లక్నో: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేరు. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేరు. ఉద్యోగాలు చేస్తున్నవారికి పదోన్నతి సైతం దక్కదు. ప్రభుత్వం నుంచి ఏ రకమైన రాయితీలూ పొందలేరు. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడమే లక్ష్యంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు ముసాయిదాలోని ముఖ్యాంశాలివీ. జనాభా నియంత్రణ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇందులో భాగంగా ఇద్దరు పిల్లల విధానాన్ని కఠినంగా అమలు చేయాలని యోచిస్తోంది. ఈ పాలసీని ఉల్లంఘిస్తే ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందడం అసాధ్యమే. ఈ మేరకు ‘ఉత్తరప్రదేశ్ జనాభా(నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు–2021’లో భాగంగా యూపీ లా కమిషన్(యూపీఎస్‌ఎల్‌సీ) ముసాయిదాను సిద్ధం చేస్తోంది. ఈ ముసాయిదాను మెరుగుపర్చేందుకు ప్రజల సలహాలు, సూచనలు, వినతులు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు లా కమిషన్ వెల్లడించింది. జూలై 19లోగా ప్రజలు స్పందించాలని కోరింది.
ముసాయిదాలో ఏముందంటే..
► జనాభా నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర జనాభా నిధిని ఏర్పాటు చేస్తారు.
► ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించే ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం సర్వీసు కాలంలో అదనంగా 2 ఇంక్రిమెంట్లు అందుకోవచ్చు. 12 నెలల పూర్తి వేతనం, భత్యాలతో మాతృత్వ, పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ప్రభుత్వ వాటాను 3 శాతం పెంచుతారు.
► అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెటర్నిటీ సెంటర్లు నెలకొల్పుతారు. ఇక్కడ గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు సరఫరా చేస్తారు.
► ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులపై ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.
► గర్భధారణలు, ప్రసవాలు, జననాలు, మరణాలను కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి.
► జనాభా నియంత్రణను అన్ని సెకండరీ పాఠశాలల్లో ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా బోధించాలి.
► పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో వనరులు పరిమితంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ ఆహారం, సురక్షిత తాగునీరు, సరైన ఆవాసం, నాణ్యమైన విద్య, విద్యుత్ వంటి వసతులతోపాటు జీవనోపాధి తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. పరిమిత వనరులతో అందరికీ అన్ని వసతులు అందుబాటులోకి తీసుకురావడం కష్టం. అందుకే జనాభా నియంత్రణ, స్థిరీకరణ చర్యలు చేపట్టాలి.
రాజకీయ అజెండాతోనే..
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనాభా నియంత్రణ బిల్లు ముసాయిదాను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని యూపీ కాంగ్రెస్ ప్రతినిధి అశోక్ సింగ్ ఆరోపించారు. ఇలాంటి బిల్లును తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా ధ్వజమెత్తారు. దేశంలో దళితులు, గిరిజనుల కారణంగానే జనాభా పెరుగుతోందని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహూమూద్ వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణ కోసం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా అది ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగానే భావించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment