
మహిళలు అనుభవించే గృహహింసకు, వేధింపులకు చాలావరకు చిన్నారులే మౌన సాక్షులుగా ఉంటారు. అమ్మను నాన్న నిరంతరం వేధిస్తూ, కొడుతుంటే.. బిక్కుబిక్కు మంటూ చూస్తారు. చూసీ, చూసీ కొంతమంది తిరగబడతారు. ‘ఖబడ్దార్.. అమ్మమీద చేయి వేస్తే..’ అంటూ అమ్మకు అండగా నిలబడతారు. అమ్మమీద దెబ్బ పడకుండా కాపాడు కుంటారు. అవసరమైతే నాలుగు దెబ్బలు కూడా తింటారు. ఈ విషయంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మరింత వేగంగా స్పందిస్తారు. కానీ చివరికి ఆ అమ్మ ఇక తనకు లేదని తెలిస్తే.. ఏం చేయాలి? ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కోటి ఆశలతో కాపురానికి వచ్చిన కోడల్ని, బిడ్డ పుట్టిన తరువాత కూడా వేధింపులకు పాల్పడి, దారుణంగా హత్య చేసిందో కుటుంబం. కానీ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ ఐదేళ్ల చిన్నారి సాహసంతో వారి పథకం పారలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివపరివార్ కాలనీలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాలు ..
యూపీలోని ఝాన్సీలో ఒక వివాహిత మహిళ అనుమానాస్పదంగా మరణించింది. సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషమంగా ఉన్న స్థితిలో ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తీసుకుచ్చారు. చికిత్స పొందుతూ మరణించింది. తమ కోడలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ఐదేళ్ల కుమార్తె తన తండ్రి తన తల్లిని ఎలా చంపాడో వివరిస్తూ ఫోటో గీసి మరీ వివరించింది. ఒక బొమ్మను గీస్తూ తన తండ్రి తన తల్లిని బాగా కొట్టాడని వివరించింది. ఇంకో బొమ్మలొ నానమ్మ తన తల్లిని మెట్లపై నుండి తోసేసిందనీ, తండ్రి గొంతు నులిమినట్టు ఆమె తెలిపింది. ఇది చూసి పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పలువురి గుండెల్ని పిండేస్తున్న ఈ మాటలు వైరలవుతున్నాయి.
కంటతడిపెట్టించే చిన్నారి మాటలు
‘నాన్నే అమ్మను తీవ్రంగా కొట్టాడు..ఆ తర్వాత ఉరేశాడు. ఇదేంటి అని అడిగినందుకు కావాలంటే నువ్వు చచ్చిపో అన్నాడు’ అని మీడియాకు చిన్నారి దర్శిత చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అనేకసార్లు తన తల్లిని చంపేస్తానంటూ నాన్న బెదిరించాడని తెలిపింది. అంతేకాదు ఇంకోసారి మా అమ్మను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని తాను ఒకసారి నాన్నను ఎదిరిస్తే.. మీ అమ్మ చచ్చాక నీకూ అదే గతి పడుతుంది అంటూ.. తనను కూడా కొట్టేవాడు అంటూ దీనంగా చిన్నారి చెప్పిన వైనం అందర్నీ కలచి వేసింది.
భారీ కట్నం, అమ్మాయి పుట్టిందని మరింత వేధింపులు
దీంతో తికామ్‌గఢ్ జిల్లాకు చెందిన మృతురాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలు తన కుమార్తెను బాగా వేధించేవారని ఆరోపించారు. తన కుమార్తె సోనాలిని మెడికల్ రిప్రజంటేటివ్‌గా పని చేస్తున్న సందీప్‌తో వివాహం చేశారు. 2019లో వివాహం చేసుకున్నప్పటి నుండి అత్తమామలు కట్నం కోసం నిరంతరం మానసికంగా శారీరకంగా హింసకు గురిచేశారని వాపోయారు. రూ. 20 లక్షల కట్నం ఇచ్చినప్పటికీ, ఆమెను తీవ్రంగా వేధించేవారంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది, అతగాడికి మగపిల్లవాడు కావాలట, అందుకే ప్రసవం తర్వాత తల్లీ బిడ్డల్ని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిల్లు తానే కట్టి ఇంటికి తీసుకెళ్లానని, ఒక నెల తర్వాత అల్లుడు వచ్చాడని చెప్పారు. దీనిపై సోనాలి భర్త సందీప్ బుధోలియాపై గతంలో వరకట్న వేధింపుల కేసు నమోదైంది, కానీ ఆ తరువాత బాగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో అప్పట్లో రాజీ కుదిరింది.
సర్కిల్ ఆఫీసర్ (CO) సిటీ రాంబీర్ సింగ్ ప్రకారం, సందీప్, అతని తల్లి వినీత, అతని అన్నయ్య కృష్ణ కుమార్, అతని వదిన మనీషా మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భర్త సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment