
లక్నో: పెంపుడు పిల్లి మృతితో కుంగిపోయిన ఓ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. మళ్లీ బతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు తన పెంపుడు పిల్లి మృతదేహంతోనే గడిపింది. చివరికి మూడో రోజు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ఘటన జరిగింది. హసన్‌పూర్‌లో నివసించే 32 ఏళ్ల పూజకు ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం కాగా.. రెండేళ్ల తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. దీంతో నాటి నుంచి తల్లి గజ్రా దేవి వద్ద ఆమె నివసిస్తోంది.
ఒంటరితనం నుంచి బయటపడడానికి పూజ ఒక పెంపుడు పిల్లిని తీసుకొచ్చి పెంచుకుంటోంది. ఆ పిల్లి హఠాత్తుగా చనిపోవడంతో ఆమె తల్లి.. పిల్లిని పాతిపెట్టమని చెప్పింది. అందుకు పూజ నిరాకరించింది. అది తిరిగి బతికి వస్తుందంటూ.. రెండు రోజుల పాటు ఆ పిల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. ఖననం చేయామని కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు చెప్పిన కానీ పూజ వినిపించుకోలేదు.
పిల్లి మృతితో తీవ్ర కుంగుబాటుకు గురైన పూజ.. శనివారం మధ్యాహ్నం ఆమె తమ ఇంటి మూడో అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. గజ్రా దేవి తన కూతురిని చూడటానికి తలుపులు తీసి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment