అదనపు కట్నం కోసం అత్తమామల వికృత చేష్ట.. కోడలికి ఏకంగా.. | Dowry demand UP woman injected with HIV-infected needle | Sakshi
Sakshi News home page

అదనపు కట్నం కోసం అత్తమామల వికృత చేష్ట.. కోడలికి ఏకంగా..

Published Sun, Feb 16 2025 11:20 AM | Last Updated on Sun, Feb 16 2025 11:50 AM

Dowry demand UP woman injected with HIV-infected needle

లక్నో: అదనపు కట్నం ఇవ్వలేదనే కారణంతో కోడలిపై కక్ష గట్టి దారుణానికి ఒడిగట్టారు అత్తామామలు. తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఆలోచనతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్‌ చేసి హెచ్‌ఐవీ వైరస్‌తో కలుషితమైన ఇంజెక్షన్లు చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలు కోర్టును ఆశ్రయించడంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో 2023 ఫిబ్రవరి 15న వివాహమైంది. వివాహం సందర్భంగా సచిన్‌కు రూ.15 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. వీరి పెళ్లి తర్వాత కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇంతలో అత్తింటి వారు స్కార్పియో కారు కొనడానికి తల్లిగారి దగ్గర నుంచి మరో రూ.25 లక్షలు తీసుకురావాలని కోడలిని వేధించారు. ఈ క్రమంలో తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని యువతి తల్లిదండ్రులు తెలిపారు. దీంతో, ఆగ్రహానిలోనైన అత్తామామలు.. కోడలిని ఇంటి నుంచి బయటకు పంపించేశారు.

అయితే, ఈ విషయం పంచాయతీ పెద్దల వరకు వెళ్లడంతో వారికి నచ్చజెప్పి యువతిని తిరిగి అత్తింటికి  పంపారు. కానీ, తీరు మార్చుకోని అత్తమామలు అదనపు కట్నం కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు. తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఆలోచనతో ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే హెచ్‌ఐవీ వైరస్‌తో కలుషితమైన ఇంజెక్షన్లు చేశారు. కొంత కాలం తర్వాత యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమెకు హెచ్‌ఐవీ సోకినట్లు వైద్యులు నిర్దరించారు.  

ఇదే సమయంలో భర్త అభిషేక్‌కు పరీక్షలు చేయగా.. అతడికి హెచ్‌ఐవీ నెగిటివ్‌గా తేలడంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆమె అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు స్థానిక కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్‌ చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement