HIV affected
-
ఎయిడ్స్ నియంత్రణకు ప్రెప్ అస్త్రం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎయిడ్స్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హైరిస్క్ వర్గాల వారికి ప్రీ–ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ (ప్రెప్) ఔషధాలు అందజేస్తోంది. చెన్నైకి చెందిన వలంటరీ హెల్త్ సొసైటీ (వీహెచ్ఎస్) ద్వారా ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ శాక్స్) వీటిని పంపిణీ చేస్తోంది. కండోమ్ వినియోగంలో పొరపాట్లు, ఇతర సురక్షితం కాని శృంగారం వల్ల కలిగే ఎయిడ్స్ వ్యాప్తిని ఈ మాత్రలు నిరోధిస్తాయి. బహిరంగ మార్కెట్లో 30 మాత్రల ధర రూ.2 వేలు ఉంది. వీటిని సబ్సిడీపై వైద్యశాఖ రూ.450కే పంపిణీ చేస్తోంది. విజయవాడ, వైజాగ్‌లలో ఇప్పటికే పంపిణీ ప్రారంభించారు. హైరిస్క్ వర్గాలుగా పరిగణించే ఫీమేల్ సెక్స్ వర్కర్లు, స్వలింగ సంపర్కులు (మేల్ హోమో సెక్సువల్స్), ట్రాన్స్జెండర్లు, ఇంజెక్షన్ల ద్వారా మత్తు పదార్థాలు తీసుకునేవారికి సబ్సిడీపై ఈ మాత్రలు అందిస్తున్నారు. ఎయిడ్స్ హైరిస్క్ వర్గాల్లో ట్రాన్స్జెండర్లు ఒకరు. సమాజంలో వివక్షకు లోనయ్యే వీరికి వైద్యంతో పాటు సామాజిక తోడ్పాటు అందించడానికి విజయవాడ, వైజాగ్‌లలో ట్రాన్స్‌జెండర్స్ వన్స్టాప్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో వైద్యుడు, ఏఎన్ఎం, సిబ్బంది ఉంటారు. ఇక్కడ ట్రాన్స్జెండర్లకు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి వైద్య సహాయం అందిస్తున్నారు. విజయవాడ జీజీహెచ్, విశాఖ కేజీహెచ్‌లలో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లు సైతం ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధి, న్యాయపరమైన సహకారం అందిస్తున్నారు. హైరిస్క్ గ్రూపుల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా ఇక్కడ సహాయం లభిస్తోంది. ఇక్కడే ప్రెప్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. త్వరలో తిరుపతి, కర్నూలు, కాకినాడల్లో కూడా ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రెప్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. పంపిణీ ఇలా వన్‌స్టాప్ సెంటర్లకు వచ్చిన హైరిస్క్ వర్గాల్లోని హెచ్ఐవీ నెగెటివ్ వ్యక్తులకు ప్రెప్ మాత్రల వినియోగం వల్ల ప్రయోజనాలను వివరిస్తారు. అనంతరం హెచ్ఐవీ నిర్ధారణ, కిడ్నీ, లివర్ పనితీరు సహా పలు రకాల వైద్యపరీక్షలు చేస్తారు. పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రెప్ మాత్రల వినియోగానికి అర్హులో కాదో వైద్యులు నిర్ధారిస్తారు. వైద్యుల సూచన మేరకు మాత్రలు అందిస్తారు. అనంతరం వన్‌స్టాప్ సెంటర్లోని వైద్యుడు ఆ వ్యక్తిని రోజూ ఫోన్ ద్వారా సంప్రదించి మాత్రలు వినియోగిస్తున్నారో లేదో ఫాలోఅప్ చేస్తారు. ముందు, తర్వాత 21 రోజుల చొప్పున వాడాలి ప్రెప్ మాత్రల వినియోగం వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకదు. శృంగారంలో పాల్గొనడానికి 21 రోజుల ముందు నుంచి, చివరిసారిగా శృంగారంలో పాల్గొన్న తరువాత 21వ రోజు వరకు రోజుకు ఒక మాత్ర వాడాలి. అప్పుడే ప్రభావవంతంగా పనిచేస్తుంది. వైద్యులను సంప్రదించకుండా వాడకూడదు. ఎస్టీడీతో పాటు ఇతర జబ్బులు సోకకుండా ఉండాలంటే అపరిచితులతో శృంగారంలో కండోమ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. – డాక్టర్ ప్రత్యూష, టీజీ వన్‌స్టాప్ సెంటర్ వైద్యురాలు, విజయవాడ ప్రజల్లో చైతన్యం ఇంకా పెరగాలి ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో ఇంకా చైతన్యం పెరగాలి. వ్యాధి వ్యాప్తి తగ్గిందిలే అని నిర్లక్ష్యం వహించకూడదు. వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసి రాబోయే తరాలకు సురక్షిత ఆరోగ్యం ప్రసాదించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. విజయవాడ, వైజాగ్‌లలో ప్రెప్ మాత్రలు పంపిణీ చేస్తున్నాం. త్వరలో తిరుపతి, కాకినాడ, కర్నూలుల్లో కూడా ప్రారంభిస్తాం. – నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీ శాక్స్ పీడీ -
పదేళ్లలో 17 లక్షల మందికి ఎయిడ్స్
న్యూఢిల్లీ: దేశంలో గత పదేళ్లలో 17,08,777 మంది హెచ్ఐవీ బారిన పడ్డారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ(ఎన్ఏసీఓ) సంస్థ వెల్లడించింది. అరక్షితశృంగారమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్తగా హెచ్ఐవీ బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని వివరించింది. 2011–12లో 2.4 లక్షల మందికి హెచ్ఐవీ సోకగా, 2020–21 85,268కు తగ్గిందని తెలిపింది. ► ఎయిడ్స్ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. గత పదేళ్లలో ఏపీలో 3,18,814, మహారాష్ట్రలో 2,84,577, కర్ణాటకలో 2,12,982, తమిళనాడులో 1,16,536, యూపీలో 1,10,911, గుజరాత్లో 87,440 హెచ్ఐవీ కేసులు బయటపడ్డాయి. ► 2011–12 నుంచి 2020–21 మధ్య రక్తం ద్వారా 15,782 మందికి హెచ్ఐవీ సోకింది. ► తల్లి నుంచి బిడ్డకు సోకిన కేసులు గత పదేళ్లలో 4,423 బయటపడ్డాయి. ► 2020 నాటికి 23,18,737 హెచ్ఐవీ బాధితులున్నారు. వీరిలో 81,430 మంది పిల్లలు. ► హెచ్ఐవీ వైరస్ ప్రధానంగా రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ఎయిడ్స్‌కు దారితీస్తుంది. ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేసే ప్రామాణికమైన చికిత్స ఇప్పటిదాకా అందుబాటులో లేదు. -
బలిపీఠంపై మూడు ప్రాణాలు
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో ఓ గర్బిణీ స్త్రీకి రక్తం ఎక్కించడం ద్వారా హెచ్ఐవీ సోకడం, తనకు హెచ్ఐవీ ఉందని తెలియకుండానే రక్తం ఇచ్చిన దాతకు ఈ విషయం తెలిసి తాను ఆత్మహత్య చేసుకోబోవడం రెండూ విషాదకర సంఘటనలే. గర్బిణీ కడుపులోని బిడ్డకు ఎయిడ్స్ సోకితే అది మరో విషాధం. రక్తదాతకు హెచ్ఐవీ ఉన్న విషయాన్ని కనుగొనడంలో విఫలమైన ప్రభుత్వ వైద్య సిబ్బంది ఇందులో అసలు నేరస్థులు. సొత్తూరుకు చెందిన ఎనిమిది నెలల గర్బిణి ప్రస్తుతం మదురైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెకు రక్తదానం చేసిన 20 ఏళ్ల యువకుడు బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించి రామనాథపురం ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. (గర్భిణికి హెచ్ఐవీ బ్లడ్.. రక్తదాత ఆత్మహత్యాయత్నం) హెచ్ఐవీ రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా నివారించేందుకు కఠినమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇలా జరగడం దారుణం. రక్తదాతలకు హెచ్ఐవీ, మలేరియా, హెపటైటీస్ బీ, సీ, సిఫిలీస్ ఉందా, లేదా అని తప్పనిసరిగా రక్త పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. రక్తం బ్యాంకులు, ప్రభుత్వ ఆస్పత్రులు, రక్తదాన శిబిరాల్లో అలసత్వం, నిర్లక్ష్యం వల్ల రక్త మార్పిడి కారణంగా ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవీ సోకుతోంది. 2014 అక్టోబర్ నుంచి 2016 మార్చి మధ్యన ఇలా ఎయిడ్స్ సోకిన వారి సంఖ్య 2,234 మందని జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థనే వెల్లడించింది. అయితే ఈ సంఖ్య వారంతట వారు ముందుకొచ్చి చెప్పుకున్నదని, వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించినది కాదని ఆ సంస్థ చెబుతోంది. 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే రక్తమార్పిడి ద్వారా ఎయిడ్స్ సోకడం బాగా తగ్గినప్పటికీ రెండేళ్లలో రెండువేల మందికిపైగా సోకిందంటే చిన్న విషయం ఏమీ కాదు. 20 ఏళ్ల క్రితం ప్రతి పది మందిలో 8 మందికి రక్తమార్పిడి ద్వారా ఎయిడ్స్ సోకేది. నాణ్యమైన రక్తం కన్నా ఎక్కువ పరిణామంలో రక్తాన్ని సేకరించేందుకు సామాజిక సంస్థలు, బ్లడ్ బ్యాంకులు తాపత్రయ పడడం వల్ల ఎయిడ్స్ ముప్పు పెరుగుతోందని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడంలో ఈ 20 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ 2017 లెక్కల ప్రకారం దేశంలో అంతకుముందు సంవత్సరం 80 వేల మందికి ఎయిడ్స్ సోకితే ఆ సంవత్సరం 88 వేలకు పెరిగింది. ఇక మృతుల సంఖ్య కూడా 62 వేల నుంచి 69 వేలకు పెరిగింది. ప్రస్తుతం 21 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధితో బాధ పడుతున్నారు. -
ఒక్క తప్పు.. 40 మందికి హెచ్ఐవీ
లక్నో: ఓ వ్యక్తి చేసిన తప్పిదానికి 40 మంది జీవితాలు బలయ్యాయి. ఎయిడ్స్ రోగికి ఇచ్చిన సిరంజీతో ఇంజక్షన్ చేయడం వల్ల 40 మందికి హెచ్ఐవీ వైరస్ సోకింది. ఈ విషయం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి తెలియడంతో హుటాహుటిన విచారణకు ఆదేశించింది. హెచ్ఐవీ సోకడానికి కారణమైన సదరు వ్యక్తిని అరెస్ట్ చేయాలని రాష్ట్ర హోంమంత్రి ఆదేశించారు. హెచ్ఐవీ సోకిన వ్యక్తులను కాన్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ కౌన్సెలింగ్ నిర్వహించి చికిత్స కూడా అందిస్తున్నారు. అలాగే ఘటన జరిగిన ఉన్నావో జిల్లాలోని బంగార్మౌ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎయిడ్స్ పేషంట్‌కు ఇచ్చిన సూదితోనే ప్రతి రోగికి ఇంజెక్షన్ చేయడం వల్లే అందరికీ హెచ్ఐవీ సోకిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోందని, చాలా మంది డ్రైవర్లకు అవగాహన లేకపోవడం వల్ల తమ లారీలను అక్కడే ఆపి సుఖవ్యాధులు అంటించుకుంటున్నారని చెప్పారు. ఎయిడ్స్‌ను అరికట్టేందుకు ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ వారికి హెచ్ఐవీ సోకడంతో బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. -
న్యాయవాది తీరుపై క్రైస్తవ ప్రచారకుల ఆందోళన
ప్రత్తిపాడు, న్యూస్‌లైన్ :న్యాయవాది తీరుకు నిరసనగా ప్రత్తిపాడులో క్రైస్తవ ప్రచారకులు, సంఘ సభ్యులు, ప్రజలు ఆదివారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. సెయింట్ జోసెఫ్స్ ఆస్పత్రి ఆవరణలో హెచ్ఐవీ బాధిత చిన్నారులకు వసతి గృహంగా వినియోగిస్తున్న భవనాన్ని మూసేస్తూ స్థానిక న్యాయవాది జనిపల్లి ప్రసాద్‌బాబు బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారు. ఇరువర్గాలకు మందడి స్థలాన్ని న్యాయవాది ఆక్రమించాడని క్రైస్తవ ప్రచారకులు ఆరోపిస్తున్నారు. వసతి గృహం కిటికీలు మూతపడడమే కాకుండా న్యాయవాది భవనంలోని వాడకం నీరు వసతిగృహంలోకి వస్తుందన్నారు. ఆక్రమణలు తొలగించాలని కోరిన తమను అసభ్యపదజాలంతో దూషించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి మదర్ సుపీరియర్ శోభ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70 ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఆస్పత్రి సిస్టర్స్‌ను, శోభను దూషించడం దారుణమని ఆర్సీఎం చర్చి కమిటీ సభ్యులు విమర్శించారు. చర్చి కమిటి అధ్యక్షుడు బి. మధుబాబు, ఉపాధ్యక్షుడు డేగల వసంత్, కార్యదర్శి ఎన్. బులిబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కడుగుల నూకరాజు, మాజీ వార్డు సభ్యుడు కాకర ప్రకాష్, కిర్లంపూడి ఆర్సీఎం చర్చి సంఘ సభ్యులు బాతు అప్పారావు, బులిపే గోపి, కాకర రాజు తదితరులు న్యాయవాది ఇంటి వద్ద రహదారిపై రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు ఈఆందోళన కొనసాగింది. తాను ఆక్రమణలకు పాల్పడలేదని న్యాయవాది ప్రసాద్‌బాబు చెబుతున్నారు. ప్రత్తిపాడు సీఐ టి. రామ్మోహన్‌రెడ్డి ఇరువర్గాలతో స్థానిక పోలీస్ స్టేషన్లో జరిపిన చర్చలు విఫలం కావడంతో చర్చి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ధర్నా కొనసాగించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ ఆందోళన సాగుతుందని స్పష్టం చేశారు. కాగా ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.