సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో ఓ గర్బిణీ స్త్రీకి రక్తం ఎక్కించడం ద్వారా హెచ్‌ఐవీ సోకడం, తనకు హెచ్‌ఐవీ ఉందని తెలియకుండానే రక్తం ఇచ్చిన దాతకు ఈ విషయం తెలిసి తాను ఆత్మహత్య చేసుకోబోవడం రెండూ విషాదకర సంఘటనలే. గర్బిణీ కడుపులోని బిడ్డకు ఎయిడ్స్ సోకితే అది మరో విషాధం. రక్తదాతకు హెచ్‌ఐవీ ఉన్న విషయాన్ని కనుగొనడంలో విఫలమైన ప్రభుత్వ వైద్య సిబ్బంది ఇందులో అసలు నేరస్థులు. సొత్తూరుకు చెందిన ఎనిమిది నెలల గర్బిణి ప్రస్తుతం మదురైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెకు రక్తదానం చేసిన 20 ఏళ్ల యువకుడు బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించి రామనాథపురం ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. (గర్భిణికి హెచ్‌ఐవీ బ్లడ్.. రక్తదాత ఆత్మహత్యాయత్నం)
హెచ్‌ఐవీ రక్త మార్పిడి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా నివారించేందుకు కఠినమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇలా జరగడం దారుణం. రక్తదాతలకు హెచ్‌ఐవీ, మలేరియా, హెపటైటీస్ బీ, సీ, సిఫిలీస్ ఉందా, లేదా అని తప్పనిసరిగా రక్త పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. రక్తం బ్యాంకులు, ప్రభుత్వ ఆస్పత్రులు, రక్తదాన శిబిరాల్లో అలసత్వం, నిర్లక్ష్యం వల్ల రక్త మార్పిడి కారణంగా ఒకరి నుంచి ఒకరికి హెచ్‌ఐవీ సోకుతోంది. 2014 అక్టోబర్ నుంచి 2016 మార్చి మధ్యన ఇలా ఎయిడ్స్ సోకిన వారి సంఖ్య 2,234 మందని జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థనే వెల్లడించింది. అయితే ఈ సంఖ్య వారంతట వారు ముందుకొచ్చి చెప్పుకున్నదని, వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించినది కాదని ఆ సంస్థ చెబుతోంది.
20 ఏళ్ల క్రితంతో పోలిస్తే రక్తమార్పిడి ద్వారా ఎయిడ్స్ సోకడం బాగా తగ్గినప్పటికీ రెండేళ్లలో రెండువేల మందికిపైగా సోకిందంటే చిన్న విషయం ఏమీ కాదు. 20 ఏళ్ల క్రితం ప్రతి పది మందిలో 8 మందికి రక్తమార్పిడి ద్వారా ఎయిడ్స్ సోకేది. నాణ్యమైన రక్తం కన్నా ఎక్కువ పరిణామంలో రక్తాన్ని సేకరించేందుకు సామాజిక సంస్థలు, బ్లడ్ బ్యాంకులు తాపత్రయ పడడం వల్ల ఎయిడ్స్ ముప్పు పెరుగుతోందని నిపుణులు ఆరోపిస్తున్నారు.
ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడంలో ఈ 20 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ 2017 లెక్కల ప్రకారం దేశంలో అంతకుముందు సంవత్సరం 80 వేల మందికి ఎయిడ్స్ సోకితే ఆ సంవత్సరం 88 వేలకు పెరిగింది. ఇక మృతుల సంఖ్య కూడా 62 వేల నుంచి 69 వేలకు పెరిగింది. ప్రస్తుతం 21 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధితో బాధ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment