new policy
-
‘క్వాలిటీ’ ర్యాంకులు
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్ద పీట వేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలు తీసుకు వస్తోంది. ఇందులో జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నాణ్యతను ధ్రువీకరిస్తూ ఇచ్చే న్యాక్ అక్రిడిటేషన్‌లో అదనపు ఫ్రేమ్‌వర్క్‌ను పరిచయం చేస్తోంది. ఈ ప్రక్రియలో రెండు దశల్లో విద్యా సంస్థల మదింపు చేసి ర్యాంకులు ఇవ్వనుంది. తొలి దశ ‘ఎలిజిబులిటీ క్వాలిఫైయర్’లో ప్రాథమిక అర్హతలను పరిశీలిస్తారు.ఇందులో ఎంపికైన విద్యా సంస్థలు రెండో దశ పరిశీలనకు వెళ్తాయి. తొలి దశలో విద్యా సంస్థ 11 రకాల అంశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వీటిలో యూజీసీ గుర్తింపు, న్యాక్ అక్రిడిటేషన్, ఏఐఎస్హెచ్ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్, విద్యార్థుల ఫిర్యాదు పరిష్కార కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను ప్రాథమికంగా పాటించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటేనే రెండో దశకు అర్హత లభిస్తుంది. రెండో దశలో నాణ్యత ధ్రువీకరణ కోసం నిర్ణీత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యా సంస్థలోని కనీసం 75 శాతం బోధనా పోస్టుల్లో శాశ్వత సిబ్బంది ఉండాలి. ఈ శాశ్వత సిబ్బంది మాలవీయ మిషన్ ద్వారా శిక్షణ పొంది ఉండాలి. అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, పర్యావరణ విద్యను ఆయా సంస్థలు బోధిస్తూ ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం 3 వేల మంది విద్యార్థులను చేర్చుకున్నారా? ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా? తదితర ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 49 ప్రశ్నలకు గానూ 30 ప్రశ్నలు అన్ని ఉన్నత విద్యా సంస్థలకూ వర్తిస్తాయి. మరో 13 ప్రశ్నలు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు సంబంధించినవి. ముఖ్యంగా వైస్ చాన్సలర్ల నియామకం యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదో పరిశీలించనున్నారు. ఈ తాజా మార్గదర్శకాలపై 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని యూజీసీ కోరింది. అయితే జాతీయ విద్యా విధానం అమలు ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇవ్వడాన్ని తమిళనాడు, కర్ణాటక విశ్వవిద్యాలయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్ఈపీని అమలు చేయని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. -
హెల్త్ ఇన్సూరెన్స్ ‘పోర్టింగ్’.. తొందరొద్దు!
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సాధనం. రక్షణ కవచం కూడా. ఎప్పుడు ఏ రూపంలో అనారోగ్యం లేదా ప్రమాదం ఎదురవుతుందో ఊహించలేం. ఖరీదైన వైద్య వ్యయాల భారాన్ని మోయలేం. జీవితకాల కష్టార్జితాన్ని ఒకేసారి ఎత్తుకుపోయే కరోనా మాదిరి విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు. వీటన్నింటికీ పరిష్కారమే హెల్త్ ఇన్సూరెన్స్. విస్తృత ప్రచారం నేపథ్యంలో నేడు చాలా మంది ఆరోగ్య బీమా ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రీమియం కష్టమైనా తీసుకుంటున్నారు. తీరా ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత.. కంపెనీ సేవలు నచ్చకపోవచ్చు. మంచి ఫీచర్లతో తక్కువ ప్రీమియానికే మరో బీమా కంపెనీ హెల్త్‌ప్లాన్ ఆకర్షించొచ్చు. అటువంటి సందర్భంలో కనిపించే ఏకైక ఆప్షన్ పోర్టింగ్. ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మొబైల్ నంబర్ మార్చుకున్నంత సులభంగానే.. హెల్త్ ఇన్సూరెన్స్‌ను సైతం పోర్ట్ పెట్టుకుని మరో కంపెనీ ప్లాన్‌లో చేరిపోవచ్చు. పోర్టింగ్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటి గురించి అవగాహన తప్పనిసరి. బలమైన కారణాలుంటేనే, అది కూడా సమగ్రమైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ‘పోర్టింగ్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, బిజినెస్ డెస్క్తమ కంపెనీ ప్లాన్‌లోకి ‘పోర్ట్’ పెట్టుకోవాలంటూ ఇటీవలి కాలంలో మార్కెటింగ్ కాల్స్ రావడం కొందరికి అనుభవమే. బీమా మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో ఈ ధోరణి ఏర్పడింది. కొత్త కస్టమర్ల కోసం మార్కెటింగ్ బృందాలు అన్ని మార్గాల్లోనూ జల్లెడ పడుతున్నాయి. అప్పటి వరకు అసలు ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేని కస్టమర్లకు హెల్త్ ప్లాన్ ఇవ్వడం మంచిదే. కానీ, ఇతర బీమా కంపెనీల కస్టమర్లను సైతం ఆకర్షించేందుకు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి.‘‘పోర్ట్ పెట్టేసుకుని, మా కంపెనీ ప్లాన్‌లోకి మారిపోండి. మంచి ఫీచర్లు, మెరుగైన కవరేజీతో బీమా రక్షణ పొందండి’’ అంటూ ఆఫర్లు ఇస్తున్న ధోరణి కనిపిస్తోంది. వ్యాపార వృద్ధి లక్ష్యాల్లో భాగంగా కొత్త కస్టమర్లను సంపాదించేందుకు కొందరు అనైతికంగానూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడే పోర్టింగ్ ఆప్షన్‌ను పరిశీలించాలి. చేదు అనుభవం..కేరళ రాష్ట్రానికి చెందిన అజిత్ కుమార్ (53)కు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అప్పటికే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో కానీ, బీమా కంపెనీతో కానీ అతడికి ఎలాంటి సమస్యల్లేవు. కానీ, ప్రముఖ ఆన్లైన్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి ఒకరోజు కాల్ వచ్చింది. పాలసీని పోర్ట్ పెట్టుకోవాలంటూ మార్కెటింగ్ సిబ్బంది సూచించారు. మెరుగైన సదుపాయాలున్న ప్లాన్‌ను పోర్టింగ్‌తో పొందొచ్చంటూ ఆయన్ను ప్రోత్సహించారు. ‘‘11 ఏళ్ల నుంచి నాకు హెచ్డీఎఫ్సీ ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ప్లాన్ ఉంది. అన్నేళ్లలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయలేదు.అయినా కానీ, పాలసీ ప్రీమియాన్ని గణనీయంగా పెంచేశారు. దీంతో మంచి ఫీచర్లున్న కొత్త పాలసీకి పోర్ట్ పెట్టుకోవాలంటూ పాలసీబజార్ కస్టమర్ కేర్ ప్రతినిధి నాకు సూచించారు’’అని కుమార్ తన అనుభవాన్ని పంచుకున్నారు. కానీ, జరిగిన నష్టం ఏంటో ఆ తర్వాత కానీ తెలియలేదు. పోర్టింగ్ నిర్ణయం పట్ల కుమార్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కుమార్ పూర్వపు పాలసీలో రూ.10 లక్షల సమ్ అష్యూరెన్స్ ఉంది. మరో రూ.10 లక్షలకు నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) కూడా ఉంది. అంటే మొత్తం రూ.20 లక్షల బీమా రక్షణ ఉన్నట్టు. పాలసీ తీసుకుని 10–11 ఏళ్లు కావడంతో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్ నిబంధనలను కుమార్ అధిగమించేశారు. పాత పాలసీలోనే కొనసాగి ఉంటే ఎలాంటి క్లెయిమ్‌కు అయినా అర్హత కొనసాగేది. కానీ, పోర్టింగ్‌తో నో క్లెయిమ్ బోనస్ కొత్త పాలసీలోకి బదిలీ కాలేదు. పైగా ఒకే విడత మూడేళ్ల ప్రీమియంలను కుమార్‌తో కట్టించారు సదరు మార్కెటింగ్ సిబ్బంది. వారి సూచనతో సూపర్ టాపప్ ప్లాన్ కూడా కొనుగోలు చేశారు. పాలసీ కొనుగోలు తర్వాత సేవలు దారుణంగా ఉన్నాయని కుమార్ విచారించడం మినహా మరో మార్గం లేకపోయింది. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు అన్ని పోర్టింగ్ కేసుల్లోనూ తప్పనిసరిగా బదిలీ కావాలని లేదు. ఈ విషయంలో బీమా సంస్థల షరతులను అర్థం చేసుకోవాలి. పోర్టింగ్ ప్రక్రియ ఇలా..పోర్టింగ్ పెట్టుకోవాలంటే ప్రస్తుత పాలసీ రెన్యువల్ ఇంకా కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 60 రోజుల గడువు ఉందనగా ప్రక్రియ ప్రారంభించాలి. ఉదాహరణకు ఫిబ్రవరి 28న తదుపరి ప్రీమియం చెల్లించాల్సిన గడువు అనుకుంటే, మీరు రెండు నెలల ముందుగా డిసెంబర్ 31నుంచి ప్రారంభించొచ్చు. రెన్యువల్‌కు 30 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్నా కానీ, బీమా సంస్థ తన విచక్షణ మేరకు పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించొచ్చని ఐఆర్డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత బీమా కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వక్కర్లేదు. పోర్టింగ్‌తో ఏ కంపెనీ ప్లాన్‌లోకి వెళ్లాలనుకుంటున్నారో, ఆ కంపెనీని సంప్రదించాలి. పోర్టబులిటీ, ప్రపోజల్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.పోర్టింగ్ సమయంలో తాజా ఆరోగ్య సమాచారం మొత్తాన్ని వివరంగా వెల్లడించాల్సిందే. అప్పటి వరకు ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, లోగడ హెల్త్ క్లెయిమ్‌ల గురించి కూడా వెల్లడించాల్సి రావచ్చు. ఈ వివరాల ఆధారంగా రిస్క్‌ను మదింపు వేసి బీమా సంస్థ ప్రీమియంను నిర్ణయిస్తుంది. అవసరమైతే అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రీమియంను పెంచొచ్చు.పోర్టింగ్ దరఖాస్తును కొత్త సంస్థ ఆమోదించి, పాలసీ జారీ చేసే వరకు పాత పాలసీని రద్దు చేసుకోవద్దు. ఎందుకంటే పాలసీదారు ఆరోగ్య చరిత్ర, రిస్క్, ఇతర అంశాల ఆధారంగా కొత్త సంస్థ ప్రీమియంను గణనీయంగా పెంచేస్తే అది అంగీకారం కాకపోవచ్చు. నో క్లెయిమ్ బోనస్, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాల విషయంలోనూ కొత్త సంస్థ నిబంధనలు నచ్చకపోతే, పోర్టింగ్ అభ్యర్థనను ఉపసంహరించుకుని పాత సంస్థలో కొనసాగొచ్చు. ఆచరణ వేరు..ప్రస్తుత హెల్త్ ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్ ఉందనుకోండి. దీనికి మరో రూ.10 లక్షలు నో క్లెయిమ్ బోనస్ తోడయ్యింది. అప్పుడు సదరు పాలసీదారు రూ.20 లక్షల క్లెయిమ్‌కు అర్హులు. పోర్టింగ్‌తో వేరే కంపెనీ ప్లాన్‌లోకి మారాలనుకుంటే.. అప్పుడు రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ పాత ప్లాన్‌లో మాదిరే రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్‌ను కొత్త సంస్థలోనూ ఎంపిక చేసుకుంటే.. రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ కోల్పోయినట్టు అవుతుంది.పోర్టింగ్‌తో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే అంత మొత్తానికి తాజా వెయిటింగ్ నిబంధన కొత్త సంస్థలోనూ అమలు కాదు. ముందస్తు వ్యాధులకు (పాలసీ తీసుకునే నాటికి) 3–4 ఏళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ క్లాజ్ ఉంటుంది. పాలసీ తీసుకుని అన్నేళ్ల పాటు రెన్యువల్ చేసుకున్న తర్వాతే, ఆయా వ్యాధుల తాలూకూ క్లెయిమ్‌లకు అర్హత లభిస్తుంది. కనుక ఒక ప్లాన్‌లో వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకునే ముందు సమ్ అష్యూరెన్స్ ఎంపికలో వివేకంతో వ్యవహరించాలి.ఐఆర్డీఏఐ ఉత్తర్వులు ఉన్నా...సమ్ అష్యూరెన్స్, నో క్లెయిమ్ బోనస్, నిర్దేశిత వెయిటింగ్ పీరియడ్, మారటోరియం పీరియడ్‌కు సంబంధించిన అర్హతలను పోర్టింగ్తోపాటు బదిలీ చేయాలంటూ ఈ ఏడాది ఆరంభంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కానీ, బీమా సంస్థలు తెలివిగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు.. ప్రస్తుత ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్‌తో, అన్ని వెయిటింగ్ పీరియడ్ నిబంధనలు అధిగమించేసి ఉన్నారని అనుకుందాం.పోర్టింగ్ సమయంలో కొత్త సంస్థలో రూ.20 లక్షల సమ్ అష్యూరెన్స్ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాత ప్లాన్‌లో రూ.10 లక్షలకే వెయిటింగ్ పీరియడ్‌ను పూర్తి చేశారు కనుక, కొత్త సంస్థ కూడా అంతే మొత్తానికి ఆ ప్రయోజనాన్ని కొనసాగిస్తుంది. మరో రూ.10 లక్షల మొ త్తానికి అన్ని వెయిటింగ్ పీరియడ్లు తాజాగా అమల్లోకి వస్తాయని తెలుసుకోవాలి. దీనర్థం.. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి క్లెయిమ్ మొత్తం రూ.10 లక్షలు మించిన సందర్భాల్లో రూ.10 లక్షలకే పరిహారం పరిమితమవుతుంది.కుమార్ విషయంలో ఈ తప్పిదమే చోటుచేసుకుంది. పాత ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్ సమ్ అష్యూరెన్స్, రూ.10 లక్షల నో క్లెయిమ్ బోనస్ ఉన్నప్పటికీ.. పోర్ట్ తర్వాత రూ.10 లక్షలకే సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. దీంతో నో క్లెయిమ్ బోనస్ కోల్పోవడమే కాకుండా, ఆ మొత్తానికి వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాన్ని కోల్పోయినట్టు అయింది. పోర్టింగ్ ఏ సందర్భాల్లో..?ముఖ్యమైన కారణాలుంటేనే పోర్టింగ్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఏజెంట్ల సూచన మేరకు పోర్టింగ్ చేసుకుంటే, ఇన్సూరెన్స్ పాలసీ ప్రపోజల్ పత్రంలో అన్ని వివరాలు సమగ్రంగా ఉన్నాయేమో ఒక్కసారి ధ్రువీకరించుకోవాలి. చాలా సందర్భాల్లో ఏజెంట్లు అధిక కమీషన్ కోసం పోర్టింగ్ పేరుతో, తాజాగా పాలసీలు అంటగడుతుంటారు’’ అని హోలిస్టిక్ వెల్త్ సహ వ్యవస్థాపకుడు నిషాంత్ బాత్రా తెలిపారు. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ప్రీమియం తగ్గుతుందన్న ఆశతో పోర్టింగ్ పెట్టుకునే తప్పిదం చేయవద్దన్నది బాత్రా సూచన. పోర్టింగ్ ద్వారా వచి్చన పాలసీదారులను కొత్తవారిగానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. పోర్టింగ్ చేసుకున్న తర్వాత తొలినాళ్లలో క్లెయిమ్‌కు వెళితే, అందులోని వాస్తవికతను అవి సందేహించే అవకాశం లేకపోలేదు. మరి పోర్టింగ్ ఏ సందర్భాల్లో పరిశీలించాలన్న సందేహం రావచ్చు. ప్రస్తుత ప్లాన్‌లో లేని మెరుగైన ఫీచర్లు కొత్త ప్లాన్‌లో వస్తుంటే, మరిన్ని వ్యాధులకు కవరేజీ లభిస్తుంటే, అవి తమకు ఎంతో ప్రయోజనకరమని భావిస్తే అప్పుడు పోర్టింగ్‌ను పరిశీలించొచ్చు.అలాగే, ప్రస్తుత ప్లాన్‌లో రూమ్ రెంట్ విషయంలో పరిమితులు ఉండి, పోర్టింగ్‌తో వెళ్లే ప్లాన్‌లో ఎలాంటి రూమ్ రెంట్ పరిమితులు లేనట్టయితే అప్పుడు కూడా ఈ ఆప్షన్ వినియోగించుకోవడం సరైనదేనని బాత్రా సూచించారు. ఇక ప్రస్తుత బీమా సంస్థ క్లెయిమ్‌ల పరంగా ఇబ్బందులు పెడుతుంటే, క్లెయిమ్ మొత్తంలో కోతలు పెడుతుంటే లేదా క్లెయిమ్ ఆమోదంలో చాలా జాప్యం చేస్తుంటే, కస్టమర్ సర్వీస్ విషయంలో సంతోషంగా లేకపోయినా కానీ పోర్టింగ్ సహేతుకమే. ఇవి తెలుసుకోవాలి..⇒ పోర్టింగ్‌తో పాత పాలసీలో పొందిన నో క్లెయిమ్, వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్ ప్రయోజనాలను కొత్త సంస్థ కూడా నిబంధనల మేరకు అందిస్తుందా? లేదా అన్నది ముందే ధ్రువీకరించుకోవాలి. ⇒ పాత కంపెనీలో ముందస్తు వ్యాధులకు 3 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ నిబంధనను పూర్తి చేశారని అనుకుందాం. పోర్టింగ్ తర్వాత కొత్త సంస్థ ప్లాన్‌లో వెయిటింగ్ పీరియడ్ 4 ఏళ్లుగా ఉంటే.. అప్పుడు మరో ఏడాది తర్వాతే క్లెయిమ్ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. ఒకవేళ పాత కంపెనీలో వెయిటింగ్ పీరియడ్‌ను సగమే పూర్తి చేసి ఉంటే, అప్పుడు కొత్త సంస్థలో నిబంధనల మేరకు మిగిలిన కాలానికి వెయిటింగ్ పీరియడ్ కొసాగుతుంది. ⇒ పోర్టింగ్‌కు ప్రీమియం ఒక్కదానినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే వయసు, ఆరోగ్య చరిత్ర వివరాల ఆధారంగా ఈ ప్రీమియం మారిపోవచ్చు. అధిక రిస్‌్కలో ఉన్నారని భావిస్తే బీమా సంస్థలు అధిక ప్రీమియంను నిర్ణయిస్తాయి. ⇒ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను నేరుగా బీమా సంస్థ నుంచి తీసుకున్నా, ఏజెంట్ సాయంతో తీసుకున్నా ప్రీమియంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. కొన్ని కంపెనీలు ఏ రూపంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ ఒక్కటే ప్రీమియం అమలు చేస్తున్నాయి. ⇒ పోర్టింగ్ తర్వాత అధిక సమ్ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరింత సమ్ అష్యూరెన్స్ ఇవ్వడమా? లేదా అన్న దానిని అండర్‌రైటింగ్ నిబంధనల మేరకు బీమా కంపెనీలు నిర్ణయిస్తాయి. ⇒ అన్ని వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ ఇండెమ్నిటీ పాలసీలకు పోర్టింగ్ అర్హత ఉంటుంది. ఇక గ్రూప్ హెల్త్ పాలసీల్లో కవరేజీ ఉన్న వ్యక్తులు, కుటుంబాలకు మాత్రం.. ఆ గ్రూప్ నుంచి తప్పుకున్నప్పుడు లేదా గ్రూప్ పాలసీలో మార్పులు చేసినప్పుడు (ప్రీమియం పెంపు సహా) లేదా గ్రూప్ పాలసీని ఉపసంహరించుకున్న సందర్భాల్లో పోర్టింగ్‌కు వీలు కల్పించాల్సి ఉంటుంది. ⇒ పోర్టింగ్ దరఖాస్తుపై 15 రోజుల్లో బీమా సంస్థ తన నిర్ణయాన్ని పాలసీదారునకు తెలియజేయాల్సి ఉంటుంది. పాత పాలసీలో ఉన్న కవరేజీకి తక్కువ కాకుండా బీమా రక్షణను కొత్త సంస్థ అందించాలి. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నుంచి కొత్త పాలసీ
పెరిగే వ్యయాలను ఎదుర్కొనడంలో పదవీ విరమణ చేసిన వారికి కొంత తోడ్పాటు అందించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కొత్త పాలసీని ఆవిష్కరించింది. ఏటా అయిదు శాతం అధికంగా యాన్యుటీ చెల్లింపు ప్రయోజనాలను అందించే ఫీచరుతో గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీని ప్రవేశపెట్టింది. ఈ తరహా పాలసీల్లో ఇదే మొట్టమొదటిదని సంస్థ తెలిపింది.ద్రవ్యోల్బణం వల్ల కాలక్రమేణా కొనుగోలు శక్తి తగ్గినా, జీవన ప్రమాణాలను స్థిరంగా కొనసాగించుకోవడంలో కస్టమర్లకు ఈ పాలసీ ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చీఫ్ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పల్టా తెలిపారు. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు ఉన్న నేపథ్యంలో జీవితకాలం పాటు అధిక రాబడులను అందుకునేలా యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేసేందుకు ఇది సరైన తరుణమని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్‌కు ఢిల్లీ పరిస్థితి రావొద్దనే..: పొన్నం
హైదరాబాద్, సాక్షి: కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చేపించాలని పిలుపు ఇచ్చారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు ఈవీ వాహనాలు కొనాలంటూ కోరుతున్నారాయన.ఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యంతో స్కూల్స్‌కు బంద్ చేస్తున్నారని, అలాంటి పరిస్థితి తెలంగాణకు.. హైదరాబాద్‌కు రాకూడదనే ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారాయన. ‘‘ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా తెలంగాణ ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉంది. ఈవీ వాహనాల పై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నాం. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం.... హైబ్రిడ్ వాహనాల పై కూడా పన్ను రాయితీ పై ఆలోచిస్తున్నాం. ప్రజలు ఈవీ వాహనాల వైపు అడుగులేయండి. అలాగే.. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించారాయన. -
Menstrual Leave: ఉద్యోగినులకు నెలసరి సెలవు?
ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే సంస్థలు స్త్రీలను ఉద్యోగాల్లోకి తీసుకోకపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరి మహిళలు ఏమంటున్నారు?సుజన సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఉదయం నుంచి పొత్తి కడుపులో నొప్పి, కూర్చోవడానికి వీలుకానంతగా నడుం నొప్పి. ప్రతి నెలా ఉండే సమస్యే ఇది. ఈ నెల మరీ ఎక్కువగా బాధిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు సెలవు పెట్టడానికి వీలు లేదని ఆఫీసులో ముందే హెచ్చరించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాధను పంటి బిగువున భరిస్తూనే ఆఫీసుకు బయల్దేరింది.మేరీ ప్రైమరీ స్కూల్ టీచర్. పిల్లలతో కలిసిపోతూ రోజంతా యాక్టివ్‌గా ఉండాలి. నెలసరి సమయం దగ్గర పడుతుందంటేనే లోలోపల భయపడుతూ ఉంటుంది. తీవ్రమైన నొప్పితో పాటు, అధిక రక్తస్రావం సమస్యతో ప్రతీసారీ ఇబ్బందే.కరుణ బట్టల షోరూమ్‌లో పనిచేస్తోంది. రోజంతా షాప్‌లో నిల్చొనే ఉండాలి. సేల్ సీజన్ కావడంతో సెలవులు పెట్టడానికి వీల్లేదని మేనేజర్ ముందే చెప్పారు. సెలవు అడిగితే ఉద్యోగం పోతుందేమో అని భయం. కానీ, నెలసరి సమయంలో విశ్రాంతి లేకుండా పని చేయడం అంటే మరింత అలసట కమ్ముకొచ్చేస్తుంది. నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది. నెలసరి సెలవులు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందా? అసౌకర్యం వేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేయడానికి మొగ్గు చూపుతారా? నెలసరి అవసరం గురించి మహిళలు స్పందన.అవసరం ఉన్నవారికే!దాదాపు తొంభై శాతం మందిలో ఒకేలాంటి సమస్య ఉండదు. కాబట్టి అందరికీ సెలవు అవసరం లేదు. నెలసరి సమయంలోనూ సమస్యలేమీ లేకపోతే సెలవు ఎందుకు తీసుకోవాలి? పైగా పని పట్ల ఇష్టం ఉన్న నాకు లీవ్ తీసుకొని ఇంటి వద్ద ఉండటం బోర్ అనిపిస్తుంది. అందుకే సమస్య ఉన్నవారు, మెడికేషన్‌లో ఉన్నవారు డాక్టర్ ప్రిస్కిప్షన్‌తో లీవ్ తీసుకోవచ్చు. స్కూల్ టైమ్‌లో నెలసరి వస్తే ఇంటికి వెళ్లే వీలు ఉండదు. çస్కూల్లోనే కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాం. సమస్య తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారు లీవ్ తీసుకుంటే సరిపోతుంది. – మృణాళిని, టీచర్ఉపయోగకరమైనదే! మహిళ ఇంటిని, ఆఫీస్ పనినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తనని తాను నిరూపించుకుంటోంది. అయితే, పీరియడ్ సమయంలో అందరికీ అన్ని వేళలా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఎవరికైతే అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, మైగ్రెయిన్, వాంతులు... వంటి సమస్యలు ఉంటాయో వారికి విశ్రాంతి అవసరం అవుతుంది. భరించలేనంత నొప్పి ఉన్నప్పుడు ఎలాగూ పని మీద దృష్టి పెట్టలేరు. సమస్య ఉన్నవారికి సెలవు ఇవ్వడం మంచిదే. ఎందుకంటే నెలసరి నొప్పి భరించలేక ఉద్యోగాలు మానేసినవారూ ఉన్నారు. కొందరు ఉద్యోగినులు హెల్త్ చెకప్‌కి లీవ్ దొరకడం లేదని చెబుతుంటారు. అలాంటి వారికి ఈ లీవ్ అవకాశం ఉపయోగపడుతుంది. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్విశ్రాంతి అవసరమే!మహిళలు కూర్చుని చేసే ఉద్యోగాల్లో సాధారణంగా నడుం నొప్పి ఉంటుంది. నెలసరి సమయంలో ఆ తీవ్రత ఇంకాస్త పెరుగుతుంది. కానీ, మాకు కేటాయించిన పనిని మరొకరికి అప్పగించలేం. సెలవు పెడితే పనిభారం పెరుగుతుందని భయం. అదీ సమస్యే. పిరియడ్ లీవ్ తప్పనిసరి చేస్తేæ వర్క్‌లోడ్ పెరగడం, ప్రమోషన్స్‌పై ప్రభావం చూపడం జరగవచ్చు. మా ఆఫీసులో వాష్‌రూమ్‌లలో ΄్యాడ్స్, విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు ఈ తరహా అవకాశాలు ఉపయోగించుకొని, పనులను యధావిధిగా చేస్తుంటాం. పిరియడ్ లీవ్ అనేది అందరికీ అవసరం కాదు. సమస్య ఉన్నవారు యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకోవచ్చు. – ఎస్.కె.బాజి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్– నిర్మలా రెడ్డి -
రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీ
న్యూఢిల్లీ: నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగిను లకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో సంబంధిత వర్గాలు, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని సోమవారం కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. అయితే విధాన నిర్ణేతల పరిధిలోని ఈ అంశాల్లో కోర్టులు జోక్యంచేసుకోబోవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థినులు, ఉద్యోగినులకు ప్రతినెలా నెలసరి సెలవులు ఇవ్వాలంటూ లాయర్ శైలేంద్రమణి త్రిపాఠి వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘రుతుస్రావ సెలవుపై కోర్టు నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. అసౌకర్యంవేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఉద్యోగినులకు ఇలాంటి సెలవు ఇవ్వడం ఇష్టంలేని సంస్థలు, యాజమాన్యాలు మహిళలకు ఉద్యోగం ఇచ్చేందుకు విముఖత చూపే ప్రమాదం కూడా ఉంది. ఉన్న ఉద్యోగినులను కూడా తగ్గించుకునే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి విపరిణామాలకు మేం అవకాశం ఇవ్వదల్చుకోలేదు. వాస్తవానికి ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇందులో కోర్టు జోక్యం ఉండకూడదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. చైనా, బ్రిటన్, జపాన్, ఇండోనేసియా, స్పెయిన్, జాంబియా, దక్షిణకొరియాలో ఏదో ఒక కేటగిరీ కింద ఇలాంటి సెలవులు ఇస్తున్నాయంటూ లాయర్ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘‘ఈ సెలవులు ఇవ్వాలని గత ఏడాది మే నెలలోనే పిటిషనర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. విధానపర నిర్ణయమైన ఇలాంటి అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
కొత్త ఈవీలపై ఆటో కంపెనీల కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి కేంద్రం కొత్త విధానం ప్రకటించిన నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు రాబోయే రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ మొదలైన దిగ్గజాలు డిమాండ్‌కి అనుగుణంగా కొత్త మోడల్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. 2025 జనవరితో మొదలుపెట్టి.. రాబోయే రోజుల్లో అయిదు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో (ఆటోమోటివ్ విభాగం) నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. తమ వినూత్నమైన ఇన్గ్లో ప్లాట్‌ఫాంపై ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. 2027 నాటికి తమ పోర్ట్‌ఫోలియోలో 20–30 శాతం వాటా విద్యుత్ వాహనాలదే ఉండగలదని నళినికాంత్ వివరించారు. మరోవైపు, తాము కూడా ఈవీలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (కార్పొరేట్ అఫైర్స్) రాహుల్ భారతి తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల రేంజ్ ఉండే అధునాతన ఈవీ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, 7–8 ఏళ్లలో ఆరు ఈవీ మోడల్స్‌ను ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలు, చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి భారత్‌లో హైబ్రీడ్–ఎలక్ట్రిక్, సీఎన్జీ, బయో–సీఎన్జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి మరెన్నో టెక్నాలజీలు అవసరమని రాహుల్ తెలిపారు. అటువంటి సాంకేతికతలపై కూడా తాము పని చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్లలో హ్యుందాయ్ రూ. 26 వేల కోట్లు .. 2030 నాటికి భారత ఆటోమోటివ్ మార్కెట్లో ఈవీల వాటా 20 శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తున్నట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈవీలు క్రమంగా ప్రధాన స్థానాన్ని దక్కించుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే పదేళ్లలో తమిళనాడులో రూ. 26,000 కోట్ల మేర హ్యుందాయ్ ఇన్వెస్ట్ చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే కోనా, అయోనిక్ 5 పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. 10 ఈవీలపై టాటా దృష్టి.. 2026 నాటికి పది ఎలక్ట్రిక వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు టాటా మోటర్స్ తెలిపింది. కర్వ్ ఈవీ, హ్యారియర్ ఈవీతో పాటు కంపెనీ ఈ ఏడాది మరో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మరోవైపు తాము ఈ ఏడాది 12 కొత్త వాహనాలను ప్రవేశపెట్టనుండగా, వాటిలో మూడు .. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. 2030 నాటికి భారత్‌లో తమ ఆదాయంలో 50 శాతం భాగం ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆడి ఇండియా తెలిపింది. ప్రస్తుతం కంపెనీ నాలుగు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను దేశీయంగా విక్రయిస్తోంది. అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. -
క్రిప్టోలను కరెన్సీగా గుర్తించం..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్‌ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్‌ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కేంద్రం కీలక నిర్ణయం.. టెస్లాకు లైన్ క్లియర్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ తయారీదారుల పెట్టుబడులను ఆకర్షించడానికి, కేంద్రం ఈ-వెహికల్ పాలసీని తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ.. దేశంలో అడుగుపెట్టడానికి ఉవ్విల్లూరుతున్న టెస్లా మార్గాన్ని మరింత సుగమం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా టెస్లా భారతదేశంలో ప్లాంట్ నిర్మించడానికి కేంద్రంతో చర్చలు జరుపుతూనే ఉంది. నేటికి కొత్త పాలసీ రావడంతో త్వరలోనే టెస్లా మనదేశానికి వస్తుందని పలువురు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త ఈవీ పాలసీ కింద.. ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ సుమారు రూ. 4150 కోట్లు (5వేల మిలియన్ డాలర్స్) పెట్టుబడి పెడితే.. అనేక రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కొత్త పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగితే.. ఫ్యూయెల్ దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణంలో కాలుష్యం కూడా తగ్గుతుంది. ఆటోమొబైల్ కంపెనీ రూ. 4150 కోట్లు పెట్టుబడి పెడితే.. మూడు సంవత్సరాల్లో స్థానికంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతే కాకుండా విడి భాగాల్లో 25 శాతం స్థానీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్ల ధరలను బట్టి 70 నుంచి 100 శాతం దిగుమతి సుంకాలు వర్తిస్తాయి. గతంలో ఇదే టెస్లా భారత్ ఎంట్రీకి సమస్యగా ఉండేది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల టెస్లా ఊపిరి పీల్చుకుంది. గత ఏడాది దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల శాతం కేవలం 2% మాత్రమే. ఇది 2030 నాటికి 30 శాతానికి పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక విధానం అవినీతికి ఆలవాలంగా మారిందని.. అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానం తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతోపాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఇసుక రవాణా, టీఎస్ఎండీసీ కార్యకలపాలపై విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలు చేయాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో భూగర్భ గనులు, ఖనిజ వనరుల శాఖపై మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి, ఆ శాఖ అధికారులతో రేవంత్ సమీక్షించారు. అన్ని స్థాయిల్లో అవినీతి ఇసుక క్వారీయింగ్, రవాణాకు సంబంధించి అన్నిస్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. వాటిని వెంటనే అరికట్టాలని అధికారులను సీఎం హెచ్చరించారు. 48 గంటల్లోగా అన్నిస్థాయిల అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. రెండు రోజుల తర్వాత ఏసీబీ, విజిలెన్స్ విభాగాలను రంగంలోకి దింపాలని.. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమాలకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు. అన్నిరూట్లలో ఉన్న టోల్గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా లారీల్లో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని బయటికి తీయాలని సూచించారు. ఇసుక రీచ్‌లు, డంపులను తనిఖీ చేయాలని.. అక్రమాలకు పాల్పడినవారికి జరిమానాలు విధిస్తే సరిపోదని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలు చేయించి..: ఇసుక రీచ్లన్నింటా సీసీ కెమెరాలు ఉన్నాయని అధికారులు చెప్పడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 1న తాను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పాదయాత్ర చేసినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లానని.. అక్కడ సీసీ కెమెరాలు లేవని చెప్పారు. ఈనెల 3న రవాణా విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించామన్నారు. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. అందులో 22 లారీలకు అనుమతి లేదని.. ఒకే పర్మిట్, ఒకే నంబర్‌తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నాయని తేలిందని స్పష్టం చేశారు. అంటే 25శాతం ఇసుక అక్రమంగా తరలిపోతోందన్నారు. అనుమతిలేని క్రషర్స్ సీజ్ చేయండి హైదరాబాద్ చుట్టుపక్కల అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. భారీ భవన సముదాయాలు నిర్మించేటప్పుడు రోడ్లపై కంకర, బిల్డింగ్ మెటీరియల్ వేయకుండా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సెల్లార్ల కోసం ఆరు మీటర్ల కంటే లోతుగా తవ్వితే నిబంధనల ప్రకారం పన్ను వసూలు చేయాలని ఖనిజ వనరుల శాఖను ఆదేశించారు. అలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేప్పుడే.. వాటి వివరాలు ఖనిజ వనరుల శాఖకు చేరేలా సమీకృత ఆన్లైన్ విధానం అమలు చేయాలన్నారు. గ్రానైట్, ఖనిజ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు జియో ట్యాగింగ్, జీపీఆర్ఎస్ను వినియోగించాలని సూచించారు. గ్రానైట్‌తోపాటు ఇతర క్వారీలకు సంబంధించిన కేసులు ఏమేం ఉన్నాయి, ఏయే ఏజెన్సీల వద్ద ఉన్నాయి, వాటి పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
అదే రోజు సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ట్రేడ్ చేసిన రోజే సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చే దిశగా సెబీ కీలక అడుగు వేసింది. అదే రోజు సెటిల్మెంట్ (సేమ్‌డే), వెనువెంటనే (రియల్ టైమ్) సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ప్రవేశపెట్టడానికి సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో షేర్ల కొనుగోలు, విక్రయ లావాదేవీలకు ప్రస్తుతం టీప్లస్1 విధానం అమల్లో ఉంది. అంటే ట్రేడ్ చేసిన రోజు కాకుండా తదుపరి పని దినం రోజున ఆ షేర్ల సెటిల్మెంట్ (విక్రయించిన వారి నుంచి తీసుకుని, కొనుగోలు చేసిన వారికి జమ చేయడం) చేస్తున్నారు. టీప్లస్1 విధానాన్ని సెబీ 2021లో దశలవారీగా అమల్లోకి తీసుకొచి్చంది. అంతకుముందు వరకు టీప్లస్2 విధానం ఉండేది. టీప్లస్5 స్థానంలో టీప్లస్3ని 2002లో ప్రవేశపెట్టారు. 2003లో టీప్లస్2 అమల్లోకి వచి్చంది. అదే రోజు సెటిల్మెంట్ విధానం వల్ల షేర్లను విక్రయించిన వారికి ఆ రోజు ముగింపు లేదా మరుసటి రోజు ఉదయానికి నిధులు అందుబాటులోకి వస్తాయి. షేర్లను కొనుగోలు చేసిన వారికి ఖాతాల్లో అదే రోజు జమ అవుతాయి. దీనివల్ల మరింత లిక్విడిటీ, ఇన్వెస్టర్లకు సౌకర్యం లభిస్తుంది. ఈ సంప్రదింపుల పత్రంపై జనవరి 12 వరకు సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రజలను సెబీ కోరింది. ఐచ్ఛికంగా.. సెక్యూరిటీలు, నిధుల క్లియరింగ్, సెటిల్మెంట్కు టీప్లస్0, ఇన్స్టంట్ సెటిల్మెంట్ సైకిల్‌ను ప్రస్తుత టీప్లస్1 విధానంతోపాటు ఐచి్ఛకం అమలును ప్రతిపాదిస్తున్నట్టు సెబీ తన సంప్రదింపుల పత్రంలో పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెక్యూరిటీల మార్కెట్ల అభివృద్ధికి సెబీ వరుసగా పలు చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. తక్షణ సెటిల్మెంట్ సైకిల్‌ను అమల్లోకి తీసుకురావడమే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఉద్దేశ్యంగా ఉంది. నిజానికి ఇన్వెస్టర్ షేర్లను కొనుగోలు చేయాలంటే, ముందుగా అందుకు సంబంధించిన నిధుల మొత్తాన్ని తన ఖాతాకు జోడించుకోవడం తప్పనిసరి. అప్పుడే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అలాగే, షేర్ల విక్రయానికి (డెలివరీ) సైతం ఆయా సెక్యూరిటీలను కలిగి ఉండాలి. అప్పుడే బ్రోకర్లు ట్రేడ్లను అనుమతిస్తారు. కనుక తక్షణ సెటిల్మెంట్ ఆచరణ సులభమేనని సెబీ భావిస్తోంది. దీనివల్ల సెక్యూరిటీలు, నిధులను తక్షణమే ఇన్వెస్టర్లు పొందడానికి వీలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆందోళనలు.. ‘‘నూతన విధానం వల్ల లిక్విడిటీ తగ్గిపోతుందని, సమర్థమైన ధరల అన్వేషణపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అలాగే, ట్రేడ్లు చేయడానికి ముందే నిధులు, సెక్యూరిటీలు కలిగి ఉండాల్సి రావడం వల్ల ట్రేడింగ్ వ్యయం పెరిగిపోతుందని.. ఫలితంగా టీప్లస్1 సెటిల్మెంట్ సైకిల్‌తో పోలిస్తే టీప్లస్0 విధానంలో ధరల వ్యత్యాసానికి దారితీస్తుంద్న ఆందోళన ఉంది’’అని సెబీ పేర్కొంది. ఈ ఆందోళనలను తగ్గించేందుకు వీలుగా టీప్లస్0, టీప్లస్1నూ వినియోగించుకునే వెసులుబాటును కలి్పస్తున్నట్టు తెలిపింది. తద్వారా రెండు విధానాల మధ్య ధరల అంతరాన్ని తొలగించుకోవచ్చని పేర్కొంది. రెండింటి మధ్య సెక్యూరిటీ ధరల్లో అంతరం ఉంటే ఆర్బిట్రేజ్ ద్వారా ప్రయోజనం, లిక్విడిటీని పొందొచ్చని తెలిపింది. రెండు దశల్లో మొదటి దశలో టీప్లస్0 విధానాన్ని మధ్యా హ్నం 1.30 గంటల వరకు ఐచి్ఛకంగా అమలు చేయవచ్చు. ఈ వ్యవధిలోపు నమోదైన ట్రేడ్స్‌కు సంబంధించి నిధులు, సెక్యూరిటీల పరిష్కారాన్ని సాయంత్రం 4.30 గంటలకు పూర్తి చేస్తారు. రెండో దశలో ఇన్స్టంట్ ట్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది 3.30 గంటల వరకు ఉంటుందని సెబీ సంప్రదింపుల పత్రం స్పష్టం చేస్తోంది. -
మొదలైన కొత్త మద్యం పాలసీ.. అప్పుడే 171 కోట్ల ఆదాయం!
మహబూబ్‌నగర్ క్రైం: రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం దుకాణాలు నిర్వహించే వ్యాపారులకు 75శాతం రాకపోవడంతో ఇకపై ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కొత్తగా దుకాణాలను సొంతం చేసుకున్న వారితో కొందరు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. మరికొందరు తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్‌లదే పైచేయిగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆగస్టు 21న నిర్వహించిన టెండర్లలో మొత్తం 8,595 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.171.90కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మద్యం దుకాణాలకు టెండర్లు రావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రోజురోజుకూ మద్యం వ్యాపారంపై చాలా మంది దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాపారులతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా టెండర్లు దాఖలయ్యాయి. 2021 కంటే ఈసారి దరఖాస్తులు రెండింతలు పెరిగాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో దరఖాస్తులు రెట్టింపయ్యాయి. బిజీబిజీ.. ఉమ్మడి జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి హడావుడి మొదలైంది. 230 దుకాణాల్లో కొన్నింటిని అదే దుకాణాల్లో ఏర్పాటు చేసుకుంటుంటే.. మరికొన్ని దుకాణాలు కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10గంటల వరకు అన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యాపారులు ఆయా దుకాణాల నిర్మాణ పనులు చేస్తూ బీజీబీజీగా కన్పించారు. లాభాలు ఉండటంతో.. మద్యం విక్రయాల వల్ల భారీగా లాభాలు ఉండటంతో మద్యం వ్యాపారులతో పాటు రాజకీయ నేతలు కూడా రంగప్రవేశం చేశారు. దుకాణం ఎవరి పేరుతో వచ్చినా అంతా కలిసే వ్యాపారం చేసుకోవాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కొక్కరు 10మందికిపైగా బినామీ పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో ఏ ఒక్కరికి వచ్చినా అందరికీ లబ్ధి చేకూరేలా చేసుకున్నారు. మద్యం దుకాణాదారులే గ్రామాలు, వార్డుల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రూ.4వేల కోట్ల వ్యాపారం సాగుతుండగా.. రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే విశ్వాసంతో వ్యాపారులు ఉన్నారు. -
కార్లకు రిలయన్స్ ఇన్సూరెన్స్ కొత్త పాలసీ - తిరిగే దూరాన్ని బట్టి..
ముంబై: సాధారణ బీమా సంస్థ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్‌జీఐసీఎల్) తాజాగా కార్ల కోసం ’రిలయన్స్ లిమిట్ ష్యూర్ – పే యాజ్ యూ డ్రైవ్’ పేరిట కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. వాహనం తిరిగే దూరానికి అనుగుణంగా ఈ పాలసీని తీసుకోవచ్చని సంస్థ సీఈవో రాకేశ్ జైన్ తెలిపారు. కనిష్టంగా 2,500 కిలోమీటర్ల శ్లాబ్‌తో మొదలుపెట్టి అవసరాన్ని బట్టి అదనంగా 1,000 కిలోమీటర్ల మేర పరిమితిని పెంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే తాము ఎంచుకున్న శ్లాబ్‌లో కిలోమీటర్లు మిగిలిపోతే, పాలసీని రెన్యువల్ చేసుకునేటప్పుడు వాటిపై డిస్కౌంటు కూడా పొందవచ్చని వివరించారు. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! అటు తమ ప్లాన్‌లో కిలోమీటర్ల పరిమితిని దాటిపోయినప్పటికీ అగ్నిప్రమాదం, దొంగతనానికి సంబంధించి థర్డ్ పార్టీ కవరేజీని పొందవచ్చని తెలిపారు. 'రిలయన్స్ లిమిట్ ష్యూర్ - పే యాజ్ యు డ్రైవ్' అనేది పూర్తి థర్డ్-పార్టీ, ఓన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌తో సహా కన్వెన్షనల్ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి సమానమైన అన్నింటిని కవర్ చేసే కవరేజీని అందిస్తుంది. -
ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు
న్యూఢిల్లీ: జాతీయ విద్యావిధానంలో భాగంగా పరీక్షల విధానంలో కేంద్రం కొత్త మార్పులకు సిద్ధమైంది. ఇకపై ఇంటర్లో ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్సీఎఫ్) ప్రతిపాదనలు చేసింది. అలాగే, 9–12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జెక్టుల సంఖ్యను పెంచాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్సీఎఫ్ నివేదికను బుధవారం జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలికి అందించారు. ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఏ పరీక్షలో అయితే ఉత్తమ మార్కులు సాధిస్తారో వాటినే ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ చెప్పింది. ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని పేర్కొంది. క్రమక్రమంగా అన్ని బోర్డులు కూడా సెమిస్టర్ లేదా టర్మ్ బేస్డ్ వ్యవస్థకు మారతాయని కేంద్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. దీనివల్ల విద్యార్థులు ఒక సబ్జెక్టును పూర్తిచేయగానే అతడు పరీక్ష రాయొచ్చని, ఇలా ఒక పరీక్ష పూర్తయినా విద్యార్థిపై కంటెంట్ భారం తగ్గుతుందని చెప్పింది. ఎన్‌సీఎఫ్‌ను ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ నేతృత్వంలోని జాతీయ స్టీరింగ్ కమిటీ రూపొందించింది. బోర్డు పరీక్షల్లో ఇలాంటి సంస్కరణలు తొలిసారి కాదు. 2009లో పదో తరగతిలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానాన్ని ప్రవేశపెట్టగా, 2017లో రద్దుచేసి తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని తెచ్చారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఇకపై కచ్చితంగా మూడు లాంగ్వేజ్ సబ్జెక్టులు చదవడం తప్పనిసరని ఎన్సీఎఫ్ సిఫార్సు చేసింది. వీరు మూడు లాంగ్వేజ్‌లతోపాటు మ్యాథ్స్, కంప్యూటేషనల్ థింకింగ్, సోషల్ సైన్స్, సైన్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వెల్–బియింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్ లాంటి వాటి నుంచి ఏడు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. -
గూగుల్ అకౌంట్... వాడకుంటే డిలీటే!
మీ గూగుల్ అకౌంట్‌ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్ 1 నుంచి గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్ ఈ వారమే తన యూజర్లందరికీ మెయిల్స్ పంపింది. తాను అందించే అన్ని సరీ్వసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్ డిలీషన్ అందులో భాగమే’’ అని గూగుల్ ప్రకటించింది. వీటికి వర్తిస్తుంది ► గూగుల్ అకౌంట్‌ను రెండేళ్ల పాటు సైన్ ఇన్ చేయకపోతే, వాడకపోతే. ► ఒకసారి డిలీట్ చేసిన అకౌంట్ తాలూకు జీ మెయిల్ అడ్రస్‌ను ఇంకెవరికీ కేటాయించబోరు. ► సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్ చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ► అయితే అకౌంట్‌ను డిలీట్ చేసే ముందు గూగుల్ పలుమార్లు రిమైండర్ మెయిల్స్ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తోపాటు యూజర్ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి. ► ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్ రావడం మొదలవుతుంది. మీ గూగుల్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే... ► తరచూ లాగిన్ అవుతూ ఉన్నా... ► కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్ అయినా... ► గూగుల్ డ్రైవ్ వాడినా... ► మెయిల్ పంపినా, చదివినా... ► యూట్యూబ్‌లో వీడియో చూసినా... ► ఏ గూగుల్ యాప్ డౌన్లోడ్ చేసినా... ► థర్డ్ పార్టీ యాప్, సరీ్వస్ లను గూగుల్ ద్వారా సైన్ ఇన్ చేసినా మీ గూగుల్ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు. మినహాయింపులున్నాయ్.. గూగుల్ అకౌంట్ డిలీషన్ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు ► యూట్యూబ్ చానల్స్, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్ అకౌంట్ ► డబ్బులతో కూడిన గిఫ్ట్ కార్డులున్న జీ మెయిల్ అకౌంట్ ► పబ్లిషిడ్ అప్లికేషన్ ఉన్న అకౌంట్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు
భారీ పరిశ్రమలను ఆకర్షించేలా యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2023 – 27 విధివిధానాలను తాజాగా విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 30 వరకు నూతన పాలసీ అమల్లో ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. యాంకర్ యూనిట్లతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రభుత్వం నూతన పాలసీ విధివిధానాలను రూపొందించింది. యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. యాంకర్ యూనిట్ రూ.500 కోట్లకు పైబడి పెట్టుబడితో ఏర్పాటవ్వాలి. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించాలి. ఈ యూనిట్ ఆధారంగా కనీసం మరో ఐదు యూనిట్లు ఏర్పాటవ్వాలి. ఇటువంటి యూనిట్లకు పారిశ్రామిక పాలసీ 2023 – 27లో పేర్కొన్న ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు కూడా లభిస్తాయి. యూనిట్ ఏర్పాటు వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిగే ప్రయోజనం, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ప్రతిపాదనలను బట్టి టైలర్ మేడ్ రాయితీలను ఇవ్వనున్నారు. తొలుత యాంకర్ యూనిట్ పూర్తి నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌కు సమర్పించాలి. వారు కోరుకొనే రాయితీలను ప్రజంటేషన్ రూపంలో చూపించాలి. ఆ రాయితీలు ఇవ్వడానికి సహేతుక కారణాలను వివరించాలి. ఈ ప్రతిపాదనలను ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ ముందుకు తేవాలి. వాటిని ఎస్ఐపీబీ పరిశీలించి భూమి ధరలు, ప్రత్యేక రాయితీలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు విస్తరణ చేపట్టినా, లేక వేరే రంగంలో పెట్టుబడులు పెట్టినా వాటికి కూడా నిబంధనలకు అనుగుణంగా రాయితీలు అందుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన ప్రతి పరిశ్రమకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉద్యోగుల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని, అటువంటి సంస్థలకే ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఇందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందుకు విధివిధానాలను నూతన పాలసీలో పొందుపరిచింది. ఈ పరిశ్రమల్లో 100 శాతం పెట్టుబడి ఎస్సీలు, ఎస్టీల పేరు మీద ఉండాలి. 100 శాతం పెట్టుబడి ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద ఉంటే వాటిని ఎస్సీ, ఎస్టీ మహిళా యూనిట్లుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలను తొలి తరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా వారిని చేయిపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. జగనన్న కాలనీల్లో వాక్ టు వర్క్ విధానంలో పనిచేసుకునే విధంగా ఉమ్మడి వసతులతో కూడిన సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్లలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కాలనీల్లో యూనిట్లు ఏర్పాటు చేసేలా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
‘బంగారు కొండ’లకు పోషకాహారం!
సాక్షి, రాజమహేంద్రవరం : చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించి, సంపూర్ణ పోషణ అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలత వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ‘బంగారుకొండ’ పేరుతో నూతన విధానానికి బుధవారం నాంది పలికారు. వయసుకు తగ్గ బరువు, ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల్ని బాల మిత్రల ద్వారా గుర్తించి సాధారణ స్థితికి తెచ్చే వరకూ 6 నెలల పాటు నెలకు రూ.300 విలువ చేసే 8 రకాల పోషక పదార్థాలను దాతల సాయంతో అందివ్వాలన్నదే కార్యక్రమ ఉద్దేశం. కలెక్టరేట్ వేదికగా వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్‌ను హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్, కలెక్టర్ కె.మాధవీలతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే పిల్లల్లో పౌష్టికాహార సమస్యను దూరం చేయాలని సీఎం జగన్.. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఎదుగుదల, పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం దాతలు నెలకు రూ.500 చొప్పున ఆరు నెలలకు రూ.3,000 వేలు చెల్లించి బాలమిత్రగా నమోదు కావాలని సూచించారు. పలువురు చిన్నారుల బాధ్యత తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పౌష్టికాహార సమస్యతో బాధపడుతున్న పిల్లల్ని ఆరు నెలల పాటు పోషణ నిమిత్తం దత్తత తీసుకునేందుకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహం చూపారు. హోం మంత్రి వనిత ఓ చిన్నారిని, ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఇద్దరిని, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావ్‌లు ఇద్దరు చొప్పున, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కమిషనర్ దినే‹Ùకుమార్‌లు చెరో చిన్నారిని దత్తత తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 85,700 మంది పిల్లలుంటే.. వారిలో తక్కువ బరువు ఉన్న పిల్లలు 368 మంది, వయస్సుకు తగ్గ ఎత్తు లేని వారు 506 మంది, బరువుకు తగ్గ ఎత్తు లేని వారు 409 మందిని గుర్తించినట్లు తెలిపారు. ఆ మేరకు 1,283 మంది పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు 1,283 మంది బాల మిత్రలుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు. -
మేలో కొత్త వ్యాపార ప్రీమియం రూ.23,448 కోట్లు
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల రూపంలో వచ్చేది) మే నెలలో 4.1 శాతం తగ్గి రూ.23,448 కోట్లకు పరిమితమైంది. 24 జీవిత బీమా కంపెనీలు క్రితం ఏడాది ఇదే నెలలో ఉమ్మడిగా రూ.24,480 కోట్లు ప్రీమియం ఆదాయం సంపాదించాయి. నూతన వ్యాపార ప్రీమియం పరంగా ఎల్ఐసీ 11.26 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ సంస్థకు నూతన పాలసీల రూపంలో మే నెలలో రూ.14,056 కోట్ల ప్రీమియం సమకూరింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఎల్ఐసీకి వచ్చిన ఆదాయం రూ.15,840 కోట్లుగా ఉంది. ఈ గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ కాకుండా మిగిలిన 23 జీవిత బీమా సంస్థల ఉమ్మడి ప్రీమియం ఆదాయం 9 శాతం పెరిగి రూ.9,421 కోట్లుగా నమోదైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 24 జీవిత బీమా కంపెనీల నూతన వ్యాపార ప్రీమియం ఆదాయం రూ.36,043 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.42,420 కోట్లతో పోలిస్తే 15 శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఎల్ఐసీ నూతన వ్యాపార ప్రీమియం 28 శాతం క్షీణించి రూ.19,866 కోట్లకు పరిమితమైంది. -
ఈ మార్పులపై ఓ లుక్కేయండి!
ఆదాయపన్ను పరంగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని పన్ను మిహాయింపులు తొలగిపోగా.. కొన్ని సాధనాలకు సంబంధించి పెట్టుబడి పరిమితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే ఆదాయపన్ను కొత్త విధానం మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రధానంగా పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచే లక్ష్యాలతో కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు, సవరణలు తీసుకొస్తోంది. కనుక ఆదాయపన్ను పరిధిలోని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన మార్పులను వివరించే కథనమిది... నూతన పన్ను విధానం... నూతన పన్ను విధానం ఎంపిక చేసుకునే వారికి వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే రూపాయి పన్ను చెల్లించే పని లేకుండా పన్ను రాయితీని ప్రభుత్వం కల్పించింది. సెక్షన్ 87ఏ కింద గరిష్టంగా రూ.25,000 రాయితీని ప్రకటించింది. అంటే నికరంగా రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం ఉండదు. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపశమనం కల్పించడమే ఈ రాయితీ ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థి క సంవత్సరం నుంచే ఈ రాయితీ అమల్లోకి వచ్చింది. ఈ రాయితీ వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం లభించనుంది. ఒకవేళ ఆదాయం రూ.7లక్షలకు పైన స్వల్పంగా ఉన్నప్పుడు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీన్ని అర్థం చేసుకున్న కేంద్ర సర్కారు ఆర్థిక బిల్లు 2023లో కొన్ని సవరణలు చేసింది. ఉదాహరణకు రూ.7 లక్షలకు పైన మరో రూ.5 వేల ఆదాయం ఉంటే అప్పుడు నిబంధనల కింద రూ.26,500 పన్ను (సెస్సులతో) చెల్లించాల్సి ఉంది. దీని స్థానంలో.. రూ.7లక్షలకు పైన అదనంగా ఉన్న రూ.5వేలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాగే, నూతన పన్ను విధానంలోనూ రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కల్పించారు. దీంతో నికరంగా రూ.7.50 లక్షల వరకు పన్ను భారం పడదు. నూతన పన్ను విధానం కింద పన్ను రేట్లలోనూ మార్పులు చేశారు. 60 ఏళ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3–6 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.6–9 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను పడుతుంది. రూ.9–12 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.15 లక్షల ఆదాయంపై 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. బీమాపైనా పన్ను జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంపైనే కాదు, గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా పన్ను ఉండదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. జీవిత బీమా పాలసీలకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే.. పాలసీదారు జీవించి ఉన్న సందర్భాల్లో గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే అధిక ప్రీమియం పాలసీల మెచ్యూరిటీపై ఇప్పటి వరకు ఉన్న సున్నా పన్ను ప్రయోజనాన్ని సర్కారు తొలగించింది. వార్షిక ప్రీమియం రూ.5 లక్షల వరకు ఉండే పాలసీల మెచ్యూరిటీపై ఇక ముందూ పన్ను మినహాయింపు ప్రయోజనం కొనసాగుతుంది. అలాగే, 2023 మార్చి 31వరకు కొనుగోలు చేసిన జీవిత బీమా పాలసీలకు సంబంధించి వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉన్నా, చివర్లో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. అలాగే, పాలసీదారు మరణించిన సందర్భంలో చెల్లించే పరిహారంపైనా పన్ను ఉండదు. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఎంత ఉన్నా కానీ, పన్ను పరిధిలోకి రావు. డెట్ ఫండ్స్‌పై కూడా... డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగించినప్పుడు వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. వచ్చిన లాభం నుంచి పెట్టుబడి పెట్టిన కాలంలో సగటు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన లాభంపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇది గతంలో ఉన్న విధానం. కానీ, ఈ ప్రయోజనాన్ని తొలగించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతైనా కానీయండి, వచ్చే లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఏ శ్లాబు రేటు పరిధిలో ఉంటే, ఆ మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రస్తుతం డెట్ ఫండ్స్‌లో అమల్లో ఉన్న స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధానమే ఇక మీదట అన్ని రకాల డెట్ ఫండ్స్ లాభాలకు అమలవుతుంది. మొత్తానికి డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని తొలగించారు. తద్వారా డెట్ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులను నిరుత్సాహపరిచినట్టయింది. దీంతో దీర్ఘకాల పెట్టుబడులు జీవిత బీమా, ఈక్విటీ సాధనాల వైపు వెళతాయన్నది నిపుణుల అంచనాగా ఉంది. 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే తాజా డెట్ పెట్టుబడులకు నూతన పన్ను విధానం అమలవుతుంది. 2023 మార్చి 31 వరకు చేసిన పెట్టుబడులకు కొత్త నిబంధన వర్తించదు. రిటర్నుల దాఖలు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేసే వారు తప్పకుండా గమనించాల్సిన మార్పు ఒకటి ఉంది. పాత, కొత్త పన్ను విధానాలు ఉన్నప్పటికీ, నూతన పన్ను విధానమే డిఫాల్ట్‌గా కనిపిస్తుంది. పాత పన్ను విధానంలోనే కొనసాగాలని అనుకునేవారు రిటర్నులు దాఖలు చేసే ముందే దానిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నూతన పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, చాలా వరకు పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాల్లేవు. అన్ని రకాల మినహాయింపు ప్రయోజనాలను ఉపయోగించుకునే వారికి పాత విధానం అనుకూలం. కనుక ఎవరికి వారు తమ వార్షిక ఆదాయం, పెట్టుబడుల ఆధారంగా ఏ పన్ను విధానం అనుకూలం అనేది ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో స్పష్టత రాకపోతే పన్ను నిపుణుల సాయం తీసుకోవాలి. ఎస్సీఎస్ఎస్ పదవీ విరమణ పొందిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చి పెట్టే పెట్టుబడి పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అయితే 55–60 ఏళ్ల మధ్యలో ఉన్నా పెట్టుబడికి అర్హులు. ఈ పథకంలో ఒక్కరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏప్రిల్ 1 నుంచి దీన్ని రూ.30 లక్షలకు పెంచారు. నగదు ఉపసంహరణలపై టీడీఎస్ బ్యాంకు ఖాతా నుంచి భారీగా నగదు ఉపసంహరణలను నిరుత్సాహ పరిచేందుకు గాను కేంద్ర సర్కారు మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌ను) ప్రవేశపెట్టింది. ఒక ఆర్థి క సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణలు రూ.కోటి మించితే టీడీఎస్ కింద బ్యాంకులు 2 శాతాన్ని మినహాయిస్తాయి. వ్యక్తులు, వ్యాపార సంస్థలకూ ఇది అమలవుతుంది. ఎల్‌టీఏ ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు సెలవులను నగదుగా మార్చుకునే మొత్తంపై పన్ను ప్రయోజనానికి పరిమితి ఉంది. 2002 నుంచి ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంటే, దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే సెలవులను నగదుగా మార్చుకునే మొత్తం రూ.25 లక్షలు ఉన్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పథకం. ఈ పథకంలోనూ ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునేందుకు అనుమతి ఉంటే, దీన్ని రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ కింద రూ.9 లక్షల పరిమితిని రూ.15 లక్షలు చేశారు. హెచ్‌ఎన్‌ఐలపై పన్ను భారం బడ్జెట్లో అధిక సంపద కలిగిన వ్యక్తులకు సర్‌చార్జీ భారాన్ని తగ్గించారు. వార్షికాదాయం రూ.5 కోట్లకు పైన ఉన్న వారికి సర్‌చార్జీ 37 శాతం నుంచి 25 శాతానికి దిగొచ్చింది. కాకపోతే నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే వారికే దీన్ని పరిమితం చేశారు. ఎన్పీఎస్ నుంచి వైదొలగాలంటే.. ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ పథకం నుంచి వైదొలిగే లేదా యాన్యుటీ ఎంపిక చేసుకునే వారికి కేవైసీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. పథకం నుంచి వైదొలిగిన సభ్యులకు వేగంగా యాన్యుటీ చెల్లింపుల చేసేందుకే ఈ ఆదేశాలు అమల్లోకి తెచ్చారు. ఎన్పీఎస్ ఎగ్జిట్ లేదా విత్ డ్రాయల్ ఫారమ్, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, బ్యాంక్ అకౌంట్ రుజువు, ప్రాన్ (పెన్షన్ అకౌంట్) కార్డ్ కాపీని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్‌లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనారోగ్యం, వైకల్యం తదితర సందర్భాల్లో ఎన్పీఎస్ నుంచి 25 శాతం ఉపసంహరణకు అనుమతి ఉంది. ఆ సందర్భాల్లోనూ వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ–గోల్డ్ భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్ (ఈజీఆర్) రూపంలోకి మార్చుకుంటే ఎలాంటి మూలధన లాభాల పన్ను పడదు. ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ ద్వారా గెలుచుకునే మొత్తంపై 30 శాతం టీడీఎస్ అమలు కానుంది. ఈపీఎఫ్ ఉపసంహరణపై టీడీఎస్ ఈపీఎఫ్ ఖాతాకు పాన్ లింక్ చేయకపోతే.. సభ్యులు ఉపసంహరించుకునే మొత్తంపై 20 శాతం టీడీఎస్ అమలు చేస్తారు. ఇంటి మూలధన లాభంలో మార్పులు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54 ఎఫ్ కింద ఒక ఇంటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఈ సెక్షన్ల కింద తిరిగి పెట్టుబడి పెట్టే మూలధన లాభాలను రూ.10 కోట్లకు పరిమితం చేశారు. అంటే ఇంతకు మించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ మహిళలకు 2023 బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన పథకం ఇది. 2025 మార్చి వరకు ఈ పథకం ఉంటుంది. ఒక్కరు రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై 7.5% వడ్డీ రేటు చెల్లిస్తారు. గరిష్టంగా రెండేళ్లు డిపాజిట్ చేసుకోవచ్చు. బంగారం విక్రయం ఇలా.. హాల్ మార్క్ ఆభరణాలు, బంగారం వస్తువులను ఏప్రిల్ 1 నుంచి 6 నంబర్ల ఆల్ఫాన్యూమరిక్ హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్‌యూఐడీ)తోనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ జ్యుయలరీ పట్ల వినియోగదారుల్లో విశ్వాసాన్ని ఇది పెంచనుంది. హెచ్‌యూఐడీ లేకుండా విక్రయించడాన్ని బీఐఎస్ నిషేధించింది. -
న్యూ ఇండియా అష్యూరెన్స్ నుంచి డ్రోన్లకు బీమా..
ముంబై: డ్రోన్లకు కూడా బీమా కవరేజీ అందించేలా న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏ) కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. తద్వారా ఎన్ఐఏ ఈ తరహా పాలసీలను అందించే తొలి ప్రభుత్వ రంగ బీమా సంస్థగా నిల్చింది. పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌ల నుంచి సోలో ఫ్లయింగ్ గ్లైడర్లు మొదలైన వాటికి ఈ పథకం వర్తిస్తుంది. డ్రోన్ ఓనర్లు, ఆపరేటర్లు, తయారీ సంస్థలకు కవరేజీ అందించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 15 యాడ్ ఆన్ కవర్స్ కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా ఏఐజీ జనరల్ తదితర సంస్థలు డ్రోన్ పాలసీలను అందిస్తున్నాయి. -
తగ్గేదేలే: మస్క్ కొత్త పాలసీ, అలా చేస్తే అంతే!
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్ టేకోవర్ తరువాత వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కొత్త పాలసీ విధానాన్ని ప్రకటించారు. కంటెంట్ మోడరేషన్ ప్రణాళికలను వెల్లడించారు. ట్విటర్ పోస్ట్‌లకు భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది కానీ నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండదని తేల్చి చెప్పారు. విద్వేష పూరిత కంటెంట్ ఉన్న పోస్టులను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. (గుడ్‌న్యూస్,తొలిసారి ట్విటర్లో...మస్క్ క్లారిటీ!) ఫ్రీడం ఆఫ్ స్పీచ్, బట్ నాట్ రీచ్: కొత్త పాలసీ తాజా పాలసీ అప్డేట్లో విద్వేషపూరిత ట్వీట్లు డీబూస్ట్, డీమోనిటైజ్ చేస్తామని మస్క్ తెలిపారు. నెగెటివ్, హేట్ పోస్ట్‌లను ప్రమోట్ చేయమని, వాటిని మోనిటైజ్ పరిధిలోకి రావని స్పస్టం చేశారు. అలాంటి పోస్టులపై యూజర్లకు ఎలాంటి రెవెన్యూ ఉండబోదని తేల్చారు. అంతేకాదు అడ్వర్టయిజ్మెంట్లను కూడా నియంత్రిస్తామన్నారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని కూడా మస్క్ పేర్కొన్నారు. యూజర్లు అలాంటి ట్వీట్లను ప్రత్యేకంగా వెతికితే తప్ప దొరకవు అని వెల్లడించారు. New Twitter policy is freedom of speech, but not freedom of reach. Negative/hate tweets will be max deboosted & demonetized, so no ads or other revenue to Twitter. You won’t find the tweet unless you specifically seek it out, which is no different from rest of Internet. — Elon Musk (@elonmusk) November 18, 2022 మరోవైపు గతంలో ట్విటర్లో బ్యాన్ చేసిన కొన్ని ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు మస్క్. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ట్విటర్ అకౌంట్‌ను పునరుద్ధరించాలా? వద్దా? అనే విషయంపై పోల్ పెట్టారు. అయితే ట్రంప్ ఖాతాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం గమనార్హం. Kathie Griffin, Jorden Peterson & Babylon Bee have been reinstated. Trump decision has not yet been made. — Elon Musk (@elonmusk) November 18, 2022 అలాగే వర్క్ ఫ్రం హోం రద్దుతోపాటు, ఎక్కువ పనిగంటలు పనిచేసేందుకు సిద్ధపడతారా, రాజీనామా చేస్తారా అంటూ మస్క్ అల్టిమేటానికి సమాధానంగా తాజాగా 1200 మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. సాఫ్ట్వేర్ కోడ్ రాసే ఉద్యోగులు ఎవరైనా మధ్యాహ్నం శాన్ఫ్రాన్సిస్కోలోని కార్యాలయంలోని 10వ అంతస్తులో తనను కలవాలని మస్క్ శుక్రవారం ట్విటర్ సిబ్బందికి మెయిల్ పంపారు. (ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) కాగా 44 బిలియన్ డాలర్ల ట్విటర్ డీల్ తరువాత సంచలన నిర్ణయాలతో అటు ఉద్యోగులను, ఇటు టెక్ వర్గాలను గందరగోళానికి గురిచేస్తూ విమర్శలు పాలవు తున్నా, మస్క్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ట్విటర్ పునరుద్ధరణ పేరుతో ఇప్పటికే వేలాది ఉద్యోగులను తొలగించడంపై అమెరికా కోర్టులో కేసులు కూడా నమోదైనాయి. అంతేకాదు మస్క్ అనాలోచిత నిర్ణయాలతో ట్విటర్ మూత పడనుందనే అంచనాలు వెల్లువెత్తాయి. అయితే ఆదివారం జరగనున్న వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లైవ్ కవరేజీ, కమెంటరీని ఎంజాయ్ చేయమంటూ ప్రకటించి ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు. -
కల్లు గీత నూతన పాలసీతో లక్ష కుటుంబాలకు ప్రయోజనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్లు గీత నూతన పాలసీని అమలులోకి తేవడం వల్ల గీత కార్మికులకు చెందిన సుమారు లక్ష కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు. కల్లు గీత నూతన పాలసీని అమలులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయడంపై మంత్రి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. నూతన పాలసీ అమలుతో గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, ఈత, శ్రిసయిన కులాలకు చెందిన కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కల్లు దుకాణాల అద్దెలను (కిస్తిలను) ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం, కల్లు గీచే వారికే చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాలలో షెడ్యూల్డ్ జాతులు వారు కల్లు గీసుకోవడం కోసం ఐదు సంవత్సరాలు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని వివరించారు. అదే విధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన కల్లుగీత కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.ఐదు లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచడం, ప్రమాదానికి గురై అంగ వైకల్యం చెందిన వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించడం, కల్లుగీత కార్మికుడు సహజంగా మరణిస్తే కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా కింద అందచేయడం బాధిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తుందని తెలిపారు. నదీతీరాలు, కాల్వగట్లు, మీద తాటి, ఈత చెట్ల పెంపకం ద్వారా కార్మికులకు మరింత ఆదాయం వచ్చే విధంగా ఐదు సంవత్సరాల పాలసీని తీసుకురావడం హర్షణీయమని మంత్రి రమేశ్ పేర్కొన్నారు. -
డిజిట్ ‘‘పే యాజ్ యు డ్రైవ్’’ యాడ్ ఆన్ ఫీచర్ ..
ముంబై: ప్రైవేట్ రంగ సాధారణ బీమా సంస్థ గో డిజిట్ తాజాగా వాహన బీమా పాలసీలకు సంబంధించి ‘‘పే యాజ్ యు డ్రైవ్’’ యాడ్–ఆన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. తక్కువగా డ్రైవింగ్ చేసే కస్టమర్లు ఈ యాడ్–ఆన్‌తో తక్కువ ప్రీమియం చెల్లించే వీలుంటుందని సంస్థ తెలిపింది. షోరూమ్ నుంచి కొనుగోలు చేసినప్పట్నుంచి సగటున సంవత్సరానికి 10,000 కిలోమీటర్ల కంటే తక్కువ డ్రైవింగ్ చేసే వారు ఎవరికైనా ఈ డిస్కౌంటు వర్తిస్తుందని పేర్కొంది. ఓడోమీటర్ రీడింగ్, టెలీమాటిక్స్ డేటా అలాగే వార్షిక కిలోమీటర్లు మొదలైన వివరాల ఆధారంగా డిస్కౌంటును డిజిట్ లెక్కిస్తుంది. ఓన్ డ్యామేజీ ప్రీమియంలో గరిష్టంగా 25 శాతం వరకూ డిస్కౌంటు పొందవచ్చు. టెక్నాలజీ ఆధారిత వీడియో ప్రీ ఇన్స్పెక్షన్ తర్వాత కేవలం 30 నిమిషాల్లోనే పాలసీ జారీ ప్రక్రియ పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. కారును తక్కువగానే వినియోగిస్తున్నప్పటికీ .. ఎక్కువగా వినియోగించేవారితో సమానంగా అధిక ప్రీమియంలు చెల్లించే వారికి ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుందని వివరించింది. -
ఐసీఐసీఐ లాంబార్డ్ ‘నడిపిన మేరకు’ బీమా
ముంబై: ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపనీ.. ‘పే యాజ్ యూ డ్రైవ్’ పాలసీని కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ఫ్లోటర్ ప్లాన్ తీసుకున్న పాలసీదారు తన వాహనాన్ని నడిపినంత దూరం మేరకే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పైగా పాలసీదారుకు ఒకటికి మించిన వాహనాలు ఉంటే వాటన్నింటికీ ఈ ఒక్క ఫ్లోటర్ ప్లాన్ కవరేజీ ఆఫర్ చేస్తుంది. సంప్రదాయ మోటారు బీమా పాలసీలో ఉండే అన్ని కవరేజీలు.. ప్రమాద కవరేజీ, మూడో పక్షానికి నష్టం వాటిల్లితే పరిహారం, వాహనదారుకి వ్యక్తిగత ప్రమాద కవరేజీ ఇందులోనూ ఉంటాయి. ఈ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటి ఆప్షన్లో పాలసీదారు వాహనాన్ని నడిపిన మేరకు కవరేజీ లభిస్తుంది. రెండో ఆప్షన్లో వాహనాన్ని ఏ విధంగా నడుపుతున్నారనే దాని ఆధారంగా ప్రీమియం ఉంటుంది. మంచి డ్రైవింగ్ చేసే వారికి ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. ఇండింపెడెంట్ పాలసీలు కలిగి ఉన్న వారు ఈ ఫ్లోటర్ ప్లాన్‌లోకి మారిపోయే అవకాశాన్ని కూడా సంస్థ కల్పిస్తోంది. -
నవ్వుతూ సేవ చేయ్! లేదంటే జరిమాన: ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
Smile Or Get Fined: ఫిలిప్పీన్స్ మేయర్ స్థానిక ప్రభుత్వం అందించే సేవల స్థాయిని మెరుగుపరిచే నిమిత్తం ఒక సరికొత్త పాలసీని తీసుకు వచ్చాడు. ఫిలిప్పీన్స్ ప్రధాన ద్వీపం లుజోన్‌లో క్యూజోన్ ప్రావిన్స్‌లోని ములానే పట్టణంలో అరిస్టాటిల్ అగ్యురే కొత్త మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే స్మైల్ పాలసీ అనే కొత్త పాలసీని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేస్తూనే ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను విని సాయం అందించేలా చిత్తశుద్ధితో పనిచేసేందుకు ఈ స్మైల్ పాలసీ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులు, ఎక్కువగా కొబ్బరి వ్యాపారులు, మత్స్యకారులు తమ పన్నులు చెల్లించడానికి లేదా సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు టౌన్ హాల్ సిబ్బంది తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ...ఫిర్యాదులు రావడంతోనే ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అగ్యురే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మార్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పాలసీని పాటించని ఉద్యోగులకు ఆరు నెలల జీతానికి సరిపడా మొత్తం జరిమానగా విధించబడటం లేదా విధుల నుంచి తొలగించడం వంటివి జరుగుతాయని స్పష్టం చేశారు. అగ్యురే ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేశారు. ఈ మేరకు అగ్యురే మాట్లాడుతూ... వ్యాపార అనుకూలమైన మున్సిపాలిటీగా ఉండేందుకే ఈ పాలసీని తీసుకువచ్చాం. తమ ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటిస్తారనే విశ్వసిస్తున్నానని చెప్పారు. (చదవండి: అగ్నిపర్వతం వద్ద సెల్ఫీ తీసుకోబోయి... అందులోనే పడిపోయాడు ఆ తర్వాత...)