హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ‘పోర్టింగ్‌’.. తొందరొద్దు! | Dont Choosing Lowest Premium Health Insurance | Sakshi
Sakshi News home page

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ‘పోర్టింగ్‌’.. తొందరొద్దు!

Published Mon, Dec 23 2024 4:08 AM | Last Updated on Mon, Dec 23 2024 7:05 PM

Dont Choosing Lowest Premium Health Insurance

సేవలు, ఫీచర్లు నచ్చకపోతేనే ముందుకు.. 

ప్రీమియం తక్కువని ఎంపిక చేసుకోవద్దు

వెయిటింగ్‌ పీరియడ్, ఎన్‌సీబీ బదిలీ కీలకం

సమగ్రంగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం

లేదంటే ప్రయోజనాలు కోల్పోవాల్సి రావచ్చు  

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన ఆర్థిక సాధనం. రక్షణ కవచం కూడా. ఎప్పుడు ఏ రూపంలో అనారోగ్యం లేదా ప్రమాదం ఎదురవుతుందో ఊహించలేం. ఖరీదైన వైద్య వ్యయాల భారాన్ని మోయలేం. జీవితకాల కష్టార్జితాన్ని ఒకేసారి ఎత్తుకుపోయే కరోనా మాదిరి విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు. వీటన్నింటికీ పరిష్కారమే హెల్త్‌ ఇన్సూరెన్స్‌. విస్తృత ప్రచారం నేపథ్యంలో నేడు చాలా మంది ఆరోగ్య బీమా ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రీమియం కష్టమైనా తీసుకుంటున్నారు. తీరా ప్లాన్‌ కొనుగోలు చేసిన తర్వాత.. కంపెనీ సేవలు నచ్చకపోవచ్చు. మంచి ఫీచర్లతో తక్కువ ప్రీమియానికే మరో బీమా కంపెనీ హెల్త్‌ప్లాన్‌ ఆకర్షించొచ్చు. 

అటువంటి సందర్భంలో కనిపించే ఏకైక ఆప్షన్‌ పోర్టింగ్‌. ఒక నెట్‌వర్క్‌ నుంచి మరో నెట్‌వర్క్‌కు మొబైల్‌ నంబర్‌ మార్చుకున్నంత సులభంగానే.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను సైతం పోర్ట్‌ పెట్టుకుని మరో కంపెనీ ప్లాన్‌లో చేరిపోవచ్చు. పోర్టింగ్‌తో ఎన్నో ప్రయోజనాలున్నాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటి గురించి అవగాహన తప్పనిసరి. బలమైన కారణాలుంటేనే, అది కూడా సమగ్రమైన సమాచారం తెలుసుకున్న తర్వాతే ‘పోర్టింగ్‌’ను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణుల సూచన.       – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

తమ కంపెనీ ప్లాన్‌లోకి ‘పోర్ట్‌’ పెట్టుకోవాలంటూ ఇటీవలి కాలంలో మార్కెటింగ్‌ కాల్స్‌ రావడం కొందరికి అనుభవమే. బీమా మార్కెట్లో పోటీ పెరిగిపోవడంతో ఈ ధోరణి ఏర్పడింది. కొత్త కస్టమర్ల కోసం మార్కెటింగ్‌ బృందాలు అన్ని మార్గాల్లోనూ జల్లెడ పడుతున్నాయి. అప్పటి వరకు అసలు ఆరోగ్య బీమా రక్షణ పరిధిలో లేని కస్టమర్లకు హెల్త్‌ ప్లాన్‌ ఇవ్వడం మంచిదే. కానీ, ఇతర బీమా కంపెనీల కస్టమర్లను సైతం ఆకర్షించేందుకు కొత్తదారులు వెతుక్కుంటున్నాయి.

‘‘పోర్ట్‌ పెట్టేసుకుని, మా కంపెనీ ప్లాన్‌లోకి మారిపోండి. మంచి ఫీచర్లు, మెరుగైన కవరేజీతో బీమా రక్షణ పొందండి’’ అంటూ ఆఫర్లు ఇస్తున్న ధోరణి కనిపిస్తోంది. వ్యాపార వృద్ధి లక్ష్యాల్లో భాగంగా కొత్త కస్టమర్లను సంపాదించేందుకు కొందరు అనైతికంగానూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సహేతుక కారణాలు ఉన్నప్పుడే పోర్టింగ్‌ ఆప్షన్‌ను పరిశీలించాలి.  

చేదు అనుభవం..
కేరళ రాష్ట్రానికి చెందిన అజిత్‌ కుమార్‌ (53)కు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అప్పటికే ఉన్న హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌తో కానీ, బీమా కంపెనీతో కానీ అతడికి ఎలాంటి సమస్యల్లేవు. కానీ, ప్రముఖ ఆన్‌లైన్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఒకరోజు కాల్‌ వచ్చింది. పాలసీని పోర్ట్‌ పెట్టుకోవాలంటూ మార్కెటింగ్‌ సిబ్బంది సూచించారు. మెరుగైన సదుపాయాలున్న ప్లాన్‌ను పోర్టింగ్‌తో పొందొచ్చంటూ ఆయన్ను ప్రోత్సహించారు. ‘‘11 ఏళ్ల నుంచి నాకు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఆప్టిమా సెక్యూర్‌ ప్లాన్‌ ఉంది. అన్నేళ్లలో ఒక్కసారి కూడా క్లెయిమ్‌ చేయలేదు.

అయినా కానీ, పాలసీ ప్రీమియాన్ని గణనీయంగా పెంచేశారు. దీంతో మంచి ఫీచర్లున్న కొత్త పాలసీకి పోర్ట్‌ పెట్టుకోవాలంటూ పాలసీబజార్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధి నాకు సూచించారు’’అని కుమార్‌ తన అనుభవాన్ని పంచుకున్నారు. కానీ, జరిగిన నష్టం ఏంటో ఆ తర్వాత కానీ తెలియలేదు. పోర్టింగ్‌ నిర్ణయం పట్ల కుమార్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.  

కుమార్‌ పూర్వపు పాలసీలో రూ.10 లక్షల సమ్‌ అష్యూరెన్స్‌ ఉంది. మరో రూ.10 లక్షలకు నో క్లెయిమ్‌ బోనస్‌ (ఎన్‌సీబీ) కూడా ఉంది. అంటే మొత్తం రూ.20 లక్షల బీమా రక్షణ ఉన్నట్టు. పాలసీ తీసుకుని 10–11 ఏళ్లు కావడంతో అన్ని రకాల వెయిటింగ్‌ పీరియడ్‌ నిబంధనలను కుమార్‌ అధిగమించేశారు. పాత పాలసీలోనే కొనసాగి ఉంటే ఎలాంటి క్లెయిమ్‌కు అయినా అర్హత కొనసాగేది. కానీ, పోర్టింగ్‌తో నో క్లెయిమ్‌ బోనస్‌ కొత్త పాలసీలోకి బదిలీ కాలేదు.

 పైగా ఒకే విడత మూడేళ్ల ప్రీమియంలను కుమార్‌తో కట్టించారు సదరు మార్కెటింగ్‌ సిబ్బంది. వారి సూచనతో సూపర్‌ టాపప్‌ ప్లాన్‌ కూడా కొనుగోలు చేశారు. పాలసీ కొనుగోలు తర్వాత సేవలు దారుణంగా ఉన్నాయని కుమార్‌ విచారించడం మినహా మరో మార్గం లేకపోయింది. నో క్లెయిమ్‌ బోనస్, వెయిటింగ్‌ పీరియడ్‌ ప్రయోజనాలు అన్ని పోర్టింగ్‌ కేసుల్లోనూ తప్పనిసరిగా బదిలీ కావాలని లేదు. ఈ విషయంలో బీమా సంస్థల షరతులను అర్థం చేసుకోవాలి.  

పోర్టింగ్‌ ప్రక్రియ ఇలా..
పోర్టింగ్‌ పెట్టుకోవాలంటే ప్రస్తుత పాలసీ రెన్యువల్‌ ఇంకా కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 60 రోజుల గడువు ఉందనగా ప్రక్రియ ప్రారంభించాలి. ఉదాహరణకు ఫిబ్రవరి 28న తదుపరి ప్రీమియం చెల్లించాల్సిన గడువు అనుకుంటే, మీరు రెండు నెలల ముందుగా డిసెంబర్‌ 31నుంచి ప్రారంభించొచ్చు. రెన్యువల్‌కు 30 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉన్నా కానీ, బీమా సంస్థ తన విచక్షణ మేరకు పోర్టింగ్‌ దరఖాస్తును ఆమోదించొచ్చని ఐఆర్‌డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత బీమా కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వక్కర్లేదు. పోర్టింగ్‌తో ఏ కంపెనీ ప్లాన్‌లోకి వెళ్లాలనుకుంటున్నారో, ఆ కంపెనీని సంప్రదించాలి. పోర్టబులిటీ, ప్రపోజల్‌ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

పోర్టింగ్‌ సమయంలో తాజా ఆరోగ్య సమాచారం మొత్తాన్ని వివరంగా వెల్లడించాల్సిందే. అప్పటి వరకు ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనా, లోగడ హెల్త్‌ క్లెయిమ్‌ల గురించి కూడా వెల్లడించాల్సి రావచ్చు. ఈ వివరాల ఆధారంగా రిస్క్‌ను మదింపు వేసి బీమా సంస్థ ప్రీమియంను నిర్ణయిస్తుంది. అవసరమైతే అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రీమియంను పెంచొచ్చు.

పోర్టింగ్‌ దరఖాస్తును కొత్త సంస్థ ఆమోదించి, పాలసీ జారీ చేసే వరకు పాత పాలసీని రద్దు చేసుకోవద్దు. ఎందుకంటే పాలసీదారు ఆరోగ్య చరిత్ర, రిస్క్, ఇతర అంశాల ఆధారంగా కొత్త సంస్థ ప్రీమియంను గణనీయంగా పెంచేస్తే అది అంగీకారం కాకపోవచ్చు. నో క్లెయిమ్‌ బోనస్, వెయిటింగ్‌ పీరియడ్‌ ప్రయోజనాల విషయంలోనూ కొత్త సంస్థ నిబంధనలు నచ్చకపోతే, పోర్టింగ్‌ అభ్యర్థనను ఉపసంహరించుకుని పాత సంస్థలో కొనసాగొచ్చు.  

ఆచరణ వేరు..
ప్రస్తుత హెల్త్‌ ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్‌ సమ్‌ అష్యూరెన్స్‌ ఉందనుకోండి. దీనికి మరో రూ.10 లక్షలు నో క్లెయిమ్‌ బోనస్‌ తోడయ్యింది. అప్పుడు సదరు పాలసీదారు రూ.20 లక్షల క్లెయిమ్‌కు అర్హులు. పోర్టింగ్‌తో వేరే కంపెనీ ప్లాన్‌లోకి మారాలనుకుంటే.. అప్పుడు రూ.20 లక్షల సమ్‌ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ పాత ప్లాన్‌లో మాదిరే రూ.10 లక్షల బేసిక్‌ సమ్‌ అష్యూరెన్స్‌ను కొత్త సంస్థలోనూ ఎంపిక చేసుకుంటే.. రూ.10 లక్షల నో క్లెయిమ్‌ బోనస్‌ కోల్పోయినట్టు అవుతుంది.

పోర్టింగ్‌తో రూ.20 లక్షల సమ్‌ అష్యూరెన్స్‌ ఎంపిక చేసుకుంటే అంత మొత్తానికి తాజా వెయిటింగ్‌ నిబంధన కొత్త సంస్థలోనూ అమలు కాదు. ముందస్తు వ్యాధులకు (పాలసీ తీసుకునే నాటికి) 3–4 ఏళ్ల పాటు వెయిటింగ్‌ పీరియడ్‌ క్లాజ్‌ ఉంటుంది. పాలసీ తీసుకుని అన్నేళ్ల పాటు రెన్యువల్‌ చేసుకున్న తర్వాతే, ఆయా వ్యాధుల తాలూకూ క్లెయిమ్‌లకు అర్హత లభిస్తుంది. కనుక ఒక ప్లాన్‌లో 
వెయిటింగ్‌ పీరియడ్‌ నిబంధనలు అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, మరో కంపెనీకి పోర్ట్‌ పెట్టుకునే ముందు సమ్‌ అష్యూరెన్స్‌ ఎంపికలో వివేకంతో వ్యవహరించాలి.

ఐఆర్‌డీఏఐ ఉత్తర్వులు ఉన్నా...
సమ్‌ అష్యూరెన్స్, నో క్లెయిమ్‌ బోనస్, నిర్దేశిత వెయిటింగ్‌ పీరియడ్, మారటోరియం పీరియడ్‌కు సంబంధించిన అర్హతలను పోర్టింగ్‌తోపాటు బదిలీ చేయాలంటూ ఈ ఏడాది ఆరంభంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ)తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కానీ, బీమా సంస్థలు తెలివిగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు.. ప్రస్తుత ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్‌ సమ్‌ అష్యూరెన్స్‌తో, అన్ని వెయిటింగ్‌ పీరియడ్‌ నిబంధనలు అధిగమించేసి ఉన్నారని అనుకుందాం.

పోర్టింగ్‌ సమయంలో కొత్త సంస్థలో రూ.20 లక్షల సమ్‌ అష్యూరెన్స్‌ ఎంపిక చేసుకుంటే, అప్పుడు పాత ప్లాన్‌లో రూ.10 లక్షలకే వెయిటింగ్‌ పీరియడ్‌ను పూర్తి చేశారు కనుక, కొత్త సంస్థ కూడా అంతే మొత్తానికి ఆ ప్రయోజనాన్ని కొనసాగిస్తుంది. మరో రూ.10 లక్షల మొ త్తానికి అన్ని వెయిటింగ్‌ పీరియడ్‌లు తాజాగా అమల్లోకి వస్తాయని తెలుసుకోవాలి. దీనర్థం.. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి క్లెయిమ్‌ మొత్తం రూ.10 లక్షలు మించిన సందర్భాల్లో రూ.10 లక్షలకే పరిహారం పరిమితమవుతుంది.

కుమార్‌ విషయంలో ఈ తప్పిదమే చోటుచేసుకుంది. పాత ప్లాన్‌లో రూ.10 లక్షల బేసిక్‌ సమ్‌ అష్యూరెన్స్, రూ.10 లక్షల నో క్లెయిమ్‌ బోనస్‌ ఉన్నప్పటికీ.. పోర్ట్‌ తర్వాత రూ.10 లక్షలకే సమ్‌ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. దీంతో నో క్లెయిమ్‌ బోనస్‌ కోల్పోవడమే కాకుండా, ఆ మొత్తానికి వెయిటింగ్‌ పీరియడ్‌ ప్రయోజనాన్ని కోల్పోయినట్టు అయింది.  

పోర్టింగ్‌ ఏ సందర్భాల్లో..?
ముఖ్యమైన కారణాలుంటేనే పోర్టింగ్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఏజెంట్ల సూచన మేరకు పోర్టింగ్‌ చేసుకుంటే, ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రపోజల్‌ పత్రంలో అన్ని వివరాలు సమగ్రంగా ఉన్నాయేమో ఒక్కసారి ధ్రువీకరించుకోవాలి. చాలా సందర్భాల్లో ఏజెంట్లు అధిక కమీషన్‌ కోసం పోర్టింగ్‌ పేరుతో, తాజాగా పాలసీలు అంటగడుతుంటారు’’ అని హోలిస్టిక్‌ వెల్త్‌ సహ వ్యవస్థాపకుడు నిషాంత్‌ బాత్రా తెలిపారు. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ప్రీమియం తగ్గుతుందన్న ఆశతో పోర్టింగ్‌ పెట్టుకునే తప్పిదం చేయవద్దన్నది బాత్రా సూచన. పోర్టింగ్‌ ద్వారా వచి్చన పాలసీదారులను కొత్తవారిగానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. 

పోర్టింగ్‌ చేసుకున్న తర్వాత తొలినాళ్లలో క్లెయిమ్‌కు వెళితే, అందులోని వాస్తవికతను అవి సందేహించే అవకాశం లేకపోలేదు. మరి పోర్టింగ్‌ ఏ సందర్భాల్లో పరిశీలించాలన్న సందేహం రావచ్చు. ప్రస్తుత ప్లాన్‌లో లేని మెరుగైన ఫీచర్లు కొత్త ప్లాన్‌లో వస్తుంటే, మరిన్ని వ్యాధులకు కవరేజీ లభిస్తుంటే, అవి తమకు ఎంతో ప్రయోజనకరమని భావిస్తే అప్పుడు పోర్టింగ్‌ను పరిశీలించొచ్చు.

అలాగే, ప్రస్తుత ప్లాన్‌లో రూమ్‌ రెంట్‌ విషయంలో పరిమితులు ఉండి, పోర్టింగ్‌తో వెళ్లే ప్లాన్‌లో ఎలాంటి రూమ్‌ రెంట్‌ పరిమితులు లేనట్టయితే అప్పుడు కూడా ఈ ఆప్షన్‌ వినియోగించుకోవడం సరైనదేనని బాత్రా సూచించారు. ఇక ప్రస్తుత బీమా సంస్థ క్లెయిమ్‌ల పరంగా ఇబ్బందులు పెడుతుంటే, క్లెయిమ్‌ మొత్తంలో కోతలు పెడుతుంటే లేదా క్లెయిమ్‌ ఆమోదంలో చాలా జాప్యం చేస్తుంటే, కస్టమర్‌ సర్వీస్‌ విషయంలో సంతోషంగా లేకపోయినా కానీ పోర్టింగ్‌ సహేతుకమే.  

ఇవి తెలుసుకోవాలి..
పోర్టింగ్‌తో పాత పాలసీలో పొందిన నో క్లెయిమ్, వెయిటింగ్‌ పీరియడ్‌ క్రెడిట్‌ ప్రయోజనాలను కొత్త సంస్థ కూడా నిబంధనల మేరకు అందిస్తుందా? లేదా అన్నది ముందే ధ్రువీకరించుకోవాలి. 

 పాత కంపెనీలో ముందస్తు వ్యాధులకు 3 ఏళ్ల వెయిటింగ్‌ పీరియడ్‌ నిబంధనను పూర్తి చేశారని అనుకుందాం. పోర్టింగ్‌ తర్వాత కొత్త సంస్థ ప్లాన్‌లో వెయిటింగ్‌ పీరియడ్‌ 4 ఏళ్లుగా ఉంటే.. అప్పుడు మరో ఏడాది తర్వాతే క్లెయిమ్‌ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. ఒకవేళ పాత కంపెనీలో వెయిటింగ్‌ పీరియడ్‌ను సగమే పూర్తి చేసి ఉంటే, అప్పుడు కొత్త సంస్థలో నిబంధనల మేరకు మిగిలిన కాలానికి వెయిటింగ్‌ పీరియడ్‌ కొసాగుతుంది.  

పోర్టింగ్‌కు ప్రీమియం ఒక్కదానినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే వయసు, ఆరోగ్య చరిత్ర వివరాల ఆధారంగా ఈ ప్రీమియం మారిపోవచ్చు. అధిక రిస్‌్కలో ఉన్నారని భావిస్తే బీమా సంస్థలు అధిక ప్రీమియంను నిర్ణయిస్తాయి.  

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను నేరుగా బీమా సంస్థ నుంచి తీసుకున్నా, ఏజెంట్‌ సాయంతో తీసుకున్నా ప్రీమియంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. కొన్ని కంపెనీలు ఏ రూపంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ ఒక్కటే ప్రీమియం అమలు చేస్తున్నాయి.  

పోర్టింగ్‌ తర్వాత అధిక సమ్‌ అష్యూరెన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరింత సమ్‌ అష్యూరెన్స్‌ ఇవ్వడమా? లేదా అన్న దానిని అండర్‌రైటింగ్‌ నిబంధనల మేరకు బీమా కంపెనీలు నిర్ణయిస్తాయి.  

 అన్ని వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఇండెమ్నిటీ పాలసీలకు పోర్టింగ్‌ అర్హత ఉంటుంది. ఇక గ్రూప్‌ హెల్త్‌ పాలసీల్లో కవరేజీ ఉన్న వ్యక్తులు, కుటుంబాలకు మాత్రం.. ఆ గ్రూప్‌ నుంచి తప్పుకున్నప్పుడు లేదా గ్రూప్‌ పాలసీలో మార్పులు చేసినప్పుడు (ప్రీమియం పెంపు సహా) లేదా గ్రూప్‌ పాలసీని ఉపసంహరించుకున్న సందర్భాల్లో పోర్టింగ్‌కు వీలు కల్పించాల్సి ఉంటుంది.  

పోర్టింగ్‌ దరఖాస్తుపై 15 రోజుల్లో బీమా సంస్థ తన నిర్ణయాన్ని పాలసీదారునకు తెలియజేయాల్సి ఉంటుంది. పాత పాలసీలో ఉన్న కవరేజీకి తక్కువ కాకుండా బీమా రక్షణను కొత్త సంస్థ అందించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement