
దేశంలోని రాష్ట్రాల్లో ఏటికేడు అప్పులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు భవిష్యత్తులో తమకు ఉపయోగపడేలా స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పనకు అప్పులను వాడుతున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు వేతనాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు వంటి వాటికోసం వీటిని వినియోగిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని ఇటీవల ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య మొత్తం తమిళనాడు రుణాలు రూ.1.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
బలమైన ఆర్థిక వ్యూహం, వృద్ధి ఆధారిత పెట్టుబడుల పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తూ తమిళనాడు రాష్ట్రం పెట్టుబడులను సమీకరిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా అప్పుల్లో తమిళనాడు నిలకడగా ముందంజలో ఉంది. సంవత్సరాలవారీగా అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి.
2021 ఆర్థిక సంవత్సరంలో రూ.87,977 కోట్లు
2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో రూ.87,000 కోట్లు
2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1.13 లక్షల కోట్లు
2025 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2024 నుంచి 2025 ఫిబ్రవరి వరకు రూ.1.01 లక్షల కోట్లు
తమిళనాడు తర్వాత 2025 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర రూ.99,000 కోట్ల అప్పుతో రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
అప్పులకు వెనుక కారణాలు
2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయంలో 22% పెరుగుదలను రాష్ట్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి బలమైన నిబద్ధతను సూచిస్తుంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 28.7% లోపు దాని డెట్-జీఎస్‌డీపీ నిష్పత్తి 26.43%గా ఉంది. ఇది ఆర్థిక స్థిరత్వం, సుస్థిరతను నిర్ధారిస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తమిళనాడు రూ.20,000 కోట్ల రుణాలు తీసుకోవాలని యోచిస్తోంది. దాంతో మొత్తం రుణాలు రూ.1.62 లక్షల కోట్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఇది రాష్ట్రం దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.