State Debts
-
అప్పుల ఊబిలో చంద్రబాబు సర్కారు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని రాకెట్ వేగంతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. బడ్జెట్ లోపల, బడ్జెట్బయట ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. ఈ ఒక్క ఆర్ధిక ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటికే మార్కెట్ రుణాల కింద చేసిన అప్పులు బడ్జెట్లో పేర్కొన్న దానికంటే మించి పోయాయి. బడ్జెట్లో రూ.71 వేల కోట్లు మార్కెట్ రుణాల ద్వారా అప్పు చేస్తామని పేర్కొంటే.. మంగళవారం చేసిన రూ.5,000 కోట్లతో మార్కెట్ రుణాల అప్పు రూ.74,827 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక ఏడాదిలోనే తాజాగా జనవరి నుంచి మార్చి వరకు మార్కెట్ రుణాల ద్వారా మరో రూ.11 వేల కోట్ల అప్పు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే బడ్జెట్ లోపల ఒక్క మార్కెట్ రుణాల ద్వారానే అప్పులు రూ.85,827 కోట్లకు చేరనున్నాయి. వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో ఏకంగా రూ.14 వేల కోట్లు అప్పు చేస్తుండగా.. మరో పక్క రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యూ సంస్థ ద్వారా ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అంటే ఈ ఒక్క ఆర్థిక ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.1,30,827 కోట్లకు చేరుతున్నాయి. కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్ధిక ఏడాదిలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పులు చేయలేదు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినప్పటికీ సూపర్ సిక్స్ హామీలను సైతం అమలు చేయడం లేదు. ఇలాంటి చంద్రబాబు సర్కారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తుండటం గమనార్హం. మూడు నెలల మార్కెట్ రుణాలకు ఆర్బీఐ క్యాలెండర్ చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మూడు నెలల్లో మరో రూ.11 వేల కోట్ల మార్కెట్ రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్ రుణాల ద్వారా డిసెంబర్ 31 నాటికి రూ.74,827 కోట్లు అప్పు చేసింది. ఈ ఆర్ధిక ఏడాదిలో జనవరి నుంచి మార్చి వరకు మార్కెట్ రుణాలు ఏ రాష్ట్రం ఎంత తీసుకుంటుందనే అంశంపై ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. ఈ సంప్రదింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర మార్కెట్ రుణాల ద్వారా అప్పు చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐకి చంద్రబాబు సర్కారుతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి నుంచి మార్చి వరకు ఈ తేదీల్లో ఎంత మేర మార్కెట్ రుణాల ద్వారా అప్పు చేస్తారో సూచిస్తూ క్యాలెండర్ ప్రకటించింది. -
బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు'
సాక్షి, అమరావతి: వారం.. వారం అప్పులే! బడ్జెట్లోనూ.. బడ్జెట్ బయటా అప్పుల మోతలే! ఎటు చూసినా రుణ భారమే! ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మంగళవారం అంటే అప్పుల బేరమే! రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తాజాగా రూ.1.19 లక్షల కోట్లను దాటేశాయ్! చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సంపద సృష్టి అంతా కరెంట్ చార్జీల బాదుడు.. ఉచిత ఇసుక ముసుగులో పచ్చ ముఠాల దందాలు.. మద్యం విక్రయాల పేరుతో జనం జేబులను గుల్ల చేయడంలోనే కనిపిస్తోంది. రాష్ట్రానికి పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డులు తిరగరాస్తున్నారు. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే మంగళవారం చేసిన రూ.5,000 కోట్ల అప్పుతో చంద్రబాబు సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా రూ.74,827 కోట్లకు చేరాయి. తాజాగా ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 7.17 శాతం వడ్డీకి రూ.ఐదు వేల కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇక బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా రూ.1.19 లక్షల కోట్లకు ఎగబాకింది! సంపద సృష్టించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అప్పులు చేయడం, ప్రజలపై భారం మోపడమే సంపద సృష్టి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మూడు నెలల ముందే..మార్కెట్ రుణాల ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో రూ.71,000 కోట్ల మేర అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు మిగిలి ఉండగానే అంతకు మించి అప్పు చేసింది. బడ్జెట్లో చెప్పిన దానికి మించి రూ.74,827 కోట్ల అప్పులు చేసింది. ఇంత అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని ‘కాగ్’ ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ వరకు మూలధన వ్యయం కేవలం రూ.8,329 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కార్పొరేషన్ల పేరుతో మరిన్ని..కేవలం మార్కెట్ రుణాల ద్వారానే ఇంత అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి గ్యారెంటీలతో మరిన్ని అప్పులు చేసింది. ఏపీ ఎండీసీ ద్వారా రూ.5,000 కోట్ల అప్పును సమీకరించేందుకు సలహాదారు–మర్చంట్ బ్యాంకర్‌ను నియమించాల్సిందిగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బడ్జెట్ బయట ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ, ఏపీ ఎండీసీ, హడ్కో ద్వారా మరిన్ని అప్పులు చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇంత అప్పు చేసినప్పటికీ సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనవి ఒక్కటీ అమలు చేయకపోవడం గమనార్హం. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం కూడా చేయలేదు.పథకాలు లేవు.. మరి ఏం చేస్తున్నట్లు?వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందని, సంక్షేమ పథకాల కోసం వైఎస్ జగన్ బటన్లు నొక్కుతున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున విషం చిమ్మిన విషయం తెలిసిందే. లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు గణాంకాలతో మభ్యపుచ్చే యత్నం చేశారు. మరిప్పుడు సూపర్ సిక్స్, సెవెన్ పథకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. కొత్త పథకాలను అమలు చేయకపోగా పేదలకు జగన్ ఇచ్చిన అన్ని పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు స్కూలు పిల్లలకు ‘అమ్మ ఒడి’ లేదు. విద్యార్థులకు రూ.3,900 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించక పేదలు అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. హామీలను అమలు చేయకుండా.. పథకాలను నిలిపివేస్తూ.. ఎడాపెడా అందినకాడికి అప్పులు తీసుకుంటూ రాష్ట్రాన్ని కూటమి సర్కారు అంధకారంలోకి గెంటేస్తోంది. మరి ఆ అప్పులన్నీ దేనికి వ్యయం చేస్తున్నట్లు? గత సర్కారు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినా అది పెద్ద నేరంగా చిత్రీకరించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకుంటున్నా మొద్దు నిద్ర నటిస్తోంది. అటు అప్పులు.. ఇటు అమ్మకాలుఒకపక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు మరోపక్క వైఎస్సార్ సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడ రేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు పాతరేయడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. అప్పులతోనే అమరావతి!రాజధాని అమరావతి కోసం తొలి దశలో రూ.52 వేల కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రూ.15 వేల కోట్లు అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి రూ.5 వేల కోట్ల రుణాన్ని సమీకరించేందుకు సీఆర్డీఏను అనుమతిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా రూ.21 వేల కోట్ల రుణ సమీకరణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. -
ఆ అప్పులు.. అంటగట్టినవే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై దుష్ట చతుష్టయం చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా ‘కాగ్’ నివేదిక కుండబద్ధలు కొట్టింది. రాష్ట్ర అప్పులు రూ.పది లక్షల కోట్లకు చేరాయంటూ ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నివేదిక స్పష్టం చేసింది. 2022–23 అకౌంట్స్‌పై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభకు సమర్పించింది. కార్పొరేషన్ల అప్పులను దాచేస్తున్నారని, కాగ్‌కు కూడా చెప్పడం లేదంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు నిజం లేదని కాగ్ అకౌంట్స్ నివేదిక వెల్లడించింది. 2022–23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు, మార్కెట్ రుణాలు, వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్థిక సంస్ధల నుంచి గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పుల పూర్తి వివరాలను కాగ్ స్పష్టంగా వెల్లడించింది. ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ) నిబంధనలు, లక్ష్యాలను ప్రభుత్వం పక్కాగా పాటిస్తోందని స్పష్టం చేసింది. 2022–23లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే అప్పులు, ద్రవ్య, రెవెన్యూ లోటు ఉన్నాయని కాగ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్ బయట అప్పులను సైతం ఎటువంటి దాపరికం లేకుండా కాగ్ అకౌంట్స్‌లో స్పష్టం చేసింది. 2018–19 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.2,57,612 కోట్లుగా ఉన్నాయని కాగ్ పేర్కొంది (2019 మే నాటికి టీడీపీ సర్కారు సొంత ప్రచారం కోసం మరో రూ.14 వేల కోట్లు అప్పు చేసింది). ఆ రూ.14 వేల అప్పులను మినహాయించి చూసినా సరే 2022–23 నాటికి బడ్జెట్లో చేసిన అప్పులు రూ.4,23,942 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,66,330 కోట్లు మాత్రమేనని, టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లోకి నెట్టిందని కాగ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. 2022–23 నాటికి బడ్జెట్లో అప్పులతో పాటు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలు, కంపెనీల ద్వారా గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు మొత్తం కలిపి రూ.5,62,817 కోట్లు మాత్రమేనని కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వెల్లడించినా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు అనధికార అప్పులంటూ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. -
రాష్ట్ర అప్పులు రూ.6,71,757 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు నాటి నుంచి తాము అధికారంలోకి వచ్చేంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన గణాంకాలతో కాంగ్రెస్ సర్కారు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దీనిని బుధవారం శాసనసభ ముందుంచారు. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన అప్పులు, రెవెన్యూ రాబడులు, వసూళ్ల తీరు, ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు, ఆర్బీఐ, కాగ్ నివేదికల్లో పేర్కొన్న అంశాలను పొందుపరిచారు. మొత్తం 22 పట్టికల్లో పలు గణాంకాలను వెల్లడించారు. ఆర్థిక శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలివీ.. ► బడ్జెట్ ప్రతిపాదనల్లో వాస్తవ ఖర్చు శాతం ఆందోళనకరం. 2014–15లో బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వాస్తవ ఖర్చు 61.9శాతమే. 2014– 2023 మధ్య సగటు వ్యయం 82.3 శాతం. గత పదేళ్లలో రూ.14,87,834 కోట్ల మేర బడ్జెట్ అంచనాలను ప్రతిపాదిస్తే.. అందులో ఖర్చు చేసినది రూ.12,24,877 కోట్లు. ► కాంగ్రెస్ పాలనలో 2004–14 వరకు సగటు వ్యయం 87శాతం. మొత్తం రూ.10,04,326 కోట్ల అంచనాలకు గాను రూ.8,73,929 కోట్ల ఖర్చు జరిగింది. ► 1956–57లో ఉమ్మడి ఏపీ బడ్జెట్లో తెలంగాణ వాటా కింద రూ.33 కోట్లు ఖర్చు పెట్టగా.. 2013–14 నాటికి ఇది రూ.56,947 కోట్లకు చేరింది. మొత్తంగా గత 57 ఏళ్లలో అంటే 1956– 57 నుంచి 2013–14 వరకు తెలంగాణ లో జరిగిన ఖర్చు రూ.4,98,053 కోట్లు. ► ఈ నిధులతోనే ఓఆర్ఆర్, ఎయిర్‌పోర్టుతోపాటు నాగార్జునసాగర్, జూరాల, కోయల్‌సాగర్, దేవా దుల, శ్రీరాంసాగర్, కడెం లాంటి సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు, ట్రిపుల్‌ఐటీలు, వర్సిటీలు, వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, రోడ్లు–భవనాలు, కాల్వలు, విద్యుత్ లైన్లు, రక్షణ సంస్థలు, ఔషధ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయగలిగాం. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన 16 మంది సీఎంల కాలంలో తెలంగాణ అప్పు రూ.72,658 కోట్లు మాత్రమే. ► 2014–15 తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ రాబడులు అస్థిరంగా ఉన్నాయి. స్థూల ఉత్పత్తితో పోలిస్తే రెవెన్యూ రాబడులు 2015–16లో గరిష్టంగా 13.2శాతంగా ఉండగా.. 2018–19లో 11.8 శాతానికి క్షీణించాయి. అంటే కరోనా మహమ్మారికి ముందే ఆర్థిక మందగమనం ప్రారంభమైంది. ఇక రెవెన్యూ రాబడుల శాతం కూడా పడుతూ, లేస్తూ వచ్చింది. 2021–22లో తెలంగాణ కంటే కేవలం మరో ఐదు రాష్ట్రాలే తక్కువ రెవెన్యూ రాబడులు కలిగి ఉన్నాయి. ► పెరుగుతున్న ఖర్చులతో పోలిస్తే ఆదాయ వనరుల్లో పెరుగుదల లేని కారణంగా ద్రవ్యలోటు పెరిగింది. ఈ లోటును పూడ్చడానికి రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ రుణాలు గత పదేళ్లలో ఏటా సగటున 24.5శాతం చొప్పున పెరిగాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపించిన రుణాల్లో బడ్జెటేతర రుణాలను చేర్చలేదు. ప్రభుత్వ హామీతో స్పెషల్ పర్పప్ వెహికిల్స్ (ఎస్పీవీలు) ఏర్పాటు చేసి ప్రభుత్వమే చెల్లించే విధంగా కొన్ని రుణాలు, ప్రభుత్వ హామీ ఉన్న ఎస్పీవీలు చెల్లించేలా మరికొన్ని, ప్రభుత్వ హామీ లేకుండా మరికొన్ని రుణాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు, హామీ ఇచ్చినవి, హామీలేనివి కలిపి మొత్తం అప్పు రూ.6,71,757 కోట్లకు చేరింది. ► ఈ అప్పులతో ఏటా రుణాల తిరిగి చెల్లింపు భారం పెరిగిపోయింది. 2014–15లో అప్పుల అసలు, వడ్డీ చెల్లింపులు రూ.6,954 కోట్లు కాగా..2023–24 నాటికి ఇది రూ.32,939 కోట్లకు చేరింది. ► మొత్తం రెవెన్యూ రాబడుల్లో రుణాల చెల్లింపుల భారం 2014–15లో 14 శాతం కాగా.. 2023–24 నాటికి 34 శాతానికి పెరిగింది. బహిరంగ మార్కెట్ రుణాల సగటు వడ్డీ రేటు 7.63 శాతం. కానీ గత ప్రభుత్వం గ్యారంటీలిచ్చి తీసుకున్న రుణాల్లో 95 శాతం రుణాల వడ్డీ రేటు 8.93 నుంచి 10.49 శాతం వరకు ఉంది. ► రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 24 ప్రభుత్వ శాఖల్లో 39,175 ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. ఇందుకు రూ.3,49,843 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. రూ.1,89,903 కోట్లు వ్యయమైంది. మిగతా పనుల కోసం రూ.72,983 కోట్లను రుణాలు తీసుకోవాల్సి ఉంది. ► ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, డి్రస్టిబ్యూటర్లకు సంబంధించిన 4,78,168 బిల్లులను క్లియర్ చేయాల్సి ఉంది. ఈ బిల్లుల మొత్తం విలువ రూ.40,154 కోట్లు. ► ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల సగటు వార్షిక వృద్ధిరేటు 17 శాతం. 2014–15లో రూ.17,130 కోట్లు జీతాలు, పెన్షన్ల కింద చెల్లించగా.. 2021–22 నాటికి అది రూ.48,809 కోట్లకు చేరింది. రాష్ట్ర రాబడిలో ఇది 38 శాతం. ► కొన్నేళ్లుగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలపై ఆధారపడటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణతను సూచిస్తోంది. 2014–15లో రాష్ట్ర ఖజనాలో 303 రోజులు నగదు నిల్వ ఉండగా..2023–24 (నవంబర్ 30వరకు) 30 రోజు లకు పడిపోయింది. 2022–23లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలను 328 రోజులు ఉపయోగించుకున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ► 2014–19 మధ్య రాష్ట్రం రెవెన్యూ మిగులును నమోదు చేయగా.. 2019–22 మధ్య జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీల వంటి చెల్లింపులు, పునరావృత ఖర్చులను తీర్చడానికి కూడా రెవెన్యూ రాబడులు మిగలలేదు. ► మొత్తం రాబడులు, వ్యయం మధ్య ఉండే తేడాను ద్రవ్యలోటు అంటారు. ఈ ద్రవ్యలోటు 2014–15లో రూ.9,410 కోట్లుకాగా.. 2015–16లో రూ.18,856 కోట్లు, 2016–17 నాటికి రూ.35,281 కోట్లకు చేరింది. ► కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ నివేదిక ప్రకారం.. 2023–24లో దేశంలోని రాష్ట్రాలు తమ బడ్జెట్లో 14.7 శాతం విద్యపై ఖర్చు చేస్తాయని అంచనా వేయగా.. తెలంగాణ 7.6శాతం ఖర్చు చేస్తుందని అంచనా వేసింది. ఇది జాతీయ సగటులో సగం మాత్రమే. ఇదే నివేదిక ప్రకారం వైద్యంపై ఖర్చు కేవలం 5 శాతం మాత్రమే. పారదర్శకంగా అధిగమిస్తాం మొత్తం 42 పేజీల్లో 13 అంశాలను కూలంకషంగా వివరిస్తూ ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర బడ్జెట్ అంచనాలు–వాస్తవ వ్యయం, ఉమ్మడి ఏపీలో తెలంగాణలో చేసిన ఖర్చు, రెవెన్యూ వసూళ్లు, రుణాల తీరు, మూలధన వ్యయం, జీతభత్యాలు–పెన్షన్ల ఖర్చు, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఖర్చును అంశాల వారీగా వివరిస్తూ రూపొందించినట్టు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా పొందిన ప్రభు త్వ ఆర్థిక పరిస్థితిని వివరించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ప్రజలు మార్పు కోసం ఇచ్చిన ఆదేశాన్ని, పార్టీ వాగ్దానం చేసిన ఆరు హామీలను నెరవేర్చడానికి ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా, వివేకంతో, పారదర్శకంగా అధిగమించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొంది. -
రామోజీ.. ఇదేం డ్రామా!
సాక్షి, అమరావతి: రామోజీ రాతల్లో దురుద్దేశాలను పాఠకులు కష్టపడి గ్రహించాల్సిన అవసరం లేదు! ఎందుకంటే తన సొంత పత్రిక, వెబ్సైట్ ద్వారా వాటికి ఆయనే కౌంటర్లు వేసుకుంటున్నారు కాబట్టి!! కేంద్రం వద్దంటున్నా, ఆర్బీఐ హెచ్చరిస్తున్నా బేఖాతరంటూ రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటోందని ఈనాడు మంగళవారం ఓ కథనాన్ని అచ్చేసింది. అదే రోజు ‘ఈనాడు డాట్నెట్’ మాత్రం అందుకు విరుద్ధంగా మరో కథనాన్ని వదిలింది. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకుగాను అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందనేది ఆ వార్త సారాంశం. 2021–22లో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు ఈ అవకాశం దక్కగా ఈసారి మాత్రం ఆరు రాష్ట్రాలకే అవకాశం లభించిందని, అందులో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఉందని వెబ్సైట్ స్పష్టంగా పేర్కొంది. ఈ వెసులుబాటుతో ఏపీ రూ.5,858 కోట్ల రుణాన్ని 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు మార్కెట్ నుంచి అదనంగా పొందేందుకు కేంద్రం అనుమతించింది. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక మాధ్యమం (ఎక్స్) ద్వారా స్వయంగా వెల్లడించారు. అదనపు రుణాలు పొందేందుకు అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అలా తీసుకోలేదు. ఈనాడు పత్రిక మాత్రం రుణాలు ఎక్కువ తీసుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం వద్దంటోందని అడ్డగోలుగా అబద్ధాలను వండి వార్చింది. అదే మీడియాకు చెందిన వెబ్సైట్ మాత్రం వాస్తవాలను బహిర్గతం చేయడంతో రామోజీ పన్నాగం బెడిసికొట్టింది. ఆయన ద్వంద్వ వైఖరికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి? -
అప్పులంటూ అబద్ధాల డప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రం అప్పులపై ‘ఈనాడు’ రామోజీ అట్టడుగు స్థాయికి దిగజారి తప్పుడు కథనాలు ప్రచురించారని, నిరాధారమైన గణాంకాలతో దు్రష్పచారానికి దిగారని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయటమే లక్ష్యంగా అప్పులపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ భయపడిందని, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించిందని, స్టాక్ ఎక్స్చేంజ్ మదుపరులను అప్రమత్తం చేసిందని, ఆర్థిక దిగ్గజాలు భయపడుతున్నారని, ఏపీ అప్పులను చూసి దేశం ఆశ్చర్యపోతోందంటూ దుర్మార్గంగా వండి వార్చిన కథనాలను చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పత్రికకు ఉన్న ద్వేషం, కక్ష అర్ధం అవుతున్నాయన్నారు. ఈనాడు కథనంలో డొల్లతనాన్ని నిరూపిస్తూ.. ఆర్బీఐ, కాగ్ అధికారిక నివేదికలను దువ్వూరి కృష్ణ బయటపెట్టారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాకు వాస్తవాలను వివరించారు. అవి ఆయన మాటల్లోనే... అబద్ధాలే.. ఆధారాలేవి? ఊహాజనిత గణాంకాలతో, లేని అప్పులు ఉన్నాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలను అచ్చు వేసింది. ప్రతి గొంతుతోనూ అబద్ధాలాడే ‘దశకంఠుడి’గా రామోజీ దిగజారిపోయారు. రాష్ట్ర అప్పులు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనల మేరకు పరిమితికి లోబడే ఉన్నాయి. కోవిడ్‌తో రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ టీడీపీ హయాంలో కన్నా ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వృద్ధి తక్కువగా ఉంది. మార్కెట్ రుణాలతో పాటు నాబార్డు, విద్యుత్ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, బాండ్ల గ్యారెంటీతో పాటు గ్యారెంటీ ఇవ్వకుండా తీసుకున్న మొత్తం అప్పులు రూ.6.38 లక్షల కోట్లు మాత్రమే. దాన్ని రూ.10.11 లక్షల కోట్లగా పేర్కొంటూ ‘ఈనాడు’ ఏ అధికారిక నివేదిక ఆధారంగా రాసిందో చెప్పాలి. లేదంటే కాగ్, ఆర్బీఐ అధికారిక నివేదికల ప్రకారం నేను వెల్లడించిన గణాంకాలను ప్రచురించాలి. పెండింగ్ బిల్లులపై సొంత లెక్కలా? పెడింగ్ బిల్లులు రూ.21 వేల కోట్లు మాత్రమే ఉన్నాయని ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రకటించగా రూ.1.70 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులున్నట్లు రామోజీ పచ్చి అబద్ధాలు ఎలా ప్రచురిస్తారు? ప్రభుత్వం బడ్జెట్లో చేసే అప్పులతో పాటు గ్యారెంటీతో చేసిన అప్పులు, గ్యారెంటీ ఇవ్వని అప్పులన్నీ కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనల మేరకు అసెంబ్లీకి సమర్పించాం. ఈనాడు తనకు నచ్చిన ఊహాజనిత గణాంకాలతో అప్పులుపై తప్పుడు కధనాలు రాస్తోంది. అప్పులపై ఎన్నిసార్లు వాస్తవాలు వెల్లడించినా పదేపదే దు్రష్పచారానికి పాల్పడుతూ టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. హెచ్చరికలంటూ అవగాహనారాహిత్యం.. ఆర్బీఐ గానీ కేంద్ర ఆర్థికశాఖగానీ అప్పులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించలేదు. అసలు నిబంధనల మేరకు అప్పులకు అనుమతిస్తారు. ఒకవేళ నిబంధనలు మీరితే అప్పులు ఇవ్వడం నిలిపేస్తారు. అంతేగానీ హెచ్చరికలు ఉండవు. ఈ మాత్రం కనీస అవగాహన కూడా రామోజీరావుకు లేదు. కేంద్రానికి గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ అనధికారిక అప్పులు ఉండవనే సంగతి తెలియకపోవడం ‘ఈనాడు’ అవగాహనారాహిత్యానికి నిదర్శనం. అనధికారిక అప్పులా? మార్గదర్శి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక డిపాజిట్లు సేకరించడం రామోజీకే చెల్లింది. ప్రభుత్వాలకు బ్యాంకులు గానీ, ఆర్థిక సంస్ధలు గానీ ఏ అప్పులిచ్చినా అవి అధికారికంగానే ఇస్తాయి. అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వరనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా? మార్వాడీ దగ్గరకు వెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడం కేంద్రంతో పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ సాధ్యం కాదు. ప్రభుత్వానికి అప్పులు చెల్లించే ఉద్దేశం లేదంటూ మరో అబద్ధాన్ని ఈనాడు అచ్చేసింది. అప్పులను వాయిదాల ప్రకారం ప్రభుత్వాలు తీరుస్తూ ఉంటాయి. తీర్చకపోతే డిఫాల్ట్ అవుతాయి. అది కూడా తెలియదా? గత అప్పులకు ఇప్పుడు కోత రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు తక్కువే. వాస్తవానికి గత సర్కారు నిబంధనల కంటే ఎక్కువగా అప్పులు చేసింది. దాంతో కేంద్రం ఇపుడు వాటిని తగ్గిస్తోంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల జారీ ద్వారా రుణం తీసుకోవడానికి సెబీ అనుమతించింది. అయితే అవసరం లేదు కాబట్టి తీసుకోలేదు. దీన్ని కూడా వక్రీకరిస్తూ రాజ్యాంగ విరుద్ధం అన్నట్లు తప్పుడు కథనాలు ప్రచురించారు. పరిమితికి లోబడే గ్యారెంటీలు గ్యారెంటీలు రాష్ట్ర ఆదాయంలో 80 శాతమే ఉన్నాయి. ఇవి నిబంధనల కన్నా తక్కువే. పెండింగ్ బిల్లుల విషయంలో ‘ఈనాడు’వి పచ్చి అబద్ధాలు. జీతాలు గానీ పెన్షన్లు గానీ ఆగలేదు. అలాంటప్పుడు ఇన్ని పెండింగ్ బిల్లులు ఎలా ఉంటాయి? కోవిడ్ కారణంగా రాష్ట్రం రూ.66 వేల కోట్లు ఆదాయం కోల్పోయినప్పటికీ టీడీపీ హయాంతో పోలిస్తే తక్కువగానే అప్పు చేసింది. గత సర్కారు హయాంతో పోల్చితే ఆస్తుల కల్పనకు వెచ్చించిన మూల ధన వ్యయం ఇప్పుడే ఎక్కువ. -
ఆర్బీఐ తాజాగా నివేదిక విడుదల.. అప్పుల్లో.. అడుగునే
సాక్షి, అమరావతి: ఒకసారి శ్రీలంకతో పోలుస్తూ.. మరోసారి రూ.పది లక్షల కోట్లంటూ రాష్ట్ర అప్పులపై తమకు నచ్చినట్లు పుంఖాను పుంఖాలుగా ఓ వర్గం మీడియా ప్రచురిస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదని ఆర్బీఐ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది. 2021–22 ఆర్థిక ఏడాది మార్చి నాటికి వివిధ రాష్ట్రాల అప్పులపై ఆర్బీఐ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇన్స్టిట్యూషన్లతో పాటు స్టేట్ డెవలప్మెంట్ రుణాలు (మార్కెట్ బారోయింగ్), విద్యుత్ బాండ్లు, నాబార్డు, ఇతర బాండ్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కేంద్రం నుంచి రుణాలు, అడ్వాన్స్‌లు, నేషనల్ సెక్యూరిటీ ఫండ్, నేషనల్ కో–ఆపరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిపాజిట్స్ అండ్ అడ్వాన్స్ ద్వారా తీసుకున్న మొత్తం రుణాలను రాష్ట్రాల వారీగా ఆర్బీఐ వెల్లడించింది. అన్ని రకాల రుణాలు కలిపి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 2022 మార్చి నాటికి రూ.3,98,903 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. 2019 మార్చి నెలాఖరు నాటికి అంటే చంద్రబాబు పాలన చివరి దశలో రాష్ట్రం అప్పులు రూ.2,64,451 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు సర్కారు ఏప్రిల్ 4వతేదీన ఒకేసారి రూ.4,000 కోట్లు, మే 2వ తేదీన రూ.500 కోట్లు, మే 7వతేదీన 500 కోట్లు, మే 14వ తేదీన రూ.1,000 కోట్లు అప్పులు చేసింది. దీంతో మరో రూ.ఆరు వేల కోట్ల మేర చంద్రబాబు సర్కారు అప్పు చేసినట్లైంది. దీంతో చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు రూ.2,70,451 కోట్లకు చేరుకున్నాయి. ఇంతకంటే ప్రామాణికం ఇంకేముంది? అప్పులపై ఆర్బీఐ నివేదిక కంటే ప్రామాణికం ఏదీ ఉండదని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చాలనే దురుద్దేశంతోనే రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ ఓ వర్గం మీడియా బురద చల్లుతోందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అప్పులు ఎన్ని ఉన్నాయో ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా చెప్పినందున ఇకనైనా తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఆర్థిక శాఖ వర్గాలు సూచిస్తున్నాయి. ఆ రెండు పత్రికలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తున్నాయని పేర్కొంటున్నాయి. నిపుణుల పేరుతో ఓ వర్గం మీడియా వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పుల వివరాలను ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ పత్రంలో స్పష్టంగా పేర్కొన్నప్పటి ఆ పత్రికలు పట్టించుకోకుండా కథనాలు అల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఏడు రాష్ట్రాల తరువాతే ఏపీ.. దేశంలో ఏడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే అధికంగా అప్పులు చేశాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రానికి అప్పులున్నాయని తెలిపింది, అత్యధిక అప్పుల్లో రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో మహారాష్ట్ర, నాలుగో స్థానంలో పశ్చిమబెంగాల్, ఐదో స్థానంలో రాజస్థాన్, ఆరో స్థానంలో కర్నాటక, ఏడో స్థానంలో గుజరాత్ రాష్ట్రాలున్నాయి. ఆ తరువాత.. అంటే 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. -
అప్పు పథంలో ఐదు రాష్ట్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రతిష్టను రచ్చకీడుస్తూ.. శ్రీలంకతో పోలుస్తూ పదేపదే బురద చల్లుతున్న దుష్ట చతుష్టయానికి చెంపపెట్టులా ఆర్థిక పరిస్థితిపై ప్రపంచ బ్యాంకు నివేదికను వెల్లడించింది. లాక్డౌన్ తదనంతరం దేశంలోని 20 పెద్ద రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులను ప్రపంచ బ్యాంకు క్షుణ్నంగా పరిశోధించి సమగ్ర నివేదిక రూపొందించింది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రమాదకర స్థాయిలో లేవని ప్రపంచ బ్యాంకు పరిశోధన నివేదిక నిగ్గు తేల్చింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో 2020–21 తొలి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)పై ప్రభావం పడటమే కాకుండా అప్పులు, ద్రవ్యలోటు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. సెకండ్ వేవ్‌తో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నప్పటికీ అనంతరం పుంజుకోవడంతో చాలా రాష్ట్రాల ఆదాయాలు పెరగడంతో పాటు మూలధన వ్యయం మెరుగుపడిందని తెలిపింది. ఆదాయాలు క్షీణించినప్పటికీ ఆహార సబ్సిడీలు, పెన్షన్లు లాంటి సామాజిక భద్రత చర్యలు చేపట్టడంతో వ్యయం పెరిగి అన్ని రాష్ట్రాల రుణాలు 24 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు అత్యధిక అప్పుల్లో ఉన్నాయని తెలిపింది. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేకపోవడం గమనార్హం. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, కేరళ రాష్ట్రాల అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2019, 2020, 2021 ఆగస్టు నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు, క్యాపిటల్ వ్యయం, బడ్జెట్ అంచనాలు, రెవెన్యూ రాబడులను ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. 2019–20లో ఆర్థిక మందగమనం కారణంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు తగ్గిపోయాయని నివేదిక పేర్కొంది. పుంజుకున్న ఆదాయాలు.. ఆంధ్రప్రదేశ్ సహా మిగతా రాష్ట్రాలన్నింటిలో 2019 ఆగస్టుతో పోల్చితే 2020, 2021 ఆగస్టుల్లో రెవెన్యూ రాబడులు పెరిగాయని నివేదిక తెలిపింది. చాలా రాష్ట్రాల్లో క్యాపిటల్ వ్యయం పెరిగిందని, ఏపీలో 2019 ఆగస్టుతో పోల్చి చూస్తే 2020 ఆగస్టులో క్యాపిటల్ వ్యయం బాగా పెరిగిందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2019 ఆగస్టుతో పోల్చితే 2021 ఆగస్టులో బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా రాబడులు మెరుగుపడ్డాయని, బడ్జెట్ అంచనాల మేరకు వ్యయం కూడా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనైనా తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే యత్నాలకు ఇకనైనా స్వస్తి పలకాలని ఆర్ధిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నివేదికలో ముఖ్యాంశాలు... ► దేశంలో అత్యధికంగా పంజాబ్ అప్పుల్లో ఉంది. జీఎస్డీపీలో ఏకంగా 49.5 శాతం అప్పులున్నాయి. ► రాజస్థాన్‌కు జీఎస్డీపీలో 39.5 శాతం మేర అప్పులుండగా హిమాచల్‌ప్రదేశ్‌కు 39.7 శాతం, బిహార్‌కు 38.6 శాతం, కేరళకు 37 శాతం మేర అప్పులున్నాయి. ► ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్డీపీలో 32.5 శాతం మాత్రమే అప్పులున్నాయి. ► సొంత రాబడుల్లో పంజాబ్ వడ్డీ చెల్లింపులపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ► బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ, హర్యానా రాష్ట్రాలు వచ్చే ఐదేళ్లలో చెల్లించాల్సిన అప్పుల వాటా అత్యధికంగా ఉంది. చత్తీస్గడ్ వచ్చే ఐదేళ్లలో 59.2 శాతం, ఒడిశా 54.7 శాతం, హర్యానా 48.7 శాతం మేర అప్పులు చెల్లించాల్సి ఉంది. కేంద్రం అప్పులే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ అప్పులు 2020–21లో ఏకంగా జీడీపీలో 61 శాతానికి చేరుకోవడం గమనార్హం. 2013– 14లో కేంద్రం అప్పులు రూ.56,69,128.48 కోట్లు కాగా 2021–22 నాటికి రూ.1,35,88,193.16 కోట్లకు పెరిగాయి. చదవండి: బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? -
దురుద్దేశంతోనే రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం: మంత్రి బుగ్గన
న్యూఢిల్లీ: ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించే దురుద్దేశంతో రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. వివిధ రాష్ట్రాల అప్పులపై పార్లమెంటులో ప్రశ్న అడిగితే.. అదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాత్రమే అడిగినట్టుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అప్పులు ఎక్కువగా చేశారని గుర్తు చేశారు మంత్రి. అనవసర అప్పులు ఆ కాలంలోనే ఎక్కువగా జరిగాయన్నారు. ‘మా ప్రభుత్వ హయాంలో అప్పులు చేశాము. అయితే టీడీపీ ప్రభుత్వ హాయంతో పోల్చితే మేము చేసిన అప్పుల శాతం చాలా తక్కువ. కర్ణాటకలో సగటున ఏడాదికి అప్పుల భారం రూ. 60 వేల కోట్లు, తమిళనాడులో రూ.1 లక్ష కోట్ల అప్పు పెరిగింది. జనాభా దామాషా ప్రకారం చూసినా, మరే విధంగా చూసినా ఏపీ అప్పుల తీరు చాలా తక్కువ. స్థూల ఉత్పత్తిలో పోల్చితే ఈ అప్పులు ఏ విధంగా ఎక్కువ? నిజానికి మా హయాంలో చేసిన అప్పులు స్థూల ఉత్పత్తితో పోల్చితే తక్కువే. ఏడాదికి 15%-16% వరకు అప్పు పెరిగితే, మిగతా రాష్ట్రాల్లో 20% వరకు పెరిగింది. ద్రవ్యలోటు 2014లో 3.95% ఉంటే, 2021-22లో 3% కి తగ్గించాము. పొరుగు రాష్ట్రాలు 4% కంటే ఎక్కువ ద్రవ్యలోటు కలిగి ఉన్నాయి. ఒక్క ఏపీ మాత్రమే అప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. యావద్దేశ అప్పు శాతం పెరిగింది. కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఇలా జరిగింది.’ అని స్పష్టం చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఇదీ చదవండి: మంత్రి బుగ్గన వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా? -
దుష్ట చతుష్టయం దొంగ లెక్కలు
సాక్షి, అమరావతి: దుష్ట చతుష్టయం, అభివృద్ధి నిరోధక శక్తుల తప్పుడు లెక్కల బండారం పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా అప్పులు చేస్తోందని, ఏకంగా రూ.8 లక్షల కోట్లకుపైగా రుణాలు తీసుకుందంటూ పదేపదే చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు కూడా వాస్తవం లేదని తాజాగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. ఆర్థిక పరిస్థితికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నా దుష్ట చతుష్టయం పదేపదే బురద చల్లుతూ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తోంది. అభివృద్ధి నిరోధక శక్తులకు చెంపపెట్టు రాష్ట్ర అప్పులపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏకరువు పెట్టే కథనాలు, వాటి ఆధారంగా టీడీపీ బృందం చేస్తున్న ప్రచారం అంతా పచ్చి బూటకమని తేలిపోయింది. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం పలుదఫాలు వాస్తవాలను గణాంకాలతో సహా వివరించినా ఏమాత్రం బాధ్యత లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తున్న అభివృద్ధి నిరోధక శక్తులకు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం చెంపపెట్టులా పరిణమించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల అప్పుల భారంపై హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కిషన్‌కపూర్ అడిగిన ప్రశ్నకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆ వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 2022 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.3,98,903.60 కోట్లేనని తేలింది. చంద్రబాబు సర్కారు దిగిపోయే నాటికి అంటే 2019 మే నెలాఖరు నాటికి రాష్ట్రం అప్పులు రూ.2,68,115.00 కోట్లుగా ఉన్నాయి. అంటే మూడేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1,30,788.6 కోట్లు మాత్రమే అప్పులు చేసినట్లు స్పష్టమైంది. అప్పుల్లో ఏపీ దేశంలోనే నంబర్ వన్ అంటూ దుష్ట చతుష్టయం చేస్తున్న దుర్మార్గమైన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనే స్పష్టం చేస్తోంది. బాబు జమానాలో రూ.1.62 లక్షల కోట్లకు లెక్కల్లేవ్ ఏపీలో బడ్జెట్ కేటాయింపులు లేకుండా రూ.లక్షల కోట్లు వ్యయం చేశారని, అది కేంద్రం దృష్టికి వచ్చిందా? ఏం చర్యలు తీసుకున్నారంటూ రాజ్యసభలో టీటీపీ సభ్యుడు కనకమేడల ఇటీవల ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇస్తూ 2014–15 నుంచి 2018–19 వరకు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ.1.62 లక్షల కోట్లకు లెక్కలు లేవని, కేటాయింపులు లేకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా వ్యయం చేశారని వెల్లడించారు. కాగ్ నివేదికలోనూ ఇది స్పష్టంగా ఉందని తెలిపారు. దీంతో బాబు సర్కారు బండారం బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నించి భంగపడి తమ అధినేత నిర్వాకాలనే కనకమేడల పార్లమెంట్ వేదికగా చాటి చెప్పారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పుల్లో తమిళనాడు టాప్ సాక్షి, న్యూఢిల్లీ: ‘స్టేట్ ఫైనాన్స్‌లు: 2021–22 బడ్జెట్ల అధ్యయనం’ పేరుతో రిజర్వు బ్యాంక్ రూపొందించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం బకాయిల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. సోమవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ కిషన్‌కపూర్ అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులకు సంబంధించి 2020 మార్చి చివరి నాటికి రుణాలు, 2021 మార్చి సవరించిన అంచనాలు, 2022 మార్చి నాటికి బడ్జెట్ అంచనాలను పార్లమెంట్‌కు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి చివరికి బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.3,98,903.6 కోట్లు కాగా తెలంగాణ మొత్తం అప్పు రూ.3,12,191.3 కోట్లుగా ఉందని తెలిపారు. అప్పుల్లో తమిళనాడు రూ.6,59,868 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే.. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన ప్రకటనతో వెల్లడైంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి బడ్జెట్ అంచనాల మేరకు వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను ఆమె లోక్‌సభకు తెలియచేశారు. రాష్ట్రాల అప్పులకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రతి ఏడాది కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తుందని, దాని ప్రకారమే అప్పులు చేస్తాయని, ఏ ఆర్థిక ఏడాదైనా అనుమతికి మించి అప్పులు చేస్తే మరుసటి సంవత్సరంలో సర్దుబాటు చేస్తుందని చెప్పారు. -
అధికవడ్డీతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేస్తున్నారు: ఎంపీ ఉత్తమ్‌కుమార్
-
తెలంగాణలో అప్పులే తప్ప అభివృద్ధి కనిపించడం లేదు: ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర సోమవారం ప్రకటించింది. గత మూడేళ్లలో రాష్ట్రాలు తీసుకున్న అప్పుల జాబితాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. తెలంగాణ, ఏపీ అప్పలు జాబితాను విడుదల చేశారు. 2022 వరకు ఏపీ అప్పులు రూ. 3 లక్షల 98 వేల కోట్లు ఉండగా.. తెలంగాణ అప్పులు రూ. 3 లక్షల 12వేల కోట్లుగా ఉంది. 2014 నాటికి తెలంగాణ అప్పు కేవలం రూ. 64వేల కోట్లు మాత్రమే ఉంది. అయితే 2014లో రూ.18 వేలుగా ఉన్న తలసరి అప్పు.. 2022లో రూ.లక్షకు పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని కేసీఆర్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో అప్పులు చేసినా అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలో అప్పులపై అనేకసార్లు ప్రస్తావించినా.. తమను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ఎడాపెడా అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని స్థితికి ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. చదవండి: కేసీఆర్‌తో కోల్డ్‌వార్.. గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు -
రాష్ట్ర అప్పులు 3.29 లక్షల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పుల పద్దు రూ.3 లక్షల కోట్లు దాటుతోంది. ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరంలో సమీకరించుకుంటామని ప్రతిపాదించిన రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ.3,29,988 కోట్లకు చేరనున్నాయి. 2021–22 ఏడాదికిగాను సవరించిన బడ్జెట్ అంచనాలు.. రాష్ట్ర అప్పులు రూ.2,85,120 కోట్లు. తాజా బడ్జెట్లో కొత్తగా రూ.59 వేల కోట్లకుపైగా రుణాలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో పాత రుణాలకు సంబంధించి చెల్లింపులు పోగా.. రూ.45 వేల కోట్లు అదనంగా జతకానున్నాయి. మొత్తం అప్పులు రూ.3.29 లక్షల కోట్లు దాటనున్నాయి. ఈ అప్పులను 2011 జనాభా లెక్కలతో పోల్చితే, తలసరి అప్పు రూ.94,272 కోట్లకు చేరుతోంది. ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల పేరిట పూచీకత్తులతో తీసుకున్న రుణాలను కూడా కలిపితే.. తలసరి అప్పు మరో రూ.30 వేల వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆర్థిక సంవత్సరానికి తలసరి అప్పు రూ.81,935 మాత్రమే కావడం గమనార్హం. బహిరంగ మార్కెట్ నుంచే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల వివరాలను పరిశీలిస్తే.. బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలే 90 శాతం మేర ఉంటున్నాయి. 2021–22 నాటికి బహిరంగ మార్కెట్లో మొత్తం రూ.2,44,238 కోట్లు అప్పుగా తీసుకోగా.. ఈ ఏడాది మరో రూ.53,970 కోట్లను అదే తరహాలో సమీకరించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. ►కేంద్రం నుంచి ఇప్పటివరకు రూ.755.59 కోట్లు అప్పుగా తీసుకోగా.. వచ్చే ఆర్థిక సం వత్సరంలో మరో రూ.4,102 కోట్లు తీసుకుంటామన్నారు. 2021–22 సవరించిన బడ్జెట్ అంచనాలు.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6,377.77 కోట్ల సెక్యూరిటీలు వేలం వేసి అప్పులు సేకరించారు. ►పలు ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి రూ.14,161.74 కోట్లు.. ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ ఫండ్ల ద్వారా రూ.12,785 కోట్ల రుణాలను ప్రభుత్వం సేకరించింది. ►ఈ రుణాలన్నీ ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారమే తీసుకుంటున్నామని.. ఇందులో రిస్క్ ఉన్న రుణాలు తక్కువేనని, చెల్లింపు సజావు గా జరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది. ఈ రుణాల ద్వారా రాష్ట్ర సంపద కూడా పెరుగుతోందని పేర్కొంటోంది. వడ్డీలకే రూ.18,911 కోట్లు ►రాష్ట్ర అప్పులకు వడ్డీల కింద ఈసారి రూ.18,911 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, వడ్డీల కింద ప్రస్తుతం రూ.17,584 కోట్లున్న అప్పు వచ్చే ఏడాది మరో రూ.1,300 కోట్లు పెరగనున్నాయి. ►రుణాల్లో చెల్లింపుల కోసం తాజా బడ్జెట్లో రూ.11,601 కోట్లు చూపారు. ఇందులో ప్రజారుణం కింద రూ.8,336 కోట్లు, కేం ద్రం నుంచి తీసుకునే రుణాలకు రూ.367.94 కోట్లు, ఇతర రుణాలకు రూ.2,897 కోట్లు తిరిగి చెల్లించనున్నారు. -
టీడీపీ అప్పులతోనే తిప్పలన్నీ..
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మేరకు అప్పులు చేశామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడంతో ఆ భారాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ రుణాలపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడం హేయమని బుగ్గన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే లక్ష్యంతోనే టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. అవాస్తవాలతో విషప్రచారానికి దిగిందని మండిపడ్డారు. ప్రభుత్వం పరిమితికి లోబడే అప్పులు చేస్తోందని తేల్చిచెప్పారు. ఆ అప్పు మొత్తాలను విచక్షణతో వినియోగించి.. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద కరోనా సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో అదనంగా రెండు శాతం అంటే.. రూ.20 వేల కోట్ల అప్పునకు అనుమతించిందని గుర్తు చేశారు. కేంద్రం నిర్దేశించిన మేరకే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు. ఈ మేరకు మంత్రి బుగ్గన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలనే కాకుండా ఆర్థిక వ్యవస్థ వలయంలో ఉన్న కంపెనీలను, వాటిపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధిని నిలబెట్టగలిగామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన ప్రతి పైసాకి లెక్క ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,27,105.81 కోట్లు అప్పు చేయగా.. అందులో రూ.1,05,102 కోట్లు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని వివరించారు. ప్రభుత్వం వెచ్చించిన ప్రతి రూపాయికి ఆధార్ నంబర్లతో సహా లబ్ధిదారుల లెక్క ఉందన్నారు. ఇలా టీడీపీ ప్రభుత్వ నేతలు వారు చేసిన అప్పులకు లబ్ధిదారులెవరో పారదర్శకంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ రాబడులు భారీగా తగ్గాయని, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తున్నాయని బుగ్గన స్పష్టం చేశారు. ప్రతిపక్షం చేస్తున్న వాదన అవాస్తవం.. కరోనా వల్ల రాష్ట్ర రాబడులు తగ్గలేదని ప్రతిపక్షం చేస్తున్న వాదన అవాస్తవమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–15 నుంచి 2018–19 వరకు పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం, వివిధ వృత్తులపై ఉన్న పన్నులు మొత్తం 10.03 శాతం చొప్పున ఏటా పెరుగుతూ వచ్చాయని గుర్తు చేశారు. అయితే.. 2019–20, 2020–21ల్లో పన్నుల ఆదాయం కేవలం 1.30 శాతమే పెరిగిందన్నారు. పన్నుల రాబడి తగ్గడం వల్ల ఒక్క ఏడాదిలోనే రూ.7,947.07 కోట్ల్ల ఆదాయం కోల్పోయిందని చెప్పారు. కరోనా లాక్డౌన్ సమయంలో గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పన్నుల నుంచి రావాల్సిన ఆదాయం రూ.4,709.24 కోట్లకు పడిపోయిందన్నారు. 2018–19లో రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.58,107 కోట్లు ఉంటే.. 2019–20లో రూ.57,618.82 కోట్లే ఉందని తెలిపారు. అలాగే 2020–21లో రూ.57,378 కోట్లు మాత్రమే ఉందన్నారు. 2021–22లో కూడా కరోనాతో రాష్ట్ర ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడిందని చెప్పారు. పేద ప్రజలకు 15 నెలలపాటు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ కరోనా సహాయక చర్యలు, చికిత్స, వ్యాక్సిన్ కొనుగోలుకు ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయలేదంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని బుగ్గన స్పష్టం చేశారు. 37,60,360 టీకాలను రూ.125.6 కోట్లతో కొనుగోలు చేశామన్నారు. కరోనా తొలి, రెండో వేవ్ ఉధృతి సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఖర్చుకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3,092.05 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఈ మొత్తంతో 15 నెలలపాటు 58.79 లక్షల బియ్యం కార్డుదారులకు 106.64 కోట్ల కిలోల బియ్యాన్ని, 4.60 కోట్ల కిలోల కందిపప్పును ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కరోనా కష్టకాలంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే 1.35 కోట్ల కుటుంబాలకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.1,350 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. కరోనా చికిత్స, కట్టడి కోసం అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2,562.54 కోట్ల వ్యయం చేసినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమం, స్థిర అభివృద్ధికే వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యం.. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే ప్రతి రైతుకు రూ.44,500 అందజేసింది. ► ఇప్పటివరకు రైతు భరోసా కింద గత రెండేళ్లలో కరోనా కష్టకాలంలోనూ 52.38 లక్షల మంది రైతులకు(పీఎంకేఎస్‌వైతో కలిపి) రూ.17,029 కోట్లు ఇచ్చాం. ► రైతులకు సున్నా వడ్డీ కింద రూ.1,105.89 కోట్లు అందజేశాం. ► ఉచిత పంటల బీమా కింద రూ.3,788.25 కోట్లు ఇచ్చాం. ► ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1,055.19 కోట్లు అందించాం. ► మత్స్యకార భరోసా కింద రూ.331.58 కోట్లు ఇచ్చాం. ► ధాన్యం మినహా ఇతర పంటల కొనుగోళ్లకు రూ.5,964 కోట్లు వెచ్చించాం. ► గత రెండేళ్లలో రైతుల కోసం రూ.83,102.18 కోట్లు ఖర్చు చేస్తే.. ఇందులో ధాన్యం కొనుగోళ్లకే రూ.30,405.62 కోట్లు వ్యయం చేశాం. ► పిల్లల చదువుల కోసం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతోపాటు అమ్మఒడి, నాడు–నేడు కోసం రూ.25,914.13 కోట్లు ఖర్చు పెట్టాం. 8అక్కచెల్లెమ్మలకు ఆసరా, సున్నా వడ్డీ, చేయూత ద్వారా రూ.17,608.43 కోట్ల లబ్ధి చేకూర్చాం. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 12.48 లక్షల మంది రోగులకు రూ.4,342.05 కోట్లు ఖర్చు పెట్టాం. ► ఆరోగ్యశ్రీ కింద 1.97 లక్షల మంది కోవిడ్ రోగుల చికిత్సకు రూ.668.77 కోట్లు వ్యయం చేశాం. ► అవ్వాతాతలకు కరోనా కష్టకాలంలో కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ల రూపంలో రూ.37,461.89 కోట్లు ఇచ్చాం. ► నేతన్నల సంక్షేమం కోసం గత టీడీపీ సర్కార్ ఐదేళ్లలో రూ.259.04 కోట్ల వ్యయం చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత రెండేళ్లలోనే రూ.575.87 కోట్లు వెచ్చించింది. ఆర్థిక స్థితిని దిగజార్చిన గత సర్కారు ► గత టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక స్థితిని కోలుకోలేని విధంగా దిగజార్చిందని మంత్రి బుగ్గన మండిపడ్డారు. 2014లో రాష్ట్ర విభజనతో మనకు అప్పగించిన అప్పులు మొత్తం రూ.1,18,544.34 కోట్లు ఉన్నాయన్నారు. ► గత టీడీపీ ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 వరకు ఇష్టానుసారం అప్పులు చేసి ఆ మొత్తాన్ని రూ.2,57,509.85 కోట్లకు పెంచిందని తెలిపారు. అంతేకాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.1,00,000 కోట్లకుపైగా అప్పులు చేసిందన్నారు. ► విద్యుత్ శాఖకు సంబంధించి 2014–15లో రూ.31,647.64 కోట్ల అప్పు ఉంటే 2018–19 నాటికి దీన్ని టీడీపీ ప్రభుత్వం రూ.62,463 కోట్లకు పెంచిందని తెలిపారు. ► విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన బకాయిలు 2014–15లో రూ.4,817.69 కోట్లు ఉంటే.. 2028–19 నాటికి రూ.20,121.97 కోట్లకు పెంచిందని గుర్తు చేశారు. ► పౌరసరఫరాల కార్పొరేషన్‌పై రూ.20,000 కోట్లు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌పై రూ.3,000 కోట్లు, నీటివనరుల అభివృద్ధి సంస్థపై రూ.4,000 కోట్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)పై రూ.5,014 కోట్లు, టిడ్కోపై రూ.4,601.59 కోట్లు, రైతు సాధికార సంస్థపై రూ.2,000 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీపై రూ.1,356 కోట్లు, తాగునీటి కార్పొరేషన్‌పై రూ.980 కోట్లు, హౌసింగ్ కార్పొరేషన్‌పై రూ.1,870 కోట్లు, ఇంకా చిన్న చిన్న కార్పొరేషన్లపై రూ.10,000 కోట్లు టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. ► సంపూర్ణ వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి రూ.87,612 కోట్ల రైతు రుణాలుంటే దాన్ని రూ.20 వేల కోట్లకు కుదించిందని గుర్తు చేశారు. అందులోనూ ఐదు విడతల్లో కేవలం రూ.15,279.42 కోట్లు (17.44 శాతం) మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. -
ఆదుకునేందుకే అప్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆప్పులపై ప్రతిపక్షాలతో పాటు కొన్ని పత్రికలు (‘సాక్షి’ కాదు) చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ప్రజల కష్టాలను తీర్చడానికి పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నామని, ఇందులో దాపరికం ఏమీ లేదని చెప్పారు. ప్రతిపక్షంతో పాటు కొన్ని పత్రికలు పనిగట్టుకుని ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చాలనే కుట్రలో భాగంగా తప్పుడు రాతలు, దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. అప్పులపై వాస్తవాలను బుధవారం ఆయన ఆర్ అండ్ బీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కోవిడ్‌తో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్ర ప్రజల జీవనోపాధి కోసమే వ్యయం చేసిందని, నేరుగా నగదు బదిలీ ద్వారా ప్రజల ఖాతాలకు రూ.లక్ష కోట్లను ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. ఆర్ధిక మందగమనం సమయంలో అప్పు చేసైనా ప్రజలకు డబ్బులు అందించాలన్నది ఆర్ధిక నిపుణుల సూత్రమని, అప్పుడే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందని, అదే సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేసిందని, ఇందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. 2019 – 20 నుంచే ఆర్ధిక మందగమనం ప్రారంభమైందని, ఆ ఆర్ధిక ఏడాదిలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.6,591 కోట్లు తగ్గిపోయాయని చెప్పారు. కోవిడ్ కారణంగా కేంద్ర పన్నుల వాటా నుంచి రావాల్సిన రాబడిలో రూ.7,780 పాటు రాష్ట్ర పన్నుల రాబడి రూ.7,000 కోట్లు తగ్గిపోగా మరో పక్క కరోనా నివారణ, నియంత్రణ చర్యల కోసం అదనంగా రూ.8,000 కోట్లు వ్యయం చేయాల్సి వచ్చిందని వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడిందన్నారు. దువ్వూరి కృష్ణ ఇంకా ఏమన్నారంటే... టీడీపీ సర్కారు పెంచింది అప్పులే అప్పులు ఎక్కువ కావటానికి ప్రధాన కారణం.. గత సర్కారు రూ.1,20,556 కోట్ల అప్పులను రూ.2,68,115 కోట్లకు పెంచేసి ఎక్కడా మౌలిక వసతుల కల్పనకు వ్యయం చేయలేదు. బడ్జెట్ బయట మరో రూ.58 వేల కోట్లు అప్పు చేయడమే కాకుండా మూడు ఆర్ధిక సంవత్సరాల్లో పరిమితికి మించి రూ.16,418 కోట్లు అప్పు చేసింది. టీటీపీ సర్కారు పరిమితికి మించి చేసిన అప్పుల వల్లే నేడు అప్పుల్లో కోత పడుతోంది. అంతేకాకుండా టీడీపీ సర్కారు దిగిపోయేనాటికి ఏకంగా రూ.38,000 కోట్ల బిల్లులు బకాయిలు పెట్టింది. విద్యుత్ రంగంతో పాటు డిస్కమ్‌ల పేరిట భారీ అప్పులు చేయడమే కాకుండా బిల్లులు బకాయిలు పెట్టింది. ఆ నిర్వాకాలకు తోడు కోవిడ్‌తో ఆర్థిక కష్టాలు.. గత సర్కారు తీసుకున్న అప్పులను ఉత్పాదక రంగంపై వెచ్చించకపోగా వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలను నిర్లక్ష్యం చేసింది. టీడీపీ సర్కారు దుర్వినియోగ చర్యలతో విభజన కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఆర్ధిక సమస్యల్లోకి గెంటేసింది. ఆ ఇబ్బందులకు తోడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోవిడ్ కష్టాలు చుట్టుముట్టాయి. ‘మాఫీ’ లేదు.. విద్య, వైద్యంపై నిర్లక్ష్యం టీడీపీ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసింది. రైతులకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పింది. దీంతో రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని 2016–17 నాబార్డు సర్వే స్పష్టం చేసింది. దేశంలో వ్యవసాయ కుటుంబాలు సగటున 47 శాతం అప్పుల్లో ఉండగా రాష్ట్రంలో ఏకంగా 77 శాతం అన్నదాతల కుటుంబాలు అప్పుల్లో ఉన్నట్లు సర్వే తెలిపింది. గత ప్రభుత్వం ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రాథమిక విద్య గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దేశ సగటు 99 శాతం కాగా అత్యల్పంగా రాష్ట్రంలో కేవలం 84.48 శాతమే ఉంది. దీన్నిబట్టి టీటీపీ ప్రభుత్వం అప్పులను ఎలా విచ్చలవిడిగా వ్యయం చేసిందో బోధపడుతోంది. ఇప్పడు జీవనోపాధి, వ్యవసాయం, వైద్య, విద్య రంగాలకు వ్యయం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలో కూడా పరిమితికి లోబడి అప్పులు చేస్తూ ఒకపక్క ప్రజలను నగదు బదిలీ ద్వారా ఆదుకుంటూ మరోపక్క విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. కోవిడ్ కారణంగా పలు దేశాలతో పాటు రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మన రాష్ట్రం కూడా అదే తరహాలో అప్పులు చేస్తున్నా వాటిని కోవిడ్ విపత్తులో ప్రజలకు జీవనోపాధి కల్పిచడం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యయం చేసింది. ఈ చర్యల వల్లే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలకుండా నిలబడింది. నాడు విద్యుత్ అప్పులతో యూనిట్‌కు రూ.1.20 భారం గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో చేసిన అప్పుల కారణంగా ప్రతీ యూనిట్‌పై రూ.1.20 చొప్పున భారం పడింది. విద్యుత్ రంగంలో అప్పులను టీడీపీ సర్కారు రూ.33,587 కోట్ల నుంచి రూ.70,254 కోట్లకు పెంచింది. డిస్కమ్‌ల బకాయిలను రూ.2893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెంచి భారం మోపింది. అక్కడ అమ్మకం.. ఇక్కడ తనఖా మాత్రమే ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా తెలంగాణ సర్కారు భూముల అమ్మకం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని బడ్జెట్లో కూడా పొందుపరిచింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భూముల విక్రయాల ద్వారా దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయం పొందింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం భూములను విక్రయించకుండా కేవలం తనఖా పెట్టడం ద్వారా రుణాలను సమీకరిస్తోంది. నోట్: ఈ పట్టిక చూస్తే ఎవరి పాలనలో అప్పులు భారీగా పెరిగాయో అర్థం అవుతుంది. చంద్రబాబు హయాంలో కేంద్రం చేసిన అప్పుల వృద్ధి రేటు కంటే రాష్ట్రం అప్పుల వృద్ధి రెండు రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర అప్పుల వృద్ధితో పోలిస్తే రాష్ట్రంలో అప్పుల వృద్ది తక్కువగా నమోదైందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. -
అప్పు.. ఇంతింతై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రుణ ప్రస్థానం భారీ బడ్జెట్‌తోపాటే ఉరకలేస్తోంది. వచ్చే ఏడాదికి అప్పు ఏకంగా రూ.2.21 లక్షల కోట్లు దాటనుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి అప్పుల మొత్తం రూ.1,80,238 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం బడ్జెట్లో ప్రస్తావించింది. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.1,51,133 కోట్ల అప్పులు చేసినట్లు వెల్లడించింది. వీటితో పాటు ఇప్పటికే మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కార్పొరేషన్ల పేరిట మరో రూ.41,538 కోట్ల అప్పు చేసినట్లుగా వెల్లడించింది. వెరసి మొత్తం అప్పు రూ.2.21 లక్షల కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. వీటికి తోడు సాగునీటి ప్రాజెక్టుల రుణ సమీకరణకు తెలంగాణ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ను ఇటీవలే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దాదాపు రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్‌కు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. దీంతో కార్పొరేషన్ల అప్పు అంతకంతకూ పెరిగిపోనుంది. సాధారణంగా కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రాలు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర జీఎస్డీపీలో 3.25 శాతం మేరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు కేంద్రం 3.50 శాతం వరకు పెంచుతూ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23 వేల కోట్ల మేర అప్పు తీసుకున్న ప్రభుత్వం వచ్చే ఏడాది రూ.29 వేల అప్పులు తీసుకోనుంది. అంతమేరకు జీఎస్డీపీలో 3.45 శాతం ద్రవ్యలోటును బడ్జెట్లో ప్రస్తావించింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్డీపీలో 25 శాతం మించకూడదని, అంతకు మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో చేరి పోయే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు జీఎస్డీపీలో 21.39 శాతానికి చేరనున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్న అప్పు రూ.70 వేల కోట్లు. గడిచిన నాలుగేళ్లలో ఈ అప్పు అంతకంతకు పెరిగిపోయింది. వడ్డీలకే 13 వేల కోట్లు! చేసిన అప్పులు తిరిగి చెల్లించటం రాష్ట్ర ఖజానాకు భారంగా మారనుంది. 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం రూ.8,609 కోట్ల వడ్డీలు చెల్లించినట్లు అకౌంటెంట్ జనరల్ తన గణాంకాల్లో ధ్రువీకరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది. అలాగే 2017–18లో వడ్డీల చెల్లింపులకు రూ.1,1138 కోట్లు వెచ్చింది. సవరణ బడ్జెట్లోనూ ఇవే గణాంకాలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వడ్డీల భారం రూ.1,1691 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. దాదాపు రూ.29 వేల కోట్ల అప్పులను అంచనా వేసిన ప్రభుత్వం.. వడ్డీల లెక్కలను మాత్రం తక్కువ చేసి చూపినట్లు స్పష్టమ వుతోంది. వడ్డీల మోత రూ.13 వేల కోట్లు దాటే అవకాశాలున్నాయి. -
'అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు'
-
'అప్పుల తెలంగాణగా మారుస్తున్నారు'
హైదరాబాద్: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. ( చదవండి : రాష్ట్రం అప్పు రూ. 1.2 లక్షల కోట్లు ) మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి తోసేశారని, అప్పుల కోసమే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మెదటి స్థానంలో ఉందని, ఈ అప్పులకు ఈ ఏడాది రూ.7,700 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందని చెప్పారు. త్వరలోనే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా మేలుకోకపోతే తెలంగాణ మరో బీహార్‌లా బీమారీ స్టేట్‌గా మారుతుందని అన్నారు.