టీడీపీ అప్పులతోనే తిప్పలన్నీ.. | Buggana Rajendranath Comments On Chandrababu Govt For AP Debts | Sakshi
Sakshi News home page

టీడీపీ అప్పులతోనే తిప్పలన్నీ..

Published Sun, Sep 5 2021 3:44 AM | Last Updated on Sun, Sep 5 2021 3:46 AM

Buggana Rajendranath Comments On Chandrababu Govt For AP Debts - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మేరకు అప్పులు చేశామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడంతో ఆ భారాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మోయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ రుణాలపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడం హేయమని బుగ్గన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే లక్ష్యంతోనే టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. అవాస్తవాలతో విషప్రచారానికి దిగిందని మండిపడ్డారు. ప్రభుత్వం పరిమితికి లోబడే అప్పులు చేస్తోందని తేల్చిచెప్పారు. ఆ అప్పు మొత్తాలను విచక్షణతో వినియోగించి.. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ కింద కరోనా సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో అదనంగా రెండు శాతం అంటే.. రూ.20 వేల కోట్ల అప్పునకు అనుమతించిందని గుర్తు చేశారు.

కేంద్రం నిర్దేశించిన మేరకే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు. ఈ మేరకు మంత్రి బుగ్గన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలనే కాకుండా ఆర్థిక వ్యవస్థ వలయంలో ఉన్న కంపెనీలను, వాటిపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధిని నిలబెట్టగలిగామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన ప్రతి పైసాకి లెక్క ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,27,105.81 కోట్లు అప్పు చేయగా.. అందులో రూ.1,05,102 కోట్లు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని వివరించారు. ప్రభుత్వం వెచ్చించిన ప్రతి రూపాయికి ఆధార్‌ నంబర్లతో సహా లబ్ధిదారుల లెక్క ఉందన్నారు. ఇలా టీడీపీ ప్రభుత్వ నేతలు వారు చేసిన అప్పులకు లబ్ధిదారులెవరో పారదర్శకంగా చెప్పగలరా అని సవాల్‌ విసిరారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ రాబడులు భారీగా తగ్గాయని, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా అన్ని రాష్ట్రాలు, దేశాలు అప్పులు చేస్తున్నాయని బుగ్గన స్పష్టం చేశారు.  

ప్రతిపక్షం చేస్తున్న వాదన అవాస్తవం..  
కరోనా వల్ల రాష్ట్ర రాబడులు తగ్గలేదని ప్రతిపక్షం చేస్తున్న వాదన అవాస్తవమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–15 నుంచి 2018–19 వరకు పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం, వివిధ వృత్తులపై ఉన్న పన్నులు మొత్తం 10.03 శాతం చొప్పున ఏటా పెరుగుతూ వచ్చాయని గుర్తు చేశారు. అయితే.. 2019–20, 2020–21ల్లో పన్నుల ఆదాయం కేవలం 1.30 శాతమే పెరిగిందన్నారు. పన్నుల రాబడి తగ్గడం వల్ల ఒక్క ఏడాదిలోనే రూ.7,947.07 కోట్ల్ల ఆదాయం కోల్పోయిందని చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పన్నుల నుంచి రావాల్సిన ఆదాయం రూ.4,709.24 కోట్లకు పడిపోయిందన్నారు. 2018–19లో రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.58,107 కోట్లు ఉంటే.. 2019–20లో రూ.57,618.82 కోట్లే ఉందని తెలిపారు. అలాగే 2020–21లో రూ.57,378 కోట్లు మాత్రమే ఉందన్నారు. 2021–22లో కూడా కరోనాతో రాష్ట్ర ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడిందని చెప్పారు.
 
పేద ప్రజలకు 15 నెలలపాటు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ
 
కరోనా సహాయక చర్యలు, చికిత్స, వ్యాక్సిన్‌ కొనుగోలుకు ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయలేదంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని బుగ్గన స్పష్టం చేశారు. 37,60,360 టీకాలను రూ.125.6 కోట్లతో కొనుగోలు చేశామన్నారు. కరోనా తొలి, రెండో వేవ్‌ ఉధృతి సమయంలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఖర్చుకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3,092.05 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఈ మొత్తంతో 15 నెలలపాటు 58.79 లక్షల బియ్యం కార్డుదారులకు 106.64 కోట్ల కిలోల బియ్యాన్ని, 4.60 కోట్ల కిలోల కందిపప్పును ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కరోనా కష్టకాలంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే 1.35 కోట్ల కుటుంబాలకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.1,350 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. కరోనా చికిత్స, కట్టడి కోసం అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2,562.54 కోట్ల వ్యయం చేసినట్లు తెలిపారు.

కరోనా కష్టకాలంలోనూ సంక్షేమం, స్థిర అభివృద్ధికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రాధాన్యం.. 
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే ప్రతి రైతుకు రూ.44,500 అందజేసింది.  
► ఇప్పటివరకు రైతు భరోసా కింద గత రెండేళ్లలో కరోనా కష్టకాలంలోనూ 52.38 లక్షల మంది రైతులకు(పీఎంకేఎస్‌వైతో కలిపి) రూ.17,029 కోట్లు ఇచ్చాం. 
► రైతులకు సున్నా వడ్డీ కింద రూ.1,105.89 కోట్లు అందజేశాం. 
► ఉచిత పంటల బీమా కింద రూ.3,788.25 కోట్లు ఇచ్చాం. 
► ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,055.19 కోట్లు అందించాం. 
► మత్స్యకార భరోసా కింద రూ.331.58 కోట్లు ఇచ్చాం. 
► ధాన్యం మినహా ఇతర పంటల కొనుగోళ్లకు రూ.5,964 కోట్లు వెచ్చించాం. 
► గత రెండేళ్లలో రైతుల కోసం రూ.83,102.18 కోట్లు ఖర్చు చేస్తే.. ఇందులో ధాన్యం కొనుగోళ్లకే రూ.30,405.62 కోట్లు వ్యయం చేశాం. 
► పిల్లల చదువుల కోసం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనతోపాటు అమ్మఒడి, నాడు–నేడు కోసం రూ.25,914.13 కోట్లు ఖర్చు పెట్టాం. 8అక్కచెల్లెమ్మలకు ఆసరా, సున్నా వడ్డీ, చేయూత ద్వారా రూ.17,608.43 కోట్ల లబ్ధి చేకూర్చాం. 
► వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద 12.48 లక్షల మంది రోగులకు రూ.4,342.05 కోట్లు ఖర్చు పెట్టాం. 
► ఆరోగ్యశ్రీ కింద 1.97 లక్షల మంది కోవిడ్‌ రోగుల చికిత్సకు రూ.668.77 కోట్లు వ్యయం చేశాం. 
► అవ్వాతాతలకు కరోనా కష్టకాలంలో కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ల రూపంలో రూ.37,461.89 కోట్లు ఇచ్చాం. 
► నేతన్నల సంక్షేమం కోసం గత టీడీపీ సర్కార్‌ ఐదేళ్లలో రూ.259.04 కోట్ల వ్యయం చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత రెండేళ్లలోనే రూ.575.87 కోట్లు వెచ్చించింది.

ఆర్థిక స్థితిని దిగజార్చిన గత సర్కారు
► గత టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక స్థితిని కోలుకోలేని విధంగా దిగజార్చిందని మంత్రి బుగ్గన మండిపడ్డారు. 2014లో రాష్ట్ర విభజనతో మనకు అప్పగించిన అప్పులు మొత్తం రూ.1,18,544.34 కోట్లు ఉన్నాయన్నారు. 
► గత టీడీపీ ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 వరకు ఇష్టానుసారం అప్పులు చేసి ఆ మొత్తాన్ని రూ.2,57,509.85 కోట్లకు పెంచిందని తెలిపారు. అంతేకాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.1,00,000 కోట్లకుపైగా అప్పులు చేసిందన్నారు. 
► విద్యుత్‌ శాఖకు సంబంధించి 2014–15లో రూ.31,647.64 కోట్ల అప్పు ఉంటే 2018–19 నాటికి దీన్ని టీడీపీ ప్రభుత్వం రూ.62,463 కోట్లకు పెంచిందని తెలిపారు. 
► విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్‌ ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన బకాయిలు 2014–15లో రూ.4,817.69 కోట్లు ఉంటే.. 2028–19 నాటికి రూ.20,121.97 కోట్లకు పెంచిందని గుర్తు చేశారు. 
► పౌరసరఫరాల కార్పొరేషన్‌పై రూ.20,000 కోట్లు, రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పై రూ.3,000 కోట్లు, నీటివనరుల అభివృద్ధి సంస్థపై రూ.4,000 కోట్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)పై రూ.5,014 కోట్లు, టిడ్కోపై రూ.4,601.59 కోట్లు, రైతు సాధికార సంస్థపై రూ.2,000 కోట్లు, ఏపీఎస్‌ఆర్‌టీసీపై రూ.1,356 కోట్లు, తాగునీటి కార్పొరేషన్‌పై రూ.980 కోట్లు, హౌసింగ్‌ కార్పొరేషన్‌పై రూ.1,870 కోట్లు, ఇంకా చిన్న చిన్న కార్పొరేషన్‌లపై రూ.10,000 కోట్లు టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు.  
► సంపూర్ణ వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి రూ.87,612 కోట్ల రైతు రుణాలుంటే దాన్ని రూ.20 వేల కోట్లకు కుదించిందని గుర్తు చేశారు. అందులోనూ ఐదు విడతల్లో కేవలం రూ.15,279.42 కోట్లు (17.44 శాతం) మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement