
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రుణ ప్రస్థానం భారీ బడ్జెట్‌తోపాటే ఉరకలేస్తోంది. వచ్చే ఏడాదికి అప్పు ఏకంగా రూ.2.21 లక్షల కోట్లు దాటనుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి అప్పుల మొత్తం రూ.1,80,238 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రస్తావించింది. గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం రూ.1,51,133 కోట్ల అప్పులు చేసినట్లు వెల్లడించింది. వీటితో పాటు ఇప్పటికే మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కార్పొరేషన్ల పేరిట మరో రూ.41,538 కోట్ల అప్పు చేసినట్లుగా వెల్లడించింది. వెరసి మొత్తం అప్పు రూ.2.21 లక్షల కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. వీటికి తోడు సాగునీటి ప్రాజెక్టుల రుణ సమీకరణకు తెలంగాణ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ను ఇటీవలే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది.
వీటి ద్వారా దాదాపు రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్‌కు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. దీంతో కార్పొరేషన్ల అప్పు అంతకంతకూ పెరిగిపోనుంది. సాధారణంగా కేంద్రం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోకి లోబడే రాష్ట్రాలు రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.25 శాతం మేరకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణకు కేంద్రం 3.50 శాతం వరకు పెంచుతూ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23 వేల కోట్ల మేర అప్పు తీసుకున్న ప్రభుత్వం వచ్చే ఏడాది రూ.29 వేల అప్పులు తీసుకోనుంది. అంతమేరకు జీఎస్‌డీపీలో 3.45 శాతం ద్రవ్యలోటును బడ్జెట్‌లో ప్రస్తావించింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర అప్పు జీఎస్‌డీపీలో 25 శాతం మించకూడదని, అంతకు మించితే ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల జాబితాలో చేరి పోయే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు జీఎస్‌డీపీలో 21.39 శాతానికి చేరనున్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రం నుంచి పంచుకున్న అప్పు రూ.70 వేల కోట్లు. గడిచిన నాలుగేళ్లలో ఈ అప్పు అంతకంతకు పెరిగిపోయింది.
వడ్డీలకే 13 వేల కోట్లు!
చేసిన అప్పులు తిరిగి చెల్లించటం రాష్ట్ర ఖజానాకు భారంగా మారనుంది. 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం రూ.8,609 కోట్ల వడ్డీలు చెల్లించినట్లు అకౌంటెంట్ జనరల్ తన గణాంకాల్లో ధ్రువీకరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపరిచింది. అలాగే 2017–18లో వడ్డీల చెల్లింపులకు రూ.1,1138 కోట్లు వెచ్చింది. సవరణ బడ్జెట్‌లోనూ ఇవే గణాంకాలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వడ్డీల భారం రూ.1,1691 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. దాదాపు రూ.29 వేల కోట్ల అప్పులను అంచనా వేసిన ప్రభుత్వం.. వడ్డీల లెక్కలను మాత్రం తక్కువ చేసి చూపినట్లు స్పష్టమ వుతోంది. వడ్డీల మోత రూ.13 వేల కోట్లు దాటే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment