‘మాఫీ’ కూడా వ్యవసాయంలోనే!
* రైతుల రుణ మాఫీ సొమ్మునూ వ్యవసాయ కేటాయింపుల్లో చూపిన సర్కారు
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇచ్చింది రూ. 7,531.44 కోట్లు
* ప్రణాళికకు రూ. 2,661.66 కోట్లు.. ప్రణాళికేతర రూ. 4,869.78 కోట్లు
* ప్రణాళికేతర బడ్జెట్‌లో రూ. 4,250 కోట్లు రుణమాఫీకే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు బడ్జెట్లో రూ. 7,531.44 కోట్లు కేటాయించింది. భారీగా కేటాయింపులను చూపినా.. రైతుల రుణ మాఫీ పథకం కింద తొలి విడతగా బ్యాంకులకు చెల్లించిన రూ. 4,250 కోట్లను కూడా ఇందులోనే చేర్చింది. పాలిహౌస్‌లకు, ధరల స్థిరీకరణకు కొంత మెరుగ్గా నిధులను కేటాయించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఇచ్చిన బడ్జెట్‌లో ప్రణాళిక కింద రూ. 2,661.66 కోట్లను, ప్రణాళికేతర కింద రూ. 4,869.78 కోట్లను ఇచ్చారు. కానీ ప్రణాళికేతర బడ్జెట్లోనే రుణ మాఫీకి చెల్లించిన రూ. 4,250 కోట్లను చూపారు.
ఇక ప్రణాళిక కింద వ్యవసాయానికి రూ. 1,828.87 కోట్లు, ఉద్యానవన విభాగానికి రూ. 502.75 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ. 203.36 కోట్లు, మత్స్యశాఖకు రూ. 64.96 కోట్లు, సహకారశాఖకు రూ. 61.70 కోట్లు కేటాయించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ (మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్) కోసం రూ. 400 కోట్లు కేటాయించారు. ఆ సొమ్మును కనీస మద్దతు ధర లభించని పక్షంలో రైతులను ఆదుకునేందుకు వినియోగిస్తారు. అలాగే 2011-12 నుంచి 2013-14 వరకు బ్యాంకుల్లో పేరుకుపోయిన రుణ వడ్డీ బకాయిల చెల్లింపునకు కూడా వినియోగిస్తారు.
వెయ్యి ఎకరాల్లో పాలిహౌస్ (గ్రీన్‌హౌస్)ల్లో కూరగాయల సాగు కోసం రూ. 250 కోట్ల ను సబ్సిడీగా కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 100 కోట్లు ఇచ్చారు. క్రాప్ కాలనీలు, భూసార, నీటి పరీక్షలకు రూ. 20 కోట్లు ప్రతిపాదించారు. కొత్తగా క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయడం ద్వారా నిర్దేశిత పంటల ఉత్పత్తిని పెంచాలనేది ఉద్దే శం. కాగా ఈ ఏడాది 4.5 లక్షల భూసార కార్డులను అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రాష్ట్రా న్ని విత్తన భాండాగారంగా తయారుచేయాలన్న లక్ష్యా న్ని బడ్జెట్‌లో స్పష్టీకరించారు. పాల ఉత్పత్తికి ప్రోత్సాహకం కింద రూ. 16.30 కోట్లు కేటాయించారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించారు.
ముఖ్యమైన కేటాయింపులు (రూ.కోట్లలో)
• సీడ్ బ్యాంక్ స్కీమ్ కోసం రూ. 11.90
• పంటల బీమా పథకం రూ. 139.77
• వ్యవసాయశాఖకు భవనాలు రూ. 5.19
• ఇతర రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ. 6.88
• వడ్డీ లేని రుణాలు, పంటల బీమా రూ. 200
• రైతులకు విత్తనాల సరఫరా రూ. 63.61
• సీడ్ చైన్ బలోపేతానికి రూ. 50
• రైతు క్షేత్రస్థాయి పాఠశాల, ఎక్స్‌పోజర్ విజిట్స్ రూ. 10
• జాతీయ ఆహార భద్రతా మిషన్ రూ. 80.22
• విస్తరణ, టెక్నాలజీ జాతీయ మిషన్ రూ. 56.27
• సుస్థిర వ్యవసాయ జాతీయ మిషన్ రూ. 278.56
• ఆయిల్‌సీడ్, ఆయిల్ పాం మిషన్ రూ. 70.34
• రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ. 280.14
• మైక్రో ఇరిగేషన్ రూ. 200
• కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ రూ. 20
• సహకార సంఘాలకు రూ. 4.04
• ‘వైద్యనాథన్’ సిఫారసుల అమలుకు రూ. 49.77