మిశ్రమ స్పందన | Mixed response Telangana state government first budget | Sakshi
Sakshi News home page

మిశ్రమ స్పందన

Published Thu, Nov 6 2014 4:23 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

మిశ్రమ స్పందన - Sakshi

మిశ్రమ స్పందన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై జిల్లాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కేటాయింపులు చేసిందని అధికార పార్టీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రజా ఆలోచనలకు, ఆశలకు వ్యతిరేకంగా బడ్జెట్ కేటాయింపులు చేశారని వామపక్షాలు విమర్శించాయి. ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేదని, రైతాంగానికి ఊరటనిచ్చేవిధంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదని పేర్కొన్నాయి.                                        
 
 జిల్లాకు మొండిచేయి
 జిల్లా ప్రజలకు ఆరోగ్య వరప్రదాయిని అయిన నిమ్స్‌కు బడ్జెట్‌లో నయాపైసా కేటాయించకపోవడం విచారకరం. అలాగే తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు నామమాత్రంగా నిధులు కేటాయించారు. ఎస్‌ఎల్‌బీసీ, ఉదయ సముద్రం, బీ.వెల్లంల ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వలేదు. అర్హత పేరిట సంక్షేమ పథకాలైన రేషన్‌కార్డులు, ఫించన్‌లకు కోత పెడుతున్నారు.
  -కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ ఉపనేత
 
 ప్రజలు ఆశించిన స్థాయిలో లేదు
 బడ్జెట్‌ను నిశితంగా పరిశీలిస్తే ఉత్పాదక రంగాలపై తక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అలాగని సంక్షేమ రంగాలపై కూడా వరాల జల్లేమీ కురిపించలేకపోయారు. తెలంగాణ ప్రజలకు తక్షణ అవసరమైన విద్యుత్ రంగానికి కూడా ప్రత్యేక కేటాయింపులు కనిపించలేదు. ప్రణాళికేతర వ్యయాన్ని మాత్రం భారీగా చూపించారు. అయితే, 50శాతం కన్నా ఎక్కువగా నాన్‌ప్లాన్ బడ్జెట్‌ను చూపించేందుకు గల కారణాలను మాత్రం ఎక్కడా చెప్పలేకపోయారు. జిల్లా విషయానికి వస్తే ఎప్పటిలాగే సాగునీటి ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులే జరిగాయి. ఎన్నెస్పీ, ఎస్‌ఎల్‌బీసీ, ఎస్సారెస్పీ రెండో దశ ప్రాజెక్టులకు పెద్దగా ప్రాధాన్యమిచ్చినట్టేమి కనిపించలేదు. నక్కలగం డి లాంటి ప్రాజెక్టుల ఊసు లేకపోవడం జిల్లాకు నష్టం కలిగించేదే. పిలాయిపల్లి, కోటప్పమత్తడి, బునాదిగాని కాల్వ, శేషులేటి వాగులాంటి చిన్న ప్రాజె క్టులకు కూడా నిధులివ్వలేదు. యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిం చడం స్వాగతించదగిందే. అయితే, రైతాంగంపై శ్రద్ధ పెట్టి బడ్జెట్‌ను కూరిస్తే బాగుండేది.
 -గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
 
 బంగారు తెలంగాణకు నాంది
 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవిధంగా బడ్జెట్ రూపొందించారు. ఈ బడ్జెట్ బంగారు తెలంగాణకు నాంది పలకనుంది. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేశారు. హామీ ఇవ్వని క ల్యాణి లక్ష్మి వంటి పథకాలకు కూడా నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ వచ్చే ఐదేళ్లలో బంగారు తెలంగాణకు అద్ధంపట్టే విధంగా ఉంది.
 
 రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
 తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రానికి కొత్తగా ఒరిగిందేమీ లేదు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు సరిపోయే పరిస్థితి లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం అంతంత మాత్రమే. జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ నివారణకు ఏయే చర్యలు తీసుకుంటున్నారో చెప్పలేదు. బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజ లను ప్రభుత్వం అంకెల గారడితో మోసం చేసింది.
 
 సమస్యలను పట్టించుకోలేదు
 బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటే వారి ఆశలను వమ్ము చేసింది ప్రభుత్వం. ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే వాటిని ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించడం దారుణం.  ప్రజల ఆశలకనుగుణంగా బడ్జెట్ లేదు. బడ్జెట్ ప్రసంగంలో రైతుల గోసపై కనీస ప్రస్తావన లేదు. విద్యుత్‌కు కేవలం వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తగిన బడ్జెట్ కేటాయింపుల్లేవు.
  - నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
 
 దళితులకు నిరాశ
 తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఎంతో మేలు జరుగుతుందన్న ఆశాభావంతో ఉ న్న దళితులకు బడ్జెట్ తీవ్ర నిరాశ పర్చింది. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూ మి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్‌లో ఎలాంటి ప్రాధాన్యతను పొందుపర్చలేదు. అదేవిధంగా సబ్‌ప్లాన్ కోసం కేటాయించిన నిధులు దళితులకే ఖర్చు చేస్తారన్న నమ్మకం లేకుండా చేశారు.
  -కత్తుల మల్లేశం,
 షెడ్యూల్డ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు
 
 ఆశలే తప్ప.. కేటాయింపుల్లేవ్
 బడ్జెట్‌లో కోటి ఆశలు రేకత్తించారు తప్పా ఆ స్థాయిలో కేటాయింపు లు చేయలేదు. రైతాం గం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు లేవు. విద్యుత్ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పేదల ఇళ్లకు డబుల్ బెడ్ రూం కటిస్తామని చెప్పారు కానీ బడ్జెట్‌లో కేటాయింంచలేదు.
  - తూడి దేవేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు
 
 కేంద్రం ఇచ్చే సబ్సిడీలకే కేటాయింపులు
 కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పథకాలకే ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించింది. నిరుద్యోగులు, యువకులు, రైతులకు బడ్జెట్‌లో ఒరిగిందేమీ లేదు. ఉద్యోగాల కల్పన పూర్తిగా విస్మరించారు. మౌలిక సదుపాయాలు, ఖాయాల పడ్డ పరిశ్రమల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను చిన్నచూపు చూసింది. సీఎం, మం త్రులు ఎన్నికల్లో గుప్పించిన హామీలకు ప్రతిబిం బించే విధంగా బడ్జెట్ లేదు.
  - వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
 
 గిరిజనులకు అధిక ప్రాధాన్యం
 టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గిరిజనులకు అధిక ప్రాధాన్యం లభించింది. గిరిజనులకు మూడు ఎకరాలు, కళ్యాణలక్ష్మి పథకం ద్వారా తమకు చేయూత అందనుంది. తండాలను ప్రత్యేక గ్రామ పంచాతీలు చేయడం ద్వారా అభివృద్ధికి  మార్గం సుగమమైంది. సబ్‌ప్లాన్ నిధులతో తండాలకు మహార్ధశ పట్టనుంది. గతం లో గిరిజనులకు ఇంత ఉపయోగకర మైన బడ్జెట్ ఏ ప్రభుత్వం కేటాయించలేదు.
  - లకావత్ రవినాయక్, తెలంగాణ గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
 బీసీల పట్ల వివక్ష
 రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు కేవలం రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించారు. దీంట్లో బీసీ విద్యార్థుల ఫీజు బకాయిల కిందనే రూ.3వేల కోట్లు చెల్లిం చాల్సి ఉంది. అది మినహాయిస్తే బీసీలకు మిగిలేది శూన్యం. ఇక కార్పోరేషన్లు, సంక్షేమ శాఖకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు బీసీలకు వర్తింపజేయాలి.
  - వైద్యుల సత్యనారాయణ,
 జిల్లా బీసీ సంఘం ప్రధానకార్యదర్శి
 
 రైతు వ్యతిరేక బడ్జెట్
 ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల తరహాలోనే అంకెల గారడీల బడ్జెట్ ఉంది. ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఐదు నెలల్లో ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఖర్చు చేయలేరు. ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఎస్‌ఎల్‌బీసీకి బడ్జెట్‌లో అత్తెసరు నిధులు కేటాయించి అన్ని వర్గాల ప్రజలు విస్మరించారు.
  - బిల్యానాయక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
 
 ఖర్చు చేస్తేనే ప్రయోజనం
 ఏపీ బడ్జెట్ రూ.లక్షా 15వేల కోట్లు అయితే.. తెలంగాణ ప్రభుత్వం 10జిల్లాలకు లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం హర్షణీయం. కేటాయించిన బడ్జెట్ నిధులన్నీ 5నెలల్లో ఖర్చు చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉండాలి. లోటు బడ్జెట్ రూ.17వేల కోట్లు ఉంది. దీన్ని పూడ్చేం దుకు ప్రభుత్వం అప్పుతేవడం కానీ, ప్రజలపై పన్నుల రూపంలో భారం మోపాల్సి ఉంటుంది. ఎక్కువశాతం జనాభా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం రూ.2వేల కోట్లు కేటాయించడం విచారకరం. విద్యుత్, రుణమాఫీ, ఉన్నతవిద్యకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత రావాల్సి ఉంది.
  - డాక్టర్ అంజిరెడ్డి, ఎంజీయూ అర్థశాస్త్ర విభాగాధిపతి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement