గుట్ట అభివృద్ధికి రూ.100 కోట్లు
భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని తిరుమల తిరుపతికి దీటుగా అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గుట్ట దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన యాదగిరిగుట్ట రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. కాగా గత నెల 17న గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని గుట్ట అభివృద్ధిపై హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో యాదగిరి క్షేత్రం అభివృద్ధికి తీసుకునే చర్యలు సూచించారు.
బడ్జెట్‌లో సైతం గుట్ట అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ఇక్కడి ప్రజలు, స్వామి భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో స్వామివారి గర్భగుడి ఆలయ గోపురం ఎత్తుపెంపుతో పాటు స్వర్ణతాపడం ముఖ్యమైనది. దీంతోపాటు గుట్ట పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయిం చారు. ఇందులో 400 ఎకరాల్లో నర్సింహ అభయారణ్యం పేరిట జింకల పార్కును, మిగి లిన 16 వందల ఎకరాల్లో తిరుమల తిరుపతి తరహాలో ఉద్యానవనాలు, అధ్యాత్మిక కేంద్రా లు, కల్యాణమంటల నిర్మాణంతో పాటు వేదపాఠశాల ఏర్పాటు చేయనున్నారు.
నా పూర్వ జన్మ సుకృతం
నా హయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం నా పూర్వ జన్మసుకృతం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గుట్ట క్షేత్రం లో అధునాతన సదుపాయలు కల్పిస్తాం.
-గొంగిడి సునీత, ఎమ్మెల్యే ఆలేరు
సంతోషంగా ఉంది..
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉంది. స్థపతుల సలహా తీసుకుని వాస్తు ప్రకారం అభివృద్ధి చేయాలి. ఆలయం చుట్టూ ప్రాకారం, నాలుగు రాజగోపురాలు నిర్మిస్తే బాగుంటుంది.
-కారంపూడి నరసింహాచార్యులు,
గుట్ట ప్రధానార్చకులు