పాత లెక్కలే... అవీ తక్కువే | Telangana government presents its first Budget | Sakshi
Sakshi News home page

పాత లెక్కలే... అవీ తక్కువే

Published Thu, Nov 6 2014 4:19 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

పాత లెక్కలే... అవీ తక్కువే - Sakshi

పాత లెక్కలే... అవీ తక్కువే

ఏఎమ్మార్పీపైనా చిన్నచూపు
 ఎస్‌ఎల్‌బీసీపైనా ‘ఈటెల’ బడ్జెట్ చిన్నచూపే చూసింది. ఈ బడ్జెట్‌లో మాత్రం దాన్ని రూ.325 కోట్లకు కుదించారు. ఉదయ సముద్రం, డిండి ఎత్తిపోతల పథకాల అంతర్భాగమైన ఈ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)కు కూడా ఆశించిన స్థాయిలో నిధులివ్వలేదు. రూ.2813 కోట్ల పరిపాలనా అనుమతులున్న ఈ ప్రాజెక్టు 2010 నాటికే పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటికీ కొనసా.. గుతూనే ఉంది.
 
 సాగర్‌కు  రూ. 425 కోట్లే
 నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.743 కోట్లు కేటాయించగా, ఇప్పుడు చూపెట్టింది రూ.425 కోట్లే. ప్రపంచ బ్యాంకు సాయంతో సాగుతున్న సాగర్ ఆధునికీకరణ పనులకు  రెండేళ్లుగా రూ.700 కోట్లకు పైగా కేటాయించినా,  ఈసారి మాత్రం తక్కువ చూపెట్టడం గమనార్హం. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ పద్దుకింద రూ.154.24 కోట్లను చూపెట్టారు. మొత్తం మీద 4వేల కోట్ల రూపాయల పైచిలుకు అంచనాలతో చేపట్టిన సాగర్ ఆధునికీకరణ పనులకు తక్కువ నిధులు కేటాయించడం కొంత నిరాశే మిగిల్చింది.
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ
 కొత్త ఆశలు ఆవిరయ్యాయి... తెలంగాణరాష్ట్ర తొలి బడ్జెట్‌లో జిల్లావాసులు ఆశించిన విధంగా వరాల జల్లు కురవలేదు కదా... కనీసం ఓటాన్‌అకౌంట్ బడ్జెట్‌లో చూపెట్టిన నిధుల కన్నా తక్కువ కేటాయింపులే జరిగాయి. పాత లెక్కల కన్నా తక్కువ కేటాయింపులతోనే సరిపెట్టారు రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్. జిల్లాలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు మొక్కుబడి కేటాయింపులు చేసిన టీఆర్‌ఎస్ సర్కారు రెండు కొత్త ప్రాజెక్టుల కింద కొన్ని నిధులు కేటాయించింది.  కొత్తగా జూరాల -పాకాల ప్రాజెక్టు సర్వేకు అనుమతినిచ్చింది.  చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు కింద 51వేల ఎకరాల ఆయకట్టు అభివృద్ధికి నిధులు కేటాయించింది.  మూసీ ప్రాజెక్టు, ఆసిఫ్‌నహర్, డిండి ప్రాజెక్టులకు కూడా కొన్ని నిధులు చూపెట్టారు.
 
 ఈసారి బడ్జెట్‌లో కొత్తగా పంట కాలనీల ఏర్పాటును ప్రతిపాదించడం గమనార్హం. జిల్లాలో వరి, కంది, మొక్కజొన్న, ఆముదం కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, నిమ్స్ వర్సిటీకి ఈసారి బడ్జెట్‌లో నిధులిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. అసలు జిల్లా నిమ్స్ గురించే బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడం గమనార్హం. మొత్తంమీద  ఈటెల  బడ్జెట్ జిల్లావాసులు, ముఖ్యంగా అన్నదాతల్లో ఒకింత నైరాశ్యాన్ని నింపిందనేది నిపుణుల అభిప్రాయం.     డీఈఓ, డిప్యూటీ డీఈఓ కార్యాలయ భవనాల నిర్మాణానికి కూడా రూ.36లక్షలు కేటాయించారు.  
 కళల ప్రోత్సాహంలో భాగంగా జిల్లాలో సురభి డ్రామా పండగలు, చిందు యక్ష గానాలకు నిధులు కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు.  ఎమ్మెల్యేల విషయానికొస్తే నియోజకవర్గానికి రూ.కోటిన్నర నిధులు,  క్యాంపు కార్యాలయాల నిర్మాణానికి  రూ.50లక్షలు కేటాయించారు.
 
 రెండోదశకు రూ.25 కోట్లతో సరి!
 తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు సాగునీటిని అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండోదశ నిర్మాణానికి ఈసారి బడ్జెట్‌లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే చూపెట్టారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు మొదటి నుంచీ అరకొర కేటాయింపులే జరుగుతున్నాయి. పూర్తిగా అందుబాటులోనికి వస్తే జిల్లాలోని 2.2లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టుకు గత ఏడాది రూ. 40 కోట్లివ్వగా, అంతకుముందు ఏడాది రూ. 75 కోట్లు కేటాయించారు. ఇప్పుడు మాత్రం రూ.25 కోట్లతోనే సరిపెట్టడం గమనార్హం.
 
 కొత్తగా రెండు
 ఈసారి జిల్లాలో ఆయకట్టు పెంపునకు రెండు కొత్త ప్రాజెక్టులను చూపెట్టారు.  జూరాల -పాకాల ప్రాజెక్టుకు గాను ఈసారి బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయించారు.  వరంగల్ జిల్లా పరిధిలోనిదే అయిన చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు కింద జిల్లాలో 51, 599 ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేయనున్నట్టు బడ్జెట్‌లో చూపెట్టారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.215 కోట్లు కేటాయించారు. ఇక, జిల్లాలో సాగునీటిని అందిస్తుందని ఆశిస్తున్న ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా రూ.1820 కోట్లు కేటాయించారు. అదేవిధంగా దుమ్ముగూడెం - టెయిల్‌పాండ్‌కు కూడా రూ.3 కోట్లు కేటాయించారు.
 
 చిన్ననీటికి చిన్న కోటానే
 ఇక, జిల్లాలోని చిన్ననీటి ప్రాజెక్టులకు కంటితుడుపుగా నిధుల కేటాయింపు జరిగింది. ఆసిఫ్‌నహర్‌కు రూ.30లక్షలు, మూసీ ప్రాజెక్టుకు రూ.3కోట్లు మినహా మరే ఇతర చిన్ననీటి ప్రాజెక్టుకు పైసా కూడా విదల్చలేదు. ముఖ్యంగా నక్కలగండి, బునాదిగాని కాల్వ, పిలాయిపల్లి కాల్వ, కోటప్పమత్తడి, శేషులేటి వాగు, వేములూరు ప్రాజెక్టు, భీమలింగం లాంటి వాటికి పూర్తి స్థాయి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తప్పదని ఆశించినా... ఆచరణలో మాత్రం కనిపించలేదు. దీంతో చిన్ననీటి పారుదల రంగం అభివృద్ధి కుంటు పడే అవకాశం ఉందని సాగునీటి నిపుణల భావన.
 
 పంట కాలనీలు ఏర్పాటు చేస్తారంట...!
 తెలంగాణ రాష్ట్రంలో పంటల వృద్ధికి ఉద్దేశించిన పంటకాలనీల ఏర్పాటుకు జిల్లాకు కూడా అవకాశం లభించింది. ఈసారి బడ్జెట్‌లో జిల్లాలో వరి, ఆముదం, కంది, మొక్కజొన్న పంటల కాలనీలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయకట్టు ప్రాంతంలో వరి పంట కాలనీలు, నాన్ ఆయకట్టులో మిగిలిన పంటల కాలనీలు ఏర్పాటు చేయనున్నారు.  జిల్లాలోని 15 మండలాల్లో ప్రత్యేకంగా పామాయిల్ సాగు చేపట్టనున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు. జిల్లాలోని భూముల సారాన్ని పరిశీలించేందుకు గాను రూ.59లక్షల వ్యయంతో సంచార భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
 
 సర్వేల్‌కు రూ.1.6కోట్లు
 జిల్లాలో ప్రతిష్టాత్మమైన సర్వేలు గురుకులానికి రూ.1.6 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ గురుకులంలో అదనపు భవనాల నిర్మాణానికి ఈ నిధులు కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో పేర్కొన్నారు.
 
 ఐఎంజీఎస్‌వైకు పెద్దపీట
 గర్భిణి, బాలింతలకు పౌష్టికాహారం, సంరక్షణకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకమైన ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన (ఐఎంజీఎస్‌వై)కు రూ.11.56 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ నుంచి మన జిల్లానే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం గమనార్హం.
 
 భువనగిరి మున్సిపాలిటీతో పాటు మరో నాలుగు మండలాలు అంతర్భాగంగా ఉన్న హెచ్‌ఎండీఏకు కూడా పెద్ద మొత్తంలో రూ.1101 కోట్లు కేటాయించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement