లక్ష కోట్ల బడ్జెట్ | lakh crores budget | Sakshi
Sakshi News home page

లక్ష కోట్ల బడ్జెట్

Published Wed, Nov 5 2014 1:57 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

లక్ష కోట్ల బడ్జెట్ - Sakshi

లక్ష కోట్ల బడ్జెట్

 నేడు అసెంబ్లీ ముందుకు తెలంగాణ తొలి పద్దు
 ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఈటెల
 వచ్చే నాలుగేళ్లకు పునాదిగా రూపకల్పన
 చెరువులు, వాటర్‌గ్రిడ్, సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట
 ప్రణాళిక వ్యయం రూ. 48,900 కోట్లు
 ప్రణాళికేతర వ్యయం రూ. 51,600 కోట్లు
 పన్నుల రాబడి రూ. 35 వేల కోట్లుగా అంచనా
 టాస్క్‌ఫోర్స్ కమిటీల సిఫారసులు పరిగణనలోకి
 రాష్ట్ర ప్రభుత్వ పథకాల కుదింపు

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి బడ్జెట్ రూపుదిద్దుకుంది. లక్ష కోట్లకుపైగా నిధులతో రూపొందిన భారీ బడ్జెట్ బుధవారం అసెంబ్లీలో ఆవిష్కృతంకానుంది. తెలంగాణ రాష్ర్టం సాకారమైన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవే శపెడుతున్న ఈ తొలి బడ్జెట్‌లో రూ. 312 కోట్ల రెవెన్యూ మిగులునూ చూపెట్టే అవకాశముంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ర్ట విభజన జరిగిన జూన్ 2 నుంచి పది నెలల కాలానికే ఈ బడ్జెట్ వర్తిస్తుంది. ఇప్పటికే ఐదు నెలల వ్యయానికి గవర్నర్ ఆమోదం తీసుకున్న నేపథ్యంలో.. మరో ఐదు నెలల కోసమే నిధుల కేటాయింపులు జరుగుతాయి. ఈ స్వల్పకాలంలో పెద్దగా లక్ష్యాలను సాధించే అవకాశం లేకపోయినప్పటికీ వచ్చే నాలుగేళ్ల భవిష్యత్ కార్యాచరణకు ఈ బడ్జెట్టే పునాదికానుంది. రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో రంగాలవారీగా దక్కనున్న కేటాయింపులు, ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దంపట్టనుంది. ప్రభుత్వం సాధించాలనుకుంటున్న లక్ష్యాలకు అనుగుణంగానే తొలి బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని సమాచారం. చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్, సంక్షేమం, వ్యవసాయం, రహదారులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళితులకు భూ పంపిణీ తదితరాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. సొంత రాష్ర్టంలో సొంత ప్రభుత్వం రూపొందించిన తొలి బడ్జెట్‌పై రాష్ర్ట ప్రజలు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు.
 
 ఉదయమే కేబినెట్ ఆమోదం
 
 రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఉదయం 11 గంటలకు శాసనసభలో, అదే సమయంలో డిప్యూటీ సీఎం రాజయ్య శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు. అంతకు గంట ముందే మంత్రి మండలి అసెంబ్లీ కమిటీహాల్‌లో ప్రత్యేకంగా సమావేశమై బడ్టెట్‌ను లాంఛనంగా ఆమోదించనుంది. అనంతరం అసెంబ్లీలో ఆధునీకరించిన శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ వెంటనే శాసనసభ మొదలవుతుంది. బడ్జెట్ పరిమాణం దాదాపు రూ. 1,00,500 కోట్లుగా ఉంటుందని సమాచారం. ఇందులో ప్రణాళిక పద్దు కింద రూ. 48,900 కోట్లు, ప్రణాళికేతర పద్దుగా రూ. 51,600 కోట్లను కేటాయించనున్నట్లు సమాచారం. కాగా, నీటిపారుదల రంగానికి రూ. 6500 కోట్లు, వాటర్ గ్రిడ్‌కు రూ. 2000 కోట్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి కింద కోటిన్నర రూపాయల చొప్పున కేటాయించనున్నట్లు తెలిసింది. విద్యుత్ రంగానికి దాదాపు రూ. 4 వేల కోట్లకుపైగా కేటాయింపులు ఉంటాయని సమాచారం. కాగా, రాష్ట్ర సొంత పన్నుల రాబడులను రూ. 35 వేల కోట్లుగా అంచనా వేశారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు దాదాపు రూ. 13 వేల కోట్ల మేరకు రుణాలు మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లను కూడా వార్షిక ప్రణాళికలో చూపిస్తున్నారు. దీంతో వార్షిక ప్రణాళికా వ్యయం భారీగా ఉండనుంది.
 
 భవిష్యత్తుకు ఇదే పునాది..
 
 ప్రస్తుతం ప్రవేశపెట్టే పథకాలే రాబోయే కాలంలోనూ కొనసాగుతాయి. ఈ పథకాలకు సంబంధించిన లక్ష్యాలు సాధించేలా ఆయా రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఈసారి చక్కదిద్దేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు అధికార వర్గాల కథనం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ముఖ్యమంత్రి ముందు నుంచీ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించిన పలు సమావేశాల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పలుమార్లు ప్రణాళిక వ్యయాన్ని పెంచుతూ వెళ్లారు. ఆదాయ వనరుల కంటే భారీ బడ్జెట్ రూపకల్పనపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెట్టింది. అనవసర పథకాలను కొనసాగించే కంటే, వాటిని ఇతర పథకాలతో అనుసంధానించడం లేదా తొలగించడం వంటి చర్యలను కూడా ఈసారి తీసుకున్నారు. ఇదివరకు రాష్ట్రంలో వెయ్యికంటే అధిక పథకాలు ఉండగా.. వాటిని ఇప్పుడు 750కి కుదించారు. ఈ ప్రక్రియను ఇకపైనా కొనసాగించి రానున్న కాలంలో మరిన్ని పథకాలను తగ్గించే దిశగా సర్కారు కసరత్తు చేయనుంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక కేంద్ర పథకాలను 250 నుంచి 66కు తగ్గించినట్లే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరిస్తున్నట్లు సమాచారం. సాంకేతికంగా పది నెలల బడ్జెట్ ప్రవేశపెడుతున్నా.. దీన్ని ఆ దృష్టితో కాకుండా మధ్యకాలిక వ్యయాల బడ్జెట్(మీడియం టర్మ్ ఎక్స్‌పెండిచర్ బడ్జెట్)గా పరిగణిస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. భవిష్యత్తులో పథకాలకు నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయన్న దానికి ఈ బడ్జెట్ ద్వారా సంకేతాలు అందనున్నాయి. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ముఖ్యమంత్రి నియమించిన 14 టాస్క్‌ఫోర్స్ కమిటీల నివేదికలను ఆర్థిక సాంకేతిక సహకారంగా ఆర్థిక శాఖ వినియోగించుకుంది. ఐదేళ్ల వ్యవధిలో సాధించాల్సిన లక్ష్యాలపై ఈ బడ్జెట్‌లో కసరత్తు చేశారు. బడ్జెట్‌తో పాటే రాష్ట్ర ఆర్థిక సర్వేను కూడా ప్రభుత్వం సభకు సమర్పించనుంది.  
 
 ఏటా 15-20 శాతం ఆర్థిక వృద్ధి తప్పనిసరి
 
 ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుకు ప్రస్తుతమున్న ఆదాయం ఏటా 15 నుంచి 20 శాతం వరకు పెరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే ప్రణాళికలను సిద్ధం చేశారు. ఆదాయం పెంచడానికి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన వనరుల సమీకరణ టాస్క్‌ఫోర్స్ కమిటీ చేసిన కీలక సూచనలు బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. ఆ కమిటీ చేసిన సిఫారసులు బడ్జెట్‌కు కీలకమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి ఆగస్టులో జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. తొలి బడ్జెట్ కోసం ప్రభుత్వం సుధీర్ఘ కసరత్తే చేసింది. ముందుగా మన ఊరు-మన ప్రణాళిక, టాస్క్‌ఫోర్స్ కమిటీల నివేదికలంటూ రెండున్నర నెలలపాటు కసరత్తు చేసింది. పనితీరు ఆధారిత బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెడుతున్నారు. అంచనాలకు, కేటాయింపులకు మధ్య వ్యత్యాసం పెద్దగా ఉండబోదని, బడ్జెట్ కేటాయింపుల తర్వాత ఆయా శాఖల పనితీరు కీలకం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement