Lakh crores
-
రియల్టీ నుంచి ప్రభుత్వాలకు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రియల్ ఎస్టేట్ పరిశ్రమ పెద్ద ఆదాయ వనరుగా మారింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఈ పరిశ్రమ నుంచి రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం స్టాంప్ డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు తదితర రూపంలో ప్రభుత్వాలకు సమకూరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ వాటా 5.4 శాతంగా ఉంది. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’తో కలసి రియల్ ఎస్టేట్ కౌన్సిల్ ‘నరెడ్కో’ విడుదల చేసింది. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 12 రెట్లు పెరిగి 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది 477 బిలియన్ డాలర్లుగా ఉంది. 2047 నాటికి దేశ జీడీపీలో 15 శాతం వాటాను సమకూరుస్తుంది. ప్రస్తుతం పరిశ్రమ వాటా జీడీపీలో 7.3 శాతంగా ఉంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 33–40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’అని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. నివాస మార్కెట్ 3.5 ట్రిలియన్ డాలర్లు నివాస గృహాల మార్కెట్ పరిమాణం గత ఆర్థిక సంవత్సరం నాటికి 299 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2047 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 40 బిలియన్ డాలర్ల నుంచి 473 బిలియన్ డాలర్లకు.. వేర్ హౌసింగ్ మార్కెట్ సైజు 2.9 బిలియన్ డాలర్ల నుంచి 34 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా వేసింది. -
లక్ష కోట్ల దిశగా పతంజలి గ్రూప్..
న్యూఢిల్లీ: వచ్చే 5–7 ఏళ్లలో సంస్థ ఆదాయం రెండున్నర రెట్లు ఎగసి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని పతంజలి గ్రూప్ వెల్లడించింది. ప్రస్తుతం ఆదాయం రూ.40,000 కోట్లు ఉందని గ్రూప్ ఫౌండర్, యోగా గురు బాబా రామ్‌దేవ్ తెలిపారు. అయిదేళ్లలో తమ సంస్థ ప్రత్యక్షంగా అయిదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ‘గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా) ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లను తాకింది. మరో నాలుగు కంపెనీలను 2027 నాటికి లిస్ట్ చేయనున్నాం. ఐపీవోకు రానున్న కంపెనీల్లో పతంజలి ఆయుర్వేద్, పతంజలి మెడిసిన్, పతంజలి లైఫ్‌స్టైల్, పతంజలి వెల్నెస్ ఉన్నాయి. ఈ నాలుగింటిలో పతంజలి ఆయుర్వేద్ తొలుత ఐపీవోకు రానుంది. ఈ కంపెనీకి మార్కెట్లో సుస్థిర స్థానం ఉంది’ అని వివరించారు. నెయ్యిలో కల్తీ అబద్ధం పతంజలి నెయ్యిలో కల్తీ జరుగుతోందడం సరికాదన్నారు. ల్యాబ్‌లో కనుగొన్న విషయాలు సరైనవి కావని, ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాల ల్యాబొరేటరీ ప్రమాణాలు పెరగాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ల్యాబొరేటరీలలో పరీక్షా సౌకర్యాలను మెరుగుపరచాలని, బాధ్యతా రహిత అధికారులను శిక్షించాలని సూచించారు. ‘అన్ని ఉత్పత్తులు బయటకు వచ్చే ముందు అనేకసార్లు పరీక్షిస్తాం. పరిశోధన, అభివృద్ధికి రూ.1,000 కోట్ల దాకా ఖర్చు చేశాం’ అని వెల్లడించారు. ఇమేజ్ కాపాడుకుంటాం.. ‘కుట్ర పన్నిన వ్యక్తులను ఈసారి వదిలిపెట్టబోము. బ్రాండ్ ప్రతిష్టను కాపాడేందుకు చట్ట ప్రకారం కఠిన చర్యలను గ్రూప్ తీసుకుంటుంది. 100 మందికిపైగా లీగల్ నోటీసులు పంపించాం. ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’ అని స్పష్టం చేశారు. యోగా పరువు తీయడంలో మతపరమైన తీవ్రవాదం, ఆయుర్వేదం విషయంలో మెడికల్ టెర్రరిజం హస్తం ఉందని గ్రూప్ ప్రకటన ఒకటి తెలిపింది. లంపీకి పరిష్కారం దిశగా.. పశువులకు సోకుతున్న లంపీ చర్మ వ్యాధికి పరిష్కారం కనుగునే దిశగా పతంజలి గ్రూప్ కసరత్తు చేస్తోందని రామ్‌దేవ్ వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే దేశంలో ఒక లక్ష ఆవులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. హరిద్వార్‌లోని తన ఇంట్లో చాలా ఆవులకు కూడా ఈ వ్యాధి సోకిందని, అయితే ఒక్కటి కూడా చనిపోలేదని చెప్పారు. త్వరలో నాలుగు ఐపీవోలు ఐపీవో కోణం నుండి చూస్తే పతంజలి ఆయుర్వేద్ ఉత్తమమైనదని రామ్‌దేవ్ తెలిపారు. ‘ఉత్పత్తి శ్రేణి, విస్తృతి, కస్టమర్ల సంఖ్య, లాభదాయకత, భవిష్యత్తు అంచనా పరంగా ఇది అత్యంత అనుకూలమైనది. దివ్య ఫార్మసీని ప్రమోట్ చేస్తున్న పతంజలి మెడిసిన్ రెండవ ఐపీవోగా అడుగుపెట్టనుంది. ఆ తర్వాత ఔట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్స్, హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న పతంజలి వెల్నెస్ ఐపీవోకు రానుంది. పతంజలి వెల్నెస్ కింద 25,000 పడకల సామర్థ్యానికి చేరుకోవాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 50 కేంద్రాలున్నాయి. వీటిని రెండింతలు చేస్తాం. ఫ్రాంచైజీ విధానంలోనూ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. దుస్తులు, రవాణా, పశువుల దాణా, ఇతర అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో పతంజలి లైఫ్‌స్టైల్ కార్యకలాపాలు సాగిస్తోంది’ అని చెప్పారు. -
రూ. 5.41 లక్షల కోట్లకు..ఎల్ఐసీ ఇండియన్ ఎంబెడెడ్ విలువ!
ముంబై: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) 2022 మార్చికల్లా ఇండియన్ ఎంబెడెడ్ విలువ(ఐఈవీ)ను రూ. 5,41,492 కోట్లుగా మదింపు చేసింది. గతేడాది(2021) ఇదే కాలానికి కంపెనీ ఐఈవీ రూ. 95,605 కోట్లుగా నమోదైంది. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లో వాటాదారుల కన్సాలిడేటెడ్ విలువను ఎంబెడెడ్ విలువ(ఈవీ)గా పేర్కొంటారు. ఐఈవీ మదింపును మిల్లీమ్యాన్ అడ్వయిజర్స్ పూర్తి చేసినట్లు ఎల్ఐసీ ఎండీ రాజ్ కుమార్ వెల్లడించారు. ఇకపై ఐఈవీని ఆరు నెలలకోసారి వెల్లడించనున్నట్లు తెలియజేశారు. కాగా.. 2021 సెప్టెంబర్ చివరికి ఐఈవీ రూ. 5,39,686 కోట్లకు చేరినట్లు ఎల్ఐసీ తెలియజేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) కొత్త బిజినెస్ విలువ(వీఎన్‌బీ) రూ. 7,6019 కోట్లు చేరింది. 2020–21 మార్చికల్లా వీఎన్‌బీ రూ. 4,167 కోట్లుగా నమోదైంది. గతేడాది వీఎన్‌బీ మార్జిన్ 9.9 శాతం నుంచి 15.1 శాతానికి బలపడింది. ఇక వార్షిక ప్రీమియం(ఏపీఈ) రూ. 45,588 కోట్ల నుంచి రూ. 50,390 కోట్లకు బలపడింది. కాగా, ఎన్ఎస్ఈలో ఎల్ఐసీ షేరు 0.5 శాతం నీరసించి రూ. 715 వద్ద ముగిసింది. -
ఇలా చేస్తే రూ. 311 లక్షల కోట్లు ఆదా, నీతి ఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ: సరుకు రవాణాకోసం పరిశుభ్రమైన, వ్యయాలను తగ్గించగలిగే ఇంధనాలను వినియోగించడం వల్ల భారత్.. 2020–2050 మధ్య కాలంలో లాజిస్టిక్స్ ఇంధనంపరంగా రూ. 311 లక్షల కోట్లు ఆదా చేసుకోగలదని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. అలాగే వచ్చే మూడు దశాబ్దాల్లో 10 గిగాటన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో సరుకు రవాణా వేగవంతం చేయడంలో పరిశుభ్రమైన ఇంధనాల వినియోగం అంశంపై రాకీ మౌంటెయిన్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఎంఐ)తో కలిసి నీతి ఆయోగ్ ఈ నివేదిక రూపొందించింది. ఉత్పత్తులు, సర్వీస్ లను డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో సరుకు రవాణాకు కూడా డిమాండ్ గణనీయంగా పెరగగలదని నివేదిక పేర్కొంది. రైల్వే నెట్‌వర్క్‌నుపెంచుకోవడం, వేర్‌హౌసింగ్‌ను మెరుగుపర్చుకోవడం, విధానపరమైన సంస్కరణలు తీసుకోవడం, పరిశుభ్రమైన టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పైలట్ ప్రాజెక్టులు నిర్వహించడం, ఇంధన ఆదా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. వృద్ధి బాటలో ఉన్న భారత ఎకానమీకి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం సరుకు రవాణా కీలకంగా మారిందని, రవాణా వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతి ఆయోగ్ సలహాదారు (రవాణా, ఎలక్ట్రిక్ మొబిలిటీ) సుధేందు జె సిన్హా తెలిపారు. కేంద్రం నిర్దేశించుకున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా తదితర లక్ష్యాల సాకారానికి కూడా సమర్ధమంతమైన రవాణా విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. చదవండి: వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో రూ. లక్ష కోట్లను దాటాయి. జీఎస్టీ వసూళ్లు మూడు నెలల తర్వాత లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే. గత ఏడాది నవంబర్‌లో రూ.97,637 కోట్లు, (ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.95,380 కోట్లుగా) ఉన్న జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది నవంబర్‌లో 6 శాతం వృద్ధితో రూ.1.03 లక్షల కోట్లకు పెరిగాయి. 2017, జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే మూడో అత్యధిక వసూళ్లు. కాగా ఈ వసూళ్లు లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదో నెల. అంతకు ముందు రెండు నెలల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసిన జీఎస్టీ వసూళ్లు పండుగల డిమాండ్ పుణ్యమాని ఈ నవంబర్‌లో పెరిగాయి. వినియోగం పెరగడాన్ని, జీఎస్టీ అమలు మెరుగుపడటాన్ని పెరిగిన ఈ వసూళ్లు సూచిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
ముచ్చటగా మూడోసారి రూ.లక్ష కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు మరోసారి రూ. లక్ష కోట్ల వసూళ్లను దాటాయి. జనవరి మాసానికి సంబంధించి లక్ష కోట్ల రూపాయల మార్కెను అధిగమించాయని ఆర్థికమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. గతనెల రూ. 94, 725 కోట్ల రూపాయలతో పోలిస్తే , గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ. 89, 825కోట్లతో పోలిస్తే జనవరిలో ఈ వసూళ్లను సాధించినట్టు ట్వీట్ చేసింది. కాగా గత ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి లక్షకోట్ల రూపాయలను దాటాయి. అనంతరం మళ్లీ అక్టోబర్ రెండవసారి ఈ మైలు రాయిని దాటాయి. రెండు నెలల విరామం తరువాత తిరిగి జనవరి మాసంలో ముచ్చటగా మూడోసారి జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల మార్క్‌ను దాటాయి. The total Gross GST Revenue collected in the month of January, 2019 has today crossed ₹ 1 lakh crore. This has been a significant improvement over collection of ₹ 94,725 crore during last month and ₹ 89,825 crore during the same month last year — Ministry of Finance (@FinMinIndia) January 31, 2019 -
ట్రిలియన్ దాటిన జీఎస్టీ వసూళ్లు
సాక్షి,న్యూఢిల్లీ: పండుగ సీజన్లో వినియోగదారుల డిమాండ్ పెరగడంతో జీఎస్టీ వసూళ్లు మరోసారి ట్రిలియన్ మార్క్‌ను అధిగమించాయి. సెప్టెంబర్‌లో రూ. 94,442 కోట్ల పోలిస్తే అక్టోబర్ నెలలో బాగా పుంజుకుని లక్ష కోట్ల రూపాయిలను దాటాయి. 6.64 శాతం పెరిగి అక్టోబర్ నెలలో రూ. 1,00,700 కోట్లకు చేరాయి. సీజీఎస్టీ రూ. 16,464 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ. 22,826 కోట్లు. ఉమ్మడి అంటే ఐజీఎస్టీ వసూళ్లు రూ. 53,419 కోట్లు. ఇందులో ఎగుమతుల ద్వారా రూ. 26,908 కోట్లు. సెస్ రూపంలో రూ. 8,000 కోట్లు వసూలయ్యాయి. ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆపసోపాలు పడుతున్నప్రభుత్వానికి ఇది ఊరట నిచ్చే అంశం. కాగా ఈ ఏడాదిలో లక్షకోట్ల వసూళ్లను దాటం ఇది రెండవ సారి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలలో తొలిసారి ట్రిలియన్ రూపాయల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. -
రూ.లక్షల కోట్ల పెట్టుబడులేవి బాబూ!
-
రూ.లక్షల కోట్ల పెట్టుబడులేవి బాబూ!
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ధ్వజం , రూ.లక్షల కోట్ల సాక్షి, అమరావతి: ఒప్పందాలు, పెట్టుబడుల పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఏదో మేలు చేస్తున్నాననే భ్రమలు కల్పిస్తూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ఆయన గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. గతేడాది జనవరి 12న విశాఖలో నిర్వహించిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వం 331 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తుచేశారు. ఆయా కంపెనీల సామర్థ్యంపై విచారణ జరపకుండానే ఒప్పందాలు చేసుకోవడం శోచనీయమని అన్నారు. -
ఒక నూలు మిల్లు కథ
అక్షర తూణీరం ‘ఇలా ఎన్నాళ్లు? నిజం తెలిస్తే...’ అన్నాడు జమిందారు. నందోరాజా భవిష్యతి. నిశ్చింతగా ఉండండన్నాడు కాశీపతి. నీ రుణం తీర్చుకోలేనని పాదాల వంక చూశాడు జమిందారు. కుందేలు సింహానికి ఎదురు తిరుగుతుంది. ఒకచోట మేక పులిపై తిరగబడుతుంది. రాజ గురువులు అలాంటి పోతుగడ్డ లను గుర్తించేవారు. అక్కడ కోటలను కట్టేవారు. చరిత్రలో మన కోటలన్నింటికీ ఇలాంటి స్థల పురాణాలే ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్టికి అమరావతి పుణ్యమా అని పురాణ యుగంలోకి వెళ్లిపోయాం. జీవితమే సఫలమూ.. అని కొందరు, దొరకునా ఇటువంటి సేవ.. అనుకుంటూ మరికొందరు, తమ తమ హోదాల్లో రాజధాని నిర్మాణానికి రాళ్లెత్తుతున్నారు. కొందరు నేనుసైతం ఒక రాయి వేశానంటూ ఈ శతాబ్దపు మహా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. పుట్టమట్టిని, పొలం మట్టిని వేదోక్తంగా సేకరించి తెచ్చి అమరావతి పీఠానికి అమర త్వం సిద్ధింపచేస్తున్నారు. చాలదు, ఇంకా రకరకాల మట్టి నమూనాలు రావాలి. పోరుబందరు నుంచి దోసెడు మట్టి తేవాలి. శాంతి సహనాలను నిక్షిప్తం చేయాలి. పుచ్చలపల్లి, ప్రకాశం, ఎన్.జి. రంగా పుట్టిన ఊళ్లలో మట్టి సేకరణ జరగాలి. ఘంటసాల, ఎస్వీ రంగారావు, సావిత్రి, కన్నాంబ, రేలంగి, కాంచనమాల పుట్టిన ఊళ్ల అజ తెలుసుకోవాలి. సర్వేపల్లి, గిరి, నీలం తప్పదు. వేమూరి గగ్గయ్య, కొంగర జగ్గయ్య, డి.వి. సుబ్బారావు, స్థానం నరసింహారావుల పురిటి గడ్డలను మరిస్తే పాపం. ద్వారం, ఆదిభట్ల (కైలాసం మరియు నారాయణ దాసు), గురజాడ, వేమనల పక్షాన గుప్పెడేసి స్ఫూర్తి నింపాలి. త్యాగయ్య, అన్నమయ్య నడయాడిన చోటి పాదధూళి తక్షణం రావాలి. ఆదిశంకరుడు అవతరించిన కాలడి మృత్తిక తెచ్చారా? విశ్వనాథ, జాషువ, శ్రీశ్రీ, దేవులపల్లి వీరిని మరవద్దు. వివిధ రంగాల ప్రము ఖులని కనీసం అయిదు వేల మందిని గుర్తించి, వారి పుట్టిన మట్టిని తప్పక ఈ పునాదిలో వెయ్యాలి. ఇదే మన తక్షణ కర్తవ్యం. ఇన్ని లక్షల కోట్లతో ఈ మెగా నిర్మాణం సాధ్య మయ్యే పనేనా అని కొందరు నిరాశావాదులు పదే పదే సందేహిస్తున్నారు. కాని ఒక పాజి టివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లా లంటారు మన ముఖ్యమంత్రి. మా ఊరి జమిందారు కథ నన్నెప్పుడూ నూతనో త్సాహంతో ముంచెత్తుతూ ఉంటుంది. మనకి స్వాతంత్య్రం వచ్చిన కొన్నేళ్లకి రకర కాల కారణాలవల్ల జమిందారీలు హరించుకపోయాయి. మా ఊరి జమిందారుకి మాసిన తలపాగా, మీసాలు, వెలిసిన పూసల కోటు మాత్రం మిగిలాయి. వెల్లకి కూడా నోచుకోని లంకంత దివాణంలో బిక్కుబిక్కుమంటూ జమిందారొక్కడు ఉండేవాడు. బరువుగా రోజులు వెళ్లదీ స్తున్న తరుణంలో ఉన్నట్టుండి ఆయన దశ తిరిగింది. దివాణం పూర్వ వైభవం నింపుకోసాగింది. రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ నిజమేంటంటే- కాశీపతి ఊళ్లోకి వచ్చాడు. మా ఊరు వాడేగాని చిన్నప్పుడు కాశీకి వెళ్లి, అక్కడే చదు వుకుని, అక్కడే స్థిరపడ్డాడు. కాశీపతి వస్తూనే జమిం దార్ని పరామర్శించి, ఆయన దీనస్థితికి జాలిపడ్డాడు. ‘ఒకే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ అని కాశీపతి భరోసా ఇచ్చాడు. దృశ్యాన్ని కత్తిరిస్తే ఇద్దరూ మద్రాసు జార్జిటౌన్ సత్రంలో దిగారు. జమిందారు పరాకుగా మర్చిపోగా మిగిలిన మోకులాంటి బంగారు మొలతా డుని అమ్మి డబ్బు చేశారు. వచ్చేటప్పుడు కూడా తెచ్చిన ఒక తుప్పట్టిన తుపాకీ, రెండు వేట కత్తుల్ని అధిక వెలకు పాత సామాను కొనే పిచ్చాడికిచ్చి నగదు చేశారు. నాలుగు సత్తు కుండీలకు వెండి రాయించారు. ఇద్దరూ ఊళ్లోకి దిగా రు. దివాణానికి ఫేస్‌లిఫ్ట్ ఇచ్చారు. వెండి కుండీలలో మందార మొక్క లు నాటారు. ఒక్కసారి ఊరు నివ్వెర పోయింది. జమిందారు ఏదో బర్మా వ్యాజ్యం గెలిచాట్ట! ఎన్ని కోట్లో వస్తుందట! నూలు మిల్లు పెడ్తాట్ట. ఊరి వారందరికీ పనీపాటా ఇస్తాడంట! పుకార్ల మీద పుకార్లు. వెయ్యి పత్రికల పెట్టుగా కబుర్లు. కాశీపతి చెన్నపట్నంలో సంపెంగ నూనె సీసా కొని చ్చాడు. జమిందారు చాలా ఆనందపడ్డాడు. ఠీవి, దర్పం మళ్లీ మొలకెత్తాయి. ఇది వరకు తోకలు జాడించిన వారు దిగి వచ్చి శిస్తు పాత బకాయిలు చెల్లించారు. భయపడి జిరా యితీ భూముల్ని వదిలేశారు. కాశీపతి జాగ్రత్తగా కథ నడిపిస్తున్నాడు. కబుర్లన్నీ కోట్ల మీదే ఉంటున్నాయి. ‘ఇలా ఎన్నాళ్లు? నిజం తెలిస్తే..’ అన్నాడు జమిందారు. నందోరాజా భవిష్యతి. నిశ్చింతగా ఉండండన్నాడు కాశీ పతి. నీ రుణం తీర్చుకోలేనని పాదాల వంక చూశాడు జమిందారు. ఎంతమాట! నేను రుణపడ్డా. కాశీలో శవా లు మొయ్యడం కన్నా ఇది ఎంతో మెరుగు కదా అన్నాడు కాశీపతి. నాకు తెలిసి 50ఏళ్ల తరువాత కూడా నూలు మిల్లు ఖరారు కాలేదు. అయినా జనం శంకించలేదు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
లక్ష కోట్ల బడ్జెట్
-
లక్ష కోట్ల బడ్జెట్
నేడు అసెంబ్లీ ముందుకు తెలంగాణ తొలి పద్దు ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఈటెల వచ్చే నాలుగేళ్లకు పునాదిగా రూపకల్పన చెరువులు, వాటర్‌గ్రిడ్, సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట ప్రణాళిక వ్యయం రూ. 48,900 కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ. 51,600 కోట్లు పన్నుల రాబడి రూ. 35 వేల కోట్లుగా అంచనా టాస్క్‌ఫోర్స్ కమిటీల సిఫారసులు పరిగణనలోకి రాష్ట్ర ప్రభుత్వ పథకాల కుదింపు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి బడ్జెట్ రూపుదిద్దుకుంది. లక్ష కోట్లకుపైగా నిధులతో రూపొందిన భారీ బడ్జెట్ బుధవారం అసెంబ్లీలో ఆవిష్కృతంకానుంది. తెలంగాణ రాష్ర్టం సాకారమైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవే శపెడుతున్న ఈ తొలి బడ్జెట్లో రూ. 312 కోట్ల రెవెన్యూ మిగులునూ చూపెట్టే అవకాశముంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ర్ట విభజన జరిగిన జూన్ 2 నుంచి పది నెలల కాలానికే ఈ బడ్జెట్ వర్తిస్తుంది. ఇప్పటికే ఐదు నెలల వ్యయానికి గవర్నర్ ఆమోదం తీసుకున్న నేపథ్యంలో.. మరో ఐదు నెలల కోసమే నిధుల కేటాయింపులు జరుగుతాయి. ఈ స్వల్పకాలంలో పెద్దగా లక్ష్యాలను సాధించే అవకాశం లేకపోయినప్పటికీ వచ్చే నాలుగేళ్ల భవిష్యత్ కార్యాచరణకు ఈ బడ్జెట్టే పునాదికానుంది. రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో రంగాలవారీగా దక్కనున్న కేటాయింపులు, ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దంపట్టనుంది. ప్రభుత్వం సాధించాలనుకుంటున్న లక్ష్యాలకు అనుగుణంగానే తొలి బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని సమాచారం. చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్, సంక్షేమం, వ్యవసాయం, రహదారులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళితులకు భూ పంపిణీ తదితరాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. సొంత రాష్ర్టంలో సొంత ప్రభుత్వం రూపొందించిన తొలి బడ్జెట్‌పై రాష్ర్ట ప్రజలు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఉదయమే కేబినెట్ ఆమోదం రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఉదయం 11 గంటలకు శాసనసభలో, అదే సమయంలో డిప్యూటీ సీఎం రాజయ్య శాసన మండలిలో ప్రవేశపెట్టనున్నారు. అంతకు గంట ముందే మంత్రి మండలి అసెంబ్లీ కమిటీహాల్లో ప్రత్యేకంగా సమావేశమై బడ్టెట్‌ను లాంఛనంగా ఆమోదించనుంది. అనంతరం అసెంబ్లీలో ఆధునీకరించిన శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ వెంటనే శాసనసభ మొదలవుతుంది. బడ్జెట్ పరిమాణం దాదాపు రూ. 1,00,500 కోట్లుగా ఉంటుందని సమాచారం. ఇందులో ప్రణాళిక పద్దు కింద రూ. 48,900 కోట్లు, ప్రణాళికేతర పద్దుగా రూ. 51,600 కోట్లను కేటాయించనున్నట్లు సమాచారం. కాగా, నీటిపారుదల రంగానికి రూ. 6500 కోట్లు, వాటర్ గ్రిడ్‌కు రూ. 2000 కోట్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి కింద కోటిన్నర రూపాయల చొప్పున కేటాయించనున్నట్లు తెలిసింది. విద్యుత్ రంగానికి దాదాపు రూ. 4 వేల కోట్లకుపైగా కేటాయింపులు ఉంటాయని సమాచారం. కాగా, రాష్ట్ర సొంత పన్నుల రాబడులను రూ. 35 వేల కోట్లుగా అంచనా వేశారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు దాదాపు రూ. 13 వేల కోట్ల మేరకు రుణాలు మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లను కూడా వార్షిక ప్రణాళికలో చూపిస్తున్నారు. దీంతో వార్షిక ప్రణాళికా వ్యయం భారీగా ఉండనుంది. భవిష్యత్తుకు ఇదే పునాది.. ప్రస్తుతం ప్రవేశపెట్టే పథకాలే రాబోయే కాలంలోనూ కొనసాగుతాయి. ఈ పథకాలకు సంబంధించిన లక్ష్యాలు సాధించేలా ఆయా రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఈసారి చక్కదిద్దేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు అధికార వర్గాల కథనం. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని ముఖ్యమంత్రి ముందు నుంచీ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించిన పలు సమావేశాల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పలుమార్లు ప్రణాళిక వ్యయాన్ని పెంచుతూ వెళ్లారు. ఆదాయ వనరుల కంటే భారీ బడ్జెట్ రూపకల్పనపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెట్టింది. అనవసర పథకాలను కొనసాగించే కంటే, వాటిని ఇతర పథకాలతో అనుసంధానించడం లేదా తొలగించడం వంటి చర్యలను కూడా ఈసారి తీసుకున్నారు. ఇదివరకు రాష్ట్రంలో వెయ్యికంటే అధిక పథకాలు ఉండగా.. వాటిని ఇప్పుడు 750కి కుదించారు. ఈ ప్రక్రియను ఇకపైనా కొనసాగించి రానున్న కాలంలో మరిన్ని పథకాలను తగ్గించే దిశగా సర్కారు కసరత్తు చేయనుంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక కేంద్ర పథకాలను 250 నుంచి 66కు తగ్గించినట్లే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరిస్తున్నట్లు సమాచారం. సాంకేతికంగా పది నెలల బడ్జెట్ ప్రవేశపెడుతున్నా.. దీన్ని ఆ దృష్టితో కాకుండా మధ్యకాలిక వ్యయాల బడ్జెట్(మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ బడ్జెట్)గా పరిగణిస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. భవిష్యత్తులో పథకాలకు నిధుల కేటాయింపులు ఎలా ఉంటాయన్న దానికి ఈ బడ్జెట్ ద్వారా సంకేతాలు అందనున్నాయి. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ముఖ్యమంత్రి నియమించిన 14 టాస్క్‌ఫోర్స్ కమిటీల నివేదికలను ఆర్థిక సాంకేతిక సహకారంగా ఆర్థిక శాఖ వినియోగించుకుంది. ఐదేళ్ల వ్యవధిలో సాధించాల్సిన లక్ష్యాలపై ఈ బడ్జెట్లో కసరత్తు చేశారు. బడ్జెట్‌తో పాటే రాష్ట్ర ఆర్థిక సర్వేను కూడా ప్రభుత్వం సభకు సమర్పించనుంది. ఏటా 15-20 శాతం ఆర్థిక వృద్ధి తప్పనిసరి ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుకు ప్రస్తుతమున్న ఆదాయం ఏటా 15 నుంచి 20 శాతం వరకు పెరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే ప్రణాళికలను సిద్ధం చేశారు. ఆదాయం పెంచడానికి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన వనరుల సమీకరణ టాస్క్‌ఫోర్స్ కమిటీ చేసిన కీలక సూచనలు బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. ఆ కమిటీ చేసిన సిఫారసులు బడ్జెట్‌కు కీలకమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి ఆగస్టులో జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. తొలి బడ్జెట్ కోసం ప్రభుత్వం సుధీర్ఘ కసరత్తే చేసింది. ముందుగా మన ఊరు-మన ప్రణాళిక, టాస్క్‌ఫోర్స్ కమిటీల నివేదికలంటూ రెండున్నర నెలలపాటు కసరత్తు చేసింది. పనితీరు ఆధారిత బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెడుతున్నారు. అంచనాలకు, కేటాయింపులకు మధ్య వ్యత్యాసం పెద్దగా ఉండబోదని, బడ్జెట్ కేటాయింపుల తర్వాత ఆయా శాఖల పనితీరు కీలకం కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.