న్యూఢిల్లీ: సరుకు రవాణాకోసం పరిశుభ్రమైన, వ్యయాలను తగ్గించగలిగే ఇంధనాలను వినియోగించడం వల్ల భారత్.. 2020–2050 మధ్య కాలంలో లాజిస్టిక్స్ ఇంధనంపరంగా రూ. 311 లక్షల కోట్లు ఆదా చేసుకోగలదని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. అలాగే వచ్చే మూడు దశాబ్దాల్లో 10 గిగాటన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో సరుకు రవాణా వేగవంతం చేయడంలో పరిశుభ్రమైన ఇంధనాల వినియోగం అంశంపై రాకీ మౌంటెయిన్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఎంఐ)తో కలిసి నీతి ఆయోగ్ ఈ నివేదిక రూపొందించింది. ఉత్పత్తులు, సర్వీస్ లను డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో సరుకు రవాణాకు కూడా డిమాండ్ గణనీయంగా పెరగగలదని నివేదిక పేర్కొంది.
రైల్వే నెట్‌వర్క్‌నుపెంచుకోవడం, వేర్‌హౌసింగ్‌ను మెరుగుపర్చుకోవడం, విధానపరమైన సంస్కరణలు తీసుకోవడం, పరిశుభ్రమైన టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పైలట్ ప్రాజెక్టులు నిర్వహించడం, ఇంధన ఆదా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం తదితర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. వృద్ధి బాటలో ఉన్న భారత ఎకానమీకి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం సరుకు రవాణా కీలకంగా మారిందని, రవాణా వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతి ఆయోగ్ సలహాదారు (రవాణా, ఎలక్ట్రిక్ మొబిలిటీ) సుధేందు జె సిన్హా తెలిపారు. కేంద్రం నిర్దేశించుకున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా తదితర లక్ష్యాల సాకారానికి కూడా సమర్ధమంతమైన రవాణా విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు.
చదవండి: వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస
Comments
Please login to add a commentAdd a comment