
ఒక నూలు మిల్లు కథ
‘ఇలా ఎన్నాళ్లు? నిజం తెలిస్తే...’ అన్నాడు జమిందారు. నందోరాజా భవిష్యతి. నిశ్చింతగా ఉండండన్నాడు కాశీపతి. నీ రుణం తీర్చుకోలేనని పాదాల వంక చూశాడు జమిందారు.
అక్షర తూణీరం
‘ఇలా ఎన్నాళ్లు? నిజం తెలిస్తే...’ అన్నాడు జమిందారు. నందోరాజా భవిష్యతి. నిశ్చింతగా ఉండండన్నాడు కాశీపతి. నీ రుణం తీర్చుకోలేనని పాదాల వంక చూశాడు జమిందారు.
కుందేలు సింహానికి ఎదురు తిరుగుతుంది. ఒకచోట మేక పులిపై తిరగబడుతుంది. రాజ గురువులు అలాంటి పోతుగడ్డ లను గుర్తించేవారు. అక్కడ కోటలను కట్టేవారు. చరిత్రలో మన కోటలన్నింటికీ ఇలాంటి స్థల పురాణాలే ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్టికి అమరావతి పుణ్యమా అని పురాణ యుగంలోకి వెళ్లిపోయాం. జీవితమే సఫలమూ.. అని కొందరు, దొరకునా ఇటువంటి సేవ.. అనుకుంటూ మరికొందరు, తమ తమ హోదాల్లో రాజధాని నిర్మాణానికి రాళ్లెత్తుతున్నారు. కొందరు నేనుసైతం ఒక రాయి వేశానంటూ ఈ శతాబ్దపు మహా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. పుట్టమట్టిని, పొలం మట్టిని వేదోక్తంగా సేకరించి తెచ్చి అమరావతి పీఠానికి అమర త్వం సిద్ధింపచేస్తున్నారు. చాలదు, ఇంకా రకరకాల మట్టి నమూనాలు రావాలి. పోరుబందరు నుంచి దోసెడు మట్టి తేవాలి. శాంతి సహనాలను నిక్షిప్తం చేయాలి.
పుచ్చలపల్లి, ప్రకాశం, ఎన్.జి. రంగా పుట్టిన ఊళ్లలో మట్టి సేకరణ జరగాలి. ఘంటసాల, ఎస్వీ రంగారావు, సావిత్రి, కన్నాంబ, రేలంగి, కాంచనమాల పుట్టిన ఊళ్ల అజ తెలుసుకోవాలి. సర్వేపల్లి, గిరి, నీలం తప్పదు. వేమూరి గగ్గయ్య, కొంగర జగ్గయ్య, డి.వి. సుబ్బారావు, స్థానం నరసింహారావుల పురిటి గడ్డలను మరిస్తే పాపం. ద్వారం, ఆదిభట్ల (కైలాసం మరియు నారాయణ దాసు), గురజాడ, వేమనల పక్షాన గుప్పెడేసి స్ఫూర్తి నింపాలి. త్యాగయ్య, అన్నమయ్య నడయాడిన చోటి పాదధూళి తక్షణం రావాలి. ఆదిశంకరుడు అవతరించిన కాలడి మృత్తిక తెచ్చారా? విశ్వనాథ, జాషువ, శ్రీశ్రీ, దేవులపల్లి వీరిని మరవద్దు. వివిధ రంగాల ప్రము ఖులని కనీసం అయిదు వేల మందిని గుర్తించి, వారి పుట్టిన మట్టిని తప్పక ఈ పునాదిలో వెయ్యాలి. ఇదే మన తక్షణ కర్తవ్యం.
ఇన్ని లక్షల కోట్లతో ఈ మెగా నిర్మాణం సాధ్య మయ్యే పనేనా అని కొందరు నిరాశావాదులు పదే పదే సందేహిస్తున్నారు. కాని ఒక పాజి టివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లా లంటారు మన ముఖ్యమంత్రి. మా ఊరి జమిందారు కథ నన్నెప్పుడూ నూతనో త్సాహంతో ముంచెత్తుతూ ఉంటుంది. మనకి స్వాతంత్య్రం వచ్చిన కొన్నేళ్లకి రకర కాల కారణాలవల్ల జమిందారీలు హరించుకపోయాయి. మా ఊరి జమిందారుకి మాసిన తలపాగా, మీసాలు, వెలిసిన పూసల కోటు మాత్రం మిగిలాయి. వెల్లకి కూడా నోచుకోని లంకంత దివాణంలో బిక్కుబిక్కుమంటూ జమిందారొక్కడు ఉండేవాడు. బరువుగా రోజులు వెళ్లదీ స్తున్న తరుణంలో ఉన్నట్టుండి ఆయన దశ తిరిగింది. దివాణం పూర్వ వైభవం నింపుకోసాగింది. రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి.
ఇంతకీ నిజమేంటంటే- కాశీపతి ఊళ్లోకి వచ్చాడు. మా ఊరు వాడేగాని చిన్నప్పుడు కాశీకి వెళ్లి, అక్కడే చదు వుకుని, అక్కడే స్థిరపడ్డాడు. కాశీపతి వస్తూనే జమిం దార్‌ని పరామర్శించి, ఆయన దీనస్థితికి జాలిపడ్డాడు. ‘ఒకే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ అని కాశీపతి భరోసా ఇచ్చాడు. దృశ్యాన్ని కత్తిరిస్తే ఇద్దరూ మద్రాసు జార్జిటౌన్ సత్రంలో దిగారు. జమిందారు పరాకుగా మర్చిపోగా మిగిలిన మోకులాంటి బంగారు మొలతా డుని అమ్మి డబ్బు చేశారు. వచ్చేటప్పుడు కూడా తెచ్చిన ఒక తుప్పట్టిన తుపాకీ, రెండు వేట కత్తుల్ని అధిక వెలకు పాత సామాను కొనే పిచ్చాడికిచ్చి నగదు చేశారు. నాలుగు సత్తు కుండీలకు వెండి రాయించారు. ఇద్దరూ ఊళ్లోకి దిగా రు. దివాణానికి ఫేస్‌లిఫ్ట్ ఇచ్చారు. వెండి కుండీలలో మందార మొక్క లు నాటారు. ఒక్కసారి ఊరు నివ్వెర పోయింది.
జమిందారు ఏదో బర్మా వ్యాజ్యం గెలిచాట్ట! ఎన్ని కోట్లో వస్తుందట! నూలు మిల్లు పెడ్తాట్ట. ఊరి వారందరికీ పనీపాటా ఇస్తాడంట! పుకార్ల మీద పుకార్లు. వెయ్యి పత్రికల పెట్టుగా కబుర్లు. కాశీపతి చెన్నపట్నంలో సంపెంగ నూనె సీసా కొని చ్చాడు. జమిందారు చాలా ఆనందపడ్డాడు. ఠీవి, దర్పం మళ్లీ మొలకెత్తాయి. ఇది వరకు తోకలు జాడించిన వారు దిగి వచ్చి శిస్తు పాత బకాయిలు చెల్లించారు. భయపడి జిరా యితీ భూముల్ని వదిలేశారు. కాశీపతి జాగ్రత్తగా కథ నడిపిస్తున్నాడు.
కబుర్లన్నీ కోట్ల మీదే ఉంటున్నాయి. ‘ఇలా ఎన్నాళ్లు? నిజం తెలిస్తే..’ అన్నాడు జమిందారు. నందోరాజా భవిష్యతి. నిశ్చింతగా ఉండండన్నాడు కాశీ పతి. నీ రుణం తీర్చుకోలేనని పాదాల వంక చూశాడు జమిందారు. ఎంతమాట! నేను రుణపడ్డా. కాశీలో శవా లు మొయ్యడం కన్నా ఇది ఎంతో మెరుగు కదా అన్నాడు కాశీపతి. నాకు తెలిసి 50ఏళ్ల తరువాత కూడా నూలు మిల్లు ఖరారు కాలేదు. అయినా జనం శంకించలేదు.
శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)