Sri Ramana
-
హాస్యం... సెంటిమెంట్ కలిస్తే... అది శ్రీరమణ!
శ్రీరమణ పేరు చెప్పగానే చాలాకాలం పాటు ఆయన హాస్యం, వ్యంగ్యం గుర్తుకు వచ్చేవి. హాస్యానికీ, వ్యంగ్యా నికీ చిరునామాగా ఆయన పేరే వినబడేదంటే అతిశ యోక్తి కాదు. తర్వాత సినీ రచయితగా, బాపు–రమ ణల అంతే వాసిగా ప్రసిద్ధు లయ్యారు. ‘బంగారు మురుగు’ కథ తర్వాత నుంచి ఆయనకు గొప్ప కథకుడిగా పేరు వచ్చింది. హాస్యమూ, వ్యంగ్యమూ మాత్రమే కాదు, సెంటిమెంటు కూడా అంతే గొప్పగా పండించ గలడన్న సంగతి పాఠక లోకానికి విదితమైంది. ఇక ‘మిథునం’తో ఆయన ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఏ వృద్ధ దంపతులను చూసినా ‘మిథునం’ గుర్తుకు వచ్చేటంతగా ఆయన పాఠకుల హదయాలపై ముద్ర వేసేశారు. ముసిముసి నవ్వులు పూయించే వికటకవే కాదు, గుండెను తట్టి మనసు పొరల్లో తడి స్రవింపచేసే కవీ తనలో ఉన్నాడని నిరూపించుకున్నారు. హాస్య ప్రక్రియల్లో అన్నిటికన్న క్లిష్టమైనది ప్యారడీ రచన. దానికి ఎంతో అధ్యయనం, పరిశీలన కావాలి. రచయిత రచనాశైలిలో ఉన్న ప్రత్యేకత ఏమిటో పట్టుకోగలగాలి. దాన్ని తరచుగా వాడడాన్ని గమనించి, దాన్ని ఎత్తి చూపితే నవ్వు పుట్టించే అవకాశం ఉందని గ్రహించాలి. దాన్ని ఉత్ప్రేక్షించి, ఆ అవకరాన్ని సామాన్య పాఠకుడి దృష్టికి తీసుకుని రాగల రచనాకౌశలం ఉండాలి. శ్రీరమణ ఆధునిక వచన రచయితలలో ప్రముఖులందరినీ ప్యారడీ చేశారు. వచనాన్ని ప్యారడీ చేయటం అంత సులభం కాదు. వారి మూలరచనలు చదివినవారికే ఆ ప్యార డీలలో స్వారస్యం బోధపడుతుంది. శ్రీరమణ ఆ సాహిత్యాలన్నీ చదివి ఒంటపట్టించుకున్న పండి తుడు, నిశిత పరిశీలన Výæల విమర్శకుడు, దానిలో వక్రతను పసిగట్ట గలిగిన రసజ్ఞుడు. వారిలో యింకో విశేష మేమిటంటే, ఈయన చేత చురకలు వేయించుకున్న వారు కూడా పగలబడి నవ్వేటంత సంస్కార యుతంగా రాయగలగడం! పాత్రికేయ ఉద్యోగానికే పరిమితమైతే ఆయన ఒక పరిధిని దాటలేక పోయే వారేమో! కానీ ఆయన మద్రాసు వెళ్లారు. బాపు – రమణలతో చేరారు. వారి సమస్త వ్యవహారాలూ ఈయన చూసే వారు. వారు సొంతానికైతీసిన సినిమాలలో, ఇతరులకు తీసి పెట్టిన సినిమాలలో ఈయన అనేక బాధ్యతలు నిర్వర్తించేవారు. వాళ్లు వెళ్లిన చోటకల్లా వెళుతూ వారిలో ఒకడిగా ఉన్నారు. దీని కారణంగా ఆయనకు ఎంతో విస్తృత ప్రపంచం దర్శనమైంది. ‘బంగారు మురుగు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించ బడినప్పుడు సంచలనాన్ని సృష్టించింది. దాదాపు 800 ఉత్తరాలు వచ్చాయట. ఇది మా బామ్మ కథే అని ఒకరు, కాదు కాదు... మా అమ్మమ్మ కథ అని మరొకరు... ఇలా అందరూ తమని తాము ఐడెంటిఫై చేసేసుకున్నారు. ‘మిథునం’ వెలువడే టప్పటికి అందరూ వారిలో తమ తలిదండ్రులను ఐడెంటిఫై చేసుకున్నారు. శ్రీరమణ పాత్రలు మన నిత్యజీవితంలో చూసేవే. షోడా నాయుడు, ధన లక్ష్మి... వీళ్లందరూ మన చుట్టూ ఉన్నవాళ్లే! ‘ధనలక్ష్మి’ కథలో ఆయన వ్రాసిన మాండలిక పదాలు, తెలుగు పలుకుబడులు, తెలుగువారికి దొరికే అరుదైన మృష్టాన్న భోజనం. కొన్ని వర్ణనలు క్రొంగొత్తగా అనిపించి అలరిస్తాయి. ఉదాహరణకు: ‘‘రోషం కమ్మేసిన అతని మొకం తుమ్మల్లో పొద్దుగూకి నట్లుంది.’’ ‘‘...చీమలకు చక్కెర దొర గ్గాలేంది, మనుషులం మనకు నాలుగు మెతుకులు దొరకవా...’’ ‘‘...పిండిమర మెళుకువలన్నీ ఇప్పుడు ధన మ్మకు కొట్టినపిండి...’’ ఇలాంటి చమక్కులెన్నో వారి రచనల్లో కనిపి స్తాయి. శ్రీరమణకు మొహమాటాలు తక్కువ, తెగువ ఎక్కువ. మతం పేరుతో చేసే అట్టహాసాలను వెక్కి రించడంలో దిట్ట. ఆచార వ్యవహారాల కంటె మాన వత్వానికే పెద్దపీట వేసే ‘బంగారు మురుగు’లో బామ్మ స్వాములారిని కడిగి పారేస్తూంటే మనకు లోపల్నుంచి సంతోషం తన్నుకు వస్తుంది. అలాగే ‘అరటిపువ్వు స్వాములా’రి పాత్ర ద్వారా కుహనా ప్రవచనకారులకు చాకిరేవు పెట్టేశారు. వారపత్రికా సంపాదకుడిగా ఆయన రాజకీయ నాయకుల గురించి కూడా నిర్భయంగా తూర్పార బట్టారు. నిజజీవితంలో కూడా ఆయన వ్యాఖ్యల్లో వెక్కిరింత, మాటల్లో వగరు మనల్ని తాకుతూనే ఉంటాయి. కానీ ఆయన విమర్శలో ఉన్న వాస్తవం మనల్ని ఆకట్టుకుంటుంది. నాకు బాపు–రమణలు అత్యంత ఆప్తులు. వారికి నేను వీరాభిమానిని. శ్రీరమణతో నాకు ఉన్నది పరిమిత పరిచయమే. కానీ వారి రచనలు చాలా ఇష్టంగా చదువుతాను. వారి రచనల ద్వారా, వారిలో ఉన్న హాస్యాన్ని పండించే శైలి ద్వారా సెంటిమెంట్ వ్రాయడంలో వారికున్న ప్రతిభ ద్వారా నాకు బాగా నచ్చిన, బాగా ఇష్టపడిన రచయితగా నా మనః పథంలో శాశ్వతంగా ఉండిపోతారు. అంతేకాకుండా నా ఆప్తమిత్రులు బాపు–రమణలకు అంతేవాసిగా కూడా నేను వారిని బాగా ఇష్టపడతాను. కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, వ్యాసకర్త వ్యవస్థాపక ఛైర్మన్,శాంతా బయోటెక్నిక్స్ -
ప్రముఖ రచయిత శ్రీరమణ కన్నుమూత
మణికొండ: ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాసరచయిత, సినిమాగా వచ్చిన మిథునం కథా రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్రీరమణ (71) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ ఫ్లోటిల్లా గెటెడ్ కమ్యూనిటీలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య జానకి, ఇద్దరు కుమారులు చైత్ర, వంశీకృష్ణ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.1952 సెపె్టంబర్ 21న ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో అనసూయ, సుబ్బారావు దంపతులకు జని్మంచిన శ్రీరమణ అసలుపేరు కామరాజ రామారావు. కానీ ఆయన రచయిత శ్రీరమణగానే అందరికీసుపరిచితం.ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రాసిన కథలు మానవత్వం, విలువలతో కూడి ఉంటాయని జగన్ గుర్తుచేసుకున్నారు. -
నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? ..ఒక్కసారిగా గిర్రున కన్నీళ్లు..
నేను పదవతరగతిలో ఉన్నప్పుడో, ఇంటర్ మీడియట్ లో ఉన్నప్పుడో సరిగా గుర్తు లేదు కానీ ఆంధ్రజ్యోతి లో ఓక పుస్తక ప్రకటన వచ్చింది . నవోదయ పబ్లిషర్స్ వారిది. "శ్రీ రమణ రంగుల రాట్నం. చమత్కారాలు, మిరియాలు, అల్లం బెల్లం, మురబ్బాలూ" అని. అప్పటికి నాకు శ్రీరమణ ఎవరో తెలీదు. ముళ్ళపూడి వెంకట రమణే శ్రీరమణ అని అనుకునేవాడిని. నాకు బాపుగారు తెలుసు. బాపు గారు ఏ రమణకి బొమ్మవేసినా ఆ రమణ శ్రీముళ్ళపూడి రమణే అయి ఉంటారని ఒక లెక్క తెలుసు. నాకు ఆ పత్రికా ప్రకటనలోని అల్లం బెల్లం మురబ్బాలు కావాలి అనిపించింది. మా రఘుగాడి ధన సహకారంతో అనుకుంటా ఆ పుస్తకాన్ని పోస్ట్ లో తెప్పించుకున్నాను. అట్ట పైన, అట్ట లోపలా అంతటా ఎంత బావుంటుందో ఆ పుస్తకం. రమణ గారి రాతల చమత్కారం, బాపు గారి బొమ్మల మహధ్భాగ్యం. రీచర్చీ కాలర్లు, చేయి జారిన అదృష్టరేఖలు, కథలూ-కజ్జికాయలు, మెంతికూర చింతామణి, ఉత్తరగ్రహణం, మూడు ప్రింట్లు ఆరు ఆటలూ, విద్యాలయాల్లో పిడకల వేట, కిటికీ పక్క సీటు, పొట్టలో చుక్క, కార్తీకంలో కవిత్వ సమారాధన, గళ్ళ నుడికట్టు చీర ఇట్లా ఒకటా రెండా ఎన్నెన్నో శీర్షికల మకుటాలతో ఆ వ్యాసాలు చక్కిలిగింతల హాస్యాలు పలికాయి. మొన్నటికి మొన్న ఒకానొక రచయిత్రి గురించి అనుకుంటూ " ఈ రచయిత్రి పెట్టే చివరి సిరాచుక్క అంధ్ర సరస్వతి నొసట కస్తూరి చుక్క" అని ఎప్పుడు అవుతుందో కదా దేముడూ అని శ్రీరమణ భాషలో దండం పెట్టుకున్నా కూడా . పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో కొనుక్కున్న, చదువుకున్న శ్రీరమణ గారిని ఈ రోజుకూ చదువుకోవడం, వాటిని గుర్తుగా తలుచుకోవడం అనేది మన గొప్ప కాదు. శ్రీరమణ గారే అన్నట్టు "గింజకు జీవశక్తి ఉంటే అది ఎక్కడ పడేసినా పోదు" తెలుగు పాఠకుడికి బుర్ర ఉన్నంత కాలం అందులో జీవశక్తి ఉన్న గింజలు మాత్రమే బ్రతికి ఉంటాయి. శ్రీరమణ గారి నుడి ,ఆయన పలుకు అటువంటిది. అది పురాజన్మలో శ్రీ మహావిష్ణువు చేతి బంగారు మురుగు. కలం రూపం ధరించి, రమణ అనే కలం పేరు దాల్చి కొంతకాలం ఇక్కడికి వచ్చింది. ఈ రోజు అది వెనక్కి మరలి శ్రీహరి చేతినే చేరింది. నా ఇంటర్ మీడియట్ రోజులు, చదువు దినాలు గడిచి, అలా అలా నడిచి ఒకచోట వచ్చి నిలబడ్దాను. ఇదిగో ఇప్పుడు నేనున్న నా ఇంటి నుంచి రెండో మలుపు దగ్గర సరాసరి కాస్త డౌన్ దిగితే శ్రీరమణ గారి ఇల్లు. వారానికి రెండు మూడు సార్లు ఆయన్ని కలిసి బోలెడన్ని కబుర్లు గడిచేవి. ఫోన్ లో కాలక్షేపాలు నడిచేవి. వారి ఇంటికి వెళితే శ్రీమతి జానకి గారి కాఫీ ఆతిథ్యాలు. మా ఆవిడ ఎప్పుడయినా ఏదయినా పనిమీద ఊరికి వెడితే మొహమాటపడకుండా తమ ఇంటికి వచ్చి భోజనం చెయ్యమనేవారు. నేను ఓ యెస్, తప్పకుండా వస్తా అనేవాడ్ని, రాకుండా అలానే మొహమాటపడేవాడ్ని. కాస్త సాహిత్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఇంటికి వస్తే వారిని పిలుచుకుని మా మేనమామ గారి ఇంటికి వెళ్ళినంత చనువైన దర్జాతో ఆయన ఇంటికి తీసుకు వెళ్ళి కబుర్లు పెట్టించేవాడిని. ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. నా పుట్టినరోజు పండగ నాడు ఉదయాన్నే ఆయన కాళ్లకు దండం పెట్టుకుని వారి ఆశీస్సులు తీసుకునేవాడిని. నా తొలి పుస్తకం రాగానే దగ్గరి వారని, పెద్ద దిక్కని, ఆయన వద్దకు వెళ్ళి పుస్తకాన్ని అందించాను. ఆయన ఆ పుస్తకం సలక్షణీయతను ముచ్చటగా రెపరెపలాడించి, నా భుజం మీద చేయి వేసి బాపు గారు ఈ రోజు ఉండి, ఈ పుస్తకం చూసి ఉంటే ఎంత పొంగిపోయి ఉండేవారో తెలుసా? అని నా కళ్ళలో చిన్న తడిని తెప్పించారు. తెల్లవారుఝామున వాకింగ్ కని నాలుగు గంటలకు లేచి నడుస్తూ అక్కడ మలుపు తిరుగుతానా, నా కళ్ళు శ్రీరమణ గారి ఇంటి గేటుకు అంటుకు పోయి ఉంటాయి. ఎన్నిసార్లు బిగుతైన ఆ గేటు కిర్రుకిర్రులని పలకరించి ఉంటాను? ఆ ఇంట్లో ఒక కుక్క ఉండేది అది ఎవరు వచ్చినా తెగ అరుస్తూ గోల చేసేది. గత రెండు, రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కరోనా రోజుల్లో రమణ గారు వారి పెద్దబ్బాయి ఇంటికి వెళ్ళిపోయారు. నేను రోజూ ఉదయపు నడకలో ఆ ఇంటివైపు చూస్తాను. రమణ గారు వచ్చి ఉంటారేమోనని ఆశ. కలిసి బోల్డని కబుర్లు చెప్పుకోవచ్చని కోరిక. ఆయన ఆరోగ్యం చాలా కాలంగా బావుండటం లేదని కబురు తెలుసు నాకు.అయినా ఆయన దగ్గరికి వెళ్లలేక పోయా. ఎప్పుడు కలిసినా కూర్చుని మాట్లాడే ఆయనని మంచం మీద చూడ్డం నాకు ఇష్టం లేకుండా ఉండింది. రమణగారు నాతో ఒక పుస్తకం గురించి చెప్పేవారు దాని శీర్షిక " సింహాల మధ్య నేను" అని గొప్పగొప్ప వారి మధ్య గడిపిన ఒక వ్యక్తి జ్ఞాపకాల సమాహారం ఆ పుస్తకం. అట్లాంటి పుస్తకం నేను ఒకటి వ్రాస్తానండి. ఎంత గొప్పవారి మధ్య గడిపాననుకున్నారు నేను అని చెప్పుకుని పొంగిపోయేవారు ఆయన. శ్రీరమణ గారూ, నేనూ మీ వంటి ఒక సింహం సాన్నిహిత్యంలో గడిపాను సర్. మిమ్మల్ని గుహలో చూడటమే నాకు తెలుసు. మంచం మీద దుప్పటి కప్పుకున్న సింహన్ని ఈ కళ్ళతో చూడలేక పోయాను సర్. అందుకే ప్రతి రోజూ మీరు తిరిగి వచ్చే రోజుకోసం మీ ఇంటివైపు చూపులను అట్టిపెట్టేవాడ్ని. నేను చిన్నతనం రోజులనుంచి చదువుకున్న శ్రీరమణ గారిని 2002 ఆ ప్రాంతాల్లో ఆంధ్రజ్యోతిలో మొదటిసారిగా కలిసాను. మునుపు కాలంలో మూతపడ్డ ఆంధ్రజ్యోతిని అప్పుడు కొత్తగా మళ్ళీ మొదలెట్టారు. నాకు ఆ పత్రికలో శ్రీ రమణగారు ఉద్యోగం చేస్తూ ఉన్నారని తెలీదు. నేను కార్టూనిస్ట్ శంకర్ ని కలవడానికి అక్కడికి వెళ్ళాను. శంకర్ కూచునే దగ్గరలోనే రమణగారి సీటు. నేను ఆయన్ని చూస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళి "మీరెవరో నాకు బాగా తెలుసు అనిపిస్తుంది. కాని తెలీదు, మీరు ఎవరు సార్" అని అడిగా. ఆయన నవ్వుతూ ఆయన ఎవరో చెప్పారు. నేను థ్రిల్ అయిపోయా, ఈయనేనా నా బాల్య స్నేహితుడు. ఈయన రచనలనేగా నవ్వులు నవ్వులుగా చదువుకున్నది . ఈ రోజు కళ్ళ ఎదురుగా నా ముందు ... ఆ రోజు కలిసిన మహూర్త బలం గొప్పది. ఇక ప్రతి రోజూ ఆయన్ని కలిసేవాడిని. అప్పుడు నా ఉద్యోగం ఆంధ్రప్రభలో పతంజలి గారితో, ఉదయం పూట ఆయనతో ఎన్నెన్ని కబుర్లు నవ్వులు గోల. సాయంత్రం కాగానే శ్రీరమణ గారి తో ముచట్లు. ఎట్లాంటి రోజులవి. ఎంత బంగారు సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అవి ! వెలిగిన రోజులవి. ఒక సాయంత్రం శ్రీరమణ గారి కలిస్తే నవ్వుతూ అన్నారు కదా" మీ గురువు గారిని కాస్త మమ్మల్ని క్షమించి దయ చూడమనవచ్చు కదా మీరు" "ఏమీ సర్? ఏవయ్యింది," "నేనిలా అన్నానని మీరు ఆయనతో చెప్పండి చాలు" నేను మరుసటి రోజు పతంజలి గారిని కలిసి శ్రీరమణ గారు ఇలా అన్నారు, ఏమిటి సర్ విషయం అని అడిగా. "నిన్న ఒక ఎడిటోరియల్ వ్రాసాను మిత్రమా" అన్నారు పతంజలి గారు. అది తెచ్చుకుని చదివా. నాకు గుర్తున్నంతరకు దానిపేరు "ఒక చిరునవ్వు, ఒక వెక్కిరింత, ఒక లేమి" అటువంటి ఒక సాహితీ చురక వ్రాయలన్నా, దానిని పుచ్చుకుని సిగ మల్లెగా దరించాలన్నా, సరస్వతీ దేవి అద్దంలో తనను చూసుకుంటూ వ్వే వ్వే వ్వే అనుకొడమే. లేరిక అటువంటి సాహితీవేత్తలు. రారిక ఆ మత్తేభాలు, శార్దూలాలూ. బాపు రమణల గురించి కానీ , ఆ కాలం సాహితీ జనం గురించి కాని, ఎన్ని కబుర్లు, ఎన్ని విశేషాలు ఆయన దగ్గర ఉండేవో! ఫలానా కథ గురించి చెప్పాలన్నా, ఫలానా సాహితీ విశేషం గురించి ముచ్చటించాలన్నా, ఆనాటి సినిమా తెర వెనుక ముచట్ల వంటి అల్లం మురబ్బా ఘాటు నుండి శార్వరి నుండి శార్వరి దాక ఎన్ని విశేషాల లోతుల్లోకి మునకలు వేయించేవారో! శార్వరి నుండి అంటే నాకు గుర్తుకు వచ్చింది , రమణగారు మీరు నాకు విశ్వనాథ వారి నవల సెట్టు బాకి ఉన్నారు. మాట దక్కించుకోకుండా ఎలా వెల్లిపోయారు మీరు? మా ఇద్దరికి ఉన్న మరో పిచ్చి స్టేషనరీ. రంగు రంగు కాగితాలు పెన్నులు పెన్సిల్లు, క్లిప్పులు. తాను మదరాసు లో ఉన్నప్పుడు కొన్న సరంజామా గురించి చక్కగా వినిపించేవారు. ఆయనకు గుర్తు వచ్చినప్పుడల్లా నా పైలట్ ఎలాబో పెన్నును అడిగి తీసుకుని దాన్ని అలా ఇలా తిప్పి చూసేవారు. జాగ్రత్తగా ఉంచుకొండి దీన్ని, చాలా ఖరీదైన పెన్ను కదా ఇలా చొక్కా జేబుకు తగిలించుకు తిరగవద్దు, అని హెచ్చరించేవారు. పదేళ్ల క్రితమే దాని ధర పన్నెండు వేల రూపాయలు. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ. అన్నం పెట్టే విద్యకు సంబంధించిన టూల్స్ ని ఇలా భక్తి గా కొనుక్కునే నా గుణం పై ఆయనకు చాలా మక్కువగా అనిపించేది. మేము చివరిసారిగా కలవడానికి ముందు ఇంటికి పిలిచి ఒక మంచి తోలు బ్యాగు కానుకగా ఇచ్చారు. ’"నాకు దీని క్వాలిటీ బాగా నచ్చిందండి, రెండు తీసుకున్నా. నాకొకటి, మీకొకటి. ఇప్పుడు అవన్నీ తలుచుకున్న కొద్ది బాధగా ఉంటుంది. మనమేం పుణ్యం పెట్టి పుట్టాం ఇంత అభిమానం, ప్రేమ పొందడానికి. నేను స్కూటర్ కొన్న కొత్తలో కార్టూనిస్ట్ జయదేవ్ గారూ, నేనూ ఒక పత్రికలో కలిసి పని చేసేవాళ్లం. నాకు ఆయన్ని స్కూటర్ మీద ఎక్కించుకుని తిరగాలని చాలా కోరిగ్గా ఉండేది. ఆయనకు నా డ్రయివింగ్ మీద అపనమ్మకం కాబోలు. ఎపుడు రమ్మన్నా, మీరు పదండి అన్వర్, నేను మీ వెనుకే నడుచుకుంటూ వస్తా గా అని నవ్వేవాడు. నేను కారు కొనబోతున్న కొత్తలో కార్ల గురించి శ్రీరమణ కబుర్లు పెట్టేవాణ్ణి. ఆయనా చాలా విషయాలు చెప్పేవారు కార్ల గురించి , బెజవాడలో నవత డ్రయివింగ్ స్కూలు వారి గురించి, వారితో స్నేహం, బాపు గారు వ్రాసి ఇచ్చిన లోగో గురించి. సర్, నేను కారు కొన్నాకా నా కారు ఎక్కుతారా మనం కలిసి తిరుగుదామా అనేవాడ్ని, తప్పకుండా అండి అని ఆయనా భరోసా ఇచ్చారు. కానీ మేము ఇద్దరమూ వేరే కార్లు ఎక్కి తిరిగాము కానీ, మా కారు మాత్రం ఎక్కి తిరగలా. అది ఎందుకో కుదరలా. ఒకసారి ఒక ప్రయాణం ప్రపోజల్ పెట్టారు. ఏవండీ ఓడ ఎక్కి శ్రీలంక వెళ్లి వద్దామా? ప్రయాణం భలే బావుంటుంది. మీరు వస్తాను అంటే మీకు కూడా టికెట్ బుక్ చేపిస్తా అన్నారు . అయితే ఓడ కన్నా ముందే కరోనా వచ్చింది. ప్రయాణం మునకేసింది.ఆయన హాస్యమూ, చురకా రెండూ పదునైనవి దానికి ఎటువంటి మినహాయింపులు ఉండేవి కావు. ఫలానా ఆయన ఈయనకు బాగా దగ్గరివారు అనుకుంటామా ,ఆ దగ్గరి వారిపైన అయినా ఒక చురక వేయవలసి వస్తే వేయడమే కానీ మన పర అని ఏమి ఉండేవి కావు. బాపు గారి దగ్గర ఉండి ఉండి రమణ గారికి కూడా బొమ్మల లోతుపాతులు కొంతమేరకు తెలుసు . పిచ్చి బొమ్మ, వంకర, బొమ్మ, బొమ్మ తక్కువ బొమ్మ, మేధావి బొమ్మ ల మీద ఆయనకు బాగా చిన్న చూపు. ఇదంతా దొంగ బొమ్మల సంగతి. అలా అని ఆయనతో పికాసో గురించో, లక్ష్మాగౌడ్ గురించో, తోట వైకుంఠం గురించో మాట్లాడి చూడండి. పులకించి పోతూ చెబుతారు. ఒకసారి ఒక పత్రికాఫీసులో మేమిద్దరం కబుర్లు చెబుతూ కూచున్నామా, స్కానింగ్ డిపార్ట్మెంట్ నుండో , ఆర్ట్ డిపార్ట్మెంట్ నుండో ఒకాయన వచ్చి "సర్ ఆర్టిస్ట్ బొమ్మ వేసి ఇంటికి వెల్లిపోయారు, అయితే బొమ్మ ఏది పై భాగమో, ఏది కింది భాగమో అర్థం అవడం లేదు. మీరు కాస్త చెప్పండి అన్నారు. ఆయన ఆ బొమ్మని ఎత్తి పట్టుకుని " ఈ బొమ్మని ఇలాగే ఎడిట్ పేజీలో ఆర్టికల్ కి ఉపయోగించుకోండి, ఇదే బొమ్మని కుడివైపుకు తిప్పి ఎడిట్ పేజిలోనే ఆ చివర ఒక కవిత వస్తుంది కదా, దానికి వాడుకోండి. బొమ్మని ఎడమ వైపుకు తిప్పి పెట్టుకుని ఆదివారం అనుబంధంలో కథకు ఇలస్ట్రేషన్ గా పెట్టుకోండి. ఇక ఈ రోజు మన కార్టూనిస్ట్ రాకపోతే ఆ కార్టూన్ ప్లేస్ లో ఈ బొమ్మని తలకిందులు చేసి పెట్టుకుంటే సరిపోతుంది" మొహంలో కోపం, విసుగు, చిరాకు ఏమీ లేకుండా ఆయన అలా కూల్ గా చెబుతుంటే , మనం పేపరాఫీసు పైకప్పు ఎగిరి పోయేలా నవ్వుతూ ఉంటే ఏం మర్యాద? రమణ గారు ఒక రచయితకు ముందు మాట వ్రాస్తూ ఇలా అన్నారు" మనం ఒక పుస్తకం అచ్చుకి ఇస్తున్నాము అంటే దాని అర్థం , ఒక వెదురు పొదను సమూలంగా నాశనం చేస్తున్నామని . ఒక వెదురు పొద పచ్చగా బ్రతకాలా? లేదా మీ పుస్తకం బయటికి రావాలా అనేది మీ విజ్ఞత కే వదిలేస్తున్నా.చెప్పాగా, ఆయనకు నేనంటే వాత్సల్యం ఉండేది. లక్షల రూపాయల పనులని ఆయన నాకు ఇప్పించారు. ఆయన వ్రాసిన ఒక పుస్తకానికి నేను బొమ్మలు వేసి ఋణం కొద్దిగా మాత్రమే తీర్చుకున్నాను. ఆయన వెంకట సత్య స్టాలిన్ పుస్తకానికి బొమ్మలు వేద్దామని నాకు చాలా కోరిగ్గా ఉండేది. శ్రీరమణ గారికి ఉన్న అభిమానుల్లో ఒక పెద్ద అభిమాని చిత్రకారులు శ్రీ మోహన్ గారు. ముచ్చట పడి ఆయన వెంకట సత్య స్టాలిన్ కి బొమ్మలు వేస్తానని చెప్పి వేసి పెట్టారు. నిజానికి ఆ బొమ్మలు ఏమీ బాగో ఉండవు. ఆ దగ్గర శ్రీరమణ గారు హెల్ప్ లెస్. అయితే శ్రీ మోహన్ గారు, శ్రీరమణ గారు చిలకల పందిరి అని ఒక సూపర్ డూపర్ హిట్ శీర్షిక నడిపారు. ఆ రచన, ఆ బొమ్మలు బంగారం మరియూ తావే. మోహన్ గారన్నా, ఆయన వచనం అన్నా, ఆయన రేఖలు అన్నా శ్రీరమణగారికి కూడా చాలా ముచ్చట. ఆ మధ్య పాత పుస్తకాలు వెదుకుతుండగా ఆయన సోడా నాయుడు కథకి గోపి గారు వేసిన నలుపూ తెలుపు బొమ్మ నా కంటపడింది. ఎంత అందం . కథంత అందం ఆబొమ్మది. పత్రికాఫీసుల్లో పని చేసారు కదా ఆయనకు చాలా చాలామంది చిత్రకారులతో పరిచయం , చాలా దగ్గరితనం ఉండేది . అయితే ఆయన రచనలకు బాపు గారు తెచ్చిన అందం ఎవరూ తేలేదు, తేలేరు కూడా. వ్యక్తిగతంగా , వృత్తిగతంగా కూడా ఆయనకు ఇష్టమైన చిత్రకారులు బాపు కాకుండా మోహన్ గారు గిరిధర్ గౌడ్ గారు మాత్రమే నని నాకు తెలుసు. ఈ రోజు ఉదయం శ్రీరమణ గారిని చివరి చూపుగా పలకరించడానికి ప్లోటిల్లా అపార్ట్మెంట్ కి వెళ్ళాము నేను, కవి నాయుడు గారు. రమణ గారు అద్దాల పెట్టె లో పడుకుని ఉన్నారు. అలా మాటడకుండా, నిశ్శబ్దంగా ఉంటే ఆయనేం శ్రీరమణ? నా కంటి అద్దాల లోపల నీరు గిర్రున తిరిగింది, అద్దాలు తీసు కళ్ళు తుడుచుకునే పని చేయలేదు. ఆ గాజు పెట్టె లో నిలువెల్లా ఆయన నాకు కనపడుతున్నారు. ఏదో లోపం, ఏదో తప్పు జరిగింది, నేనేదో మరిచిపోయా. కొంత కాలం క్రితం ఒకసారి మా ఇద్దరి మాటల్లో మనం ఎవరి ఇంటికయినా వెడుతూ వారికి ఏమీ పట్టుకు వెడితే బావుంటుంది? మనం ఖర్చు పెట్టే రూపాయ ఎట్లా వృధా పోకుండా ఉండాలి? ఆ ఇంట్లో వాళ్లకు షుగర్ ఉంటే ఎలా? ఈ పూలు, బొకేలు అవీ పట్టుకు పోతారు కదా, పూలు ఎట్లాగూ వాడిపోతాయి కదా ,దానికి డబ్బులు దండగ కదా అని శ్రీరమణ గారితో మాటలు పెట్టుకున్నాను . దానికింత గొడవెందుకండి? ఏదయినా పట్టుకు వెళ్ళొచ్చు. ఆ ఇంట్లో వయసు పెద్ద వాళ్ళే ఉండి , వారికి షుగర్ ఉంటే మాత్రమేం? తీసుకు వెళ్ళిన స్వీట్లు వాళ్ళ ఇంట్లో పిల్లలు తింటారు, పిల్లలు లేకపోతే పక్కింటి వారికో, లేదా వారి పనివారికో పంచుతారు.పూల బొకేలు ఇస్తే డబ్బులు దండగ ఏమీ కాదు. పూల గుత్తిని చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందండి . వాంగో సన్ ప్లవర్స్ పెయింటింగ్ లాగా, దాని రంగులు, రెక్కలు చూస్తూ గడపవచ్చు కదా. అప్పుడు ఇంటికి ఇంటికి వచ్చిన వారెవరైనా ఎక్కడిది పూలగుత్తి, ఏమిటి విశేషం అని అడిగితే " మమ్మల్ని చూడ్డానికి ఇంటికి అన్వర్ గారు వచ్చి వెళ్లారు , మా కోసం పూలు పట్టుకు వచ్చారు" అని సంతోషంగా చెప్పుకుంటారు కదా. శ్రీరమణ గారు ఈ రోజు మీకొక పూల మాల తేవాల్సింది నేను. తేనందుకు మీరు ఫీల్ అయ్యేది ఏమీ లేదు. సింహాల మధ్య తిరిగి ఉండి కూడా నేను మర్యాద తెలీని శిష్యుడిగా మిగిలిపోలా! ఇపుడు ఏం చేసేది? బుద్ది లేని జన్మ. థూ! ఒకసారి నేను ఒక కథ చదివాను . వేలూరి శివరామశాస్త్రి గారిది. కథ పేరు 'తల్లి లేని పిల్ల"ఆ కథలో ఇలా ఉంటుంది "చిట్టెమ్మ మేకల మంద నడుమ కూచుంది . చుట్టూ పది పన్నెండు దుత్తలు, ఐదారుచెంబులూ. చిట్టెమ్మ కొడుకు రాఘువులు మేకపాలతో ఒక చిన్న గుంట అలికి దానిలోనూ, ఒక చిన్న రాతి తొట్టిలోనూ కుక్కలకూ, కుక్క పిల్లలకూ మేకపాలు పోస్తున్నాడు. రాఘువులు తండ్రి నాగాయ మంద చివర నించుని మేకలని పరీక్ష చేసి పళ్ళు కదిలిన వానికి క్షౌరం చేసి చక్రాంకితాలు వేశాడు. కొన్ని మేకల డెక్కల నడుమ ముళ్ళు లాగాడు. ఒక మేకవి కాలిమీది వెంట్రుకలు లిక్కితో కోసి నెత్తురు కంటచూసి- 'ఓరే నాయనా! ఉప్పుపెట్టి రుద్దు" అని పురమాయించాడు" నాగాయ తన కొడుకును పురమాయిస్తే పురమాయించాడు కానీ, నాకు అనుమానాలు, ఎందుకుని ఈ చక్రాంకితాలు, అదీనూ పళ్ళుకదిలినవాటికే ఎందుకు? లిక్కి దూసి మేక నెత్తురు పరీక్ష చెయ్యడం అదేవిటి? సరే ఉప్పు రాయడం ఎందుకో కాస్త అంచనాకు అందిందనుకో. ఎవరిని అడిగితే వీటికి సమాధానం దొరకాలి? అపుడు నాకు ప్రతి ప్రశ్నకు సమాధానంగా శ్రీరమణ గారు ఉండేవారు. మహానుభావుడు కేవలం ఆధునిక సాహిత్యాన్ని, ప్రాచీన వాగ్మయాన్ని చదువుకున్న మనిషే కాదు. జీవితాన్ని పరిశీలనగా చూసిన వాడు కూడా . పల్లెలో పుట్టి పెరిగినవాడు, అన్నీ తెలుసు. తెలిసిన వాటిని విప్పి చెప్పే హృదయం ఉంది. ఇలా ఉన్న హృదయాలన్ని మూసుకుపోయి ఇప్పుడు మనసు లేని మనస్సుల , మనుష్యుల మధ్య బ్రతకడం ఎంత కష్టమో, చికాకో సింహాల మధ్య తిరిగిన మీకు ఏమి తెలుస్తుంది ? చెప్పినా ఏమి అర్థమవుతుంది. -అన్వర్, ఆర్టిస్ట్, సాక్షి దిన పత్రిక -
అందరినీ ఆకట్టుకునే రచనలవి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ కథా రచయిత, పాత్రికేయుడు శ్రీరమణ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. శ్రీరమణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ఒక ప్రకటనలో తెలిపారాయన. ఆయన మానవత్వం, వ్యంగ్య రచనలు అందరినీ ఆకట్టుకున్నాయని, మిథునం లాంటి మంచి సినిమాకు రచయితగానే కాకుండా.. అనేక కథలతో అందర్నీ అలరించారని గుర్తు చేశారు సీఎం జగన్. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రమణ.. మంగళవారం వేకువ ఝామున కన్నమూసిన సంగతి తెలిసిందే. శ్రీరమణ స్వస్థలం గుంటూరు జిల్లా, వేమూరు మండలం వరహాపురం అగ్రహారం. పేరడీ రచనలకు పేరుగాంచిన కామరాజ రామారావు(శ్రీరమణ).. బాపు-రమణ(ముళ్ళపూడి వెంకటరమణ)లతో కలిసి పని చేశారు. పలు పత్రికలకు కాలమిస్ట్‌గా, సంపాదకుడిగా, నవలా రచయిత, సినీ రచయితగానూ ఆయన సాహిత్య రంగానికి సేవలందించారు. శ్రీ రమణ తన హస్య రచనకు గానూ 2014లో తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం స్వీకరించారు. ఇదీ చదవండి: మిథునం రచయిత శ్రీరమణ కన్నుమూత -
ఉదాశీనయ్యలు–శీను బాబు
ఉదాశీన శీలురు యుగయుగాలుగా ఉన్నారు. వారి ఉదాశీనతవల్లే బోలెడు ఘోరాలు రాజ్యమేలాయి. నిండుసభలో ఇంటికోడల్ని అవమానించినపుడు పెద్దలు మేధావులు.. చెప్పతగినవారు, చెప్పాల్సిన వారు నోరు చేసుకుని ఉంటే కురుక్షేత్ర మహా సంగ్రామం జరిగి ఉండేది కాదు. త్రేతా యుగంలో కైక వరాలకు దశరథుడు శిరసా వహించినపుడు అయోధ్యలో ఉన్న శిష్టులో వశిష్టులో రంగంలోకి దిగి ఉంటే రామాయణం మరోలా ఉండేది. రాచమర్యాదలకు పోయి ఎవరూ పర్ణశాలల నించి బయటికి రాలేదు. రాజునైనా చక్రవర్తినైనా సమయం వచ్చినప్పుడు దండించే ఖలేజా మేధావి వర్గానికి ఉండి తీరాలి. ధర్మం నాలుగు పాదాల మీద నడిచే రోజుల్లోనే పెద్దలు చూసీ చూడనట్టు, వినీ విననట్టుండే వారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక ధర్మం ఒంటికాలుమీద కుంటుతున్న కలియుగం మాట చెప్పాలా? ఇప్పుడు ఈ బుద్ధి పెద్దలకు నైజంగా మారింది. దీన్నే లౌక్యం అంటున్నారు. గోడమీది పిల్లలువలె ఎటైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటున్నారు. రెండువైపులకి సరిపోయే తర్కం అందు బాటులో పెట్టుకుంటున్నారు. సుఖంగా జీవితం వెళ్లిపోవడమే పర మార్థంగా భావిస్తున్నారు. నిజానికి అలాంటివారే మేధావులుగా చెలా మణీ అవుతున్నారు. సూటిగా ప్రశ్నించే దక్షతని వదులుకుంటున్నారు. అన్యాయాన్ని అధర్మాన్ని వేలెత్తి చూపడం నేరమా? కొన్ని వర్గాలకి ప్రత్యేక కవచాలుంటాయా? ఉంటే వారికెవరిచ్చారు? వీటిని నిగ్గు తేల్చాల్సిన మేలి మలుపు ఆధునిక కాలంలో వచ్చింది. ‘అందరూ సమానమే. కొందరు మరింత ఎక్కువ సమానం’ అనే పాత నానుడిని తిరగరాసుకోవాలి. ఒకనాటి మన పండితరాయలు ముంగండ అగ్రహారీకుడు. ఢిల్లీ షాజహాన్ కొలువులో ఉన్నత పదవులు నిర్వహించాడు. క్షుణ్ణంగా లోకం తెలిసినవాడు. లోకంలో నాలుకతో, కళ్లతో ఎంతటి విషయాన్నైనా చప్పరించే వాళ్లుంటారో చక్కగా వివరించి చెప్పాడు. పండిత రాయలు వీధి వెంట వెళ్తుంటే, ఓ చెట్టు నీడన ఎంగిలి విస్తళ్లు తింటూ ఓ గాడిద కనిపించింది. పనిమాలా దాన్ని పలకరించి, ఏం పాపం ఈ ఆకులు తింటున్నావని సానుభూతితో అడిగాడు. గాడిద, ‘చాల్చాలు నా బతుక్కి ఇదే గొప్ప’ అన్నది. ‘ఓసీ వెర్రిమొహమా! ఆ తెలివితక్కువ తనమే నిన్ను గాడిదని చేసింది’ అనగానే, గాడిద ప్రశ్నార్థకంగా చూసింది. ‘పో... వెళ్లు. వెళ్లి రాజుగారి అశ్వశాలలో చేరిపో.. రోజూ ముప్పూటలా ఉత్తమజాతి గుగ్గిళ్లు దాణాగా పెడతారు’ అని పండిత రాయలు సలహా ఇచ్చాడు. గాడిద ఆ సలహాకి ఉలిక్కి పడి, ‘ఆహా, ఎవరైనా చూస్తే నా నడుం విరగ్గొడతారు. నేను నీకేం అపకారం చేశాను స్వామీ’ అని బాధపడింది. పండితరాయలు చిరునవ్వు నవ్వి, ‘అందుకే నీ బతుకు ఇట్లా అఘోరించింది. నువ్ అశ్వశాలలో, గుర్రాల పంక్తిలో ఉంటే నువ్వు గుర్రానివే! గుగ్గిళ్లు వేసే సేవకులు అంతే ఆలోచిస్తారు’ అంటూ ధైర్యం ఇచ్చాడు రాయలు. ‘ఎప్పుడైనా రాజుగారి దండ నాయకుడు శాలకి వస్తేనో’ అంది గాడిద. ‘వస్తే రానీ, తోకల్ని లెక్కేసుకుపోతాడు. వాడికి శాల్తీలు సరిపోతే చాలు’ వివరించాడు రాయలు. గాడిదకి కొంచెం కొంచెం ధైర్యం వస్తోంది. ‘సరే, ఏ మంత్రిగారో వస్తే...?’ అన్నది గాడిద. ‘వస్తేరానీ, చూస్తారు.. వెళ్తారు’ అన్నాడాయన. ‘స్వయంగా రాజుగారే వచ్చి, చూసి వచ్చే పండుగకి నేను ఊరే గడానికి దీన్ని సిద్ధం చేయండని పురమాయించి వెళితే...’ అనడిగింది గాడిద. ‘పిచ్చి మొహమా.. ఎందుకు ప్రతిదానికీ అలా కంగారుపడతావ్. ఏమీ కాదు. రాజుగారు దూరం నించి వేలు చూపించి వెళ్తారు. ఇహ ఆ క్షణం నించీ నీ మాలీస్ వేరు. తిండి వేరు’. ‘తీరా ఆ రోజు వస్తే...’ అనడిగింది గాడిద. ‘వస్తే బ్రహ్మాండంగా నిన్ను అలంకరిస్తారు. వజ్రాల బొంతలు కప్పుతారు. రాజు ఎక్కే సమ యానికి అది నువ్వో, గుర్రమో అర్థం కాకుండా చేస్తారు’. ‘వీధిన వెళ్లేప్పుడు పెద్దలు, తమలాంటి పండితులు’ అని గొణి గింది గాడిద. ‘ఓసీ పిచ్చిదానా! మన ప్రజలు మరీ ముఖ్యంగా తెలివితేటలు ఉన్నవారు చాలా ఉదాశీనులు, ఓర్పువంతులు. వాళ్లంతా చూసి నిన్ను గుర్తుపట్టినా.. రాజుగారు సరదాపడ్డారు కాబోలు. మనకెందుకులే అని నోరు మెదపరు. రాజుగారు ఠీవీగా ఊరేగుతారు’ అంటూ దాని వెన్ను చరిచాడు రాయలు. మేధావుల ఉదాశీనత దేశానికి పట్టిన బూజు. పెద్దల మెదళ్లకి బొజ్జలొస్తే శీనయ్యలు ఉదాశీను బాబులు అవుతారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
జయాభి జై భవ! జయోస్తు!
గత స్మృతులు గుర్తు చేసుకుం టున్నకొద్దీ రంగుల కలలుగా కని పించి ఆనందపరుస్తాయి. చిన్న ప్పుడు, కొంచెం ముందునించే దసరా రిహార్సల్స్ మొదలయ్యేవి. ఒక పద్యం తప్పక అయ్యవార్లు పిల్లలకు నేర్పించేవాళ్లు. ‘ధరా సింహాసనమై, నభంబు గొడుగై, తద్దేవతల్ భృత్యులై...’ అనే పద్యం చాలా ప్రసిద్ధి. పిల్లలం దరికీ నోటికి పట్టించేవారు. దసరా అంటే శరన్నవ రాత్రోత్సవాలలో పిల్లల విద్యా ప్రదర్శన, దాంతోపాటు గురు దక్షిణ స్వీకారం జరిగేది. ఈ పద్యం ఏ మహాను భావుడు రచించాడో చాలా గొప్పది. దేవుణ్ణి పొగిడి, పొగిడి ఆఖరికి ‘వర్ధిల్లు నారాయణా’ అంటూ దీవెనలు పెడతాడు. ధరా సింహాసనమై, భూమి ఆసన్నమై, ఆకాశం గొడుగై, దేవతలు సేవకులై, వేదాలు స్తోత్ర పాఠకులై, శ్రీగంగ కుమార్తె కాగా ‘నీ ఘనరాజసంబు వర్ధిల్లు నారా యణా’ అంటూ పూర్తి అవుతుంది. అనాదిగా వస్తున్న దసరా పద్యాలలో ఇదొకటి. తర్వాత పిల్లలు జయాభి జై భవ! దిగ్వి జై భవ! బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు అంటూ బడి పిల్లలు జై కొడుతూ అయ్యవారి వెంట బయలు దేరతారు. ఏటా జరిగే ఈ ఉత్సవం కోసం ప్రతి గడపా వేయికళ్లతో ఎదురుచూసేది. ఆడ, మగ పిల్లలు నూతన వస్త్రాలు ధరించి, మగ పిల్లలు విల్లమ్ములు, ఆడ పిల్లలు ఆడే కోతి బొమ్మలు పట్టుకుని పాటలతో, వీధుల వెంట సందడి చేసేవారు. ఆ చిన్న విల్లమ్ములు చిత్రంగా ఉండేవి. దాంతో గులాములు కొట్టడానికి వీలుండేది. ఆడ పిల్లలు కొత్త పరికిణీలు వేసుకుని కోతిని ఆడిస్తూ ఆట పట్టించేవారు. పిల్లలు ఇంటింటికీ తిరిగేవారు. జయాభి జై భవ! దిగ్వి జై భవ! బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు! పావలా అయితేను పట్టేది లేదు! అర్ధరూపాౖయెతే అసలే మాకొద్దు! అయ్యవాండ్రకు చాలు ఐదు వరహాలు! పిల్ల వాండ్రకు చాలు పప్పుబెల్లాలు! అంటూ యాగీ చేసేవారు. వీధి బడిలో ఏడాది పొడుగునా చదువు చెప్పిన వారికి ఐదు వరహాలు గురుదక్షిణ. వరహా అంటే నాలుగు రూపా యలు. ఆ రోజుల్లో అయ్యవార్లు ఎంతటి అల్ప సంతో షులు! ఇది విజయదశమి నాటి సంరంభం. ముందు రోజు ఆయుధపూజ. అదీ మరీ పెద్ద ఉత్సవం. రైతుల దగ్గర్నించి, పల్లెల్లో పట్టణాల్లో ఉండే సమస్త చేతివృత్తుల వారు తాము నిత్యం వాడే పరిక రాలను ఆయుధాలుగా భావించి వాటికి సభక్తికంగా పూజలు చేస్తారు. దీనికి రకరకాల ఐతిహ్యాలు చెబుతారు. పాలపిట్టని చూస్తే శుభమని తెలంగాణ ప్రాంతీయులు నమ్ముతారు. వెండి బంగారం అంటూ జమ్మి ఆకులు ఇచ్చి పెద్దల దీవెనలు తీసుకుంటారు. తెలంగాణలో జానపదుల బతుకమ్మ పండుగ దసరాతో కలిసే వస్తుంది. బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రిళ్లలో రోజుకో అవతారంలో భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఇట్లా పదిరోజులు సాగే పెను పండుగ మరొకటి లేదు. దేశమంతా కనకదుర్గ, మహంకాళి అమ్మవారి ఉత్సవాలు రకరకాల పేర్లతో వైభవంగా జరుగు తాయి. మన దేశం అన్ని విషయాలలో మిగిలిన ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నా పండుగలూ పర్వాలనూ పంచాంగం చెప్పిన ప్రకారం జరుపుకుంటోంది. ఇదొక విశ్వాసం, ఇదొక నమ్మకం. ఎన్నో తరాలుగా, ఆర్ష సంప్ర దాయం అనుసరించి వస్తున్న పండుగలు పచ్చాలు భక్తిప్రపత్తులతో చేసుకోవడంలో తప్పులేదు. నిన్న మన సంప్రదాయాన్నీ, ఆచారాన్నీ గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బెజవాడ దుర్గమ్మకి సభక్తికంగా రాష్ట్ర ప్రజలపక్షాన పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ప్రజలు ఆనందించారు. మన దేశంలో పెద్ద నదులన్నింటికీ పుష్కరాలు జరుగుతాయి. గంగానది సాక్షాత్తూ శివుడి తలమీంచి జనావళి కోసం దిగి వచ్చిందని మనం నమ్ముతాం. భగీరథుడి కృషికి దివి నుంచి భూమికి గంగ దిగి వచ్చింది. గంగ పుష్కరాలని కుంభమేళాగా వ్యవహరిస్తారు. సాధు సంతులు, సంసారులు, సామాన్యులు కుంభమేళా గంగ స్నానాలు ఆచరిస్తారు. ఈ ఉత్సవానికి హాజరైన నాటి మన ప్రధాని నెహ్రూని, మీరు ఇలాంటి వాటిని నమ్ముతారా అని ఓ పత్రికా ప్రతినిధి అను మానంగా అడిగాడు. అందుకు జవహర్లాల్ ఏ మాత్రం తొట్రుపడకుండా– ‘కోట్లాది మంది విశ్వాసాల్ని నేను గౌరవిస్తాను. గౌరవం ఉంటే నమ్మకం. గౌరవం అంటే నమ్మకం’ అని జవాబు ఇచ్చారు. ఎక్కువమంది విశ్వసించే వాటిని గౌరవించడం కూడా ఒక సంస్కారం. మంచికి, చెడుకి మధ్య జరిగిన పోరు దసరా. అందుకే విజయదశమి అయింది. ఇహ నించి జాతికి అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినోభవన్తు! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బాలు తీరని కోరిక నాకు తెలిసి ఒకే ఒకటి..
మొత్తం 40 వేల పాటలు, 16 భారతీయ భాషలు, అన్ని భాషల టాప్ హీరోలకు గాత్రదానం చేసి పుణ్యం కట్టుకున్నారు. పద్మభూషణ్ సన్మానితులు. ప్రతిభ, ఓర్పు, సహనం కలబోసుకున్న త్రివేణి యస్పీ బాలు. తల్లిదండ్రులకు వరపుత్రుడు, భార్యకి పూర్వజన్మ సుకృతం, పిల్లలకి ఆదర్శప్రాయుడైన తండ్రి, జన్మజన్మలకి ఈ అన్నే కావాలనుకునే చెల్లెమ్మలు, ‘మావాడు’ అని విర్రవీగే నెల్లూరు సీమవాసులు, భూమధ్యరేఖ ఎగువన దిగువన బాలు పాట కోసం కలవరించే పిచ్చి అభిమానుల పొగరు, గర్వం నిన్న మధ్యాన్నం ఒంటిగంట నాలుగు నిమిషాలకు (25.9.2020) ఒక్కసారిగా అణిగాయి. తెలుగువాళ్లం ఇంకా ఏం చూసుకు గర్వపడాలి? మాకోసం ఎన్ని విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు కొల్లగొట్టుకు తెచ్చారు? ఒక మంద నందుల్ని (21) ఎక్కడెక్కడ నుంచో తోలుకొచ్చి మాకు కైవసం చేశారు. ఎన్ని దేశాలు తిరిగారు, ఎన్ని టీవీ షోలని పండించారు? మీరు కనిపించ కుండా ఒక్కపూట గడుస్తుందా? మాకు మీ పాట వినిపించకుండా ఒక గంట గడుస్తుందా? మీ వయసెంతని ఎవరైనా ఎపుడైనా అడిగారా? ఎన్నేళ్లనుంచి ఈ రేయింబవళ్ల కోలాహలం జనం కోసం సాగిస్తారని అడిగామా? బాలూ! నువ్వంటేనే పాటల జాతర. నెల్లూరు సీమలో ఎన్నడో కోయిలలు స్వరాలు మర్చిపోయాయి. బహుశా 1966లో మహా గానగంధర్వుడు గళం విప్పాడని చెవులారా విని, పిక సముదాయం ఒక్క పలుకుమీద నిలిచి సృష్టికి కొరత లేదని కూతలు కట్టుకున్నాయ్. (పాటవై వచ్చావు భువనానికి...గానమై.. గగనానికి... ) వానలో తడియనివారు, ఎండ పొడ సోకని వారు, బాలు మా బంగారు నాయనతో జ్ఞాపకాలు అనుభవాలు లేని వారు ఎవరూ ఉండరు. ఎన్ని భాషల అనుభవాలు, ఎన్నేసి జ్ఞాపకాలు, అనుభవాలు లేని జ్ఞాపకాలు. పాడిన పాటల గురించి కాదు, ఆయన పాడని పాటల గురించి కలలు కంటూ ఉండే వారు. వృత్తిమీద గౌరవం, భయభక్తులు బాలుకి పుటకతో అబ్బిన సుగుణాలు. బాపు రమణలు ‘త్యాగయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు బాలుని సంప్రదించారు. ‘నా భాగ్యం’ అన్నారు నమస్కరిస్తూ. తర్వాత రెండో రోజో, మూడో రోజో బాలసుబ్రహ్మణ్యంగారి తండ్రి సాంబమూర్తి బాపు రమణలని కలవడానికి మా ఆఫీస్‌కి వచ్చారు. పెద్దలు, మీకో మాట చెప్పాలని వచ్చాను. మా వాడికి శాస్త్రీయం తెలియదు. తెలిసి తెలిసి మీరు పెట్టుకున్నారు. ‘అయ్యా, ఒకటికి రెండుసార్లు మూడుసార్లు పాడించండి. కొంచెం దగ్గరగా జరిగి, అవసరమైతే ఒక దెబ్బ వేసైనా సరే, సరిగ్గా పాడించండి’ అని హితవు పలికారు. బాపుగారు ఆ మాటకి పడీపడీ నవ్వారు. ఎందుకంటే అప్పటికే శంకరాభరణం పాటలు గ్లోబ్ మొత్తం మార్మోగుతున్నాయ్. బాపు రమణలకి బాలు అంటే ప్రాణం. 1967 బాపు రమణలు సాక్షి తొలి చిత్రం తీశాక, వెంటనే ‘బంగారు పిచిక’ సినిమా ప్లాన్ చేశారు. మొదట్లో దాని పేరు ‘స్వయంవరం’ ఫొటోకార్డ్స్ కూడా వచ్చాక దానిపేరు మార్చారు. అయితే బంగారుపిచుకలో బాలుని హీరోగా ఎన్నుకున్నారు. అప్పుడు బాలు సుకుమారం అంతటిది. ఆయన సరసన నాయికగా యుద్ధనపూడి సులోచనా రాణిని ఖాయం చేశారు. అయితే, కారణం ఏదైతేనేం ఈ బంగారు పిచిక రెక్కలు విదిల్చి ఎగరనే లేదు. బాపు రమణలకు బాలు సమర్పించిన అపురూప జంట మహదేవన్, పుహళేంది. కడదాకా ఈ స్నేహాలు సాగాయి. నేటి ప్రఖ్యాత చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ దృష్టి ఆరుద్రపై తొలిసారి పడింది. ఒక టోర్నీకి యస్పీతో ఆరుద్ర స్పాన్సర్ చేయించారు. ఇలాంటి సందర్భాలు బాలు జీవితంలో కోకొల్లలు. హైదరా బాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్టకి బాలు పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. బాలుగారి జీవితంలో తీరిన కోరికలు కోటానుకోట్లు. తీరని కోరిక నాకు తెలిసి ఒకే ఒకటి. అదేమంటే నవంబర్ నెల తేట నీటిపై గోదావరి మీద పున్నమి వెన్నెలపై పాపికొండలు దాటి శబరి కలిసేదాకా మూడు లాంచీలు, ఆరు పంట్లు (పంట్ అంటే లాంచీకి టగ్ చేసే ఫ్లాట్‌ఫాం) కట్టుకుని అలా పాడుకుంటూ వెళ్లాలని. అందులో బాలు, బాపురమణ, వేటూరి, ఎ.ఆర్. రెహ్మాన్ (అప్పట్లో దులీప్ ఆయన పేరు) ఇంకా శివమణి (డ్రమ్స్), ఫ్లూట్ మాస్టర్ గుణ ఉంటారు. చిన్న సరంజామాతో బాలు పాటలు పాడతారు. వేటూరి వెన్నెట్లో గోదారి అందాలమీద, దేవిపట్నం రంపచోడవరం అల్లూరి పౌరుషాగ్ని మీద మూడు పల్లవులు, ఆరు చరణాలు చెబుతారు. బాపు ఆ వెన్నెల వెలుగులో లాంచీ తూగులో భద్రాచలంపై కొలువుతీరిన రాముణ్ణి పిచ్చి పిచ్చిగా గీసుకుంటారు. ఇదీ యాత్రా విశేషం. బాలూ గారూ! పోనీ ఒక్కసారి రాకూడదూ? మన గోదారి యాత్ర పండించుకుందాం. ఎందరో ఎన్నేళ్లుగానో మమ్మల్ని చూసి ఈర్ష్య పడుతున్నారు. ఆఖరికి ఇలా జరిగింది. ఏమివ్వగలం ఈ గుప్పెడు అక్షరాలు తప్ప. పైగా మీరు నాకు మరీ ప్రత్యేకం. మీరు నా హీరో... మిథునం ఫేమ్. వ్యాసకర్త: శ్రీరమణ ప్రముఖ కథకుడు -
అంతా భ్రాంతియేనా!?
దేశం కనీవినీ ఎరుగని ఆపత్కర, విపత్కర పరిస్థితిలో వుంది. చూస్తుండగా వారాలు, నెలలు గడిచి పోతున్నాయ్. సరైన దారి మాత్రం కనిపించడం లేదు. ఈ కొత్తరోగంపై స్పష్టమైన అవగా హన రావడం లేదు. కోవిడ్ నిరో« దానికి లేదా వచ్చాక తగ్గించుకో డానికి కచ్చితమైన మందులు లేవు. గడిచిన ఏడెనిమిది నెలలుగా ఎవరికి తోచిన సంగతులు వాళ్లు చెబుతున్నారు. జనం ప్రాణభయంతో ఎవరేం చెప్పినా విని అమలు చేసు ్తన్నారు. ప్రపంచ దేశాలన్నీ విడివిడిగా కలివిడిగా తమ తమ రాజకీయాలను వైరస్ అంచున నడిపిస్తున్నాయి. భారతదేశం టెలిస్కోప్‌లో ప్రపంచ దేశాల జననష్టాన్ని, నిస్సహాయతను చూపించి భారంగా నిట్టూర్పులు విడుస్తోంది. మన కర్మభూమిలో దీనికి కావాల్సినంత వాఙ్మయం కుప్పలు తెప్పలుగా దొరుకుతుంది. ఈ సౌలభ్యం మిగిలిన దేశాలకు లేదు. మనం అతిపెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటాం. కానీ, యిలాంటి విపత్కర సమయంలో, యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ మన సామాన్య సమాజాన్ని పరిశీలిద్దాం. మార్చిలో ఏమి చెయ్యాలో తోచక రాత్రికి రాత్రి లాక్డౌన్ ప్రవేశపెట్టినపుడు జనం గందరగోళంలో పడ్డారు. వలస కూలీలు ఆకలి పొట్టలతో బతుకు జీవుడా అనుకుంటూ సొంతనేలకి కదిలారు. అదే సమయంలో కొన్ని దేశాలలో జనం నిత్యావసరాల కోసం ఎగబడ్డారు. దొరకనివారు దోచుకున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు పప్పులు, ఉప్పులు, నూనెలతోబాటు కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు దండుకున్నారు. ఆ విషయంలో మనది సత్యంగా వేదభూమి, నిత్యంగా కర్మభూమి. ఈ జన్మ గురించి కాదు, వచ్చే జన్మలపై మనకి భయం. కానీ యీ భయం కొందరికే. వేరే ‘నిర్భయ ముఠా’ వుంది. ముందు శూన్యం, తర్వాత శూన్యం అని ప్రగాఢంగా నమ్మే ముఠా. మన ప్రభుత్వాలు మాటకు ముందు పారదర్శకం... పారదర్శకం అని నినాదాలు యిస్తుంటాయేగానీ చాలా విషయాలు ఇనుప తెరల లోపలే వుంటాయ్. ఈ కరోనా నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఎంత దారుణంగా ప్రవ ర్తిస్తున్నాయో గమనించాం, గమనిస్తున్నాం. యుద్ధ సమ యంలో చాలా షరతుల్ని పక్కన పెట్టిస్తారు. ఎమర్జెన్సీలో ప్రైవేట్ ఆస్తుల్ని జాతీయం చేసుకుంటారు. ప్రభుత్వాలకి ప్రత్యేక అధికారాలుంటాయి. దీనికి బదులుగా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యానికి బోలెడు రాయితీలు కల్పిస్తుంది. మంచి తీరైన చోట సబ్సిడీ ధరకి భూములు యిస్తారు. ఖరీదైన వైద్య పరికరాల కొనుగోళ్లపై పన్ను రాయితీలు కల్పిస్తారు. ఇవన్నీ సమయం వచ్చినప్పుడు అందరికీ సాయపడాలన్న సదుద్దేశంతోనే కల్పిస్తారు. కానీ మొన్న నిర్దాక్షిణ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు చేతులె త్తేశాయి. చివరకు రైలు పెట్టెల్ని సైతం పడకలుగా సిద్ధం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులపై బోలెడు విమర్శలు వచ్చాయి. వసూళ్ల ఫీజులపై ఆంక్షలు లేవు. బెడ్ దొరికితే చాలు బతికేసినట్టు అనుకున్నారు. నిలువుదోపిడీలకు సిద్ధ పడ్డారు. అందుకని సామాన్యులు ఏమనుకుంటున్నారంటే ప్రైవేట్ ఆసుపత్రి ముందు పెద్ద పెద్ద అక్షరాలలో ప్రభు త్వం వారికిచ్చిన రాయితీలు ఎంతెంతో, దానికిగానూ ప్రతిఫలంగా వారిచ్చే సేవలేమిటో స్పష్టంగా చెప్పాలి. అక్కడ స్థలాలు, ఆకాశ హార్మ్యాలు, అద్దాల గదుల వెనుక సామాన్యుడి కాసులు కూడా వున్నాయని తెలియ జెప్పండి. కార్పొరేట్ సంస్కృతిలో నిర్భయంగా బలిసి పోయే ప్రమాదం వుంది. ఒక దశకి వెళ్లాక కార్పొరేట్లు ప్రభుత్వంలో వాటాదార్లు అవుతాయి. ఇక దందా నడిచి పోతూ వుంటుంది. ఈ నేపథ్యంలో ప్రై.ఆసుపత్రులను ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి. కోవిడ్ ఫీజులపై నిఘా లేదు. జనం ఎంతటి అసహాయ స్థితిలో వున్నారో గమనిస్తే దుఃఖం వస్తుంది. మెడికల్ కాలేజీ వారిదే, నర్సింగ్ శిక్షణ వారిదే, మందుల షాపులు వారివే, భోజ నాల నిర్వహణ వారిదే. అన్నీ కలిసి ఒక పెద్ద ఇండస్ట్రీలా పెనవేసుకుపోయింది. ఇంకా సామాన్యులకు అంతుపట్టని బ్లడ్ బ్యాంకులు, హెల్త్ ఇన్సూరెన్సులు వేరే! ఎన్నైనా చేసు కోండి గానీ సామాన్యుణ్ణి కాస్త పట్టించుకోండి. వ్యాధిపై సరైన అవగాహన కల్పించండి. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు సరిగ్గా కోవిడ్ వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావడం. ఎన్ని కల ముందు టీకా రావడం అత్యంత ప్రాధాన్యతను సంత రించుకుంటోందని ప్రపంచ మీడియా వ్యాఖ్యానించడం మరో చమత్కారం. ఈ టీకా ట్రంప్ విజయానికి దోహద పడుతుందని ఒక అంచనా. వేచి చూద్దాం. తర్వాత చరిత్రలో ఓ వాక్యం రాసుకుందాం. శ్రీరమణ వ్యాసకర్త ప్రముఖ కథకుడు -
రాజనీతి కథ
స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఏళ్లు దాటింది. తెల్లదొరల రాజ్యం వెళ్లి నల్లదొరల రాజ్యం వచ్చింది. కానీ రాజనీతి ఒక్క లాగే సాగుతోంది. సామాన్యుడి రెక్కలాట డొక్కలాట ఒక్కలాగే నడుస్తోంది. ఏ యుగంలో అయినా రాజ్యాధికార చెలా యింపు ఏకపక్షంగానే ఉంటుంది. ద్వాపర యుగంలో ఏకఛత్రపురం అనే చిన్న రాజ్యం ఉండేది. దానికో రాజున్నాడు. రాజుకి భోగాలన్నీ ఉన్నాయ్. ఉన్నట్టుండి రాజ్యానికి వుపలాయం వచ్చింది. ఓ బ్రహ్మరాక్షసుడు రాజ్యం పొలిమేరలో విడిది చేశాడు. వాడి పేరు బకా సురుడు. వాడి గురించి విన్న రాజుకి వణుకు పుట్టింది. బతికుంటే బలుసాకు తిని బతకవచ్చనే నిర్ణయానికి వచ్చి వెర్రి సాహసాలేవీ చెయ్యలేదు. మీసాలు దించి, కుదించి రాక్షసుడికి రాయబారం పంపాడు. నీ ఆకలి సంగతి నేను కనిపెట్టి ఉంటాను. నువ్వు ఇష్టారాజ్యంగా స్త్రీ, బాల, వృద్ధుల్ని ఎప్పుడంటే అప్పుడు పీక్కుతినద్దు. ఓ క్రమశిక్షణ పాటిద్దాం. రోజూ ఠంచన్‌గా సూర్యుడు నడి నెత్తికి వచ్చేసరికి, నీకు సన్నబియ్యం కూడు ఓ బండెడు, దానితోపాటు వచ్చిన జత దున్నపోతులు ఆహారంగా ఉండిపోతాయ్ అన్నాడు రాజు. ‘నాకు నర మాంసం లేనిదే ముద్ద దిగదే’ అని అరిచాడు బకాసు రుడు. దానికంతంత రంకెలెందుకు, సాయలాపాయ లాగా పరిష్కరించుకోవచ్చుగా అన్నాడు రాజు అనున యంగా. అసురుడు నవ్వి నీలాంటి సాత్వికుణ్ణి నేనింత వరకు కనలేదు, వినలేదు అన్నాడు మిక్కిలి అభినందన పూర్వకంగా. ‘సరే, అఘోరించావులే’ అన్నాడు లోలో పల రాజు. అనుకున్న మాట ప్రకారం బండి నడుస్తోంది. రాజుగారి వంటశాలలో గుండిగలూ వార్పులూ పెరిగాయి. ఓ జత దున్నపోతులు సంతల నించి, అంగళ్లనించి వస్తున్నాయి. సమస్య లేదు. ఇక మిగిలింది బండితోపాటు వెళ్లాల్సిన మనిషి. రాజు తలుచుకుంటే మనుషులకు కొరతా? రాజ్యంలో చాటింపు వేయిం చాడు. మంత్రులు, దండనాయకులు ఊరి మీదపడి తిథులవారీగా మనుషుల్ని నిర్ణయించి ఖాయం చేశారు. ఆ రోజు సుష్టుగా భోంచేసి వేళకు సిద్ధంగా ఉండాలని రాజాజ్ఞ జారీ చేశారు. కాదని తిరస్కరిస్తే ఆ మనిషిని కోట గుమ్మంమీద ఉరితీస్తారని హెచ్చరిక జారీ చేశారు. ‘ఏదైతే ఏమైంది, కనీసం అక్కడికి పోతే బ్రహ్మ రాక్షసుణ్ణి కళ్లారా చూడనైనా చూడవచ్చు, అదే బాగు’ అనుకు న్నారు పురజనం. మాట తేడా రాలేదు. రాజు హ్యాపీ, రాక్షసుడు హ్యాపీ! కొడవటిగంటి కుటుంబరావు తన కథలో ఏమంటారంటే– పాలక వర్గానికి రకరకాలుగా సమాజాన్ని దోచుకునే వెసులుబాటు ఉంటుంది. రక్షిం చాల్సిన రాజు హాయిగా ఓ ఒప్పందం చేసుకుని తాంబూ లాలిచ్చేశాం, మీ చావు మీరు చావండన్నారు. ఆయన భోగాలు తరగలేదు. ఆయన స్వజనం ఎవరూ బలికి వెళ్లరు. అంతా సవ్యంగా, పద్ధతిగా చికాకు లేకుండా కథ నడిచింది. కరోనా ఉపద్రవం వచ్చినప్పుడు నాకు బకాసురుడి కథే గుర్తుకొచ్చింది. ఉన్నఫళంగా లాక్డౌన్ విధించారు రాజుగారు. ఒక్క ప్రయాణసాధనం లేదు. ఎక్కడివారు ఎక్కడెక్కడో చిక్కుకుపోయారు. లక్షలాదిమంది పిల్లా పెద్దా, ఆడామగా పరాయి ప్రాంతంలో చిక్కడిపో యారు. మరోవైపు మృత్యుభయం. ఏంచేస్తారు పాపం, రోడ్డునపడ్డారు. అసలే మనది రామరాజ్యం కదా. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అనుకుంటూ సొంత నేలకు పయనమయ్యారు. అదొక దుఃఖపూరిత సన్ని వేశం. దేశం యావత్తూ కంటతడి పెట్టింది. అవకాశం ఉన్న తల్లులు తలోముద్ద అన్నం పెట్టారు. జాలిపడ్డారు. రాజుగారు సాయపడుతున్న వారికి దణ్ణాలు పెట్టిం చారు. గంటలు మోయించి జేజేలు చెప్పించారు. దీపాలు వెలిగించి హారతులు ఇప్పించారు. కరోనాతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. దాంతో కలిసి జీవించడం అనివార్యం అన్నారు. జనం బిక్కమొహాలు వేసుకున్నారు. బయటకు రాకండి, సుఖంగా ఇంట్లోనే బతికె య్యండి అంటూ రాజుగారు భరోసా ఇచ్చేశారు. అదే వన్నా అంటే మహా మహా దేశాలు నిస్సహాయంగా చూస్తూ ఊరుకున్నాయ్. మనమెంత అంటూ నిట్టూ ర్చారు. జనం ప్రతిగా నిస్పృహతో నిట్టూర్చారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆధునిక మానవుడు గొప్ప వాడు, చాలా గొప్పవాడు. బకాసురుణ్ణి మంత్రాంగాన్ని, కరోనాని కట్టడి చేసే వ్యాక్సిన్‌ని కనిపెడతాడు. మనిషి అసహాయ సూరుడు! జై హింద్!! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
వార్తల కెక్కని పీవీ చాణక్యం
అవి 1994 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు. రాష్ట్రంలో పదో అసెంబ్లీ కొలువు తీరింది. తిరుగులేని మెజా రిటీతో ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ఆసీనులయ్యారు. దిష్టి తగిలిందో ఏమో ఏడాది తిరక్కుండా సంక్షోభం మొద లైంది. ఆగస్టు సంక్షోభంగా పేపర్లకు ఎక్కింది. కలయో, వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో గానీ గట్టిగా ఉన్న టీడీపీ పీఠం తాలూకు కూసాలు కదిలాయి. ఎన్టీఆర్‌కి పాపం దెబ్బ మీద దెబ్బ! కో పైలట్ నాదెళ్ల కొట్టిన దెబ్బ సర్దుకోక ముందే తిప్పు కోలేని, వూహించని పోటు. యన్టీఆర్ తల్లడిల్లి పోయారు. కనిపించిన వాళ్లందరి దగ్గరా గోడు వెళ్ల బోసుకున్నారు. చంద్రబాబుని కాళ్లు కడిగిన అల్లుడని కూడా చూడక నానా దుర్భాషలాడారు. నిస్సహాయ స్థితిలో పడ్డారు పాపం. జరిగిన అన్యాయాన్ని నిలదీసిన పెద్ద మను షులు లేరు. న్యాయాన్యాయాలు కాదు. ఇక్కడ బలా బలాల సమస్య. ఇతరేతర కారణాల వల్ల యన్టీఆర్ మద్దతుదార్లు బాగా క్షీణించారు. రకరకాల వ్యూహ రచనలతో మీడియా యావత్తు చంద్రబాబుకి పూర్తిగా కొమ్ము కాసింది. అల్లుడు దశమగ్రహమంటూ, శని గ్రహమంటూ ఎన్టీఆర్ మాట్లాడిన అనేకానేక ఆడి యోలు రాష్ట్రంలో హల్చల్ చే శాయ్. ప్రజలు చాలా సందర్భాలలో ఉదాసీనంగా ఉంటారు. అంతకు ముందు దాకా ఎన్టీఆర్ బొమ్మల్ని పూజామందిరాల్లో పెట్టుకున్న జనం ‘ఇది పూర్తిగా మీ కుటుంబ సమస్య. కొట్టుకు చావండని’ నిమ్మకు నిరెత్తినట్టు ఉండి పోయారు. ఇంకొంచెం వివరాల్లోకి వెళితే ఆసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి ఘనంగా 216 సీట్లు, జాతీయ కాంగ్రెస్‌కి కేవలం 26 కుర్చీలు, ఉభయ కమ్యూనిస్టులు వెరసి 34 సీట్లు, మిగిలిన పార్టీలన్నీ కలిస్తే కేవలం 6 స్థానాలు వచ్చాయి. ఎన్టీఆర్‌పై వేర్వేరు కారణాల వల్ల వచ్చిన వ్యతిరేకతని మొత్తంగా కలిపి జనానికి భూతద్దంలో చూపించారు. వైస్రాయ్ హోటల్ భూమికగా చంద్రబాబు తన మైండ్ గేమ్‌ని ఆరంభించారు. 170 మంది అసెంబ్లీ సభ్యులు నాగూట్లో ఉన్నారని నమ్మపలికారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సైతం పూర్తిగా విశ్వసించారు. దీనివల్ల కప్పదాట్లు లేకుండా ఆగాయి. అప్పుడు ఎన్టీఆర్‌తో కేవలం 28 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆయన ఆక్రోశం ఆగ్రహం హద్దులు లేకుండా పోయాయి. అంతా జారిపోయారు. ఎన్టీఆర్ నిరాశ నిస్పృహల మధ్య పీవీ నరసింహారావుని కూడా కలిశారు. ఇంటికి పిలిచి బొబ్బట్లతో మంచి తెలుగు భోజనం పెట్టారు. వాళ్ల కుటుంబ వ్యవహా రంలో ఆయనెందుకు తలపడతాడు? పైగా ఏది ఏమైనా ఆయనకు ఒనగూరే లాభమూ లేదు. నష్టమూ లేదు. కోట బీటవారితే కొంత లాభమే. మౌనం వహించారు. అయితే, పి.వి. గొప్ప చాణక్యపు ఎత్తుగడ వేశారు. అదేంటంటే పూర్వ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల విజయభాస్కర రెడ్డికి తన వ్యూహాన్ని వివరించారు. ‘మనవాళ్లని టీడీపీ రామా రావు గ్రూపుతో కలుపు. సీఎం ఆయనే. మనకి మంత్రి పదవులు కూడా వద్దు’ అనగానే కోట్ల అందరం కలి సినా యాభై నాలుగే అని చప్పరించారు. మంత్రి పదవులు ఎరవేస్తే మరి కొందరొస్తారు. కొందరు కొందర్ని తెచ్చుకుంటారు. అసలు కవ్వం వేసి కదల్చకుండానే వెన్న పడాలంటావేమమయ్యా అన్నారు. పీవీ. ‘అసలేమో లేదనుకున్నవాళ్లం వందకి వచ్చాం కదా. నువ్ కూడా మైండ్‌గేమ్‌కి పావులు కదిలించు’ అనగానే మీరుంటారా అన్నారు జంకుతో కోట్ల, ఎప్పుడూ నవ్వని పీవీ చిరునవ్వు నవ్వి, ‘నా ఢిల్లీ సీటు వదిలి ఇక్కడ ఉండటమా? అక్కడ కుర్చీ ఏ గంటకా గంటే లెక్క! అందుకని ఆ విధంగా ముందు కెళ్లు. తక్కువలుంటే సామదాన భేద దండోపాయాల ద్వారా సాధిద్దాం. రాజకీయంలో అసాధ్యమంటూ ఏమీ ఉండదు’ అని పరిపరివిధాల హితబోధ చేశారు. పి.వి. అయితే, కోట్ల అందుకు సాహసించలేదు. ఆ వ్యూహం ఫలించి వుంటే టీడీపీ చెక్కలు ముక్కలై పోయేది. నల్లేరు మీద బడిలా ఆ సందర్భం నడి చింది. పీవీ వ్యూహాలు అప్పటికీ యిప్పటికీ వెలుగు లోకి రాలేదు. ఆయనే ప్రత్యక్షంగా చదరంగంలోకి దిగితే, బాబుకి ఎక్కడికక్కడ చెక్‌లు పడేవి. పదవి పోయి అపకీర్తి మాత్రం మిగిలేది. నిశ్శబ్దంలోనే ఉండి పోయింది. పీవీ మహా మేధావి, రాజకీయ దురంధ రుడు, నిత్సోత్సాహి. ఆయనకు అక్షర నీరాజనం. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు /విశ్వదాభిరామ వినురవేమ! అన్న పద్య పాదం సూక్తిగా ప్రచారంలోకి వచ్చింది. మొన్న ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం చేతగాని అసమర్థ ఆర్థిక నిర్వహణని కాంగ్ తూర్పారపట్టింది. వుతికి ఆరేసింది. అక్షింతలు వేసింది. ముక్క చీవాట్లు పెట్టింది. ఇలా పద హారు రకాలుగా చెప్పుకోవచ్చు. కేటాయించిన నిధుల్ని సద్విని యోగం చేయలేక వృథాగా మురగపెట్టారని కంప్ట్రోలర్ ఖాతాల వారీగా లెక్కలు చెప్పి మరీ మందలించారు. ప్రపంచ ఆర్థిక సంస్థలకి సూచనలు యిచ్చేది మేమే, రిజర్వ్ బ్యాంక్, మాతో సంప్రదించాక అడుగు ముందుకు వేస్తుంది. చిదంబరానికి చిట్కాలు నేర్పింది మేమే. మన్మోహన్‌కి కూడికలు హెచ్చవేతలు మాదగ్గరే దిద్దుకున్నారని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకుంటారు. మరి అంతా కలసి మూకుమ్మడిగా తప్పులో కాలెందుకు వేశారో వారే చెప్పాలి. నక్కలు బొక్కలే వెదుకుతా యని సామెత. తనుదిగి పోయాక ఏమి జరిగినా, జరగక పోయినా నా రోజుల్లో... అంటూ చంద్రబాబు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోతారు. అదేదో ఆంధ్రుల స్వర్ణయుగం అయినట్లు కబుర్లు చెబుతారు. ఏ మంచి పనినీ హర్షించే సహనం ఆయనకు లేదు. సరైన లీడర్‌కి వుండా ల్సిన మొదటి లక్షణం ఆ సహనం, ఓర్పు. ఆయనని కిందటి ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు కాబట్టి యీ ప్రజలు లేదా ఓటర్లెవరూ తనవారు కాదు. ఓటర్లు ఎప్పుడూ వెర్రి గొర్రెల్లా ఒకే ఒక అరుపుతో మందగా వేరే పక్క ఆలోచ నలు లేకుండా ఉండాలని చంద్రబాబు కాంక్ష. కానీ ఎల్లకాలం అలాగే సాగాలంటే చాలా కష్టం. మా వూర్లో ఒక పెద్ద ఆసామి ఆడపడుచులకు చంద్రన్న ఆవుల పంపిణీ పబ్లిసిటీ గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ వుంటాడు. ఒకే ఆవు, ఒక ఆడ పడుచు, ఒక నినాదం అంతే! కొన్ని లక్షల మందికి ఆవుల పంపిణీ జరిగినట్లు సీన్ క్రియేట్ చేశారు. ఎండ మావిలో నీళ్లు తాగించారు. ఓటర్లు కూడా తగి నట్టుగానే బదులు తీర్చుకున్నారు. చెల్లుకు చెల్లు! ఆఖరికి పంటల బీమా ప్రీమి యంలు కూడా బకాయిలే! చంద్రబాబు విశ్వ విఖ్యాత బకాయిసురుడు! అతి భయంకరమైన ఓటమిని ఏడాది గడిచి పోయినా నేత జీర్ణించుకోలేకపోతు న్నారు. అందుకని సీనియర్, జూనియర్ ప్రతి దానికీ వక్ర భాష్యాలు చెబుతూ కొంత సంతృప్తి చెందుతున్నారు. ఈ సంవత్సరం కూడా రుతుపవనాలు అనుకూలంగా వున్నాయి. అందుకు రాష్ట్ర వాసిగా ఆనందించాలి. గడచిన సంవత్సరం పంటలు బాగు న్నాయి. కరోనా గడ్డుకాలంలో కూడా జగన్ యిచ్చిన మాట లన్నీ గడువులు ముందుకు జరిపి మరీ నిలబెట్టుకున్నారు. ఇలాంటి ఒక్క ఉదాహరణని తన హయాంలో చంద్రబాబు చూపగలరా! ప్రతిదానికీ అవినీతి ఆరోపణలు చెయ్యడం ఆయనకు హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. మాస్కుల్లో అవినీతి జరిగిందని ఆరోపణ! ఎన్ని మాట్లాడినా ఎవ్వరూ దేన్నీ పట్టిం చుకోవడం లేదు. ఇది తెలుసుకొని కొంచెం ప్రభావవంతంగా కాలక్షేపం చెయ్యాలి. ప్రజలు అంతటి గుణపాఠం చెప్పినపుడు మర్యాదగా చంద్రబాబు రాజకీయ సన్యాసం చేయాలి. చివరకు జరిగేది అదే! అయితే స్వయంగా సన్యసించి ఆత్మగౌరవం నిలుపుకున్నారా? లేక ప్రజలు పట్టుబట్టి సన్యాసం అంట గట్టారా? అనేది ముఖ్యం. ఎన్నాళ్లు పాలిస్తే తృప్తి, ఎన్ని తరాలు పాలిస్తే సంతృప్తి? ఆయన చెప్పిన చెప్పని సంక్షేమ పథకాలన్నింటికీ యీ గడ్డు సమయంలో కోట్లాది రూపాయలు వారి వారి ఖాతాల్లో జమ పడ్డాయి. పైసా లంచం లేదు. కాళ్ళరిగేట్టు ఆఫీసుల చుట్టూ తిరగడం లేదు. అందుకే ప్రజలు ఆనందంగా వున్నారు. రైతన్నలు, నేతన్నలు, పేద కాపు గృహిణులు జగన్ పుణ్యమా అని గలగలలాడుతూ ఖుషీగా వున్నారు. ఈ పంపిణీలో తరు గులు వుండవ్. అన్నీ మాట ప్రకారం పైసలతో సహా బ్యాంక్‌లో జమ పడుతుంది. ఆ డబ్బు ఇతర అప్పులకి చెల్లదు గాక చెల్లదు. అది అక్క చెల్లెమ్మలకే అంకితం. మా పథకాలనే మసిపూసి మారేడుకాయ చేసి పంచి పెడుతున్నారని ఒక ఆరోపణ చేశారు చంద్రబాబు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాక ముక్కున వేలేసుకున్నారు. అందరి సంక్షేమం దృష్ట్యా జగన్ ఆరంభించిన పథకా లలో మారేడు కాయలేవో, నేరేడు కాయలేవో నిగ్గు తేల్చుకోవాలి. చంద్రబాబు హయాంలో పథకాలను నామకరణాలు చేయడంతోనే అయి పోయేవి. ఫండ్స్ అయితే అస్సలే రాలేవి కావు. పైగా సామాన్య ప్రజలని మీ కలెక్టర్‌ని, మీ అధికారులని నిల దీయండి అని వుసిగొల్పేవారు. అదంతా ఒక పీడకల అని దెబ్బ తిన్న అధి కారొకరు వాపోయారు. జగన్మోహన్రెడ్డి ముందు దేనికైనా ఫండ్స్ విడుదల చేసి తర్వాత మాట్లాడతారని ప్రజల్లో నమ్మకం వుంది. బాబు పెట్టిన బకాయిల్ని కూడా యీ ప్రభుత్వం క్లియర్ చేసిన సందర్భాలు న్నాయి. ఉత్తుత్తి ప్రచారం వుంటే చాలు. బాబు ఆ చప్పట్ల మోతలో అంతా నిజంగా నమ్మేసి ఓ గంట ప్రసంగిస్తారు. ఒక ఫ్లాష్‌బ్యాక్ జ్ఞాపకం రాయలసీమలో చినుకులు లేక పైర్లు ఎండి పోయే స్థితికి వచ్చాయి. రైతులు హాహాకారాలు చేస్తున్నారు. వెంటనే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొమ్మిది కార్లు దిగారు. క్షణాల్లో ఒక వాటర్ గన్ ఎండిన చేలో ఏర్పాటైంది. బాబు వాటర్ గన్‌లో నీళ్లుతెప్పించి, వలయాకారంగా తిప్పారు. నీళ్లు కురిశాయి. మర్నాడు చంద్రబాబు లక్ష ఎకరాల్లో ఎండి పోయి వున్న పంటని కాపాడినట్టు వార్త పెల్లుబికింది. చివరకు యివన్నీ శాపాలై తగిలాయి. వ్యాసకర్త ప్రముఖ కథకుడు:శ్రీరమణ -
చెక్కించుకున్న పేర్లు మిగలవ్
కొన్ని వార్తలు మనుషుల మీద నమ్మకాన్ని గౌరవాన్ని కలిగిస్తాయి. ఇటీవలి కరోనా గత్తరతో మనలోని మానవీయత జాలి, దయ కొంచెం వైరాగ్యం మేల్కొన్నాయి. మొన్నటి సమస్యలో వేల లక్షలమంది వలసకూలీలు వేరేదారి లేక కాలినడకన స్వస్థలాలకు బయలుదేరి వెళ్ళడం ఎంతోమందిని కలిచివేసింది. వేలమైళ్లు నడిచి వెళ్ళాలనుకోడం కేవలం సొంతవూరి మీది మమకారం. కొందరు రకరకాలుగా వారికి సాయపడ్డారు. ఒక తెలంగాణారైతు తన పొలంలో పండిన పుచ్చకాయల్ని వలస కూలీలకు ఉచితంగా ఉదారంగా పంచిపెట్టాడు. ఈ వార్త మనసుని ఎంతగానో సేద తీర్చింది. దీని తర్వాత నాకు బాగా తెలిసిన ఒక పెద్ద మనిషి తన శక్తి కొద్దీ సైకిళ్లు కొని వలస కూలీలకు పంచారు. రెండువేలు ఖర్చయింది. కాని వారెంత సంతోషించారో చెప్పలేను. మూడు రోజులు ముందు వూరు చేరతామని సంబరపడ్డారు. ఇలాంటప్పుడు చేసిన, చేస్తున్న ప్రభుత్వాల మీద బురద జల్లుతూ కూర్చోడం కంటే, మన మాజీ నేత చంద్రబాబు ఓ వెయ్యి సైకిళ్లు పంచిపెట్టవచ్చుగదా. పైగా సైకిల్ తెలుగుదేశం పార్టీ గుర్తు కూడా.బాబుకి జిందాబాదుళ్లు కొట్టించుకోవడంలో ఉన్న నిషా ఇంకెందులోనూ లేదు. కావాలంటే పచ్చరంగుతో సైకిళ్లు పంచితే గొప్ప ప్రచారం కూడా కదా. వెయ్యి సైకిళ్లు టోకున కొంటే నాలుగు లక్షలకు వస్తాయి. ఎంత పుణ్యం? ఎంత పేరు, ఎంత ప్రచారం. చిన్న చిన్న త్యాగాలు కూడా చెయ్యరు గాని చేసే వారిపై విమర్శలు సంధిస్తూ నిత్యం వార్తల్లో ఉండాలని తాపత్రయ పడుతుంటారు. ఇంకా ఆయన హెరిటేజ్ షాపుల ద్వారా వలస జీవులకు ఒక గ్లాసెడు చల్లటి మజ్జిగ యిచ్చినా వారి మేలు మర్చిపోలేరు. దాని విలువ పావలాకి మించి ఉండదు. ఈ పాటి త్యాగానికి కూడా పూనుకోలేకపోతున్నారు. హైవే మీద ఆకలి తీరుస్తున్న అమీనా బేగం అపర అన్నపూర్ణ. ఆమె నిజంగా ఆ పుచ్చ రైతుకి పై నుంచి ఎన్ని దీవెనలు వస్తాయో. ఈ తల్లికి. ఎన్నిపుణ్యాలు వస్తాయో. ఎప్పుడో చిన్నప్పుడు సానెట్లుగా చదివిన ఒక బైబిలు కథ జ్ఞాపకం వస్తోంది. చాలా పాతకాలంలో చక్రవర్తి తన రాజ్యంలో ఓ కొండమీద అద్భుతమైన చర్చి నిర్మించాలని ప్రారంభించాడు. దాని ద్వారా తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలనుకున్నాడు. రాళ్లని, యితర నిర్మాణ సామాగ్రిని చేర్చడానికి గాడిదల్ని పనిలోకి దింపారు. పాపం గాడిదలకి రోజంతా కొండరాళ్లు మోయడమే పని. ఒక వృద్ధుడు వాటి శ్రమని గమనించాడు. రోజూ కొండ కింద కూర్చుని గాడిదలకు లేత పచ్చికలు మేపేవాడు. గాడిదలకు అదొక సేదతీర్చే మజిలీ అయింది. వెళ్తూ ఆ వృద్ధుణ్ణి నాలిలుతో స్పృశించి వెళ్లేవి. అందుకే వృద్ధుడు పులకించిపోయేవాడు. కొన్నాళ్లు గడిచింది. చర్చి భూమిపై ఒక అద్భుతంగా నిలిచింది. దాన్ని గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ మర్నాడు చర్చిని చక్రవర్తి ఆవిష్కరించి ప్రజలకి అంకితం చేస్తాడు. చక్రవర్తి మంది మార్బలంతో సహా వచ్చి, చర్చిని పరిశీలనగా చూసి, దానిపై ప్రముఖంగా తన చిరునామాలతో సహా తన పేరు పాలరాతిపై ఎలా చెక్కాలో శిల్పులకు ఆదేశించాడు. తెల్లవార్లూ చెప్పింది అక్షరం పొల్లు పోకుండా శిల్పులు చెక్కారు. వెన్నెల వెలుగులో చక్రవర్తి పేరు ప్రతిష్టలు నక్షత్రాల్లా మెరిసాయి. తెల్లవారింది చక్రవర్తి చర్చి ఆవిష్కరించడానికి పెద్ద ఊరేగింపుతో వచ్చారు. కొండ దగ్గరకు వచ్చేసరికి చర్చిమీద పేరు చూసి రాజు నివ్వెర పోయాడు. అంతలోనే పట్టరాని కోపంతో ఊగిపోయాడు. తనపేరు శిలాక్షరాలతో ఉండాల్సిన చోట మరోపేరు చెక్కబడి ఉంది. స్వయంగా పేరుచెక్కిన శిల్పులు చక్రవర్తి కాళ్లమీద పడ్డారు. ఎవడిదా పేరు అని రాజు హుంకరించాడు. గాడిదలకి ఓర్పు సహనాలతో ప్రతిఫలం ఆశించకుండా పచ్చికలు అందించిన వృద్ధుడిపేరుగా గుర్తించారు. చక్రవర్తి నిర్ఘాంతపోయాడు. అన్ని పైనించి గమనించే రాజాధిరాజు, మహాచక్రవర్తి ఒకడుంటాడు ప్రభువా వందనం నన్ను మన్నించమని చక్రవర్తి తలదించుకున్నాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఏడాది పాలన
పథకాలు అందరూ ప్రారంభిస్తారు. తు.చ. తప్పక అమలులో పెట్టేవారు కొందరే ఉంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పథకాల నడక జనరంజకంగా ఉంది. అన్నింటా మేలైంది మద్యపానానికి బిగించిన పగ్గాలు. ఎవరూ దీని జోలికి వెళ్లరు. వెళ్లినా ఆచరణలో అసాధ్యమంటారు. కానీ, ఒక మంచి ప్రయత్నానికి నాంది పలకడం పెద్ద సాహసం. బెల్ట్‌షాపులు మూత పడ్డాయ్. ధరలు అందని ఎత్తుకు వెళ్లాయి. కొంచెం తేడా కనిపిస్తోంది. ఇంకా కొన్నాళ్ల తర్వాత మరిన్ని సత్ఫలితాలు కనిపిస్తాయి. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ మద్యపానాన్ని అంగీ కరించదు. అది ఆర్థిక, ఆరోగ్య, సాంఘిక, నైతిక అంశాలను దెబ్బతీస్తుంది. మధ్యతరగతి దిగువ మధ్య మరియు పేద కుటుంబాలు ఇంకా చితికిపోతాయి. ఖజానాకి కాసులు వస్తాయని గత ప్రభుత్వం మందుని ప్రోత్సహించింది. దురలవాట్ల మీద ఆంక్షలు విధిగా ఉండాలి. ఏపీ సీఎం వైఎస్ జగన్ స్త్రీ జన పక్షపాతి. కొన్ని ఆర్థిక ప్రయోజనాలను తల్లులకే నేరుగా ముట్టచెబుతున్నారు. జగన్ పాలనలో మహిళలకు ధైర్యం వచ్చింది. గొంతు లేచింది. జగనన్న ఆదేశిస్తే తాగే భర్తలని అలవోకగా కట్టడి చేయగలరు. పొడిగా ఉండేవారికి ప్రోత్సాహకాలు అంటే స్పందన తక్కువగా ఉండదు. ఏడాది పాలనలో మద్యం వినియోగంపై దృష్టి సారించడం నిజంగా సాహసం. చాలామంది సంస్కారవంతులకు నచ్చింది గ్రామ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చడం. మా తరం అంటే యాభై అరవై ఏళ్ల క్రితం పూరిపాకల్లో చదివాం. పశువులు, పందులు బడిపాకల్లో బడిపక్కన ఉండేవి. బ్లాక్ బోర్డ్ తెలియదు. బల్లలు తెలియవు. ఫ్యాన్లు, లైట్లు సరేసరి. మళ్లీ ఇంటికి వెళ్తేనే మంచినీళ్లు. ఇప్పుడీ తరగతి గదులు చూస్తుంటే మళ్లీ బళ్లో చేరి హాయిగా చదువుకోవాలనిపిస్తోంది. పైగా, ఇంగ్లిష్ మీడియంలో భవిష్యత్‌పై కొండంత ఆశతో. ఇది నిజంగా విప్లవాత్మకమైన నిర్ణయం. జగన్మోహన్రెడ్డి ఒక కుట్రని ఈ విధంగా భగ్నం చేశారని చెప్పవచ్చు. మన మేధావులు నోరుతెరిచి మాట్లాడరెందుకో?! నేడు ప్రపంచమంతా ఒక పందిరి కిందకు వచ్చింది. ఎవరు ఎక్కడైనా చదవవచ్చు, బతకవచ్చు. భాష విషయంలో మడి కట్టుకు కూర్చునే చైనా, జపాన్‌లు కూడా ఏబీసీడీలు దిద్దడం తప్పనిసరి అయింది. లేకుంటే వృత్తి వ్యాపారాలు నడవవు. ఆర్థిక లావాదేవీలు ఆగిపోతాయ్. టెక్నాలజీ మొత్తం ఆంగ్ల పునాదుల మీద నిలబడి ఉంది. మాతృభాష ఎటూ ఇంట్లో వస్తుంది. అతిగా తోమక్కర్లేదు. చిన్నయసూరి బాల వ్యాకరణంతో, అమర కోశంతో ఈ తరం నించి ఎక్కువ పని ఉండదు. ఇంగ్లిష్ మాత్రం చాలా ముఖ్యం. భవిష్యత్తుకి ఆక్సిజన్ లాంటిది లేకపోతే వెంటిలేటర్స్ మీద బతకాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నట్టు క్లాస్‌రూమ్‌లతో బాటు మంచి టీచర్లు ముఖ్యం. వారంతా శ్రద్ధాసక్తులతో ఆసక్తికరంగా బోధిం చాలి. ఆంగ్ల భాషకి ఉచ్ఛారణ కూడా ముఖ్యం. తేడా వస్తే, నలుగురిలో నవ్వుల పాలవుతారు. టీచర్స్ని ముందుగా తయారు చేసుకోవాలి. బీబీసీ వార్తల్లాంటివి పిల్లలకు నిత్యం వినిపించాలి. ఇప్పుడు ఆంగ్ల ఉద్యమానికి దోహదం చేసే సాఫ్ట్వేర్ కుప్పలు తెప్పలుగా వచ్చిపడింది. వాటిని అందుబాటులోకి తేవాలి. చాలామంది అనుకునేట్టు ఇంగ్లిష్ అంత తేలికైన భాషేమీ కాదు. అక్షరాలు తక్కువేగానీ స్పెల్లింగ్‌లు ఎక్కువ. పలుకుబడులు ఎక్కువ. మద్యపానం దశలవారీ అమలు తరువాత, ఇంగ్లిష్ మాధ్యమం గొప్ప నిర్ణయం. కుట్రలు భగ్నమైనప్పుడు భయస్తులు అల్లరి చేయడం సహజం. మళ్లీ ఒకసారి ముందుకువెళ్లి మద్యపాన నిషేధం గురించి మాట్లాడుకుందాం. ఎవరి సంగతి ఎలా ఉన్నా, మన సమాజంలో చదువుచెప్పే ఉపాధ్యాయుడు మతాతీతంగా ప్రార్థనా మందిరాల పూజారులు, లా అండ్ ఆర్డర్ పరిరక్షించే పోలీసులు, రకరకాల గౌరవాలతో ఉచిత ప్రభుత్వ పింఛన్లు పొందేవారు, ఇంకా పెద్ద మనసున్నవారు విధి వేళల్లోనే కాదు విడి వేళల్లో కూడా మద్యంమీద ఉండదారు. టీచర్ అంటే పిల్లలకు దేవుడితో సమానం. ఒకసారి జార్జి చక్రవర్తి కొడుకుని చూడటానికి స్కూల్‌కి వస్తానని కబురంపాడు. వెంటనే ఆ స్కూలు హెడ్మాస్టర్ వినయంగా కబురంపాడు. ‘చక్రవర్తీ! తమరు రావద్దు. మీరొస్తే రాచమర్యాదలో భాగంగా నేను టర్బన్ తీసి తమరికి వందనం చేయాలి. ఇంతవరకూ మా పిల్లలు ఈ నేలపై నన్ను మించినవారు లేరనే నమ్మకంతో ఉన్నారు. నేను టర్బన్ తీస్తే ఆ నమ్మకం వమ్ము అవుతుంది. తర్వాత మీ దయ’ ఇదీ కబురు సారాంశం. ఇక ఆ చక్రవర్తి ఎన్నడూ స్కూలు వైపు వెళ్లలేదు. ఇది ప్రభుత్వానికి, సమాజానికి సహకరించాలి. లేదంటే వారు వేరొక వృత్తిని ఎంచుకోవాలి. సీఎం జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలన్నీ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
భూగోళానికే మడి వస్త్రం చుట్టిన కరోనా
ఇన్నాల్టికి ఒక ఆశావహమైన చిన్న వ్యాసం (16.5.2020 సాక్షి డైలీలో) వచ్చింది. తెలుగువాళ్లు పసుపు, నిమ్మకాయ, లవంగం, వెల్లుల్లి, ఎక్కువగా నిత్యం వాడతారు. ఇదే శ్రీరామరక్ష అని నెల్లూరు డాక్టర్‌గారు భరోసా ఇస్తున్నారు.పూర్వం మన పెద్దవాళ్లు ఒక బలవర్ధకమైన రుచికరమైన ఆహారం చేసి పెట్టేవారు. రాత్రిపూట కావల్సినంత అన్నంలో పాలుపోసి బాగా మరిగించి, తగిన వేడికి చల్లార్చి దాన్ని తోడు పెట్టేవారు. తెల్లారి పొద్దునకది అన్నంతో కలిసి తోడుకునేది. అందులో నీరుల్లిపాయ ముక్కలు, పది మిరియపు గింజలు వేసేవారు. తినేటప్పుడు ఆ పెరుగు తోడులో కాసిని నీళ్లు, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, శొంఠి పొడి కలుపుకునేవారు. ఇవన్నీ ఒకనాటి మన సంప్రదాయాలు. గ్లోబలైజేషన్ నిషాలో అన్నింటినీ వదిలేశాం. ఇప్పుడు అన్నింటినీ తల్చుకుని, నాలిక కరుచుకుంటున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలకు లేదుగానీ గోదావరి జిల్లాలకు ‘తరవాణి కుండ’ బాగా అలవాటు. మరీ ముఖ్యంగా వేసవికాలం రాగానే ఈ కుండని ఓ మూల ప్రతిష్ట చేస్తారు. కుండలో అన్నం, నీళ్లు వేసి పులియబెడతారు. దాంట్లో వేయాల్సిన దినుసులు వేస్తారు. పుల్లపుల్లగా ఉండే నిమ్మ, దబ్బ ఆకులు ముఖ్య దినుసు. ఇంకా సైంధవ లవణం లాంటివి కొన్ని ఉండేవి. ఆ కుండలో నీళ్లు పర్మింటేషన్‌తో ఒక రకమైన పుల్లని రుచితో మారేవి. ఇంటిల్లిపాదీ తరవాణి నీళ్లని తాగేవారు. దీంట్లోని బలవర్ధకాల గురించి తెలియదుగానీ, ఇది మంచి జఠరాగ్ని కలిగిస్తుందని చెప్పేవారు. అయితే ఇది శ్రోత్రీయ కుటుంబాలలో కనిపించేది కాదు. ఇందులో అన్నం పులియబెట్టడం లాంటి ప్రాసెస్ ఉండేది కాబట్టి అన్నం అంటు, ఎంగిలి కాబట్టి కొంత అన్‌హైజనిక్ అనీ దూరం పెట్టి ఉంటారు. కానీ తరవాణిలో ఉన్న గుణదోషాలను ఎవరూ చెప్పరు. నాడు మోహిని అమృతం పంచాక తెలుగుజాతికి దీన్ని కానుకగా ఇచ్చిందని ఐతిహ్యం. గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఇది ఉంది. పూర్వం మన పెరటి దొడ్లలో కరివేప, నిమ్మ, దబ్బ, అరటి చెట్లు విధిగా ఉండేవి. అల్లం కొమ్ములు తులసి మొక్క మొదట్లో భద్రపరిచేవారు. ఫ్రిజ్‌లు లేని రోజుల్లో నేలలో పెట్టిన అల్లం ఎన్నాళ్లయినా పచ్చిగా, తాజాగా ఉండేది. మహా అయితే చిగురు వేసేది. నిమ్మపళ్లు నిత్యం అందుబాటులో ఉండేవి. పైగా ఏడాదిలో అన్ని రోజులూ నిమ్మకాయలు వస్తూనే ఉంటాయి. అంటే మన నిత్య వంటలో పదార్థాల్లో నిమ్మ ఒక భాగంగా ఉండేది. అలాగే దబ్బ. ఇప్పుడిప్పుడు దాని వాడుక బాగా తగ్గిపోయింది. మార్కెట్ లేనందున శ్రద్ధ లేదు. ప్రపంచీకరణ మహా ఉప్పెనలో ఎన్నో మంచి చెడులూ కొట్టుకుపోయాయి. మొన్న కరోనా ఉపద్రవం వచ్చినప్పుడు లాకౌట్లు చూసి, మొత్తం గ్లోబ్‌కి మడి వస్త్రం చుట్టినట్టు ఉందని ఓ మిత్రుడు చమత్కరించాడు. ధైర్యం చెప్పిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. మీ అనుభవంలోంచి ఇంకా కొన్ని ధైర్య వచ నాలు చెప్పండి. మా యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భయపెట్టకండి, ధైర్యం చెప్పండని పెద్దలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
కరోనాతో కలిసి బతకాల్సిందే!
ఈ మాట చాలా ముందస్తుగా అన్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మీద నిప్పులు చెరిగారు. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ అన్నారని కరోనా తీవ్రత గురించి ఆయనకేం తెలియదని.. మాట లొచ్చి మైకు దొరికిన టీడీపీ నాయ కులంతా దుయ్యబట్టారు. పది, పదిహేను రోజుల వ్యవధిలో కింది నుంచి పైదాకా ఇదే మాటకి వచ్చి స్థిరపడ్డారు. ముందన్నవాడు దోషి. తర్వాతి వారంతా దిశానిర్దేశకులు. మన భారతదేశంలో ముందుగా కరోనా వైరస్ బారిన పరోక్షంగా పడి, బతికి బట్టకట్టినవారు పాండవులు. వారు ద్వాపర యుగంలో పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని ఏడాది అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. ఇది చాలా ప్రమాద కరం. చాలా భయంకరం! తేడా వస్తే మళ్లీ పన్నెండేళ్లు అర ణ్యవాసం... ఇక ఇంతే సంగతులు. అందుకని పాండవులు, ద్రౌపది చాలా విపత్తు మధ్యన ఏడాది గడిపారు. దుర్యో ధనాదులు ఎలాగైనా వీరి జాడ తెలుసుకోవాలని గూఢచా రులను పెంచారు. పాండవులు కీచకుడితో, బకాసురుడితో దెబ్బలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు జనమంతా జాగరూక తతో ఉంటే కరోనా ఏమీ చెయ్యదని అంటున్నారు. ఈలోగా నడుస్తున్న ప్రభుత్వంమీద ఏదో ఒక రాయి విస రడం అపోజిషన్‌కి ఉత్సాహం. వారు నిత్యం వార్తల్లో ఉండకపోతే మరుగున పడిపోతామని భయం. అంతేగానీ ఇలాంటి సంకట స్థితిలో మన విమర్శలని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనే ఆలోచనే ఉండదు. కరోనాతో కలిసి జీవించటమంటే, చిన్న చిన్న ఉపకారాలు అవసరంలో ఉన్నవారికి చేస్తే చాలు. అదే పదివేలు. పాకిస్తాన్ యుద్ధ సమయంలో నాటి మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి– దేశం కోసం ప్రతి ఒక్కరూ ఒక్క చపాతీ తగ్గించుకుని త్యాగం చెయ్యండని అభ్యర్థించారు. దేశం బాగా స్పందిం చింది. ఇప్పుడు కూడా అన్నానికి అలమటిస్తున్న వారెం దరో ఉన్నారు. ఒక్క పిడికెడు మెతుకులు అన్నార్తులకు తీసిపెట్టండి. పుణ్యం పురుషార్థం. పంచగలిగిన వారు పదంటే పది పాల ప్యాకెట్లు పంచండి. ఇప్పుడు అందరం మంచి ఆహారం తీసుకోవలసిన సమయం. పోనీ రెండు గుడ్లు, ఏదైనా ఒక పండు. వీటికి ఏమాత్రం శ్రమ పడన క్కర్లేదు. జేబులో చెయ్యిపెట్టి కొంటే చాలు. మీరు కాకుంటే బోలెడు స్వచ్ఛంద సంస్థలు సేవ చేస్తున్నాయ్. వారికి వ్వండి. మహా ప్రసాదంగా పంచిపెడతారు. వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్నాడు మహాకవి గురజాడ. ఇంకా జరుగుబాటు, ఆర్థిక స్తోమత ఉన్న పింఛన్‌దార్లు తమ పెన్షన్‌ని పూర్తిగా లేదా పాక్షికంగా త్యాగం చెయ్యొచ్చు. సర్వీస్‌కంటే అధికంగా పెన్షన్ స్వీక రిస్తున్నవారు చాలామంది ఉంటారు. అది వారి హక్కే కావ చ్చుగానీ ఈ విపత్కర పరిస్థితిలో ప్రపంచాగ్నికొక సమిధని ఆహుతి ఇవ్వచ్చు. ఈ తరుణంలో వాకిట్లోకి వచ్చే కూరల బండ్ల దగ్గర, పండ్ల దగ్గర గీచిగీచి బేరాలు చెయ్యకుండా కొనండి. చాలు, వారిలో అత్మస్థైర్యం పెరుగుతుంది. అందులో కొంతభాగం పండించే రైతుకి కూడా చేరుతుంది. అనుభవజ్ఞులు సూచించిన జాగ్రత్తల్ని పాటించండి. వ్యక్తి గత పరిశుభ్రత ముఖ్యం. ఎవర్నీ రాసుకు, పూసుకు తిరగ వద్దు. ఎక్కడైనా ఏ రేషన్ షాపుదగ్గరైనా, ఏ బ్యాంక్ వద్ద యినా రద్దీ చెయ్యద్దు. అందరికీ ఇస్తారు. ఇవ్వాళ కాకుంటే రేపు. బ్యాంకులో మీ ఖాతాలో జమ అయ్యాక ఆ డబ్బు ఇక మీదే. ఒక్కరోజు కొందరు సంయమనం పాటిస్తే చాలు. దొరికినంతలో మంచి ఆహారం తీసుకోండి. ఖరీదైనవి చాలా గొప్పవని భావించవద్దు. ఆకుకూరలు చాలా మంచిది. దేశవాళీ పళ్లు బలవర్ధకమైనవి. స్తోమతగల ప్రతివారూ తమచుట్టూ ఉండే నాలుగైదు కుటుంబాల యోగక్షేమాల్ని, ఆకలినీ పట్టించుకుంటే చాలు. ఈ తరు ణంలో దీనికి మించిన దేశభక్తి దేవుడి భక్తి వేరే లేదు. అపోజిషన్ వాళ్లం కాబట్టి, విధిగా రాళ్లు వెయ్యాలనే సంక ల్పంతో ఉండవద్దు. మంచి సూచనలివ్వండి. గత్తరలో ఉన్న ఈ ప్రజని మరింత గత్తర పెట్టకండి. మా ఊళ్లో ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు. సహృద యుడు, సంస్కారి. వందల ఎకరాల భూమి ఉండేది. పొలం పనులు వస్తే అట్టే ఊడ్పులు, కలుపులు, కోతలు వగైరాలకు ఊరు కూలినాలి జనమంతా వెళ్లేవారు. ఆయ నకో లెక్క ఉండేది. ఆడపిల్ల పైట వేసుకుంటే, మగ పిల్లాడు పంచెకట్టుకుంటే అందరితో సమంగా కూలి ముట్టజెప్పే వారు. అందుకని అయిదారేళ్ల ఆడపిల్లలకి గౌను మీద పైట, నిక్కర్‌మీద పంచె బిగించి చేలో దిగేవారు. ఈ మోసం అందరికీ తెలుసు. ఒకసారి ఆ భూస్వామితో అంటే– ‘పర్వాలేదులే, అయినా అంతా వాళ్ల కష్టం నించి వచ్చిం దేగా. నామీద ఇష్టంతో, దయతో వచ్చి చాకిరీ చేస్తున్నారు. ఇంతకంటే మనం చేసి చచ్చే పుణ్యకార్యాలేముంటాయ్’ అన్నాడు. అదీ మన భారతీయత. అదీ మన సంప్ర దాయం. గుర్తు చేసుకుని కరోనాతో కలిసి జీవిద్దాం. శుభమస్తు! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
క్షీరసాగర మథనం
చాలా రోజుల తర్వాత నిషా తిరిగి మబ్బులా ఆవరించింది. వీధులమీద చిత్రవిచిత్రమైన సందళ్లు. ఎప్పుడూ ఇంత స్తబ్దుగా ఈ సమాజం ఉన్నది లేదు. ఎంత డబ్బు?! నమ్మలేని నిజాలు! రోజువారీ రాష్ట్ర అమ్మకాల్లో సామాన్యుడి వాటా పదిహేను కోట్లు. అందులో పేదవాడి చెమట నెత్తురు కనీసం ఏడె నిమిది కోట్లు. ఇంతాచేసి ఇది ఒక్కరోజు కలెక్షను. పైగా ఇది కేవలం ద్రవాల వెల మాత్రమే, ఇందులో ఉపద్రవాలపై ఖర్చు ఉంటుందని అనుభవజ్ఞుడి అంచనా. ఇది పుట్టినప్పుడు దీనికి ‘సురాపానం’ అని నామకరణం చేశారు. అంటే దేవతల అధికారిక డ్రింక్. (చదదవండి: ఐఏఎస్‌లకు ఏం తెలుసు?) ఇది ఎప్పటికీ అసురపానం కాలేదుగానీ క్రమంగా ఓ మెట్టు పైకి చేరినకొద్దీ సురలే అసురులై పోతారని ‘మధు మోహం’ లేనివారు విశ్లేషిస్తుంటారు. కృతయుగంలో ఏ దివ్యముహూర్తాన క్షీర సాగర మహాక్రతువు ఆరంభమైందోగానీ ఆ మహా మథనంలో ఎన్నో వింతలు విశేషాలు పుట్టు కొచ్చాయి. ఐరావతమనే తెల్లఏనుగు నించి వెన్నె లలు కురిపించే చందమామ దాకా ఆ చిలకడంలో వెన్నెముద్దల్లా తేలాయి. దీన్ని జయప్రదం చేయ డానికి విష్ణుమూర్తి రెండు అవతారాలు ధరించాడు. కూర్మమై మునిగిపోతున్న మంథరగిరి కవ్వాన్ని వెన్నంటి నిలిపాడు. శివదేవుడు ఘోర కాకోలమైన విషం చెలరేగినపుడు జుంటి తేనెలా స్వీకరించి గొంతులో నిలిపి గరళ కంఠుడైనాడు. మధ్యలో అనేకానేక విశేషాలు వింతలు వచ్చాయి. అచ్చర కన్నెలు నాట్యభంగిమలతో పాల నురగల్లో కలిసి పోయారు. ఒక దశలో ‘వారుణి’ దిగి వచ్చి ఏరులై ప్రవహించింది. సేవించిన వారందరికీ తిమ్మి రెక్కింది. తిక్క రేగింది. దేవ దానవులు రెచ్చి పోయారు. కలిపిన పట్టువదిలి ఊగసాగారు. విష్ణు మూర్తి, ఇంకో నాలుగు తిప్పులు తిప్పితే ఆశించిన అమృతం సిద్ధిస్తుంది లేకపోతే ఎక్కడికో జారి పోతుందని హెచ్చరించాడు. నిజంగానే అమృతం జాడ పొడకట్టింది. నిత్య యవ్వనంతోబాటు, జర రుజ మరణాల్ని నియంత్రించే అమృతం వచ్చేసరికి మాకంటే మాకంటూ సురాసురులు ఎగబడ్డారు. విష్ణుమూర్తి గమనించాడు. అన్యాయం, అక్రమం, స్వార్థం, భయం, పక్షపాత బుద్ధి అక్కడే పడగ విప్పాయి. దేవుడు మోహినిగా అవతారం ధరిం చాడు. వడ్డన సాగించాడు. ధర్మ సంస్థాపన కోసం జరగాల్సిన దగా దేవుడి చేతుల మీదుగా జరిగి పోయింది. చివరకు సురలకే అమృతం దక్కింది. అసురలకు శ్రమలో వాటా చిక్కింది. కలియుగంలో ఎన్టీఆర్ పాలనలో తెలుగు వారుణి వాహినిగా ప్రభుత్వ సారాయిగా జనం మీదకు వచ్చింది. అన్న గారు కిలో రెండు రూపాయల బియ్యం పథకం దేశాన్ని కుదిపేసింది. ఆనాడు ఆ బియ్యం ధర శ్రామిక వర్గాన్ని నిషా ఎక్కించింది. మిగిలిపోతున్న డబ్బులు వారుణి వాహిని వైపు మొగ్గు చూపాయి. అప్పుడే చాలామంది కష్టపడి ఈ కొత్త మత్తుని అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వం ఆ చేత్తో ఇచ్చి, ఈ చేత్తో లాక్కుందని జనం వాపోయారు. (చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా) ఇప్పుడు షాపులు తీశారని ఒక విమర్శ. రాష్ట్ర సరిహద్దు కూత వేటు దూరంలో ఉంటుంది. భాగ్యనగర్ వైన్స్‌కి, బెజవాడ వైన్స్‌కి పది అంగల దూరం ఉంటుంది. ఆ దూరాన్ని ఎవడాపగలడు. అప్పుడు మళ్లీ అదొక విమర్శ. జగన్ మద్యం ధరలు పెంచారట. కొందరైనా విముఖత చూపుతారని ఆశతో. బీద బిక్కి దీనివల్ల చితికి పోతున్నారని చంద్రబాబు ఒక మద్యాస్త్రం సంధించారు. ఎవరి మద్యం వారే కాచుకోండి అంటే ఎట్లా ఉంటుంది? ప్రతి ఇల్లూ ఒక బట్టీ అవుతుంది. ధరలు తగ్గు తాయి. ఏదైనా ఎదుటివారికి చెప్పడం చాలా తేలిక. మనం ఏం చేశామో మనకి గుర్తుండదు. అందుకే నేటి అపోజిషన్ లీడర్లు పాత పేపర్లు తీరిగ్గా చదువు కోవడం మంచిదని ఒక పెద్దాయన సూచిస్తున్నారు. మా ఊరి పెద్దాయన చంద్రబాబు వీరాభిమాని, ‘రోజూ హీనపక్షం రెండు లేఖలు వదుల్తున్నారండీ’ అంటే ఆయన చిద్విలాసంగా నవ్వి, పోన్లెండి ఇవ్వా ల్టికి ఇంటిపట్టున ఉన్నాడు. తాజా కూరలు తాజా పాలు, వేళకి తిని తగినంత విశ్రాంతి తీసుకుంటు న్నట్టున్నాడు. రోజూ ఒకటికి రెండుసార్లు ఇబ్బంది లేకుండా అవుతున్నట్టున్నాయ్ మంచిదే! అన్నారు. అంటే నిత్యం చంద్రబాబు వదుల్తున్న లేఖల్ని మా వూరి పెద్దాయన ఎలా భావిస్తున్నారో చాలా లౌక్యంగా చెప్పారు. అందుకని ఈ దినచర్య మార్చండి. వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
మరో స్వాతంత్య్ర సమరం
ఊరట కోసం అబద్ధాలు రాయనక్కర్లేదు. వార్తల్లో ఉండ టంకోసం సంచలనాలు సృష్టించి, పతాక శీర్షికలకు ఎక్కించపన్లేదు. లక్ష తుపాకులకన్నా ఒక వార్తా పత్రిక మిక్కిలి శక్తివంతమైనదని అతి ప్రాచీన నానుడి. ఎందుకంటే పత్రికల్ని అంతో ఇంతో నమ్ముతాం. అసలు అచ్చులో అక్షరాన్ని చూడగానే విశ్వసిస్తాం. అవన్నీ మనం రాసి మనం కూర్చినవే కావచ్చు. అయినా కనుబొమ్మలెగరేస్తాం. కొంచెం నమ్మేస్తాం. ఈ కరోనా విపత్కాలంలో సోషల్ మీడియాలో లేనిపోని వదంతులు తిరుగు తున్నాయి గానీ, పత్రికలు పెద్దరికంగా బాధ్య తాయుతంగా ప్రవర్తిస్తున్నాయ్. అయితే, ప్రతి దానికీ ఒక మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు దీనికీ ఉంది. ఇప్పటికే ప్రజలు పూర్తిగా డస్సిపోయి ఉన్నారు. ఇంకా భయభ్రాంతులకు గురి చేయ కండి. సొంత తెలివి ఉపయోగించి అసత్యాలు రాయక్కర్లేదు. నెల రోజులు దాటినా మాన వత్వం ఉదారంగా అన్నపురాశులుగా వాడవా డలా పరిమళిస్తూనే ఉంది. స్వచ్ఛంద సంస్థలు తమకు తామే జాగృతమై సేవలు అందిస్తు న్నాయి. గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతా లకు ఏ వేళకు ఆ వేళ మూడు నాలుగు ఆదరు వులతో వేలాదిమందికి భోజనాలు అందిస్తు న్నారు. ఇప్పటికే మంచి పేరున్న ‘అమ్మ పౌండేషన్ నిస్వార్థ సంస్థ’ వేలాదిమందికి ఆకలి తీరుస్తోంది. డబ్బులివ్వడం వేరు. దాన్ని భోజ నంలోకి మార్చి వడ్డించిన విస్తరిగా అందించ డానికి మరింత ఔదార్యం కావాలి. వెనకాల ఎందరో వదా న్యులు ఉండి ఉండవచ్చు. కానీ, క్రమశిక్షణ కార్యదీక్షతో ఈ మహా క్రతువుని సాగించడం అసలైన పూజ. నిజమైన దేశభక్తి మన తారలు కొందరు ప్రజాహితం కోరుతూ, ‘ఇంట్లోనే ఉండండి! అదొక్కటే రక్ష!’ అంటూ సూచిస్తున్నారు. కొందరు కథానాయకులు ఇళ్లల్లో ఉండి వాళ్లు స్వయంగా చేస్తున్న ఇంటి పనులన్నింటిని మంచి పేరున్న శిల్పితో వీడి యోల కెక్కించి చానల్స్కిచ్చి తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. కొందరి జీవితాలు సౌందర్య సాధనాల్లాంటివి ఎప్పుడూ మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ ఉండకపోతే జనం మర్చి పోతారు. అందుకని స్మరింపజేస్తూ ఉండాలి. ఒకనాడు ఫోర్డ్ కారు ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందింది. ప్రతివారూ దాన్ని కలిగి ఉండాలని తహతహలాడేవారు. కానీ అంత తేలిగ్గా ఫోర్డ్ కారు లభించేది కాదు. అయినా ఫోర్డ్ సంస్థ ఆ కారు విశిష్టతల గురించి ఖరీదైన వ్యాపార ప్రకటనలు లక్ష లాది డాలర్లు వెచ్చించి విడుదల చేస్తుండేది. ఒక పెద్ద మనిషి ఫోర్డ్ని సూటిగా అడిగాడు. ‘మీ కారు కొనాలంటే దొరకదు. మళ్లీ అద నంగా కొనమని ఈ వ్యాపార ప్రకటనలొకటి’ అన్నాడు నిష్టూరంగా. అందుకు ఫోర్డ్ గారు నవ్వి, ‘దేనికదే.. విమానం గాలిలో జోరుగా ఎగురుతోంది కదా అని ఇంజన్ ఆపేస్తామా’ అని ఎదురుప్రశ్న వేసి నోటికి తాళం వేయిం చాడట! మనవాళ్లు ఆ అమెరికన్ కాపిటలిస్ట్ అడుగుజాడల్లో నడుస్తారు. మీడియా ఇలాంటి దిక్కుతోచని స్థితిలో సామాన్య ప్రజలకు ఏమి చెబితే ధైర్యస్థైర్యాలొస్తాయో అవి చెప్పాలి. జాగ్రత్తలు చెప్పండి. ఉపాయాలు చెప్పండి. ప్రపంచ దేశాల్లో సాగు తున్న పరిశోధనల గురించి చెప్పండి. తప్ప కుండా ఒక మంచి మందు శక్తివంతమైన టీకా వస్తుందని ధైర్యం ఇవ్వండి. మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా మరీ కరోనా గురించి ఎక్కువ భయపెట్టకండని మీడియా మిత్రులకు చెప్పారు. మానవజాతి కరోనాతో కలిసి జీవించడానికి అలవాటుపడాలన్నారు. ఆ తర్వాత ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కూడా ఈ మాటే ధ్రువపరి చారు. కుళ్లు కుతంత్రం, అసూయ ద్వేషం లాంటి ఎన్నో అవగుణాలతో జీవితాన్ని సాగి స్తున్నాం. వాటిముందు ఈ వైరస్ అంత నీచ మైందేమీ కాదు. దేశ స్వాతంత్య్ర సమరం తర్వాత మనలో సమైక్యతాభావం తిరిగి ఇన్నా ళ్లకు కనిపిస్తోంది. కాసేపు రాజకీయాలను పక్క నపెట్టి మానవసేవవైపు దృష్టి సారిస్తే పుణ్యం పురుషార్థం బయట ఏ స్వార్థమూ లేనివారు రకరకాల త్యాగాలు చేస్తున్నారు. సేవలు అంది స్తున్నారు. అంతా తమవంతు సాయం అందిం చండి. జీవితాన్ని ధన్యం చేసుకోండి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కావల్సింది నాలుగు మంచి మాటలు
అనుకోని ఈ గత్తర ప్రపంచాన్ని వణికిస్తోంది. మన సంగతి సరేసరి. ఇంత జరుగుతున్నా మన లోని సంఘటిత శక్తి మేల్కొనలేదు. ఔను, మన దేశం ఎన్నడూ గొప్ప యుద్ధాన్ని చూడలేదు. ఒకనాడు మహోధృతంగా సాగిన విప్లవాల నైజాలు, నష్టాలు తెలియదు. మనలో దేశభక్తిపాలు చాలా తక్కువ. లేకుంటే ఈ సమయంలో రాజకీ యాలని మేల్కొలిపి జరుగుతున్న ప్రజాహిత కార్య క్రమాలకు అడ్డంపడుతూ ఆగం చేసుకుంటామా? వయసు, అనుభవం ఉంటే రాష్ట్ర ప్రజకి అవి అంకితం చేయండి. రండి! ప్రజని ఇలాంటప్పుడు క్రమశిక్షణతో నడపండి. అంతకంటే ఈ తరుణంలో గొప్ప దేశ సేవ మరొకటి ఉండదు. ఇక ఈ రాజ కీయాలు, ఆరోపణలూ ఎప్పుడైనా ఉంటాయ్. తర్వాత తీరిగ్గా చూసుకోవచ్చు. మనం ఎన్ని మాట్లాడినా మీడియా ఎన్ని ప్రచారాలు ప్రసారం చేసినా ప్రజల చెవులకి అమోఘమైన ఫిల్టర్లు ఉంటాయ్. దారిలో స్వచ్ఛమై తలకెక్కుతాయి. ఇది మాత్రం సత్యం. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని టన్నుల లెక్కన మనకి పదే పదే చెప్పి అందించారు. ఎలాంటి సందర్భం వచ్చినా తన విశేష ప్రజ్ఞా పాటవాలని సోదాహరణంగా చెప్పి బోరు కొట్టకుండా వదిలింది లేదు. ప్రపంచ ప్రఖ్యాత గణితవేత్త శ్రీనివాస రామానుజంకి చివరాఖరులో మూడు స్టెప్పులూ తనే సూచించా ననీ, ఆ లెక్కలే ఇప్పటికీ ఉపగ్రహాలు సక్రమంగా గమ్యం చేరడానికి వినియోగపడుతున్నాయని చెప్ప డానికి ఏమాత్రం సంకోచించని మనిషి. తెలుగు జాతికి కీర్తి కిరీటమై శోభిల్లిన మంగ ళంపల్లి బాలమురళీకృష్ణ కూర్చిన పలు కొత్త సంగ తుల వెనక చోదకశక్తి తానేనని నిర్భయంగా ప్రక టించి వేదికపై నిలబడగల సాహసి. అంతేనా?! తర్వాత తప్పనిసరిగా సమకూర్చవలసిన అంబే డ్కర్ రాజ్యాంగ సూత్రాలకి సవరణల్ని బాబూ సాహెబ్ మెదడులో కూచుని రాశాను అని నిస్సం కోచంగా ప్రకటించగల ధీశాలి. ఆయనిప్పుడు ఉత్త రకుమారుడై లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. పదవీ, బాధ్యత, జవాబుదారీ వగైరాలేవీ లేకుండా ఉచిత సలహాలు గుప్పించడం బహు తేలిక. ప్రతివారికీ పదివేలు ఇవ్వాలి, కావల్సినవన్నీ ఇవ్వాలి, సేంద్రియ కూరలు, పళ్లు పంపిణీ చెయ్యాలి– ఇట్లా పది సూచనలతో ఒక డిమాండ్ ప్రభుత్వంపై విసరవచ్చు. మనం కూడా నిన్న మొన్నటిదాకా పవర్లో ఉన్నాంకదా! ఏమి నిర్వాకం చేశామని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలో చించాలి. అవతలివైపు ఉండి బాధ్యతాయుత పాత్ర పోషించడమంటే ఇది కాదనిపిస్తోంది. బాధ్యతగల ఒక రాష్ట్ర పౌరుడిగా ఇంతవరకు తమరు ఏమి చేశారో చెప్పండి. అందరిలాగే తెలుగుజాతి అతలా కుతలం అవుతుంటే– పోనీ, ఏ పత్రికాముఖంగా నైనా, నేనున్నాను నిబ్బరించండి, జాగ్రత్తలు పాటిం చండి, ప్రభుత్వాలకి సహకరించండని ఒక్క మంచి సూచన చేశారా? మనం గతంలో ఇలాంటివి ఎన్నో చూశాం. ఏమీ పర్వాలేదు. ఆధునిక మానవుణ్ణి తక్కువ అంచనా వేయకండి. మహా ప్రళయాలకి అడ్డుకట్టలు వేసిన నేటి మనిషి మన కోసం అహ రహం తపిస్తూ శ్రమిస్తున్నాడు. అతని తపస్సు ఫలి స్తుంది. మన వేద భూమిలో సమస్త దేవి దేవతలు ఆ తపస్వికి సహకరిస్తారు. కావల్సిన బుద్ధిబలం వాళ్లంతా సమకూరుస్తారు. ఇలాంటి వ్యాధులు గోడలు దూకి పారిపోతాయ్ అంటూ ఒక సాటివాడికి, సామాన్యుడికి వెన్నుతట్టే నాలుగు మంచి ముక్కలు రాసిన పాపాన పోలేదు. మీరేనా జనానికి వెన్నుదన్ను. పవర్లో ఉండి పనిచేస్తున్న వారిమీద రాళ్లు, మట్టి విసరడం పెద్ద గొప్పేమీ కాదు. లోపా లోపాల్ని విమర్శించడానికి బోలెడు వ్యవధి ఉంది. అవకాశాలొస్తాయ్. మరీ తొట్రుపాటు తగదు. ఇప్పుడే పట్టాభిషేకానికి తొందరపడొద్దు. కాలం నిర్ణయిస్తుంది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పరిశుభ్రతే పరమధర్మం
ఒక ఉలికిపాటు. ఒక విపత్తు. ఎప్పుడూ లేదు. ఒకప్పుడు ఇలాంటి ఎదు రుచూడని వైపరీత్యాలు జరిగి ఉండచ్చు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో సమాచారాన్ని విశ్వమంతా చేరవేయగల సాంకేతిక పరిజ్ఞానం మనిషి వేళ్ల కొసమీద ఉంది. కొద్ది గంటల్లో నేలమీద ఏ మూల నుంచి ఏ మూలకైనా చేరగల సౌకర్య సామర్థ్యాలను మనిషి సాధించాడు. అదే ఇప్పుడు ఈ పెనుముప్పుకి దోహదమైంది. కరోనా అంటువ్యాధి విమానాలెక్కి సముద్రాలు దాటి ఖండాంతరాలను వచ్చి చేరింది. నూతన సంవత్సరం 2020 ఈ విపత్తులో ప్రారంభం కావడం మొత్తం మానవాళిని అల్ల కల్లోలం చేస్తోంది. ఇంతవరకు కరోనా నైజం ఎవరికీ అంతుబట్టలేదు. శాస్త్రవేత్తలు అవిశ్రాం తంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి తెలిసిందే మంటే వ్యక్తిగత మరియు సమష్టి పరిశుభ్రత మాత్రమే దీనికి విరుగుడుగా నిర్ధారించారు. వయ సుమళ్లినవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. మాటిమా టికీ చేతులు శుభ్రం చేసుకోవాలని హెచ్చరి స్తున్నారు. పరిశుభ్రతలోనే పరమేశ్వరుడున్నాడని అనా దిగా మనం విశ్వసిస్తున్నాం. పాటిస్తున్నాం. రోజూ కనీసం మూడుసార్లు నదీ స్నానం, దైవ ధ్యానం, అగ్నిహోత్ర ఆరాధన లాంటి నియమాలను మన ఋషులు శాస్త్రోక్తంగా ఆచరించి మరీ ఉద్బోధిం చారు. రోజులు మారాయి. ఎవరికీ తీరిక ఓపికలు లేవు. రోజూ ఒక స్నానానికి కూడా వ్యవధి లేదు. ప్రపంచీకరణ తర్వాత అవకాశమున్న అన్ని వెసులు బాట్లని మనం దినచర్యలోకి అలవాటుగా తెచ్చు కుని, అదే నాగరికత అనుకుంటున్నాం. ఒక నాటి ముతక ఖద్దరు వస్త్రాలు, వాటిని రోజూ ఉతికి ఆరేసి ధరించడం అనాగరికం అయింది. ఇప్పుడు మనం ధరించే చాలా రకాల దుస్తులు ఉతికే పనిలేదు. ఒంటిమీదే పుట్టి ఒంటిమీదే చిరి గిపోతాయ్. ఇంటికి ఎలాంటి పరాయి మనిషి వచ్చినా, అతిథి వచ్చినా కాళ్లకి నీళ్లివ్వడం మన ఆచారం. అదిప్పుడు అనాచారం. మరీ పసిపిల్ల లున్న ఇళ్లలోకి ఈ శుభ్రత పాటించకుండా ఎవరూ గడపలోకి అడుగుపెట్టేవారు కాదు. మళ్లీ ఇన్నాళ్లకి ఆచారాలు గుర్తుకొస్తున్నాయ్. స్వచ్ఛభారత్ ఒక శుభారంభం. కానీ మన ప్రజల ఉదాసీనత, తరాలుగా ఉన్న అశ్రద్ధ, అవ గాహనా రాహిత్యంతో ఆ ఉద్యమం చేరాల్సిన స్థాయికి చేరలేదు. మన రైలు బోగీలు, మన ప్రయాణికుల బస్సులు, ఆయా స్టేషన్లు ఇన్నాళ్లూ శాని టైజేషన్ని చూడలేదు. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అవన్నీ నడుస్తున్నాయి. మనకి చెత్త చెదారం ఇంకా చిమ్మేసినవన్నీ తీసి గోడవతల వెయ్యడం మనకో అలవాటు. మనకి సూర్యుడు రక్షాకరుడు. రోజులో పది నించి పన్నెండు గంటలు రకరకాల కిరణాలను భూమికి పంపుతూ అనేకానేక సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తున్నాడు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడుగా పూజ లందుకుంటున్నాడు. సూర్యభగవానుడు నిజానికి మన జెండా మీద ఉండాలి. మనకి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అలవాటే. కరోనాకి అవగాహనే ప్రస్తుతానికి మందు. ప్రపంచ దేశా లన్నీ ముందు జాగ్రత్తకీ, తర్వాత వైద్యానికి మందుల పరిశోధనతో తలమునకలవుతు న్నాయ్. త్వరలోనే పరిష్కారం వస్తుందన్నది నిస్సంశయం. ప్రధాని మోదీ జాతికి సందేశమిస్తూ, రేపు వచ్చే ఆదివారం ఐచ్ఛికంగా దేశమంతా కర్ఫ్యూ పాటించాలని చెప్పారు. పన్నెండు గంటలు నిరో ధిస్తే వైరస్ చనిపోతుందని కూడా చెప్పారు. ఈ చిన్న అభ్యర్థనని అందరం పాటిద్దాం. నిర్మా నుష్యమైన చారిత్రక ప్రదేశాల్లో అరుదైన ఫొటోలు తీద్దామని, సెల్ఫీలు దిగుదామని కూడా బయ టకు రావద్దు. ఇలాంటి ప్రయత్నాలని ఎవరూ హర్షించరు. అది గర్వకారణం కూడా కాదు. దేశభకి,్త సమాజ భక్తి ఉంటే అంతా తలా పది మందికి చెప్పి, నచ్చజెప్పి కరోనా వ్యాప్తిని అరి కట్టేందుకు యథాశక్తి దోహదపడండి. సర్వే జనా సుఖినోభవంతు. వ్యాసకర్త : శ్రీరమణ ప్రముఖ కథకుడు -
ఏది హాస్యం! ఏది అపహాస్యం!
కొన్ని వేల సంవత్సరాల నాడే అరిస్టాటిల్ మహాశ యుడు ‘నేటి మన యువత వెర్రిపోకడల్ని గమనిస్తుంటే, రానున్న రోజుల్లో ఈ సమాజం ఏమి కానున్నదో తల్చు కుంటే భయం వేస్తోంది’ అని పదేపదే నిర్వేదపడేవాడు. మూడువేల సంవ త్సరాల తర్వాత కూడా ఏమీ కాలేదు. ఎప్పుడూ అంతే, నాన్నలకి పిల్లల ధోరణి విపరీతంగా కనిపి స్తుంది. పిల్లేంచేసినా ఏదీ ఒక సక్రమ మార్గంలో ఉండదని తండ్రులు ప్రగాఢంగా భావించేవారు. పిల్లలు హాయిగా నవ్వుకుంటూ తమ జీవితం తాము గడిపేవారు. అరిస్టాటిల్ నించి మోతీలాల్ దాకా ‘ఈ ప్రజాస్వామ్యం పెడదోవ పడుతోంది. బహుపరాక్’ అంటూ హెచ్చరించినవారే. ఇటీవలి కాలంలో మళ్లీ చంద్రబాబులో అరిస్టాటిలూ ఇతర విశ్వవిఖ్యాత తత్వవేత్తలూ తొంగి తొంగి చూస్తు న్నట్టు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే సహించేది లేదని నిన్న మొన్న కూడా తీవ్ర స్వరంతో హెచ్రించారు. రాచరికాలు నడిచే రోజుల్లో కూడా ఓ మూల ప్రజాస్వామ్యం నడుస్తూ ఉండేది. రాణివాసపు ఆప్తులు, రాజాశ్రితులు, రాజబంధు వులు, రాజోద్యోగులు, అక్రమ సంతాన మొగమాట స్తులు ఇలా చాలామంది వీధులకు తీరి ఉండేవారు. రాజుగారి పాలనలో అంతా సమానమేగానీ పైన చెప్పినవారు మరింత ఎక్కువ సమానం. మరీ ఓ వారం పదిరోజుల్నించి చంద్రబాబుకి ప్రజా స్వామ్యం మీద బెంగ ఎక్కువైంది. పిల్లికి రొయ్యల మొలతాడన్నట్టు అచ్చ తెలుగు సామెత ఉంది. చంద్రబాబు నలభై ఏళ్ల ఇండస్ట్రీని ఒక్కొక్క ఫ్రేము చూస్తే– తెలుగునాట డెమోక్రసీ ఎన్ని ఫ్రేముల్లో గీతలు చారలు పడిందో మనం చూడవచ్చు. కొంచెమైనా వెన్ను ముదరకుండానే లోకేశ్ బాబుని పెరటి గుమ్మంలోంచి ప్రవేశపెట్టి మంత్రి పదవి కూడా ఇచ్చేసి సభలో కూచోపెట్టినపుడు ప్రజాస్వామ్య దేవత ఆనంద తాండవం చేసిందా? నేతలు పుడతారు. మనం తయారుచేస్తే అవరు. చంద్రబాబుకి తొలినుంచీ సహనం చాలా తక్కువ. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగినా, ఎన్టీఆర్ పవర్లోకి రాగానే దండవేసి మామగారి చంకనెక్కి కూచు న్నారు. అది అపహాస్యం కాదు. ప్రజాస్వామ్య పరి రక్షణ. తర్వాత మామగారిని పాతాళానికి తొక్కేసి నపుడు కూడా అది ధర్మసమ్మతమే. చంద్రబాబుకి గడిచిన 9 నెలలూ తొమ్మిది యుగాలుగా అనిపి స్తోంది. పదవీ విరహ వేదనతో మనిషి చలించి పోతున్నాడు. సరైన ఆలోచనలు రావడం లేదు. తను పవర్లో ఉండగా నెగ్గిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి గిట్టుబాటు ధరలతో ఎమ్మార్పీలు నిర్ణయించి మూకుమ్మడిగా కొనుగోలు చేసినపుడు ప్రజా స్వామ్యం చంద్రబాబుపై పూలవాన కురిపిం చిందా? చెప్పాలి. పంచాయతీ, మున్సిపల్ ఎన్ని కలు తీవ్రస్థాయికి చేరాయ్. చంద్రబాబుకి అభ్య ర్థుల కొరత తీవ్రంగా ఉందని ప్రజలు చెప్పుకుం టున్నారు. జగన్ ప్రభు త్వం మద్యంమీద నిఘా పెట్టింది. ఇది కూడా బాబుకి పెద్ద మైనస్. ఎన్నికల కమిషన్ చెయ్యాల్సిన పనులు మీరెందుకు చేస్తున్నా రని జగన్‌పై రంకెలు వేస్తున్నారు. ఇంకోపక్క మెడ మీద తలకాయలున్న నాయకులు అటుపక్కకి జారి పోతున్నారు. ఇలా సతమతమవుతున్న తరుణంలో అంతా అపహాస్యంగా కనిపిస్తోంది. నిజానికి చంద్రబాబు ఎన్నికల బరిలో ముఖా ముఖి తలపడి నెగ్గిన బాపతు కాదు. వాజ్‌పేయి బొమ్మని అడ్డం పెట్టుకుని గెలుపు సాధించారు. చంద్రుడి స్వయంప్రకాశం ఎన్నడూ లేదు. మొన్న కూడా దేశ రాజకీయాలతో ఆడుకోవాలనుకున్నాడు గానీ అడుగు కూడా పడలేదు. మోదీతో తేడా పెరిగింది. ఆ తేడా తగ్గించుకోవడానికి బాబు చాలా యాతన పడుతున్నారు. మనం చేసిన మంచి చెడులూ మన వెనకాలే పడి మనల్ని వేటాడతా యన్నది నిజం. ఒక గుహ దగ్గరకు వెళ్లి మనం ఏది అరిస్తే అదే ప్రతిధ్వనిస్తుంది. అన్యాయం అని అరిస్తే అన్యాయం అని మారు పలుకుతుంది. రాజ కీయాల్లో కొన్ని కొన్ని మాటలు నేతి బీరకాయ చందం. ఆధునిక కాలం రాజకీయాలు కూడా వ్యాపార సరళిలోనే నడుస్తున్నాయి. అందులో ఉన్న నిజాయతీని మాత్రమే చూసి ముచ్చటపడాలి. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు. ఆ లెక్కన ఎంత తగ్గించినా నాలుగేళ్లు గడవాలి. అందాకా చంద్రబాబు ఈ ప్రజాస్వామ్యంలో గడ పక తప్పదు. వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
దోపిడీదారులు
క్షణానికి వచ్చేది తెలియ దంటారు. ఆది శంకరుడు అంతా మిథ్య అన్నాడు. అయితే రోల్స్ రాయిస్ కారు, ఫైవ్‌స్టార్ రిసార్టు, అందలి సుఖాలు మాయం టావా? మిథ్యంటావా? నా ముద్దుల వేదాంతీ అని శ్రీశ్రీ సూటిగా ప్రశ్నించాడు. మనల్ని కొన్ని వైరాగ్యాలు ఆవహిస్తూ ఉంటాయ్. గొప్ప జీవితం గడిపి ఆఖరికి గుప్పెడు బూడిద అయినప్పుడు చూపరు లకు శ్మశాన వైరాగ్యం ఆవరిస్తుంది. విపరీతంగా ప్రసవ వేదన అనుభవించిన తల్లికి ప్రసూతి వైరాగ్యం పూనుతుంది. మంచి పౌరాణికుడు ప్రవ చనం ఆర్ద్రంగా వినిపించినపుడు ఇంటికి వెళ్లేదాకా పురాణ వైరాగ్యం మనసుని వేధిస్తుంది. కరోనా వైరస్ మొన్న ప్రపంచాన్ని చుట్టుముట్టి నపుడు మనిషికి వైరాగ్యం కూడా వైరస్‌లా అంటు కుంది. చూశారా నిరంకుశ పాలన సాగేచోట కరోనా తీవ్రంగా ఉందని కొందరు విశ్లేషించారు. దేవుణ్ణి బొత్తిగా నమ్మనిచోట కరోనా విజృంభిస్తోందనీ మరికొందరన్నారు. ఇండియాలో దేవీదేవతలనైనా, పెద్దవారినైనా చేతులు చోడించి వినమ్రంగా పలక రిస్తాం. ఇది మన సంప్రదాయం. ఇదే కరోనాకి శ్రీరామ రక్ష అంటున్నారు శాస్త్రవేత్తలు. షేర్ మార్కెట్ చిగురుటాకులాంటిది. ఎండకాస్తే, నాలుగు చినుకులు పడితే షేర్ మార్కెట్ చలించి పోతుంది. ఇక కరోనా లాంటి మందులేని జాఢ్యం ఆవరించినపుడు చెప్పేదేముంది. భారతదేశం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. చిల్లర రాళ్లని మొక్కే దేశం. అప్పుడొకసారి అంతరిక్షం నించి లాబొరేటరీ గింగిరాలు తిరుగుతూ వచ్చి పడుతోందని ఒక వార్త పుట్టింది. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎక్కడ పడుతుందో తెలియదు. అప్పుడు మన తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లాయి. కొందరు ఉన్న స్థిర చరాస్తులు అమ్మేసి సామూహికంగా తాగేసి ఆందోళన నుంచి బయటపడ్డారు. తర్వాత అదె క్కడో సముద్రంలో పడిందని తెలిసి కొందరు ఊపిరి వదిలారు. కొందరు ఊపిరి పీల్చుకున్నారు. మనకి కాసేపు వైరాగ్యం ఆవరించి తర్వాత అదే దోపిడీగా మారుతుంది. కరోనా పుణ్యమా అని మాస్క్‌లకి రెక్కలొచ్చాయ్. అదేదో వైరస్ రాగానే బొప్పాయికి ఎక్కడలేని డిమాండ్ వస్తుంది. డబ్బులు దాటి పెద్ద పెద్ద సిఫార్సులు పడితేగానీ ఒక బొప్పాయి దొరకదు. మాస్క్ కోసం క్యూలు కట్టడం, వాటి ధర వేలంపాట పాడి కొనుక్కో వలసిన అగత్యం రావడం చూశాం. రూపాయి పావలా ఉండే మాస్క్ చివరకు ఇరవై ముప్ఫై దాటి చుక్కలు చూడటం చూస్తున్నాం. ఇక మళ్లీ మళ్లీ అవకాశం రాదన్నట్టు అమ్మకందారులు ఆశని నియంత్రించుకోలేరు. మనవాళ్లు ఎంతటి వైరాగ్య జీవులో అంతకుమించిన స్వార్థపరులు. జీవితం బుద్భుదప్రాయమనీ మరీ ఈ కరోనా తర్వాత మరీ బుడగన్నర బుడగ అని అనుకుంటూనే మాస్క్‌ల మీద ఏ మాత్రం లాభాలు చేసుకోగలం అనే దూరాలోచనలో మునకలు వేస్తూ ఉంటారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ఎక్కడో పుట్టి మరెక్కడో పెరగదు. అకాల వర్షం వస్తుంది. ఎంతకీ ఆగదు. గొడుగులు, టోపీలు రోడ్డుమీద అమ్మకా నికి వస్తాయ్. సరసమైన ధరలన్నీ విరసంగా మారతాయ్. అవసరం అలాంటిది. బేరాలు చేస్తూ నిలబడితే తడిసిపోతాం. చినుకు చినుకుకీ ధర పెరిగే అవకాశమూ ఉంది. కరోనాకి హోమియోలో ఉంటుందండీ మంచి మందు. ఒక్క డోస్‌తో పక్కింటి వాళ్లకి కూడా ఠక్కున కడుతుందని ఒకళ్లిద్దరు అన్నారు. ఆ మాటకొస్తే ఆయుర్వేదం మన వేదం. ఉండే ఉంటుంది. ఎటొచ్చీ తెలుసు కోవాలి అంతే. ఇట్లాగే మనం ఎన్ని విద్యలు నాశనం చేసుకున్నామో! చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం అంటూ ఓ పెద్దాయన వాపోయాడు. మన దేశంలో అంటే బోలెడుమంది దేవుళ్లున్నారు. పిలిస్తే పలు కుతారు. వాళ్లకి ఆ గోడవతల వాళ్లకి దేవుడే లేడు. ఇక వారినెవరు రక్షిస్తారు? అందుకే నేనెప్పుడూ దేవుణ్ణి నమ్ముకోమని అందరికీ చెబుతుంటానని ఓ గాంధేయవాది బాధపడ్డాడు. ‘ఉంటారండీ, ఈ వైరస్‌లన్నింటినీ తొక్కి నారతీసే వాడెవడో ఉంటాడు. ఆ బీజాక్షరాలు తెలుసుకుని మంత్రోక్త హోమం చేస్తే ఈ కరోనా ఉక్కిరిబిక్కిరి అయి పోదుటండీ’ అని నమ్మ కంగా సాగదీశాడు ఓ మోదీ అభిమాని. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
దత్తుడు గార్లెండ్స్ బాబ్జీ
‘దత్తుడు గార్లెండ్స్ బాబ్జీ, బాబ్జీ గార్లెండ్స్ దత్తుడు’– అంటూ నానుడిలాంటి వాడుక ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారంలో ఉండేది. పెద్ద బస్తీల్లో, చిన్న నగరాల్లో చిన్న చిన్న కూటములుం టాయ్. వారు తమ వృత్తి వ్యాపారాల్లో కొండచిలువల్లా పెరిగిన వారై ఉంటారు. వాళ్లకి కీర్తిని కొనుక్కోవడానికి లెక్కలు చూపని చిల్లర ఉంటుంది. వారి వారి శక్త్వానుసారం అప్పుడప్పుడు సవాపావో, సవాశేరో కీర్తిని కొను క్కుని దండతో ఇంటికి వెళ్తుంటారు. దండోరా వేయించుకుంటారు. ఈ కూటమి వాళ్లకి వినసొంపైన పదవులుంటాయ్. అవి అజాగళస్తనాల్లాంటివి– ఇదేమరి అక్కర్లేని సొల్లు కబుర్లంటే– మొన్న ట్రంప్ టూర్ ప్రసంగాల్లాగా. ట్రంప్ మోదీని, మోదీని ట్రంప్ అడుగడుగునా దండించుకున్నారు. నగర సంకీర్తన వలె పలుచోట్ల పరస్పరం భజించుకున్నారు. ఆ పొగడ్తలకి ఇద్దరి పళ్లు పులిసిపోయి ఉంటాయ్. ట్రంప్ గాంధీ పేరు ఎత్తలేదు, మోదీ తాజ్‌మహల్ గుమ్మం ఎక్కలేదు. చెల్లుకు చెల్లు ఏ అమెరికా ప్రెసిడెంటు వచ్చినా ఏవుండదు కడుపు నిండేది– మా మేనత్త పెళ్లిళ్లకి వెళ్లినట్టే! ఆ వైనం చెబుతా. ఆవిడ ఆస్తిపరురాలు. బాధ్యతలు లేవు. పెద్దతనంలో కూడా జుత్తూడక, మాట చెడక నిండుగా ఉండేది. ఒంటినిండా నగలుండేవి. వొంకుల వడ్డాణం, కాసులపేరు, ఓ చేతికి కట్టె వంకీ, ఇంకో చేతికి నాగవత్తు ఇంకా చాలినన్ని బంగారు గాజులు ఉండేవి. ముక్కుకి ఎర్రరాయి నత్తు, తలతిప్పితే అరచెయ్యంత చేమంతిబిళ్ల, అసలు సిసలు కంజీవరం పట్టు చీరెలో ఆవిడ పందిట్లో తిరుగుతుంటే దేవుడి రథం కదుల్తున్నట్టుండేది. పెళ్లికి వస్తే హీనపక్షం మూడు రోజులుండేది. పట్టు చీరెలన్నీ ప్రదర్శించేదాకా ఉండేది. ఆ రోజుల్లో అరడజనుంటే మహాగొప్ప. ఆవిడ దీవెనలు మాత్రం ఉదారంగా ఇచ్చేసి, పెళ్లివాళ్లు పెద్దరికంగా పెట్టేవి స్వీకరించి వెళ్లేది. అమెరికా ప్రెసిడెంటు తెల్లఏనుగు లాంటి విమానం గురించి, మందీమార్బలం గురించి, జరగాల్సిన మర్యాదల గురించి ఎన్నో కథలు వింటూనే ఉన్నాం. ఒబామా పెంపుడు కుక్కతో సహా వచ్చాడు. అత్తగారు కూడా వచ్చింది. అసలావిడ కోసమే వచ్చారని అనుకున్నారు. తాజ్‌మహల్ చూడాలని మదర్ ఇన్ లా అడిగిందట. అది మన దేశ పౌరులు చేసుకున్న అదృష్టం. అయినా ఎప్పుడూ అదేం దరిద్రమో తెలియదు. ఏ అమెరికా ప్రెసిడెంటు వస్తున్నాడన్నా కోట్లకు కోట్లు ధారపోసి అతి మర్యాదలు చేయడం మనకు అలవాటే. కరువులో అధిక మాసం అంటే ఇదే. అప్పుడెప్పుడో ఇవాంకా వస్తేనే భాగ్యనగరానికి రంగులు వేశాం. దానికి రిటన్ గిఫ్ట్‌గా కేసీఆర్‌ని పిలిచి ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. నవ్వుతూ ఆరుసార్లు చెయ్యి ఊపాడు. జగన్‌కి పిలుపు లేదు. ఇహ దానిమీద ఆయనంటే గిట్టని మీడియా కావల్సినన్ని కథనాలు అల్లింది. నా చిన్నప్పుడు ఐసన్‌హోవర్ రష్యానించి వస్తుంటే నెహ్రూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ట్రంప్ స్వాగతానికి మోదీ కనీసం కొన్ని వందల కోట్లు ఖర్చుచేసి ఉంటారు. శివరాత్రి నుంచి శివతాండవంలా నడిచింది. మోదీకి కూడా పూనకం వస్తుందని అర్థమైంది. ఆ దేశం గొప్ప దేశమే కావచ్చు. మనదీ గొప్ప దేశమే. అంతమాత్రంచేత దాని పాలకులంతా గొప్పవారు కానక్కర్లేదు. మన దేశాన్ని ఎందరు నికృష్టులు పాలించలేదు. పద్ధతులు పాటించవచ్చుగానీ మరీ అతి అవసరం లేదు. సబర్మతి ఆశ్రమంలో ఎన్నో రకాలు ఎంతో వ్యయంతో, శ్రమతో చేయించిన ఉపాహారాలను ట్రంప్ ముట్టనే లేదు. దారిలో ప్రాకృతిక వాతావరణంలో పచ్చని చెట్టుకింద కావాల్సినన్ని మాంసాహారాలు వండి వడ్డించాల్సింది. ట్రంప్ రాబోతున్న ఎన్నికల దృష్ట్యా వచ్చాడని అందరికీ తెలుసు. మోదీ గాంధీల రాష్ట్రం తనకి బాసటగా ఉంటుందని ట్రంప్ ఆశ. సువీ అంటే రోకలిపోటని తెలియందెవరికి. ఆయన మళ్లీ త్వరలోనే వస్తారు. మళ్లీ పొగడ్తలుంటాయ్ కాకపోతే కొత్తవి. కానీ మహాశయా! ఈసారి తప్పనిసరిగా జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించండి. తెలుగువారు కూడా మీ జాతకం తేల్చగలవారే. ఎందుకైనా మంచిది చంద్రబాబుని కూడా పిలవండి. ఆయనగానీ ఒక్క వీల వేస్తే...... వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
పిట్ట కథలు
మనకు తొట్టతొలి పిట్టకథ రామాయణం. క్రౌంచ మిథు నాన్ని ఒక బోయ చంపాడు. తొలి సహగమనం కూడా అక్కడే జరిగింది. శోకం లోంచి శ్లోకం పుట్టింది. మహేతిహాసానికి నాంది వాక్యమైంది. క్రౌంచ పక్షుల్ని వాడుకలో కవుజు పిట్టలంటారు. చుక్కల చుక్కల రెక్కలతో చూడముచ్చటగా ఉంటాయి. పిట్టమాంస ప్రియులు కవుజు రుచి పరమాద్భుతం అంటారు. వేటగాళ్లు దీన్ని చాలా తెలివైన పిట్టగా చెబుతారు. అనవసరంగా ఇది ఎక్కడా కూత వెయ్యదు. కూతతో ఉనికిని చాటుకుని ప్రాణం మీదికి తెచ్చుకోదు. అందుకే వేటగాళ్లు దీన్ని వేటాడాలంటే కవుజు సాయమే తీసుకుంటారు. షికారీల దగ్గర పెంపుడు కవుజులుంటాయ్. నూకలుజల్లి కౌజుల్ని అక్కడ వదులుతారు. పెంపుడు కౌజు చేత ‘ఇక్కడ మేతలు న్నాయ్ రమ్మని’ కూతలు వేయిస్తారు. పాపం నమ్మి బయటి కవుజులు వచ్చి ముగ్గులో వాల్తాయ్. మరు క్షణం వేటగాడి వలలో పడతాయి. మనిషి తిండి కోసం ఎవరినైనా ఎన్ని మోసాలైనా చేస్తాడు. దేశంలో పిట్టలు, అనేకానేక పక్షి జాతులు కను మరుగవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రకృతి ప్రియుల్ని చాలా బాధపెడుతోంది. నగ రీకరణ, అడవుల కొరత, పర్యావరణ కాలుష్యం, మనిషి జిహ్వ చాపల్యం–ఇవన్నీ పిట్టలు కనుమ రుగు అవడానికి కారణం. ఎక్కడ దాక్కున్నా మనిషి పిట్టల్నీ బతకనీయడం లేదు.మనిషి భూమిని, ఆకా శాన్ని, సముద్రాన్నీ ఇప్పటికే వశపరచుకున్నాడు. ఇప్పుడు ఇతర గోళాలమీద దృష్టి సారించాడు. చివ రకు మనిషి త్రివిక్రముడిగా మిగులుతాడో, భస్మాసు రుడుగా కనుమరుగు అవుతాడో కొన్ని తరాలు ఆగి చూడాల్సి ఉంది. అనేకానేక పరిశోధనల తర్వాత పక్షులు కూడా డైనోసార్స్ నుంచే ఆవిర్భవించాయని తేల్చి చెప్పారు. సమస్త చరాలకు డైనోయే మూల మని రుజువైంది. మనదేశంలో చాలామంది పక్షి ప్రియులున్నారు. వాళ్లు టెలిస్కోపులు, కెమెరాలు వేసుకుని కంచెలెంబడి అస్తమానం తిరుగుతుం టారు. వాటి కూతల్ని రికార్డు చేసి ఆనందిస్తుంటారు. ఒకప్పుడు ఎటుచూసినా గుంపులుగా కనిపించే కాకులు ఇప్పుడు అపురూపమైపోయాయి. పిచ్చు కలు ఇళ్లలో కిచకిచలాడుతూ, అద్దాల్ని చూసి ఆడు కుంటూ ఎక్కడంటే అక్కడ గూళ్లుపెట్టి గుడ్లు పెడుతూ నానా యాగీ చేస్తుండేవి. ఇప్పుడు లేవు. సెల్‌ఫోన్ టవర్స్ రేడియేషన్ కారణంగా పిచుకలు పోయాయని చెబుతారు. పల్లెటూళ్లలో అతిపెద్ద పరి మాణంలో రాబందులు, కనిపించేవి. ఇవ్వాళ వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. వాటిని పెంచ డానికి లక్షలు వెచ్చించడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. చెట్ల తొర్రలో కాపురముండే రామ చిల కలు, గువ్వలు, గోరువంకలు ఒకనాడు మనుషుల బాల్యాన్ని ఆనందంగా నింపేవి. అన్నం తినక మారాం చేసే పిల్లలకు చందమామ, పావురాలు, రామచిలకల్ని చూపి తల్లలు బువ్వలు తినిపించే వారు. తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట. ఎగిరే ఇంద్ర ధనుస్సులా ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూద్దా మంటే విజయదశమి పండగరోజు కూడా దర్శనమీ యడం లేదు. తక్కువ ఎగురుతూ, ఎక్కువ పరు గులు పెడుతుండే కంచెకోడి బలే రంగురంగుల పిట్ట. నిజంగా దాన్ని చూసి ఎన్నాళ్లు అయిందో. కోయిల కూతకి బదులు కూత వేస్తూ పిల్లలని కవ్వించేది. అది ఎప్పుడూ కన్పించడం తక్కువే. ఇప్పుడు ఉగాది పండగ చిత్రాల్లో పంచాంగం పక్కన, మామిడి పిందెల సరసన వేపకొమ్మకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది నల్లటి కోయిల. తీతువుపిట్ట అరుపులు విన్నాంగానీ ఎప్పుడూ అది కంటపడలేదు. వడ్రంగిపిట్ట బాగా పరిచయం. మునుపు తమిళనాట పక్షి తీర్థం అని క్షేత్రం ప్రసిద్ధి. సరిగ్గా మధ్యాహ్నం వేళకు ఎక్కడినుంచో అయిదు గద్దలు అక్కడకు దిగేవి. అర్చక స్వాములు సమర్పిం చిన ప్రసాదం తిని తిరిగి ఎగిరిపోయేవి. ఏరోజూ వేళ తప్పేవి కావు. వాటిని గరుత్మంత అవతారాలుగా భావించేవారు. పాతికేళ్ల క్రితం వంద ఉన్న చాలా పక్షులు ప్రస్తుతం మూడు, అయిదుకి పడిపోయాయి. ఇప్పటికీ ఎక్కువ రకాల పక్షులు, పాములు తిరుమల ఏడుకొండలమీదే ఉన్నాయని చెబుతారు. పక్షుల్ని సంరక్షించే బాధ్యత ఏడుకొండలవాడికే అప్పగిం చాలి. అనువైన ఒక కొండని పక్షి ఆశ్రయంగా, కణ్వా శ్రమంగా తీర్చిదిద్దాలి. అపురూపమైన అరుదైన పక్షి జాతుల్ని స్వామి సన్నిధిలో కాపాడాలి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
చీపురు వజ్రాయుధమై...
సొంత చాప కిందికి నీళ్లొచ్చిన వైనం ఆ జంట పసిగట్టలేకపోయింది. అమిత్ షాకి గజకర్ణ గోకర్ణ, టక్కు టమారాది విద్యలు క్షుణ్ణంగా వచ్చుననీ, మనుషుల మెదళ్లని బొంగరాలుగా తిప్పి ఆడుకుంటా డని ఒక వాడుక. మోదీ అమిత్ షా చేసిన, చేస్తున్న తప్పులతో సహా సమాదరించి విశ్వసిస్తారని ప్రపంచం అనుకుంటుంది. మోదీకి మోదీపై భయంకరమైన ఆత్మవిశ్వాసం ఉంది. నిన్న మొన్నటి ఢిల్లీ ఎన్నికలు మహా మాంత్రికులిద్దరినీ పొత్తిళ్లలోకి తీసికెళ్లాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సోదిలోకి కూడా రాలేదు. కమలం రెక్కలైనా సాంతం విప్పలేకపోయింది. పీఠం కిందనే ఉండి పూర్తిగా అందుబాటులో ఉన్న హస్తినలోనే పాగా గురితప్పిందంటే ఆ ద్వయం ఆలోచనలు అధ్వాన్నంగా ఉన్నాయనడానికి కొండ గుర్తు. కశ్మీర్ పరిష్కారం, రామాలయం, పౌరసత్వ క్షాళన ఇవేమీ బీజేపీని పీఠంపై గట్టిగా పదిమెట్లు కూడా ఎక్కించలేక పోయాయి. అంతమాత్రం చేత కమలానికి రాముడి రక్ష లేదని నాస్తికుల్లా కొట్టిపారెయ్యరాదు. క్షాళనకి ప్రతీకగా నిలబడ్డ ఆప్ పార్టీ ముత్యం మూడోసారి చెక్కు చెదరలేదు. కారణాల్లో మొదటిది ఏలికలపై అవినీతి ఆరోపణలు లేకపోవడం. ప్రజల సామాన్య అవసరాలపై దృష్టి సారించడం చీపురు గెలుపునకు కారణంగా చెబుతున్నారు. ఒకప్పుడు నీళ్లు, కరెంటు లాంటి ప్రాథమిక అవసరాల ప్రస్తావన ఉంటే ఆ పార్టీలను గెలిపించేవారు. కేవలం ఈ వాగ్దానాలతో దశాబ్దాలపాటు గద్దెమీద కూచున్నవారున్నారు. బీజేపీ దేశంలో పూర్తి పవర్లో ఉంది. మొత్తం బలాలు, బలగాలు యుద్ధప్రాతిపదికన ఢిల్లీ ఎన్నికల సంరంభంలోకి దిగాయి. ఒక పెద్దాయన ‘ప్రభుత్వ వాహనాలే కాదు మిలట్రీ ట్యాంకర్లు సైతం ఎన్నికల్లో సేవలందించాయ్. అయినా పూజ్యం’ అని చమత్కరించాడు. ఢిల్లీ చౌరస్తాలో పానీపూరీ జనంతో తింటూ వారి మాటలు వినాలి. టాంగా, ఆటో ఎక్కినప్పుడు సామెతల్లా వినిపించే మాటలుంటాయ్. అందులో గొప్ప చమత్కారం ఉంటుంది. సత్యం ఉంటుంది. ‘ఈసారి ఢిల్లీలో మోదీ సాబ్‌ని ఒడ్డెక్కించడం బాబామాలిక్ వల్ల కూడా కాదు. అందుకే బాబా కాలుమీద కాలేసుకుని ప్రశాంతంగా కూచున్నాడు’ అన్నాడొక పకీర్ మధ్యలో పాట ఆపి. ఆప్ పార్టీ చిన్న చిన్న సౌకర్యాలమీద శ్రద్ధ పెట్టిందనీ, దానివల్లే కాషాయపార్టీని ఊడ్చేయగలిగిందని అంతా అనుకున్నారు. స్కూళ్లమీద పిల్లల చదువులమీద దృష్టి నిలిపింది. హెల్త్ సెంటర్లని జన సామాన్యానికి అందుబాటులోకి తెచ్చింది. సామాన్య ప్రజ సంతృప్తి చెందింది. నిశ్శబ్దంగా కేజ్రీవాల్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెల్పుకున్నారు. మనుషులు దేవుడి విషయంలో అయినా అంతే. నిదర్శనం కావాలి. ఫలానా మొక్కు మొక్కాం. అది జరిగితే ఆ దేవుణ్ణి మర్చిపోరు. తిరుమల వెంకన్న కావచ్చు, షిర్డీ సాయిబాబా కావచ్చు. వరుస విజయాలవల్ల మోదీ, షా బ్రహ్మాండ నాయకులమని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఢిల్లీ ఫలితాలు గట్టి మొట్టికాయగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ కాలుష్యకాసారంగా పేరుపడింది. అందుకు బోలెడు కారణాలు. వీధులు పట్టనన్ని మోటారు వాహనాలు మరొక సమస్య. వీటిని ఓటర్లు నొచ్చుకోకుండా ఎలాగో అధిగమించారు. పాలకులు చిన్న చిన్న సమస్యల పరిష్కారంతోనే ప్రజల మనసుల్ని గెలవచ్చునని పూర్వం నుంచీ వింటున్నాం. అశోకుడు మహా చక్రవర్తి. అయినా మనం చెప్పుకునేవి చెట్లు నాటించెను, చెరువులు తవ్వించెను అనే రెండు అంశాల గురించి మాత్రమే. చాలా ఏళ్ల క్రితం రుషి లాంటి ఒక పెద్దాయనని కలిశాను. ‘అన్నిటికంటే ప్రజల్ని గెల్చి పవర్లోకి రావడం బహు తేలిక’ అని స్టేట్మెంట్ ఇస్తే ఉలిక్కిపడ్డాను. నా మొహం చూస్తూనే నా మనసు గ్రహించాడు. ‘నీకు కుర్చీమీద మోజుంటే చూస్కో. మన రాష్ట్రంలో లేదా మన దేశంలో అంటువ్యాధులు, వీధి కుక్కలు మచ్చుకి కూడా లేకుండా చేయగలిగితే చాలు. జనం పట్టం కడతారు’ అన్నాడు. ‘అంతేనా’ అన్నాను అవి చాలా తేలిక అన్నట్టు. రుషి నా మాటకి నవ్వాడు. ‘నాయనా! మన దేశంలో మంచిపని ఏదీ అంత తేలిక కాదు. పనిచేయక మూలపడిన బోర్లను శ్రద్ధగా మూసేస్తే బోలెడు మరణాలు నిత్యం నివారించవచ్చు. కానీ జరగడం లేదు. తప్పులకి శిక్షలు లేకపోవడం మనకున్న గొప్ప అదృష్టం’ అన్నాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
దానవీరులు
సిరిసంపదలు సృష్టించడం బ్రహ్మ విద్య మాత్రమే కాదు, ఒక గొప్ప కళ. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కాగానే ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో సాలుకి ఎకరాకి కోటింజిల్లర ఆదాయం రావడం మొదలు పెట్టింది. ఆదిత్యుని కటాక్ష వీక్షణాలతో శమంతకమణి తునక ఆ క్షేత్రంలో జారిపడిందని సనాతనులు విశ్వసించారు. కాదు, హైబ్రిడ్ క్యాప్సికమ్ అనే బుంగ మిరపకాయలు విరగకాసి తద్వారా కోటికి పడగలెత్తారని చంద్రశేఖరరావు నమ్మినబంట్లు పొలికేకలు పెట్టారు. ‘కాదు.. ఇవన్నీ శాస్త్రానికి నిలవవు’ అంటూ విషయ పరిజ్ఞానం కలిగిన హేతువాదులు ఇళ్లెక్కి అరిచి మొత్తుకున్నారు. ఏది ఏమైనా వ్యవసాయ క్షేత్రాలకు ఆఖ రికి వజ్రాలు పండినా పన్నులేదని ట్యాక్స్వాళ్లు తేల్చి చెప్పారు. ఆ మహాపంట, ఆ ఆదాయం వాటి వెనకాల ఉన్న శక్తి యుక్తులు ఏవిటో ఈ రోజుకీ ఆయనకు తప్ప వేరేవరికీ తెలియదు. చిదంబర రహస్యంగానే మిగిలి ఉంది. ఈ శమంతకోపాఖ్యానాన్ని ఇలా ఉంచి మరికొన్ని ఆదాయ వనరుల్ని పరిశీలిద్దాం. ఆనాడు గాంధీగారికి వేసిన సాదా సీదా పూలదండని ఏ బిర్లాగారో వెయ్యి రూపాయలకు వేలంలో పాడి ఉద్యమానికి జమవేసిన సందర్భం ఉంది. కాంగ్రెస్ సభలో నెహ్రూగారి మెళ్లో పడిన నూలు దండని వెయ్యినూట పదహార్లకు సింఘానియాలు సొంతం చేసుకుని పార్టీ నిధికి జమవేశారు. అప్పటి రోజుల్లో పరోక్షంగా అవన్నీ భూరి విరాళాలు. ఇప్పుడు కేవలం ఒక ప్లేటు భోజనం. అంతే! ఈమధ్య వేలంపాటల తాలూకు అపశ్రుతులు పేపర్ల కెక్కాయ్. మెట్రోలో జోకులై చిటపటలాడాయ్. మన అగ్ర నేతలంతా శ్రమదానాలతో లక్షలకి లక్షలు కుమ్మారని, దాన్ని సొంత పార్టీకి మంచి పనులకి ధారపోసి దానవీరం ప్రదర్శించారని వార్తలొచ్చాయ్. ఒకాయన చిన్న చిన్న బరువులు మోసి అయి దా రులకారాలు ప్రజల నుంచి గుంజాడు. కేటీఆర్ స్వయంగా కొన్ని చిన్నాచితక పనులు చేసి లక్షలు ఆర్జించి ప్రజలకి ధారపోసి, చేతికి ఎముక లేదని నిరూ పించుకున్నారు. అమ్మాయి కవిత నే తక్కువ తిన్నానా.. ఇదిగో నా కష్టార్జితం అంటూ లక్షలు గుమ్మరించి నుదుటి చెమట తుడుచుకుంది. హరీష్‌రావు పై సంగతి వేసి పెద్దరికంగా మిగిలిపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మాణాల దగ్గర ఇసుక సిమెంట్, కంకర బొచ్చెలకెత్తుకుని కేసీఆర్ లక్షలకి లక్షలు ఉద్యమ సాదరు ఖర్చులకు లోటు లేకుండా చూశారు. ఇంతవరకు బానే ఉంది. తర్వాత అసలు కథ మొదలైంది. మీ మీ శ్రమదాన ఆదాయాన్నీ లెక్కల్లో చూపించారా? దానికి పద్ధతిగా పన్ను చెల్లింపులు జరిగాయా? చెల్లించని యెడల మీ ‘ఈజీ మనీ’పై అపరాధ రుసుంతో సహా ఫలానా ఫలానా నిబం ధన కింద పన్నెందుకు వసూలు చేయరాదో చెప్పాలని కేటీఆర్ అని కూడా ఖాతరు చెయ్యకుండా ఐటీవాళ్లు తాఖీదులు జారీ చేశారు. అసలు ఆదాయపు పన్ను వారికి ఓర్పు, సహనాలు చాలా తక్కువ. హస్తవాసి బావుండి డాక్టర్‌కి పది రూపా యలు అదనంగా వస్తే వాళ్లు సహించలేరు. వాక్శుద్ధి కలిగిన లాయర్‌కి నాల్రూపాయలు వచ్చాయని తెలిస్తే తట్టుకోలేరు. ఆఖరికి ప్రైవేట్ ట్యూషన్ మేష్టర్లని కూడా వదలరు. ఆ మధ్య అపరకర్మల మీద బాగా పిండు కుంటున్నాడని ఓ పంతుల్ని కర్మల రేవులో రెడ్ హ్యాండె డ్గా కాటేశారు ఇన్‌కమ్‌ట్యాక్స్ వాళ్లు. గోదాన, భూదాన సువర్ణాది షోడశ దానాలూ పరోక్షంగా పెద్ద తలకాయలకే ముడుతున్నట్టు తేల్చి పాపం ముంచేశారు. పంతులు చేసేది లేక వచ్చిన శాపనార్థాలన్నీ పెట్టాడు. ఐటీ శాఖ వారు ‘జాన్దేవ్’ అనేసి నోటీసులు జారీ చేసేశారు. లాటరీ వచ్చినా వాళ్లొదలరు. ‘జన్మకో శివరాత్రి మహా ప్రభో వదలండి’ అని కాళ్లావేళ్లా పడ్డా మాక్కూడా సేమ్ టు సేమ్ కదా అంటూ రూపాయికి పావలాలు పట్టేస్తారు. ఇదివరకు, ఇప్పుడు కూడా పార్టీ పెద్ద పండుగల ప్పుడు సభల్లో హుండీలు పెడతారు. కలెక్షన్లు బానే ఉంటాయ్. ఇక్కడో చమత్కారం ఉందని చెబుతారు. ‘ఏవుంది, ఓ చేత్తో పడేసి, ఇంకో చేత్తో తీసుకోవడమే.. ఈ రోజుల్లో హుండీలో వేసేది ఎవరండీ అని’ ఒకాయన వాపో యాడు. మనమే తుమ్మి మనమే చిరంజీవ అనుకోవాలి. ఎవరిని నమ్మి కరెన్సీ కట్టలిస్తాం? మళ్లీ అన్నీ పడ్డాయో లేదో తేలేదాకా టెన్షను. ఇలా హుండీ ఆదాయాలు చూపించకపోతే తర్వాత ఏ శేషనో ఖర్చులు బైటికిలాగి లేనిపోని యాగీ చేస్తే– అదో పెద్ద తంటా. ఇవన్నీ గుప్తదానాలు. ఎవరు ఏమిచ్చారో ఎందుకిచ్చారో చెప్పక్కర్లేదు. చంద్రబాబు పదే పదే అంటు న్నట్టు బంగారు గుడ్లు పెట్టే బాతుగా ప్రతి హుండీ ఆ రోజుల్లో నిధులు సమకూర్చేది. మావూరి రచ్చబండ మీద ఒక పెద్దాయన తాజా విశేషాలు చెబుతూ, మా చంద్ర బాబుకి అయిదేళ్లనాడు ఈ సంగతి తెలిస్తేనా... అంటూ మొదలుపెట్టాడు. మొన్న మన గోడవతల చైనాలో తొమ్మిది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని, ఇంకో వారంలో ఇంకోటి నిర్మించారట. వాళ్ల దగ్గర కావల్సిన యంత్రాంగం, మంత్రాంగం ఉందిట! మనకి మాట మాత్రం తెలిస్తే మనకీ అద్భుతం జరిగేది అనగానే అంతా ఛీకొట్టారు. వాళ్లది వేరు, మనది వేరు అని నోరు మూయించారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
క్యాపిటల్ పాంకోళ్ల కథ
అసలు అప్పుడే మనకి నోరుంటే పొట్టి శ్రీరాములు స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకోగానే నెల్లూరే మన క్యాపిటల్ అని ఎలుగెత్తి చాటేవారు. శ్రీరంగనాయకస్వామి అండగా నిలబ డేవాడు. పెన్నమ్మ జలసంపదలిచ్చి చల్లగా చూసేది. సన్న బియ్యంతో సహా సమస్త నాజూకులతో ముఖ్య పట్టణం విరాజిల్లేది. ప్రపంచ దేశాల స్థాయిలో నెల్లూరులో ఏ కాన్ఫరెన్స్ పెట్టినా ఆహ్వానితులు ఆవురావురుమని విచ్చేసే వారు. ఆ కూరలు, ఆ పిండి వంటలు, ఆ దోసెలు, ఆ అరిటాకు లేలేత పరిమళాలు క్యాపిటల్ పేరు చెప్పగానే పదండి ముందుకు అంటూ నడిపించేవి. కాయగూరలేనా, కందమూలా లేనా పుణ్య పురుషులకు రుచి భోగాలున్న జలచరాలు, భూచ రాలు, ఖేచరాలు కోరినదే తడవుగా విస్తళ్లను అలంకరిస్తాయి. ఇంకా చిత్రాతిచిత్రమైన చిత్రన్నాలు, భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు, మధుర మధురతర పానీయాలు విస్తరిని కిటకిటలాడిస్తాయి. ఇది నెల్లూరు తిండిముచ్చట. ఇక రాజకీ యాలంటారా, అచట చిగురు కొమ్మైన చేవ. నెల్లూరు బారసాల కూడా లేకుండానే జారిపోయింది. అకళంక దేశభక్తుడు ‘వంగ వోలు’ క్యాపిటల్ చెయ్యాలిరా అని రంకెపెడితే ఏమి జరిగేదో?! ఆంధ్రకేసరి గర్జించ లేదు. మూడో మాట లేకుండా తెలుగువారు వడ్డించిన విస్తరి ముందు కూర్చుని తిరిగి వెనక్కి చూడలేదు. మళ్లీ ఇన్నాల్టికి విస్తళ్లముందు నుంచి కొంగులు దులుపు కుని లేచిపోవలసి వచ్చింది. వడ్డించిన విస్తళ్లు కాదు కదా కూచో డానికి అనువైన చోటైనా దొరకలేదు. ఆరేళ్ల నుంచి కథ నడు స్తోందిగానీ కంచికి చేరడం లేదు. భూములిచ్చిన రైతులు, వారి కష్టనష్టాలు, మీడియా, రాజకీయ, అరాచకీయ ప్రముఖులు అంతా కలిసి సమస్యని కమ్మేశారు. కుమ్మేశారు. చినికి చినికి గాలివాన అయింది. పనులు ముందుకు కదలడం లేదు. మాక్కావలసింది అదేనని తృప్తిగా నిట్టూరిస్తోంది వీళ్లకి సరిపోని అపోజిషన్. ఇట్లాంటి పెద్ద సమస్యలుగా ప్రజ్వరి ల్లేటప్పుడు, సామాన్యుణ్ణి అడిగి చూడాలి. అదే చేశాను. అతని మారుపేరు ‘అడ్డ బుర్ర’. వట్టిపోయిన గోమాతతో నూనెగా నుగ తిప్పుతూ ఊర్లో బతికేస్తున్నాడు. ఒక ప్పుడు బాగా బతికి చెడ్డవాడు. గానుగ కొయ్య తొట్టె మీద కూచుని, ఓ మూల నుంచి వచ్చే రేడియో సర్వస్వం వింటూ, దొరికిన పేపర్లని అక్షరం వదలకుండా నాకేసేవాడు. ‘ఇదిగో నువ్ గోవుతో గానుగ తిప్పుతున్నావని మోదీకి ఫొటోతో సహా ఫిర్యాదు చేస్తా’నని బెదిరిస్తే– అడ్డబుర్ర విలాసంగా నవ్వి ‘మరి నా గానుగ ఎట్టా తిరగాల? ఎవరైనా వాళ్ళోళ్లకి పురమాయించ మను. లేదంటే పనిచేసే ఆవులకు రిటైర్మెంట్ ప్రకటించి నెలవారీ పింఛనైనా మంజూరు చెయ్యమను. పాపం! అవెట్టా బతకాల’ అని జాలిపడేవాడు. ఇవ్వాళ హాయిగా బతకాలంటే లోకజ్ఞానం కాదు మీడియా జ్ఞానం ముఖ్యం అనేవాడు గానుగ కిర్రు చప్పుళ్ల మధ్య. ‘నువ్వు కాణి ఖర్చులేకుండా అన్ని పేపర్లు చదివేస్తావు గదా, మరి ఆ ఫలానా పత్రికనే ఎక్కువమంది చదువుతారెందుకు?’ అని అడిగితే, అదంతే అంటాడు అడ్డ బుర్ర. ‘కల్లు తాగేసినంత జోరుగా పాలు లాగీలేదు గందా’ సామెత చెప్పి ముక్తాయించేవాడు. పేపర్లో నిజాలు, అబద్ధాలు, వార్తలు అని మూడు విధాలవి కలిసిపోయి ఉంటాయి. విడ గొట్టుకున్నవాడు విజ్ఞాని అని సూత్రీకరించేవాడు. క్యాపిటల్ దుమారంమీద చర్చ వచ్చింది అడ్డ బుర్రతో. మధ్యలో కిర్రు చప్పుడుకి చిరాకుపడ్డాడు. అదేదో మన అవస్తో, వ్యవస్తో అది కూడా నా గానుగ లాంటిదే. అదిలించినా అంతే కదిలించకపోయినా అంతే. ముసలి జీవం మూడుకాళ్లమీద ఎట్టా నడుసుద్దో అంతే. మళ్లీ విషయంలోకి వచ్చాడు. ‘అసల ప్పుడు అట్టా జరిగి ఉంటే అప్పుడసలు క్యాపిటల్ సమస్య వచ్చేదే కాదు’ అంటూ ఓ ఏకవాక్య స్టేట్మెంట్ వదిలాడు. అసలప్పుడేం జరి గింది? అందరం ప్రశ్నార్థకంగా నిలబడి ఉత్కంఠభరితంగా అరిచాం. అభయహస్తంతో అందర్నీ ఊరటపరి చాడు. అప్పట్లో ఆయన పార్టీపెట్టి జై కేత నం ఎగరేసే సరికి, అప్పటికే విశాఖలో స్థిర పడ్డ పీఠాలు పాంకోళ్లు చేతపట్టుకు కది లాయి. రా.. కదిలిరా, తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది అంటూ నినా దాలు చేసుకుంటూ పచ్చజెండా భుజాన వేసుకుని బలగమంతా భాగ్యనగరానికి కదిలింది. ఇక ఈ నేల మనదిరా, ఈ గాలి మనదిరా, ఇంక మనకి తిరుగు లేదురా అంటూ ఇక్కడ తెలుగుజాతి ఎవరికి తోచిన మహా నిర్మాణాలు వాళ్లు ప్రారంభించారు. కొంతకాలానికి చిన్న నేతలు వయసు కొచ్చారు. వాళ్లకి తీవ్రమైన పదవుల కొరత వచ్చింది. దాంతో కొండలు కదిలాయ్. ఈ పాంకోళ్లు నాడు కదలకుండా విశాఖ లోనే ఉండి ఉంటే– అయిదువేల ఎకరాల్లో లేదంటే హీనపక్షం పదివేల ఎకరాల్లో చిత్ర నగరం వెలిసేది. ఇక్కడ లేని సముద్రం కూడా జతపడి ఉచిత సేవలు అందిస్తూ ఉండేది. విశాల సామ్రాజ్యం పాంకోళ్ల కిందకు వచ్చేది. అప్పుడు కావల్సిన కళ్లద్దాలు తగిలించుకుని, విశాఖ ఎంత గొప్పనేలో పూర్వ గాథల్ని వివరిస్తూ సొంత మీడియాలు జాగారం చేసేవి. అప్పుడు కావల్సిన కళ్లద్దాలు తగిలించుకుని, విశాఖ ఎంత గొప్ప నేలో పూర్వగాథల్ని వివరిస్తూ సొంత మీడియాలు జాగారం చేసేవి. అప్పుడు భూ మార్గం నుంచి, ఆకాశమార్గం నుంచి మాత్రమే కాక జలమార్గం ద్వారా కూడా ఆ ఎంపైర్కి జనం వచ్చేవారు. కానీ కథ అడ్డంగా తిరిగింది అని ముగిం చాడు అడ్డబుర్ర. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అర్ధరాత్రి శపథాలు
రెండు రోజుల్లో పాత సంవత్సరం వెళ్లిపోయి, ఘల్లుఘల్లుమని బంగరు గజ్జెల చప్పుళ్లతో కొత్త సంవత్సరం విశ్వమంతా అడుగు పెట్టనుంది. ఈ నవ వత్సర శుభవేళ అంద రికీ శుభాకాంక్షలు. డిసెం బర్ 31 అర్ధరాత్రి దాకా మేలుకుని గడచిన సంవ త్సరానికి వీడ్కోలు చెబుతూ, ఆ వెంటనే వచ్చే కొత్త వత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకుంటారు. ఆశావాదులు 2020 అన్ని విధాలా లాభసాటిగా ఉంటుందని బోలెడు నమ్మ కాలతో పాత సంవత్సరపు చివరి రాత్రిని గడు పుతారు. నిరాశావాదులు చప్పరింతలతో ‘ఏం తేడా ఉంటుంది. అంతా మన భ్రమ తప్ప’ అంటూ సందేశాలు ఇస్తుంటారు. అసలు పాత కొత్త అనే తేడా లేనే లేదు. కాలం అనేది పెద్ద దారపు బంతి అయితే, అందులో ప్రతి జానెడు నిడివి ఒక ఏడాది అంటే క్రీస్తు శకంలో 2019 జానలు అయిపోయి, తర్వాతి జాన మొదలైనట్టు అన్నమాట. ఆస్తికులు ఆ జాన సాక్షాత్తూ దేవుడిదని నమ్ముతారు. నాస్తికులు నమ్మరు. హేతువాదులు అసలు కాలాన్ని ఇంకో విధంగా నిర్వచిస్తారు. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రోజులు, సూర్యుడి చుట్టూ తిరగడంవల్ల సంవత్సరాలు లెక్కకు వస్తున్నాయంటారు. ప్రాణం ఉన్నప్పుడే కాలం గణనకి వస్తుంది. రాయికి, రప్పకి కాల ప్రభావం, ఆయుర్దాయం ఉండవు. ఇలా హేతు వాదంతో అప్లయిడ్ ఫిజిక్స్లోకి, సాలిడ్ స్టేట్ కెమి స్ట్రీలోకి తీసికెళ్లి చివరకు ఎన్సైక్లోపీడియా ఇరవై రెండో వాల్యూమ్‌లో మనల్ని నించోబెట్టి వాళ్లదా రిన వాళ్లు వెళ్లిపోతారు. అందుకే హేతువాదుల వెంట నడిచేటప్పుడు ఆచితూచి అడుగులు వెయ్యండి. ఆ మధ్య కరడుగట్టిన ఓ హేతువాది బారినపడ్డా. ‘మీ తాతగారు నిజంగా మీ తాత గారని గ్యారంటీ లేదు. అదొక నమ్మకం మాత్రమే. పాక్షిక సత్యం. డీఎన్ఏలు చూసి నిర్ధారించిన పూర్ణసత్యాలు కావు’ అంటూ సశాస్త్రీయ తర్కంలోకి దిగాడు. నాకు మా తాతగారి మీద డౌట్ వచ్చింది. మా నాయనమ్మని అడిగా. ఆవిడ నవ్వేసి ఎవడ్రా నీకు చెప్పిన అంట్లవెధవ అని అడిగింది. మీ తాత ఛండాలపు బుద్ధులన్నీ అమర్చినట్టు నీకు వచ్చి పడ్డాయ్. ఇంతకంటే రుజువేం కావాలి’ అంటూ తాతగారిని తలచుకుంటూ కంటతడి పెట్టింది. ఈ సంధి కాలంలో, పాత కొత్తల బేసందులో అందరం ఎన్నెన్ని తీర్మానాలు చేసుకుంటామో.. ఆలోచిస్తే గుండె చెరువైపోతుంది. ‘ఏ అమృత ఘడియల్లో సిగరెట్లు తాగడం అంటుకుందోగానీ నన్నది వదలడం లేదు. ఈసారి వదిలేస్తా. అదేం పెద్ద కష్టం కాదు’ అంటూ శపథం చేశాడొక మిత్రుడు. ‘ఏడేళ్లుగా ఈ మాటమీదే ఉన్నావ్ మిత్రమా’ అంటే ‘ఇన్నేళ్లు సీరియస్‌గా తీసుకో లేదు. ఇప్పుడు ఖాయం’ అన్నాడు. చూడాలి. ముచ్చటగా మూడ్రోజులు ఆగితే జాతకం తెలిసి పోతుంది. కొందరు కొన్ని అలవాట్లని ‘వ్యస నం’గా తీర్మానించారు. అది చాలా తప్పు. ‘ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఓ క్రమశిక్షణతో నమ్ముకున్న అలవాటుని పద్ధతిగా ఆచరించడం వ్యసనం ఎట్లా అవుతుంది. అదొక కమిట్మెంట్’ అని ఓ మహా కవి జాతికి సందేశం ఇచ్చారు. ‘సిగరెట్లు మానె య్యడం కష్టమేమీ కాదు. నేను చాలాసార్లు మానే శాను’ అంటూ భరోసా ఇచ్చేవారు ఆరుద్ర. ‘మీరు పైపు కాలుస్తారా... ఎందుకండీ’ అని విస్తుపోతూ అడిగిన తన అభిమానికి – ‘మరి పైపులున్నది కాల్చడానికే కదండీ’ అని జవాబిచ్చారు. ‘నేను కూడనివన్నీ మానేస్తా. కానీ జనవరి ఒకటిన కాదు. ఎప్పుడో ఇంకోప్పుడు....’ అని నిర్ణయించుకు న్నారు వెంకటరమణ. ఇంకోప్పుడంటే ఎప్పుడండీ అని అడిగితే, అది వ్యక్తిగత విషయం కదా అని భయపెట్టేవారు. పాత సంవత్సరంలో విశేషమైన అరిష్టం పోయి, నవ శకం ఆరంభమైందని ఎక్కువ మంది సంతోషపడుతున్నారు. అనేకానేక భరోసా పథకాలు జగన్ పాలనతో పేదముంగిళ్లకి వచ్చాయ్. పల్లెల్లో ఉద్యోగాలు విస్తృతంగా మొలక లెత్తాయి. ఇంగ్లిష్ మాటలు వినిపిస్తున్నాయ్. అప్పట్లో వాస్తు రీత్యా అమరావతి క్యాపిటల్ పర మాద్భుతం అన్నారు. మరి వాస్తు అంత ప్రశస్తంగా ఉంటే ముందుకు నడవాలి కదా, ఇట్లా గుంట పూలు పూస్తూ పునాదుల్లోనే ఆగడం ఏమిటి? 2020 శుభాకాంక్షలు. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
ఉత్తమాభిరుచికి మారుపేరు నవోదయ
ఒకప్పుడు బెజవాడ ఏలూరు రోడ్డంటే పుస్త కాల మక్కా. ‘ఏ పుస్తక మైనా సరే– ఏలూర్ రోడ్ ఛలో’ అనేవారు. తర్వాత అదే కారల్‌మార్క్స్ వీధిగా వాసికెక్కింది. అందులో నవోదయ బుక్ షాప్ ఒక ల్యాండ్ మార్క్! అర్ధ శతాబ్దిపాటు నవోదయ ఒక వెలుగు వెలిగింది. మంచి చరిత్ర ఉంది. తెలుగు ప్రాచీన గ్రంథాల ప్రచురణలో వావిళ్ల వారికున్న కీర్తిప్రతిష్టల్ని ఆధునిక సాహిత్య ప్రచురణలో నవో దయ గడించింది. నవోదయ రామమోహనరా వుగా పేరు తెచ్చుకున్న అట్లూరి 1934లో గన్న వరం తాలూకా ఉంగుటూరులో జన్మించారు. స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్న రావుకి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో మంచి ప్రవేశం ఉంది. పుస్తకాల ప్రూఫ్‌లు దిద్దడంలో ఆయన నిక్కచ్చ యిన మనిషి. మొదట్లో నవోదయ అంటే కమ్యూ నిస్ట్ సాహిత్యమని పేరుండేది. తర్వాత్తర్వాత విలు వలున్న అభ్యుదయ రచనలకు అచ్చులు కల్పిం చారు. బాపురమణల స్నేహం దొరకడంతో నవో దయ అందమైన మలుపు తీసుకుంది. పుస్తకం సైజు, బాపు దిద్దిన ముఖచిత్రం, బాపు మార్క్ కోతి అక్షరాలు, ఇంకా ఎన్నో చిలవలు పలవలతో నవోదయ పబ్లికేషన్స్ పుస్తకాల మార్కెట్‌ని అలంకరించేవి. ఆ క్రమంలో ముళ్లపూడి వెంకట రమణ పుస్తకాలు గిరీశం లెక్చర్లు, రుణానందల హరి, బుడుగు విడివిడిగా బాపు రమణీయంగా వెలువడ్డాయ్. బాపు కార్టూన్ సంపు టాలు వెలువడి నవ్వులు పండిం చాయి. చాలామంది రచయితలు తమ పుస్తకాలు నవోదయ బ్యానర్‌పై వస్తే బాగుండునని కలలు కనేవారు. వీఆర్ నార్ల సీత జోస్యం, నండూరి రామ మోహనరావ్ విశ్వరూపం, నరావ తారం సి. రామచంద్రరావు వేలుపిళ్లై, శ్రీరంగం నారాయణ బాబు రుధిర జ్యోతి, ఆరుద్ర పుస్తకాలు నవోదయ పేరుకి పెద్ద పీట వేశాయి. పుస్తకాలు పెట్టిచ్చే కాగితం కవర్లమీద బాపు కొంటె బొమ్మలు చిత్రాతిచిత్రంగా ఉండేవి. కస్టమర్లు కవర్లని కూడా దాచుకొనేవారు. బాపు గీసిన ప్రతి గీతని, వేసిన ప్రతిగీతని వాడుకుని అందమైన గ్రీటింగ్ కార్డ్స్‌ని రూపొందించేవారు. నవోదయ షాపు ఎప్పుడు చూసినా ‘బాపు బొమ్మల కొలువులా’ పరిమళిం చేది. ఆ తర్వాతి కాలంలో సత్యం శంకరమంచి విరచిత అమరావతి కథలు బాపు రేఖా చిత్రాలతో రమణ ముందుమా టతో వెలువడి సంచలనం సృష్టించింది. ఇంద్ర గంటి హనుమచ్ఛాస్త్రి, శ్రీకాంత శర్మ, శ్రీరమణ ఇత్యాదులు నవోదయ ఆథర్స్. మీరంతా మా ఆధ రువులని రావు తరచూ చమత్కరిస్తుండేవారు. నవోదయకి గుంటూరులో కూడా అన్ని హంగులతో శాఖ వెలిసింది. అప్పటి గుంటూరు మెడికోలలో చాలామందికి నవోదయ స్టెత స్కోప్ లాంటిది. అప్పట్నించీ డాక్టర్ జంపాల చౌదరి నవో దయ అభిమానిగా ఉన్నారు. తానా సంస్థకి మూల స్తంభం. రామ్మోహనరావుపై చాలా చాలా ఇష్టం కొద్దీ రావు దంపతుల్ని ఒక తానా ఉత్సవా లకు గౌరవంగా రప్పించి సత్క రించారు. కడదాకా రావుగారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, వైద్య సలహాలిస్తూ డాక్టర్ జంపాల నవోదయ రుణం తీర్చుకున్నారు. అప్పటి ఎమెస్కో యజమాని ఎమ్మెన్ రావు, పలు వురు ఢిల్లీ ప్రచురణ కర్తలు డా‘‘ రావుతో ఆత్మీ యంగా ఉండేవారు. గడచిన రెండు మూడు దశాబ్దాలలో జనరల్ బుక్స్ వైపు చూసేవారు తగ్గి పోయారు. దాంతోబాటే నవోదయ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. దాదాపు ముప్ఫై ఏళ్లనాడు ‘విజయవాడ బుక్ ఫెయిర్’ ఒక మహోత్సవంగా జరగడానికి నవోదయ రామ్మోహనరావు కార కులు. కమ్యూనిస్ట్ భావాలు, హేతువాద తత్వం కలిగిన రావు ఎప్పుడూ ఎక్కడా రాజీ లేకుండానే 86 ఏళ్ల జీవితం గడిపారు. 1955లో పర్వతనేని ఝాన్సీ, నవోదయ రామ్మోహనరావు ఇష్టపడి వివాహమాడారు. ఝాన్సీ నవోదయ సంపాదించు కున్న ‘గుడ్‌విల్’కి కొమ్ముకాశారు. బాపు రమణ లకు నిత్యం ఒకసారైనా ఫోన్లో మాట్లాడక అయ్యేది కాదు. బాపు ముద్దుగా రావుని ‘మావో గారూ!’ అని పిలిచేవారు. ఆ త్రయం కనుమరు గైంది. తెలుగు అక్షరానికి పెద్ద లోటు. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
ఒక జీవనది అదృశ్యమైంది
‘గొల్లపూడి మారుతీరావు గొప్ప నాటక రచయిత మాత్రమే కాదు, చాలా మంచి నటుడు కూడా. సినిమాల్లో వేస్తే ముఖ్య పాత్రలో బాగా రాణించగ లడు’ అంటూ 1970లో ప్రముఖ పత్రికా సంపాద కులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గొల్లపూడిని అంచనా వేశారు. తర్వాత అక్షరాలా అంతే జరి గింది. పదేళ్ల తర్వాత ముఖానికి రంగు పూసుకుని వెండితెరకెక్కారు. గద్దముక్కు, తీక్షణమైన చూపులు, సన్నగా పొడుగ్గా కింగ్ సైజు సిగరెట్ లాంటి విగ్రహం, చేతులు వూపేస్తూ వాదనలో పస లేకపోయినా అవతలివాళ్లని తగ్గేట్టు చేసే వాగ్ధాటి గొల్లపూడికి ముద్రవేసి నటుడిగా నిలబెట్టాయి. తొలి సినిమా ‘ఇంట్లో రామయ్య...’ చిత్రంతోనే అన్ని వయసుల వారిని ఆకట్టుకున్నారు. వంద సినిమాల తర్వాత అబ్బాల్సిన ‘ఈజ్’ మొదటి దెబ్బకే వంటబట్టింది. ఇక తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. మారుతీరావుది పరిపూర్ణ జీవితం. పద్నాలుగే ళ్లప్పుడే మించిన ప్రతిభని ప్రదర్శిస్తూ ‘ఆశాజీవి’ కథ రాశారు. ఇంకో రెండేళ్లకి తొలి నాటకం అనంతం, ఇంకో రెండేళ్లకి మరో మంచి పెద్ద కథ గొల్లపూడిని రచయితగా నిలబెట్టాయి. విశాఖ పట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చది వారు. ఆ పట్టాని, దాష్టీకమైన వాక్కుని పట్టుకుని విజయవాడ ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదిం చారు. అక్కడ మహానుభావుల మధ్యలో ఉండి కలానికి పదను పెట్టుకున్నారు. సరిగ్గా వృత్తి నాటక రంగం వెనకబడి సినిమాకు అన్ని కళలూ, శక్తి యుక్తులూ దాసోహం అంటున్న తరుణంలో నాటి కలు, నాటకాలు రాసేవారు ఒట్టిపోయారు. ఈ మహా శూన్యంలో గొల్లపూడి ప్రవేశించి పుంఖాను పుంఖాలుగా నాటక రచనలు చేసి తెలుగు అమె చ్యూర్ థియేటర్‌కి కొత్త చిగుళ్లు తొడిగారు. ‘అనంతం’ కొన్ని వందల ప్రదర్శనలకు నోచు కుంది. ‘బియాండ్ ది హొరైజన్’ ఆధారంగా తీర్చిది ద్దిన ‘రాగగాగిణి’ మాతృక వలే ఖ్యాతి పొందింది. కొత్త కొత్త నాటకాలు చదవడం, తనదైన శైలిలోకి దించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తన రచనలకు బారసాలలు చేసి పేర్లు పెట్టడంలో గొల్ల పూడిది విలక్షణమైన దారి. పిడికెడు ఆకాశం, వెన్నెల కాటేసింది, రెండురెళ్లు ఆరు, మళ్లీ రైలు తప్పిపోయింది, కరుణించని దేవతలు, రోమన్ హాలిడే, కళ్లు, సత్యంగారి ఇల్లెక్కడ, చీకట్లో చీలి కలు, ఎర్రసీత ఇవన్నీ కొత్తగా ఆకర్షణీయంగా ఉంటాయ్. ఆఖరికి ఆయన స్వీయ చరిత్రకి ‘అమ్మ కడుపు చల్లగా...’ అని నామకరణం చేసు కున్నారు. విజయనగరం నేల మహత్యం, గాలి నైజం మారు తీరావుకి పుట్టుకతోనే (1939) అంటింది. హమేషా కొత్తపూలు విరిసే విశాఖ ప్రభాతం ఆయనపై పూర్తిగా పడింది. తెలుగు కథని జాగృతం చేసిన చా.సో., కా.రా., రావి శాస్త్రి, భరాగో ఇంకా మరెం దరో గొల్లపూడి రెక్క విచ్చే టప్పుడు ఉత్సాహంగా రాస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి అప్పట్లో సరస్వతీ నిలయం. శంకర మంచి సత్యం, ఉషశ్రీ, జీవీ కృష్ణారావ్, బుచ్చి బాబు లాంటి విశిష్టులు తమ ప్రజ్ఞా పాటవాలతో వెలుగుతున్నారు. ఈ వనంలో తనూ ఒక మల్లె పొదలా ఎదిగి గుబా ళించారు గొల్లపూడి. పరిమళాలు గాలివాటున చెన్నపట్నందాకా వెళ్లాయి. అన్నపూర్ణ సంస్థ ‘చక్ర భ్రమణం’ ఆధా రంగా తీస్తున్న ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకి మాటల రచయితగా మారుతీరావుకి పిలుపు వచ్చింది. ఆయనకు సహజంగా ఉన్న మాటకారితనం సిని మాల్లో బాగా పనిచేసింది. 80 సినిమాలకు కథలు, మాటలు ఇచ్చారు. నటుడిగా 200 పైగా చిత్రాల్లో కనిపించి మెప్పించారు. నటుడు, రచయిత, వ్యాఖ్యాత, వ్యాసకర్త, విశ్లేషకుడు– అన్నిటా రాణిం చారు. నటుడుగా విలనీ, కామెడీ ఇంకా అనేక షేడ్స్ చూపించారు. ‘వందేళ్ల తెలుగు కథకి వందనాలు’ పేరిట కె. రామచంద్రమూర్తి పూనికతో గొల్లపూడి రూపొందించిన టీవీ కార్యక్రమం ఆయన మాత్రమే చేయగలడు. 14వ ఏట నించి సృజనాత్మకంగా ఆయన జీవితం సాగింది. అన్నీ ఒక ఎల్తైతే పాతి కేళ్లపాటు అవిచ్ఛిన్నంగా నడిచిన ఆయన ‘జీవన కాలమ్’ మరో ఎత్తు. బ్రాడ్వే నాటకాలను స్వయంగా వెళ్లి, చూసి వచ్చి ఆయన అందించిన విపుల సమీ క్షలు మనకి విజ్ఞానదాయకాలు. గొల్లపూడికి అక్షర నివాళి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కాకికీ ఓరోజు వస్తుంది
ఒకవైపు మాతృభాషని పక్కన పెడుతున్నారని, మరోవైపు అమరావతి విశ్వవిఖ్యాత క్యాపిటల్‌ని కూల్చేస్తున్నారనీ తెలుగు దేశం పార్టీ యాగీ చేస్తోంది. బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపేస్తు న్నారని వాపోతున్నారు. అవసరాల్ని బట్టి భాషలు, పనులు అలవడతాయ్. ఒకప్పుడు బతుకుతెరువు కోసం రంగూన్ వలస వెళ్లేవారు. అక్కడ హార్బర్లో కొయ్యదుంగలు మోస్తూ, ఇంకా అనేక చిన్న చిన్న పనులు చేస్తూ తెలుగు ప్రాంతం నుంచి వెళ్లిన నిరక్షరాస్యులుండేవారు. చాలా శ్రమించేవారు. ఆదాయం తక్కువే ఉండేది. అయినా జాగ్రత్తగా బతికి, మిగిలిచ్చి ఇంటికి డబ్బు పంపేవారు. కొన్ని సంవత్సరాలకిగానీ సొంత గూటికి వచ్చేవారు కాదు. వాళ్లంతా అక్కడి స్థానిక భాషలు నేర్చారు. బర్మీస్ స్థానిక యాసలతో సహా పొందిగ్గా మాట్లాడే వారు. ‘నేర్చుకోవాలి.. చచ్చినట్టు. లేకుంటే వ్యాపా రులు దళారులు మా నెత్తురు తాగేస్తారు’ అని వివరం చెప్పారు. భాష తెలియకపోతే ఇంకా మోసపోతామని చెప్పేవారు. మావూళ్లో బర్మీస్ అనర్గళంగా మాట్లాడగలిగినవాళ్లు పాతికమంది పైగా ఉండేవారు. ఇక్కడికి వచ్చాక వాళ్లకా భాషతో అస్సలు పని లేకుండా పోయింది. దాని గురించి దిగులు పడాల్సిన పనేముంది? కాలమాన పరిస్థి తుల్ని బట్టి ఆధిక్యతలు మారిపోతూ ఉంటాయి. కరెంటు వచ్చాక కిరసనాయిల్ అవసరం తీరింది. ఒకనాటి నిత్యావసరం అది. అలాగే అనేకం. ‘మేం చిన్నప్పుడంతా గబ్బునూనె బుడ్డికిందే చదువు కున్నాం. ఇంతవాళ్లం అయ్యాం. దాన్ని మర్చి పోకూడదు. వెలిగించండి లాంతర్లు’ అంటూ ఉద్య మించాల్సిన అవసరం లేదేమో?! ఇవన్నీ మన సంస్కృతిలో భాగం అనుకోకూడదు. దీపం బుడ్డి అనాగరికం మాత్రమే. కుక్కకి కూడా ఒకరోజు వస్తుందని సామెత. అలాగే కాకికి కూడా ఒక గౌరవం వస్తుందన్నది నిజం. మొన్న మొన్నటిదాకా ప్రకృతిలో చాలా నీచమైన, హేయమైన ప్రాణి కాకి. దాని రంగు బాగుండదు. దాని అరుపు, పిలుపు బాగుండవు. ఇనుపముక్కుతో వికారం నిలువెల్లా. శనేశ్వరుడి వాహనంగా అదొక అపఖ్యాతి. రకరకాల కారణాల వల్ల కాకి జాతి బాగా క్షీణించింది. నగరాల్లో వాటి ఉనికి అస్సలు లేదు. గ్రామాల్లో ఎక్కడైనా, ఎప్పు డైనా కాకి అరుపు వినిపిస్తోంది. మనదసలే నమ్మ కాల నేల. పితృ కార్యాలప్పుడు పెద్దల్ని స్మరించి వికర పిండాలని కాకులకి అర్పించి కార్యకర్తలు తృప్తి పడతారు. ‘పియ్య తినెడి కాకి పితరుడె ట్లాయెరా’ అని ప్రజాకవి వేమన సూటిగా మన చాదస్తాన్ని ప్రశ్నించాడు. అయినా ఈ ఆచారం ఆగ లేదు. అన్నంలో ఘుమఘుమలాడే నెయ్యి పోసి చేతినిండా తీసుకుని ముద్ద చేసి వికర పిండాన్ని సిద్ధం చేస్తారు. కాకులకు కన్పించే రీతిలో దాన్ని ఎత్తుమీద పెట్టి వాటి రాక కోసం ఆశగా చూస్తుండే వారు. ఎందుకో ఒక్కోసారి వచ్చేవి కావు. అమ్మో! పెద్దలు అలిగారని భావించి, బోలెడు వాగ్దానాలు చేస్తూ దణ్ణాలు పెట్టేవారు. ఫలానా పెళ్లి జరిపి స్తాం, ఆ పని చేయిస్తాం ఇలా బోలెడు అనుకున్న మాటల్ని పైకి చూస్తూ చెబుతారు. ఎప్పటికో ఒక కాకి వస్తుంది. దాని పిలుపుతో కాకిమూక దిగు తుంది. మెతుకు లేకుండా తినేసి వెళ్తాయి. ‘అదీ ఆవిడకి లేదా ఆయనకి లోపల అనుమానం ఉంది. ఇప్పుడు తీరింది’ అనుకుంటూ లోపలికి వెళ్లేవారు. ఇప్పుడు కాకులకి మహర్దశ పట్టింది. మన నగరాల్లో పెంపుడు చిలకల్లా హాయిగా గారాబంగా పంజరాల్లో పూర్తి వెజిటేరియన్‌గా బతికేస్తున్నాయ్. ఒక అవసరంలోంచి ఆలోచనలు పుడతాయ్. అంత్యేష్ఠికి ఆబ్దికానికి కాకుల కొరత తీవ్రంగా ఉందని గ్రహించిన ఓ మేధావి కాకుల్ని చేర దీశాడు. ఫోన్ చేసినా, కబురు పెట్టినా కాకి పంజ రంతో సహా స్పాట్‌కి వస్తాడు. పితరుడి హోదాలో పిండం తినగానే దక్షిణ తీసుకుని యజమాని తన బండిమీద వెళ్లిపోతాడు. చేతిలో పది కాకులుంటే పదిమంది కాకి మనుషుల్ని బతికిస్తాడు. రేటెంత అంటే గిరాకీ, ఒత్తిడిని బట్టి అంటున్నారు. మునుపు నటించే కుక్క, కోతి, జింక, చిలక, పాము, ఉడుత లాంటి వాటికి భలే డిమాండ్ ఉండేది. ఇప్పుడీ విధంగా కాకికి ఒక రోజు వచ్చింది. అవసరాన్ని బట్టి అన్నీ వస్తాయ్. కనుక చంద్రబాబు దేని గురించీ అతిగా అలజడి పడా ల్సిన పన్లేదు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బంగారు కల
కేవలం 23 అసెంబ్లీ సీట్లతో టీడీపీని రాష్ట్రంలో తొలగించారు. బంపర్ మెజార్టీ ఇచ్చి వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఈ యధార్థాన్ని చంద్రబాబు అన్నివేళలా గుర్తు పెట్టుకోవాలి. ఆయన రాజకీయ అనుభవాన్ని ఇలాంటప్పుడే మర్యాదగా వినియోగించుకోవాలి. సద్వినియోగం చేసుకుంటూ తెలుగుజాతికి మేలు చెయ్యాలి. అంతేగానీ కరకట్టమీద, వరదపై, ఇసుకపై రోజుకో సంగతిని తీసుకుని దాన్ని సమస్యని చేసి పాలించే ప్రభుత్వంపై బురదజల్లుతూ వినోదించకూడదు. మనం ముందే అనుకున్నట్లు ఓటర్లు ఒక్కమాటమీద నిలబడి చంద్రబాబుని వద్దనుకున్నారు. ప్రజల తీర్పుని గౌరవించాలి. తప్పులు, లోపాలు జరుగుతుంటే అపోజిషన్ లీడర్‌గా నిలదీయండి, ప్రశ్నించండి, ఎండగట్టండి. అంతేగానీ, రంధ్రాన్వేషణవల్ల ప్రయోజనం శూన్యం. జగన్ పాలనలోకి వచ్చాక దశలవారీ మద్యనిషేధం, బడి చదువుకి ప్రోత్సాహకాలు, అన్ని వర్గాలకు ఆర్థిక సాయం ఒక రకంగా సంస్కరణలే కదా! చంద్రబాబు ఒక సీని యర్ రాజకీయ వేత్తగా చిన్న నవ్వుతో హర్షం వ్యక్తపరిస్తే ఎంత బావుంటుంది? పాలసీల కంటే ఉత్తమ సంస్కారం గొప్పది. అమరావతిపై పెద్ద గందరగోళానికి చంద్ర బాబు తెర తీశారు. ఆయన మానస పుత్రిక అమరావతి నిర్మాణం వారి సొంత పాలన అయిదేళ్లలో ఎంత మందుకు వెళ్లింది? పోనీ ఎంత పైకి వెళ్లింది? జగన్ కుర్చీ ఎక్కగానే క్యాపిటల్‌ని ఒక భయంకరమైన సమస్యగా బయటకు తెచ్చారు. దాన్ని బంగారు గుడ్లు పెట్టే బాతుగా టీడీపీ వారు అభివర్ణిస్తున్నారు. అది ఎట్లా బంగారు గుడ్లు పెడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ముందా బాతుని సిద్ధం చేయడానికి కనీసం రెండు లక్షల కోట్లు (తరుగులతో కలుపుకుని) కావాలి. ఆ డబ్బుని వెచ్చించి కాగితం మీద ఉన్న మేడలు, గోడలు, సుందర సౌధాలు, సువిశాల వీధులు ఇంకా అన్నీ సిమెంటుతో పూర్తయితే దానికో ఆకర్షణ వస్తుంది. దేశ విదేశాల నించి వ్యాపార వేత్తలు డబ్బుతో వచ్చి ఇంకా బోలెడు సరదాలు చేరుస్తారు. అతి ఖరీదైన మాల్స్, ప్యారిస్ స్థాయి సెలూన్లు, విలాసవంతమైన బార్లు... చెప్పలేనన్ని దిగిపోతాయ్. ఎవరైనా సరే తమ కొత్త ఇంటికి అత్యుత్తమ విద్యుద్దీపాలు కావాలనుకుంటే మలేసియా, సింగపూర్ వెళ్లక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి వస్తే చాలు. అన్నీ వివరంగా వర్ణించి చెప్పాలంటే ఒక మహా గ్రంథమే అవుతుంది. ఇహ అప్పుడు మనకు ఎంట్రీ టిక్కెట్టు ఉంటుంది. దాన్ని అప్పుడప్పుడు పెంచుకుని డబ్బు చేసుకోవచ్చు. ఇట్లాంటి బోలెడు ఐడియాలతో చంద్రబాబు పగలూ, రాత్రీ కలలు కంటూ కూర్చున్నారు. ఎన్నెన్నో రంగుల కలలు! ఇక ఇండియా అంటే అమరావతి అని ప్రపంచం అనుకోవడం ఖాయం. ఈ పనిమీద ప్రపంచమంతా స్వజనంతో సొంత విమానంలో చంద్రబాబు తిరిగారు. ఉత్తమజాతి గుర్రాలు క్యాపిటల్‌కి దిగాయి. బ్రహ్మాండమైన రేసు కోర్టుని ప్రపంచ ప్రసిద్ధమైన స్థాయిలో మొదటే సిద్ధం చేశారు. పెద్ద గుర్రాల సంత వెలిసింది. తెచ్చుకునేవారు తమ ఊరునించి విమా నంలో సొంత అశ్వాన్ని తెచ్చుకోవచ్చు. లేదంటే మన సంతలో కొనుక్కోవచ్చు. అన్నింటికీ షరతులు వర్తిస్తాయి. ప్రతి రేసులో రాష్ట్రం తరఫున పందెం కాస్తారు. రాష్ట్రం పేరున పరుగెత్తుతున్న గుర్రం జాక్ పాట్ కొట్టింది. కనక వర్షం కురిసింది. నోట్లు.. నోట్లు! ఎక్కడ చూసినా రేసు కోర్టు నిండా పచ్చటి ఆకుల్లా కరెన్సీ నోట్లు! చంద్రబాబు ఒక్కసారి ఉలిక్కిపడి లేచారు. కళ్లు నులుముకు చూస్తే అంతా భ్రమ! నిజంగానే ఇది భ్రమరావతి అనుకున్నారు. నిన్న మొన్న చంద్రబాబు అమరావతి పాదయాత్రకి వెళ్లడం చోద్యంగా ఉంది. వేలాది ఎకరాలు ఆరేళ్లుగా బీడు పెట్టిన ఘనత చంద్రబాబుదే. ఇప్పుడు పైకి లేచి కనిపిస్తున్న నాలుగు భవనాలు శాశ్వతాలు కావట. కొన్నాళ్ల తర్వాత తిప్పి కట్టాలట. ఇప్పటికే చాలామంది రాష్ట్ర ప్రజలు మనకంతటి వరల్డ్ క్లాస్ అమరావతి అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అదేంటో ఒంటి నిండా వస్త్రాలు లేకుండా, తలమీద బంగారు కిరీటం ధరించినట్టు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
అన్నం పెట్టే భాషకే అగ్ర తాంబూలం
మాతృభాష చాలా గొప్పది. బువ్వపెట్టే భాష అంతకంటే గొప్పది. అమెజాన్, సెల్ ఫోన్ లాంటి సంస్థల్లో సాదాసీదా బరు వులు మోసే ఉద్యోగికి కూడా ఇంగ్లిష్‌లో వర్కింగ్ జ్ఞానాన్ని తప్పనిసరిగా అడుగుతు న్నారు. పెద్ద హోటల్స్‌లో చిరు సేవలకు, కారు డ్రైవర్ ఉద్యోగానికి ఎబీసీడీలు ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి ఏది కొత్తగా ప్రవేశపెట్టినా చంద్రబాబు వర్గం దానికి వక్రభాష్యం చెప్పి, రాష్ట్రం నాశనం అయిపోతోందని ప్రచారం సాగిస్తారు. ఎవరూ నిజాల్ని నిజాలుగా ఆలోచించరు. ‘జగన్ ఇంగ్లిష్‌ని ఆరో క్లాసుదాకా కంప ల్సరీ చేసి, ఇన్నేళ్లుగా సాగుతున్న ఒక జలతారు ముసుగుని తొలగిం చారని’ ఒక మేధావి తేల్చి చెప్పాడు. ప్రతి చిన్న పల్లె నించి నిత్యం ఒకటి రెండు బస్సులు దగ్గరి బస్తీలకు చిన్న పిల్లలతో బయలుదేరి వెళ్తాయ్. అక్కడ కాన్వెంట్ స్కూల్స్ ఉంటాయ్. పిల్లలకు యూని ఫామ్స్ ఉంటే తల్లిదండ్రులు గొప్పగా భావిస్తారు. పిల్లలు మమ్మీ, డాడీతోబాటు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్‌స్టార్ నేర్చుకుంటారు. కాలా నికి తగినట్టు మార్పులు తప్పవు. ఒకప్పుడు సంస్కృతం మన దేశ భాష. ఘంటం పట్టేదాకా తెలుగు నిండిన కావ్యం రానేలేదు. ప్రపం చీకరణ తర్వాత ఇంగ్లిష్ ఆధిక్యత పెరిగింది. దేశం వదలి వెళ్లక పోయినా వ్యవహార వ్యాపార లావాదేవీలన్నీ ఆంగ్లంలోనే సాగు తాయి. కనుక ఇంగ్లిష్ తప్పనిసరి. స్థానిక సొంత భాషని నమ్ము కున్న చైనా, జపాన్ దేశాలు తమ మనసువిప్పి మాట్లాడలేక ఇబ్బంది పడ్డాయ్. ఇటీవల కాలంలో వాళ్లు ఇంగ్లిష్‌లోకి మారారు. వారి పిల్లల్ని ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. మాతృభాషని కూడా పదిలంగా మనసులో ఉంచుకుంటున్నారు. విద్య బతుకు తెరువు కోసమేనని రూఢీ అయ్యాక అన్నం పెట్టే భాషకే అగ్ర తాంబూలం! ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి కాగానే ఒక మంచి ఆలోచన చేశారు. పల్లెటూరి పిల్లలకు బస్తీ పిల్లలకు అబ్బే నాణ్యమైన చదువు అబ్బడం లేదు. సరైన బోధనా పరికరాలు గ్రామ పాఠశా లల్లో ఉండవు. దృశ్య శ్రవణ బోధన గ్రామీణ పిల్లలకు అందించాలని సంక ల్పించారు. ముప్ఫై నలభై ఏళ్ల నాడు వచ్చిన సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగిస్తూ వీడియోలలో స్కూలు పిల్లలకు పాఠాలు రూపొందించాలని యోచన చేశారు. అప్పటికే చలనచిత్ర రంగంలో గణనీయమైన ప్రవేశం ఉన్న జంట బాపూ రమణలను రావించి పాఠాల పని అప్ప గించారు. నాలుగేళ్లకు పైగా శ్రమించి, వారి శక్తియుక్తులన్నీ వినియోగించి ఒకటి రెండు మూడు తరగతుల పాఠాల్ని తెరకెక్కించారు. దేశంలో సుప్రసిద్ధులైన సాంకేతిక నిపు ణులను ఆయా శాఖల్లో వినియోగించుకున్నారు. గ్రాఫిక్స్, యానిమే షన్ పంథా పాఠాలను పిల్లలకు అత్యంత ఆకర్షణీయంగా తీర్చిది ద్దారు. ప్రఖ్యాత సంగీతజ్ఞుడు ఏఆర్ రెహ్మాన్ మొత్తం పాఠాలకి సొంపైన సంగీతం సమకూర్చారు. వాటిలో ప్రతి అంగుళం ప్రతి అక్షరం ఎన్టీఆర్ చూశారు. వారు ఆశించిన దానికి మించి వచ్చా యని అభినందించారు. పథకం ఆరంభంలో తొలి విడతగా కృష్ణా, చిత్తూరు, నల్గొండ జిల్లాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ప్రతి స్కూలుకి కలర్ టీవీ, వీసీపీ (వీడియో క్యాసెట్ ప్లేయర్) పాఠాల క్యాసెట్లు అందజేశారు. వాటిని ఎలా నడపాలో, ఎలా వినియోగిం చాలో అక్కడ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. పిల్లలకు సినిమా చూసి చదువు నేర్చినంత ఉత్సాహంగా ఉంది. బళ్లలో డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయి. ఎన్టీఆర్ అంతకుముందే గ్రామాధికారులు కరణం, మున్సబులను తొలగించారు. ఇప్పుడీ విద్యాబోధన ద్వారా ఉపాధ్యాయులను తీసేస్తారని ఒక వదంతి ప్రచారంలోకి వచ్చింది. దానికితోడు భయంకరమైన పవర్‌కట్. పగలు కరెంట్ ఉండటం గగనం. పులిమీద పుట్రలా అప్పుడే చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీని స్వయంగా స్వీకరించారు. దాంతో బంగారంలాంటి ఈ పథకం అటకెక్కింది. ఆనాడు ఎన్టీఆర్ కూడా పల్లెపిల్లల బాగు గురించే ఆలోచన చేశారు. లోకల్ లాంగ్వేజ్ పరిధి వేరు.. ఆంగ్ల భాషా విస్తృతి వేరు. ఇవ్వాళ వ్యవసాయ వృత్తిలో కూడా ఆంగ్ల భాష తప్పనిసరి అవుతోంది. ఒకనాటి నాగలి కనుమరుగైంది. ట్రాక్టర్ వచ్చింది. కరెంట్ మోటార్లు, ఆయిల్ ఇంజిన్లు, హార్వెస్టర్లు వచ్చే శాయి. ఇంగ్లిష్ ఉంటే తప్ప బండి నడవదు. బ్యాంకింగ్ వ్యవస్థ పల్లెలకు విస్తరించింది. మొత్తం ఆ భాష, యాస రైతులు నేర్చారు. పల్లెల్లో సెల్‌ఫోన్ విరివిగా వాడుతున్నారు. దానికి సంబంధించిన ఇంగ్లిష్ మాటలు సెల్ వాడకం దార్లకు బాగా తెలుసు. టీవీ పుణ్యమా అని ఇంగ్లిష్ వాడుక భాషని గుమ్మంలో గుమ్మ రించింది. మాతృభాష పరిపాలనలోగానీ, కోర్టు తీర్పుల్లోగానీ, సైన్ బోర్డుల్లోగానీ, ఇంకాగానీ.. ఇంకాగానీ వాడింది లేదు. మాతృ భాషని ఒక ఉద్యమంగా బతికించుకోవల్సిన అగత్యం ఏర్పడిం దంటే– దానితో అవసరం తగ్గిందని అర్థం. ఒక లంబాడీ తండాలో వారి మాతృభాషని రుద్దేస్తామంటే కుదరదు. ఇతర ప్రాచుర్యం ఉన్న భాషలు రావాలి. అప్పుడే వారు తండా దాటి సుఖంగా మనగలుగుతారు. ఊరంతా మాట్లాడుకునే, తెలుగు భాష పిల్లలకు చిన్న వయసులో రానే వస్తుంది. ఇప్పుడు బళ్లో ఎటూ ఉంది. రాత నేర్చుకుంటారు. ఎవరూ కంగారు పడక్క ర్లేదు. దేశభక్తి గురించి, తెలుగు భాష గురించి మాట్లాడటంలో మన అపోజీషన్ నేతలకు దూకుడెక్కువ. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ ఉంది. అందులో ఒక తెలుగు పార్ట్ లేదు. హ్యాండిలు, బెల్లు, సీటు, మడ్ గార్డు, టైరు, ట్యూబు, స్టోక్సు, చైను, పెడల్సు, హబ్బు– ఏమైందిప్పుడు, సైకిల్ నడవటం లేదా? బాబుగారూ! ముందు సైకిల్ని తెలుగీకరించండి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఫిడేల్ నాయుడు గారు
1914 ప్రాంతంలో విశాఖపట్నం ‘మై ఫ్రెండ్స్’ సంఘంలో ఓ ఇరవైయేళ్ల కుర్రాడు సుశ్రావ్యమైన గోష్ఠి చేస్తే, అతడి వాయులీన వైదుష్యాన్ని మెచ్చుకొని మారేపల్లి రామచంద్ర శాస్త్రి బంగారపు ఉంగరం వేలికి తొడుగుతూ ఆ విద్వాంసుడికి ‘ఫిడేలు నాయుడు’ అని నామకరణం చేశారు. తదాది ఆ వేలికి ఉంగరం, ఆ వ్యక్తికా పేరు స్థిరంగా ఉండిపోయాయి. తర్వాత ద్వారం వేంకట స్వామి నాయుడుగారు విజయనగరం కోటలో కచేరి చేసినపుడు, ఆస్థాన విద్వాంసుడు ఆదిభట్ల నారాయణ దాసు విని వివశుడై ‘జీనియస్’ అంటూ ఆరున్నర శృతిలో అన్నారట. చివరిదాకా ఆదిభట్ల ఆ మాట మీదే ఉన్నారు. అంతకుముందు సంగీతంలో మెలకువలు, పైసంగతులు నేర్వాలని ద్వారం విజయనగర సంగీత పాఠశాల ద్వారంలో నిలబడితే– ఆయన వేదనని, వాదనని విని ‘నువ్వు గురు స్థానంలో ఉండాల్సిన వాడివి’ అంటూ విజయనగరం సంగీత కళాశాల ఉచితాసనమిచ్చి కూర్చోబెట్టింది. వజ్రం వెతకదు, వెతకబడుతుంది. ఆధార షడ్జమంలోనే నాయుడు ‘రవ’ళిం పుని జాతి పసిగట్టింది. ఇక తర్వాతిదంతా చరిత్ర. ‘ఈ చిన్న కర్రముక్కని చేతికిచ్చి ఈ సంగీత సముద్రం ఈదమన్నాడు దేవుడు. నావల్ల ఏమవుతుంది?’ అని భయపడుతూనే సంగీత సాగరంలో లక్షలాదిమందిని ఓలలాడించి ధన్యులయ్యారు ఫిడేలు నాయుడుగారు. ఆయన సిద్ధుడు. అనితర సాధ్యమైన సాధనతో వాయులీనాన్ని పూర్తిగా వశపరచుకుని గుండెలకు హత్తుకుని వాయులీన అంతరంగాన్ని అర్థం చేసుకున్నారు. రాగ ప్రస్తా రాన్నిబట్టి మొహమల్ వస్త్రంమీద ముత్యాలు జారినంత మృదువుగా ఉక్కుతీగెలను పలికించగలరు. కొన్ని సందర్భాలలో పున్నాగ పరిమళం శ్రోతల్ని కమ్ముకుంటుంది. ఆయన ఉన్న రోజుల్లో దక్షిణాది ప్రజ హారతులు పట్టింది. దేశం ఫిడేలు నాయుడు గారిని గుర్తించింది. 1957లో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. అప్పటికే ప్రతిష్టాత్మకమైన బంగారు పతకాలు అందుకున్నారు. పౌర సన్మానాలు, దర్బారు ఆహ్వానాలు లెక్కకుమించి జరిగాయి. గాంధర్వ విద్యాభూషణ, గానకళా విశారద, సంగీత కళానిధి, డాక్టర్ ఆఫ్ లెటర్స్ (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం) నాయుడుగారిని అలంకరించాయి. 1950లో ఆంధ్రా యూనివర్సిటీ కళాప్రపూర్ణతో గౌరవించింది. 1964లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన సంగీత విద్వాంసునిగా నియమించి రాష్ట్రం సత్కీర్తి పొందింది. ద్వారం వారికి శాస్త్రీయ కృతుల నుంచి జానపదాల వరకు అన్నీ ఇష్టమే. వయొలిన్‌పై ఎంకి పాటలకు శాశ్వతత్వం తెచ్చారు. అన్నిటికన్నా మిన్నగా ‘రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ’ అన్న కృతిని కదన కుతూహల రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్యరుగారు వ్యాప్తిలోకి తెచ్చారు. మహాకవి శ్రీరంగం నారాయణ బాబు ద్వారంకి హితులు, సన్నిహితులు. నారాయణ బాబు ద్వారంపై రాసిన కవితలో– ‘నాయుడుగారూ/ మీ వేళ్లు/ ఘన రాగ పంచకం/ మీ శరీర/ మాకాశం/ మీ హస్తం/ హరివిల్లు/ చిత్ర చిత్ర వర్ణాలు/ శ్రీవారి వేళ్లు/’ అంటూ కొనసాగించారు. ఆనాటి మహా కవులలో విశ్వనాథ, జాషువా, తుమ్మల ఫిడేలు నాయుడుగారిని ప్రస్తుతిస్తూ పద్యాలు చెప్పారు. చమత్కారంగా మాట్లాడుతూ, మధ్య మధ్య చుట్ట పొగ సుతారంగా పీలుస్తూ చూడవచ్చిన వారిని పాటలతోనే కాక మాటలతో కూడా ముగ్ధులను చేసే నైజం నాయుడు గారిది. మీ కచేరీ వేళ రెండు పాములు ఆడాయని చెబితే అది నేల మహత్యం అన్నారు. మీరు దీపక రాగం వాయిస్తే అక్కడ వస్త్రాలు అంటుకున్నాయండీ అంటే పాపం ఎవరో బీడీయో చుట్టో కాలుస్తూ ఏమరుపాటున ఉండి ఉంటారు అన్నది ఆయన తీర్మానం. ఆయనొకసారి వయొలిన్‌ని శృతి చేసుకుని, కమాన్ని కూడా పరిక్షించుకుని పక్కన పెట్టారట. వెంటనే నిండు సభ కరతాళ ధ్వనులతో మార్మోగిందట. నమ్మకం కుదిరితే అలాగ ఉంటుందన్నారు నాయుడుగారు. ‘ఈ వాయులీన సాహిత్య మాధుర్యముల్/ దేవతా స్త్రీ కంఠ దీప్తరావమ్ములో/ పారిజాతామోద భావమ్ములో/ సురనీద్ జీవమ్ములో/ ఈ వాయులీన సాహిత్య సాహిత్యముల్/ పలుకరించిన తొట్రుపాటెరుంగని యట్టి/ పలుకులో కలకండ పలుకులో/ చిరునవ్వు మొలకలో...’ – విశ్వనాథ మనకి కూడా ఫిడేలు నాయుడుగారి స్మృతి చిహ్నం విధిగా ఉండాలి. ఈ నెల 8న ద్వారం వారి జయంతి. ఆరోజున నాయుడుగారి జ్ఞాపకాలతో ఒక విశేష సంచిక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు కె. రామచంద్రమూర్తి చేతులమీదుగా విడుదల అవుతుంది. ఉదయం 11 గంటలకు వీవీఐటీ ప్రాంగణం, నంబూరు (గుంటూ రు)లో జరిగే ఈ సభకు అందరూ ఆహ్వానితులే. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఏమాటకామాట చెప్పుకోవాలి
ఊళ్లో చెట్టుకొమ్మకి తేనెపట్టు పడుతుంది. చైత్ర వైశాఖాలు వసంత రుతువు. అప్పుడు చెట్లు చిగిర్చి పూలు పూస్తాయ్. అందుకని వేసవిలో తేనెపట్లు ఎక్కువగా కనిపిస్తాయ్. వాటిని తేనె కోసం నిర్దాక్షిణ్యంగా దులిపేస్తుంటారు. తుట్టెకి పొగ పెడతారు. అవి దిక్కు తెలియక పట్టు వదిలేసి పారిపోతూ కనిపిస్తాయ్. కాసేపటి తర్వాత ఆశ చావని తేనెటీగలు మళ్లీ అక్కడికి చేరతాయ్. ఖాళీగా ఉన్న మైనపు పట్టు చుట్టూ ఈగలు రొద చేస్తూ తిరు గుతూ కనిపిస్తాయ్. మావూరి పెద్దమనిషి ఒకాయన, ‘మావోడి పద్ధతి అట్టా ఉంది’ అంటూ నిట్టూర్చాడు. మావోడంటే ఆయన ఉద్దేశం చంద్రబాబునాయుడు. ఇదిగో రోజూ ఓ హద్దూ పొద్దూ లేకుండా బాబు, మిగతా పాత మినిస్టర్లు అర్థంపర్థం లేకుండా ఈగల్లా రొద చేయడం చూస్తుంటే నాకదే గుర్తొస్తోంది అనగానే, ‘మీరు పచ్చి తెలుగుదేశం కదా. మీరే ఇట్లా వ్యాఖ్యానిస్తే ఎట్లాగండీ’ అన్నాను. ‘దేనికదే, ఓడిపోయి అయిదు నెలలైనా కాలేదు. ఇంకా అయిదేళ్లు జరగాలి. ఇప్పట్నుంచే బెంగ పెట్టేసుకుంటే ఎట్లా? దిగులుతో రోజులు మరీ గడ్డుగా కదుల్తాయ్’ మా పెద్దమనిషి బాధపడ్డాడు. ‘పైగా జనం కసిగా తీర్పు ఇచ్చారు కదా. ఇప్పుడు నించుంటే గన్‌షాట్‌గా గెలుస్తార్ట! పిచ్చి భ్రమలు. చంద్రబాబు ఇంతకంటే చిత్తుగా ఓడిపోతాడని మేం అనుకున్నదే. చుట్టూ చేరిన భజన బృందం వడపప్పు పానకంలా దొరికింది దొరికినట్టు బొక్కేశారు. తెలుస్తున్నా ఎవర్నీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. అసలు మా వోడికి ఎన్నికల్లో నెగ్గడం బొత్తిగా రాని విద్య’ అనగా అదేంటండీ అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశా. ‘నిజానికి మావోడు సింగిల్‌గా పోటీ చేసిందీ లేదు. గెలిచి ఏడిసిందీ లేదు. మొన్నే కదా ఒంటరిగా బరిలోకి దిగింది. ‘వద్దురా బాబూ, లెగిస్తే మనిషి కాదన్నట్టు ఉండు. బీజేపీ కండువా కప్పుకోమని మేమంతా చిలక్కి చెప్పినట్టు చెబితే వింటేనా?’ అంటూ చాలా బాధపడ్డాడు. కాసేపు నిస్పృహతో మావూరి పెద్దమనిషి మౌనంగా ఉండిపోయాడు. చంద్రబాబు ఎన్నికల ముందు మోదీకి దీటుగా నిలబడగలననీ, అవసరమైతే ప్రధాని కాగలననీ ఊగారు. అన్ని పార్టీలు సోదిలోకి రాకుండా పోయేసరికి మళ్లీ ఆ ప్రస్తావనే లేదు. ఎక్కడికీ కదిలిందీ లేదు. ఎక్కడా మాట్లాడిందీ లేదు. కనీసం తెలంగాణకి అయినా వచ్చింది లేదు. అనేక వ్యాధుల బారినపడి అల్లాడుతుంటే వచ్చి పలకరించింది లేదు. మొన్న జరిగిన బై ఎలక్షన్లో కాంగ్రెస్‌కి దన్నుగా వచ్చి నిలబడిందీ లేదు. కనీసం ఆర్టీసీ కార్మికులకు నేనున్నానని వత్తాసుగా వచ్చింది లేదు. మా పెద్దమనిషి చుట్ట కాల్చడం పూర్తిచేసి, కొత్త దమ్ముతో వచ్చి మాట కలిపాడు. ‘ఏమాటకామాట చెప్పుకోవాలి. దేవుడి కొండకింద మందు నిషేధిం చడం బావుంది. చాలా మంచిది. దాంట్లోనూ సాధక బాధకాలుంటాయ్. నిన్నటిదాకా తాగుబోతులైనోళ్లు ఉన్నట్టుండి మానెయ్యలేరు. అరికట్టడం చాలా కష్టం. ప్రయత్నిస్తే అసాధ్యం కాకపోదు. ముందు కొండమీది దేవుడు సంతోషిస్తాడు. కొండకింది అలమేలు మంగమ్మ ఆనందిస్తుంది. స్వామి రాత్రి పొద్దున కొండ దిగివచ్చేవేళ దారి ప్రశాంతంగా ఉంటుంది. ఆ దేవుడు ఈ నిషేధాన్ని దీవిస్తాడు. చూస్తూ ఉండండి’ అన్నాడు. నేనేదో అనబోతుంటే ఏమాటకామాట చెప్పుకోవాలని గుర్తు చేశాడు. ‘మావోడి ధోరణి చూస్తుంటే, మెల్లిగా జరిగి జరిగి బీజేపీలో చేరిపోయేట్టున్నాడు’ అనగానే నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ‘మీకేం ఖర్మండీ’ అన్నాను అప్రయత్నంగా. ఆయన పెద్దగా నవ్వి, ‘మీరు భలే తెలియనట్టు మాట్లాడుతున్నారండీ’ అన్నాడు. ‘ఎవరైనా సరే, నాకు ఆయన మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు. పగ లేదు. తేడా లేదు. మాకున్నదల్లా సిద్ధాంత భేదాలు అని స్పీచిలో చెప్పాడో అప్పుడే అర్థం చేసుకోవాలి’ అంటూ మావూరి పెద్దమనిషి సూత్రీకరించాడు. ‘ఇప్పుడు మావోడు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి అర్జంటుగా ఓదారి మార్గం కావాలి. నాకు కన్పిస్తున్న ఒకే ఒక దారి బీజేపీ. ఇప్పటికే అక్కడ అడుగు పెట్టడానికి వీలుగా కొన్ని మెట్లు కట్టుకున్నాడు కదా. బాబుకి చాలా సులువు అవుతుంది. ఏమాటకామాట చెప్పుకోవాలి’ అంటూ ముగించాడు. నాకెందుకో మావూరి పెద్దమనిషితో పూర్తిగా ఏకీభవించాలనిపించింది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మహాసంకల్పం
వైఎస్ జగన్మోహన్రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్రని క్షేత్రంగా చేసుకుని త్రికరణశుద్ధిగా మహాసంకల్పం చేశారు. వాటిలో తొమ్మిది ముఖ్యాంశాలున్నాయ్. వాటినే నవరత్నాలన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి వాటిమీదే దృష్టి లగ్నం చేశారు. యువతలో ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగాన్ని ఒక్కసారిగా తగ్గించగలిగారు. దీనివల్ల గ్రామపాలన తిరిగి శ్వాసించడం మొదలుపెట్టింది. ఇంతకుముందు గ్రామాల్లో ఎక్కడా ప్రభుత్వం ఉన్న జాడలు కనిపించేవి కావు. రోడ్లు లేవు. వీధి దీపాలు లేవు. వర్షపు నీటి కాలువలు లేవు. ఇంకా ఏవీ లేవు. గ్రామ పంచాయతీలకు వచ్చే పన్నులు లేవు. పోయే ఖర్చులు లేవు. పాఠశాల భవనానికి వెల్ల వేయించాల్సిందెవరు? మరమ్మతులు చేయించాల్సిందెవరు? ఇలాంటి దుస్థితిలో ఉన్న గ్రామాలు ఒక్కసారి మేల్కొన్నాయి. చదువుకున్న యువత ఉద్యోగులై, బాధ్యతాయుతంగా ప్రజలకు అన్నిటా సహకరించడానికి వచ్చారు. వట్టిమాటలు కాక గట్టిమేల్ చేసేవారు. సమస్యల్ని ఆర్చేవారు. తీర్చేవారు. వారి స్థాయి దాటినవైతే పైవారికి నివేదించి పరిష్కరించే వెసులుబాటు ఉంది. ‘‘ఇహ నించి ప్రతి గ్రామ పంచాయతీకి ఏటా కోటి రూపాయల ఆదాయం వచ్చే ఐడియా నా దగ్గర ఉంది. వెర్మి కంపోస్ట్‌ని ప్రతి ఊళ్లో కుప్పలు తెప్పలుగా పోషిస్తాం. దాన్ని రైతులు కొంటారు. ఆ డబ్బుతో గ్రామాన్ని ఎక్కడికో తీసికెళ్తాం’’ అని ఉన్నట్టుండి చిన్నబాబు చెప్పేసరికి టీడీపీ శ్రోతలు తెగ చప్పట్లు కొట్టారు. తర్వాత వాళ్లంతా నివ్వెరపోయారు. వానపాములతో ఇంత ఆదాయమా అని ఆశ్చర్యపోయారు. చంద్రబాబుకి ఏనాడూ గ్రామీణ ప్రాంతాలమీదగానీ, వ్యవసాయంమీదగానీ నమ్మకం లేదు. పండించటం కంటే, కొని దళారీతనం చేసి అమ్ముకోవడం లాభసాటి అని నమ్మకం. ఆయన చేసేది అదే. బ్రోకరేజ్‌లో పురుగుమందులతో పని లేదు. విత్తనాలు, యూరియా అక్కర్లేదు. చివరకు గాలివాన గండం ఉండదు. అందు కని ఈ విధంగా ముందుకు వెళ్లాలన్నది ఆయన లక్ష్యం. నిజమే, వ్యవసాయం కష్టతరమైంది. అట్లాగని దాన్ని వదిలిపెడితే ఏమి తిని బతుకుతాం? మన రైతులు చాలా అమాయకులు. నేను నేలదున్ని పండించకపోతే, పాపం ఈ జనం ఎలా బతుకుతారని ఆలోచిస్తారు. అందుకే వ్యవసాయ భూములు ఇంకా మిగిలాయ్. మన గ్రామాల్లో మౌలికమైన విద్య వైద్యం నెర్రలు బారేలా చేశారు. వలసలకు ఒక ముఖ్య కారణం ఇదే. ప్రతి గ్రామం ఒక వృద్ధాశ్రమంలా తయారైంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక కదలిక వచ్చింది. రైతుల్లో పునర్ జాగృతి. జగన్ సంస్కరణతో బెల్ట్‌షాపులు మూతపడ్డాయ్. పల్లెలు కొంచెం ప్రశాంతంగా నిద్రపోతున్నాయ్. సంస్కరణలని ఒక్కసారి తీసుకురావడం అంత తేలిక కాదు. మనం నేలమీద బాగా పాదులు తవ్వి, మంచి ఎరువులు వేసి మొక్కలు నాటి పెంచి పెద్ద చెయ్యాలని కృషి చేస్తాం. అయితే అవి ఎంతకీ ఎక్కిరావు. అదే గోడమీద పిట్టల రెట్టల్లోంచి మొక్కలొస్తాయ్. వాటిని వదిలించుకుందామంటే అవి వదలవ్. ఎంత నరికినా అవి మళ్లీ తలెత్తి లేస్తూనే ఉంటాయ్. దురలవాట్లు కూడా ఇలాంటివే. ‘ఆనోభద్రాక్రతయన్తు విశ్వతః’ అని ఉపనిషత్ వాక్యం ఉంది. గొప్ప ఆలోచనలు ఎటునుంచి వచ్చినా స్వీకరిద్దాం. ప్రతిదాన్నీ ఖండిస్తూ, వక్రభాష్యాలు చెబుతూ ఉండక్కర్లేదు. నిన్నెవరో ఒక మాజీ మంత్రి నోరు చేసుకుని ‘చైనా నుంచి బ్యాటరీ బస్సులు వస్తాయంట. ఇది మొత్తం అవినీతిమయం. ఇందులో చాలా మిగుల్తుంది’ అంటూ పరిపరివిధాలా వాపోయాడు. ఆయనకన్నీ తెలిసినట్టు, ఏదో తనకి పూర్వానుభవం ఉన్నట్టు చెప్పారు. మొన్న మహాబలిపురంలో చైనా అగ్రనేతతో మాట్లాడి అంతా తెలుసుకున్నట్టు చెప్పేశాడు. ఇలాంటి గురిగింజలు కొన్నాళ్లు మైకుల ముందు నోళ్లు పెట్టకూడదు. నిన్నగాక మొన్న ప్రజలు వీరికి భయంకరమైన తీర్పు ఇచ్చారు. ఒకతరంపాటు తెలుగుదేశం రాజకీయ సన్యాసం స్వీకరించాలని పరోక్షంగా సూచించారు. కనుక విజ్ఞతతో ప్రవర్తించాలని పరోక్షంగా సూచించారు. కనుక విజ్ఞతతో ప్రవర్తించాలి. రోజూ మనం కనిపించి, మనగొంతు వినిపించకపోతే మర్చిపోతారనే భయంతో ఉన్నారు. కొత్తవాళ్లకి జనం చక్కని అవకాశం ఇచ్చారు. పరిపాలించనివ్వండి. సీనియారిటీ ఉంటే నిర్మాణాత్మక సూచనలివ్వండి. మీ అంతిమ లక్ష్యం ప్రజా సేవే కదా. కనుక చెయ్యి చెయ్యి కలపండి. చంద్రబాబు పెద్ద మనసు చరిత్రకి ఎక్కుతుంది. ఈ రోజువారీ స్టేట్‌మెంట్స్‌వల్ల ఒక ఇసుక రేణువంత కూడా పెరగదు. అది మహాసంకల్పం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పదండి ముందుకు!
చంద్రబాబు అసహనంతో రోజుకో ఇంచ్ కుంగిపోతున్న యథార్థం జనసామాన్యానికి స్పష్టంగా కనిపిస్తోంది. కాపిటల్ నిర్మాణంలో ‘ఊహ’ మంచిదే. కానీ మన దేశమే అంతటి మహా నగరాన్ని భరించలేదు. ఇక ఒక చిన్న రాష్ట్రం తట్టుకోగలదా? దాన్ని పక్కనపెడితే ఇక మిగిలింది పోలవరం. అది అవినీతి పునాదుల మీద ఇంతదాకా పైకి లేచిందని కొందరికి డౌటు. ఆ డౌటు తీరగానే పోలవరం శరవేగంతో సిద్ధం అవుతుంది అని విజ్ఞులు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిదానికీ ఆందోళన చెంది అల జడి చేస్తున్నారు. రోజూ రెండు నుంచి నాలుగు ప్రెస్మీట్లు పెడుతూ పాలన మీద ఇసుక, బురద, రాళ్లు జల్లుతూ వినోదిస్తున్నారు. ఇసుక లేక ఇరవై లక్షల కుటుంబాలు పస్తులుంటు న్నాయని ఊరేగింపు నడిపారు. నేను ఒక పెద్ద బిల్డర్‌ని అనుమానం నివృత్తి చేసుకోవడానికి అడిగా. ఆయన అన్ని ప్రాంతాల్లో ఇళ్లు కడతారు. ఆయన వివరంగా చెప్పారు. ‘అదేం లేదు. ప్రతియేటా వర్షాకాలం రెండు నెలలూ ఇసుక కరువు ఉంటుంది. రేవుల్లో ఇసుక తోడుకోవడానికి ఉండదు. పైగా ఈ సీజన్లో వర్షాలు ఎక్కువ పడ్డాయ్. వాగులు, నదులు వరదలై పొంగాయి. రేవుల్లో ఇసుక తీయడానికి ఇబ్బంది అయింది. ఇప్పుడు పొంగు తగ్గింది. కావల్సినంత ఇసుక. పైగా సరసమైన ధర’ అని సవివరంగా చెప్పుకొచ్చారు. బాబు పాలనలో పొడి తప్ప తడిలేదు. అందు కని ఆయనకు తెలీదు. చంద్రబాబు దేన్నీ సక్రమంగా చూడలేక పోతున్నారని వాళ్ల వాళ్లే ఆందోళన చెందుతున్నారు. కాకి పావు రం లాగా, పావురం చిలకలా, చిలక గద్దలా ఆయన కళ్లకి కనిపిస్తోందని వాళ్ల వాళ్లు అనుకుంటున్నారు. నాలుగు నెలల వ్యవధిలోనే నూట ఇరవై ఆరోపణలు జగన్ ప్రభుత్వం మీద చేశారు. ఎన్నిసార్లు సూర్యోదయం ప్రభుత్వ పంచాంగంలో చెప్పిన వేళకు కాలేదో, ఎన్నిసార్లు చంద్రోదయం లెక్క తప్పిందో నిమిషాలు, సెకన్లతో చెప్పి జగన్‌ని ఝాడించి, పిండి ఆరేశారు. ఒక అపోజిషన్ లీడర్‌గా ప్రజలని అన్నివిధాలా సంరక్షిస్తున్నారు. అక్టోబర్ 2న, గాంధీ 150వ పుట్టినరోజున పోలీసులతో మద్యం అమ్మించిందని ఈ కొత్త ప్రభు త్వాన్ని దులిపేశారు. అయ్యా, తమరెవరూ కొంచెం కూడా సాహసించలేని పనికి జగన్మోహన్రెడ్డి నాంది పలికారు. అందుకు ఆనందపడాలి. ఆయనని అభినందించాలి. ఆ సంస్కరణకి మనసా మద్దతు ఇవ్వాలి. ఇప్పటికే బెల్ట్ షాపుల్ని లేపేశారు. ఇంకా అనేక ఆంక్షలు విధించారు. దీనికి ఆడపడుచులు ఆనందపడుతున్నారు. చంద్రబాబు హయాంలో లిక్కర్ని కోటాలిచ్చి అమ్మించారు. పల్లెల్లో ఇంటింటా బెల్ట్ షాపుని ప్రోత్సహించి, నిత్య దరిద్రాన్ని నట్టింట తిష్ట వేయించారు. ప్రభుత్వాన్ని సారాయితోనే నడిపించారు. జగన్ నవరత్నాల మేనిఫెస్టోకి కట్టుబడి, అధికారంలోకి వచ్చిన రోజునుంచి వ్యవహరిస్తున్నారు. పాపం, అవేవీ చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చినట్టు లేదు. వ్యవసాయానికి, విద్యకి, వైద్యానికి చేయగలిగినదంతా చేస్తున్నారు. ప్రతిసారీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని పదే పదే చెప్పుకోవడం మంచిది. ‘నేను తలచుకుంటే జగన్ పాదయాత్ర చేసేవాడా’ అని మైకులో ప్రశ్నించారు. అంటే, ఇలా రకరకాలుగా జరిగినవన్నీ తలచుకొని పశ్చాత్తాపపడుతు న్నారు. పోలీసు శాఖ మీద నోరు చేసుకున్నారు. డొక్క చించి డోలు కడతానన్నారు. ఏదో మొత్తానికి అసహనమూర్తిగా సభల్లో మెరుస్తున్నారు. మా ఊళ్లో వృద్ధులు, పెద్ద ముత్తయిదువులు ఏమనుకుంటున్నారంటే– బాబు ఈవిధంగా కాలం వృథా చేసుకోవడం కంటే పాదయాత్రకి దిగడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఆయన రెండు రాష్ట్రాలు నడవాలి. వారి సాధక బాధకాలు గమనించాలి. కేసీఆర్‌ని, జగన్‌ని తూర్పారబట్టాలి. పక్క రాష్ట్రాలను కొంచెం తడమాలి. నాలుగేళ్ల వ్యవధి ఉంటేగానీ బాబుకి చాలదు. అప్పుడు గానీ ఆ లాంగ్‌మార్చ్ పాత రికార్డులని బద్దలు కొట్టలేదు. బాబు ఆ విధంగా నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలి. ఆయన సరే అంటే మా ఊరి జనం దగ్గర బోలెడు ఆలోచనలున్నాయ్. చినబాబుని కూడా వెంటతెస్తే మరీ కొత్తగా ఉంటుంది. ఆ బాబుకి అనుభవం వస్తుంది. ఇంకా బోలెడు లాభాలుంటాయ్. దిగితే తెలుస్తాయ్. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బ్రహ్మనించి స్ఫూర్తి పొందండి
మా వూళ్లో ఒక జడ్జీ గారుండేవారు అయితే ఆయన కాలం చెల్లి రిటైరయ్యారు. తప్పు, యిలాగ కాలం చెల్లీ, కాలం తీరి అని రిటైరైతే అనకూడదు. అయినా పర్వాలేదు కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనచ్చు. అయితే ఆ జడ్జీగారు సొంతూరు వచ్చి స్థిరపడ్డారు. వచి్చన కొత్తల్లో వూరు వాళ్లందరికీ పిచ్చి గౌరవం. అన్నిటికీ ఆయననే పిలిచి, మైకు అప్పగించేవారు. బడి వార్షికోత్సవం, ఆటల పోటీలు, రామాలయంలో భజన ప్రోగ్రామ్, శివాలయంలో హరికథ యిత్యాదుల న్నిటికి జడ్జీగారే ముందుండేవారు. అంటే మైకు ముందుండేవారు. ప్రారంభ దినాల్లో కొంచెం సందేశాలు, కొన్ని నీతులు చెబుతుండేవారు. జనం సహించి, పోనీలే పెద్దాయన పైగా ఇంగ్లిష్ కూడా వచ్చని చాలా గట్టు(మార్జిన్) వదిలే వారు. అయితే దాన్ని జడ్జీగారు హద్దు మీరి వాడుకున్నారు. అప్పటిదాకా నల్ల గౌనులో సభలకి వచ్చేవారు. అది పూర్తిగా వెలిసి పోయింది. ఒకసారి గుళ్లో పెట్రోమాక్స్ లైటు అంటుకోగా అది కాస్తా పరశురామ ప్రీతికి బలైంది. అప్ప ట్నించి జడ్జీగారి హోదా ఓ మెట్టు కిందికి జారింది. అయన బోరు భరించలేక, బతికుంటే బలుసాకు తినచ్చనుకుని పిల్లల తల్లులు, పెద్దల తండ్రులు జడ్జీగారికి దూరంగా ఉంటూ వచ్చారు. జడ్జీ గారికి దిగులు, బెంగ యిత్యాదులన్నీ కందిరీగల్లా ఆవరించాయ్. వాళ్లావిడ పరిపరి విధాల నచ్చ చెప్పింది. ‘‘ బ్రహ్మదేవుడిని ఎవరు తలుచుకుంటారు. ఆయన దగ్గరికి మునులా, రుషులా ఎవరు ఆర్తనాదాలు చేస్తూ వెళ్తారు చెప్పండి. ఆయన నాలుగు తలలు పెట్టుకుని ఎనిమిది చెవుల్తో వాగ్దేవి పలికించిన పాటలే వీణ మీద మళ్లీ మళ్లీ వింటూ పొద్దున వండిన కూర, సాంబారుతోనే రాత్రి కూడా ముగిస్తూ సంతృప్తిగా కాలక్షేపం చేయడం లేదా? మీరు ఆ బ్రహ్మ దేవుడు నుంచి స్ఫూర్తి పొందండి. ఆ విధంగా ముందుకు పదండి’’ అని చెవులో ఇల్లు కట్టుకుని నచ్చ చెప్పింది. ‘‘లా ఇండస్ట్రీలో ముఫ్పై అయిదేళ్లు చట్టాన్ని కాచి వడపోసిన వాణ్ణి, శాసనాన్ని చెట్టు కొమ్మలపై ఆరేసిన వాణ్ణి. నన్నిప్పుడు మైకులకు మాటలకు దూరంగా పెడతారా.. అంతు చూస్తా’’ అంటూ శపథం చేశారు. మర్నాడు రచ్చబండ మీద కొంచెం ఎగుడూ దిగుడూ లేని చోట ఓ బల్లా కుర్చీ స్వయంగా ఆయనే ఏర్పాటు చేయించుకున్నారు. ఇంట్లో ఉన్న సంకురాత్రి బొమ్మకి గంతలు కట్టి, చేతులో త్రాసు వగైరా ఏర్పాటు చేసి ధర్మ దేవతగా నిలబెట్టారు. ఒక సుత్తి పాత అట్ల పెనము బల్లపై అలంకరింప చేశారు. రోజూ సరిగ్గా పది గంటలు కొట్టగానే వాళ్లింటి పెద్ద పాలేరు, భుజం మీంచి అడ్డంగా ఓ వస్త్రం వేసుకుని ఏదో అరుచుకుంటూ హెచ్చరికగా రచ్చబండ మీదికి వచ్చేసే వాడు. ఆ వెనకాల çహుందాగా జడ్జీగారు వచ్చేవారు. రోజూ వచి్చన పేపర్ వార్తల మీద జడ్జీ గారు స్పందించేవారు. చాలా గట్టిగా వార్నింగ్‌లు ఇచ్చేవారు. కొన్నిసార్లు శిక్షలు చెబుతూ తీర్పులు ఇచ్చేవారు. పాట్నా హైకోర్టు 1939లో ఇచి్చన తీర్పును ఒకసారి, అలహాబాద్ 1942 తీర్పును అనర్గళంగా ఉటంకించి ఫలానా దానికి ఎందుకు జీవితఖైదు ప్రసాదించకూడదో చెప్పమని నిగ్గదీసేవారు. మ ధ్య మధ్య ఆడర్ ఆడర్ అంటూ పెనం మీద సుత్తితో రెండు దెబ్బలు కొట్టేవారు. చూసి పోయే జనం పాపం అని జాలిపడుతూ వెళ్లేవారు. ‘‘బాగా ముదిరింది’’ అని కొందరు పైకే అనుకుంటూ వెళ్లేవారు. శివాలయంలో పూజారిగారు మధ్యాహ్నం నైవేద్యం తర్వాత పక్కనే ఉన్న రచ్చ బండకి వచ్చి ప్రసాదం పెట్టబోతే జడ్జీ గారు చా లా చిరాకు పడేవారు. నేనిక్కడ అఫీషియల్ డ్యూటీలో ఉండగా డిస్టర్బ్ చేస్తావా, కస్టడీలోకి తీసుకోండి అంటూ లోకల్ పోలీస్‌కి ఆర్డర్ వేసేవారు. తర్వాత పూజారిగారు జడ్జీగారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ‘‘మీరు హాయిగా నిత్యం గుడికి రండి దేవుడి ముందు కూర్చోండి. ఆ తామసం తగ్గుతుంది. హాయిగా మామూలు మనిషి అయిపోతారు. బాబు గారూ, నా మాట వినండి’’ అని బతిమాలారు. జడ్జీగారు అగ్గిమీద గుగ్గిలమై ‘‘నీ కు ఉరిశిక్షే. అప్పీల్ గ్రౌండ్స్ లేకుండా వుంటుంది తీర్పు’’ అని అరిచారు. పూజారి తలపట్టుకుని నవ్వుకుంటూ వెళ్లిపోయారు. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
సాంకేతిక రహస్యం తెలిసిన శాస్త్రవేత్త
డాక్టర్ సోమరాజు సుశీల సైంటిస్ట్‌గా సాధించిన అపు రూపమైన అంశాలు చాలా మందికి తెలియదు. తొలి నాళ్లలో కాకినాడ, విజయ వాడలలో ఆమె విద్యా భ్యాసం సాగింది. చిన్నత నంలో విజయవాడ రేడి యోలో సుశీల ఆటలు, పాటలు సాగాయి. దాంతో చదువు సంస్కారం అబ్బాయి. పెద్దయ్యాక హైదరా బాదు ఉస్మానియా యూనివర్సిటీలో సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీలో డాక్టరేట్ చేశారు. అది పాషాణం లాంటి చదువని తెలిసిన వారంటారు. ఉస్మానియా నించి తొలి డాక్టరేట్ సుశీల. కొద్దికాలం లెక్చరర్‌గా పని చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పెళ్లికొడుకుని వివా హమాడారు. గోదావరి కృష్ణ సంగమించాయి. ఇద్దరూ కలిసి ‘చల్ మోహన రంగా’ అంటూ పూనే నేషనల్ కెమికల్ లాబొరేటరీస్‌లో ఉద్యోగంలో చేరి పోయారు. కొన్నాళ్ల తర్వాత, ఎన్నాళ్లిలా నెల జీతా లమీద పని చేస్తాం, మనం తిని నలుగురికి పెడితే కదా బతుక్కి ఓ అర్థం– అనిపించింది ఆ జంటకి. పైగా ఏ మాత్రం జీవితం పట్ల భయంలేని వయస్సు. దానికి తోడు మనస్సు. తను పరిశోధన చేసి కొంత కృషి చేసిన సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ అంశమైన ‘ధర్మిస్టర్స్’ తయారీ మీద పని చేద్దామనుకున్నారు. వాటి అవసరం చాలా ఉంది గానీ దేశంలో ఎక్కడా చేసే వసతి లేదు. ఇంపోర్ట్ చేసు కోవడం, ఎక్కువ ధరకి కొనడం మాత్రమే ఉంది. కొత్త కొత్త టెక్నా లజీలను రీసెర్చి ద్వారా తయారు చెయ్యడం, వాటిని కోరిన వారికి అమ్మ డం– ఆ రోజుల్లో నేషనల్ లాబ్స్ పని. డాక్టర్ సుశీల బాగా సర్వే చేసి, ధర్మిస్ట ర్స్‌కి మంచి గిరాకీ ఉందని వాటి ఫార్ములా తీసుకోవాలనుకుంది. తీరా డబ్బిచ్చి కొన్నాక ఆ సంస్థ కాగి తం మీద ఫార్ములా చెప్ప గలిగింది గానీ, ప్రత్యక్షంగా చేసి చూపించలేక పోయింది. అప్పుడే డాక్టర్ సుశీల ప్రఖ్యాత శాస్త్రవేత్త వై. నాయు డమ్మని కలిసింది. ఒక పెద్ద లాబొరేటరీస్ నిర్వాకం తెలిస్తే అప్రతిష్ట. అందుకని ఎక్కడా బయట పెట్టద్దు. ఇక్కడే మీకు కావల్సిన వసతులు ఇస్తాం. మీరే సాధించండి’ అని నాయు డమ్మ మనసారా దీవించారు. అప్పట్లో టెక్నాలజీకి ఈమె చెల్లించిన సొమ్ము ఎక్కువేమీ కాదు. పట్టు దలగా కార్యరంగంలోకి దిగారు. అంతకుముందు హేమాహేమీలవల్ల సాధ్యం కాని వ్యవహారం ఓ అర్ధరాత్రి ఎడిసన్ ఇంట కరెంటు దీపం వెలిగినట్టు, ధర్మిస్టర్ అన్ని గుణాలతో అవత రించింది. ‘లాబ్‌లో అందరికీ ఉత్కంఠగానూ, రహ స్యం కనిపెట్టాలని ఆశగానూ ఉండేది. అందుకని కిటికీ అద్దాలకు లోపల కాగితాలు అంటించి జాగ్రత్త పడేవాళ్లం’ అని చెప్పారు డాక్టర్ సుశీల. ఆమె కొన్ని శాంపిల్స్ కొంగున ముడి వేసుకుని ‘చల్ మోహన రంగా’ అంటూ రావుతో భాగ్య నగరం వచ్చేశారు. చిన్న సొంత పరిశ్రమని ‘భాగ్య ల్యాబ్స్’ పేరుతో ప్రారంభించారు డాక్టర్ సుశీల. మొట్టమొదటి పారి శ్రామికవేత్తగా ఆంధ్రలో జెండా పాతారు. ఇంతకీ ధర్మిస్టర్స్ అంటే– అవి చూడ్డానికి అగ్గిపుల్లల పరిమా ణంలో, పింగాళీ పుల్లల్లా ఉంటాయ్. వాటిని గ్యాస్ బెలూన్‌లో ఉంచి ప్రతి ఎయిర్పోర్ట్ నించి రోజూ మూడు పూటలా ఎగరవేస్తారు. అది ఎత్తుకువెళ్లి, అక్కడి టెంపరేచర్, తేమలాంటి అంశాలను రికార్డ్ చేసుకువస్తుంది. ఆ సమాచారాన్ని పైలట్స్‌కి అంది స్తారు. ఇవి కొన్ని విదేశాల్లో తయారవుతాయి. కానీ వాటిని తయారించే బట్టీలు పది పదిహేను కోట్లు ఖరీదు అవుతాయ్. డాక్టర్ సుశీల కేవలం క్యాండిల్ వెలు గులో చేసేవారు. దాదాపు నలభై ఏళ్లు పైబడి, ఒక్క భాగ్య లాబ్స్ మాత్రమే భారత ప్రభుత్వానికి సరఫరా చేసింది. ఆ పరమ రహస్యం తెలిసిన ఒకే ఒక శాస్త్రవేత్త అప్పటికీ ఇప్పటికీ డాక్టర్ సోమరాజు సుశీల మాత్రమే. ఆమె ఔననుకుంటే వాజ్‌పేయి హయాంలో భట్నాగర్ అవార్డో, పద్మశ్రీనో వచ్చేది. అనుకోలేదు. ఇది తెలుగుజాతికి, భారతావనికి గర్వం కాదా? ఆలస్యంగా రమారమి యాభై వయస్సులో కథకురాలై అద్భుతాలు సృష్టించారు. డా‘‘ సుశీల ఇల్లేరమ్మ కథలు ఆమెను చిరంజీవిని చేస్తాయి. చిన్న పరిశ్రమలు, ముగ్గురు కొలంబస్‌లు, ఇతర కథలు అన్నీ బెస్ట్ సెల్లర్స్‌గా పేరు తెచ్చుకున్నాయి. వాళ్లింట్లో, వాళ్ల ఫ్యాక్టరీలో వారే కథల్లో పాత్రలు. అందర్నీ చిరంజీవులుగా చేశారు. చెయ్యి తిరిగిన వంటగత్తె. తెలుగు, ఉత్తరాది వంటలు దివ్యంగా వండేవారు. కేవలం ఏడెనిమిది నిమిషాల్లో మైసూ ర్పాక్ కోపులు కోసేవారు. దానికి తగ్గట్టు మంచి అతిథేయురాలు. సంగీతంలో ప్రవేశం ఉంది. ఇంట్లో అత్తగారు, భర్త, పిల్లలు, కోడలు, అల్లుడు డా. సుశీల ఇష్టాయిష్టాలను అనుసరించి ప్రేమించారు. బోలెడు సత్కార్యాలు చేశారు. 55 పెళ్లిళ్లు ఆమె చేతుల మీదుగా చేసిన రికార్డు ఉంది. కొన్ని నెలల క్రితం ‘ప్రయాణం’ అంటూ ఒక వచన కవిత్వం రాశా రావిడ. రైల్లో మలిమజిలీ ముందు సామాను సద్దు కోవడంతో జీవితాన్ని పోల్చారు. ఆ రచనతో గొప్ప కవిగా నిలిచారు. తెలుగువారి ఆణిముత్యం, దేశాభి మాని డాక్టర్ సోమరాజు సుశీలకి అక్షర నివాళి. (మొన్న 26న డాక్టర్ సుశీల కన్నుమూశారు) వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
కేంద్ర బడ్జెట్ నిండా హంసపాదులే
ప్రతిదానికి సహేతుకమైన కారణం ఉండి తీరుతుందని హేతువాదులు బల్లగుద్ది వాదిస్తారు. అత్తిపత్తిని తాకితే ముట్టవద్దన్నట్టు ముడుచుకుపోతుంది. అది దాని జీవలక్షణం. ఆ మర్మం తెలియనివారిని దైవ మహిమగా చిత్రించి దగా చేయకూడదు. కొన్నిసార్లు దేశంలో ఏదో మూల ఒక వేలం వెర్రిని పైకి లేపుతూ ఉంటారు. ఒకసారి వినాయకుడు పాలు తాగేస్తున్నాడని తమిళనాడులో సందడి లేచింది. అంతా ఇంతా సందడి కాదు. చెంచాలతో పాలు అందిస్తుంటే పిళ్లయ్యార్ ఆబగా పీల్చేయడం జనం కళ్లారా చూశారు. మర్నాడు హేతువాదులు రంగంలోకి దిగారు. ఇది దైవ మహిమా కాదు, గోంగూరా కాదు. విగ్రహం అంటే రాయి. బయటి వాతావరణానికి అలిసిపోతుంది. దీన్నే ‘స్టోన్ ఫెతిగ్’ అంటారు. అలాంటి సందర్భాలలో శిలలు ద్రవాల్ని సేవిస్తాయని వారంతా నొక్కి వక్కాణించారు. ఆ వేలం వెర్రి రెండో రోజుకి చప్పగా చల్లారిపోయింది. దైవ భక్తులు ఈ చర్యని దేవుడి మహత్యంగానే ఇప్పటికీ నమ్ముతుంటారు. వినే వారుంటే హేతువాదులు శాస్త్రీయ కారణాలను వివరిస్తూ ఉంటారు. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఇలాంటి వెర్రి వేషాలు ఉన్నట్టుండి కనిపిస్తూనే ఉంటాయి. మనలాంటి ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికల వేళ కూడా ఈ వేలంవెర్రి తలెత్తుతోందని మేధావి వర్గం మొత్తుకుంటూ ఉంటుంది. ‘ఇది కూడా ఒక మాస్ హిస్టీరియానే. ఆనాడు ఇందిరమ్మకి మూకుమ్మడిగా ఎందుకు ఓట్లు వేశారు? తర్వాత ఎందుకు మానేశారు. ఆ హిస్టీరియా అమలులో ఉన్నప్పుడు గడ్డిపరక సైతం బంపర్ మెజారిటీతో గెలి చేస్తుంది’ అంటూ ఆ వర్గం అధిక ప్రసంగం చేస్తుంది. మొదటిసారి మోదీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు కొందరు మాస్ హిస్టీరియా అంటూ ఆక్షేపించారు. తర్వాతసారి, మోదీ బోలెడు జన వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు. సోదిలోకి కూడా రాడని కొందరు ఆశావాదులు తెగ సంబరపడ్డారు. మిగిలిన అందరూ ఓ కట్టు మీద ఉండాలని కూడా తీర్మానించుకున్నారు. ఫలితాలు చూసి దిగ్భ్రమ చెందారు. మెషీన్లు చేసిన మోసమని కూడా సమాధానపడ్డారు. కానీ తర్వాత ఆ సంగతి మర్చిపోయారు. నరేంద్రమోదీ మరింత వైభవమైన మెజారిటీతో పీఠం ఎక్కారు. పెండింగ్ బిల్లులన్నింటినీ గట్టున వేశారు. కశ్మీర్ వ్యవహారంలో గొప్ప సాహసం చేశారన్నారు. ఇదంతా, ఒక ఎత్తు. రెండోవైపు, ‘ఏవుందీ.. దేశం గుంట పూలు పూస్తోంది. ఎక్కడా పెరుగుదల లేదు. విదేశీ పాలసీలు సరిగ్గా లేవు. స్వదేశీ సిద్ధాంతాలు బాగా లేవు’ అని అంతా దుయ్యబడుతున్నారు. కొందరు ఛాందసవాదులు, ఇవన్నీ కాదు– ‘ఏది రామాల యం ఎక్కడ? రెండోసారి రామయ్య గెలిపించినా రామకార్యం చెయ్యకపోతే ఇహ ఇంతే సంగతులు’ అంటూ పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. మోదీ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించి, ఆచరించే నేత. రాముణ్ణి పూర్తిగా నమ్మినా రెండోసారి గెలుపుకి ఆయనే కారణమని పైత్యంగా రామమందిరం పనులకి పునాదులు తీసేంత భక్త శిఖామణి మాత్రం కాదు. రెండోసారి పగ్గాలు పట్టి నాలుగు నెలలు అవుతోంది. ధరల విషయంలో సామాన్యుడు సంతృప్తిగా లేడు. బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతి పద్దుని తిరిగతోడి సమర్థించుకుంటూ వస్తున్నారు. ప్రతి ఖాతాలోనూ, కొత్తగా ఎరువులు గుమ్మరించి, మందులు చిలకరిస్తున్నారు. అంతా ఉద్దీపకాలతోనే అన్నీ నడుస్తున్నాయ్. కేబినెట్లో కొందరికి స్వేచ్ఛగా ఊపిరాడుతోందని, ఇంకొందరికి ఉక్కపోస్తోందని ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతోంది. మోదీకి పార్టీ విస్తరణ కాంక్ష తప్ప వేరే కాంక్ష లేదంటున్నారు. ఏమైనా కాస్త తూకం తప్పుతున్నట్టుంది. జాగ్రత్తపడితే మంచిది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మనది సేద్యం పుట్టిన నేల
అయిదువేల సంవత్స రాలకు పూర్వమే భారతదేశ నేలమీద వ్యవసా యం ఉందని శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. వ్యవసాయపు జీవధాతు మూలాల్ని వెలికితీశారు. అంటే సుమారు రెండువేల అయిదు వందల తరాలుగా వ్యవసాయాన్ని భారతీయులు చేస్తున్నారని అర్థం. మన వేద భూమి అనాదిగా సేద్యమెరిగిన నేల. అందుకు మనం గర్వపడాలా, విచారించాలా అనేదిప్పుడు అనుమానంలో పడ్డది. అనాదిగా మానవుడు అడవులమీద ఆధారపడి దొరికిన వాటితో పొట్ట నింపుకునే దశ నించి స్వయంగా ఆహార దినుసుల్ని ఉత్పత్తి చేసుకునే వైపు అడుగులు వేశాడు. తన శక్తికి పదింతలు సాధు జంతువుల్ని మాలిమి చేసుకోవడం ద్వారా సాధించాడు. బరువు పనుల్ని ఉపాయాలతో సులువు చేసుకున్నాడు. అడవుల్ని స్వాధీనం చేసుకుని నేలని పంటభూమి చేశాడు. క్రమేపీ నాగళ్లతో నేలని పదును చేశాడు. అత్యంత ప్రాచీన దశలో మానవుడు పెంచి పోషించిన పంట నువ్వులు. అందుకే నువ్వులు పెద్దలకు తర్పణలు వదలడానికి ఉత్తమమైనదిగా ఇప్పటికీ అమల్లో ఉంది. కాయగూరల్లో గింజ చిక్కుడు అనాదిగా ఉంది. కనుకనే సూర్యుడికి రథాలు కట్టేటప్పుడు మనం చిక్కుడు గింజలతో కడతాం. సూర్య భగవానుడికి చిక్కుడాకుల్లో నైవేద్యాలు సమర్పిస్తాం. మొదట్నించీ ఏ క్రతువు వచ్చినా, కార్యం వచ్చినా నవధాన్యాలను తప్పనిసరిగా వినియోగించడం ఆచారంగా మారింది. శక్తికి మూలమైన గోమాతని పూజించడం మన సదాచారం అయింది. నిజానికి భూమితోపాటే సమస్త వృక్ష జాతులు, సస్య సంపదలు నేలమీద ఉన్నాయి. ఎటొచ్చీ వాటిని గుర్తించి, తన సొంత నార్లు పోసు కున్నాడు. నీళ్లని అదుపులో పెట్టుకోవడంలో ఆరితేరాడు. కార్తెల్ని, రుతువుల్ని గుర్తించి వ్యవసాయ పనులకి కొలమానాన్ని తయారు చేసుకున్నాడు. వర్షాలు ఎందుకొస్తాయో, వాగులు, వంకలు ఎగువనించి ఎట్లా వస్తున్నాయో మనిషి అంతు పట్టించుకున్నాడు. తరాలు గడిచినకొద్దీ వృక్ష శాస్త్రాన్నీ, పశు విజ్ఞానాన్నీ స్వానుభవంతో నేర్చాడు. రామాయణ కాలం నాటికే నాగలి వ్యవ సాయం ఉంది. ఏరువాక పౌర్ణిమనాడు భూమి పూజ చేసి నాగళ్లు పూని బీడు గడ్డల్ని పదును చేయడం ఉంది. అలాంటి సందర్భంలోనే నాగేటి చాలులో సీతమ్మ ఉద్భవించిందని ఐతిహ్యం. ద్వాపర యుగంలో బలరాముడికి నాగలి ఆయుధంగా నిలిచింది. అంటే వ్యవసాయపు ప్రాధాన్యత తెలుస్తూనే ఉంది. పశు సంపద ప్రాముఖ్యత పెరిగింది. పశుపోషణ వ్యవసాయంతో సమానంగా వృద్ధి చెందింది. ఈ రెండూ ఆదాయ వనరులుగా విస్తరించాయి. అంతకుముందే చెరుకు వింటి వేలుపుగా మన్మథుణ్ణి ప్రస్తావించారు. అంటే చెరుకు గడలు మన నాగరికతలో చేరినట్టే! వ్యవసాయం, దాని తాలూకు ఉపవృత్తుల చుట్టూనే నాటి నాగరికత పెంపొందింది. ఆనాడు ‘చక్రం’ వాడుకలోకి రావడం నాగరికతలో గొప్ప ముందడుగు. మానవుడు స్వయం ఉత్పత్తి సాధించగానే, ఆ సంపదని కాపాడుకోవడం ముఖ్య తాపత్రయమయింది. దాని కోసం అనేక ఉపాయాలు ఆలోచించాల్సి వచ్చింది. తరాలు తిరుగుతున్నకొద్దీ మనిషిలో స్వార్థ ప్రవృత్తి పెచ్చు పెరిగింది. ఆశకి అంతులేకుండా పోయింది. నేల తల్లి మంచీ చెడులను గుర్తించే వారు లేరు. దిగుబడులు అత్యధికంగా రావాలి. దానికోసం ఏవంటే అవి నేలలో గుప్పించడం మొదలు పెట్టారు. ఎన్నోరకాల రసాయనాలు వినియోగిస్తున్నారు. నేల తన సహజ నైజాన్ని కోల్పోతోంది. భూగోళపు సహజ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. అడవులు బోసిపోయి రుతుధర్మాలు చెదిరిపోయాయి. వాటి బాపతు పర్యవసానాల్ని ఈ తరంవారు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పరిస్థితిని చక్కబెట్టుకోవాలి. లేదంటే ఇంకొన్ని తరాల తర్వాత ‘వర్షం’ కనిపించకపోవచ్చు. భావితరాలకు మనమిచ్చే గొప్ప సంపద మంచి పర్యావరణం. ప్రాచీన విలువల్ని కాపాడదాం. మన వేద భూమిని వ్యవసాయ భూమిగా నిలిపి ఆకుపచ్చని శాలువాతో గౌరవిద్దాం! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
ఎవరా శివుడు?
మనం మద్రాస్ నుంచి విడిపోయినపుడు, సర్దార్ పటేల్ పుణ్యమా అని చక్కటి మహా నగరం కాపిటల్‌గా అమి రింది. సుఖంగా వడ్డిం చిన విస్తరి ముందు కూచునే అవకాశం దొరి కింది. కాపిటల్ నిర్మాణం, కష్టనష్టాలు మనకి తెలియవు. అసెంబ్లీ నించి హైకోర్టు దాకా, లేక్ వ్యూ అతిథి గృహం దగ్గర్నించి దవాఖానాల్దాకా దక్కాయ్. ఏ ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కినా నైజాం నవాబు వైభవాలన్నింటినీ అందిపుచ్చు కుని అనుభవించాడు. అప్పట్నించీ పెద్దగా పేర్లు రిపేర్లు జోలికి పోకుండా బండి లాగించుకుంటూ వచ్చారు. అయిదారేళ్లనాడు మళ్లీ విడిపోయాం. తెలంగాణకి వడ్డించిన విస్తరి యథాతథంగా దక్కింది. రెండుగా విడగొట్టినప్పుడు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిని అన్నదమ్ములు స్వేచ్ఛగా వాడుకోండని వెసులుబాటు కల్పించారు. ఎవరి ‘ఇగో’ వాళ్లకుంటుంది. ఎవరి దర్జా వాళ్లది. కొద్ది నెలల వ్యవధిలోనే ఇద్దరికీ కాడి కలవ లేదు. ఎంతైనా కాపిటల్ జన్మహక్కు తెలంగాణ వారిదే గానీ ఆంధ్రోళ్లది కాబోదు కదా. రెండు సీఎం కాన్వా య్లు ఒకే రోడ్డు మీద పరుగులు పెట్టడం ఇబ్బందే కదా. అంతేకాదు ఆ సీఎం గారికున్న గుట్టుమట్టు ఆనవాళ్లు ఈ సీఎం గారికి ఉండవు కదా. కొన్నిసార్లు కుండబద్ధలై నానా సందడీ అయింది కూడా. అసలే తెలుగుదేశం అంటేనే ఆత్మగౌరవం. చంద్రబాబు ఎక్కడో తీవ్రంగా నొచ్చుకున్నారు. విశ్వవిఖ్యాత మహానగరాన్ని నిర్మిస్తా. కృష్ణా, గోదావరులు సంగమించే తావు ఈ నగరానికి ఒక హద్దుగా ఉంటే అమరలింగేశ్వరుడు రక్షగా ఉంటాడు అని రంగంలోకి దిగారు. మూడు పంటలు పండించే రైతులు తమ సుక్షేత్రాలను ల్యాండ్ పూలింగ్‌లో దత్తం చేశారు. అప్పట్లో కేసీఆర్ సైతం వాస్తు రీత్యా అమరావతి అద్భు తంగా ఉంటుందని చెప్పారని వినికిడి. అంతా సవ్యంగా సాగుతున్నంత సేపూ జాతక ప్రభగా వాస్తుదశ అనీ ధీమాగా ఉంటారు. ఎప్పుడో దశమారి, ప్రభ చల్లారితే ఇహ వాటి ప్రస్తావనే రాదు. ఇంతమంచి దిక్కులున్న కాపిటల్‌లో ఉండి పాలన సాగిస్తున్న చంద్రబాబు ఇంత ఘోర పరాజయాన్ని ఎందుకు చవిచూశారంటే ఎవరూ జవాబు చెప్పరు. చంద్రబాబు ఏదో ఒక అద్భుతంతో ప్రపం చంలోనే ఆదర్శంగా నిలవాలని కాపిటల్ మహా సంకల్పంతో కరకట్టమీద నిలిచారు. మోదీ గంగ మట్టి గంగాజలం కానుకగా ప్రత్యేక విమానంలో తెచ్చి అమరావతిని త్రివేణిగా మార్చారు. ఆ తర్వాత అమరావతి అడుగు ముందుకు పడ లేదు. అయిదారేళ్లలో కొన్ని అశాశ్వత భవనాలు మాత్రం పైకి లేచాయి. ఇంతలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోయింది. విజ్ఞులు ముందునించీ చెబుతూనే ఉన్నారు. అమరావతి అనువైంది కాదని, ఆ ప్రాంతం పంటలకే తీరైనదిగానీ పరి పాలనా కోటలకి అనువైనది కానేకాదు. సింగ పూర్ నించే వచ్చే ప్రమోటర్స్‌కి ఏ నేలైనా ఒక్కటే కదా. ఇప్పుడు కాపిటల్ మీద ఉన్నట్టుండి గందర గోళం నెలకొంది. దాన్ని పూర్తిగా మార్చకపో వచ్చు, వికేంద్రీకరణ జరుగుతుంది. కొన్నిచోట్ల కొన్ని కార్యాలయాలు, కొన్నిచోట్ల కోర్టులు అలా నెలకొంటాయ్. ప్రభుత్వ కార్యకలాపాలకి కావ ల్సినవి అమరావతిలోనే ఉంటాయ్. అప్పుడు ఎకరాలన్నింటినీ ఏం చేసుకుంటారో తెలియదు. ఈ లోపల ఈ సంకల్పంలో భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ కుట్ర జరిగిందని కొందరంటున్నారు. మా ఊళ్లో గుడి దగ్గర తరచూ ఏకాహాలు, సప్తాహాలు మైకుల్లో జరుగుతూ ఉంటాయ్. ఒక వైపు మైకులో పాహిమాం, రక్షమాంలు భక్తి భావంతో వినిపిస్తుంటే, మరోవైపు అత్తా కోడళ్ల చాడీలు, పాత గొడవల మీద తీర్మానాలు చెవుల్లో పడుతుంటాయ్. ఈ అమరావతి సందట్లో మొన్న ఎవరో– ‘క్యాపిటల్ ఐదు కోట్ల మందికి గాని కేవలం ఒక సామాజిక వర్గానికి కానే కాదు’ అనడం స్పష్టంగా వినిపించింది. ఇంతకీ అసలేం జరిగింది? అసలేం జరుగుతుంది? ఏం జరగ బోతోంది? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మరీ ముఖ్యంగా శివక్షేత్రం అమరావతిలో. ఇంతకీ ఆ శివుడెవరు?! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
వరదలో బురద రాజకీయాలు
అసలీ వరద మనది కాదు. బురద మాత్రం మనం పూసుకుంటున్నాం. ఎక్కడో పైన ఏ మహారాష్ట్రలోనో వా నలు పడితే కృష్ణమ్మ చెంగనాలు వేస్తుంది. దారి పొడుగునా జలాశయాలు నింపి, గేట్లు వదిలించుకుని దిగువకు నడుస్తుంది. మనకున్న జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడడం ఒక పండుగ. ఇదిగో , మొన్న సర్వత్రా కురిసి న వర్షాలకు వాగులు వంకలు పొంగి వరదలొచ్చినా యి. ఎవరికి వారు లాకులు ఎత్తివేశారు. తలుపులు తెరిచారు. దాంతో కావల్సినంత కరెంటు, అక్కర్లేనన్ని నీళ్లు! కట్టలు తెంచుకున్నప్పుడు వరదలొస్తాయ్. కృష్ణమ్మకి చివ్వరి మెట్టు విజయవాడ ప్రకాశం బ్యారేజి. ఆ బ్యారేజి దిగువకు నీళ్లొదిలితే కృష్ణ వూళ్ల వీదపడుతుంది. మొన్న అదే జరిగింది. ఇళ్లు ఊళ్లు మునిగి పోయాయి. పంటలు నీళ్లలో మురిగి పోయాయి. రైతులు గగ్గోలు పెట్టారు. అక్కడ నించి అమరావతిలో వరదకు మించి రాజకీయాలు వెల్లువెత్తాయి. కరకట్ట మీదున్న మాజీ ముఖ్యమంత్రి అధికార నివాసంలోకి వరద నీరు చేరింది. ఇంకేముంది? ఆ వరద బురదైంది. ఏ చిన్న అవకాశం దొరి కినా తెలుగుదేశం వదిలిపెట్టే సహనంతో లేదు. సూదిని దూలానికి గుచ్చి టీడీపీ నాయకులంతా భుజాన వేసుకుని మీడియా వీధుల్లో వూరేగించేందుకు సిద్ధంగా వున్నారు. చంద్రబాబు నివాసంలోకి వరద నీటిని మళ్లించింది జగనేనని తెలుగుదేశం గొంతు సవరించుకుంది. అంతేకాదు చంద్రబాబు నివాసం మీదకి డ్రోన్లు పంపారని, అదొక దుష్టాలోచననీ ముక్తకంఠంతో ఎండగట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారు. రైతులకు అండగా వుంటానని బురదలో నిలబడి మరీ చెప్పారు. ఈ దెబ్బతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం ఖాయమనే పిచ్చి వుత్సాహంతో టీడీపీ వరద బురదలో ఆటలాడింది. మునిగి పోయిన రైతులు పాతనేతల మాటలకి రెచ్చపడక పోగా, తమరి హయాంలో మీరేం చేశా రని ఎదురు ప్రశ్నించారు. ఇన్పుట్ సబ్సిడీ నుంచి రైతులకు చంద్రబాబు చేసిన దగాలను ఓ జాబితాగా వల్లె వేశారు వరద రైతులు. రాష్ట్రంలో యింత కల్లోలం జరిగితే, చంద్రబాబు మీదకి వరదని అమానుషంగా తోలితే కనీసం రాహుల్ గాంధీ పరామర్శ కైనా రాలేదు. మమతా బెనర్జీ పలకరించనైనా లేదు. ఇది యిట్లావుంచి, వరద బురద యింకా ఉండగానే అమరావతి క్యాపిటల్ మీదికి ద్రోణి ఆవరించింది. వరద పర్యవసానాల్ని అడ్డం పెట్టుకుని అసలిక్కడ క్యాపిటల్ తగదనీ, అసలు పెద్దాయన యీ నల్లరేగడిలో పునాదులకే చాలా ఖర్చు అవుతుందని చెప్పనే చెప్పాడనీ ఓ సీనియర్ మంత్రి కెలికాడు. ఇంకే వుంది, అసలే సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న కృష్ణ గుంటూరు ప్రజల గుండెలు గుబగుబలాడసాగాయి. వరద బురద దీంతో బాగా పాకాన పడింది. చంద్రబాబు కలల క్యాపిటల్ సాకారం కావాలంటే హీనపక్షం ఒకటిన్నర లక్షల కోట్లు కావాలి. ఆయనీ కల కని ఐదేళ్లు దాటింది. మూడు పంటలు పండే సుక్షేత్రాలైన నలభై వేల ఎకరాలను చంద్రబాబు బీడు పెట్టిన మాట వాస్తవం. ఇప్పుడు జగన్ ఇక్కడే క్యాపిటలని చెప్పినా జరిగేదేమీ లేదు. మొన్న బడ్జెట్లో అయిదొందల కోట్లు మాత్రమే క్యాపిటల్‌కి కేటాయించారు. ఈ లెక్కన ఈ విశ్వవిఖ్యాత నగరం పూర్తి కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. పైగా అంతటి ప్రపంచ ప్రసిద్ధ నగరాన్ని చంద్ర బాబు ఎలా నిర్మిద్దామనుకున్నారో, ఆర్థిక వనరులేమిటో ఎక్కడా ఎవ్వరికీ చెప్పలేదు. లండన్, సింగపూర్‌లాంటి దేశాల నుంచి బోలెడు తమాషాలు క్యాపిటల్‌కి వస్తాయని, వాళ్లంతా ల్యాండ్ పూలింగ్‌లో వచ్చిన భూముల్ని భయంకరమైన రేట్లకు కొనేస్తారని చంద్రబాబు అనుకున్నారు. డబ్బులు ఎవరికీ అంత తేలిగ్గా రావు! కాకపోతే, చంద్రబాబు వెంకటేశ్వరస్వామికి కొన్ని ఎకరాలు సమర్పించారు క్యాపిటల్ దగ్గర్లో. టీటీడీ కొన్ని వందల కోట్లు గుడి కోసం కేటాయించింది. ఇప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆలయం నిర్మాణం జరగవచ్చు. ఎందుకంటే శ్రీవారికి నిధుల కొరత లేదు కదా! అన్నీ సవ్యంగా ఉంటే అంతవరకు జరగచ్చు. మిగతా క్యాపిటల్ నిర్మాణం బహుకష్టం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఏవి బాబూ మొన్న కురిసిన అగ్గి చినుకులు!
ఇంకా పట్టుమని పది వారాలు కాలేదు. ఇంతకు ముందు ఎలుకలు, పందికొక్కులు తవ్విపోసిన బొరియల లోతులు, గోతుల అంచనాలు సరిగ్గా అంతుపట్టడం లేదు. అప్పుడే తెలుగుదేశం పార్టీ వైఎస్సార్సీపీ పాలనమీద నోటికి వచ్చినట్టు విమర్శిస్తూ ఆనందిస్తోంది. టీడీపీ ధోరణి చూస్తుంటే రెండు మూడు వారాల్లో పాలనా పగ్గాలు చంద్రబాబు చేతికి రానున్నాయన్నట్టుగా ఉంది. ఇంతవరకు జగన్ తీసుకున్న నిర్ణయాలు సంస్కారవంతులైన వారికి ఆమోదయోగ్యంగానే ఉన్నాయ్. టీడీపీ ఏ ఒక్క నిర్ణయాన్ని హర్షించలేక పోతోంది. పంచతంత్రంలో దుఃఖ భాజనుల జాబితాని స్పష్టంగా ఇచ్చాడు. సరిగ్గా ఆ లిస్టుకి టీడీపీ నేతలు సరిపోలతారు. మనకి బద్ధ శత్రువైనా ఒక మంచి పని నిర్వర్తించినప్పుడు, ఓ ఘన కార్యం సాధించినప్పుడు, ఓ గెలుపుని సొంతం చేసుకున్నప్పుడు మనసారా అభినందించడం సంస్కారవంతుల లక్షణమని రుషులు ఏనాడో చెప్పారు. నిజానికి చంద్రబాబుకి ఇప్పుడున్న బలానికి ఇప్పుడు వస్తున్నంత ప్రచారం మీడియాలో రానక్కర లేదు. సొంత మీడియా కావ డంవల్ల సభలో కాకపోయినా, బయట కుర్చీల్లో కూర్చుని రూలింగ్ పార్టీని విమర్శించినా దాన్ని వినిపిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ పలుకుల్ని ఎవరు వినిపిస్తున్నారు. త్వరలో టీడీపీ ఇంకా బలహీనపడి తీరం చేరే అవకాశం ఉందని వాతావరణ వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆధునిక రాజకీయాలు కూడా భోగభాగ్యాల్లాంటివే! వచ్చేటప్పుడు కొబ్బరికాయలోకి నీళ్లొ చ్చినట్టు నిశ్శబ్దంగా చేరిపోతాయి. వెళ్లిపోయేటప్పుడు వెల గపండు బుగిలి, డొల్ల తేలినట్టు, పైపం చెలు దులుపుకు వెళ్లి పోతాయి. కడకు బాబు మాత్రమే తెలుగుదేశాన్ని వీడలేరు. లోకేశ్ బాబుకి సైతం పార్టీని వీడటానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇదే మరి డెమోక్రసీ చక్కదనం! బస్తీ బాబులకంటే గ్రామీణులకు జ్ఞాపకశక్తి ఎక్కువ. మరీ ముఖ్యంగా నాయకుల ప్రసంగాన్ని బాగా గుర్తు పెట్టుకుంటారు. అటు మొన్న ఎన్నికలప్పుడు చంద్రబాబు నానా రకాలుగా విజృంభించాడు కదా, ఇప్పుడు అయిపోయిన భూచక్రంలా చతికిలపడ్డాడని రచ్చబండ చుట్టూ వినిపిస్తోంది. నదులన్నీ కళకళలాడుతున్నాయ్. అన్ని జలాశయాలు గేట్లు ఎత్తుకు మరీ విలాసంగా నవ్వుతున్నాయ్. రైతులు పొలంపనుల్లో తలమునకలవుతు న్నారు. ఇదొక శుభసూచికం. చంద్రబాబు ఇవేవీ గమనించినట్టు లేదు. నిన్నటిదాకా తెలుగు రాష్ట్రాల వారంతా ఒకే గడ్డమీద పుట్టి పెరిగాం. ఇప్పుడు విడిపోయినంత మాత్రాన శత్రువులుగా మారిపోనక్కర్లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు రెండు రాష్ట్రాలను పాలించారు. అట్లాంటిది ఇప్పుడు ఇంతలో ‘నా ఏపీ, నా ప్రజలు’ వారి హితమే నా జీవిత లక్ష్యమని గాండ్రిస్తున్నారు. జనం ఉభయ రాష్ట్రాల వారు గమనిస్తున్నారు. కేసీఆర్‌తో కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే సహించేది లేదని చంద్రబాబు ఆందోళనా స్వరంతో అరుస్తున్నారు. ప్రజలు ఇవ్వని బాధ్యతల్ని నెత్తిన వేసుకోవడ మంటే ఇదే. కృష్ణా, గోదావరి నీళ్లని వారిష్టానుసారం పంచుకోవడం అనైతికం, అప్రజాస్వామికం అంటూ ఆరోపిస్తున్నారు. నీతి నియమాలు, విధి విధానాలు తగినన్ని ఉన్నాయ్. అనేక మంచి పనులకే ఏదో వంకన అడ్డుపడే ప్రబుద్ధులున్న మన దేశంలో నదుల్ని ఇష్టం వచ్చినట్టు పంచుకుంటే ఊరుకుంటారా? చంద్రబాబుని ఘోరాతి ఘోరంగా ఓడించింది, నరేంద్ర మోదీని హోరెత్తే మెజార్టీతో గెలిపించిందీ గ్రామీణ ప్రజలే. ఆ బలం చూసుకుని తన సత్తా చూపి ధైర్య సాహసాలతో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు మోదీ. మోదీ శక్తి సామర్థ్యాలను బాబు బొత్తిగా అంచనా వెయ్యలేకపోయారు. దానివల్ల రాష్ట్రానికి జరగాల్సిన అరిష్టం జరిగిపోయింది. ‘ఏరి బాబు వాళ్లంతా? ఏరి? ఇరవైమందికి పైగా నేతలు.. అందరూ దండలు దండలుగా చేతులు కలిపి ముక్తకంఠంతో ‘మోదీ డౌన్ డౌన్’ అంటూ’’ నినదించారు. మమతాజీ ప్రధాని కావాలని చంద్రబాబు, కాదు అందుకు చంద్రబాబే సరి అని మరికొందరు పోట్లాడుకున్నారు. ఇంతమంది మహా నేతలు కలిసి కూడా మోదీ ఘన విజయాన్ని అస్సలు పసికట్టలేకపోయారు. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కలలు కంటూ, విమానంలో విరామం లేకుండా ఊరేగారు. ఏది, ఆ తర్వాత మళ్లీ ఏ ఇద్దరూ కలిసినట్టు లేదు. ఇక బాబు ఢిల్లీలో ఏ చక్రం తిప్పాలి? చంద్రబాబు ఆఖరికి గెలుపు కోసం కాంగ్రెస్ హస్తాన్ని కూడా కలిపి నడిచారు. వేదికలు పంచుకున్నారు. అందుకే మా రచ్చబండమీద, వ్రతం చెడ్డా పాపం ఫలం దక్కలేదని ఊరోళ్లు నవ్వుకుంటూ ఉంటారు. వ్యాసకర్త : శ్రీ రమణ ( ప్రముఖ కథకుడు) -
ఒడిసిపట్టడం ఒక మిథ్య!
ఎండలు తీవ్రంగా మండిపోతున్న తరుణంలోనే ‘ప్రతి నీటిచుక్కని ఒడిసి పట్టండి. వదలద్దు’ అంటూ రాజకీయ నాయకులు, పెద్దలు, సంస్కర్తలు తెగ ఘోషించారు. మొన్న వానల వేళ చూశాం. ఇంకా చూస్తూనే ఉన్నాం. గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి ఇంకా అనేక నదుల్లోపడి అనేక లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. ఎన్ని చుక్కలైతే ఒక క్యూసెక్ అవుతుందో కదా?! వీటిని ఒడిసిపట్టే సామర్థ్యం ప్రస్తుతం మనకి లేదు. నిలవచేసే జలాశయాలు మనకి లేవు. అరవై ఏళ్ల క్రితం సంకల్పించి కల్పించిన నాగార్జున సాగర్ తర్వాత అంతటి జలాశయం మనకి రానే లేదు. కొండల మధ్య చేసిన గొప్ప వ్యూహ రచన శ్రీశైలం డ్యామ్. ‘జలమే బలం. బలమే జలం’ అని జనం నమ్మేవాళ్లు. గ్రామ నిర్మాణం జరిగినప్పుడే ఊరికి నాలుగుపక్కలా నాలుగు చెరువులను తగిన పరిమాణంలో తీర్చిదిద్దేవారు. తాగునీటి కోసం అత్యంత పరిశుభ్రమైన చెరువు ఊరికి తూరుపు దిక్కున ఉండేది. తెల్లారుతూనే నిత్యం సూర్యోదయం ఆ చెరువులోనే విచ్చుకునేది. నీళ్ల కావిళ్ల బుడబుడలు, ఆవు మెడ గంటల చప్పుళ్లు, పక్షుల కిలకిలారావాలు ముప్పేటగా తూరుపు చెరువున ప్రతిధ్వనించేవి. అవి కరువు కాటకాలెరుగని మంచి రోజులు. అనాది నించీ మనిషి ప్రతిభాశాలి. ప్రజ్ఞాశీలి. ఉన్నంతలో అవసరానికి తగినట్టు తెలివిని ఉపయోగించి చాకచక్యంగా బతికేవాడు. వర్షానికి చెరువు పొంగితే నీరు వృథా కాకుండా చేప జెల్ల వెళ్లిపోకుండా ఏర్పాటుండేది. ప్రతి చెరువుకి, వాగుకి ‘కోడు’ ఉండేది. కోడంటే అదనపు నిల్వ సామర్థ్యం. ఆనాడు కేవలం రైతు అవసరాలకు అత్యంత ప్రాముఖ్యత ఉండేది. నీటి ప్రాధాన్యతని మన పురాణాలు కళ్లకు కట్టినట్టు చెబుతున్నాయ్. శివుడు గంగని తలమీద పెట్టుకున్నాడంటే దాని అంతరార్థం గ్రహించాలి. జీవించిన వారికి మాత్రమే కాదు. గతించిన వారికి కూడా దాహార్తి ఉంటుందని, పెద్దల దాహాన్ని పిన్నలు మంత్రోక్తంగా తీర్చాలని నిర్దేశిస్తున్నాయ్. పంచభూతాలూ సృష్టికి మూలం. వాటిలో నీరు అత్యంత ప్రాణప్రదమైంది. ప్రతి మానవ అంకురానికి అమ్మకడుపే మహా విశ్వం. అక్కడి నీళ్లమీద తేలియాడుతూ కొత్త మొలక సర్వశక్తులూ కూడ తీసుకుంటుంది. పుడుతూనే వర్ణ లింగ భేదాలతో నవజాత శిశువు నేలకు దిగుతుంది. భూమిని, ఆకాశాన్ని, సమాజాన్ని వీలైనంత మేర కైవసం చేసుకునే ప్రయత్నం చేయడమే తన జీవిత లక్ష్యంగా రోజులు గడుపుతుంది. సృష్టిలో భూమి ఎంతో ఆకాశం అంత. ఆకాశం నీళ్లని పైకి తీసుకుని మళ్లీ కిందికి వర్షిస్తుంది–పర్యావరణాన్ని పాడు చేయనంతవరకు. అశోకుడు చెరువులు తవ్వించాడని, చెట్లు నాటించాడనీ చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. పూర్వం పెద్ద రైతులు తమవంతుగా కొన్ని ఎకరాల విస్తీర్ణంలో సొంత చెరువులు తవ్వించేవారు. నీళ్ల కరువు వస్తే అవి ఆదుకొనేవి. రాను రాను నేలకి రెక్కలొచ్చాయ్. ఊరి ఆలయంలో విధిగా ఉండే తటాకాలు కనుమరుగయ్యాయి. రైతుల భూముల్లో చెరువులు పోయి చదరంత కుంటలు మిగిలాయి. ‘ఏదో శాస్త్రానికి...’ అన్నట్టు చాలా సదాచారాలను మిగుల్చుకున్న దురదృష్టవంతు లం మనం. తర్వాత పెద్ద రైతులు మాకేంపని, అదంతా రాజుగారి పని అన్నారు. రాజు తీయించిన చెరువులు ఇప్పుడిప్పుడు మాయమై, అక్కడ మహా భవనాలు వెలిశాయి. ఇదీ నిజం కథ. రాను రాను నీళ్ల కరువు, నీళ్ల భయం పట్టుకుంది. ఆ మధ్య ‘ఇంకుడు గుంటలు ఇంటింటా’ అంటూ ఓ నినాదం తెచ్చారు. అదొక పెద్ద ఫార్సు. ఎక్కడా నీళ్లింకిన దాఖలాలు లేవు. ‘మా ఏరియాలో ఎంత లోతుకి వెళ్లినా తడి తగలడం లేదండీ. ఆఖరికి పెట్రోల్ తగిలేట్టుంది’ అని ఒకాయన వేష్ట పడ్డాడు. ఇంతకీ మళ్లీ మొదటికి వస్తే– ఒడిసిపట్టడం అనేది ఒక మిథ్య, ఒక మాయ. మనం ప్రస్తుతం సముద్రాలమట్టం పెంచుతున్నాం. మనకిప్పుడు కావల్సింది మాటలకోర్లు కాదు. వీలుంటే నలుగురు కాటన్ దొరలు, సాధ్యమైతే నలుగురు మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు. వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
అమ్మో! పులులు పెరిగాయ్!?
ఈ మధ్య రెండు మూడు రోజులుగా పులుల ప్రస్తావన ఎక్కు వైంది. ఎక్కడ విన్నా ఇదే టాపిక్ అయిపోయింది. పేపర్లలో పతాక శీర్షికలెక్కాయి పులులు. దేశంలో పులుల సంఖ్య అధికంగా మూడో వంతు పెరిగిందని, గ్రాఫ్ గీతలతో సహా చూపించారు. ఇదంతా మోదీ హయాంలోనే మోదీ అవిరళ కృషితోనే సాధ్యపడిందన్నట్టు తెగ వార్తలొచ్చాయ్. నాకసలు అనుమానం వచ్చింది. ఏమిటి నిజం పులుల గురించా, బీజేపీ పులుల గురించా అని సందేహం వచ్చింది. ఒక్కోసారి టెన్నిస్ ఆటగాళ్లని ‘టైగర్స్’ అంటుంటారు. ఆ ఉద్యమం నడిచినన్నాళ్లూ శ్రీలంకలో ‘తమిళ పులులు’గా వ్యవహరించేవారు. కిందటి ఎన్నికల్లో పెరిగిన సంఖ్యని దృష్టిలో పెట్టుకుని, పెరిగిన పులుల సంఖ్యగా చెబుతున్నారనుకున్నా. కొన్ని వేలమంది, కొన్ని వేల కెమెరాలు శ్రమించి పులుల సంఖ్యని నిర్ధారించారు. మోదీకి అసలు తను కిందటి జన్మలో బెంగాల్ టైగర్ అయి ఉండవచ్చని గట్టి విశ్వాసం. అందుకే ఆయనకి పులిమీద పిచ్చి ఇష్టమని కొందరంటుంటారు. కనుకనే వాటి అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశా రని మరికొందరి నమ్మకం. పులి అంటే ధీమా. పులి అంటే పంజా. పులి అంటే చచ్చే భయం. సింహానికి ఠీవి ఎక్కువ. పులికి దూకుడెక్కువ. పులి ఏం తోస్తే అది వెనకా ముందూ చూడకుండా చేస్తుంది. తర్వాత సింగిల్‌గా గుహలో కూచుని బాధపడి, ఎవరికీ వినిపించకుండా చిన్నగా గాండ్రించి, పంజాతో వెన్ను తడుముకుని ముందుకి నడుస్తుంది. సింహం అలా కాదు. మధ్యమధ్య ఠీవిగా వెనక్కి తిరిగి చూసుకుంటుంది. అది తప్పైనా ఒప్పైనా. ఒక్కోసారి అదీ ఏనుగులద్దె తొక్కుతుంది. జూల్లో ఈగలు వాలి దాన్నీ చికాకు పెడతాయి. వాటిని దర్జాగానే సంబాళించుకుని, ‘లయనిజమ్’కి భంగం రాకుండా కాపాడుకుంటుంది. ఒక్కసారి జూలు విదిల్చుకుని ఠీవినొకసారి రీచార్జ్ చేసుకుని వెనక్కి తిరిగిచూసి అడవి దద్దరిల్లేలా గర్జిస్తుంది. దీన్నే సింహావలోకనం అంటారు. సమస్త జీవ రాశి ఆ గర్జనకి ఉలిక్కిపడుతుంది గానీ జూలులో ఆడుకుంటున్న ఈగలు మాత్రం నవ్వుకుంటాయ్. పులి చర్మాన్ని తపోధనులు ఆసనంగా వాడతారు. తల, పులిగోళ్లు యథాతథంగా ఉండి తపస్సుకి ఓ నిండుతనం చేకూరుస్తాయ్. మోదీ కూడా యోగాసనాలు, పెద్ద నిర్ణయాలు పులి చర్మంమీద కూచునే తీసుకుంటారని కొంద రంటారు. పులి చర్మం సృష్టిలో ఒక విచిత్రం. భూమ్మీద ఏ రెండు చర్మాలూ ఒక్కలా ఉండవట. చుక్కలు, ఆ వైఖరి దేనికదే ప్రత్యేకం. విశ్వనాథ సత్యనారాయణకి పులి చాలా అభిమాన జంతువు. ఆకాశంలో ఇంద్రధనుస్సుని పులి తోకతో పోలుస్తారాయన. ‘పులిమ్రుగ్గు’ పేరుతో ఓ మంచి నవల రాశారు. నిజంగా ఇప్పుడు∙మోదీ పుణ్యమా అని పులుల సంఖ్య పెరిగిందంటే విశ్వనాథ ఆనందపడి మోదీని మధ్యాక్కరలతో మెచ్చుకొనేవారు. ప్చ్... ప్రాప్తం లేదు. ఎంతైనా సింహానికున్న రుజువర్తన పులికి లేదంటారు. ఒక్కోసారి పులి నక్కలా ప్రవ ర్తిస్తుందని అడవి జీవితం తెలిసిన వాళ్లంటారు. పులిమీద బోలెడు లిటరేచర్ వచ్చింది. అనేక కథలు వచ్చాయ్. ఒక పులికి నిండుగా వృద్ధాప్యం వచ్చేసింది. పులులకి వృద్ధాశ్రమాలు ఉండవు కదా. చచ్చేదాకా దాని బతుకు అది బతకాల్సిందే. లేళ్ల గుంపుల్ని వేటాడిన పులి అడుగుల నడకే గగనంగా ఉంది. క్షుద్బాధ తీరేదెలా? కుందేళ్లు నోట్లోకి రావుకదా. ఇంతకుముందు రాజుగారిని తిన్నప్పుడు మిగిలిన బంగారు కడియం పులి పంజాకి ధరించి తిరుగుతోంది. చెరువు పక్కన ఓ చెట్టు నీడన కూర్చుంది. వచ్చే పోయే వారిని కేకలతో పలకరించేది. ‘రండి.. రండి! నరమాంసం తిని ఎంతో పాపం మూటగట్టాను. ఇదిగో ఈ వజ్రాలు పొదిగిన బంగారు కంకణం తీసుకుని నన్ను పునీతం చెయ్యండి. ఓయీ విప్రుడా నీవే ఇందుకు తగు’ అనగానే విప్రుడు ఆశపడ్డాడు. విప్రుని తినేసి తిరిగి కంకణాన్ని పంజాకి వేసుకుంది పులి. మోదీ పులుల లెక్క తిరిగి తిరిగి పులిహింస దగ్గర ఆగింది. మొత్తంమీద ఏదో రకంగా దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
అనుసరించారా? వెంబడించారా?
పచ్చ తమ్ముళ్లకి అంతా కొత్తకొత్తగా ఉంది. తూర్పేదో, పడమరేదో ఒక సారి చూసి మరీ ఖరారు చేసుకోవలసి ఉంది. చంద్రబాబు గతంలో కూడా గడ్డుకాలం చూశారు. పదేళ్లపాటు పార్టీని బతికించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఇట్లాంటి దీనావస్థ టీడీపీకి వస్తుందని ఆయన ఊహించలేదు. ఆయన సహచరులైతే అస్సలు శంకించలేదు. జనమంతా మన వెనకాలే ఉన్నారనుకున్నారు. కానీ జనం అనుసరిస్తున్నారా, వెంబడిస్తున్నారా తెలుసుకోలేక పోయారు. ప్రజలు చంద్రబాబు ఓటమి కోసం చాలా చిత్తశుద్ధితో కృషి చేశారు. ఒక గ్రామీణుడు, ‘ఇన్ని సీట్లు కూడా రావల్సిన మాట కాదండీ. చంద్రబాబు ఎందుకు గెలిచాడో, ఎట్లా గెలిచాడో మాకు బొత్తిగా అర్థంకాని విషయం’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. జనం కొన్నిసార్లు ఉత్తినే తీర్పు ఇచ్చి ఊరుకోరు. గుణపాఠం చెప్పి నిశ్శబ్దం వహిస్తారు. ఇప్పుడదే జరిగింది. పాత అలవాటుగా ప్రతిపక్ష బెంచీల్లో కూచున్నా అధికార బెంచీలనుకుని టీడీపీలు సొంతడబ్బా కొట్టుకుంటున్నారు. ఇంకా గట్టిగా ఆరువారాలు కూడా కాలేదు కొత్త ప్రభుత్వం వచ్చి. అప్పుడే తెలుగుదేశీయులు అయిదేళ్లు ఎప్పుడైపోతాయని వేళ్లుమడిచి లెక్కలేసుకుంటున్నారు. ఓటర్లు విసిగి వేసారి పోయారని మాజీ ముఖ్యమంత్రి బాబు గ్రహించాలి. అసెంబ్లీని చూస్తుంటే టీడీపీ అసహనం ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. నెలరోజులు తిరక్కుండానే రైతులకు విత్తనాలేవి? పరిపాలనా దక్షత లేదంటూ కంఠశోష పడుతున్నారు. నాటిన విత్తుల్లో మొలకలేవి? వచ్చిన మొలకలు దుబ్బు కట్టలేదు. కట్టినా పూత రాలేదు. వచ్చినా పిందె దిగలేదు. ఇదే మా ప్రభుత్వంలో అయితే ఆదివారంనాడు అరటి మొలిచింది చందంగా ఏడో రోజుకి గెలలుకొట్టి పందారాలు చేసే వాళ్లమంటూ జబ్బలు చరుస్తున్న చిన్న ప్రత్యర్థి వర్గాన్ని చూస్తుంటే జాలేస్తోంది. ‘శ్వేతపత్రం’ నిబద్ధతకి దేశం హయాంలో నమ్మకం కోల్పోయింది. ఎన్నికల ముందు అస్త్రా లను సంధించినట్టు గుట్టలు గుట్టలుగా శ్వేతపత్రాస్త్రాలను తెలుగుదేశం జనంమీద కురిపిం చింది. అవన్నీ ఎండుటాకుల్లా నేలకి రాలాయ్ ఏ మాత్రం బరువు లేకుండా. చివర చివర్లో చంద్రబాబుకి వయసుమీద పడటంతోబాటు జగన్ అనుకూల పవనాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీనికితోడు అదనంగా బిడ్డ బరువొకటి! వృద్ధ కంగారూలా లోకేశ్ బాబుని, ఆయన వదిలే అజ్ఞానపు బెలూన్లని మోయడం చంద్రబాబుకి తప్పనిసరి అయింది. దాంతో ఆయన ధోరణిలో మార్పు వచ్చింది. ఇందిరాగాంధీని కీర్తించడం, రాహుల్ గాంధీని, సోనియమ్మని నెత్తిన పెట్టుకోవడం లాంటి విపరీతాలు చుట్టుకున్నాయ్. మోదీ కుటుంబ విషయాల్లో తలపెట్టి, అసలే దెబ్బతిన్న బుర్రని మరింత చెడగొట్టుకున్నారు. ఆ తరుణంలో జగన్మోహన్రెడ్డిని దూషించడానికి చంద్రబాబుకి తిట్లు కూడా కరువయ్యాయి. దాంతో పూర్తిగా దెబ్బతిన్నారు. ఇంకా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. అపోజిషన్‌లో చేరిన చంద్రబాబు ముందు ప్రజల మనసుని అర్థం చేసుకోవాలి. సంయమనం పాటించాలి. వారి అనుచరులను కూడా క్రమమార్గంలో నడిపించాలి. ప్రభుత్వంలోకి వచ్చినవారు కూడా వారి శక్తి సామర్థ్యాల మేరకు ప్రజాహితం కోరి పనిచేస్తారు. అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని అదుపు చేస్తారు. వృథా ఖర్చులు, అస్మదీయులకు పెద్దపీటలు తగ్గుతాయి. పుటకనించి అడ్డంగా నడవటానికి అలవాటుపడ్డ ఎండ్రకాయ ఈ భూమ్మీద సకల జీవులు అడ్డంగా నడుస్తున్నాయని తెగ విస్తుపోతూ ముక్కు మీద కాలివేలును వేసుకుంటుందిట! ఉన్న నలుగురూ కాస్త ఓర్పు, సహనాలు వహించండి. విత్తనాలు చక్కగా చిలకల్లా మొలకెత్తుతాయ్. భూమ్మీద నిలబడి తలవంచి సూర్యభగవానుడికి నమస్కరిస్తాయ్. ఇరుగు పొరుగుల్లో స్నేహ సౌరభాలు వెల్లి విరుస్తాయ్. ఈ విరామంలో చంద్రబాబు కర్ణాటకని దారిలో పెడితే ఉభయతారకంగా ఉంటుందని కొందరి సూచన. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
కారుణ్యమూర్తికి అక్షరాంజలి
జూలై 8న మనసున్న మారాజు, తెలుగుతల్లి ముద్దుబిడ్డ వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టినరోజు. ఆయన ఔదార్య కారుణ్యాలను ప్రతిబిం బించే కథలాంటి ఓ నిజం–అది గుంటూరు. ఆ యువతి పేరు శేషశ్రీ. కడు పేదరాలు. భర్తకి ఉద్యోగం లేదు. ఒక చిన్న ఆపరేషన్ సమయంలో డాక్టర్ల తప్పిదంవల్ల ఆమెకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఉన్నట్టుండి శేషశ్రీ మూత్రపిండాలు ముడుచుకు పోయాయి. గుంటూరు కన్యల ఆసుపత్రిలో వైద్యం నడుస్తోంది భరించరాని ఆర్థిక ఇబ్బందుల మధ్య. అప్పుడే పదిహేనేళ్ల పేషెంటు ఆమెకు తారసపడ్డాడు. ‘అక్కా! ముందు నా కథ విను..’ అంటూ మొదలుపెట్టాడు. ‘నాకు నా అనే వాళ్లెవరూ లేరు. వైఎస్ దేవుడు తాడికొండ వచ్చినప్పుడు ఊరివాళ్లు నా గురించి చెప్పారు. నా కిడ్నీ వ్యాధి గురించి, నా దిక్కులేనితనం గురించి విన్నవించారు. వెంటనే, అయితే వెళ్లి హైదరాబాద్ నిమ్స్‌లో చేరిపో. నేను ఏర్పాటు చేస్తానన్నారు. మేమెవరం ఆ దేవుడి మాటల్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పటిలాగే వీధులవెంట తిరుగుతున్నాను. ముఖ్యమంత్రి నేరుగా నిమ్స్‌కి ఫోన్ చేసి, ఫలానా కుర్రవాడు ఎందుకు చేరలేదో వాకబు చెయ్యండని ఆదేశించారు. నా కోసం గాలించారు. నన్ను పట్టు కొని తెచ్చి నిమ్స్‌లో చేర్పించారు. నాకు ఉచితంగా రాజవైద్యం జరిగింది. అక్కా! నువ్ బతికి బట్టకట్టాలంటే ఆయనొక్కడే దిక్కు’ అంటూ ఆ అనాథ పేషెంటు హితవు పలికాడు. అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్సార్ హైదరాబాద్ లేక్‌వ్యూ అతిథి గృహంలో ప్రజల సొంత సమస్యల్ని ఆల కించడానికి పొద్దున పూట ప్రత్యేక సమయం కేటాయించేవారు. శేషశ్రీ గంపెడాశతో వైఎస్సార్ దర్బార్‌కి హాజరైంది. వైఎస్ వస్తూనే కారు దిగుతూనే నిర్జీవంగా ఉన్న శేషశ్రీని గమనించారు. దగ్గరగా వచ్చి వెన్నుతట్టి ఆమెను లోపలికి తీసుకెళ్లారు. ఆమె వణికిపోతోంది. కనీసం కుర్చీలో కూడా కూర్చునే స్థితిలో లేదు. నేలమీద చతికిలపడింది. ముఖ్య మంత్రి కూడా నేలమీదే ఆమెకు దగ్గరగా కూర్చున్నారు. ఆపేక్షగా పరామర్శించారు. వృత్తిరీత్యా డాక్టర్ కాబట్టి సమస్యని అవలీలగా అర్థం చేసుకో గలిగారు. ఆమెకు ధైర్యం చెప్పారు. అక్కడే ఉన్న అధికారిని ఈ వ్యాధికి ఎక్కడైతే మంచి చికిత్స ఉంటుందని అడిగారు. అధికారి స్విమ్స్, తిరుపతి సార్ అని చెప్పడంతో, సీఎం తన లెటర్‌ప్యాడ్ తీసి స్వదస్తూరితో స్విమ్స్ డైరెక్టర్‌కి లేఖ రాశారు. ‘వెళ్లి తిరుపతిలో వైద్యం చేయించుకో. ఏ సమస్య ఉన్నా సరే ఎప్పటికప్పుడు నాకు చెబుతూ ఉండు. ఇదిగో ఇది నా పర్సనల్ టెలిఫోన్ నంబర్. నీ దగ్గర పెట్టుకో. ఈ నెంబరు ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు. తెలిసిందా’ అని గట్టిగా హెచ్చరించి మరీ పంపారు. శేషశ్రీకి ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. ఆమె భర్తకి అర్హతకి తగిన ఉద్యోగం ఏర్పాటు చేశారు. స్విమ్స్‌లో అడ్మిట్ చేసుకున్నారు. ఎందుకంటే అది ముఖ్యమంత్రి ఆదేశం. కానీ ఆ సమస్యకి తగిన సాధన సామగ్రి స్విమ్స్‌లో లేదు. అత్యవసరంగా తెప్పించాలన్నా చాలా సమయం పడుతుంది. ఆ సంగతి పేషెంట్‌కి వివరంగా చెప్పారు. ఆమె ఫోన్ చేసి సంగతి వివరించింది. వైఎస్ అక్కడే ఉన్న అప్పటి అధికారిని కేకలు వేయడం శేషశ్రీకి వినిపించింది. తర్వాత హైదరాబాద్ నిమ్స్‌లో చేరడానికి మారాజు సకల ఏర్పాట్లు చేయించారు. నిమ్స్‌లో రూపాయి తీసుకోలేదు. ఆమెకు, కూడా ఉన్న వారికి కావల్సిన సదుపాయాలన్నీ నిమ్స్వారే చూసుకున్నారు. ‘ఏనాటి అనుబంధమో! కన్నవారైనా ఇంతటి దయాపేక్షలతో కాచుకుంటారా’ అని వారంతా మనసులో కోటిదణ్ణాలు పెట్టుకున్నారు. ఒక్క శేషశ్రీతో తప్ప ఇంకెవరితోనూ వైఎస్ మాట్లాడింది లేదు. వారి పొగడ్తలు స్వీకరించింది లేదు. నిమ్స్‌లో ట్రీట్ మెంట్ ప్రారంభించి, మీ రేషన్‌కార్డ్ చూపించండని అడిగారు. వారికి ఏ రంగు కార్డూ లేదు. అర్జంటుగా కావాలి. వైఎస్ పర్సనల్ ఫోన్ మోగింది. గుంటూరు ఎమ్మార్వోకి మరుక్షణం ఫోన్ వెళ్లింది. గుంటూరు ఎమ్మార్వో ఆఫీసుకి వెళ్లగానే, క్షణాలమీద తెల్ల రేషన్‌కార్డ్ అధికారికంగా చేతుల్లో పెట్టారు. దేవుడు వరాలు ఇవ్వాలనుకుంటే దృశ్యాలు ఇట్లాగే ఉంటాయ్. వాళ్లు కొద్ది నెలల తర్వాత ఆరోగ్యం కొంచెం కుదుటపడ్డాక తిరిగి గుంటూరు వచ్చారు. మర్నాడు రచ్చబండ కార్య క్రమం.. వైఎస్ శేషశ్రీకి ఫోన్ చేశారు. ‘నీ మందులకి వాటికి నెలనెలా బ్యాంక్‌లో జమ అవుతున్న డబ్బు నాలుగు నెలలుగా డ్రా చెయ్యడం లేదు. ఇట్లా అయితే రూల్స్ ప్రకారం ఆ డబ్బు వెనక్కి వెళ్లిపోతుంది’ అని గుర్తు చేశారు. ఎంతటి ఆదరణ! ఎంతటి మానవత్వం! రచ్చబండ మర్నాడు ఏం జరి గిందో అందరికీ తెలుసు. అందరూ షాక్‌కి గురయ్యారు. శేషశ్రీ ఇంతటి దిక్కుని కోల్పోయాననే బెంగతో, వైద్య కారణాలతో ఎక్కువకాలం జీవించలేదు. శేషశ్రీ తల్లి ఆదిపూడి జానకి గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో చిన్న గుమాస్తాగిరి చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. వైఎస్‌ని వారంతా దేవుడిగా పరిగణిస్తారు. ఎవరడిగినా ఈ యథార్థ గాథని పూస గుచ్చినట్టు ఆమె చెబుతారు. ఆ కారుణ్యమూర్తికి అక్షరాంజలిగా సమర్పణ. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఆటలో గవ్వలు సరిగ్గా పడాలి
ఎంతో లోకానుభవం ఉన్న ఒక మహాకవి ‘... అధికారాంతమునందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అంటూ పద్యం నాలుగో పాదాన్ని ముగించాడు. అదొక సామెతలా జనంలో మిగిలిపో యింది. చంద్రబాబు విమానం టేకాఫ్ కాగానే, సెల్ ఫోన్ ఎయిరోప్లేన్ పంథాలోకి వెళ్లగానే నలుగురు తెలుగు తమ్ముళ్లు పచ్చచొక్కాలు విసర్జించి కాషాయ కండువాలు ధరించారు. మోదీ మాత్రమే ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించగలరనే ఏకాభిప్రాయం కలిగిందని వినమ్రంగా చెప్పారు. విమానంపైకి లేచిందో లేదో నలుగురు రాజ్యసభ సభ్యుల మెదళ్లలో జ్ఞానదీపాలు ఒక్కసారిగా వెలి గాయి. మాకు మా దేశం, అంతకంటే ముందు మా సొంత గడ్డ, దానికంటే ముందు మా ప్రజ ముఖ్య మనిపించింది. ఇన్నాళ్లూ జరిగిన అనైతిక చర్యలకు వగచి, చింతించి, బాధపడి, కంటకళ్లు పెట్టుకు న్నారు. మా పశ్చాత్తాపాన్ని పెద్దమనసుతో అర్థం చేసుకోండి. రోజుకి ఆరు లీటర్లు మినరల్ వాటర్ తాగే వాళ్లం ప్రాయశ్చిత్తంగా అరలీటరు సాదా పానీతో సరిపెట్టుకోవడానికి నలుగురం నిర్ణయించు కున్నాం. చంద్రబాబే మా తండ్రి, చంద్రబాబే నేత, చంద్ర బాబే మా గురువు. ఆయనకి ముందుగానే మా నిర్ణయం విన్నవిద్దామని మేము సిద్ధపడ్డాం. గురు కటాక్షం లేక అది సాధ్యపడలేదు. మిగిలిన అరకొర, అడుగుబొడుగు తెలుగు తమ్ముళ్లు మేమంతా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుని ఇలా సన్యసించి కాషాయం లోకి కన్వర్ట్ అయ్యారని ఒక పుకారు లేపారు. అంతా వట్టిది. బీజేపీ తీర్థం పుచ్చుకున్నందున డబ్బు కరువు తీరుతుందా?’ అని ఆ నలుగురూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఇద్దరూ కూడా చేరిపోతారని, మంచిరోజు దొరక్క ఆగారని ఒకమాట చక్కర్లు కొడుతోంది. అసలీ రాజ్యసభ సభ్యత్వాలు వాటి గడువులు పెద్ద పజిల్. సామాన్యులకు, మనలాంటి వాళ్లకి గడువులు వాటి గొడవ అంతుపట్టదు. లాటరీ అంటారు, కాలం తీరిందంటారు, అధిక మాసాలం టారు.. అంతా అయోమయంగా ఉంటుంది. మరో వైపు ఓడిపోయిన తెలుగు దిగ్గజాలు పది పదిహేను మంది, ఒకచోట గుమికూడి ఓ రోజల్లా మంతనాలు సాగించారు. కాకినాడ కేంద్రంగా సాగిన ఈ రహస్య సమాలోచనలు కూడా బాబు విమానం గాల్లోకి లేచీ లేవగానే! ‘అబ్బే! రహస్యం ఏముందిందులో. అసలు రామరాజ్యానికి దీటుగా సాగిన బాబు పాలనకి ఇట్టి దుర్గతి ఎందుకు పట్టిందో చర్చించాం. చర్చల ఫలితాలు మా నేతకి చెప్పాలని నివేదిక సిద్ధం చేస్తున్నాం’ అని చెబుతున్నారు. పాపం పుణ్యం కాకినాడ గ్రామ దేవతలకి తెలియాలి. చంద్రబాబు బ్రహ్మాండంగా ఓడిపోవడం మాట అలా ఉంచి, ఆయన వాచాలత్వం వల్ల సమీ కరణాలన్నీ అద్దాలు పగిలినట్టు పగిలాయి. మోదీ సర్కార్ భూస్థాపితం కాబోతోందని బాబు భవిష్య వాణిని వినిపించారు. అసలు ఒకటి మాట్లాడి ఒకటి పేలలేదని లేదు. మోదీ జ్ఞాపకశక్తి ఇంకా మసక బారలేదు. ఆయనపై వ్యక్తిగత విమర్శలకు కూడా వెళ్లారు. ఏంలేదు. రేపు అన్ని రాష్ట్రాలలో స్థానిక పార్టీలు విజయదుందుభులు మోగిస్తాయనీ, టీడీపీ సంగతి చెప్పనే అక్కర్లేదనీ బాబు కలలు కన్నారు. తెలుగు తమ్ముళ్లకి అనగా చినబాబుకి స్టేట్ అప్ప గించి పెదబాబు ఢిల్లీలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూ రారు. అసలు దేశ భవిష్యత్తంతా లోకల్ పార్టీలదే నని శంఖం పూరించారు. చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం గురించి పదే పదే బెది రించేవారు. అనుభవం కంటే ప్రపంచ తంత్రం గుర్తె రిగి ప్రవర్తించడం అసలైన విజ్ఞత. ఏ మాత్రం అను భవం లేకపోయినా ఇందిరాగాంధీ దేశాన్ని తిరుగు లేకుండా ఏలింది. ప్రజారాజ్యానికి ఎమర్జెన్సీ ఏమిటో, ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించింది. ఇందిర శకంగా ముద్ర వేసుకుంది. అందాకా దేనికి ఎన్టీఆర్ పేపర్ చదవడం, రాజకీయాలు చెవిన వేసుకోవడం లాంటి దురలవాట్లకి దూరంగా ఉండేవారట. ఆయన తల్లి కడుపులో బిడ్డవలె 9 నెలల్లో పరి పూర్ణంగా తయారై గొప్ప నేతగా పేరు తెచ్చుకు న్నారు. పరమపద సోపాన పటంలో ఎన్టీఆర్ చంద్ర బాబుకి చిక్కి అరుకాసురుడనే పెద్దపాము నోట్లో పడ్డాడు. మొదటి గడికి జారాడు పాపం. ఇప్పుడు అంతకుమించిన మహాసర్పం నోట్లోపడి చంద్ర బాబు సోపాన పటం దాటి నేలకి అంటుకున్నాడు. అందుకని ఆటలో అనుభవాలు కాదు, సరైన పందాలు పడటం ముఖ్యం. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
గంజాయిపూత పండితే..!
ఆనాడు కురుక్షేత్ర మహా సంగ్రామంలో కౌరవులదే ఘోర పరాజయమని సుయోధనుడికి మినహా అందరికీ తెలుసని చెబుతారు. సజ్జనులు, యోగులు, జ్ఞానులు ఈ భూమ్మీద ధర్మపక్షంఏదైతే, అదే విజయపతాకం ఎగురవేస్తుందని గట్టిగా విశ్వసించారు. సొంత మీడియాలు, అస్మదీయుల సర్వేలు కోళ్లై కూసినా ధర్మపక్షం, నిశ్శబ్ద విప్లవాన్ని అధర్మ పక్షానికి రుచి చూపించింది. మన చేతలు జనంలోకి వెళ్లి ఏ మాత్రం నష్టం చేయలేదని, మన నాయకుడి కబుర్లు పిచ్చి జనం చెవుల్లో అమృతం పోసినట్టు ఆనందపరిచి తెగ నమ్మించిందనీ తెగ నమ్మారు తెలుగుదేశం తమ్ముళ్లు. అదే చివరకు కొంప ముంచింది. ‘పచ్చజెండా మొన్నటి దెబ్బతో ఎక్కడో గుంటలోకి వెళ్లింది. అది పైకొచ్చి తలెత్తి చూసే ఎత్తుకి చేరడానికి ఎన్ని ఎన్నికల వ్యవధి పడుతుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం. ఎన్టీఆర్ తర్వాత టీడీపీకి నమ్మినబంట్లు లేనే లేరు. ఉన్నదల్లా అధికార దాహార్తులు మాత్రమే. చూరునీళ్లకి ఆశపడే వారితో గుండెలమీద చేయి వేసుకుని గుడ్ గవర్నెస్‌ని అందించడం అసాధ్యం. చంద్రబాబు గదినిండా కంప్యూటర్ పెట్టెలుంటే సుపరిపాలన ఆటోమాటిక్‌గా అందుతుందని అనుకున్నారో,లేదా అందర్నీ బ్రహ్మాండమని నమ్మించవ చ్చని పథక రచన చేశారో తెలియదు’ అంటూ వయసుపండిన అనుభవజ్ఞుడు విడమరచి చెప్పిన మాటలు. ఎన్నికలు కోసెడు దూరంలో ఉన్నాయనగానే బాబు రకరకాల తంత్రాలు ఆరంభించారు. ‘చూడండి... చూడండి... ప్రజల్లో నా పరిపాలన పట్ల 75 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు.ఇంకా కృషి చేస్తా. కనీసం ఇంకో 15 శాతం మందిని సంతృప్తిలో మునకలు వేయిస్తా. ఇదే నా తక్షణ కర్తవ్యం’ అంటూ నినదించేవారు. అసలా కొలతలేమిటో, సంతృప్తి అనగా ఏ సందర్భంలో, ఏ విషయంలో... ఇవి ఎవ రికీ తెలియదు. జనాన్ని అయోమయంలో పడేద్దా మని బాబే అయోమయంలో పడ్డారు. చివరి దశలో మోదీని తిట్టడం, జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌ని కలగలిపి విమర్శించడం మాత్రమే మిగిలింది. ఒకప్పుడు చంద్రబాబు పెద్ద కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని అభి వర్ణిస్తూ సోనియాని, వైఎస్సార్‌ని కలగలిపి విమర్శిం చారు. అదేమీ లాభించలేదు. ఆ నినాదాన్ని తర్వాత వదిలేశారు. మొన్న పూర్తిగా దిగజారి సోనియా హస్తంతో చేయికలిపి మరో అరిష్టం కొని తెచ్చుకున్నారు. నాయకుడైన వాడికి ‘స్వస్వరూప జ్ఞానం’ ఉండాలి. లేదా ఎవరైనా చెబితే విని ఆచరించాలి. చంద్రబాబు ఎన్నిసార్లు హౌస్‌లో కూర్చున్నారన్నది కాదు పాయింటు. ఎప్పుడైనా ఒక్కసారైనా పూర్తి స్వశక్తితో గెలిచినట్టు దాఖలాలున్నాయా? వాజ్‌పేయితో, ఇంకా వారితో వీరితో కలిసి గట్టెక్కిన సందర్భాలు మాత్రమే చంద్రబాబుకి ఉన్నాయ్గానీ స్వయంప్రకాశం లేదు. ఓడిపోయిన పాలకపక్షం, మేము చేసిన గొప్ప పనులను ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్లలేకపోయాం – అని వాపోతుంటారు. ఇలా వారిని వారు ఓదార్చుకుంటారు. పంటకాల్వలోకి సకాలంలో నీళ్లొస్తే దానికి మళ్లీ ప్రచారం దేనికి? తీగెల్లో నాణ్యమైన కరెంటు సదా ప్రవహిస్తుంటే తిరిగి ఆ విషయాన్ని బాజా భజంత్రీలు వాయించి ప్రచారం చేయాల్సిన అగత్యం ఏముంది? అలాగే రోడ్లు, వంతెనలు, ఆసుపత్రులు, పాఠశాల భవనాలు ఇలాంటి ప్రజాహిత పనులు ఏవి చేసినా వాటి గురించి కంఠశోషతో ప్రజల ముందుకు వెళ్లక్కర్లేదు. ఆ సదుపాయాలు, ఆ సంస్థలే మౌనంగా ప్రచారం చేసుకుంటాయి. ఎక్కడో ఒక పొదలో సంపెంగ పువ్వు వికసిస్తుంది. పచ్చని ఆకు ల్లో కలిసిపోయి నిరాడంబరంగా తళుకుబెళుకులు లేని ఆ సంపెంగ ఎంతోమేర సువాసనలు వెదజల్లుతుంది. కనిపించకుండా తన ఉనికిని చాటుతుంది. ప్రజాహిత చర్యలు జరిగినప్పుడు కూడా ఇలాగే పరిమళిస్తాయ్. గంజాయి పుట్టినప్పుడు అచ్చం బంతి మొక్కలా ఉంటుంది. పెరిగి పెద్దయి పూతకి వస్తుంది. అయినా గంజాయి లోగుట్టు ఎవరికీ తెలియదు. పూత కొద్దిరోజులకి పక్వానికొస్తుంది. దాన్నే ‘కళ్లెకి రావడం’ అంటారు. ఇహ చూడండి కొన్ని మైళ్ల దూరం ఆ వాసన వ్యాపిస్తుంది. తెలిసిన వారికి ఆ పరిమళంలో ఓ ఆకర్షణ, ఓ పిలుపు ధ్వనిస్తుంది. అదొక చిత్రమైన మత్తు వాసన! అదే సొంత సామాజిక వర్గంమీద చెప్పరాని, అలవిమాలిన అభిమానాలున్నప్పుడు గంజాయి కళ్లె అయిస్కాంతం లాంటిదే! దీన్ని కప్పిపుచ్చడం చాలా కష్టం. ఇది చాలా ప్రమాదం! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పనికిరాని డేటా!?
పూర్వం శ్రీకాళహస్తి దేవాలయం కట్టేటప్పుడు బోలెడుమంది శ్రామికులు, శిల్పులు ఏళ్ల తరబడి పనిచేశారు. ఆ గుడి ముందు నుంచే స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. పొద్దు కుంకగానే పనివారంతా వెళ్లి స్వర్ణముఖి రేవులో కాళ్లు చేతులు కడుక్కునేవారు. తర్వాత గోపుర ముఖంగా తిరిగి, దోసిలితో నిండా నదిలోనే ఇసుక తీసుకుని, ‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ!’ అని మనసా మొక్కేవారు. వారి శ్రమనిబట్టి, పనితనాన్నిబట్టి, చాకిరిలో నిజాయితీనిబట్టి దోసిలి ఇసుకలో బంగారు రేణువులు తేలేవట! సాక్షాత్తూ మహాదేవుడే కూలి నిర్ణయించేవాడు. అదీ ఒకనాటి స్వర్ణముఖి వైభవం. ఇప్పుడూ ఉంది, పాపం దాన్ని చూస్తున్నాం. సర్వావయాలకు సీళ్లు వేసుకుని ఆ దారిన పోవాల్సిందే. దీన్నిబట్టి మనుషుల్లో నీతి, నిజాయితీ, ధర్మంలాంటి దినుసులు ఎంతగా అడుగంటాయో అర్థమవుతుంది. నదులు, కొండలు, అడవులు ఇతర ప్రకృతి స్వరూపాలు ఆధునిక మానవుడి స్వార్థ చింతనని, ప్రవర్తనని ఎప్పటికప్పుడు బయటపెడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు రౌద్రంగా హెచ్చరికలు చేస్తూ ఉంటాయి. కానీ మనిషి అర్థం చేసుకోడు. చేసుకున్నా పట్టించుకోడు. ఈ విశాల విశ్వం నుంచి మనిషి తవ్వుకుని డబ్బు చేసుకోవలసినవి చాలా ఉన్నాయ్. వాటి కోసం మనిషి ఆశగా వెతుకులాడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు పైన ఈథర్ అనే ఓ శక్తి ఉందనీ, అది శబ్ద తరంగాలను చెప్పిన చోటికి చేరవేస్తాయని కనిపెట్టాడు. అదే రేడియో పెట్టెగా రూపు కట్టింది. ఆకాశవాణిగా బోలెడు సేవలు అందిస్తోంది. తర్వాత అదే నట్టింట్లో బొమ్మలు చూపిస్తోంది. ఆ రోజుల్లో రేడియోలకి లైసెన్స్‌లు ఉండేవి. సంవత్సరానికి పాతికో పరకో. కానీ చాలామంది చెల్లించేవారు కాదు. లైసెన్స్ ఇన్స్పెక్టర్లు అప్పుడప్పుడు ఊళ్లమీద పడి అల్లరి చేసేవారు. ఇదంతా ఈథర్ మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. తర్వాత వన్జీ, టూజీలు వరుసకట్టాయి. భూగోళం ఒకే గ్రామంగా మారింది. హలో అంటే హలో అంటూ వేర్వేరు ధృవాల్లో కూచుని మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఈ ‘జీ’లకి ఇంధనం అక్కర్లేదు. ఇండస్ట్రీలు అక్కర్లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తరించి ఎక్కడికో చేరింది. దాంతోపాటే జీలు పెరిగినకొద్దీ స్కాములు చేవ తేలాయి. పెద్దలకి అవకాశాలు పెచ్చు పెరిగాయి. ఆనాడు మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం చేశాడు. కనీసం ఉప్పుకి ఒక రుచి, బరువు, ఒక లక్షణం అన్నా ఉన్నాయ్. ఈ అంతర్జాలం ఒక గొప్ప మాయాజాలం. కనిపించని ఓ దివ్యశక్తి భూగోళపు నైజాన్ని మార్చివేసింది. అయితే ఇది ఈథర్ లాగా కాదు. కోట్లు, బిలియన్లు ప్రభుత్వాలకు కురిపిస్తోంది. వీటిని ఒడిసి పట్టడానికి కావల్సినన్ని ఉప గ్రహాలు పైకక్ష్యలో నిరంతరం పరిభ్రమిస్తుంటాయ్. వీటితో ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఈ కోట్లు, బిలియన్లు గాలిలోంచి మానవాళికి అందు తున్న భిక్ష. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉండి ఉంటాయ్. సముద్రాన్ని అతి చౌకగా మంచినీళ్లగా మారిస్తే– అది గొప్ప లాభసాటి వ్యాపారం అవుతుంది. ఇసు కని బంగారం చేసే వైనం తెలుసుకుంటే స్వర్ణముఖి బాగుపడుతుంది. అసలే మన రాష్ట్రం టెక్నాలజీ మీద అధికారం ఉన్న వాళ్లం. సముద్రం మీద ఇంకా విశాలంగా పరిశోధనలు జరగాలి. ఇప్పటికే పెట్రోలు, గ్యాసు సముద్ర గర్భం నుంచి తీస్తున్నాం. బంగారం, వెండి కూడా వెలికి తీయాలి. మన దేశం రత్నగర్భ. వాటిని కూడా తోడి పొయ్యాలి. అప్పుడు గానీ మన కరువు తీరదు. ప్రస్తుతం డబ్బుకంటే విలువైంది ‘డేటా’. ఏమిటీ డేటా అంటే సర్వం డేటాయే! ఇదొక చిత్తభ్రమ! ఎదుటివాడి గురించి సమస్త విషయాలు తెలుసుకుని మన గుప్పెట్లో ఉంచుకోవడం డేటా! ఎదుటివాడి కొలతలు, బరువులు, అభిరుచులు, ఆదాయ వ్యయాలు, డీఎన్ఏ, గోంగూర లాంటి పరమ చెత్తంతా కలిస్తే డేటా అవుతుంది. ఈ డేటాల కోసం కలవరించే చాలామందికి వారి గోడకింద వ్యవహారాలే వారికి తెలియవు. అందాక దేనికి, సొంత భార్య, కన్న కొడుకు, కోరి చేసుకున్న కోడలు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నారో కరెక్ట్‌గా ఇంటి పెద్ద చెప్పలేడు. అయ్యాక కూడా ఓట్లు ఎవరికేశారో అంతుపట్టదు. అంతా జన జీవన స్రవంతిలో కలిసిపోతారు. దీనికి లిట్మస్ పరీక్ష కనిపెట్టాలి. ఇదే మన తక్షణ కర్తవ్యం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పై కోర్టుకి అప్పీల్ చెయ్యండి!
ఓర్పుకి, సహనానికి పరీక్షలా సాగుతోంది. లేని వాళ్లకి బీపీ అంటు కుంటోంది. ఉన్నవాళ్లకి పుంజుకుంటోంది. ఓటర్ల అభిప్రాయాలు బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమై ఉన్నాయ్. ఫలితాలు నిద్రావస్థలో ఉన్నాయ్. ఇంకో మూడు వారాలు ఓపిక పట్టాలి. అంతా సవ్యంగా నడిస్తే అప్పటికి ఒడ్డున పడతారు అందరూ. అభ్యర్థులకి ఇదొక మంచి సమయం. ఎవరికి వారు గెలుపు ధీమాతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. రేప్పొద్దున ఫలితాలు ఉల్టాసీదా అయినా ఎవరూ ఏమీ ప్రశ్నించరు. ప్రజాస్వామ్యంలో ఈ ఓట్ల తతంగం చిత్రమైంది. నా చిన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు, ఊరి ఓటర్లందర్నీ పెద్ద దొడ్డికి తోలేవారు. అభ్యర్థి పేరు చెప్పి, ఇష్టమైన వారిని చేతులు ఎత్తమనేవారు. వచ్చిన అధికారి చేతుల్ని లెక్కించేవాడు. ఈ పద్ధతివల్ల కొన్నాళ్లపాటు ఊళ్లో కక్షలు, కార్పణ్యాలు నడిచేవి. సీజన్‌ని బట్టి పంట కుప్పలు తగలబడేవి. జనానికి తిన్నన్ని వరిపేలాలు. పూరిళ్లు, గడ్డి వాములు పరశురామ ప్రీతికి గురి అవుతుండేవి. తర్వాతి కాలంలో పంచాయతీలకి కూడా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి వచ్చింది. అయినా, అదేం చిత్ర మోగానీ ఓడిపోయిన అభ్యర్థి తనకి ఎవరెవరు ద్రోహం చేశారో ఫలితాలు రాగానే ఎలుగెత్తి అరిచేవాడు. ఊరికే పేరుకే సీక్రెట్గానీ అంతా ఓపెనే! చంద్రబాబు ఏపీలో పోలింగ్ కాగానే, ఏ మాత్రం విశ్రమించకుండా అదే గుక్కలో మోదీపై తిట్ల వర్షం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈవీఎంలను నూరు శాతం శంకిస్తున్నారు. ఈసీని మోదీ తొత్తుల్ని చేసి, బ్లాక్ లిస్ట్‌లో పడేశారు. టెక్నాలజీ మీద పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. ఈ కౌంటింగ్ విరామం చంద్రబాబుపై బాగా ప్రభావం చూపిస్తోంది. జగన్ లాంటి నేతల్ని ప్రజలు ఎన్నుకోరని చెబుతూనే బాబు పూర్తిగా డీలా పడుతున్నారు. ప్రజల మీద అంత నమ్మకం ఉంటే, జగన్ మీ స్థాయి నీతి మంతుడు కాడని విశ్వాసం ఉంటే నిశ్చింతగా నిద్రపోండి. ఈ కలవరపాట్లు, కలవరింతలు దేనికి చంద్రబాబూ? ఇక్కడొక పిట్ట కథ చెప్పాలి. కోర్టులో ఖరీదైన వ్యాజ్యం నడుస్తోంది. నడిచి నడిచి చివరకు తీర్పు వచ్చింది. తన క్లయింటు దారుణంగా ఓడి పోయాడు. ఆ లాయర్‌కి ఈ సమాచారం ఎట్లా చెప్పాలో తెలియక, ‘అయ్యా, న్యాయం గెలిచింది’ అంటూ క్లుప్తసరిగా టెలిగ్రామ్ కొట్టాడు. ‘పై కోర్టుకి అప్పీల్ చెయ్యండి’ అంటూ ఆ క్లయింట్ జవాబు కొట్టాడు. నిజానికి ఈ తీరికలో చంద్రబాబు కేంద్ర రాజకీయాలమీద దృష్టి సారించవచ్చు. తిప్పబోయే చక్రానికి పదును పెట్టుకోవచ్చు. రాష్ట్రంలో పునాదుల్లోనే ఉండిపోయి మట్టి తింటున్న అనేక నిర్మాణాలని పరామర్శించవచ్చు. ఒకసారి సింగపూర్ వెళ్లి అందర్నీ పలకరించి రావచ్చు. పోలింగ్ తర్వాత సాయంత్రంవేళ వచ్చి ముమ్మరంగా ఓట్లు వేసిన మహిళల మీద చంద్ర బాబు నమ్మకం పెట్టుకున్నారని వినికిడి. అంటే అప్పటిదాకా ఓటింగ్‌లో పాల్గొన్న వారిమీద నమ్మకం లేదనేగా? పసుపు కుంకుమ పేరుతో ఆడపడుచులకు ప్రభుత్వ ఖజానాలోంచి పంచిన డబ్బు వారిని ఓటింగ్ బూత్‌లకు పరుగులు తీయించిందని బాబు నమ్మకం. ఇలాంటి ఊహాగానాలను బాబు డెబ్భై రెండు మేళ కర్త రాగాలలో ఆలాపిస్తూ ఆనందిస్తున్నారట. అన్ని రాగాలూ వారికి వచ్చా అని చెప్పిన సన్నిహితుణ్ణి అడిగాను. వారికి ఈ విశాల విశ్వంలో రానిదేముంది? వారు పాడింది పాట, ఆలాపిం చింది రాగం అన్నాడు. ఇంతకీ ఆలస్యంగా పడిన మహిళల ఓట్లు ఖజానా సొమ్ముతో పడినవి కావని అనుభవజ్ఞులు అంటున్నారు. ఎప్పుడూ ఇంతే, చాలామంది నేతలు, ప్రజలు తమను అనుసరిస్తున్నారో, వెంబ డిస్తున్నారో విడమరిచి అర్థం చేసుకోలేరు. పండో పచ్చో ఫలితం నవ్వుతూ పెట్టెల్లో కులుకుతోంది. ధర్మం నెగ్గుతుంది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బాబోయ్! డిప్రెస్ మీట్!
మొన్న ఏపీలో పోలింగ్ ప్రారంభం అయీ కాకుం డానే చంద్రబాబు నిరసన గళం విప్పారు. ఓటింగ్ యంత్రాలు దగా చేస్తున్నా యన్నారు. సైకిల్ మీట నొక్కితే ఫ్యాను తిరుగు తోందని అలజడి చేశారు. దాదాపు ముప్ఫై శాతం యంత్రాలు పని చేయడం లేదని చెప్పారు. మొత్తం ఈసీ అవతలి వర్గంతో కుమ్మక్కై, మోదీ చేతి కీలుబొమ్మగా పని చేస్తోందని నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది విన్న వాళ్లు ‘ఆడలేక మద్దెల ఓడు’ అంటే ఇదేనని తెలుగు సామెతలు వచ్చిన పల్లె ప్రజలు చెప్పుకున్నారు. రెండు రోజులు గడిచిపోయినా, ఆఖరికి ప్రశాం తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసినా చంద్రబాబు పాత పాటే పాడుతున్నారు. ప్రజల చెవులు బద్దలు కొడుతున్నారు. చంద్ర బాబు భారత రాజ్యాంగ మూలాల గురించి, దేశభక్తి సిద్ధాంతాల గురించి, గాంధేయ వాదంలో నిక్షిప్త మైన నైతిక అంశాల గురించి, తను అవలంభించే మానవతా దృక్పథాల గురించి ప్రతి ప్రెస్ మీట్ లోనూ మాట్లాడి అందర్నీ బాధిస్తున్నారు. ఒక సీనియర్ పాత్రికేయుడు గంట రెండు గంటల సేపు చంద్రబాబు సొంత మీడి యాలో సొంత రొద విని బయటకు వస్తూనే, పరమ గాఢంగా నిట్టూర్చి, ‘ఇది ప్రెస్‌మీట్ కాదు డిప్రెస్ మీట్’ అందరూ అన్ని దారుల నిండా గాలిని వదిలి రిలాక్స్ అయ్యాడు. తలపెట్టిన ఓ క్రతువు నిర్విఘ్నంగా పూర్తయినం దుకు పెద్దలు, దేశాభిమానులు మొదలు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. దేవుడిమీద నమ్మకం లేనివాళ్లు ఓటర్లని మనసా అభినందించాలి. ఇంతటి మహాక్రతువుని నిర్వహించిన ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి కృతజ్ఞతలు చెప్పాలి. అంతేగానీ కుళ్లు రాజకీ యా లకు తెర తీయకూడదు. ఓడిపోతే ఎవరిమీద ఏ విధంగా నెపం వేయాలో ఇప్పుడే శ్రీకారాలు చుట్ట కూడదు. కిందటి ఎన్నికలలో ఈవీఎంలు అద్భు తంగా పని చేశాయి. ఈసారి వచ్చేసరికి సాంకే తికంగా దిగజారి పోయాయి. వాటికి మతి చెడి సైకిల్‌కి ఫంకాకి తేడా తెలియకుండా పోయింది. మంచి నాయకుడు గెలుపుని సమతూకంగా స్వీకరిం చడమే కాదు ఓటమిని సైతం సహనంగా తీసుకో గలగాలి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ప్రజలిచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటాయి. ప్రజా తీర్పుని అన్ని పార్టీలు శిరసా వహించాలి. కొన్నాళ్లుగా చంద్రబాబు ఓర్పు, సహ నాలు కోల్పోయి.. ఆముదం గానుగ ఒకే గాడిలో తిరుగుతున్న తీరున ప్రసంగిస్తున్నారని జన సామా న్యం చెప్పుకుంటున్నారు. ప్రజలకి చెప్పడానికి గొప్ప పాయింటు లేనప్పుడే ఉపన్యాసాలు ఆము దం గానుగలవుతాయి. మోదీ, జగన్, కేసీఆర్‌లను అక్షులు పక్షులు కాకుండా చంద్రబాబు తిట్టిపోశారు. ఇది గొప్ప ఎన్నికల వ్యూహంగా పనిచేస్తుందని చంద్రబాబు ఊహించారు. కానీ కాదు. రేపు మోదీ మళ్లీ ప్రధాని అవుతారు. అప్పుడేమవుతుంది. ఒక దేశ ప్రధానిని గౌరవించడం ప్రజలందరి బాధ్యత. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలు కూడా చంద్రబాబుకి తెలియ దని జనం అనుకున్నారు. పోలవరం కట్టడానికి, రెండు మూడు కాపిటల్ తాత్కాలిక భవన నిర్మాణా లకి చంద్రబాబు తెగ పబ్లిసిటీ ఇచ్చి విఫలమ య్యారు. రైతులిచ్చిన నలభై వేల ఎకరాల భూమి వ్యవహారాన్ని బాబు సొంత ఖాతాలో వేసుకుని కులుకుతున్నారు. జగన్ వస్తే అరాచకమే అంటూ బూచిగా చిత్రీకరించే ప్రయత్నంలో పూర్తిగా ఓడి పోయారు. జగన్ ఎప్పుడూ గద్దెని ఎక్కి ఉండకపో వచ్చు. పుడుతూనే అనుభవాలు మూటకట్టుకు రారు. చంద్రబాబుకి అట్లా కలిసి వచ్చింది. గడచిన ఐదేళ్లలో అమరావతి పేరు చెబుతూ, అమరావతిలో కూర్చుని చంద్రబాబు దేవతా వస్త్రాలు మాత్రమే నేశారని ఓటర్లు కచ్చితంగా భావించారు. ఇంకా ఎన్నో అంశాలు వ్యతిరేకతనే స్పష్టంగా సూచి స్తున్నాయి. అయినా ఇప్పటికే ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. కాసిని రోజులు ఓపిక పడితే తేటతెల్లంగా జాతకాలు తెలుస్తాయి. ఈలోగా బురద జల్లుకోవడం అనవసరం. ఒక విచిత్రం ఉంది. పోలింగ్ బూత్‌కి వెళ్లేటప్పుడు గంభీరంగా ఉండే ఓటర్లు, వచ్చేటప్పుడు మూతి మెదుపుతారు. అర్థం అయ్యేలా సైగలు చేస్తారు. ఆ సైగలకే చంద్ర బాబు కలవరపడుతున్నారని అనుభవజ్ఞులు పందే లతో వాదిస్తున్నారు. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
గుర్తుకొస్తున్నాయి...
అది 1991 మే నెల 21. మండు వేసవి అర్ధరాత్రి. అప్పట్లో మాకు హైదరా బాదు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో చిన్న గెస్ట్ హౌస్ ఉండేది. మా ఇంటికి మూడు నాలుగిళ్ల ముందర వీధి మొగదాల వైట్ హౌస్ కొండ గుర్తుగా ఉండేది. అంటే అది నందమూరి బాలకృష్ణ ఇల్లు. దాని ముఖ కవళికలు అచ్చం అమెరికా అధ్యక్ష నివాసంలా ఉండి, వైట్హౌస్గా వాసికెక్కింది. అప్పట్లో బాలకృష్ణ ఇంకా అందులో చేరలేదు. కానీ సందడిగా మాత్రం ఉండేది. ఆ అర్ధరాత్రి మా అతిథి గృహంలో ఫోను మోగి, నిద్ర లేపింది. మద్రాస్ నుంచి ఒక ఆంగ్ల పత్రికలో పనిచేసే మిత్రుడు, రాజీవ్ గాంధీ దారుణ హత్య తాలూకు శ్రీపెరంబదూర్ విషాద వార్తని వివరించి, ‘ఇంట్లోనే ఉండండి. తలుపులు తియ్యద్దు. ఇప్పటికే మీ సిటీ అలజడిగా ఉంది. వార్తలొస్తున్నాయ్’ అని కంగారుగా చెప్పాడు. తర్వాత తెంపు లేకుండా ఫోన్లు. ఇదే సంగతి. మా సినిమా పనిమీద బాపు, రమణ, నేను అక్కడే ఉన్నాం. స్థానికంగా ఉన్న బాపురమణల ఐఏఎస్, ఐపీఎస్ మిత్రులు ఫోన్లు చేసి పరామర్శించి, జాగ్రత్తలు చెప్పారు. మాకు కాలం కదలడం లేదు. ఎంతకీ తెల్లవారడం లేదు. రాజీవ్ దారుణ హత్య అని తెలిసిన మరుక్షణం ఇక్కడ కొందరు అసాంఘిక శక్తులు ఎన్టీఆర్ ఆస్తులపై దాడులు సాగించారు. దొరికినవి కొల్లగొట్టారు. మా వీధి మొన వైట్‌హౌస్ అద్దాలన్నీ పగలగొట్టారు. రాజీవ్ గాంధీని ఎక్కడో ఎల్టీటీఈ వారు దారుణంగా బలి తీసుకోవడానికి, ఇక్కడ ఎన్టీఆర్ ఆస్తులు నాశనం చేయడానికి సంబంధమేమిటో వెంటనే ఎవరికీ అర్థం కాలేదు. ఎన్టీఆర్ ఆ వినాశన కాండను చూసి ఖిన్నుడయ్యారు. హిమాలయ మహా శిఖరం ఎండ తగిలిన చందమయ్యారు. ఎందరో ఆప్తులు, మిత్రులు వచ్చి ఓదార్చారు. ‘‘బ్రదర్, మేము ఇవన్నీ ఎక్కడెక్కడో కష్టపడి, ఖర్చుపెట్టి సేకరించిన అపురూపమైన వస్తువులు. ఆనాటి నవాబు బిడ్డలు అమ్ముతుంటే కొన్నాం. చూడ ముచ్చటగా మా థియేటర్లలో అమర్చుకొన్నాం. ఇవ్వాళ డబ్బు పెట్టినా అవి మళ్లీ దొరకవు. వారికి నామీద అసలు ఆగ్రహమెందుకో నాకు తెలియదు. నేను కాంగ్రెస్ వ్యతిరేకిని. రాజీవ్ దారుణ హత్యను తీవ్రంగా గర్హిస్తున్నా. రాజకీయ విభేదాలుండటం సహజం. కానీ ఇలా పగ తీర్చుకోవడమా’’ అంటూ ఆక్రోశించారు. ఇక తర్వాత జరిగినదంతా చరిత్ర. ఈ మధ్య ఎన్నికలలో, చంద్రబాబు నేతృత్వంలో, కాంగ్రెస్ పార్టీ తో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ జత కట్టడం, మమేకమై పోటీ చేయడం అందరూ చూశారు. ఘోర పరాజయంలో రెండు పార్టీల టాలెంటు ఉంది. ఆ కలయికను చూసి ట్యాంక్‌బండ్‌మీది విగ్రహాలు ముక్కున వేలేసుకున్నాయి. చార్మినార్ నాలుగు స్తంభాలు నవ్వాయి. ధ్వంసమైన కళాఖండాలు మరోసారి నెత్తురోడ్చాయి. ఈ మహా కలయిక ఏపీ అభ్యున్నతి కోసమేనని చంద్రబాబు పదేపదే చెప్పినప్పుడు రాబందుల రెక్కల చప్పుడులా వినిపించింది. ఎన్టీఆర్ పవర్లో ఉండగా ఆయనని తమాషా చేస్తూ గండిపేట రహస్యం, మండలాదీశుడు వగైరా సినిమాలు విడుదలై డబ్బు చేసుకున్నాయ్. వీటి మూల పురుషులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, హీరో కృష్ణ ప్రభృతులు. ఇంకా చాలా సినిమాలు ఇలాంటివే నిర్మించడానికి చర్చిస్తున్నారు. వాటిని ఏ సెన్సారు ఆపడం లేదు. వడ్డించేవారు వాళ్ల వాళ్లే. డీవీఎస్ రాజు, రావు గోపాలరావు తీవ్రంగా ఆలోచించి అడ్డుకట్టకో, పై పోటీకోగానీ, ‘మిస్టర్ క్లీన్’ పేరుతో సినిమా అనౌన్స్ చేయాలని నిర్ణయించారు. వైట్‌హౌస్‌లో అంతా చేరారు. అశోక్ గజపతిరాజు, చంద్రబాబు కూడా ఉన్నారు. అప్పట్లో మిస్టర్ క్లీన్ అంటే అందరికీ విదితమే. తెలుగులో ఆ వేషానికి మోహన్‌బాబు, హిందీలో రాజ్ బబ్బర్ అనుకున్నారు. రావుగోపాలరావు నిర్మాణ సంస్థ మీద నిర్మించాలని తీర్మానించారు. ఆ చర్చలకి రాజ్‌బబ్బర్, ఇంకా ప్రముఖులు, మేనకా గాంధీ కూడా హాజరయ్యారు. నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. ‘సెన్సార్ వారు చాలా పెద్ద మనసుతో, నిర్మాతలకు ఆకాశమంత స్వేచ్ఛని ఇచ్చి చిత్రాల విడుదలకు అనుమతిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఒక మంచి సమకాలీన ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని జన రంజకంగా తీయాలని సంకల్పించాం’ అంటూ, వివరాలన్నీ ఇస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. మర్నాడు అన్ని పత్రికల్లో ప్రముఖంగా మిస్టర్ క్లీన్ వార్త వచ్చింది. అంతే, గప్‌చుప్ కాంగ్రెస్ పార్టీ నించి అన్నగారిపై చిత్రాలు ఆగిపోయాయి. వీళ్లూ ఆగిపోయారు. ఇప్పుడు అన్నింటినీ వదిలేసి చంద్రబాబు రాహుల్, సోనియాగాంధీలతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. అదేవన్నా అంటే రాష్ట్ర ప్రగతి కోసం అంటున్నారు. ‘నేను తప్ప అందరూ దొంగలే’నని చంద్రబాబు అరుస్తున్నారు. అందరి అభిప్రాయం అదే నని బాబు గ్రహించాలి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అన్న–తమ్ముడు మరియు సింపతి
సార్వత్రిక ఎన్నికల పర్వంలో తొలి ఘట్టం రేపోమాపో ముగియ నుంది. దాని తర్వాత బుజ్జగింపులు, ఓదా ర్పులు, కొత్త ఆశలు ఉంటాయి. సర్వసాధార ణంగా ఏదో ఒక తాయి లం అభ్యర్థిని లొంగదీసుకుంటుంది. ఎందుకంటే మనం మనుషులం రుషులం కాదు. దేశభక్తుల వంశం అసలే కాదు. స్వతంత్రం వచ్చాక పదవి ఒక అలంకారం అయింది. కాలక్రమేణా ఉత్తి అలంకా రమే కాదు. కీర్తిప్రతిష్టలున్నాయని తెలిసొచ్చింది. ఆనక డివిడెండ్లున్నాయని అర్థమైంది. ధర్మార్థ కామ మోక్షాలకి పదవి రహదారి అని తెలిశాక ఏ పెద్ద మనిషి ఈ దారి వదులుతాడు? ‘ఇప్పుడు అయి పోతే, మళ్లీ ఎన్నికలు రావా? అయిదేళ్లు ఎన్నాళ్లు తిరిగొస్తాయండీ’ అనే ఆశావహులు కోకొల్లలు. వారే అసలైన తాత్వికులు. ‘నేను లీడర్లని, ఓటర్లని నమ్ముకోను. కాలాన్ని మాత్రమే నమ్ముకుంటాను అన్నాడొక పైకొస్తున్న రాజకీయ వేత్త. దానికి పలు దృష్టాంతరాలు సెలవిచ్చాడు. ముందుసారి కాక ముందుసారి మా అన్నయ్య నామినేషన్ వేయడా నికి మేళతాళాలతో, ఏనుగు అంబారీ మీద వెళ్తుంటే ఏనుక్కి పిచ్చి రేగింది. నానా యాగీ చేసి అంబారీ మీది అన్నయ్యని తొండంతో విసిరికొట్టింది. అభ్యర్థి కోమాలోకి వెళ్లాడు. సూపర్ స్పెషాలిటీలో రాజ వైద్యం నడుస్తోంది. నామినేషన్లకి ఇంకొక్క రోజే గడువుంది. నియోజకవర్గమంతా రకరకాల వదం తులు. పైవాళ్లు అర్జంటుగా నన్ను తలంటోసుకుని కొత్త దుస్తులు ధరించమన్నారు. నేను కంటతడి పెట్టాను. అవి ఆనంద భాష్పాలో దుఃఖ భాష్పాల్లో నాకే అర్థం కాలేదు. ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ అద్దాల గదికెళ్లి డాక్టర్లతో భోరుమన్నాను. మా అన్నయ్య.. అంటూ ఎక్కిళ్లు పెట్టాను. ఆసుపత్రి రాజవైద్యుడు, నువ్వు ఏడవద్దు. మీ అన్నయ్య సంగతి మేం చూసుకుంటాం. ఇప్పటికే అవసరమైన అన్ని స్పేర్ పార్ట్లు సేకరించి పెట్టాం. బ్లడ్ గ్రూప్ రక్తం బోలెడు లీటర్లుంది. అయితే, అధిష్టానం సూచనల మేరకు నడుచుకోమని గట్టిగా చెప్పారు అని ఓ పిచ్చి చూపు చూశాడు. క్షణం కూడా వృథా చేయకుండా తమ్ముడి పేరు మీద బి ఫారం పుట్టించి, సకాలంలో నామి నేషన్ దాఖలు చేయించారు. మళ్లీ కోలాహలం. ఈసారి ఏనుగు లేదు. అసలు మనకి దేవుడి వాహనాలు వద్దంటే వద్దని మా పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కుంకంబొట్లు, భారీ దండలు, జిందాబాదుళ్లు తీవ్రంగా పడ్డాయ్. ఎన్నికలు దగ్గ రకు వస్తున్నాయ్. పై నించి ప్రచార సామగ్రి దిగింది. నా దగ్గర తంతే కోటి కూడా లేదు. అర్ధాంతరం నన్ను పాలిటిక్స్‌లో దింపేశారేంటని తమ్ముడు బావురుమన్నాడు. పైవాళ్లు నువ్వు మామూలోడివి కాదు. ఇంకా సాంతం గడిలోకి రాకుండానే మాకు గండి వేస్తున్నావ్ అనగానే తమ్ముడు వెర్రిమొహం పెట్టాడు. తమ్ముడూ నువ్ దేశముదురువి. నీకు నిండా దొరికాం అంటూ తలపండని మహా మాంత్రికులు నీరుకారి పోయారు. మర్నాడు, ‘నాకీ రాజకీయాలు అస్సలు తెలి యవు. నాకు నా అన్న ప్రాణం ముఖ్యం’ అంటూ ఆసుపత్రిలో కుప్పకూలాడు తమ్ముడు. వైద్యం సరిగ్గా జరగడం లేదు. ఏదో ఉంది. ఇహ నాకు మీడియా తప్ప వేరే మార్గం లేదన్నాడు తమ్ముడు. హై కమాండ్ ఒక్కసారిగా ఖంగుతింది. పోలింగ్ తేదీ పది రోజుల్లోకి వచ్చింది. అంతా ఆసుపత్రి వర్గాల చేతుల్లో ఉంది. కావాలంటే వెంటిలేటర్స్ మీద పది రోజులు ఉంచగలరు, వద్దనుకుంటే పుణ్యతిథి చెబితే పైకి పంపించేగలరు రేపు లేదా ఎల్లుండి పోలింగ్ అనగా అన్నయ్య గుటుక్కుమ న్నాడు. వార్త ముందే తెలిసినంత పర్ఫెక్ట్గా గుప్పు మంది. క్షణాలమీద లీడర్స్ చార్టర్ ఫ్లయిట్స్‌లో, హెలికాప్టర్లలో, కార్లలో వచ్చి వాలారు. ఎన్ని దండలు, ఎన్ని కన్నీళ్లు? ఆయన ఆదర్శాల కోసం శేష జీవితాన్ని అంకితం చేస్తామని వాళ్లంతా గద్గద స్వరాలతో వక్కాణించారు. తమ్ముడు, బరిలో ఉన్న అభ్యర్థి అపస్మారక స్థితిలో ఉన్నాడని ఆసుపత్రి చెబుతోంది. సర్వత్రా సింపతీ కారుమేఘాల్లా అలు ముకుంది. ఫలితం గురించి వేరుగా చెప్పక్కర్లేదు. గెలుపులో పెద్ద పాత్ర ఆసుపత్రిది. సహజంగా నటించింది ఏనుగు ఒక్కటే! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అగ్గి తిరునాళ్లు
భారత పౌరుషానికి, ప్రతీకారాగ్నికి బాలాకోట్ బూడిదగుట్టయింది. మన వీరుల ధైర్యసాహసాలకి గురి తప్పని దృఢ సంక ల్పానికి బాలాకోట్ బాంబుదాడి చిన్న శాంపిల్. కోట్లాదిమంది భారత ప్రజానీకానికి కొండంత ధైర్యం మన త్రివిధ దళాలు. వారిని మనసారా అభినందిస్తూ, వారి త్యాగనిరతికి నీరాజనాలర్పిస్తోంది. మన బలగాల్లో నలభైమందిని దొంగదెబ్బతో పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకను సరిగ్గా అది జరిగిన పన్నెండో రోజున ఉగ్రవాద శిబిరాన్ని సమాధి చేశారు. ప్రాణానికి పది ప్రాణాలు బలి తీసుకుని మన వీరులకు ఆత్మశాంతి కావించారు. అప్పటిదాకా ఉడికిపోతున్న భారత జాతి కొద్దిగా చల్లబడింది. అయినా, అకారణంగా పోయిన మనవారు తిరిగిరారు. ఆ నష్టం, ఆ బాధ ఎన్నటికీ తీరనిది. యుద్ధ క్షేత్రంలో ఎన్నో దళాలు, ఎన్నో శాఖలు ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటాయ్. వాహనాలకి ఇంధనం నింపేవారి నించి, వైద్య సేవలందించే కాంపౌండర్లు, నర్సుల దాకా యుద్ధం గెలుపుకి కీలక కారకులే. ఆ రోజు అత్యంత విజయవంతంగా నడిపించిన ఉగ్ర శిబిర విమాన దాడిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయ్. గురి తప్పకుండా బాంబులవాన కురిపించి, ఉగ్రమూకల్ని బూడిదగుట్టలుగా మిగిల్చి, అన్ని యుద్ధ విమానాలూ విజయోత్సాహంతో మాతృభూమిపై వాలిన తర్వాతే ప్రధాని నిద్రకు ఉపక్ర మించారట. ఇంత మాత్రం చొరవ దేశ ప్రధానికి ఉండటం అభినందనీయమే గానీ ఆశ్చర్య కారకం కాదు. సొంతగడ్డమీది భారతీయులే కాదు, ప్రపం చంలో ఉన్నవారంతా ఊగిపోయారు. ఉత్సవాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ ‘నేనున్నా నేనున్నా. ఈ దేశం సురక్షిత దేశాల్లో ఉంది. నిశ్చింతగా ఉండండి’ అంటూ అభయ సందేశం ఇచ్చారు. అసలే గందరగోళంలో ఉన్న మోదీ వ్యతిరేక వర్గానికి ఈ దాడితో బుర్ర శ్రుతి తప్పింది. మన సైనిక బలాల శక్తి సామర్థ్యాలను, దేశభక్తిని మోదీ ఖాతాలో జమ చేసుకోవడం, ఈ సన్నివేశాన్ని రాజకీయం చేయడం పరమ దివాలాకోరుతనం అంటూ మైకుల్లో ఆక్రోశించారు. నిజమే, ఇలాంటి సందర్భంలో ఏ ప్రధాని పీఠం మీదున్నా ఈ మాత్రం తెగువ చేస్తాడు. మోదీకి సమయం కలిసి వచ్చింది. అసలా మాటకొస్తే త్రివిధ దళాధిపతి మన రాష్ట్రపతి, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్– ఎక్కడా వారిపేర్లు రాలేదు. ఎక్కడైనా అధినాయకుని పేర్లు, ఫొటోలు మాత్రమే తెరకెక్కుతాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే, రాజు యువరాజు పేర్లు మినహా ఎంతమంది మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయ్? పాపం, మంత్రులు మాట్లాడినా, ‘... గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి ఆదేశం మేరకు...’ అని ప్రారంభించి ఆ విధంగా ముందుకు వెళ్తారు. ‘ఆయన పేరు లేకుండా స్పీచి సాగితే సారుకి బీపర్లు వెళ్తాయట. అసలే టెక్నాలజీ మా సారు గుప్పెట్లో ఉంటది’ అన్నాడొక పెద్దాయన వ్యంగ్యంగా. ఇంత జరిగితే ఏమీ జరగనట్టు శత్రు దేశం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అలాంటి ఫైవ్ స్టార్ ఉగ్రవాద శిబిరాలు రాజ లాంఛనాలతో పాకిస్తాన్ నేలమీద నడుస్తున్న మాట నిజం. తేలుకుట్టిన దొంగలాగా కిక్కురుమనక ఊరుకున్నారు. శాంతి మంత్రాలు వల్లిస్తున్నారు. యుద్ధం ఎవరికీ లాభదాయకం కాదని పాక్ ప్రధాని ధర్మపన్నాలు చెబుతున్నారు. జెనీవా ఒప్పందాన్ని గౌరవించి అభినందన్ విడుదలకి మడత పేచీలు లేకుండా అంగీకరించారు. అంతవరకు సంతోషం. ప్రపంచ అగ్రదేశా లన్నీ భారత్‌ని సమర్థించాయి. సంయమనం పాటించమని సూచిస్తున్నాయ్. చైనా మునుపటి వైఖరిని మార్చుకున్న ధోరణి పొడసూపింది. దీంతో పాకిస్తాన్ చాలా వైనంగా మాట్లాడుతూనే, బీరాలు పోతోంది. మోదీ వ్యతిరేక శక్తులకు ఇది ఆకస్మికంగా వచ్చిన సమస్య. ఇప్పుడు చంద్రబాబు మోదీని దేశద్రోహిగా ఏపీ విరోధిగా, ఓర్వలేని కుళ్లుమోతు నేతగా జన హృదయాల్లోకి ఎక్కించడం కొంచెం చాలా కష్టం అనిపిస్తోంది. అతి త్వరలో వచ్చే అనేక పరిణామాలు మోదీని ఇంకో రెండు మెట్లు పైకి ఎక్కిస్తే చాలా కష్టం వ్యతిరేక వర్గానికి. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
కవిసమయాలూ–రాజకీయాలు
నిండు పౌర్ణమినాడు బ్రహ్మదేవుడు వెన్నెలని పారిజాతాల మీంచి పోగేసి, సరస్వతీ దేవి దోసిట నింపాడు. వెన్నెల దోసిలిని బ్రహ్మ సుతారంగా నొక్కి అచ్చుతీసి వెలికితీసిన పిట్ట ఆకతికి హంస అని పేరు పెట్టాడు. ఇది మామూలు హంస కాదు, రాజహంస అన్నది వాగ్దేవి. దానికి తగిన రెక్కలిచ్చి మానస సరోవరంలో వదిలాడు. అది పాడితే కిన్నెరులు చెవులు రిక్కిస్తారు. హంస ఆడితే అచ్చర కన్నెలు గువ్వల్లా ముడుచుకుంటారు. ఇవన్నీ కావ్యోక్తులు. నిజంగా హంసని విన్నవారేగానీ కన్నవారు లేరు. అయినా ఎవరూ హంసని జాబితాలోంచి తియ్యరు. ఇదొక విచిత్రం. చక్రవాకం అనే మరో పక్షి వినిపిస్తూ ఉంటుంది. పెద్దముక్కున్న నోరు, నిడివైన తోకతో వెన్నెల రాత్రుళ్లలో తేట మబ్బుల్ని చుడుతూ చక్కెర్లు కొడుతూ ఉంటుంది. దాని ఆహారం వెన్నెల. ‘చకోరంలా నిరీక్షించడం’ అని ప్రాచీన సాహిత్యం నించి ఆధునిక నవలల దాకా రాతగాళ్లు తెగ వాడుతూ ఉంటారు. కానీ చకోర పక్షిని చూసినవారుగానీ, దాంతో సెల్ఫీలు దిగినవారుగానీ లేరు. అయినా చకోరికి బోలెడు కీర్తి. ఇంతటి కీర్తి ప్రతిష్టలూ స్వాతి చినుకుకి ఉన్నాయ్. ముత్యపు చిప్పల్లో స్వాతి లగ్గంలో పడిన చినుకు మంచి ముత్యంగా ఆవిర్భవిస్తుంది. అది తుల లేనిది వెల లేనిదిగా భాసిస్తుంది. రాయంచ, చకోరం, స్వాతిముత్యం అవన్నీ ఎవరికంటా పడకపోయినా గొప్ప ప్రాచుర్యం పొందాయ్. ఇంతటి గొప్ప అంశాలను కొట్టి పారేయడం దేనికని, ప్రాజ్ఞులు వీటిని కవిసమయాలుగా తీర్మానించి వీటికి గౌరవప్రదమైన స్థానం కల్పించారు. ఇంకా ఐరావతం అంటే తెల్ల ఏనుగు ఒక ఊహ. చాలా అన్యోన్యమైన జంటగా చిలకాగోరింకల్ని చెబుతారు. ఇది కవిగారి పైత్యమే గానీ నిజం లేదు. రెండు చిలకలు, రెండు గోరింకలు జత కడతాయి గానీ వర్ణ సంకరానికి చచ్చినా పాల్పడవు. అప్సర కన్యలు మనుషుల తీయటి కల. ఆ మధుర స్వప్నంలో శతాబ్దాలుగా కవులు జనాన్ని ఓలలాడిస్తున్నారు. మన రాజకీయ నాయకులు అరచేత చూపించే కలల బొమ్మలు కూడా ఇలాంటివే. రాజకీయవాది ఎప్పుడూ నిరాశ చెందడు. అధైర్యపడడు. సరికొత్త కలల్ని భుజాన వేసుకుని జనం ముందుకు వస్తాడు. అవినీతి అనే మాటని నేనొచ్చాక మీ నిఘంటువులలో తొలగించాల్సి ఉంటుంది. ఆశ్రిత పక్ష పాతం ఇప్పటికే సగంపైగా చెరిగిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా సేవచేస్తూ మన రాష్ట్ర సగటు ఆయుర్దాయాన్ని గణనీయంగా పెంచాయ్. ప్రభుత్వ బళ్లలో చదువులకు ప్రజలంతా నీరాజనాలెత్తుతున్నారు. నేతి బీరకాయ చందం, పెరుగు తోటకూర వైనం– ఇవన్నీ సామెతలుగా వాడుతున్నాం. మన అపోజిషన్ వారికి ఒక ప్రణాళిక ఉండదు. గడచిన మూడు నాలుగేళ్లలో సీఎం నించి చిన్నా పెద్దా మంత్రులు వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలు చాలావరకు దొరుకుతాయ్. వాటిలోంచి ఆణిముత్యాలు ఏరి ఒక్కొక్కరి అధిక ప్రసం గాన్ని ఓ గంటకి కుదించి చానల్స్‌లో ప్రసారం చెయ్యాలి. ఎన్నెన్ని అతిశయోక్తులు, ఎన్ని కవి సమయాలు– అందరం విని దుఃఖపడతాం. ఏడాది క్రితమే పోలవరంలో నీళ్లు పారడం ప్రజలు చూశారు. ఆయకట్టు కింద బంగారు పంటలు పండటం చూశారు. అమరావతి రాజధాని సరేసరి. అదిగో అసెంబ్లీ ముందున్న ఉద్యానవన తోటలో హంసల దండు ముచ్చట్లాడుకుంటూ ముగ్ధమనోహరంగా ఈదులాడుతున్నాయ్. చకోరాలు కాలుష్య శూన్యంగా కన్పించిన ఏకైక ప్రదేశంగా గుర్తించి గుంటూరు–బెజవాడ మధ్య వెన్నెల తింటూ తిరుగుతున్నాయ్. ఇక్కడ మురుగు కాలవలే ఇంత శుద్ధమా అని నివ్వెరపోతూ, కాలుజారి స్వాతి చినుకులు ముత్యపు చిప్పల్లో పడుతున్నాయ్. దాంతో గుంటూరు ఊరి కాలువల్లోనే మంచి ముత్యాలు పుష్కలంగా పండుతున్నాయ్. ‘రామరాజ్యం ఇంతకంటే విశేషంగా ఉండేది కాదని నా భావన’ అని ఓ కవి స్పష్టం చేశాడు. ‘తెలుగు భాష అందరిదీ. అభిప్రాయాలు వారి సొంతం. వాగుడు మీద జీఎస్టీ లేదు’ అన్నాడు విన్న శ్రోత ముక్తసరిగా. ‘చంద్రబాబుకి కులగజ్జి ఉందంటే... ఇహ ధర్మదేవత లేదను కోవాల్సిందే’ అని ఇద్దరు సీనియర్ మంత్రులు వాపోయారు. మరికొందరు మౌనంగా రోదించారు. ఇంకొందరు సైగలతో వివరిస్తూ బాధపడ్డారు. ‘బాబు కాపులకు కాపు. ఏపీకి పెదకాపు’ అని ఆ సైగకి అర్థంట. ‘పుట్టుకచే కమ్మబాలుడు, ఎదిగినకొద్దీ జగమెరిగిన బ్రాంభడు’ అన్నాడొకాయన జంధ్యం తిప్పుతూ. బేరసారాలలో వైశ్యుడు. చేతి ఎముక పుట్టుక నించి గట్టిపడలేదు. ఠీవి యందు రాజు. బాబు అక్షరమాలలో లకేత్వం, దకి కొమ్ము లేదు. చాకిరీ సేవా భావంలో దళిత తత్వం, శ్రమించడంలో ఆదివాసీ. మైనారిటీలకి దేవుడిచ్చిన మేజర్... ఈ ధోరణిని అడ్డుకుంటూ ఓ పెద్దాయన అస హనంగా ‘అబ్బో! చాలా కవి సమయాలు చెప్పావురా’ అంటూ ముగింపు పలికాడు. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
తలంట్లు... ప్రైవేట్లు
అస్తస్తమానం ఇద్దరూ ఒకరికొకరు ప్రైవేట్ చెప్పేసుకుంటున్నారు. మొన్నామధ్య మోదీ అంకుల్ ఢిల్లీ నించి వచ్చేసి మన అంకుల్‌కి తలంటు పోసేశారు. వెంఠనే మనంకుల్ దోసెడు చమురు ఢిల్లీ అంకుల్‌కి అంటి, బోలెడు కుంకుడు కాయలతో జిడ్డంతా వదిలించి, వేడివేడి నీళ్లతో తలంటోసి తిరిగొచ్చారు. దానికోసానికి అంతంత దూరాలు విమానాలెక్కి తిరగాలా. పనీపాట లేకపోతే సరి అని బామ్మ కోంబడింది. అమరావతి నించి ఇంఖో పాద్ధ విమానంలో ఢిల్లీ వెళ్లిన బాబు అంకుల్ మొట్టికాయకి మొట్టికాయ వేశాడు. లెఖ్ఖ ప్రకారం ఏడో పన్నెండో శొంఠి పిక్కలు అటేపు పెట్టాడు. తిన్న టెంకెజల్లలు లెఖ్ఖ చెప్పాడు. నల్లచొక్కాలేసుకుని కాకుల్లా గోల చేశారని మా బాబాయ్ వ్యాఖ్యానించాడు. అఘోరించలేకపోయాళ్లే అంది బామ్మ. పేపర్ చదివేప్పుడు, టీవీ చూసేప్పుడు బాబాయ్ పాలిటిక్స్... పాలిటిక్స్ అని గొణుగుతూ ఉంటాడు. ఎందుకో ఏవిటో మనకి తెలీదనుకో. జాటర్ డమాల్. అంతే..! బుడుగు, సీగాన పెసూనాంబ సైజు పిల్లలు కూడా ఇక్కడ జరుగుతున్న దశ్యాల్ని చూసి నవ్వుకుంటున్నారు. విజ్ఞులకు హాస్యాస్పదంగా ఉంది. చిన్నప్పుడు పిల్లలకో కథ చెప్పి ఏడిపించేవాళ్లు. ముందు కథకి ‘ఊ’ కొట్టించేవారు. ముసలమ్మ బొంత కుడుతుంటే సూది బావిలో పడింది అనగానే పిల్లలు ఊకొడతారు. ఊకొడితే వస్తుందా? అని నస మొదలుపెడతారు. నవ్వితే వస్తుందా? అరిస్తే వస్తుందా అంటూ బాధిస్తారు. ఈ సన్నివేశంలో ఆ కథ గుర్తొస్తోంది. ‘ప్రధాని మోదీ పరమ ద్రోహి, ఏపీ పచ్చగా ఉంటే చూడలేడు. మనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు... అనే లూప్‌ని ముప్పొద్దులా వల్లిస్తారు చంద్రబాబు. నేను ఇన్ని కోట్లిచ్చా అన్ని కోట్లిచ్చానంటూ పెద్ద పెద్ద ఫిగర్స్ వల్లిస్తారు మోదీ. రామ రామ డబ్బులా? ఎప్పుడిచ్చారు? ఎక్కడిచ్చారు? నేనే పాపం ఎరగను. నా రాష్ట్ర ఓటర్లమీద ఒట్టు అంటున్నారు చంద్రబాబు. అది బావిలో సూది కథలా సాగుతూనే ఉంది. కొనసాగుతూనే ఉంది. సామాన్యుడికి అర్థంకాని మర్మం ఒకటుంది. ఇచ్చింది కేంద్రం, పుచ్చుకుంది రాష్ట్రం– ఈ విషయాన్ని ఇన్ని వ్యవస్థలున్న ఈ ప్రభుత్వాలు నిగ్గు తేల్చలేవా? మొత్తం హిమాలయ పర్వతం ఎన్ని టన్నులు ఎన్ని గ్రాములు తూగుతుందో చెప్పగలిగే టెక్నాలజీ మనకుంది. బంగాళాఖాతంలో ఎన్ని మిల్లీ లీటర్ల నీరుంటుందో తేల్చగల శాస్త్రజ్ఞానం మనకుంది. మరి ఢిల్లీనించీ తరలివచ్చిన ఫండ్స్‌ని రూపాయి, పైసల్లో లెక్కించి తేల్చలేరా? ఇదొక పరమాశ్చర్య సంఘటన. నలుగురు నికార్సయిన పెద్ద మనుషుల్ని, ఓ లెక్కలుకట్టే కంప్యూటర్ని పురమాయించండి. ఎంతిచ్చారు, ఎంత పుచ్చుకున్నారు మొదట తేల్చండి. అవి ఏ విధంగా వినియోగం లేదా కైంకర్యమైనాయో ఇంకో మెట్టులో తేల్చుకోవచ్చు. ఇంత చిన్న విషయానికి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో ప్రజ లకి బొత్తిగా తెలీడం లేదు. అయినా మోదీ మా రాష్ట్రంమీద, మా క్యాపిటల్ మీద మీకెందుకంత ఈర్ష్ష్య? మీరు ఆమధ్య విమానంలో వస్తూ, యక్షుడు ఆకాశమార్గాన అలకాపురిని విమర్శగా దర్శించినట్టు మా విశ్వ నగరాన్ని చూశారు. మీ కళ్లు కుట్టాయి. ఆ ఆకాశహర్మ్యాలు, మయసభని తలదన్నే సభా భవనాలు కాలుష్యమే లేని మహాద్భుత కర్మాగారాలు... ఒకటేమిటి అన్నీ కలిసి మిమ్మల్ని చిత్తభ్రమకు గురిచేశాయ్. ప్రస్తుతానికి కాగితంమీద ఉన్నాయ్. త్వరలో నేలమీదికి వస్తాయ్. అదీ కొసమెరుపు. మళ్లీ బుడుగు తెరమీదికొచ్చి, అయినా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏవిటా తలంట్లు పోసుకోడం అని హాచ్చర్యపడి పోయాడు. మన ఊరి పెద్ద కరణాన్ని పంపిస్తే చిట్టాలు చూసి కూడికలు వేసి లెఖ్ఖ నివిషంలో తేలుస్తాడంది మా బామ్మ. ‘ఇదంతా ఓటు కోసం గాలం’ అన్నాడు నాన్న. మనకేం తెలియదనుకో. బుడుగులకి ఓట్లు బీట్లు ఉండవ్. గాలం అంటే అదొక రకం వల. అయినా డబ్బుల కోసం ఎందుకింత యాగీ పడతారు? మా బామ్మ వత్తుల బుట్టలో కావల్సినన్ని... అడిగితే చచ్చినా ఇవ్వదు. మీరే పట్టికెళ్లండి. డబ్బు మిగిల్తే నాకో నిఝం రైలింజను కొనిపెట్టండి. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
ఎన్నికల చక్రం
చూస్తుండగా కాలం గిర్రున తిరిగొచ్చింది. ఎన్నికలు మళ్లీ రానే వస్తున్నాయ్. నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నడంలో మునిగి తేలుతున్నారు. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్లు నూటికి నూరు శాతం ఓట్ల బడ్జెట్‌గానే అంతా నిర్ధారించారు. అయినా జనం మాయలో పడు తూనే ఉంటారు. భ్రమలోపడి, ఆ మాటలు నమ్మి మీటనొక్కి వస్తుంటారు. వేలికి నల్లమచ్చ పొడిపించుకుని గంపెడాశతో బయటకొస్తారు. అక్కడ నుంచి నెలా రెండు నెలలు ఇంకో డ్రామాకి తెర లేస్తుంది. అంకాల వారీగా అది పూర్తవుతుంది. పదవుల్ని పంచుకుంటారు. అంతా సంకల్పాలు చెప్పి కంకణాలు ధరిస్తారు. కొత్త చాంబర్లు, కొత్తకార్లు అన్నీ ప్రజాసేవలోకి దిగుతాయ్. అసంతృప్తులు కూడా తొంగి చూడటం ప్రారంభం అవుతుంది. ఇక్కడికి ఆరు నెలల పుణ్యకాలం గడిచిపోతుంది. మళ్లీ చలికాలం మొదలవుతుంది. పది పన్నెండుసార్లుగా కోటి ఆశలతో ఓట్లు వేస్తున్న వారికి అవే అవే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయ్. ప్రజా సమస్యల మీద నుంచి ప్రభుత్వాలు దృష్టి మళ్లించి నాలుగైదు నెలలు దాటింది. పాత మాటలు పక్కనపెట్టి సర్కార్లు కొత్త వాగ్దానాలు చేస్తున్నాయ్. ఈ మధ్య ఒక పెద్దాయన, ‘ఇప్పుడు జనాభాకి మునుపటిలో అయోమయంగానీ తికమకగానీ లేదండీ. స్పష్టంగా అనుకునే ఓట్లు వేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘మంచి ధరకి ఓటు వేస్తున్నారు కొందరు, మనవాడని వేస్తున్నారు కొందరు. అందుకని మాయ మాటల్లో పడే సమస్యే లేదు’ అని ముక్తాయించారు. ఓటర్ ప్రజకు వడ్డించాల్సిన భక్ష్యాలన్నీ ప్రభుత్వాలు బడ్జెట్ విస్తట్లో వడ్డించాయ్. వాళ్లకి అందులో తినేవి ఏవో ఉత్తుత్తివేవో అర్థం కాలేదు. ఇవ్వాల్సిన వరాలన్నీ ఇచ్చేశారు. ఇప్పుడింకా కొత్త జల్లులు పడే అవకాశం లేదు. సమయం దాపురించేసింది. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపాలో తేల్చుకున్నారని చాలామంది స్పష్టంగా చెబుతున్నారు. అభ్యర్థి తేలితే అంతా ఖరారేనంటున్నారు. అన్ని వర్గాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయ్. అన్నింటినీ ప్రజ సమభావంతోనే స్వీకరిస్తోంది. మన దేశంలో నేతల ఆరోపణలన్నీ సీరియస్‌గా తీసుకోవడం జనం మానేసి చాలా కాలమైంది. అవి చాలాసార్లు కాలక్షేపం, కొన్నిసార్లు వినోదంగా మారాయి. స్వతంత్రం రాకముందు నుంచి రైతు సమస్యల గురించి మన నాయకులు ఉద్ఘోషిస్తున్నారు. గాంధీ గ్రామ స్వరాజ్యం మీద కలలు కన్నారు. గ్రామసీమలు చూస్తుండగా దివాళా తీశాయి. రైతుకి సిమెంటు రోడ్డు కంటే నీరు పారే పంటకాలువ, మురుగు కాలువ ముఖ్యం. వాటిని ఏ ప్రభుత్వం పట్టించుకోదు. పట్టించుకున్నా వాటికి కమిటీలు వేసి, రాజకీయం చేసి వదులుతారు. ఏదో వంకన అస్మదీయుల్ని పెంచి పోషించడమే అవుతుంది. ప్రభుత్వం పెట్టే ఏ పథకంలో లబ్ధి పొందాలన్నా, ముందు విధిగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలి. ఇది అందరికీ తెలిసిన సత్యం. గ్రామాలు అనేక కారణాల వల్ల మరుగున పడిపోయాయి. ఆదాయాలు లేవు, బతుకు తెరువులు లేవు. పట్నవాసంతో సమంగా ఖర్చులు పెరిగాయి. విద్య, వైద్య సౌకర్యాలు పూజ్యం. వలసలకి ఇదే కారణం. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, డాక్టర్లో ఇతర చిరుద్యోగులు గ్రామంలో ఉండరు. దగ్గర బస్తీలో మకాం పెడతారు. గుళ్లో పూజారి సైతం నగరంవైపు పరుగులు పెడతాడు. వాళ్ల పిల్లలకీ చదువులు కావాలి. వారి పెద్దలకీ వైద్యం కావాలి. వాళ్లకీ వ్యాపకం, వినోదం కావాలి. ఈ తరుణంలో ఓట్ల ప్రస్తావనలు వచ్చి, అందరికీ పల్లెలు గుర్తొస్తాయి. నివాసయోగ్యంగా సకల సదుపాయాలతో ఉన్న గ్రామాలు చాలా తక్కువ. గడిచిన నాలుగైదు దశాబ్దాలలో పల్లెలు కళా విహీనమయ్యాయి. అన్నీ పట్టించుకునే మీడియా కూడా గ్రామ ప్రాంతాలను పట్టించుకోదు. గ్రామంలో కుక్కని మనిషి కరిచినా అది వార్త కాదు. జానపద కళల అభివృద్ధికి, కొన్ని క్రీడలకి గ్రామాలు ఆటపట్టుగా నిలుస్తాయ్– అభివృద్ధి చేస్తే. అన్ని క్రీడలకు పుట్టిల్లు పల్లెటూళ్లేనని మర్చిపోకూడదు. పల్లెని విస్మరించడమంటే తల్లిని విస్మరించడమే! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అతి లౌక్య బడ్జెట్!
మొన్న మహాత్మాగాంధీ అమరుడైన రోజు, ప్రధాని మోదీ స్టూడెంట్ కుర్రాళ్లకి, వారి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు ఢిల్లీ తాలక్‌టోరా స్టేడియంలో మంచి క్లాసు పీకారు. ‘పరీక్షలు పండగలా ఉండాలి’ అనగానే, ‘అబ్బో! ఎలక్షన్లు మాత్రం ఉండద్దా’ అని ఓ తెలుగు కుర్రాడు గొణిగాడు. ‘మీరు పరీక్షల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి’ అని మోదీ అంటే ‘ఆప్ భీ’ అన్నదొక హిందీ అమ్మాయి. ‘జీవితంలో పరీక్షలు ఒక భాగమే తప్ప జీవిత సర్వస్వం కాదు’ అనగానే ‘ఎలక్షన్ల లాగా’నే అంటూ ఓ కుర్రాడు అందించాడు. ‘పిల్లలెప్పుడూ తుళ్లుతూ నవ్వుతూ ఉండాలి’ అన్నారు గంభీరంగా ప్రసంగ ధోరణిలో. అందరూ ఒక్కసారి ఫెళ్లున నవ్వారు. ఎందుకంటే ప్రధాని నవ్వడం వాళ్లెప్పుడూ పొరబాటున కూడా చూడలేదుట. భారత పూర్వ ప్రధాని చిరునవ్వడం వారి తండ్రి ఒకసారి కళ్లారా చూశారట. మరో ప్రధాని మన్మోహన్ నవ్వడం చూసిన పెద్దలు ఒకరిద్దరా సభలో ఉన్నారట. మోదీయే కాదు, ఆయన మంత్రివర్గంలో కూడా ఎవ్వరూ నవ్వరు. నీతిపరులు గంభీరంగా ఉండాలని నవ్వుతారు. పెద్ద పెద్ద జడ్జీలు, గవర్నర్లు సాధారణంగా నవ్వరు. పిల్లల్ని ఇంకొకరితో పోల్చి తక్కువ చేయవద్దని మోదీ చెప్పారు. బీజేపీ మాత్రం పోల్చుకుని అనవసరంగా పోటీ పడటం దేనికి? రేపు ఎన్నికల్లో తేడాపడితే దేశ సేవ చేయడానికి ఇంకొకరికి సువర్ణ అవకాశం వస్తుంది. మోదీ ఎక్కడున్నా ప్రజాసేవ మితం లేకుండా చెయ్యొచ్చు. స్వేచ్ఛగా బోలెడు ఉద్యమాలు చెయ్యొచ్చు. అసలు ఓం ప్రథమంగా రామమందిర నిర్మాణం మీద మహోద్యమం తీయచ్చు. దీంతో ఏంటంటే గుడి వచ్చినా రాకపోయినా, కొన్ని వర్గాల్లో గొప్ప కీర్తి మిగుల్తుంది. మొన్న పిల్లలకి వైఫల్యం నుంచి విజయం సాధించాలని చెప్పారు. ఇట్లాంటివి చెప్పడానికి భలే ఉంటాయి, కానీ వింటుంటే చెవుల్లో సెగలొస్తాయన్నాడొక స్టూడెంటు. ‘చదువు పుస్తకాల్లో మాత్రమే ఉండదు. పుస్తకాల్లోనూ ఉంటుంది’. విన్నావా, మనం కూడా మంత్రులమై ఇట్లా మాట్లాడాలిరా. వీళ్లకంటే కాషాయ డ్రెస్ వేసుకుని మాట్లాడే ప్యూర్ వేదాంతులు నయమని ఓ అమ్మాయి తెగ వేష్ట పడింది. మా స్కూలు టీచరు, మా గుళ్లో పూజారి వీళ్లు కూడా ఇవే మాటలు చెబుతుంటారు– వినే వాళ్లుంటే. పాపం వాళ్లకెవరూ ఉండరు. చాలా పెద్దాయన కాబట్టి ఎక్కడ చూసినా మైకులే– ఎవరూ విన్నా వినకపోయినా. రేడియోలు, టీవీలు మోదీ సందేశాన్ని వినిపించాయ్. అవన్నీ రేపెప్పుడో పుస్తకాలుగా వస్తాయ్. పాఠ్యగ్రంథాలు అవుతాయ్. కానీ ఆయన పవర్లో ఉండాలి. మనమే చచ్చినట్టు నిశ్శబ్దంగా వింటాం. ఇవ్వాళ పెద్ద పెద్ద వాళ్లు బడ్జెట్ సభలో తెగ కేకలు పెట్టారని పిల్లలు అనుకున్నారు. ‘ఔను, వాళ్లంటే సాటి సమానస్తులు కదా. వాళ్లకేం భయం’ అని కొందరు సమర్థించారు. బడ్జెట్ అన్నా తాయిలాలన్నా ఒకటేనా అని పిల్లలకి ధర్మ సందేహం వచ్చింది. ఎన్నికల ముందే అమ్మనాన్నలకి, మేష్టారికి మంచి చేస్తారెందుకు. ఇంకాస్త ముందు చెయ్యచ్చుకదా అని పిల్లలకి సందేహం వచ్చింది. ‘మంచి చేయడానికి ఓటు వేయడానికి ఎక్కువ టైం ఉంటే మర్చిపోరూ’ – ఓ పెద్ద కుర్రాడు దీర్ఘం తీశాడు. అసలిది గొర్రెతోక బడ్జెట్ట. కోతి తోకది తర్వాత వస్తుందిట– ఓ పెద్దాయన టీవీలో చెబుతున్నాడు. ఏ తోక అయితేనేంగానీ నేనెప్పుడూ ఏటా బడ్జెట్ ప్రసంగం శ్రద్ధగా వింటా. బంగారం, పెట్రోలు లాంటి వాటిపై పన్నులు రాయితీలు నేనసలు పట్టించుకోను. వాటిమీద ఉండేది కూడా స్వల్పంగానే ఉంటుంది. నాకు వినబుద్ధి అయ్యేవి, గుండు సూదులు, తుంగచాపలు, ఎర్రరంగు మొలతాళ్లు, కుక్కల మెడ బెల్టులు, నిక్కరు గుండీలు, సీళ్లలక్క, చింతరావి మామిడి కొయ్యలతో చేసిన పాంకోళ్లపై పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇంకా ఇట్లాంటివే బోలెడుంటాయి. ఈసారి మోదీ బడ్జెట్ అతిలౌక్యంగా కొట్టాడన్నాడొక గ్రామపెద్ద. మావూరి చిన్న టీకొట్లో స్ట్రాంగ్‌గా కావాలా, లైట్‌గా కావాలా అని అడిగితే ‘లౌక్యంగా కొట్టు’ అనడం అలవాటు. అంటే అటూ ఇటూ కాకుండా అని అర్థం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఎవరి మేళం వారిది!
మా ఊళ్లో పోలేరమ్మ గుడి ఉంది. ఏటా ఆ గ్రామ దేవతకి జాతర జరుగుతుంది. ఎవరి పద్ధతిలో వాళ్లు పూజలు చేస్తారు. మొక్కులు తీరుస్తారు. పోటాపోటీగా జాతర నిర్వహిస్తారు. గ్రామ దేవతకి ఊళ్లో వాద్య కళాకారులంతా తమతమ వాద్యగోష్ఠితో సంగీత నివేదన చేస్తారు. డప్పులు వాయించే కళాకారులు, డోలు వాయిద్యాలు, బాకాలూదేవారు, బ్యాండ్ సెట్లో ఇత్తడి బూరాలు వాయించే వాళ్లు ఇలా రకరకాల వాళ్లు అమ్మవారి గుడిచుట్టూ చేరి తమ భక్తిని అపారంగా ప్రదర్శిస్తారు. మా ఊళ్లో రెండు వర్గాలుంటాయ్ హీనపక్షంగా. రెండో వర్గం డప్పులు, బ్యాండ్లు మంచి సెగలో వేడెక్కించి అమ్మోరి గుడిచుట్టూ మోహరించేది. తాషా మరపాలు, రామ డోళ్లు, ఇంకా రకరకాల తోలు వాయిద్యాలు వాటి శ్రుతుల్లో అవి మోగిపోతూ ఉంటాయ్. నాదస్వరం, క్లారినెట్లు, మెడకి వేసుకున్న హార్మణీ పెట్టెలు వాటికొచ్చిన సంగీతాన్ని అవి సొంత బాణీల్లో వినిపిస్తూ ఉంటాయ్. వాద్యకారులందరికీ పోలేరమ్మమీద భక్తే. ఏ ఒక్కరినీ శంకిం చలేం. మధ్యమధ్య ఊదుడు శంఖాలున్న జంగందేవర్లు శంఖనాదాలు చేస్తుంటారు. ఇంకా బోలెడు సందళ్లు. వీటన్నింటినీ ఏకకాలంలో మూకుమ్మడిగా గంటల తరబడి వినడమంటే ఇహ ఆలోచించండి. పైగా వర్గపోటీలో రెచ్చిపోయి వాయిస్తూ ఉంటారు. వాళ్లని ఎవ్వరూ అదుపులో పెట్టలేరు. ఆ.. వూ... అనలేరు. వింటూ చచ్చినట్టు ఆ శిక్ష అందరూ అనుభవించాల్సిందే. ఆ కారణంగా కుర్రతనంలో నాకు మొదటిసారి దేవుడు లేడేమోనని సందేహం వచ్చింది. నిజంగా ఉంటే జాతరలో భక్తులు చేస్తున్న ఈ రణ గొణ ధ్వనులను ఏ అమ్మవారైనా, ఏ అయ్యోరైనా ఎందుకు వారించరు? గుడ్లురిమి ఎందుకు భయపెట్టరు? వారి మనస్సుల్లో ప్రవేశించి, గ్రామానికి శాంతి ఏల ప్రసాదించరు? ఇలా పరిపరి విధాల అనుకుంటూ దేవుడి ఉనికిని శంకించేవాణ్ణి. ఆ ముక్క చెబితే, మా నాయనమ్మ గుంజీలు తీయించి, చెంపలు వేయించి, నా చేత తలస్నానం చేయించేది. ఆ తర్వాత మళ్లీ పోలేరమ్మ మీద నమ్మకం కుదిరేది. ఈ మహా కూటముల తిరనాళ్లు చూస్తుంటే మా వూరి జాతర మేళం గుర్తొస్తుంది. అందరి లక్ష్యమూ ఒక్కటే. ఉన్నవాళ్లని ఇప్పుడు కుర్చీలోంచి దింపాలి. వీళ్లు పవర్లోకి రావాలి. ఇప్పుడు ఉన్నాయన ప్రజ లకు చాలా అన్యాయం చేస్తున్నారు, మేం మిమ్మల్ని రక్షిస్తాం–అనే ఉమ్మడి నినాదంతో ఇంటింటికీ వస్తారు. ర్యాలీలు, భారీ సభలు నిర్వహిస్తారు. ఓటర్లు మరొక్కసారి బోనులో పడకపోతారా అని కూటమి పిచ్చి నమ్మకంతో ఉంది. ఈ జగత్తు యావత్తూ ఒక పెద్ద వల. తెల్లారిన దగ్గర్నించి జీవిని జీవి వలలో వేసుకోవడమే లక్ష్యం. పురుగుని కప్ప, కప్పని పాము, పాముని డేగ, డేగని వేటగాడు ఇలా ఒక వలయం చుట్టూ వేట సాగు తుంది. నిద్ర లేవకుండానే, సాలెపురుగు వల అల్లడం మొదలుపెడుతుంది. జింక కోసం పులి పొంచి ఉంటుంది. నోటి సైజులని బట్టి చేపలు చేపల కోసం పరుగులు పెడుతుంటాయ్. కొంగ ఒంటికాలి మీద జపంలో నుంచుంటుంది. ఏ జీవి లక్ష్యమైనా కావల్సిన ఆహారం సంపాయించుకోవడమే. నాయకుడికి కావల్సిన మేత ఓట్లు. పవర్ చేతికొస్తే మనదేశంలో కామధేనువుని పాకలో కట్టేసుకున్నట్టే. కల్పతరువుని పెరట్లో నాటినట్టే. పవ రుంటే సర్వభోగాలు ఉన్నట్టే. వారికి వారి నియర్ అండ్ డియర్‌కి చట్టాలు వర్తించవు. అవసరమైతే ఒక్కోసారి తెగించి వాళ్లు ప్రజాసేవ కూడా చెయ్యొచ్చు. మిగతాప్పుడు ఎలా ఉన్నా ఈ గణతంత్ర దినోత్సవం రోజు భారత జాతి గర్వంగా, తలెత్తి జాతీయ పతాకానికి శాల్యూట్ కొడుతుంది. మూడు సింహాల మొహర్ చాలా శౌర్యాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలున్నట్టు, మనది నాలుగుసింహాల ముద్ర. వెనకపడిన నాలుగో సింహం ఏ మాత్రం చైతన్యవంతంగా లేదన్నది మాత్రం నిజం. అందుకే నాలుగో సింహానికి కూడా శాల్యూట్ కొడదాం! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
ఇంక మా మధ్య బాకీలుండవ్..!
సడీ చప్పుడూ లేదు. అంతా సద్దుమణిగింది. పొగ లేదు. దుమ్ము లేదు. కాలుష్యం లేదు. తిట్లు లేవు. శాపనార్థాలు లేవు. మొత్తం మీద నేతలందర్నీ శుద్ధి చేశారు. పరస్పరం తలంట్లు పోసుకున్నారు. ఇదొక చిన్న విరామం. రోజు రోజూ కరిగిపోయి ఓట్ల పండుగ రానే వచ్చింది. అయిదేళ్లకోసారి వచ్చే ఓట్ల మేళా. పార్టీల జాతకాలు తిరగరాసే ముఖ్య ఘట్టం. దేశభక్తి మసకబారి రాజకీయం పూర్తి వ్యాపారం అయినప్పటి నించి ఓట్లకి రేట్లు వచ్చాయ్. అంతకుముందు గాలికి, నీళ్లకి, మట్టికి ధరలుంటాయని మనకి తెలియదు. యాభై ఏళ్లనాడు గ్రామ పెద్దలు సూచించిన గుర్తుకి ఓటు వేస్తుండేవారు ఎక్కువమంది. మంచి చెడు మనకి తెలియదు, ఆ పెద్దోళ్లకి తెలుస్తుందని నమ్మేవారు. అదొక పుణ్యకాలం. కాల క్రమంలో పెద్ద మనుషులు అంతరించారు. సామాన్య ప్రజానీకం ఎవర్ని నమ్మాలో తెలియని అయోమయంలో పడ్డారు. క్రమేపీ అందరికీ లోకం పోకడ అర్థమవుతూ వచ్చింది. ఓటు అమూల్యమైందనే సిద్ధాంతం నించి దానికో మూల్యం ఉంది అనే సత్యంలోకి వచ్చింది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎవరికెవరు రుణపడాల్సిన పన్లేదనే సూత్రం అమల్లోకి వచ్చింది. ‘నాయకులు కావల్సినన్ని వాగ్దానాలు గుప్పించారు. కానీ ఏదీ నాకు దక్కింది లేదు. నా విలువైన ఓటుని మాటలతో దక్కించుకున్నారు. నేనింకా మోసపోను. నా హక్కుని డిమాండ్‌ని బట్టి అమ్మేసి సొమ్ము చేసుకుంటాను. ఇంక మా మధ్య బాకీలుండవ్’ అనే లాజిక్‌ని ఎక్కువమంది అనుసరిస్తున్నారు. అక్కడనించి ఎన్నికలు చాలా ఖరీదైన జూదంగా మారింది. పోటీ చేయడమంటే కోట్లతో వ్యవహారం. దీన్ని పెట్టుబడిగానే భావిస్తారు. కొన్నిసార్లు వ్యాపారం కలిసొస్తుంది. కొన్నిసార్లు రాదు. ఒక విశ్లేషకుడు ఏమన్నాడంటే– మనకి సగటు మనిషి కాకుండా, మేధావి అయినవాడు మేధావినని అనుకొనేవాడు ఉన్నారు. ఈ మేధావులు తప్పులోనో పప్పులోనో కాలువేసేవారే. సగటు మనిషి గాడిదలా ఆలోచించి తప్పిపోయిన గాడిద జాడని పసిగడతాడు. ప్రజలనాడిని పట్టుకున్నవాడే పొలిటీషియన్. నేటి మనిషి ఇన్స్టెంట్ తిండికి, బతుక్కి అలవాటు పడ్డాడు.‘నేనొక పెద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తా. అయిదేళ్లలో లక్ష ఎకరాలకి నీళ్లు, పదివేల మందికి ఉపాధి’ అని దణ్ణాలు పెట్టి చెప్పినా ఎవరూ వినిపించుకోరు. అదే రేపట్నించి రేషన్‌కార్డ్ మీద ఉప్పుతో పదహారూ ఇస్తామంటే తలలూపుతారు. అందుకే నెలవారీ పింఛన్ పథకాలు సూపర్‌హిట్ నినాదం. రెండుగదుల ఇల్లు కట్టించి ఇస్తారట. ఇచ్చేదాకా ఏటా యాభైవేలు అపరాధ రుసుం చెల్లిస్తారట. ఎంత ఔదార్యం!? మీ దరిద్రాన్ని ఏకమొత్తంగా రూపుమాపే పథకాలున్నాయని ఎవరూ చెప్పరు. జన సామాన్య ఓటర్ దరిద్రాన్నీ అలాగే పోషిస్తూ, ప్రజల సొమ్మునే కొంచెం కొంచెం చిలకరిస్తూ రాజరికం అనుభవించడమే నేటి మన ప్రజాస్వామ్యం. ఒక రోడ్డు వేస్తే, ఒక వంతెన కడితే వాటి గురించి మళ్లీ ఎన్నికల దాకా డప్పు కొట్టుకునే నేతలు ప్రజా సేవకులా? కనీస బాధ్యతలు నిర్వర్తించడం కూడా మహా త్యాగంగా చెప్పుకోవడం నేటి మన నాయకుల నైజం అయింది. పవర్ కోసం పడుతున్న ఆరాటం చూస్తుంటేనే రాజకీయం ఎంత లాభసాటి వ్యవహారమో అర్థమవుతుంది. అందుకే ప్రజలు ఓటు వేయడానికే కాదు, ఊకదంపుడు ఉపన్యాసాలకు వచ్చి కూచోడానికి కూడా రేట్లు నిర్ణయించుకున్నారు. రాజకీయ నాయకులు తమ సభలకి తామే జనాన్ని తోలి, తిరిగి వారే వారిని చూసి ముగ్ధులైపోవడం. దీన్నే ‘ఆత్మలోకంలో దివాలా’ అంటారు. ఎన్నికల వేళ అంతా కట్టుదిట్టం చేశామంటారు. నిజమే ఈ రెండ్రోజులూ లిక్కర్ షాపులు బంద్ చేశారట. ఎప్పుడూ వ్యసనపరుడు మందుచూపుతో అప్రమత్తంగా ఉంటాడు. దాదాపు నెలరోజులుగా కొన్ని నిర్జన ప్రాంతాల్లో మందుపాతర్లు వెలిశాయని చెప్పుకుంటున్నారు. గడచిన కొద్ది రోజులుగా షాపుల్లో మందు అమ్మకాల గ్రాఫ్‌ని చూస్తే కథ అర్థమవుతుంది. డబ్బు అన్ని సెంటర్లకీ చాపకింద నీళ్లలా ఎప్పుడో పాకింది. గమనించండి, ఈ మహోత్సవ వేళ ఏ మందుబాబైనా పొడిగా పొద్దుపుచ్చుతాడేమో! ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో ఓటు రేటు నిర్ధారణ అయింది. పోటీ చేసే వారిలో ఇద్దరూ డబ్బు పంచుతారు. ‘ఇద్దరి దగ్గరా తీసుకోండి. ఓటు మాత్రం నాకే వెయ్యండి’ అని ఎవరికి వారే ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నారు. శ్రీ రమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఒకే ఒక నేను! –నేను
అసలు లీడరు ధారాళంగా ఉపన్యసిస్తూ ఉంటాడు. గంభీరంగా, విసుర్లతో, కసుర్లతో, చేసిన సేవ, మిగిలిన ప్రజాసేవని చెప్పుకుంటూ వెళ్తారు. ఇక్కడో సంప్రదాయం ఉంది. మహా నేత ఏ సభలో ప్రసంగిస్తుంటే ఆ ప్రాంతపు అభ్యర్థి ఎడమవైపున ఒద్దికగా నిలబడి ఉంటారు. క్యాండిడేటు నుదుట చిందరవందరగా వీర తిలకాలు అద్దించుకుని, అలిసిన ముఖంతో, మెడలో పార్టీ కండువాలతో నిలబడి విశాలమైన నవ్వుతో అర్ధ వృత్తాకారంలో మొహం తిప్పుతూ శ్రమిస్తుంటారు. ‘... వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటే మీకు సిగ్గులేదా అని అడుగుతున్నా’ ఆవేశంగా ప్రశ్నిస్తాడు నేత. అభ్యర్థి అదే నవ్వుతో చేతులు జోడించి మరీ ప్రేక్షకులవంక తలతిప్పుతాడు. ‘.. శరం లేదా? బుద్ధి జ్ఞానం లేదా? అని అడుగుతున్నా?’ క్యాండిడేటు అదే యాక్షన్ యాంత్రికంగా చేస్తారు. ‘...అవసరమైతే వ్యవసాయానికే కాదు, ఇళ్లక్కూడా ఉచిత విద్యుత్తు ఇస్తాం. ప్రజాక్షేమమే నాకు ముఖ్యం. ఈ సంగతి మీకు బాగా తెల్సు’. మళ్లీ విశాలమైన నవ్వు.. జనం చప్పట్లలోంచి కని పిస్తుంది. అభ్యర్థి వెక్కిరిస్తున్నాడా, సానుకూలంగా స్పందిస్తున్నాడా అర్థం కాదు. వినిపించే స్పీచ్‌కి, కన్పించే ముఖ కవళికలకి పొంతనే ఉండదు. జాతీయ నేతలొచ్చినప్పుడు అనువాదకులు వేరేమైకులో సిద్ధంగా ఉంటారు. మూల ప్రసంగానికి తెలుగుసేతకి అస్సలు సంబంధం ఉండదు. ఆ మధ్య ఒక పెద్దాయనకి తన మాటలకి అంతగా అన్నిసార్లు నవ్వుతున్నారేమిటని అనుమానం వచ్చిందిట. తీరా ఆరాతీస్తే అదంతా అనువాదకుడి సొంత పొగడ్తల వల్లనేనని అర్థమైందిట. ఏమైతేనేం తన స్పీచ్ అందర్నీ అలరించిందని ఆనందించాడట. పాపం, మన నేతలు అల్పసంతోషులు. మొన్న మా సెంటర్లో రోడ్ షో దర్శించే మహదవకాశం దొరికింది. అబ్బో, అదొక పెద్ద సందడి. ‘వీటిని ఎదురుపడకుండా చూడాలి. ఇదొక పెద్ద న్యూసెన్సు’ అని చిరాకుపడ్డాడొక పోలీస్ అధికారి. రోడ్ షోలో ఒకర్ని మించి ఒకరు అవాకులు చెవాకులు పేల్తున్నారు. ‘నాకు పోటీగా నిలబడ్డ వ్యక్తి తాహతేంటో మీ అందరికీ బాగా తెలుసు. ఒకప్పుడు నేనున్న పార్టీలోనే ఉన్నాడు. డ్రైనేజీ గుంటల్లో పూడికలు తీసే కాంట్రాక్టుల్లో అడ్డంగా సంపాయించాడు. బతుక్కి కనీసం ఈరోజుకి బీపీగానీ షుగర్‌గానీ లేదు. ఏవిటీయన చేసే ప్రజాసేవ? మళ్లీ అయిదేళ్లకిగానీ చిగురించని మీ విలువైన ఓటుని ఈ అర్హత లేని వాడికి వేస్తారా? ఆలోచించండి. నేను రెండేళ్ల క్రితం గుండె బైపాస్ చేయించుకున్నా. నా బామ్మరిది ఈ మధ్యనే కిడ్నీ మార్పించుకున్నాడు. నా డ్రైవర్‌కి రెండు స్టెంట్లు వేయించి ఖర్చంతా నేనే భరించా’. మీకు తీరిక ఓపిక ఉండాలేగానీ ఇలాంటి ప్రసంగాలు కావల్సినన్ని. చంద్రబాబు ప్రసంగాలు అరిగిపోయిన రికార్డులు. దేశ ప్రజల సంక్షేమంతప్ప వేరే ఆకాంక్ష లేదు. అవసరమైతే అందుకు కేసీఆర్‌తో అయినా కరచాలనం చేస్తారు. టీడీపీని తెలంగాణలో గెలి పించడం కూడా చారిత్రక అవసరమేనా? చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి. తెలంగాణలో కొన్ని తప్ప మిగతావన్నీ చంద్రబాబు చలవేనని స్వయంగా చెప్పుకుంటున్నారు. వారి ప్రసంగ పాఠాలు వినగా వినగా అవే కలల్లోకి వచ్చి పీడిస్తున్నాయ్. నిన్న పట్టపగలు నాకో పీడకల వచ్చింది. ఢిల్లీ రాజకోట ముందు పెద్ద వేదికమీద విక్టోరియా రాణి ఇంగ్లిష్ యాసలో మాట్లాడుతోంది. ‘మద్రాస్ నించి కలకత్తా రైల్వేలైను నేనే వేశా, సముద్రం ఉన్నచోట లేనిచోట కూడా హార్బర్లు నేనే కట్టించా, ఊటీ కొండకి రోడ్లు వేయించా, నా హయాంలో సిటీలన్నీ డెవలప్ చేశా, రోడ్లన్నీ వెడల్పు చేశా’ ఇలా నడిచింది. అంతా విస్తుపోయి వింటున్నారు. తర్వాత సూటుబూటులో వచ్చి మౌంట్‌బాటన్ మాట్లాడాడు. ‘ఇండియాకి సంస్కృతీ సంప్రదాయాలు మేమే నేర్పాము’ ఇక ఆపైన జనం మాట సాగనియ్యలేదు. జనం హాహాకారాలకి నేను ఉలిక్కిపడి లేచాను. కల చెదిరింది. ప్రజాస్వామ్యంలో ప్రజాధనంతో ప్రజా సహకారంతో ప్రజోపయోగం కోసం చేసే పనులు నేతలు తమ సొంత ఖాతాలో వేసుకోవడం నేరం కాదా? వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
పట్టు కలవాలి!
పూర్వం సిండికేట్ అనే వారు. ఇప్పుడు తెలుగులో మహాకూటమి, ప్రజాకూ టమి అనే పేర్లతో వ్యవహ రిస్తున్నారు. ‘ఇదొక కాక్ టైల్ కూటమి, ఇదో క్లబ్ పార్టీ’ అన్నాడొక నాగరి కుడు. నాయకుల్ని ఏకం చేయగలిగింది పదవీ వ్యామోహం ఒక్కటేనని ఓ పెద్దాయన తీర్మానించాడు. ‘ఈ మాత్రం ఐకమత్యం దేశ సమస్యలప్పుడుం టేనా... రాష్ట్రాలన్నీ చిన్న చిన్న రామరాజ్యాలైపో తాయ్’ ఒక పెద్దావిడ నిట్టూర్చింది. ‘ఈ మహా కూటమిలో కట్టు కట్టిన వారంతా మహానుభావులు. గొప్ప గొప్ప ఆలోచనలున్నవారు. సొంత ఫిలాసఫీ, ఎజెండాలున్నవాళ్లు. వీళ్లు చివరికి ఎట్లా కలుస్తారండీ. నూకలు, మైదాపిండి, గులక రాళ్లు, నీళ్లు కలిపినట్టు అవుతుందండీ. మీకేమనిపిస్తోంది’ అని సూటిగా నిలదీశాడు. ‘ఇదివరకు ఇలా చాలా కూటములు వెలి శాయండీ. బలం కూడదీసుకోడానికి ఇదొక మార్గం’ అని నీళ్లు నమిలాను. చంద్రబాబు అన్నిస్థాయిల్లో కూటములు తయారు చేసేట్టున్నాడు. మోదీని చిత్తుచేసి దేశ రాజ్యాంగాన్ని నిలిపే ఉద్యమంలో తిరుగుతున్నాడు. ప్రయోగాత్మకంగా తెలంగాణలో కూటమిలో చేరిపో యారు. ఏ మాత్రం సంకోచించకుండా కాంగ్రెస్‌తో సైతం కరచాలనం చేసేశారు. చాలామంది ‘ఔరా’ అనుకుంటూ ముక్కున వేలేసుకుంటే, ఆ చర్య మూసీ ప్రభావంవల్లగానీ మా చర్యవల్ల కాదని చంద్రబాబు సమర్థించుకుంటున్నారు. ప్రతి కూటమి వెనక స్వార్థం ఉంటుంది. గొప్ప సేవాభావం అయితే ఉండదు. సరైన కొలతలు లేని ఒక చిత్రమైన ఆకృతిలో జంతువు తయారవుతుంది. అయిదుకాళ్లు, రెండు తోకలు, చిన్న తొండంతో ఉంటుంది. భావసారూప్యత లేక నాలుగుకాళ్లు నాలుగు పొడుగుల్లో ఉంటాయి. గిట్టలు, పాదాలు ఇలా రకరకాలు. పాపం, అది అడుగు ముందుకు వెయ్యాలంటేనే పెద్ద ప్రయత్నం చెయ్యాలి. అదింకా జాతిని పరుగులెలా పెట్టిస్తుందో తెలియదు. పాత జానపద కథ ఒకటుంది. రాజరికాలు నడిచే రోజుల్లో కూడా సింహాసనం కోసం ఎప్పుడూ ఓ యుద్ధం నిశ్శబ్దంగా సాగుతూ ఉండేది. యుద్ధ మంటే అవతలివారి ఆశ. బలమైన కోరిక. తమ శక్తియుక్తులన్నీ ప్రయోగించి నిరంతరం ప్రయత్నాలు సాగిస్తూ ఉండేవారు. కథ ఏంటంటే– ఒక అడవిలో ఒక బండినిండా ధాన్యం ఉంది. కానీ బండి లాగడానికి ఎడ్లు లేవు. అది గమనించిన ఒక గద్దకి ఆలోచన వచ్చింది. మరో నలుగురితో జతకట్టి, ఆ బండిని వేరే చోటికి చేర్చి, హాయిగా పంచుకు తినాలని ఆలోచన చేసింది. గద్ద దగ్గర్లో ఉన్న సొర చేపని, ఎండ్రకాయని సంప్రదించ బోయింది. అవి గద్ద రెక్కల చప్పుడు వినగానే బొరి యలోకి, నదిలోకి పోయి దాక్కున్నాయి. ఎట్లాగో నచ్చచెప్పి, సంగతి వివరించి ఒప్పించింది. గబ్బి లంతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. బండి కాడికి అటూఇటూ సొర చేపను, ఎండ్రకాయను కట్టింది. కాడిని మధ్యలో తనే ఎత్తిపట్టింది. గబ్బిలం వెనకాల తలక్రిందులుగా వేలాడుతూ ఆలోచన చేస్తోంది. కాడిని గద్ద బలంగా పైకి లేపింది. ఎంత సేప టికీ సొరచేప నీళ్లవైపు లాగుతోంది. రెండోవైపు ఎండ్రకాయ దాని సహజమైన అడ్డధోరణిలో పక్కకి పెడలాగుతోంది. గబ్బిలం తలక్రిందు ఆలోచనలతో తపస్సు చేస్తోంది. బండి ఎటూ కదలడం లేదు. ముందుకీ కదలడం లేదు. పక్కకి అసలే లేదు. బండి సక్రమంగా ముందుకు వెళ్లాలంటే పట్టు కలవాలి. అది ఏకోన్ముఖంగా సక్రమంగా ఉండాలి. అదీ కథ. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
కార్తీక వన రాజకీయాలు
రాజకీయం ఏ అవకాశాన్నీ వదులుకోదు. అసలు రాజకీయం అంటేనే అది. ఈసారి మంచి తరుణంలో ఎన్నికలవేడి అందుకుంది. పాపం, మన పూర్వీకులు ఏదో సదుద్దేశంతో ఒక ఆచారం పెడతారు. తీరా, తరాలు గడిచేసరికి ఆ సదాచారం శీర్షాసనం ధరి స్తుంది. అర్థం పర్థంలేని కులాలు గోత్రాలు చెరిగి పోయి, అంతా ఓ చెట్టు నీడన సహబంతి భోజనాలు సాగించాలని తీర్మానించారు. కార్తీకమాసం అందుకు శ్రేష్ఠమని పురాణాల్లో చెప్పారు. అందుకు ఉపవాస దీక్షని జోడించారు. శివుడు కోరిన వరాలిస్తాడని పుణ్యం పుష్కలమని మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న మహర్షుల మాటగా చెప్పారు. నెలరోజులు గడువు ఇచ్చారు. కార్తీక వన భోజనాలు బాగా క్లిక్ అయినాయి. కాకపోతే ఇప్పుడిప్పుడు పిక్నిక్ కళ తెచ్చుకుంది. ఆర్థిక, సాంఘిక, కుల రాజకీయ వ్యవహార చర్చలకు వేదికగా మారింది. చివరికిప్పుడు కుల ప్రాతిపదికన ఈ వన సమారాధనలు నిరాటంకంగా జరుగుతున్నాయి. మనవాళ్లంతా రండి. మనవాళ్లని తీసుకురండి. మనోడు స్పాన్సర్ చేస్తున్నాడు. మనవాడి ఫాంహౌజ్‌లోనే... అంటూ సాదరంగా పిలుపులు వస్తున్నాయ్. ఇట్లు, మీవాడు అంటూ ఆహ్వానాలు పంపుతున్నారు. ఇలాంటప్పుడు కొత్త సమాచారం సేకరిస్తుంటారు కులపెద్దలు. ఫలానా సెంట్రల్ మినిస్టర్ తీరా చూస్తే మనవాడేనని తేలింది. ఆయన ముత్తాతగారి పెత్తాత గోదావరి వాడంట. నువ్వుజీళ్లు తయారించి, అమ్ముకుని జీవించేవాడు. వరుసగా మూడేళ్లు భయంకరమైన కరువొస్తే తట్టుకోలేక పొట్టని, నువ్వుజీళ్ల ఫార్ములాని చేతపట్టుకుని పొగ ఓడలో బొంబాయి చేరుకున్నాట్ట. అక్కడ జీళ్ల కార్ఖానా రాజేశాడు. వెళ్లిన వేళా విశేషంవల్ల దశ తిరిగింది. ఇహ ఆ కొలిమి ఆరింది లేదు. శివాజీ మహరాజ్ జీళ్లకి అబ్బురపడి, ఫిరంగి గుళ్లు, తుపాకీ తూటాలు కూడా చేయించి వినియోగించారట. ‘ఈ దినుసేదో బావుంది. వినియోగం తర్వాత చీమలకి ఆహారం అవుతోంది భేష్’ అంటూ మెచ్చుకుని ప్రోత్సహించారు. ఆ విధంగా పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. కాలక్రమాన ఆ వంశం ముంబాదేవి ఆశీస్సులతో అక్కడ స్థిరపడిపోయింది. వలస వచ్చాం అని చెప్పుకోవడం దేనికి లేనిపోని రొష్టని బొంబాయి జనజీవన స్రవంతిలో ఐక్యమైపోయారు. ‘ఆయన మనోడే. కావాల్సినన్ని రుజువులున్నాయ్. డీఎన్ఏలతో సహా పక్కా.. మనోడే’ అని కులపెద్దలు ఆనందంగా బయటపెట్టారు. ఆయన సమారాధన సభకి వస్తున్నట్టు ప్రకటించారు. మీడియా భాషలో చెప్పాలంటే ఈ టైములో వనభోజనాలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. హాయిగా మనసువిప్పి కులం భాషలో మాట్లాడుకుంటున్నారు. పంట ఓట్లు తక్కువగానూ, పైఓట్లు ఎక్కువగానూ అవసరపడే అభ్యర్థులు చర్చించి రేట్లు ఖాయం చేసుకునే పనిలో ఉన్నారు. తీరా ఆవేల్టికి రేట్లు మన చేతిలో ఉండవ్. ఇప్పుడైతే పచ్చని చెట్లకింద శివసాన్నిధ్యంలో ఓ మాట అనుకుంటే, పాపభీతికి జంకైనా మాటమీద నిలబడతారని నమ్మకం. తులసీ దళం మీద కొందరు, మారేడు దళం మీద మరికొందరు ఓటర్లతో∙ప్రమాణం చేయించుకుంటున్నారట.సర్వసిద్ధంగా ఉన్న అభ్యర్థులు షడ్రసోపేతమైన భోజనం పెట్టి, చివరకు మారేడాకు, తులసి ఆకో గుర్తువేసి ఇస్తున్నారట. తులసి ఆకు చూపిస్తే విష్ణాలయాల్లోనూ, మారేడైతే శివాలయంలోనూ దాన్ని రొఖ్ఖంలోకి మార్చుకోవచ్చు. ఈ విధంగా కార్తీక వన విందులు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయ్. మన సంప్రదాయాల వెనుక ఎప్పుడూ ఒక సామాజిక ప్రయోజనం ఉంటుంది. కారల్‌మార్క్స్ అన్నట్టు సమస్త సంబంధాలూ కడకు ఆర్థిక సంబంధాలకే దారి తీస్తాయ్. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రోజుకి 33 రూపాయలు
చంద్రబాబుకి ఎప్పుడూ వార్తల్లో ఉండాలి. లేకపోతే మనసు మనసులో ఉండదు. అప్పటికీ సొంత మీడియా ఉంది కాబట్టి ఏవో వార్తలు పెద్దక్షరాలతో వండి వారుస్తూ ఉంటారు. వాటన్నింటినీ నిజమేనన్న భ్రమలో పొద్దున్నే ఒకటికి రెండుసార్లు చదువుకుని సంతృప్తిపడుతూ ఉంటారు. ఇప్పుడు పొద్దుపోక కమలేతర కూటమిని కట్టకట్టే పనిలో కాలుకాలిన పిల్లిలా చంద్రబాబు తిరుగుతున్నారు. ఇదేదో ఆయనలో మొలిచిన గొప్ప ఆలోచనలా చెబుతున్నారు. ఇదంతా ఇదివరకటి ముఠాయే కదా. పునరేకీకృతం అవడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొంచెం కండబలం ఉన్న పార్టీ చుట్టూ గుమిగూడితే దాన్ని ‘పోలరైజేషన్’ అంటారు. అది కెమిస్ట్రీ. ఇదివరకు కలిసివున్నవారు రకరకాల కారణాలవల్ల విడిపోయి, దూరమై మళ్లీ దగ్గరగా జరగడాన్ని పునరేకీకరణ అంటారు. వీటికి సారూప్యతలు ఉండక్కర్లేదు. అదేదో ఆటలో అంతా కలిసి బంతిని కైవసం చేసుకున్నట్టు, ఈ కూటముల పరమార్థం కుర్చీని లాక్కోవడమే. కూటములు కట్టేవేళ కనిపించేది సైద్ధాంతిక ఏకాభిప్రాయం, ఐకమత్యం కాదు. ప్రత్యామ్నాయం లేక, వేరే దిక్కులేక అందరూ కలిసిపోతారు. చంద్రబాబు, రాహుల్‌గాంధీ, స్టాలిన్, మమత అంతా సుహృద్భావ వాతావరణంలో మాటలు సాగిస్తారు. తమరధికులంటే, తమరు వందనీయులని పరస్పరం పొగుడుకుంటారు. ప్రస్తుతం పాలిస్తున్న వారిని గద్దెదింపడమే లక్ష్యంగా కూటమి ఆలోచిస్తుంది. అడుగులు వేస్తుంది. అదొక్కటే ఏకైక లక్ష్యం. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ, చంద్రబాబు రాష్ట్రాలు తిరుగుతూ, కూటమి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారంటే చాలామందికి సందేహంగా ఉంది. తెలంగాణ సీట్లమీద కసరత్తు చెయ్యచ్చని సామాన్య ప్రజ అనుకోవడం సహజం. తెలంగాణలో చంద్రబాబు నోరెత్తి ఏం మాట్లాడాలి, ఏం చెప్పి టీడీపీకి ఓట్లు అడగాలన్నది పెద్ద ప్రశ్న. అగ్రనేత కేసీఆర్‌తో సహా చాలామంది పసుప్పచ్చ మూలాలున్నవారే. బాబు రాజకీయ మూలాలు కూడా అందరికీ విదితమే. మోదీ పాలన మీద నిప్పులు చెరుగుతూ కాలక్షేపం చేస్తున్న చంద్రబాబుకి అదొక అస్త్రంలాగా కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమం కొన్నాళ్లు పక్కనపెట్టి దేశాన్ని బాగుచేసే పనిని బాబు తలకెత్తుకున్నారు. మోదీకంటే రాజకీయాల్లో సీనియారిటీ ఉందని పదే పదే చెబుతున్నారు. ఆ మాటకొస్తే దేశంలో ఇంకా సీనియర్లు అనేకులున్నారు. ఈ సందర్భంలో ఆలిండియా స్థాయి రాజకీయాల్ని తన చుట్టూ తిప్పుకుంటే జన సామాన్యం నివ్వెరపోతుందని అంచనా.‘మనకున్న పది పన్నెండు రాష్ట్రాల్ని చూసుకుంటే చాలు బాబూ’ అని జనం గగ్గోలు పెడుతున్నారు. చదువుకున్న యువతలో కొందరికి తొమ్మిదివందల తొంభై తొమ్మిది భృతి ఏర్పాటు చేశారు. అంటే రోజుకి ముప్ఫైమూడు రూపాయలు. దేనికి సరిపోతుందో ఎరుక పరచాలని యువకులు అడుగుతున్నారు. రైతుల సమస్యలేమీ తీరలేదు. వాళ్లకి కావల్సింది బ్యాంకు రుణాలు కావు. ప్రకృతిని వారికి కావల్సినట్టు సంబాళించడం. అది ప్రభుత్వాల చేతుల్లో ఎలాగూ ఉండదు. కనీసం నాణ్యమైన విత్తనాలన్నా వారికి ఇప్పించండి. ఇప్పుడు రైతుకూలీలు దొరకడం కష్టంగా ఉంది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొందరికే అందుబాటులో ఉన్నాయ్. వాటిని మండల స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థ ద్వారా రైతుకి సరైన కిరాయికి పనిచేయిస్తే మేలు. అంతకంటే ముఖ్యంగా పండించిన వాటికి గిట్టుబాటు ధర కల్పించడం. ఈ పంటల తరుణం వచ్చిందంటే రైతులు ఆనందించడం కంటే, నిరుత్సాహపడటమే ఎక్కువగా ఉంటుంది. మిగతా ఉత్తుత్తి కబుర్లన్నీ పక్కనపెట్టి, చంద్రబాబు అసలు సమస్యలమీద దృష్టి పెట్టాలి. అది ఆయన తక్షణ కర్తవ్యం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కూటమికో జెండా
ఉన్నట్టుండి ఒక హడావుడి, ఒక కలకలం. చంద్రబాబు ఒక్కసారిగా రెక్క విదిల్చారు. ‘హస్తినలో చం.చా’ (చంద్రబాబు చాణక్యం) అంటూ పత్రికలు శీర్షికలు పెడుతు న్నాయ్. దేశం చాలా చిక్కుల్లో ఇరుక్కుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ మోదీ కబంధ హస్తాలలో నలిగిపోతున్నాయనీ చంద్రబాబు కొన్నాళ్లుగా తెగ బాధపడుతున్నారు. పైగా ఏ సందేశం ఇవ్వాల్సి వచ్చినా, మోదీమీద నిప్పులు చెరగాలన్నా, ‘ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్’ అని ఓ స్లోగన్ ఇస్తారు చంద్రబాబు. సంవత్సరాలు కొలతబద్దలు కావు. అరవై ఏళ్లు పాలిటిక్స్ ఉండి ఏ చిన్న పదవినీ ధరించని నికార్సయిన గాంధేయవాదుల్ని మనం ఎరుగుదుం. ఏపీలో మధ్యతరగతి టౌన్స్ లో, ఉన్నట్టుండి బాబు ఈ కొత్త ఉద్యమానికి తెరతీశాడేంటని మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో గుప్పెడు సీట్లన్నా రావాలంటే, నయానో భయానో ఓట్లు రాబట్టే ప్రయత్నం చెయ్యాలి కదా. అందుకని ఢిల్లీలో తిరుగుతూ ఉరుములు మెరుపులు తెప్పిస్తున్నాడని ఓ నడివయస్కుడన్నాడు. ఒక పెద్దావిడ ఉన్నట్టుండి అంది కదా, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని సామెత ఉంది. ఇప్పుడు ఇన్ని జోగులు ఎడాపెడా రాసుకుంటున్నారు. ఇంత బూడిదకంటే అల్పమైందేమి రాల్తుందో చూడాలని నిట్టూర్చింది. చంద్రబాబు మొన్నామధ్య వరకూ ఏపీకి స్పెషల్ ప్యాకేజీయే ముద్దు అంటూ ముందుకు వెళ్లారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ వెనక్కి వస్తున్నారు. తెలుగుదేశం నేతకి జనంలోకి వెళ్లడానికి పట్టు చిక్కడం లేదు. మోదీ ప్రతిష్టని కిందికి దించాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారుగానీ అది ఏ మేరకు ఫలించిందో చంద్రబాబుకి స్పష్టంగా తెలియరావడం లేదు. ఇంతకుముందు ఇదో గొప్ప వ్యూహమనుకుని, బాబు లాగే కమలేతరులందర్నీ ఒకే తాటిమీదికి తెస్తానని ఒకే ఒక సభతో ఆరంభించి అదే సభతో ముగించారు. తేవడం అంత చిన్న విషయం కాదు. తెచ్చినా తాడు తెగే ప్రమాదం ఉందని పెద్దవాళ్లంటారు. కేసీఆర్ ఏకతాటి పథకాన్ని కింద పారేసి గప్‌చుప్ అయిపోయారు. కాడి ఖాళీగా ఉందనీ, వేరే గొప్ప ఐడియాలు లేక, రాక చంద్రబాబు భుజాన వేసుకున్నారని అనుభవజ్ఞులంటున్నారు. చంద్రబాబుకి అంతా నివ్వెరపోయే విధంగా చక్రం తిప్పగలనని పిచ్చి నమ్మకం ఉంది. బాబు చక్రం తిప్పడం ఒక ఎన్టీఆర్‌ని దింపడం దగ్గరే ఫలించిందని ఒక టీడీపీ మనిషే వేష్టపడ్డాడు. ఏ పార్టీ మేనిఫెస్టో వారిది. ఎవరి సొంత అహం వారిది. అంతా తమంతవాళ్లు తాము. ఒక దక్షిణాది రాష్ట్రం నించి, అదీ బుల్లి రాష్ట్రం నించి వెళ్లి అందర్నీ నడిపిస్తానంటే అది సాగదు. మనం దైవ ప్రార్థనలో ఉన్నట్టుంటాంగానీ మన సొంత ఆలోచనలు అప్పుడే తీవ్రంగా ప్రకోపిస్తూ ఉంటాయ్. దేశ అభ్యున్నతి కోసం, దేశ ప్రజల కోసం చంద్రబాబు సడెన్‌గా కంకణబద్ధుడై హస్తినలో కనిపించేసరికి చాలామంది నివ్వెరపోయారు. కొత్త ఆలోచనలు రానప్పుడు, అన్ని తీగెల్ని కదిలించి చూడ్డం మామూలే. ఎక్కడో ఓ తీగె పలికితే, ఇక దాన్ని ఆసరా చేసుకుని కథ నడిపే ప్రయత్నం చేస్తారు. అటువైపు నరేంద్ర మోదీ దేనికీ తొణకడు బెణకడు. మనసులో ఏముందో ఎవడూ పసికట్టలేరు. దాదాపు ఏడాది నించి చంద్రబాబు విమర్శించినా, కట్టువదిలి వెళ్లిపోయినా, తిడుతున్నా, శాపనార్థాలు పెడుతున్నా మోదీ పలకడు ఉలకడు. అదే చంద్రబాబుని తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. ఆహార కల్తీ శాఖ షాపులమీద పడి ఆకస్మిక తనిఖీలు చేస్తే– ‘చూడండి, కక్ష సాధింపు. ఆ కల్తీలు చేసే వాళ్లంతా మా తెలుగుదేశం వాళ్లే’నని నేత అరుస్తున్నాడు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందంగా ఈ ఆరోపణలు సాగుతున్నాయ్.ఏమో! సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఐక్యతా ఉక్కు విగ్రహం చంద్రబాబులో రాత్రికి రాత్రి స్ఫూర్తి నింపేసిందేమోనని ఒకాయన ముక్కున వేలేసుకున్నాడు. కూటమికి ముందొక రంగురంగుల జెండా ముఖ్యం అన్నాడు ముగింపుగా. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
ముందస్తు కోతలు
ఆ సంవత్సరం మామిడి కాపు బావుంటుంది. రెమ్మ రెమ్మకీ గుత్తులు గుత్తులుగా పిందెలుంటాయ్. తోట యజమాని ఆశగా లెక్కలు వేసుకుంటూ వుంటాడు. పిందెలు కాయలవుతాయ్. మరింత సంతోషపడ తాడు. మార్కెట్లో మామిడికి మంచి ధర కూడా ఉంటుంది. యజమాని చాలా టెన్షన్‌కి గురి అవు తాడు. రేప్పొద్దున అన్ని తోటలూ, అన్ని చెట్లూ కోత కొస్తాయ్. ఒక్కసారి రేటు పడిపోయే ప్రమాదం ఉందని యోచన చేస్తాడు. మర్నాడే, టెంక ముద రకుండానే కాయలు కోస్తాడు. మంచి ధరకి మార్కె ట్కి పంపుతాడు. మార్కెట్ వాళ్లు లేతకాయల్ని కృత్రి మంగా పండబెట్టి జనం మీదికి వదులుతారు. ఎకరాకి అవలీలగా కోటి ఆదాయం తీసే ఆదర్శ రైతు కేసీఆర్ ఇప్పుడు ముందస్తుకు వచ్చి సరిగ్గా అదే వ్యూహం అమలు చేశారు. సుఖంగా కుటుంబ సభ్యు లంతా మూడు పదవులు ఆరు శాఖలుగా రాష్ట్రాన్ని ఏలుకుంటూ ఉండగా 9 నెలలు ముందుకు కోరి తెచ్చుకున్నారనిపిస్తోంది. ‘నాలుగున్నర సంవత్స రాలు ఇంటిళ్లిపాదీ రాష్ట్ర ప్రజకే అంకితమైపోయిన పుడు మళ్లీ గెలుపు గురించి జంకెందుకు?’ అని అజ్ఞానులు కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. జనం ఎంత చేసినా ఇంకా ఏదో చెయ్యలేదనే భావనలో ఉంటారు. బంగారు తెలంగాణ చేస్తే ప్లాటినం తెలం గాణ చెయ్యలేదని అసంతృప్తి పడుతూ ఉంటారు. తాగునీరు, సాగునీరు ఇస్తే ఇంకో కుళాయిలో ఇంటిం టికీ పాలు ఇవ్వచ్చుగదా అంటారు. పాలు కూడా ఇస్తే ఇంకో నల్లాలో ‘పాపాలు’ ఇవ్వచ్చుగదా అని వాపోతారు. మీకు తెలియదు రామరాజ్యంలోనే నెగటివ్ ఓట్లు పేరుకుపోయాయ్. వాటితోనే కదా రాముడి జీవితం మీడియాపాలై, పల్చనైపోయింది. ‘కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయ్. చేసిన వాడికే చెరుపు’ అంటూ ఓ అనుభవజ్ఞుడు చాలా బాధ పడ్డాడు. చంద్రబాబుకి ముందస్తు అనే మూడక్షరాలు వినిపిస్తే దడ. అప్పట్లో అలిపిరి సంఘటనని ఆసరా చేసుకుని సింపతీ వేవ్‌ని సృష్టించడం నల్లేరుమీద బండి నడకని భావించిన బాబు పరమ ఘోరంగా దెబ్బతిన్నారు. పాపం, ఒడ్డున వున్న వాజ్‌పేయిని కూడా ముందస్తు గోతిలోకి దింపారు. చివరకి అటల్జీకి ఐదేళ్లు దేశాన్ని పాలించామనే తృప్తి కీర్తి లేకుండా చేశారు. అందుకని చంద్రబాబు పొరబా టున కూడా ప్రిపోల్స్ మాటెత్తరని తెలుగు తమ్ముళ్లు చెబుతూ ఉంటారు. చంద్రబాబుకి దిగితే తిరిగి ఎక్కగలం అన్నది ఎప్పుడూ డౌటే. ఇప్పుడు ఇంకా ఆర్నెల్లకైనా ఎన్నికల ముందుకి రాక తప్పదు. నాలు గున్నరేళ్లు గడిచినా చంద్రబాబుకి పాకుడు రాళ్లే తప్ప కాస్త కాలు మోపి నిలబడే రాయి చిక్కనే లేదు. ‘విశ్వవిఖ్యాత కాపిటల్’ కొండకి పట్టించిన నాగలిగా, గొంగళి చందంగా మిగిలింది. లక్ష ఎకరాల్లో దాదాపు పన్నెండు పంటలు వృథా అయినాయ్. భూమాతని గొడ్రాలుగా మిగిల్చినవారు శాపగ్రస్తులవుతారని ఒక సిద్ధాంతిగారు కంటతడి పెట్టారు. నేలని పిండి నూనె తీసిన కర్ణుడు శాపగ్రస్తుడైన మాట ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పిన పోలవరం కదల్లేదు. కబుర్లే గానీ ఫలించిన పథకం ఒక్కటీ లేదని ప్రజలు అను కుంటున్న మాట నిజం. ఇప్పుడు గడువు దగ్గర పడే సరికి ఏవేవో ఆలోచనలు పుట్టుకొస్తున్నాయ్. చివరకు ప్రధాని మోదీ ఏపీకీ శత్రువనీ, మొత్తం ఆయన వల్లే తనేమీ చేయలేకపోయానని పదే పదే మన సీఎం చెబుతున్నారు. ఇదే ప్రస్తుతం చంద్రబాబు చేతిలో ఉన్న అస్త్రం. దాన్ని పదునుపెట్టే క్రమంలో మోదీ పెద్దమనిషి కానేకాడనీ ప్రచారంలోకి దిగారు. రాష్ట్రంలో తుఫాన్ వచ్చినా, వ్యాపార సంస్థలమీద ఆదాయపన్ను దాడులు జరిగినా, వైరల్ జ్వరా లొచ్చినా మోదీ చేస్తున్న కుట్రగానే చెబుతున్నారు. దీనివల్ల ఏపీ ఓటర్లు చంద్రబాబు చిత్తశుద్ధిని శంకించ రని ఆయన ఉద్దేశం. మావూళ్లో ఒక మహిళా ఓటరు రెండు ఐడి యాలిచ్చింది. తాగుడుతో మేమంతా విసిగి వేసారి ఉన్నాం. వారానికి ఒక్కరోజు మందు బంద్ చేసినా చాలండి జనం వోట్లేస్తారంది. అమలు చేయడం కష్టం కదా అన్నాను. చంద్రబాబు చెప్పినవి ఏవి అమలు చేశారు కాబట్టి.. అని పెదవి విరిచింది. ఇక రెండో ఐడియా ఏవిటన్నాను. అందరితో ఎడాపెడా పొత్తు పెట్టుకోవడమే అన్నదా మహిళ. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బారోట్రామా
అక్షర తూణీరం మునుపు ఏ విపరీతం జరిగినా, ఇందులో విదేశీ హస్తం ఉందని, ఒక వర్గం ఆరోపించింది. చాలాసార్లు ఆ హస్తం విదేశీ గూఢచార సంస్థది అయి ఉండేది. ఉప్పెనలొచ్చినా, పంటల మీద తెగుళ్లొచ్చినా, గాలి వాన కురిసినా విదేశీ హస్తం మీదకే తోసేసేవారు. చాలా రోజుల తర్వాత తిరిగి ఇన్నాళ్లకు చంద్రబాబు, ఎక్కడ ఏం తేడా జరిగినా మోదీ ఖాతాలో జమ వేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు వైఫల్యాలన్నిటికీ ఒకే ఒక కారణం మోదీ. ఏడాది క్రితం దాకా ప్రధాన మంత్రి ఏ మాత్రం వంకలేని పెద్దమనిషి. ఈ మధ్య కాలంలో ఇద్దరికీ పూర్తిగా చెడింది. అక్కడ్నించి మోదీ అంత రాష్ట్ర ద్రోహి ఇంకోడు లేకుండా పోయాడు. కిందటివారం నించి నరేంద్ర మోదీ బ్రిటిష్ పాలకులని మించిన దేశద్రోహిగా మారాడు. ఆయన ఆ స్థాయిలో చేసిన జలియన్ వాలాబాగ్ ఉదంతాలేమిటో తెలియదు. సాధారణ ప్రజ అనుకునేదేమిటంటే– చంద్రబాబు మానిఫెస్టోలని మోదీ ఎందుకు తలకెత్తుకుంటాడని?! ఎవడి జెండాలు, ఎజెండాలు వాడికి ఉంటాయి కదా? రైతుల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని స్థానిక పార్టీలు ఇంటింటా తిరిగి, చెవుల్లో మైకులు పెట్టి చెబుతారు. తీరా పవర్లోకి వచ్చాక ఆ మాట పీకలమీదికి తెస్తుంది. బ్యాంకులు సహకరించడం లేదని పవర్లోకొచ్చిన పార్టీ నస మొదలుపెడుతుంది. అది ఎవరి సొమ్ము బాబూ చేతికి ఎముక లేకుండా ధారపొయ్యడానికి? నగరాల్లో ఉంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ పన్ను చెల్లించేవారు ఈ మాఫీ అన్నప్పుడల్లా పరిపరి విధాల తిట్టుకుంటారు. రైతులకి న్యాయం చెయ్యా ల్సిందే. వారిని ఉద్ధరించాల్సిందే. దానికి అనేక మార్గాలున్నాయండీ అంటూ ఒక బంగారు ఫ్రేమ్ కళ్లద్దాలాయన ఎయిర్‌పోర్ట్‌లో క్లాసు తీసుకున్నాడు. ‘ఒకప్పుడు అందరం రైతులమే కాదంటే రైతు కూలీ లమే. ఇప్పుడు చెల్లాచెదరై ఇట్లా టౌన్లకొచ్చాం. అవి పెరిగి పెరిగి సిటీలైనాయ్. అయితే మనదా తప్పు? ఇప్పుడూ పెట్రోలు మండిపోతోంది. డీజిల్ కాలి పోతా ఉంది. రైతులు ఎడ్లతో చాకిరీ చేయించడం ఎప్పుడో మర్చిపోయారు. ట్రాక్టర్లే అన్నింటికీ. లీడ ర్స్‌కి రైతులమీద అభిమానం ఉంటే, ఎకరాకి ఓ వంద లీటర్లు డీజిల్ సగానికో పావలాకో సప్లయ్ చెయ్యాల. కావాలంటే ఎగస్ట్రా క్లాస్ కార్లకి కొట్టే చమురు మీద ఇంకో పదో పరకో వడ్డించు కోమనండి’ అంటూ గోల్డ్ ఫ్రేం నవ్వుని శ్రోతల మీదికి తిప్పాడు. ఆయన ఊహించినంత ప్రతిస్పం దన కన్పించలేదు. పైగా శ్రోతల ధ్యాసంతా ఎయిర్ పోర్ట్ మైకులమీద ఉంది. ఇంతలో నిన్న ఢిల్లీ–జైపూర్ విమానీకులు ముంబై నించి వస్తున్నారు. నలుగురైదుగురు మన ప్రాంతంవాళ్లు. అందులో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నతాధికారులు. తరచుగా పేపర్లో, టీవీల్లో వాళ్ల ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడివారు ఇట్టే గుర్తించారు. పలకరించి, చచ్చి బతికినందుకు అభినందించారు. అక్కడ చేరిన వారంతా ఎవరి అనుభవాలు వాళ్లు కక్కుతున్నారు. ‘ఏవండీ, బ్లీడ్ స్విచ్ని మర్చిపోవడంవల్ల, బారోట్రామా సంక్ర మించి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తస్రావం అయిందటగా.. ఏమిటి మీ పరిస్థితి’ అంటూ వారి ముఖాల్లోకి పరీక్షగా చూస్తూ అడిగారు. ఆ ముగ్గురూ చాలా తేలిగ్గా తీసుకుని చప్పరించేశారు. ఆ జెట్ విమానంలో మాతో కలిపి 171 మంది ఉన్నారు. మేం తప్ప అంతా వొణికిపోయిన వారే. గాల్లోకి వెళ్లాక విమానంలో ప్రెషర్ లేకపోతే ఏమవుతుంది? అదే అయింది. అంటూ వాళ్లు ఒకర్నొకరు చూసుకు న్నారు. శ్రోతలకేమీ అర్థం కాలేదు. ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత, ‘మీరు చాలా అదృష్టవంతులు’ అన్నారంతా అభినందన పూర్వకంగా. వాళ్లు అదేం కాదన్నట్టు చూశారు. ‘మేం నాలుగేళ్లకి పైగా ఏపీ స్టేట్ సర్వీస్‌లో ఉన్నాం. అందుకని ఎఫెక్ట్ కాలేదు’ వాళ్ల మాటలెవరికీ అర్థం కాలేదు. ముగ్గుర్లో ఒకా యన అందుకుని ‘గడిచిన యాభై నెలలుగా మా సీఎంగారు వివిధ అంశాల మీద, టెక్నాలజీలపైన, మోదీ రాక్షసత్వంమీద, చారిత్రక అవసరాల మీద చేసిన భారీ నుంచి అతి భారీ ప్రసంగాలని వినడా నికి మా శరీరాలు అలవాటు పడ్డాయి. ఈ బోడి బోయింగ్ ప్రెషర్ మమ్మల్నేమీ చేయలేకపోయింది. నవరంధ్రాలు ఆ విధంగా పనిచేసే స్థితిలో స్థిరంగా ఉన్నాయి. డాక్టర్లు మమ్మల్ని పరీక్షించి, మీకు ‘బారోట్రామా ఇమ్యూనిటీ’ వందశాతం వచ్చేసింద న్నారు. ఈ సీఎం థెరపీని విమానయాన శాఖ ప్రవే శపెడుతుందేమో..’నంటూ బయటకు నడిచారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
గతమెంతో ఘనకీర్తి..!
రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలుండవ్. అట్లా గని శాశ్వత మిత్రత్వాలూ ఉండవ్. ఇది అనాదిగా వినిపిస్తున్న నానుడి. చరి త్రలో ఆగర్భ శత్రువులైన వారు చేతులు కలిపిన సందర్భాలు అనేకం ఉన్నాయ్. కృత యుగంలోనే మనకు కొండంత ఉదాహరణలు కనిపిస్తాయి. శాపవశాన దేవతలు బలహీనపడిపోయినపుడు వారు మార్గాంతరం వెదికారు. ఉపాయశాలి అయిన శ్రీహరి రంగంలోకి దిగాడు. ఔషధ గుణాలున్న మూలికలను పాల సముద్రంలో నిక్షేపించి, సము ద్రాన్ని శక్తికొద్దీ మథిస్తే అమృతం పుడుతుంది. దాన్ని సేవిస్తే ఇక జర రుజ మరణాలుండవు. శక్తివంతులై, నిత్యయవ్వనులై కళకళలాడుతూ ఉంటారు అని దేవ దేవుడు చెప్పగానే దేవతలు రెట్టించిన ఉత్సాహంతో పనిలోకి దిగారు. ముందస్తుగా రాక్షసుల సాయం అర్థించారు. ‘అన్నలారా! మన క్షేత్రాలు వేరైనా బీజాలు ఒక్కటే! రండి, చేయి చేయి కలుపుదాం. అమృతం సాధించి మృత్యువుని జయిద్దామని పిలుపునిచ్చారు. పక్షి రాజు గరుత్మంతుడు సాయం చేశాడు. మంధరగిరిని కవ్వంగా, సర్పరాజు వాసుకి కవ్వపు తాడుగా క్షీర సాగరంలో అమర్చి వెళ్లాడు. భల్లూకరాజు జాంబవం తుడు సర్వత్రా గాలించి, వనమూలికలు సేకరించి సముద్రం నింపాడు. అందరి పొత్తుతో క్షీర సాగర మథనం భూమ్యాకాశాలు దద్దరిల్లే స్థాయిలో సాగింది. మధ్యలో ఐరావతం, కౌస్తుభం, ఉచ్ఛై శ్రవం, అచ్చరలు, చందమామ ఇలా ఎన్నో విశేషాలు పుట్టుకొచ్చాయి. దేవతల్లో నోరున్న వారికి తలో విశేషం ఇచ్చారు. మధ్యలో కొండ మునుగుతుంటే విష్ణు మూర్తి తాబేలుగా వచ్చి ఆదుకున్నాడు. లక్ష్మీ దేవిని అందుకున్నాడు. హాలాహలం పుట్టింది. అంతా గగ్గోలు పెట్టారు. భోళా శంకరుణ్ణి మాటలతో సిద్ధం చేశారు. ఆయన గరళం మింగేశాడు. చివరికి అమృ తం ఉద్భవించింది. ‘రాక్షసులకి అమృతం దక్కితే మన కొంపలు మునుగుతాయ్’ అంటూ దేవతలు మాయోపాయం పన్నారు. కానీ అప్పటికే ఇద్దరు రాక్షసులు చెరో గుటకా పుచ్చేసుకున్నారు. ఆ పుణ్యానికి రాహు కేతువులు గ్రహాల్లో చేరిపోయి, ఇప్పటికీ పూజలం దుకుంటున్నారు. అన్యాయం చేశారనే కోపంతో మిగిలిన గ్రహాల్ని దొరికినప్పుడల్లా కబళిస్తూ ఉంటారు. అదీ కథ.ఇపుడు మనం అమృతతుల్యమైన పవర్ కోసం ఎందరితో జతకడితే మాత్రం తప్పేంటి? ధర్మం నాలుగు పాదాల నడుస్తున్న ఆ యుగంలోనే ఇట్లా జరిగింది. ధర్మం ఒంటికాలి మీద కుంటుతున్న ఈ కాలంలో పవర్ కోసం ఏం చేసినా ఆక్షేపణీయం కాదు. చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్‌తో చెయ్యి కలి పారని కొందరు నోళ్లు నొక్కుకుంటున్నారు. ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని పెట్టిందే కాంగ్రెస్‌ని భూస్థాపితం చేయడానికే కదా అని జ్ఞాపకశక్తి గల కొందరు గుర్తు చేస్తున్నారు. కావచ్చు, కాలోచితంగా స్ట్రేటజీ మార్చనివాడు పాలిటిక్స్‌లో షైన్ కాజాలడు. ఇపుడు తెలంగాణలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే, బోణీ కొట్టడం కూడా కష్టమేనని రాజకీయ విశ్లేష కులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు తెలంగాణలో పార్టీప రంగా ఈ నాలుగేళ్లలో సాధించిందేమీ లేదు. అసలు పార్టీని తెలంగాణలో పక్కన పెట్టారని, ఏపీ వరకు రక్షించుకుంటే చాలనే స్థితిలో ఉన్నారనీ ఎక్కువ మంది అభిప్రాయం. నలుగురితో పాటు నారా యణా అన్నట్టు, అందరితో కలిసి ఉంటే అదో రకం. అప్పుడు కూటమి ఫెయిల్ అయిందని చెప్పుకో వచ్చు. ఒంటరిగా ఓటమిని భరించడం కంటే నలుగురితో పంచుకోవడం తేలిక. అవినీతి పాలన, కుటుంబ పాలన, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు– ఇలాంటి అతి పురాతన చద్ది విమర్శలతో నెగెటివ్ ఓటుని ఏ పార్టీ అయినా సృష్టించజాలదు. ‘ఇవన్నీ కాదు, నెగెటివ్ పాయింట్ చెప్పండని’ ఓటర్లు సూటిగా అడుగుతారు. అందుకు రెడీగా ఉండాలి ఏ కూటమి అయినా. ఈ కల యికలు, పొత్తులు అన్నీ యుగాలుగా ఉన్నవే. కొత్తగా మనం కనిపెట్టినవేం కాదు. అందుకే... గతమెంతో ఘనకీర్తి కలవాడా! చెయ్యెత్తి జై కొట్టు...!! వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
అచ్చమైన నేత
ముందస్తు ఎన్నికలు రావడం వేరు, నాయకుడే కోరి తెప్పించుకోవడం వేరు. దీనికి తెగువ, తెగింపు కావాలి. అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధపడాలి. తెలంగాణ ముఖ్యమంత్రిది నిజంగానే గొప్ప సాహసం... కాదంటే ఆత్మ విశ్వాసం. సర్వే రిపోర్ట్లన్నీ ‘సరిలేరు నీకెవ్వరూ’ అని ముక్త కంఠంతో చెప్పాయనీ, కనుక కేసీఆర్ ఈ రద్దుని దుస్సాహసంగా భావించడం లేదనీ దగ్గరి వారను కుంటున్నారు. ఏ మాత్రం రిస్క్ వున్నా తిని కూర్చుని ఈ ముందస్తు అడుసులోకి దిగరు కదా. తిరిగి మళ్లీ అంతా వాళ్లే. ఎమ్ఐఎమ్ వాళ్ల పేర్లు కూడా అవే వుండచ్చు. సేమ్ గవర్నర్! ప్రజలకి అసలేం తేడా పడదు. కాకపోతే, ‘తానొకటి తలచిన ఓటర్ మరొకటి తలచును’ అనే చందంగా ఒక్కసారి సభ్యుల్ని మారుద్దాం అనుకుంటే చెప్పలేం. కేసీఆర్ ఉద్యమంలోంచి ఉద్భవించిన నేతగా జ్ఞాని కనుకనే సీట్ల గురించిన కసరత్తులు చేయకుండా ఒక్క నిమిషంలో తేల్చి పడేశాడు. ఆయనకి స్పష్టంగా తెలుసు, ఎవరైనా ఒకటేనని! ఈ చర్యని కొందరు ‘ఓవర్ కాన్ఫిడెన్స్’ అని అభివర్ణించారు. ఇంకొందరు, ‘అదేం కాదు. లోపల చాలా జంకు ఉంది. లేని సాహ సాన్ని ప్రదర్శించి ప్రత్యర్థుల్ని చెదరగొట్టడం ఒక స్ట్రాటజీ’ అని అనుకోవడం వినిపించింది. ఏమైనా ఇది అర్ధరాత్రి నిర్ణయమేమీ కాదు. సామాన్యంగా రాష్ట్రంలో అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఎన్నికలు వస్తే బావుండని అధికార పార్టీ ఆశిస్తుంది. ఈ సీజన్లో వర్షాలుపడి రిజర్వాయర్ల నించి ఊరి చెరువుల దాకా నీళ్లతో తొణికిసలాడుతున్నాయి. ఇందుకు ప్రభుత్వ ప్రమేయం చినుకంతైనా లేకపోయినా ఫలితం ప్రభుత్వ ఖాతాలో పడుతుంది. లా అండ్ ఆర్డర్ సమస్య, కరెంటు కోతలు లాంటి ఈతి బాధలు లేకుండా ఉంటే– సామాన్య పౌరుడు అంతా సజావుగానే ఉందనుకుంటాడు. కిందటి మేనిఫెస్టో ప్రతుల్ని ఇంట్లో ఫ్రేములు కట్టించుకుని ఎవ్వరూ తగిలించుకోరు. ‘ఏదో మాట వరసగా బోలెడు అంటారు. అవన్నీ పట్టుక్కూర్చోకూడదు’ అనే విశాల దృక్పథంతో జనం ఉంటారు. పోనీ, అవతలివైపు ఏమైనా అద్భుతమైన ప్లస్ పాయింట్లు వచ్చి చేరాయా అంటే అదేం లేదు. మాటల ధోరణి మారిందా అంటే అదీ లేదు. వేలం పాటలో పై పాట పాడినట్టు అవతలవాళ్లు అన్న దానికి ఓ అంకె కలపడం, పాడడం లాగా ఉంది. కొత్త ఆలోచనలు లేవు. కొత్త ప్రాజెక్టులు లేవు. కొత్త రైల్వేలైను, నాలుగు పెద్ద కర్మాగారాలు... పోనీ మాటవరసకైనా లేవు. అందుకని కేసీఆర్ తన సీట్లో తాను కాళ్లూపుకుంటూ నిశ్చింతగానే కూర్చుని కనిపి స్తున్నారు. అధికార పక్షానికి నెగెటివ్ ఓటు శాపం ఉంటుంది. ఎంత చేసినా ఓటరు సంతృప్తిపడనీ, ఇంకా ఏదో చెయ్యలేదనీ ఆగ్రహంతో ఉంటాడనీ ఒక వాదన ఉంది. తప్పదు, రాజకీయ రొంపిలో దిగాక అన్నింటినీ తట్టుకు నిలబడాల్సిందే. ఒక రాష్ట్రాన్ని చేతుల్లోకి తీసుకోవడమంటే సామాన్యమా? ఎంత పవరు, ఎంత పలుకుబడి, ఎంత డబ్బు, ఎంత కీర్తి?! ప్రత్యక్షంగా పరోక్షంగా అయిదారు లక్షల కోట్లు ముఖ్యమంత్రి చేతులమీదుగా చెలామణీలోకి పోతుంది, వెళ్తుంది. ఆ ప్రవాహం ఏ మెరక దగ్గర కొద్దిగా ఆగినా కోట్లకి మేట పడుతుంది. ఎన్ని ఉద్యో గాలు అడ్డగోలుగా వేయించగలరో! ఎన్ని అవకత వకల్ని, అవినీతుల్ని శుద్ధి చేసి పక్కన పెట్టగలరో! అందుకే రాజకీయం చాలా గొప్పది. పైగా ‘ప్రజా సేవ’ కిరీటం ఎక్స్ట్రా. కేసీఆర్ అటు ఢిల్లీ అధికార పక్షంతో కూడా అన్ని విషయాలు మాట్లాడుకుని ఈ పనికి పూనుకున్నారని అంతా అనుకుంటున్నారు. ఇందులో పెద్ద అర్థంగాని వ్యూహమేమీ లేదు. ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోతే, పార్ల మెంటుకి స్థిమితంగా ఉంటారు. అప్పుడు కొంచెం బీజేపీకి చేసాయం, మాటసాయం చెయ్యచ్చు. అప్పుడు బీజేపీతో కలిసి వెళ్లినా ఆక్షేపణ ఉండదు. ఉన్నా పెద్ద పట్టింపు లేదు. కాసేపు సెక్యులరిజాన్ని ఫాంహౌజ్‌లో పెట్టి కథ నడిపించవచ్చు. అప్పుడది నల్లేరు మీద బండి నడక అవుతుంది. ‘జీవితంలో తన ఉన్నతికి చేదోడుగా ఉన్న ఎందరినో సందర్భో చితంగా మర్చిపోతూ వెళితేగానీ ఒక నేతగా నిలబడ లేడని’ సూక్తి. కల్వకుంట్ల చంద్రశేఖర రావు అచ్చ మైన నేత. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పూలూ – పడగలూ
చాలాసార్లు చిన్నపిల్లలకి వచ్చేలాంటి సందేహాలు పెద్దవాళ్లకి రావు. ఎందు కంటే పెద్దవాళ్ల అభిప్రా యాలు, ఆలోచనలు లక్కలా బిడిసి, గట్టిగా స్థిర పడి పోయి ఉంటాయి. ప్రతి కల్పాంతంలోనూ భయంక రమైన జలప్రళయం వస్తుంది. అప్పుడీ సృష్టి మొత్తం జల సమాధి అయిపోతుంది. మళ్లీ నూతన సృష్టికి అంకురార్పణ జరుగుతుంది. అందుకు దేవుడు సృష్టి లోని సమస్త జీవకోటి శాంపిల్స్‌ని, విత్తనాలని ఒక పెద్ద పడవలోకి చేర్చి జాగ్రత్త పరిచాడు. ఈ పురాణ గాథని మరింత ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఉన్న ట్టుండి క్లాసులో ఓ పిల్లవాడు లేచి, ‘టీచర్ మరైతే పడవలో ఉన్న పులి అందులోనే ఉన్న మేకని తినె య్యదా?’ అని అడి గాడు. నిజమే, వాడొక శాంపిల్ చెప్పాడు గానీ ఇంకా కప్పని పాము, పాముని గద్ద మింగేస్తాయి కదా. అప్పుడు చాలా శాంపిల్స్ అడ్రస్ లేకుండా పోతాయి గదా. పిల్లలంతా నా జవాబు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేనేవన్నా ప్రవచనకారు డినా అప్పటి కప్పుడు ఆశువుగా వాడి సందేహం తీర్చ డానికి. కనీసం రెండు శ్లోకాలైనా పఠిస్తే, వాటిని గడగడ పుక్కిలించి, తోచిన అర్థంతో తరగతిని భయపెట్టి బయ టపడేవాణ్ణి. ఓ క్షణం దిక్కులు చూసి, ‘అఘో రించావ్. ఈ తెలివి మాత్రం ఉంది. కూర్చో’ అని గద్దించి, ఆ గండం గట్టెక్కాను. మొన్నామధ్య టీవీ వార్తలు చూస్తుంటే, పది పన్నెండేళ్ల పక్కింటి పిల్ల నాకూడా ఉంది. కేరళ వరదల్ని చూసి భయపడింది. చాలా జాలిపడింది. చూస్తున్నంత సేపూ అయ్యో పాపం అనుకుంటూనే ఉంది. మళ్లీ తర్వాత వేరే వేరే వార్తలు వచ్చాయి. చివరంటా నాతో పాటు వార్తలు చూసింది. ‘మరి... అయితే ఢిల్లీలో ఉండే మంత్రులు గొప్పవాళ్లా, ఇక్కడ ఉండే మన మంత్రులు గొప్పవాళ్లా’ అని అడిగిందా అమ్మాయి. ‘అంతా ఒకటే, కాకపోతే వాళ్లు అక్క డుండి దేశం సంగతులు చూస్తారు. వీళ్లు ఇక్కడ ఉండి రాష్ట్రం సంగతులు చూసుకుంటారు’ అని చెప్పాను. ‘మరైతే... మనవాళ్లు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా డోలంత పెద్ద పూలగుత్తుల్ని తీసికెళ్లి వాళ్లకిచ్చి దణ్ణం పెడతారెందుకు’ అని సూటిగా అడిగింది. వెంటనే జవాబు స్ఫురించలేదు. ‘మర్యాద.. అదొక మర్యాద’ అన్నాను. ‘ప్రతిసారీ మంచి ఖరీదైన పట్టు శాలువా కూడా ఢిల్లీ మంత్రులకు కప్పుతారు’ అన్నది. అవి లాంఛనాలు... అలాగే ఉంటాయన్నాను. మనలో మనకి అవన్నీ దేనికని ఎదురుప్రశ్న వేసింది. ఏదో సర్దిచెప్పి, ఒడ్డున పడ్డాను. పాపం, పుణ్యం, శ్లేషార్థాలు ఏమీ తెలియని పిల్ల కాబట్టి, హాయిగా సందేహాలు అడిగింది. నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఒక్కొక్క మంత్రి చేతుల్లోకి ఎన్నెన్ని ఖరీదైన బొకేలు వస్తాయో.. ఒక్క క్షణం కూడా ఆయన చేతిలో ఉండదు. శాలువా కప్పగానే, అదేదో మిడతో, పురుగో భుజంమీద వాలి నట్టు దాన్ని తీసి పక్కన పడేస్తారు. ఈ రాజ లాంఛనాలేమిటో అనిపి స్తుంది. దేవాలయాల్లో దేవు డికి వచ్చే వస్త్రాలను ఏటా వేలం వేస్తారు. ఈ శాలు వాలు కూడా అలా వేసి, ప్రభుత్వ ఖజానాకి జమ వేస్తే బాగుండు. సగటున ప్రతి మంత్రి నిత్యం పది శాలువాలు కప్పించుకుంటాడు. పదిహేను పూల గుచ్ఛాలు అందుకుంటాడు. మనలో మనకి ఈ మర్యాదలేంటని అందరూ ఒక్కమాట అను కుంటే, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవు తుంది. పోనీ, వీళ్లకి వాళ్లకి మధ్య నిజంగా గౌర వాలు, అభిమానాలు ఉంటాయా అంటే రవ్వంత కూడా ఉండవు. బయటకు రాగానే మీడియా మైకుల్లో నిర్భ యంగా చెరిగి పడేస్తారు. రాష్ట్ర గవర్నర్ ఉన్నతస్థాయి అధికారి. ఆయన కూడా ప్రజా సేవకే ఉన్నారు. ఆయనని కలవడానికి లేదా దర్శించడానికి వెళ్లినప్పుడల్లా మద్దెలంత పూల గుచ్ఛం స్వయంగా మోసుకు వెళ్లాలా? ఇవన్నీ ఎవరు నిర్దేశించారు. వీటి అమలు వెనుక అంతరార్థమేమిటి? ప్రధాని మోదీ ‘మనసులో మాట’ పేరుతో చాలా అర్థ వంతమైన ప్రసంగాలు ఆకాశవాణిలో చేస్తుంటారు. సందేశాలు, సలహాలు ఇస్తారు. ఇలాంటి కృత్రిమమైన మర్యాదల్ని, లాంఛనాల్ని ఎందుకు నిశ్శేషంగా వదిలిం చరో అర్థం కాదు. ముందసలు అన్నిచోట్ల కుప్పలుగా పడివున్న శాలువాలని వెంటనే కేరళకి పంపండి. కొంత పాపం శమిస్తుంది. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
ప్రియతమ నేత
ఒక మంచి మనిషి, గొప్ప కవి, మహానేత, దార్శనికుడు, హృదయవాది, భరతమాత ముద్దుబిడ్డ శాశ్వతంగా కన్ను మూశారు. అటల్ బిహారీ వాజ్ పేయి మహా శూన్యాన్ని సృష్టించి వెళ్లిపోయారు. దాదాపు దశాబ్దంగా ఈ కర్మ యోగి యోగనిద్రలో ఉన్నట్టుగా ఉన్నారు. ప్రజాజీవితానికి దూరంగా ఉన్నా.. ప్రభుత్వాలు, ప్రజలు ఆయన్ని తలుచుకోని క్షణం లేదు. విలక్షణమైన వ్యక్తిత్వం. అనుకరణీయుడేగానీ అనుసరణకు అసాధ్యుడు. ‘‘మీరు ప్రధాని అయ్యారు. రేపట్నించి జన సామాన్యంలోకి వెళ్లలేరు. బోలెడు సెక్యూరిటీ కంచెలుంటాయ్’’ అని ఒక పాత్రి కేయుడు వ్యాఖ్యానించినప్పుడు, అటల్జీ దుఃఖిస్తూ కంటనీరు పెట్టారు. ‘‘నాకు శిఖరంలా ఎదగాలని లేదు, నలుగురిలో నలుగురితో ఉండాలని ఉంది. కొండ శిఖ రాల మీద రాళ్లు రప్పలు తప్ప పచ్చదనం ఉండదు. చెమ్మ అసలే ఉండద’’ని కవితామయంగా అన్నారు. సభల్లో, సమావేశాల్లో వాజ్‌పేయి నోరు విప్పితే అమృతం కురిసేది. వేద రుక్కులు, ఉపనిషత్ వాక్యాలు సందర్భోచితంగా వచ్చి వర్షించేవి. ఇంగ్లిష్, హిందీ, సంస్కృత మాధ్యమాలలో డిగ్రీ తీసు కున్నారు. రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. తర్వాత ఆ శాస్త్రానికి ఆయనే పాఠ్యగ్రంథంలో నిలిచారు. కవితలు ఆశువుగా భావోద్వేగంతో చెప్పడం తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నానని చెప్పుకు న్నారు. కబీర్ రామచరితమానస్, మహాదేవి వర్మ ‘గీత’ తనకి గొప్ప ప్రేరణనిచ్చాయనేవారు. అటల్‌జీపై అవిశ్వాసం పెట్టినప్పుడు, పదవి నుంచి దిగిపోతూ ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగం, ప్రపంచంలోనే అతి గొప్ప విశ్లేషణాత్మక సందేశంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న విశ్వాసానికి కూడా ఆ సన్నివేశం నిదర్శనం. వాజ్‌పేయి మేథలో సరస్వతీ, హృదయంలో సిద్ధార్థుడు కొలువుతీరి ఉన్నారని పెద్దలు అంటారు. ఆయన ప్రసంగాలు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసేవి. అటల్జీ ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ గురించి చెప్పాలంటే వెయ్యి సందర్భాలు ఉటంకించాలి. ఆయన పరిపాలనా దక్షతకి, వాజ్‌పేయి హయాంలో దృష్టిపెట్టిన రోడ్లు, కరెంటు, నీళ్లు ఈ మూడు మౌలిక అంశాలను చెబుతారు. పోఖ్రాన్ అణుపరీక్షని గుర్తు చేసుకుంటారు. కార్గిల్ యుద్ధం మన సేనల్లో ఆత్మ స్థయిర్యం పెంచింది. ప్రైవేటైజేషన్‌లో ఆయన వేయించిన ముందడుగులు దేశ ఆర్థిక స్థితిని మార్చాయి. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చిత్రకారుడు బాపు రచించిన రామాయణ వర్ణచిత్రాలు వాజ్‌పేయి ఆవిష్కరించారు. ‘‘రాముడు మనుషుల్లో దేవుడు. ఆదర్శప్రాయుడు. అందుకే ఆయనకు గుళ్లు కడతాం. ఆయన సన్మార్గానికి, ఆయన ఆదర్శాలకు చిహ్నంగా కడతాం. యుగాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. రాముడు దేవుడు కాదు కాబట్టి నాస్తికులు కూడా దణ్ణం పెట్టుకోవచ్చు. తప్పులేదు’’ అని సభలో నవ్వులు పూయించారు. ‘అజాత శత్రువు’ అనే మాట ద్వాపరయుగంలో ధర్మరాజుకి చెల్లిపోయింది. మళ్లీ కలియుగంలో అటల్ బిహారీ వాజ్‌పేయికి చెల్లింది. అందరూ ఆమోదించారు. వాజ్‌పేయికి ప్రాంతం వర్తించదు. పూర్తిగా దేశవాసి. కనుకనే అన్ని ప్రాంతాలనించి గెలిచి సభకి వచ్చారు. ఏ పార్టీకి చెందిన వారైనా ఆయనకు మిత్రులంటే మిత్రులే! అటల్జీ ఇంట్లో పీవీ ఫొటో ప్రముఖంగా ఉండటం చూసి, ఇదేమిటని అడిగారట ఒకాయన. రాజకీయ లబ్ధి కోసం మిత్రులను వదులుకోలేను అని జవాబు ఇచ్చారట. ‘‘ఒక పల్లెటూరి బడిపంతులు కొడుకునైన నా వంటి సాధారణ పౌరుడికి ప్రధాన పదవి కట్ట బెట్టారు. మన ప్రజాస్వామ్య శక్తికిది నిదర్శనం. ఈ దేశంలో వంశపాలనకు కాలం చెల్లింది’’ అంటూ హెచ్చరించారు. దీని వెనుక ఒకే ఒక్క ఓటు బలంతో ఆయనను గద్దె దింపిన సంఘటన తాలూకు ఉద్వేగం ఉంది. రోషం ఉంది. ‘‘నా విధి నిర్వహణలో విజయం వరించినా, అపజయం ఎదురైనా జంకను. రెంటినీ స్వీకరిస్తా. ఎందుకంటే రెండూ నిజమే కాబట్టి’’ ఇదీ అటల్జీ మనోభావం. భారతీయత ఆయన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. హిమాలయాల్లోని కులుమనాలి ప్రాంతం అంటే ఆయ నకు ఇష్టం. విశ్రాంతికి వెళ్లాలంటే మనాలిని కోరుకునే వారు. నాట్యం, సంగీతంపట్ల అభిరుచి ఆసక్తి ఉన్నవారు. మంచి భోజనప్రియులు. తెలుగువాళ్లం గర్వంగా చెప్పుకో తగింది– వాజ్‌పేయికి మన పుల్లారెడ్డి మిఠాయిలంటే పరమ ఇష్టం. తెలుగువారితో ఆయనిది తీయని అను బంధం. తరచూ ఆయన కవితా రచనలలో మృత్యువుతో పరిహాసమాడేవారు. సవాళ్లు విసిరేవారు. ఆ మహా మనీ షిని ఏ మృత్యువూ తీసికెళ్లలేదు. కోట్లాదిమంది హృద యాలలో అటల్జీ నిలిచే ఉంటారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సృష్టిలో తీయనిది...
‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి...’ అంటూ అమృత వాక్కులతో పల్ల వించారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. ఈ స్నేహో త్సవ వేళ ఈ సుకవిని, స్నేహానికి ప్రతీకగా నిలచిన బాపూరమణలని తలచు కోవాలి. ఇష్టాలు వేరు, పరిచయాలు వేరు, దగ్గరి తనాలు వేరు, స్నేహాలు వేరు. కృష్ణుడు, కుచేలుడు ఒక గురువు వద్ద శిష్యులు. ఇద్దరూ సన్నిహితులు. ఆ చనువుకొద్దీ మిత్రునివద్దకెళ్లి అర్థిస్తాడు. ఆ ఇష్టంకొద్దీ మిత్రుడు సంపదలిచ్చాడు. ఇదొక సందర్భం. కర్ణ దుర్యోధన సాన్నిహిత్యం మరో విధం. రాజరాజు తనపట్ల చూపిన ఔదార్యానికి కర్ణుడు జీవితమంతా శిరసువంచాడు. ఇష్టుడై సుయోధనుణ్ణి సరిదిద్ది కాపా డలేకపోయాడు కర్ణుడు. బంధుత్వాలు, వాటి ధర్మాల గురించి మన ప్రాచీన రుషులు అనేకచోట్ల ప్రస్తావిం చారు గానీ స్నేహధర్మాల ప్రస్తావనలు వినిపించవ్. యువరాణులకు చెలికత్తెలుంటారు. వాళ్లు చాలా హద్దుల్లో నడుచుకుంటూ యువరాణి కనుసన్నల్లో మెలగాలి. శిష్యుల్ని చతురోపాయాలతో శిష్యుల్ని సన్మార్గాన నడిపించిన గురువులున్నారు. రాజుకు అండదండగా నిలిచిన మహామంత్రులున్నారు. ఇవి స్నేహాలనిపించుకోవు. స్నేహమంటే... ఇక దానికి హద్దులుండవ్. ఈ సృష్టిలో అలాంటి దినుసు అదొక్కటే ఉంది. తెలుగునాట అందమైన ద్వంద్వ సమాసంగా సత్కీర్తి పొందారు బాపూరమణ. ‘రెండు కళ్లు – ఒక చూపు’ అన్నారు ఆచార్య సినారె. తెలుగు సరస్వతికి వాళ్లిద్దరు వాగర్థాలన్నారు. మేం బొమ్మా బొరుసులం అనుకున్నారు వాళ్లిద్దరూ. అరవై ఏళ్ల పైబడి ఈ బొమ్మ బొరుసులు నానా సందడి చేశారు. ఒకరు కథలు రాస్తే, ఇంకొకరు బొమ్మలు వేశారు. ఒకరు జోకులు, ఇంకోరు కొంటె బొమ్మలు.. ఒకరు దేవుడి బొమ్మలు గీస్తే మరొకరు దేవుడి కథలు– ఇలా వంతులేసుకుని మరీ తెలుగు నేలన కావల్సినన్ని పంటలు పండించారు. రకరకాల వంటలు వండి వడ్డించారు. వంటా వార్పూ అయ్యాక, బాపు రమణ లేత పచ్చని అరిటాకులై తెలుగువారి ముందు ఒదిగి పోయారు. ఎప్పుడో అరవై ఏళ్లుగా ఆ ప్రాణ మిత్రుల స్నేహం గురించి వారి కథలతోబాటు కథలు కథ లుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. వారిద్దరూ బాల్యమిత్రులు. ఇద్దరూ ప్రతిభా సంపన్నులే. ఎవరి వృత్తి విద్యలు వారివే. అయినా అవేవీ స్నేహానికి అడ్డు రాలేదు. ఇద్దరూ ఒక శుభోదయాన సినీ నిర్మా తలుగా మారారు. ఆనక అద్భు తాలు సృష్టించారు. విడిగా ఎవరి అభిరుచులు వారికుండేవి. కర్ణా టక సంగీతం రమణకిష్టం. బడే గులాం, మెహదీ హాసన్ గజళ్లంటే బాపుకి ప్రాణం. ఇవిగాక కలివిడిగా బోలెడిష్టాలుండేవి. అందులో ఆరుద్ర, కేవీ మహ దేవన్ ముఖ్యమైన కొన్ని. బాపూరమణ చాలా సార్లు విభేదించేవారు. చాలాసార్లు ఒకే రాగానికి కట్టుబడి తలలూపేవారు. ఏ గోదావరి లంకలోనో, ఏ కత్తవపాడులోనో కారప్పచ్చడితో అట్టు తినేటప్పుడు, పక్కన ఆ ఇద్దర్లో ఎవరు లేకపోయినా ఆ తిండికి రుచి లేనట్టే. వారిద్దరే కాదు ఆ రెండు కుటుంబాలూ వేళ్లనించి చిటారు కొమ్మలదాకా కలిసిమెలిసి పోయాయి. ఒకే ఇంట్లో ఉన్నారు. వాళ్ల సంగతి తెలిసిన చాలామందికి, వారి ద్దరి మధ్యా ఆర్థిక సంబంధాలు ఎట్లా ఉంటా యోననే ప్రశ్న వేధిస్తూ ఉండేది. ఔను, అది ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నే! ఒకసారి ఉన్నట్టుండి రమణ ఇల్లు పోయింది. బాపుకి తెలిసింది. ‘ఓస్! అంతే కదా, మా మేడమీద మేడ వేసుకో. దేవుడు మనిద్దర్నీ ఒకింట్లో పడుండమన్నాడు వెంకట్రావ్’ అని భరోసా ఇచ్చారు బాపు. ఆ భరోసా విలువ కొన్ని కోట్లు. బాల్య మిత్రులు స్నేహితులుగానే నడిచి నడిచి కుదు రుకట్టారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లై, ప్రయోజకులై పెళ్లీడు కొచ్చారు. అప్పుడు మిత్రులిద్దరూ, పోనీ ఇచ్చి పుచ్చు కుంటే.. అని కొంచెం ఆశ, ఇంకొంచం సరదా పడ్డారు. ఆ పిల్లలు ఇంకోలా ఆశపడి, మరోలా సరదా పడ్డారు. ‘అయితే అలాగే కానిద్దాం’ అంటూ కళాత్మకంగా, కలర్ఫుల్గా శుభలేఖలు డిజైన్ చేశారు బాపూరమణలు. ఆ దేవుడు మనల్ని ఈ విధంగా స్నేహితులుగానే ఉండి పొమ్మన్నాడయ్యా. ఆ విధంగా బంధుత్వాలు కలుపుకోవద్దన్నాడయ్యా’ అని మురిసిపోయారు బాపూరమణలు. అదొక విలక్షణమైన జంట, తాడూ బొంగ రంలా, గాలిపటం దారంలా, విల్లూ్ల అమ్ములా, స్నేహానికి నిర్వచనంలా. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వడ్ల గింజలో...
మొత్తానికి చంద్రబాబు ప్రయత్నం ఫలించింది. గజనీ మహమ్మద్ దండ యాత్రల్లాగా పదమూడు సార్లు విఫలమై ఆ తర్వాత అవిశ్వాసానికి సఫలమ య్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీవల్ల ఘోర మరియు తీరని అన్యాయం జరిగిందని ఆలస్యంగా చంద్రబాబు దృష్టికి వచ్చింది. అంతే! అవిశ్వాసానికి భేరి వేశారు. ఇప్పు డేం జరుగుతుందని నాలాంటి సగటు ఓటర్లకి ఉత్కంఠగా ఉంది. ఏమీ జరగదు, వడ్లగింజలో బియ్యపు గింజ అంటున్నారు. తెలివిమీరిన కొందరు. సభ్యుల సంఖ్యని బట్టి సభలో సమయం కేటాయిం చారు. తెలుగుదేశం పార్టీకి పదమూడు నిమిషాల ‘టాక్ టైం’ వస్తే, బలవంతంగా ఇంకో రెండు నిమి షాలు వినిపిస్తారేమో. అయితే అవిశ్వాసంపై చర్చ మొదలయ్యాక టీడీపీకి 50 నిమిషాల పైనే మాట్లాడ టానికి అవకాశం ఇచ్చారు. ఈ కాస్త వ్యవధిలోనే గతమంతా తవ్వి పొయ్యాలి. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఒత్తిడి తగ లకుండా నేపథ్యాన్ని చెప్పుకు రావాలి. మోదీ పాల నలో ఏపీకి జరిగిన అన్యాయాలను, మోదీ వాగ్దాన భంగాలను తెలుగుదేశం సభ్యులు గడగడా అప్ప జెప్పాలి. ఈ సందర్భాన్ని అడ్డం పెట్టుకుని భారత ప్రధానిని ఉతికి, ఝాడించి పార్లమెంట్ హాల్లో ఆరేస్తారు. దాంతో అధికార పార్టీ సొమ్మసిల్లిపో తుంది. అరె! తెలుగు తమ్ముళ్లు మన ప్రభుత్వ వైఫ ల్యాలని, మోదీ సవతి తల్లి ప్రేమని ఓ క్రమంలో కడిగి ఆరపోశారని విస్తుపోతారు. నేరకపోయి మన మోదీ చంద్రబాబుతో పెట్టు కున్నందుకు కమల దళం నాలుకలు కరచుకుం టుంది. కొందరికి ఒడుపు తెలియక నోట్లో నెత్తుర్లొ స్తాయ్. ఇలాంటి దృశ్యాన్ని టీడీపీ వూహిస్తోంది. కానీ అనుభవజ్ఞులు ఈ సీన్ రివర్స్ అవుతుందంటు న్నారు. తెలుగుదేశం సభ్యులు పాడిన పాటే పాడి, ఎనభై నిమిషాలు హరించుకుంటారు. ఇంకో ఇరవై నిమిషాలు కోరస్‌లతో సరి. ఇంకా ఇప్పటికి ప్రధాని వంతు రాలేదు. మోదీ తనదైన శైలిలో నిలబడి, తనదైన స్టైల్లో ఉండగా, వూహాతీతంగా ప్రసంగం ఆరంభమవుతుంది. బాబు దక్షతని పొగుడుతారు. రాష్ట్రంపట్ల బాబుకి గల భక్తి శ్రద్ధల్ని నొక్కి వక్కాణిస్తారు. గడచిన నాలుగేళ్లలో ఏపీకి ఎన్నేసి కోట్లు నిధులు ఇచ్చిందీ వివరిస్తారు. ఏయే సంస్థలు మంజూరు చేసిందీ చెబుతారు. రైల్వే జోన్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నామంటారు. మోదీ చాలా సమతూకంగా జవాబిస్తారు. మూడు గంటలసేపు నిండు హాల్లో మ్యాట్నీ సినిమా చూపిస్తారని ఒక వర్గం అభిప్రాయపడు తోంది. నిన్నటిదాకా తన మంత్రి వర్గంలో ఉండి సహకరించిన టీడీపీ మంత్రులని అభినందిస్తారట. ఆనక అసలు చిట్టాలు విప్పుతారట. ఎన్ని నిధులు దారిమళ్లాయో వివరిస్తారు. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ మోదీ వాగ్దానం కాదు. పోలవరం పూర్తి చేస్తారు. మోదీ ఆవేశపడరు. నా పరిధి భారతదేశంగానీ ఏపీ మాత్రమే కాదని చెబుతారు. తర్వాత లాంఛనప్రాయంగా ఓటింగ్ ముగు స్తుంది. నాలుగేళ్ల నా పాలన తర్వాత కూడా నాటి సభ్యులంతా నాతోనే ఉన్నందుకు ధన్యవాదాలు. ఈ సంగతి తేల్చుకోడానికి పార్లమెంట్లో అవకాశం కల్పించిన చంద్రబాబుకి ధన్యవాద్! మోదీ సుదీర్ఘ సమాధాన ప్రసంగంలో అనేక విషయాలు వెలుగు లోకి వస్తాయి. ఉన్నత న్యాయస్థానానికి సమర్పిం చిన అఫిడవిట్లో కేంద్రం బోలెడు అబద్ధాలు ఉటం కించిందని బాబు ఆరోపణ. దీన్నెవరూ పట్టుకు ప్రశ్నించలేరా? అఫిడవిట్ సంతకం చేసిన వారికి శిక్ష ఉండదా? ఇవి సామాన్యుడి సందేహాలు. చాలామంది ఏమంటున్నారంటే– మోదీ బయ టపెట్టే నిజాలు బాబు ప్రత్యర్థులకు కొత్త బలాన్ని స్తాయి. వైఎస్సార్సీపీ తదితరపార్టీలకు వచ్చే ఎన్ని కల దాకా అవి ఇంధనంగా ఉపయోగపడతాయి. నిధులకు సంబంధించిన నిజాల్ని నిగ్గు తేల్చడం అసాధ్యమేమీ కాదు. ఇప్పుడేం జరిగింది? మాట్లా డిందే మాట్లాడుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే అత్యంత విలువైన సభా సమ యం చాలా వృథా అయ్యింది. చంద్రబాబు మోదీని విలన్‌గా చూపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తు న్నారు. బీజేపీకి పెద్దగా ఓట్లు లేని ఏపీలో నష్ట పోయేదేమీ లేదని మోదీ ఉదాసీనంగా ఉన్నారు. వడ్ల గింజలో బియ్యపు గింజ! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
బొంగు బిర్యానీ?!
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర అధికార వంటకంగా ‘బొంగు బిర్యానీ’ని ఖాయంచేశారు. చాలామంది నిర్ఘాంతపో యారు. అది విశాఖ ప్రాంతంలో కొండదొరల వంటకం. పచ్చి వెదురు గొట్టంలో లేత కోడిని సమస్త మసాలా దినుసులతో దట్టించి, దాన్ని బొంగులోకెక్కించి, మంటమీద కాలుస్తారు. కోడి వెదురు గొట్టంలో ఒక పదునులో ఉడికాక దాన్ని తింటారు. అదొక మహత్తర సందేశంగా ప్రతిధ్వనిస్తుంది. అసలు దాని వ్యవహార నామం ‘బొంగులో కోడి’. ఈ బొంగు బిర్యానీ పేరు డొల్లగా, బోలుగా ధ్వనిస్తూ మా చంద్రబాబు ప్రసంగంలాగే ఉందని కొందరు వ్యాఖ్యానించారు. ‘బొంగు భుజాన వేసుకుని పోయెద మెక్కడికైన...’ అని తిరుపతి వేంకట కవులు పద్యంలో కోప్పడ్డారు. అసలు మనం ‘బిర్యానీ’ పదాన్ని వాడటమే శుద్ధ దండగ. అది మన సంప్రదాయం కాదు. తెలంగాణ నైజాం పాలనలో వారింటి వంటగా రకరకాల బిర్యా నీలు చెలరేగిపోయేవి. దాని రుచి, వైభవం విశ్వ వ్యాప్తమైంది. బిర్యానీ అంటే అది విశేషమైన నాన్ వెజ్ వంటకం. శాకాహారులు దాన్ని శాకపాకాలతో వండుకుని తృప్తి పడుతున్నారు. అటు ట్రైబల్స్‌ని ఆనందపరుద్దామని చంద్రబాబు ఆలోచన చేశా రేమో. అట్లా అనుకుంటే ‘నత్తముక్కల గోంగూర’ని రంగంలోకి దింపండి. అమరావతి అబ్బా అంటుంది. బడుగు బలహీన వర్గాలు గుంటూరు గోంగూరని, కొనకుండానే దొరికే నత్తముక్కల్ని కలిపి పొక్కిస్తారు. తిన్నవాళ్లకి అమరావతి కనిపిస్తుంది. ‘కొత్త రాష్ట్రం, కొత్త కాపిటల్, కొత్త ఆఫీసులు, ఆఫీసర్లు– ఇన్ని కొత్తల మధ్య ఈ బొంగు బిర్యానీ అవసరమా? నేటి అమరావతిని ఏలిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి పరంపర పొట్టేలు, కోడిపుంజు మాంసాలు విరివిగా తిని ధరణికోటకి పేరు తెచ్చారు. ఆ పునాదులమీద, ఆ పౌరుషాల పురిటిగడ్డమీద తిరిగి పునాదులెత్తాం. ఈ నేపథ్యంలో ‘ఈ బొంగు బిర్యానీ అవసరమా?’ అని అడుగుతు న్నారు తెలుగు తమ్ముళ్లు. కృష్ణా జిల్లా మంచి వంట లకు పుట్టినిల్లు. కొన్ని వందల సంవత్సరాలపాటు ప్రసిద్ధి వహించిన ‘బ్రాహ్మల ఇంగువచారు’ కృష్ణా జిల్లాలో ఒక సామాజిక వర్గం ఇచ్చిన కౌంటర్‌తో గింగిరాలు తిరిగింది.ఆ కౌంటర్ పేరు ‘ఉలవచారు’. అది మహత్తరం, బలవత్తరం. వేడి అన్నం, ఉలవ చారు బాబు దృష్టికి రాలేదా? బొత్తిగా అభిరుచి లేని మనిషి అని కొందరన్నారు. ఇహ గోదావరి జిల్లాల కెళితే, ఎన్ని కూరలు, ఎంత వైవిధ్యం? రాజమం డ్రిలో కూర్చుంటే, ఈ దేవుడు ఇంకో వందేళ్లు, ఫిట్ మెంట్ పడేస్తే ఆయన సొమ్మేం పోయిందనిపిస్తుంది. ఈ వరదాకాలంలో గోదావరికి ఎదురొస్తుంది పులస! వాటి కోసం బడా బడా బెంజికార్లు తలు పులు తెరుచుకుని గోదావరి ఒడ్డున నిలబడతాయి. ఆ జిల్లాలో అన్ని చేపలూ గోదావరి నీళ్లు తాగి, గాలి పీల్చి తెగ నోరూరిస్తాయ్. ఇహ పాలకొల్లు, అంత ర్వేది లాంటి చోట బెల్లపు జీళ్లు ఏవున్నావుంటాయ్. బెల్లాన్ని ముదురుపాకంలో దించి, దాన్ని కొండచిల వగా చేసి నున్నటి గుంజకి చుడతారు. ఇహ దాన్ని లాగి లాగి, పీకి బాబు ప్లీనరీ స్పీచ్‌ని తలపిస్తారు. చివరికి చప్పట్లు కొట్టినట్టు నువ్వులద్ది జీళ్లు తయారు చేస్తారు. అవి అనన్య సామాన్యంగా ఉంటాయి. కాకినాడ కోటైకాజా ఒక చిత్రం. మడత కాజా ఇంకో విచిత్రం. విశాఖపట్నం సముద్రపు చేప సామా న్యమా? పలాస జీడిపప్పు రచనలు, ద్రావిడ ప్రసి ద్ధం పనసబుట్టల్ని ఎప్పుడైనా తిన్నారా? నెల్లూరు సీమ పులి బొంగరాలు, కారం దోశెలు, ఆ దిగువన అల్లూరయ్య సమస్త పాకాలు, తెనాలి బెల్లం జిలేబి, అటేపు బొబ్బట్లు నాలిక్కి తగల్లేదా బాబూ! ఆత్రేయ పురం పూత రేకులు ఇంటర్నేషనల్ ఫేమ్. ఇంకా రాయలసీమ రాగిముద్ద, పధ్నాలుగు సరసమైన కలు పులతో అనాదిగా విరాజిల్లుతున్నది. అసలు రాగి సంగటిని డిక్లేర్ చేస్తే ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉండనే ఉండదు. అప్పుడు మనకి కడప ఇనుముతో పనే ఉండదు. చిత్తూరు జిల్లా పిట్ట మాంసాలన్నీ పూర్తిగా లోకల్. ఈ కొండ అడివి పిట్టల్ని తిన్నవారు అదో రకంగా ఉంటారని చెబుతారు. అయినా మనకి పులిహోర నించి పులగం దాని డజను చిత్రాన్నాలు న్నాయ్. ఎందుకసలు మన ముఖ్యమంత్రి రాష్ట్ర వంటకానికి పోటీ పెడితే, అద్భుతాలు చేయగల మన తెలుగింటి ఆడపడుచులు జిహ్వ కింపుగా ఓ ‘కొత్త’ వంటకం బంగారుపళ్లెంలో అంది స్తారు. వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
మిమిక్రీ చక్రవర్తి
ధ్వన్యనుకరణ కళకి ఆద్యుడు పూజ్యుడు నేరెళ్ల వేణుమాధవ్. ఆయనకు ముందు మిమిక్రీని ఓ కళగా ఒంట పట్టించుకుని జన సామాన్యాన్ని నవ్వు లలో ముంచెత్తిన వారు లేరు. ఆయనతో పుట్టి, ఆయనతో పెరిగింది. ధ్వన్యనుకరణ సమ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ ఇక వినిపించరు. మానవాళికి పెద్ద లోటు. ఆ సహస్ర కంఠుడు మూగపోవడంతో సుమారు ఏడు దశాబ్దాల అపురూపమైన సందడి సద్దుమణిగింది. వేదికలతో పని లేదు. ఆర్కెస్ట్రాతో అస్సలు పనిలేదు. తెరమరుగులు, దీపకాంతుల అవసరమే లేదు. నేరెళ్ల తన సహజమైన చిరు నవ్వుతో నడిచివచ్చి మైకు చేపడితే చాలు. జనం చప్పట్లు కొడతారు. ప్రారంభించకుండానే నవ్వడం మొదలుపెడతారు. వెంటనే సభ నిశ్శబ్దమైపోతుంది. యావన్మందీ చెవులు రిక్కిస్తారు. ఆయనొక స్వర మాంత్రికుడై విజృంభిస్తారు. స్వర మాంత్రికుడై శ్రోతల మనసుల్ని వశపరచుకుంటారు. మనకు దక్కిన మరో కోహినూర్ వజ్రం నేరెళ్ల వేణుమాధవ్. మా తెనాలిలో కొల్లా కాశయ్య, తాయారమ్మ దంపతులుండేవారు. ప్రజాహిత కార్యక్రమాలతో వారక్కడ ప్రసిద్ధులు. నేరెళ్ల కొల్లా వారి అల్లుడు. నా బాల్యంలో మా నాన్న తరచు కొల్లా వారింటికి తీసుకు వెళ్తుండేవారు. లోపల పెద్దలు వారి వ్యవ హారం సాగిస్తుంటే, నేను బయట రాలిన పొగడ పూలు ఏరుకుంటూ కూచునేవాణ్ణి. పొద్దు తెలిసేది కాదు. వారింటి కాంపౌండ్‌లో రెండు పెద్ద పొగడ మాన్లుండేవి. 1960లలో మొదటగా వేణుమాధవ్‌ని నేనక్కడ చూశాను. ఆ చెట్లు తిరుగుతూ, గొణు క్కుంటూ, ఆయనలో ఆయన నవ్వుకుంటూ, తర్వాత ఆయన వెలుగులోకి వచ్చారు. ఎన్టీఆర్ నిధుల సేక రణ యజ్ఞాలలో నేరెళ్ల పాలు పంచుకున్నారు. ఆయన తన ప్రజ్ఞ ద్వారా అందరికీ హితులయ్యారు. మా పరిచయం కొనసాగుతూనే ఉంది. పత్రికా రంగంలో ఉండటంవల్ల తరచూ కలుస్తుండేవాళ్లం. 1978లో నా జీవిత కథ మీరు రాసిపెట్టాలంటూ మా ఇంటికి వచ్చారు. మొత్తం అప్పటిదాకా నేరెళ్లపై కురి సిన ప్రశంసలు, వ్యాసాలు, సన్మానాలు, బిరుదులు భోగట్టా దస్త్రాలన్నీ ఇచ్చి వెళ్లారు. అంతేకాదు, ఎవ్వ రికీ దక్కని అదృష్టం నాకు దక్కింది. వేణుమాధవ్ విజయవాడ ఎప్పుడొచ్చినా ఆయనకు ఉచితంగా ఆతిథ్యమిచ్చే మంచి హోటల్ ఒకటుండేది. అక్కడ దిగేవారు. నన్ను పిలిచేవారు. ఇక చిన్నప్పటినుంచీ కబుర్లు, ప్రపంచంలో ఎక్కడెక్కడో ప్రదర్శించిన ఘట్టాలు చేసి చూపేవారు. ఇలాగ దాదాపు ఏడాది పాటు... కనీసం వంద గంటలు. జీవితంలో నాకు అబ్బిన గొప్ప అదృష్టాల్లో ఇది ముఖ్యమైంది. ఇంతకీ నేను జీవిత కథ రాయనేలేదు. కావాలంటే పెద్ద వ్యాసం రాస్తానన్నాను. ‘‘చూడండి సార్! అమలాపురం నించి ఐరాస దాకా మెప్పించారు. నెహ్రూ, సర్వేపల్లి, బ్రిటిష్ రాణి, జాన్ కెనడీ మనసా మెచ్చుకున్నారు. మీరు నడిచే నవ్వుల రథం. ఇవి చెప్పాక ఏమి రాసినా కేటలాగు అవుతుంది గానీ వేరు కాదు. మీలాంటి కళాకారుల కథ ఎవరిది రాసినా అంతే అవుతుంది. మీ జీవితంలోని ఇతర సంగతులకు అంత ప్రాము ఖ్యం ఉండదండీ’’ అని దణ్ణం పెట్టాను. నా సంజా యిషీ ఆయనకు నచ్చలేదు. ఆనక పురాణంతో రాయించారు. మద్రాసులో కలిసినప్పుడు పుస్తకం ఇచ్చారు. ‘అంత బాగా రాలేదు. మీరన్నట్టు అందంగా ఆల్బమ్ వేస్తే బావుండేది’ అన్నారు. ఆ మహానుభావుడు నన్ను అపార్థం చేసుకోనందుకు ఆనందించాను. నేరెళ్ల చిత్తూరు నాగయ్యలో పరకాయ ప్రవేశం చేసేవారు. కొన్ని దృశ్యాలకు దృశ్యాలు పాటలు, హావభావాలతో సహా ప్రదర్శించి ఆశ్చర్యపరిచేవారు. మెకనాస్ గోల్డ్‌లో గుర్రాలు ఎడారిలో పరిగెత్తడం, నటి భానుమతి మాట పాట.. ఇలా ఏదైనా అద్భుతమే! నేరెళ్ల, గుమ్మడి, మిక్కిలినేని, సింగిరెడ్డి ఈ నలుగురూ ఆప్తమిత్రులు. మమ్మల్ని దుష్టచతు ష్టయం అనుకుంటారని గుమ్మడి నవ్వుతూ అంటుం డేవారు. ఆ నలుగురూ కలిసి కనిపిస్తే కళలు, కవి త్వం కొలువైనట్టనిపించేది. ఈ ఇష్టచతుష్టయంలో నాలుగో ఇష్టుడు కూడా కనుమరుగైనాడు. వారికి అశ్రునయనాలతో... శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బడిగంట మోగింది!
ఉన్నట్టుండి వీధుల్లో కొత్త సందడి మళ్లీ మొదలైంది. ఇంద్రధ నువులు నేలకి దిగివచ్చి నట్టు, గుంపులు కట్టి సీతాకోక చిలకలు వీధుల్లో విహరిస్తు న్నట్టు, ఆధునిక సంగీతం యూనిఫాం ధరించి స్కూల్ బస్‌లో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే మళ్లీ స్కూళ్లు తెరిచారు. బడిగంట మోగింది. పిల్లలు... పిల్లలు... ఎక్కడ చూసినా బడిపిల్లలు. వాళ్లు అక్షర దీపాలు. మన ఆశా కిరణాలు. రెండు నెలలకు పైగా హాయిగా సెలవులనుభవించి, ఇప్పుడే ఒళ్లు విరుచుకుంటూ బడికి అలవాటు పడుతున్నారు. నిన్నమొన్నటి దాకా గడియారం వంక చూడకుండా నిద్ర పోయారు. హోం వర్కులు వాటి తాలూకు అమ్మ నసలు అస్సలు లేవ్. ఎప్పుడైనా నిద్రలేచి ఎప్పు డైనా స్నానం పోసుకోవచ్చు. అసలు ఓ పూట నీళ్లు డుమ్మాకొట్టినా ఎవరూ పట్టించుకోరు. కొత్త డ్రెస్సుల్లో, కొత్త తరగతుల కొత్త పుస్తకాలతో పిల్లలు నవనవలాడుతున్నారు. సై తరగతికి వచ్చినందుకు అంగుష్ఠమాత్రం పెద్ద రికం ప్రదర్శిస్తున్నారు. ఇన్ని రోజుల బ్యాక్లాగ్ విశేషాలు చెప్పుకోవాలి. అందుకని కబుర్లే కబుర్లు. తాతగారింటికో, నానమ్మ దగ్గరికో వెళితే ఆ సంగతులన్నీ దోస్తులకి పంచాలి. ఇన్నాళ్లలో ఇంటాబయటా చూసిన సినిమా కబుర్లు కల బోసుకోవాలి. ఎగరేసిన గాలిపటాలు, తీర్థంలో తిరిగిన రంగుల రాట్నం, ఆచోటెక్కిన జెయంట్ వీలు, మెట్రో రైలు, షూటింగ్లో అభిమాన హీరో– అన్నీ ప్రస్తావనకి వస్తాయ్. పిల్లల మాటల్ని మాటేసి వినండి. ఏ గొప్ప సంగీతమూ వాటికి సాటి రాదు. రెండేళ్ల వయసు దాటితే వాళ్ల మాటలు కలవవ్. అందుకని ఎవరి గ్రూప్ వారి దిగా విడిపోతుంది. పాపం, పుణ్యం, శ్లేషార్థాలు ఏమీ తెలియని పిల్లలన్నాడు మహాకవి. కులం, మతం, గోత్రం, వర్గం, ప్రాంతం తేడా తెలియని వాళ్లు. ఆ దశలో ఉండే అమాయకత్వాలని చిది మేసి పెద్దలు స్వార్థానికి వాడుకుంటారని భయ మేస్తూ ఉంటుంది. అమ్మ వెనకో, నాన్న వెనకో స్కూటర్ మీదో, బైక్ మీదో చిన్న చిన్న పిల్లలు కూచుని వెళ్తుం టారు. వాళ్ల భుజాలకో బరువైన సంచీ. మధ్యా హ్నం స్కూల్నించి వచ్చేటప్పుడు ఆ పిల్లలు నిద్రలో జోగుతూ ఉంటారు. నాకెంత భయమే స్తుందో చెప్పలేను. అమ్మనాన్నలని హెచ్చరించే అవకాశం ఉండదు. అయ్యలారా! అమ్మలారా! పిల్లల్ని జాగ్రత్తగా గమనించుకోండి. లేదంటే కలిపి ఓ బెల్ట్ పెట్టుకోండి. పదేళ్ల తర్వాత వీళ్లంతా ఒక ఆకృతి ధరి స్తారు. డాక్టర్, ఇంజనీర్, లాయర్, టీచర్ ఏమైనా అవచ్చు. క్రీడాకారులుగా, కళాకారులుగా రాణిం చవచ్చు. దీని తర్వాత బంగారు కలలు కనే దశ వస్తుంది. కెరియర్ పట్ల, జీవితంపట్ల బోలెడు ఆశలు, ఆశయాలు పొటమరిస్తాయ్. ఈనాటి ఈ ఇంద్రధనువులు ఒక్కోసారి నిరాశా నిస్పృహలను కలిగిస్తున్నాయి. ఎంట్రన్స్, ఇతర పోటీ పరీక్షా ఫలితాల సీజన్ వస్తోందంటే గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయ్. అనుకున్న ర్యాంక్ రాకపోతే చని పోవాలా? చదువుల్లోనే కాదు, మానసికంగా కూడా గట్టి పడాలి. ఇలాంటి సంఘటనలప్పుడు వారి తల్లిదండ్రులే కాదు, అందరూ విలవిల్లాడు తారు. పదిలం! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అద్భుతాలు సరే, ఇంకేం చేస్తారు
అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎక్కడైనా నెగటివ్ ఓటు బెడద ఉంటుంది. ఎందుకంటే ప్రచారవేళ ఓటర్లకి కావల్సినన్ని ఆశలు పెడతారు. అవన్నీ తీర్చలేమని వాళ్లకి తెలుసు. అయినా ముందు గట్టెక్కేస్తే తర్వాత సంగతి తర్వాత చూద్దామనుకుంటారు. సామాన్యంగా రుణమాఫీలు పారవేస్తారు. ఇంటికో ఉద్యోగం ఆశ పెడతారు. ఇంక పింఛన్లయితే చెప్పక్కర్లేదు. ఈ వలలు పన్నడంలో, ఎరలు వెయ్యడంలో రాష్ట్రాల ఫక్కీ వేరు. కేంద్రం పంథా వేరు. మోదీ ఇంకేముంది ‘‘స్విస్ ఖాతాలు తెరుస్తాం, అర్జంటుగా అక్కడి నల్లధనాన్ని అవసరమైతే విమానాల్లో తరలిస్తాం. మనిషికింతనో, ఓటరుకింతనో దామాషా ప్రకారం పంచుకోండి. పంపిణీలో మా ప్రమేయం ఉండదు. మాకు ఓటెయ్యని వారికి కూడా ఆ నల్లధనంలో వాటా ముడుతుంది. కాకపోతే, మేం గెలిస్తేనే కదా మీకీ స్విస్ సౌభాగ్యం అంటేది. కనుక మీ విలువైన ఓటు మాకే’’ అనేసరికి అందరికీ బంగారు కలలు రావడం మొదలైంది. మోదీ కల ఫలించింది. ‘‘ఇట్లా ఏరు దాటాక తెప్ప తగలెస్తే ఎట్లాగండీ? ఈసారి ఏరు దాటాలంటే ఏం చేస్తారండీ’’ అని గద్గద స్వరంతో నిగ్గదీశాడొక ఓటరు. నాయకుడు చిద్విలాసంగా నవ్వి, ‘‘తెప్పలు ఆలోచనల్లాంటివి. ఆ తెప్ప పోతే ఇంకోటి పుట్టిస్తాం. ఈసారి భూగర్భ నిధులన్నీ జాతిపరం చేసే కొత్త ఆలోచనతో జనం ముందుకు వస్తాం. ఆ నిధుల విలువని బహిరంగంగా ప్రకటిస్తాం. దామాషా ప్రకారం మీరే పంచుకోండంటాం’’ అని వివరించాడు. రాష్ట్రాలు కేంద్రం స్థాయి ఆశలు పెట్టలేవ్. అందుకనే చంద్రబాబు ఇప్పుడు నెగటివ్ ఓటుని నెగటివ్తోనే గెలవాలని ప్రయత్నిస్తున్నారు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యమన్నారుగదా. అందుకని మైకు ముందుకొస్తే చాలు, మోదీ ఎంత ద్రోహం, అన్యాయం, కుట్ర చేసిందీ తీవ్ర స్వరంతో చెబుతున్నారు. ఏపీ ఓటర్లకి అంతా అయోమయంగా ఉంది. నిన్నటిదాకా మోదీ వెనకాల తిరిగారు. మంత్రి పదవులు అనుభవిం చారు. ప్రత్యేక హోదా వద్దన్నారు. ప్యాకేజీ శ్యమంతకమణితో సమానం అన్నారు. ఢిల్లీ కనుసైగల్లో ఉంటే తప్ప రాష్ట్రం ముందుకు నడవదన్నారు. ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రసంగాలన్నీ మోదీని దుర్భాషలాడటంతోనే సరిపోతున్నాయ్. ఇక రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ పార్టీలని కొంచెం తిట్టాలి కదా. దాంతోనే సరిపోతుంది. కనుక ఆయన్ని మళ్లీ గెలిపిస్తే ఏమేం చేస్తారో చెప్పడానికి ఆయనకి వ్యవధి ఉండటం లేదు. జరిగిపోయిన వాటి గురించి చర్చించి చర్చించి, అందర్నీ వేలెత్తి చూపడంవల్ల అస్సలు ప్రయోజనం ఉండదు. రుణమాఫీలు, మహా కాపిటల్ మహత్తర నిర్మాణం వగైరా లాంటి అద్భుతాలు కాకుండా, నిజంగా అసలేం చేస్తారో చెప్పండని అడుగుతున్నారు. ఇవ్వాళ, మేము ప్రాజెక్టులు కడతాం, అవీ ఇవీ చేసి తీర్చి దిద్దుదాం. అంటే ఎవరూ పట్టించుకోరు. తక్షణ ఫలాలు అందాలి. సద్యోగర్భాలు కావాలి. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కిలో రెండు రూపాయల బియ్యంతో కదా జనాన్ని జయించారు. అది గుర్తుంచుకోవాలి. శ్రీరమణ -
టెంక కాదు, టెక్నాలజీ ముఖ్యం
మామిడికాయ పచ్చళ్లకి సమయం ముంచు కొచ్చేసింది. తల్లులారా! మీరు టెక్నాలజీని వాడండి. నా మాట వినండి. ప్రపంచంలోనే మొదటిసారి మ్యాంగో పికిల్ యాప్‌ని ప్రారం భించనున్నారు. ఎందుకంటే ఇది మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు జాడీ. మన తెలుగింట ఆడపడుచులకు ఆవకాయల తయారీ కొట్టిన పిండి. దంచేయడం, పొడి చేయడం మన విద్య.ఈ సీజన్లో ఏపీలో కొన్ని వందల మెట్రిక్ టన్నుల మామిడి నిల్వ పచ్చళ్లని అమ్మలక్కలు జాడీలకెత్తుతారు. వీటి పాళాలు ఇంటికో తీరున, ఊరికో లెక్కన ఉంటాయ్. మన ఊళ్లలో ఆవకాయ పెద్దమ్మలు, మాగాయ మామ్మలు ఉంటారు. వాళ్లు మన ప్రాచీన ఋషుల్లా వారి అనుభవాలని క్రోడీకరించి ఫార్ము లాని ప్రచారంలోకి తెస్తారు. నమ్మిన వాళ్లు ఆచరిస్తారు. నమ్మనివాళ్లు నాస్తి కుల్లా మిగులుతారు.ఇందులో బ్రహ్మ విద్యలో ఉన్నట్లు రకరకాల వాదాలున్నాయ్. కొందరు టెంకవాదులు, మరికొందరు కండవాదులు, ఇంకొందరు టెంకండ వాదులు. అంటే రెండూ ముఖ్యమేనని విశ్వసించేవారు. పచ్చళ్లలో గ్లామర్ చింతకాయకి, గోంగూరకి లేదు. ఇది.బూర్జువా అభిరుచిగా అతి వాదులు ఆక్షేపిస్తూ ఉంటారు. ఆవకాయలో సామాజిక స్పృహమీద చర్చించడం ఆత్మలోకంలో దివాలా. కత్తిపీటల్లో ఆవకాయ కత్తిపీటలు వేరు. వూరికి రెండో మూడో ఉండేవి. ముందుగా వాటిని బుక్ చేసుకుని, తర్వాత కాయ తెచ్చు కునేవారు. ఆవకాయ ముక్క కొట్టడం ఒక విల క్షణమైన కళ. ఇది పరుష విద్య. కాయకే కాదు. ఈ పనికీ కండపుష్టి అవసరం. ప్రతి ముక్కకి అంతో ఇంతో టెంక పెచ్చు మనిషికి తత్వజ్ఞానంలా అతుక్కుని ఉండాలని శాస్త్రకారులు ఘోషిస్తున్నారు. అరిస్టాటిల్ హయాంలోనే ఈ ఆవకాయ సంప్రదాయం ఉన్నట్లు గ్రీక్ గ్రంథాలను జాగ్ర త్తగా పరిశీలిస్తే అవగతమవుతుంది. భాగవత పురాణంలో పోతన గోపాలకులు చద్దులారగించు వేళ మాగాయలాంటి నంజుళ్లని ఇష్టంగా తిన్నట్టు పేర్కొన్నారు. ఒక తెగ తెలుగువారు నూజివీడు చిన్న రసాలు, పెద్ద రసాలు ఆవకాయకి పెట్టింది పేరంటారు. ‘‘పీచు కావాలంటే హలో! నూజి వీడు రసాలకే చలో’’ అనే నినాదం ప్రచారంలో ఉంది. ప్రతి ఇంటా కారాలూ ఆవాలూ నూరే తరుణం ఇది. దినుసుల మీద కావల్సినంత గోష్టి నడుస్తుంది. ఈ రెండు నెలల్లోనే ఆవాలు, కారాలు, నూనెలు మీద జరిగే చర్చలకిగాను మొత్తంమీద రెండొం దల కోట్ల సెల్ బిల్ కాల్తుందని ఓ అంచనా. ఏ జిల్లా సంప్రదాయం ఆ జిల్లాదే. ఇప్పుడు చంద్రబాబు పూనుకుని, అందర్నీ ఓ జాడీ కిందికి తీసుకొచ్చి, అమరావతి ఆవకాయలుగా స్థిరీకరిస్తే బావుంటుందనిపిస్తోంది. ఈ వేసవిలో విదేశాలకు పంపే మామిడి పచ్చళ్లకి ప్రత్యేక కౌంటర్లు వెలుస్తాయ్. ఇండియాలో పెద్ద దిక్కు లేని వారికి, మేమున్నామంటూ కొన్ని సంస్థలు వచ్చాయ్. అన్నీ వాళ్లే చూస్తారు, ఎటొచ్చీ మనం డబ్బు చూడాలి. ఈ సీజన్లో అట్లాంటా నించి న్యూజెర్సీ నించీ, అమ్మా! హాయ్... సూపర్బ్, టిపికల్, వావ్ అంటూ లొట్టలు విని పించి, లక్షలాది తెలుగు ఇళ్లలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. దీనికి ఇంత సత్తా ఉందని తెలిస్తే, చంద్రబాబు ఊరుకోడు. ఓ ఉచిత సలహా కేంద్రం, పంపడానికి ఓ సేవా కేంద్రం స్వయంగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించే అవకాశం ఉంది. ఆయనకి టెంక కంటే టెక్నాలజీయే ముఖ్యం! వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
డబల్... డబల్
జనం చెవుల్లో అరటి పూలు పూయించవచ్చునని అనుకుంటే, ఏదో రోజు జనం వారి చెవుల్లో కాగడాలు వెలిగిస్తారు. రాజకీయ నాయకులు రూరల్ ఓటర్ కోసం కొత్త కొత్త గాలాలు, సరికొత్త వలసంచీలు తీసుకు తిరుగుతూ ఉంటారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తానని మోదీ నమ్మపలికారు. పంచవర్ష ప్రణాళిక పూర్తి కావస్తున్నా, రైతుల మొహాన పొద్దు పొడవ లేదు. ఇంతకీ ఏ విధంగా రైతు ఆదాయం పెంచుతారో చెప్పనే లేదు. ఇంకో నాయకుడు పూర్తిగా శిథిలమైన పంచాయతీ వ్యవస్థని పునర్నిర్మి స్తానని చెబుతున్నారు. అధికార వికేంద్రీకరణకి రాజ కీయం తెల్సిన నాయకుడెవడూ మొగ్గుచూపడు. ఒకప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనకి గ్రామ పంచాయతీలే మూలమని గుర్తొస్తుంది. ఇంకేవుంది ఆ దారిలో ఏలేద్దామనుకుంటారు. మన గ్రామ పంచాయతీలకి ఆదాయం లేదు. ముందు దాన్ని పెంచాలి. అన్ని లావాదేవీలపైన గ్రామాలకి వాటా పెట్టాలి. బళ్లు, గుళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వాటి విధుల్ని సక్రమంగా నిర్వర్తించేలా చూడాలి. గడచిన యాభై ఏళ్లుగా గ్రామాలు బస్తీలవైపు వెళ్తుంటే చూస్తూ కూర్చున్నాం. కులవృత్తులకు చెదపట్టింది. నేడు గ్రామాల్లో ఎనభై శాతం మంది పురుషులు మద్యానికి అలవాటుపడ్డారు. ప్రభుత్వాలు నిస్సిగ్గుగా మద్యం మీద బతుకుతున్నాయ్. రైతు ఆదాయం సబ్సి డీలతో పెంచుతారా? వాళ్లకి కూడా పింఛన్లు మంజూరు చేస్తారా? అదే మన్నా అంటే దళారీ వ్యవస్థని రూపు మాపుతామంటారు. అంతా వొట్టిది. అసలు మన రాజకీయ వ్యవస్థే అతిపెద్ద దళారీ వ్యవస్థ. ఆనాడు ఈస్టిండియా కంపెనీ ఏల కులు, లవంగాలు, ధనియాలు, దాసించెక్కలకి దళారీ హోదాతోనే దేశంలో అడుగుపెట్టింది. అందు కని మన నేతలకి అదొక దిక్సూచి. చిల్లరమల్లరగా ఓట్లు కొనుక్కుని ఓ ఎమ్మెల్యే తెర మీదికి వస్తాడు. అవసరాన్నిబట్టి ఆ ఎమ్మెల్యే ఏదో ధరకి అమ్ముడవుతాడు. పగ్గాల మీద ఆశ ఉన్న వారంతా కొనుగోళ్లమీద దృష్టి సారిస్తారు. ప్రత్యేకించి పాలసీలేమీ వుండవ్. అందరూ ప్రజాసేవ నినాదంతోనే సాగుతూ, వారి వారి ‘స్టామినా’ని బట్టి సొమ్ము చేసుకుంటూ ఉంటారు.ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తే కొన్ని కొన్ని ఆదాయ వనరులు గ్రామాల్లో కనిపిస్తాయ్. ధాన్యాలు, కూరలు, పండ్లు, మాంసం, చేపలు, పాలు– వీటన్నింటినీ ఉత్పత్తి చేసేది గ్రామాలే. దళారీలు కబళించకుండా గ్రామాల్ని కాపాడితే చాలు. దాంతోపాటు గ్రామాల్ని బస్తీలకు దగ్గర చెయ్యాలి. అంటే రవాణాకి అనువైన చక్కని రోడ్లు, జలమార్గాలని ఏర్పాటు చేయాలి. కేరళలో అతి చౌకగా జల రవాణా ఎలా సాగుతోందో గమనించవచ్చు. మనకి బొత్తిగా జవాబుదారీతనం లేకుండా పోయింది. నేతలకి సొంత మీడియా భుజకీర్తుల్లా అమరిన ఈ తరుణంలో ఎవర్నీ ఏమీ ప్రజలు ప్రశ్నించలేరు. అయిదువేలు జనాభా ఉన్న పంచాయతీలన్నింటికీ డ్రైనేజీ సౌకర్యం, పంచాయతీకి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేలా వెర్మి కంపోస్ట్ పరిశ్రమ మంజూరు చేసేశారు ఓ యువమంత్రి ఉదారంగా. జనం చెవుల్లో అరటి పూలు పూయించవచ్చునని అనుకుంటే, ఏదో రోజు జనం వారి చెవుల్లో కాగడాలు వెలిగిస్తారు. పాడుబడ్డ నూతులముందు నిలబడి నవ్వితే, తిరిగి నవ్వు వినిపి స్తుంది. అరిస్తే అరుస్తుంది. అడవుల్లో అజ్ఞానం కొద్దీ నక్కలు, ఎలుగులు అరుపు లతో వినోదిస్తూ ఉంటాయ్. నాయకులు మరీ ఆ స్థాయికి దిగకూడదు. ఈ నేల మీద పెట్రోలు, డీజిలు, గ్యాస్ లాంటి సహజ ఇంధనాలు పుష్కలంగా పండుతున్నాయ్. వాటిని చీడపీడలు అంటవు. అతివృష్టి అనావృష్టి సమస్యలు లేవు. గాలులు, గాలి వానలు చెరచలేవు. అయినా సామాన్య పౌరుడు ఈ నిత్యావసరాలను ఎంతకి కొంటున్నాడు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి! మనదొక పెద్ద దళారీ రాజ్యం. మన నాయకుల మాటలన్నీ దళారీ మాటలు. ఇది నైరాశ్యం కాదు, నిజం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
దడిగాడువానసిరా
సీఎం సమీక్షా సమావేశంలో అధికారులు నోట్ చేసుకున్న కీలక అంశాలు... ‘ఇక్కడ పట్టపగలు నరమేధం జరుగుతోంది. మమ్మల్ని కాపాడువారే లేరా’... అమరావతి మహాక్యాపిటల్ క్షేత్రంలో సభ కొలువు తీరింది. దైవాంశ సంభూతులమనే పూర్తి విశ్వాసం ఉన్న పుంజీలకొద్దీ అధికారులు సభని కిటకిటలాడిస్తున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో సమస్యలన్నిటినీ కాచి వడపోశారు. ఉలవలు నీళ్లలో పోస్తే తుక తుకా, తుక తుక తుగా, తుక్కతుకా ఉడకటం ఖాయం. సెక్యూరిటీ కారణాల వల్ల ఉలవల ప్రయోగం ఎవరూ చేయలేదు. చేస్తున్న మంచి పనులన్నిటికీ ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని అరవైనాలుగోసారి ముఖ్యనేత లూప్ వేశారు. ఏ ఒక్కరికీ రవ్వంత అవకాశం ఇవ్వకుండా, ముఖ్యనేత మాత్రమే అంకితభావంతో వాయించి వదులుతున్నారు. రాబోయే కొత్త ఊరగాయల దగ్గర్నుంచి సమస్త విషయాల మీద దిశానిర్దేశం చేసిపడేస్తున్నారు. సభ జరుగుతున్నంతసేవూ తోక పుస్తకాల మీద ఎంతో శ్రద్ధాసక్తులతో అధికారగణం పాయింట్లు నోట్ చేసుకుంటున్నారు. రమారమీ ఎనిమిదిన్నర గంటల తర్వాత సమీక్షా సమావేశం ముగిసింది. ఒక్కసారిగా సభ లఘుశంకలు తీర్చుకోవడానికి బతుకుజీవుడా అని లేచింది. జీడిపప్పు మర్యాదలతోనే ప్రెస్ మీట్ కూడా ముగిసింది. సినిమా వదిలినట్లుంది. బల్లల మీద వదిలేసిన తోక పుస్తకాలను, దొరికిన మేర బాల్ పెన్నులు పోగేసుకున్నా. అత్యంత శ్రద్ధాసక్తులతో జరిగిన సీఎం సమీక్షా సమావేశంలో అధికారులు నోట్ చేసుకున్న కీలక అంశాలు మా పాఠకుల కోసం.. ఒక పుస్తకంలో ‘ఇక్కడ పట్టపగలు నరమేధం జరుగుతోంది. మమ్మల్ని కాపాడువారే లేరా’ అని ఇంగ్లిష్ స్పెల్లింగ్‌తో రాశారు.పాల ఇంగువ, పిల్లాడికి వంటావదం–డోన్ట్ ఫర్గెట్. ఒక పుస్తకంలో చంద్రబాబుని తలపాగా తంబురాతో శంకర శాస్త్రి గెటప్‌తో గీశారు. సొంత కాబినెట్ కొలీగ్స్ ఇద్దరు వయొలిన్ మృదంగాలపై సహకరిస్తున్నారు. పోలికలు అంత బాగా రాలేదు.ఏడెనిమిది తోక పుస్తకాల మీద కనీసపు పిచ్చిగీతలు కూడా లేవు. వీరంతా అదమరిచి నిద్దరోయినట్లు భావించవచ్చు. ‘మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు చెప్పినట్లుగా సూర్యుడు తూర్పున ఉదయించడం ముదావహం. అలాగే చంద్రుడు.. చంద్రుడు (దిక్కుమీద డౌటు) ఆయన చెప్పిన వైపునే వస్తున్నాడు’. ‘నా సెల్ చార్జర్ రిపేరు.. లేదా కొత్తది’.పన్నెండో బుక్కుమీద, బ్రాడీపేటలో ఎక్కడో లోపలగా ఉన్న అట్లకొట్టు అడ్రసుంది. పొద్దున ఏడులోపు వెళ్లకపోతే సొంతింటి వంటకాన్నే తినవలసి వచ్చును. ‘ఆంధ్రాలో పిడుగుల్లెక్క సరిపోయింది. ఎటొచ్చీ మూడు మాత్రం లెక్కలకి అందలేదు. ఉరిమిఉరిమి మంగలాలమీద పడ్డట్టు భావిస్తున్నారు’. ప్రశ్న : తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? జవాబు : నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు. ‘బాగా ముదురుపాకం వచ్చాక, చంద్రబాబు తీర్మానాలల్లే తీగలు తీగలుగా సాగేప్పుడు– ముందుగా వేయించి పెట్టుకున్న సమస్త పప్పుల్నీ బాణలిలో వేసి శక్తికొద్దీ తిప్పాలి’. ‘సుబ్బి పెళ్లి ఎంకి చావుకని వెంకయ్య పదోన్నతితో చంద్రన్నకి రెక్క విరిగింది’. ‘నాకిప్పుడు శక్తి కావాలి. కనీసం సెలైన్ పెట్టండి’. ‘రాష్ట్రంలో పన్నెండేళ్లు రాగానే తెలుగు కుర్రాళ్లకి పంచెల ఫంక్షన్ ఈ ప్రభుత్వమే చేస్తుంది’. ‘రాష్ట్రాన్ని విద్యుత్ గనిగా చేస్తా!’ డాడీ! మన హెరిటేజ్ తోటలో ధనియాలు జల్లితే కొత్తిమీర మొలిచింది! ‘ఇంటలిజంట్ హబ్బా? మజాకానా’. సమావేశం ముగిసింది. స్వస్తి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పద్మవ్యూహంలో చంద్రన్న
బాబుకి జగన్ అంటే సింహస్వప్నం కాబట్టే వైఎస్సార్సీపీపై బురదజల్లే దీక్షలో ఉంటారు. దానికి బదులు మోదీ పాలనపై పూర్తి స్థాయిలో అస్త్రాలు సంధించడం మంచిది. అంతా గందరగోళంగా ఉంది. అంతా అయోమయంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కాలుష్య యుగం నడుస్తోంది. నరేంద్ర మోదీ ఇరగదీస్తాడని అంతా ఆశపడ్డారు. తీరా వచ్చాక ఓటర్ల వెన్నెముకలు అరగదీస్తున్నాడని జన వాక్యం. భాజపా పదవీ కాలంలో సింహ భాగం అయిపోయింది. సామాన్యుడికి వొరిగిందేమీ లేదు. దేవతా వస్త్రాల నేత చందంగా ఉంది మోదీ సర్కార్ వైఖరి. పూర్వం మన ప్రధాని ఒకాయన దేశానికి జటిల సమస్య వచ్చినప్పుడల్లా ఢిల్లీ పెద్దాసుపత్రిలో చేరేవాడు. పెద్ద డాక్టర్లు వాళ్లు చుట్టూ చేరి, వారికి సెగ తగలకుండా కాపాడేవారు. జబ్బేమిటంటే– అది తెలుసుకొనే పనిలో ఉన్నామని డాక్టర్లు ముప్పొద్దులా బులెటిన్లు విడుదల చేసేవారు. మూడో రోజుకి దేశ సమస్య ఒక కొలిక్కి వచ్చేది. పరిష్కారానికి ఒక దారి కనిపించేది. ప్రధాని ఠక్కున దిండుని ఓ తన్ను తన్ని, బయటికొచ్చి, ‘నా దేశం.. నా ప్రజలు... నా ఊపిరి’ అంటూ తిరిగి వార్తల్లో పడేవాడు. ఇప్పుడీ ప్రధాని కూడా కొన్ని చెవిన పెట్టక, కొన్ని పెడచెవిని పెడుతూ కాలాన్ని తన్నుకుంటూ పబ్బం గడిపేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మోదీ చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారని ఆర్నెల్లనాడు మాట వరుసగా జనం మధ్యకు వచ్చిన మాట అతి వేగంగా ముదిరింది. విస్తరిం చింది. అసలేమీ మాట్లాడరేంటి. ఓ కొత్త రాష్ట్రం ఇక్కడ అఘోరిస్తోందని గమనించరేంటి. బీజేపీ పద్మవ్యూహంలో చంద్రబాబు బాగానే ఇరుక్కున్నారు. ప్రతికూల పవనాలను అనుకూలంగా మార్చుకోవడంలో దిట్టనని తరచూ చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారు. మోదీ ఈ పరీ క్షని మిత్రునికి కావాలనే పెట్టారా? రేపు ధర్మదీక్షలతోనో, అధర్మదీక్షలతోనో తెలుగునేత వ్యూహాన్ని ఛేదించుకు బయటపడితే– చూశారా.. చూడండి... దటీజ్ బాబు. నా మిత్రుని శక్తియుక్తుల్ని దీక్షాదక్షతల్ని ఈ అగ్నిపరీక్ష ద్వారా నిగ్గుతేల్చాను. కనుక మీరు రానున్న ఎన్నికల్లో బాబుకే ఓట్లు వెయ్యండి. బాబు నెగ్గితే మేం నెగ్గినట్టే ఎందుకంటే ఈసారి కలిసే పోటీ చేస్తాం. నీళ్లని చీల్చుకుంటూ నావ వెళ్తుంది. నది రెండుగా చీలినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మరో కొసనుంచి చీలికలు కలసిపోతూ తిరిగి మహానది ఏ మాత్రం చీలనట్టే కనిపిస్తుంది. కొందరేమంటారంటే ఎన్నికల ముందు కోరిన వరాలే గాక, కోరనివి కూడా ఇస్తారు. బీజేపీ ఉత్తుత్తి కబుర్లేగానీ, ఎన్నికల బరిలో కత్తులు దూసినట్టు కరెన్సీ దూస్తున్నారని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. చిన్న చిన్న రాష్ట్రాలలో కుర్చీ కోసం బీజేపీ పడ్డ తాపత్రయాలు నిన్న మొన్నటి వార్తలు. ఒకప్పుడు ఉల్లిపాయలు దేశ రాజకీయాల్ని తారుమారు చేస్తుండేవి. ఇప్పుడు వట్టిపోయిన గోమాతల్లా వీధులపక్క నిలబడ్డ ఏటీయంలు కమలపాలనని బ్లాంక్ ఫేస్‌లతో వెక్కిరిస్తున్నాయ్. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉందని బ్యాంకు ఖాతాదారులు నిమిషానికోసారి వాపోతున్నారు. బీజేపీ, సంఘ్ వారు సైతం మోదీ వైఖ రిని సమర్థించలేక పోతున్నారు. ఆయన అమిత్ షా కాదు, అమృత్ షా అంటూ కొనియాడిన వారు ఇప్పుడు నాలికలు తిప్పేసి, అంతా ఉత్తిదే అంటున్నారు. చంద్రబాబు విఠలాచార్య సినిమాలో రాకుమారుడిలా, రెండు చేతులతో రెండు కత్తులు ఝళిపిస్తూ– ఒక చేత ప్రధానిని, ఇంకో చేత జగన్‌ని నిలువరించడానికి ప్రయాసపడుతున్నారు. చంద్రబాబుకి జగన్ అంటే సింహస్వప్నం. అందుకని అకారణంగా, అసందర్భంగా, అదే పనిగా వైఎస్సార్సీపీ పై బురదజల్లే దీక్షలో ఉంటారు. బురదదీక్షకి కాసేపు స్వస్తిపలికి, అమరావతి తెలుగు సోదరులు మోదీ దుష్ట పాలన మీద పూర్తి స్థాయిలో అస్త్రాలు సంధించడం మంచిది. ఎదుటివారిపై ఒక వేలు చూపిస్తే, మూడవేళ్లు మనల్ని చూపిస్తాయన్న క్కురల్ సూక్తిని గుర్తు చేస్తూ తెలుగు తమ్ముళ్లని కార్యోన్ముఖుల్ని చేస్తున్నా. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
లంచాల రేట్లు పెరిగాయ్!
ఎద్దువెనక నక్కలాగా మోదీ వెనుక బాబు ఏదో ఆశించి తిరిగారు. ముప్ఫై ఢిల్లీ విజిట్లవల్ల విమానం ఖర్చులు తప్ప ఒక్క హామీ కూడా సాధించలేక పోయారు. ‘‘గత కాలము మేలు...’’ అని జనం అనుకుంటు న్నారు. మోదీ పాలనపై నాలుగేళ్ల తర్వాత సమీక్షించు కుంటే వెలితిగా అనిపిస్తోంది. ఆనాడు వాజ్‌పేయి పాలిం చింది నికరంగా నాలుగేళ్లే అయినా జనహితానికి ఎన్నో కొండ గుర్తులు సృష్టించారు. కేవలం ఈ నెలల వ్యవధిలో మోదీ ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందనే ఆశ లేదు. వచ్చీ రాకుండానే నల్ల ధనవంతుల మీద, అవినీతి మీద రంకెలు వేశారు. ఒక్క రూపాయి నల్లధనం దొరకలేదు. చెలామణిలో ఉన్న కరెన్సీని బూడిద చేసి కొత్త రంగుల్లో కొత్తనోట్లు వదిలారు. పెద్ద నోట్ల రద్దుతో ఖజానాకి వరదొస్తుందని చెప్పారు. ఏమీ రాలేదు. పాపం, గ్రామా లలో వయోవృద్ధులు, అమాయకులు వారు ప్రాణపదంగా దాచుకున్న పెద్ద నోట్లు పనికిరాకుండా పోయాయి. ఆనాటి ప్రభుత్వం మూడు సింహాల ముద్రతో, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి చేవ్రాలుతో ఇచ్చిన ప్రామిసరీ నోటుకి మర్యాద, విలువ లేకుండా పోయింది. ఆనాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వద్దన్నా వినకుండా ఏక పక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మోదీ మీద అభియోగం. అవినీతి ఆగలేదు. ఎమర్జెన్సీ రోజుల్లో లాగే, రిస్క్ పెరిగిందని అవినీతికి రేట్లు పెంచారు. ఉన్నత స్థాయిలో కుంభకోణాలు లేవని గుండీలమీద చేతులేసుకుని చెబుతున్నారు. మహా స్కాముల్ని రాజకీయ లబ్ధి కోసం నిర్వీర్యం చేయడం స్కాం కాదా అంటున్నారు. గెలుపు కోసం ఈశాన్య రాష్ట్రాలలో కరెన్సీని కురి పించలేదా అని ప్రత్యక్ష సాక్షులు నిగ్గతీస్తున్నారు. వెంకయ్యనాయుడిని జన జీవన స్రవంతి నుంచి వేరు చేసి, ఏనుగు అంబారీ ఎక్కించడం మాత్రం మోదీ గొప్ప ఎత్తుగడగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.ఆనాడు మోదీని ఎంత గ్లామరస్‌గా ప్రదర్శించినా, దక్షిణాది రాష్ట్రాలలో ఆ పప్పులు ఉడకలేదు. ఉత్తరాదిలో అప్పటికే కాంగ్రెస్ కొడి గట్టడం, గుజరాత్ ముఖ్యమంత్రిగా మహాద్భుతాలు చేశారన్న ప్రచారం అటు బాగా పనిచేసింది. మోదీని నిలబెట్టింది. వస్తు, సేవల పన్ను విధానానికి కావల్సిన మెజార్టీ సాధించి నెగ్గించగలిగారు. అర్ధరాత్రి జీరో అవర్‌లో జీఎస్టీ పండుగని పార్లమెంట్ భవనంలో జరిపి, నాటి స్వాతంత్య్రోత్సవాన్ని తలపించారు. సంతోషం. పన్నులకు తగిన సేవలు లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడా టౌన్లకి సరైన రోడ్లు లేవు. వీధి దీపాలు లేవు. డ్రైనేజీ లేదు. రక్షిత మంచినీరు లేదు. ఇప్పుడే గ్రామాలమీద దృష్టి పడింది. గ్రామాలంటే రైతులు. వాళ్ల ఓట్ల కోసం ఒక్కసారిగా ఇవ్వాళ గ్రామాలు గుర్తొచ్చాయి. స్వచ్ఛ భారత్ జరిగిన దానికంటే ప్రచారం అధికంగా జరుగుతోంది. పెద్ద నగరాలలో, అనేకానేక కాలనీలలో చెత్త పేరుకు పోతోంది. బ్యాంకింగ్ రంగం అనేక కారణాలవల్ల ఎన్.పీ.ఏ.గా తయారైంది. బడా బాబులకి వేలాది కోట్లు ధార పోసింది. మోదీ జన్‌ధన్ పథకం సామాన్యులకి ఏమి ఒరగబెట్టిందో తెలియదు. ‘మనసులో మాట’ వినడానికి బావుంది. తాజాగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఓటర్లని మోదీ పైకి ఉసికొల్పుతున్నారు. మోదీ, వైఎస్సార్సీపీ కలిసిపోయి కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని చంద్రబాబు అభియోగం. ఎద్దువెనక నక్కలాగా మోదీ వెనుక చంద్రబాబు ఏదో ఆశించి తిరిగారు. కానీ ఏమీ రాలేదు. ముప్ఫై ఢిల్లీ విజిట్లవల్ల విమానం ఖర్చులు తప్ప ఒక్క హామీ కూడా సాధించలేక పోయారు. అందుకని ఆదికవి నన్నయ అన్నట్టు గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
కేంద్రం సత్యం
అన్ని దేశాల వాస్తుకి సరిపోయేలా 33 వేల ఎకరాల నేలని చూపిస్తే అది హాట్ కేక్ అవుతుందని బాబు కలలు కన్నారు. అదంత వీజీ కాదని తేలింది. చంద్రబాబు బాగా ఇరుకున పడ్డాడని కొందరు అనుకుంటున్నారు. సమస్యే లేదు, వ్యతిరేక పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొనే సామర్థ్యం ఉంది. పొలస చేపలా వరద గోదారికి ఎదురీదగలడని ఇంకొందరంటున్నారు. పొత్తిళ్లనాటి నించి చంద్రబాబు గంపెడాశలతో మోదీ వెనకాల ఆవు వెంట దూడ వలె తిరుగుతున్న మాట నిజం. ఆఖరికి మోదీ చాటపెయ్యని చూపించి, చేపించి పాలు పిండుకున్నారని కొందరు వ్యాఖ్యా నిస్తున్నారు. కొన్ని బిల్లులు ఇవ్వకపోయినా, చాలా బిల్లులకు ప్రధానికి బాబు సహకరించారని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. మోదీకి చంద్రబాబు పాలనమీద పూర్తి నమ్మకం ఉంది. ఘటనాఘటన సమర్థుడని విశ్వాసం ఉంది. అందుకే చంద్రబాబు భుజంమీద మోది చెయ్యి వేశారని చెబుతారు. అవసరమైతే ఏ భాష సభ్యులనైనా ఓ గొడుగు కిందికి చేర్చగల పనితనం చంద్రబాబుకి ఉందని పెద్దాయనకి గట్టి నమ్మకం. ఇక ఇట్నించి చూస్తే– వాజ్‌పేయి హయాంలోలాగే ఆవకాయ వాటంగా, నల్లేరుమీద బండి చందంగా నడిచి పోతుందనుకున్నారు. బాబుకి ప్రమాణ స్వీకారం దగ్గర్నించి మోదీ హయాం గతుకుల రోడ్డుగానే అనిపిస్తోంది. కుదుపులు, మలుపులు బాగానే ఇబ్బంది పెడుతున్నాయ్. ఎన్టీఆర్ ‘కేంద్రం మిథ్య’ అని ప్రతిపాదిస్తే చంద్రబాబు ‘కేంద్రం సత్యం’ అని విభేదించారు. మనం కేంద్రంతో గొడవపడితే, కష్టాతికష్టం అది నష్టాతినష్టం అని తాను నమ్మి ఏపీతో నమ్మించారు. మనం తెలివిగా స్నేహ భావంతో ఉన్నట్టే ఉండి మనక్కావల్సిన నిధులు రాబట్టుకోవాలి. నేనేదో చేస్తున్నానని ఎన్నోసార్లు నొక్కి వక్కాణించారు. సరిగ్గా మోదీ కూడా స్నేహ భావం విషయంలో అదే వ్యూహంతో ఉన్నారు. మిత్రపక్షం కుంపట్లో చంద్ర బాబు పప్పులు ఉడకలేదు. గోలవరం తప్ప పోలవరం కదల్లేదు. ప్రపంచ ప్రసిద్ధ కాపిటల్‌లో మొదటి అక్షరం కూడా పడలేదు. ప్రధాని ప్రత్యేక విమానంలో ఉదారంగా తెచ్చిన మృత్తికలు, గంగాజలం మాత్రం ప్రజకి బాగా గుర్తుంది. 33 వేల ఎకరాల నేలని అన్ని దేశాల వాస్తుకి సరిపోయేలా చూపిస్తే అది హాట్ కేక్ అవుతుందని బాబు కలలు కన్నారు. అదంత వీజీ కాదని తేలింది. గుగ్గిళ్ల మూటని చూస్తూ పరిగెత్తిన గుర్రంలా నాలుగేళ్లు చంద్రబాబు భ్రమలో ఉన్నమాట నిజం. ఇప్పుడు మార్గాంతరం లేదు. గేరు మార్చి ప్రత్యేక హోదా జిందాబాద్! ప్యాకేజి డౌన్ డౌన్ అని అరుస్తున్నారు. మిత్రపక్షంలో ఉంటామంటూనే ఒకటిన్నర మంత్రి పదవుల్ని త్యాగం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం చేజారి ఇంకోరి చేతుల్లోకి పోతుందేమోనని టీడీపీకి భయం. వైఎస్సార్సీపీ వైపు బీజేపీ మొగ్గుతుందేమోనని తెలుగుదేశంకి పీడకలలు వస్తున్నాయి. తృతీయఫ్రంట్ అనే ఓ గడి ఖాళీగా ఉంది. చంద్రబాబు ఆ గడిలోకి రాకుండా కేసీఆర్‌తో మోదీయే కర్చీఫ్ వేయించాడని ఓ వదంతి ప్రచారంలో ఉంది. ఈ గందరగోళాల్లో వేలకోట్ల బ్యాంకు స్కాంలు, ఏపీ బడ్జెట్ పక్కకి వెళ్లి పోయాయి. ఇంతా చేసి అంతా ఒకటే. మోదీ, చంద్రబాబు, కేసీఆర్– ఎవరెవరితోనూ విభేదించరు. అనంత విశ్వంలో గ్రహాల్లా ఎవరి కక్ష్యలో వాళ్లు తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు మాత్రం గ్రహణాలు తెప్పించుకుంటూ ఉంటారు. తర్వాత సంప్రోక్షణలు జరుగుతాయ్. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు -
బ్రాండ్ రైస్
అమరావతి కోసం అడిగిందే తడవుగా మూడు పంటలు పండే సుక్షేత్రాలను రైతులు అప్పగించారంటే– ఆరుగాలం కష్టించే రైతు విసిగి వేసారి ఉన్నాడని ఒక సర్వే సారాంశం. గ్రామసీమలు, పల్లెపట్టులు, అన్నదాతలు, వెన్నెముకలు, రైతన్నలు, రైతురాజులు, కృషీవలురు, జైకిసాన్– ఇవన్నీ ఒఠ్ఠి మాటలు. గట్టి మేలెవరూ తలపెట్టడం లేదు. ప్రతిసారీ రైతుల్ని ఉద్ధరిస్తాం, గ్రామాల్ని ఉద్ధరిస్తాం అనే నినాదంతోనే రాజకీయ పార్టీలు బరిలోకి దిగుతాయి. తరాలు గడిచినా మట్టిని నమ్మిన వారికి అమాయకత్వం పోలేదు. తను దున్ని, విత్తి, పోషించి పండించకపోతే దేశానికి అన్నం ఉండదని గట్టిగా నమ్ముతాడు. తన కోసమే ఎండలు కాస్తున్నాయని, తన కోసమే వానలు పడుతున్నాయని విశ్వసిస్తాడు. దాన్ని ఆసరా చేసుకుని మన నల్లదొరలు హాయిగా ఏలుతున్నారు. ఏనాడూ సేద్యం రైతుకి అధిక లాభాలు తెచ్చి పెట్టింది లేదు. అయినా రైతు కాడి కింద పారేసింది లేదు. కారణం ఆ రోజుల్లో గ్రామాల్లో జీవన వ్యయం తక్కువ. ఇప్పుడు బస్తీలతో పోటీ పడుతోంది. డెబ్భై ఏళ్లలో ప్రాథమిక సౌకర్యాలు కూడా పల్లెలకు అంద లేదు. రోడ్డు, కరెంటు లేని ఊళ్లు ఇంకా ఉన్నాయి. పెద్ద గ్రామాలకు సైతం శుద్ధమైన నీరు లేదు. సరైన విద్య లేదు. వైద్య సదుపాయం బొత్తిగా లేదు. ఎన్ని ప్రాథమిక పాఠశాలల్లో సరైన విద్య అందుతోందో, ఎన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంచి వైద్యం ఉందో గుండెమీద చెయ్యి వేసుకు చెప్పండి. టీచర్లు, డాక్టర్లు నగరంలో ఉండి ఊళ్లో బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. దరిద్రం, అనారోగ్యం, విద్య లేమి కారణంగా వలసలు మొదలై నాయి. ఇది ఆరంభమై యాభై ఏళ్లు దాటుతున్నా, నాయకులు గమనిం చినా దీనికి అడ్డుకట్ట వేసే ప్రయ త్నం చిత్తశుద్ధితో ఆరంభించలేదు. సకల సౌకర్యాలతో ఉన్న గ్రామాలు ఇప్పటికీ నిండుగా కన్పిస్తున్నాయి. రైతుకి సకాలంలో సరైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు లేరు. వారు వ్యవసాయ శాస్త్రం చదివిన వారు కాదు. అనూచా నంగా వచ్చే పద్ధతుల్నే పాటిస్తారు గానీ నూతన విధానాలంటే భయ పడతారు. వారికి కౌన్సెలింగ్ అవ సరం. యూరియా లాంటి రసాయ నాలు అతిగా ఎందుకు వాడరాదో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వచ్చే అనర్థాలని చూపాలి. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక పరిశోధనా కేంద్రం ఉండాలి. అక్కడ అన్ని రకాల పంటల్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో పండించాలి. అలాగ రైతుని నమ్మించాలి. అతిగా నీటి వాడకం, ఎరువుల, మందుల వాడకం, ఇతర అశాస్త్రీయ నమ్మకాల్ని వమ్ము చేయాలి. ఇదంతా ఎవరు చేస్తారు? అమరావతి కోసం అడిగినదే తడవుగా మూడు పంటలు పండే సుక్షేత్రాలను రైతులు అప్పగించారంటే– దాని వెనుక ఆరుగాలం కష్టించే రైతు విసిగి వేసారి ఉన్నాడని ఒక పరిశీలనలో తేలింది. పూర్వం గ్రామీణులకు ఇతర ఆదాయాలు ఉండేవి. పాడి పశువులు, గొర్రెలు, కోళ్లు, పెరటి కూరలు రోజువారీ ఖర్చులకు ఆసరాగా ఉండేవి. యాంత్రీకరణతో పశుసంపద పోయింది. జనం సుఖం మరిగారు. దళారీ రాజ్యం వర్ధిల్లుతోంది. నిజానికి బ్రోకర్లే ప్రజల్ని ప్రభుత్వాల్ని శాసిస్తున్నారు. ఇప్పుడు పుట్టు కొస్తున్న బ్రాండెడ్ రైస్‌లు, వాటి వ్యాపార ప్రకటనలో చూస్తేనే అర్థమవుతుంది. తడుపు తగలని మంచి సన్న ధాన్యాన్ని కల్లాల్లోనే సొంతం చేసుకుంటారు. రైతు ఎప్పుడు డబ్బులు చేతికందుతాయా అని ఎదురు చూస్తుంటాడు. చాలామంది సామాన్య రైతులు ముందే అప్పులు లేదా అడ్వాన్సులు తీసుకుని ఉంటారు. ఇక రుణదాత ఎప్పుడు వసూలు చేయమంటే అప్పుడు చేయాల్సిందే. రైతుకి గడ్డి మిగుల్తుంది. తినేందుకు పశువులు కూడా లేవు. ‘రైతు ఉద్ధరణ’ బాగా కలిసొచ్చిన నినాదం. అందుకే కమల్ హాసన్ ఆ మాటతో రంగంలోకి దిగాడు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
అది తిరునామం!
చంద్రబాబు ‘ప్యాకేజీ’ అనే ఎండమావి వెనకాలపడి నాలుగేళ్ల నుంచీ పరుగులు పెడుతున్నారు. దానివల్ల దాహం పెరిగిందిగానీ ఎక్కడా తడి తగల్లేదు. బాగా ఎల్తైనవి, చాలా లోతైనవి మామూలు దృష్టికి అంతుచిక్కవు. ఉదాహరణకి భూగోళం. అది గుండ్రంగా ఉంటుందని, నారింజపండు లాగానో, రుద్రాక్ష కాయలా గానో ఉంటుందనే సత్యం మామూలు కంటితో చూసి నిర్ధారించలేం. నిజం నిరూపించాలంటే చాలా ఎత్తుమీద నుంచైనా చూడాలి, లేదా అత్యాధునిక టెలిస్కోపునైనా వాడాలి. రాజకీయం తెలుసు కాబట్టి చక్రం తిప్పుతానని ఊరికే అతి విశ్వాసంతో ముందుకు వెళ్లకూడదు. శాస్త్ర పురాణాలు క్షుణ్ణంగా కాకపోయినా పైపైన అయినా చదవాలి. దేవుడు పది అవతారాలెత్తాడు. కానీ ఏ రెండూ ఒక దాన్ని పోలి ఒకటి లేవు. చేపకి, తాబేలుకి, నరసింహానికి సాపత్యం ఏవన్నా ఉందీ? లేదని భావం. వామనావతారం మరో చమత్కారం. భూమికి జానెడు ఎత్తున వటువుగా నడిచి వచ్చి మూడు వేళ్లు చూపించి మూడడుగుల దానం ఇమ్మన్నాడు. బలి చక్రవర్తికి తెలిసి చావలా– అవి మూడేళ్లు కావు తిరునామం. ఆంతర్యం అంతుపట్టక తీసుకో, కొలుచుకో అన్నాడు. అంతే! వామన పురాణంగా వాసికెక్కింది. ఒకే ఒక డాట్‌ని విశదపరిస్తే కేంద్ర బడ్జెట్ సవివరంగా వచ్చినట్టు– వామనుడు త్రివిక్రముడి డిజిటలైజ్ వెర్షన్. చంద్రబాబు కూడా ఇక్కడే పప్పులో కాలేశాడు. మోదీని ముందు ధరించి పసుపు పచ్చ జెండా ఊపుకుంటూ ముందుకు కూతలు వేసుకుంటూ సాగి పోవచ్చనుకున్నాడు. ఇప్పుడు పట్టాల దారి కనిపించడంలేదు. ‘నేనున్నానని’ అభయ మిస్తూ కనిపించిన వెంకయ్యనాయుడుని సమున్నతమైన కొండ గుహలో కూర్చోపె ట్టారు. ఇది కూడా మోదీ పుణ్యమే! చంద్రబాబు అందరూ చెబుతున్నా విన కుండా ‘ప్యాకేజీ’ అనే ఎండమావి వెనకాల పడి నాలుగేళ్ల నుంచీ పరుగులు పెడుతు న్నారు. దానివల్ల దాహం పెరిగిందిగానీ ఎక్కడా తడి తగల్లేదు. ఇప్పుడు మళ్లీ తూచ్ అనేసి ప్రత్యేక హోదాయే ముద్దు, అది అయిదుకోట్ల చిల్లర తెలుగువారి హక్కు అని గర్జిస్తున్నారు. ‘ప్యాకేజీ’ చాలా చాలా లాభమన్నారు మొన్నటిదాకా. నిన్నట్నించి గళం మార్చి స్వరం మార్చి ప్రసంగిస్తున్నారు. ఎన్నడూ లేనిది, మోదీని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఆయన ‘దేశముదురండీ’ అని నాలుగేళ్ల నాడే ఒక సంఘ్ పెద్ద అన్నారు– ఏ భావంతో అన్నారో గానీ. అరటితోటలో ఆంజనేయస్వామి కొలువై ఉంటాడని పుస్తకంలో ఉందని తోట లన్నీ గాలిస్తే దొరుకుతాడా? దొరకడని భావం. త్రేతాయుగంలో ఆంజనేయస్వామి రామబంటుగా రామాయణం నిండా కొలువు తీరాడు. ద్వాపరం వచ్చే సరికి జెండా మీద బొమ్మై, జెండాపై కపిరాజుగా గాలిలో రెపరెపలాడాడు. కలియుగం వచ్చే సరికి కిరసనాయిల్ డబ్బాల మీద, ట్రాన్స్పోర్ట్ లారీలపైన ట్రేడ్‌మార్క్ గుర్తుగా స్వామి సేవలందిస్తున్నాడు. సంఘ్‌లో పుట్టి సంఘ్‌లో పెరిగిన సంఘీయుడు మోదీ. ఆయన నాయకత్వంలో అయోధ్య బృహత్తర రామమందిరం ప్రస్తుతం రైలు స్టేషన్‌గా అవతరించబోతోంది. మన కల నెరవేరబోతోంది. అందుకని చంద్ర బాబు మనుషుల్ని జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఆట్టే వ్యవధి కూడా లేదు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
ద్వి శతమానం భవతి!
అక్షర తూణీరం మనిషి తాబేలులాగా పెంకులు కట్టిన మూపులతో వందల ఏళ్లు బతకచ్చు. కానీ మనిషి మనిషిలా హృదయవాదిగా జీవిస్తేనే సార్థకత. మనిషి ఆయుర్దాయం 140 సంవత్సరాలకి పెంచగల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిండు సభలో హామీ ఇచ్చారు. తథాస్తు! మనిషికి ఎన్నేళ్లు బతి కినా తనివి తీరదు. ఐశ్వర్యవంతులే కాదు దరిద్రులు కూడా సెంచరీ కొట్టాలని కోరుకుంటారు. ఇప్పటివరకూ ‘శతమానం భవతి’ అన్నది సర్వామోదం పొందిన దీవె నగా నిలబడింది. ఇకపై ఇలా అంటే ‘ఆయుష్మాన్ భవ’ అనే అర్థం స్ఫురిస్తుంది. ఇప్పుడన్ని జీవిత కొలమానాల్ని సరితూచి మళ్లీ నిర్ధారించాల్సి ఉంది. ఈమధ్య కాలంలో యనభై దాటడం అవ లీలగా మారిన సందర్భంలోనే బోలెడు తేడాలు, సమస్యలు తలెత్తుతున్నాయ్. ఒకప్పుడు అరవై, నిండగానే, హమ్మయ్య ఒక చక్రం తిరిగిందని దేవుడికి కృత జ్ఞతలు చెప్పుకునేవారు. యాభై దాటిందగ్గర్నించి ‘పెద్దాయన’గా అరవై దాటాక ‘ముసలాయన’ అనీ సంబోధించేవారు. ఇప్పడవి అమర్యాదలయినాయ్. ఇప్పుడు ఈ కొత్త భరోసా నేపథ్యంలో మన రాజ్యాంగాన్ని తిరగరాసుకోవలసి ఉంటుంది. భారతీయ శిక్షాస్మృతిని సవరించాలి. యావజ్జీవమంటేనే కనీసం యాభై ఏళ్లుగా నిర్ణయించాలి. జీవిత బీమా పరిమితిని నూటయాభైకి పెంచుకోవాలి. ఇప్పుడే ఉద్యోగ పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వాలు గింగిరాలు తిరుగుతున్నాయ్. ముప్ఫై మూడేళ్లు ఉద్యోగం చేసి ముప్ఫై నాలుగేళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న ఆయు రారోగ్యవంతులున్నా రు. అందుకే ఒక దశలో ‘గోల్డెన్ హాండ్ షేక్’ ఆశపెట్టింది ప్రభుత్వం. కానీ ఈ గడుసు పిండాలు బంగారు కరచాల నానికి ససేమిరా అన్నారు. ఇప్పుడైతే రిటైర్మెంట్ వయసు వందకి పెంచేసి, ఇహ దణ్ణం పెట్టెయ్యడం మంచిది. రాజకీయాల్లో కటాఫ్ రెండు ఆవృతాలకు అంటే నూట ఇరవైకి పెట్టుకో వచ్చు. ఎముకలు కలిగిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడేమనేవారో తెలియదు. ఇదే సత్యమై నిత్యమై కార్యరూపం ధరిస్తే మొట్ట మొదట బాగుపడేది కార్పొరేట్ ఆస్పత్రులు. ఎందరో వయస్సు మళ్లిన జాంబవం తులు, భీష్మాచార్యులు దొరుకుతారు. ఎన్నో కొత్త రోగాలు పుట్టుకొస్తాయ్. అందరూ వైద్యబీమాకి అలవాటుపడతారు. ఇక దున్నుకోవడమే పని. ఈ జీవితం క్షణికం, బుద్బుదప్రాయం, మూన్నాళ్ల ముచ్చటే చిలకా లాంటి తత్వాలకు కాలం చెల్లినట్టే. మనిషికి ఇంకా ఆశ పెరుగుతుంది. దోచుకోవడం, దాచుకోవడం తప్పనిసరి అవుతుంది. ఇకపై 140 ఏళ్ల సంసారికి ఆరో తరం వార సుణ్ణి చూసే అవకాశం వస్తుంది. పొందు కుదురులోనే నాలుగొందల పిలకలు లేచే అవకాశం ఉంది. ఎందు కొచ్చిందోగానీ ‘పాపి చిరాయువు’ అని నానుడి ఉంది. అధిక కాలం బతికితే అనర్థాలేనని అనుభవజ్ఞులు అంటారు. నిజమే, జీవితంలో ఏది శాపమో, ఏది వరమో తెలిసీ తెలియని అయోమయంలో బతికేస్తూ ఉంటాం. శాస్త్ర విజ్ఞానం పెరిగింది. దేనివల్ల మనిషి ఆయుర్దాయం పెరుగుతుందో తెలుసుకుంటే చాలు. ఎన్ని వందల ఏళ్లయినా బతికించగలరు. మనిషి తాబేలులాగా పెంకులు కట్టిన మూపులతో వందల ఏళ్లు బతకచ్చు. కానీ మనిషి మనిషిలా హృదయవాదిగా జీవిస్తేనే సార్థకత. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
గొంగళి అక్కడే ఉంది
పోలవరం, క్యాపిటల్, ప్యాకేజీ యవ్వారం, ఇతరములు అన్నీ వేసిన చోటే ఉన్నాయన్నది నిజం. భేటీలో ఇద్దరికీ శృతి కలవలేదన్నది నిజం. పారదర్శకత లేకపోతే ఇంతే. ‘‘పారదర్శకత’’– అది కదా మన నినాదం. పారదర్శ కత అంటే స్పష్టంగా కనిపించడం, స్పష్టంగా వినిపిం చడం. ఇంకా చెప్పిందే చేస్తూ ఉండటం, చేసిందే చెప్తూ ఉండటం. ఆ మధ్య ఇవాంక భాగ్యనగరానికి వచ్చిన ప్పుడు అంతా క్లియర్‌గా ఉంది. ఆఖరికి మోదీ ఇచ్చిన విందులో వడ్డించిన వెయ్యిన్నొక్క చిత్రాలున్నాయి, భోజ్యాలు, భక్ష్యాలు, చోష్యాలు, లేహ్యాలు చక్కగా జనప్రజకు కళ్లకు కట్టించారు. మొన్న మనక్కావలసిన ఓ విదేశీ ప్రముఖుడు వచ్చినప్పుడు, మోదీ రాచరికం పక్కనపెట్టి రాజమర్యాదలు చేశారు. ఆలింగనంతో ఆహ్వానం పలికి దేశమంతా తిప్పి చూపించారు. కనులారా చూసి మురిసిపోయాం. మొన్న కనుమ పండుగ రోజు సుప్రీం తెలుగు న్యాయ మూర్తి సహపాటిలందరికీ అద్భుతమైన విందు ఇచ్చారు. నేటివిటీని ట్రాన్స్పరె న్సీతో రంగరించారు. సొంతూరు నుంచి జున్నుపాలు, నేతి అరిశెలు విమానంలో తెప్పించారు. అందరూ ఇష్టంగా తిన్నారని సమాచారం. ఇవన్నీ ఇంత పారదర్శకంగా ఉండగా– మొన్నామధ్య మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రిని మన కాపిటల్‌లో భేటీ అయినపుడు ఏ మాత్రం సడీ చప్పుడూ లేదు. ఒక్క సంగతి బయటకు రాలేదు. అసలు ప్రధానితో సమాగమ సమయం దొరకడమే విశేషమన్నట్టు పత్రికల్లో ముందస్తు వార్తలొచ్చాయ్. అత్యంత ఆత్మీయమైన మిత్ర పక్షం నేతతో ప్రధాని అమావాస్యకి పున్నమికి కలుసుకోవచ్చు. హాయిగా మనసు విప్పి ఇష్టా గోష్ఠి, కష్టా గోష్ఠి సాగించవచ్చు. ఎక్కడో కొంచెం సత్సంబం ధాలు బీటవారినట్టు నిత్య సందేహులకు సందే హంగా ఉంది. రాక రాక వచ్చావు రెండ్రోజులు నా నివాసంలో ఉండాల్సిందేనని ప్రధాని బల వంతం చేసినట్టు లేదు. అంతా కలిసి నలభై నిమిషాల్లో ‘భేటీ’ ముగించేశారు. ఇందులో శాలువా కప్పడం, పూలగుచ్ఛ ప్రదానం, గొంతులు సరిచేసుకోవడం, తొలి పలుకులు అయ్యేసరికి పది నిమిషాలు గోవిందా. ఇక మిగిలిన ముప్ఫై నిమిషాల్లో రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, సాంఘిక, విద్య, జల, పారిశుధ్యాది సమస్యల మీద రెండేళ్లుగా పేరుకుపోయిన సంగతుల్ని చంద్రబాబు టెలిగ్రాం భాషలో చెప్పినా వ్యవధి చాలదు. అసలు విషయాలు బయటకు రాకుండా సుహృద్భావ వాతావరణంలో భేటీ జరిగిందనీ, ప్రధాని సానుకూలంగా స్పందించారనీ తెలుగు తమ్ముళ్లు చెప్పుకున్నారు. అసలు సానుకూల స్పందనకీ, సుహృద్భావ వాతావరణానికీ అధికారిక అర్థాలు, నిర్వచనాలు తేల్చి చెప్పాలని ప్రజల పక్షాన కోరుతున్నా. బయటకు వచ్చాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆచితూచి (దీనిక్కూడా అఫీషియల్ మీనింగ్ కావాలి) మాట్లాడారు. ప్యాకేజీ వ్యవహారంలో అవసరమైతే న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అక్కడ తేలిపోయింది కథ. గుట్టు విప్పకపోయేసరికి రకరకాల కబుర్లు నమ్మకంగా వినవస్తున్నాయి. నేతలిద్దరూ అనేక విషయాలమీద మాటలతో షటిల్ ఆడుకున్నారని కొందరు, ఎన్నికల పొత్తు విషయంలో ఇద్దరూ తలలు పట్టు కుని మౌనంగా చర్చించారని ఇంకొందరు చూసినట్టే చెబుతున్నారు. ఇచ్చిన సొమ్ముకి లెక్కలు సరిచూడమన్నారనీ, అజ్ఞాతవాసిని తనకు వదిలేస్తే తను హ్యాండిల్ చేసు కుంటానన్నారనీ కొన్ని కథనాలు వినవస్తున్నాయ్. పోలవరం, క్యాపిటల్, ప్యాకేజీ యవ్వారం, ఇతరములు అన్నీ వేసిన చోటే ఉన్నాయన్నది నిజం. భేటీలో ఇద్దరికీ శృతి కలవలేదన్నది నిజం. త్రిబుల్ తలాక్ బిల్లుపై, టీడీపీ శీతకన్ను వేయడంతో, మోదీ రామబాణం సంధించారనీ అంటున్నారు. పారదర్శకత లేకపోతే ఇలాగే ఉంటుంది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
తేగల సమర్థుడు!
♦ అక్షర తూణీరం దేవుడి చేతిలో మనందరం తోలు బొమ్మలమే. కానీ నాయకులు మనల్ని శాసించి, ఆడిస్తారు. అప్పుడప్పుడు తల కాయలు మారుస్తారు కూడా. సంక్రాంతి అంటే కొత్త ధాన్యం వచ్చే తరుణం. ఆ వడ్లని మసిలే నీళ్లలో నానపోసి, తర్వాత వాటిని ఆరపోస్తారు. మంచి పొయ్యి సెగమీద మంగలంలో వాటిని వేపుతూ, వేడిమీదనే రోకళ్లతో దంచుతారు. అప్పుడు అటుకులుగా సాగుతాయి. అన్ని పనులూ సరైన పదునులో జరిగి, అనుభవం తోడైతే అటు కులు చింతాకుల్లా సాగి ఫలిస్తాయి. అటుకులు పేదవాడి ఫల హారం. ద్వాపరంలో కుచేలుడు వీటికి ఎక్కడలేని ప్రాచుర్యం తీసుకొచ్చాడు. దేవుళ్లకి అటుకులు ఇష్టప్రసాదాలైనాయి. ఈ గ్రామీణ గృహ పరిశ్రమలో రాజకీయం ఉంది. ఉడుకుదుడుకుగా విషయాన్ని నాన పెట్టడం, సెగమీద వేపడం, వేడిమీదే ధనధనా దంచి సాగతియ్యడం– మనం గమని స్తూనే ఉన్నాం. అరిశెల తయారీ కూడా ప్రజా సేవకులకు దారి చూపిస్తుంది. వాగ్దానాలు వారికి కొట్టినపిండి. కొత్త బెల్లంతో తియ్యటి తీగెపాకం పట్టడం, అందులో కొట్టిన పిండి పోస్తూ తిప్పడం, అవసరమైతే కుమ్మడం ద్వారా అరిశెల పిండి సిద్ధం అవుతుంది. దాన్ని అప్పచ్చులుగా చేసి కాగే నూనెలో వండుతారు. వాటిని పైకి తీసి అరిశె చెక్కలతో తాగిన నూనెని కక్కిస్తారు. పైపైన నువ్వులద్దుతారు. ఇహ వాటి రుచి సంక్రాంతి సంబరాల్ని మెరిపిస్తుంది. ఈ తయారీలో దంచడం, కుమ్మడం, నొక్కడం, కక్కించడం, పైపైన అద్దడం లాంటి ప్రక్రియలున్నాయ్. గమనార్హం. ఇప్పటి వారికి పేరు తెలుసుగానీ ‘తేగలు’ ఎక్కడ ఎలా పండుతాయో, ఏ ఫ్యాక్టరీలో తయారవుతాయో తెలియదు. తేగ అంటే తాడిచెట్టు మొలక. తాటిపండు లోంచి వచ్చే టెంకలు మొలకెత్తి తేగల వుతాయి. ఇది కూడా మంచి ఆహారం. ‘‘ఇదిగో నే ఢిల్లీ వెళ్తున్నా. ప్రధానమంత్రిని కలు స్తున్నా. రాష్ట్రానికి అందాల్సిన సాయాలన్నింటినీ తేగ లను... తేగలను’’ అంటూ చంద్ర బాబు నొక్కి వక్కాణిస్తున్నారు. తేగల సమర్థుడే! ఆవుపేడ కిలో రెండొందల యాభైకి ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇది మోదీ కీర్తిని పెంచే అంశం ఏ మాత్రం కాదు. పేడ విషయంలో కమల నాథులు మనసు పెట్టాలి. ఒక సవాలుగా స్వీకరించాలి. కొడి గట్టిన స్వచ్ఛభారత్ నినాదాన్ని భోగిమంటల్లో తిరిగి వెలిగిం చాలి. ఈ పండుగ సీజన్లో ఊరి బయటి చింతలతోపులో బొమ్మ లాళ్లు వచ్చి దిగేవారు. ఏడెని మిది గూడుబళ్లు, వాటి నిండా తోలు బొమ్మలు, చిన్నా పెద్దా, పిల్లా జెల్లా, కోడీ మేకా, సరుకూ సరంజామా సర్వం దిగిపోయి చింతలతోపు తిరునాళ్లను తలపించేది. వాళ్లు బళ్లలోంచి బొమ్మలన్నింటినీ దింపి వాటిని సరిచేసుకోవడం, కొత్త నగిషీలు పూయడం చేసేవారు. కొందరు వూరిమీదపడి తెరలకు వస్త్రాలు, ఆటదీపానికి చమురు పోగేసేవారు. పొడుగాటి తుమ్మముళ్లు ఆట ఆడించడానికి మరికొందరు సేకరిస్తుండే వారు. వూడిపోయిన తలకాయల్ని, వూగే కాళ్లని చేతుల్ని ప్రతి మజిలీలోనూ జాగ్రత్తగా సరిచూసుకోవాలి. బొమ్మలాటలో వినోదం పంచే బంగారక్క, కేతిగాడు అతి ముఖ్యంగా. వాళ్లిద్దరూ నోటికి ఎంత మాటొస్తే అంతమాటంటారు. చెయ్యి విదల్చని వారిని ఆ పాత్రలతో తిట్టించేవారు. జట్టుపోలిగాడు మరో ప్రధాన పాత్ర. దేవుడి చేతిలో మనందరం తోలు బొమ్మలమే. కానీ నాయకులు మనల్ని శాసించి, ఆడిస్తారు. అప్పుడప్పుడు తల కాయలు మారుస్తారు. బంగారక్క కేతిగాడులా ఒక్కోసారి పాలకుల్ని నోటారా తిట్టాలని పిస్తుంది. ఫిరంగి గొట్టం నీటిధారలు చిమ్ముతోంది పంటచేలు పచ్చపచ్చని సిరులు సింగారించుకుంటున్నాయి ఉదయపు సూర్యకాంతిలో కమలం కళకళలాడుతోంది పంటసిరుల సంక్రాంతి శుభవేళ మన భారతావనిని శాంతి సౌభాగ్యాలు వరించుగాక! ( ప్రధానికి రచయిత సంక్రాంతి శుభాకాంక్షలు ) శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సంక్రాంతి అల్లుడొక జీఎస్టీ
అక్షర తూణీరం గుమ్మడి కాయంత బంగారం, కుక్క ముట్టుకుందని పారేశాం. అందుకే ఇలా వచ్చానని జోలె చూపిస్తాడు. ఆ కబుర్లు, కోతలు ఓటుకొచ్చే వారి మాటల్ని తలపిస్తాయ్. సంక్రాంతి పండగ కనుచూపు మేరలో ఉంది. ఓట్ల పండగలాగే సంక్రాంతి కూడా నెల ముందునుంచీ సంద డికి దిగుతుంది. సాంతం తెల్లారకుండానే సాతాని జియ్యరు పాడినపాటే పాడుకుంటూ గడపగడపకీ తిరు గుతాడు. అక్షయ పాత్రలో బియ్యం పడగానే ‘కృష్ణార్పణం’ అంటూ మరో ముగ్గులోకి వెళ్లిపోతాడు. పాడిన పాటే పాడుకుంటూ ఓట్ల కోసం వస్తారు. కాకపోతే ఓటేశాక మనమే ‘కృష్ణార్పణం’ అనుకుని సరిపెట్టుకోవాలి. ఈ తరుణంలో గంగిరెద్దులస్వామి వస్తాడు. ‘అయ్యగారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టు’ అంటూ బొంతలు కప్పుకున్న గంగిరెద్దుని మోకరిల్ల చేస్తాడు. బోలెడు దీవెనలు పెడతాడు. అన్నింటికీ ఆ బసవన్న తలూపుతుంది. అప్పుడు దాని మెడలో గంటలు మోగుతాయి. ఒకసారి నాయకత్వం తలపైకొస్తే, ఇక తర్వాత అందర్నీ డూడూ బసవన్నలని చేసి ఆడించవచ్చునని ఒక ధీమా, ఒక నమ్మకం, ఒక నిజం. బుర్రమీసాలు, వెలిసిపోయిన కోటు, చిరుగుల గొడుగు, తలకి పాగా, చేతిలో ఢక్కా నుదుట పెద్ద కుంకమ బొట్టుతో బుడబుక్కల స్వామి కొంచెం దాష్టీకంగా ఉంటాడు. ‘అంబ పలుకు, జగదాంబ పలుకు’ అనే పల్లవితో ఇంటిల్లపాదికీ దీవెనలు పెడతాడు. అంతా జయమే కలుగుతుందంటూ జోస్యాలు చెబుతాడు. బోలెడు కోరికలు కోరతాడు. కోరినవన్నీ సాధించుకు గాని వెళ్లడు. మంచి కార్యసాధకుడైన నేతలా కనిపిస్తాడు. కట్టె తుపాకీ బుజాన పెట్టుకుని, విచిత్ర వేషధారణలో వినోదాన్ని ఇంటి ముందుకు తెస్తాడు పిట్టలదొర. ఇది చాలా ప్రసిద్ధమైన సంక్రాంతి ముష్టిపాత్ర. కావల్సినన్ని కబుర్లు చెబుతాడు. అంతులేనన్ని కోతలు కోస్తాడు. గుమ్మడి కాయంత బంగారం ఉన్నవాణ్ణి, కుక్క ముట్టుకుందని అవతల పారేశాం. అందుకే ఇలా వచ్చానని జోలె చూపిస్తాడు. ఆ కబుర్లు, కోతలు ఓటుకొచ్చే వారి మాటల్ని తలపిస్తాయ్. కడవలో నీళ్లు పోసి, నీళ్లలో కత్తి గుచ్చి, ఆ కత్తిని కావడికి వేలాడదీసి ఊరంతా ఊరేగిస్తారు మాసాబత్తినివాళ్లు. విప్రవినోదులు హస్తలాఘవంతో ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రదర్శిస్తారు. నీళ్లలో కత్తి గుచ్చి ఇంద్రజాలం చేయడం, హస్తలాఘవ విద్య రాజకీయ వ్యాపారానికి పెట్టుబడులు. ఏది శంకుస్థాపనో, ఏది ప్రారంభోత్సవమో అంతుపట్టదు. కోడిపందేలు సరేసరి. పందెపు కోళ్లు బాదంపప్పులు దాణాగా తింటాయ్. స్కాచ్ విస్కీ పుచ్చుకుంటాయ్. వాటి గెలుపోటములు కొందరి జీవితాలని నిర్ధారిస్తాయ్. మన పల్నాటి చరిత్రని పందెపు కోళ్లే రచించి, పౌరుషానికి నిర్వచనం చేశాయి. ‘‘ఏమిటోనండీ! ఈ సంక్రాంతి లాంఛనాలతో, అల్లుళ్ల అలకలతో ఇది మాత్రం మోదీ పెట్టిన జీఎస్టీలాగా తినేస్తోందండి!’’ ఈ సంక్రాంతి వేళ ఓ గృహస్తు బావురుమన్నాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఆంగ్ల శుభాకాంక్షలు
ప్రత్యక్ష నారాయణుడు సూర్యదేవుడు ఇంగ్లిష్ కాలసూచినే అనుసరిస్తున్నాడు. ఏటా మకర సంక్రమణం ఆ తేదీనాడే చేస్తున్నాడు. ఆంగ్లంలో అధిక మాసాల బెడద లేదు. రెండురోజుల్లో 2018 నూతన సంవత్సరం వస్తోంది. ఇక మనం నిత్యం పద్దెనిమిదిని స్మరిస్తూనే ఉంటాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పుకుంటున్నా. ఏటా ఒకసారి మాత్రమే వచ్చే పండుగ. కావలసినంత వినోదం, ఉల్లాసం, ఉత్సాహం, చిందులేసే సంబరాల సందర్భం. ప్రపంచమంతా ఒక్కసారి జాగృతమవుతుంది. డిసెంబర్ 31 అర్థరాత్రి కోసం జగమంతా జాగారం చేస్తుంది. పాత సంవత్సరపు చివరి సెకను దాటగానే అరుపులు, కేకలు, చప్పట్లు, అభినందనలు నురుగలు కక్కుతాయ్! కొత్త సంవత్సరపు నిర్ణయాలు తీసుకోవడం, మిత్రులు తీర్మానాలు చేయడం ప్రతి గదిలో జరుగుతాయ్. కొన్ని అమలవుతాయి, చాలాకొన్ని అమలు అవవ్ – ప్రభుత్వ పథకాల్లాగే. దానివల్ల ఏమీ ప్రమాదం ఉండదు. భూమిపై భూమధ్య రేఖకు ఎగువన దిగువన ఈ ఒక్కరాత్రి కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తుంది. చాలా ప్రభుత్వ ప్రైవేట్ నిబంధనల అమలుకి డిసెంబర్ 31ని డెడ్‌లైన్‌గా నిర్ణయిస్తారు. చాలాసార్లు చూశాను చివరిక్షణంలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని. ఏమీ జరగలేదుగానీ 16 వెనక్కి తగ్గి 2017 ముందుకు వచ్చింది. నూతన సహస్రాబ్ది ఆవిర్భావ ఘడియలోనే ఏమీ సడీచప్పుడూ లేదు. కానీ సహస్రాబ్ది రెండువేలుగా మారడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో వై2కె పుణ్యమా అని ఎందరికో ఉపాధి దొరికింది. అది మరి ఆంగ్ల క్యాలెండర్ పెట్టిన భిక్షేకదా! ఉన్నట్టుండి ఆంగ్ల సంవత్సరాది మీద కొందరు కన్నెర్ర చేస్తున్నారు. నాకు గ్రీటింగ్స్ చెబితే చెప్పిన వారితో గుంజీలు తీయించి శిక్ష వేస్తానని చిలుకూరు అర్చకస్వామి శ్రీముఖం ఇచ్చారు. హైందవాలయాలలో ప్రత్యేక పూజలు వద్దన్నారు. జనవరి 1న దేవుడి ముఖం చూడాలని లక్షలాది మంది పడిగాపులు పడతారు. మన పురాణాలు ఏమి చెప్పాయో పెద్దలు గుర్తు చేసుకోవాలి. ప్రహ్లాదుడు తింటూ, తాగుతూ ఎప్పుడైనా భగవన్నామ స్మరణ చేసుకోమన్నాడు. మనమంతా ఈ ఆంగ్ల క్యాలెండర్లో క్రీస్తుశకంలో పుట్టి పెరిగాం. పొద్దుటే రేడియో పెడితే శాలివాహన శకం వినిపిస్తుంది. ఇప్పుడైతే శుభలేఖల మీద తెలుగు తిథివారాలని మాత్రమే ప్రస్తావిద్దామా? మనం చాంద్రమానులం, మన పక్కనే సౌరమానులున్నారు. తెలుగు యువకుడు తమిళమ్మాయిని పెళ్లాడేటప్పుడు ఏ మానం అనుసరించాలని ధర్మ సందేహం. ముందసలు మన ఐయ్యేఎస్లతో ప్రభవ, విభవలు; చైత్ర వైశాఖాలు; పాడ్యమి విదియ తదియలు భట్టీయం వేయించాలి. ప్రత్యక్ష నారాయణుడు సూర్యదేవుడు ఇంగ్లిష్ కాలసూచినే అనుసరిస్తున్నాడు. ఏటా మకర సంక్రమణం ఆ తేదీనాడే చేస్తున్నాడు. దేశంలో సమస్యలు గుట్టలుగా పడి ఉండగా, ఈ కొత్త సమస్యని తెర మీదకి తేవడం అవసరమా? తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికెళ్లిందని అచ్చ తెలుగు సామెత ఉంది. పత్రికల మీద డేట్లైన్లు పాడ్యమి, విదియలతో ఉండాలి. మిగుళ్లు తగుళ్లు చూసుకోవాలి. మధ్య మధ్య అధికమాసాలొస్తుంటాయి. అప్పుడు రెండు పుట్టిన్రోజులూ, రెండు ఆబ్దికాలూ తప్పదు. ఆంగ్లంలో అధిక మాసాల బెడద లేదు. ఆలోచించుకోండి! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
దీపాలా? ద్వీపాలా?
అక్షర తూణీరం సోమనకీ, పోతనకీ, రామదాసుకీ ప్రాంతీయత ఆపాదించాం. విశ్వమానవుడైన కాళోజీకి కొలతలు నిర్ణయించాం. విడిపోయినంత మాత్రాన వివక్షలు చూపనక్కర్లేదు. అన్ని సందర్భాలకు ఉద్యమస్ఫూర్తి పనికిరాదు. తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు ఆర్భాటంగా మొదలై ఆనందోత్సాహాలతో సాగి, విజయవంతంగా ముగి శాయి. తెలుగువారందరికీ ఒక మధుర స్మృతి. జరిగిన తెలుగు తిరునాళ్లవల్ల తెలుగు విస్తృతి పెరిగిందా తరిగిందా అన్నది ప్రశ్న. తెలుగు వైతాళికులను తమకు కావల్సిన రీతిలో జల్లెడపట్టి పాలకులు వారిని మాత్రమే ప్రదర్శిం చారన్నది నిజం. ఈ వడపోతవల్ల తెలుగు ప్రాభవం అందగించిందో, మందగించిందో ఆలోచించుకోవాలి. అందరూ కలిసి మాట్లాడితే పదికోట్ల గొంతులు, చీలి పోతే ఆరూ మూడూ! పంచతంత్ర నిర్మాత, తెలుగు వ్యాకరణవేత్త అయిన చిన్నయసూరిని మద్రాసీ వంకన వదిలేస్తామా? తెలుగు భాషికి దాసుడై తెలుగుతల్లికి సేవచేసిన సీపీ బ్రౌన్‌ని ఆంగ్లేయుడని కడగా పెడదామా? షాజహాన్ కొలువులో గౌరవాలందుకున్న అలంకారవేత్త మన పండితరాయ లకు ఇలాంటి ఉత్సవాలలో పేరు దక్కద్దా? తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ మానసపుత్రిక. ఆయన ముద్దుబిడ్డగా వన్నెలు, చిన్నెలు సంతరించుకుంది. బుద్ధ పూర్ణిమ పథకంతో భాగ్యనగరానికి వెన్నెల తెచ్చింది తారక రామారావు. ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు పట్టాకనే తెలుగుదనం పరిమళించింది. హైదరాబా దులో కమ్మని తెలుగుమాటలు వెరపులేక వినిపించసా గాయి. ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అనే సూక్తి నందమూరితోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. జీవనది గోదావరి ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. పాయలు వేరైనా నీరొకటే. ఆ నీటి గుణా లొక్కటే. అక్కడి జలచరాలు అన్ని పాయల్లో స్వేచ్ఛగా కలుపుగోలుగా తిరుగాడుతూ ఉంటాయ్. ఆ అలలు నేర్పిన భాషలోనే మాట్లాడుకుంటాయ్. బంగారు పళ్లానికైనా గోడ చేర్పు కావాలి. ఆచార్య సినారెని ఆది నించి కడదాకా సమాదరించారు అన్న గారు. దాశరథిని అక్కినేని అక్కున చేర్చుకున్నారు. ఆస్థాన కవి పదవిలో జలగం గౌరవించారు. ఎంత పాతబడినా నిజాలు చెరిగిపోవు. ప్రారంభ సభలో ఎన్టీఆర్ పేరెత్తడానికి సంకోచించారు వెంకయ్యనా యుడు. అంతేకాదు మరెన్నో చెప్పదగిన, చెప్పాల్సిన పేర్లను దాటవేశారు. అప్పుడు డైలాగులు మర్చిపోయిన నటుడిలా ఉపరాష్ట్రపతి కనిపించారు. చివరి రోజు రాష్ట్ర పతి స్పష్టంగా పింగళి వెంకయ్యని, అల్లూరిని సైతం స్మరించుకున్నారు. ప్రథమ పౌరునికి ధన్యవాదాలు. ఇవ్వాళ కవులుగా, కథ, నవలా రచయితలుగా ప్రసిద్ధులై సభల్లో కళకళలాడుతూ తిరిగిన వారంతా– పెరిగిందీ పేరు తెచ్చుకుందీ కోస్తా ప్రాంతపు పత్రి కల్లోనే. తొలి రచనలు ప్రచురించి, సానలు దిద్దిన పత్రికా సంపాదకుల్ని, తెలుగుమీరిన పాఠకుల్ని పూర్తిగా విస్మ రించి స్వయంభూలుగా ప్రవర్తించక్కర్లేదు. అలిశెట్టి ప్రభాకర్‌ని గమనించిందీ, గుర్తించిందీ, నెత్తిన పెట్టుకు వూరేగించిందీ కోస్తా ప్రాంతం. సోమ నకీ, పోతనకీ, రామదాసుకీ ప్రాంతీయత ఆపాదించాం. విశ్వమానవుడైన కాళోజీకి కొలతలు నిర్ణయించాం. విడి పోయినంత మాత్రాన వివక్షలు చూపనక్కర్లేదు. అన్ని సందర్భాలకు ఉద్యమస్ఫూర్తి పనికిరాదు. పద్యనాటకం తెలుగువారి హంగు. బుర్రకథ తెలుగోడి పొంగు. చెక్కభజన, హరికథ తెలుగు భుజకీర్తులు. దీపంచెట్టు తెలుగు పల్లెల ఆనవాలు. ఇవన్నీ అలా ఉంచి ఇంతకీ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఈ సభలు ఎలాంటి అంచనాలు కలిగించాయి. ఒకజాతి దీపాల్లా వెలుగులు పంచాలిగాని ద్వీపాల్లా మిగలకూడదు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అన్నీ కలిసి ఉన్న ప్పుడే తెలుగు అక్షరమాల సంపూర్ణమవుతుంది. అప్పుడే మాటలన్నీ పలుకుతాయ్. ఉచ్ఛారణ స్వచ్ఛంగా, స్పష్టంగా, సలక్షణంగా వర్ధిల్లుతుంది. జై తెలుగుతల్లి! వ్యాసకర్త ప్రముఖ కథకుడు శ్రీరమణ -
మాటసాయం
రాజకీయ నాయకులక్కూడా స్టయిల్ షీట్ ఉండాలి. కాకలు తీరిన నేత, రాజకీయాల్లో క్షుణ్ణంగా నలిగిన నేత ఇలా పేలడమేమిటి? అది బూమరాంగ్ అయింది. అందుకే అంటారు– కాలు జారితే తీసుకోవచ్చు గాని నోరు జారితే తీసుకోలేమని. గుజరాత్లో అసలే టగ్గాపోరుగా ఉంటే మణిశంకర్ అయ్యరు మాట తూలాడు. వాక్స్థానంలో శనిగాడుంటే మాటలిలాగే జారతాయ్! ఒక్కోసారి చిన్న పలుకైనా మంగలంలో పేలపు గింజల్లా పేలి పువ్వులా తేల్తుంది. కొన్ని మాటలు పెనం మీది నీటిబొట్టులా చప్పున ఇగిరిపోతాయ్. ఇసకలో పడ్డ చందంగా కొన్ని చుక్కలు ఇంకిపోతాయ్. ఇప్పుడీ అయ్యర్ మాట మోదీ పాలిట ముత్యపుచిప్పలో పడ్డ మంచి ముత్యమైంది. ఇప్పుడా మాటను మోదీ నిండు మనసుతో స్వీకరించారు. ఆ ముత్యాన్ని పూర్తిగా సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అనుకోకుండా వరంలా ఈ తరుణంలో లభించిన ముత్యానికి నగిషీలు చెక్కుతున్నారు. ఇప్పుడు చూడండి, అధికార పక్షానికి ఒక్కసారి బరువు దిగింది. అభివృద్ధి పనులు ఏకరువు పెట్టాల్సిన పనిలేదు. గుజరాత్ యువతకు కొత్త ఆశలు పెట్టి మనసు మళ్లించాల్సిన అగత్యం లేదు. ఎజెండాలో లేనివి కూడా సభల్లో వల్లించి బెల్లించాల్సిన కంఠశోష లేదు. ఆ జారిన ముక్కని పల్లకీలో ఊరేగించడమే తక్షణ కర్తవ్యం. ప్రస్తుతం ‘నీచ్’శబ్దం మీద క్యాంపైన్ ఉధృతంగా నడుస్తోంది. ‘‘ఔను, నేను నీచుణ్ణే’’అనే మకుటం మీద ఓ శతకం రచించి జనం మీదకి వదుల్తారు. ‘‘జనహితం, దేశక్షేమం కోరడంలో నేనెంతకైనా దిగజారతా! ఎంత నీచానికైనా పాల్పడతా. నల్ల ధనవంతులు, అవినీతిపరులు, పన్ను ఎగవేతదారులు, దేశద్రోహులు, ఉగ్రవాదులు నన్ను నీచుడన్నా సరే! వారిని వదిలి పెట్టను’’అంటూ దానికి బహుముఖాలుగా పదును పెడతారు. రాజకీయ నాయకులక్కూడా స్టయిల్ షీట్ ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోవడానికి టాబ్లెట్లు కావాలి. కాకలు తీరిన నేత, రాజకీయాల్లో క్షుణ్ణంగా నలిగిన నేత ఇలా పేలడమేమిటి? బహుశా నెహ్రూ కుటుంబం ఉబ్బితబ్బిబ్బవుతుందని కౌంటర్ ధాటిగా ఇచ్చి ఉండాలి. అది బూమరాంగ్ అయింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం పోయింది. అంటే కూకటివేళ్లతో పార్టీ నుంచి పెకలించినట్టు. ఇంతకు ముందు కూడా అయ్యర్ ‘చాయ్ వాలా’ అని మోదీకి సాయపడ్డారు. ఎన్నికల వేడి తీవ్రంగా ఉన్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఊరికే చీకట్లో రాళ్లేసినట్లు విసరకూడదు. ఇప్పుడీ రెండక్షరాల మాటని ఓట్లలోకి మారిస్తే, హీనపక్షం పది లక్షలంటున్నారు. మణిశంకర్ మాటని చెరిపెయ్యడానికి క్షమాపణలతో సహా అన్ని చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కానీ అవతలివైపు బాగా రాజు కుంటోంది. ఆ మాత్రం దొరికితే వదుల్తారా! మా ఊరి రచ్చబండ మీద రెండ్రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. ‘‘మంచి సమయంలో ఇంతటి మాట సాయం చేసిన అయ్యర్‌ని ఊరికే వదలరు. కొంచెం ఆగి బీజేపీలోకి లాక్కుంటారు’’ అనేది ఒక వెర్షన్. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
... గంధర్వుడే తీర్చాడు!
♦ అక్షర తూణీరం గ్రామాలకు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని, ప్రతి పంచాయతీకి కంపోస్ట్ ద్వారా వెయ్యి కోట్ల ఆదాయం తెప్పిస్తానని లోకేశ్ అన్నందుకే రేవంత్ పార్టీ వీడాడా? ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉంటాడు. కొంచెం పొట్టిగా పొన్నకాయలా ఉంటాడు. సమస్యలొచ్చినా హాయిగా మీసాలతో నవ్వే రసికుడు. పార్టీ ఫిరాయిం పుతో ఇటీవల వార్తల్లోకెక్కిన రేవంత్ రెడ్డి మంచి మాట కారి. చమత్కారి. ఇలాంటి వారికి దీటైన శత్రువు ఉంటే తమ వాక్బాణాలకు పదును పెట్టుకుంటారు. తెలంగా ణలో తెదేపా ఎమ్మెల్యేగా హుషారైన పాత్రే పోషించినా, అది అడవిగాచిన వెన్నెలే. అందుకని కాంగ్రెస్‌లో చేరా డంటే పొరబాటు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఒక సారి రేవంత్ ఒక చక్కని సామ్యం చెప్పారు. ‘‘కేసీఆర్‌తో వ్యవహారం శివలింగం మీద తేలు మాదిరి. చెప్పుతో కొట్టలేం, చేత్తో తియ్యలేం’’ అంటూ చక్కని సామె తతో విశ్లేషించారు. మంచి రాజకీయ పరిజ్ఞానం, వయసుకు తగ్గిన కుర్రతనం రేవంత్‌కి అదనపు క్వాలిఫికేషన్లు. ఆ మధ్య వెలమ, కమ్మ రాజకీయ వర్గాలను సంధి సూత్రంతో కలిపి ‘వెల్కమ్’ గ్రూప్స్‌గా మాటకట్టాడు. రాజకీయాల్లో పార్టీ పదవులకంటే, మంచి మాటల పొందికకు జనాకర్షణ ఎక్కువ. ఇలాంటి యువనేత పచ్చకండువా పక్కనపెట్టి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం మీద చాలా వాదనలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఇది వ్యూహాత్మకం, అమరావతి రిమోట్‌గా పనిచేసే డ్రోన్ అన్నాడొకాయన. రేవంత్ ఫిరాయింపుపై రకరకాల వ్యూహాగానాలు వినిపిస్తున్నాయ్. తెలంగా ణలో తెదేపా రోజు రోజుకీ శుష్కిస్తోంది. అటు చూస్తే కేసీఆర్ ఉన్న దానికి లేని దానికి నిప్పులు చెరిగే మనిషి. ఎంతవారినైనా దద్ద మ్మలు, సన్నాసులు అనడం ఆయనకు పరి పాటి. బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో అవశే షంగా ఉంది గానీ, విశేషంగా లేదు. ఇక తెరాసకి సభల్లో కనిపిస్తున్నది కాంగ్రెస్ తల కాయలే. ‘పునరేకీకరణ’ మంత్రాన్ని తిరిగి తెరమీదికి తెచ్చి, ఈ రేవంత్ డ్రోన్‌ని చేతిలో పెట్టారని కొందరి ఊహ. ఎందుకంటే అధినేత దేశంలో లేని తరుణంలో ఈ బాంబు పేలింది. పైగా మంత్రివర్గ ప్రముఖులమీద విస్ప ష్టంగా ఆరోపణలు వినిపించాయి. అసలీ విస్ఫోటనా నికి పరిటాల వారింటి పెళ్లి నాంది పలికినట్టని పిస్తుంది. తెదేపా ప్రముఖులు కేసీఆర్‌కి భృత్యులై చరిస్తున్నారనీ, వేల కోట్ల కాంట్రాక్టులు, పరిటాల బ్రాండ్ బీర్ ఫ్యాక్టరీ నిజం కాదా అంటూ రేవంత్ గళమెత్తాడు. ఈ మాటలన్నీ ఇక్కడికంటే లండన్‌లో ఉన్న బాబుకి ఐదు గంటలు ముందే వినిపించాయి. అయినా రేవంత్‌ని ఉత్తుత్తినే కూడా కేకలు వేయ లేదు. బాబు ఉదాసీనత ఆయా నాయకులని గొప్ప అసహ నానికి గురి చేసినా, ఉలుకూ పలుకూ లేక ఊరుకున్నారు. అధినేత ఈ మొత్తం ఘట్టాన్ని ఆనందించాడు. కాగల కార్యం గంధర్వుడు తీర్చాడు. ఈ మొత్తానికి స్క్రీన్ ప్లే, డైలాగులు, నేపథ్య సంగీతం సమస్తం కొత్త క్యాపిటల్లోనే తయా రైందిట. అందుకే పార్టీ వదిలి వెళ్లే వారికి పెట్టే శాపనార్థాలేవీ రేవంత్‌కి పెట్టలేదు. ఇంకా చిత్రం వారాలు గడిచినా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ ఏపీ స్పీకర్‌కి చేరకపోవడం. టెక్నాలజీ మాన్ చంద్రబాబు ఈ జాప్యాన్ని పట్టించు కోవాలి. ఓ పెద్దాయన ఇదేం కాదండీ, అసలు కారణం వినండని మొదలు పెట్టాడు. లోకేశ్ బాబు ఒకరోజు అయిదువేలు జనాభా దాటిన గ్రామాలకు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని, ప్రతి పంచాయతీకి కంపోస్ట్ ద్వారా ఏటా వెయ్యి కోట్ల ఆదాయం తెప్పిస్తానని ఉద్ఘాటించాడట. ఆ దెబ్బకి రేవంత్ అఘా తానికి గురై పార్టీ వీడాడని వివరించాడు. ఇది కూడా నావరకూ నాకు నమ్మ తగ్గట్టుగానే ఉంది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అడుసు తొక్కనేల...?
♦ అక్షర తూణీరం ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా మహా నిర్మాణాల శిలాఫలకాల మీద రాజుల, నియంతల, ప్రధానుల పేర్లే ఉంటాయిగానీ రాళ్లెత్తిన కూలీల పేర్లుండవు. ఉన్న సమస్యలు చాలవన్నట్టు లేనివి కొనితెచ్చుకోవడం మనకో విలక్షణమైన అలవాటు. ప్రసిద్ధ చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌ని యూపీ పర్యాటక శాఖ వెలి వేయడం, దాని నిర్మాతలు సన్మార్గులు కారనడంతో వివాదం చెలరేగింది. సెగ పైదాకా తగిలింది. తాజ్‌మహల్ లాంటి మహల్ ప్రపంచంలో మరెక్కడా లేని మాట నిజం. ప్రపంచ ప్రజల్ని తాజ్‌ని చూసినవారు, చూడనివారు అని రెండు వర్గాలుగా విభజించవచ్చని ప్రముఖులు తీర్మానించారు. ఎవరేమన్నా భారతదేశానికి ఆ పాలరాతి మందిరం ఓ కొండగుర్తు. కాదు, అసలది తేజ్మహల్. శివాలయం కాగా దాన్ని మార్చి, పరిమార్చి తాజ్‌మహల్ చేశారని కోతిచేత నిప్పు తొక్కించారెవరో. ఇది చినికి చినికి గాలివాన అయ్యేట్టుందని యూపీ ముఖ్యమంత్రి రంగప్రవేశం చేసి, నిర్మాతలెవరైనా, రాళ్లెత్తిన కూలీలు చిందించిన స్వేదాన్ని, రక్తాన్ని గౌరవిస్తా, తాజ్‌మహల్‌ని గౌరవిస్తానని బహిరంగ ప్రకటన చేశారు. ఏ కాలంలో అయినా, ఏ దేశంలో అయినా మహా నిర్మాణాల శిలాఫలకాల మీద రాజుల, నియంతల, ప్రధానుల పేర్లే ఉంటాయిగానీ రాళ్లెత్తిన కూలీల పేర్లుండవు. కనీసం ఆ మహా నిర్మాణక్రమంలో నలిగి, కమిలి బలవన్మరణాల పాలైనవారి పేర్లైనా ఉండవు. ‘‘మీ మహాప్రస్థానానికి అక్షరం అక్షరం పొది గిన వారెవరు? అచ్చులొత్తిందెవరు? అట్టలు కుట్టిందెవరు? కట్టలు మోసిందెవరు? ఎక్కడైనా వారి పేర్లు అచ్చు వేశారా?’’అని మహాకవిని నిలదీశారు. జవాబు లేదు. అంతే, కొన్ని కోటబుల్ కోట్స్ అవుతాయిగానీ చర్చకు నిలవవు. తిరిగి తాజ్‌మహల్ దగ్గరకు వస్తే– అన్నట్టు ముగ్గేలా తాజ్‌మహల్ ముని వాకిటలో అన్నాడు శ్రీశ్రీ! ముఖ్యమంత్రి యోగి మొత్తం శుద్ధి చేయడానికి తాజ్‌మహల్ పరిసరాలన్నీ తుడుస్తూ చీపురుతో పాదయాత్ర ప్రారంభించారు. అయ్యవార్లంగారేం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టుంది. ఈ నైజం భాజపా రక్తంలోనే ఉందనిపిస్తుంది. మోదీ సర్కార్ ప్రతిష్టాత్మక నిర్ణయం పాతనోట్ల రద్దు– పైకి తేవా ల్సిన చిచ్చుబుడ్డి అడుగునించి గుంటపూలు పూసిందని అపోజిషన్ ఆక్షేపిస్తోంది. బ్లాక్ డేని బ్లాక్‌మనీ డేగా తిరగ్గొడతామని సర్కార్ అంటోందిగానీ మాట నీళ్లు నవుల్తున్నట్టుంది. ‘‘వీళ్లింతేనండీ, అడుసు తొక్కడం, గంగాజలంతో కాళ్లు కడుక్కోవడం, మళ్లీ అడుసువైపు పరుగులు తీయడం... వీళ్లకి దేశభక్తి, మతాభిమానం ఉంటే ఏదండీ రామమందిరం? నాలుగేళ్లలో నాలుగు స్తంభాలైనా నిలిపారా’’ అన్నాడొక అపర హనుమంతుడు ఆక్రోశంగా. ‘‘చూస్తున్నాంగా ఈయనవీ ఊకదంపుడు ఉపన్యాసాలే. కాకపోతే మరీ నాసిరకం ఊక కాకుండా హెర్బల్ ఊక వాడుతున్నాడని’’ ఓ పెద్దమనిషి ఆక్షేపించాడు. జీఎస్టీ కూడా బురద బురదగానే ఉంది. దాన్నొక క్రమంలో పెట్టకుండా, అచ్చీపచ్చీగా జనం మీదకు వదిలారని అనుభవజ్ఞులంటున్నారు. హిందీ భాషలో ఏది స్త్రీ లింగమో, ఏది పుంలింగమో చెప్పడం క్లిష్టతరం. దానికో వ్యాకరణ సూత్రం లేదు. వస్తు సేవల పన్ను పరిభాష కూడా అలాగే ఉంది. కొన్ని వేల లక్షల పన్ను విధానాలు. ఇది అంకెలలో నిర్మించిన హిందీ భాష. ఇది నా మనసులో మాట! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇంటింటా ఉసిరి
అక్షర తూణీరం మా చంద్రబాబు నాయుడు అయితే ఏ చిన్న అవకాశాన్ని వదలడు. అమరావతి పరిసరాలలో వనభోజనాలకు పది వనాలను పెంచుతానంటాడు. శరదృతువుకో ప్రత్యేకత ఉంది. అప్పటిదాకా వర్షాకాలం సృష్టించిన చిత్తడిని, బురదని ఇంకింప చేస్తుంది. ఈ రుతువులో ఎక్కడ చూసినా పచ్చికలు, గరికపూలు, రంగురంగుల కలుపు మొక్కలతో నేలలు తివాచీ పరుచుకున్నట్టుంటాయి. నగరాలలో పొడిదుమ్ము తగ్గుతుంది. కార్తీకమాసపు చిరుచలి మనుషుల మనసుకు ఆహ్లాదాన్నిస్తూ ఉంటుంది. పెందరాళే చీకటి పడుతుంది. పగటి పొద్దు తక్కువై పరుగులు పెట్టిస్తుంది. కార్తీకానికి వెలుగు ముద్ర అన్నట్టు వీధి గుమ్మాలలో, తులసికోటలలో నిత్యం దీపం దర్శనమిస్తుంది. శివాలయ ధ్వజస్తంభం మీద ఆకాశదీపాలు ఆధ్యాత్మిక వెలుగులని ప్రసరిస్తుం టాయి. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా చెబుతారు. శివార్చనలు, రుద్రాభిషేకాలు, ఒంటిపొద్దు ఉపోషాలతో మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు కొలుస్తూ ఉంటారు. ఇక సాంఘికంగా, సామాజికంగా కూడా కార్తీకమాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో జరిగే సామూహిక వనభోజనాలు ఒక చక్కని సదాచారం. ఏడాదికోసారి సర్వులూ ఒక చెట్టు నీడన చేరి సహపంక్తి భోజనం చేయడం ఒక పండు గలా వస్తోంది. ఈ ఆచారంలో ఓ సందేశం ఉంది. కుల, మత, వర్గ వివక్ష లేకుండా అంతా కలసి మెలసి ఒక కుండ కూడు, ఒక మబ్బు కింద, ఓ చెట్టు నీడన తినడం ఈ వ్రతక్రమం. కాసిన పూసిన వనంలో ఉసిరి చెట్టు సమక్షంలో అంతా సమభావంతో ప్రకృతి ఒడిలో ఒక పూటైనా సేద తీరడం దీని పరమార్థం. ప్రకృతిని పూజించడం, వృక్ష సంపద విలువలను గుర్తించడం ఈ సమారాధనల వెనుక దాగి ఉంది. రకరకాల చెట్ల గుణగణాలను ఆస్వాదిస్తాం. అవి చేస్తున్న మేలుని తలుచుకుని ‘ఆహా’ అనుకుంటాం. స్మశాన, పురాణ వైరాగ్యాల్లాగే, పర్యావరణ వైరాగ్యాన్ని మరుక్షణం విస్మరిస్తాం. పూర్వం ఒక పేట, ఒక ఊరు, ఒక వాడ, ఒక కార్యాలయం వారు, ఒక కర్మాగారం సిబ్బంది ఇలా సమష్టిగా కుటుంబాలతో వన భోజనాలు చేసేవారు. తరతమ భేదాలు చెరిగి మానవ సంబంధాలు కాస్తంత మెరుగుపడేవి. ఒకరి రుచులు, మరొకరి అభిరుచులు పరస్పరం పంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడూ జరుగుతూనే ఉన్నాయి గానీ, సంప్రదాయానికి వెన్ను వేసింది. కులాల వారీగా, తెగల ప్రకారంగా, వర్గాల వారీగా నేడు వనభోజనాలకు పిలుపులొస్తున్నాయి. భారీ ఫ్లెక్సీలు మొలుస్తున్నాయి. కొన్ని సెంటర్లలో రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నచోట రాజకీయ గబ్బు తప్పదు. ఈ వనభోజన వేదికని వాడుకుంటూ, కార్తీక దృశ్యాలు నడుస్తుంటాయి. ఇలా చెబుతుంటే అమరావతి ప్రాంతీయుడొకాయన అందుకుని, మా చంద్రబాబు అయితే ఏ చిన్న అవకాశాన్ని వదలడు. అమరావతి పరిసరాలలో వనభోజనాలకు పది వనాలను పెంచుతానంటాడు. అవసరమైతే తాజా సాంకేతిక పరిజ్ఞానం వాడుకుని, వచ్చే కార్తీకంలోగా వృక్షాలను సిద్ధం చేస్తానంటాడు. ఔషధ మొక్కలతో పాటు పదిమంది రామ్‌దేవ్ బాబాలను తయారు చేసుకుందామని హామీ ఇస్తాడు. ఇంటింటా ఉసిరి చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపడతాం. ‘ఇంట్లో ఉసిరి– తెలుగువారి సిరి’ఇదే మా నినాదం – అంటూ ముగించాడు ఆ ఆసామి. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కప్పాతల్లీ! నీళ్లాడే
‘నే చెప్పాకదా, పంచ భూతాల్ని మనం పిలవాలే గానీ వచ్చి వాల్తాయ్. అవసరమైతే పాత ఆచారా లను పునరుద్ధరిస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నా. టీవీ పెడితే రెండోది లేదు. హైదరాబాదులో వాన వార్తలు తప్ప. మూడు వారాల నించీ ఇంకో గొడవ లేనే లేదు. మన మీడియా భలే చిత్రమండీ.. అంటూ మొదలుపెట్టాడు ఒక మంత్రి స్థాయి నాయకుడు. వర్షా కాలంలో వానలు కురవడం విడ్డూరమా? తడిసి ముద్ద యిన నగరం, ఆకాశానికి చిల్లు, నీటిపై తేలు తున్న ట్రాఫిక్ ఇలాంటి అర్థంపర్థం లేని పేర్లు పెట్టి జనాన్ని భయపెడతారెందుకో? వాన కురిసింది. అక్కడక్కడ నీళ్లు నిలుస్తాయి. సహజం. నిలిచాయి. అదేమన్నా పెద్ద వార్తా! నీరు పల్లమెరిగి గప్‌చుప్‌గా వెళ్లిపోతే మనకి వార్తవుతుందిగానీ, రోడ్లు కాలువలైతే అదెట్లా వార్తవుతుంది. సైన్స్ ప్రకారం సాంద్రతని బట్టి వస్తువులు నీళ్లపై తేల్తాయ్. నీటి పోటు అధికమైనప్పుడు కార్లు పడవలవుతాయి. ఈ సిద్ధాంతాన్ని పెద్ద రాద్ధాంతం చేయడంలో అంతరార్థమేమిటో తెలుస్తూనే ఉంది. దేశ విదే శాల నించీ పెట్టుబడి మూటల్ని గాడిదల మీద, ఒంటెలమీద వేసుకుని మన భాగ్యనగరాన్ని వెతుక్కుంటూ వస్తున్న వారికి ఈ వార్తలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయ్. గత పాలకులు అరవై ఏళ్లుగా పట్టించుకోని అనర్థం ఇదంతా. మూడేళ్లలో విశ్వనగరం అయిపోవాలంటే కొంచెం కష్టమే. ఇది వరకటి ప్రభు త్వాలు అనేక గుంతల్ని, భయం కరమైన లొసు గుల్ని నగర వీధుల్లో కప్పి పెట్టాయి. ఈ కుండపోతలకి అవి బయటపడు తున్నాయ్. నీతి నియమం, సత్యం ధర్మం నిండిన మా పాలనని దేవుడు గుర్తించాడు. ‘‘చాలు మహాప్రభో’’ అన్నా వినకుండా గంగని వదుల్తున్నాడు – ఇదీ తెలంగాణ పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ స్థితి ఇందుకు భిన్నంగా లేదు. ‘‘నే చెప్పాకదా, పంచ భూతాల్ని మనం పిలవాలే గానీ వచ్చి వాల్తాయ్. జలహారతి ఇవ్వండి తమ్ముళ్లూ అని పిలుపునిచ్చాను. జలం ఉన్నచోటా లేని చోటా కూడా జల హారతులు ఘనంగా ఇచ్చాం. ఫలితం స్వయంగా చూస్తున్నాం. ఈసారి డ్వాక్రా మహిళల్ని, తెలుగు ఆడపడుచులని జలహారతిలో పూర్తి భాగ స్వాముల్ని చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు మనవి చేస్తున్నానని అమరావతి వాగ్దానం చేయగానే, ‘‘వద్దు వద్దు... అతివృష్టితో రాష్ట్రం కొట్టుకుపోతుంది’’ అంటూ ముక్తకంఠంతో అరిచారు అభిమానులు. చాలా కాలం తర్వాత శ్రీశైలం నిండిందని కూడా మీకు మనవి చేస్తున్నా. గేట్లు ఎత్తే వేడుకని జరుపుకుంటున్నాం. ఇక నుంచి ఒక్కో గేటుని ఒక్కో మంత్రితో ఎత్తించే ఏర్పాటు చేసి, అందర్నీ భాగస్వాముల్ని చేస్తాం. మన రాష్ట్రంలో వర్షాల కొరత ఉండదు. జలహారతి బాగా క్లిక్ అయ్యింది. వరుణ యజ్ఞాలు మరోవైపు సాగుతున్నాయి. వాన పూజలు బ్రహ్మాండంగా చేయించడం జరుగుతుంది. నాకు తెలుసు కొందరు వీటిని అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇవి ఆగవు. పూర్వకాలంలో వానల కోసం మనవాళ్లు కప్పలకు పెళ్లిళ్లు చేసేవారు. అవసరమైతే పాత ఆచారాలను పునరుద్ధరిస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నా. ధైర్యంగా ఉండండి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
భూమి గుండ్రంగా ఉంది?
అక్షర తూణీరం సముద్ర తీరాన నిలబడి వచ్చే ఓడని గమనిస్తే– మొదట జెండా క్రమంగా పై భాగం మధ్య భాగం కనిపిస్తాయి. దీన్ని బట్టి భూమి గుండ్రంగా ఉందని నమ్మాలి. అసలు దేశానికి పెద్ద అనర్థమేమంటే– ప్రభుత్వం పార్టీ పేరు మీద కాకుండా ముఖ్యనేత పేరుమీద నడవడం. ఉదాహరణకి ‘మోదీ గవర్నమెంట్’ అని వ్యవహరిం చడం. ప్రజాస్వామ్య పునాదులు ఇక్కడే కదిలిపోతాయ్. ఒక్కసారి మోదీ గద్దెక్కాక సామాన్యుడికి ఒరిగిందేమిటో చూద్దాం. చిన్నతరహా పరిశ్రమలుగానీ, వ్యవసాయ రంగంగానీ హాయిగా ఊపిరి పీల్చుకున్నది లేదు. మన దేశంలో చిన్న పరిశ్రమ రెక్కలు ముక్కలు చేసుకుని ఉత్పత్తి చేస్తుందిగానీ ఫలితాన్ని దళారీ రాబందులు తన్నుకుపోతాయి. కనీసం వాడకందారుకి చేరేలోపు మూడు రకాల దళారీ వ్యవస్థలు లాభాల్నీ కొరికేస్తాయి. ఇక ఉత్పత్తిదారుడికి మిగిలేది చాకిరీ మాత్రమే. చేనేత పరిశ్రమ ఇందుకు మిన హాయింపు కాదు. ఇక వ్యవసాయం మరీ దారుణం. రైతు ఆశాజీవి. ప్రభుత్వాలు రుణాలు ఎరవేసి రైతుల్ని ప్రలోభ పెడుతున్నారు. రుణాలివ్వడం, వాటిని మాఫీ చేస్తామని ఓట్ల కోసం ఆశ పెట్టడం పరిపాటి అయింది. ఇప్పటికీ కూడా మన రైతులకు వ్యవసాయ శాఖ నించి సరైన సలహాలు, సూచనలు అందవు. ఇప్పటికీ నకిలీ విత్తనాలపై ఆంక్షలు లేవు. నూతన పరిశోధనలు రైతులకు అందనే అందవు. కేవలం వార్తల్లో మాత్రం అధిక దిగుబడుల వంగడాల మాటలు విని పిస్తాయి. అధునాతన పరిజ్ఞానం గ్రామాలకు చేరనే చేరదు. అన్నీ సక్రమంగా ఉన్నా పంట అయ్యేనాటికి అడివి అవుతోంది. ఇక విద్య, వైద్యం కార్పొరేట్ కోరల్లోంచి బయ టకు రాకపోగా మరింత సుఖంగా చిక్కుకు పోయింది. ప్రజలు ఎన్ని రకాల పన్నులు కడుతు న్నారో తెలియకుండా మభ్య పెడుతున్నారు. అన్నీ భాగ స్వామ్య వసతులే. అన్ని రహదారులకూ టోల్ పేరిట ప్రతి ట్రిప్పుకీ పన్ను చెల్లిం చాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులూ పార్కింగ్ నుంచి పాయ ఖానా దాకా డబ్బు గుంజు తున్నాయి. డబ్బున్నవాడు నాలుగు వంతెనలు, రెండు ఫ్లై ఓవర్లూ కట్టుకుంటే చాలు. వాటిమీద సుఖంగా బతికేయచ్చు. జన్‌ధన్ ఖాతాలన్నారు. ఆధార్‌తో భార తీయుల పంచప్రాణాలు, నవరంధ్రాలు అనుసంధానం చేస్తేగానీ దేశం ముందు కెళ్లదన్నారు. పెద్ద నోట్లు రద్దు అన్నారు. మీ జాతకాలు తిరగబడతాయన్నారు. అసలు పవర్లోకి రాకముందే స్విస్ బ్యాంకు ఖాతాల్లోంచి నల్లధనం దింపుతాం, అందరూ ఐకమత్యంగా పంచుకోండన్నారు. ఆ ఓడలు ఎక్కడున్నాయో తెలియదు. మోదీ ప్రభుత్వంలో అవినీతి లేదు, స్కాములు లేవు, అంతా కడిగిన అద్దం అన్నారు. క్యాబినెట్ వరకు కావచ్చు. అలవాటుపడిన అధికార యంత్రాంగం మాత్రం ధరలు నాలుగు రెట్లు పెంచిన మాట నిజం. అవినీతి తగ్గడమంటే వేళ్ల దాకా తగ్గాలి. చిన్నప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి, సముద్ర తీరాన నిలబడి వచ్చే ఓడని గమనిస్తే– మొదటి జెండా క్రమంగా పై భాగం మధ్య భాగం కనిపిస్తాయి. దీన్ని బట్టి భూమి గుండ్రంగా ఉందని నమ్మాలి. మోదీ సర్కార్‌ని కూడా అలాగే నమ్మాలి. వేరే దారి లేదు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మా ఊరెళ్లాలి...
అక్షర తూణీరం మనందరి వేళ్లు ఇప్పటికీ మన గ్రామంలోనే ఉన్నాయి. పండుగ వస్తే, మూడ్రోజులు వరుసగా సెలవులొస్తే ఊరికి ప్రయాణమవుతాం. అప్పుడప్పుడు మా ఊరెళ్లాలనిపిస్తుంది. చెప్పలేనంత బలంగా, ఆగలేనంత ఆత్రంగా వెళ్లాలనిపిస్తుంది. ఎన్నెన్నో జ్ఞాపకాలు ముసురుతూ, కసురుతూ ఉన్నచోట ఉండనివ్వవు. పెద్ద పండుగలు దసరా, సంక్రాంతి వస్తున్నాయంటే మనసు నిలవదు. గుళ్లోంచి పున్నాగపూల వాసన ఉద్యోగపు ఊరుదాకా వచ్చి కవ్విస్తుంది. పిల్ల కాలువలు, పచ్చిక డొంకలు, తాటిబీళ్లు పేరెట్టి మరీ పిలుస్తాయి. ఇంకా రాలేదేమని పదే పదే అడుగుతాయ్. రథం బజార్ సెంటర్లో రావిచెట్టు గలగలమంటూ ఏదో చెప్పాలని ఆరాటపడుతుంది. మా ఊరెళ్లాలి. ఆ గడ్డపై ఏదో ఆకర్షణ ఉంది. పాదరక్షలు లేకుండా ఆ మట్టిమీద నడవాలనిపిస్తుంది. మా ఊరి చెరువులో బాతులతో సమానంగా ఈదులాడ మనసవుతుంది. మర్రి ఊడల ఉయ్యాలలూగి బాల్యాన్ని ఒంటిమీదికి ఆవాహన చేసుకోవాలని ఉంది. సత్తార్ భాయ్‌తో సమానంగా దసరా పులి వేషం కట్టి ఆడాలనే కోరిక ముదురుతోంది. పులి ఆట, డప్పులు అడుగు నిలవనివ్వకుండా వినిపిస్తున్నాయ్. మా ఊరెళ్లాలి. చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు ఇంకీ ఇంకని బురద వీధిలో.. కొత్త దుస్తులు, విల్లమ్ములు, కోతి బొమ్మలు ధరించి బుక్కాలు కొట్టుకుంటూ సాటి పిల్లలతో ఊరంతా తిరగడం నిన్నమొన్నటి సంగతిలా అనిపిస్తుంది. అయ్యవారికి చాలు అయిదు వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు– జయీభవ! దిగ్విజయీభవ అని దీవెనలు పెడుతూ అరుగు అరుగు ఎక్కి దిగడం పప్పూ బెల్లాలు తినడం ఇంకా నాలిక మీద ఉంది. ఇప్పుడు మా ఊరు మారిపోయింది. ఆ ఇళ్లు, ఆ గోడలు, ఆ అరుగులు లేవిప్పుడు. బోలెడు మా ఊరి ఆనవాళ్లు కన్పించనే కన్పించవు. ఆ మనుషులు మచ్చుకి కూడా కనిపించరు. ఆత్మీయంగా పలకరించే ఆ పిలుపులు వినిపించవ్. మా ఊరెళ్లాలి, అంతే! చేలమీంచి వచ్చే జనపపూల వాసన ఇప్పుడు లేదు. పురుగు మందుల కంపు వేటాడుతుంది. ఎద్దుల మెడ గంటల సవ్వడి వినరాదు, ట్రాక్టర్ల రొద తప్ప. కొంచెమే పాతముఖాలు, అవీ బాగా వెలిసిపోయి కనిపిస్తాయి. అన్నీ కొత్త మొహాలే. పాపం నన్ను గుర్తుపట్టలేవ్. చేసంచీతో వెళ్లి, ఊరంతా తనివితీరా తిరిగి రావాలి. పాత గుర్తులన్నింటినీ తిరిగి మా ఊరికి అలంకరించి, ఆనాటి ఊరు తల్లిని దర్శించాలి. అందుకే మా ఊరెళ్లాలి. మనందరి వేళ్లు ఇప్పటికీ మన గ్రామంలోనే ఉన్నాయి. పండుగ వస్తే, మూడ్రోజులు వరుసగా సెలవులొస్తే ఊరికి ప్రయాణమవుతాం. ఏటా రెండు మూడు సందర్భాలు మాత్రమే వస్తాయ్. ఈ సంగతి అందరికీ తెలుసు. ప్రజలకు ప్రభుత్వాలకు ఎరుకే. అయినా ప్రయాణ సౌకర్యాలుండవ్. సరిగ్గా అప్పుడే రవాణా సంస్థ సర్వర్లు పనిచెయ్యవ్. సరిగ్గా అప్పుడే ప్రైవేట్ రవాణాదార్లకు గిరాకీ పెరుగుతుంది. టికెట్ ధర ఐదు నుంచి పదిరెట్లవుతుంది. అవసరాన్ని బట్టి టికెట్లు వేలం పాడుకోవలసి ఉంటుంది. ఇదొక పెద్ద మాయ! రోడ్డు రవాణా సంస్థ సైతం ధరలు పెంచుతుంది. రైల్వేశాఖ పెంచుతుంది. ఆకాశ మార్గం అయితే సరే సరి– ఆకాశమే హద్దంటుంది. ఇలా పండుగ వస్తే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఎంతలా కిటకిటలాడిపోతాయో మీడియా బొమ్మలు చూపించి వినోదపరుస్తుంది. ఇలా జనం స్వగ్రామాలు వెళ్లడం కూడా మా ప్రభుత్వ కృషి ఫలితమేనని ఏలినవారు క్లెయిమ్ చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఎంత కష్టమైనా, నిష్టూరమైనా ఊరివైపు కాళ్లు లాగేస్తాయి. ఉన్నచోట నిలవనివ్వవ్. మా ఊరెళ్లాలి, తప్పదు. -శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఒకడు మోహన్
మోహన్ గీతలు డామినేట్ చేయడంవల్ల రాతల గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడరు. ఆయనకో విలక్షణమైన శైలి ఉంది. వాక్యాలు పదునుగా ఉంటాయి. కమ్యూనిస్టు భావాలున్న కార్టూనిస్టుగా, మంచి రాత గీత ఉన్న జర్నలిస్ట్‌గా, అన్నిటికీ మించి మంచి స్నేహ శీలిగా మోహన్ కలకాలం గుర్తుంటారు. మోహన్ రేఖలు వేటకొడవళ్లలా నిగ్గుతేలి ఉంటాయి. శషబిషలు లేని సూటి విసుర్లతో కార్టూన్లు సృష్టించి అనేకమంది అభిమా నులను, కొద్దిమంది శత్రువులను సంపాయించుకు న్నారు. మోహన్ గీతలు డామినేట్ చేయడంవల్ల రాతల గురించి ఎవరూ ఎక్కువ మాట్లాడరు. ఆయనకో విలక్ష ణమైన శైలి ఉంది. వాక్యాలు పదునుగా ఉంటాయి. ప్రపంచంలోని వివిధ కళా రీతుల్ని ఆయన అధ్యయనం చేశారు. మోహన్ అక్షరాలను తెలుగువారు ఇట్టే గుర్తించగలరు. ఆయనకి ‘‘శిష్య కోటి’’ ఉంది. హైదరాబాద్‌లో ‘‘నీహార్ ఆన్ లైన్’’ పోర్టల్ ప్రారంభించినపుడు దాంట్లో ‘‘సరసమ్ డాట్‌కామ్’’ ప్రత్యేక హాస్య విభాగాన్ని పెట్టారు. వారం వారం పాతిక వెబ్ పేజీలు నేను హాస్యంగా, వ్యంగ్యంగా, సర సంగా రాస్తే దానికి మోహన్ క్యారి కేచర్లు, కార్టూన్లు సమకూర్చి నిండు తనం తెచ్చేవారు. రెండు సంవత్స రాలు నిరాఘాటంగా, 66 దేశాలలో లక్షలాది క్లిక్స్తో నడిచింది సరసమ్. మోహన్ తన కెరియర్లో సంతృప్తినిచ్చిన సందర్భంగా చెప్పేవారు. వాటిలోంచి వాచవిగా కొన్ని: ఆంధ్రజ్యోతిలో చిలకలపందిరి కూడా మా కాంబినేషన్లో బానే సందడి చేసింది. నేనంటే ఆయనకు వల్లమాలిన ఇష్టం. నా వెంకట సత్య స్టాలిన్‌కి బొమ్మలు వేసిచ్చారు. పుస్తకం తేవాలి. మోహన్ సరసమ్ డాట్కామ్ని ఆరు సంపుటాలుగా సర్వాంగ సుందరంగా తేవాలని ముచ్చట పడ్డారు. చాలా బొమ్మలు మళ్లీ గీశారు కూడా. కొన్ని అనుకున్నట్టు జరగవ్. అంతే. సృజనశీలికి, సన్మిత్రునికి నివాళి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
హిరణ్యాక్షులు
అక్షర తూణీరం మీ సేద్యపు భూమిని, కాలికింది మట్టిని, మీ బతుకు ఆధరువును మాకివ్వండి. మీరంతా గాలిలో నిలబడండి అన్నదే పాలకుల మాట. ‘‘త్వరపడండి! ఇప్పటికే తయారీ నిలిచిపోయింది. ఆలశించిన ఆశా భంగం!!’’ అంటూ చాలా కాలం క్రితం ఒక అమెరికన్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటనలిచ్చి అందర్నీ ఆకర్షించింది. కొందర్ని ఆలోచింపజేసింది. ఇక ఎవరేం చేసినా భూగోళం విస్తరించదు కదా. భూమిపై మూడొంతులు నీరు, ఒక వంతు నేల. అప్పుడప్పుడు సముద్రం సమయం దొరికితే శత్రు వల్లే నేలను కబళిస్తూ చొచ్చుకు వస్తూ ఉంటుంది. ఉన్న కాస్త నేలలో కొండలు, గుట్టలు, అడవులు, వాగులు, వంకలు కొంత ఆక్రమించాయి. మిగిలిన పీస భాగంలోనే మనమంతా ఉండాలి. ఇందులోనే ఇల్లూవాకిలి, గొడ్లుగోదా, బడీగుడీ నిలబడాలి. నిన్న మొన్నటిదాకా మన భారతీయులం నలభైకోట్లు. ఇప్పుడు మూడు రెట్లకు ఎదిగాం. మన దేశ జనాభా రెండొందల కోట్లు అవడానికి మరీ ఎక్కువ వ్యవధి అవసరం లేదు. ఇప్పటికే ధరధరలు కొండలెక్కగా, జనావాసాలు పైకి ఎదగడం ప్రారంభించాయి. గూడు çఫర్వాలేదు గానీ కూడు నేల లేకుండా ఎలా? మరీ ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల భూముల్ని ‘ఎర’వేసి కబళించడం ఎక్కువైంది. మహా నగరాల కోసం, మెగా నిర్మాణాల కోసం ఓడరేవులకని, విమానాశ్రయా లకనీ, బుల్లెట్ రైళ్లు నడుపుతామనీ, కాలువలనీ, రోడ్లనీ, వంతెన లనీ, వారధులనీ కారణం ఉండీ లేకా పంట భూముల్ని బీళ్లు చేస్తున్నారు. రైతులు మొదట ఆందోళన చేసినా, తర్వాత రకరకాల ‘ఎర’లకు లొంగిపోతున్నారు. ఒకసారి భూమి చేజారిపోతే, తిరిగి ఎన్నటికీ రాదు. కృతయుగంలో, గొప్ప భూదానానికి ఒడిగట్టి అధఃపాతా ళానికి వెళ్లిపోయాడు. బలి ద్వారా మనకో సందేశం అందింది. ద్వాపరంలో కురుక్షేత్రంలో భీష్మున్ని దహనం చేయడానికి స్వచ్ఛ మైన నేలే దొరకలేదు. ఎక్కడకు వెళ్లినా ‘‘శతమ్ భీష్మమ్’’ అనే మాట ప్రతిధ్వనించింది. మహాకవి కంకాళాలు లేని స్థలం భూత లమంతా వెదికిన దొరకదన్నాడు. కనుక ఈ నేలకి మనం కొత్త కాదు. మనకే ఈ గడ్డ కొత్త. నేలతల్లి నిత్య బాలింత. ఈ నేల చావు బతుకుల రేవు. మోదీ సాబ్ హిందీలో సూటిగా ధాటిగా గర్జించినా, చంద్ర బాబు తెలుగులో తిరగేసి బోర్లేసి సుత్తి కొట్టినా, తీయటి తెలంగాణ యాసలో కేసీఆర్ ముచ్చట పెట్టినా వాటి ఆంతర్యం ఒక్కటే: ‘‘మీ సేద్యపు భూమిని, కాలికింది మట్టిని, మీ బతుకు ఆధరువును మాకివ్వండి. మీరంతా గాలిలో నిలబడండి. మీ చేతులకు, కాళ్లకు బంగరు కడియాలు తొడుగుతాం’’ అంతే. భూమికి బదులు భూమిస్తామని పొరబాటున కూడా అనరు. ఈ సర్కారీ భూ ఆక్రమణకు అడ్డుకట్టవేసే ‘‘నేషనల్ పాలసీ’’ రావాలి. లేదంటే ఇంటర్నేషనల్ పాలసీ! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
శిలాఫలకాలే ఆశాకిరణాలు
అక్షర తూణీరం నాయకులు ఇచ్చిన వాగ్దానాలను ప్రేక్షక శ్రోతలు మర్చిపోరు. నాయకులు సమయానికి తగు మాటలాడి, వేదిక దిగుతూనే మనసులోంచి దులిపేసుకుంటారు. నాటక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. అది పౌరాణికం, సాంఘికం, జానపదం ఏదైనా కావచ్చు. టిక్కెట్టు లేని అందరూ ఆహ్వానితులే బాపతుకి జనం కొరత ఉండదు. ప్రతి నాటకానికి ఒక ట్రూప్ లీడర్ ఉంటాడు. సామాన్యంగా ఆయన నాటకంలో ముఖ్యపాత్ర పోషిస్తాడు. వేషం ఏదైనా మంచి దుస్తుల్లో కనిపిస్తాడు. చప్పట్ల వాన కురిసే అదునుపదును ఉన్న డైలాగులు ట్రూప్ లీడర్ నోట ఎక్కువగా వస్తాయ్. సీన్‌కి సీన్‌కి మధ్య గ్రీన్ రూమ్‌లో నటీనటులు మాట్లాడుకుంటారు. పరస్పరం అభినందించుకుంటారు. తాను సరిగ్గా అందుకోలేకపోయినాసరే, తప్పు ప్రాంప్టర్‌దే అన్నట్టు సైడ్‌వింగ్‌ని కేకలేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ పక్షాన నిత్యం జరుగుతున్న సభల్ని చూస్తుంటే నాటక రంగమే గుర్తొస్తోంది. ఈ రాజకీయ రంగస్థలం మీద ఎందరో ఆసీనులై ఉంటారు. వారంతా సందర్భోచితంగా ట్రూప్ లీడర్ ప్రసంగానికి మితిమీరి స్పందిస్తూ కనిపిస్తారు. నవ్వి నవ్వించడం, చప్పట్లకు సంకేతాలిచ్చి అందర్నీ కరతాళ ధ్వనులకు ఉసిగొల్పడం, ఆశ్చర్యపోవడం, తరచూ ఆవులింతలు ఆపుకోవడం లాంటి చర్యలు వేదిక మీది పెద్దల్లో చూస్తాం. అంతా లీడర్ సహచరులే అయినా, ఆయన మాటలకు విస్తుపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ పనులూ, ఆ పథకాలూ ఎప్పుడూ అనుకొనిగానీ, విని గానీ ఉండరు. ఈ ట్రూప్ లీడర్ ప్రదర్శించే నాటకంలో మిగతా ట్రూప్కి పోర్షన్లు ఉండనే ఉండవు. నాటకంగా చెబుతారు గానీ ఏకపాత్రాభినయంగా నడిచి ముగుస్తుంది. రోడ్లు, కాలువలు, విద్య, వైద్యం, అభివృద్ధి, పారిశుధ్యం, మీరేదైనా చెప్పండి– అన్నీ నంబర్‌వన్ చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నట్లు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆ సభకు తెరపడుతుంది. మర్నాడు ఇంకో సభ. అక్కడ మళ్లీ బోలెడు కొత్త ముచ్చట్లు. అనేక భరోసాలు.. ఇలా సభ మీద సభ నడిచిపోతూ ఉంటుంది. నాయకులు ఒక్క సంగతి గుర్తు పెట్టుకోవాలి. వేదికలపై నుంచి మైకుల్లో వారిచ్చిన వాగ్దానాలను ప్రేక్షక శ్రోతలు మర్చిపోరు. నాయకులు సమయానికి తగు మాటలాడి, వేదిక దిగుతూనే మనసులోంచి దులిపేసుకుంటారు. కాలం కదిలిపోతుంది. పవర్లోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. వేసిన ఎసళ్లు ఇంకా వేసినట్టే ఉన్నాయ్. జనం నకనకలాడుతున్నారు. అప్పుడే మళ్లీ ఎన్నికల కథలు మొదలైనాయ్. ట్రూప్ లీడర్‌కి కొత్త వాగ్దానాలేవీ గుర్తు రావడం లేదు. ఆరోగ్య, ఐశ్వర్య, ఆనందాంధ్రప్రదేశ్ దాకా జనానికి చూపించేశారు. మహా క్యాపిటల్ అమరావతి చుట్టుపక్కల బోలెడన్ని శిలాఫలకాలు ఆశాకిరణాలుగా మెరుస్తున్నాయి. ఇవన్నీ మిద్దెలై, మేడలై, మహా నగరాలై, విశ్వవ్యాప్తమై, ప్రపంచ ప్రసిద్ధం కావాలంటే– చచ్చినట్టు నన్నే గెలిపించాలి. ఇదే మా ఎజెండా! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పలుకులమ్మ తోటమాలి
అక్షర తూణీరం ఒక కుటుంబం కలసికట్టుగా చేసిన త్యాగం ఈ గ్రంథాలయం. ‘‘పలుకులమ్మ తోటమాలి’’ని అభినందన సంచికతో నేడు వారి కుటుంబం గౌరవిస్తోంది. సముద్రం లోపల ముత్యపు చిప్పలుంటాయి. దానిలో చిన్న పురుగు ఉంటుంది. ఆల్చిప్పల్లోకి ఇసుక రేణువులు జొరబడతాయి. అతి సున్నితమైన ఆ పురుగు ఇసుక రేణువులతో కలిగే చికాకును అస్సలు భరించలేదు. తన నోట్లోంచి తెల్లటి జిగుర్ని ఊరించి, ఆ రేణువులచుట్టూ పొదిగి గరగరల నించి ఉపశమనం పొందుతుంది. ఆ జెల్లీ మెల్లగా గట్టిపడుతుంది. అదే మనం ధరించే మంచి ముత్యం (స్వాతి చినుకులు కేవలం కవి సమయాలు మాత్రమే) అంటే, ఒక్కోసారి కొన్ని గరగరలు, జీవుడి వేదనలు జాతికి మేలు చేస్తాయి. అలా జరిగిన ఒకానొక మేలు– గుంటూరు బృందావన గార్డెన్స్‌లో వెల సిన అన్నమయ్య గ్రంథాలయం. ఒక్క మనిషి కృషి, ఒక్క రెక్క శ్రమ, ఒక్క పురుగు దురద. అరవై ఏళ్లలో లక్షంజిల్లర పుస్తకాలను సేకరించి, పదిలపరచి, ముడుపుకట్టి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి చేర్చి కృతార్థులైనారు. ఈ గ్రంథాళ్వార్ అసలు పేరు లంకా సూర్యనారాయణ. సహస్ర చంద్ర దర్శనానికి చేరువలో ఉన్నా, పుస్తక సేక రణపట్ల ఏ మాత్రం ఉత్సాహం తగ్గలేదు. తను సేకరించలేని అపురూప గ్రంథా లను తలచుకుంటూ అసంతృప్తి పడే మంచి ముత్యం ఎల్లెస్. గుంటూరు సమీపంలోని చిన్న గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మిం చిన లంకా ఉన్నత చదువులు చదివి సెంట్రల్ ఎక్సైజ్‌శాఖలో వివిధ హోదా ల్లో పని చేశారు. తలచుకుంటే బారువు లకొద్దీ బంగారం ఇచ్చే శమంతకమణి లాంటి శాఖలో ఉన్నా, పెద్ద మనిషి గానే మిగిలిపోయారు లంకా సూర్య నారాయణ. కాలేజీ రోజుల్లోనే పుస్త కాల పిచ్చి పట్టుకున్న ఈ ఆసామి ఇంటిళ్లిపాదినీ తన హాబీకి అనుగు ణంగా మలచుకున్నారు. సంతృప్తి, సింప్లిసిటీ ఇవే గొప్ప అలంకారాలని కుటుంబ సభ్యుల్ని విజయవంతంగా నమ్మించగలిగారు. దరిమిలా ఎల్లెస్ తన వ్యసనాన్ని ప్రశాంతంగా పండిం చుకోగలిగారు. శ్రీ విద్యనుంచి శ్రీ శ్రీ సాహిత్యందాకా ఆయన సేకరణలో లేనివి లేవు. సాహిత్యం, సంగీతం, కళ లపై పత్రికల్లో వచ్చిన కండపుష్టిగల వ్యాసాలను కత్తిరించి, ఒకచోట గుచ్చెత్తడం లంకా చేసిన గొప్ప పని. అసంఖ్యాకంగా ఉన్న అలాంటి సంపుటాలు అన్నమయ్య లైబ్రరీకి అదనపు ఆకర్షణ. ఇంట్లో కొండలుగా పెరిగిపోయిన పుస్తకాలు ఆ వేంకటేశ్వరస్వామి సన్నిధిని చేరాయి. తర్వాత అన్నమయ్య ఉద్యానంలోని భవనాన్ని అలంకరించాయి. లక్షకు పైగా పుస్తకాలను ఆయనొక్కరే వైనంగా చేరవేసి సర్దారు. అది చూశాక నేను అపు రూపంగా చూసుకునే ఎన్సైక్లోపీడియా వాల్యూములు, ప్రారంభంనించీ భారతి సంచికల బైండ్లు, ఆంధ్ర వారపత్రిక ఉగాది సంచికలు, మరికొన్ని మంచి పుస్తకాలు ఆ ఆళ్వార్ చేతిలో పెట్టి బరువు దించుకున్నాను. దేవుడు ప్రత్యక్షమై వాగ్దేవిపట్ల నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకోమంటే, నా అశ్రద్ధవల్ల వసుచరిత్ర ప్రాచీన ప్రతి తాలూకు అనుక్రమణిక పుట రాలిపోయింది. దాన్ని తిరిగి మొలిపించి పుణ్యం కట్టుకోమని లంకా కోరతాడని ఒక ఐతిహ్యం మిత్రుల మధ్య ప్రచారంలో ఉంది. ఒక కుటుంబం యావత్తూ కలసికట్టుగా చేసిన త్యాగం ఈ గ్రంథాలయం. అందరికీ శిరçస్సువంచి నమస్కరిస్తున్నాను. ‘‘పలుకులమ్మ తోటమాలి’’ని అభినం దన సంచికతో నేడు వారి కుటుంబం గౌరవిస్తోంది. ఇలాంటి మాలీలు మన జాతి సంపదలు– వరుసన్ నీ ఘనరాజసంబు వర్ధిల్లు నారాయణా! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
కొండకి నాగలంటే ఇదే!
అక్షర తూణీరం బాబు తెరపై చూపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ మహానగరం ఎప్పటికి చూస్తామోనని ప్రజలు తహతహలాడుతున్నారు. కొందరికి అసలు చూడమేమోనని దిగులు. రైతులు ఇచ్చారో కాపిటలిస్టులు తీసుకున్నారోగానీ ముప్పై వేల ఎకరాల సుక్షేత్రాన్ని బీడు పెట్టేశారు. కాపిటలిస్టులంటే మహానగర నిర్మాతలని నా ఉద్దేశం. రాష్ట్రంలో కూరగాయలకు కరువొచ్చిపడింది. టమేటాలు సలక్షణమైనవి కిలో వందరూపాయలు, పచ్చిమిర్చి దానికి సరితూగుతోంది. మిగతా పచ్చికూరలన్నీ మన సొంత హెరిటేజ్‌లో సైతం మండిపోతున్నాయి. రెండు ఏరువాకలు గడిచిపోయాయి. జరిగిందేమిటంటే తాత్కాలిక సచివాలయం మరియు శాసనసభా భవనం, అవి కూడా మన రాష్ట్రప్రభుత్వ ఆంతరంగిక సమాచారంలాగే అడపా దడపా లీకులకు గురి అవుతున్నాయి. అది నిర్మాణ లోపం కాదనీ, వాన కురుస్తున్న తీరే కారణమని అప్పటికప్పుడు నొక్కి వక్కాణిస్తున్నారు. లీకుల వల్ల తడిసేది వారే గానీ సామాన్య ప్రజ కానేకాదు. పోనీ, ఈ తాత్కాలికాలకు ఓ వెయ్యి ఎకరాలు పక్కన పెట్టినా, మిగతా సుక్షేత్రాలలో కూరగాయలు పండించవచ్చు. మిగతా మెట్టపంటలు వెయ్యొచ్చు. ఒకవేళ సింగపూర్ వాళ్లు, జాపనీయులు వస్తే పంటతో నేలను చూపించవచ్చు. వాళ్లు వచ్చేసరికి బీడు భూముల్లా కనిపించాలని ఖాళీగా పెట్టారు. ఆధునిక టెక్నాలజీని వాడుకుంటూ, బాబు తెరమీద చూపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ మహానగరం ఎప్పటికి చూస్తామోనని ప్రజలు తహతహలాడుతున్నారు. కొంచెం వయసు మీరినవారు అసలు చూడమేమోనని దిగులు పడుతున్నారు. కొందరు మాత్రం, ‘కొండకి నాగలి పట్టించాడు. కొంచెం కష్టమే’నని నిట్టూరుస్తున్నారు. కృష్ణమ్మ మీద నయన మనోహరమైన వంతెనలు, ఆబాల గోపాలాన్ని ఆడించే నందనవనాలు, కోరిన చోటల్లా ఫ్లైఓవర్లు బాబు చూపిస్తున్న బొమ్మల్లో తెగ ఊరిస్తున్నాయి. నా చిన్నప్పుడు హనుమంతుడు గారని ఒకాయన ఏటా నాలుగుసార్లు మా ఊళ్లకి వచ్చేవాడు. ఒక ఎడ్లబండిలో రెండు రాతి విగ్రహాలు, వెనకాల మరో బండిలో ఊరూరు తిరిగేవారు. ఏటవతల ఆలయనిర్మాణం జరుగుతోందని, అక్కడ ప్రతిష్ట చేసే విగ్రహాలు ఇవేనని భక్తిపూర్వకమైన భాషలో మైకులో ప్రకటించేవాడు హనుమంతుడుగారు. ‘ఇదే ఆఖరి అవకాశం.. దేవుడు మీ ఇంటిముందుకొచ్చాడు. తర్వాత మనమే గుడికి వెళ్లాలి దర్శనానికి’ అంటూంటే, ఇహ జనం టెంకాయలే కాదు, హారతులే కాదు, కానుకలే కాదు.. హనుమంతుడుగారి పంటపండేది. రెండు బజార్లు కవర్ చేసేటప్పటికి బియ్యంతో, అపరాలతో వెనకాల బండి నిండిపోయేది. రొఖ్ఖం సరే సరి. ప్రతిష్ట తర్వాత గోత్రనామాలతో పూజకి ముందస్తు బుకింగ్‌లు కూడా జరిగేవి. హనుమంతుడు మైకులో కట్టబోయే ఆలయాన్ని గోపురాలతో, ప్రాకారాలతో, ధ్వజస్తంభాలతో, జే గంట లతో, మహామంటపాలతో, కొలనులతో బొమ్మ కట్టించి భక్తుల్ని తన్మయుల్ని చేసేవాడు. మీరొక మారేడుకి ఆశ్రయం ఇవ్వొచ్చు. మీరొక పున్నాగను పూయించవచ్చు. పొగడ, పొన్న, పారిజాతం ఏదైనా సరే మీ పేరు మీద పూస్తూ, దేవుళ్లను సేవిస్తూ ఉంటుంది– ఒక్క నూట పదహారు రూపాయలు చాలు. మళ్ళీసారి హనుమంతుడు కొత్త బొమ్మలు తెచ్చేవాడు. దశావతారాలు, నవగ్రహాలు.. ఇలా రకరకాల విగ్రహాలు. ఆలయం ఎక్కడో తెలియదు. ఎప్పటికి ప్రతిష్టలవుతాయో చెప్పలేం. మొత్తానికి ముప్పైఏళ్లపాటు హనుమంతుడిగారి జీవితం సుఖంగా సాగిపోయింది. మనదేశంలో దేవుడి బొమ్మలతో ఎంత కాలమైనా వ్యాపారం నడిచిపోతుంది. కానీ ఇతరత్రా బొమ్మలతో మాత్రం కథ నడవదు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
స్వప్నాలను పండించుకున్న సిద్ధుడు
యనభై ఆరేళ్ల జీవితంలో ఆయన అధిరోహించని పదవులు, వేదికలు లేవు. సృజనశీలి. సౌజన్యమూర్తి. కల్తీలేని తెలుగు సంభాషణతో ఠీవైన పంచెకట్టుతో అరవైఏళ్ల పాటు తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. తెలుగునాట ఏడుపదుల సందడి సద్దుమణిగింది. గలగల లాడే ఒక సెలయేరు నిర్జీవమై నిలిచిపోయింది. తెలుగు కవిత ఆయన కోసం వెతుక్కుంటుంది. ఆ సృజన శీలిపై బెంగపడుతుంది. ‘సి.నా.రె.’ మూడక్షరాల సంతకం మానస సరోవరంలో ఈదాడే రాయంచలా ఉండేది. ఆయన దస్తూరి తెలుగు లిపికి పట్టువస్త్రాలు కట్టినట్టుండేది. జీవితంలోనూ సాహిత్యంలోనూ మడత నలగని పొంది కైన మనిషి. గొప్ప స్వాప్నికుడు. ఊరికే కలలు కంటూ రికామీగా కూచోకుండా, నిరంతర సృజనతో స్వప్నాలను పండించుకున్న సిద్ధుడు. ఈ పోటీ లోకంలో ఆరు దశాబ్దాల పాటు ‘సెలెబ్రిటీ హోదా’ని చలాయించుకున్న అపురూప వ్యక్తి సింగిరెడ్డి నారాయణరెడ్డి. నవాబ్ పాలనలో ఉర్దూ మాధ్యమంలో డిగ్రీ దాకా చదివారు. ఆపై చదువులు తెలుగు మాధ్యమంలో చేశారు. నారాయణరెడ్డికి ఉర్దూ, పారశీ భాషలపై మంచి పట్టుంది. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడై, విద్యార్థులకు పాఠాలు చెప్పే పనిలో పడ్డారు. ప్రబంధ సాహిత్యం, కావ్యాలు నాటి డిగ్రీ, పై డిగ్రీలకు నిత్యం బోధించేవారు. నారాయణరెడ్డి పాఠం చెబుతుంటే ఆ తరగతికి సైన్స్, కామర్స్ శాఖల విద్యార్థులు సైతం వచ్చి కూర్చునేవారు. చక్కని కంఠంతో పద్యం విడమరిచి ఆయన చదువుతుంటే – అర్థం చేసుకుంటూ ఆస్వాదిస్తూ విద్యార్థులు ఆనందించేవారు. పాఠాలు చెప్పడం ఆయన తొలి ప్రేమ. జీవితంలో ఎన్ని వ్యాపకాలు పెట్టుకున్నా విద్యార్థులతో గడపడం ఆయనకు ఇష్టం. అందుకే సినారె నిత్యోత్సాహిగా, నిత్య యవ్వనుడిగా మిగిలారు. గంగ,యమున, సరస్వతి ముగ్గురాడపిల్లలు. వివేక్‌నగర్‌లో ఆ ఇంటిపేరు త్రివేణి. గురువుగారి లెక్క తేడా వచ్చింది. నాలుగో నది కృష్ణవేణి కదిలి వచ్చింది. సినారె రచించిన అద్భుతమైన గీత కావ్యాలు రామప్ప,∙కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం సర్వత్రా గుబాళించాయి. ఆ పరిమళాలే చిత్రసీమకు నడిపిం చాయి. స్వగ్రామం హనుమాజీపేటలో మూట కట్టుకున్న జానపద బాణీలు, అష్ట దిగ్గజాల పదగుంఫనలు తన స్వీయవాణికి జత చేసుకున్నారు. వేలాది పల్లవులు ఆశువుగా కువ్వలు పోశారు. సాహిత్య ప్రక్రియల్లో దేని పదాలు దానికి వాడితేనే అందం. పాటలకు కొన్ని మాటలే ఒదుగుతాయి. ఆ మాటలు సినారెకు బాగా తెలుసు. పైగా ఆయన ఖజానాలో అవి కావల్సినన్ని ఉన్నాయి. భావానికి అనువైన భాషని పొదగడంలో మహాశిల్పి. అవసరమైన చోట సమాసాలను సొగసుగా అల్లనూగలరు. జానపద శైలికి కావల్సిన సరుకూ సరంజామా ఆయన గోటి మీద ఉంటుంది. అందుకే సినారె గీతాలలో యమునా తరంగాలు, నందనవనాలు, నవపారిజాతాలు, తరిపి వెన్నెలలు, సైకత వేదికలు, వీణలు, వేణుగానాలు, పగలే వెన్నెలలు– ఇలా ఎన్నెన్నో పాత మాటలే ఈ కవి ప్రయోగంలో కొత్తగా ధ్వనిస్తాయి. అందుకే విశ్లేషకులు సినారె సినిమా పాటలకు కావ్య గౌరవం తెచ్చారని అభినందించారు. పాటలు, లలిత గేయాలు, పద్యాలు, తెలుగు గజళ్లు, ప్రపంచ పదులు, భావ కవిత్వాలు, దీర్ఘ కవితలు ఇంకా ఆయన పండించని ప్రక్రియ లేదు. యనభై ఆరేళ్ల జీవితంలో ఆయన అధిరోహించని పదవులు, వేదికలు లేవు. సృజనశీలి. సౌజన్యమూర్తి. కల్తీలేని తెలుగు సంభాషణతో ఠీవైన పంచెకట్టుతో అరవైఏళ్ల పాటు తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. పద్మభూషణ్, జ్ఞానపీuŠ‡ అవార్డ్‌ల గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యులు, ఆచార్య డాక్టర్ సి. నారాయణరెడ్డికి అశ్రుతర్పణం. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
దీక్షాంధ్రప్రదేశ్
ఈ దీక్షలు ఏ ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపడం లేదు. అసలీ దీక్ష ఎవరికిస్తున్నారో చెప్పండి. దీక్షా ప్రసంగాలు జనాన్ని డిప్రెషన్లోకి నెట్టేసేలా సాగుతున్నాయ్. ‘‘ఏమిటండీ ఈ నవ నిర్మాణ దీక్ష– వినలేక కనలేక చచ్చిపోతున్నాం. ఏ చానల్ చూసినా ఇదే...’’– నా అసహనాన్ని వ్యక్తం చేశా. ‘‘మీరే అట్లా అనుకుంటే మా సంగతేంటి సార్? నేను ఏపీ సర్కార్‌లో గ్రూప్ వన్ అధికారిని. వారం రోజుల్నుంచీ గూబలు పగిలి పోతున్నాయ్. సంసార జీవితానికి పనికి రాకుండా పోతానేమోనని భయంగా ఉంది సార్’’ అంటూ బావురుమన్నాడు. ఈ దీక్షలేంటో.. ఈ కఠోర శపథాలేంటో ఎవరికీ అర్థం కావ డం లేదు. కొందరికి మాత్రం, ఇది బాబుగారి భయంలోంచి, ఇన్సెక్యూరిటీ లోంచి పుట్టుకొస్తున్న ఆలోచనలని అర్థం అవుతోంది. ఎన్ని పని గంటలు, ఎంత డబ్బు, ఎంత అధికారం దుర్వినియోగం అవుతుందో చాలామంది లెక్కలు కడుతున్నారు. ఈ దీక్షలు ఏ ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపడం లేదు. అసలీ దీక్ష ఎవరికిస్తున్నారో చెప్పండి. మీ అనుచరగణానికి, మీ సొంత వర్గానికా, అధికార వర్గానికా, మీ పార్టీ కార్యకర్తలకా లేక రాష్ట్ర ప్రజలందరికీనా? దీక్షా ప్రసంగాలు జనాన్ని డిప్రెషన్లోకి నెట్టేసేలా సాగుతున్నాయ్. విభజనలో అన్యాయం చేశారు. రోడ్డున పడేశారు. అయినా హెర్క్యులిస్లా నేనున్నా... భారాన్ని నే మోస్తా.. అంటూ పదే పదే, దపే దపే, చెప్పిందే చెప్పి, మళ్లీ చెప్పి, అందర్నీ దెప్పి... ఇదంతా మహా దిగులు పుట్టిస్తోంది. అన్నదమ్ముల్లా విడిపోయాం. కష్టపడదాం. బాగుపడదాం. ఎవర్నెవరు అన్యాయం చేశారో తెలియదు. విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అడుగులేని నావ అని తెలిసికూడా ముందుకు నడిపిస్తానని చుక్కాని పట్టుకున్నారు చంద్రబాబు. ఆత్మ విశ్వాస మన్నా కావాలి అది, అధికార దాహమన్నా అయి ఉండాలి. ఆత్మవిశ్వా సమే అయితే, పరనింద ఆత్మస్తుతి వదిలి హీరోలా ప్రవర్తించాలి. ఓ పౌరాణిక నాటకంలో ఒక పతివ్రత వేషధారిణి దుష్టుడికి శాపం పెట్టబోయేముందు, ఏను పతివ్రతయేని... నేను మహా పతివ్రతయేని అంటూ సవాల్ విసిరి శాప పద్యం అందుకున్నది. ఆవిడ చాలెంజి అయీ కాకుండానే ప్రేక్షకుల్లోంచి ఓ సరసుడు ‘‘ఏం డౌటా’’ అని అరిచాడు. దాంతో పతివ్రత పద్యానికి తడబడింది. అందుకే ఎప్పుడూ పాయింట్లోకి వెళ్లిపోవాలి గానీ రోజుల తరబడి వ్యర్థ ప్రసంగాలకు దిగకూడదు. పైగా ఇంకా కోటిన్నరమంది తెలుగువాళ్లు తెలంగాణలో సుఖ జీవనం సాగిస్తున్నారు. ఇంకోటిమంది వేళ్లూ, కాళ్లు ఇక్కడే ఉన్నాయి. అంచేత అనవసరంగా పేలకూడదు. ‘‘నవ నిర్మాణ’’ అనగానే జనానికి సిమెంటు, ఇసుక గుర్తొస్తున్నాయ్. ఎవరి కుండే ప్లస్‌లు వాళ్లకున్నాయ్. ఏపీకి ఎవరికీ లేనంత సముద్ర తీరం ఉంది. సారవంతమైన నేల ఉంది. శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న, బెజవాడ కనకదుర్గమ్మ ఉన్నారు. రాష్ట్రానికి బంగారు ప్యాకేజీలు ఉదారంగా ఇచ్చే మోదీ ఉన్నారు. వరాలు మోసుకుంటూ తెచ్చిస్తూ ఆసులో గొట్టంలా తిరిగే వెంకయ్య మీ వెనక ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు జనానికి ఇలా దిగుళ్లు నూరిపొయ్యకండి బాబూ! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అర్ధ శతాబ్ది సినిమా చరిత్ర
దాసరి మంచి స్క్రీన్‌ప్లే రచయిత. గొప్ప నటుడు. ఆయనదొక ప్రత్యేకమైన మాడ్యులేషన్. ఒక చిత్రంలోని ఆయన డైలాగులు గ్రాంఫోన్ రికార్డులుగా రాష్ట్రమంతా మార్మోగాయి. శరణన్న వారికి అభయమిచ్చి ఆదుకున్న భోళాశంకరుడు. 75 ఏళ్ల జీవితంలో యాభై ఏళ్ల సినీ జీవితాన్ని సమగ్రంగా, సలక్షణంగా గడిపిన దర్శకరత్నం దాసరి నారాయణరావు. నాటకాలతో ఆయన జీవితం ఆరంభమైంది. రచయితగా, నటుడిగా, దర్శకునిగా ఆ రంగంలో అభినివేశం గడిం చారు. ప్రారంభదశలో వెండితెరకి సంబంధించిన పలు శాఖలను గమనిస్తూ వచ్చారు. వాటితో పాటు అవమానాల్ని, ఆకలిని భరిస్తూ, సహిస్తూ తగినంత చేవ తేలారు. తారాబలం లేకపోయినా మంచి కథాచిత్రాలను సామాన్య ప్రేక్షకులు ఆదరిస్తున్న రోజులు. ఒక మంచి ఇతివృత్తం, సందేశం, పరిష్కారం మిళితమైన కథతో సినీ బజారున పడ్డారు దాసరి. చిన్న బడ్జెట్ చిత్రం కావడం కంటే, ఆయన కథ చెప్పిన తీరు నిర్మాతని విశేషంగా ఆకట్టుకుంది. చెప్పిన దానికంటే ఆసక్తికరంగా వెండితెరపై కథ చూపించాడు. అదే తాత–మనవడు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం– ఇలా సర్వం తనే అయ్యారు. తొలి సూపర్‌హిట్‌తో దాసరి నారాయణరావు ఇక జీవితంలో వెనుతిరిగి చూసింది లేదు. ఆయన బలం సెన్సాఫ్ డ్రామా. ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ అప్పటికే తెలుగునాట ప్రసిద్ధికెక్కిన నాటకం. దాసరి చేతుల్లో చిట్టెమ్మ బంగారు కాసులు కురి పించింది. వయసుకి మించిన లోకానుభవం, పరిశీలన, గోదావరితనం దాసరికి మనోధైర్యాన్నిచ్చాయి. ఎవరీ దాసరి నారాయణరావ్, పైన మేఘాల్లో... కిందికి దించండి అన్నవారే, కాదు ఉంచండని సగౌరవంగా నిలిపారు. సినిమా ఫీల్డ్‌ని ఒక ఇండస్ట్రీగా అంతా గుర్తించి గౌరవించే స్థాయి దాసరితోనే మొదలైంది. దేనికీ వెరపెరుగని దిగ్గజంగా ఎదిగారు. వైటాన్వైట్లో నిలువెత్తు విగ్రహంతో సినీప్రపంచంలో స్వైరవిహారం చేసి, అన్ని శాఖల్లోనూ హారతులందుకున్నారు. చాలా బిజీ జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఎందరికో జీవితాలు ప్రసాదించారు. పొద్దుటే నిద్ర లేచి, అయిదు నిమిషాల్లో రెడీ అయి, కారెక్కి దారి పొడుగునా టేప్రికార్డర్లో డైలాగులు చెప్పేసి, కారు దిగి షూటింగ్ స్పాట్‌కి వెళ్లేవారు. లైటింగ్ గ్యాప్‌లో తర్వాతి కథ చర్చలు నడిపేవారు. పాలగుమ్మి పద్మరాజు, రాజశ్రీ లాంటి దీటైన రచయితలు ఆయన వెంట ఉండేవారు. కనుకనే ఒక సంవత్సరం (1984)లో దాసరి దర్శకత్వంలో అటు హిందీ ఇటు తెలుగులో కలిపి పది చిత్రాలు విడుదలైనాయి. దాసరి మంచి స్క్రీన్‌ప్లే రచయిత. గొప్ప నటుడు. ఆయనదొక ప్రత్యేకమైన మాడ్యులేషన్. ఒక చిత్రం లోని ఆయన డైలాగులు గ్రాంఫోన్ రికార్డులుగా రాష్ట్రమంతా మార్మోగాయి. శరణన్న వారికి అభయమిచ్చి ఆదుకున్న భోళాశంకరుడు. ఆయన ప్రారంభించి నడిపిన ‘ఉదయం’పత్రిక ఒక సంచలనం. బలహీన వర్గాలకు, తిరుగుబాటువాదులకు గర్జించే శక్తిగా నిలిచింది. ఎన్నో కొత్త గళాలను, కలాలను మీడియా రంగానికి ‘ఉదయం’ అందించింది. దాసరి త్రిముఖుడు, త్రివిక్రముడు. కలకాలం గుర్తుండే మహామనిషికి అక్షర నివాళి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సీమ రూకలొస్తున్నాయ్..!
అక్షర తూణీరం మన ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్షణం తీరిక లేకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దున్ని పారేస్తున్నారు. ఆయనంతే, అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. ఎవర్నీ నిద్రపోనివ్వరు. ‘‘పెట్టుబడుల గురించి వాకబు చేస్తున్నారు’’ అన్నాను. ‘‘అంటే ఆయన పెట్టడానికా...’’ అన్నాడు మావూరి ఆసామి ఒకాయన. ‘‘అబ్బో..! అందరికీ చమత్కారాలు పెరిగిపోయాయ్. మరీ ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల..’’ అన్నాను. ఎందుకు పెరగవ్.. చచ్చినట్లు పెరుగుతాయ్. దగ్గరదగ్గర యాభైవేల ఎకరాల్లో సేద్యం లేదు. పాతికవేల మంది రైతులు రికామీగా ఉన్నారు. పైగా వారికి కరువులు లేవు. అకాల వర్షాల దెబ్బ లేదు. గాలి దుమారాలు లేవు. హాయిగా చెక్కులు గుమ్మంలోకి కొట్టుకు వస్తున్నాయ్. వాళ్లు రాబోయే విశ్వ నగరం తాలూకు బ్లూప్రింట్స్ని ఆస్వాదిస్తూ వినోదించడమే రోజువారీ కార్యక్రమం. అందరూ కార్లలో, బైకుల మీద ఓ రచ్చబండ మీదికి చేరడం, పేపర్లు నెమరేస్తూ, టీవీని చర్చిస్తూ పొద్దు పుచ్చడం మిగిలింది. హాయిగా చేతుల్లో సెల్ఫోన్లుంటాయ్. ఇంటి వ్యవహారాల్ని, ఒంటి వ్యవహా రాల్ని సెల్లో చక్కపెట్టుకోవచ్చు. పూర్వంలాగా అప్పుల బెడద, చీడపీడల బెడద అస్సలు లేదు. అందుకని ఆ ప్రాంతం రైతులంతా మాటకు ముందు చమత్కారాలు ఒలకపోస్తున్నారు– ఇదొక సర్వే రిపోర్టు. ఇంతటి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. ఒకే ఒక్క క్షణంలో ప్రపంచంలో ఎవరినైనా పలకరించవచ్చు, చూసి మాట్లాడవచ్చనేది యదార్థం. ప్రయాసపడి, బోలెడన్ని కోట్లు ఖర్చుతో సముద్రాలు దాటి వెళ్లడం అవసరమా అని రచ్చబండ మీద చర్చ నడుస్తుంది. పెట్టబడులు, వ్యాపారాలు అంటే పెళ్లి యవ్వారాల్లాంటివి. ‘‘ఫోన్లో పెళ్లిళ్లు సెటిలైపోతాయా? జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల! అవసరమైతే గెడ్డాలు పుచ్చుకు బతిమాలాల...!’’ అని ఇంకో గొంతు సమర్థిస్తుంది. ‘‘బాబాయ్! వాళ్లంతా ఇక్కడోళ్లే... మొహాలు చూస్తుంటే తెలియటంలా...’’ ‘‘ఇక్కడోళ్లైతే పెట్టుబళ్లు పెట్టకూడదా’’ అని సూటి జవాబు. ఎందుకు పెట్టకూడదూ... నిక్షేపంగా పెట్టవచ్చు. అసలు మన అవినీతి ఆఫీసర్ల లాకర్లు తీస్తే చాలు. అయితే ఎలాంటి కేసులూ ఉండవని భరోసా ఇవ్వాలి. వారి సొమ్ముని బట్టి, ఆయా పరిశ్రమల్లో వారికి వాటా ఇవ్వాలి. ఇప్పుడు వందకోట్లు ఆ పైన కూడపెట్టిన వాళ్లు వెలుగులోకి వస్తున్నారు. పది, ఇరవై, యాభై కోట్ల వారిని ఈ స్కీము కింద గుర్తిస్తే, బోలెడు పెండింగ్ పనులు పూర్తవుతాయి. వారిని దేశభక్తులుగా ట్రీట్ చేసి, సముచిత రీతిని వారి పెట్టుబడులకు న్యాయం చెయ్యాలి–అన్ని చతుర్లు వింటున్న ఓ పెద్దాయన నోరు చేసుకున్నాడు. ‘‘బాబు తెచ్చేవి సీమ రూపాయలు. అరవై ఆరురెట్లు పలుకుద్ది. రెండు జేబుల్లో వచ్చే ఆ రూపాయల్తో కృష్ణమీద కొత్త బ్యారేజీ పూర్తవుతుంది’’. శ్రీరమణ (ప్రముఖ కథకుడు) -
ఎర్ర బుగ్గలకు స్వస్తి!
అక్షర తూణీరం పవర్లోకి వచ్చీ రాగానే, నేతలకు గన్మెన్లు, పైలట్లు సిద్ధమవుతాయ్. ఇవి చాలా అనవసరం, నాకొద్దు అన్నవారెవరైనా ఉంటే వారికి వందనం. ఉన్నట్టుండి ఆయనెందుకో సిగ్గుపడి, ‘ఎర్ర బుగ్గలకు‘ స్వస్తి పలికారు. మోదీ మాట వినగానే, నేనిదివరకే... కాదు నాకిదివరకే సిగ్గేసి ఎర్ర బుగ్గలు వదిలేశానని, కారులో నిలబడి మన వెంకయ్య నాయుడు చెప్పారు. జాగ్రత్తగా గమనిస్తే, నరేంద్ర మోదీ అప్పుడప్పుడు ఇలాంటి మెరుపులు మెరిపిస్తుంటారు. యూపీ విజయం తరువాత నాకేదో అనుమానంగా ఉంది. ఉన్నట్టుండి ముఖ్య నేతలంతా పాంకోళ్లు వేసుకుని.. మేండేటరీ చేయ కపోయినా, ఆదరణీయ క్రియగా భావిస్తారని సందేహంగా ఉంది. నిజమే! ఈ ఎర్ర దీపం కాన్సెప్ట్ ఎట్నించి వచ్చిందో తెలియదు. ఫైరింజన్ని చిన్నప్పుడు మావూళ్లో గంటల కారు అనేవాళ్లం. దానికి కూడా ఎర్రదీపం జ్ఞాపకం లేదు. అంబులెన్స్‌కి ఎర్ర దీపం ఎరుగుదుం. వీఐపీలకి అంటే వాళ్ల కార్లకి ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఈ ఎర్ర దీపం తిరుగుడేందో, ఎట్లా వచ్చిందో మనకు తెలి యదు. గొప్పవాళ్లకి కొంచెం ఆర్భాటం ఉండాల్సిందే. లేకపోతే వాళ్లకి గుర్తింపు ఉండదు. కలెక్టర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, జడ్జీ గార్లకి ముందు డవాళా బంట్రోతు నడుస్తూ తెగ సందడి చేసి భయపెడుతూ ఉంటారు. పూర్వం రాజులకి వంది మాగధుల నించి వెండి బెత్తాల వారు దాకా ముందుండి హంగు కూర్చేవారు. ఫ్యూడల్ అవశేషాలు ఇంకా బోలెడు మిగిలే ఉన్నాయి. ప్రజా నాయకులం, ప్రజాసేవకులం అని చెప్పుకోవడం, రాచమర్యాదలకు తహతహలాడడం మనవాళ్లకి అలవాటే! ‘మేం అసాంఘిక శక్తులపై నిరంతరం పోరు సాగిస్తున్నాం, మా ప్రాణానికి ముప్పుంది‘ అనే సాకుని ‘సెక్యూరిటీ‘గా మార్చి, ఆ వంకన లేనిపోని ఆర్భాటం చేస్తున్నారని కొందరు విశ్లేషకులంటారు. ఎర్ర దీపానికి సెక్యూరిటీకి సంబంధం ఉంది కాబట్టి, గొప్పవారి ప్రాణాలు అందులోనే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఎర్ర దీపం కారు సైరన్‌తో, ఒక మహా మనిషి కదలి వస్తున్నాడని హెచ్చరిస్తూ వేగంగా వెళ్లి పోతుంది. దీని తర్వాత స్థాయి బులుగు బుగ్గలది. క్యాబినెట్ స్థాయికి దిగువన ఉండే వీఐపీలకు నీలం దీపాలుంటాయి. పవర్లోకి వచ్చీ రాగానే, ఇంకేముంది మమ్మల్ని చంపేస్తారంటూ–గన్మెన్లు, పైలట్లు సిద్ధమవుతాయ్. ‘ఇవి చాలా అనవసరం, నాకొద్దు’ అన్నవారెవరైనా ఉంటే వారికి వందనం. ప్రజలతో మమేకమయ్యే వారికి ఈ గొప్పలన్నీ అవసరమా అనిపిస్తుంది. నేనొకసారి ప్రత్యక్షంగా చూశాను–నగరంలో వెటర్నరీ హాస్పిటల్‌కి ఒక ఎర్ర దీపం కారు, నీలం దీపం కారు వచ్చాయి. రెండు కార్లలోంచి రెండు కుక్కలు దిగాయి. ఎర్ర దీపంలో వచ్చిన కుక్క ఆలస్యంగా వచ్చినా, దాన్నే ముందు చూసి పంపించారు. నీలం కారు కుక్క తాలూకు డ్రైవర్ ముందొచ్చా గదా అని సణిగాడు. ఎర్ర దీపానికున్న ప్రయార్టీ నీకుండదు గదా అన్నాడు. కుక్కల డాక్టరు ఈ రంగు దీపాల కార్లు స్కూల్లో పిల్లల్ని దింపుతూ కనిపిస్తాయ్. అందరూ ఒకే యూని ఫాంలో ఉన్నా ఎర్ర దీపం యవ్వారం వేరుగా ఉంటుంది. తరచు డ్రైవర్ సొంత పనిమీద మందు షాపు ముందు ఆపుతాడు. ప్రసిద్ధ నటులు, తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు, గొప్ప చమత్కారి ఒకసారి నాతో అన్నారు–ఈ ఎర్ర దీపం బళ్లు వెళ్తుంటే ఖడ్గ మృగాల్ని చూసినట్టుండేదయ్యా. మా అన్నగారు ఢిల్లీ పీఠమెక్కితే ఎర్రకోటకి పచ్చరంగు పడుద్ది. కార్లకీ పచ్చదీపాలే! దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోమన్నారు. అంటే తలమీద ఎరుపో బులుగో ఉండగానే నాలుగు రాళ్లు... శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
'హోదా' నేతి బీరకాయ?
అక్షర తూణీరం మా వూళ్లో ఒక పెద్దాయన అన్నాడు – ‘అంతా మకతిక చేస్తున్నారు. చంద్రయ్య నాయుడు, వెంకబాబు ఇద్దరూ కలసి ఆంధ్రప్రదేశ్‌లో అంత్యాక్షరి ఆడుతున్నారు’ అని. రాష్ట్రాన్ని కత్తిరిస్తున్నప్పుడు ఉభయ రాష్ట్రాలకి లాభసాటిగా ఉండేలా చూస్తాం అన్నారు. చేస్తాం అని కూడా అన్నారు పార్ల మెంటులో. తెగిపోయిన ఆంధ్రప్రదేశ్ దిక్కూ మొక్కూ లేకుండా, తాడూ బొంగరం, ఇల్లూ వాకిలీ లేకుండా మిగిలింది. అందుకు పెద్దలంతా జాలిపడి, పదేళ్లపాటు ఉమ్మడి క్యాపి టల్‌గా పాలన సాగించుకోమని పర్మిషన్ ఇచ్చారు. ఆంధ్రప్ర దేశ్‌కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని, తద్వారా అన్ని రంగాలలో త్వరితగతిని వృద్ధి చెందుతుందని చెబుతూ వరం ప్రసాదించారు. వరమిచ్చిన వేలుపు మారాడు. కొత్త దేవుడు సీన్లోకి వచ్చాడు. అయ్యా మా వరం అన్నారు భక్తులు. దేవుళ్లంతా ఒకటే – మహా మాయదార్లు! 'అమాయక భక్తులారా! ప్రత్యేక హోదావల్ల మీకేమీ ప్రయోజనం లేదు. ఎప్పటికప్పుడు నాకు తోచిన విధంగా డబ్బు సంచులిస్తాను. హాయిగా బాగుపడండి. సుఖ పడండి' అంటూ వరాన్ని తిరగేశాడు. దేవుళ్ల చుట్టూ సొంత గణాలుంటాయ్. కొత్త దేవుడికి కొరతేముంది?! తిరగేసిన వరం ఎంత గొప్పదో రకరకాలుగా జనంలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మా వూళ్లో ఒక పెద్దాయన అన్నాడు - 'అంతా మకతిక చేస్తున్నారు. చంద్రయ్య నాయుడు, వెంకబాబు ఇద్దరూ కలసి ఆంధ్రప్రదేశ్‌లో అంత్యాక్షరి ఆడుతున్నారు' అని. 'అదెట్లా' అన్నాను. 'ఏవుంది, మోదీ భజన పాటలు ఆయన ఆపిన అక్షరం మీద ఈయన ఎత్తుకుం టాడు. కప్పల సంగీతంలాగా భజన మాత్రం ఆగదు' అంటూ వివరించాడు. అసలు దీనికింత రచ్చ దేనికి? ప్రత్యేక హోదాతో పదేళ్లలో ఒనగూడే ప్రయోజనా లేంటి? ప్యాకేజీతో లాభాలేంటి? ఈ రెంటినీ కచ్చితంగా రూపాయి పైసల్లో లెక్క కట్టొచ్చు. అప్పుడు ఏ వరాన్ని పొందాలో తేల్చు కోవచ్చు. వెరీ సింపుల్. ఇది ఇట్లా ఉండగా ఏదో కొంప మునిగినట్టు కొత్త క్యాపి టల్ నిర్మాణంలో పడ్డారు. యాభై వేల ఎకరాల పంట భూమిని కళ తప్పించారు. లాభసాటి చాలెం జ్ల మీద మహా నేత కసరత్తు చేస్తున్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ని వినియోగించుకోవచ్చు అన్నారు. అయినా అర్జంట్‌గా సొంత క్యాపిటల్ కావల్సిందే నన్నారు. ఇక్కడ రోడ్లమీద మన కాన్వాయ్కి మర్యాద లేదు. ఇక్కడ సెల్‌ఫోన్ టవర్స్‌పై మనకి పట్టుండదు. మన మాటకి గుట్టుండదు. అందుకని వెళ్లిపోవడమే మన తక్షణ కర్తవ్యం అన్నారు. ప్రపంచంలోనే నంబర్‌వన్ సిటీగా తీర్చిదిద్దుతామనే నినాదంతో చంద్రబాబు ముందుకు పోతా ఉన్నారు. కొండకి వెంట్రుక కట్టాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఉరిశిక్ష పడిన గజదొంగని జైల్లో పెట్టారు. ఉరి అమలుకి వ్యవధి ఉంది. నా దగ్గర గుర్రాన్ని ఎగిరించే అపురూపమైన విద్య ఉందని రాజుకి కబురు చేశాడు. రాజు కీలు గుర్రంపై సరదాపడి, ఆయనకి ఏమేమి కావాలో ఇవ్వండి. జాగ్రత్తగా చూసుకోండి అని ఆజ్ఞాపించాడు. గజదొంగకి బోలెడు మర్యాదలు సాగుతున్నాయి. ఓ జాతి గుర్రాన్ని తెప్పించి రోజూ ఆవు వెన్నతో దొంగ మంత్రాలతో మాలిష్ చేస్తున్నాడు. ఒకరోజు సాటి ఖైదీ 'నిజంగా గుర్రాన్ని ఎగిరించే విద్య నీకు తెలుసా' అని నిగ్గదీశాడు. గజదొంగ నవ్వి, 'ప్రస్తుతానికి ఉరి తప్పింది. చూద్దాం. తర్వాత భూకంపమో, వరదో రావచ్చు. పొరుగు రాజు దండెత్తి రావచ్చు. ఇంకేదో కావచ్చు. ఏమో! గుర్రం ఎగరావచ్చు' అని ధీమాగా చెప్పాడు. అలాగే, ఈ అసంపూర్తి క్యాపిటల్ నిర్మాణం నాతోనే సాధ్యమని మరోసారి, ఇంకోసారి అంటూ కాలక్షేపం చెయ్యొచ్చు. వస్తే కొండ, పోతే వెంట్రుక! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
ఒక అంకుశం?!
అక్షర తూణీరం పవన్బాబు ఏ ఇష్యూ మీద నోరు తెరిచినా పర్వాలేదు. ఒక్క ప్రత్యేక హోదాపై నోరెత్తకుండా ఉంటే చాలని ఏలినవారు కోటి దేవుళ్లకి మొక్కుకుంటున్నారు. రాష్ట్రంలో ఒకమూల మూత్రపిండాల వ్యాధి ప్రబలింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో అవస్థపడు తున్నారు. ప్రభుత్వం తన సహజ ధోరణిలో ఉదాసీనత వహించింది. ఉన్నట్టుండి జనసేన నేత ఆ స్పాట్‌కి వెళ్లాడు. జనం చేరారు. ప్రభుత్వాన్ని తనదైన ధోరణిలో ప్రశ్నించాడు. నిగ్గ దీశాడు. ఆపైన హెచ్చరించాడు. గంటైనా గడవకుండానే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ‘‘తగు చర్యలు తీసు కున్నాం, ఇంకా తీసుకుంటాం మహా ప్రభో!’’ అంటూ సవిన యంగా మనవి చేశారు. ఉన్నవిగాక ఇంకా బోలెడన్ని డయాలసిస్ కేంద్రాలు ప్రారం భిస్తాం. అందరి రక్తాలు క్షాళన చేస్తామని మీడియా ముఖంగా విన్నవించారు. అంతే కాదు, ‘‘పవన్ కల్యాణ్‌గారు ఇలాగ స్పాట్‌లోకి వచ్చి సమస్యని బహిర్గతం చేసి ఎంతో మేలు చేశారు. ఆయన మేలు మర్చిపోలేం’’ అంటూ అమాత్యుల వారు అభినందించారు కూడా. అంతకు ముందు క్యాపిటల్ ఖాతాలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని విని జననేత నినదించారు. ఇప్పుడు అలాంటిదే మరో అఘాయిత్యం జరిగిందని రైతులు జనసేనని ఆశ్రయించారు. ఆయన అభయం ఇచ్చాడని తెలియగానే ప్రభుత్వం విప రీతంగా స్పందిస్తుంది. ఇప్పుడది జనం గ్రహించారు. అందుకని ఏపీలో ఏ సమస్య తలెత్తినా అది పవన్ కల్యాణ్ గుమ్మంలో ప్రతిధ్వనిస్తోంది. క్షణా లలో అధికారగణం అతిగా స్పందిస్తోంది. ఈ తంతుని యావ న్మంది గమనిస్తున్నారు. భయానికి కారణాలు వాళ్లకి స్పష్టంగా తెలుసు. పవన్బాబు ఏ ఇష్యూ మీద నోరు తెరి చినా పర్వాలేదు. ఒక్క ప్రత్యేక హోదాపై నోరె త్తకుండా ఉంటే చాలని ఏలినవారు కోటి దేవుళ్లకి మొక్కుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం యువనేత వెంకయ్యనాయుడిపై విమర్శలు గుప్పించాడు. వాటిని అడ్డంగా ఘాటుగా ఎవరూ ఖండించలేదు. లౌక్యంగా మాట్లాడి తమని తాము సముదాయించుకున్నారు. ‘‘అందుకే గదా, అప్పుడు అన్ని ఆంధ్రా టౌన్స్లోనూ వెంకయ్యకి సన్మానాలు చేసి విమ ర్శల్ని మరిపించాం’’ అని ఒక పెద్దాయన క్లారిఫై చేశాడు. ప్రభుత్వం ప్రతిపక్ష నేత విమర్శలను పట్టించుకోనట్లు నటిస్తుంది. రాజకీయేతర, రాజ్యాంగేతర శక్తిగా, ఫ్రీలాన్సర్‌గా ప్రభుత్వాన్ని నిగ్గతీస్తున్న పవన్ కల్యాణ్‌కి కొంచెం బాగా భయపడుతున్నట్టే కనిపిస్తోంది. ఈ వైఖరి సామాన్య జనంలోకి ఎలాంటి ఆలో చనల్ని, సంకేతాలని పంపిస్తోందో పెద్దలు ఆలోచించాలి. జననేత పెదవి విప్పితే చాలు అరక్షణంలో మంత్రులు మైకుల ముందుకు వచ్చి సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. సామాన్య ప్రజ సంతోషిస్తోంది. ఎవరైతేనేం, ఏదో ఒక అంకుశం పనిచేస్తోందని అనుకుంటున్నారు. ఈ ఫార్స్ మొత్తాన్ని గమనిస్తుంటే గొగోల్ ప్రసిద్ధ నాటకం ‘ఇన్స్పెక్టర్ జనరల్’ గుర్తొస్తోంది. మొన్న సంకురాత్రికి మా గ్రామం వెళ్లినప్పుడు మా ఊరి ప్రజలు రోడ్డు కోసం ఎమ్మెల్యేకి, మంత్రిగారికి పెట్టుకున్న అర్జీ చూపించారు. ‘‘మా ఊరు రోడ్డు వేసి పన్నెండేళ్లు దాటింది. మా ఎమ్మెల్యేకి మేం ఓట్లు వేయలేదని కోపం. కనీసం నడ వడానికి కూడా కష్టంగా ఉంది. మీరు, ఈ రోడ్డు సమస్యని వెంటనే పరిష్కరించకపోతే శ్రీ పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని మా గ్రామం తీర్మానించింది’’ ఇదీ అర్జీ సారాంశం. బహుశా పని జరగచ్చు. శ్రీరమణ (ప్రముఖ కథకుడు) -
మా ఊరి పోస్టాఫీసు
అక్షర తూణీరం అనేక కారణాల వల్ల ఊరి వారు, డిపార్టుమెంటు వారు మా ఇ.డి. బ్రాంచ్ ఆఫీస్ మా ఇంట్లోనే ఉండాలన్నారు. వారస త్వంగా ముద్రలు, మువ్వల బరిసె అక్కడే ఉండిపోయాయి. ... కాదు, మా ఇంటి పోస్టాఫీసు. అరమరికలు లేని అందరిది మా ఇల్లు. 1939 నవంబరులో అది మా ఇంటికి వచ్చింది. మా నాన్న నలభైమూడేళ్ల పాటు బ్రాంచి పోస్ట్ మాస్టరు ఉద్యోగాన్ని సేవాభావంతో నిర్వహించి పదవీ విరమణ చేశారు. అయినా అది మా ఇంటిని వదల్లేదు. ఆ కుర్చీ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కారణం దాన్ని నాన్న సేవా కేంద్రంగా నడి పారు. వేళలుండేవి కావు. కార్డు కొన్నవారికి ఆయనే ఓపిగ్గా రాసి పెట్టేవారు. పోస్టులో వచ్చిన కార్డులు కొన్నింటిని చదివి పెట్టే పని కూడా ఉండేది. మా ఊరికి నెలనెలా చాలా మనియార్డర్లు ఏపీఓ నించి వచ్చేవి. అంటే ఆర్మీ పోస్టాఫీసు. అనగా మా ఊళ్లో సైనికోద్యోగులు ఎక్కువమంది ఉండేవారు. ఒక్కోసారి ఆ మనియార్డర్లు వారం పదిరోజులు ఆలస్యమయ్యేవి. పాపం! రోజూ వాటిని అందుకోవల్సిన తల్లిదండ్రులు పోస్ట్ వేళకు ఆశగా మా ఇంటికి వచ్చేవారు. కొన్ని సార్లు నాన్న వాళ్లకి ముందుగానే ఆ యాభయ్యో వందో ఇచ్చేసేవారు. నే చెప్పినప్పుడు వచ్చి వేలిముద్ర వేసి వెళ్లండని చెప్పే వారు. ఆర్మీ జవాన్లు సెలవులకు వచ్చిన ప్పుడు తప్పకుండా వచ్చి అమ్మకీ నాన్నకీ కృతజ్ఞతలు చెప్పివెళ్లేవారు. రెండో ప్రపంచ యుద్ధం దాకా మా పోస్టా ఫీసుకి రంగూన్ మనియార్డర్లు కూడా వచ్చేవి. ఆ రోజుల్లో చాలా మంది మా ఊరి వారు బతుకు తెలివి కోసం రంగూన్ వెళ్లారు. వారంతా కష్టపడి సంపాయించి ఇంటికి డబ్బు పంపేవారు. కొందరు నాన్న పేరు మీదే పంపేవారు. ఎప్పుడో వచ్చినప్పుడు లెక్కలు చూసుకునేవారు. ఆ రోజుల్లో భయంకరమైన అవిద్య పల్లెల్ని ఏలుతోంది. రెవిన్యూ స్టాంప్‌ని ‘నోటుబిళ్ల’ అంటారు గ్రామాల్లో. ఆ రోజుల్లో ‘అణా బిళ్ల’ అనేవారు. రోజూ రాత్రి పూట నాన్న నోటు బిళ్లలు తప్పనిసరిగా తలకింద పెట్టుకు పడుకునేవారు. ఆలస్యమైతే అప్పిచ్చేవాడికి మనసు మారవచ్చు, ఎవరు ఎప్పుడొచ్చినా నోటు బిళ్లలు వెంటనే ఇవ్వండని చెప్పేవారు. తెల్ల కాగితం, కలం, కాటుక్కాయ సిద్ధంగా ఉండేవి. మాకు అక్షరాలు రాగానే ప్రామిసరీ నోటు రాయడం వంట పట్టించారు నాన్న. బ్రహ్మోపదేశం వేళ నాన్న చెప్పిన గాయత్రీ∙మంత్రం తడుముకుంటానేమోగాని ప్రొనోటు రాతలో కలం ఆగదు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఊరి వారు, డిపార్టుమెంటు వారు మా ఇ.డి. బ్రాంచ్ ఆఫీస్ మా ఇంట్లోనే ఉండాలన్నారు. వారసత్వంగా రకరకాల ముద్రలు, మువ్వల బరిసె అక్కడే ఉండిపోయాయి. కొంచెం చదువుకున్న మా వదినగారు పోస్టుమాస్టర్ అయింది. బ్రిటిష్ హయాంలో ఈ శాఖని ‘అంచెల్స్’ అనే వారు. తపాల్స్ అంచెలంచెలుగా నడిచేవి. ఆ తెలుగు మాటనే ‘అంచల్స్’ చేశారు. నా బాల్యం, నా యవ్వనం మా పోస్టాఫీసుతో ముడిపడి ఉన్నాయి. హైస్కూల్లో మని యార్డర్ ఫారమ్‌ని ఆశువుగా పూర్తి చేయడం నాకే వచ్చు. టపా కట్టడం వచ్చు. మా నాన్న తర్వాత అంత దీక్షతోనూ శ్రీమతి సావిత్రి అనే ఈ పోస్టు మాస్టర్ కూడా డ్యూటీ చేశారు. పిల్లలు, పిల్లల పిల్లలు నాలుగు తరాల వాళ్లం అరిచేతిలో నల్లటి తారు ముద్రలతో ఆడు కున్నాం. ఎన్నో పత్రికలు, ఎన్నో శుభవార్తలు అందుకున్నాం. గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ, అరవిందుని సావిత్రి, నెలనెలా వచ్చే ఎమ్మెస్కో సొంత గ్రంథాలయం పుస్తకాలు ఈ అంచెల్స్లోనే వచ్చాయి. సంజీవ్‌దేవ్, ఆరుద్ర, శేషేంద్ర, పురాణం, కరుణశ్రీ, నండూరిల ఉత్తరాల పలకరింతలు ఈ అంచెల్సే అందించాయి. ఎన్నో మధుర స్మృతులు మిగిల్చి డెబ్బయి ఆరేళ్ల తర్వాత రేపు 19న, ఈ వరహాపురం అగ్రహారం పోస్టాఫీసు వారసులు లేక మా ఇల్లు వదిలి వెళ్లిపోతోంది. దస్విదానియా! (వ్యాసకర్త : శ్రీరమణ ప్రముఖ కథకుడు) -
అచ్చం ఇందిరమ్మలాగే..!
అక్షర తూణీరం మొత్తానికి అంతా గందరగోళంగా ఉంది. రోజుకో నిబంధన రెండు సడలింపులతో కథ నడుస్తోంది. నోట్లరద్దుతో బ్యాంకుల మీద విశ్వాసం పోయింది. ఈ మధ్య వార్తలు వేడివేడిగా వుంటున్నాయ్. ఆకాశం నించి గరుడ పక్షి మీద ఆకాశం మంచి నేలకి దిగుతున్నట్టు, ఈ పుణ్యభూమిలో లింగోద్భవం అవుతున్నట్టు ఏదో హడావుడిగా ఉంది. ప్రధాని మోదీ ఒక చేత్తో శంఖం పూరిస్తూ, ఇంకో చేత డమరుకం వాయిస్తూ ఊగిపోతున్నారు. సగటు మనిషికి ఏమీ అర్థం కావడం లేదు. గొప్పవాళ్లకి అర్థం కావడానికి ఏమీలేదు. అప్పుడు ఇందిరమ్మ కూడా ఇలాగే శివాలెత్తించింది. రాజాభరణాల రద్దు చేస్తున్నా, మొత్తం ఆ సొమ్ములు పేద ప్రజలకే అన్నది. బ్యాంకుల్ని జాతీయం చేశా. బడుగు బలహీన వర్గాలు కావాల్సినంత డబ్బు వాడుకోవచ్చు. అంటూ భరోసా ఇచ్చింది. తర్వాత ఏం జరిగిందో, ఏం జరగ లేదో అందరికీ తెలుసు. అప్పుడు కూడా అవినీతిపై అచ్చం ఇలాంటి వార్తలే వచ్చేవి. వెనకటికి ఓ రాజుగారు ఇలాగే పన్ను కట్టని వారి తాట తీస్తానని చాటింపు వేయిం చాడు. రాజ్యం ఉలిక్కి పడుతుందనీ, మూట లకొద్దీ బంగా రు నాణాలు ఖజానాకి జమ పడతాయని ఆశపడ్డాడు. ఒక్క నాణెం కూడా అదనంగా రాలేదు. ‘‘ఏమిది అమాత్యా! మాకు ఆశ్చర్యముగానున్నదే’’ అంటూ రాజు దుఃఖపడ్డాడు. రాజా! తమ ఏలుబడిలో పన్ను ఎగవేతదారులా! కల్ల కల్ల! అంటూ మంత్రి గారనే సరికి రాజుగారి బుగ్గలు ఎరుపెక్కాయి. జరిగిందేమంటే నల్లధనం మూటలన్నీ గుట్టుచప్పిడిగా పరిచారకుల ద్వారా రాణిగారి మందిరానికి చేరాయి. రాజ మందిరాల్లో బోలెడన్ని పనికిరాని గదులు వృ«థాగా పడుం టాయి. ఇప్పటికీ రాజభవన్లో రాష్ట్రపతి భవన్లో మనం చూస్తుంటాం. అవి దర్పానికేగాని వాడకానికి కాదు. నల్లడబ్బు మూటలతో అంతఃపురంలోని గదులు నిండిపోయాయి. దండ నాయకులు, దళపరులు గుర్రాల మీద వెళ్లి అనుమానితుల ఇళ్లపై దాడి చేశారు కూడా. సొమ్ము మూటలు తీసుకురావడానికి ఒంటెల్ని కూడా తీసుకు వెళ్లారు. ఎక్కడా నల్లధనం కనిపించలేదు. రాజాధికారులు అంతఃపురం మినహా అంతా కుళ్ల పొడిచారు. అయితే, నే విన్నదేమంటే తర్వాత తెలివైన రాజు పనికి రాని గదులకు తాళాలు వేశాడనీ, మొత్తం దొంగ సొత్తుని సొంత గూటికి రప్పించుకున్నాడని కథనం. మొత్తానికి అంతా గందరగోళంగా ఉంది. రోజుకో నిబంధన రెండు సడలింపులతో కథ నడుస్తోంది. కరెన్సీ నోటంటే మూడు సింహాల సాక్షిగా ప్రభుత్వం వారి ప్రామిశరీ నోటు. అది చెల్లదనడానికి వీల్లేదు. సామాన్యులు, పేదవారు చాలా నలిగి పోతున్నారు. భవిష్యత్తులో వారికేమి తవ్వి తలకెత్తుతారో అనుమానమే. విచిత్రంగా ఈ నేపథ్యంలో బ్యాంకుల మీద విశ్వాసం పోయింది. ప్రజలకి సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. మోడీ గొప్ప సాహసం చేశారనీ ప్రచారం సాగుతోంది. ఆయనని తెలియకుండానే ఒక డిక్టేటర్‌ని చేసి పడేశారు. అంతే, ఇదో రకం ఎమర్జన్సీ. పాతనోట్ల గడువు దగ్గర పడింది. ఒక వదాన్యుడు చెప్పాడు, ఇంకో రెండు రోజులు దార్లు వెదుకుతా. దారి దొరక్కపోతే తెలుగులో కవి గాయక నట విశారదులను పాతనోట్లతో సత్కరించుకుంటానని ఉదారంగా సెలవిచ్చాడు. గొప్పవిషయం! (వ్యాసకర్త : శ్రీరమణ ప్రముఖ కథకుడు) -
సంగీత సుధార్ణవం
అక్షర తూణీరం గమకాలు గుండెలవిసేలా లోతుగా.. ఉండాలన్న అతి పాత ధర్మాన్ని సంస్కరించారు. గమకాలు కలువ రేకులు కదిలి నంతసున్నితంగా కూడా ఉండవచ్చని పాడి చూపించారు. ఒక సుమధుర సంగీత ఝరి ఆగిపోయింది. ఆయన గళంలో ఒక ఠీవి ఉంది. శ్రుతికి మించిన ఆత్మవిశ్వాసం ఉంది. సంగ తులు, గమకాలు వాటంతటవే వచ్చి కూర్చుంటాయన్న ధైర్యం ఆయనకుండేది. ‘బాలమురళి’ అంటే నవ శాస్త్రీయ చరిత్ర. ఎనభై ఏళ్ల సుదీర్ఘ రాగ ప్రస్థానం. త్యాగరాజ స్వామి గురు పరంపరలో అయిదో తరం వారసుడు. సంగీత సార్వ భౌమ పారుపల్లి రామకృష్ణయ్య శుశ్రూషలో సంగీత పాఠాలు నేర్చిన విద్యార్థి మంగళంపల్లి బాలమురళీకృష్ణ. అరవై ఏళ్ల క్రితం బాలమురళి వివాదాస్పద విద్వాంసుడు. ఒక బంగారు చట్రంలో బిగుసుకుపోయిన శాస్త్రీయ సంగీత రీతులకు విముక్తి కలిగించాడు. సంప్రదాయమంటే - ఒక తరం వారు తాము ఆర్జించిన సుజ్ఞానాన్ని మారిన కాలంతో వడకట్టి తర్వాతి తరా నికి అందించడమేకానీ, తుచలు పోకుండా అందివ్వడం కాదని ఈ ‘ఛైల్డ్ ప్రాడిజీ’ నమ్మారు. అదే ఆచరించి చూపారు. అందుకే ఆయన వెయ్యిమందిలో ఒక్క రుగా కాక ఒకే ఒక్కడుగా సంగీత ప్రపం చాన్నేలారు. సామాన్య జనులందరినీ సంగీతమాస్వాదించి ఆనందించగల రసి కులుగా ‘కన్వర్ట్’ చేసేస్తున్నాడని బాలముర ళిపై ఆనాటి ఛాందసులు అభియోగం మోపారు. దాన్నొక గొప్ప అభినందనగా, ఆశీర్వాదంగా బాలమురళి స్వీకరించారు. వస్తూనే ‘స్వరార్ణవం’ చంకనపెట్టుకు తెచ్చుకున్నాడని ప్రతీతి. ‘‘నేను వానికి నేర్పిందేమీ లేదు. వాడి సంగీతాన్ని వాడే తెచ్చుకున్నాడు’’ అంటూ గురువు పారుపల్లి రామకృష్ణయ్య తరచూ చెబుతుండేవారట. ఆరవ ఏట పక్కవాద్యాలతో సహా సంగీత గోష్ఠి నెరపిన అసాధారణ ప్రతిభామూర్తి బాలమురళి. సంగీత లోకంలో ఆయనొక సాహసి. విద్యుత్తుతోబాటు తగుమాత్రం ధిషణాహం కారం కూడా బాలమురళి వినూత్న శైలిని తీర్చిదిద్దింది. గమకాలు గుండెలవిసేలా లోతుగా, గొడ్డలి గంట్లులా ఉండాలన్న అతిపాత ధర్మాన్ని సంస్కరించుకుని ఆపాత మధురంగా మలచుకున్నారు. గమకాలు కలువరేకులు కదిలినంత సున్నితంగా కూడా ఉండవచ్చని పాడి చూపించారు. మెప్పించి, ఔననిపించారు. వయోలాని గిటార్‌లా, వయొలిన్‌ని ఏక్తారలా, వీణని వయొలిన్‌లా పలికించగల చతుర్థ సమర్థుడు. అనేక వాద్యాల మీద అధికారం సంపాయించారు. బాలమురళీ ‘పుట్టు విద్వాంసుడు’ అవడం వల్ల, సంగీత జ్ఞానిగా సాహిత్యకారునిగా సాధించాల్సినదంతా పాతికేళ్లకే పూర్తి చేసు కున్నారు. ఇక మిగిలిన తీరికలో కావల్సినన్ని సాము గరిడీలు చేస్తూ సంగీత సరస్వతిని ఆరాధించారు. బాలమురళి కారణ జన్ముడు. స్కూలు చదువులెరుగని బాలమురళి సంస్కృతాంధ్ర భాషల్లో ప్రావీణ్యం గడిం చారు. కొత్త రాగాలను నిర్మించారు. అనేక కృతులు రచించారు. ఆయన తిల్లానాలను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సినిమాలకు పాటలు పాడినా బాలమురళి ముద్ర ఉంటుంది. గొప్ప చమత్కారి. ‘నేను కచ్చేరీల్లోనే సాధన కూడా చేస్తాను. ముఖ్యంగా పెళ్లిళ్లలో నా గోష్ఠి ఏర్పాటు చేసినపుడు. ఎందుకంటే అక్కడ నన్నెవరూ వినరు. అందు కని నా ప్రయోగాలు నేను చేసుకుంటాను’ అని చెప్పేవారు. సంగీతానికి బాల మురళి చేసిన గొప్ప సేవ ఆయన రికార్డింగ్స్. కొన్ని వందల గంటలు రికార్డ్స్‌లో, టేపుల్లో, సీడీల్లో నిక్షిప్తం చేసి జాతికి అందించారు. త్యాగరాజ కృతుల్లోని సాహిత్యాన్ని సుమధుర గాత్రంతో విశదపరిచారు. శాస్త్రీయ సంగీతానికి, ఆ విద్వాంసులకు బాలమురళి గ్లామర్ తెచ్చి పెట్టారు. ఆయన ‘షోకిలా’గా జీవించారు. ఆయన అందుకోని బిరుదులు, గౌర వాలు ఏవీ లేవు. అన్నమయ్య, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, రామదాసు కీర్తనలు ఆయన నోట అమృతధారలైనాయి. బాలమురళి మరో పేరు ‘‘భక్తిరంజని’’. బాలమురళి నిష్ర్క మణతో సరిగమల బృందావనం సద్దుమణిగింది. వారికి అక్షర నివాళి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
చిత్రసీమ తలలో నాలుక
అక్షర తూణీరం బాలు గొంతుతో నటిస్తున్నాడని కొందరు ఆక్షేపించారు. మిమిక్రీ చేస్తున్నాడు చూసుకోండని కొందరు హెచ్చరించారు. ‘‘అలాగా... భలే బాగుంది’’ అంటూ మెచ్చుకున్నది ప్రజ. ఇండియన్ సినిమా శత వసంతాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో గానగంధర్వుని విశిష్ట పురస్కారంతో సన్మానించ నున్నారు. సినిమా శతాబ్ది చరిత్రలో అర్ధ శతాబ్దిని ఇప్పటిదాకా ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం తన స్వరంతో శ్వాసించారు. ఆనక శాసించారు. గడచిన యాభై ఏళ్లలో వచ్చిన అనేక భారతీయ సినిమా రీళ్లను పరిశీలిస్తే, వాటి సౌండ్‌ట్రాక్స్‌లో బాలు వినిపి స్తారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ.. మరి కొన్ని భాషలలో నలభై వేల పాటలు పాడారు. గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. పద్మభూషణుడైనారు. ప్రముఖ సంగీత దర్శకులు కోదండపాణి దీవెనలతో చిత్రసీమలో బాలు అడుగు పెట్టారు. అప్పటినుంచీ అడుగులు వేస్తూనే ఉన్నారు. ప్రజాకోటి ఆయన అడుగులకు మడుగులొత్తుతూనే ఉంది. తొలినాళ్లలో అంటే అర్ధ శతాబ్దికి పూర్వం ఆయన పాడిన ఏమి ఈ వింత మోహం, ఓహోహో బంగారు పిచ్చుకా, మేడంటే మేడా కాదు లాంటి ఎన్నో పాటలు నేటికీ కొత్త చిగుళ్లుగానే అలరిస్తున్నాయి. ‘‘రావ మ్మా మహాలక్ష్మీ రావమ్మా’’ పాటలో ఆర్ద్రత తొణికిసలాడుతుంది. మొదట్నించీ పాట సాహిత్య సౌరభాన్ని తన పలుకు బడితో మరింతగా గుబాళింపచేయడం బాలు అలవరచుకున్నారు. తేనెలో కల కండ పలుకులు కలసి ప్రవహిస్తున్నట్టుంటుంది ఆ స్వరం. కలకండ పలుకులు ఉచ్ఛా రణలో సుస్పష్టత కోసం నిలిచాయి. మకరందం మాధుర్యాన్నిచ్చింది. ఆ తరం కవుల నుంచి ఈనాటి కవులదాకా తమ గీతాన్ని బాలు పాడాలని అభిలషిస్తారు. తమ సాహి త్యానికి న్యాయం జరుగుతుందని అలా ఆశ పడతారు. దర్శకునిగా బాపు రెండో చిత్రం బంగారు పిచిక. అందులో బాలుని కథానాయకుడుగా, ఓ ప్రసిద్ధ యువ రచయిత్రిని హీరో యిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇతరేతర కార ణాలవల్ల ఆ కథ అలా నడవలేదు. బాలు మంచి రూపు అని చెప్పడానికి ఈ పాత నిజం చెప్పాను. బాలు జీనియస్. లలితలలితమైన కంఠస్వరంతో సునామీని సృష్టించాడు. చాలా మంది ఆనాటి గాయకుల్ని తోసిరాజన్నాడు. గళంలో వైవిధ్యాన్ని చూపాడు. కొందరు గొంతుతో నటిస్తున్నాడని ఆక్షేపించారు. నాలాంటి సగటు శ్రోతలు పర్వాలేదన్నారు. మిమిక్రీ చేస్తున్నాడు చూసుకోండని కొందరు పండితులు ప్రజల్ని హెచ్చరించారు. ‘‘అలాగా... భలే బాగుంది’’ అంటూ మెచ్చుకున్నది ప్రజ. అర్జున ధనుష్ఠంకారం, అక్షయ తూణీరంలోని అమ్ముల్లా తరగని పాటలు బాలుకి పేరు తెచ్చిపెట్టాయి. పద్మశ్రీ తుర్ల పాటి దశకంఠునిగా అభివర్ణించి, శ్లాఘించారు. ‘‘హీరోలకి, కమెడియన్లకి, కానివారికి, అయిన వారికి ఇలాగ సినిమాలో అందరికీ ఈయనే పాడేస్తున్నాడు బాబోయ్!’’ అంటూ ఒకాయన గావుకేక పెడితే, హీరోయిన్లని వదిలేశాడు సంతోషించమని మరొకాయన శాంతపరిచాడు. బాలు పాడిన గొప్ప పాటల్ని ఏకాక్షరంతో గుర్తు చేసుకోవడం కూడా సాధ్యం కాదు. ఏకవీర పాటల్ని మరచిపోలేం. ప్రతి రాత్రి వసంత రాత్రి పాట బాలు, ఘంటసాలల యుగళగీతం. వారిద్దరినీ కలిపి ఆస్వాదించడం ఓ గొప్ప అనుభవం. బాల సుబ్రహ్మణ్యం గాయకుడు, నిర్మాత, గాత్రదాత, నటుడు, సంగీత దర్శకుడు, స్నేహశీలి, సరసుడు ఇంకా అన్నీను. స్నేహానికి పోయి ఎడంవైపున, సొంతానికి పోయి కుడివేపున చేవ్రాళ్లు చేసి, ఆనక పాటలు పాడుకుంటూ అప్పులు తీర్చే భాగ్యశాలి బాలు. మిగిలినవన్నీ ఒక ఎత్తు, పాడుతా తీయగాతో ఆయన నడుపుతున్న పాటశాల ఒక ఎత్తు. మిథునంలో అప్పదాసు పాత్ర ధరించి నాకు ఖండాంతర ఖ్యాతి తెచ్చిపెట్టారు. ఇంకా ఎన్నో చెప్పాలి. ఆయన తగని మొహమాటస్తుడు, తగిన మర్యాదస్తుడు. ‘‘బాలు మగపిల్లాడుగా పుట్టాడు కాబట్టి సరిపోయింది. ఆ మోహ రూపుకి ఆడపిల్లగా పుడితే... పాపం చాలా ఇబ్బందయేదని’’ బాపు తరచూ ఆనందించేవారు. శతమానం భవతి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అన్నలు మరణింపబడ్డారు?
అక్షర తూణీరం అసమాన ప్రతిభ, త్యాగనిరతి అడవి కాచిన వెన్నెల కాలేదా అని సందేహం కలుగుతుంది. యాభై ఏళ్ల తరువాత బేరీజు వేస్తే ఉద్యమ ఫలితాలు నైరాశ్యాన్నే నింపుతాయి. అడవి నైజం మారి అర్థశతాబ్ది దాటింది. ప్రతి పిట్టా భయంగా కూస్తోంది. ప్రతి పక్షీ అలజడిగా కనిపిస్తోంది. ఆకుల కదలికల్లో ఏదో సంకేత భాష నడుస్తోంది. నీటి చెలమలు నెత్తురోడుతున్నాయి. అనుక్షణం అడవి భయంతో, బాధతో చలించిపోతోంది. ఎక్కడో కలకత్తా అవతల పుట్టి మనకు పాకింది నక్సల్బరీ ఉద్యమం. దండోపాయంతోనే ఈ వ్యవ స్థని దారిలో పెడతామని రంగంలోకి దిగారు నక్సలైట్లు. అక్ర మాల్ని, అన్యాయాల్ని చూసి సహించలేకపోయారు. జరుగు తున్న దారుణాలకు ఆక్రోశించారు. విప్లవపంథా తప్ప మరేదీ ఈ కుళ్లిన వ్యవస్థని సంస్క రించలేదని తీర్మానించుకున్నారు. వారంతా మానవతావాదులు. జాలిగుండెల వాళ్లు. చీకట్లను తిట్టుకుంటూ కూచోకుండా చిరుదీపాన్నైనా వెలిగించ సంకల్పించినవాళ్లు. అప్పటికింకా దేశానికి స్వతం త్రం వచ్చి గట్టిగా ఇరవై ఏళ్లు కూడా కాలేదు. తెల్లదొరలను మరి పించే మన నల్లదొరల దోపిడీలను సహించలేని కొందరు నడుం బిగిం చారు. తుపాకీని భుజం మీద ధరించారు. తొలినాళ్లలో నాకు సుపరిచ యమైన పేర్లు ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం. ఉద్యమ నేత లుగా వాళ్ల వీరగాథలు విన్నాను. వాళ్లను కీర్తిస్తూ సామాన్య జనం పాడుకున్న పాటలూ విన్నాను. కొంచెం ఆ తర్వాత మరో విప్లవ మూర్తిని దగ్గరగా చూశాను. అతను డాక్టర్ చాగంటి భాస్కర రావు. కొద్దిసార్లు పదిపన్నెండడు గులు అతనితో కలసి నడిచాను. ఆ నిరాడంబరత, సౌజన్యం, విప్లవదీక్ష అతని ప్రతి కదలికలోనూ ప్రస్ఫుటమయ్యేది. ‘‘ఉద్యమించడం మంచిదేగాని చంపడం అవసరమం టారా’’ అన్నప్పుడు, ‘‘మీరు ఆట్టే దూరం మాతో నడవరు’’ అని జవాబుగా అనేసి వెళ్లి పోయాడు భాస్కరరావు. ‘‘దేవుణ్ణి పూజించినా, ఇలాగ ఉద్యమించాలన్నా వాటికి పునాది నమ్మకం. అది లేనివాళ్లు ఇందులోకి రాకూడద’’ని ఒక విప్లవనేత స్పష్టం చేశాడు. కావచ్చు కానీ, అసమాన ప్రతిభ, దీక్షాపరత్వం, త్యాగనిరతి అడవి కాచిన వెన్నెల కాలేదా అని సందేహం కలుగుతుంది. నడకదారి కూడా ఆగిపోయిన చోట ఉద్యమకారుల స్థావ రాలు మొదలవుతాయని చెప్పుకుంటారు. యాభై ఏళ్ల తరువాత బేరీజు వేస్తే ఉద్యమ ఫలితాలు నైరాశ్యాన్నే నింపుతాయి. ఇంతకీ పోరు ఎవరి మధ్య నడుస్తోంది? పొట్టకూటికి తుపాకీ పట్టిన పోలీసులకీ, చెడబారిన వ్యవస్థని సంస్కరిస్తామని ప్రాణాలు పణంగా పెట్టిన ఉద్యమకారులకీ నడుమ యుద్ధం. ఎప్పుడూ పౌర హక్కుల నేతలు, బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఆరో పిస్తారు. అసలు ఎన్కౌంటర్ మాటే పెద్ద బూటకం. ఎన్కౌంటర్ అంటే మరణిం పబడ్డాడని అర్థం. ట్రిగ్గర్ మీద వేలేశాక జాలీ దయ, నీతీ నియమం గుర్తు రావు. రెండు వైపుల నుంచీ విచక్షణా రహితంగానే బుల్లెట్లు దూసుకువస్తాయ్. ఇక్కడి రణ రంగంలో ఎవరు దేశభక్తులో, ఎవరు కాదో తేల్చడం కష్టం. ఈ నేలలో కారుణ్యం ఇంకిపోయింది. ‘‘ఎన్కౌంటర్లో గాయపడ్డ మావోయిస్టులు దొరికితే మాంఛి వైద్యం చేయించేవాళ్లం’’ అంటూ ఉన్నత పోలీసు అధికారి ఉదారమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటివి అపహా స్యాస్పదంగా ధ్వనిస్తాయి. ఈ నేల మీద జీసస్ ఎవరో జూడాస్ ఎవరో గుర్తించడం కష్టంగా ఉంది. అతిరథ మహారథులంతా కలసి పద్మవ్యూహంలో అభిమన్యుణ్ణి జయించిన తీరు అనుక్షణం గుర్తొస్తోంది. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
చిన్నచిన్న నిజాలైనా చెప్పరా?
అక్షర తూణీరం ప్రజకు నిజాలు ఎలా తెలుస్తాయ్? ఎవరు చెబుతారన్నది పెద్ద ప్రశ్న. స్వచ్ఛ భారత్‌లో స్వచ్ఛత ఏ మేరకు వచ్చిందో కచ్చితంగా చెప్పేదెవరు? తెలుగు రాష్ట్రాలలో రైతుల రుణమాఫీ జరిగిందా, జరుగు తోందా, జరగనుందా? జరిగితే ఏ మేరకు? అనే సత్యాన్ని అంకెలతో చెప్పే హరిశ్చంద్రుడెవరు? ప్రజలకు అందుతున్న రకరకాల పింఛన్లు ముట్టచెబుతున్నది కేంద్రమా? లేక చంద్రన్నలా? స్పష్టంగా విశదపరిచేదెవరు? శరన్నవరాత్రి ఉత్సవాలలో వరంగల్ భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ మొక్కులు, ముడుపులు చెల్లించారు. ఆయన మోయలేనంత బరువు బంగారు నగలు. ‘‘మొక్కిన మొక్కులు చల్లంగుండి తెలంగాణ నా చేతికి వస్తే- బంగారు తొడుగేయించెదనమ్మా అని ఆనాడాయన మొక్కారు. ఈనాడు తీర్చారు.’’ ఒక పెద్దావిడ ఆ నగల సమర్పణ దృశ్యం చూసి ఆనందబాష్పాలు రాల్చి, ఇవన్నీ ఎవరి పైసలతో చెల్లిస్తున్నాడని అడిగింది. ‘‘ఎవరివైతేనేమి అవ్వా’’ అంటిని. అది సరేలే, మా దొరకి మీ, మా వెత్తాసం లేదు గాని, పున్యంలో నాకు వాటా వస్తదో లేదో తేలాలి గదా అన్నది. అది పబ్లిక్ మనీతో చేయించారా, సొంత సొమ్ముతో కావించారా అనేది అవ్వ ధర్మసందేహం. అది సొంత మొక్కు కాబట్టి, జేబు డబ్బుల్లోంచే కైంకర్యం చేసి ఉంటారని కొందరం టున్నారు. ‘‘అసలీ చిన్న వ్యవహారానికి ఇంతగా జనం తర్జనభర్జన పడాలా, తేల్చి చెప్పవచ్చు గదా’’ అనేది అవ్వల నిశ్చితాభిప్రాయం. ‘‘ఇదిగో, తల్లీ! భద్రకాళీ ప్రజల అభీష్టం మేరకు నేకోరిన వరం ఇచ్చినందుకు ప్రజాధనంతో నీకు సొమ్ములు సమర్పిస్తున్నా’’ అని స్పష్టంగా చెప్పచ్చునేమో అని మరికొందరు నోళ్లు నొక్కు కుంటున్నారు. ఈమధ్య మనదేశంలో ప్రతిదీ సస్పెన్స్‌గానే ఉంటోంది. ఎందుకో తెలియదు. జయలలిత ఒంట్లో బాగాలేదన్నది మాత్రమే మనకి తెలుసు. ఎంత బాగాలేదో, ఎట్లా బాగాలేదో ఎవ్వరూ చెప్పరు. ఎందరో వస్తారు. ఆసుపత్రికి వెళ్లొస్తుంటారు. పరామర్శించా మంటారు. వైద్య నిపుణులను కలసి ట్రీట్మెంట్ వివరాలు చర్చించామంటారు. దాదాపు నాలుగు వారా లుగా ఇదే దృశ్యం నడుస్తోంది. కాకపోతే పాత్రలు మారుతున్నాయి. వైద్య నిపుణుల నుంచి కూడా అంద రికీ అర్థమయ్యే రీతిలో బులెటిన్ రానేలేదు, చిదంబర రహస్యంలా. వీఐపీలంతా వస్తున్నారు, తిలకించి వెళు తున్నారు. కొన్ని గోప్యంగా ఉంచడం మంచిదేగానీ వాటికి హద్దులుండాలి. సమాచార వ్యవస్థలు, వందలాది శాటిలైట్లు చిన్న గోడ వెనుక సత్యాన్ని చెప్ప లేకపోతున్నాయి. ప్రజా క్షేమం దృష్ట్యా, దేశ ఆరోగ్యం దృష్ట్యా కొన్ని సార్లు పారదర్శక సూత్రా లను పక్కన పెట్టాల్సిందే. ఇట్లాంటప్పుడు అన్ని వ్యవస్థలు ఎట్లా ఉన్నా సమాచార వ్యవస్థ సక్రమంగా పనిచెయ్యాలి. కొన్ని నిజాలను ప్రజకు చెప్పి, ఫోర్త్ ఎస్టేట్‌లో నిజాయితీ ఉందని నిరూపించుకోవాలి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పని చూడు బాబూ!
అక్షర తూణీరం ఎక్కడ రోడ్లు లేవో, వీధి దీపాలు లేవో తెలుసుకోవ డానికి శాటిలైట్ సాయం అక్కర్లేదు. అవసరాలను, అత్యవసరాలను తెల్పడానికి ఒక్క కార్యకర్త చాలు. కొందరు పనికిరాని పరిజ్ఞానాన్ని పోగుచేస్తూ ఉంటారు. ఎలాగంటే – మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక రోజులో తయారయ్యే పెసరట్లని ఒకచోట పరిస్తే సరిగ్గా ఇరవై రెండున్నర హెక్టార్ల విస్తీర్ణానికి సరి పోతాయి. నవ్యాంధ్రలో ఒక సాయంత్రం వండు తున్న సమోసాలను ఒకచోట పేరిస్తే, ఇంద్రకీలాద్రికి రెట్టింపు పరిమాణంలో ఉంటాయి. రాష్ట్రంలో డేటా వేట జరుగుతున్న వేళ నాకు పెసరట్ల కథనం గుర్తు కొచ్చింది. అశోకుడు చెట్లు నాటించాడు. చెరువులు తవ్వించాడు. రోడ్లు వేయిం చాడని చిన్నప్పటినుంచీ వాచకం పుస్తకాల్లో చదువుకున్నాం. అశోకుడు కాలం నాటికి ఇంతటి సాంకేతిక విజ్ఞానం ఉన్నట్టు లేదు. ఇవన్నీ ప్రజకి అవసరం అనుకున్నాడు. అశోకుడు గప్‌చుప్‌గా చేయించాడు. మనకిప్పుడు పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది. ప్రతిపనికీ ముందు సర్వే, సూక్ష్మ సర్వే, అతి సూక్ష్మ సర్వేలకు ఆజ్ఞా పించడంతో కథ మొదల వుతుంది. ఆకలిగొన్నవా రెందరు, అర్ధాకలి వారెం దరు.. ఇలా ఆకలిని పది పన్నెండు సూక్ష్మాలుగా వింగడించి, ఐదుగురు నిష్ణాతులు, ఆరు కంప్యూ టర్లు కలిసి పనిచేసి ఒక సమగ్ర నివేదికను సమ ర్పించడం జరుగుతుంది. అసలు పని జరగదుగాని, ఈ హంగామా అంతా ‘‘ఇక ఆకలికి చెక్’’ అన్న వార్తా శీర్షిక కింద నడుస్తూ ఉంటుంది. చివరికి ఏమీ ఉండదు. బెజవాడ కనకదుర్గమ్మ దివ్య సన్నిధిలో రోజుకో మహత్తు వెలుగు చూస్తోంది. శరన్నవరాత్రుల తొలిరోజు యాభైవేల లడ్లు పచ్చబారాయి. ఈగలు, బొద్దింకలు విస్తృతంగా వాటిచుట్టూ కనిపించాయి. అటు అమ్మవారిని ఇటు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఆలయ అధికారులు ఆ అరలక్ష లడ్లని పాతర వేశారు. మరో రోజు అధికారులంతా చేరి అమ్మవారి ఆలయాన్ని ఆక్ర మించుకుని ఆ తల్లి సేవలో తరించారు. ఈ భక్తి పారవశ్యంలో నివేదనలు మరిచారు. ఇంకో రోజు వేలాది రూపాయలకు ప్రత్యేక పాస్‌ల విక్రయాలు జరిగాయి. ఇంకా అగమ్యగోచరమైన విశేషాలు అనేకం. ఇలాంటి వ్యవ హారాలకు ఎంతకాలం విచారణ కావాలి? ఎన్ని నివేదికలు అందుకోవాలి? అదేమన్నా అంటే టెక్నాలజీ వాడకంలో ముందెత్తులో ఉన్నామని ప్రస్తుతి చేసుకోవడం విడ్డూరం. ఇసుక మాఫియా వైనం పత్రికల్లో చదివే దాకా శ్రీవారికి తెలియరాలేదు. భలే ఉంటాయి కబుర్లు. అభివృద్ధి చేయడానికి, అవినీతిని అరికట్టడానికి పెద్ద టెక్నాలజీతో పన్లేదు. ఎక్కడ రోడ్లు లేవో, వీధి దీపాలు లేవో తెలుసుకోవడానికి శాటిలైట్ సాయం అక్కర్లేదు. ఒక ఊరికి ఒక ప్రతినిధి ఉంటే చాలు. అవసరాలను, అత్యవసరాలను తెల్పడానికి ఒక్క కార్యకర్త చాలు. టెక్నాలజీ చాలా అవసరమేగానీ మరీ అంతకాదు. స్వచ్ఛ భారత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం సంపాదించుకుంది. ఇంద్ర కీలాద్రి సంగతి మోదీ దాకా వెళ్లనీయకండి. (వ్యాసకర్త : శ్రీరమణ ప్రముఖ కథకుడు) -
ఓవర్‌డోస్ పర్యవసానం
అక్షర తూణీరం చాలా ప్రధాన వీధులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. రూట్లు నిర్ధారించి బోట్లు వేసేస్తే కొంతమేర కాశ్మీర కళ వస్తుంది. ఇక మెరక వీధుల మీద దృష్టి పెడితే ఏడాదిన్నరలో ఇక్కడ కుంకుమ పూదోటలు ఘుమఘుమలాడడం ఖాయం. మహారాజు పరమ నిష్ఠాగరిష్టుడు. సత్యసంధుడు. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌లాగా ఒక పద్ధతి గల మనిషి. ఒక రోజు రాజు తన ఎర్రవెల్లి తోట నుంచి కోటకి గుర్రం మీద వస్తున్నాడు. వాగు దాటే వేళ రాయి మీద గిట్ట జారింది. గుర్రం పడిపోయింది. రాజు పక్కనే ఉన్న ఊబిలో పడ్డాడు. ఎంత ప్రయత్నించినా లేవలేకపోయాడు. రాజు ఒక్కసారి ఆకాశం వైపు తిరిగి, ‘ఓ ముక్కోటి దేవత లారా! నేను ఆకస్మికంగా ఊబిలో పడ్డాను. లేవలేక పోతున్నాను. నేనే కనక ధర్మపరుడినైతే, నేనే కనక మిమ్ముల నమ్మి కొలుస్తున్నట్టైతే- నన్నీ ఊబిలోంచి బయట పడెయ్యండి!’ అంటూ ప్రార్థించాడు. మరు క్షణం పురాణ ఫక్కీలో ఆకాశంలో మెరుపులు మెరిశాయి. చెట్లు పూనకం వచ్చినట్టు ఊగాయి. రాజు ఒక్కసారిగా లేచి, రివ్వున ఎగిరి దూరంగా మరో ఊబిలో పడ్డాడు. ఈ దృశ్యాన్ని చూసిన గుర్రం విచిత్రంగా సకిలించింది. రాజుకి రోషం వచ్చింది. ‘‘సాయం కోరితే చేయుట ఇట్లేనా’’ అని ఆకాశాన్ని సూటిగా ప్రశ్నించాడు. వెంటనే మెటాలిక్ వాయిస్‌లో జవాబు వచ్చింది- ‘‘మారాజా! చిన్న గుంటలోంచి లేవడానికి ముక్కోటి దేవతలను సాయమడిగావ్. అందరూ తలో చెయ్యి వేశారు. దాంతో నువ్ పోయి ఎక్కడో పడ్డావ్.’’ తన ప్రార్థన ఓవర్‌డోస్ అయిందని రాజు గ్రహించాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. క్రిందటి సంవత్సరం చివర్లో మన సొంత ఎస్టేట్‌లో చండీయాగం చేశాం. అలా ఇలా కాదు. ఇలాతలం దద్దరిల్లే విధంగా. ఎన్ని యజ్ఞకుండాలు, ఎందరు రుత్త్విక్కులు, ఎన్ని సమర్పణలు, ఎందరు వీఐపీలు, ఎంతటి కవరేజి?! స్తోత్రాలు, ఆహుతులు చేరవలసిన వారికి చేరాయి. ఫైళ్లు గబగబా కదిలాయి. తెలంగాణలో వచ్చే రుతువులో వర్షం బాగా పడేట్టు చూడండని అమ్మవారు ఆదేశిం చింది. కేసీఆర్ సోమయాజిగా నడిపిన చండీయాగం పూజలు గుర్తొచ్చినప్పుడల్లా దిక్పాలకులకి వాన మాట హెచ్చరించడంతో ఈ స్థితి దాపురించిందని ఒక పెద్దాయన విశ్లేషిస్తున్నాడు. మన నేత భక్తి ఓవర్‌డోస్ అయిందని ప్రాజ్ఞులు తేల్చారు. ఏమిటి దీనికి విరుగు డని సవినయంగా వారిని అడిగాను. ఏంలేదు, ఈసారి రుత్త్విక్కులని సగానికి తగ్గించడం, దానాలూ దక్షిణలూ కూడా కుదించుకోవడం మంచిదన్నారు. భక్తిశ్రద్ధల విషయంలో కూడా నాలుగు డిగ్రీలు రాజీపడితే ఇంతింత కుంభవృష్టి పడే ప్రమాదం ఉండదన్నారు. ఈలోగా విశ్వనగరాన్ని క్షుణ్ణంగా రిపేరు చేసుకుంటే, ఇహ తర్వాత రెచ్చిపోవచ్చు. మన నగరాన్ని భూతల స్వర్గం కాశ్మీరంలా చేసుకోవడం తేలిక అనిపిస్తుంది. ఇప్పటికే చాలా ప్రధాన వీధులు నీళ్లతో కళకళలాడు తున్నాయి. రూట్లు నిర్ధారించి బోట్లు వేసేస్తే కొంత మేర కాశ్మీర కళ వస్తుంది. ఇక మెరక వీధుల మీద కార్పొ రేషను, కేటీఆర్ దృష్టి పెడితే ఏడాదిన్నరలో ఇక్కడ కుంకుమ పూదోటలు ఘుమఘుమలాడడం ఖాయం. అప్పుడు గత పాలకులపై బురద జల్లకుండా కుంకుమ పూలని ఆస్వాదించవచ్చు. ఇదిగో ఇప్పుడు బతుకమ్మల మీదకు మళ్లుకుం టున్నారు. నాకు భయంగా ఉందని ఒక ఆధ్యాత్మికవేత్త కంగారు పడ్డాడు. ‘‘ఈసారి బతుకమ్మ పూజకి బడ్జెట్ పెంచారు. అటు భక్తిభావం పెరిగింది. ఇక ఆవిడ కూడా ఒకటిన్నర రెట్లు కరుణిస్తే ... అమ్మో చాలా డేంజరండీ!’’ అన్నాడు. ఈ భక్తి విప్లవాన్ని ఎవరైనా ఆపి పుణ్యం కట్టుకుంటే బాగుండు. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పొగడ్తల రాజసూయం
అక్షర తూణీరం అడవి రాముడు సినిమా విజయవంతమైందంటే అర్థం ఉంది. ‘‘పుష్కరాలు విజయవంతం’’ అవడమంటే ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. అసుర సంధ్యవేళ మహా సంకల్ప దీక్ష చెప్పించడం ఒక ఫార్సు! ఆనాడు ధర్మరాజు రాజ సూయం చేశాడు. అది మహా భారతంలో ఒక సువర్ణ అధ్యాయం. ఆ యజ్ఞం చేయ డానికి గొప్ప శక్తి సామర్థ్యాలు కావాలి. పుష్కలంగా నిధులు కావాలి. అర్జునుడు లోకం మీదపడి, రాజుల్ని గెలిచి ధనం దండుకువచ్చాడు. అప్పట్నించీ ‘ధనంజయుడు’ అనే కీర్తినామం ధరించాడు. ఆ సందర్భంలోనే మయుడు ఒక మహత్తరమైన సభా మండపాన్ని నిర్మించి పాండవులకు కానుకగా సమర్పించాడు. రాజ సూయానికి సుయోధనుడు కూడా మంచిమనసుతోనే వచ్చాడు. ఆయనను ఖజానావద్ద కూర్చోబెట్టారు. రారాజు చేతిలో పరుసవేది ఉంది. అంటే ఆ చేతులతో ధనధాన్యాలను తీస్తుంటే, ఎన్నితీసినా అవి అడు గంటవు. గల్లాపెట్టె అక్షయపాత్రగా నిలుస్తుంది. రాజ సూయం వెనకాల సచివుడు సారథి శ్రీకృష్ణుడున్నాడు కనుక కిటుకులు చెప్పి ముందుకు నడిపించాడు. అత్యంత శోభాయమానమైన మయసభను సుయో ధనునికి విడిదిగా ఇచ్చారు. మయసభ రారాజుకి ‘అయోమయ సభ’ అయింది. ఆపైన పాంచాలి పరిహ సించుటయా! మయసభలోనే కురుక్షేత్ర మహా సంగ్రా మానికి బీజం పడింది. శ్రీకృష్ణుడిని అగ్రపూజకు ఎంపిక చేశారు. కొందరు హర్షించి ఊరుకున్నారు. శిశుపాలుడు మాత్రం సభాముఖంగా రెచ్చిపోయాడు. కృష్ణునిలో పర మాత్ముని పక్కనపెట్టి, ఉతికి ఆరేశాడు. నిండుసభలో సుదర్శనానికి శిశుపాలుడు బలైపోయాడు. నలుగురు సోదరులు నాలుగు వేదాలై నిలవగా, ధర్మజుడు యజ్ఞ కుండమై భాసిల్లాడని వ్యాసమహర్షి అభివర్ణించాడు. రాజసూయంలో పాండవులపై కురిసిన పొగడ్తలు అన్నీ ఇన్నీ కావు. శేష జీవితానికి సరిపడా, పళ్లు పులిసేలా పొగిడేశారు సామంతులు. ఇక్కడ ఇది చాలా అసందర్భమే కానీ, ఎందుకో కృష్ణా పుష్కరాలని ఆరంభం నించి చివరి ఆస్ట్రేలియా బాణసంచా దాకా చూశాక రాజసూయ ఘట్టం గుర్తుకు వచ్చింది. ‘‘పుష్కరాలు విజయవంతం’’ అవడమంటే ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. అడవి రాముడు సినిమా విజయవంతమైందంటే అర్థం ఉంది. అదేదో సంగమం దగ్గర కృష్ణానదిని ఆవహించినంతగా ఉంది. దాదాపు నెల రోజులపాటు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు డుమ్మా కొట్టాయి. కలెక్టర్ల నుంచి దిగువ దాకా అందరూ ‘‘ఆన్ డ్యూటీ’’గా పుష్కర ఘాట్లలో మునిగి తేలారు. అసుర సంధ్యవేళ మహా సంకల్ప దీక్ష చెప్పించడం ఒక ఫార్సు! ‘‘అటుపోతే బ్యారికేడ్లు, ఇటు చూస్తే నీటి ప్రవాహం – ఈ మధ్యలో త్రిశంకు స్వర్గంలో నిలబడిపోయాం. ఏ దారీ లేక గోదారి అన్నట్టు, అక్కడ దొరికిపోయాం. పైగా పోలీసులు’’ అని ఒక భక్తుడు తడిబట్టలతో బాధపడ్డాడు. ‘‘మొత్తానికి బాబు మాస్ హిస్టీరియా క్రియేట్ చేశాడు’’ అని ఓ హేతువాది నిర్భ యంగా వ్యాఖ్యానించాడు. ‘‘ప్రజాధనం గంగలో పోశారు’’ అంటూ బెజవాడ పాత కమ్యూనిస్టు కష్ట పడ్డాడు. ‘‘ఒక రోజు పెళ్లికి మొహమంతా కాటుక’’ అన్నట్టు ఈ మాత్రం దానికి ఇంత హంగామా అవ సరమా అని చాలామంది అనుకున్నారు. కిలోమీటర్ల పొడవున ఎంతో ఉదారంగా నిర్మించిన స్నానఘట్టాల మెట్లన్నీ తోలు తీసిన ఆవుదూడల్లా కనిపిస్తున్నాయి. పైన పరిచిన టైల్స్‌ని పీక్కుపోవడం ప్రారంభమైంది. ఎంతైనా మన జాతి అసామాన్యమైన జాతి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పుష్కరాల కలెక్షన్లు భేష్!
అక్షర తూణీరం వీవీఐపీలు అందరూ ‘‘ఏర్పాట్లు మహాద్భుతం’’ అన్నారు. వాళ్ల ఏర్పాట్ల కోసమే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేస్తుందని వారికీ తెలుసు. ‘‘...మరి ఈ ఒక్క సింధుయే కాదు, మన నవ్యాంధ్ర నుంచి ఇంటికో సింధు రావాలని కోరు కుంటున్నా. క్రీడా రంగంలో మన రాష్ట్రం ప్రపంచం లోనే నంబర్‌వన్‌గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే, వచ్చే ఒలింపిక్స్ మన నవ్యాం ధ్రప్రదేశ్‌లో జరిపించేందుకు గట్టిగా ప్రయత్నిస్తాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్టేడియంని నిర్మిస్తాం. అవసరమైతే దానికోసం లక్ష ఎకరాలను మన రైతుల నుంచి సేకరిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం...’’ అంటూ మంచం దిగి చీకట్లో వెళ్లిపోతుంటే ఇంట్లోవాళ్లు ఆపారు. ఏమిటో! ఈమధ్య నాకివే కలవరింతలు! పూర్తిగా మేల్కొన్నాను. పది రోజులుగా పుష్కర విశేషాలు వినీ వినీ – అవే కలలు. అవే కలవరింతలు. ఏవిటో కలల్లో పుష్కర స్నానా నికి రానివారు వచ్చినట్టు, వచ్చినవారు రానట్టు కని పిస్తున్నారు. ప్రత్యేకంగా వెళ్లి సగౌరవంగా ఆహ్వానించినా మోదీ రానేలేదు. తీరా ఆయన వచ్చాక పుష్కర ఘాట్‌లో నిలబెట్టి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా సంక ల్పం చేయించి, నిండా మునకలు వేయిస్తారని భయం కావచ్చునని కొందరు వేరే ఘాట్‌లో అనుకుంటుంటే వినిపించింది. శాస్త్రోక్తమైన పవిత్ర పుష్కర సందర్భాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చని మొదటిసారి అర్థమైందని – ఓ తలపండిన నేత నివ్వెరపోయాడు. దేన్నైనా ఒక వేలంవెర్రి కింద మార్చేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. పుష్కర వేళ కోట్లాది రూపా యలతో నడిపిస్తున్న సాంస్కతిక కార్యక్రమాలు నీరుకారుతున్నాయని ఓ విలేకరి వ్యాఖ్యానించాడు. పుష్కరాలు పవిత్రమైనవే కావచ్చు. నమ్మకాలున్నవారు గతించిన తమ పెద్దలకు తర్పణలు వదిలే ఒకానొక సందర్భం. అందుకు తగిన అదనపు ఏర్పాట్లు చేయడం పాలకుల బాధ్యత. అంతకుమించి ఏం చేసినా అది ఎక్స్ట్రా. ప్రతిరోజూ భక్తుల కలెక్షన్లు చెప్పడం, అంతేగాక రేపు ఎల్లుండిలో పికప్ అయ్యే అవకాశం ఉందని మంత్రులు బాకాలూదటం సినిమా విడుద లని తలపిస్తున్నాయ్. ముందునుంచే ఇన్ని కోట్లమంది వస్తారు, అన్ని కోట్లమంది వస్తారని అవసరమైన ఊహాగానాలను వదలడం చాలా అవసరం. విజయవాడలో పుష్కరాల సందర్భంగా ఎట్నించి ఎటు వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అందులో ఎక్కుతున్నవారు పెద్దగా లేరు. ఒక సామాన్యుడేమన్నాడంటే – ఇదంతా వేస్టు. రేపు నష్టాలొచ్చాయంటూ టిక్కెట్లు పెంచడానికి ఇదంతా’’. ఏర్పాట్లకి జనం సంతప్తిపడాలిగానీ చిరాకు పడకూడదు. వీవీఐపీలు అందరూ ‘‘ఏర్పాట్లు మహాద్భుతం’’ అన్నారు. వాళ్ల ఏర్పాట్ల కోసమే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేస్తుందని వారికీ తెలుసు. అయినా అదొక మర్యాద. అదొక సంప్రదాయం. కష్ణా డెల్టాలో నాట్లు పడలేదు. సాగర్ కింకా చిరునవ్వైనా రాలేదు. ముఖ్యమంత్రి పుష్కర తీర్థంలో తలదాచుకుంటున్నారు. ఇవికాగానే వినాయక చవితి, దాని తర్వాత నిమజ్జనోత్సవం వస్తాయి. ఈలోగా కొత్త కాపిటల్‌లో మంత్రుల చాంబర్స్‌ని తిరిగి కట్టడం పూర్తవుతుంది. అప్పుడు మళ్లీ మొదట్నుంచీ పరిపాలన ప్రారంభం అవుతుంది. - శ్రీరమణ వ్యాసకర్త ప్రముఖ కథకుడు శ్రీరమణ -
సైకతస్నానం
అక్షర తూణీరం ఇప్పటికి నెల రోజుల నుంచి పుష్కరాల కబుర్లు తప్ప వేరేమీ లేవు. అన్ని ఆఫీసులు పుష్కరం ముసుగులే సుకు కూర్చున్నా ఏర్పాట్లేమో అరకొరగానే ఉన్నాయి. పుష్కరాలు కృష్ణానదికి కాదు! నవ్యాంధ్రప్రదేశ్‌కి. ఆ రాష్ట్ర నాయకులకి. వారి పంట పండింది. ఇట్లాంటి సహజ సందర్భాలకు చంద్రబాబు రెచ్చి పోతారు. మహా శివరాత్రి, తిరుపతి బ్రహ్మోత్సవం, సూర్య గ్రహణం, రథ సప్తమి - ఇలాంటి అవ కాశాలు ఏవి వచ్చినా వదలరు. అవన్నీ తన ప్రమేయంతో వచ్చాయన్న స్పృహ కల్పించి, అశేష ప్రజానీకానికి తనదైన శైలిలో ఒక సందేశం ఇస్తారు. మరి పుష్కరం అంటే మామూలా? ముఖ్యమంత్రి హస్తినకు ప్రత్యేక విమానంలో వెళ్లి, చేటలంత పుష్కర శుభలేఖల్ని స్వయంగా పంచి వచ్చారు. కాని వాటికేమంత గొప్ప ప్రతిస్పందనలు కనిపించడం లేదు. ఇక వెంకయ్య మనవాడు కాబట్టి, అందరి తరఫునా అన్ని కృష్ణా రేవు ల్లోనూ మునిగి తేలుతాడని అనుకుంటున్నారు. నమ్మకాలున్న వారికి పుష్కరం పెద్ద పర్వమే కావచ్చు. వేదిక ధర్మపరాయ ణులు ఆచరించే పవిత్ర క్రతువే కావచ్చు. కాని, ఇప్పుడు జరుగుతున్న ఆర్భా టాలను ప్రజలు గమనిస్తు న్నారు. అయోమయంలో మునకలు వేస్తున్నారు. ఈ వైదిక సంధ్యలో అత్యాధునిక లేజర్ షోలు ఎంత అసందర్భమో అనుకుంటున్నారు. జన సామాన్యాన్ని దారి మళ్లించే ప్రయత్నంలో ఈ పుష్కరాల పడవని మహా నౌకగా చిత్రించి చుక్కానిని పెడమార్గం పట్టించే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికి నెల రోజుల నుంచి పుష్కరాల కబుర్లు తప్ప వేరేమీ లేవు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి దాకా పుష్కరం ముసుగులేసుకు కూర్చున్నాయి. ఇక పోలీసు శాఖ అయితే చెప్పనే అక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా ‘మీరో పని చేయండి. చూస్తున్నారుగా... ఈ హడావుడి అయ్యాక రండి’ అని సెలవిస్తున్నారు. నిజానికి పైవారు ఏ పనిలోనూ మునిగి ఉండరు. ఇంతాచేసి ఏర్పాట్లు అరకొరగానే పూర్తయ్యాయి. చేసిన పనుల న్నింటినీ, ఈ పుష్కర పర్వం పూర్తయ్యాక చూసి, బేరీజు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఒక అనుభవజ్ఞుడి సూచన. అయితే, అప్పటికి సగం దార్లు, వంతెనలు, ఘాట్లు మిగిలి ఉండకపోవచ్చు. ‘అప్ప ఆర్భాటమేగాని నూర్పిట్లో యిత్తు లేదని’ సామెత. కృష్ణమ్మ అంత దయగా ఏమీ ప్రవహించడం లేదు. బెజవాడకి దిగువన మూరెడు ఎత్తు నీరు మాత్రమే ఉంది. కొందరు మేము ఈ పుష్కర వేళ కృష్ణా ఇసుకతో స్నానం చేయవచ్చునా? సైకత స్నానం మీద బ్రహ్మశ్రీ విడమరచి చెప్పాలని భక్తులు కోరుతున్నారు. ‘మన అమరావతిని నిర్మించనున్నది జపాన్, చైనా, సింగపూర్ కంపెనీల వారే కదా. వారు పుష్కర స్నానాలకు వచ్చారా?’ అని ఓ కాపిటలిస్ట్ వాకబు చేశాడు. అక్కడ భూమి పోగొట్టుకున్న వారిని ‘కాపిటలిస్ట్’లనే బిరుదు నామంతో వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఎట్లా ఉన్నా, పుష్కరాల పుణ్యమా అని కృష్ణా తీరం మహ నీయులను స్మరించుకునే సదవకాశం వచ్చింది. కొత్త కాపిటల్‌లో, మందుల మాంత్రికుడు యల్లాప్రగడ సుబ్బారావుకి, జాతీయ జెండా శిల్పి పింగళి వెంకయ్యకి సముచిత స్థానం కల్పించాలి. (వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
కృష్ణాతీరం... సినిమా కేంద్రం
తెలుగు సినిమా పరుగులు నేర్చి ఏడు దశాబ్దాలైంది. ఆరంభ దశ నుంచి నేటి దాకా బెజవాడ... సినిమా పరిశ్రమకి ముఖ్య కేంద్రంగా నిలిచింది. తొలితరం నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు కృష్ణాతీరం వారే! సినిమా ఆనాడు సరికొత్త సాంకేతిక విజ్ఞానం. మూకీల నాడే ఎల్.వి.ప్రసాద్ అనబడే అక్కినేని లక్ష్మీవరప్రసాద్ చిన్నతనాన్ని, బంగారు కలల్ని వెంటవేసుకుని బొంబాయి పారిపోయారు. తిరిగి వచ్చేటప్పుడు సినిమా నాలెడ్జిని వెంట తెచ్చారు. ఎల్.వి.ప్రసాద్ దర్శకుడుగా, నటుడుగా, నిర్మాతగా, లాబొరేటరీ యజమానిగా రాణికెక్కారు. గూడవల్లి రామబ్రహ్మం సామాజిక స్పృహతో చిత్రాలు నిర్మించి పేరు తెచ్చుకున్నారు. కెయస్. ప్రకాశరావు, కె.రాఘవేంద్రరావు సినిమాని పరిశ్రమగా తీసుకున్నారు. కె.విశ్వనాథ్ కనక వర్షాలు కురిపించిన కళాత్మక సినిమాలకు మారుపేరు అయ్యారు. విజయవాడలో పుట్టి పెరిగిన జె.వి.డి.ఎస్ అనే జంధ్యాల తెలుగు సినిమాకి చక్కలిగింతలు పెట్టి, తెలుగు ప్రేక్షకుల్ని నవ్వులలో ముంచెత్తారు. ఆయన రచయిత, దర్శకుడు మాత్రమే కాదు, మంచి నటుడు కూడా. దర్శకులు ఘంటసాల బలరామయ్య దృష్టి సోకి, కథానాయకుడిగా చలనచిత్ర చరిత్రలో నిలిచారు అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని ఏ మహత్తర క్షణంలో తొలిసారిగా మేకప్ వేసుకున్నారో గాని, ఇప్పటికీ మూడోతరం కథానాయకులుగా అక్కినేని వారసులు చలాయిస్తున్నారు. నిర్మాత, పంపిణీదారుడు, స్టూడియో యజమాని. ఇంకా దేశంలోనే సుదీర్ఘ నట జీవితం గడిపిన ధన్యజీవి. తెలుగుతనానికే ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని, వెండితెరపై ఇప్పుడు మూడో తరం విజయవంతంగా నడుస్తోంది. స్టూడియో, సినిమా థియేటర్లు, నిర్మాణసంస్థ, పంపిణీ వ్యవస్థలను యన్టీఆర్ నెలకొల్పారు. రాజకీయాలలో ఆయనదొక శకం. 1947లో ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ అనే నాటక సంస్థ ఆవిర్భవించింది. అందులో ఎన్.టి.రామారావు, ఎన్. త్రివిక్రమరావు, ఎ. పుండరీకాక్షయ్య, రోజులు మారాయి ఫేమ్ వ హీదా రెహమాన్, సావిత్రి లాంటి వారు అనేక నాటకాలు ప్రదర్శించి ప్రజాభిమానం చూరగొన్నారు. తరువాత ఎన్.ఎ.టి. చిత్ర నిర్మాణ సంస్థగా రూపొందింది. ప్రముఖ దర్శకులు విక్టరీ మధుసూదనరావు విజయవాడ ఆంధ్రా ఆర్ట్స్ థియేటర్ నుంచి వచ్చారు. ఇంకా మిక్కిలినేని రాధాకృష్ణ, రక్తకన్నీరు నాగభూషణం ఆ థియేటర్ వారే. కృష్ణాతీరంలో, విజయవాడలో వచ్చిన నాటక సంస్థలు సినిమా పరిశ్రమకు నటీనటులను, దర్శకులను అందించాయి. 1929లో గుడివాడలో ఆంధ్ర నాటక కళాపరిషత్ ఆరంభమైంది. దుక్కిపాటి మధుసూదనరావు అక్కడివారు. ఆనక అన్నపూర్ణా సంస్థను పేరు ప్రతిష్ఠలతో నడిపించారు. నాలుగు దశాబ్దాలకు పైబడి నలుగురు కథానాయకులు చిత్ర కళా మండపానికి నాలుగు స్తంభాలుగా నిలిచారు. వారు ఏయన్నార్, యన్టీఆర్, శోభన్‌బాబు, కృష్ణ. ఈ దిగ్గజాలన్నీ విజయవాడ పరిసరాలవారు అవడం ఒక విశేషం. నటుడిగా, విద్యాధికునిగా వాసికెక్కిన కొంగర జగ్గయ్య ఈ ప్రాంతం వారే. కామెడీ హీరోగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రాజేంద్రప్రసాద్. విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు పేరు తెచ్చుకున్నారు. పెద్దరికపు పాత్రలలో రాణించిన అన్నపూర్ణ విజయవాడ మజిలీ నుంచే మద్రాసు వెళ్లారు. నటవిశారద శారద తెనాలి నుంచి విజయవాడ మీదుగా వెండితెరకు ఎక్కారు. తెనాలి పేరు చెబితే కాంచనమాల, లక్ష్మీరాజ్యం గుర్తు రాకుండా ఉండరు. విజయవాహిని సంస్థకు చుక్కాని చక్రపాణి తెనాలి వాస్తవ్యులు. సీతామాలక్ష్మి లాంటి అభిరుచి గల సినిమాలతో నిర్మాత అవతారం యెత్తిన కాట్రగడ్డ మురారిది విజయవాడ సెంటరు. ఎన్ని పేర్లు చెప్పినా ఇంకా కొందరు చెప్పక మిగిలే వుంటారు. చిత్ర పంపిణీ సంస్థలన్నీ విజయవాడలోనే వుండేవి. వాటికి అనుబంధంగా అనేక చిరు పరిశ్రమలు యిక్కడ నుంచే నడిచేవి. మద్రాస్‌లో రూపాయలు జల్లి విజయవాడలో ఏరుకుంటారని సామెత. పలు సినిమాలకు కథలు అందించిన యద్దనపూడి సులోచనారాణి స్వస్థలం బెజవాడ పక్కన కాజ. కృష్ణవేణి సముద్రుని చేరే హంసలదీవికి కూతవేటు దూరంలో ఆ దివ్య జలధారల జీరల సౌకుమార్యాన్ని కంఠాన ధరించి జన్మించిన సంగీత శక్తి ఎస్.జానకి. నాదస్వరానికి ఆమె గళం మధురిమలు, సరిగమలు నేర్పింది. తెలుగు సినిమా పాటకు కొత్త మాటలు నే ర్పిన వేటూరి సుందరరామమూర్తి దివిసీమ వాసి. తరాలుగా తెలుగువారిని తన గాంధర్వ గానంతో అలరించిన ఘంటసాల ఇక్కడి వారే. చిరుత ప్రాయంలోనే దక్షిణాది సంగీత వేదికలను అలంకరించిన బాలమురళీకృష్ణ తగిన సంఖ్యలో సినిమా పాటలు పాడారు. పద్యాలంటే ఆయనే అనిపించుకున్నారు మాధవపెద్ది సత్యం. ఇలాంటి విశేషాలు ఎన్ని రాసినా సశేషం వుండనే వుంటుంది. విజయవాడ గాంధీనగరం సినిమా వాసనలతో వుండేది. ఇప్పుడు వ్యాపార తీరు మారి ఆ జోరు తగ్గింది. బెజవాడలో మారుతీ టాకీస్ అత్యంత ప్రాచీనమైంది. అన్నిటికీ తోడు పత్రికలన్నీ విజయవాడలోనే వుండడం వల్ల సినిమా పబ్లిసిటీలకు ముఖ్య కేంద్రమైంది. సినిమా విజయంలో ‘బెజవాడ టాక్’ చాలా కీలకమైంది. ఒక్కోసారి కొన్ని అద్భుతాలు కూడా బహుళ ప్రచారంలో వచ్చేవి. పాతకాలంలో - రోజులు మారాయి సినిమా విడుదలైంది. అప్పుడప్పుడే అందుకుని బాగా నడుస్తోంది. ఉన్నట్లుండి సాక్షాత్తూ కనకదుర్గమ్మ రోజులు మారాయి సినిమాకి వచ్చి చూసి వెళ్లిందని బెజవాడలో కథలు కథలుగా చెప్పుకున్నారు. కనకదుర్గమ్మ రిక్షాలో వచ్చిందట. దిగి వెళ్తుంటే రిక్షావాలా డబ్బులు అడిగితే వెనక్కి చూడకుండా వెళ్లిపోయిందట. రిక్షావాలా కోపంగా తలపాగా తీసి విదిలించాడట. పదిరూపాయల నోట్లు జలజలా రాలాయిట! ఆ తర్వాత వారం పదిరోజులు ఆ సినిమాకి టిక్కెట్లు దొరకలేదుట! ఇలా ఎన్నో తమాషాలు!!! - శ్రీరమణ -
ధృతరాష్ట్ర వారసత్వం
అక్షర తూణీరం ‘‘నాకీ సంగతి తెలియదే. నా గురించి నా ప్రజలేమనుకుంటారు?’’ ‘‘సర్వం తెలిసిన మూర్ఖుడు. గొప్ప నట చక్రవర్తి అనుకుంటారు మహారాజా!’’ ఇంతలో కోట వచ్చింది. ఈ భూమ్మీద గుడ్డివాడిలా నటించగలవాడే పాలకుడిగా రాణించగలడు. భారతదేశ నేతలు ధృతరాష్ట్ర వారసులు. యుగాలు మారినా నేల అదే కదా! అది ద్వాపరయుగం. హస్తినాపురం. ఒకరోజు ధృతరాష్ట్రుడు విదురునికి కబురంపాడు. ‘‘మనం ఈ అర్ధరాత్రి మారువేషాలలో నగరాన్ని సందర్శించాలి. ప్రజల ఆంతర్యాలను తెలుసుకోవాలని ఉంది’’ అన్నాడు. విదురుడు వెంటనే, ‘‘మహారాజా! ఎందుకు పదే పదే మిమ్మల్ని మీరు దగా చేసుకుంటారు? మీకు అన్నీ తెలుసు. అయినా మీకు ప్రయాస లేకుండా నేను అందరి ఆంతర్యాలు చెప్పగలను’’ అన్నాడు విదురుడు. ‘‘కాదులే, వెళదాం!’’ అన్న రాజాజ్ఞను మన్నించి గోప్యంగా అందుకు తగిన ఏర్పాట్లు చేయించాడు. అర్ధరాత్రి వీళ్లిద్దరూ పరదేశీయుల లాగా వీధుల వెంట నడిచి తిరుగుతున్నారు. ఒక చిన్న సందులోంచి లయబద్ధంగా నేత మగ్గం చప్పుడు వినవచ్చింది. ఆ పూరింట్లో చిన్న ప్రమిద వెలుగుతోంది. అతను మగ్గం మీద ఉంటే, ఇల్లాలు నూలు కండెలను ఆసు పోస్తోంది. అంతా వివరించి చెప్పాడు విదురుడు. ‘‘ఇంత రాత్రి వేళా?’’ అన్నాడు రాజు. ‘‘ఔను, వాళ్లకి పగలూ రాత్రీ ఒకటే. ఒక్కొక్క పోగూ నేసి వస్త్రాన్ని సిద్ధం చేస్తారు. కోటి పోగులైనా ఒక మూరెడు వస్త్రం కాదు.’’ ‘‘మరి ఈ జిలుగు పనికి వెలుగు?’’ ‘‘చిన్న ప్రమిద. కాని వారికి మనోదీపం ఉంటుంది.’’ అని విదురుడు అనగానే, ‘‘అదెలా సాధ్యం?’’ అని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు. ‘‘సాధ్యమే రాజా! అందుకు మీరే ప్రబల సాక్ష్యం. మీ కోటలో, దివాణంలో జరిగే సమస్తం తమరికి కళ్లకు కట్టినట్టు ఎరుకే గదా! పుట్టు అంధులు మీకే.....’’ మాట పూర్తి కాకుండానే ‘‘సరి సరి. మరోచోటికి వెళ్దాం’’ అంటూ రాజు కదిలాడు. ఆ ఇంట్లో భార్య, భర్త ఘర్షణ పడుతున్నారు. అది తీవ్ర స్థాయికి వెళ్లింది. ‘‘నీ వల్లే వాడట్లా భ్రష్టుపట్టాడు. వాడెన్ని తప్పుడు పనులు చేసినా హర్షిస్తావు. వాడినే సమర్థిస్తావు. చూడు, చివరికి వాడేకాదు, వాడి అకృత్యాల వల్ల అందరం నాశనం అవుతాం. నీది ధృతరాష్ట్ర ప్రేమ’’ అంటూ భర్త భార్యపై రంకెలు వేస్తున్నాడు. ‘‘రాజా! విన్నారా?’’ అన్నాడు విదురుడు. ‘‘నాకు చెవులున్నాయిగా, పద..పద..’’ అన్నాడు కోపంగా, ధృతరాష్ట్రుడు. ఇద్దరూ ఓ ఇంటి అరుగు మీద సేద తీరారు. ఆ ఇంట్లోంచి మాటలు స్పష్టంగా వినవస్తున్నాయి. ‘‘ఏమిటి, మహారాణిలా అర్ధరాత్రి సింగారాలు?’’ అంటున్నాడు భర్త పరిహాసంగా. ఆవిడ నవ్వి, ‘‘నా మొగుడు గుడ్డివాడూ కాదు. నేను బండి గుర్రంలా కళ్లకి గంతలు కట్టుకోనూ లేదు. అర్ధరాత్రి అలంకారాలకు నాకేం ఖర్మ?’’ అన్నది. ‘‘నాకేం బోధపడలేదు. విదురా! వివరించవా!’’ అన్నాడు రాజు. ‘‘ఈ పాటక జనం మాటలు ఎవరికీ అర్థం కావు’’ అనగానే, ‘‘నువ్వు అసత్యమాడవని నాకో గుడ్డి నమ్మకం’’ అన్నాడు ధృతరాష్ట్రుడు. వెంటనే విదురుడు, ‘‘అది మీ అంతఃపుర రహస్యం. మహారాణి అర్ధరాత్రి వేళ పరిచారికల సాయంతో, వైనంగా అభ్యంగన స్నానం చేసి సర్వాలంకార భూషితయై జాము సేపు అందాన్ని నిలువుటద్దంలో చూసుకుంటారు’’ అన్నాడు విదురుడు. ‘‘నాకీ సంగతి తెలియదే. నా గురించి నా ప్రజలేమను కుంటారు?’’ ‘‘సర్వం తెలిసిన మూర్ఖుడు. గొప్ప నట చక్రవర్తి అనుకుంటారు మహారాజా!’’ ఇంతలో కోట వచ్చింది. ఈ భూమ్మీద గుడ్డివాడిలా నటించగలవాడే పాలకుడిగా రాణించగలడు. భారతదేశ నేతలు ధృతరాష్ట్ర వారసులు. యుగాలు మారినా నేల అదే కదా! (వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
పుష్కరాల పనులు
అక్షర తూణీరం హైవే మీద మద్యం దుకాణాలను అనుమతించడం చాలా అన్యాయం. నడిరోడ్డు మీద మద్యాన్ని అందు బాటులోకి తెచ్చి ఎలాంటి సంకేతాలిస్తున్నారు? అసలే కృష్ణాతీరం నవ్యాంధ్ర క్యాపిటల్ నిర్మాణ పనుల్లో హడావుడిగా ఉంటే, ఆపైన పుష్కరా లొచ్చిపడ్డాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరుకి పూర్తి కాకపోతే పుష్కరాలకి మర్యాద దక్కదని మహానేత ఆదేశాలిచ్చారు. వేస్తున్నవి రోడ్లంటే రోడ్లుకాదు. తారుని నీళ్లకంటే పల్చగా చేసి, దాన్ని మంత్రోదకంలా చిలకరించి కొత్త రోడ్లని చాలా వేగంగా సిద్ధం చేస్తున్నారు. తారు నీళ్లు కల్లాపి జల్లుతున్నారని ఒక పల్లెటూరి ఇల్లాలు చమత్కరించింది. ఈ పుష్కర పనులు అస్మదీయులకు లాభసాటి పండగ. ఈ పుణ్య పర్వం సందర్భంగా - పుష్కరాల రోడ్లు, పుష్కరాల ఘాట్లు, పుష్కరాల గట్లు, పుష్కరాల దీపాలు ఇంకా చిత్ర విచిత్రమైన పనులకు టెండర్లు పడ తాయి. పాత తరం హడా వుడి పనులు అలాగే ఉంటాయి. ఇలాంటి వాటిపై వ్యాఖ్యానించేదేమీ లేదు. కాబోతున్న విశ్వనగరం మనది. మూడొంతులు అయిపోయిందనే ఏలిన వారి నమ్మకం. గట్టిగా నాలుగు చినుకులు పడితే చాలు అన్నీ వీధి గండాలే. ‘‘హమ్మయ్య! ఇవ్వాల్టికి అందరూ ప్రాణాలతో, కాళ్లూ, చేతులతో ఇంటికి చేరారు. దేవుడా! ధన్యవాదాలు’’ అని ఇల్లాండ్రు ప్రతినిత్యం దణ్ణం పెట్టుకుంటున్నారు. ఇది ఎక్కువచేసి చెప్పింది కాదు. పైగా మాట్లాడితే న్యూయార్క్ నగరంతో వంతు పెట్టడంవల్ల నగరవాసులకి మరింత దుఃఖం పెల్లుబుకుతోంది. నేను చరిత్ర పుస్తకంలో చదువుకున్న మొదటి నినాదం ‘‘స్వాతంత్య్రం నా జన్మహక్కు!’’. నేను స్వయంగా విన్నది ‘‘గరీబీ హఠావో!’’. ‘‘ఈ దేశం వెలిగిపోతోంది చూడండి’’ అంటూ ఫీల్‌గుడ్ తత్వాన్ని మంత్రించారు. రెండేళ్ల క్రితం సింహగర్జనలా ‘‘మేకినిండియా’’ వినిపించింది. మొద ట్నించీ గుర్తు చేసుకుంటే ఇది పదహారో జాతీయ నినాదం. కొత్త నోళ్లలో కొన్ని పాత నినాదాలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. పేదరికాన్ని, అవినీతిని పారదోలతాం. ఈ మధ్య పారదర్శక పాలన సాగిస్తామనే స్లోగన్ వినిపిస్తోంది. అంటే అద్దాల గదుల్లోంచి పాలన సాగించడమా? అమరావతి కోసం భూమి పోగొట్టుకున్న ఓ బక్క రైతు, ‘‘ఈ ప్రజల కోసం ప్రజల చేత... ఇదంతా పెద్ద అబద్ధం స్వామీ’’ అని అరిచాడు. నేను వివరాల్లోకి పోలేదు. ప్రస్తుతం కొత్త క్యాపిటల్‌లో బాగా చిక్కపడుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక కాలుష్యాలపై చర్యకిది సమ యం కాదు. సందర్భమూ కాదు. హైవే మీద మద్యం దుకాణాలను అనుమతించి, ప్రోత్సహించడం చాలా అన్యాయం. ఇప్పటికే హైవే ప్రమాదాలు భయంకరంగా జరుగు తున్నాయి. నడిరోడ్డు మీద మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ఎలాంటి సంకేతాలిస్తున్నారు? ఏమి సందేశమిస్తున్నారు? మునుపు బ్రిటీష్ హయాంలో రైల్వే స్టేషన్లలో లిక్కర్ షాపులుండేవి. ఇప్పుడు మనం మాత్రం ఎందుకు కూడదు? హైవేల మీద పెట్రోల్ బంకులలో టై అప్ పెట్టుకుంటే అందరికీ ఉభయతారకంగా ఉంటుంది. అటు ఆ ట్యాంక్‌ని, ఇటు ఈ ట్యాంక్‌ని ఒకేచోట నింపుకుని గాలిలో తేలుతూ పోతారు. అప్పుడు హైవే టోల్ గేట్లు కూడా పెంచవచ్చు. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కూతలు... కేకలు... పరుగులు
అక్షర తూణీరం ఎవరో ఒకాయన, ‘‘రుతుపవనాలు వెనక్కి తిరిగాయంటే రాష్ట్రంలో నీతినియ మాలు లేకనే. మా హయాంలో పవనాలు పిలిస్తే పలికేవి. వద్దంటే వానలు... ధర్మం నాలుగున్నర పాదాల మీద నడిచేది’’ అంటూ ఆవేశపడుతున్నాడు. ఏడాది నుంచి పరిస్థితి అయోమయంగా ఉంది. సగం దేహం వేడినీళ్ల లోనూ, సగం చన్నీళ్లలోనూ ఉన్నట్టుంది. తల హైదరా బాద్‌లో, కాళ్లు అమరా వతిలో ఉండిపోయాయి. అటు ఢిల్లీ నేతలు, ఇటు తెలుగునేతలు శరవేగంగా జరిగిపోతున్న అభివృద్ధి గురించి మాట్లాడేస్తున్నారు. ఈ మధ్య, ఓ పెద్ద రైల్వేస్టేషన్లో దిక్కుతోచక నిలబడిపోయినట్టు అని పిస్తోంది. కూతలు... కేకలు... పొగలు... పరుగులు. దూరంగా ఎత్తు మీద ఆగిపోయిన పెద్ద గడియారం. సందడిలో సందడిగా పలు భాషల్లో ఏవో అనౌన్స్మెంట్లు. ప్లాట్‌ఫాం చివర రైల్‌రోకో జరుగుతోంది. ఎందుకంటే- కేంద్ర రాష్ట్ర ఉద్యో గులు లంచాలడిగితే ఫలానా నంబర్ని సంప్రతిం చండని సెల్ఫోన్లో ప్రభుత్వం ప్రచారం చేస్తోం దట. ఆఫీసులలో కోసీట్లకి ఎదురుగా సీసీ కెమె రాలు బిగించారట. ఆఫీసు క్యాంటీన్లలో కూడా నిఘా పెట్టారట. ఇది హేయం, అమానుషం. సాటి మనిషిని అనుమానించడం, అవమానించడం కాదా! ఇది మానవహక్కుల ఉల్లంఘనే ముమ్మా టికీ. ‘‘నశించాలి! ప్రభుత్వ ఏకపక్ష ధోరణి నశించాలి!’’ నినాదాలు స్టేషనంతా ప్రతిధ్వనిస్తు న్నాయి. ప్లాట్‌ఫాం బ్రిడ్జి మెట్ల మీద ఒక బృందం బైఠాయించింది. వాళ్లెవరండీ అంటే బోస్టన్ టీ పార్టీ అన్నారు. ఒక్కసారిగా అందరూ కొత్త కండువాల కోసం ఎగబడే సరికి, రేటు గణనీయంగా పడి పోయిందిట. గిట్టుబాటు ధరకోసం ఆందోళన సాగిస్తున్నారు. మధ్యలో దండతో ఉన్నాయన ఆమ రణ దీక్షలో ఉన్నారు. వార్తా మాథ్యమాల మనుషులు మైకులతో కనిపించారు. ఇప్పుడు స్టేషన్లో మాటువేసి, పెద్ద మనుషుల స్పందనలను రికార్డ్ చేస్తున్నారు. ఎవరో ఒకాయన, ‘‘రుతు పవనాలు వెనక్కి తిరిగా యంటే రాష్ట్రంలో నీతినియమాలు లేకనే. మా హయాంలో పవనాలు పిలిస్తే పలికేవి. వద్దంటే వానలు... ధర్మం నాలుగున్నర పాదాల మీద నడిచేది’’ అంటూ ఆవేశపడుతున్నాడు. ఇంతలో ఒకాయన నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అరిచాడు. దేనిని, దేనికి అన్నారెవరో. సందర్భం వచ్చినప్పుడు చెబుతా. ఇప్పటికైతే ఖండిస్తున్నా. ‘‘నేనా, నేనొక కవిని. జనకవిని. రైలే నా ఆదర్శం. రైలే నా జెండా. పట్టాల మీద గాడి తప్పకుండా వెళ్లే ఒక మహాశక్తి. అలజడులకు, ఉద్యమాలకు ఆహుతి అవుతుంది. అగ్నిపునీత అవుతుంది. అక్షరాల్ని భుజాన వేసుకు తిరుగు తున్న వాణ్ణి. నా దగ్గర మట్టివాసన వేస్తుంది’’ ఔను. వేస్తోంది. రేపట్నించి రైళ్లలో సమస్త కూరలు అమ్మే ఏర్పాటు చేస్తాం. వంటలు చేసుకునే స్త్రీపురుష ప్రయాణికులకు వెసులుబాటు ఉంటుంది. భారతీయ రేల్ తర్కారీ! అసలు లాంగ్ జర్నీ రైళ్లలో ఓ బోగీలో సమస్త సరుకులు పేర్చి అమ్ముతాం. రైల్వే నానావిధాలుగా లాభాలు ఆర్జిస్తుంది. ఓ పక్క ఆగకుండా అయిడియాలు అయిపోతున్నాయి. దాంతో ముఖ్యమంత్రికి పూనకం వచ్చేసింది. అమ రావతి రైల్వే స్టేషన్‌ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా చేస్తాం. ఇక్కడ విమానాలు కూడా దిగు తాయి. అవసరమైతే ఓడలు కూడా వస్తాయి. డ్వాక్రా గ్రూపులతో షాపింగ్ కాంప్లెక్స్‌లు నడిపిస్తాం. జై తెలుగుతల్లి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
‘జిల్లా’యిలే... జీడిపప్పులే!
ఒక చెరువుని నాలుగు చెరువులుగా విభజించి గట్లు వేస్తే దోసెడు నీళ్లు కూడా పెరగవు. జిల్లాలను ముక్కలు చేయడం కంటే చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. ఇరవై మూడు జిల్లాల రాష్ట్రం రెండుగా చీలింది. దీపంలా ఉన్న రాష్ట్రం ప్రమిదలా, వత్తిలా విడి పోయింది. జిల్లాల సంఖ్య క్షీణించడంతో పాలకులకు చిన్నతనంగా ఉండటం సహజం. ఆ చిన్నతనాన్ని దూరం చేసుకోడానికి వ్యూహ రచన చేసుకుని, పరిపాలనా సౌలభ్యం కోసం ఒక్కో జిల్లాని రెండు చేస్తున్నామన్నారు. అందుకు కత్తులు, కత్తెర్లు సిద్ధం చేసుకున్నారు. కొత్త జిల్లాలకు ఇష్టుల పేర్లు పెట్టుకుని మంచి పేరు తెచ్చుకోవచ్చు. కేసీఆర్‌కి నిజాములన్నా, వారి పాలనన్నా పరమ ప్రీతి. ఆయన నిజాము రోజుల్ని స్వర్ణయుగంగా భావిస్తారు. ఆ పరంపరలోని కొందరి పేర్లు తప్పక జిల్లాలకు పెడతారు. పాల్కురికి సోమన, బమ్మెర పోతన తప్పదు. ఇంకా కొందరు ఉర్దూ కవి గాయకులను సంభావించుకుంటారు. ఇక ఉద్యమ నేతలకు, అమర వీరులకు పెద్దపీటలు వేస్తారు. పేర్లు మిగిలితే జిల్లాల్ని పెంచుకుంటాం. ఇంకా తగ్గితే మిషన్ కాకతీయలో పునర్జన్మకి నోచుకుంటున్న ముప్పై వేల చెరువులకు బారసాలలు చేస్తాం. ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాలుగడుగులు ముందుంటారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి జిల్లాని అంట్లు తొక్కి మూడు చేస్తారు. దేశంలోనే జిల్లాల విషయంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలుపుతారు. అత్యధిక జిల్లాలున్న రాష్ట్రాలకు అగ్రనేతగా గిన్నిస్‌లో స్థానం పొందినా ఆశ్చర్యం లేదు. కొత్త జిల్లాల ఆలోచన మంచిదే. అనేకమంది కలెక్టర్లు, బోలెడు మంది యస్పీలు వారి వారి అధికారా లతో రంగప్రవేశం చేస్తారు. యంత్రాంగం, మంత్రాంగం తామరతూడులా విస్తరిస్తుంది. మంది మార్బలం, వందిమాగధులు, ఆశ్రీతులు, భజనపరులు, సామాజి కులు... పెద్ద బలగమే ఏర్పడుతుంది. వికేంద్రీకరణ మంచిదే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో చాలా వ్యవస్థలు, దానికి తగిన అవస్థలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ, మండల వ్యవస్థ, మున్సి పాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ వ్యవస్థ ఉండగా- పైన పెత్తనం చేయడానికి ఎమ్మెల్లేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు రాజ్యసభ సభ్యులు వుండనే వుండిరి. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యానికి లోటేమి వచ్చిందో తెలియదు. ఇప్పుడు ప్రతి కొత్త జిల్లాకు కనీసం వెయ్యిమంది కొత్త జీతగాళ్లు అవసరపడతారు. వారి జీతాలు, నాతాలు, పెట్రోళ్లు, సెల్ఫోన్లు, పర్యటనలు అన్నీ కలిసి తడిసి మోపెడవుతుంది. ప్రజాధనాన్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి రాజ్యాంగంలోని ఏ అధికరణం అనుమతిచ్చిందో చెబితే బావుంటుంది. ప్రజా సేవకుల సంఖ్యని పెంచుకుంటూ వెళ్లడం కన్నా, వారిలో సేవానిరతిని, ఉద్యోగ ధర్మాన్ని పెంచడం మంచిది. ఒక చెరువుని నాలుగు చెరువులుగా విభజించి గట్లు వేస్తే దోసెడు నీళ్లు కూడా పెరగవు. జిల్లాలని ముక్కలు చేయడం కంటే అత్యవ సరంగా చేయతగ్గవి అనేకం ఉన్నాయి. సర్కారు పాఠశాలల్లో అయ్యవార్లను నియమించవచ్చు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల్ని పెంచవచ్చు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ప్రజలు నిర్భయంగా జీవించేలా చెయ్యచ్చు. ధర్మాసు పత్రులలో కాస్తంత నీడ, కొంచెం దయా దాక్షిణ్యాలతో వైద్యం అందేలా వ్యవస్థను మరమ్మత్తు చేయతగు. ఏలినవారికి ఏమాత్రం అవకాశమున్నా మార్కెట్ యార్డు లకి పై కప్పులు సమకూర్చవచ్చు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కోటమ్మగారి కొబ్బరి మొక్కు!
అక్షర తూణీరం కోటమ్మ చిన్నగా నవ్వింది. కొడుకు తల నిమురుతూ ‘‘పిచ్చి సన్నాసీ! కొబ్బరి మొక్క కాస్తేనే మొక్కు చెల్లించాలి. లేకపోతే తూచ్!’’ అంది. మన క్యాపిటల్ వాగ్దానాలు కూడా అంతే- మళ్లీ మళ్లీ కాపు దిగితేనే....! ఆయన చిత్తూరు చాణక్యు డండీ! జనానికి మండు వేసవిలో చందమామని చూపిస్తున్నాడంటూ ఓ పెద్దమనిషి తెగ ఆశ్చర్య పడ్డాడు. మొన్నటికి మొన్న కృష్ణా గోదావరి నదుల్ని అనుసంధానం చేసి పచ్చ పూల హారతి ఇచ్చాడు. నిన్నటికి నిన్న అమరావతి ముఖ్యపట్టణం తాలూకు సచివాలయం నూతన భవనంలోంచి ముఖ్యమంత్రి మహా సంతకాలు చేశారు. అసలు కొత్త క్యాపిటల్ నూతన సెక్రటేరి యట్ భవనాన్ని రిబ్బన్ కత్తిరించి, స్వజనం కరతాళ ధ్వనుల మధ్య ప్రారంభించడం భళారే చిత్రం! రాష్ట్రం ముందుకు పోతావుంది. సందేహం లేదు. పూర్వం ఎన్నో నిర్మాణాలు శిలాఫలకాల దగ్గరే నిద్ర పోతుండేవి. ఇప్పుడు అట్లా కాదు. ఎంతోకొంత పైకి సాగుతున్నాయి. ‘‘ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవని ముఖ్యమంత్రి పురిట్లోనే బారసాల చేశాడని’’ ఓ మాటకారి చమత్కరించాడు. అంతేగాని నేత చిత్త శుద్ధిని మెచ్చుకోలేదు. పైగా, అమరావతి నిండా కొత్త తాటాకు చలవ పందిళ్లు వెలుస్తాయి చూడండంటూ ప్రత్యక్ష వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. ఉమ్మడి రాజధానిలో మనకు స్థానబలిమి లేకుండా పోయింది. గుట్టుగా ఓ ఫోను చేసుకుం దామన్నా రట్టయిపోతోంది. వేరుపడ్డాక భద్రాచల రామయ్య వాళ్ల పక్షానికి వెళ్లాడు. ఇక మన సంగతి ఎంతవరకు పట్టించుకుంటాడో అనుమానమే. మనం దిక్కులేక ఒంటిమిట్టని ఉన్నట్టుండి ఉద్ధరించే పనిలో పడ్డాం. రాముడు నిజం గ్రహించలేడా? గ్రహించినా లౌక్యంగా, పోన్లే ఇన్నాళ్టికి ఈ వైభవం దక్కిందని సరిపెట్టుకుంటాడా? వాటాల్లో మిగిలిన దేవుళ్లు ఎటు చెదిరినా, మనకి కొండంత అండ వెంకన్న మిగిలాడు. చాలు, అదే కోటి వరహాలు. కోటివరాలు! అంతేనా, ఇంకా అన్నమయ్య, ఆయన వేనవేల సంకీర్తనలు మనకు దక్కాయి. ఇంకానయం వాటాల పంపిణీలో పదివేలు మాకు చెందాలని, దాయి భాగాలకి పేచీ పెట్టరు కదా! ఒకవేళ పెడితే, వారి వాటాకి వెళ్లిన సంకీర్తనలు వారు తప్ప వీరు పలకరాదు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు రాజధాని తరలింపుపై మునికాళ్ల మీద ఉన్నారు. హాయిగా హైకోర్టుకి నాలుగు చలవ పందిళ్లు, అసెంబ్లీకి ఓ పెళ్లిపందిరి- ఇలా వేసుకుంటూ వెళితే తప్పేముంది? ఒకప్పుడు కర్నూలు రాజధాని పటకుటీరాలలో అంటే డేరాలలో నడవలేదా? రాజధానికి భూమి మాత్రం కొదవలేదు. రైతులు వారికిచ్చిన కమ్మర్షియల్ స్థలాల్లో కూడా చక్కటి తాటాకు, కొబ్బరాకు పందిళ్లు వేసుకుని, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు అద్దెలకిచ్చు కుంటారు. దీని మీద విస్తృతంగా చర్చిస్తే అనేక లాభసాటి మార్గాలు, అడ్డదారులు కనిపిస్తాయి. కోటమ్మ గారు వాళ్ల పుట్టింటి నుంచి కొబ్బరి మొక్క తెచ్చి వాళ్ల పెరట్లో నాటింది. రోజూ దానికి నీళ్లు పోసి, ప్రదక్షిణ చేసి, ‘కాశీ విశ్వేశ్వరా! నీకు వెయ్యెనిమిది టెంకాయలు కొడతా’నంటూ మొక్కేది. ఒక్కో వారం ఒక్కో దేవుడికి టెంకాయల మొక్కు మొక్కేది. అది మారాకు తొడిగే సరికి మూడేళ్లు, మాను కట్టేసరికి పుష్కరం పట్టింది. కోటమ్మకి పెద్దతనం వచ్చింది. ఓపిక అయిపోయింది. ఒకరోజు కొడుకుని కోడల్ని పిలిచి, టెంకాయల మొక్కు సంగతి చెప్పింది. ‘‘నువ్వు చెప్పాలా? ఊరందరికీ తెలుసు. అన్నీ కలిపి లక్షన్నర కొబ్బరికాయల పైమాటే. మా నెత్తి మీదకు తెచ్చిపెట్టావ్’’ అని వేష్టపడ్డారు. కోటమ్మ చిన్నగా నవ్వింది. కొడుకు తల నిమురుతూ ‘‘పిచ్చి సన్నాసీ! కొబ్బరిమొక్క కాస్తేనే మొక్కు చెల్లించాలి. లేకపోతే తూచ్!’’ అంది. మన క్యాపిటల్ వాగ్దానాలు కూడా అంతే- మళ్లీ మళ్లీ కాపు దిగితేనే....! వ్యాసకర్త: శ్రీరమణ (ప్రముఖ కథకుడు) -
మార్చి బడ్జెట్ మార్చ్!
అక్షర తూణీరం నెలకి ఇరవై వేలు వచ్చే వేతన జీవి ఉంటాడు. ఆ జీవికి నెల నెలా ఇంటద్దె, ఇతర బిల్లులు, పాలు, సరుకులు, పిల్లల ఫీజులు వగైరా అన్నీ పోను వెయ్యో అరవెయ్యో మిగుల్తుంది. నెలవారీ బిల్లులే గాక అనేక బిల్లులుంటాయి. తప్పనిసరి ప్రయాణాలు, పండుగలూ పబ్బాలు, చుట్టాలు పక్కాలు, బైకు రిపేర్లు తగుల్తాయి. వాటిని తట్టుకోవాలి. ఆ ఉద్యోగి అన్నీ పోను మిగిలిన నాలుగు డబ్బులే తనవిగా భావిస్తాడు. రాష్ట్ర బడ్జెట్ లక్షా ముప్పై అయిదు కోట్లని ఘనంగా మొదలు పెట్టక్కరలేదు. జీతాలు నాతాలు, తరుగులు, ఆమాంబాపతులన్నీ పోను ప్రజోపయోగానికి ఎన్ని రూపాయలు ఖర్చు చేస్తామన్నదే పాయింటు. దాన్ని మూడుముక్కల్లో ఆర్థిక మంత్రి చెబితే చాలు. దానికి అన్ని పేజీల, అన్ని గంటల సుదీర్ఘ సుత్తి చాలా అనవసరం. ఏటేటా రూపాయి బరువు తగ్గి పోతుండటం వల్ల రాశి పెరిగిపోతుంటే, దాన్ని అభివృద్ధిగా సూచించబోవడం మోసం. ప్రతి మార్చిలోనూ బడ్జెట్ మార్చ్ ఒక పెద్ద ఫార్స్. ఈ విన్యాసంలో రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ముఖ్య తంతు. ప్రభుత్వం తలపెట్టిన పథకాలను, ఆశలను, ఆశయాలను, ఆకాంక్షలనూ కుండబద్దలు కొట్టినట్లు నిర్భయంగా గవర్నర్ ప్రసంగపాఠాన్ని వల్లిస్తారు. ఈ వ్యవహారంలోని కర్త కర్మ క్రియలలో ఆయనకు ప్రమేయం ఉండదు. పాపం పుణ్యం శ్లేషార్థాలు ఆయనకు తెలియవు. ఒక రోజు ముందు ప్రసంగ పూర్తి పాఠాన్ని విడివిడిగా టైపు చేసి గవర్నర్ సారుకి స్వయంగా అధికారపక్షం అంది స్తుంది. పోర్షన్ ముందుగా అనుకున్న ఉత్తమ నటుడిలాగా ఆయన వాకింగ్‌కి ముందూ, సాయంత్రం స్నాక్ తర్వాత దాన్ని చదువుకుంటారు. ప్రాజెక్టుల పేర్లూ, విరామ చిహ్నాలు ఒకటికి రెండు సార్లు చూసుకుంటారు. కాన్ఫిడెన్స్‌ని, కాగితాలను చుట్టపెట్టుకుని సభ పోడి యం ముందుకు వస్తారు. ఉభయ సభ లను అడ్రస్ చేసి, ఆనక భావయుక్తంగా ప్రసంగం చదివే ప్రయత్నం చేస్తారు. కొన్ని వాక్యాలు వచ్చినపుడు అధికార సభ్యులు చప్పట్లతో, బల్ల చరుపులతో హర్షామోదాలు తెల్పుతూ ఉంటారు. అప్పుడప్పుడు అమాత్యుల ప్రతిధ్వనులు క్లోజప్‌లో కనిపిస్తాయి. ముఖ్యమంత్రి గంభీరముద్రతో గర్వాన్ని దిగమింగుతూ ఉంటారు. స్క్రిప్టుని రచించింది, నగిషీలు చెక్కిందీ వారే! అయినా ఏమీ ఎరగనట్టు అప్పుడే విని తెలుసుకుంటున్నట్టు హావభావాలను సభ్యులు ప్రదర్శిస్తారు. మొత్తం మీద ఈ నాటకాన్ని టీమ్ స్పిరిట్‌తో రక్తి కట్టిస్తారు. సభల ద్వారా రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేసిన గవర్నర్ గారికి అధికార లాంఛనాలతో రాజ్‌భవన్‌లో దిష్టి తీస్తారు! మర్నాడు మరో అంతర్నాటకానికి తెర లేస్తుంది. గవర్నర్‌కి సభ్యులంతా ధన్యవాదాలు చెప్పడం. ఇదొక ప్రహసనం. విపక్షం ససేమిరా అంటుంది. ప్రసంగం ఓపిగ్గా విన్నందుకు మాకే థాంక్స్ చెప్పాలని పట్టుబడతారు. హిజ్ మాస్టర్ వాయిస్‌గా మాట్లాడిన గవర్నర్ ప్రసంగంలో పస లేదంటారు. సరిగ్గా ఇలాంటి చోద్యమే ఢిల్లీ పార్లమెంట్ హాల్లోనూ జరుగుతుంది. పాపం అకారణంగా దేశ ప్రథమపౌరులను ఏటా ఒకసారి న్యూనత పరచడం ఏమాత్రం భావ్యం కాదు. పెద్దలు ఆలోచించాలి. ధన్యవాదాలు వద్దు, దాష్టీకాలు వద్దు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు, శ్రీరమణ) -
పునరేకీకీకీకరణ
అక్షర తూణీయం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో, తమిళనాడులో సేవా కాంక్ష కట్టలు తెంచుకుని రూలింగ్ పార్టీవైపు వురకలు లేస్తోంది. ‘‘పవర్’’ పెద్ద అయస్కాంతం. ఆకర్ష్ మంత్రం పఠించక పోయినా లాగేస్తుంది. అంతా అనుకోవడంలో ఉంటుంది. ‘‘అమ్మాయి లేచి పోయింది’’ అంటే ఒకలా ఉంటుంది. అదే ‘‘అమ్మాయి వయసొచ్చిందని చెప్పకనే చెప్పింది’’ అంటే శ్రావ్యంగా వినిపిస్తుంది. ఏ మాటవాడినా ఫలితాలు, పర్యవసానాలు ఒకటే. ప్లేటు ఫిరాయించారు, కండువాలు మార్చారు, వలసల బాట పట్టారు, దూకారు, జారిపోయారు, తీర్థం పుచ్చుకున్నారు లాంటి మాటలు జంప్ల వేళ వాడుతూ ఉంటారు. ఈ పరిభాష అంత యింపుగా వినిపించదు. కేసీఆర్ వాడుకలోకి తెచ్చిన ‘‘క’’ భాష బావుంది. పునరేకీకరణ! చాలా హుందాగానూ, అయోమయంగానూ వినవస్తోంది. అసలు అంకితమైతే పునరంకితం ప్రసక్తి వస్తుంది. ఏకీకరణ జరిగి ఉంటే పునరేకీకరణ పదం పుడుతుంది. ఏ ‘కరణం’ అయితేనేమి సమీకరణం మారింది. మిత్రులు ప్రగతిబాటలో రాళ్లెత్తడానికి గులాబి కండువాలు చుట్టు కుంటామంటున్నారు. పూటకో కారుడిక్కీడు కండువాలు కొత్త మెడల్లోకి వెళ్తున్నాయి. రాష్ట్రం పురోగమిస్తున్న ‘‘వాసన గుబాళిస్తోంది’’. అదే ‘‘గబ్బుకొడుతోంది’’ అంటే అస్సలు బావుండదు. మిత్రలాభం కథ ఒకటుంది. చెరువు క్రమక్రమంగా ఎండిపోతోందని గ్రహించిన ముందు చూపు గల కప్పలు, నీళ్లున్న చెరువులోకి గంతులేస్తూ వెళ్లిపోయాయి. ఒక బుర్ర తక్కువ తాబేలు అక్కడే బురదలో మిగిలిపోయింది. దానికి మిత్రులైన కొంగలు సాయం చేయడానికి పూను కున్నాయి. ఓ చిన్న కర్రని తమ ముక్కులతో రెండు కొంగలు పట్టు కున్నాయి. ఆ కర్రని గట్టిగా పట్టు కోమని తాబేలుకి చెప్పాయి. ఆ విధంగా తాబే లుతో సహా ఆకా శంలోకి కొంగలు ఎగిరాయి. ఆ దృశ్యాన్ని చూసి అంతా ఆశ్చర్యంతో వినోదిస్తున్నారు. ‘‘ ఆహా! ఈ తెలివి ఎవరిదో కదా’’ అనగా విని, ‘‘నాదే’’ అన్నది గర్వంగా తాబేలు. సీన్ కట్ చేస్తే ‘‘ధబ్’’ మన్న శబ్దంతో నింగి నించి నేలకు పడి పిచ్చిచావు చచ్చింది. అయితే, మన నేతలు నీరెండేదాకా నిలువ ఉండరు. ఉన్నా తాబేలు వలే నోరు తెరవరు. నేలకి దిగి మీడియా ముందు నోరు తెరిస్తే, ‘‘మార్పు నా తీర్పు. దేశమాత ఆదేశం మేరకే ఏం చేసినా’’ అనేస్తారు. మారన్నలంతా పెద్దాయన తలపెట్టిన ప్రగతి పథకాలకు ముగ్ధులై, తాళలేక తట్టుకోలేక తపనతో గోడదూకిన వారే కాని వేరే ఆలోచన లేదు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో, తమిళనాడులో సేవా కాంక్ష కట్టలు తెంచుకుని రూలింగ్ పార్టీవైపు వురకలు వేస్తోంది. ‘‘పవర్’’ పెద్ద అయస్కాంతం. ఆకర్ష్ మంత్రం పఠించకపోయినా లాగేస్తుంది. అంభంలో కుంభం ఆదివారంలో సోమవారమన్నట్టు, చంద్రబాబుకి దిశలు తెల్లారుతున్నాయి. అపోజిషన్ వాళ్ల ఎమ్మెల్యేలకి లేని రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. పదవీకాలం గట్టిగా రెండేళ్లుంది. ‘‘ముప్పై కోట్లు, మూడు టెండర్లూ అంటే టూమచ్. ఆ ధరలే నిజమైతే నేను పదిమందిని తెచ్చి టీడీపీలో కట్టేస్తా. నాకు టెన్ పర్సెంట్ యిస్తారా?’’ అంటూ పార్టీ ఆఫీస్‌కి ఓ బ్రోకర్ ఫోన్ చేశాడని వినికిడి. ఇలాంటి కప్పలకి శాసనసభలో వేరే బెంచీలు కేటాయించాలి. జనం వారిని ఎప్పుడూ గుర్తించి గుర్తుపెట్టుకునేలా చూడాలని ఒక మేధావి సూచించాడు. జరిగే పనికాదు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు : శ్రీరమణ) -
ఇద్దరూ వాగ్దాన కర్ణులే!
కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లను, మంచినీళ్లని నమ్మారే కానీ ప్రభుత్వ బడులలో అయ్యవార్లను నియమిస్తామని గాని, దవాఖానాల్లో వైద్యమందేట్లు చూస్తామని గాని కోతలు కొయ్య లేదు. అదే 99 వైపు పరుగులు తీయించి పరువు నిలిపింది. తొంభై తొమ్మిది ఒక తమాషా సంఖ్య. వంద సంఖ్య పూర్ణత్వాన్ని ధ్వనింపచేస్తుంది. 99లో ఒక రాజసం ఉంది. దీనికి ఒక్కటి కలిస్తే చాలు- వంద, వెయ్యి, పదివేలు, లక్ష అయిపోవడానికి. కొన్ని సార్లు ఈ తమాషా సంఖ్య భలే ఉపయోగపడుతుంది. వాహనంలో వంద లేదా అంతకు మించి ప్రయాణికులను ఎక్కించరాదు అనే నిబంధన ఉంటే, తొంభై తొమ్మిదితో సరిపెడతారు. మొత్తం సొమ్ము లక్ష రూపాయలైతే విధిగా చెక్కు ద్వారా చెల్లించాలని రూలు ఉంటుంది. అప్పుడు, ఐదు తొమ్ముదుల లక్కీ నెంబర్‌తో చెక్కు రాసి రూల్‌ని గౌరవిస్తారు. ఒకానొక సన్నివేశంలో సుయోధనుడు, ‘‘... నూర్గురు సహోదరులకు అగ్రజుండనై’’ అంటూ వాపోతాడు. నిజానికి రాజరాజుకి సహోదరులు తొంభైతొమ్మిది మందే! వత్సల సహోదరి. మరీ కచ్చితంగా పోకుండా రౌండ్‌ఫిగర్ చెప్పి బాధపడ్డాడు. ‘‘తొంభైతొమ్మిదిపాళ్లు అవుతుంది’’ అంటే అయిపోతుందనే అర్థం. కాకపోతే ఆ ఒక్కపాలు దేవుడిమీద భారం వేస్తారు. వచ్చాడు, దిగాడు, సాధించాడన్నట్టుగా కేసీఆర్ కోటలో పాగా వేశారు. కోటమీద జండా ఎగరేశారు. అందరం ఇక్కడికి వలస వచ్చిన వాళ్లమే! ఏం భయపడొద్దు. మిమ్మల్ని కడుపులో పెట్టుకు చూసుకుంటానని ఆంధ్రోళ్లకి అభయం ఇచ్చారు. పరమ శివుణ్ని కడుపులో పెట్టుకున్న గజాసురుడు గుర్తుకు వచ్చాడు. ఎన్నికల్లో వాగ్దా నాలు అందరూ చేస్తారు. ఎవరో ఒక్కరివే పేలాల్లా పేల్తాయ్. ఓట్లుగా రాల్తాయ్. కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్లు పంట గడి చేరడానికి ఊతమి చ్చింది. మంచినీళ్లని నమ్మారు. అంతేగాని నగ రంలో వీధి కుక్కల బెడ దను తొలగిస్తామని కాని, ప్రభుత్వ బడులలో అయ్య వార్లను నియమిస్తామని గాని, దవాఖానాల్లో వైద్యం అందేట్లు చూస్తా మని గాని లేనిపోని కోతలు కొయ్యలేదు. అదే 99 వైపు పరుగులు తీయించి పరువు నిలిపింది. తెలుగుదేశం తొలి అంకెతో సరిపెట్టుకుని భంగపడింది. దేశాన్ని పాలిస్తున్న కమలం గుప్పెడు కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సభలు, సమావేశాలు, అధిక ప్రసంగాలు, రోడ్‌షోలు చేసినా బూడిదలో పన్నీరుగా, అడవి గాచిన వెన్నెలగా మిగిలాయి. ముప్పవరపు ముప్పతిప్పలు పడ్డా- నొప్పులు రొప్పులు తప్ప చేర్పుకూర్పుల నేర్పుని జనం చప్పరించారు. చంద్రబాబు యువరాజుని రంగంలోకి దింపారు. ఇంకేముంది సొంత భజన కత్తులు ‘‘చినబాబు అరంగేట్రం! ప్రమోదంగా ప్రసంగం! వాక్కులు వడగళ్లు! పలుకులు పకోడీలు!’’ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. తీరా ఫలితాలు వచ్చాక’’ ఐరన్ లెగ్’’ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. బాబుకి అంత సీన్ లేదంటున్నారు. తెలుగు సీఎంలిద్దరికీ వాగ్దాన కర్ణులుగా మంచిపేరుంది. రాజకీయాల్లో ఎవరు ఓటర్లని నమ్మించి బుట్టలో వేశారన్నదే ముఖ్యం. ఆవు మాట నమ్మి పులి దాన్ని వదిలేసిందని తెలిసిన ఓ ఎద్దు అలాగే నమ్మించబోయింది. పులి అడవి దద్దరిల్లేలా గాండ్రించి, నిన్ను వదల.. నేన్నీకు గాడిదలా కనిపిస్తున్నా కదూ.. దూడకి పాలిచ్చి వస్తానంటే నమ్మేంత దద్దమ్మలా ఉన్నానా...’ అంటూ పంజా విసిరింది. అందుకని ఎజెండా కథలు వినసొంపుగా ఉండాలి. ఆసక్తికరంగా చెప్పగలగాలి. అప్పుడు తొంభై తొమ్మిది పాళ్లు విజయం వరిస్తుంది. లేకపోతే ఒక్కటితో ఆగిపోతుంది. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ -
ఇప్పుడేమంటారు మహాశయా!
‘చెవి కోసుకోవడం’ మన అచ్చ తెలుగు జాతీయం. అందుకని ఇక్కడ చెవి కోసుకోవడమంటే, ఫలితాలు వినడానికి ఆసక్తి చూపుతాననే అర్థంలో గ్రహించి, పుట్టుకతో వచ్చిన ఆయన చెవులను చెక్కు చెదరక పోనీయడం మంచిది. చివరకు ఇలా జరిగింది! ఆఖరికి ఇలాగే జరిగింది! అనుకున్నంతా అయింది! - ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏకవాక్య విశ్లేషణ ఈ మూడింటిలోనే ఉంటుంది. ఎన్నికలు కూడా యుద్ధనీతిని అనుసరించి నడుస్తాయి. కాకపోతే, రణరంగంలో రెండే పక్షాలుంటాయి. ఎన్నికల పోరులో నాలుగైదు నుంచి పది పన్నెండు పక్షాలు బరిలో ఉంటాయి. ఓటర్లని ఓట్లని చీల్చేస్తూ కొన్ని పక్షాలు శ్రమిస్తుంటాయి. పాపం, వాళ్లు గెలవరు. కాని వాళ్లవల్ల మరెవరో గెలిచేస్తారు. ఇలా గెలుపు ఆశించకుండా చీల్చేసే వారిని ‘శిఖండిగాళ్లు’ అంటుంటారు. వ్యూహాలు ప్రతివ్యూహాలు ఈ రెండు క్షేత్రాల్లోనూ తప్పదు. యుద్ధరంగంలో శక్తిహీనుడు కూడా ఊరికే విజయోత్సాహంతో రంకెలు వేస్తుంటాడు. అవతలివాడిని మానసికంగా దెబ్బతీయడానికి ఇదొక యుద్ధతంత్రం. ఎన్నికల క్షేత్రంలో కూడా అంతే. డిపాజిట్లు రావని తెలిసి కూడా పటాటోపపు ప్రసంగాలు చేస్తుంటారు. శత్రుపక్షాలు అంతా ఒఠిదేనని తెలిసి కూడా భయం నటిస్తూ ఉంటారు. తీరా చూస్తే ఉన్నవారిలో గట్టిగా సగం మంది కూడా ఓట్లెయ్యరు. అందులో కొంతభాగం దొంగ ఓట్లు. మరికొంత శాతం కల్తీ బాపతు. అంటే ‘ఔట్ సోర్సింగ్’ అంటే కొనుగోలు చేసినవి. ఈ భాగ్యానికి దీన్నొక ప్రజాస్వామ్యంగా, ప్రజారాజ్యంగా అభివర్ణించుకు మురిసిపోవడం! దీనిపై బెట్టింగులు, శపథాలు ఇదొక తంతు నడుస్తుంది. ఇన్ని సీట్లు రాకపోతే రాజకీయ సన్యా సం చేస్తానని ఒకాయన ప్రతిజ్ఞ చేస్తాడు. మీసాలు తీసేస్తానని మరికొందరు శపథం చేస్తారు. మొన్నటికి మొన్న ఒకాయన చెవి కోసుకుంటానని బహి రంగంగా ప్రకటించారు. నారాయణ! నారాయణ! ఈ చిన్న విషయానికి ఇంతటి ఘోర ప్రతిజ్ఞలు అవసరమా? అయితే ఒకటి, దీన్ని మరీ అంత మాటకి మాటగా తీసుకుని కత్తులు నూరి సిద్ధం చెయ్యక్కర్లేదు. ‘చెవి కోసుకోవడం’ మన అచ్చ తెలుగు జాతీయం. ‘సంగీతమంటే చెవి కోసుకుంటాడు’ అంటాం. ఎదుటివారి గొడవలంటే చెవి కోసుకుంటాడు! ఇలాంటి ప్రయోగాలున్నాయి. అందుకని ఇక్కడ చెవి కోసుకోవడమంటే, ఫలితాలు వినడానికి ఆసక్తి చూపుతాననే అర్థంలో గ్రహించి, పుట్టుకతో వచ్చిన ఆయన చెవులను చెక్కు చెదరక పోనీయడం మంచిది. పైగా ప్రజా హక్కుల కమిటీ చూస్తూ ఊరుకుంటుందా? ఐచ్ఛికంగా చెవి కోసుకోవడానికి సిద్ధపడ్డా ఊరుకోరు గాక ఊరుకోరు. ఆనాడు యుద్ధ రంగాల్లో కూడా ఇలాంటి భీషణ ప్రతిజ్ఞలుండేవి. సాయంత్రంలోగా సైంధవుణ్ణి చంపుతానని, లేకుంటే శిరసు ఖండించుకుంటానని అర్జునుడు ప్రకటించాడు. అది కృష్ణుడి పీకల మీదకి వచ్చింది. సూర్యుడికి చక్రం అడ్డువేసి బామ్మరిదిని రక్షించుకున్నాడు. అంతపని అవసరమా? కృష్ణుడు దివ్య దృష్టితో సైంధవుడికి వేరెబౌట్స్ తెలుసుకుంటే అయిపోదూ! ఒక్కోసారి దేవుళ్లు కూడా కొన్ని తమాషాలు చేసి, వార్తల్లోకి ఎక్కుతుంటారు- మన పొలిటీషియన్స్లాగా! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇదొక పండగ... ఈవెంట్
శ్రీరమణ.. పరిచయం అక్కర్లేని పేరు. ‘మిథునం’ కథా రచయితగా... రాజకీయాలపై ‘అక్షర తూణీరం’ పేరున సంధిస్త్తున్న వ్యంగ్య వ్యాసాల రచయితగా.. ప్రముఖ సంపాదకుడిగా అందరికీ సుపరిచితులు. విజయవాడలో జరుగుతున్న 27వ పుస్తక ప్రదర్శనకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా తన అనుభవాలు పంచుకున్నారు. ఆ వివరాలు.. ఏ మార్పూ లేదు పుస్తక మహోత్సవం ప్రారంభమైన నాటి నుంచి.. అంటే 27 ఏళ్లుగా నేను బుక్ ఎగ్జిబిషన్‌కు వస్తున్నా. ప్రదర్శన మొదట్లోనే పెద్దస్థాయిలో ప్రారంభమైంది. మొదటి సంవత్సరం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. అదే స్థలంలో కొనసాగుతోంది. గతంలో కోల్‌కతా బుక్ ఫెస్టివల్‌కు ఎక్కువగా వెళ్తుండేవారు. కంప్యూటర్, ఇంటర్నెట్ లేనిరోజుల్లో ఆంగ్ల పుస్తకాల కోసం కోల్‌కతానే వెళ్లాల్సి వచ్చేది. విజయవాడలో పుస్తక ప్రదర్శన మొదలైన తర్వాత ఇంగ్లిష్ పుస్తకాల స్టాల్స్ వచ్చాయి. ఈ ప్రదర్శన కోల్‌కతా స్థాయిని దాటిపోయింది. హైదరాబాద్, మద్రాస్ నగరాల్లోనూ బుక్ ఎగ్జిబిషన్లు జరుగుతున్నాయి. విజయవాడలో జరగటం వల్ల చుట్టుపక్కల గ్రామాల వారికి ఇదొక పండుగలా, ఈవెంట్‌లా అనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబాల వారు ఏడాదిపాటు డబ్బులు దాచుకుని ప్రదర్శన ప్రారంభం కాగానే పుస్తకాలు కొంటున్నారు. సకుటుంబ సపరివారంగా.. చాలామంది ముందుగా ఈ ప్రదర్శనకు వచ్చి ఎగ్జిబిషన్ అంతా తిరిగి ఏయే స్టాల్లో ఏయే పుస్తకాలు ఉన్నాయో చూసి రెండోసారి వచ్చి పుస్తకాలు కొంటున్నారు. వచ్చిన వాళ్లెవరూ ఉత్తి చేతుల్తో వెళ్లడం నేను చూడలేదు. నిఘంటువుల వంటి ఖరీదైన పుస్తకాల మీద వచ్చే పదిశాతం డిస్కౌంట్ వారికి ప్రత్యేక ఆకర్షణ. సాధారణంగా ఏ ప్రదేశానికీ సకుటుంబంగా వెళ్లడం సాధ్యపడదు. అటువంటిది ఇక్కడకు సకుటుంబంగా వస్తారు. సీనియర్ సిటిజన్లు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఏనాడో కలుసుకున్న పాత మిత్రులను ఇక్కడ కలుస్తుంటాను. కళా వేదికలు ప్రత్యేకం పుస్తక ప్రదర్శనలోని వేదికలకు సాంస్కృతిక, సాహిత్య రంగాల్లోని ప్రముఖుల పేర్లు పెట్టడం ప్రత్యేకం. మాలతీ చందూర్, బాపురమణలు, చలసాని ప్రసాద్... ఇలా పలువురు ప్రముఖుల పేర్లు పెట్టి వారిని స్మరించడం ఒక మంచి పని. ఇది కేవలం పుస్తక వ్యాపారం మాత్రమే కాదు. పుస్తకాలకు సంబంధించి ఇదొక స్పృహ. ఇలా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడమంటే మంచి వాతావరణం కల్పించడమే. బాలసాహిత్యం భేష్ నేను గమనించినంత వరకూ ఈ సంవత్సరం బాలసాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలకు ఆదరణ అధికంగా ఉంది. గతంలో వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు ఎక్కువగా కొనేవారు. ఇప్పడు బాలసాహిత్యానికి ఆదరణ రావడం ఆనందంగా ఉంది. పిల్లల కోసం కథలు రాయగలిగిన రచయితలు ఇప్పుడు మళ్లీ మరిన్ని పుస్తకాలు రాస్తారనిపిస్తోంది. బాపురమణలు మద్రాసులో ఉన్నా వీలు చేసుకుని తప్పనిసరిగా ఇక్కడకు వచ్చేవారు. ఓ సంవత్సరం బాపురమణలను వేదిక పైకి పిలిచారు. ‘మేం వేదికలు ఎక్కమని తెలుసు కదా..’ అని వారు సమాధానం ఇచ్చారు. వేదిక కిందే కూర్చుని సమాధానాలు చెప్పమని దగ్గరుండి నేను, జంపాల చౌదరి ప్రేక్షకులతో ముఖాముఖి ఏర్పాటుచేశాం. చాలా సరదాగా సమాధానాలు చెప్పారు. నాకు ఇటువంటి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదో ఈవెంట్ ఎప్పుడు బుక్ ఎగ్జిబిషన్ వ చ్చినా ఎటువంటి కొత్త పుస్తకాలు వచ్చాయా అని చూడటం నాకు అలవాటు. పుస్తక ప్రదర్శన అనేది విజయవాడను గుర్తుపెట్టుకునే పెద్ద ఈవెంట్. 27 ఏళ్లుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు. -
2015 ఆశావహంగా నడిచింది!
సర్‌ప్రైజుల మీద సర్ప్రైజులిస్తూ, తరుచు సెల్ఫీలు దిగుతూ ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నారు ప్రధాని మోదీ. ఒంటె మీద బరువులెక్కించే వారు ఒక పద్ధతిని పాటిస్తారు. ఒంటె కాళ్ల కింద ఇటుకలు పెట్టి అవి చితికేదాకా బరువులు వేస్తారు. అప్పుడు దాని మూలుగు విని ఒక వీశెడు బరువుని భారంగా దించినట్టు నటిస్తారు. వెర్రి ఒంటె హాయిగా నిట్టూర్చి నడక సాగిస్తుంది. ఈ గ్యాసు వార్తలు అవీ వింటుంటే దే శ ప్రజలు వెర్రి ఒంటెల్లా కనిపిస్తున్నారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. 2015 ఎంతో ఆశావహంగా గడిచింది. ప్రస్తుతం ఉమ్మడి క్యాపిటల్ నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాటలన్నీ కలసే ఉంటాయి. ఇద్దరిదీ మాటల్లో ఒకే చాకచక్యం. చేతల్లో ఒకేరకం చాణక్యం. ఒకర్ని మించిన వాగ్ధాటి మరొకరిది. మొత్తం మీద ఇరువురూ శనగలు తింటూ ప్రజల చేత ఉలవలు తినిపించినవారే. వరల్డ్ క్లాస్ సిటీకి శంకుస్థాపన చేశామని ఒకరంటే, ఇప్పటికే భాగ్యనగరం విశ్వనగరం అయిపోయిందని మరొకరు ప్రకటిస్తున్నారు. మొత్తం మీద ఎండమావిలో లేత కొబ్బరి నీళ్లు తాగిస్తున్నారు. ప్రజలు ఒక భ్రమలో ఆ విధంగా ముందుకు పోతావున్నారు. ఇంగో పక్క ప్రతిష్టాత్మకంగా నదుల అనుసంధానం జరిగిపోతావుంది. ఇక్కడ చూస్తే మూసీనది మూడొందల సంవత్సరాల నాటి స్వచ్ఛతతో ప్రవహిస్తోంది. దుష్టపాలనలో ఉమ్మడి రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. క్షాళనకు కంకణం కట్టుకున్నాం. మిషన్ కాకతీయ కేకతీయగా మూడు చెరువుల నీళ్లు తాగించనుంది. నేను టెక్నాలజీకి ఆది పురుషుణ్ణి. కరెంటు తీగెల్లోంచే సర్వస్వం సరఫరాకి ఆలోచిస్తున్నాం. కరెంటు, నీళ్లు, గ్యాస్ , చానల్స్ సర్వం ఒకే గొట్టం ద్వారా అందేటట్టు ‘ఏకగొట్ట విధానానికి’ రూపకల్పన చేస్తున్నాం. ఈ బాధ్యత నేను తీసుకుంటున్నానని కూడా మీకు మనవి చేస్తున్నాను. మునుపు, వచ్చే అయిదేళ్లలో ఎంతమంది కొత్త ఓటర్లు జాబితాలోకి వస్తారని లెక్కలు వేసేవారు. ఇప్పుడు ఎంత మంది మందుబాబులు వచ్చి కలుస్తారని గణాంకాలు వేస్తున్నారు. ఎందుకంటే సర్కార్లన్నీ లిక్కరే ఇంధనంగా నడుస్తున్న మాట నిజం. ఇవాళ ఓటు హక్కుని మించిందీ మందు హక్కు. వయసొచ్చిన వారికి ఓటు నిజంగానే ప్రాథమిక హక్కా? అయితే అన్ని లక్షల మంది మహానగర ఓటర్లు జాబితా నుంచి ఎలా చెరిగిపోయారో తెలియదు. అయినా ఎలా, ఎందుకు, ఎవరు చెరిపేశారన్న సంగతి తేల్చరు. ఏమీ వర్రీ అవద్దు, మళ్లీ ఓటు భిక్ష పెడతామని హామీ ఇస్తున్నారు. సూర్యోదయం అయింది గాని మా బతుకుల్లోకి వెలుగు రాలేదని బడుగు ప్రజ వాపోతోంది. ఆధార్ కార్డ్ మీ జేబులో ఉంటే మీ జీవితం పండినట్టే అన్నారు. బ్యాంకు ఖాతాలు తెరవండి. అవి మీ పాలిట అక్షయ పాత్రలవుతాయన్నారు. స్వచ్ఛ భారత్ తో అంతా మహాశుభ్రమన్నారు. మనసులో మాటలో మానసిక విశ్రాంతి అన్నారు. సర్‌ప్రైజుల మీద సర్ప్రైజులిస్తూ, తరుచు సెల్ఫీలు దిగుతూ ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నారు ప్రధాని మోదీ. ఒంటె మీద బరువులెక్కించే వారు ఒక పద్ధతిని పాటిస్తారు. ఒంటె కాళ్ల కింద ఇటుకలు పెట్టి అవి చితికేదాకా బరువులు వేస్తారు. అప్పుడు దాని మూలుగు విని ఒక వీశెడు బరువుని భారంగా దించినట్టు నటిస్తారు. వెర్రి ఒంటె హాయిగా నిట్టూర్చి నడక సాగిస్తుంది. ఈ గ్యాసు వార్తలు అవీ వింటుంటే దే శ ప్రజలు వెర్రి ఒంటెల్లా కనిపిస్తున్నారు. (వ్యాసకర్త శ్రీరమణ ప్రముఖ కథకుడు) -
చండీదేవి కాదు వాగ్దేవి...!
చండీయాగం పుణ్యమా అని మీడియా వారు వైదిక పరిభాషని పుక్కిట పట్టేశారు. కనీసం రెండువందల కొత్తమాటలు పత్రికలకెక్కించి, పాఠకుల్ని పునీతుల్ని చేశారు. ఎందరో స్వాముల పేర్లు, దేవీదేవతల పేర్లు, కైంకర్యాలు... ఇలా ఎన్నని చెప్పడం! ఆమె చండీదేవి కాదు మీడియా పాలిట వాగ్దేవి. ‘‘మహాద్భుతం... నైమిశను తలపిస్తోంది!’’ అన్నాడొకాయన. శ్రోత నోరు చేసుకుని, ‘‘మీకు బుద్ధీ జ్ఞానం ఉందా? శౌనకాది మహామునులు సత్రయాగం సాగించిన నైమిశలో ఏముంది, ఒక్క హోమ గుండం తప్ప. తమ బొంద... ఇక్కడ లాగా మైకులు, గొట్టాలు ఉన్నాయా? టీవీ కెమెరాలు న్నాయా? ఇంత లైటింగ్ ఉందా? కవరేజీ ఉందా? అంటూ ఉతికి ఆరేస్తే మొదటాయన నిర్ద్వంద్వంగా లెంపలేసుకున్నాడు. అతడనేక యాగముల నారియు తేరిన అను భవజ్ఞుడు. యాగం అంటే కల్వకుంట్లకి వెన్నతో పెట్టిన విద్య. పైగా యజ్ఞాలన్నీ ఆయనకు ఫలిం చాయి కూడా. ఈ మహాయజ్ఞం ఫలితాలు 2016లో గాని బయటపడవు. కొందరంటారూ-ఇదంతా ఎవరో స్వప్రయో జనం కోసం తయారుచేశారు గానీ ఫాయిదా ఉండ దని. మరికొందరు సైన్స్ చదువుకున్న వాళ్లు మంత్రా లకు చింతకాయలు రాల్తాయా అని సూటి ప్రశ్న వేస్తున్నారు. చరిత్ర బుక్స్ చదివిన వాళ్లు గతంలో జరిగిన యజ్ఞయాగాది క్రతువులను తారీకుల వారీగా వల్లించి, వాటివల్ల ఒనగూడిన ఫలితాలు ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. లెక్కలొచ్చిన వాళ్లు యాగద్రవ్యాలను తూనికలు కొలతలు వేసి, మార్కెట్ ధరతో లెక్కించి గ్రాండ్ టోటల్స్ తలోరకంగా చెబుతున్నారు. కెమిస్ట్రీ మేధావులు ఇలా అగ్నికి నానావిధ ఫలపుష్ప ఘృత వస్త్రాదులు సమర్పించినందువల్ల, అక్కడ పుట్టే పొగ ఎలాంటి శక్తివంతమైన మేఘాలనూ సృష్టించలేదని లేబోరేటరీ ప్రయోగాల ద్వారా తేలిందని వాదిస్తున్నారు. కానీ జ్ఞానవూడలను వెండిగడ్డాలుగా ధరించిన పెద్దలు మాత్రం, ‘‘మీ ప్రయోగాలలో వేదమంత్రాలు కలి శాయా?’’ అని నిగ్గదీస్తున్నారు. మామూలు గడ్డిపరక మంత్ర సహితంగా హోమగుండంలో పడినప్పుడు అది సమిధ అవుతుంది. ఊడలను దువ్వుతూ వారేమన్నారంటే, మీరిప్పుడు పది నెంబర్లు మీటితే అది కలవాల్సిన వారిని నిద్రలేపి మరీ కలపడం లేదా, అలాగే ఇదీను. ఇ-మెయిల్లో ప్రతి అక్షరం, చిన్న చుక్కతో సహా సరిగ్గా ఉంటేనే కదా అడంగు చేరుతుంది. ఇది కూడా అంతే. అనుదాత్త ఉదాత్త స్వరాలు పకడ్బందీగా, బీజాక్షరాలు సక్రమంగా పడితే ఇవన్నీ చేరాల్సిన వాళ్లకి ఎందుకు చేరవు? ఇవన్నీ సరేగానీ, నాకు ఒకందుకు సంతోషంగా ఉంది. ఈ అయుత చండీయాగం పుణ్యమా అని మీడియా వారు వైదిక పరిభాషని పుక్కిట పట్టేశారు. కనీసం రెండు వందల కొత్తమాటలు పత్రికల కెక్కించి, పాఠకుల్ని పునీతుల్ని చేశారు. ఇవిగాక ఎందరో స్వాముల పేర్లు, దేవీదేవతల పేర్లు, కైంకర్యాలు... ఇలా ఎన్నని చెప్పడం! ఆమె చండీదేవి కాదు మీడియా పాలిట వాగ్దేవి. తెలుగురాష్ట్రాలే కాదు, మొత్తం దేశమంతా ఎర్రవల్లి వైపు చూస్తోంది. ఎర్రవల్లికి బోలెడు చరిత్ర ఉంది. గతంలో అనేక యజ్ఞగుండాలకది నిలయం. అన్ని వేలమంది రుత్విక్కులు రోజుకో రంగు దుస్తులతో రుక్కుల్లా వెలిగిపోవడం బావుంది. కాకపోతే మొదటిరోజు అంతా పసుపుమయం అయ్యేసరికి కొందరికి భయం వేసింది. (వ్యాసకర్త శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
ఒక నూలు మిల్లు కథ
అక్షర తూణీరం ‘ఇలా ఎన్నాళ్లు? నిజం తెలిస్తే...’ అన్నాడు జమిందారు. నందోరాజా భవిష్యతి. నిశ్చింతగా ఉండండన్నాడు కాశీపతి. నీ రుణం తీర్చుకోలేనని పాదాల వంక చూశాడు జమిందారు. కుందేలు సింహానికి ఎదురు తిరుగుతుంది. ఒకచోట మేక పులిపై తిరగబడుతుంది. రాజ గురువులు అలాంటి పోతుగడ్డ లను గుర్తించేవారు. అక్కడ కోటలను కట్టేవారు. చరిత్రలో మన కోటలన్నింటికీ ఇలాంటి స్థల పురాణాలే ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్టికి అమరావతి పుణ్యమా అని పురాణ యుగంలోకి వెళ్లిపోయాం. జీవితమే సఫలమూ.. అని కొందరు, దొరకునా ఇటువంటి సేవ.. అనుకుంటూ మరికొందరు, తమ తమ హోదాల్లో రాజధాని నిర్మాణానికి రాళ్లెత్తుతున్నారు. కొందరు నేనుసైతం ఒక రాయి వేశానంటూ ఈ శతాబ్దపు మహా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. పుట్టమట్టిని, పొలం మట్టిని వేదోక్తంగా సేకరించి తెచ్చి అమరావతి పీఠానికి అమర త్వం సిద్ధింపచేస్తున్నారు. చాలదు, ఇంకా రకరకాల మట్టి నమూనాలు రావాలి. పోరుబందరు నుంచి దోసెడు మట్టి తేవాలి. శాంతి సహనాలను నిక్షిప్తం చేయాలి. పుచ్చలపల్లి, ప్రకాశం, ఎన్.జి. రంగా పుట్టిన ఊళ్లలో మట్టి సేకరణ జరగాలి. ఘంటసాల, ఎస్వీ రంగారావు, సావిత్రి, కన్నాంబ, రేలంగి, కాంచనమాల పుట్టిన ఊళ్ల అజ తెలుసుకోవాలి. సర్వేపల్లి, గిరి, నీలం తప్పదు. వేమూరి గగ్గయ్య, కొంగర జగ్గయ్య, డి.వి. సుబ్బారావు, స్థానం నరసింహారావుల పురిటి గడ్డలను మరిస్తే పాపం. ద్వారం, ఆదిభట్ల (కైలాసం మరియు నారాయణ దాసు), గురజాడ, వేమనల పక్షాన గుప్పెడేసి స్ఫూర్తి నింపాలి. త్యాగయ్య, అన్నమయ్య నడయాడిన చోటి పాదధూళి తక్షణం రావాలి. ఆదిశంకరుడు అవతరించిన కాలడి మృత్తిక తెచ్చారా? విశ్వనాథ, జాషువ, శ్రీశ్రీ, దేవులపల్లి వీరిని మరవద్దు. వివిధ రంగాల ప్రము ఖులని కనీసం అయిదు వేల మందిని గుర్తించి, వారి పుట్టిన మట్టిని తప్పక ఈ పునాదిలో వెయ్యాలి. ఇదే మన తక్షణ కర్తవ్యం. ఇన్ని లక్షల కోట్లతో ఈ మెగా నిర్మాణం సాధ్య మయ్యే పనేనా అని కొందరు నిరాశావాదులు పదే పదే సందేహిస్తున్నారు. కాని ఒక పాజి టివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లా లంటారు మన ముఖ్యమంత్రి. మా ఊరి జమిందారు కథ నన్నెప్పుడూ నూతనో త్సాహంతో ముంచెత్తుతూ ఉంటుంది. మనకి స్వాతంత్య్రం వచ్చిన కొన్నేళ్లకి రకర కాల కారణాలవల్ల జమిందారీలు హరించుకపోయాయి. మా ఊరి జమిందారుకి మాసిన తలపాగా, మీసాలు, వెలిసిన పూసల కోటు మాత్రం మిగిలాయి. వెల్లకి కూడా నోచుకోని లంకంత దివాణంలో బిక్కుబిక్కుమంటూ జమిందారొక్కడు ఉండేవాడు. బరువుగా రోజులు వెళ్లదీ స్తున్న తరుణంలో ఉన్నట్టుండి ఆయన దశ తిరిగింది. దివాణం పూర్వ వైభవం నింపుకోసాగింది. రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ నిజమేంటంటే- కాశీపతి ఊళ్లోకి వచ్చాడు. మా ఊరు వాడేగాని చిన్నప్పుడు కాశీకి వెళ్లి, అక్కడే చదు వుకుని, అక్కడే స్థిరపడ్డాడు. కాశీపతి వస్తూనే జమిం దార్ని పరామర్శించి, ఆయన దీనస్థితికి జాలిపడ్డాడు. ‘ఒకే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’ అని కాశీపతి భరోసా ఇచ్చాడు. దృశ్యాన్ని కత్తిరిస్తే ఇద్దరూ మద్రాసు జార్జిటౌన్ సత్రంలో దిగారు. జమిందారు పరాకుగా మర్చిపోగా మిగిలిన మోకులాంటి బంగారు మొలతా డుని అమ్మి డబ్బు చేశారు. వచ్చేటప్పుడు కూడా తెచ్చిన ఒక తుప్పట్టిన తుపాకీ, రెండు వేట కత్తుల్ని అధిక వెలకు పాత సామాను కొనే పిచ్చాడికిచ్చి నగదు చేశారు. నాలుగు సత్తు కుండీలకు వెండి రాయించారు. ఇద్దరూ ఊళ్లోకి దిగా రు. దివాణానికి ఫేస్‌లిఫ్ట్ ఇచ్చారు. వెండి కుండీలలో మందార మొక్క లు నాటారు. ఒక్కసారి ఊరు నివ్వెర పోయింది. జమిందారు ఏదో బర్మా వ్యాజ్యం గెలిచాట్ట! ఎన్ని కోట్లో వస్తుందట! నూలు మిల్లు పెడ్తాట్ట. ఊరి వారందరికీ పనీపాటా ఇస్తాడంట! పుకార్ల మీద పుకార్లు. వెయ్యి పత్రికల పెట్టుగా కబుర్లు. కాశీపతి చెన్నపట్నంలో సంపెంగ నూనె సీసా కొని చ్చాడు. జమిందారు చాలా ఆనందపడ్డాడు. ఠీవి, దర్పం మళ్లీ మొలకెత్తాయి. ఇది వరకు తోకలు జాడించిన వారు దిగి వచ్చి శిస్తు పాత బకాయిలు చెల్లించారు. భయపడి జిరా యితీ భూముల్ని వదిలేశారు. కాశీపతి జాగ్రత్తగా కథ నడిపిస్తున్నాడు. కబుర్లన్నీ కోట్ల మీదే ఉంటున్నాయి. ‘ఇలా ఎన్నాళ్లు? నిజం తెలిస్తే..’ అన్నాడు జమిందారు. నందోరాజా భవిష్యతి. నిశ్చింతగా ఉండండన్నాడు కాశీ పతి. నీ రుణం తీర్చుకోలేనని పాదాల వంక చూశాడు జమిందారు. ఎంతమాట! నేను రుణపడ్డా. కాశీలో శవా లు మొయ్యడం కన్నా ఇది ఎంతో మెరుగు కదా అన్నాడు కాశీపతి. నాకు తెలిసి 50ఏళ్ల తరువాత కూడా నూలు మిల్లు ఖరారు కాలేదు. అయినా జనం శంకించలేదు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇంక పండగే మిగిలింది!
అక్షర తూణీరం ఎన్నో మహానగరాలు, అద్భుతమైన కోటలు కట్టిన ఘన చరిత్ర గల దేశం మనది. ఇప్పుడు వేల ఎకరాలని బంగారు పళ్లెంలో పెట్టి సింగపూర్‌కో, జపాన్‌కో అప్పగించి, కట్టిపెట్టండని ప్రాధేయపడుతున్నాం. ఇల్లు అలకగానే పండగ అయిందా?’ -ఏనాడు పుట్టిం దోగాని, నిజంగా గొప్ప సామెత. ఇవ్వాళ్టికీ నిత్యనూత నంగా చలామణీ అవుతోంది. నిన్నమొన్న అమరావతి శంకు స్థాపన కోసం బుల్డోజర్లతో పంటభూముల్ని చదును చేస్తుంటే నాకీ సామెత గుర్తొస్తూనే ఉంది. పత్రికలలో ఏర్పాట్లమెంట్స్ తాలూకు వార్తలు చదువుతుంటే, నాటి రాజసూయం ఏర్పాట్లను తలపిస్తున్నాయి. బడ్జెట్ సమర్పణకి కూడా చేయనంత కసరత్తు ఆహ్వానాల రూపకల్పనకు చేస్తున్నారు. అమరావతి మహానగర నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఆహ్వానాలే కాదు, సన్మానాలు కూడా ముడతాయట. పట్టుచీరెలు, పట్టు ధోవతులు, పసుపు కుంకుమలు వెండిపళ్లెంలో పెట్టి భూములందించిన రైతులకు సమర్పిస్తారట. వెండిపళ్లెం అచ్చంగా ఇస్తారో లేదో తెలియదు గానీ పట్టువస్త్రాలు మాత్రం గ్యారంటీ. ‘‘అబ్బా! అయితే వేల చీరెలూ, వేల ధోవతులు సీయమ్ పెట్టే సారెకు కావాలే’’ అని ఒక రైతు ఆశ్చర్యపోయాడు. ‘‘పదేళ్లపైగా ఆప్కోలో గుట్టలు గా పడున్నాయి. ఈ దెబ్బతో ఓల్డ్ స్టాక్సన్నీ వదిలి, గోడౌ న్లు ఖాళీ అవుతాయ్’’ అన్నాడు పేపర్ నాలెడ్జ్ ఉన్న మరో రైతు. పాత సరుకుని వదిలించడంలో మా చంద్ర బాబు అసాధ్యుడని పెద్దాయన తెగ మురిసిపోయాడు. ‘‘ఏంటో... ఓల్డ్స్టాక్ అంటే కొంపదీసి ఈయన ఆ అర్థంలో వాడాడా...’’ అని ఒకరిద్దరు సందేహించారు. అరవై ఏళ్ల క్రితం నాగార్జునసాగర్ వచ్చింది. తర్వాత కాలవలు తవ్వడానికి వందలాది మైళ్ల పొడు గునా కాలవలు తవ్వారు. అందులో చాలా భాగం రైతుల భూములే. ఇష్టంగా, ఐచ్ఛికంగా రైతులు ఇచ్చారు. కాలవలు నేల మీద పారకపోతే ఆకాశంలో పారతాయా అనుకున్నారు. నష్ట పరిహారాలు కూడా గొప్పగా ఏమీ ఇవ్వలేదు. సాగరం వస్తుంది, కరువు తీరిపోతుంది, సన్నబియ్యం తింటామంటూ ఆ రోజుల్లో ‘‘నందికొండ పాటలు’’ జానపదుల నోళ్లలో నానాయి. అప్పుడు కూడా వేలాది ఎకరాలు రైతులు వదులుకు న్నారు. కానీ అప్పట్లో ప్రభుత్వాలు వాళ్లని పట్టుపీతాంబ రాలతో సన్మానించలేదు. మమ్మల్ని నమ్మి మాకిచ్చారని పదే పదే కృతజ్ఞతలు గుమ్మరించలేదు. ఉభయులూ పౌరధర్మం గానే భావించారు. ఇప్పుడీ మహోత్సవానికి ఎన్ని వందల కోట్లు కైంకర్యం చేయనున్నారో తెలియదు. ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. కరువు కాలంలో ఇదంతా అవసరమా అనిపిస్తుంది కొందరికి. కానీ అవసరమే. ఎక్కడా నీటి చుక్క లేదు. పారుతున్న పంట కాలవ లేదు. వీటిని పక్కన పెట్టి, అమరావతి వైభవంలో ప్రజలు మునిగి తేలాలన్నది ఏలినవారి లక్ష్యం. ఎన్నో మహానగరాలు, అద్భుతమైన కోటలు కట్టిన ఘనచరిత్రగల దేశం మనది. ఇప్పుడు వేల ఎకరాలని బంగారు పళ్లెంలో పెట్టి సింగపూర్‌కో, జపాన్‌కో అప్పగించి, కట్టిపెట్టండని ప్రాధేయపడుతున్నాం. తెరవెనుక బాగోతం సామాన్యు లకు అర్థంకాదు. అంతుపట్టదు. నిజానికి సేకరించిన ఎకరాలే క్యాపిటల్‌కి క్యాపిటల్. మన దగ్గర శంకుస్థాప నకి కొట్టాల్సిన కొబ్బరికాయకు కూడా నిధులు లేవు. అయిదు వేల ఎకరాలు అసలు తేనెపట్టు. చుట్టూ పాతిక వేల ఎకరాలూ పురుగుల తుట్టె. వాళ్లేం చేస్తారంటే, అక్క డ చేరి ఆ ఎకరాల్లో అనేక ఆకర్షణలు పెట్టి, అక్కడి భూమిని అంగుళాల లెక్కన అమ్ముకుని సొమ్ము చేసు కుంటారు. ఓల్డ్స్టాక్స్ని వదిలించుకోవడంలో అందరూ సమర్థులే. (వ్యాసకర్త శ్రీ రమణ ప్రముఖ కథకుడు) -
చిరంజీవ... చిరంజీవ!
అక్షర తూణీరం కథానాయకుడుగా చిత్రపరిశ్రమని కొల్లగొట్టారు చిరంజీవి. ఆయన కాలు కదిపితే అశేషప్రజ అడుగులకు మడుగులొత్తారు. ఆయన పోరాట పటిమకు హారతులు ఇచ్చారు. కనకవర్షాలు కురిపించారు. ఇది హాయిగా ఆ కనకాన్నీ, కీర్తినీ నెమరు వేసుకోవలసిన సమయం. అన్నింటినీ చక్కగా జీర్ణం చేసుకోవలసిన సందర్భం. ఆ మధ్య కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు - ‘‘చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకి మూ డో కన్ను’’ అని. నిజానికి మూడో కన్ను మాత్రమే శక్తి వంతమైంది. ఆ రెండు కళ్లూ చూట్టానికీ, చూడకుండా ఉం డటానికీ, బాష్పాలు వదలడా నికీ మాత్రమే పనికొస్తాయి. మూడో కన్ను సందర్భాన్ని బట్టి నిప్పులుముస్తుంది. ప్రళయం సృష్టిస్తుంది. మూడో కన్ను తెరిచాడంటే యిహ ఖతం అని అర్థం. పరిశ్రమ మాట పక్కన పెడితే, రాజకీయాల్లో మాత్రం చిరంజీవి మూడో కన్ను కాలేకపోయాడు. అంతే ఒక్కోసారి- ఒక వూరి కరణం మరో వూరికి వెట్టి అవడం మామూలే. అరవై ఏళ్ల తర్వాత, తీరిగ్గా వెనక్కి తిరిగి చూస్తే- చిరంజీవి హీరోగా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఒంట్లో శిల్పం ఉంది. కంట్లో దీపం వుంది. కథానాయికలను కథోచితంగా, యథోచితంగా అలరించినవాడు. ప్రతి అడుగూ ఆచితూచి వేసిన వాడు. కొంచెం లేటు వయ సులో రాజకీయం లోతులు తెలియక అడుగు పెట్టాడు. నల్లేరు మీద బండినడక అనుకున్నారు. అది పల్లేరు మీద కాలి నడక అయింది. బురద అంటుకుంది గాని సత్కీర్తి అంటలేదు. ఆ రోజుల్లో చిరంజీవిని ‘వెండి తెరకు పెట్టని విగ్గు’గా అభివర్ణించేవారు. ఆడామగా మాడా ఎవరైనా విగ్గుకి తలవంచాల్సిందే కదా. కాసేపు ఫ్లాష్ బ్యాక్‌ని పక్కన పెడితే, కనిపిస్తున్న శకునాలు మార్పుల్ని సూచి స్తున్నాయి. వెంకయ్య నాయుడు ట్వీటర్ కిచకిచల్ని పరిశీ లిస్తే, ఆ భాషలో అంతరార్థాలు వినవస్తున్నాయి. కాం గ్రెస్ కొంపదీసి ఒక వేళ చిరంజీవి భాజపాలోకి అడుగు పెట్టరు కదా. ఓ వేళ వేస్తే గీస్తే అది త్రివిక్రముడి మూడో అడుగు కారాదని ఆశిద్దాం. అట్నించి చూస్తే - చిరంజీవి అవసరం భాజపాకి వుంది. గ్లామరు, గ్రామరు కూడా సరిపోతుంది. సంధి సూత్రాలు, సమీకరణాలు సరిపోతాయి. ఊతకర్రల్ని వదిలించుకుని రాష్ట్రంలో సొంత కాళ్ల మీద నుంచోవాల ని భాజపా ఆశపడుతోంది. ఇట్నించి చూస్తే- ఆద్యతన భవిష్యత్తులో కాంగ్రెస్‌కి మహర్దశ పట్టే అవకాశాలు కని పించడం లేదు. వున్న గడిలో గాలి వెలుతురూ లేదు. ఆశాకిరణాలు పొడసూపడం లేదు. అరవై వయసు ఆలో చించాల్సిన వయసు. ఇంకో తప్పు చేయతగ్గ మజిలీ కాదు. కథానాయకుడుగా చిత్రపరిశ్రమని కొల్లగొట్టారు చిరంజీవి. ఆయన కాలు కదిపితే అశేషప్రజ అడుగులకు మడుగులొత్తారు. ఆయన పోరాట పటిమకు హారతులి చ్చారు. కనకవర్షాలు కురిపించారు. ఇది హాయిగా ఆ కన కాన్ని కీర్తిని నెమరేసుకోవలసిన సమయం. అన్నింటినీ చక్కగా జీర్ణం చేసుకోవలసిన సందర్భం. అందుకు మిగి లిన దినుసులతో పాటు పవర్ అనే లాలాజలం కూడా కలిస్తే చక్కహా వుంటుంది. అరవయ్యవ మైలురాయి మీద కూచుని శివశంకర్ ప్రసాద్ సింహావలోకనం చేసుకుంటున్నారు. అదే సమ యంలో భాజపా వెంకయ్య మెగా ఎరతో గాలాన్ని పట్టు కుని తీరం వెంట తిరుగుతున్నారు. ‘‘సువీ అంటే రోకలి పోటని వేరే చెప్పాలా. హస్తినలో అనేక రాచకార్యాలుం డగా, తోచీ తోచనమ్మ తోడుకోడలు పుట్టింటికి వచ్చి నట్టు స్వయంగా వచ్చి మరీ ప్రశంసలు కురిపించాలా? ట్వీటర్ తరవాత ఎంతటి మందభాగ్యుడికైనా డౌటు రాకతప్పదు. మార్పిడీదారుడు కొన్నాళ్లు వార్తలకి దూ రంగా వుండి పాత చిలువు వదుల్చుకుంటారు. తర్వాత ‘నా లక్ష్యం, నా బతుకు ప్రజాసేవ. పార్టీలు పై కండు వాలు మాసిపోతే వుతుకుతాం. నచ్చకపోతే మారు స్తాం’’ అంటూ అంతరాత్మ ప్రబోధానికి డబ్బింగ్ చెప్పే స్తారు. పై సంగతులన్నీ వూహాగానాలు. దీనికో ప్రత్యా మ్నాయం వుంది. అదేంటంటే చిరంజీవి వున్నచోటే ఉం డిపోవడం. శ్రీరమణ వ్యాసకర్త ప్రముఖ కథకుడు. -
కరువు కాదు కొత్త అనుభవం
(అక్షర తూణీరం) సింగపూర్ ప్రభుత్వం ఉదారబుద్ధితో ఉచితంగా తయారుచేసి, భక్తి ప్రపత్తులతో పుష్కర గోదావరీ తీరాన సమర్పించిన అమరావతీ నగర నీలి పటాన్ని అధినేత విప్పి ప్రదర్శించినప్పుడల్లా-కాశీ బ్రాహ్మడి గొట్టం, పాప పుణ్యాలపై ఆయన ధారాళమైన ప్రసంగమే కనుల కదిలి, చెవుల మెదుల్తూ ఉంటాయి. వెనకటికి సంక్రాంతి పండు గ రోజుల్లో కాశీ కావడితో ఒకాయన మా ఊరు వచ్చే వాడు. కాశీ బ్రాహ్మడు వచ్చా డంటూ మర్యాదగా కూచో బెట్టే వారు. కావడి పొడుగు నా ఒక రేకు గొట్టం జతకట్టి ఉండేది. అందులోంచి పెద్ద పటం విప్పి చేరిన వారి ముందు పరిచేవాడు. హిందీ యాసలో మంత్రాలేవో చదువుతూ, పటంలో బొమ్మ ల్ని వివరిస్తూ కాసేపు అనర్గళంగా ఉపన్యసించేవాడు. అది పాపపుణ్యాలకు, వాటి శిక్షాస్మృతులకు సంబం ధించిన చిత్రపటం. ఏఏ తప్పులకు యములాడు నూనెలో వేపుతాడు, కొరడా దెబ్బలెందుకు పడతాయి లాంటి చిత్రాలు భయపెట్టేవి. పుణ్యాలు, దానధర్మాల వల్ల దొరికే అప్సరసల నాట్యాలు, వారుణివాహిని, పుష్పక విమానం మరో వైపు అలరించేవి. చూస్తున్నం త సేపూ చూపరులు రకరకాల భావోద్వేగాలకు లోన య్యేవారు. కాశీగారు దాన్ని చుట్టచుట్టగానే వారి మనో భావాలు కూడా పూర్వస్థితికి వచ్చేసేవి. క్షణభంగుర మైన వైరాగ్యంలో కలిగిన ఆవేశపు పొంగులు చల్లారేవి. పుట్టెడు ధాన్యం ధారపోద్దామనుకున్న వారు చిట్టె డుతో సరిపెట్టేవారు. తను చూపిన కట్టు కథలకి, వారి ఔదార్యానికి సరికిసరి అనుకుంటూ కాశీ కావడి మరో ఇంటికి కదిలేది. సింగపూర్ ప్రభుత్వం ఉదారబుద్ధితో ఉచితంగా తయారు చేసి, భక్తి ప్రపత్తులతో పుష్కర గోదావరీ తీరాన సమర్పించిన అమరావతీ నగర నీలి పటాన్ని (తప్పు కాదు కదా! ఏమో, బ్లూ ఫిలిం లాగే బ్లూప్రింట్ కూడా ఏమైనా గూడార్థాలు కలిగి ఉంటుం దేమోనని భయం) అధినేత విప్పి ప్రదర్శించినప్పు డల్లా-కాశీ బ్రాహ్మడి గొట్టం, పాపపుణ్యాలపై ఆయన ధారాళమైన ప్రసంగమే కనుల కదిలి, చెవుల మెదుల్తూ ఉంటాయి. ఇక క్షేత్రస్థాయి నిజాలకు వద్దాం. ఆకాశం ఎండి పోయింది. వాన చినుకు లేదు. కార్తెలు కదలి వెళ్లిపోతు న్నాయి. సస్య క్షేత్రాలు ఊసర క్షేత్రాలుగా మారిపో యాయి. గోదావరి, కృష్ణా డెల్టాలలో ఖరీఫ్ నాటు ఏమిచేద్దాం? తాగునీరు కూడా ఇవ్వలేనంటున్న నాగా ర్జున సాగరాన్ని ఏమందాం? గడ్డపారలకు పదును పెడదామా? రాజధానిలో వరుణయాగానికి హోమ కుండాలు సిద్ధం చేద్దామా? బిహార్ ఎన్నికల ఎరగా ప్రధాని భారీ ప్యాకేజీని ప్రకటించగానే ఆంధ్రప్రదేశ్ నేతల ముఖాలు ‘చింకి చాటంత’ అయినాయి. బిహార్‌కే అంతిస్తే, ఇక మన కెంత ఇవ్వాలి? మనమెంత అడగాలి? అనుకుంటూ అంకెలకి కొత్త సున్నాలు కలుపుకుని ఢిల్లీ వెళ్లే ప్రయ త్నంలో ఉన్నారు. ఇది ప్రత్యేక హోదాకు అదనంగా వచ్చే నిధి. అవతలి పెద్దమనిషి సామాన్యుడు కాదు. ‘‘నువ్వు పాడిందానికి నేను తలూపాను. దానికీ దానికీ చెల్లు. విన్నందుకు తంబూరా ఇచ్చి వెళ్ల’’మనే రకం. అదలా ఉండగా వర్షాభావ, దుర్భిక్ష భిక్ష కోసం ఫొటో ల సహితంగా మళ్లీ వెళతారు. మళ్లీ కొత్త ఆశలు, కొత్త చిగుళ్లు చూపిస్తారు. ఆశాభావాలు, ఊహాగానాలు దం డిగా మోసుకుని తిరిగివస్తారు. ఇకపై ఇది వ్యవసాయ శాఖ కాదుట. రైతు సంక్షేమ శాఖట! ‘‘పేరు ఏదైనా దరిద్రం ఒకటేలెండి’’ అని ఒక రైతు నిట్టూర్చాడు. ఇలాంటి వాతావరణ పరిస్థితులలో కొంతైనా ఊరట నివ్వగల ప్రత్యామ్నాయ పంటల గురించి ఏ విశ్వవి ద్యాలయమైనా సూచించగలదా! ఇన్నేళ్ల పరిశోధన ఫలితాలెక్కడ? ఇది దుర్భిక్షం కాదు, కరువు కానేకాదు. ఇదొక ‘‘కొత్త అనుభవం’’అని పేరు మార్చుకుంటే ఆకలి తీరుతుందా? ఈ విపరీత పరిస్థితికి ఒకే ఒక ఫలశ్రుతి ఉంది. ఈ మహా కష్టకాలంలో సామాన్యుడికి ఓదార్పుని ఇవ్వ గలిగింది చీప్ లిక్కర్ ఒక్కటే. నీళ్ల కొరత కారణంగా నీట్ పుచ్చుకుంటారు కాబట్టి అబ్కారీ టార్గెట్లు ముందే పూర్తవుతాయి. (వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
ఉక్కుపాదాలకో కర్మాగారం
ఒక విద్యాలయ ప్రాంగణంలో జరుగుతున్న అమానుషాలను అరికట్టలేని వారు అంతర్జా తీయ ఉగ్రవాదాన్ని నిరోధించగలరా అనిపిస్తుంది. ఏ దౌర్జన్యం జరిగినా ఉక్కుపాదంతో అణచివేస్తాం’’అంటూ ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం మన పాలకులకు ఆనవాయితీ అయింది. కొత్త దుస్తులు, కొత్త పుస్తకాలు... కొత్త కొత్తగా క్యాంపస్‌లో అడుగుపెడతారు. ఎన్నో ఊహల్నీ, ఆశల్నీ వెంట తెచ్చు కుంటారు. వచ్చీరాని రెక్కల్ని చూసు కుంటూ మురిసిపోతుంటారు. విద్యార్థి జీవితంలో ఇదొక అద్భుతమైన దశ. ఆ బంగారు కలల్ని ధ్వంసం చేసి వినోదించే రాక్షస సంస్కృతి రోజురోజుకీ విస్తరి స్తోంది. ర్యాగింగ్ రాక్షసక్రీడను అరికట్టడం అంత కష్టమేమీ కాదు. సామదాన భేద దండో పాయాలను చిత్తశుద్ధితో ప్రయో గిస్తే అడ్డుకట్ట పడకుండా ఉండదు. దుర దృష్టమే మంటే మన పంటచేలల్లో కంచెలు, మంచెలే చేను మేసేస్తుంటాయి. అందుకని వేరే దిక్కుండదు. కళాశాలలో అడుగు పెట్టడమంటే, మిసమిసలాడుతూ నూత్న యవ్వనంలో అడుగుపెట్టడం. మనసు ఆటగుర్రంలా ఉండే వయసు. సీనియర్స్ సరదాగా వారి ని ఆట పట్టించడం వరకూ ఫర్వాలేదు. జూనియర్స్ రకరకాల ప్రాంతాల నుంచి, ఎన్నో రకాల నేపథ్యాల నుంచి వచ్చి ఉంటారు. అప్పటికే క్యాంపస్‌కి పాత కాపులైన సీని యర్స్ తమ వినోదానికో, కాలక్షేపానికో కొత్త వారితో ఆడుకో వడం భరించతగినదే. దానివల్ల పరస్పర పరిచయాలూ, సాన్ని హిత్యాలూ పెరుగుతాయి. కానీ ఈ రాక్షసత్వమేమిటి? ఈ అమా నుష చర్యలేమిటి? పిల్లల ప్రాణాలు తీసే పైశాచిక వినోదమా? ఎవరిచ్చారు వీళ్లకీ హక్కు? ఇవన్నీ ఏళ్లుగా కురుస్తున్న ప్రశ్నలు. పరిష్కారం దొరకని శుష్క ఆవేశం. ఒక విద్యాలయ ప్రాంగ ణంలో, నాలుగు గోడల మధ్యా జరుగుతున్న అమానుషాలను అరికట్టలేని వారు అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని నిరోధించగలరా అనిపిస్తుంది. నిరాశ కలుగుతుంది. ఏ దౌర్జన్యం జరిగినా ‘‘ఉక్కుపాదంతో అణచివేస్తాం’’అంటూ ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం మన పాలకులకు ఆనవాయితీ అయింది. ఉక్కుపాదాలు తయారుచెయ్యడానికి అచ్చంగా ఒక ఫ్యాక్టరీని నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏలినవారికి మనవి చేస్తున్నా. ‘‘కాబోయే విశ్వవిఖ్యాత మహానగరం, ఆంధ్రుల అలకాపురి, బౌద్ధ సంస్కృతి పరిఢవిల్లిన నేల, ఆచార్య నాగార్జునుడి పేర వెలసిన విశ్వవిద్యాలయమే ఈ తీరున అఘోరిస్తే, మిగిలిన వాటి దుర్గతిని ఊహించుకోండి!’’ అంటూ ఒక పెద్దాయన కంటతడి పెట్టాడు. పల్లెటూళ్లో కొత్తగా కాపురానికి వచ్చిన కోడళ్లని పాత కోడళ్లు చాలా ఏడిపించేవారు. ఆ చనువుతో, స్నేహం తో ఆ ఇంటి పద్ధతుల్నీ, ఆ ఊరి సంప్ర దాయాల్నీ కొత్త కోడళ్లకి నేర్పేవారు. వాళ్లు రాటుతేలేలా అరగతీసేవారు. కర్మాగారాల్లో, ఇతర సంస్థల్లో అప్పుడే చేరిన కార్మికులను ఎప్పుడో చేరిన వారు చిన్న చిన్న అవస్థలు పెట్టేవారు. అది సరసంగా శిక్షణ ఇవ్వడంలా ఉండేది. ఒక మంచి సంస్కృతి క్రమేపీ విష సంస్కృతిగా మారిపోయింది. మనం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి, ఈ విద్యా సంవత్సర ఆరంభ తరుణం లోని పత్రికలను తిరగేస్తే- ఇలాంటి వార్తలే కనిపిస్తాయి. బలవ న్మరణాలు, రాలిపోయిన పిందెలు వార్తల్లో ఉంటాయి. ఉక్కు పాదం ప్రతిజ్ఞే కనిపిస్తుంది. అదే వాక్యనిర్మాణం, అంతే ఘాటు గా. సీనియర్ విద్యార్థులారా! భావి భారత పౌరులారా! సహపాటీలను బతకనీయండి. వారి తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చకండి! (శ్రీరమణ వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
తల్లి గోదావరి సేద తీరింది!
అక్షర తూణీరం కోట్లాది మంది పుష్కరస్నానాలు ఆచరించారు. తెలుగు ప్రభు త్వాల ప్రచారం ఫలించింది. కోట్లకు కోట్లుగా తీర్థస్నానానికి తరలివచ్చారు. పెద్దలను భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. ఇదం తా భక్తేనా? కాదన్నారు ఒక మేధావులు. మేధావి అంటే చాలు కదా అనుకోవచ్చు. కాని మేధావి నిత్య బహువచనం. ‘‘ప్రస్తు తం జనంలో ఒక అలజడి, అస్థిరత్వం ఆవరించి ఉన్నాయి. అం దుకని ప్రజలు ఏమాత్రం అవకాశం దొరికినా పక్కకి పారిపోవా లని చూస్తున్నారు. దాని పర్యవసానమే ఇది’’ అంటూ విశ్లేషిస్తు న్నారు. మరికొందరు, ‘‘ఏం లేదండీ! ఇదొక మాస్ హిస్టీరియా’’ అని కొట్టి పారేస్తున్నారు. ఏదైనా రెండువారాల పాటు జనాన్ని వేరే ప్రపంచంలో ఓలలాడించిన మాట వాస్తవం. మా నేత పిలుపుతో జనం తరలి వచ్చారంటున్నారు. మహానేత పిలుపుని అందుకుని మహాజనం మహోత్సవంగా తరలి వచ్చారని సంబరపడుతున్నారు. ఇది పరోక్షంగా తెలుగుదేశం సుభిక్ష పాలనని సమర్థించడమే, ఇది చంద్రబాబు విజయం అంటూ కొందరు కీర్తిస్తున్నారు. నాటకం అయీ కాకుండానే తెరలూ, పూసల కోట్లూ, గదలూ, గెడ్డాలూ మీసాలూ, జుల పాల జుట్లూ మూటలు కట్టే సినట్టు - మీడియా పుష్క రాల సరంజామాని సర్దేసిం ది. పుష్కర పరిభాషని మార్చేసుకుని, సాధారణ జనజీవన స్రవంతిలోకి వచ్చేసింది. ఈ మహా తరు ణాన్ని మార్కెట్ చేసుకున్న వారంతా తమ తమ కలెక్ష న్లను లెక్క చూసు కుంటు న్నారు. రాబోయే కృష్ణా పుష్కరాలకు ఈ అనుభవాన్ని జోడిస్తూ కొత్త ఆలోచనలు చేస్తున్నా రు. ‘‘మూఢ నమ్మకాలను జనంపై రుద్ది నిజాల్ని మభ్యపెడుతున్నారు. ఇది పాలకుల దివాలాకోరుతనానికి సాక్ష్యం. ప్రభుత్వం మూడువేల కోట్లు వృథాచేసింది. కనీసం పది వేల కోట్ల ప్రజాధనం గోదావరి పాలైంది. ఈ డబ్బూ, ఈ పనిగంటలూ వెచ్చిస్తే ఒక ఉప యుక్తమైన జలాశయం పూర్తయ్యేది’’ అంటున్నారు గతితార్కికులు. ప్రతి సందర్భానికీ వారొక స్టేట్మెంట్ ఇస్తారు. ఒక ప్రతిపాదన చేస్తారు. ఎవ్వరూ వాళ్లని పట్టించుకోరు. అయినా వాళ్లు ఖాతరు చెయ్యరు. వారి సదాచారాన్ని వారు పాటిస్తూనే ఉంటారు. గురుడు సింహరాశిలోకి వస్తున్నాడు. ఊరికే మనుషులతో మాటా మాటా పెరిగే అవకాశాలెక్కువ, జాగ్రత్త! అంటూ మన్మథ ఉగాది రోజున సిద్ధాంతిగారు హెచ్చరించారు. అందుకే నా జాగ్రత్తలో నేనుంటున్నాను. అయితే, రుషితుల్యులైన మన ప్రవచనకారులు నాలాగా మెలకువగా ఉన్నట్టు లేరు. మొన్న పన్నెండు రోజులూ పూనకాలు వచ్చినట్టు దుయ్యబట్టుకున్నారు. దూసి పోసుకున్నారు. మీడియా రేటింగులు పెంచారు. ఇప్పటికే ఇన్ని మతాలు, ఇన్ని శాఖలు, ముప్పదిమూడు కోట్ల దేవుళ్లతో సామాన్యులు సతమత మవుతున్నారు. అసలే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న మూఢమతులకు దారి చూపాల్సిన వారే పరస్పరం ‘‘మట్టి’’ జల్లు కుంటుంటే ఇక దిక్కెవరు? పుష్కరాల ఆఖరిరోజు గోదావరి తీర దేవుళ్లంతా ఒకచోట చేరారు. ఈ పర్వంలో వారి వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మహర్దశ పట్టిన దేవుళ్లను మిగతా వారు అభినందించారు. పుష్కరాలకు వలస వచ్చిన వెంకటేశ్వరస్వామి కూడా అక్కడకు వచ్చి చేరారు. ‘‘తీర్థప్రజ వచ్చి, గంటల తరబడి వేచి, మా దర్శనం చేసుకువెళుతుంటే ఓ గొప్ప అనుభూతి కలిగింది. శ్రీనివాసా! నీ వైభవం, నీ భోగం ఏ స్థాయిదో మాకు బోధ పడింది!’’ అంటూ సాటి దేవుళ్లు వేనోళ్ల పొగిడారు. దేనికైనా పెట్టిపుట్టి ఉండాలని అభిప్రా యపడ్డారు. ఇంతలో ముత్తైవులా గోదావరి మాత అక్కడకు వచ్చింది. అంతా సవిన యంగా నమస్కరించి స్వాగతం పలికారు. ‘‘అలసిపోయావా?’’ అని అడిగారు. ‘‘లేదు, నా బిడ్డల స్పర్శతో సేద తీరాను!’’ అన్నది మాత గోదావరి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు). -
ఇదొక ఏకగ్రీవ తీర్మానం!
అక్షర తూణీరం అలా మొదలైంది.. కొందరు దిష్టి దెబ్బ తగిలిం దన్నారు. మరి కొందరు ప్రభు త్వ వైఫల్యం అన్నారు. ఇంకొం దరు అధికారుల నిర్లక్ష్యంగా అభివర్ణించారు. నెపం ఏదైతేనే మిగాని దీని విలువ ముప్ఫై నిండు ప్రాణాలు, కొన్ని అంగ వైకల్యాలు. ‘‘నీవే కారణమింతకు...’’ అంటూ ప్రతి పక్షులు ముఖ్యమంత్రిని ఎత్తిపొడిచారు. పనిలో పనిగా, ఆనవాయితీగా, రాజీనామా చెయ్యాల్సిందేనని డిమాం డ్ చేశారు. చెయ్యక్కర్లేదని వీరికీ వారికీ కూడా తెలుసు. చెయ్యరని ప్రజలకు తెలుసు. ఇటీవలి కాలంలో మనది ప్రజారాజ్యమనే భావన కలగడం లేదు. రాజ్యాలు, రాజులు, రాజ్యాధికారాలు, యివే తలపిస్తున్నాయి. వీవీఐపీలు, వీఐపీలు, ఐపీలు చాలా ఎక్కువ అయిపోయారు. ఎక్కడైనా కావచ్చుగాని కొన్ని చోట్ల అధికుల మనరాదు. తిరుపతి లాంటి దైవ క్షేత్రంలో ‘‘వీవీఐపీ’’ బోర్డులు కనిపించినపుడు కొంచెం నవ్వు వస్తుంది. దైవ సన్నిధిలో ఎవరహో యీ వీవీఐపీ అనిపిస్తుంది. ప్రత్యేక ద్వారాల్లోంచి వందిమాగధులతో సహా క్షణంలో వెళ్లి, గంటసేపు సేవించి, చాలా పుణ్యం మూటకట్టానని మురిసిపోయే వివిఐపిలను చూస్తే జాలేస్తుంది. ఆ ఆర్భాటంలో దేవుడి ముందు నిలబడేది ఆయన గారి అహంకారమే గాని ఆయన కాదు. ఎవరెవరో, ఎవరేమిటో మూలవిరాట్ గుర్తించలేదా? గుర్తించలేకపోతే దేవుడే కాదు. కొండ మీద గుడి కడుతున్నారు. ప్రాకారాలు, గోపురాలు, మండపాలు, రకరకాల చెక్కడాలతో అదొక మహానిర్మాణం. ఆ రోజుల్లో ఆధునిక సదుపాయాలు లేవు. బండరాళ్లని మనుష్యులు, కంచర గాడిదలు, ఏనుగులు కొండమీదికి చేరవేస్తున్నాయి. ఆలయ నిర్మాణం మహా యజ్ఞంగా సాగి పూర్తయింది. రేపటి రోజు ఆలయ మహా కుంభాభిషేకం. సిద్ధాంతులు, స్వాములు, ఆగమ పండితులు ఉత్సవాన్ని పర్యవేక్షిస్తున్నారు. శిలాఫలకంపై ‘‘ ఫలానా రాజు నిర్మించిన ’’ అంటూ బిరుదు నామాలతో సహా చెక్కి అక్షరాలకు బంగరుపూత పెట్టారు. తీరా ముహూర్తం వేళకి ఆ శిలాఫలకంలో వేరే పేరు కనిపించింది. అంతా కలకలం చెలరేగింది. పని చేస్తున్న రోజుల్లో అక్కడ శ్రమించిన గాడిదలకు పచ్చిక మేత అందించి, నీళ్లు తాగించిన ఒక వృద్ధుని పేరు ఆ ఫలకం మీద వెలిసింది! అందుకని నిజానిజాలు దేవుడికి తెలుస్తాయి. పుష్కరాల్లో, విఐపి ఘాట్లను రూపొందించారు. అయితే, ఫలానా ఘట్టంలోనే పుణ్యం పురుషార్థమని సీఎం గారి వ్యక్తిగత సిద్ధాంతులు ధ్రువీకరించారు. ఇక రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? పుష్కర జలాల్లో నేత యోగా నుంచి సినిమా సీన్స్ దాకా చేశారు. సామాన్య ప్రజ ఏమైపోయినా అధికార యంత్రాంగానికి పట్టదు. వాళ్లందరికీ పెద్ద సార్ ఒక్కరే పడతారు. ఇక తర్వాత జరిగిన విషాదాన్ని ప్రత్యక్షంగా చూసి విలపించాం. పుష్కర స్పెషల్ ఆఫర్‌గా ఎక్స్‌గ్రేషియా ప్రాణానికి పది లక్షల చొప్పున ప్రకటించి ముఖ్యమంత్రి తన ఔదార్యం చాటుకున్నారు. ఇలాంట ప్పుడు అపోజిషన్ వారు ఇరవై, పాతికా అంటూ పై పాట పాడతారు. ఇదంతా మామూలే. జరిగిన వైఫల్యాన్ని, విషాదాన్ని మరిపించాలని అటునుంచి కృషి జరుగుతోంది. ఈ మహా విషాదానికి చిహ్నంగా, ప్రాణాలు కోల్పోయిన అమాయకుల స్మృతి స్తూపాన్ని గోదావరి పుష్కర ఘాట్‌లో నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాను. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఏది చెత్త? ఏది కొత్త? మహాత్మా!
అక్షర తూణీరం చెత్త... చెత్త... ఎక్కడ విన్నా ఇదే మాట. ఎక్కడ చూసినా ఇదే మాట. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మోదీ ప్రధాని గా వచ్చాకనే ‘చెత్త స్పృహ’ దేశంలో పెరిగింది. అయితే అన్ని చెత్తలూ వ్యర్థాలు కావు. అన్ని వ్యర్థాలు చెత్తకావు. అసలు చెత్తంటే ఏంటి? దీన్ని అద్వైత సిద్ధాంతానికి అన్వ యించి వింగడిస్తే, చెత్త మూలాలు మనల్ని ఆశ్చర్య పరుస్తాయి. రేడియోని చెత్తగా భావించి అటకల మీద పారేశాం. ‘మనసులో మాట’ అంటూ మోదీ, బ్రదర్ ఒబామా రేడియోలో తెగ మాట్లాడేసుకోవడం విని, అట కల మీంచి దింపి రేడియోల దుమ్ము దులిపాం. ఇప్పుడు పున్నమికీ, అమావాస్యకీ మోదీ రేడియోలోనే మనసు విప్పుతున్నారు. దాంతో చెత్త కాస్తా కొత్తగా మారింది. ‘చెత్త’ సాపేక్షం. అప్పటిదాకా ఒక పార్టీలో కింగ్‌పిన్‌గా ఉన్నాయన పార్టీ ఫిరాయించగానే ఉత్త చెత్త మూట అవుతాడు. అదే చెత్త మూట మారిన పార్టీలో జాకబ్ వజ్రంలా మెరుస్తుంటాడు. ఒక సాములారు ఎదురైతే చెత్త ప్రస్తావన తెచ్చి, అనుగ్రహ భాషణానికి అర్థిం చాను. స్వామి చిరునవ్వు నవ్వి, ఈ సృష్టిలో సత్యం, అసత్యం తప్ప ఇంకోటేమీ లేదన్నారు. ఇంతకీ మీరు సత్యమా, అసత్యమా అంటూ తెగించి అడిగాను. ‘‘అస త్యం’’ అంటూ కదిలారు స్వామి. రూపం నాకు కనిపిం చలేదు. అసలిదంతా నా భ్రమ కావచ్చు, పరమ చెత్త కావచ్చు. కొన్ని చెత్త ఉదాహరణల్ని పరిశీలిద్దాం. చదివేసిన పేపర్లు మనకు పరమ చెత్త. పాత పేపర్ల వ్యాపారికి అదే బతుకు. టన్నుల కొద్దీ తలనీలాలు శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించుకుంటారు. కేశాలను స్వీక రించి, క్లేశాలను తొలగిస్తాడని నమ్మకం. అవి శ్రీవారికి కోట్ల ఆదాయాన్నిస్తాయి. ప్రసిద్ధ సాహితీవేత్త వేటూరి ప్రభాకరశాస్త్రి ఇంటికి ఆయన శిష్యుడు వెళ్లాడు. మాటా మంచీ అయ్యాక శిష్యుడు రాత్రి భోజనం చేశాడు. ఎంగిలి విస్తరి పారెయ్య డానికి ఇంటి వెనక్కి వెళ్లి చీకట్లో చూడక గుంటలో దభేల్ మని పడ్డాడు. గురువు గారు సంగతి గ్రహించి ‘‘మా చెత్తగుంట ఇలా ఒక్కసారి నిండుతుందనుకోలేదోయ్!’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారట. సాహిత్య విష యంలో ‘చెత్త’ని బాగా వాడతారు. జీవితకాలంలో చాలా చెత్త ఉత్పత్తి చేశాడు. ‘అగ్ని దహించలేదు. జల ము హరించలేదు. చెదలారగించలేవు’’ అంటూ హాలా హలం లాంటిదని చెబుతారు. కొన్ని గొప్ప గొప్ప మ్యూజియమ్స్‌లో చాలా ఖరీదైన చెత్త ఉంటుందని ఒక పెద్దాయన అనుభవం మీద చెప్పాడు. నిజానికి చెత్తలోనే వ్యాపారం నడుస్తుంది. ‘‘పాత చెత్త కుక్కర్, చెత్త గ్యాస్ స్టౌ, చెత్త మిక్సీలను సగౌర వంగా స్వీకరిస్తాం. కొత్త వాటిని సమర్పిస్తాం’’ అనే ప్రకటన కనిపిస్తే చాలు. కేక! ఆఖరికి పాత లోఉడుపులు తీసుకురండి, సరికొత్తవి తీసుకువెళ్లండి అనగానే భూకంపం వచ్చినట్టు ఇంట్లోంచి పరుగులు పరుగులు. చెత్తని ఎవ్వరూ భరించరు. పక్కింటి హద్దులో పడేసి చేతులు దులుపుకుంటాం. తిరిగి వాళ్లూ అంతే చేస్తారు. సృష్టిలో ఏ పదార్థాన్నీ సృష్టించలేం, నాశనం చేయలేం. అది మాత్రం సత్యం. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఎక్కడ బాపూ నీ బొమ్మ?
హారతి గోదావరికి ఇవ్వాల్సిందే, దానితో పాటు ఆర్థర్ కాటన్‌కి కూడా ఇచ్చుకోవడం కనీస ధర్మం అన్నారు అక్కడి పురజనులు. ప్రసిద్ధ చిత్రకారుడు బాపు పోయినప్పుడు నివాళులర్పిస్తూ, నిండుసభలో మాట ఇచ్చారు. బాపు విగ్రహం ప్రతిష్టిస్తామని చెబితే పిచ్చి తెలుగువాళ్లు కాబోలని తెగ మురిసిపోయారు. ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలు! అవి ఎట్లాగో ఏమిటో అర్థం కాలేదు. పోల వరం ప్రాజెక్టు మీద పాట! దానికీ, దీనికీ పొంతనేమిటో తెలియరాలేదు. పట్టిసీమ పథ కంపై పల్లవి! అదిప్పుడు అవ సరమా? భక్తి, ముక్తిలకు సం బంధించిన ఈ పుష్కరవేళ ఈ సుత్తి ఎందుకని కొందరు బాహాటంగానే గుసగుసలాడుకున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గోదావరి హారతిని ప్రారంభిస్తూ శంఖా న్ని విజయ సంకేతంగా పూరించారు. అదిరిందన్నాయి పార్టీ శ్రేణులు. అది డబ్బింగు, వెనకాల ఎవరో ఊదార న్నారు గిట్టని శ్రేణులు. హారతి గోదావరికి ఇవ్వాల్సిందే, దానితో పాటు ఆర్థర్ కాటన్‌కి కూడా ఇచ్చుకోవడం కనీస ధర్మం అన్నారు అక్కడి పురజనులు. మూడు యాభైలకు మునుపే కోనసీమ పండితులు ఒక శ్లోకంలో కాటన్ దొరను స్తుతిస్తూ అర్ఘ్యం వదిలేవారట. ఇప్పటికీ కొందరు గోదావరి తీరవాసులు పుష్కరవేళ ఆర్థర్ కాట న్కి కూడా తమ పెద్దలతో బాటు పిండప్రదానం చేస్తా రట. గోదావరిని ప్రసన్నం చేసుకుని ప్రజకు వరప్రదా యినిగా మలచిన మహనీయుడాయన. ఆయనకో పూదండ వేసి, హారతి ఇస్తే పుణ్యం పురుషార్థం. ఆర్థర్ కాటన్ పేరు మీద ‘గోదావరి వాటర్ యూనివర్సిటీ’ని ముఖ్యమంత్రి ప్రకటిస్తారని కొందరు తలపోశారు. ఎం దుకో తలపుయ్యలేదు. నీటి నిర్వహణ, నీటి కాలుష్య నివారణ, జల రవాణా సదుపాయం లాంటి అంశాలపై ఆ విశ్వవిద్యాలయంలో కోర్సులుంటాయి. కావాలంటే జల విద్యుత్తు కూడా కలుపుకుందాం. ఆయన మ్యాన్ ఆఫ్ ఐడియాస్! వాన కురిస్తే, హరివిల్లు విరిస్తే అదంతా తమ చల వేనని చెప్పుకునే స్థాయికి వెళ్లాయి రాజకీయ పార్టీలు. ఆ మధ్య ఒక అరబ్ షేక్ ఏడు నక్షత్రాల హోటల్లో బస చేశాడు. హోటల్ మేనేజర్ వచ్చి, ‘షేక్‌సాబ్! వర్షం చూస్తారా?! వర్షంలో తడుస్తారా?!’ అన్నాడు, సవిన యంగా. షేక్ గారికి వాన అపురూపం కదా! ఆయన ఎగిరి గంతేశాడు. వానలో గెంతులేశాడు. అందుకు హోటల్ వారు భారీగా బిల్లు వేశారు. వాన వెలిసింది. మళ్లీ వెళ్లి, ‘సాబ్! హరివిల్లు చూస్తారా?’ అన్నాడు. చూడ్డానికెంతో చెబితే దాన్ని బట్టి చూస్తానన్నాడు షేక్జీ. అలాగే ప్రజకి కూడా అనుభవం వచ్చింది. ఎగిరి గంతు లెయ్యకుండా ఆచితూచి వేస్తున్నారు. నాకిప్పుడు ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. ఇటు వంటి ప్రతిష్టాత్మక శుభవేళ ఖైదీలకు కొన్ని ‘ఇరువులు’ కల్పించాలి. వాళ్లు సంకల్పితం గానో, అసంకల్పితం గానో తప్పు చేసి ఉంటారు. దానికి శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అంతమాత్రం చేత వారి పెద్దలు ఆకలి దప్పు లతో అలమటించడం న్యాయమా? వారికి శ్రాద్ధవిధులు నిర్వర్తించడానికి వెసులుబాటు కల్పించాలి. క్రతువుకీ, దానధర్మాలకీ కావాల్సిన నిధులు ప్రభుత్వమే సమ కూర్చి పుణ్యం కట్టుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం మన సంప్రదాయాన్నీ, శాస్త్రాన్నీ త్రికరణశుద్ధిగా నమ్ము తున్నట్టయితే, ఖైదీలను వదలాలి. అదే గోదావరి మాత కు అసలైన కర్పూర హారతి. రాజమహేంద్రి గోదావరి తీరంలో నందమూరి తారకరాముణ్ణి కృష్ణుడి గెటప్‌లో నిలుపుతున్నారు. శుభప్రదం, శోభస్కరం. ప్రసిద్ధ చిత్ర కారుడు బాపు పోయినప్పుడు నివాళులర్పిస్తూ, నిండు సభలో మాట ఇచ్చారు. బాపు విగ్రహం ప్రతిష్టిస్తామని చెబితే పిచ్చి తెలుగువాళ్లు కాబోలని తెగ మురిసి పోయారు. అంతా హుళక్కే. ఎక్కడ బాపూ నీ బొమ్మ? (వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
అంతా విచిత్రం
అక్షర తూణీరం అంతా విచిత్రంగా ఉంది. ఏమీ అంతుబట్టడం లేదు. ఏపీ మొత్తం సాలెగూళ్లులా అల్లుకు పోయి ఉంది. కొంద రు యోగా చేస్తున్నారో, శిక్ష అనుభవిస్తున్నారో తెలియరా కుండా మెలికలు తిరిగి కని పిస్తున్నారు. అక్కడ ప్రశ్నార్థ కాలు, ఆశ్చర్యార్థకాలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొన్ని కామాలు, మరికొన్ని చుక్కలు ఇప్పుడే హెలికాప్టర్ దిగు తున్నాయి. సమానార్థకాలు, కాకువు దీర్ఘాలు, చప్ప రింతలు, నిష్టూరాలు, కొన్ని పలకరింతలు, కాసిని పుల కరింతలు పోలీసు వ్యానులో వచ్చి చోటు కోసం కాచు క్కూచున్నాయి. ‘చట్టం తన పని తాను చేసుకు వెళ్తుం ది’- ఇదొక ఆధునిక మహావాక్యం. పీవీ ప్రతిపాదించి దేశం మీదకు వదిలారు. దాని అవసరం, వినియోగం దినదినాభివృద్ధి చెందుతూ, ఆ వాక్యం వర్థిల్లుతోంది. చుట్టం కూడా అంతే, తన పని తాను చేసుకు వెళ్తాడు. తర్వాత ఉండమన్నా నిమిషం ఉండడు. సంభాషణలను చెరపట్టడం మీద చర్చలు నడుస్తు న్నాయి. భారత దేశ రాజ్యాంగాన్ని కూలంకషంగా కాచి వడబోయాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రామాల్లో రచ్చబండలనించి సమస్త మాధ్యమాలూ ఫోన్ ట్యాపిం గ్ మీద చర్చిస్తున్నాయి. ఇతరుల రహస్యాలు వినడం తప్పా, ఒప్పా అనేది ముందు తేలాలి. ఆ తరువాత ఆ మాటల్లోని అవాకుల్నీ చెవాకుల్నీ పరీక్షించాలి. ఒక సారి దిగాక అక్కడిక ధర్మయుద్ధం, అధర్మయుద్ధం అంటూ ఉండదు. పద్మవ్యూహాలూ ఉంటాయి. అశ్వత్థామ హతః కుంజరఃలూ తప్పవు. సైంధవులూ ఉంటారు. శిఖండీ వస్తాడు. శల్య సారథ్యం నడుస్తూనే ఉంటుంది. అంతా బానే ఉంటుంది. పాపం ప్రజల మాటేమిటని ప్రజలు కాక మరెవరన్నా ప్రశ్నించుకున్నారా? ఉపన్యాసాలు, పరస్పర ఆరోపణలు కాకుండా విశేషాలేమన్నా ఉన్నాయా? వెనకటికి ఓ కథ చెబుతారు. భర్త క్యాంపుకి పొరు గూరు వెళ్లాడు. కొన్ని వారాల తర్వాత ఫలానా రోజు వస్తున్నానని ఇంటికి తంతి కొట్టాడు. ఏదో తేడా వచ్చి చెప్పిందాని కంటే ఒకరోజు ముందే దిగాడు. ఇంటికి రాగానే భర్త చూడరాని దృశ్యం చూసి అవాక్కయ్యాడు. ఎలాగో వాక్కు తెచ్చుకుని ‘‘ఏమిటిది, తగునా?’ అని భార్యను ప్రశ్నించాడు. ‘‘ఏదైనా సహిస్తాను గాని మాట తప్పేతనాన్ని నేను భరించలేను. మీరు రేపొస్తానని ఇవ్వాళ రావడం ఘోరం. ఇది దుర్మార్గం. స్త్రీజాతినే అవమానించడం....’’ అంటూ పెద్ద దండకం అందు కుంది భార్య. ఈసారి ఆయన గారు నిజంగానే అవాక్క య్యారు. ఎందుకో ఈ మధ్య ఇలాంటి పాత కథలు గుర్తుకొస్తున్నాయి. నిజానికి ఇప్పుడు తలుచుకోవల్సింది కొత్త కథల్ని. రాబోయే కథలని. అమరావతి ఆధు నిక-ప్చ్ కాదు, విశ్వవిఖ్యాత విశాల నగరంలో ఫోన్ ట్యాపింగ్‌లకు అవకాశం ఉండదు. నిక్షిప్తం అవుతాయి గాని ఆ మాటలు ఏ పైశాచిక భాషలోనో రికార్డ్ అయి ఉంటాయి. ఎప్పుడైనా ఏలిన వారు మాత్రమే దాన్ని స్వార్థానికి గాని, నిస్వార్థానికి గాని వినియోగించుకో వచ్చు. అబ్బో, ఇంకా చాలా మతలబులుంటాయి. అవ న్నీ గోప్యం. చెప్పకూడదు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రా! లేచిరా! గోదారి పిలుస్తోంది రా!
( అక్షర తూణీరం) పుష్కరాలు ఎప్పుడైనా ఒక గొప్ప యీవెంటే. ఎప్పుడో ఎనభై ఏళ్లనాడు వచ్చిన గ్రామఫోన్ రికార్డు, అందులో ‘‘దొడ్డమ్మా పుష్కరాల వింతలూ’’ అనే పాట చాలా మందికి జ్ఞాపకం. పుష్కరాల తీర్థంలో ఎలాంటి మోసాలు జరుగుతాయో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతుందా పాట. మీకు తెలుసా? మన దేశంలో జీవనదులకు ప న్నెండేళ్లకోసారి పుష్కరం వస్తుంది. ఇ ట్లా క్రమం తప్ప కుండా పుష్కరుడు నదులలో ప్రవేశిం చడం కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగు తూనే ఉంది. కావాలంటే మన పాత పంచాం గాలు తిరగేసుకోండి. గంగానదికి పుష్కరం వస్తే అది కుంభమేళా. మనకి ఎప్పుడో పుష్కర సందడి మొదలైపోయింది. ఇది కూడా రాజకీయ సిలబస్‌లో ఒక అధ్యాయంగా తయారైంది. ఇన్ని కోట్లు, అన్ని కోట్ల నిధులు పుష్కరాలకి విడు దల చేస్తున్నామని ప్రకటనలు మొదలై చాలా నిలువెత్తు బొమ్మలతో హోర్డింగ్స్ రూపుదిద్దు కుంటున్నాయి. ’’ముణగండి! ముణగండి!’’ అంటూ తాటికాయంత అక్షరాలతో నినాదం వుంటుంది. పుష్కర స్నానానికి వచ్చేవారు యివి చూసి, ‘‘ఎప్పుడో మునిగాం మళ్లీనా’’ అనుకుంటారు మనసులో. ప్రతి సందర్భాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడం నేటి టెక్నాలజీ అయితే కావచ్చుగాని అది అన్యాయం. పుష్క రం కేవలం హిందూ మతానికి సంబంధిం చిన అంశం. కర్మకాండల మీద, క్రతువుల మీద నమ్మకం, విశ్వాసం వున్న వారు తమ పెద్దలను స్మరించుకునే సదవకాశం. దేవత లకు అర్ఘ్యం యివ్వడం, పెద్దలకు పేరు పేరు నా పిండప్రదానం చేయడం పుష్కర విధిలో ముఖ్యాంశం. పుష్కరాంశలో నది మహా పవి త్రంగా ఉంటుంది కాబట్టి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దాన ధర్మాలు అప్పుడే కాదు ఎప్పుడు చేసినా పుణ్యమే. అయినా అదొక మంచి సందర్భం. పుష్కరాలు ఎప్పుడైనా ఒక గొప్ప యీవెంటే. ఎప్పుడో ఎనభై ఏళ్లనాడు వచ్చిన గ్రామఫోన్ రికార్డు, అందులో ‘‘దొడ్డమ్మా పుష్కరాల వింతలూ’’ అనే పాట చాలా మందికి జ్ఞాపకం. పుష్కరాల తీర్థంలో ఎలాంటి మోసాలు జరుగుతాయో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెబుతుందా పాట. అప్పుడు కూడా ఏటి ఒడ్డున, గోదారి గట్టున బోలెడు వ్యాపారం నడిచేది. క్రమేపీ ఆ పని స్వయంగా ప్రభుత్వాలే చేపట్టాయి. సీసాల్లో గోదావరి నీళ్లని పోస్టాఫీసుల్లో అమ్ముతారట! గంగ తీర్థంతో కాశీ నుంచి చిన్నచిన్న రాగి చెంబులో సీలు వేసిన మూతలలో తెచ్చుకుంటారు. ఆ చిన్న కాశీచెంబు యాత్రకి జ్ఞాపకంగా మిగిలేది. ఇంతకు ముందు రంజాన్ దీక్షల వేళ హలీం అమ్మించారు. దాన్ని మధ్యలో ఆపేశారు. భద్రాచలం సీతారామకళ్యాణం అక్షింతలు, ప్రసాదాలు పోస్టాఫీసుల్లో అమ్మించారు. ఈ క్రమంలో తిరపతి లడ్డు లాభదాయకం. అసలు ఆ ఆదాయం మీదే బతుకుతున్న సర్కార్లకి పోస్టాఫీసుల్లో లిక్కరు అమ్మించాలనే ఆలోచన ఎందుకు రాలేదో?! కోట్లాది రూపాయలు పుష్కర పనులకి ప్రభుత్వాలు కేటాయించడం మంచిదే. చెరువుల నిర్మాణం, సత్రవులు పెట్టడం లాగే నదులకు స్నానఘట్టాలు నిర్మించడం పుణ్యకార్యం గా భావించేవారు. స్తోమతు గల ధార్మికులు ఆ పని చేశారు. ప్రభుత్వం యిప్పుడు వందల కోట్లు విడుదల చేస్తున్నట్టు వూరిస్తోంది. పుష్కర పర్వం ఆరంభం కావడానికి వారం ముందు డబ్బులు బయటకు వస్తాయి. పుష్క రాలు ఎప్పుడు వస్తాయో సర్కార్ల వారికి పన్నెండేళ్ల ముందే తెలుసు. కాని హడావిడిగా గోదావరికి వరద వచ్చిన సందర్భంలో లాగా దీనికి చేస్తారు. అక్కడక్కడి పంచాయతీలకు, మునిసిపాలిటీలకు అప్పగిస్తే వారే చేయించు కుంటారు. పుష్కరాలు కూడా క్యాంపెయిన్‌కి వేదికలు, భోక్తలకు విందు భోజనం. పుష్క రాల సొమ్ముని కైంకర్యం చేస్తే, దప్పికతో మరణిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. తర్వాత వారిష్టం. (రచయిత: శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
శ్రీకారాలు - శ్రీమిరియాలు
పేరడీ రచనకు ఆద్యులు నిన్న మొన్నటి దాకా తెలుగు నేలన ప్రతిధ్వనించిన కొన్ని పద్యపాదాలు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటుంటాయి. ‘‘అల్లుడా రమ్మని ఆదరంబున బిల్వ..., నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు’’ ఇవేగాక పసిబిడ్డబాలాది పాడుకున్న చాలా పద్యాలు రచించిన మహాకవి చిలకమర్తి లక్ష్మీనరసింహం. వందేళ్ల తరువాత చేయాల్సిన ప్రయోగాల్ని, చేపట్టాల్సిన ప్రక్రియల్ని వందేళ్ల క్రితమే చేపట్టారు. దేశభక్తి గేయాలు, గయోపాఖ్యానం లాంటి పద్య నాటకాలు, అనేకానేక ప్రహసనాలను రచించి తెలుగు సాహిత్యాన్ని తెలుగుజాతిని చైతన్యపరిచారు. చిలకమర్తి 1867లో పుట్టారు. టంగుటూరి ప్రకాశంకి సమకాలికులు, ఆప్తులు. చిలకమర్తి రూపొందించిన అనేక పాత్రలను ప్రకాశం ధరించారు. ఆ రోజుల్లో ప్రకాశం స్త్రీ పాత్రలను కూడా ధరించి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో హాస్యం చిలకమర్తితోనే శ్రీకారం చుట్టుకుంది. నూటపాతిక సంవత్సరాల క్రితమే తెలుగులో పేరడీ ప్రక్రియను చిలకమర్తి చేపట్టారు. ‘‘లండను సంకల్పము’’ అనే ప్రహసనంలో లండన్‌లో ఉన్నవాడు సంకల్పం ఎలా చెప్పుకుంటాడో చెప్పారు. ‘‘లండన్ వే స్వాహా, జూశసేస్వాహా, జుహావాదేవశ్య ధీమహే, ధీయో యోనః ప్రబోదయాత్ - మమ ఉపాక్త ధనవ్యయ ద్వారా కాంటినెంటల్ టూర్ సంప్రాప్తర్థం... అఖండ ధ్యేమ్యునద్యాం అంటూ సాగుతుంది. అర్థం లేని ఆచారాలను, వ్యవహారాలను తీవ్రంగా నిరసించారు. మన వ్రతాలు నోముల కథల్లో నైమిశారణ్యం, శౌనకాది మునులు, సూతమహర్షి తప్పక వినిపిస్తాయి. రుషులకు మహర్షులకు వచ్చే ధర్మ సందేహాలకు సూతమహర్షి జవాబులు చెబుతూ ఉంటాడు. ఇదే సంప్రదాయంలో కథ చెబుతూ కొన్ని పేరడీ ప్రశ్నల్ని జవాబుల్ని చిలకమర్తి హాస్యస్నోరకంగా అందించారు. నల్లుల బాధ భరించలేకనే విష్ణుమూర్తి శేషతల్పాన్ని ఆశ్రయించాడట. చాకితోడ జగడాలు పడలేక సిరిగలాడు పట్టుచీరెగట్టి శివుడు తోలు గప్పె, ఛీయని మదిరోసి భైరవుండు చీరపారవేసె అందుకని శివుడు దిగంబరుడైనాడని తీర్మానించారు. భగవద్గీతలో సృష్టిలోని సర్వోత్తమ వస్తువులన్ని నేనేనని చెప్పే ఘట్టాన్ని హాస్యానుకరణ చేశారు. ‘‘వృక్షములలో గంజాయి మొక్కను నేను. జంతువులలో పెద్దపులిని నేను. ప్రాకెడి పురుగులలో పామును నేను. లంచము నేను, లంచమిచ్చిన సొమ్మును నేను, లంచము తెచ్చిన రాయబారిని నేను. ... వేయేల సమస్తం నేను’’ అంటూ పెద్ద జాబితాతో ముగించారు. అతి ప్రాచీనంలోకి వెళ్లి, మూలాలను కదిలించి నవ్విస్తూ చురకలు వేయడానికి పలుకే కాదు ధైర్యం కూడా కావాలి. ఆనాడు చూపిన వ్యంగ్య ధోరణులను చాలామంది అందిపుచ్చుకున్నారు. 1915లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా గ్రంథాలయ వార్షికోత్సవానికి చిలకమర్తిని అధ్యక్షునిగా ఆహ్వానించారు. రావిచెట్టు లక్ష్మీనరసమ్మ గారింట్లో బస ఏర్పాటు చేశారట. ఆ సభలో సరోజిని నాయుడు, సర్ హైదరాలీ సమక్షంలో చిలకమర్తిని సన్మానించారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమానికి పూనిక మాటపాటి హనుమంతరావు. ఏమైనా ఈ బహుముఖ ప్రజ్ఞాశాలిని తెలుగుజాతి ఒకసారి స్మరించుకోవాలి. ఫోర్జరీ! ‘‘నన్ను, నా నడకని, నా నవ్వుని ఫోర్జరీ చేసేస్తున్నాడు. ఆఖరికి నా బతుకుని కూడా ఫోర్జరీ చేసి బతికేస్తున్నాడు’’ ‘‘అదెలాగ?’’ ‘‘నే పెళ్లి చేసుకుంటే వాడూ చేసుకున్నాడు నే కాపరం పెడితే వాడూ పెట్టాడు. నాకిద్దరు పిల్లలు. వాడికీ ఇద్దరు. మొన్నామధ్య విసిగి వేసారిపోయిన నా భార్య నన్నొదిలేసి వెళ్లిపోయింది. విసిగించి వాళ్లావిడ వెళ్లిపోయేలా చేసాడు. ఫోర్జరీ....’’ అంటూ నిట్టూర్చాడు. చెప్పు! డబ్బులు లేక చెప్పులు కొనలేకపోతున్నా. డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా. ఈ సంగతెవరికీ ‘‘చెప్పుకొనలేక’’పోతున్నా. - శ్రీశ్రీ ఫలానా వారి కూతుర్ని, ఫలానా వారి కోడల్ని నాకు గోమయం అంటే తెలియదా అని గోంగూర తెచ్చినట్టు! - తెలుగు నానుడి కాలం ఆ గదిలో గోడగడియారం అయిదు గంటల యాభై రెండు నిమిషాల దగ్గర ఆగిపోయింది. ఇంటి యజమాని వయోవృద్ధుడు. ఆ గదిలోనే పడుకుంటాడు. ఎదురుగా దాన్నే చూస్తూ పొద్దు పుచ్చుతాడాయన. ఆ పాత గడియారాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆగిపోయి, రోజూ రెండుసార్లు మాత్రమే సరైన వేళ చెబుతూ గోడకి అంతుక్కుపోయి ఉందా గడియారం. పెద్దాయన ఓపిగ్గా ఉన్నన్నాళ్లూ దానికి ‘కీ’యిచ్చి నడిపిస్తుండేవాడు. తిరగడానికి, గంటలు కొట్టడానికి రెండు చోట్ల దానికి కీ ఇవ్వాలి. రుతువుని బట్టి లోలకం పొడుగుని సవరించాలి. ఇవన్నీ యజమానికి తెలుసు. ఒక రోజు ఆయన కన్ను మూశాడు. సరిగ్గా అయిదు గంటల యాభై రెండు నిమిషాలకే. దీనికి ఏమైనా శాస్త్రీయ కారణం ఉందా? ఆగిపోయిన వేళ గురించి ఆయన మనసులో ఆలోచన ఉందా? ఏమో, తెలుసుకోవాలి. ఆశాజీవి మన పురాణాలలో వినవచ్చే కామధేనువు, కల్పతరువు చాలా విశిష్టమైనవి. అవి రెండూ యజమాని ఏమి కోరినా ఇస్తాయి. అంటే తరగని వరాలు పెరట్లో ఉన్నట్టే. అందులో ఒకటి జంతువు, మరొకటి వృక్షం. ఇదంతా పురాణం అనేవారు సైతం నిర్మాతల ఊహని మెచ్చాల్సిందే. వాటిని నిగ్రహశక్తికి, సహనానికి సంతృప్తికి పరీక్షలుగా నిలిపారు. కామధేనువు ఏది కోరినా ఇస్తుంది. అట్లాగని అది అధీనంలో ఉన్నవారు పుట్లకొద్దీ బంగారం సంపాయించి నేల పాతర్లు వేయలేదు. కోరితే నవరత్న రాశుల్ని కురిపించగల కల్పతరువుని వజ్ర వైఢూర్యాలకై వేధించలేదు. నిగ్రహం, సంతృప్తి పుష్కలంగా ఉన్నవారి దగ్గరే ఇవి ఉన్నాయి. వాటిని స్వార్థానికి, పదవులు కాపాడుకోవడానికి వినియోగించుకోవాలనేవారికి అవి దక్కలేదు. నిరాడంబరమైన జీవితం గడిపేసరికి మామూలు గోవి కామధేనువుగా, కాసే పూసే మామూలు చెట్టు కల్పతరువుగా అనిపిస్తాయి. మనిషి అత్యాశ వల్ల, తీరని దాహం వల్ల నదుల్ని ఎండగడుతున్నాడు, అడవుల్ని ఎడారులు చేస్తున్నాడు. భూగర్భ నిధుల్ని తోడేసి భూమిని గుల్ల చేసేస్తున్నాడు. మనిషి ఆశని పూరించే శక్తి నక్షత్ర మండలానికి కూడా ఉండదు. నిర్వచనం పెద్ద పెద్ద దొరలు, బంగళాల్లో ఉండేవారు ఎక్కువగా తింటారు కాబట్టి బంగాళాదుంపలని పేరొచ్చింది. నిజానికవి మన కందమూలలే. ప్రాచీన రుషులు చిలకడదుంపలతో పాటు వీటినీ తినేవారు. బంగాళాదుంప మన తెలుగు సంప్రదాయం. వి॥ పెన్ డ్రాప్స్ - అంబేద్కర్‌ని ఒక్కసారి వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడాయన ఔన్నత్యాన్ని, కీర్తి ప్రతిష్టల్ని పంచుకునే పనిలో పడ్డారు. సింహభాగాల కోసం తహతహలాడుతున్నారు. - లోక్‌సభకి గాని రాజ్యసభకి గాని సభ్యులు సైకిళ్ల మీద రావొద్దు. టీడీపీకి ప్రచారం కల్పించవద్దు. - భాజపా. - చంద్రబాబు తెలుగు గడ్డ మీద కంటే మిగతా భూగోళం మీద గట్టిపట్టు సాధిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. - శ్రీరమణ -
శ్రీకారాలు - శ్రీమిరియాలు
సంసారి సుఖీ... ఆ మధ్య ఇద్దరు స్వామీజీలు ఒక వేదిక మీద కలిశారు. ఇద్దరూ ఒక ప్రాంతం వారే. ఇద్దరికీ సొంత ఆశ్రమాలు, భక్తగణం ఉంది. పూర్వాశ్రమంలో ఇద్దరూ ఒకే చెక్‌పోస్ట్‌లో పనిచేస్తూ తనిఖీకొచ్చినవారి అపార్థాల వల్ల, ఇద్దరూ ఒకేసారి ఉద్యోగ విముక్తులైనారు. వేర్వేరు దారుల్లో విడిపోయి, వృత్తిరీత్యా ఉన్న సారూప్యత ప్రకృతిలో కూడా ప్రతిబింబించింది. ఎప్పుడెప్పుడో కొని పారేసిన తోటల్ని, దొడ్లని సంరక్షించుకోవలసిన అవసరం వచ్చింది. శిక్షని వరంగా మలుచుకున్నారు. కట్ చేస్తే ఇద్దరు స్వాములు, రెండు ఆశ్రమాలు. ఎవరి శిల్పం వారిది. అయితే, రావల్సిన ముఖ్యనేత ప్రెస్మీట్లో చిక్కడి ఆలస్యం అవడంతో స్వాములకు మామూలు భాషణకు వ్యవధి దొరికింది. స్వామి స్వామి కష్టం సుఖం మాట్లాడుకుంటూ వినిపించారు. ‘‘ఆశ్రమం బోరులో నీళ్లు వస్తున్నాయా?’’ ‘‘ఆ, ఏదో పర్వాలేదు. మీ పరిస్థితి?’’ ‘‘గుట్టుచప్పుడు కాకుండా లాగిస్తున్నా. ఆశ్రమానికే నీళ్లు పుట్టించలేనివారు రాష్ట్రానికేమి తెస్తారని ఆక్షేపిస్తారు కదా!’’ ‘‘... కరెంటు ఏం చేస్తున్నారు?’’ ‘‘జనరేటరే. ఏసీలకి జీవి అలవాటుపడింది కదా!’’ ‘‘భక్తుడా...’’ ‘‘అబ్బే సొంత నిధులే. అసలే మార్కెట్ మందంగా ఉంది.’’ ‘‘ఔ. గోశాల?’’ ‘‘బావుంది. ఏవుంది, హళ్లి హళ్లి సున్నకి సున్న. కాని ఉండాలి. అది ఆశ్రమానికి హంగు.’’ ‘‘పంటలు..?’’ ‘‘ఆ... ఏవుంది. శ్రీనాథుడి వ్యవసాయమే.’’ ‘‘ఆ మధ్య ఏనుగుని తెప్పించారని విన్నాం?’’ ‘‘గున్న ఏనుగు. కేరళ నించి వచ్చింది. నా భక్తుడి కొడుకు సలహా ఇచ్చాడు. ఆశ్రమానికి ఆదాయ మార్గం చెప్పమంటే వాడు ఏనుగుని తగిలించాడు’’ నవ్వుతూనే, ‘‘వాడు విదేశాల్లో ధనార్జన మంత్రాలు నేర్చినవాడండోయ్.’’ ‘‘చెప్పండి... చెప్పండి...’’ ‘‘ఏనుగు ఆశ్రమానికి ఆకర్షణ అయింది. ఆదాయమూ పెరిగింది. పొద్దునపూట విష్ణు సంప్రదాయంలో నామాలు దిద్దుకుని భక్తుల్ని దీవిస్తుంది. సాయంత్రం పూట శైవ సంప్రదాయంలో అడ్డపట్టీలతో దీవిస్తుంది. తొండం తాకిస్తే పది. ఇదిగాక అరటిపళ్లు, చిలకడదుంపలు, చెరకు ముక్కలు వస్తాయి. పాపం ఒకపూట తిండి అదే సంపాయించుకుంటుంది. వారానికో రోజు అంబారీ ఉంటుంది. తలకి వంద. దాని ఖర్చులు, మావటీని అదే భరిస్తోంది. అంతో ఇంతో ఆశ్రమానికీ ఇస్తోంది. పైగా పేరు...’’ ‘‘అది నిజమేలెండి. అదొచ్చాక మిమ్మల్నంతా ఏనుగుస్వామి అంటున్నారు. నాక్కూడా ఏదైనా దారి చూపించండి. అనుగ్రహ భాషణలతో బండి నడవడం కష్టమే.’’ ‘‘మరే! జ్యోతిష్యం ఉంటే దాని ఆదాయం వేరు. విరుగుళ్లుంటాయి కదా.’’ ‘‘ఔనౌను. అవి బోలెడు ఖరీదు. నేనొక కోతిని చేరదీశా.’’ ‘‘విన్నాం... విన్నా.’’ ‘‘అది కొన్నాళ్లు బానే ఉంది. ఆంజనేయస్వామి అంశగా మావాళ్లు కథనాలు ప్రచారంలోకి తెస్తుండగా, ఎవడో గిట్టనివాడు దానికి కల్లు అలవాటు చేశాడు.’’ ‘‘చూశారా, లోకం పాపిష్టిది. ఆ తర్వాత?’’ ‘‘దానికి కల్లు దొరక్కుండా కట్టడి చేశా. ఇంకేముంది, నామీద ఆగ్రహించి అప్పట్నించి నానా అల్లరీ మొదలుపెట్టింది. నేను అ.భాషణం చేస్తుంటే ఎదురుగా ఎత్తుగా కూచుని వెక్కిరించడం, కాయలు పిందెలు నామీద విసరడం... చాలా అసభ్యమైన శరీర భాషని ప్రదర్శించడం మొదలుపెట్టింది. చివరకు దాన్ని చూడటం భక్తులకు వినోదంగా మారింది.’’ ‘‘మరి ఏ అడివికైనా తరిమించెయ్యక పోయారా?’’ ‘‘ఆ ప్రయత్నం కలిసి రాలేదు. ఆఖరికి పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రోజూ రెండు కొబ్బరి చిప్పలు, పది అరటిపళ్లు పెట్టేలా రాజీపడ్డాం. వేళప్రకారం ఆశ్రమానికి దూరంగా ఇవి పెట్టేస్తాం. అయినా అప్పుడప్పుడు తాగొచ్చి అల్లరి చేస్తూనే ఉంటుంది.’’ ‘‘పోనీ పదో పరకో ఖర్చుపెట్టి సాంతం వదిలించుకోలేకపోయారా?’’ ‘‘అదో పెద్ద కథ...’’ అని కొంచెం దగ్గరగా వాలి లో-గొంతులో ఆరంభించాడు. ఇంతలో ముఖ్యనేత కారుదిగి, అక్కడ నుంచే చేతులు జోడించి వేదికని సమీపించారు. కోతి కథ అక్కడాగింది. ఆ పెద్ద కథ నన్ను రకరకాలుగా తొలుస్తూనే ఉంటుంది. కలవారి అబ్బాయి బాగా డబ్బున్న మిత్రుడి ఇల్లు చక్కని పేకాట కేంద్రంగా భాసిల్లుతోంది. సువిశాలమైన సమశీతల గది, సుఖమైన కుర్చీలు, సమయానికి తగు పానీయాలతో బావుంటుంది. కాకపోతే ఒకే ఒక్క న్యూసెన్స్ ఏమిటంటే, ఏడెనిమిదేళ్ల యజమాని కొడుకు. వాడు చుట్టూ తిరుగుతూ ముక్కలు చూస్తూ కళ్లతో చేతులతో సైగలు చేస్తుంటాడు. వాడిని ఏమీ అనడానికి లేదు. చివరకు ఒక ఆటగాడు వాడిని నివారించగలిగాడు. ఏమిటి చిట్కా, ఎట్లా కట్టడి చేశారని మిగిలిన చేతులు అడిగాయి. ‘‘ఆ... ఏవుంది. పిల్లవెధవకి సెల్‌ఫోన్ మప్పాను. ఇహ మన జోలికి రాడు’’ అన్నాడాయన. ఇప్పుడే అందిన ఎస్ఎమ్మెస్ మిషన్ కాకతీయలో చెరువులు నిండుతున్నాయని తెలిసి ఎక్కడెక్కడి కప్పలు వలస వస్తున్నాయిట! కలెక్షన్ కింగ్ పౌరాణిక నాటకాలకి తెనాలి పెట్టింది పేరు. అప్పట్లో కిరీటాలు ధరించే హేమాహేమీలంతా తెనాలిలోనే ఉండేవారు. ఆ రోజుల్లో మాధవపెద్ది వెంకట్రామయ్య దుర్యోధన వేషానికి ఫేమస్. పులిపాటి వెంకటేశ్వర్లు అర్జున పాత్రకు ప్రసిద్ధి. రాజరాజు గెటప్‌లో మాధవపెద్ది రంగస్థలానికి కాంతి తెస్తే, పాండవ మధ్యమునిగా పులిపాటి స్టేజికి కళ తెచ్చేవారు. ఒక నాటకాల కాంట్రాక్టరు ట్రూపు నాటకానికి బేరం కుదరక మాధవపెద్దిని కాదని పులిపాటిని బుక్ చేసుకువెళ్లాడు. తెనాలిలో ఈ రాజరాజు ఇల్లు పార్థుని ఇల్లు ఎదురు బొదురుగానే ఉండేవి. మాధవపెద్ది తమ్ముడూ అని ఆదరంగా పిలిస్తే, పులిపాటి అన్నగారూ అని ఆదరంగా పిలిచేవారు. చీరాలలో తెల్లవారుజామున నాటకం పూర్తికాగానే పులిపాటి ఇంటికి చేరారు. తను లేని నాటకం ఏపాటి రక్తికట్టిందో తెలుసుకోవాలని మాధవపెద్దికి ఆత్రుతగా ఉంది. సాంతం ఇంట్లో అడుగుపెట్టకుండానే, ‘‘ఏం తమ్ముడూ నాటకం ఎట్లా నడిచింది’’ అంటూ ఎదురింట్లోంచి కేక వినిపించింది. ‘‘బ్రహ్మాండం అన్నగారూ’’ మారు పలికారు పులిపాటి. ‘‘కలెక్షన్ ఏమాత్రం?’’ - మళ్లీ మాధవపెద్ది. ‘‘ముప్పై మూడు బాటా, ఇరవై రెండు నాటు. అన్నీ ఎడంకాలువే’’ అని పులిపాటి జవాబు. పేరుకి ఉద్యోగ విజయాలు నాటకం గాని అయింది పాదుకా పట్టాభిషేకం! చర్చనీయం చంద్రబాబు చైనాలో పర్యటిస్తున్నారు. పెట్టుబడులకు గాలం వేస్తున్నారు. వాళ్లు సానుకూలంగా స్పందిస్తున్నారని కూడా చెబుతున్నారు. నిజానికి చైనావాళ్లు మనవాళ్లే! కవి సమ్రాట్ విశ్వనాథ ఒకచోట రాశారు కూడా. చాలాకాలం కిందట చయనాదులు చేసే చార్వాకం సోకి దూరమైపోయి, కైలాస గిరులు దాటి స్థిరపడిపోయారని, వారే చయనీయులని విశ్వనాథ నొక్కి వక్కాణించారు. ఈ సంగతి వాళ్లకి వివరిస్తే మరింత సానుకూలంగా స్పందిస్తారేమో? నిజంగానే.. తన అద్భుతమైన కార్టూన్లతో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికని సుసంపన్నం చేసిన సుధీర్ తైలాంగ్ పూర్వీకులు తెలంగాణ ప్రాంతీయులు. పెన్ డ్రాప్స్ ‘‘మీ నమ్మకమే మా పెట్టుబడి’’ - ఓం ఫట్ చిట్స్ ‘‘నూరు శాతం నిజం’’ - ఓ ఖాతాదారుడు. నేలను నమ్మితే ఏముందిరా నేలను అమ్మితే లాభముందిరా! హీరోయిన్లు వెలిసిపోయిన తల్లి వేషాలకు దిగినట్టు - గొప్ప గొప్ప పోస్టులు నిర్వహించినవారు సలహా సంఘాలకు చేరతారు. వాటికి గోళ్లు, పళ్లు ఉండవు. - శ్రీరమణ -
పాఠక స్పందన
శ్రీ రమణ గారు హారీపోటర్ని అమ్మాయిగా చేసేశారు. హారీపోటర్ నవలలోని పాత్రే కానీ, నవల రచయిత కాదు. రాసిన విషయం ఎంతబాగున్నా, అసలైన సమాచారం తప్పు కాకూడదు కదా... - శ్రీకుమార్, ఇ మెయిల్ తేనెమనసులు సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన కథనం చాలా బాగుంది. మమ్మల్ని సంతోషపెట్టింది. ఎస్. రమ్య - ఇ మెయిల్ మార్చి 29వ తేదీ సంచికలో ప్రచురితం అయిన శ్రీకారాలు-శ్రీ మిరియాలూలో ‘మన అమ్మాయే’లో ప్రస్తావించిన హారీపోటర్ ఆ నవల్లోని ప్రధానపాత్ర పేరు. దాని రచయిత జేకే రౌలింగ్. కాబట్టి హారీపోటర్ మన అమ్మాయే అంటే చెల్లదు. - రాయపెద్ది అప్పా శేషశాస్త్రి, ఆదోని మార్చి 29వ తేదీ ఫన్డేలో ప్రచురితం అయిన బెస్ట్‌కేస్ ‘ముందే చెప్పి ఉంటే’ చాలా ఆసక్తికరంగా ఉంది. చెడు చేసే వాళ్లకు చెడే జరుగుతుంది అనడానికి ఈ కథే ఒక ఉదాహరణ. అతడు రౌడీలకు ఆశ్రయం ఇచ్చి ఉండకపోతే అతడి పాప బతికి ఉండేది కదా. - రాము, హైదరాబాద్. సూపర్‌స్టార్ కృష్ణ సినీరంగ ప్రవేశం, తేనె మనసులు 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఇచ్చిన కవర్ స్టోరీ ఆసక్తికరంగా చదివింపజేసింది. శ్రీరమణ గారి కారాలు, మిరియాలు చక్కలిగింతలు పెడుతున్నాయి. నానీలు అలరిస్తున్నాయి. ప్రహేళిక భాషపై పట్టుసాధించేందుకు ఉపయోగకరంగా ఉంది. - రామచంద్రం, నారాయణపురం మెడికల్ మెమరీస్‌లో ‘ఆ చిన్నారులు మాట్లాడిన అపురూప వేళల్లో’ చాలా బాగుంది. నేను అమ్మని కాకపోయినా ఆ బాధను అర్థం చేసుకోగలను. వారికి ఉచితంగా చికిత్స చేసిన డాక్టర్ రచన గారిని, వారి తండ్రి వినయ్కుమార్ని అభినందిం చాలి. ఇలాగే చికిత్స చేయాలని కోరుతూ... - వనజ పాలకూరు, ఇ మెయిల్ మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. మా చిరునామా: ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. ఫోన్: 040-23256000 funday.sakshi@gmail.com -
ఔట్ అనుకుంటే ఔటు అయ్యింది
శ్రీకారాలు - శ్రీమిరియాలు ఒకసారి రాజకీయాల్లో ఒక స్థాయికి వెళ్లి ఆగినవాడితో జాగ్రత్తగా ఉండాలి. అయిపోయాడులే, కొడిగట్టిన దీపం అనుకోకూడదు. నివురు కప్పిన నిప్పు ఆరిపోయినట్టే కనిపిస్తుంది. వత్తి మాత్రం కాలి ఆగిపోయిన ఔటుతో జరభద్రం. గోడమీది రావిచెట్టు ఒకందాన పోదు. కలుపుగడ్డి, సెలవేసిన కురుపు ఇందుకు మరికొన్ని ఉదాహరణలు. నీలం సంజీవరెడ్డి అత్యున్నత పదవులు అలంకరించి హాయిగా సొంతవూరు వెళ్లిపోయి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆయన పవర్లో ఉండగా పైకొచ్చిన వారు కొందరున్నారు కాని, ఎప్పుడైనా పిలిస్తే పలికేవారు కాదు. ఆరిపోయిన లక్ష్మీ ఔటుగా భావించి పక్కన పెట్టేశారు. ఒకరోజు వచ్చింది. ఒక్కసారి దేశాధ్యక్షపదవి సంజీవరెడ్డిని వరించింది. చింతనిప్పు కణకణమంది. దీపం మళ్లీ వెలిగింది. ఔటు పేలింది. పాతమిత్రులు నాలికలు కరుచుకున్నారు. గురువుగారు చిన్న పనికోసం ఫోన్ చేసినా దొరికేవారు కాదు. ఆయన ఎప్పుడు ఏ వేళలో ఫోను చేసినా బాత్రూంలో ఉన్నానని చెప్పించారు. రాజకీయాల్లో ఇలాంటి ఒడిదుడుకులు తప్పవని ఎంచి, ఒక శిష్యుడు అనకొండలాంటి గజమాలని బలగంతో పట్టించుకుని శ్రీవారిని దర్శించడానికి వెళ్లారు. అతి వినయాన్ని వొలకబోస్తూ నిలబడ్డారు. సంజీవరెడ్డి పెద్ద నవ్వుతో పులకరించి ‘‘...రండి... రండి... అన్నట్టు బాత్రూంలోంచి ఎప్పుడు బయటకు వచ్చారు’’ అంటూ పలకరించారు. హన్నా! హనుమంతుడి ముందా కుప్పిగంతులు! - శ్రీరమణ మన అమ్మాయే! హారిపోటర్ తెలుగింటి ఆడపడుచనీ, మూడుతరాల క్రితం పెద్దలు వలస వెళ్లారనీ కొందరు చరిత్రకారులు అంటున్నారు. అసలు పేరు హరిపోటర్ అనీ క్రమంగా యాసలో అది హారి అయిందని వాదిస్తున్నారు. అందుకే ఫాంటసీ బాగా రాస్తోందనీ, దాని వెనక హరికటాక్షం ఉందనీ తీర్మానించారు. రావి శాస్త్రీయం పది పదిహేనేళ్ల క్రితం ప్రసిద్ధ రచయిత రావిశాస్త్రి ప్రత్యేక అతిథిగా నల్లగొండ వెళ్లారు. ఆ పక్కనే ‘‘రాచకొండ’’ ఉందని విని, మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లారు. కొంతసేపు అక్కడ తిరిగాక, వచ్చేటప్పుడు చేతిరుమాలులో దోసెడు మట్టిని మూటకట్టుకు తెచ్చుకున్నారట. ‘‘ఇక్కడ మా పూర్వీకులు చాలా ఏళ్లు వున్నారు, ఇది నా స్వస్థలం’’ అంటూ ఎంతో ఆనందించారట! విప్లవకవి రాచకొండ విశ్వనాథ శాస్త్రికి ఎన్నో సెంటిమెంట్లు. జ్యోతిష్యం మీద ఆయనకు నమ్మకం. కాదు, నిజం చెప్పాలంటే పిచ్చి. నమ్మినంత మాత్రాన విప్లవకవి కాకుండా పోతాడా? అడిదము సూరకవి (1750-1830) పూసపాటి సీతారామరాజుని శ్లాఘిస్తూ పద్యం చెప్పాడు. కాని పద్యంలో రాజుని ఏకవచనంలో సంబోధించేసరికి రాజాగ్రహానికి గురయ్యాడు. సూరకవి వెంటనే కవితామర్యాదల్ని వివరిస్తూ ఈ పద్యం చెప్పాడు- చిన్నప్పుడు, రతికేళిని నున్నప్పుడు, కవితలోన, యుద్ధములోనన్ వన్నెసుమీ రా కొట్టుట చెన్నగునో పూసపాటి సీతారామా! ఇలాగ కందపద్యం విసిరి, ఏకవచన ప్రయోగమే కాదు, ‘ఏరా’ సైతం అనతగునని సమర్థించుకున్నాడు. ఆ రోజుల్లో కవి బతుకులు పులిమీద సవారీ. ఇప్పుడసలు అదే ‘‘కల్చర్’’ అయిపోయింది. ఆడామగా పరస్పరం రా కొట్టుకుంటున్నారు. కలిసి ‘‘రా’’ కొడుతున్నారు. విశ్వబాపు దిగ్దర్శకులు విశ్వనాథ్ బాపులకు ఒకరంటే ఒకరికి ఇష్టం, గౌరవం. విశ్వనాథ్‌కి బాగా పేరొచ్చాక కూడా బాపు వద్ద సహాయకుడిగా ఒక్క సినిమాకి అయినా పని చెయ్యాలని అనుకునేవారట. కాని ఆ కోరిక తీరనే లేదని ఇప్పటికీ విశ్వనాథ్ వాపోతుంటారు. అలాగే బాపుకి విశ్వనాథ్ అంటే చాలా అభిమానం. ఈ కార్టూన్ ద్వారా బాపు తన ఇష్టాన్ని ప్రకటించుకున్నారు. ఇది చూసి విశ్వనాథ్ కూడా హాయిగా నవ్వుకున్నారు. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్య ‘‘కళాతపస్వి’’ బిరుదుని సమర్థించి, దాన్ని ధరించమని చెబుతూ ఉంటారు. ఈ చిత్రంలో ఉన్నది ఇంద్రుడు, రంభ మరియు కళాతపస్వి. నయా కాన్సెప్ట్స్! కావాలంటే వాడుకోండి. ‘‘మీ టూత్‌పేస్ట్‌లో కర్వేపాకుందా?’’ తెల్లమొహం వేయును. ‘‘మీ టూత్‌పేస్ట్‌లో జీలకర్రుందా?’’ పిచ్చిమొహం వేయును. ‘‘అయితే ఈ టూత్‌పేస్ట్ వాడండి. మీ అవగుణాలకు అనువైన టూత్‌పేస్ట్!’’ పీకాక్ సబ్బు! నాట్య, సౌందర్యాల సమ్మేళనం! మీ జీవితాన్ని సంగీతభరితం చేస్తుంది! ప్రతి రుద్దు ఒక ముద్దు! ‘‘ఆధ్యాత్మిక పరిమళాల టీ! ప్రపంచంలోనే మొదటిసారి’’ ‘‘అదెలాగ’’ ‘‘హిమాలయ సానువుల్లో, కేదార్‌నాథ్‌కి అతి చేరువలో పెరిగిన తేయాకు తోటల నుంచి తయారించబడింది!’’ *** ధోవతులు! ధోవతులు! చేతి నేతల ధోవతులు! ఇవి మానసంరక్షణకే కాదు, మనసు సంరక్షణకు కూడా మేలైనవి! హెచ్చరికో! హెచ్చెరిక! శ్రీ ఏడుకొండల శ్రీ వేంకటేశ్వర్లుని శ్రీ దివ్య అపాదారవిందములకు కోటి దణ్ణములు సేసి, శాయంగల విన్నపములు - దేవరా! తూకమైన బంగారు సాలిగ్రామ దండయున్నూ, అయిదు పేటల పచ్చహారమున్నూ అప్పనంగా వచ్చిందని మురిసిపోకు. ముందుంటది ముసళ్ల పండగ. రేపు ఎల్లుండి నీళ్లు కరెంటు పవరుకి సంబంధించి ఏ చీకు వచ్చినా, తమరు సిరికింజెప్పక వచ్చి రంగప్రవేశం చేయకపోతే... ఇంతే సంగతులు ‘‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు...’’ అంటూ పాత ట్యూన్లు వినిపిస్తాయి. ఇది మా నేల గుణం, మా జాతి లక్షణం. అన్నిటికీ సిద్ధపడి మరీ ఆ బంగారు బరువులేసుకో సామీ!ననుగన్న తల్లులాలా! ముక్కెరకి మురిసిపోతా చెవులు పక్కన పెట్టద్దు. పిలవగానే పలకండి. క్షణం జాగైతే, ‘‘నీ యబ్బ ఆకాశరాజు చేయించెనా, నీయన్న పోతరాజు చదివించెనా’’ అంటూ ఉగ్గుపాలతో సహా కక్కించే అవకాశం ఉంది. అమ్మలాలా! నా మాట నమ్మండి. చిత్తగించవలెను మీ భక్త రేణువు పెన్ డ్రాప్స్: * కొండమీదా పప్పన్నం, కొండకిందా పప్పన్నం అన్నట్టుగావుంది మన గవర్నర్ స్థితి. ఏ రాష్ట్రంలో గడప పచ్చన చేసుకున్నా హిజ్ఎక్స్లెన్సీకి రెండు తాంబూలాలు ముడుతున్నాయి. రేపు ఉభయసభల్లో, ఉభయ రాష్ట్రాల్లో దంచుతారు కాబోలు! * బడ్జెట్ పంచాంగ శ్రవణం లాంటిది. ఆ రోజు వినడానికి, మర్నాడు చదువుకోవడానికి మాత్రమే. తర్వాత ఏ పద్దులో ఏ తేడా పడ్డా ఎవరూ పట్టించుకోరు. ఈసారి సంకురుమయ్య నల్లధనం మీద వచ్చాడు. * పాపం, ఉద్యమంలో చెయ్యి విరగ్గొట్టుకున్నారు. నాల్రోజులు కట్లు ధరించి తిరిగారు. అయినా పొన్నాల శక్తియుక్తులను పైవాళ్లు గుర్తించలేదు. * ప్రపంచీకరణ తర్వాత జాతి జామకాయలు మానేసి యాపిల్స్ తింటోంది. పేలాల బదులు పాప్‌కార్న్ తింటోంది. ఇప్పుడే అందిన ఎస్ఎంఎస్ కేంద్రం వైఖరితో చంద్రబాబుకి పచ్చివెలక్కాయ గొంతున పడ్డట్టుందిట. కడుపు చించుకోడానికీ లేదుట!