అర్ధ శతాబ్ది సినిమా చరిత్ర
దాసరి మంచి స్క్రీన్‌ప్లే రచయిత. గొప్ప నటుడు. ఆయనదొక ప్రత్యేకమైన మాడ్యులేషన్. ఒక చిత్రంలోని ఆయన డైలాగులు గ్రాంఫోన్ రికార్డులుగా రాష్ట్రమంతా మార్మోగాయి. శరణన్న వారికి అభయమిచ్చి ఆదుకున్న భోళాశంకరుడు.
75 ఏళ్ల జీవితంలో యాభై ఏళ్ల సినీ జీవితాన్ని సమగ్రంగా, సలక్షణంగా గడిపిన దర్శకరత్నం దాసరి నారాయణరావు. నాటకాలతో ఆయన జీవితం ఆరంభమైంది. రచయితగా, నటుడిగా, దర్శకునిగా ఆ రంగంలో అభినివేశం గడిం చారు. ప్రారంభదశలో వెండితెరకి సంబంధించిన పలు శాఖలను గమనిస్తూ వచ్చారు. వాటితో పాటు అవమానాల్ని, ఆకలిని భరిస్తూ, సహిస్తూ తగినంత చేవ తేలారు.
తారాబలం లేకపోయినా మంచి కథాచిత్రాలను సామాన్య ప్రేక్షకులు ఆదరిస్తున్న రోజులు. ఒక మంచి ఇతివృత్తం, సందేశం, పరిష్కారం మిళితమైన కథతో సినీ బజారున పడ్డారు దాసరి. చిన్న బడ్జెట్ చిత్రం కావడం కంటే, ఆయన కథ చెప్పిన తీరు నిర్మాతని విశేషంగా ఆకట్టుకుంది. చెప్పిన దానికంటే ఆసక్తికరంగా వెండితెరపై కథ చూపించాడు. అదే తాత–మనవడు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం– ఇలా సర్వం తనే అయ్యారు. తొలి సూపర్‌హిట్‌తో దాసరి నారాయణరావు ఇక జీవితంలో వెనుతిరిగి చూసింది లేదు.
ఆయన బలం సెన్సాఫ్ డ్రామా. ‘చిల్లరకొట్టు
చిట్టెమ్మ’ అప్పటికే తెలుగునాట ప్రసిద్ధికెక్కిన నాటకం. దాసరి చేతుల్లో చిట్టెమ్మ బంగారు కాసులు కురి పించింది. వయసుకి మించిన లోకానుభవం, పరిశీలన, గోదావరితనం దాసరికి మనోధైర్యాన్నిచ్చాయి. ఎవరీ దాసరి నారాయణరావ్, పైన మేఘాల్లో... కిందికి దించండి అన్నవారే, కాదు ఉంచండని సగౌరవంగా నిలిపారు. సినిమా ఫీల్డ్‌ని ఒక ఇండస్ట్రీగా అంతా గుర్తించి గౌరవించే స్థాయి దాసరితోనే మొదలైంది. దేనికీ వెరపెరుగని దిగ్గజంగా ఎదిగారు.
వైటాన్‌వైట్‌లో నిలువెత్తు విగ్రహంతో సినీప్రపంచంలో స్వైరవిహారం చేసి, అన్ని శాఖల్లోనూ హారతులందుకున్నారు. చాలా బిజీ జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారు. ఎందరికో జీవితాలు ప్రసాదించారు. పొద్దుటే నిద్ర లేచి, అయిదు నిమిషాల్లో రెడీ అయి, కారెక్కి దారి పొడుగునా టేప్‌రికార్డర్‌లో డైలాగులు చెప్పేసి, కారు దిగి షూటింగ్ స్పాట్‌కి వెళ్లేవారు. లైటింగ్ గ్యాప్‌లో తర్వాతి కథ చర్చలు నడిపేవారు. పాలగుమ్మి పద్మరాజు, రాజశ్రీ లాంటి దీటైన రచయితలు ఆయన వెంట ఉండేవారు. కనుకనే ఒక సంవత్సరం (1984)లో దాసరి దర్శకత్వంలో అటు హిందీ ఇటు తెలుగులో కలిపి పది చిత్రాలు విడుదలైనాయి.
దాసరి మంచి స్క్రీన్‌ప్లే రచయిత. గొప్ప నటుడు. ఆయనదొక ప్రత్యేకమైన మాడ్యులేషన్. ఒక చిత్రం లోని ఆయన డైలాగులు గ్రాంఫోన్ రికార్డులుగా రాష్ట్రమంతా మార్మోగాయి. శరణన్న వారికి అభయమిచ్చి ఆదుకున్న భోళాశంకరుడు. ఆయన ప్రారంభించి నడిపిన ‘ఉదయం’పత్రిక ఒక సంచలనం. బలహీన వర్గాలకు, తిరుగుబాటువాదులకు గర్జించే శక్తిగా నిలిచింది. ఎన్నో కొత్త గళాలను, కలాలను మీడియా రంగానికి ‘ఉదయం’ అందించింది. దాసరి త్రిముఖుడు, త్రివిక్రముడు. కలకాలం గుర్తుండే మహామనిషికి అక్షర నివాళి.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)