మా ఊరి పోస్టాఫీసు
అక్షర తూణీరం
అనేక కారణాల వల్ల ఊరి వారు, డిపార్టుమెంటు వారు మా ఇ.డి. బ్రాంచ్ ఆఫీస్ మా ఇంట్లోనే ఉండాలన్నారు. వారస త్వంగా ముద్రలు, మువ్వల బరిసె అక్కడే ఉండిపోయాయి.
... కాదు, మా ఇంటి పోస్టాఫీసు. అరమరికలు లేని అందరిది మా ఇల్లు. 1939 నవంబరులో అది మా ఇంటికి వచ్చింది. మా నాన్న నలభైమూడేళ్ల పాటు బ్రాంచి పోస్ట్ మాస్టరు ఉద్యోగాన్ని సేవాభావంతో నిర్వహించి పదవీ విరమణ చేశారు. అయినా అది మా ఇంటిని వదల్లేదు. ఆ కుర్చీ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కారణం దాన్ని నాన్న సేవా కేంద్రంగా నడి పారు. వేళలుండేవి కావు. కార్డు కొన్నవారికి ఆయనే ఓపిగ్గా రాసి పెట్టేవారు. పోస్టులో వచ్చిన కార్డులు కొన్నింటిని చదివి పెట్టే పని కూడా ఉండేది. మా ఊరికి నెలనెలా చాలా మనియార్డర్లు ఏపీఓ నించి వచ్చేవి. అంటే ఆర్మీ పోస్టాఫీసు. అనగా మా ఊళ్లో సైనికోద్యోగులు ఎక్కువమంది ఉండేవారు.
ఒక్కోసారి ఆ మనియార్డర్లు వారం పదిరోజులు ఆలస్యమయ్యేవి. పాపం! రోజూ వాటిని అందుకోవల్సిన తల్లిదండ్రులు పోస్ట్ వేళకు ఆశగా మా ఇంటికి వచ్చేవారు. కొన్ని సార్లు నాన్న వాళ్లకి ముందుగానే ఆ యాభయ్యో వందో ఇచ్చేసేవారు. నే చెప్పినప్పుడు వచ్చి వేలిముద్ర వేసి వెళ్లండని చెప్పే వారు. ఆర్మీ జవాన్లు సెలవులకు వచ్చిన ప్పుడు తప్పకుండా వచ్చి అమ్మకీ నాన్నకీ కృతజ్ఞతలు చెప్పివెళ్లేవారు. రెండో ప్రపంచ యుద్ధం దాకా మా పోస్టా ఫీసుకి రంగూన్ మనియార్డర్లు కూడా వచ్చేవి. ఆ రోజుల్లో చాలా మంది మా ఊరి వారు బతుకు తెలివి కోసం రంగూన్ వెళ్లారు. వారంతా కష్టపడి సంపాయించి ఇంటికి డబ్బు పంపేవారు. కొందరు నాన్న పేరు మీదే పంపేవారు. ఎప్పుడో వచ్చినప్పుడు లెక్కలు చూసుకునేవారు. ఆ రోజుల్లో భయంకరమైన అవిద్య పల్లెల్ని ఏలుతోంది.
రెవిన్యూ స్టాంప్‌ని ‘నోటుబిళ్ల’ అంటారు గ్రామాల్లో. ఆ రోజుల్లో ‘అణా బిళ్ల’ అనేవారు. రోజూ రాత్రి పూట నాన్న నోటు బిళ్లలు తప్పనిసరిగా తలకింద పెట్టుకు పడుకునేవారు. ఆలస్యమైతే అప్పిచ్చేవాడికి మనసు మారవచ్చు, ఎవరు ఎప్పుడొచ్చినా నోటు బిళ్లలు వెంటనే ఇవ్వండని చెప్పేవారు. తెల్ల కాగితం, కలం, కాటుక్కాయ సిద్ధంగా ఉండేవి. మాకు అక్షరాలు రాగానే ప్రామిసరీ నోటు రాయడం వంట పట్టించారు నాన్న. బ్రహ్మోపదేశం వేళ నాన్న చెప్పిన గాయత్రీ∙మంత్రం తడుముకుంటానేమోగాని ప్రొనోటు రాతలో కలం ఆగదు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఊరి వారు, డిపార్టుమెంటు వారు మా ఇ.డి. బ్రాంచ్ ఆఫీస్ మా ఇంట్లోనే ఉండాలన్నారు. వారసత్వంగా రకరకాల ముద్రలు, మువ్వల బరిసె అక్కడే ఉండిపోయాయి. కొంచెం చదువుకున్న మా వదినగారు పోస్టుమాస్టర్ అయింది. బ్రిటిష్ హయాంలో ఈ శాఖని ‘అంచెల్స్’ అనే వారు. తపాల్స్ అంచెలంచెలుగా నడిచేవి. ఆ తెలుగు మాటనే ‘అంచల్స్’ చేశారు.
నా బాల్యం, నా యవ్వనం మా పోస్టాఫీసుతో ముడిపడి ఉన్నాయి. హైస్కూల్లో మని యార్డర్ ఫారమ్‌ని ఆశువుగా పూర్తి చేయడం నాకే వచ్చు. టపా కట్టడం వచ్చు. మా నాన్న తర్వాత అంత దీక్షతోనూ శ్రీమతి సావిత్రి అనే ఈ పోస్టు మాస్టర్ కూడా డ్యూటీ చేశారు. పిల్లలు, పిల్లల పిల్లలు నాలుగు తరాల వాళ్లం అరిచేతిలో నల్లటి తారు ముద్రలతో ఆడు కున్నాం. ఎన్నో పత్రికలు, ఎన్నో శుభవార్తలు అందుకున్నాం. గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ, అరవిందుని సావిత్రి, నెలనెలా వచ్చే ఎమ్మెస్కో సొంత గ్రంథాలయం పుస్తకాలు ఈ అంచెల్స్‌లోనే వచ్చాయి. సంజీవ్‌దేవ్, ఆరుద్ర, శేషేంద్ర, పురాణం, కరుణశ్రీ, నండూరిల ఉత్తరాల పలకరింతలు ఈ అంచెల్సే అందించాయి. ఎన్నో మధుర స్మృతులు మిగిల్చి డెబ్బయి ఆరేళ్ల తర్వాత రేపు 19న, ఈ వరహాపురం అగ్రహారం పోస్టాఫీసు వారసులు లేక మా ఇల్లు వదిలి వెళ్లిపోతోంది. దస్విదానియా!
(వ్యాసకర్త : శ్రీరమణ ప్రముఖ కథకుడు)