పని చూడు బాబూ!
అక్షర తూణీరం
ఎక్కడ రోడ్లు లేవో, వీధి దీపాలు లేవో తెలుసుకోవ డానికి శాటిలైట్ సాయం అక్కర్లేదు. అవసరాలను, అత్యవసరాలను తెల్పడానికి ఒక్క కార్యకర్త చాలు.
కొందరు పనికిరాని పరిజ్ఞానాన్ని పోగుచేస్తూ ఉంటారు. ఎలాగంటే – మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక రోజులో తయారయ్యే పెసరట్లని ఒకచోట పరిస్తే సరిగ్గా ఇరవై రెండున్నర హెక్టార్ల విస్తీర్ణానికి సరి పోతాయి. నవ్యాంధ్రలో ఒక సాయంత్రం వండు తున్న సమోసాలను ఒకచోట పేరిస్తే, ఇంద్రకీలాద్రికి రెట్టింపు పరిమాణంలో ఉంటాయి. రాష్ట్రంలో డేటా వేట జరుగుతున్న వేళ నాకు పెసరట్ల కథనం గుర్తు కొచ్చింది. అశోకుడు చెట్లు నాటించాడు. చెరువులు తవ్వించాడు. రోడ్లు వేయిం చాడని చిన్నప్పటినుంచీ వాచకం పుస్తకాల్లో చదువుకున్నాం. అశోకుడు కాలం నాటికి ఇంతటి సాంకేతిక విజ్ఞానం ఉన్నట్టు లేదు. ఇవన్నీ ప్రజకి అవసరం అనుకున్నాడు. అశోకుడు గప్‌చుప్‌గా చేయించాడు. మనకిప్పుడు పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది. ప్రతిపనికీ ముందు సర్వే, సూక్ష్మ సర్వే, అతి సూక్ష్మ సర్వేలకు ఆజ్ఞా పించడంతో కథ మొదల వుతుంది. ఆకలిగొన్నవా రెందరు, అర్ధాకలి వారెం దరు.. ఇలా ఆకలిని పది పన్నెండు సూక్ష్మాలుగా వింగడించి, ఐదుగురు నిష్ణాతులు, ఆరు కంప్యూ టర్లు కలిసి పనిచేసి ఒక సమగ్ర నివేదికను సమ ర్పించడం జరుగుతుంది. అసలు పని జరగదుగాని, ఈ హంగామా అంతా ‘‘ఇక ఆకలికి చెక్’’ అన్న వార్తా శీర్షిక కింద నడుస్తూ ఉంటుంది. చివరికి ఏమీ ఉండదు.
బెజవాడ కనకదుర్గమ్మ దివ్య సన్నిధిలో రోజుకో మహత్తు వెలుగు చూస్తోంది. శరన్నవరాత్రుల తొలిరోజు యాభైవేల లడ్లు పచ్చబారాయి. ఈగలు, బొద్దింకలు విస్తృతంగా వాటిచుట్టూ కనిపించాయి. అటు అమ్మవారిని ఇటు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఆలయ అధికారులు ఆ అరలక్ష లడ్లని పాతర వేశారు. మరో రోజు అధికారులంతా చేరి అమ్మవారి ఆలయాన్ని ఆక్ర మించుకుని ఆ తల్లి సేవలో తరించారు. ఈ భక్తి పారవశ్యంలో నివేదనలు మరిచారు. ఇంకో రోజు వేలాది రూపాయలకు ప్రత్యేక పాస్‌ల విక్రయాలు జరిగాయి. ఇంకా అగమ్యగోచరమైన విశేషాలు అనేకం. ఇలాంటి వ్యవ హారాలకు ఎంతకాలం విచారణ కావాలి? ఎన్ని నివేదికలు అందుకోవాలి? అదేమన్నా అంటే టెక్నాలజీ వాడకంలో ముందెత్తులో ఉన్నామని ప్రస్తుతి చేసుకోవడం విడ్డూరం. ఇసుక మాఫియా వైనం పత్రికల్లో చదివే దాకా శ్రీవారికి తెలియరాలేదు. భలే ఉంటాయి కబుర్లు. అభివృద్ధి చేయడానికి, అవినీతిని అరికట్టడానికి పెద్ద టెక్నాలజీతో పన్లేదు. ఎక్కడ రోడ్లు లేవో, వీధి దీపాలు లేవో తెలుసుకోవడానికి శాటిలైట్ సాయం అక్కర్లేదు. ఒక ఊరికి ఒక ప్రతినిధి ఉంటే చాలు. అవసరాలను, అత్యవసరాలను తెల్పడానికి ఒక్క కార్యకర్త చాలు. టెక్నాలజీ చాలా అవసరమేగానీ మరీ అంతకాదు. స్వచ్ఛ భారత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం సంపాదించుకుంది. ఇంద్ర కీలాద్రి సంగతి మోదీ దాకా వెళ్లనీయకండి.
(వ్యాసకర్త : శ్రీరమణ ప్రముఖ కథకుడు)