ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత సంతకం చేసిన ఫైళ్లలో ఒకటి ల్యాండ్ ‘టైటిల్ గ్యారంటీ చట్టం రద్దు’ ఫైల్. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని భూ సంస్కరణలలో భాగంగా భారత దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
ఒక్కో గ్రామంలో భూ సమస్య పరిష్కారం కావడానికి తరతరాలు పడుతోంది. దీన్ని నివారించడానికి తెచ్చినదే ‘టైటిల్ గ్యారంటీ చట్టం.’ అప్పుడెప్పుడో శతాబ్దాల క్రితం చేసిన సర్వే తప్ప ఇటీవలి కాలంలో భూసర్వే జరగనే లేదు. అందుకే ఈ కొత్త చట్టం ప్రకారం సమగ్ర భూ సర్వే, డిజిటల్ ల్యాండ్ సర్వే చేసి ఏమైనా సమస్యలు ఉంటే సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అక్కడికక్కడే పరిష్కరించి పట్టా పాస్ బుక్కులు ఇచ్చారు. అయినా ఎన్నికల్లో దీన్ని ఎందుకు ప్రచారాస్త్రం చేశారు?
‘సింగిల్ సెటిల్మెంట్‌తో భూ సమస్య పరిష్కారం అయితే మేమేం కావాలి? మా పూట ఎలా గడవాలి’ అని గ్రామాల్లో పూట గడుపుకునే పెద్ద మనుషుల నుండి రైతులను చెప్పులు అరిగేలా కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్న న్యాయవాదుల వరకు వ్యతిరేకించారు. అందుకే ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది.
తెలంగాణలో గొప్పలకు పోయి తెచ్చిన పట్టాదార్ పాస్ బుక్ చట్టం – 2020, ‘ధరణి’ పోర్టల్ వంటివి పెద్ద అక్రమాలకు తావిచ్చాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో చేసిన టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా ఈ చట్టాన్ని ఉదాహరణగా తీసుకుని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, గుడ్ గవర్నెన్స్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ లాంటి సర్టిఫికేట్లు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ చట్టాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా ఎందుకు మలిచారు? అధికారం చేపట్టగానే రెండో సంతకం ఈ ఫైల్ మీదే ఎందుకు చేసినట్టు? ఈ సందర్భంగా భూ చట్టాల న్యాయ నిపుణులు ‘మంచి చట్టాన్ని చెత్త రాజకీయాలు చంపేశాయ’ని అంటున్నారు. – బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు
Comments
Please login to add a commentAdd a comment