సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు | Sakshi Guest Column On Micro level employment | Sakshi
Sakshi News home page

సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు

Published Wed, Oct 2 2024 6:08 AM | Last Updated on Wed, Oct 2 2024 6:08 AM

Sakshi Guest Column On Micro level employment

అభిప్రాయం

టాటా సన్స్‌ కంపెనీ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖర్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆగస్టు 16న కలిశారు. అదే రోజు – ‘టాస్క్‌ ఫోర్స్‌ ఫర్‌ ఎకనమిక్‌ డెవలప్మెంట్‌ ఆఫ్‌ స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047’ కో– చైర్మన్‌ చంద్రశేఖర్‌ అని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ముఖ్య మంత్రి దీనికి చైర్మన్‌. ‘రాబోయే ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబోతున్నది. ఇందులో అగ్రశ్రేణి ఇండస్ట్రీ ‘లీడర్లు’, నిపుణులు ఉంటారు’ అని పత్రికల్లో వార్తలొచ్చాయి. 

ఇది విన్నాక,ముందుగా ఈ విషయం చెప్పాలి అనిపించింది. ప్రముఖ ఆన్‌ లైన్‌ షాపింగ్‌ కంపెనీ ‘అమెజాన్‌’ తన రిక్రూట్మెంట్‌ విభాగంలో ఇకముందు ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ (ఏ.ఐ.) వాడ వద్దని నిర్ణయం తీసుకుంది. ‘రిక్రూట్మెంట్‌’ కోసం దరఖా స్తులు ‘స్క్రూటినీ’ చేసేటప్పుడు, ‘జెండర్‌’ అని ఉండేచోట– ‘ఆడ’ అని ఉంటే, ‘ఏఐ’ వాటిని తిరస్కరిస్తున్నది. అది గమ నించాక, కంపెనీ దాని వాడడం వెంటనే ఆపేసింది. 

అటువంటి కంపెనీలే అంత బాధ్యతగా ఉంటున్నప్పుడు, ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వాలు యువతరం జీవితా లను ప్రభావితం చేసే ఉపాధి అంశాల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలనేది అవి గ్రహించాలి. టీడీపీ ప్రభుత్వం 2015లో ఇలాగే– ‘స్ట్రాటజిక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్సా్ఫర్మింగ్‌ – ఏపీ’ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసినట్లుగా వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత, దానికి కొనసాగింపు కనిపించలేదు. 

‘ఫేస్‌ బుక్‌’, ‘గూగుల్‌’ వంటి సామాజిక మాధ్యమాల బహుళ జాతీయ కంపెనీలు కొత్తగా అమరావతికి వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ ‘ఏఐ’ యూనివర్సిటీ వస్తుంది అని ఆ శాఖ మంత్రి అంటున్నారు. గతంలో ‘గేమ్స్‌ సిటీ’ అన్నారు. అయితే  ఈ దిశలో ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన కసరత్తు ఇప్పటికే మొదలైతే, అది మంచిదే. అలాగే, వాటితోపాటు ఎన్నికల ముందు కూటమి వెల్లడించిన– ‘స్కిల్‌ సెన్సెస్‌’ వెంటనే పూర్తికావాలి. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు తమ వద్ద లేవనుకున్నప్పుడు ఇదొక పద్ధతి. 

అలా కాకుండా తాము చేసింది ఏదైనా అది ఆ ప్రాంతానికీ, ప్రజలకూ కూడా శాశ్వత ప్రయోజనం కలగాలి. తామే అందుకు ప్రత్యామ్నాయాలు వెతకాలని ప్రభుత్వం అను కొన్నప్పుడు అది మరోలా ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్‌ రాజశేఖర రెడ్డి 2008లో ప్రారంభించిన ‘సెజ్‌’లో ఇప్పుడు ‘శ్రీసిటీ’గా అందరికీ తెలిసిన–‘సత్యవేడు రిజర్వ్‌ ఇన్ఫ్రా సిటీ’ (టౌన్‌ షిప్‌) ఉంది. అదిప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. 

రాష్ట్రానికి ఏ ప్రపంచ దిగ్గజ కంపెనీ వచ్చినా వాళ్లకు ప్రభుత్వాలు ఇప్పుడు చూపించేది– ‘శ్రీసిటీ’. సీఎమ్‌గా  వైఎస్‌ మొత్తం 22 ‘సెజ్‌’లకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చారు. నాన్న కృషికి కొనసాగింపు అన్నట్టుగా జగన్‌  ప్రభుత్వంలో రాయలసీమ ఖనిజ నిక్షేపాల విలువ పెంచడానికి కడప జిల్లా కొప్పర్తి వద్ద ‘మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌’ కోసం 2020లో 3,155 ఎకరాలను కేటాయించారు. 

ఇది కర్నూల్‌ – రాణిపేట నేషనల్‌ హైవేకి, రైల్వే లైన్, కడప ఎయిర్‌ పోర్ట్‌కు సమీపాన ఉండడమే కాకుండా... రేణిగుంట అంతర్జాతీయ విమానా శ్రయానికి 145 కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తున్న వసతులతో రూ. 25,000 కోట్ల మేర పెట్టు బడులు వస్తాయనీ, 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనీ 2020 డిసెంబర్‌ నాటి ప్రభుత్వ అంచనా. 

కనీసం శ్రీసిటీ, కొప్పర్తి వంటి పారిశ్రామిక కూడళ్ళ వద్ద, అలాగే  కొత్త జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పడే మార్కెట్‌ డిమాండ్‌ దృష్ట్యా సూక్ష్మ స్థాయిలో ‘సర్వీస్‌ సెక్టార్‌’లో ‘ఐటీఐ’, ‘పాలి టెక్నిక్‌’ స్థాయిలో ‘కరిక్యులం’ సమీక్ష అనేది ముందు... ‘స్కిల్‌ సెన్సెస్‌’ పూర్తి అయితే అప్పుడు వాటిని సరిచేసుకోవచ్చు. 

దానివల్ల ‘స్టార్ట్‌ అప్‌’లకు ‘ఎంఎస్‌ఎంఈ’లకు అవసరమైన కొత్త ‘మ్యాన్‌ పవర్‌’ దొరుకుతుంది.  కానీ ఇవన్నీ ‘పెండింగ్‌’లో ఉంచి, అక్టోబర్‌ రెండు గాంధీ జయంతి రోజున –‘అంకుర యాత్ర’ పేరుతో భారీ బస్‌ ర్యాలీ అమరావతి నుంచి శ్రీసిటీ వరకు ప్రభుత్వం ‘ప్లాన్‌’ చేసింది. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘ఎన్నారై’లు మన ‘స్టార్ట్‌ అప్‌’లను ప్రోత్సహించడానికి ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు.  

అదలా ఉంటే, కేబినెట్‌ సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ‘విజన్‌ డాక్యుమెంట్లు’ తయారుచేస్తారని వార్తలు వస్తున్నాయి. పరిపాలనలో ఇంత అనుభవం ఉన్న పార్టీ ప్రభుత్వానికి మళ్ళీ ఇటువంటి కసరత్తు అవసరమా? మరి ఏ ‘విజన్‌’ అనకుండానే గత ప్రభుత్వం ఉద్యానవనం, పరిశ్రమలు రెండింటినీ కలుపుతూ కొత్తగా ‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌’ శాఖను ప్రారంభించింది. దాంతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మొదటిసారి ఆ శాఖకు మంత్రిని నియమించింది. 

ఈ శాఖ ఏర్పాటుతో రైతులకు సంప్రదాయ పంటల సాగు కంటే ఉద్యా నవన ఉత్పత్తులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఇలా గత ప్రభుత్వం చూపించిన బాటలో కూటమి ప్రభుత్వం కొన సాగుతూ మైక్రో ఇరిగేషన్‌తో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2029 నాటికి రెట్టింపు చేస్తాం అంటున్నారు. కేంద్ర–రాష్ట్రాలు కలిసి ప్రస్తుతం ఇస్తున్న 55% సబ్సిడీని ఇక ముందు 90% శాతానికి పెంచాలని నిర్ణయించారు. 

వాస్తవానికి అభివృద్ధి ప్రణాళికల అమలు పలు దొంత ర్లుగా ఉంటుంది. అదలా ఉన్నప్పుడే, సూక్ష్మ స్థాయి వరకు ఇంకి కొన్ని తరాలు పాటు ఆ మేలు చివరి ‘మైలు’ వరకు చేరు తుంది. ఇంతకూ ‘విజన్‌’ అంటే ఏమిటి? ఉమ్మడి ఏపీలో వైఎస్సార్‌ తాడేపల్లిగూడెం వద్ద హార్టీకల్చర్‌ యూనివర్సిటీ పెడితే, విభజిత ఏపీలో జగన్‌ ‘ఫుడ్‌ ఇండస్ట్రీ శాఖ పెట్టడం! ఫలితంగా ఈ ప్రభుత్వంలో దానికి కొత్తగా ఒక మంత్రి వచ్చి, పంట విస్తీర్ణం రెట్టింపు లక్ష్యంగా ప్రకటించడం. 

దానివల్ల ప్రయోజనాల వ్యాప్తి 26 జిల్లాలకు ఉంటుంది. అది మట్టిలో చేసే సాగుబడి నుంచి, ఆ ఉత్ప్పత్తులను ‘ఆన్‌ లైన్‌’లో మార్కె టింగ్‌ చేస్తూ ‘డెస్క్‌’ వద్దకు చేరింది! ప్రతి దశలోనూ ఇందులో యువత ప్రయోజనాలు పొందుతుంది. నిజానికి ఇది ‘ప్రాంతము– ప్రజలు’ కేంద్రిత అభివృద్ధి నమూనా.

జాన్‌సన్‌ చోరగుడి 
వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement