Johnson choragudi
-
అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. కర్నూలు నుంచి న్యాయ సంస్థలు– ‘లోకాయుక్త’ మానవ హక్కుల కమిషన్, సీబీఐ కోర్టు, ఉన్నత ‘లా’ విద్యాసంస్థలు వంటి వాటిని అక్కడ నుంచి ‘అమరావతి’కి తరలిస్తున్నట్టు, స్థానికులు ఆందోళన చేస్తున్నట్టుగా వచ్చిన వార్తల నేపథ్యంలో... గత పదేళ్ల పరిణామాల సమీక్ష తప్పడం లేదు.ఈ విషయంలో మొదట ఒకమాట అనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఎందుకు రెండుగా విభజించబడింది అనే విషయంలో పదేళ్ళ తర్వాత అయినా మనకు స్పష్టత అవసరం. ఇక్కడ రాష్ట్రాల్లో అయినా అక్కడ ఢిల్లీలో అయినా ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వంలోకి ప్రవేశించే ‘లెజిస్లేచర్’ కాకుండా, శాశ్వతమైన ‘ఎగ్జిక్యూటివ్’ అనే శక్తిమంతమైన వ్యవస్థ మరొకటి ఉంది. ఈ రెండింటిపై ‘జ్యుడిషియరీ’ ఉంది. ప్రభుత్వాలు ఉనికిలో లేని విరామాల మధ్య కూడా వాళ్ళు అధికారంలో ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి కె. కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే, 2014 ఫిబ్రవరి 20 నుంచి జూన్ 8 వరకు రాష్ట్రం ‘గవర్నర్ పాలన’లో ఉంది. దేశ ప్రాదేశిక భద్రత విషయమై గురుతరమైన బాధ్యత ఈ వ్యవస్థలకు ఉంటుంది. పరిపాలనలో కేంద్ర– రాష్ట్ర సంబంధాలు ఢిల్లీలో ‘హోమ్’శాఖ వద్ద ఎందుకు ఉంటాయో మనకు అర్థం కావాలి. అలాగే, 2014 మొదట్లో ‘యూపీఏ–2’ ప్రభుత్వంలో ఢిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయినప్పుడు; అధికారుల కమిటీ కాకుండా, ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి ఎందుకు అధ్యక్షుడుగా ఉన్నారో మనకు అర్థం కావాలి. అటువంటి గ్రహింపుతో మొత్తంగా భారత ప్రభుత్వం సమగ్రమైన తూర్పు దృష్టి (లుక్ ఈస్ట్) ‘డ్రైవ్’ అంతా కేవలం ఆగ్నేయ ఆసియా వైపు ఎందుకు ఉందో కూడా మనకు తెలియాలి. కీలకమైన కేంద్ర మంత్రిత్వశాఖలు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఎందుకు తమ కార్యకలాపాల వేగాన్ని పెంచుతున్నాయో మనకు తెలియాలి. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖపట్టణం రాష్ట్ర రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అది రాష్ట్ర పరిధిలోని అంశం. దానితో పనిలేకుండా కేంద్రం 2022 అక్టోబర్ నాటికి కాకినాడ వద్ద ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్’ సౌత్ ఇండియా కేంపస్ తెచ్చింది. మార్చి 2024 నాటికి బాపట్ల సమీపాన ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ దళాల కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పడింది. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ నైజేషన్’ (డీఆర్డీఓ) రూ. 100 కోట్లతో ‘మిస్సైల్ టెస్ట్ రేంజ్ సెంటర్’ మచిలీ పట్టణం సమీపాన నాగాయలంక దగ్గరలోని గుల్లలమోద వద్ద నిర్మి స్తున్నది. గత ప్రభుత్వంలో జరిగిన పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా బాపట్ల–బందరు రెండూ కూడా విజయవాడ, గుంటూరు నగరాలతో సంబంధం లేని సొంత కలెక్టరేట్లతో జిల్లా కేంద్రాలుగా మారాయి.చదవండి: శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!కేంద్ర ఆర్థికశాఖ అనంతపురం జిల్లాలో ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్’ వంటి దేశంలోనే అత్యున్నత స్థాయి శిక్షణా సంస్థను 2022 నాటికి బెంగళూరు సమీపాన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించింది. అదే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి పుట్టపర్తి ప్రాంతాన్ని వేరుచేసి; సత్యసాయి జిల్లా పేరుతో కొత్తగా మరో జిల్లా ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ సంస్థ ఆ కొత్త జిల్లాలో ఉంది. మరి వీటిలో దేన్నైనా ఇది ఇక్కడ కాదు, అని మరొకచోటికి తరలించే ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ; లేదా ‘కూటమి’లో భాగస్వామి అయిన బీజేపీ నడుపుతున్న కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎందుకు అనడం లేదనే సందేహం మనకు రావాలి. అప్పుడు ఐదేళ్ళ ప్రభుత్వాల అవసరాల కంటే, విస్తృతమైన దేశప్రయోజనాల కోసం కేంద్రంలో – రక్షణ, వాణిజ్యం, ఉపరితల రవాణా, రైల్వే, స్పేస్ సైన్స్, వంటి కొన్ని మంత్రిత్వశాఖల్లో– ‘ఏపీ’ కోసం ఒక ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది? అనే ప్రశ్న వైపుకు అవి మనల్ని మన రాష్ట్రం ‘జాగ్రఫీ’ వైపుకు తీసుకువెళతాయి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?అయితే, జరిగినవి ఏవీ గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం మనపట్ల ప్రేమతో చేయలేదు. ‘మెతుకు ముట్టుకుంటే అన్నం సోకు తెలుస్తుంది’ అన్నట్టుగా, రాష్ట్ర విభజన జరిగి ఆ ‘షాక్’ నుంచి ఇంకా మనం కోలుకోక ముందే 2014 మధ్యలోనే బందరు వద్ద భూమి కూడా ఎంపిక చేసిన ‘మెరైన్ పోలీస్ అకాడమీ’ని ఇక్కణ్ణించి ఉత్తరాదికి వారు తరలించారు. అదే ఏడాది డిసెంబరులో ‘ఏపీ’కి కూడా మరొక ‘అకాడమీ’ ఇస్తున్నాం అన్నారు. ఇప్పటికి అటువంటిది ఏమీ లేదు. జరుగుతున్నవి అన్నీ ఇటీవల కొత్తగా వాడుకలోకి వచ్చిన ‘జియో – పాలి టిక్స్’లో భాగంగా దేశ ప్రాదేశిక అవసరాల మేరకు ‘బ్యురోక్రసీ’ స్థాయిలో జరుగుతున్న విధాన నిర్ణయాలు. ఇంతటి సమగ్రమైన వైశాల్యంతో మారిన కొత్త ‘మ్యాప్’లోని రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడగలిగినప్పుడే, ఇక్కడ అది అమలు చేయాల్సిన స్వల్పకాలిక – దీర్ఘకాలిక ‘ప్లానింగ్’ ఎలా ఉండాల్సిందీ దానికి అర్థమవుతుంది. అప్పుడు ఈ మొత్తంలో – ‘రాజధాని’ అనే అంశానికి ఉన్న జాగా ఎంతో కూడా మనకు అర్థమవుతుంది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు
టాటా సన్స్ కంపెనీ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆగస్టు 16న కలిశారు. అదే రోజు – ‘టాస్క్ ఫోర్స్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’ కో– చైర్మన్ చంద్రశేఖర్ అని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ముఖ్య మంత్రి దీనికి చైర్మన్. ‘రాబోయే ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబోతున్నది. ఇందులో అగ్రశ్రేణి ఇండస్ట్రీ ‘లీడర్లు’, నిపుణులు ఉంటారు’ అని పత్రికల్లో వార్తలొచ్చాయి. ఇది విన్నాక,ముందుగా ఈ విషయం చెప్పాలి అనిపించింది. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ కంపెనీ ‘అమెజాన్’ తన రిక్రూట్మెంట్ విభాగంలో ఇకముందు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏ.ఐ.) వాడ వద్దని నిర్ణయం తీసుకుంది. ‘రిక్రూట్మెంట్’ కోసం దరఖా స్తులు ‘స్క్రూటినీ’ చేసేటప్పుడు, ‘జెండర్’ అని ఉండేచోట– ‘ఆడ’ అని ఉంటే, ‘ఏఐ’ వాటిని తిరస్కరిస్తున్నది. అది గమ నించాక, కంపెనీ దాని వాడడం వెంటనే ఆపేసింది. అటువంటి కంపెనీలే అంత బాధ్యతగా ఉంటున్నప్పుడు, ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వాలు యువతరం జీవితా లను ప్రభావితం చేసే ఉపాధి అంశాల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలనేది అవి గ్రహించాలి. టీడీపీ ప్రభుత్వం 2015లో ఇలాగే– ‘స్ట్రాటజిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సా్ఫర్మింగ్ – ఏపీ’ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసినట్లుగా వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత, దానికి కొనసాగింపు కనిపించలేదు. ‘ఫేస్ బుక్’, ‘గూగుల్’ వంటి సామాజిక మాధ్యమాల బహుళ జాతీయ కంపెనీలు కొత్తగా అమరావతికి వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ ‘ఏఐ’ యూనివర్సిటీ వస్తుంది అని ఆ శాఖ మంత్రి అంటున్నారు. గతంలో ‘గేమ్స్ సిటీ’ అన్నారు. అయితే ఈ దిశలో ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన కసరత్తు ఇప్పటికే మొదలైతే, అది మంచిదే. అలాగే, వాటితోపాటు ఎన్నికల ముందు కూటమి వెల్లడించిన– ‘స్కిల్ సెన్సెస్’ వెంటనే పూర్తికావాలి. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు తమ వద్ద లేవనుకున్నప్పుడు ఇదొక పద్ధతి. అలా కాకుండా తాము చేసింది ఏదైనా అది ఆ ప్రాంతానికీ, ప్రజలకూ కూడా శాశ్వత ప్రయోజనం కలగాలి. తామే అందుకు ప్రత్యామ్నాయాలు వెతకాలని ప్రభుత్వం అను కొన్నప్పుడు అది మరోలా ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లో ప్రారంభించిన ‘సెజ్’లో ఇప్పుడు ‘శ్రీసిటీ’గా అందరికీ తెలిసిన–‘సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ’ (టౌన్ షిప్) ఉంది. అదిప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. రాష్ట్రానికి ఏ ప్రపంచ దిగ్గజ కంపెనీ వచ్చినా వాళ్లకు ప్రభుత్వాలు ఇప్పుడు చూపించేది– ‘శ్రీసిటీ’. సీఎమ్‌గా వైఎస్ మొత్తం 22 ‘సెజ్’లకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చారు. నాన్న కృషికి కొనసాగింపు అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో రాయలసీమ ఖనిజ నిక్షేపాల విలువ పెంచడానికి కడప జిల్లా కొప్పర్తి వద్ద ‘మెగా ఇండస్ట్రియల్ హబ్’ కోసం 2020లో 3,155 ఎకరాలను కేటాయించారు. ఇది కర్నూల్ – రాణిపేట నేషనల్ హైవేకి, రైల్వే లైన్, కడప ఎయిర్ పోర్ట్‌కు సమీపాన ఉండడమే కాకుండా... రేణిగుంట అంతర్జాతీయ విమానా శ్రయానికి 145 కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తున్న వసతులతో రూ. 25,000 కోట్ల మేర పెట్టు బడులు వస్తాయనీ, 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనీ 2020 డిసెంబర్ నాటి ప్రభుత్వ అంచనా. కనీసం శ్రీసిటీ, కొప్పర్తి వంటి పారిశ్రామిక కూడళ్ళ వద్ద, అలాగే కొత్త జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పడే మార్కెట్ డిమాండ్ దృష్ట్యా సూక్ష్మ స్థాయిలో ‘సర్వీస్ సెక్టార్’లో ‘ఐటీఐ’, ‘పాలి టెక్నిక్’ స్థాయిలో ‘కరిక్యులం’ సమీక్ష అనేది ముందు... ‘స్కిల్ సెన్సెస్’ పూర్తి అయితే అప్పుడు వాటిని సరిచేసుకోవచ్చు. దానివల్ల ‘స్టార్ట్ అప్’లకు ‘ఎంఎస్ఎంఈ’లకు అవసరమైన కొత్త ‘మ్యాన్ పవర్’ దొరుకుతుంది. కానీ ఇవన్నీ ‘పెండింగ్’లో ఉంచి, అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున –‘అంకుర యాత్ర’ పేరుతో భారీ బస్ ర్యాలీ అమరావతి నుంచి శ్రీసిటీ వరకు ప్రభుత్వం ‘ప్లాన్’ చేసింది. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘ఎన్నారై’లు మన ‘స్టార్ట్ అప్’లను ప్రోత్సహించడానికి ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు. అదలా ఉంటే, కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ‘విజన్ డాక్యుమెంట్లు’ తయారుచేస్తారని వార్తలు వస్తున్నాయి. పరిపాలనలో ఇంత అనుభవం ఉన్న పార్టీ ప్రభుత్వానికి మళ్ళీ ఇటువంటి కసరత్తు అవసరమా? మరి ఏ ‘విజన్’ అనకుండానే గత ప్రభుత్వం ఉద్యానవనం, పరిశ్రమలు రెండింటినీ కలుపుతూ కొత్తగా ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ప్రారంభించింది. దాంతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మొదటిసారి ఆ శాఖకు మంత్రిని నియమించింది. ఈ శాఖ ఏర్పాటుతో రైతులకు సంప్రదాయ పంటల సాగు కంటే ఉద్యా నవన ఉత్పత్తులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఇలా గత ప్రభుత్వం చూపించిన బాటలో కూటమి ప్రభుత్వం కొన సాగుతూ మైక్రో ఇరిగేషన్‌తో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2029 నాటికి రెట్టింపు చేస్తాం అంటున్నారు. కేంద్ర–రాష్ట్రాలు కలిసి ప్రస్తుతం ఇస్తున్న 55% సబ్సిడీని ఇక ముందు 90% శాతానికి పెంచాలని నిర్ణయించారు. వాస్తవానికి అభివృద్ధి ప్రణాళికల అమలు పలు దొంత ర్లుగా ఉంటుంది. అదలా ఉన్నప్పుడే, సూక్ష్మ స్థాయి వరకు ఇంకి కొన్ని తరాలు పాటు ఆ మేలు చివరి ‘మైలు’ వరకు చేరు తుంది. ఇంతకూ ‘విజన్’ అంటే ఏమిటి? ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ తాడేపల్లిగూడెం వద్ద హార్టీకల్చర్ యూనివర్సిటీ పెడితే, విభజిత ఏపీలో జగన్ ‘ఫుడ్ ఇండస్ట్రీ శాఖ పెట్టడం! ఫలితంగా ఈ ప్రభుత్వంలో దానికి కొత్తగా ఒక మంత్రి వచ్చి, పంట విస్తీర్ణం రెట్టింపు లక్ష్యంగా ప్రకటించడం. దానివల్ల ప్రయోజనాల వ్యాప్తి 26 జిల్లాలకు ఉంటుంది. అది మట్టిలో చేసే సాగుబడి నుంచి, ఆ ఉత్ప్పత్తులను ‘ఆన్ లైన్’లో మార్కె టింగ్ చేస్తూ ‘డెస్క్’ వద్దకు చేరింది! ప్రతి దశలోనూ ఇందులో యువత ప్రయోజనాలు పొందుతుంది. నిజానికి ఇది ‘ప్రాంతము– ప్రజలు’ కేంద్రిత అభివృద్ధి నమూనా.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఇంతకూ మనం ఏమి నేర్చుకున్నట్లు?
ప్రకృతి సమయోచితంగా అందించే సూచనలను, దాని ముందు తలొంచి వినమ్రంగా స్వీకరించడం ఒక్కటే మనిషికి మిగిలిన ‘ఆప్షన్’. రాజైనా మంత్రి అయినా ఎవరైనా దాని ముందు ఒక్కటే. సరిగ్గా పదిహేనేళ్ళ క్రితం ఇదే సెప్టెంబర్ రెండున ‘కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా’ అయిన కర్నూలు జిల్లా నల్లమల అడవి ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సాక్షాత్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖర రెడ్డి దుర్మరణం చెందారు. మళ్ళీ తిరిగి అదే రోజు అదే కృష్ణాతీరం చూపించిన ఉగ్ర రూపం ముందు, యావత్తు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ స్తంభించి, నిస్తేజంగా ప్రేక్షక పాత్ర వహించవలసి వచ్చింది. ‘నేచర్ కోర్స్’ ఆరంభం,అంతం రెండూ ఎప్పటిలా అవి తమ సహజ మార్గంలో వచ్చి వెళ్ళిపోయాయి. అవాక్కయి జరిగింది ఏమిటి? అని వెనక్కి తిరిగి చూస్తే, బోధపడిన జ్ఞానం ఏమంటే, ప్రభుత్వ శాఖలు ఏడాది పొడ వునా ‘సీజన్’ స్పృహతో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, అవ సరమైన బడ్జెట్ ఇస్తూ, ఒక శాఖ పనుల్లో మరొకరు వేలు పెట్టకుండా అందరూ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. కొంత కాలంగా అటువంటి క్రమశిక్షణకు తరచూ తూట్లు పడు తున్నది. నెల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ ప్రభు త్వంలో– ‘పొలిటికల్ గవర్నెన్స్’ ఉంటుంది, అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒక ‘పొలిటికల్ ఎగ్జిక్యూ టివ్’ పరిమితులు ఎంతవరకు? అమలులో వున్న ‘ఫ్లడ్ మాన్యువల్స్’కు పునః సమీక్ష అవసరమా? అనే మీమాంసకు ‘2024 ఏపీ ఫ్లడ్స్’ ఒక నమూనా కానుంది. ఎందుకంటే, ఇదే జిల్లాల్లో 1977 దివిసీమ ఉప్పెనలో 14,204 మంది దుర్మ రణం పాలైన చరిత్ర ఉంది. తదనంతరం ఏవీఎస్ రెడ్డి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా తక్షణ సహాయం, పునర్నిర్మాణ పనులు చేసిన చరిత్ర కూడా ఉంది. అయినా ఇదేమీ నిన్న కాక మొన్న పుట్టిన ‘జాగ్రఫీ’ కాదు కదా! తూర్పు కనుమల్లో కురిసే వర్షం నీటి ప్రవాహానికి ఒక సహజ మార్గం ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పడు సర్కారు జిల్లాలు అనేవారు. బ్రిటిష్ ప్రెసిడెన్సీ పాలనలో 200 ఏళ్ళ పాటు ఉన్న ప్రాంతం. అప్పట్లోనే ప్రతిదానికీ ఇక్కడ ‘సిస్టమ్స్’ ఏర్పడ్డాయి. అందుకే, ఇరవై ఏళ్ళ క్రితం వరకూ కృష్ణాజిల్లా కలెక్టర్ టేబుల్ పైన గార్డన్ మెఖంజే ‘ది మాన్యువల్ ఆఫ్ క్రిష్ణా డిస్ట్రిక్ట్’ విధిగా ఉండేది. అయినా ఇటువంటి విషయాల్లో మనం వెనక్కి చూడడం, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం మర్చిపోయి చాన్నాళ్లు అయింది.మనకు తెలుసు, కదలిక (మొబిలిటీ), స్థిరత్వం (స్టాటిక్) రెండు భిన్నమైన వేర్వేరు అంశాలు. వరద అన్న వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు (సీబీఎన్) కదలిక మొదలయింది, ఇప్పటికీ అది ఇంకా ఆగలేదు. అయితే ‘శాటిలైట్ కమ్యూని కేషన్ సిస్టం’ వచ్చాక, ‘ఇ–గవర్నెన్స్’ వంటి ఆధునిక సాంకే తికత అందుబాటులో ఉండడం వల్ల పరిపాలనా యంత్రాంగం కదలకుండా ఉన్నచోట నుంచే ముందుగా వాతావరణ హెచ్చరికలు తెలుసుకుని, విపత్తు తీవ్రతను అంచనా వేస్తూ, దిగువకు క్షేత్ర సిబ్బందికి సూచనలు ఇస్తూ నష్టనివారణ చర్యలు తీసుకుంటుంది. రెండవ దశలో విపత్తు తర్వాత క్షేత్ర స్థాయి సిబ్బంది (మొబిలిటీ) సహాయ, పునరావాస, పునర్ని ర్మాణ పనులలోకి దిగుతారు. ఇలా ఇది రెండు దశల ప్రక్రియ. అంటే, పాలనా యంత్రాంగం కదలకుండా ఉన్నచోట నుంచే తమ విధుల్లో ఉంటే, ‘పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’గా సి.ఎం. సీబీఎన్ నిత్యం కదులుతున్నారు. దాంతో ఇక్కడే మన కొచ్చే అనుమానం, ‘అధికారం’ అనేది కదిలేదా (మొబిలిటీ) లేక స్థిరంగా (స్టాటిక్)గా ఉండేదా? అది కదిలేదే కనుక అయితే, మళ్ళీ దానికి ఏదో ఒక పేరుపెట్టి అది ‘రాజధాని’ అంటూ దానికుండే ‘ఫ్లోటింగ్’ లక్షణాన్ని ‘స్టాటిక్’గా మారుస్తూ, దాన్ని ఒక గాటన కట్టే ప్రయత్నం ఏమిటి? దాని చుట్టూ ఇంత పరిపాలనా యంత్రాంగం, ప్రభుత్వ నిధులు కేంద్రీకృతం ఏమిటి? ఈ దృష్టితో చూసినప్పుడు, అధికారం అనేది ఒక ‘సాఫ్ట్ వేర్’ మాదిరిగా దృశ్యమానం కాని అమూర్త అంశం అని స్పష్టం అవుతున్నది. దాంతో ‘అధికారం’ లేదా దాన్ని మనం చలాయించే ప్రాంతమైన ‘రాజధాని’ ఇవి రెండు కూడా స్థిరంగా ఉండని ‘మొబిలిటీ’ అంశాలు అయినప్పుడు, ‘అధికారం’ అనే ఈ మొత్తం కసరత్తు ఒక ‘వర్చువల్’ భావన అనే అభిప్రాయం వద్దకు మనల్ని తీసుకువెళుతున్నది. దీనర్థం ప్రభుత్వ యంత్రాంగం అన్నప్పుడు మౌలిక వసతులు అనబడే ఆఫీసులు, అధికారులకు సిబ్బందికి నివాసాలు ఉంటే అవి సరిపోతాయి. రాజ్యంలో – ఒక వ్యవస్థకు ఉండే ఇటువంటి అమూర్త స్వభావాన్ని రాజకీయాలలోకి వచ్చిన తొలి రోజు ల్లోనే ఎన్.టి. రామారావు– ‘కేంద్రం ఒక మిథ్య’ అనడంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడే పైన పేర్కొన్న తేదీల్లో అమరావతిలో కురిసిన వర్షపాతం ఎంతో వరద పరిస్థితి ఏమిటో మనకు తెలియాలి. ‘ఆ ప్రాంతంలోని 29 గ్రామాల్లో 25 పూర్తిగా మునిగాయనీ, ఆగస్టు 31న ఒక్క రోజులో అమరావతి వాతావరణ కేంద్రంలో 28 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యిందనీ, ‘క్యుములోనింబస్’ మేఘాలు, బంగాళా ఖాతంలో అల్ప పీడనం కారణాలుగా కేవలం మూడు గంటల్లో 15 సెం.మీ. వర్షపాతం నమోదు అయిందనీ’ పేరు చెప్పడానికి ఇష్టపడని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారి ఒకరు చెప్పినట్టుగా సెప్టెంబర్ పదిన ‘హిందూస్థాన్ టైమ్స్’ పత్రిక రాసింది. కొల్లేరు సరస్సులో నీటిమట్టం సాధారణంగా రెండు మీటర్లు ఉంటుంది. వరద కారణంగా అది సెప్టెంబర్ ఒకటిన 3.2 మీటర్లు ఉండగా 8వ తేదీకి 3.35 మీటర్లకు పెరిగింది, 9వ తేదీకి కొల్లేరు ప్రాంత గ్రామాలకు వరద ముంపు ప్రకటించారు. 10వ తేదీకి అది 3.42 మీటర్లుకు పెరిగింది. చివరిగా ప్రకృతి నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాము అనేది ఒక్కటే ఏ తరంలో అయినా మిగులుతున్న ప్రశ్న.జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
‘ఓట్ బ్యాంక్’ నుంచి ‘ఓట్ ట్రాన్స్ఫర్’ వరకూ...
తాజాగా ముగిసిన 2024 ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కొన్ని మౌలిక అంశాలు అనివార్యంగా చర్చకు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఇటీవల యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ మాజీ డిప్యుటీ రిజిస్ట్రార్ జనరల్ ఎన్ రామారావు రాసిన వ్యాసాన్ని ఇక్కడ ప్రస్తావించడం ఎంతైనా అవసరం. ‘‘మనదేశంలో 2011 జనగణన తర్వాత మళ్ళీ పదేళ్ళకు 2021లో అది జరగాల్సి ఉంది. కానీ అది వాయిదా పడడంతో, మన అన్ని అవసరాలకు పాత జనాభా లెక్కల మీద ఆధారపడాల్సి వస్తున్నది. అందువల్ల సంక్షేమ పథకాలు పలువురు అర్హులకు అందకుండా పోతున్నాయి’’ అంటున్నారు. గతంలో వీరు ‘సెన్సెస్ అండ్ ట్యాబ్యులేషన్’ విభాగంలో ఉన్నత స్థాయిలో పనిచేశారు. ఇంకా ఆయన– ‘‘ఇటీవల బడ్జెట్లో ఇందుకు కేటాయించిన నిధులను చూసినప్పుడు, ఇవి ఎప్పుడు జరుగుతాయో అనే అనుమానాలనే కలిగిస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంలో ఇంకా జాప్యం అంటే మాత్రం, అది ప్రమాదం అవుతుంది’’ అంటున్నారు. తాజా గణాంకాలు లేకపోవడంతో సంక్షేమ పథకాలు పలువురు అర్హులకు అందకుండా పోతున్నాయి, అనే ఆవేదనలో మరో మాటకు తావులేదు, అది నిజం. అయితే, 2019–2024 మధ్య రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీన్ని అధిగమించి మరీ సంక్షేమ పథకాలను అమలుపరచి రికార్డు సృష్టించింది. ఎలా అంటే అది– ‘సంతృప్త స్థాయి’ని ప్రాతిపదిక చేసుకుని అటువంటి అరుదైన రికార్డును నెలకొల్పింది. ఇందులో మళ్ళీ లబ్ధిదారుల ఎంపిక అనేది లేకుండా, అర్హులైన అందరికీ... అనేది ప్రాతిపదిక కావడంతో, ఏ స్థాయిలోనూ ‘మేనేజ్’ చేయడం అనే అవసరం పంచాయతీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకూ ఎక్కడా రాలేదు.పథకం ఏదైనా అర్హత ఉంటే చాలు అని అందరికీ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు మళ్ళీ పాత పద్ధతిలో గతంలో మాదిరిగా– ‘ఎస్సీ కార్పొరేషన్’ లను ప్రారంభించాలి, అంటూ తిరుపతిలో అందోళన చేసినట్టుగా జులై చివరిలో వార్తలు వచ్చాయి. ఈ కార్పొరేషన్లు లేకపోవడం వల్లనే ఎస్సీ లకు సంక్షేమ పథకాలు అందడం లేదు, అనే వాదనను ఆ పార్టీ తెరపైకి తెస్తున్నది. రాష్ట్రాల్లో ‘ఈ– గవర్నెన్స్’ నడుస్తున్నకాలంలో దేశానికి ‘కంప్యూటర్లను’ పరిచయం చేసిన పార్టీ 2024లో చెయ్యాల్సిన డిమాండ్ ఎంతమాత్రం కాదిది. అయినా సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు విషయంలో దేశానికి ఒక కొత్త– ‘సిలబస్’ ఇచ్చిన వైఎస్సార్సీపీ నమూనా దేశమంతా ఏదో ఒక రూపంలో చలామణిలోకి వచ్చాక, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకువెళ్ళడం గురించి ఎవరు మాట్లాడినా అది పేలవంగా తేలిపోతుంది. దాన్ని కొనసాగించలేక, ఆ విషయం నేరుగా ప్రకటించలేక, ఏపీలో ఎన్డీఏ కూటమి పడుతున్న ఆపసోపాలు బహిరంగమైన పరిస్థితుల్లో, కాంగ్రెస్ వంటి పార్టీల ఉనికి పోరాటానికి– ‘ఎస్సీ కార్పొరేషన్లు కావాలి...’ వంటి దేశవాళీ ‘డిమాండ్లు’ ఆ పార్టీలకు రాజకీయంగా పనికిరావొచ్చు. అయితే, ఈ సందర్భంగానే– 2024 ఎన్నికల్లో ‘దళిత్ వోట్’పై ‘లోక్ నీతి’–‘సీఎస్డీఎస్’ కో డైరెక్టర్ ప్రొ‘‘ సంజయ్ కుమార్ బృందం చేసిన విశ్లేషణను గమనించడం ఎంతైనా అవసరం. ఎన్నికలు అనేసరికి ఒకప్పుడు ‘ఓటు బ్యాంక్’ అనే స్థిమిత స్థితి ఉండడం మనకు తెలుసు. అయితే, ఇప్పుడు ఆ స్థానంలోకి ‘ఓటు ట్రాన్స్ఫర్’ అనే అనిశ్చిత స్థితి రావడంతో– ‘లిక్విడ్ పాలిటిక్స్’ (ద్రవ రాజకీయాలు) అనే సరికొత్త రూపాన్ని మన రాజకీయాలు తీసుకుంటున్నాయి. చంద్రబాబు ఒకేసారి రెండు భిన్నమైన రాజకీయ కూటములతో మైత్రి కొనసాగిస్తూ ఈ తరహా ‘ద్రవ రాజకీయాలకు’ దేశంలోనే ఎత్తైన ప్రతినిధిగా నిలుస్తారు. ఇప్పుడు క్రమంగా ప్రజలు కూడా కొందరు నాయకులు అనుసరిస్తున్న ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రొ‘‘సంజయ్ కుమార్ బృందం చేసిన విశ్లేషణలో మనకు కనిపి స్తున్నది అదే. ఆంధ్రప్రదేశ్‌లో దళిత్ ఓటు వైఎస్సార్సీపీ– తెలుగు దేశం పార్టీ మధ్య సమానంగా చీలిందంటారాయన. ఇక్కడ 48 శాతం టీడీపీకి పడితే, 50 శాతం వైఎస్సార్సీపీకి, కేవలం 2 శాతం కాంగ్రెస్‌కు వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న ఆ వర్గాలు 2014 తర్వాత అక్క ణ్ణించి పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైపుకు బదిలీ అయితే, 2024లో తిరిగి కొంతమేర అవి టీడీపీకి బదిలీ అయ్యి చివరికి అది గెలిచింది. రాబోయే ఐదేళ్ళు వైఎస్సార్సీపీ చేయబోయే రాజకీయాలకు దానికి మిగిలిన నైతిక బలం దానికొచ్చిన 40 శాతం ఓట్లు అయితే, అందులోని 50 శాతం ‘దళిత్ ఓటు’ అయింది. టీడీపీకి బదిలీ అయిన 48 శాతం దళిత్ ఓటు, ఎన్ని కల హామీల అమలు వైఫల్యంతో ఎంత వేగంగా మళ్ళీ వెనక్కి వైఎస్సార్సీపీ వద్దకు వస్తుంది అనేదాన్నిబట్టి ఇకముందు జరగ బోయే రాజకీయాలు ఉంటాయి. -జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
‘చేజారడానికి’ సిద్ధమైనప్పుడే... మనుగడ!
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న 2000లో ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. అప్పటికి ఆర్థిక సంస్కరణల అమలు మొదలై పదేళ్ళు అయింది. ఇది జరిగిన పదేళ్లకు ఈ కొత్త రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఈ కాలంలోనే – ‘రీ మ్యాపింగ్ ఇండియా’ అంశంపై ‘అకడమిక్’ చర్చ మొదలైంది. దేన్నయినా మొత్తంగా ‘చూస్తూ’ చేసే నిర్ధారణల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.అటువంటిదే – ప్రొఫెసర్ లూయిస్ టెల్లిన్ రాసిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురణ ‘రీ మ్యాపింగ్ ఇండియా: న్యూ స్టేట్స్ అండ్ దెయిర్ పొలిటికల్ ఆరిజన్స్’ గ్రంథం. ఈ రచయిత్రి ప్రస్తుతం లండన్ కింగ్స్ కాలేజీలో ‘ఇండియా ఇన్స్టిట్యూట్’తో పాటుగా కేంబ్రిడ్జి – ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’ వంటి ప్రపంచ ప్రసిద్ద యూనివర్సిటీల్లో పొలిటికల్ సైన్స్ బోధిస్తున్నారు. ఈమె గతంలో బీబీసీ సౌత్ ఆసియా అనలిస్ట్‌గా పనిచేశారు. మన రాష్ట్ర విభజన జరిగిన 2014 నాటికి ఈ రచన వెలువడింది. అందులో ముందుమాట లోనే ఆమె– ‘రాష్ట్రాల సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్థిక అంశాల విషయంలో ఏ వర్గాల మధ్య పరస్పరం పోటీ ఉంది? ఏవి ఎవరి చేజారిపోతున్నాయి? అనేది నిర్ధారిస్తాయి’ అంటారు.ఉత్తర, మధ్య ఇండియాలో ఇప్పటికి పాతికేళ్ళ క్రితం ఏర్పడిన మూడు కొత్త రాష్ట్రాల్లో జరిగిన సామాజిక రాజకీయ పునరేకీకరణ విషయంలో– ఆ తర్వాత పదేళ్లకు ఏర్పడిన కొత్త రాష్ట్రంగా మనకొక నిరంతరాయ స్పృహ తప్పదు. ప్రొ‘‘ లూయిస్ అంటున్నట్టుగా ఇందులో– ‘ఏవి, ఎవరి చేజారి ఎవరి చేతిలోకి పోతున్నాయి...’ అనేది అతి కీలకమైన అంశం. గడచిన వందేళ్ళలో కొన్ని సంప్రదాయ వర్గాల ఆధిపత్యం చేజారిపోయిందనే వాదన ఉంది. కానీ అది నిజమా? అంటే కాదు. వాళ్ళు స్థిరాస్తులుగా ఉన్న తమ భూముల్నీ, పారంపర్య ఆచార బాధ్యతల్నీ విడిచి జ్ఞాన రంగాలకు వెళ్ళి అక్కడ ఆధిపత్య స్థాయిలో స్థిరపడ్డారు. టెక్నాలజీ పరంగా ‘అప్ డేట్’ అవుతూ ఉన్నారు.అలా పైకి వెళ్ళిన వర్గాల చేతుల్లోనే గడచిన డెబ్బై ఐదు ఏళ్ల రాజకీయ ఆధిపత్యం ఉంది. వీరే ఏదో ఒక పార్టీ పేరుతో అధికార ప్రతిపక్షాల్లో ఉంటూ, తమ స్థిరాస్తుల భద్రత చూసుకుంటూ అభివృద్ధి అంటూ వారు తమ ఆస్తుల విలువ పెంచే ఆలోచనలను అమలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగానే 1989–90 మధ్య ప్రధాని వీపీ సింగ్ ‘మండల్ కమిషన్’ నివేదిక అమలు మొదలైతే, వాటి వెనుక మరో ఏడాదికి తెలుగు ప్రధాని పీవీ ఆర్థిక సంస్కరణలు అమలులోకి తెచ్చారు. గమనిస్తే– ‘మండల్’ నుంచి ‘ఆర్థిక సంస్కరణలు’ దాటి వచ్చిన ‘విభజన’ వరకు ఈ పాతికేళ్ళ కాలంలో ఇందులో ఒక ‘ప్రాసెస్’ను చూస్తాం. వాటిలో– ఒకదానిలో ‘ప్రజలు’ ఉంటే మరొకదానిలో ‘ప్రాంతం’ కనిపిస్తుంది.అయితే, వీటిలో మొదటిదైన వీపీ సింగ్ ‘మండల్’ అమలు నిర్ణయం జరగకుండా, రెండవదైన పీవీ ఆర్థిక సంస్కరణల అమలును గానీ, పోరాడి మరీ మన నుంచి తెలంగాణ విడిపోవడాన్నిగానీ ఊహించగలమా? అదే కనుక జరక్క పోయి ఉంటే, సంస్కరణల మౌలిక సూత్రమైన– ‘ప్రపంచీకరణ’– ‘ప్రైవేటీకరణ’–‘సరళీకరణ’ల అమలు ఇక్కడ సాధ్యమయ్యేవా? వాటి వలన పెరిగిన అసమానతలు మాట ఏమిటి అనేది మళ్ళీ వేరే చర్చ.అయితే ఇక్కడే– ‘రాష్ట్రాల సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్థిక అంశాల విషయంలో ఏ వర్గాల మధ్య పరస్పరం పోటీ ఉంది? సంపదపై ఆధిపత్యం ఎవరిది? ఏవి ఎవరి చేజారి ఎవరి చేతుల్లోకి వెళుతున్నాయి’ అనే ప్రశ్నే మళ్ళీ మళ్ళీ తలెత్తుతున్నది. భూముల పైన, సాంఘిక జీవనం పైన ఆధిపత్యం వదులుకుని, జ్ఞానరంగం వైపు వెళ్ళినవారు గతంలో కంటే మెరుగైన స్థాయిలో ఉండడం మనకు తెలియదా? తెలిసీ విభజన తర్వాత కూడా మళ్ళీ ‘భూమి’ కేంద్రంగా దాని చుట్టూనే అధికార రాజకీయాలు సాగాలి అన్నప్పుడు, జరగాల్సింది ఏమిటి? మళ్ళీ–‘రీ మ్యాపింగ్ ఆంధ్రప్రదేశ్’ జరగాలి.ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్ళనూ, వచ్చే పర్యవసానాలనూ పాలకులు ఎదుర్కోవాలి. అలాగని అదేమీ ఐదేళ్ళ వ్యవధిలో మొదలై పూర్తి అయ్యేది కాదు. ఆ విషయం దిగువకు చివరివరకు చేరేది అంతకంటే కాదు. గత ప్రభుత్వం 13 జిల్లాలను 25 చేసి మన్య ప్రాంతాన్ని 26వ జిల్లాగా చేసింది. అంత మాత్రాన పని పూర్తి అయిందని కాదు. గత ప్రభుత్వం ‘మ్యాప్’ పైన చేసింది కేవలం ఆరంభపు ‘మార్కింగ్’ మాత్రమే. తర్వాత జరగాల్సింది సూక్ష్మ స్థాయికి పరిపాలన చేరడం.మన సమాజంలో ‘బోర్డర్స్’లో ఉండేది ఎవరు? ఒక ఊళ్ళో ఊరి చివర ఉండేది ఎవరు? అటువంటి చివరి సమాజాలకు పరిపాలన చేరడం అనేది ఇక్కడ లక్ష్యం. ఆ క్రమంలో మనది అనుకున్నది మన తర్వాతి వారికి–‘చేజారి పోవడం’ అనేది తప్పదు.– జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
మధ్యేమార్గ సంస్కరణలతోనే.. సుపరిపాలన!
వరి పంటలో పొడుగు రకం అక్కుళ్ళు స్థానంలోకి పొట్టి రకం–స్వర్ణ ‘హైబ్రీడ్’ వచ్చినప్పుడు పాత–కొత్తల మధ్య అప్పట్లో జరిగిన ఆ మార్పు ఏమంత సాఫీగా అవలేదు. ఆ బియ్యంతో వాతం కలిగి కీళ్ళ నొప్పులు వస్తాయనీ, ఆ గడ్డి తిన్న పశువులు పాలు ఇవ్వవు అనీ అపోహలు ఊళ్ళల్లో ఉండేవి. ఇప్పుడు అదంతా చరిత్ర. అదే ‘పొట్టి’ వరి రకాలపై వందలకొద్దీ పరిశోధనలు జరిగిన తర్వాత, వస్తున్న పలు రకాల‘రిఫైండ్’ బియ్యం అన్నం ఇప్పుడు మనం తింటున్నాం.ఒక అన్నం అనే కాదు, అది ఏ రంగమైనా కొత్తదనాన్ని అంత తేలిగ్గా అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండం. పైకి అది నిజమని ఒప్పుకోవడానికి మనం పెద్దగా ఇష్టపడం. కానీ, జీవితం ఏవో కొన్ని చట్రాల మధ్య స్తబ్ధుగా అలా సాగిపోవడంలో కూడా వొక నులివెచ్చని సౌఖ్యం ఉంటుంది. దాన్ని తప్పు పడుతూనే ప్రతి కాలంలోనూ కవులు, రచయితలు సమాజాన్ని జాగృతం చేసేది.అది ఏ చట్రం అయినా కానీ, ఈ నులివెచ్చని సౌఖ్యం మనకు ఎలా ఉండాలి అంటే– కష్టం వస్తే చెప్పుకోవడానికి సమీపాన ఒక పెద్దమనిషి ఉండాలి. అతడు మనకంటే కొంచెం ఎత్తులో కూర్చుని అవసరమైతే మనల్ని గదమాయిస్తూ సలహా వంటిది చెప్పే వాడై ఉండాలి. అతడు చెప్పాలి మనం వినాలి. వెళ్ళిన పని అయ్యీ కానట్టుగా పాక్షికంగా జరగాలి. ఎందుకంటే, మన కష్టానికి కారణమైన వారికీ ఇదే పెద్దమనిషి పూచీ.ఇదీ ఇన్నాళ్ళూ మనకు తెలిసిన లెక్క. మరి ఇప్పుడు అదేమీ కాదని ఆ స్థానంలోకి ఒక ‘వలంటీర్’ వచ్చాక, ఆ వెనుక ఒక సచివాలయం అనే ఆఫీసు... అక్కడిచ్చిన ఫిర్యాదు పైకి వెళ్లి కిందికి పరిష్కారం రావడం అంటే, మరీ కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు ఏమిటి ఇదంతా?! అదే పని అయినా... మరీ ఇంత వేగిరం (‘ఎస్ ఆర్ నో’) తెమిలిపోతే ఎలా? ఆ తర్వాత ఏమిటి చేయడం? 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదే పెద్ద సమస్య అయింది. ఒకే ఒక్క ‘బటన్ నొక్కడం’ అనేది పైన చెప్పిన వైనం మొత్తానికి చోటు లేకుండా చేసింది. ఇంకా చెప్పాలంటే, సామాన్యుల జీవనంలో ఎంతో విస్తరించుకుని ఉండే ఇంత పెద్ద ‘మెలోడ్రామా’ బొత్తిగా మాయమయింది.సంప్రదాయ రాజకీయ సమాజంలో ఆధిపత్య కులాల పెద్దలకు ‘రికార్డు’లో వారికి ఎటువంటి హోదా లేకున్నా కేవలం ‘బై నేమ్’ వారు ఫోన్ చేసి రెవెన్యూ, పోలీస్ ఆఫీసుల్లో ‘పవర్’ చెలాయిస్తూ పనులు చేయించడం చాలా పాత విషయం. చట్టసభల్లో ఉండే నాయకులు ఇటువంటి ‘సెమీ వర్టికల్స్’ వలయాలు తమచుట్టూ ఏర్పడాలని, అటువంటివి వీలైనంత ఎక్కువగా ఉండేట్టుగానే వారు కూడా కోరుకుంటారు. ఎందుకంటే, ఎన్నికలప్పుడు ఓటర్లతో ‘లైవ్ నెట్ వర్క్’ ఉండే ‘ఛానెల్’ వాళ్లకు ఇదే! కుదిరితే ఏవో నామినేటెడ్ చైర్మన్ పదవులు లేదా ‘కాంట్రాక్టులు’ వీళ్ళకు ఎటూ ఉంటాయి. కౌన్సిలింగ్ పద్ధతి లేని రోజుల్లో చిన్న ఉద్యోగుల బదిలీలు వీళ్ళు అవలీలగా చేయించేవారు. వీరు కేంద్రంగా జరిగే లావాదేవీలు పార్టీల్లో చిన్నకులాల కార్యకర్తలకు అదొక మధ్యస్థాయి అదనపు వ్యాపారంగా సాగేది.అయితే, దశాబ్దాలుగా ఇంత చిక్కటి వలయాలుగా అల్లబడిన అధికార చట్రం కూసాలను, ఐదేళ్ళ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం–గ్రామ సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థతో ఎక్కడికక్కడ వదులు చేసేసింది. దాంతో ‘డెలివరీ సిస్టం’లో ఉండే ‘లీకేజీ’ల వద్ద ప్రయోజనం పొందే ‘కేడర్’ నష్టపోయి అసంతృప్తులు అయ్యారు.‘పవర్ పాలిటిక్స్’లో జరిగే ఇటువంటి మార్పును నిజానికి ‘న్యూట్రల్ ఓటర్’ హర్షించాలి. అది జరగలేదు సరికదా– ‘మాది తీసి వాళ్లకు పెడుతున్నారు...’ అనే ఫిర్యాదు వద్దే వాళ్ళు ఆగిపోయారు. అలా ‘ఇంక్లూజివ్ గ్రోత్’ అవసరాన్ని గడచిన పదేళ్ళలో అందరూ మర్చిపోయారు. ఇంతకీ జరిగింది ఏమిటి, మునుపున్న ‘సెమీ–వర్టికల్స్’ జాగాను గ్రామ సచివాలయాలలోని బహుజన యువతతో ‘హారిజాంటల్’గా జగన్ మార్చారు.అయితే, సంప్రదాయ అధికార నిర్మాణ చట్రం ఎప్పుడూ భద్రత కోరుకుంటుంది. ఏ కారణం చేత అది బీటలకు గురైనా పార్టీలతో పనిలేకుండా మొత్తం రాజకీయ చిత్రంపై దాని పర్యవసానాలు ఉంటాయి. జగన్ పాలనలో ఏపీలో సుపరిపాలన లక్ష్యంగా పరిపాలనా సంస్కరణలు మొదలైనట్టు తెలుస్తూనే ఉంది. కానీ జరిగింది ఏమిటి? సంప్రదాయ ‘పవర్ పాలిటిక్స్’ బహుళ అంచెలు (హైరార్కీ) కొంతమేర నిర్వీర్యం కావడం నిజమే. కానీ, ఈ స్వల్ప వ్యవధిలో ఆ స్థానంలోకి వచ్చిన ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ ఆ పార్టీకి పాక్షికంగానే ఉపకరించాయి. ఆ కారణంగా, ఒక హక్కుగా ‘రాజ్యం’ ఇచ్చే సంక్షేమ ప్రయోజనాలు తీసుకుంటూనే, ఏ ఒక్క రాజకీయ పార్టీకి విశ్వాసంగా ఉండనక్కర లేదనే స్వేచ్ఛాశ్రేణులు ఏర్పడే కొత్త పరిస్థితికి అది దారితీసింది.ఈ పార్టీ తీసుకున్న ఈ కొత్త వైఖరి వల్ల, అది తన ఓటర్లకు– ‘మీ మెడమీద ఇకముందు ఏ కాడి ఉండదు’ అని భరోసా ఇచ్చింది. గెలిచారా, ఓడారా అనేది అటుంచితే... రూపాంతర ప్రజాస్వామ్యం (‘ట్రాన్స్ఫార్మింగ్ డెమోక్రసీ’) దృష్టి నుంచి చూసినప్పుడు ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఇన్నాళ్ళూ కనిపించని చట్రాల మధ్య బంధించబడిన పక్షుల్ని ఇక స్వేచ్ఛగా బతకమని పంజరంలో నుంచి వాటిని బయటకు వదలడం వంటిది.ఇంత చేసి– ‘మా పార్టీ వల్ల మీకు మేలు జరిగిందని నమ్మితేనే మాకు ఓటు వేయండి’ అని జగన్ ‘ఆప్షన్’ ఇవ్వడం– ‘లిబరల్ డెమోక్రసీ’ వైఖరికి పరాకాష్ట. జనానికి అది అర్థం కాకపోతే, రాజకీయ పార్టీగా దానికి నష్టం అయితే కావొచ్చు. కానీ, దేశ రాజకీయాల్లో 2024 ఆంధ్రప్రదేశ్ ప్రయోగం ఒక ‘కేస్ స్టడీ’ కానుంది. ఇప్పటికే నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియా రీసెర్చ్ ఫెలో విగ్నేష్ కార్తీక్, జేఎన్‌యూ పరిశోధకుడు వి. చంద్రశేఖర్ ఈ ఎన్నికల్లో రెండు పక్షాల వైఖరిలోని వైవిధ్యాన్ని ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్లపత్రిక వ్యాసంలో వెలికి తీశారు.– జాన్ సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అట్టడుగు వర్గాలకు చేరిన కొత్త నమూనా
శరదృతువు వేకువ వేళల్లో చెట్లకు పట్టి ఉండే మంచు మాదిరిగా పైకి కనిపించకుండా, ఒక ‘ఫీల్ గుడ్’ వాతావరణం ఈ రోజున మన రాష్ట్రమంతా ప్రజల్లో వ్యాపించి ఉంది. నాలుగు కారణాల వల్ల ఈ మాన సిక స్థితి (ఫీల్) మన సమాజం అంచులలోని (మార్జినలైజ్డ్) ప్రజల వరకు చేరుతూ, క్రమంగా ఒక భావనగా వారిలోకి లోతుగా ఇప్పటికే అది ఇంకింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి అని చూసినప్పుడు, మొదటిది– ప్రతి యాభై కుటుంబాలకు అయాచి తంగా దొరికిన ‘గైడ్’ మాదిరిగా ‘కనెక్ట్’ అయిన ‘వాలెంటీర్లు’. రెండవది – అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పథకంలో అందిన ఆర్థిక సహాయం. మూడవది – ‘స్మార్ట్ ఫోన్’ వినియోగం అన్ని ఆర్థిక వర్గాలకు చేరడం. చివరిది ‘సంక్షేమరాజ్యం’ భావన స్థిరపడడానికిగాను ప్రజల సమీ పానికి పరిపాలన చేరడానికి పాత 13 జిల్లాలు 26 కావడం. మరి కొందరు దీన్ని – ‘విధ్వంసం’ అంటు న్నారు కదా అంటే, అదీ నిజమే. కాలం చెల్లిన పాతవాటిని పక్కకు నెట్టి, వాటి స్థానంలోకి వచ్చే ‘కొత్త’ ఏదైనా అలా అనిపించడం సహజమే. అయితే, కాలంలో వచ్చే మార్పులో భాగంగా వేగం కోసం ‘ఐ.టి.’ ద్వారా ‘స్మార్ట్ గవర్నెన్స్’ సాంకేతికతను పరిపాలనకు అన్వయించే మార్పు ప్రక్రియ గురించి, రేపటి తరం ఏమని అనుకుంటున్నది? అనేది ఇక్కడ ప్రధానం. భవిష్యత్తు యువతదే కనుక వర్తమానం సమీక్షకు వాళ్ళే నిజమైన న్యాయ నిర్ణేతలు. అయితే, నువ్వు ఏ కాలానికి అర్హమైన నాయ కుడివి? అనేది ఇక్కడ అతి విలువైన అంశం. ఈ ప్రభుత్వం వేటి కేంద్రితంగా ఉన్నదో చూడండి– ఒకటి ‘ప్రజలు’. రెండు ‘ప్రాంతము.’ చరిత్రలో ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పరిపాలించిన రాజులు విఫలం కాలేదు. ఈ రెండింటి కోసం నీకున్న ఐదేళ్ళ కాలపరిమితిలో నువ్వు ఏమి చేశావు? అనేది ప్రజల ముందుకు వెళ్లి వాళ్లకు చెబితే చాలు. నీ నిజాయతీని ప్రజలు గమనించి మిగిలింది కూడా నువ్వే పూర్తి చెయ్యి, అని మళ్ళీ నీకే కుర్చీ అప్పగిస్తారు. మన రాష్ట్రంలోని ఆలో చనాపరులకు మన ప్రతిపక్ష నాయకుడి విషయంలో ఇక్కడే అనుమానం కలుగుతున్నది. గతంలో ‘జన్మభూమి’ నుంచి ‘విజన్– 2020’ వరకు ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు కోసం మేధో కసరత్తు చేసిన అనుభవం పెట్టు కుని, ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ ‘పబ్లిక్ పాల సీ’ని ప్రతిపక్షం తరఫున లేదా వారి కూటమి తరఫున గానీ ప్రకటించలేక పోవడం ఏమిటి? రాజకీయ విమర్శ కోసం సి.ఎం.ను– ‘సైకో’ అని, ప్రభుత్వ పరిపాలన ‘విధ్వంసం’ అని అన్న ప్పుడు, అ మాటలకు సవివరమైన వివరణ ఎందుకు ఇవ్వరు? మీరు అంటున్న ‘విధ్వంసం’ నిజమై, అదే అనుభవం రాష్ట ప్రజలకు కూడాఉండి ఉంటే, అదేదో వివరం చెబితే ప్రజలు కూడా వాళ్ళూ మీతో ‘కనెక్ట్’ అవుతారు కదా? మీరు చేస్తున్న ఇటువంటి ఆరోపణలు అస్పష్టంగా ఎందుకు ఉంటున్నాయి? ప్రభుత్వంపై చేస్తున్న విమర్శ విషయంలో ప్రతిపక్షం నిస్సహాయత చూశాక, ‘కూటమి’ని పక్కనపెట్టి – ‘కొత్త రాష్ట్రానికి కొత్త నమూనా పాలన అందిస్తున్న ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ ప్రభుత్వం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అనే వైపు మధ్యతరగతి ఆలోచనాపరుల దృష్టి మారింది. ‘సాఫ్ట్వేర్’ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ‘కరోనా’ కాలంలో కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోమ్’ అవకాశం ఇచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రాకను ప్రోత్సహిస్తూ–‘వర్క్ ఫ్రం హోమ్ టౌన్’ నినాదంతో ‘బి టైప్’ పట్టణాల్లో ‘టవర్ల’ సామర్థ్యం పెంచి, స్థానిక ఇంజనీరింగ్, పాలి టెక్నిక్ కాలేజీల్లో వీరి కోసం ‘వైఫై’ సేవలు ఏర్పాటు చేసింది. మన రాష్ట్రానికొస్తే ఏమిటి పరిస్థితి? అనేదానికి వీరికి ఇదొక – ‘డ్రెస్ రిహా ర్సిల్స్’ అయింది. అంతేకాదు, ప్రభుత్వ ప్రాధాన్యతలుగా మారిన విద్య, వైద్యం, శాంతి భద్రతలు; ‘లీజర్’ కోసం రూపు మారుతున్న ‘పబ్లిక్ పార్కులు’, రెస్టారెంట్లు, అందుబాటులోకి వస్తున్న ‘క్యాబ్ సర్వీసులు’... ఇవన్నీ ఇక ముందు యువత మన రాష్ట్రంలో విస్తరిస్తున్న కంపెనీల్లో ఉపాధి వెతుక్కునే అంశాలు. ఇందులో వీరి అమ్మానాన్నల ‘పిల్లలు దగ్గరలో ఉద్యోగం చేసుకుంటూ అందుబాటులో ఉంటే బాగుండు’ అన్న ఆశను స్పర్శించే అంశం కలిసి ఉందనేది విడిగా చెప్పనక్కర లేదు. ఈ అంశంపై వ్యాసం రాయడం మొదలు పెట్టినప్పుడు ‘వాలంటీర్ల’ వివాదం అప్పటికి ఇంకా మొదలు కాలేదు. దీన్ని ముగించేటప్పటికిరాష్ట్రంలో మారిన సామాజిక సన్నివేశం, పైన చెప్పిన ‘ఫీల్ గుడ్’ భావనను వాస్తవం చేసింది. కొత్త రాష్ట్రానికి కొత్త నమూనా పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఒనకూరే ప్రయోజనాలు ఏమిటి? అనే వైపు మధ్యతరగతి ఆలోచనాపరుల దృష్టి ఇప్పటికే మారింది. ఇక ముందు మన అనుభవంలోకి రానున్న రాష్ట్ర అభి వృద్ధి ప్రణాళికా రచనలో ఏమున్నదీ అ పార్టీ ఎన్ని కల ‘మ్యానిఫెస్టో’లో వెల్లడి కావలసి ఉంది. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త సామాజిక, అభివృద్ధి అంశాల విశ్లేషకులు -
వారెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు!
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థలో జరిగిన ఆర్థిక అవకతవ కలు జాతీయ స్థాయి వార్తల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈ సంస్థ పనిలో లొసుగుల విషయం అటుంచితే, దీని స్థాపనకు ముందు మూడు దశాబ్దాల కాలం పాటు కుంటుకుంటూ సాగి... గిడసబారిన బడుగు బలహీన నిమ్న వర్గాల యువత ఉపాధి దీన చరిత్రను చూడాల్సి ఉంది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో 1985లో ఇండియాలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఏర్పడింది. ఇది జరిగాక, విద్యను ఉపాధి కేంద్రిత దృష్టితో చూడడం మొదలయింది. అంతకు ముందు అది– ‘జ్ఞానం’ కేంద్రంగా ఉండేది. ఈ శాఖ ఏర్పడిన తర్వాత మానవీయ శాస్త్రాల నుండి వాణిజ్య, శాస్త్ర– సాంకేతిక విద్య వరకు అన్నింటినీ ఒక గొడుగు కింది చేర్చి చూడడం మొదలయింది. అలా తొలి మానవ వనరుల శాఖ మంత్రి పీవీ నర సింహారావు ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాక, 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలలో మన– ‘మానవ వనరుల’ దృష్టికి ద్రవరూపం ఏర్పడి, అది అన్ని అభివృద్ధి – సంక్షేమ పార్శ్వాల్లోకి ప్రవహించడం మొదలయింది. చివరిగా అప్పటి ప్రధాని మన్మోహన్ ‘సీఐఐ’ వంటి వేదికల మీద ఉపాధి అవ కాశాల కల్పన పెంచమని పారిశ్రామిక వేత్తలను కోరడం ఈ మొత్తం పరిణామాలకు ముగింపుగా చూడాల్సి ఉంటుంది. ఈ కాలంలోనే పట్టణాభివృద్ధి, విద్యుత్తు, కమ్యూని కేషన్స్, పారిశ్రామిక, ఇరిగేషన్ రంగాల్లో ‘ఇంజనీరింగ్’ విద్య అవసరం బాగా పెరిగింది. దాంతో మానవ వనరుల అవసరాన్ని ‘డిమాండ్ – సప్లయ్’ దృష్టితో చూడడం మొదలయింది. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, వనరుల సహకారంతో ప్రయివేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొదలై అవి లాభసాటి వ్యాపారంగా మారడంతో మన (ఉమ్మడి) రాష్ట్రంలో ఆ కోర్సుల్లోకి ప్రవేశం ఖరీదు అయ్యింది. దాంతో 2000 నాటికి ఇంజనీరింగ్ కాలేజీల ‘గ్రేడింగ్’ను బట్టి ఎంపిక చేసుకున్న వాటిలో తల్లితండ్రులు తమ పిల్లల్ని చేర్చడం మొదలయింది. ఆ దశలో స్థోమతు లేని పిల్లలకు 2004 తర్వాత వైఎస్సార్ ప్రభుత్వంలో– ‘ఫీజ్ రీయింబర్స్మెంట్’ పథకం అందు బాటులోకి వచ్చాక; పెద్ద ఎత్తున అన్ని ఆర్థిక స్థాయుల్లోని పిల్లలు వీటిలో చదివి దేశ విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందారు. ఎప్పుడైతే సాంకేతిక విద్య ‘మార్కెట్’ ప్రతిపాదికగా మారిందో, అప్పుడు వీరి ఉపాధి అవకాశాలు ‘ఫస్ట్–కమ్ –ఫస్ట్’ వడ్డనగా తయారైంది. అప్పటికే ఇంజనీరింగ్ డిగ్రీ మాత్రమే చాలదు ఎంబీఏ ఉండాలనీ, ఎమ్‌టెక్ తప్పనిసరి అనీ, కాదు అమెరికాలో ఎమ్ఎస్ ఉండాలి అనే భిన్న ధోర ణులు సాంకేతిక విద్య మార్కెట్లో వ్యాపించాయి. చివరికి ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నప్పటికీ పలు స్థాయుల్లో జరిగే ‘ఎలిజిబి లిటీ టెస్ట్’ పాసైతేనే ఉద్యోగం అనే పరిస్థితి దాపురించింది. ఫలితంగా ఆలస్యంగా ఇందులోకి వచ్చిన అంతంత మాత్రపు చదువులున్న తల్లిదండ్రులకు వారి పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. అప్పటికే ‘హ్యుమానిటీస్’ డిగ్రీలకు ఉద్యోగ మార్గాలు మూసుకు పోయాయి. ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియం చదువు పునాది లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ కరవు కావడం, గ్రామీణ నేపథ్యం,వంటివి వీరి ఉపాధికి అవరోధాలు అయ్యాయి. 2007లో శేఖర్ కమ్ముల తీసిన ‘హేపీ డేస్’ సినిమాలో ‘కేంపస్ సెల క్షన్స్’లో ఉత్తరాంధ్ర గ్రామీణ విద్యార్థి పడిన పాట్లు ఈ పరిస్థితికి అద్దం పట్టాయి. డిగ్రీ ‘సర్టిఫికెట్’ ఉండికూడా కేవలం ‘స్కిల్స్’ లేక కుటుంబ పోషణార్థం‘మార్కెటింగ్ ఎగిక్యూటివ్’, ’రియల్ ఎస్టేట్ ప్రమోటర్’ వంటి దుఃస్థితిలో వీరు ఉండిపోయారు. ఇటువంటి ఉపాధి దుఃస్థితి నేపథ్యంలో 2014లో రాష్ట్ర విభ జన జరిగాక, టీడీపీ ఏపీలో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి చర్యను సంక్షేమం అనుకుందో లేదా అభి వృద్ధి అనుకుందో తెలియదు గానీ; పైన చెప్పుకున్న దయ నీయ స్థితిలో ఉంటూ ఉపాధి వెతుక్కుంటున్న యువత కోసం ‘ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఏర్పాటు చేసింది. చివరికి 2014–19 మధ్య ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే కాలం ఎవరి కోసం ఆగదు కనుక ‘ఫస్ట్–కమ్–ఫస్ట్’ అనేది అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఈ జూలై రెండో వారంలో జరిగిన యూనివర్సిటీ వైస్–ఛాన్సలర్ల సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ – సాంకేతిక విద్యా రంగంలో నూతన పోకడలతో (ఎమర్జింగ్ టెక్నాల జీస్) సిలబస్‌లను రూపొందించాలని కోరారు. ప్రపంచం ఇలా ముందుకు పోతుంటే, కేవలం ‘స్కిల్స్’ లేక మిగిలిపోతున్న పిల్లలు భవిష్యత్తు ఒక జీవిత కాలం లేటు కావడం అనేది, ఇప్పటికైనా ఈ ‘స్కిల్’ కుంభకోణం ఉదంతంలో మనకు కనిపిస్తుందా? జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
బ్లూ ఎకానమీ గురించి మాట్లాడరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ ఆగస్టు 15న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి – ‘అంటరానితనం’ అనే పదాన్ని తన అధికారిక ప్రసంగంలో ప్రస్తావించి, అనూహ్యంగా మరోసారి పరిశీలకుల దృష్టిని తన వైపుకు తిప్పు కున్నారు. ప్రగతిశీల వాదులు సైతం – ఇంకా అదెక్కడ ఉందంటూ కనిపిస్తున్న దాన్ని – ‘కార్పెట్’ కిందికి తోస్తుంటే; అదేమీ కాదని జగన్ పని మాల– ‘అంటరానితనం’ ప్రస్తావనను అధికారిక వేదికపై తెచ్చారు. దాంతో ఇంతకూ అదిప్పుడు ఉందా లేదా? ఉంటే ఏమిటి? అనే చర్చను మన ముందుకు తెచ్చారు. ఇక ఇప్పుడు కార్య సాధకులు కనుక ఎవరైనా ఉంటే వారు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను అబద్ధం చేసే పని చేపట్టవచ్చు. సీఎం మాటల్లోనే అది– ‘ఈ నాలుగేళ్ల పాలనలోనే, రూపం మార్చుకున్న అంటరానితనం మీద, పేద వర్గాలను అణచి వేస్తున్న ధోరణుల మీద యుద్ధాన్ని ప్రకటించాం. అంటరాని తనం అంటే, ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోటానికి వీల్లేదని దూరం పెట్టటం మాత్రమే కాదు, పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్న మెంట్ బడిని పాడుపెట్టటం, పేదలు ఏ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారో ఆ ఉచిత సేవలు వారికి అందకుండా ఖరీదు చేయటం, పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం, పేదలు కోరుకునే చిన్నపాటి ఇళ్ళ స్థలాన్నీ ఇంటినీ వారికి ఇవ్వకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం... ఇవన్నీ రూపం మార్చుకున్న అంటరానితనంలో పేదల మీద పెత్తందారీ భావజాలంలో భాగాలే. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడేవరకూ ఇటువంటి అంటరానితనం మీద ఈ యుద్ధం కొనసాగుతుంది.’ ఇలా సాగింది ఆ సందేశం. ఈ సందేశం– ‘గ్రామర్’ ఏమై ఉంటుంది అని చూసి నప్పుడు, సీఎంగా తన రెండవ టర్మ్‌లో చేపట్టబోయే కార్యా చరణకు జగన్ తొమ్మిది నెలలు ముందుగానే ‘సామాజిక వాతావరణ’ ముందస్తు హెచ్చరికను జారీ చేశారేమోనని అనిపిస్తున్నది. అయితే, విమర్శకులు అనొచ్చు, ఎన్నికల ముందు రాజ కీయ నాయకులు ఇలా కాకుండా మరెలా మాట్లాడతారు? అని. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పైకి కనిపించకుండా అమలవుతున్నసాంఘిక వివక్షను ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వం చేపడుతున్న చర్యల ప్రతిఫలానాలు – ‘నీతి అయోగ్’ వంటి స్వతంత్ర ప్రతి పత్తిగల సంస్థలు సైతం వెల్లడిస్తున్న నివేదికల్లో చూడవచ్చు. పైకి కనిపించని సూక్ష్మం అనిపించే ఇటువంటి అంతర్గత అంతరాన్ని ఈ ప్రభుత్వం పట్టుకుంది. దాని మీద అది ’ఫోకస్’ వేసి తగు నివారణా చర్యలు మొదలుపెట్టింది. అయితే, ఈదృష్టికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అది – రెండు వందల ఏళ్ళపాటు ఈ సర్కారు జిల్లాలు బ్రిటిష్ పాలనలో ఉండడం. దాంతో – ’మిషన్ అప్రోచ్’తో ప్రజల వద్దకు వెళితే వాళ్ళతో ‘కనెక్ట్’ కావడం కష్టం కాదు అని నమ్మి, దాన్ని– సర్కారే కాదు, నైజాం జిల్లాల్లో కూడా అమలుచేసి; అవును నిజమే అని నిరూపించినవాడు వైఎస్సార్. దానికి కొనసాగింపుగా ఈ చారిత్రక నేపథ్యాన్ని – ‘నాయకుడు’గా తననుతాను ‘ప్రూవ్’ చేసుకోవడానికి జగన్ గరిష్ఠ స్థాయిలో వాడుకోవడం వెలుగులోకి రాని అంశం. ఇప్పటికి మూడేళ్ళ క్రితమే తమ పార్టీ శ్రేణుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి నోటినుంచి– ‘అవుట్ రీచ్’ అనే పదం రావడం; ‘మిషన్ అప్రోచ్’కి కొనసాగింపుగా ఇక్కడ గుర్తుచేసుకోవడం అవసరం. ఇటీవల – ‘సోషల్ ఇంజనీరింగ్’ వంటి పదాలను పొలిటి కల్ సర్కిల్స్‌లో దేశమంతా విరివిగా వాడుతున్నారు. అయితే, జగన్ విషయంలో దాన్ని ఆలా చూడడం కుదరడం లేదు.అందుకు కారణం – ఆయనలా గతంలో సామాజిక దొంతర్ల పొరల్లోకి ఛేదించుకుంటూ లోపలికి వెళ్లినవారు మనకు కనిపించరు. ఆర్థిక ప్రయోజనాలు అందే పథకాలు అంటే సరే, కానీ ‘పవర్ పాలిటిక్స్’లోకి వచ్చే కొత్త సామాజిక వర్గాలకు– ‘లెవెల్ ప్లేగ్రౌండ్’ గతంలో ఎక్కడిది? ప్రముఖ తెలుగు నవల ’మాలపల్లి’ (1922) లో రచయిత ఉన్నవ లక్ష్మినారాయణ ప్రతిపాదించిన ‘నిమ్న వర్గాల రాజకీయ నాయకత్వాని’కి, ఇది 21వ శతాబ్ది ’వెర్షనా’ అన్నట్టుగా... కొత్త ఆశలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కొందరికి అది పొసగకపోవడం అంటారా, అది వేరే విషయం.సంక్షేమం సరే, ‘అభివృద్ధి’ ఏది? అనేది ఈ ప్రభుత్వం వైపు వేలు చూపించేవారి అతి తేలికైన ప్రశ్న. ఈ ప్రశ్న తర్వాత వెంటనే వీరు – ‘హైదరాబాద్’ అంటారు. ఇక్కడి సంపన్న జిల్లాల సొమ్ము అక్కడ అనుత్పాదక రంగాల్లో పెట్టుబడులై, జరిగిన – అర్బన్ ‘అభివృద్ధి’ నమూనా ఇప్పుడు ఇక్కడ వద్దా? అనేది వీరి ప్రశ్న. కనీస భౌగోళిక వాస్తవిక స్పృహ లేని వాదనలివి. రాష్ట్ర విభజన జరిగాక, 2014–19 మధ్య– ‘సన్ రైజ్ స్టేట్’ అంటూ తీరాన్ని ‘బ్రాండింగ్’ చేస్తూ, ‘కార్పొరేట్’ తరహా ‘పబ్లిసిటీ’కి దాన్ని పరిమితం చేయడం మాత్రమే జరిగింది తప్ప; అప్పట్లోనే ఆ సూర్యోదయ తూర్పుచూపుతో ప్రణాళికా రచన మొదల యివుంటే, ఇప్పటికి పరిస్థితి మరోలా ఉండేది. సముద్రతీర రాష్ట్రానికి ‘బ్లూ ఎకానమీ’ లక్ష్యంగా విశాఖ పట్టణం కేంద్రిత చూపు కాకుండా, ఇంకా హైదరాబాద్ అంటూ పాతపాట ఏమిటి? అనే ఇంగితం పదేళ్ల తర్వాత కూడా ఈ విమర్శకులకు తట్టకపోవడం విడ్డూరం. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 15,375 కోట్లతో– రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టులు; రూ. 3,521 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం త్వరితగతిన పూర్తి అవుతున్నాయని వీరికి పట్టదు. కారణం ఇక్కడ కూడా వివక్షే. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లలో ఉపాధి అనేసరికి వీటిలో సంపన్న వర్గాల యువతకంటే, దిగువ మధ్య తరగతి యువత ఉపాధికి జరిగే ప్రయో జనం ఎక్కువ. వీటి గురించి మాట్లాడకుండా ఉండడం అంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తిరస్కరిస్తున్నట్టే! జాన్సన్ చోరగుడి వ్యాసకర్త సామాజిక, అభివృద్ధి అంశాల విశ్లేషకులు -
సవాళ్లను ఎదుర్కొనేవాళ్లకే భవిష్యత్తు
అమెరికాతో ఆయుధ కొనుగోళ్ల ఒప్పందం ముగిసిన నెల రోజుల్లోనే మళ్ళీ అదే పని మీద మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ వెళ్లారు. జూలై 14న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యు యేల్ మెక్రాన్‌తో 26 రఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్, మూడు స్కార్పియన్ డీజిల్ –ఎలక్ట్రిక్ సబ్ మెరైన్స్ కొనుగోలుకు ఒప్పందం జరిగింది. భారత ప్రభుత్వం వీటిని మన నౌకాదళం (నేవీ) అవసరాల కోసం సమకూర్చుకో బోతున్నది. యుద్ధ సమయంలో వినియోగించే డాక్ షిప్స్ ‘ల్యాండింగ్ ఫ్లాట్ ఫారమ్స్’ నిర్మాణానికి, ఫ్రాన్స్ తరఫున – ‘ఎల్ అండ్ టీ’, ఇక్కడ మన విశాఖపట్టణం ‘హిందుస్థాన్ షిప్‌యార్డ్’ రెండూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ రెండు దేశాల పర్యటనల్లో కొన్ని ఇతర అంశాలు ఉన్నప్పటికీ, ఈ దేశాలతో ఆయుధాల కొనుగోలు ఒప్పందాలు ఇక్కడ ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. గత నెల 20–24 తేదీల్లో జరిగిన మన ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో అమెరికాకు చెందిన ‘జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ’, మన ‘హెచ్ఏఎల్’తో కలిసి– ఫైటర్ జెట్స్ తయారీకీ, మన సముద్ర తీరంలో వినియోగానికీ 3 బిలియన్ డాలర్ల వ్యయంతో 31 ‘సీ– గార్డియన్ డ్రోన్స్’ కొనడా నికీ ఒప్పందం కుదిరింది. ‘ఇండో–పసిఫిక్’ రీజియన్ (ఇది మన దేశం చుట్టూ ఉంది) సముద్ర జలాల్లో అమెరికా యుద్ధనౌకలు ఉన్నప్పుడు– వాటి సర్వీస్, మరమ్మత్తులు మనదేశంలోని ‘కట్టు పల్లి’ షిప్ యార్డ్ (చెన్నై), ‘మెజగాంవ్’ డాక్ (ముంబై), ‘గోవా’ షిప్ యార్డ్‌లలో చేయడానికి అమెరికాతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు సముద్ర జలాలతో ముడిపడినవి కావడంతో, మున్ముందు ఇందుకు సంబంధించిన పర్యవసానాలు, ఇండి యాలో రెండవ పెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రంగా ఏపీని అవి నేరుగా తాకే అంశం. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే సముద్రం మీద నుంచి ఉగ్రదాడి జరిగితే ఎలా స్పందించాలనే మాక్ డ్రిల్ తూర్పు నౌకాదళం, మెరైన్ పోలీసులూ కలిసి ఏపీ తీరంలో నిర్వహించారనే వార్త రావడం ఇక్కడ గమనార్హం. అంతర్జాతీయ సంబంధాలలోకి ‘జియో–పాలిటిక్స్’ వచ్చాక, మారిన కొత్త దృశ్యం ఇప్పుడు అన్ని ఆసియా దేశాల్లో కనిపి స్తున్నది. పదేళ్ల వెనక్కి వెళితే అప్పటి పరిస్థితి ఏమిటి? 2013 జనవరి 1న అమెరికా న్యూస్ ఏజెన్సీ– ‘రాయిటర్’ కాలమిస్ట్ ‘జిమ్ ఉల్ఫ్’ ఆసక్తికరమైన వ్యాసం రాశారు. అందులో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా– ‘ఇండో–పసిఫిక్’ విషయంలో తీసు కున్న వైఖరితో– ‘మన పరిశ్రమలకు మంచి రోజులు రాబోతు న్నాయి; చైనా రక్షణ వ్యయం కారణంగా అమెరికా ఆయుధాల వ్యాపారం ఆగ్నేయ – ఆసియాలో పెరగనుంది’ అని అమెరికా ‘ఏరో స్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్’ వైస్–ప్రెసిడెంట్ ‘ప్రైడ్ డౌనీ’ అన్నట్టుగా ఆ కాలమిస్ట్ రాశారు. సరే 21వ శతాబ్ది నాటికి ‘జియో పాలిటిక్స్’ కీలకమైంది. మనం ఒకందుకు వాళ్లొకందుకు అన్నట్టుగా సాగిన ఈ వ్యవహా రంలో, ఎప్పుడెతే అమెరికాతోపాటు యూరప్‌లోని అగ్రదేశాల విదేశాంగ విధానం– ‘ఇండో–పసిఫిక్’ కేంద్రితం అయిందో; అప్పట్లోనే అంటే యూపీఏ –2 నాటికే ‘రీ మ్యాపింగ్ ఇండియా’ అవసరం మనకు అనివార్యం అయింది. గడచిన రెండు దశాబ్దాల పరిణామాలు చూశాక, జూన్ రెండవ వారంలో సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ హోం శాఖ సహాయమంత్రి సీహెచ్ విద్యాసాగరరావు–‘డా‘‘ అంబేడ్కర్ చెప్పినట్టుగా హైదరాబాద్‌ను ఇండియాకు రెండవ రాజధాని చేయాలి’ అని కోరడాన్ని మన దేశం– ‘రీ మ్యాపింగ్’ అవస రాలకు అదనపు కొనసాగింపుగా చూడాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వం ఆగ్నేయ–ఆసియా అవసరాలు దృష్ట్యా ఢిల్లీ పర్యవేక్షణ దక్షిణ కేంద్రితంగా ఉండాల్సిన అవసరం కనుక ఏర్పడితే, దేశీయంగా కూడా ‘జియో–పాలిటిక్స్’ వైఖరి ప్రయోజనకరం కావొచ్చు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ భవన సముదాయం అందుకు ధీటైన తోడ్పాటు అవుతుంది. జనరల్ ఎన్నికలకు సమీపాన ఇప్పుడు మనం చూస్తున్నవి విజయాలు అనిపిస్తే, ఇదేదో ప్రధాని నరేంద్ర మోదీ, తీరాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభావం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఒకానొక కాలం నాటికి ఎలా పరిణమించాయి అనేది ఇక్కడ ప్రధానం. అప్పటికి అక్కడ వాటిని ఎదుర్కోవలసిన ప్రభుత్వాలు ఏ మేరకు మారినా – ‘జియో–పొలిటికల్’ వేడిని తట్టుకోవడానికి తగినంత సంసిద్ధత ఏ మేరకు ఉంది? అనేదే ఇక్కడ ప్రధానం. ఎందుకంటే... ప్రజలు, ప్రాంతం, సార్వభౌమత్వం అనే ‘రాజ్యం’ ఉపాంగాల భద్రత కోసం కాలానుగుణంగా ‘ప్రభుత్వం’ తనను తాను ‘రీ–మ్యాపింగ్’ చేసుకోవలసి ఉంటుంది. ఇటువంటి అవసరం పడిన తర్వాత, మన వద్ద మొదట 2014లో రాష్ట్ర విభజన రూపంలో జరిగితే, సూక్ష్మస్థాయిలో మరోసారి అది 2022లో కొత్త జిల్లాల ఏర్పాటుగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎమ్ఓ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం తరచూ అంటూఉండే – ‘కోర్స్ కరెక్షన్’ ప్రక్రియను మన మారబోయే అవసరా లకు íసిద్ధంగా ఉండటంగా చూడాల్సి ఉంటుంది. పదేళ్ల విభజన తర్వాత, జరగనున్న జనరల్ ఎన్నికల్లో ప్రజల ఎంపిక ఎలా ఉండాలి? అన్నప్పుడు మన రాష్ట్రం సరిహద్దుల్లో వేగంగా మారుతున్న ‘గ్లోబల్’ పరిణామాలను ఎదుర్కోవడానికి పటిష్ఠమైన ‘గవర్నెన్స్’తో సిద్ధమవుతున్నది ఎవరు? అనేదే కొలమానం. -జాన్సన్ చోరగుడి , వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
మానవాభివృద్ధినీ మనం అంగీకరించలేమా?
ఈ నెల ఐదున – ‘కళ్యాణమస్తు’ పథకం ఆరంభిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్లుప్త ప్రసంగంలో– ‘ఈ పథకంలో వధువు విధిగా టెన్త్ క్లాస్ చదివి ఉండాలి’ అనే షరతు కుటుంబం ఆడపిల్లను చదివించడానికి ప్రోత్సహించడం కోసమే’’ అన్నారు. రాష్ట్రంలో పేదపిల్లల చదు వుల ప్రోత్సాహానికి ఇప్పటికే పలు పథకాలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇవి ’ఓట్ బ్యాంకు’ పథకాలు అనీ, రాష్ట్ర ఖజానాను కుదేలు చేసేవనీ, ‘కరోనా’నంతర కాలంలో విమర్శలు చేస్తున్నారు. ఈ రెండు విమర్శల్లోని నిజానిజాలను అటు జగన్ వ్యక్తిగత దృష్టి నుంచి, ఇటు మానవాభివృద్ధి నిర్వచనం దృష్టి నుంచి... ఇవి రెండు వేర్వేరు అంశాలుగా చూడాలి. మొదటిది– ముఖ్యమంత్రి ఈ విషయంలో చూపుతున్న శ్రద్ధలో రాజకీయం కంటే వందేళ్ల ఆయన కుటుంబం చరిత్ర నేపథ్య ప్రభావం ఉంది. వైఎస్ రాజారెడ్డి సోదరి డా‘‘ రత్నమ్మ 1923లో పులివెందుల తాలూకా బలపనూరులో ఐదవ తరగతి చదివిన తర్వాత, సొంత ఊళ్ళో హైస్కూల్ లేకపోవడంతో ఆమె తండ్రి జమ్మలమడుగు మిషన్ స్కూల్లో ఆమెను చేర్చారు. అలా పై చదువుల్లోకి వెళ్లి మెడిసిన్ చదివాక, జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్లో పనిచేశారు. సర్వీస్ మధ్యలో విదేశాల్లో ‘గైనిక్’ పీజీ చేసివచ్చాక, పదిమంది తోబుట్టువులు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె– ‘ట్యూబెక్టమీ’ ఆపరేషన్ చేయించుకున్నారు. కడప జిల్లాలో 1954 నాటికి అది మొదటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్. ఇదంతా ఇప్పటికి వందేళ్ల నాటి చరిత్ర. ఇక రెండవది– మానవాభివృద్ధి నిర్వచనం దృష్టి నుంచి చూస్తే... ప్రపంచీకరణ తర్వాత ఐరాస ఉపాంగం అయిన యూఎన్డీపీ 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ (ఎస్డీజీ)ను 2030 నాటికి లక్ష్యాలుగా నిర్దేశించి, అంశాల వారీగా వాటిని సమీక్షిస్తున్నది. కనుక, ఇది ఏమాత్రం ఇప్పుడు స్థానిక అంశం కాదు. ఢిల్లీలో మన ‘నీతి ఆయోగ్’ స్థాయిలోనే కాకుండా, పలు విదేశీ యూనివర్సిటీల్లో కూడా వీటిపై నిరంతరాయంగా అధ్యయనం జరుగుతున్నది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ‘పాపులేషన్–హెల్త్–జాగ్రఫీ’ ప్రొఫె సర్గా పనిచేస్తున్న ఎస్వీ సుబ్రహ్మణ్యన్ అదే యూని వర్సిటీలో–‘ఇండియా పాలసీ ఇన్సైట్స్ ఇనీషియేటివ్’ చీఫ్ ఇన్వెస్టిగేటర్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన–‘ఇండియా, ఇట్స్ ఎస్డీజీ ప్లెడ్జి గోల్ అండ్ ది స్ట్రాటజీ టు అప్లై’ శీర్షికతో వెలువరించిన వ్యాసం చూస్తే... ‘ఇందు కోసమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ కేంద్రిత సంక్షేమంపైఇంత శ్రద్ధ చూపుతున్నది’ అని ఆలోచనలో పడతాం. హార్వర్డ్ యూనివర్సిటీలో మనదేశంలోని 707 జిల్లాలు ప్రాతిపదికగా జరుగుతున్న పరిశీలనలో 2016–2021 మధ్య– ఐదేళ్లలోపు పిల్లల మరణాలు, మెరుగైన మరుగుదొడ్ల వసతి, కౌమార బాలికల గర్భిణీ శాతం, పేదరికం (మల్టీ డైమెన్షియల్ పావర్టీ) స్త్రీల బ్యాంక్ అకౌంట్స్ సంఖ్య వంటివి ఆ సమీక్షకు తొలి ప్రాధమ్యాలుగా ఉన్నాయి. ఒకప్పుడు ‘పేదరికం’ ఒక అంశంగా సమీక్షించే దశ నుంచి, మూడు అంశాలను కలిపి ఇప్పుడు దాన్ని– ‘మల్టీ డైమెన్షియల్ పావర్టీ’గా చూస్తున్నారు. అవి – 1. ఆరోగ్యం 2. విద్య 3. జీవన ప్రమాణాలు (వంటఇంధనం, శానిటేషన్, తాగునీరు, విద్యుత్తు, గృహవసతి, అసెట్స్).మారిన పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు, అభివృద్ధిని వదిలేసి సంక్షేమమా అంటున్నవారి చూపు ఎటువంటిది అనే ప్రశ్న ఉదయించడం సహజం. అమలులో ఉన్న జీవన ప్రమాణాల సూచీ మేరకు, ‘ప్రజల’ పేదరికం తగ్గించడం ఎన్నికయిన ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన బాధ్యత. ‘యూఎన్డీపీ’ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 నాటికి సాధించాలి అనే షరతు మీదే ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు నుంచి మనతో సహా పలు దేశాలకు ఆర్థిక సహకారం అందుతున్నది. విమర్శకులు ఈ విషయాన్నీ గమనంలో ఉంచుకోవాలి. ఉద్యోగులు, పెన్షనర్లు, మానవాభివృద్ధి పథకాల అమలు పట్ల సానుకూల వైఖరి కనపర్చకపోవడం, అవి తమకు అందే వేతన ప్రోత్సాహకాలకు అడ్డు అని భావించడం కొత్త ధోరణి. ఇక ‘ప్రైవేట్ సెక్టార్’ ఉద్యోగులకు తాము పనిచేస్తున్న కంపెనీల ఉనికి వెనుక ప్రభుత్వాలు కల్పించిన మౌలిక వసతులు, ‘సబ్సిడీలు’ ఉన్నవనే విషయాన్ని మరుస్తు న్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జీవిక ప్రశ్నార్థంగా మిగిలిన వర్గాల విషయంలో తమ ‘స్టాండ్’ ఏమిటని ఎవరికి వారు జవాబు వెతుక్కోవడమే మిగిలిన పరిష్కారం. -జాన్సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
లంగరు వేసుకుని చేసేది పాలన కాదు!
మరో పదమూడు మాసాలకు రాష్ట్ర విభజన జరిగి ఒక దశాబ్దకాలం పూర్తవుతుంది. ఇదే కాలంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం– ‘జీ20’ అధ్యక్ష స్థానానికి ఎదిగింది. సాధారణంగా ప్రభుత్వ అధినేతలు ఇటు వంటి ఎదుగుదలను తమ ఖాతాలో వేసుకుంటారు. అది సహజమే అయినా తాత్కాలికం. చరిత్ర రచన– ‘ఎవరి కాలంలో అని కాకుండా, ఏ కాలంలో ఏమి జరిగింది?’ అనే ప్రతి పాదికగానే సాగుతుంది. దానికి కారణం, ప్రభుత్వాల నిర్ణయాల ‘వెనుక–ముందు’ అందుకు దోహదం చేసే అంశాల తాకిడి అదృశ్యంగా కొన్ని కొన్నిసార్లు నిలువరించలేనంత బలంగా ఉంటుంది. ఉదాహరణకు ఇందిరాగాంధీ తొలి ‘టర్మ్’ను (1966 –77) ‘వెల్ఫేర్ ఎరా’ అంటున్నంత మాత్రాన, దానికి ముందున్న రెండు దశాబ్దాల పరిణామాల్ని విస్మరించడానికి కుదరదు. అలాగే– మరో రెండు దశాబ్దాల తర్వాత 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్ళీ గతాన్ని గుర్తుచేస్తూ – ‘ఇందిరమ్మ రాజ్యం – ఇంటింటా సౌభాగ్యం’ అంటూ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడంలో ఉన్నది, రెండు వేర్వేరు కాలాల మధ్య ఉన్న ఒక – నిరంత రత్వం! ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు చేరువ కావడం కనిపిస్తుంది. ఇటువంటి కొన్ని మినహాయింపులు కూడా చరిత్రలో నమోదు అవుతుంటాయి. ఇక్కడ – ‘ప్రభుత్వం’ ప్రజలకు చేరువ కావడం అంటే, అంతిమంగా – ‘రాజ్యం’ (‘స్టేట్’) ప్రజలకు చేరువ కావడం అని అర్థం చేసు కోవాలి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 13 జిల్లాలు ఉన్న రాష్ట్రాన్ని గత ఏడాది రిపబ్లిక్ దినోత్సవం నాడు 26 జిల్లాల రాష్ట్రంగా చేసింది. అందువల్ల, మునుపున్న ఒక్కొక్క జిల్లా రెండై – వాటికి ఇప్పుడు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు వచ్చారు. అలా ఈ ‘ప్రభుత్వం’ ప్రజలకు ‘రాజ్యాన్ని’ చేరువ చేసి, ‘బ్యూరోక్రసీ’ (పరిపాలన యంత్రాంగం) ద్వారా తాను కూడా మరింత దగ్గరయింది. ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకు అవసరం అయింది అంటే.. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన– 57 మంది ఐఏఎస్, 39 మంది ఐపీఎస్ అధికారుల బదిలీల్లో ఏడాది క్రితం కొత్తగా ఏర్పడిన జిల్లాల– కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు ఉన్నారు. పొరుగు రాష్ట్రాలతో మనం సరిహద్దు పంచుకొంటున్న – పార్వతీపురం మన్యం జిల్లా, పాడేరు– అల్లూరి జిల్లా (ఒడిస్సా), అన్నమయ్య జిల్లా (తమిళ నాడు), సత్యసాయి జిల్లా (కర్ణాటక) వంటివి కూడా ఉన్నాయి. ఉంటే ఏమైంది? దీన్ని– నాలుగేళ్ల క్రితం గ్రామ సచివాలయాలతో మొదలైన పరిపాలన సంస్కరణల ప్రవాహం, రాష్ట్రం ‘మ్యాప్’ అంచు ల్లోని – ‘టెయిల్ ఎండ్’కు చేరి (సింక్) ఇంకు తున్నట్టుగా చూడాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల వల్ల ప్రజలకు నేరుగా పౌర సేవలు అందించే సచివా లయాల పనిని, జిల్లా కలెక్టర్లు మరింత దగ్గరగా ‘మోనిటర్’ చేస్తారు. ఈ ఏర్పాటుతో – రాజధానిలో చీఫ్ సెక్రటరీ నుంచి కింద గ్రామ సచివాలయాల వరకు – ‘నెట్ వర్క్’ అమరిక పూర్తి అయింది. ఇక్కడొక సందేహం సహజం. స్థిరమైన రాష్ట్ర రాజధాని నగరం అంటూ లేకుండా, ఇంతపెద్ద మానవ వనరుల సమూహాన్ని పరిపాలన యంత్రాంగంలో భాగం చేయడం ఎలా సాధ్యమయింది? ఈ సందేహానికి సమాధానం వెతకడం కోసం లోతైన చర్చ అవసరం. సంప్రదాయ రాజకీయాల దృష్టి నుంచి– ‘ఏపీ హైబ్రిడ్’ పరిపాలనను చూసేవారికి, ఇవి అంత తేలిగ్గా నప్పవు కూడా. ఒకప్పుడు పరిపాలన అంటే, రాజధాని ‘నగరం’లో లంగరు వేసుకుని కూర్చుని చేసే పని అనేది మనకున్న అవగాహన. ప్రపంచీ కరణ నేపథ్యంలో ఈ అవగాహన మేర పాలన సాగిస్తే అభివృద్ధి అంతంత మాత్రమే అవుతుంది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఈ సూక్ష్మం గ్రహింపు లేక పోయింది. ఒకప్పుడు మనమే అనుమతించిన– ‘టెక్నాలజీ’ ఈనాడు మనల్ని కూడా ‘అవుట్ డేటెడ్’ చేయడం ఇందులో గుర్తించవలసిన మర్మం. చివరిగా.. ప్రపంచీకరణతో వచ్చిన– ‘జియో పాలిటిక్స్’ వల్ల కేంద్రం ‘ఢిల్లీ’ విడిచి దేశం అంచు (మార్జిన్స్)లకు చేరడం కొత్త పరి ణామం! ఇవి ఇక ఎంతమాత్రమూ ఒకచోట కట్టు కొయ్య పాతుకుని కట్టేసుకుని కూర్చుని పరిపాలన చేసే రోజులు కావు. కనుకనే, ఈ నెల మొదటి వారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మిజోరాం వెళ్లి రూ. 1.76 లక్షల కోట్లతో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ – రోడ్డు, రైలు, విమాన సర్వీసులు 2025 లోపుగా పూర్తి చేస్తామని ప్రకటించారు. అక్కడే రూ. 2,500 కోట్లతో చేపట్టే 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మరో వారానికి ప్రధాని మోదీ గౌహతిలో జరిగిన ‘బిహూ’ డ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఇక గత ఏడాది చివరి ఆరునెలలు ప్రధాని మోదీతో సహా అరడజను మంది కీలక శాఖల మంత్రులు మన కాకినాడ – విశాఖల మధ్య అధికా రిక పర్యటనలు పెట్టుకున్నారు. ఉన్నట్టుండి వీరంద రికీ దేశం ‘మార్జిన్స్’ ఎందుకు ముఖ్యమయ్యాయి? ఈ ప్రశ్నకు సమాధానం – ‘మార్జినల్ సెక్షన్స్’ సీఎంగా పేరుపడ్డ వైఎస్ జగన్ వద్ద దొరకవచ్చు! వ్యాసకర్త సామాజిక, ఆర్థిక అంశాల విశ్లేషకులు -
పాలనకు ఒక కొత్త నమూనా!
ప్రభుత్వ పాలనా వ్యవస్థ ఒక ‘పిరమిడ్’ వలె పైన ముఖ్యమంత్రి ఉంటే, దిగువన మంత్రిమండలి, దాని కింద శాసన సభ్యులు, ఆ తర్వాత జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటారు. దీనికి సమాంతరంగా ‘ఎగ్జిక్యూటివ్’ అనబడే అధికారులు, ఉద్యోగుల వ్యవస్థ ఉంటుంది.అయితే మునుపటికి భిన్నంగా, దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఏపీలో పిరమిడ్ స్థానాన్ని ‘చతురస్రం’ నమూనా పాలనతో భర్తీ చేయడం మొదలయింది. ఇది కొత్త ప్రయోగం కావడంతో దీన్ని ‘గ్రీన్ ఫీల్డ్ పాలిటిక్స్’ ప్రభుత్వం అనొచ్చు. ఇది ఎలా పనిచేస్తున్నది అంటే, తన ‘పబ్లిక్ పాలసీ’లో భాగంగా కొన్ని ప్రాధాన్యతా రంగాలను ఎంచుకుని, క్షేత్రస్థాయిలో దాని అమ లుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చు కుంటుంది. పైనుండి ఆదేశాలు దిగువకు వెళు తుంటే, దిగువ నుంచి సాధించిన లక్ష్యాల ‘డేటా’ పైకి పంపే ‘టూ–వే’ సమాచార వ్యవస్థ ఉంటుంది. జాప్యం లేకుండా సమాచారం అందేలా ‘నెట్ వర్క్’ కోసం ‘టెక్నాలజీ’, ఆఫీసులు, సిబ్బంది ముందే ఏర్పాటు అవుతాయి. ఇవన్నీ సరే, మరి ప్రాధాన్యతా రంగం ఎంచుకోవడం ఎలా? యూఎన్ఓ ఉపాంగం అయిన– ’యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ తన 177 సభ్య దేశాలు 2030 నాటికి చేరుకోవాలని నిర్దేశించిన 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ నుంచి స్థానిక అవసరాల ప్రాతిపదికగా వీటిని ఎంచు కుంటారు. ఏపీలో తొలి ప్రాధాన్యతగా విద్య, వైద్యం, వ్యవసాయ అనుబంధ రంగాలను ఈ ప్రభుత్వం ఎంచుకుంది. ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాలు సాధించిన లక్ష్యాల ప్రాతి పదికగా ర్యాంకులు వెల్లడిస్తున్నది. వీటి అమలుకు ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ అనుసరిస్తారు. సరిగ్గా ఇక్కడే – ‘మాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మాకు ఓటు వేసారా లేదా? కూడా చూడకుండా అర్హులైన అందరికీ...’ అంటూ సీఎం జగన్ చెప్పే జనరంజకమైన వాగ్దానం ‘కనెక్ట్’ అవుతుంది. ఇంతకుముందు ఇలా ఎందుకు జరగలేదు అంటే, అది ఎన్నికయిన ప్రభుత్వ నేతకు ఉండే విచక్షణ. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఇలా పని చేస్తున్నాయి అన్నప్పుడు, బయట రాష్ట్రాల అధికారుల బృందాలు తరచూ ఇక్కడికి క్షేత్రపర్యటనలకు రావడమే అందుకు జవాబు. ఇలా ఈ ప్రభుత్వంలో పిరమిడ్ స్థానంలోకి కొత్తగా చతురస్రం నమూనా పాలన వచ్చాక, పై నుంచి కిందివరకు ఏకరీతిగా ఒక ‘సాలిడ్ సిస్టం’ ఏర్పడి పని చేస్తున్నది. అర్హతలు పరిశీలించి ఒకసారి లబ్ధి దారుడి పేరు ఖరారు అయ్యాక, ‘డి.బి.టి.’ ద్వారా ప్రభుత్వం అందించే ప్రయోజనం నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతున్నది. గతంలో మాదిరిగా హౌసింగ్ అధికారులు లబ్ధిదారుడితో– ‘మీ ఎమ్మెల్యే గారు సిఫార్సు చేసిన లిస్టులో నీ పేరు లేదు’ అనడానికి ఆస్కారం లేదు. ఊళ్ళో రాజకీయాలతో ఒకవేళ తొలుత ఆపినా, ఆప డానికి కారణాలు ఏమిటో అదే ఊళ్ళో వున్న సచివాలయం సిబ్బంది ఫిర్యాదుదారుకు చెప్పాల్సి వస్తున్నది. గ్రీన్‌ఫీల్డ్ పాలిటిక్స్ అమల్లోకి తెచ్చిన ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ‘ప్రివిలేజ్’ సాగక, తొలి ఉక్కపోతలు నెల్లూరు నుంచి రికార్డు అయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరు శాసన సభ్యుడు వెలగపల్లి వరప్రసాదరావు ‘పార్టీ ఎమ్మెల్యేగా కంటే, ఒక పౌరుడిగా జగన్‌ను ఇష్ట పడుతున్నాను’ అన్నారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి కావడంతో వీరి పరిశీలనను ప్రత్యేకంగా చూడాలి. ఈ ఎస్సీ ఎమ్మెల్యే ఒక పౌరుడిగా తన పరిశీలనను దాచుకోలేక, ఉన్నది ఉన్నట్టుగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పైకి అనేశారు. ఒక ఎమ్మెల్యేకు తమ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడి పట్ల ఉండేది విశ్వాసం, కానీ ఒక పౌరుడికి కాలక్రమంలో కలిగేది – ప్రేమ. దాన్ని ఐదేళ్లకు పరిమితం చేయలేము! -వ్యాసకర్త జాన్సన్ చోరగుడి, అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
Gruha Saradhi: అనూహ్య వ్యూహం ‘గృహ సారథి’
‘గృహ సారథి’ పేరుతో ఈ ఏడాది 5.20 లక్షల మంది యువతను సూక్ష్మ (గ్రాస్ రూట్స్) స్థాయి క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామ్యుల్ని చేయాలని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఈ ‘గృహ సారథులు’ ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరు చొప్పున వారి అవసరాలు ప్రభుత్వం వద్ద ‘పెండింగ్’ కనుక ఉంటే, వాటి పరిష్కారం కోసం పార్టీ తరఫున పనిచేస్తారు. ఆ కుటుంబాల్లోని మహిళా సభ్యుల అవసరాలు తెలుసుకోవడం కోసం వీరిలో ఒక యువతి కూడా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఎన్నికల ముందు– ‘మా పార్టీ మీ గుమ్మం వద్ద’ అన్నట్టుగా వీరు ప్రజలకు అందుబాటులో ఉంటారు. వీరి పనితీరును సమీక్షించడానికి మరో 45 వేల మంది ‘కన్వీనర్లు’ ఉంటారు. ఎనభై శాతం పైగా నిర్లక్ష్యానికి గురైన వర్గాల యువత గత మూడేళ్ళుగా వలంటీర్లు, గ్రామ సచివాలయాలల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది సర్వీస్ ఇప్పటికే ప్రభుత్వం ‘రెగ్యులరైజ్’ చేసింది. మళ్ళీ అవే వర్గాలకు ఆ వ్యవస్థతో సమాంతరంగా, అధికార రాజకీయ పార్టీ శ్రేణులుగా పని చేయడానికి మరో కొత్త అవకాశం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగంలో ఇంత పెద్ద ‘రిక్రూట్మెంట్’ జరగడం ఇది ప్రథమం. ఈ ‘గృహ సారథి’ వ్యవస్థ వల్ల తాత్కాలిక ప్రయోజనం వారిని నియ మించిన పార్టీకి ఉంటే, దీర్ఘకాలిక ప్రయోజనం పెద్ద సంఖ్యలో రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్న ఈ యువతది అవుతుంది. ఇన్నాళ్లూ పార్టీ శ్రేణులుగా తలల లెక్కకు తప్ప దేనికీ పనికిరాని ఈ యువతకు, ఇక ముందు ‘బూత్’ స్థాయిలో అధికార పార్టీ ప్రతినిధులుగా కొత్త గుర్తింపు రాబోతున్నది. అంటే– భవిష్యత్ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయడానికి వర్ధమాన వర్గాల నుంచి వైసీపీ ‘నర్సరీ’లో సరికొత్త మానవ వనరు సిద్ధమవుతున్నదన్న మాట! సరిగ్గా ఇక్కడే తెలుగునాట మూడు దశాబ్దాల దళిత బహుజన రాజకీయాల ప్రస్తావన అనివార్యం అవుతున్నది. అప్పట్లో క్షేత్రస్థాయి శ్రేణుల పాటవ నిర్మాణాన్ని (కెపాసిటీ బిల్డింగ్) పట్టించుకోకుండా, కేవలం కొందరు నాయకుల వ్యక్తిగత ‘ఫోకస్’ తాపత్రయం కారణంగా, అప్పటి ఆ రాజకీయాల ఆయుష్షు అర్ధంతరంగా ముగిసింది. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పలుకుబడి వర్గాల ‘లాబీయింగ్’కు ‘చెక్’ పెట్టి మరీ, సాంఘిక సంక్షేమంలో– అర్హులైన అన్ని ఉపకులాలకు ఫలాలు అందే విధంగా ‘హైబ్రిడ్ మోడల్’ ప్రవేశపెట్టింది. దాంతో కాలం చెల్లిన ఒత్తిడి పెంచే ‘ట్రిక్స్’ ఇక్కడా మొదలయ్యాయి. ‘ఒకప్పటి ఎస్సీ కార్పొరేషన్ కాలం నాటి బడ్జెట్ ఏది? ఆ పథకాలు ఇప్పుడు ఏవి?’ అని ఇటీవల కొందరు వాపోతున్నారు. దామాషా మేరకు పంపిణీ లక్ష్యం కోసం, స్వీయ సామాజిక వర్గాల ఒత్తిళ్లనే జగన్ పట్టించుకోవడం లేదు. లొంగడం లేదు. చిత్రం– ఇప్పటికీ ఇక్కడ సమస్య ఏమంటే – ‘రాజ్యాధికారం’ అంటే, కాపుకొచ్చిన తోటలో పంట దింపుకోవడం కాదనీ, వీరికి అర్థం కావడం లేదు. దాన్ని ఆశించేవారు, అందుకు తమదైన నేల బాగుచేసి, అందులో అనువైన విత్తనాలు జల్లి ముందుగా మనదైన పంట పండించాలి. రాష్ట్ర విభజన తర్వాత, మారిన సమీకరణాలతో– ‘పోస్ట్ మండల్’ ‘పోస్ట్ ఎకనామిక్ రిఫారమ్స్’ కాలానికి తగిన సరి కొత్త రాజకీయాలు... కేవలం సాంప్రదాయ రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈ పార్టీలకు అవగాహన లేదు. నిశ్శబ్దంగా ఆ ఖాళీ జాగాను ఆక్రమించి, గత మూడున్నర ఏళ్లుగా తన సంక్షేమ–అభివృద్ధి ప్రయోగాలను ఇక్కడ అమలు చేస్తున్నారు జగన్. గత ఏడాది జరిగిన తొలి పార్టీ సమీక్షలో– జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ‘అవుట్ రీచ్ అప్రోచ్’తో మనం పనిచేయాలి అని ఒక కొత్త పదప్రయోగం చేశారు. దాని భావం అర్థమైతే, ఆయన విమర్శకులకు సగం పని భారం తగ్గుతుంది! ఇటీవల బహిరంగ సభల్లో జగన్ ‘ఇది కులాల మధ్య యుద్ధం కాదు, వర్గాల మధ్య యుద్ధం’ అన్న తర్వాత, ఆ ప్రకటనపై వ్యాఖ్యానించలేని దశలో ఇక్కడి రాజకీయ పక్షాలు మిగిలిపోవడం, ‘అకడమిక్’ వర్గాల్లో అధ్యయనం అవసరమైన అంశం. (క్లిక్ చేయండి: రోడ్ షోలు – పౌర హక్కులు – కోర్టు తీర్పులు) ‘గృహ సారథి’ నియామకం ప్రపంచీకరణ దుష్పరిణామాలను ఎదుర్కోవడానికి సామాజిక శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్న – ‘గ్రీన్ పాలిటిక్స్’ దిశలో ఒక ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే – ‘సోషల్ కేపిటల్’, ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ థియరీల ఆచరణకు ఇదొక పెద్ద ముందడుగు అవుతుంది. లోతులు తెలియని విమర్శకులు కురచ దృష్టితో దీన్ని తక్కువచేసి చూడ్డం తేలికే గానీ, వీరిని నియమించిన పార్టీ కంటే, ఆ పార్టీ శ్రేణులకు దీనివల్ల కలిగే ప్రయోజనం విలువైనది. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
మేము ఎన్నారైలు అయ్యాము కదా.. ఇంకా తెప్ప ఎందుకు..!?
గడచిన ముప్ఫై ఏళ్లలో కొత్తగా ఎగువ మధ్యతరగతిగా మారిన వర్గాలను, ఈ రోజు మీరు ఇంత భద్రంగా ఉండడానికి, ఇవీ కారణాలు అని చెప్పి వారిని ఒప్పించడం అంత తేలిక ఏమీ కాదు. కొన్నివేల రూపాయలతో కొన్న స్థలం నుంచి ఇప్పుడు నమ్మశక్యం కానంత ‘రిటర్న్స్’ వచ్చేట్టుగా మీ ఆస్తి విలువ పెరిగింది అంటే– అప్పట్లో దాన్ని కొనడం తప్ప, అదనంగా మీరు చేసింది ఏమీలేదు, అని వాళ్లనిప్పుడు ఒప్పించడం కష్టం. మీ పిల్లల జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి కూడా– ‘మార్కెట్ ఎకానమీ’ కారణం తప్ప, అందులో మన పనితనం ఏమీ లేదు. ఇవన్నీ సంపద పంపిణీ క్రమంలో, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల మనకు అందిన ఫలాలు. అయితే, ఇలా కొత్తగా ఎగువ మధ్యతరగతిగా ‘ప్రమోట్’ అయిన వారే చిత్రంగా ఇప్పుడు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలనూ, వాటిని అమలుచేస్తున్న ప్రభుత్వ ఉదార వైఖరినీ తప్పు పడుతున్నారు. ఇటువంటి ధోరణి మునుపు ఉందా అని వెనక్కి చూస్తే, 1970–80 దశకాల మధ్య కాలంలో అమలైన సంక్షేమం పట్ల ఈ తరహా విమర్శ దాదాపు లేదనే చెప్పాలి. కారణం– స్వాత్యంత్య్రం తర్వాత, కేంద్ర ప్రభుత్వ ‘సంక్షేమ విధానాల’ వల్ల కులాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా చితికి ఉన్న అన్ని వర్గాలు ఎంతోకొంత మేలుపొందాయి. కులీన వర్గాలుగా పేర్కొనే ఎగువ మధ్యతరగతి ఇప్పటిలా ప్రభుత్వ ఉదారవాద చర్యల్ని తప్పుపట్టేది కాదు. అప్పట్లో ఎక్కువమంది స్వాగతించిన – రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి నిర్ణయాలు అటువంటివే. అప్పట్లో భద్రతతో స్థిరపడి ఉన్న కులీన వర్గాలలోని విద్యాధికులు, దేశంలో జరుగుతున్న మార్పు ‘ప్రాసెస్’లో చురుకైన భాగస్వామ్య పాత్ర పోషించారు. వారు ఇక్కడ చదివి, విదేశాల్లో ఉన్నత విద్య తర్వాత ఇండియా తిరిగివచ్చి, దేశం చేస్తున్న ప్రగతి యజ్ఞంలో తమదైన పాత్ర పోషించారు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు (బయోకెమిస్ట్), డాక్టర్ యలవర్తి నాయుడమ్మ (లెదర్ టెక్నాలజీ) అటువంటివారే. ఇటీవల డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఇంకా రెండేళ్ల పాటు చీఫ్ సైంటిస్ట్‌గా కొనసాగే అవకాశాన్ని ఈ నవంబర్ 30 నాటికి వదులుకుని, ఇండియాలో బాలల ఆరోగ్య రంగంలో చేయాల్సింది చాలా ఉందని వెనక్కి రావడం ఈ ధోరణికి కొనసాగింపే అవుతుంది. ఇప్పుడైనా ఇది చర్చించాల్సిన అంశం ఎందుకైందంటే– ‘ఏరు దాటి మేము ‘ఎన్నారై’లు అయ్యాము కదా, మా వెనక వచ్చేవారి కోసం ఇంకా తెప్ప ఎందుకు ఉండాలి’ అని పేద కుటుంబాల కోసం అమలవుతున్న ప్రభుత్వ పథకాల పట్ల వారికున్న దుగ్ధను దాచుకోవడం లేదు. లేని వంకలు వెతికి మరీ ప్రభుత్వానికి మసిపూయడానికి వీరు చేస్తున్న ప్రయత్నంలో దాపరికం ఏమీలేదు. అది తెలుస్తున్నది. ఈ క్రమంలో వాదన కోసం, వీరికి ఆక్షేపించడానికి మరేదీ కనిపించక కొందరు– ‘రోడ్లు సంగతి ఏమిటి?’ అంటున్నారు. కానీ మూడేళ్ళకు ముందు రోడ్ల పరిస్థితి ఏమిటి, ఈ మూడేళ్ళలో క్రమం తప్పకుండా కురుస్తున్న వానలు వల్ల గట్లకు నీళ్లు తన్నుతూ నిండుతున్న చెరువులు, వాగుల సంగతి వీరికి పట్టదు. అంతేనా ‘కరోనా’ కాలంలో అత్యవసర వైద్యసేవల కోసం చేసిన వ్యయం గురించి కానీ, దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు పడిన గండి గురించి గానీ – ఎంతో సౌకర్యంగా వీరు తమ వాదనలో దాటవేస్తారు. నిజానికి వీరి సమస్య వేరు. అదేమో పైకి చెప్పుకోలేనిది. ఈ ప్రభుత్వం ప్రతి రంగాన్నీ క్రమబద్ధీకరించడంతో, మునుపటిలా వీరి ఆస్తుల విలువ పెరగడం లేదు. విషయం ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒకప్పుడు బలుపుగా కనిపించిన వాపులన్నీ పొంగు తగ్గి నరాలు బయటపడి, అన్ని రంగాలు మళ్ళీ సాధారణ ఆరోగ్య స్థితికి చేరు తున్నాయి. ఈ మూడేళ్ళలో ఇక్కడ రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీలు, డీజీపీ ఇప్పటికీ ఇక్కడ పనిచేయడానికి సుముఖత చూపడం, ‘బ్యూరోక్రసీ’కి ఇక్కడున్న పని అనుకూల వాతావరణంగా చూడాల్సి ఉంటుంది. కానీ కొందరికి ఇవేమీ జరగకూడదు. జరుగుతున్నవి ఎలాగోలా మధ్యలో ఆగిపోవాలి. అయితే ఎలా? ప్రభుత్వంపై ఫిర్యాదు ఉన్నవర్గాలు ఇప్పుడు పెద్దగా లేవు. ఫిర్యాదు ఉన్న వారి సమస్యేమో – ‘బ్లాక్ అండ్ వైట్’లో చెప్పలేనిది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యక్షుడు క్లావ్ స్వాబ్ 2004 ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో మాట్లాడుతూ– ‘సమాజంలో ప్రతి ఒక్కరికీ వికాసం పొందే అవకాశం కల్పిస్తే తప్ప, మనకు ఎంతమాత్రం భద్రత ఉండదు’ అనే హెచ్చరిక అయినా వీళ్ళకిప్పుడు అర్థం కావడం ఎంతైనా అవసరం. (క్లిక్ చేయండి: ‘మై హూ నా’ హామీ తీరేదెన్నడు?) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
‘మై హూ నా’ హామీ తీరేదెన్నడు?
సెగ ఎటు నుంచి తగిలితే నేమి, ఎనిమిదేళ్లుగా పిడచ కట్టుకుని ఉన్న ఘనీభవ స్థితి అయితే నెమ్మదిగా కరగడం మొదలయ్యినట్లుగా ఉంది. ఉన్నట్టుండి ‘ఢిల్లీ’ ఫోకస్ ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌పైన పడడంతో ఇక్కడి ప్రజలు, ఇటువంటి మార్పు పట్ల ఆనందంగా ఉన్నారు. కేంద్రం 2015 డిసెంబర్ 23న ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ ప్రకటన చేశాక, ఆ దిశలో తొలి అడుగులు ఆశాజనకంగా అనిపిస్తున్నాయి. అంతే కాదు ప్రధాని విశాఖ పర్యటనకు ముందు ఒక ‘పైలెట్ టీమ్ టూర్’ కూడా జరిగింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ‘సదరన్ క్యాంపస్’ ప్రారంభించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్; వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోర్టు సిటీ కాకినాడ వచ్చి... విదేశీ వాణిజ్యం మా ప్రభుత్వ ప్రాధాన్యం అని చెప్పివెళ్లారు. మరి ఇది మీ ఆంతర్యం కనుక అయితే, మీరు మాకు చేస్తున్న మంచిని ‘ఓపెన్’గా మాతో పంచుకోవడానికి ఇబ్బంది ఎందుకన్నదే మాకు అర్థం కానిది. విశాఖ రైల్వే జోన్ విషయమే తీసుకుందాం. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, విశాఖ పట్టణంలోని వైర్ లెస్ కాలనీలోని 35 ఎకరాల రైల్వే భూమిలో రూ. 110 కోట్లతో జోనల్ కేంద్ర కార్యా లయాల భవన నిర్మాణానికి ఆర్కిటెక్టులు ఇచ్చిన డిజైన్లు రైల్వేబోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్నాయని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పినట్టు ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఇంతలో ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో– ‘సెంటర్–స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్’ అంటూ, అందులో రైల్వే జోన్ ఎజెండా మొదటి అంశమని చంద్రగ్రహణం రోజు తెలిపింది. జోన్ ప్రతిపాదన మీ వద్ద సజీవంగా ఉందనే సంగతి ఇంత డొంక తిరుగుడుగా అదీ ఒక ఆంగ్ల పత్రిక చేసిన వెతుకులాట వల్ల మాకు తెలియడం, అంత అవసరమా? ప్రజలు, ప్రాంతము రెండూ ఇక్కడివే అయినప్పుడు; మాకు జరిగే ఏ మేలైనా, అది మీరు అధినేతగా ఉన్న ఈ దేశంలోనిదే కదా? ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పటి నుంచి మీరు ఢిల్లీ పీఠంపై ఉంటూ, ఇంకా మా రాష్ట్రాన్ని ‘ఓన్’ చేసుకోలేక పోవడం ఏమిటి? మోదీజీ విశాఖ రాక వైపు చూస్తున్నప్పుడు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు కలుగుతున్న సహజ సందేహాలు. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ఐల్యాండ్ నుంచి నంబర్ 10–11 మధ్య క్షిపణి ప్రయోగం జరగనుంది. క్షిపణి సముద్రం మీద శ్రీలంక, ఇండోనేషియాల మధ్యగా ప్రయాణించే దిశలో 2,200 కి.మీ. మేర ‘నో ఫ్లయ్ జోన్’ అని మనదేశం ఇప్పటికే ప్రకటించింది. అయితే, మన క్షిపణి అనుపానులు అంచనా వేయడానికి, ఇప్పటికే చైనా స్పై షిప్ ‘యువాన్ వాంగ్–6’ హిందూ మహాసముద్రం జలాల్లోకి ప్రవేశించి, బాలి దీవుల్లో బస చేసింది. మన తూర్పు సరిహద్దున చైనా చేస్తున్న రెండవ కవ్వింపు చర్య ఇది. ఆగస్టులో కమ్యూనికేషన్ – నిఘా చర్యల రీసెర్చ్ నౌక – ‘యువాన్ వాంగ్–5’ శ్రీలంక హంబన్ తోట పోర్టులో వారం రోజులు తిష్ట వేసింది. అది ఇక్కడకు వచ్చి వెళ్ళాక, మన సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ... చైనా నౌకలు శాటిలైట్ మోనిటరింగ్‌తో రాకెట్లు, ఇంటర్ కాంటి నెంటల్ మిస్సైల్స్ ఉపయోగించే అవకాశం ఉందనీ, మన న్యూక్లియర్ స్టేషన్లు, పోర్టుల భద్రతకు నిఘా, రక్షణ చర్యలు చేపట్టాలనీ తమిళనాడు రాష్ట్ర ఇంటి లిజెన్స్ ఏజెన్సీని ఆదేశించింది. (క్లిక్ చేయండి: ‘రాజనీతి’లో రేపటి చూపు!) ఈ నేపథ్యంలో ప్రధాని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ కేంద్రమైన విశాఖ వస్తున్నారు. భారత ప్రభుత్వ ప్రాదేశిక అవసరాల బాధ్యతతో, ‘ఫెడరల్’ స్పూర్తితో దేశం తూర్పు సరిహద్దుల్లో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో కొత్త సంస్కరణలు అమలు చేస్తున్నది. వాటిని గ్రేడింగ్ చేసి ర్యాంకులు వెల్లడించేది మీరే కనుక, మా పురోగతి ముందు మీకు తెలిశాకే, అవి మాకు తెలిసేది. కేరళలో– ఈ ఏడాది ఎం.ఏ. ‘డీసెంట్రలైజేషన్ అండ్ లోకల్ గవర్నెన్స్’ పీజీ కోర్సు మొదలుపెడితే, ఇక్కడది ఇప్పటికే అమలులో ఉంది. ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండటం, ఇప్పుడు దేశం అవసరం. దీని పట్ల మీ ‘ఓపెన్ మైండ్’ మా అవసరం. (చదవండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
Johnson Choragudi: భావోద్వేగాల బంధం
రాష్ట్రావతరణ దినమైన నవంబర్ ఒకటి, గత చరిత్రలోకి చేజారి పోకుండా మళ్ళీ ‘స్వాధీనం’ చేసుకుని, సకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప పరిణతిని ప్రదర్శించింది. ఇక్కడ స్వాధీనం అంటున్నది– ‘క్లెయిమ్’ అనే ఆంగ్ల పదాన్ని దృష్టిలో ఉంచుకుని. తెలంగాణ మన నుంచి విడిపోయినప్పుడు, 1956 నుండి నైసర్గిక ఆంధ్రప్రదేశ్ చరిత్రను ‘క్లెయిమ్’ చేసుకోవలసిన – ‘పెద్దన్న’ పాత్రను గత ప్రభుత్వం తొలి ఐదేళ్లు వదులుకుంటే, చివరికి ఆ లోపాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిచేసింది. ముఖ్యమంత్రిగా ఆయనకు తొలి అనుభవం అయినప్పటికీ, నిర్ణయానికి అవసరమైన మేధోమథనం ఎంత వేగంగా జరిగింది అంటే, 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి – నవంబర్ 1 రాష్ట్రావతరణ దినోత్సవం అని ప్రకటన వెలువడింది. అది కూడా చీఫ్ సెక్రటరీ ఈ విషయాన్ని ప్రకటించడం ద్వారా, ఈ ప్రభుత్వం ‘బిజినెస్ లైక్’ పనిచేస్తుందనే సంకేతాలు కూడా మొదట్లోనే వెలువడ్డాయి. ఐదేళ్లు ఆలస్యం అయినప్పటికీ కడకు ప్రభుత్వం తల నెరిసినతనంతో, సమ్యక్ దృష్టి (హోలిస్టిక్ అప్రోచ్) తో వ్యవ హరించి ఒక చారిత్రిక తప్పిదాన్ని సరిచేసింది. అలా తొలి ఏడాది విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్రావతరణ దినోత్సవాలు – ‘స్టేట్ ఫంక్షన్’గా జరిగాయి. ఇది జరిగాక, అదే వారంలో 2019 నవంబర్ 6న దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారంగా భావిస్తున్న భారతరత్న, పద్మ విభూషణ్ తరహాలో రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రజా రంగంలో విశేష సేవలు అందించిన వారికి రాష్ట్రావతరణ దినోత్సవం నాడు పురస్కరాలతో ప్రభుత్వం సత్కరిస్తుంది అని అందులో ప్రకటించింది. అయితే, కరోనా కారణంగా 2020లో ‘మెడికల్ ఎమర్జెన్సీ’ కావడంతో అది ఆగినా, ఆ తర్వాత రెండేళ్లుగా రాష్ట్రావతరణ దినోత్సవం నాడు ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించడం గొప్ప విషయం. గత ఏడాది– ‘వైఎ స్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు’ పురస్కారానికి 10 లక్షల నగదు, మెమెంటో, ప్రశంసాపత్రం, అలాగే, ‘వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డు’ పురస్కారానికి 5 లక్షల నగదు, మెమెంటో, ప్రశంసా పత్రం అందించారు. పురస్కార గ్రహీతల ఎంపిక కోసం ప్రభుత్వం పకడ్బంది ‘స్క్రీనింగ్’ విధానాన్ని అనుసరిస్తున్నది. 2022 పురస్కారాలకు ‘వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు’కు 20 మందినీ, ‘వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు’కు 10 మందినీ ఎంపిక చేశారు. వీరిని – వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగం, విద్యా రంగం, కళారంగం, సాహిత్యం, మీడియా, స్త్రీ రక్షణ – సాధికారికత రంగాల నుంచి ఎంపిక చేశారు. (క్లిక్ చేయండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) అలజడి తర్వాత కుదురు కోవడం గురించి యోచించడానికి, అధినేతకు ప్రజలు – ప్రాంతము మధ్య ఉండే భావోద్వేగాల బంధం ఎటు వంటిదో తెలియాలి. లేనప్పుడు, అస్పష్టం అయోమయం మిగులుతుంది. ‘రాజ్యం’లో భాగమైన–’ఎగ్జిక్యూటివ్’ అందించే విలువైన మార్గదర్శనాలను అధినేత నిర్ణయాత్మకంగా వినియోగించుకున్నప్పుడు, ప్రజల తీర్పుతో ఎన్నికయిన ప్రభుత్వాలకు అది అదనపు విలువ అవుతుంది. ఇవన్నీ కాకుండా ప్రస్తుత సీఎంకీ ఏపీ ‘బ్యూరోక్రసీ’కీ మధ్య వయస్సులో కుదిరిన సారూప్యత వల్ల, ఇక్కడ తక్కువ కాలంలో ఎక్కువ ప్రభావవంతంగా ప్రస్తుతం ప్రభుత్వంలో పని సాగుతున్నది. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!
అప్పటి వరకూ ఎవరూ ప్రవేశించని చోట– ‘లోపలికి వెళ్లడం’ అనేసరికి, ఒక్కొక్క ప్రభుత్వం తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రధా నంగా వాటి దృక్పథంపై అది ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకారమే, అది తనతో– ‘రాజ్యాన్ని’ అంటే– ‘ఎగ్జి క్యూటివ్’ ‘జ్యుడీషియరీ’ వంటి వ్యవస్థలను, అవి ఇంకా చేరని మారుమూలల ఉన్న మానవ సమూహాల వద్దకు తనతో తీసుకు వెళుతోంది. ప్రజా స్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక్క– ‘లెజిస్లేటి వ్’కు మాత్రమే అటువంటి గమన శక్తి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత, తూర్పు కనుమలలోని మన్యం – ‘లోపలికి వెళ్లడం’ అనే విషయంలో, అక్కడ మొదటి పదేళ్ల కాలంలో ఏమి జరుగుతున్నది అనేది లోతైన సమీక్ష అవసరమైన అంశం. వామపక్ష తీవ్రవాద సిద్ధాంత కార్యాచరణకు తూర్పు కనుమల మన్య ప్రాంతం నాలుగు దశాబ్దాల పాటుగా క్రియాశీల స్థావరం కావడంపై, ఇప్పుడు ప్రభుత్వ– ‘ఫోకస్’ తప్పనిసరి అయింది. అయితే అది– ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కో తీరుగా అర్థమయింది. ఒకరు అంటారు– ‘విదేశాల నుంచి పోలీస్ శాఖ కొనాల్సిన ‘కమ్యూనికేషన్’ ఉపకరణాలు సకాలంలో ప్రభుత్వం కొని ఉంటే, ఒక గిరిజన ఎమ్మెల్యే నక్సల్స్ చేతిలో చనిపోయేవాడు కాదు’ అని. మరొక ప్రభుత్వ దృష్టి, అందుకు భిన్నంగా– ఆ ప్రాంతాన్ని... అక్కడ భూమిలోని ఖనిజ నిక్షేపాలను విలువైన ఆదాయ వనరుగా చూడ్డంగా కాకుండా, ఆ ప్రాంత ప్రజా ప్రయోజనాల దృష్టి నుంచి దాన్ని చూడాలి అని అనుకోవచ్చు. వామపక్ష తీవ్రవాద చర్యల్ని కట్టడి చేయడానికి 1989లో ఏపీ పోలీస్‌లో– ‘గ్రే హౌండ్స్’ విభాగం మొదలయింది. ప్రస్తుతం విశాఖపట్టణం వద్ద తాత్కాలిక ‘క్యాంపు’ల్లో ఉండి పనిచేస్తూ ఉంది. అయితే సాయుధ దళాల దన్నుతో కాకుండా... పౌరపాలన దృష్టితో ఈ ప్రాంత అభివృద్ధిని చేపట్టాలి అనే– ‘దార్శనికత’ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అది మునుపటికి భిన్నంగా ఉంటుంది. ఇలా భిన్నమైన దృక్పథాల మధ్య 2022 నాటికి ఇప్పటి యువ నాయకత్వానికి ఉన్న కొత్త చూపు నుంచి వచ్చినవే– పాడేరు కేంద్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లా, పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం’ జిల్లాలు. అంటే– ‘లోపలికి వెళ్లడం’ అనేది చిన్న పరిపాలనా యూనిట్ల ద్వారా... సూక్ష్మ స్థాయికి పరిపాలన తీసుకు వెళ్లడం వల్లనే సాధ్యమని ఈ ప్రభుత్వం నమ్మకం. నిజానికి ఇది– ప్రపంచ దేశాల చరిత్రలో కాలపరీక్షకు నిలిచిన సత్యం. అలా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో– గ్రామ సచివాలయాల ఏర్పాటు, విద్య–వైద్య రంగాల్లో సంస్కరణలు, ఉత్తర్వులు వెలువడిన వెంటనే కొత్త జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏజెన్సీ ప్రాంతంలో పని మొదలు పెట్టడం, ప్రతి సోమవారం జరిగే– ‘స్పందన’ ప్రజా ఫిర్యాదులకు రద్దీ పెరగడం, పాడేరులో కొత్తగా మెడికల్ కాలేజీ నిర్మాణం చురుగ్గా జరగడం, రోడ్లు, వంతెనల నిర్మాణం, ఇవన్నీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు అదనంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులుగా కనిపిస్తున్నాయి. గతంలో ప్రాంతమూ–ప్రజల మధ్య పెనవేసుకుపోయి ఉండే బంధాన్ని విస్మరిస్తూ రూపొందించే అభివృద్ధి నమూనాలు, వీరి పక్షాన మావోయిస్టులు – ‘రాజ్యాన్ని’ వ్యతిరేకించడానికి బలమైన కారణమైంది. కానీ– ఇప్పుడు ప్రభుత్వ దృక్పథం మారింది. అప్పటి వరకు ఉన్న పట్టు జారిపోతున్నప్పుడు, వ్యూహాలు మార్చుకోవడం ఎవరికైనా తప్పదు. విభజన తర్వాత, ఇంత త్వరగా ఇటువంటి కొత్త వాతావరణం ఏజెన్సీ గ్రామాల్లో ఏర్పడుతుందని వారు కూడా అనుకుని ఉండక పోవచ్చు. దాంతో– ముఖ్యులైన మావోయిస్టుల లొంగుబాట్లు మొదలయ్యాయి. కొత్తగా వచ్చి చేరుతున్నవారు లేరు అంటున్నారు. ఈ జూన్ నెలలో జరిగిన నాయకుల అరెస్టు సందర్భంగా 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. రూ. 39 లక్షల నగదు, అత్యంత విలువైన ఆయుధాలు స్వాధీనం అయ్యాయి. మళ్ళీ మరొకసారి ఈ సెప్టెంబర్ 7న పెదబయలు వద్ద మరొక అత్యంత భారీ ఆయుధాలు, కమ్యూనికేషన్ సిస్టం, స్కానర్లు సీఆర్పీఎఫ్ పోలీస్ దళాలు వెలుపలికి తీశాయి. ఈ జిల్లాలో రెండు నెలల వ్యవధిలో రెండవసారి ఛేదించిన ఆయుధాల నిల్వలివి. ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ఏమంటే– ఇప్పట్లో ఇక్కడ వీటి అవసరం ఉండదని, వారు వీటిని జక్కిని అటవీ ప్రాంతంలో భూమిలో పూడ్చిపెట్టి, ఛతీస్‌గఢ్‌లో భద్రత వున్న రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయారు. (క్లిక్ చేయండి: విద్యారంగంలో దూసుకుపోతున్న ఏపీ) జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పర్యావరణాన్నీ, జీవవైవిధ్యాన్నీ పరిరక్షిస్తూనే స్థానిక ఆదివాసుల ఆవాసాల మధ్య పర్యాటక రంగం అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు పాడేరులో– ‘ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్’ 7 స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక మారు మూల ప్రాంత అభివృద్ధి కోసం పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడ్డంతో ఇక్కడి – కురికుట్టి వద్ద 1200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1,000 మెగా వాట్లు సామర్థ్యం గల అదానీ గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవి పూర్తి అయ్యాక, ఒకప్పుడు – గ్రే హౌండ్స్ పోలీసులతో ‘ఏఓబీ’గా పిలవబడిన ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దున, ఒక్కొక్క పవర్ ప్రాజెక్టు వల్ల 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఏదేమైనా–ఏటిట్యూడ్ ఈజ్ ఎవ్రిథింగ్ (దృక్పథమే సమస్తమూ) అనేది, అన్ని కాలాలకు వర్తించే పాత సూక్తి. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివించుకునే కుటుంబాలకు – ‘ఇంగ్లిష్ మీడియం’ అందు బాటులోకి తీసుకురావాలని కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భిన్న అభిప్రాయాలకు, చర్చలకు దారి తీసింది. ఇప్పుడు ‘ఉచిత– పథకాల’ గురించి కోర్టుకు వెళ్లినట్టుగానే, అప్పట్లో ‘ఇంగ్లిష్– మీడియం’ విషయం కూడా కోర్టు వరకూ వెళ్ళింది. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన 30 ఏళ్ళ కాలంలో విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడం తెలిసిందే. మరి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లల విద్య నాణ్యత విషయంగా ప్రభుత్వం ఎటువంటి వైఖరిని అనుసరించాలి? ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ తర్వాత, ఒక ఉద్యోగి ఇండియాలో పనిచేసినా లేదా విదేశాల్లో పనిచేసినా పని నాణ్యతా ప్రమాణాల విషయంలో ఈ రోజున ఎటువంటి వ్యత్యాసం లేదు. అటువంటప్పుడు చదువు పూర్తి చేసుకుని ‘జాబ్ మార్కెట్’లోకి వచ్చే యువతకు ప్రాథమిక విద్య స్థాయిలోనే ‘వర్క్ ప్లేస్’ సవాళ్లు ఎదుర్కొనే నైపుణ్యాలను బోధించడం ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. ‘ప్రొఫెషనల్ కోర్సు’లు పూర్తి చేసుకుని, ఉద్యోగాల్లో చేరుతున్న దశలో నైపుణ్యాల బోధన లేని కారణంగానే, మళ్ళీ వారికీ ‘స్కిల్ డెవలప్మెంట్’ కోర్సులు అవసరం అవుతున్నాయి. ప్రభుత్వం ఆ అవసరాన్ని గుర్తించి దాన్ని కనుక పట్టించుకోకపోతే, చదివిన డిగ్రీలతో పనిలేకుండా... జీవిక కోసం ‘మార్కెట్’లో చౌక ‘లేబర్’గా వీరు మారుతారు. దాంతో వీరి చదువుల కోసం ప్రభుత్వం చేసిన ‘వ్యయం’, తిరిగి వీరి సర్వీసుల ద్వారా జాతీయ స్థూల ఉత్పత్తికి అవుతున్న ‘జమ’ మధ్య వ్యత్యాసం తగ్గదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి, ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలు స్థిరంగా– ‘జాబ్ మార్కెట్’లో నిలబడగలగడానికి– ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య స్థాయిలో ఇవ్వాల్సిన తర్భీదు ఎలా ఉండాలి? కొన్నేళ్లుగా ‘ఇంటర్నేషనల్ స్కూళ్లు’ ఉనికిలోకి వచ్చాయి. వాటి ‘కేంపస్’లు కూడా విశాలమైన స్థలం, భవనాలు, వసతులతో అలరారుతున్నాయి. అటువంటప్పుడు– అదే కాలంలో అదే ప్రాంతంలోని సమాజాల్లో ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే బోధనా ప్రమాణాలు ఎలా ఉండాలి? పబ్లిక్ స్కూళ్లలో ‘యజమాని’ ప్రభుత్వ స్కూళ్లలో ‘ఉద్యోగి’ తయారయ్యే ఇటువంటి వైరుధ్యం, వ్యత్యాసం ఇలా విద్యార్థికి ‘కిండర్ గార్డెన్’ దశలోనే మొదలవుతున్నప్పుడు, దీనిపై... సమీక్ష సంస్కరణల చర్యల అవసరం ఉందా లేదా? ఇంకా ఈ వ్యత్యాసం కొనసాగడానికి ప్రభుత్వం ‘చెక్’ పెట్టే చర్యలు కనుక చేపడితే, అందుకు మన పౌర సమాజ స్పందన ఎలా ఉండాలి? ఉపాధి అంశం కంటే సున్నితమైనది మరొకటి ఉంది. అది– ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలకు అందవలసిన ‘ఎమోషనల్ సపోర్ట్’. దీన్ని అర్థం చేసుకోవడానికి, ఒకప్పుడు మురికివాడలు అని మనం పిలిచిన పట్టణ శివారు కాలనీల్లోని పోలీస్ స్టేషన్లలో నమోదు అయ్యే ‘ఫ్యామిలీ కేసులు’ ఎటువంటివో చూస్తే, ఆ కుటుంబాల్లో పెరిగే పిల్లలకు బడిలో టీచర్ల నుంచి అందవలసిన సాంత్వన ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. విజయవాడ వంటి రైల్వే జంక్షన్ పరిధిలో వీధి బాలల కోసం పని చేస్తున్న– ఎన్జీఓలు చెప్పగలరు– పిల్లల పట్ల మనం చూపే నిర్లక్ష్యం ముగింపు ఎలా ఉంటుందో! (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) పాఠశాల విద్యాశాఖలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల విషయంలో జరుగుతున్న వాద వివాదాలను... బయట నుంచి, దూరం నుంచి చూస్తున్న పౌరసమాజపు క్రియాశీలత అవసరమైన సమయమిది. ఈ పిలుపు ఒకరికి అనుకూలం, మరొకరికి ప్రతికూలం కాదు. ఇది మన కొత్త రాష్ట్రం కోసం. (క్లిక్: ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!) - జాన్సన్ చోరగుడి సామాజిక విశ్లేషకులు -
‘రాజనీతి’లో రేపటి చూపు!
గత మూడేళ్ళుగా అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మారుతున్న భారత దౌత్య విధానానికి, ఆగ్నేయ తీరాన ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తున్నదా? కొందరు సీనియర్ ‘బ్యూరో క్రాట్ల’ అభిప్రాయాలు చూస్తున్నప్పుడు, అందుకు– ‘అవును’ అనే సమాధానం దొరుకుతున్నది. వీరికి రాజకీయాలు పట్టవు కనుక, విషయం ఏదైనప్పటికీ అందరి మేలు, దేశ సమగ్రత, దృష్టి నుంచి వీరు మాట్లాడతారు. మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారాయణన్ – ‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు –నివారణ చర్యలు’ అంశంపై ఇటీవల రాసిన వ్యాసంలో– ప్రస్తావించిన పలు కల్లోల ప్రాంతాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేకపోవడం, ఊరట కలిగిస్తున్న అంశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో భౌగోళికంగా సముద్ర తీర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్... ఇండియా– ‘ఆగ్నేయ ఆసియా విధానం’ అమలుకు, దేశ ‘జియో–పొలిటికల్’ వ్యూహాల దృష్ట్యా కేంద్రానికి ప్రత్యేకం. నలభై ఏళ్ల తెలంగాణ ఉద్యమ తీవ్రత విభజన చట్టంతో ముగిశాక, గత మూడేళ్ళలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఇక్కడ మావోయిస్టుల చర్యలు లేవు. అయితే, గత మూడు దశాబ్దాల్లో కేంద్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన– ‘విభజన’ పోరాటాలు కొన్ని ఇప్పటికీ నివురు కప్పిన నిప్పులా నిద్రాణంగా ఉంటూ, సందు దొరికితే తలలు ఎగరేయడానికి సిద్దంగా ఉన్నాయనీ; భద్రతా చర్యలతో కంటే, ప్రభుత్వాలు అనుసరించవలసిన– ‘రాజనీతి’ (స్టేట్ క్రాఫ్ట్)తో మాత్రమే వాటిని పరిష్కరించుకోవలసి ఉంటుందనీ నారాయణన్ అంటున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మొదలైన మన– ‘లుక్ ఈస్ట్’ దౌత్య విధానం, ప్రధానిగా మోదీ ఎనిమిదో ఏటకు– ‘యాక్ట్ ఈస్ట్’గా పరిణామం చెందింది. మే 23న జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మన ప్రధాని సమక్షంలో 12 దేశాలు – ‘ఇండో–పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేం వర్క్ ఫర్ ప్రాస్పరిటీ’ ఒప్పందం చేసుకున్నాయి. సరిగ్గా అదే సమయానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా దేశానికి ఆగ్నేయ తీరాన సుదీర్ఘ సముద్ర తీరంతో ఆంధ్రప్రదేశ్– దేశానికి ‘గేట్ వే’గా పరిణమించింది. బైడెన్ ఈ ఒప్పం దాన్ని– ‘రైటింగ్ న్యూ రూల్స్ ఫర్ 21 సెంచరీ ఎకానమీ’ అంటూ అభివర్ణించారు. ఇది జరిగి నెల కూడా కాకుండానే, జూన్ 12న మన విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఏపీ ప్రతిపాదిత రాజధాని విశాఖలో జరిపిన మేధావుల సదస్సులో– ‘‘తూర్పు తీరంలోని పోర్టులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయవలసి ఉందనీ, అప్పుడే ప్రపంచ మార్కెట్‌తో మన వాణిజ్యం అభివృద్ధి చెందుతుందనీ’’ అన్నారు. పశ్చిమాన గుజరాత్ తీరం తర్వాత తూర్పున ఏపీనే అత్యధిక తీర ప్రాంతం కలిగి ఉంది. గత రెండేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, కోస్తా తీరానికి సమాంతరంగా నిర్మాణం అవుతున్న హైవేలు, వైమానిక దళం విమానాలు అత్యవసర పరిస్థితుల్లో దిగడానికి అనువైన ‘హెలీప్యాడ్’ నిర్మాణాలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సిద్ధం కావడం తెలిసిందే. తూర్పు కనుమల మీదుగా జాతీయ రహదారుల శాఖ నిర్మిస్తున్న ‘హైవే’ చెన్నై–కలకత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్డుతో సమాంతరంగా రాజమండ్రి నుంచి మన్యసీమ మీదుగా రాయపూర్ చేరుతుంది. దక్షణాదిలో విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై–బెంగళూరు ఇండ స్ట్రియల్ కారిడార్, బెంగళూరు–హైదరాబాద్ ఇండస్ట్రి యల్ కారిడార్లు సిద్ధమవుతున్న నాటికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసింది. రాబోయే ఈ ‘కారిడార్ల’ ద్వారా జరిగే వృద్ధిలో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షం గానూ పరోక్షంగానూ ప్రయోజనం పొందుతారు. (క్లిక్: రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకేనా?) ప్రపంచ వ్యాప్తంగా అమలులో వున్న– ‘నాలుగవ పారిశ్రామిక విప్లవం’లో (బ్లర్రింగ్ ఆఫ్ బౌండ్రీస్) సరిహద్దుల చెరిపివేత కీలకం. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ‘రాజ్యం’ బాధ్యత. అలాగని అన్ని ప్రభుత్వాలు దాన్ని నిక్కచ్చిగా పట్టించుకోవాలని లేదు. ‘కమ్ వాట్ మే...’ (ఏదైతే అదయ్యింది) అనే తరహాలో గత మూడేళ్ళుగా అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మారుతున్న భారత దౌత్య విధానానికి, ఆగ్నేయ తీరాన ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తున్నదా? పరిపాలనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూక్ష్మ దృష్టిని చూస్తే, అవును అనే స్పష్టం అవుతున్నది. (క్లిక్: బైజూస్ సేవలు ఉపయోగకరం) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అధికారులు ‘ఛాన్స్’ తీసుకోవడం లేదు!
ఇటీవలి క్రిస్మస్ తర్వాత ఎదురైన అనుభవం ఇది. ఒంగోలు కలెక్టరేట్లో సీనియర్ అధికారిగా పని చేస్తున్న– ‘కజిన్’కు ఫోన్ చేసి ఎక్కడ? అని అడిగితే, మార్కాపురంలో రోడ్డు మీద ఉన్నట్టుగా చెప్పారు. రాత్రి ఎనిమిది అవుతుంటే, ఇప్పుడు అక్కడ ఏమి చేస్తున్నట్టు అనిపించి, అదే అడిగితే, ‘సీఎం ఆఫీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ వస్తున్నారు, ఇక్కడ ‘వెయిట్’ చేస్తున్నాం’ అని అటునుంచి జవాబు. ఆయన ఏదైనా– ‘రివ్యూ మీటింగ్’ పెడితే, అది ఒంగోలు కలెక్టర్ ఆఫీస్‌లో ఉండాలి. కానీ రాత్రి ఎనిమిదప్పుడు, జిల్లా కేంద్రం ఒంగోలుకు 70 కి.మీ. దూరంలోని మార్కాపురంలో– సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడ ఏమి చేస్తున్నట్టు? అదే అడిగాను. ‘సార్ గ్రామ సచివాలయాలను తనిఖీ చేస్తున్నారు’ అని అటునుంచి జవాబు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో భిన్నంగా ప్రభుత్వ పాలన సాగుతున్నది అనిపించింది! సీఎం సమీక్షా సమావేశాల్లో, అధికారులు– ‘ఫీల్డ్’లో చూసి వచ్చి చెబుతున్నారా లేదా అనేది జగన్ పోల్చుకుంటున్నారు... అనేది 2022 నాటికి ఏపీలో కార్యదర్శులు, శాఖాధికారుల మనోగతం. దాంతో కలెక్టర్లు కూడా జిల్లా అధికా రుల నివేదికలను క్షేత్రస్థాయిలోని వాస్తవాలతో తాము స్వయంగా చూసి మరీ– ‘క్రాస్ చెక్’ చేసుకుంటున్నారు. ఉగాది నాడు కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా– మంత్రులు, ప్రభుత్వ శాఖాధికారులు, కలెక్టర్లు పాల్గొన్న వీడియో కాన్ఫ రెన్స్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ– ‘సస్టెయిన్‌బుల్ డెవలప్మెంట్ గోల్స్’ (ఎస్డీజీ) సాధించే దిశలో– ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ (ఎస్ఓపీ) పాటించి తీరాల్సిందే అని కొత్తగా జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకున్న అధికారులకు స్పష్టం చేశారు. కేంద్రంలో– ‘నీతి ఆయోగ్’ దీన్ని మదింపు చేస్తుంది. ఇలా బహిరంగంగా– ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ పాటించి తీరాలని ఒక సీఎం చెప్పడం చిన్న విషయం కాదు. అంత తేలిక అంతకంటే కాదు. పైగా– ‘కలెక్టర్లను జాగ్రత్తగా చూసుకోండి’ అని మంత్రులతో సీఎం చెప్పడం ఆసక్తికరమైన అంశం. అధికారులతో నిబంధనలకు లోబడి పని చేయండి అని చెబుతూ, మంత్రులతో అధికారులను జాగ్రత్తగా చూడండి, అంటే విషయం స్పష్టమే! వాళ్ళ మీద– ‘అవుటాఫ్ ది వే’ చేయమని మీరు ఒత్తిడి పెట్టొద్దు. వాళ్ళు నిబంధనలకు లోబడి పనిచేస్తే, రేపు రాజకీయంగా ప్రయోజనం పొందేది మనమే అనేది జగన్ స్పష్టం చేసేశారు. పరిపాలన ఎంత– ‘ఆన్లైన్’ అంటున్నప్పటికీ, ‘టెక్నాలజీ’ అన్నిసార్లూ నిజమే చెప్పాలని లేదని, ఏపీ సీఎం జగన్‌కు మరీ ఇంత త్వరగా తెలియడం అధికారులకు కాస్త ఇబ్బందిగానే ఉంది. ముందు ఒక మాట, వెనుక మరొకటి లేని– ‘కటింగ్ ఎడ్జ్’ ధోరణి అంటున్నది దీన్నే. సీఎం ధోరణి, ఎంత సున్నితంగా ఉంది అనేది స్పష్టం అయ్యాక, సీనియర్ అధికారులు ఎవ్వరూ తమ స్థాయిలో– ‘ఛాన్స్’ తీసుకోవడం లేదు. ‘అన్నా’ అంటూనే, పనిలో అలసత్వం కనిపిస్తే మాత్రం మందలించే విషయంలో సీఎం వెనకాడడం లేదు. (క్లిక్: ప్రభుత్వ పనితీరుకు జన నీరాజనం!) కాకినాడ జిల్లాలో ఒక ఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోతే, అదే వారంలో పోలీస్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారులకు– ‘స్ట్రెస్ మేనేజ్మెంట్’పై మానసిక నిపుణులచే శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు ప్రకటించారు. తిరుపతిలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ ఆపరేటర్ల దందా వార్త వెలువడ్డాక, స్థానిక పోలీసులు అప్రమత్తం అయ్యారు. కుప్పం వద్ద– ఏపీ, కర్ణాటక, తమిళనాడు ‘ట్రై జంక్షన్’ సమీపంలో 20 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, మరణాల సమయంలో అంబులెన్స్ సర్వీసుల ఛార్జీలు అందుబాటులో ఉండేటట్టుగా కుప్పం పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ టి. శ్రీధర్ ఇప్పటికే, అంబులెన్స్ ఆపరేటర్లతో– ‘కౌన్సిలింగ్ సెషన్లు’ నిర్వహిస్తున్నారు. గతంలో ఇటువంటి చొరవ సీఎం లేదా మంత్రుల ప్రకటనలతో ‘మీడియా’లో వార్తలుగా మొదలై, ఆ తర్వాత ఎప్పటికో వాటి ప్రారంభాల ఫొటోలు, వీడియో వార్తల తర్వాత గానీ అవి ఆచరణలోకి వచ్చేవి కావు. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అనితర సాధ్య సామాజిక నమూనా!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన నాలుగు రోజులకే అంబేడ్కర్ జయంతి రావడంతో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం– ‘సామాజిక న్యాయం’ నమూనాను– ‘14 ఏప్రిల్’ చట్రంలో ఉంచి పుటం వేయడానికి, ప్రధాన మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ గట్టి ప్రయత్నమే జరిగింది. ‘ఏ పదవి లేకుండానే చక్రం తిప్పే వాళ్ళది ఏ కులం?’ అంటూ, అందుకు– కారణం మూడేళ్ళ క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వమే అన్నట్టుగా... అందుకు జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టే ప్రయత్నమే ఇందులో ప్రధానంగా కనిపించింది. ఈ తరహా ధోరణి కొత్తది. గడచిన పదేళ్లుగా తెలుగునాట ఉద్యమాలు– ‘ఆన్లైన్’లోనే జరగడంతో దానికీ ‘వర్క్ ఫ్రం హోం’ సౌలభ్యం వచ్చేసింది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా జరుగుతున్నది ఏమిటి? అనేది తెలుసుకుని, దాన్ని స్థానిక చూపుతో చూడ్డం, రాయడం, మాట్లాడ్డం, ఎప్పుడా అనేది మాత్రం ఇంకా స్పష్టం కావలసి ఉంది. అయినా ఇప్పుడొచ్చిన నష్టం కూడా పెద్దగా ఏమీ లేదు. కొత్త పార్టీ ప్రభుత్వం అన్నప్పుడు, ‘చెడు’ మాట్లాడ్డం మొదలుపెట్టిన తర్వాతే, అక్కడున్న– ‘మంచి’ ఏమిటో ఆలస్యంగా అయినా వెలుగులోకి వస్తుంది. ఈలోగా శిలాసదృశ్యంగా ఉన్న (ఇమేజ్) రూపానికి బీటలు ఆపాదించడం తప్పనిసరి అవుతుంది; దాని వెనుకే మంచి–చెడుల మదింపు లేదా సమీక్ష మొదలవుతుంది. భజనతో ప్రయోజనం ఉండదు కానీ సమీక్ష ఎవరికైనా చాలా అవసరం. అలా ఈ ప్రభుత్వం తొలి వైఫల్యంగా చలామణిలో ఉన్నది, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్జీవోల– ‘చలో విజయవాడ’ నిరసన ర్యాలీ; దాన్ని ప్రభుత్వం నియంత్రించలేకపోవడం. దీన్ని గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా చూసి ఉంటే– ‘ఉద్యోగులపై పోలీసుల దమనకాండ’, ‘విచక్షణారహితంగా ఉద్యోగులపై పోలీసుల లాఠీచార్జి’ వంటి వార్తలు, లైవ్ దృశ్యాలు, జగన్ ప్రభుత్వం తొలి– ‘బ్లాక్ రిమార్క్’గా ఇప్పటికే నమోదు అయ్యేవి. (క్లిక్: ‘సోషల్ ల్యాబ్’ పని మొదలైంది) మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గం మార్పు తర్వాత కూడా– ‘జగన్ మెత్తబడ్డాడు’ అనే వ్యాఖ్యతో అది కూడా మరో వైఫల్యంగా చలామణిలోకి తెచ్చే ప్రయత్నం మొదలయింది. నిజానికి– జిల్లాల జనాభా, వైశాల్యం, వనరులు, ‘డెమోగ్రఫీ’ వంటి ప్రాథమిక అంశాలను బట్టి ముందుగా కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి అయ్యాక, అప్పుడు మంత్రుల మార్పు జరిగింది. అంటే, రెండు దశల్లో పాత సంస్థానాల ప్రభావం తగ్గింపునకు గురైందన్నమాట. కనుక, ఈ మార్పును సరికొత్త– ‘మ్యాపింగ్’ దృష్టితో చూస్తే తప్ప దీని వెనుక ఉన్న– ‘లాజిక్’ అయినా, అస్సలు అటువంటిది ఎప్పుడు మొదలు అయిందనే దాని గత చరిత్ర అయినా స్పష్టం కాదు. దాన్ని– ‘వైఎస్ మ్యాపింగ్ ఫార్ములా’ అనొచ్చు. అందులో రెండు అంశాలు ఉండేవి: ‘నియోజక వర్గం ఎక్కడ?’ ‘కమ్యూనిటీ ఏది?’ (క్లిక్: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?) అమలులో అది ఇలా ఉండేది: 2009 ఎన్నికల ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగాక, కొత్తగా నియోజకవర్గం అయిన విజయవాడ శివారులోని పెనమలూరుకు కాంగ్రెస్ అభ్యర్ధిగా కె.పార్థసారథి (యాదవ్) ఎన్నికయ్యాక, రాజశేఖరరెడ్డి ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటికి రెండవసారి గెలిచినవారిలో బందరు నుంచి పేర్ని నాని కూడా ఉన్నారు. అయినా– ‘జాగ్రఫీ’ ఇక్కడ కీలకం కావడంతో, కృష్ణా జిల్లాకు పార్థసారథి ఏకైక మంత్రి అయ్యారు. రెండవది– అదే 2009 ఎన్నికల్లో వరంగల్ (తూర్పు) కొత్తగా నియోజకవర్గం అయింది. బసవరాజు సారయ్య (రజక) మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ తాను పాటించిన– ‘ఫస్ట్ టైం ఎంఎల్ఏ’కి మంత్రి పదవి లేదు, అనే నిబంధన పక్కన పెట్టి మరీ వైఎస్ ఆయన్ని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక్కడ– ‘కులం’ ప్రాతిపదిక అయింది. అలా సారయ్య భారత దేశంలో రజక కులం నుంచి రాష్ట్ర మంత్రి అయిన రెండవ వ్యక్తి అయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి మొదటివారు. ఇటువంటి– ‘మ్యాపింగ్’ లోకి వచ్చేదే ఉత్తర, పశ్చిమ, తూర్పు భారత రాష్ట్రాలను దక్షణాదితో కలిపే– ‘వై’ జంక్షన్‌గా ప్రసిద్ధమైన విజయవాడను కొత్తగా జిల్లా చేసి, దానికి ‘ఎన్టీఆర్’ పేరు పెట్టడం! నిజానికి ఈ చర్య, ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం కంటే, ఒక ప్రధానమైన– ‘కమ్యూనిటీ’కి ఈ ప్రాంత చరిత్రలో ఇచ్చిన సముచితమైన గౌరవం అవుతుంది. విశ్లేషకులు– ‘ఏ పదవి లేకుండానే చక్రం తిప్పేవాళ్ళది ఏ కులం?’ అంటూ అడగడం, ఇప్పటి సామాజిక మాధ్యమాలు తప్ప గత చరిత్ర తెలియనివారి వరకు వినడానికి బాగుండొచ్చు. కానీ, ఆ ప్రశ్నతో మళ్ళీ పాత తరానికి మర్చిపోయిన విషయాలు గుర్తుచేయడం అవుతుందేమో? ఎందుకంటే– ‘ఏ పదవి లేకుండానే చక్రంతిప్పే వాళ్ళది ఏ కులం?’ అని ఇప్పుడు అంటే– ‘వాళ్ళు గతంలో ఏ పార్టీల్లో ఉంటూ ఏ ప్రాంతాలకు ప్రజాప్రతినిధులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారాల్లో ఉన్నారు? అనే ప్రశ్నకు కూడా ఇక్కడ మనం జవాబు వెతకాలి. (క్లిక్: అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్ వ్యతిరేకత) సుదీర్ఘకాలం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు ‘ఐపాక్’ ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పనిచేయాలా, వద్దా? అని ఢిల్లీలో సోనియా ఇంట జరిగిన చర్చల ప్రక్రియలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు ఒక్కరూ ఎందుకు లేరు? వైఎస్ ఇక్కడ 2004లోనే గుర్తించి అమలు చేసిన– ‘మ్యాపింగ్’ కాంగ్రెస్ పార్టీని ఘనవిజయం దరి చేర్చినప్పుడు, 2024లో కూడా అది వారికి ఎందుకు అలిమి కావడం లేదు? ఎందుకంటే, ఒకప్పటి ‘వైఎస్ ఫార్ములా’ను ఇరవై ఏళ్ల తర్వాత, జగన్ ఇప్పుడు– ‘కటింగ్ ఎడ్జ్’ (అంచు మిగలని దశ)కు తీసుకు వెళ్ళారు కనుక! - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
‘సోషల్ ల్యాబ్’ పని మొదలైంది
ప్రభుత్వ వ్యతిరేక ఓటు– అంటూ ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ఏమాత్రం పొసగని అంశాన్ని పనిమాల చర్చకు తెచ్చారు. మరో రెండున్నర ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉండగా, అప్పుడే వీళ్ళు– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అంటున్నారు! వైసీపీ ప్రభుత్వం కుదురుకుంటున్న దశలో ‘కరోనా’ వచ్చిపడింది. అయినా కొత్త రాష్ట్రం పునర్నిర్మాణం కోసం అవసరమైన పరిపాలనా సంస్కరణలను అమలు చేస్తున్నారు. మరో పక్క రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుకోవడానికి ఉన్న మార్గాలను వెతుక్కుంటున్న ప్రాథమిక దశ ఇది. ఇంతలోనే– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అని అజ్ఞానంతోనో అర్ధ జ్ఞానంతోనో ఎవరైనా అన్నప్పటికీ... అది అభ్యంతరకరమని ‘మీడియా’ విశ్లేషకులకు, పార్టీల అధికార ప్రతినిధులకు అనిపించకపోవడం బాధ్యతా రాహిత్యం అవుతుంది. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అనగానే, ప్రధాన ‘మీడియా’తో పాటుగా సామాజిక మాధ్యమాల్లో దానిపై ‘చర్చ’తో డజన్ల కొద్దీ– ‘యూట్యూబ్’ వీడియోలు వెలువడ్డాయి. వాస్తవాల వైపు జనం చూడకుండా, వారి కళ్ళ మీద ఇలా– ‘గరం మసాలా తెరలు’ కడుతున్న ఈ మొత్తం యంత్రాంగం పట్ల మనకు కనుక అప్రమత్తత లేకపోతే, మున్ముందు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2022 నాటికి– ‘ప్రభుత్వ వ్యతిరేకత’ అనేది ఎంత పేలవమైన వాదన అవుతుందో చూద్దాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండున్నర ఏళ్ల పరిణామాల్లో మూడు ప్రధానమైన అంశాలను ఇందుకోసం ఇక్కడ పరిశీలిద్దాం. ‘కోవిడ్’ విషయంగా ప్రభుత్వ చర్యలు బహిరంగమే కనుక, దాన్ని ఒదిలిపెడితే, మిగతా రెండింటిలో మొదటి పరిపాలనా చర్య– ‘గ్రామ సచివాలయాలు’. వీటిని ఇప్పటికే పలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నమూనాగా పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇక చివరిది– 13 కొత్త జిల్లాల ఏర్పాటు. ఇందులోకి మళ్ళీ– నేరుగా నగదు బదిలీ జరిగే 33 సంక్షేమ పథకాలూ, ‘రైతు భరోసా కేంద్రాల’ ఏర్పాటూ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణా, 50కి పైగా వెనుకబడిన కులాల అభివృద్ధి కార్పోరేషన్ల ఏర్పాటూ, విద్యా–వైద్య రంగాల్లో సంస్కరణల వంటివీ కలపడం లేదు. గడచిన రెండున్నర ఏళ్లలో ‘కోవిడ్’ కల్లోల కాలం, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఆందోళన పోను... మిగిలిన పని గంటల్లో ఈ ప్రభుత్వం పూర్తి చేసిన పనులివి! అయితే, ఇందులో– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ ఒడిసి పట్టుకోవడం అనే సాహసం గురించి ఇప్పుడు వీళ్ళు చర్చకు తెస్తున్నారు. ఒక వార్డు స్థాయిలో కొత్తగా ప్రభుత్వ లబ్ధిదారుగా మారిన యువ సమాజంలోని వ్యక్తి– ‘స్టేట్ స్టేక్ హోల్డర్’గా ఆమె లేదా అతడు మున్ముందు అలవర్చుకోవలసిన– ‘సివిక్ సెన్స్’ను మొగ్గలోనే తుంచే ప్రయత్నం ఇది! నిజానికి ఇక్కడ జరగాల్సింది, ప్రతిపక్షాలు ప్రభుత్వ సేవల్లో లోపాలను గుర్తించి వాటిని సరిచేసే దిశలో ఒత్తిడి తేవడం. కానీ, అందుకు భిన్నంగా– సమయం సందర్భం లేకుండా ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అనడం అంటే, ప్రజల్ని– 24x7 ఓటర్లుగా చూడడం తప్పు కాదు అని వీరంతా వత్తాసు పలుకుతున్నట్టుగా ఉంది! (క్లిక్: ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’తో కొత్త వెలుగు!) ఒకప్పుడు ఉమ్మడి ఏపీ రాజకీయాలపై మధ్యతరగతి బుద్ధిజీవులు విలువైన విమర్శలు చేసేవారు. ఇప్పుడు వారు నోరు మెదపటంలేదు. ఆశ్చర్యం– ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు– ‘ఇంగ్లిష్ మీడియం’ చదువుల ప్రతిపాదన సమయంలో ఇది మరింతగా స్పష్టమయింది. గడచిన ఏడు దశాబ్దాలలో మనం ఎటూ ఏరు దాటి– ‘ఎన్నారై’లు అయ్యాం కనుక, ఇక ఇప్పుడు ప్రభుత్వ సేవలు వినియోగించుకునే వర్గాలు ఎటూ కింది కులాలే అయినప్పుడు ఇప్పుడవి మనం పట్టించుకునే అంశాలు కాదు అనేది వీరి మౌనానికి కారణమైతే; ఇకముందు ఎన్నిక కావలసిన ప్రభుత్వాలు, వాటి విధాన నిర్ణయాలు కూడా వర్ధమాన వర్గాల చేతిలోనే ఉండడం, అందుకు దోహదం చేసే నాయకత్వం చేతిలోనే ప్రభుత్వ పగ్గాలు ఉండడం సరైనది అవుతుంది. (క్లిక్: అందరూ బాగుపడాలి కదా!) ‘వలంటీర్లు’ సచివాలయాల సిబ్బందిగా... అరవై శాతం పైగా బలహీన వర్గాల యువత ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగంలో క్షేత్ర స్థాయిలో భాగమయ్యారు. ప్రభుత్వం నుంచి దిగువకు వచ్చే ‘ప్రయోజనం’ పై స్థాయిలో ఎన్ని దశల్లో ఆపడానికి అవకాశాలు ఉన్నదీ, ఆ అవరోధాన్ని దాటించి చిట్టచివర ఉన్న లబ్ధిదారుకు దాన్ని తాము చేర్చడం ఎంత కష్టమో ఇప్పుడు వారికి తెలుసు. అలా ఒక ఆసక్తికరమైన సాంఘిక ప్రయోగానికి ఇప్పుడు సచివాలయాలు వేదిక అయ్యాయి. ‘ఫంక్షనల్ పాలిటిక్స్’తో పవర్ పాలిటిక్స్’ తలపడినప్పుడు, సేవల బట్వాడాలో జరిగే జాప్యం గురించి మన సామాజిక దొంతర్లలోని చిట్టచివరి జాతుల యువతకు సాకల్యంగా స్పష్టం కావడం అనేది ఎంతమాత్రం చిన్న విషయం కాదు! (క్లిక్: అందరికీ అభివృద్ధి ఫలాలు) - జాన్ సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అందరూ బాగుపడాలి కదా!
మన దేశీయ ఉత్పత్తుల విదేశీ ఎగు మతులు మొదటిసారి అనుకున్న సమయానికన్నా ముందే వార్షిక లక్ష్యం 400 బిలియన్ డాలర్లకు చేరిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈ విజయానికి కారకులైన రైతులు, చేనేత కార్మికులు, మత్స్య కారులు, ఎంఎస్ఎంఈ, ఔత్సాహికులను అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశ్రమలు–వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ– ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఇన్నాళ్లుగా ప్రభుత్వానికి – ఉత్పాదక రంగానికి మధ్య ఈ లక్ష్యాన్ని చేరడానికి అవరోధంగా వున్న ప్రతి అడ్డంకినీ, ధ్వంసం చేయడం వల్ల ఇది సాధ్యమయింది’’ అంటూ, ప్రభుత్వంలో ఉంటూ ‘ధ్వంసం’ అనే కొత్త పద ప్రయోగాన్ని అధికారిక వేదిక మీది నుంచి వ్యక్తం చేశారు! ఈ విశేషమైన లక్ష్యాన్ని సాధించడానికి ‘మొత్తం ప్రభుత్వ విధానం’ – ‘మొత్తం దేశ విధానం’ కూడా తదుపరి స్థాయికి చేరిందని గోయల్ అభివర్ణించారు. పదమూడు కొత్త జిల్లాలు ఏర్పడుతున్న చారిత్రక సందర్భంలో ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించడం అంటే... రాష్ట్ర విభజనను ‘సమైక్యం’ అంటూ అడ్డుకోబోయి, భంగపడి నిస్సహాయంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని ఐదేళ్ల తర్వాత – ‘తదుపరి స్థాయికి’ తీసుకువెళ్లడమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది కూడా. ‘రాజ్యానికి – ప్రజలకు’ మధ్య ఇన్నాళ్లు అవరోధంగా ఉన్న ప్రతి అడ్డంకినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధ్వంసం చేస్తూ, మూడు రాజధానులు, పదమూడు కొత్త జిల్లాలతో ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థను, చిట్టచివరి ప్రాంత ప్రజలకు చేరువ చేస్తున్నది. కానీ గత ప్రభుత్వ పెద్ద... ఇప్పటికీ– ‘కేంద్రీకృత అభివృద్ధి’ నమూనా అమలు కోసం పట్టుపట్టడం విస్మయం కలిగిస్తున్నది. రాష్ట్ర విభజనకు దారి తీసిన– శ్రీ కృష్ణ కమిటీ, రాజధాని ఎంపిక కోసం పనిచేసిన శివరామకృష్ణన్ కమిటీ... రెండూ కూడా రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల వెనుకబాటుతనం గురించి చేసిన ప్రస్తావనను, గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విద్యా సంస్థలు ఈ ఏడు జిల్లాల్లో ఏర్పాటు చేయాలనే షరతు కారణంగా– సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ విజయనగరం వంటివి వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పడటానికి మార్గం సుగమం అయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ‘కోవిడ్ –19’ నీలిమేఘాలు కమ్మేశాయి. దేశంలో వివిధ ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లిన వలస కార్మికులు ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని – ఒడిస్సా, ఛతీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చమబెంగాల్, బిహార్, రాష్ట్రాలలోని ఇళ్లకు బయలుదేరిన వేళ, విజయవాడ జంక్షన్ అందుకు– సజీవ సాక్షి అయింది. మన రాష్ట్ర ప్రభుత్వ– ‘స్పర్శ’ ఆ అన్నార్తులకు ఆలంబన అయింది. ఈ మానవీయ దృక్పథమే– ‘సంక్షేమం’ పట్ల రాష్ట్ర ప్రభుత్వ ’ఫోకస్’ మరింత పెరగడానికి కారణం అయింది. దీన్ని తప్పు పడుతూ– ‘సంక్షేమ పథకాలతో ప్రజల్ని సోమరులను చేస్తున్నారు’ అంటున్నవారు ఇప్పటికీ వున్నారు. అయితే, ఇక్కడే వీరు ఒక కీలక అంశం దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ప్రభుత్వ ద్రవ్య వినిమయంపై ‘కాగ్’ – ‘నీతి ఆయోగ్’ వంటి కేంద్ర స్వతంత్ర సంస్థలు వెలువరిస్తున్న వార్షిక నివేదికల గురించి, జగన్ కఠోర విమర్శకులు సైతం నోరు మెదపడం లేదు! (క్లిక్: ఎవరిది యజ్ఞం? ఎవరు రాక్షసులు?) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ళ తర్వాత... వేరే సందర్భంలో– ‘తదుపరి స్థాయికి’ చేరడానికి అడ్డంకులను–‘కూల్చడం’ అని కేంద్ర మంత్రి అని వుండవచ్చు. కానీ తొలి కలెక్టర్ల సమావేశం ముగిసిన తర్వాత, 24 జూన్ 2019న నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నదీ గర్భంలో నిర్మించిన– ‘ప్రజావేదిక’ను కూల్చి భవిష్యత్ ఎలా ఉంటుందో సింబాలిక్‌గా చెప్పారు జగన్. ఈ వ్యవహారాన్ని కేవలం కట్టడాల తొలగింపుగా చూస్తే స్పష్టత రాదు. ఇందులో యాభైకి పైగా నిర్లక్ష్యానికి గురైన జాతుల అభివృద్ధికి కార్పొరేషన్లు, వాటికి– చైర్మన్లు, చైర్–పర్సన్లు, వైస్– చైర్మన్లు, డైరక్టర్ల నియామకాల్ని... జగన్ కొత్తగా తొలగిస్తున్న పాత అడ్డుగోడలు దృష్టి నుంచి చూడవలసివుంది. రాబోయే కొత్త జిల్లాల్లో తొలుత వీరు స్థానిక సంస్థల ప్రతినిధులుగా తర్ఫీదు పొంది, రేపు చట్టసభల ఎన్నికలకు పోటీదార్లు అవుతారు. అయితే ఈ సరికొత్త సామాజిక సరళీకరణ కదలికల్ని మొత్తంగా ఆపడానికి చేస్తున్న ప్రయత్నమే– ‘అమరావతి’! (క్లిక్: మీ అన్నను మాట్లాడుతున్నాను...) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అందరికీ అభివృద్ధి ఫలాలు
అమెరికన్ ఉదారవాద రాజకీయ తత్వవేత్త జాన్ రాల్స్– ‘థియరీ ఆఫ్ జస్టిస్’ గ్రంథంలో మూడు అంశాలు కీలకం అని చెబుతారు. సమానత్వం ఉండాల్సింది– 1. హక్కుల్లో 2. అవ కాశాల్లో 3. ఎక్కువమందికి ప్రయో జనం కలిగించడం (బెనిఫిట్ ఆఫ్ మాగ్జిమైజేషన్)లో అంటారు. ఈ దృష్టి నుంచి చూసినప్పుడు, మనది వ్యవసాయ ప్రధాన సమాజం కనుక, ఇక్కడ జరిగిన సాంఘిక మార్పునకు– ‘కాటన్ తర్వాత భూమి’ (1852) ప్రాతిపదిక. అది ఆర్థిక పరిస్థితులపై మాత్రమే కాకుండా, ఇక్కడి ‘సోషల్ ఎకో సిస్టం’ మీదా ప్రభావం చూపి, కొన్ని తరాల పాటుగా కదలికలు లేకుండా చట్టు కట్టిన సామాజిక దొంతర్ల (సోషల్ ఫ్యాబ్రిక్)ను గుల్లబార్చింది. చరిత్రకారుడు బీబీ మిశ్రా గ్రంథం– ‘ది ఇండియన్ మిడిల్ క్లాస్–దెయిర్ గ్రోత్ ఇన్ మోడరన్ టైమ్స్’ (1962)లో వర్గీకరించిన పదకొండు అంశాల్లో 60 ఏళ్ళ క్రితమే, ఆరు అంశాలు గోదావరి మండలంలో కనిపిస్తాయి. భూమికి నీటి వసతి తోడవ్వడం వల్ల... వందేళ్లలో ఆ ప్రాంతం అన్ని రంగాల్లోనూ మిగతా ప్రాంతాల నుంచి వేరు పడింది. అయితే మరి ఈ ప్రాంతాల్లో ప్రొ. మిశ్రా చెబుతున్న మధ్యతరగతి ఏది? భూములున్న ఆధిపత్య వర్గాలదే ఇక్కడా తొలి విస్తరి అయితే, ఇన్నేళ్ళ ‘సరళీకరణ’ తర్వాత కూడా– ‘వెనుకబడిన వర్గాలు వెనుకే...’ అనే పాత సూత్రమేనా? అందుకు జవాబుగానే వనరుల సమాంతర పంపిణీ కోసం... ‘జల వద్దనే ప్రవాహ దిశల్ని నలుదిక్కులకు దారి మళ్ళించడం’ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలయింది. కానీ ఆరంభ దశలోనే ఈ మార్పును ఎగువ మధ్యతరగతి అంగీకరించలేకపోతున్నది. ఇదే చిత్రం! సరళీకరణ విధానాలు తెచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల సంప్రదాయ సామాజిక దొంతర బలహీనమైంది. అదే సమయంలో అభివృద్ధి హారిజాంటల్గా విస్తరించడం చూడవచ్చు. ఈ అభివృద్ధిని రైతన్నలకే కాక, అట్టడుగు వర్గాల వరకు తీసుకెళ్లడానికి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్ర విభజన తర్వాత భూమికి జలకళ తోడవ్వడంతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. వీటి ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను అభివృద్ధి చేస్తే వ్యవసాయాధారిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. (చదవండి: ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’తో కొత్త వెలుగు!) వెనుకబడిన సామాజికవర్గాల నుంచి కొత్తగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులుగా మారిన– ‘ఎంటర్ ప్రెన్యూర్’ యువతకు ఈ ప్రభుత్వం కొత్త అభివృద్ధి– ‘ప్లాట్ ఫార్మ్’ను ప్లాన్ చేసింది. సహజంగానే వీరిలో బహుజన–దళిత–మైనారిటీ సామాజిక శ్రేణులు వారి వారి దామాషా మేరకు ఎటూ ఉంటారు. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ నిర్మాణ కాలంలో రెండేళ్లపాటు– ‘వ్యాట్’, ‘జీఎస్టీ’ల్లో రూ. 2 కోట్లు మించకుండా ‘ఎంటర్ ప్రెన్యూర్’కు తిరిగి చెల్లిస్తున్నారు. కోల్డ్ చైన్స్, కోల్డ్ స్టోరేజి, కాయలు పండ్లుగా మార్చే ‘రైపెనింగ్ యూనిట్స్’కి అవి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఐదేళ్లపాటు యూనిట్ రూ. 1.50 విద్యుత్తు సబ్సిడీ ఇస్తారు. కొత్త యూనిట్లకు– ‘క్యాపిటల్ సబ్సిడీ’ 25 శాతం ఇస్తున్నారు. అలాగే, యూనిట్లను అప్ గ్రేడ్ చేస్తే ఒక కోటి రూపాయలకు మించకుండా 25 శాతం ఇస్తారు. తొలి దశ ప్రాసెసింగ్ చేసే యూనిట్లకు రూ. 2.5 కోట్లు మించకుండా యాభై శాతం వరకు ‘కేపిటల్ సబ్సిడీ’ ఇస్తున్నారు. వ్యవసాయ, హార్టికల్చర్, డైరీ, మీట్ ఉత్పత్తుల ‘కోల్డ్ చైన్’కు 35 శాతం క్యాపిటల్ సబ్సిడీ’ ఇస్తున్నారు. రెండు శ్లాబుల్లో కేపిటల్ పెట్టుబడి మీద ఐదేళ్ళ పాటు వడ్డీ మీద సబ్సిడీ 7 శాతం ఇస్తున్నారు. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి బయటకు వెళ్లి, ప్రపంచ మార్కెట్లో పనిచేస్తున్న మన యువత సంపాదన నిల్వలు, వారి సొంత ప్రాంతంలో పెట్టు బడులుగా పెట్టడం వల్ల– ‘మైక్రో స్మాల్ అండ్ మీడియం’ యూనిట్లు రాష్ట్రంలో బాగా పెరుగుతాయి. రైతు పంటలకు గిరాకీ పెరుగుతుంది. ‘డైరీ’ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. రైతు కూలీకి ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతుంది. రవాణా, శీతల గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లు, బ్యాంకింగ్, హోటళ్ళు... ఇలా ఒక్కొక్కటిగా ప్రతి రంగం విస్తరించి చిన్న పట్టణాలలో ఉపాధి పెరుగుతుంది. ఫలితంగా సామాజిక వ్యవస్థలోని అన్ని వర్గాలూ అభివృద్ధికి చేరువవుతాయి. (చదవండి: ‘ట్యాక్స్ పేయర్స్ మనీ’ అంటూ ‘సోషల్ ఆడిట్’!) - జాన్సన్ చోరగుడి రాజకీయ – సామాజిక విశ్లేషకులు