గత మూడేళ్ళుగా అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మారుతున్న భారత దౌత్య విధానానికి, ఆగ్నేయ తీరాన ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తున్నదా? కొందరు సీనియర్ ‘బ్యూరో క్రాట్ల’ అభిప్రాయాలు చూస్తున్నప్పుడు, అందుకు– ‘అవును’ అనే సమాధానం దొరుకుతున్నది. వీరికి రాజకీయాలు పట్టవు కనుక, విషయం ఏదైనప్పటికీ అందరి మేలు, దేశ సమగ్రత, దృష్టి నుంచి వీరు మాట్లాడతారు. మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారాయణన్ – ‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు –నివారణ చర్యలు’ అంశంపై ఇటీవల రాసిన వ్యాసంలో– ప్రస్తావించిన పలు కల్లోల ప్రాంతాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేకపోవడం, ఊరట కలిగిస్తున్న అంశం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భౌగోళికంగా సముద్ర తీర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్... ఇండియా– ‘ఆగ్నేయ ఆసియా విధానం’ అమలుకు, దేశ ‘జియో–పొలిటికల్’ వ్యూహాల దృష్ట్యా కేంద్రానికి ప్రత్యేకం. నలభై ఏళ్ల తెలంగాణ ఉద్యమ తీవ్రత విభజన చట్టంతో ముగిశాక, గత మూడేళ్ళలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఇక్కడ మావోయిస్టుల చర్యలు లేవు. అయితే, గత మూడు దశాబ్దాల్లో కేంద్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన– ‘విభజన’ పోరాటాలు కొన్ని ఇప్పటికీ నివురు కప్పిన నిప్పులా నిద్రాణంగా ఉంటూ, సందు దొరికితే తలలు ఎగరేయడానికి సిద్దంగా ఉన్నాయనీ; భద్రతా చర్యలతో కంటే, ప్రభుత్వాలు అనుసరించవలసిన– ‘రాజనీతి’ (స్టేట్ క్రాఫ్ట్)తో మాత్రమే వాటిని పరిష్కరించుకోవలసి ఉంటుందనీ నారాయణన్ అంటున్నారు.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మొదలైన మన– ‘లుక్ ఈస్ట్’ దౌత్య విధానం, ప్రధానిగా మోదీ ఎనిమిదో ఏటకు– ‘యాక్ట్ ఈస్ట్’గా పరిణామం చెందింది. మే 23న జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మన ప్రధాని సమక్షంలో 12 దేశాలు – ‘ఇండో–పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేం వర్క్ ఫర్ ప్రాస్పరిటీ’ ఒప్పందం చేసుకున్నాయి. సరిగ్గా అదే సమయానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా దేశానికి ఆగ్నేయ తీరాన సుదీర్ఘ సముద్ర తీరంతో ఆంధ్రప్రదేశ్– దేశానికి ‘గేట్ వే’గా పరిణమించింది. బైడెన్ ఈ ఒప్పం దాన్ని– ‘రైటింగ్ న్యూ రూల్స్ ఫర్ 21 సెంచరీ ఎకానమీ’ అంటూ అభివర్ణించారు.
ఇది జరిగి నెల కూడా కాకుండానే, జూన్ 12న మన విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఏపీ ప్రతిపాదిత రాజధాని విశాఖలో జరిపిన మేధావుల సదస్సులో– ‘‘తూర్పు తీరంలోని పోర్టులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయవలసి ఉందనీ, అప్పుడే ప్రపంచ మార్కెట్‌తో మన వాణిజ్యం అభివృద్ధి చెందుతుందనీ’’ అన్నారు. పశ్చిమాన గుజరాత్ తీరం తర్వాత తూర్పున ఏపీనే అత్యధిక తీర ప్రాంతం కలిగి ఉంది. గత రెండేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, కోస్తా తీరానికి సమాంతరంగా నిర్మాణం అవుతున్న హైవేలు, వైమానిక దళం విమానాలు అత్యవసర పరిస్థితుల్లో దిగడానికి అనువైన ‘హెలీప్యాడ్’ నిర్మాణాలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సిద్ధం కావడం తెలిసిందే.
తూర్పు కనుమల మీదుగా జాతీయ రహదారుల శాఖ నిర్మిస్తున్న ‘హైవే’ చెన్నై–కలకత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్డుతో సమాంతరంగా రాజమండ్రి నుంచి మన్యసీమ మీదుగా రాయపూర్ చేరుతుంది. దక్షణాదిలో విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై–బెంగళూరు ఇండ స్ట్రియల్ కారిడార్, బెంగళూరు–హైదరాబాద్ ఇండస్ట్రి యల్ కారిడార్లు సిద్ధమవుతున్న నాటికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసింది. రాబోయే ఈ ‘కారిడార్ల’ ద్వారా జరిగే వృద్ధిలో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షం గానూ పరోక్షంగానూ ప్రయోజనం పొందుతారు. (క్లిక్: రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకేనా?)
ప్రపంచ వ్యాప్తంగా అమలులో వున్న– ‘నాలుగవ పారిశ్రామిక విప్లవం’లో (బ్లర్రింగ్ ఆఫ్ బౌండ్రీస్) సరిహద్దుల చెరిపివేత కీలకం. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ‘రాజ్యం’ బాధ్యత. అలాగని అన్ని ప్రభుత్వాలు దాన్ని నిక్కచ్చిగా పట్టించుకోవాలని లేదు. ‘కమ్ వాట్ మే...’ (ఏదైతే అదయ్యింది) అనే తరహాలో గత మూడేళ్ళుగా అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మారుతున్న భారత దౌత్య విధానానికి, ఆగ్నేయ తీరాన ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తున్నదా? పరిపాలనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూక్ష్మ దృష్టిని చూస్తే, అవును అనే స్పష్టం అవుతున్నది. (క్లిక్: బైజూస్ సేవలు ఉపయోగకరం)
- జాన్‌సన్ చోరగుడి
అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment