diplomacy
-
భద్రతా మండలిలో చోటుకు బదులు...
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశ హోదా కోసం భారత్ పావు శతాబ్ద కాలంగా విఫలయత్నం చేసింది. మండలి విస్తరణ జరిగినా చోటు దొరక్కపోతే మళ్లీ మరో పాతికేళ్ళు వృథా అవుతుంది. అందుకే ఆ ప్రయత్నాలను కొనసాగిస్తూనే, ప్రత్యామ్నాయంగా భిన్న దేశాల కూటములతో కలిసి పనిచేయాలన్న కచ్చితమైన నిర్ణయం భారత్ తీసుకుంది. ప్రపంచ సమస్యలపై ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. ‘ఐఎస్ఏ’, ‘సీడీఆర్ఐ’ లాంటి సమూహాల స్థాపనకు చొరవ తీసుకోవడమే కాకుండా, వాటి కార్యాలయాలను ఢిల్లీలో ఏర్పాటు చేయించడంలో విజయం సాధించింది. క్వాడ్, ఐ2యూ2 లాంటి సమూహాలతో కూడా సాగుతూ భారత్ ప్రాభవాన్ని పెరిగేలా చూడటం మన దౌత్య పురోగతికి సంకేతం. దౌత్యపరంగా ప్రపంచంలోనే అత్యున్నత వేదిక అయిన భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారత్ ఇక ఎదురుచూడటం లేదు. ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చెందిన అత్యంత ముఖ్యమైన ఈ విభాగంలో సమాన ప్రాతినిధ్య లక్ష్యం దిశగా పావు శతాబ్ద కాలంగా చేస్తూ వచ్చిన ప్రయత్నాలు పెద్ద పురోగతిని సాధించలేదు. భద్రతా మండలి విస్తరణలో కూడా మరో పాతికేళ్ళ కాలం భారత్ వంటి ఆశావహులను పక్కదారి పట్టించవచ్చనేది ఇప్పుడు కేంద్రప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. అందుకే, అంతుచిక్కని ఐక్యరాజ్యసమితి సంస్కరణల లక్ష్యం కోసం ఎదురుచూడకుండా ప్రపంచ వేదికపై తన పాద ముద్ర వేయ డానికి, చిన్న చిన్న దేశాల సమూహాలతో కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. భారత్ 37 బహు పాక్షిక సమూహాలలో చేరింది. అంతేకాకుండా, భద్రతా మండలికి బదులుగా ప్రపంచ సమస్యలపై ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ఫిబ్రవరి 8న రాజ్యసభలో మాట్లాడుతూ, ఈ బహుపాక్షిక సమూహాలు ‘‘వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ సహకారం సహా అనేక రంగాలలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్‌కు వీలు కల్పిస్తాయి. ఇలాంటి ఫలితాలు భారత్ జాతీయ అభివృద్ధి ఎజెండాకు దోహదం చేస్తాయి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి, మన ప్రజల శ్రేయస్సును మెరుగుపరుస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తెస్తాయి’’ అని చెప్పారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ) అనేది భారత్ ఆలోచన. 2015లో ప్యారిస్‌లో జరిగిన 21వ వాతావరణ మార్పు సదస్సులో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే అందించిన మద్దతు ఈ భావనను ఫ్రాంకో–ఇండియన్ ఉమ్మడి ప్రయత్నంగా మార్చింది. ఇది మోదీ ప్రభుత్వ మొట్టమొదటి బహుపాక్షిక చొరవ. కాబట్టి, ఇది ప్రారంభం కావడానికి కాస్త సమయం పట్టింది. అయితే ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీటీ)లో ఉన్నందున ఇది భారత ప్రతిష్ఠను మరింతగా పెంచింది. అనేక దశాబ్దాలుగా మన దేశమే సమస్యగా ఉండటం కాకుండా, వాతావరణ మార్పుపై సమస్య–పరిష్కర్తగా మారేట్టు చేసి, భారత ఖ్యాతిని పెంచింది. సీడీఆర్ఐ విషయానికి వస్తే, దానికి ఐఎస్ఏ లాగా అంత పేరు లేదు. ఇది 2019లో ఏర్పడిన కొత్త, ముఖ్యమైన భాగస్వామ్యం. ఇది వాతావరణానికి తట్టుకోగల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి... బహుపాక్షిక ఏజెన్సీలు, అభివృద్ధి బ్యాంకులు, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థలతో కలిసి పనిచేయడానికికీ ప్రభుత్వాలను ఒక చోటికి తీసుకువస్తుంది. 2016లో జరిగిన విపత్తు నష్టభయం తగ్గింపుపై జరిగిన ఆసియా మంత్రుల సదస్సులో మోదీ అటువంటి కూటమి ఆలోచనను ప్రతిపాదించారు. అయితే ఈ ఆలోచనను దాని భాగస్వాములు ఆమోదించడానికీ, సీడీఆర్ఐని రూపొందించడానికీ మరో మూడేళ్లు పట్టింది. సీడీఆర్ఐ ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలో ఉంది. అనేక దశాబ్దాలుగా, జెనీవా, నైరోబీ, వియన్నా వంటి మెట్రోలకు లాగే తన నగరాల్లో ఒకదానిని ఐక్యరాజ్యసమితి నగరంగా ప్రకటించాలని భారత్ ఆకాంక్ష. పైన పేర్కొన్న నగరాలు న్యూయార్క్‌కు అనుబంధ, ద్వితీయ ప్రధాన కార్యాలయంగా పని చేస్తాయి. ఇక్కడ ఐరాస వార్షిక జనరల్ అసెంబ్లీ వంటి అతి ముఖ్యమైన కార్యకలాపాలు సాగుతాయి. అయితే, భారత్ కోరుకున్నట్లు జరగలేదు. తన ప్రధాన నగరాల్లో ఒకదానిలో ప్రాంతీయ ఆర్థిక సంఘాన్ని నెలకొల్పేలా ఐరాసను భారత్ ఒప్పించలేకపోయింది. అడిస్ అబాబా, బ్యాంకాక్, బీరూట్, జెనీవా, శాంటియాగోలకు ఈ ఘనత లభించింది. అందువల్ల, భారత్‌లో సీడీఆర్ఐ, ఐఎస్ఏ కార్యాలయాలను నెలకొల్ప టానికి వ్యవస్థాపక సభ్యదేశాలను ఒప్పించటం గొప్ప విషయం. నేడు ఈ రెండు సంస్థలు పెద్ద సంఖ్యలో భారతీయులకు ఉపాధి కల్పిస్తు న్నాయి. న్యూఢిల్లీకి మకాం మార్చి, ఈ సంస్థలలో పని చేయడానికి విదేశాల నుంచి కూడా నిపుణులను రప్పించారు. జాతీయ రాజధాని ప్రాంతం ఈ సంస్థల నుండి అనుబంధ ప్రయోజనాలను పొందుతుంది. వారి ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా సమావేశాలు, ప్రదర్శనలకు న్యూఢిల్లీ ఒక ముఖ్యమైన వేదికగా ఎదుగుతుంది. భారత్ సభ్యురాలిగా ఉన్న అతి ముఖ్యమైన బహుళజాతి సమూహం ఏదంటే నిస్సందేహంగా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. దీనిని సరళంగా క్వాడ్ అని పిలుస్తున్నారు. ఇది భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలను ఒకచోట చేర్చింది. క్వాడ్‌కు భారత్‌లో సంశ యవాదులు మాత్రమే కాకుండా కొన్నిసార్లు తీవ్రమైన వ్యతిరేకులు కూడా లేకపోలేదు. కానీ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘వై భారత్ మ్యాటర్స్’ పుస్తకంలో, క్వాడ్ గురించి చాలా ముఖ్యమైన కానీ తరచుగా నిర్లక్ష్యం చేయబడిన అంశాన్ని పేర్కొన్నారు. భారత్‌కు ‘ఇటీవలి కాలంలో చాలా స్పష్టంగా అభివృద్ధి చెందిన సంబంధం ఆస్ట్రేలియాతోనే’ అని రాశారు. జైశంకర్ ప్రకారం, ఈ క్వాడ్ సభ్యదేశంతో పెరుగుతున్న సంబంధాలు ఇతర క్వాడ్ సభ్యదేశాలైన జపాన్, అమెరికాలతో సంబంధాలలో అంతరాన్ని తగ్గించాయి. అధికారిక అంచనా, ప్రజల అవగాహన రెండింటిలోనూ జపాన్, అమెరికాతో భారత్ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. జైశంకర్ వాదనను అంగీకరించినట్లయితే, బహుపాక్షిక క్వాడ్ నిజానికి సాధారణంగా అంగీకరించిన దానికంటే పెద్ద ద్వైపాక్షిక ప్రయోజనాన్ని అందిస్తోంది. గత సంవత్సరం, క్వాడ్ మొదటిసారిగా ఐరాస భద్రతా మండలి సంస్కరణపై అంతర్–ప్రభుత్వ చర్చలకు మద్దతు ఇచ్చింది. ఐక్యరాజ్యసమితిని వాస్తవానికి ఏర్పాటు చేయడా నికి కారణమైన ప్రశంసనీయమైన లక్ష్యాలను అణచివేసే ప్రయత్నా లను అడ్డుకోవడానికి కలిసి పనిచేయడానికి అంగీకరించింది. జైశంకర్ ప్రకారం, క్వాడ్ ‘రెండు దశాబ్దాలుగా కీలక సంబంధాలలో భారత దేశం సాధించిన పురోగతి సమాహారం’. ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలతో కూడిన ‘ఐ2యూ2’ కూటమి కూడా పూర్తిగా భారత్‌కు మాత్రమే ప్రయోజనం చేకూర్చింది. యూఏఈ పెట్టుబ డులు, ఇజ్రాయెల్ నీటిపారుదల సాంకేతికతతో మధ్యప్రదేశ్‌లో ఫుడ్ పార్కుల నెట్వర్క్ స్థాపన జరిగింది. రెండో ఐ2యూ2 ప్రాజెక్ట్ అమె రికా నిధులతో గుజరాత్లో విద్యుదుత్పత్తి కోసం సౌరశక్తిని ఉపయో గించాలని భావిస్తోంది. అయితే, పశ్చిమాసియాలో పెరుగుతున్న సంఘర్షణ దృష్ట్యా కొత్త ఐ2యూ2 ప్రాజెక్ట్‌లు ముందుకు సాగడానికి చాలా సమయం పట్టనుండటం విచారకరం. ఇలాంటి మరెన్నో సమూహాలకు కేంద్రంగా ఉంటున్న భారత్‌తో బహుళజాతి కార్యక్రమాలు, త్రైపాక్షికత పెరుగుతుండటం అనేవి భారతీయ దౌత్య పురోగతికి సంకేతం. భారత్, ఫ్రాన్స్, యూఏఈ తమ ‘ఫోకల్ పాయింట్స్ గ్రూప్’ను 2022లో ఏర్పాటు చేశాయి. ఇది రక్షణ, విపత్తు నిర్వహణ నుండి ప్రాంతీయ అనుసంధానం, ఆహార భద్రత వరకు అనేక రంగాలలో పురోగమిస్తోంది. ఈ మోడల్ మాదిరి గానే భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కాలానుగుణంగా ‘ఫోకల్ పాయింట్ల సమావేశాలను’ నిర్వహిస్తున్నాయి. అంత మాత్రాన ఇదంతా భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి వీడ్కోలు చెప్పడం కానే కాదు. కానీ ఫ్రెంచ్వారన్నట్లు ‘మనం మళ్లీ కలిసేవరకు’ కొనసాగుతాయని అర్థం. కె.పి. నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘రాజనీతి’లో రేపటి చూపు!
గత మూడేళ్ళుగా అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మారుతున్న భారత దౌత్య విధానానికి, ఆగ్నేయ తీరాన ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తున్నదా? కొందరు సీనియర్ ‘బ్యూరో క్రాట్ల’ అభిప్రాయాలు చూస్తున్నప్పుడు, అందుకు– ‘అవును’ అనే సమాధానం దొరుకుతున్నది. వీరికి రాజకీయాలు పట్టవు కనుక, విషయం ఏదైనప్పటికీ అందరి మేలు, దేశ సమగ్రత, దృష్టి నుంచి వీరు మాట్లాడతారు. మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారాయణన్ – ‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు –నివారణ చర్యలు’ అంశంపై ఇటీవల రాసిన వ్యాసంలో– ప్రస్తావించిన పలు కల్లోల ప్రాంతాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేకపోవడం, ఊరట కలిగిస్తున్న అంశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో భౌగోళికంగా సముద్ర తీర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్... ఇండియా– ‘ఆగ్నేయ ఆసియా విధానం’ అమలుకు, దేశ ‘జియో–పొలిటికల్’ వ్యూహాల దృష్ట్యా కేంద్రానికి ప్రత్యేకం. నలభై ఏళ్ల తెలంగాణ ఉద్యమ తీవ్రత విభజన చట్టంతో ముగిశాక, గత మూడేళ్ళలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఇక్కడ మావోయిస్టుల చర్యలు లేవు. అయితే, గత మూడు దశాబ్దాల్లో కేంద్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన– ‘విభజన’ పోరాటాలు కొన్ని ఇప్పటికీ నివురు కప్పిన నిప్పులా నిద్రాణంగా ఉంటూ, సందు దొరికితే తలలు ఎగరేయడానికి సిద్దంగా ఉన్నాయనీ; భద్రతా చర్యలతో కంటే, ప్రభుత్వాలు అనుసరించవలసిన– ‘రాజనీతి’ (స్టేట్ క్రాఫ్ట్)తో మాత్రమే వాటిని పరిష్కరించుకోవలసి ఉంటుందనీ నారాయణన్ అంటున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మొదలైన మన– ‘లుక్ ఈస్ట్’ దౌత్య విధానం, ప్రధానిగా మోదీ ఎనిమిదో ఏటకు– ‘యాక్ట్ ఈస్ట్’గా పరిణామం చెందింది. మే 23న జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మన ప్రధాని సమక్షంలో 12 దేశాలు – ‘ఇండో–పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేం వర్క్ ఫర్ ప్రాస్పరిటీ’ ఒప్పందం చేసుకున్నాయి. సరిగ్గా అదే సమయానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా దేశానికి ఆగ్నేయ తీరాన సుదీర్ఘ సముద్ర తీరంతో ఆంధ్రప్రదేశ్– దేశానికి ‘గేట్ వే’గా పరిణమించింది. బైడెన్ ఈ ఒప్పం దాన్ని– ‘రైటింగ్ న్యూ రూల్స్ ఫర్ 21 సెంచరీ ఎకానమీ’ అంటూ అభివర్ణించారు. ఇది జరిగి నెల కూడా కాకుండానే, జూన్ 12న మన విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఏపీ ప్రతిపాదిత రాజధాని విశాఖలో జరిపిన మేధావుల సదస్సులో– ‘‘తూర్పు తీరంలోని పోర్టులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయవలసి ఉందనీ, అప్పుడే ప్రపంచ మార్కెట్‌తో మన వాణిజ్యం అభివృద్ధి చెందుతుందనీ’’ అన్నారు. పశ్చిమాన గుజరాత్ తీరం తర్వాత తూర్పున ఏపీనే అత్యధిక తీర ప్రాంతం కలిగి ఉంది. గత రెండేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, కోస్తా తీరానికి సమాంతరంగా నిర్మాణం అవుతున్న హైవేలు, వైమానిక దళం విమానాలు అత్యవసర పరిస్థితుల్లో దిగడానికి అనువైన ‘హెలీప్యాడ్’ నిర్మాణాలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సిద్ధం కావడం తెలిసిందే. తూర్పు కనుమల మీదుగా జాతీయ రహదారుల శాఖ నిర్మిస్తున్న ‘హైవే’ చెన్నై–కలకత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్డుతో సమాంతరంగా రాజమండ్రి నుంచి మన్యసీమ మీదుగా రాయపూర్ చేరుతుంది. దక్షణాదిలో విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై–బెంగళూరు ఇండ స్ట్రియల్ కారిడార్, బెంగళూరు–హైదరాబాద్ ఇండస్ట్రి యల్ కారిడార్లు సిద్ధమవుతున్న నాటికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసింది. రాబోయే ఈ ‘కారిడార్ల’ ద్వారా జరిగే వృద్ధిలో రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షం గానూ పరోక్షంగానూ ప్రయోజనం పొందుతారు. (క్లిక్: రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకేనా?) ప్రపంచ వ్యాప్తంగా అమలులో వున్న– ‘నాలుగవ పారిశ్రామిక విప్లవం’లో (బ్లర్రింగ్ ఆఫ్ బౌండ్రీస్) సరిహద్దుల చెరిపివేత కీలకం. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ‘రాజ్యం’ బాధ్యత. అలాగని అన్ని ప్రభుత్వాలు దాన్ని నిక్కచ్చిగా పట్టించుకోవాలని లేదు. ‘కమ్ వాట్ మే...’ (ఏదైతే అదయ్యింది) అనే తరహాలో గత మూడేళ్ళుగా అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్, మారుతున్న భారత దౌత్య విధానానికి, ఆగ్నేయ తీరాన ఆధారపడదగిన భాగస్వామిగా కనిపిస్తున్నదా? పరిపాలనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూక్ష్మ దృష్టిని చూస్తే, అవును అనే స్పష్టం అవుతున్నది. (క్లిక్: బైజూస్ సేవలు ఉపయోగకరం) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
‘మిఠాయి దౌత్యం’.. స్వీట్లు పంచుకున్న భారత్, పాక్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఇరు దేశాల భద్రతా సిబ్బంది కలిసిపోతారు. ప్రత్యేక దినాల్లో ఇరు సైనికులు స్నేహాభావంతో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. తాజాగా బక్రీద్ పర్వదినం సందర్భంగా దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా పండుగ చేసుకున్నారు. ఇరు దేశాల సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుని ఆనందంలో మునిగారు. పూంచ్- రావల్కోట్ సరిహద్దు వద్ద ఉన్న భారత్ పాక్ సైనికులు ‘మిఠాయి దౌత్యం’ నిర్వహించారు. ఇటు పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా ఇరు దేశాలు సైనికులు మిఠాయి దౌత్యం చేపట్టారు. ఇక పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. పండుగ సందర్భంగా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని మిఠాయి దౌత్యం నిర్వహించామని పూంచ్‌లోని భారత లెఫ్టినెంట్ కమాండర్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మిఠాయిలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు, పాక్ రెసిడెంట్లు మార్చుకున్నట్లు వివరించారు. ఇలాంటి వాటితో రెండు దేశాల మధ్య స్నేహం, విశ్వాసాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి మిఠాయి దౌత్యం నిర్వహించారు. పూంచ్ జిల్లాలోని సరిహద్దులో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటున్న ఇరు దేశాల సైనికులు (ఫొటో: హిందూస్తాన్ టైమ్స్) -
దౌత్యంలో కొత్త దారులు
మిత్ర, శత్రు దేశాలన్న తేడా లేకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అందరినీ టారిఫ్‌ల యుద్ధంతో ఠారెత్తిస్తున్న వర్తమాన వాతావరణంలో కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో గురు, శుక్రవారాల్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను బుట్టదాఖలు చేసి, కొత్త షరతులు విధిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్న ట్రంప్ ధోరణి వల్ల ఇబ్బంది పడని దేశమంటూ లేదు. అమెరికాకు ఎంతో సన్నిహితంగా ఉండే యూరప్ దేశాలు సైతం ఈ దూకుడును సహించలేకపోతున్నాయి. అందుకే ఎస్సీఓ తీరుతెన్నులు ఇక ముందెలా ఉండబోతున్నాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అది తీసుకోబోయే నిర్ణయాలు అంతర్జాతీయ సంబంధాలపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నదని అంచనా వేస్తున్నవారూ ఉన్నారు. తమ తమ ప్రాంతాల్లో అమెరికా ప్రభావాన్ని పరిమితం చేయడం ఎలాగన్నది ఇప్పుడు రష్యా, చైనాలను వేధిస్తున్న ప్రశ్న. ఇందుకోసం తమ మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కనబెట్టి సమ ష్టిగా కలిసి కదలాలని అవి రెండూ భావిస్తున్నాయి. పూర్వపు సోవియెట్ యూనియన్‌లో భాగంగా ఉన్న దేశాల్లో అమెరికా ప్రభావం క్రమేపీ పెరగడం రష్యాను కలవరపెడుతుంటే... పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో దాని తీరుతెన్నులపై చైనాకు అభ్యంతరాలున్నాయి. రష్యా, చైనాలు కూటమిగా ఏర్ప డటం అసాధ్యమని ఇన్నాళ్లూ అమెరికా భావిస్తూ వస్తోంది. కానీ ఈ ఏడాది మొదట్లో అమెరికా నిఘా సంస్థ సెనేట్‌కు సమర్పించిన ఒక నివేదిక చైనా, రష్యాల మధ్య విస్తరిస్తున్న సహకారాన్ని ప్రత్యేకించి ప్రస్తావించింది. అవి పరస్పరం స్నేహసంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు అంతర్జాతీయ సంస్థల ద్వారా వాటికి అనువైన కొత్త నిబంధనలు, ప్రమాణాలు ఏర్పరచ డానికి ప్రయత్నిస్తున్నాయని ఆ నిఘా నివేదిక వివరించింది. అంతకుముందు సోవియెట్ యూని యన్, చైనాల మధ్య సంబంధాల మాటెలా ఉన్నా, 80వ దశకం చివరి నుంచి అవి క్రమేపీ మెరుగుపడుతూ వచ్చాయి. సోవియెట్ కుప్పకూలి రష్యా ఏర్పడ్డాక రెండింటిమధ్యా మిత్రత్వమే కొనసాగుతోంది. వలసలను కట్టడి చేయకపోతే అమెరికాకు చేసే ఎగుమతులపై మరో 5 శాతం టారిఫ్‌లు విధించి దాన్ని 25శాతానికి తీసుకెళ్తానని డోనాల్డ్ ట్రంప్ పక్షం రోజులక్రితం మెక్సికోను హెచ్చ రించారు. ఆ మర్నాడు మన దేశంపై విరుచుకుపడ్డారు. భారత్‌కు ఇప్పటివరకూ ఇస్తున్న సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీపీఎస్)ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనివల్ల 560 కోట్ల డాలర్లమేర భారత్‌కున్న వెసులుబాట్లు పోతాయని అమెరికా అంచనా వేస్తుండగా, అది 19 కోట్ల డాలర్లు మించదని మన దేశం చెబుతోంది. భారత్ మార్కెట్లలో అమెరికాకు సమాన ప్రతిపత్తి కల్పించ నప్పుడు మేమెందుకు దాన్ని కొనసాగించాలన్నది ట్రంప్ వాదన. అలాగే నిరుడు చైనాపైనా, 28 దేశాల కూటమి యూరప్ యూనియన్(ఈయూ)పైనా ఆయన భారీయెత్తున సుంకాలు విధించగా అటు చైనా, ఇటు ఈయూ సైతం అమెరికా ఉత్పత్తులపై తాము కూడా సుంకాలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఎవరికి వారు అమెరికా సాగిస్తున్న ఈ టారిఫ్‌ల యుద్ధం వల్ల నష్టపోతున్న తరు ణంలో ఆ దేశాలన్నీ ఏదో మేర ఏకం కావాలని చూడటం అసహజమేమీ కాదు. పద్దెనిమిదేళ్లక్రితం ఆవిర్భవించిన ఎస్సీఓలో మన దేశానికి 2017లో సభ్యత్వం లభించింది. అయితే అది కీలకమైన సంస్థగా రూపుదిద్దుకోబోతున్నదని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఇది ఏ దేశానికీ వ్యతిరేకంగా ఏర్పడింది కాదని, ఇందులో భద్రత, అభివృద్ధిపైనే దృష్టి సారించి, వాటికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తామని ఇప్పటికే చైనా ఉప విదేశాంగమంత్రి ఝాంగ్ హాన్ హ్యూ వివరణనిచ్చారు. అలా అంటూనే వాణిజ్యపరమైన ఆత్మరక్షణ విధానాలు, ఏకపక్ష విధా నాలు వగైరాలపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుంటామని ఆయన అనడాన్నిబట్టి అమెరికా వ్యవహారశైలి, దాన్ని ఎదుర్కొనడానికి అనుసరించాల్సిన వ్యూహం వగైరాలు కూడా శిఖరాగ్ర సదస్సులో ప్రస్తావనకు రాకమానవని అర్ధమవుతోంది. ఎస్సీఓలో సభ్య దేశాలుగా ఉన్న భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్న విభేదాలు, తనకు భారత్‌తో ఉన్న వివాదాలు పరిష్కారమైతే సంస్థ మరింత పటిష్టమవుతుందన్న అభిప్రాయం చైనాకుంది. అదే సమయంలో అమెరికా పోకడల విష యంలో భారత్, చైనాలు రెండింటికీ అభ్యంతరాలున్నాయి. ఇవే తమ మధ్య మరింత సహకారాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని చైనా విశ్వసిస్తోంది. ప్రధాని మోదీ ఈ సదస్సులో ఉగ్ర వాదం అంశాన్ని లేవనెత్తినా, నేరుగా పాక్ పేరెత్తి దాన్ని విమర్శించబోరని చైనా ఆశిస్తోంది. ఈ సదస్సు సందర్భంగా మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య భేటీ జరగబోదని ఇప్పటికే తేటతెల్లమైంది. అమెరికా అనుసరిస్తున్న ధోరణులు ఆ దేశానికి సన్నిహితంగా ఉండే సింగపూర్, మలేసియా వంటి దేశాలకు కూడా రుచించడం లేదు. ఎదుగుతున్న చైనాను, దాని ఆకాంక్షలను గుర్తించి అందుకు అనుగుణమైన సర్దుబాట్లు చేసుకోవాలని ఈ నెల 2న ముగిసిన ఆసియా ప్రాంత దేశాల రక్షణ సదస్సు ‘షాంగ్రీలా డైలాగ్’లో సింగపూర్ ప్రధాని లీ షెన్ లూంగ్ అమెరికాకు హితవు పలి కారు. చైనాతో వాణిజ్య, భద్రతా అంశాల్లో తగవుపడుతున్న అమెరికా తీరును మలేసియా ప్రధాని మహతీర్ మహమ్మద్ విమర్శించారు. ఇలా సన్నిహిత దేశాలకే అమెరికా అనుసరిస్తున్న ధోరణి నచ్చని స్థితిలో, దాని బాధిత దేశాలకు ఇంకెంత ఆగ్రహావేశాలుంటాయో అర్ధం చేసుకోవచ్చు. ట్రంప్ విధానాల వల్ల చైనా, రష్యాలు సన్నిహితమవుతున్నాయని, ఈ పరిణామం ముందూ మునుపూ అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నదని ఆ దేశ పౌరులు ఆందోళన పడుతున్నారు. ఏదేమైనా శరవేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో మన దేశానికి గరి ష్టంగా ప్రయోజనాలు రాబట్టే దిశగా మన దౌత్య వ్యూహాలను పదునుపెట్టుకోవాల్సి ఉంటుంది. -
‘ఇక మిలిటరీ యాక్షన్స్ కాదు.. ఆర్థిక చేయూత’
వాషింగ్టన్: అణ్వాస్త్రాల విషయంలో ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఏం జరగనుందో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. ఎప్పుడు దూకుడుగా, కవ్వించినట్లుగా స్పందించే ఆయన ఓ దౌత్యవేత్తలాగా సహనం ప్రదర్శించారు. భవిష్యత్‌లో అణుకార్యక్రమం గురించి అమెరికా, ఉత్తర కొరియా మధ్య వీడని పెద్ద ప్రతిష్టంభన కచ్చితంగా నెలకొనే అవకాశం ఉందని చెప్పిన ఆయన ఆ సమస్యను సావధానంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ నొక్కి చెప్పారు. శాంతి పరిష్కారం కూడా తప్పకుండా లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్ దౌత్యమే దీనికి పరిష్కార మార్గం అని అన్నారు. ‘ఉత్తర కొరియాతో ఉన్న మేజర్ వివాదానికి శుభంకార్డు వేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. రాయభారం ద్వారా మాత్రమే దీన్ని సాధించాలి’ అంటూ ఆయన ఓవల్ కార్యాలయంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సమస్యకు శాంతిపూర్వక పరిష్కారం కోరుకుంటున్నాని చెప్పారు. ఇక నుంచి తన పాలన వర్గం సైనిక పరమైన చర్యలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోకుండా ఆర్థిక కార్యక్రమాలతో ముందుకెళదామనుకుంటున్నట్లు తెలిపారు. ‘ఉత్తర కొరియాతో సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నాం.. కానీ అది కొంచెం క్లిష్టమైనది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ముస్లిం దేశాల సపోర్ట్ కూడా పాక్‌కు లేదు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ భారత్‌ను దొంగదెబ్బ తీస్తున్న పాకిస్తాన్‌పై తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే అన్న వాదనలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ స్పందించారు. పాకిస్తాన్‌తో యుద్ధం అంత మంచిది కాదని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్‌పై దౌత్యపరమైన చర్యలు ఉండాలని.. అంతర్జాతీయంగా భారత్ ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించడం మంచిదని నట్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. 56 సంవత్సరాలనుంచి సవ్యంగానే సాగుతున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌తో యుద్ధం అంత సులభం కాదని.. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ తిరిగి దాడి చేస్తుందని నట్వర్ సింగ్ హెచ్చరించారు. ఇరు దేశాలకు అణ్వాయుధ సామర్థ్యం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడంలో విజయం సాధించామని.. చివరికి ముస్లిం దేశాలు కూడా పాక్‌ను సపోర్ట్ చేయలేదని ఇటీవల ఐక్యరాజ్యసమితిలో నవాజ్ షరీఫ్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని.. దీనికి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే అని విమర్శించారు. ఎల్ఓసీని అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాలని నట్వర్ సింగ్ అన్నారు. -
‘మిసైల్’లా దూసుకెళ్లిన మన దౌత్యనీతి
ప్రస్త్తుతం ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న అణ్వాయుధ వ్యాప్తి నిరోధకానికి ఆద్యులైన అమెరికాతోపాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశాన్ని దూరంగా ఉంచి తమ లక్ష్యా లను సాధించలేమని గుర్తించాయి. గత రెండేళ్లలో నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరించిన దౌత్యవిధానంతో, ఒకప్పుడు మనల్ని వ్యతిరేకించిన ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, రష్యా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇంగ్లండ్‌లు.. అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ పాత్రకు మద్దతుగా నిలుస్తూ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో మన దేశ సభ్యత్వాన్ని సమర్థించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానం మరొక ఘనవిజయాన్ని సాధించింది. 26 మే, 2014న సార్క్ దేశాల నాయకుల సాక్షిగా 14వ భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి విదే శాంగ విధానాలు, దౌత్యనీతిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కి విశ్వపటలంపై గుర్తింపు, హోదాను సంపాదించడానికి ఈ రెండేళ్ల వ్యవధిలో మోదీ ప్రభుత్వం నిబద్ధతతో కూడిన విప్లవాత్మకమైన చర్యలు అనేకం చేపట్టింది. పర్యవసానంగానే భారత దేశానికి క్షిపణి క్షేత్రంలో అత్యంత కీలకమైన మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ (ఎంటీసీఆర్)లో సభ్యత్వం లభించింది. అణుపరీక్షలను నిర్వహించడం, అణ్వాయుధాల తయారీ తదితర అంశాల నుంచి భారతదేశాన్ని దూరంగా ఉంచడం కోసం, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒడంబడిక (న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ) పేరిట ఒకప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన దేశాలు.. ఇప్పుడు భేషరతుగా ఎటువంటి వ్యతిరేకత లేకుండా భారత్‌ను తమలో చేర్చుకున్నాయి. ఇప్పటికే 34 దేశాలు సభ్యు లుగా ఉన్న మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో సభ్యత్వం కోసం భారతదేశం 2015లో దరఖాస్తు చేసుకున్నది. మానవ రహిత అణ్వాయుధ వాహకాలను నిరోధించేందుకుగాను కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, ఇంగ్లండ్, అమెరికాలతో కూడిన ఏడు అభివృద్ధి చెందిన దేశాలు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ని 1987 ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేశాయి. దీనితో బ్యాలి స్టిక్ మిస్సైల్స్ తయారీ కొంతమేర తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే అణు పరిజ్ఞానం, అణ్వాయుధాల తయారీ, సేకర ణలపై కొన్ని దేశాల గుత్తాధిపత్యాన్ని భారతదేశం నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. ప్రపంచ వినాశనానికి అణ్వాయుధాల వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక దశాబ్దాలుగా ఉద్యమి స్త్తున్న భారత్ తన సార్వభౌమత్వాన్ని దేశ సమగ్రతను కాపాడు కోవడంతో పాటు అభివృద్ధి చర్యల కోసం అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్త్తున్నది. భారత్ దాదాపుగా 7,500 కి.మీ. సరిహద్దులను చైనా, పాకిస్తాన్లతో పంచుకుంటు న్నది. ఒకానొక సమయంలో ఈ రెండు దేశాలు భారత్‌పై దండ యాత్ర చేశాయి. ఈ రెండు సరిహద్దు దేశాల వద్ద అణ్వాయుధా లున్నాయి. ఇటువంటి నేపథ్యంలో భారతదేశం తన పరమాణు పరిజ్ఞానాన్ని, అణ్వాయుధ బలాన్ని నిర్లక్ష్యం చేయజాలదు. 2015లో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో సభ్యత్వం కోసం భారత్ దరఖాస్తును ఇటలీ ఎలాంటి కారణాలు చూప కుండానే అడ్డుకున్నది. ఆ తర్వాత మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం వివిధ దేశాలతో అనుసరించిన దౌత్యవిధానాల వల్ల సానుకూల పరిస్థితులు ఏర్పడి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో భారత్‌కు సభ్యత్వం లభించింది. ఈ మొత్తం చర్యలకు అమెరికా బహిరంగంగా మద్దతు పలకడం చెప్పుకోదగ్గ పరి ణామం. నిర్ణీత గడువైన 6, జూన్ 2016లోగా ఏ ఒక్క దేశం కూడా భారత సభ్యత్వానికి అభ్యంతరాలు చెప్పకపోవడంతో ఇక అధికారిక ప్రకటన నామమాత్రమే. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో సభ్యత్వం కారణంగా అత్యంత కీలకమైన న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్‌లో (ఎన్.ఎస్.జి) భారత సభ్యత్వానికి మార్గం సుగమమైంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మేలైన క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు చేరు వైంది. ఇప్పటికే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ క్షిపణి రంగంలో కీలకమైన స్థానం దక్కించుకుంటున్న భారత్‌కు ఈ పరిణామం అత్యంత శుభసూచకం. సమర్థవంతమైన క్షిపణులను కొనుగోలు చేయడానికి, అమ్మడానికి మన సాంకేతిక ైనైపుణ్యాన్ని అమ్మడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. రష్యాతో కలిసి రూపొందించిన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులను ఇతర దేశాలకు అమ్మడానికి వీలు కలిగింది. మొత్తంమీద అణ్వాయు ధాల ఎగుమతి దేశాల సరసన భారత్‌కు ప్రముఖమైన స్థానం లభించింది. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో సభ్యత్వం కారణంగా మేటి రకం ప్రిడేటర్ డ్రోన్(మానవ రహిత యుద్ధ విమానం)లను కొనుగోలు చేయడానికి చర్యలు వేగవంతమవుతాయి. భారత వాయుసేన విభాగం మరింత బలపడుతుంది. ఈ డ్రోన్ విమా నాలు 770 కిలోమీటర్లు ప్రయాణించగలవు. శత్రుదేశాల నుంచి ఏర్పడే ముప్పులపై నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. వీటన్నింటికి మించి శాంతియుత ప్రయోజనాల కోసం అణువిజ్ఞానాన్ని వినియోగించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మరింత ఊతం లభిస్తుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో భారతదేశం ఆప రేషన్ శక్తి పేరిట 1998 మే 11న రాజస్తాన్‌లోని పొఖ్రాన్‌లో అయిదు అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అంతకుముందే 1995 సంవత్సరంలోఅమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అప్పటి ప్రధాన మంత్రి ిపీవీ.నరసింహారావు అణుపరీక్షలను విరమించుకోవడం అందరికీ విదితమే. ఆ తర్వాత 1998లో అధికారంలోకి వచ్చిన వాజ్‌పేయి ఎవరి ఒత్తిళ్లకు లొంగక దేశ అణుపాటవాన్ని, మన సామర్థ్యాన్ని విజయవంతమైన ప్రయోగాలతో ప్రపంచానికి చాటి చెప్పారు. 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పాలనా కాలంలో భారత అణుప్రయోజనాలు మరుగున పడిపోయాయని చెప్పకతప్పదు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలమైన విదేశాంగ విధానా లతోపాటు, రక్షణ రంగ అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించ డంతో మన అణ్వాయుధ విధానం మరొకసారి ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రస్త్తుతం ప్రపంచవ్యాప్తంగా అమలులోఉన్న అణ్వాయుధ వ్యాప్తి నిరోధకానికి ఆద్యులైన అమెరికాతోపాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశాన్ని దూరంగా ఉంచి తమ లక్ష్యాలను సాధించలేమని గుర్తించాయి. గత రెండేళ్ల కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరించిన దౌత్యవిధానం కారణంగా, ఒకప్పుడు మనల్ని వ్యతిరేకించిన ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, రష్యా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇంగ్లండ్ దేశాలు ప్రస్తుత తరుణంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ పాత్రకు మద్దతుగా నిలుస్తూ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో మన దేశ సభ్యత్వాన్ని సమర్థించాయి. గత రెండేళ్లుగా ప్రపంచంలోని అనేక కీలక దేశాలతో పాటు అమెరికాతో సమాన స్థాయిలో మోదీ ప్రభుత్వం అనుసరించిన దౌత్యవిధానాల కారణంగానే ఈ విజయం చేకూరింది. దీని కారణంగా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌తో పాటుగా మరొక మూడు కీలకసంస్థలు - 1.న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ - 2. రసాయనిక ఆయుధాలను నిరోధించే ఆస్ట్రేలియన్ గ్రూప్- 3. కన్వెన్షనల్ ఆయుధాలను నిరోధించే 41 దేశాలతో కూడిన వాత్సెన్నార్ గ్రూప్‌లో కూడా భారత్‌కు సభ్యత్వం లభించే అవకాశాలు మెరుగయ్యాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ అవిశ్రాంతంగా చేస్తున్న విదేశీ పర్యటనలను, బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానాలను అవహేళన, అపహాస్యం చేస్త్తున్న వారికి ఈ సంఘటన ఒక కనువిప్పు అవుతుందని ఆశ. భారత దౌత్యనీతికి ఇదొక్కటే నిదర్శనం కాదు. అనేక నిదర్శనాలలో ఇదొకటి. - కామర్సు బాలసుబ్రహ్మణ్యం వ్యాసకర్త బీజేపీ పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి మొబైల్ : 09899331113 కళాత్మక దౌత్యం ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన అమెరికా యాత్ర విజయవంతమైంది అని ఎవరు అన్నా అంగీకరించాలి.ఎందుకంటే తొమ్మిదేళ్ల క్రితం భారత్ నుంచి మాయమైన అద్భుత కళాఖండాల ఆచూకీ తెలియడం, వాటిని మోదీ వెంట పంపడం కూడా జరిగింది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో వంద మిలియన్ డాలర్లు. 2000 ఏళ్ల నాటి కళా ఖండాలు ఇందులో ఉన్నాయి. సుభాష్ కపూర్ అనే అంతర్జాతీయ కళాఖండాల స్మగ్లర్ గుట్టును భారత అధికారుల సహకారంతో అమెరికా పోలీసులు రట్టు చేశారు. దీనితో అతడిని 2011లోనే అరెస్టు చేశారు. ప్రస్తుతం చెన్నై జైలులోనే ఉన్నాడు. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక కళాఖండం అక్రమంగా తర లించిన కేసులో అతడు అరెస్టయ్యాడు. ఇప్పుడు ఈ కళాఖండాలన్నింటినీ ఆయా ఆలయాలకీ, పురావస్తు ప్రదర్శన శాలలకీ తిరిగి అప్పగిస్తారట. కపూర్ గ్యాల రీస్ పేరుతో అమెరికాలోనే ఆ కుటుంబీకులు కళా ఖండాల అమ్మకాలు సాగిస్తున్నారు. -
పదునెక్కిన మన దౌత్యనీతి
విశ్లేషణ ప్రధాని నరేంద్రమోదీ తరచుగా సాగిస్తున్న విదేశీ పర్యటనలపై ప్రత్యర్థుల దాడి చేయడం మొదలైంది. బీజేపీ ఒకప్పుడు రాజీవ్‌గాంధీని కూడా ఇలాగే విమర్శించింది. ప్రధాని అంటే ముఖ్యమంత్రో లేక జిల్లా పరిషత్ చైర్మనో కాదు. దేశ రక్షణ, భద్రత, ఆర్థిక సుస్థిరతలను కాపాడటం కేంద్ర ప్రభుత్వ ప్రధాన కర్త వ్యం. ఉత్కృష్ట దౌత్య నీతితోనే వాటికి భరోసా కలుగుతుంది. మే 26న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 15న భూటాన్‌కు, జూలైలో బ్రెజి ల్కు, ఆగస్టులో నేపాల్‌కు, సెప్టెంబర్‌లో జపాన్‌కు వెళ్లారు. అదే నెలలో ఆయన అమెరికాలో పర్యటించి, అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకున్నారు. నవంబర్‌లో బర్మా, ఆస్ట్రేలియాలను సందర్శించారు. తిరిగి వస్తూ ఫిజీకి వెళ్లా రు. అక్కడి జనాభాలో సగం భారతీయ సంతతికి చెందినవారే. 30 ఏళ్లుగా ఏ భారత ప్రధానీ ఆస్ట్రేలియా, ఫిజీలకు వెళ్లలేదు. గత ఆరు నెలల్లో మోదీ ప్రపం చంలోని 46 దేశాల నేతలను కలుసుకున్నారు. మన దేశం ఇద్దరు బద్ధ శత్రువుల తో కూడిన అత్యంత స్నేహరహితమైన వాతావరణంలో ప్రాంతంలో ఉంది. మన భూభాగాన్ని కోరుతున్న చైనా, పాకిస్తాన్లతో మనకున్న సమస్యలను పరిష్కరించుకోవడం కష్టం. అవే దౌత్య రంగంలో మనం ఎదుర్కొంటున్న రెం డు ప్రధాన సమస్యలు. అందువల్లే మన బడ్జెట్లో చాలా పెద్ద భాగాన్ని రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల శాఖలకే కేటాయించాల్సి వస్తోంది. ఇక నేపాల్, బర్మా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో మనకు పెద్దగా సమస్యలేమీ లేవు. 1962 నుండి చైనా-పాక్ మైత్రి దృఢంగా ఉంది. భారత్‌తో మంద్ర స్థాయి యుద్ధాన్ని కొనసాగించేలా పాక్‌ను అది ప్రోత్సహిస్తోంది. పాక్ తన ఆక్రమ ణలోని కశ్మీర్ భూభాగాన్ని చైనాకు అప్పగించినంత పని చేసింది. బదులుగా చైనా దానికి అణు సాంకేతికతను కానుకగా ఇచ్చింది. వాస్తవానికి భారత వ్యతిరేకత కలిగిన దేశాలు నేడు మన దేశాన్ని చట్టుముట్టేసి ఉన్నాయి. ‘‘భారత విదేశాంగ విధానం అత్యంత దుర్బలమైనది. అదే దాని అతి పెద్ద శత్రువు’’ అని ‘ఫారిన్ ఎఫైర్స్’అనే ప్రముఖ పత్రిక 2013లో రాసింది. చలనశీల దౌత్య నీతి మన శత్రువులు సైతం ఆందోళనకు, ఉద్విగ్నతకు గురై సతమతమవుతుండేలా చేసే చలనశీలమైన విదేశాంగ విధానం మనకిప్పుడు అవసరం. భారత దౌత్యాన్ని ఎదుర్కొనే పోరులో చైనా, పాక్‌లు తమ సమయాన్ని, వనరులను వృథా చేసుకోవాలి. 1959లో టిబెట్ మత గురువు దలైలామాకు ఆశ్రయమి చ్చినందుకు చైనా ఎన్నటికీ భారత్‌ను క్షమించలేదు. భారత్‌లో కూడా ఎన్నటికీ సుస్థిరత నెలకొనకుండా చేయాలని అది భావిస్తోంది. మనం మన ఆర్థిక వ్యవస్థపై దృష్టిని కేంద్రీకరించడాన్ని చైనా, పాక్‌లు ఎన్నడూ సహించలేవు. వాటిని ఎదుర్కోవడానికి భారత్‌కు ఉన్న ఏకైక మార్గం దౌత్యం. మోదీ చేస్తున్నది అదే. విదేశీ నేతలను కలుసుకోవడం ద్వారా ఆయన చైనా, పాక్‌లలో ఆందోళనను రేకెత్తిస్తున్నారు. మోదీ ఫిజీ వెళ్లి వచ్చిన నాలుగు రోజులకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా అక్కడకు వె ళ్లి వచ్చారు! 1. మోదీ జపాన్ పర్యటన చైనా శత్రువులతో భారత్ చెయ్యి కలుపుతోం దనే సందేశం చైనాకు చేరింది. ఆయన భూటాన్‌కు వెళ్లటంతో... చైనా ఆ దేశానికి దూరంగా ఉండాలనే సందేశం దానికి చేరింది. భారత్-నేపాల్ పాత ఒప్పందాన్ని సమీక్షిస్తామని, అన్ని విషయాల్లోనూ దానికి శాయశక్తులా సహకరిస్తామని నేపాల్ పర్యటనలో మోదీ హామీనిచ్చారు. నేపాల్‌ను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న చైనా, పాక్‌లు రెండిటికీ అది కలవరపాటును కలిగించింది. 2. చైనా రెండు దశాబ్దాలుగా మైన్మార్ సహజ వనరులను దోచుకుంటోంది. మోదీ పర్యటనతో చైనా ఇకపై పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది, మైన్మార్ వనరులకు అది అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. 3. బంగ్లాదేశ్‌తో భౌగోళిక సరిహద్దు ఒప్పందం కుదుర్చుకోడానికి మోదీ ప్రయత్ని స్తున్నారు. భూభూగాల పరస్పర మార్పిడి ద్వారా భారత్ కంటే బంగ్లాదేశ్‌కు 6 వేల ఎకరాల భూమి ఎక్కువగా లభిస్తుంది. అయితే దీనివల్ల బంగ్లాదేశ్ కు భారత్‌పై విశ్వాసం ఏర్పడుతుంది. 4. హార్వార్డ్ ప్రొఫెసర్ జోసెఫ్ న్యే ‘‘సున్నిత శక్తి’’ని ‘‘సంస్కృతి, విలువలు, విదేశాంగ విధానం తదితరాలతో నీకు కావా ల్సిందాన్ని బలవంత పెట్టడం లేదా మూల్యం చెల్లించడం ద్వారా గాక ఆకర్షణ తో సంపాదించుకోగలిగే సామర్థ్యం’’గా నిర్వచించారు. న్యూయార్క్‌లో18,000 మంది, ఆస్ట్రేలియాలో 15,000 మంది మోదీ ప్రసంగానికి వచ్చారంటే అందుకు కారణం ఆయన భారత్‌ను ‘‘సున్నిత శక్తి’’గా ఆవిష్కరించడమే. 5. అక్కడ సరిహద్దుల్లో చైనా సేనలు మన పోస్టులపై దాడులు చేస్తుండగా ఇక్కడ మోదీ చైనా అధ్యక్షునికి, ఆయన సతీమణికి ఆతిథ్యం ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. కానీ జీ సతీమణి కూర్చున్న ఉయ్యాలను మోదీ గౌరవపూర్వకంగా ఊపుతున్న ఫొటో చైనా సోషల్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందింది. హావభావాలకు, మర్యాదామన్ననలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే కన్ఫ్యూషి యన్ బోధనలకు 2,500 ఏళ్ల తర్వాత ఇప్పుడు చైనాలో ఆదరణ లభిస్తోంది. 6. మోదీ ప్రభుత్వంతో వ్యవహరించడమంటే తేలికేమీ కాదనే సందేశం పాక్‌కు చేరింది. భారత్ తన మెత్తటి శక్త్తిని, ఆర్థిక శక్తిని ప్రయోగించి పాక్ ప్రతిష్టను క్షీణంపజేయగలదు. మోదీ అదే చేశారు. ఈ ఏడాది భారత రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నానని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించగా.... దారిలో పాక్‌లో ఆగాలని నవాజ్ షరీఫ్ కోరారు. పాక్‌లో పరిస్థితిని మెరుగుపరచినప్పుడు ఆగుతానని ఒబామా చెప్పారు. ఇది పాక్‌కు పెద్ద ఎదురు దెబ్బ. భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టలేమనే సందేశం. 7. అమెరికా పర్యటనలో మోదీ... ఆఫ్రికా నేతలు తప్ప మరే విదేశీ నేతలు సందర్శించని మార్టిన్ లూథర్ కింగ్ స్మారక స్థలిని సందర్శించారు. దౌత్య సంప్రదాయాలను విడనాడి ఒబామా ఆయనతో పాటూ వెళ్లారు! పైగా ఒబామా తమ వలస విధానాన్ని మార్చారు. దీంతో అమెరికాలోని లక్షలాదిమంది భారతీయులకు మేలు జరుగుతుంది. 8. మోదీ జపాన్ పర్యటనే చైనాకు ఒక సందేశం. అది జపాన్‌తో భారత్ అనుబంధం పట్ల చైనా తీవ్రంగా ఆందోళన చెందేట్టు చేసింది. జాతీయ ప్రయోజనాలకు పట్టం గట్టాలి ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర ఆసియా దేశా లు చైనా ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా ఒక్కటి కావాలని ప్రయత్నిస్తున్నాయి. అడుగడుగునా భారత్‌కు శత్రువుగా నిలుస్తున్న చైనాను ఎదుర్కోవడానికి మోదీ ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లను సందర్శించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ను ప్రోత్సహించే విధానాన్ని చైనా కొనసాగిస్తే భారత్ చైనా శత్రువులతో చేతులు కలుపుతుందనే సందేశాన్ని తద్వారా ఆయన పంపారు. భారత్ చడీచప్పుడు లేకుండా ‘‘చైనాను కట్టడి చేసే’’ విధానానికి మద్దతు పలుకుతోంది. అఫ్ఘానిస్థాన్‌లో తమ సేనలను 2015 వరకు ఉంచుతామని అమెరికా ప్రకటించడం భారత్ సాధించిన ఒక ప్రధాన విజయం. మోదీ ఒబామాను కలుసుకున్న తర్వాతే ఈ విధాన ప్రకటన వెలువడింది. అమెరికా సేనల ఉనికి అఫ్ఘాన్‌లోని తాలిబన్, పాక్ ఆధారిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతా న్నంతా బలోపేతం చేస్తుంది. మహాభారతంలో కౌరవులు పాండవులు తమలో తాము ఎప్పుడూ కలహించినా ‘‘మాలో మేము కలహిస్తామేమోగానీ బయటి వారికి మాత్రం మేం 105 మందిమే’’ అని చెప్పేవారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా అలాగే జాతీయ ప్రయోజనాలను సంకుచిత రాజకీయాలకు అతీతంగా నిలపాలి. నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత, దాదాపు 30 ఏళ్ల అంతరాయం తర్వాత విదేశీ వ్యవహారాలకు ప్రాధాన్యం లభిస్తోంది. అయితే మోదీ విదేశాంగ మంత్రి, తదితరులను చురుగ్గా విదేశాంగ వ్యవహారాల్లో పాల్గొననివ్వాలి. లేక పోతే మోదీయే విదేశాంగ విధానంగా మారిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనా ‘‘ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగిన’’ చందంగా వ చ్చే చిల్లర మల్లర విమర్శలను పట్టించుకోక మోదీ విదేశీ సంబంధాలపై దృష్టిని కేంద్రీకరించాలి. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)