పెంటపాటి పుల్లారావు
విశ్లేషణ
ప్రధాని నరేంద్రమోదీ తరచుగా సాగిస్తున్న విదేశీ పర్యటనలపై ప్రత్యర్థుల దాడి చేయడం మొదలైంది. బీజేపీ ఒకప్పుడు రాజీవ్‌గాంధీని కూడా ఇలాగే విమర్శించింది. ప్రధాని అంటే ముఖ్యమంత్రో లేక జిల్లా పరిషత్ చైర్మనో కాదు. దేశ రక్షణ, భద్రత, ఆర్థిక సుస్థిరతలను కాపాడటం కేంద్ర ప్రభుత్వ ప్రధాన కర్త వ్యం. ఉత్కృష్ట దౌత్య నీతితోనే వాటికి భరోసా కలుగుతుంది. మే 26న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 15న భూటాన్‌కు, జూలైలో బ్రెజి ల్‌కు, ఆగస్టులో నేపాల్‌కు, సెప్టెంబర్‌లో జపాన్‌కు వెళ్లారు. అదే నెలలో ఆయన అమెరికాలో పర్యటించి, అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకున్నారు. నవంబర్‌లో బర్మా, ఆస్ట్రేలియాలను సందర్శించారు. తిరిగి వస్తూ ఫిజీకి వెళ్లా రు. అక్కడి జనాభాలో సగం భారతీయ సంతతికి చెందినవారే. 30 ఏళ్లుగా ఏ భారత ప్రధానీ ఆస్ట్రేలియా, ఫిజీలకు వెళ్లలేదు. గత ఆరు నెలల్లో మోదీ ప్రపం చంలోని 46 దేశాల నేతలను కలుసుకున్నారు. మన దేశం ఇద్దరు బద్ధ శత్రువుల తో కూడిన అత్యంత స్నేహరహితమైన వాతావరణంలో ప్రాంతంలో ఉంది. మన భూభాగాన్ని కోరుతున్న చైనా, పాకిస్తాన్‌లతో మనకున్న సమస్యలను పరిష్కరించుకోవడం కష్టం. అవే దౌత్య రంగంలో మనం ఎదుర్కొంటున్న రెం డు ప్రధాన సమస్యలు. అందువల్లే మన బడ్జెట్లో చాలా పెద్ద భాగాన్ని రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల శాఖలకే కేటాయించాల్సి వస్తోంది. ఇక నేపాల్, బర్మా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో మనకు పెద్దగా సమస్యలేమీ లేవు. 1962 నుండి చైనా-పాక్ మైత్రి దృఢంగా ఉంది. భారత్‌తో మంద్ర స్థాయి యుద్ధాన్ని కొనసాగించేలా పాక్‌ను అది ప్రోత్సహిస్తోంది. పాక్ తన ఆక్రమ ణలోని కశ్మీర్ భూభాగాన్ని చైనాకు అప్పగించినంత పని చేసింది. బదులుగా చైనా దానికి అణు సాంకేతికతను కానుకగా ఇచ్చింది. వాస్తవానికి భారత వ్యతిరేకత కలిగిన దేశాలు నేడు మన దేశాన్ని చట్టుముట్టేసి ఉన్నాయి. ‘‘భారత విదేశాంగ విధానం అత్యంత దుర్బలమైనది. అదే దాని అతి పెద్ద శత్రువు’’ అని ‘ఫారిన్ ఎఫైర్స్’అనే ప్రముఖ పత్రిక 2013లో రాసింది.
చలనశీల దౌత్య నీతి
మన శత్రువులు సైతం ఆందోళనకు, ఉద్విగ్నతకు గురై సతమతమవుతుండేలా చేసే చలనశీలమైన విదేశాంగ విధానం మనకిప్పుడు అవసరం. భారత దౌత్యాన్ని ఎదుర్కొనే పోరులో చైనా, పాక్‌లు తమ సమయాన్ని, వనరులను వృథా చేసుకోవాలి. 1959లో టిబెట్ మత గురువు దలైలామాకు ఆశ్రయమి చ్చినందుకు చైనా ఎన్నటికీ భారత్‌ను క్షమించలేదు. భారత్‌లో కూడా ఎన్నటికీ సుస్థిరత నెలకొనకుండా చేయాలని అది భావిస్తోంది. మనం మన ఆర్థిక వ్యవస్థపై దృష్టిని కేంద్రీకరించడాన్ని చైనా, పాక్‌లు ఎన్నడూ సహించలేవు. వాటిని ఎదుర్కోవడానికి భారత్‌కు ఉన్న ఏకైక మార్గం దౌత్యం. మోదీ చేస్తున్నది అదే. విదేశీ నేతలను కలుసుకోవడం ద్వారా ఆయన చైనా, పాక్‌లలో ఆందోళనను రేకెత్తిస్తున్నారు. మోదీ ఫిజీ వెళ్లి వచ్చిన నాలుగు రోజులకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా అక్కడకు వె ళ్లి వచ్చారు!
1. మోదీ జపాన్ పర్యటన చైనా శత్రువులతో భారత్ చెయ్యి కలుపుతోం దనే సందేశం చైనాకు చేరింది. ఆయన భూటాన్‌కు వెళ్లటంతో... చైనా ఆ దేశానికి దూరంగా ఉండాలనే సందేశం దానికి చేరింది. భారత్-నేపాల్ పాత ఒప్పందాన్ని సమీక్షిస్తామని, అన్ని విషయాల్లోనూ దానికి శాయశక్తులా సహకరిస్తామని నేపాల్ పర్యటనలో మోదీ హామీనిచ్చారు. నేపాల్‌ను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న చైనా, పాక్‌లు రెండిటికీ అది కలవరపాటును కలిగించింది. 2. చైనా రెండు దశాబ్దాలుగా మైన్మార్ సహజ వనరులను దోచుకుంటోంది. మోదీ పర్యటనతో చైనా ఇకపై పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది, మైన్మార్ వనరులకు అది అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. 3. బంగ్లాదేశ్‌తో భౌగోళిక సరిహద్దు ఒప్పందం కుదుర్చుకోడానికి మోదీ ప్రయత్ని స్తున్నారు. భూభూగాల పరస్పర మార్పిడి ద్వారా భారత్ కంటే బంగ్లాదేశ్‌కు 6 వేల ఎకరాల భూమి ఎక్కువగా లభిస్తుంది. అయితే దీనివల్ల బంగ్లాదేశ్ కు భారత్‌పై విశ్వాసం ఏర్పడుతుంది. 4. హార్వార్డ్ ప్రొఫెసర్ జోసెఫ్ న్యే ‘‘సున్నిత శక్తి’’ని ‘‘సంస్కృతి, విలువలు, విదేశాంగ విధానం తదితరాలతో నీకు కావా ల్సిందాన్ని బలవంత పెట్టడం లేదా మూల్యం చెల్లించడం ద్వారా గాక ఆకర్షణ తో సంపాదించుకోగలిగే సామర్థ్యం’’గా నిర్వచించారు. న్యూయార్క్‌లో18,000 మంది, ఆస్ట్రేలియాలో 15,000 మంది మోదీ ప్రసంగానికి వచ్చారంటే అందుకు కారణం ఆయన భారత్‌ను ‘‘సున్నిత శక్తి’’గా ఆవిష్కరించడమే. 5. అక్కడ సరిహద్దుల్లో చైనా సేనలు మన పోస్టులపై దాడులు చేస్తుండగా ఇక్కడ మోదీ చైనా అధ్యక్షునికి, ఆయన సతీమణికి ఆతిథ్యం ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. కానీ జీ సతీమణి కూర్చున్న ఉయ్యాలను మోదీ గౌరవపూర్వకంగా ఊపుతున్న ఫొటో చైనా సోషల్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందింది. హావభావాలకు, మర్యాదామన్ననలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే కన్‌ఫ్యూషి యన్ బోధనలకు 2,500 ఏళ్ల తర్వాత ఇప్పుడు చైనాలో ఆదరణ లభిస్తోంది. 6. మోదీ ప్రభుత్వంతో వ్యవహరించడమంటే తేలికేమీ కాదనే సందేశం పాక్‌కు చేరింది. భారత్ తన మెత్తటి శక్త్తిని, ఆర్థిక శక్తిని ప్రయోగించి పాక్ ప్రతిష్టను క్షీణంపజేయగలదు. మోదీ అదే చేశారు. ఈ ఏడాది భారత రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నానని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించగా.... దారిలో పాక్‌లో ఆగాలని నవాజ్ షరీఫ్ కోరారు. పాక్‌లో పరిస్థితిని మెరుగుపరచినప్పుడు ఆగుతానని ఒబామా చెప్పారు. ఇది పాక్‌కు పెద్ద ఎదురు దెబ్బ. భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టలేమనే సందేశం. 7. అమెరికా పర్యటనలో మోదీ... ఆఫ్రికా నేతలు తప్ప మరే విదేశీ నేతలు సందర్శించని మార్టిన్ లూథర్ కింగ్ స్మారక స్థలిని సందర్శించారు. దౌత్య సంప్రదాయాలను విడనాడి ఒబామా ఆయనతో పాటూ వెళ్లారు! పైగా ఒబామా తమ వలస విధానాన్ని మార్చారు. దీంతో అమెరికాలోని లక్షలాదిమంది భారతీయులకు మేలు జరుగుతుంది. 8. మోదీ జపాన్ పర్యటనే చైనాకు ఒక సందేశం. అది జపాన్‌తో భారత్ అనుబంధం పట్ల చైనా తీవ్రంగా ఆందోళన చెందేట్టు చేసింది.
జాతీయ ప్రయోజనాలకు పట్టం గట్టాలి
ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర ఆసియా దేశా లు చైనా ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా ఒక్కటి కావాలని ప్రయత్నిస్తున్నాయి. అడుగడుగునా భారత్‌కు శత్రువుగా నిలుస్తున్న చైనాను ఎదుర్కోవడానికి మోదీ ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లను సందర్శించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ను ప్రోత్సహించే విధానాన్ని చైనా కొనసాగిస్తే భారత్ చైనా శత్రువులతో చేతులు కలుపుతుందనే సందేశాన్ని తద్వారా ఆయన పంపారు. భారత్ చడీచప్పుడు లేకుండా ‘‘చైనాను కట్టడి చేసే’’ విధానానికి మద్దతు పలుకుతోంది.
అఫ్ఘానిస్థాన్‌లో తమ సేనలను 2015 వరకు ఉంచుతామని అమెరికా ప్రకటించడం భారత్ సాధించిన ఒక ప్రధాన విజయం. మోదీ ఒబామాను కలుసుకున్న తర్వాతే ఈ విధాన ప్రకటన వెలువడింది. అమెరికా సేనల ఉనికి అఫ్ఘాన్‌లోని తాలిబన్, పాక్ ఆధారిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతా న్నంతా బలోపేతం చేస్తుంది. మహాభారతంలో కౌరవులు పాండవులు తమలో తాము ఎప్పుడూ కలహించినా ‘‘మాలో మేము కలహిస్తామేమోగానీ బయటి వారికి మాత్రం మేం 105 మందిమే’’ అని చెప్పేవారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా అలాగే జాతీయ ప్రయోజనాలను సంకుచిత రాజకీయాలకు అతీతంగా నిలపాలి. నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత, దాదాపు 30 ఏళ్ల అంతరాయం తర్వాత విదేశీ వ్యవహారాలకు ప్రాధాన్యం లభిస్తోంది. అయితే మోదీ విదేశాంగ మంత్రి, తదితరులను చురుగ్గా విదేశాంగ వ్యవహారాల్లో పాల్గొననివ్వాలి. లేక పోతే మోదీయే విదేశాంగ విధానంగా మారిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనా ‘‘ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగిన’’ చందంగా వ చ్చే చిల్లర మల్లర విమర్శలను పట్టించుకోక మోదీ విదేశీ సంబంధాలపై దృష్టిని కేంద్రీకరించాలి.
(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)