ఏఐ రంగంలో ప్రముఖ టెక్ కంపెనీల మధ్య పోటీ
చాట్‌జీపీటీకి పోటీగా ‘గ్రోక్’ను తెరపైకి తెచ్చిన ఎలన్ మస్క్
విస్తృత, వైవిధ్యమైన సేవలతో అగ్రగామిగా చాట్‌జీపీటీ
2021కి ముందునాటి సమాచారం ఆధారంగానే దాని సేవలు
‘రియల్ టైమ్’సమాచార సేవలతో గట్టి పోటీనిస్తున్న గ్రోక్
హాస్యంతోపాటు ఘాటైన ప్రశ్నలకూ సమాధానమిచ్చేలా దీనికి తర్ఫీదు
రాజకీయంగా చాట్‌జీపీటీ ధోరణి తటస్థం.. గ్రోక్ మాత్రం విభిన్నం
కృత్రిమ మేధ (AI) రంగం కొత్తపుంతలు తొక్కుతూ శరవేగంగా పురోగతి సాధిస్తున్న సమయంలో.. రెండు ప్రముఖ టెక్ కంపెనీల మధ్య పోటీకి దారితీసింది. కృత్రిమ మేధ ఫలాలను సామాన్యులకు సైతం పరిచయం చేసి, టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ‘చాట్‌జీపీటీ(ChatGPT)’కి పోటీగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్(X)’అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన ‘గ్రోక్(Grok)’తెరపైకి దూసుకొస్తోంది. ఎలన్ మస్క్ తన ‘ఎక్స్‌ఏఐ’సంస్థ ద్వారా గత ఏడాది నవంబర్ 3న ‘గ్రోక్’ను మార్కెట్లోకి తెచ్చారు. చాట్‌జీపీటీ, గ్రోక్ రెండూ ఏఐ టూల్స్ అయినా రెండింటి మధ్య ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. తమకు ‘గ్రోక్’బాగా నచ్చిందని, ‘చాట్‌జీపీటీ’సబ్‌స్క్రిప్షన్‌ను వదిలేసుకుని ఇకపై గ్రోక్‌నే వినియోగిస్తామని ‘ఎక్స్’లో కొందరు పోస్టులు పెడుతుండగా.. ఎలన్ మస్క్ వాటిని షేర్ చేస్తూ ప్రమోట్ చేసుకుంటున్నారు. నిజానికి కృత్రిమ మేధ రంగంలో అగ్రగామిగా ఉన్న ‘చాట్‌జీపీటీ’కి గ్రోక్ పోటీ ఇవ్వగలదా అన్నది భవిష్యత్తులో తేలిపోనుంది.
ప్రస్తుతానికి చాట్‌జీపీటీదే ఆధిపత్యం..
‘గ్రోక్’తాజా వెర్షన్‌కు ఆధారం ఎక్స్‌ఏఐకి చెందిన గ్రోక్–2 మోడల్. ఉచితంగా ఏఐ ఆధారిత సేవలు అందిస్తున్న ఇతర టూల్స్‌తో పోల్చితే పనితీరు, సామర్థ్యంలో ఇది ముందంజలో ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని అంశాల్లో ‘చాట్‌జీపీటీ’ఉచిత వెర్షన్ (GPT 3.5)ను సైతం గ్రోక్ అధిగమించినట్టు పలు పరీక్షల్లో తేలిందని అంటున్నారు. అయితే ‘చాట్‌జీపీటీ ప్లస్’వెర్షన్‌లో ఉపయోగించే ‘జీపీటీ–4’మోడల్ సామర్థ్యంతో పోల్చితే ‘గ్రోక్’వెనకబడే ఉందని స్పష్టం చేస్తున్నారు. మార్కెట్లో ఎక్కువ కాలం నుంచి కొనసాగుతుండటంతో పాటు గణనీయ స్థాయిలో డేటాతో శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో చాట్‌జీపీటీ ప్రత్యేకంగా నిలుస్తోందని.. వినియోగదారులకు అవసరమైన సేవల నుంచి సృజనాత్మక రచనల వరకు విస్తృత శ్రేణిలో సృజన చూపగలుగుతోందని పేర్కొంటున్నారు.
హాస్యాన్ని మేళవించి.. సమాచారం అందించే గ్రోక్..
గ్రోక్ హాస్యాన్ని మేళవించి సరదా సంభాషణలతో, కొంతవరకు తిరుగుబాటు వైఖరిని కూడా మేళవించి సమాధానాలు ఇస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఇతర ఏఐ టూల్స్ చెప్పలేకపోయే ఘాటైన ప్రశ్నలకు సైతం సమాధానమిచ్చేలా దీనిని రూపొందించామని అంటున్నారు. రాజకీయ అంశాల విషయంలో గ్రోక్ ధోరణి అందరికి నచ్చకపోవచ్చని.. అందుకే రాజకీయంగా పూర్తిగా సరైనది కాదని పేర్కొంటున్నారు. మరోవైపు చాట్‌జీపీటీ తటస్థంగా, మర్యాదపూర్వకంగా, సమగ్రమైన ధోరణిలో స్పందిస్తుంది.
రియల్ టైమ్‌లో గ్రోక్ పైచేయి
గ్రోక్ సామాజిక మాధ్యమం ఎక్స్ నుంచి రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి వర్తమాన అంశాలు, సరళులపై తాజా సమాచారాన్ని అందించగలుగుతుంది. అవసరమైతే ఇంటర్నెట్‌లోనూ రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తుంది. ఈ అంశంలో గ్రోక్ ముందంజలో ఉంది. చాట్‌జీపీటీ అత్యంత శక్తివంతమైనదే అయినా ‘గ్రోక్’తరహాలో రియల్ టైమ్ అప్‌డేషన్ లేదు. కటాఫ్ తేదీ (2021)కి ముందు నాటి సమాచార పరిజ్ఞానాన్ని మాత్రమే చాట్‌జీపీటీ వినియోగించి సేవలు అందిస్తుంది. అయితే డబ్బులు చెల్లించి సబ్ర్‌స్కయిబ్ చేసుకునే ప్రీమియం వెర్షన్ (చాట్‌జీపీటీ ప్లస్) దీనికి మినహాయింపు.
గ్రోక్ ‘ఎక్స్’లోనే.. జీపీటీ అన్నిచోట్లా..
గ్రోక్ ప్రస్తుతం ‘ఎక్స్’యాప్‌లోనే సమ్మిళితమై సేవలందిస్తోంది. అంటే ‘ఎక్స్’వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి ఉంది. దీనిని తొలుత ‘ఎక్స్ (ట్విట్టర్)’ప్రీమియం ప్లస్, ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. అనంతరం కొన్ని పరిమితుల మేరకు ఉచిత వినియోగదారులకు సైతం అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో ‘ఎక్స్’ప్రీమియం, ప్రీమియం ప్లస్ చందాలు కట్టాల్సిన అవసరం లేకుండా.. ‘గ్రోక్’కే చందా కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని రూపకర్తలు చెబుతున్నారు.
మరోవైపు ‘చాట్‌జీపీటీ–3.5’పాత వెర్షన్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. వినియోగదారులకు మరింత విస్తృతమైన సేవలందించే అత్యాధునిక ‘జీపీటీ–4’వెర్షన్‌కు మాత్రం డబ్బులు చెల్లించి సబ్‌్రస్కయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని వెబ్, మొబైల్ యాప్స్, ఎంఎస్ ఆఫీస్ ద్వారా విస్తృత రీతిలో పొందవచ్చు.
దేనికది ప్రత్యేకం
కంటెంట్ సృష్టి, అనువాదం, కస్టమర్ సపోర్ట్, విద్య, వ్యక్తిగత సహాయం, కోడింగ్, మేధోమథనం వంటి వైవిధ్యభరిత సేవలను విస్తృతరీతిలో చాట్‌జీపీటీ అందిస్తోంది. వినియోగదారులు టెక్ట్స్‌తోపాటు చిత్రాలను ఇన్‌పుట్‌గా వాడే సదుపాయాన్ని చాట్‌జీపీటీ ప్లస్ కలి్పస్తోంది. నిర్దిష్టమైన పరిశ్రమలు, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు కస్టమైజ్డ్ సేవలను సైతం చాట్‌జీపీటీ అందిస్తోంది.
ఇక ‘గ్రోక్’విషయానికి వస్తే సామాజిక మాధ్యమాలతో అనుసంధానం, రియల్ టైమ్ సమాచారం, వినోదం, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు వంటి సేవలను వినూత్న రీతిలో అందిస్తోంది. ‘గ్రోక్’ను అగ్రగామిగా నిలపాలనే వ్యూహంతో ఎలన్ మస్క్ భవిష్యత్తులో మరెన్నో వైవిధ్యభరిత సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెబుతున్నారు కూడా.
ఇదీ చదవండి: తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?
‘గ్రోక్’పేరు ఎందుకు
‘గ్రోక్’అనే ఆంగ్ల పదానికి అర్థం ‘ఎవరినైనా/ఏదైన అంశాన్ని లోతుగా అవగతం చేసుకోవడం’. రాబర్ట్ ఎ.హెన్లీన్ తన సైన్స్‌ఫిక్షన్ నవల ‘స్ట్రేంజర్ ఇన్ ఏ స్ట్రేంజ్ ల్యాండ్’లో వాడిన ‘గ్రోక్’పదం నుంచి స్ఫూర్తి పొందిన ఎలన్‌మస్క్ తన ఏఐ టూల్‌కు ఈ పేరును పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment