Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు! | Stock Market Investment Tips For Beginners | Sakshi
Sakshi News home page

Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!

Published Sat, Jan 4 2025 10:47 AM | Last Updated on Sat, Jan 25 2025 4:31 PM

Stock Market Investment Tips For Beginners

స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి విభిన్న మార్గాలున్నాయి. అందులో ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం ఒకటి. పరోక్షంగా పెట్టుబడి పెట్టడం రెండోది. అంటే ఈక్విటీ మార్కెట్లో రిస్క్ చేయలేని వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకోవడమన్న మాట.

అదే ట్రేడింగ్ విషయానికొస్తే... మూడు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి.  
1. ఈక్విటీలు 
2. ఫ్యూచర్స్ ట్రేడింగ్
3. ఆప్షన్స్ ట్రేడింగ్ 
ఇందులో మొదటిదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం.

సాధారణంగా మన దగ్గర డబ్బులున్నపుడు వాటిని బ్యాంకుల్లోనో, పోస్ట్ ఆఫీసుల్లోనో దాచుకుంటాం. ఈమధ్య స్టాక్ మార్కెట్ కల్చర్ బాగా పెరిగింది. అయితే చాలామంది ఇన్స్టంట్ లాభాల కోసం ఎగబడుతున్నారు. దీంతో వాళ్ళు ట్రేడింగ్ వైపు చూస్తున్నారే తప్ప భవిష్యత్ భరోసా గురించి ఆలోచించడం లేదు. ట్రేడింగ్ వైపు వెళ్లే వ్యక్తుల్లో నూటికి 95 మంది నష్టాల్లో కూరుకుపోయి లబోదిబో మంటున్నారు. అలాకాకుండా దీర్ఘకాలిక దృక్పథం మార్కెట్లోకి అడుగుపెడితే కచ్చితంగా మంచి ప్రయోజనాలే దక్కుతాయి.

ఇందులో కూడా మూడు రకాల మార్గాలు అనుసరించవచ్చు. 
1. స్వల్ప కాలిక పెట్టుబడి
2. మధ్య కాలిక పెట్టుబడి 
3. దీర్ఘకాలిక పెట్టుబడి

పెట్టుబడులు పెట్టడానికి బాండ్లు, డిబెంచర్లు, రుణ పత్రాలు వంటి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ  మనం కేవలం స్టాక్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే పై మూడింటి గురించి వివరంగా చర్చించుకుందాం.

స్వల్ప కాలిక పెట్టుబడి
సాధారణంగా మూడు నెలల వ్యవధి నుంచి 12  నెలల వ్యవధితో చేసే పెట్టుబడుల్ని స్వల్ప కాలిక పెట్టుబడులుగా పరిగణించవచ్చు. 
అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ వెంటనే వాటి అవసరం ఉండకపోవచ్చు. వాటిని మార్కెట్లోకి తరలిస్తే... మన అవసరానికి అనుగుణంగా మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లను ఎంచుకుని స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు.

ఇలాంటి సందర్భాల్లో మూడు పరిణామాలు చోటు చేసుకోవచ్చు. 
1. మన పెట్టుబడి అమాంతం పెరిగిపోయి (మనం ఎంచుకునే షేర్లను బట్టి) మంచి లాభాలు కళ్ళచూడొచ్చు. మనం పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సంబంధించి వచ్చే సానుకూల వార్తలు ఇందుకు కారణమవుతాయి. 
ఉదా: సదరు కంపెనీ రేటింగ్ ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు పెంచడం, ప్రభుత్వపరంగా సంబంధిత రంగానికి అనుకూలంగా ప్రకటనలు రావడం, ఆర్ధిక ఫలితాలు అద్భుతంగా ఉండటం.... వంటివి ఇందుకు దోహదం చేస్తాయి.

2. మన పెట్టుబడి నష్టాల్లోకి జారిపోవడం. ఒక ఆరు నెలల పాటు మనకు డబ్బులతో పని లేదని వాటిని తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తాం. ఆలోపు వివిధ ప్రతికూల అంశాలు మన పెట్టుబడిని హరించి వేస్తాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రభుత్వాలు పడిపోవడం, ఆర్ధిక అనిశ్చిత పరిణామాలు, సంస్కరణలు పక్కదారి పట్టడం... వంటి అంశాలు మార్కెట్లను పడదోస్తాయి. ఇలాంటి సందర్భాల్లో సదరు షేర్లు కూడా ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటాయి.

మీరు పెట్టుకున్న కాల వ్యవధి దగ్గర పడుతూ ఉంటుంది. షేర్లు మాత్రం కోలుకోవు.అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు జీవుడా... అనుకుంటూ ఆ కాస్త సొమ్ముతో  సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మన అవసరాలు తీరడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆర్జించడం మాట పక్కన పెట్టి అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుందన్న మాట.

3. పెట్టిన పెట్టుబడి లో పెద్దగా మార్పులు లేకపోవడం. ఆరు నెలలు గడిచినా మనం కొన్న షేర్లు అనుకున్నట్లుగా పెరగకపోవడమో, లేదంటే స్వల్ప నష్టాల్లో ఉండటమే జరుగుతుంది. దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.

మధ్య కాలిక పెట్టుబడి 
ఇది సాధారణంగా ఏడాది వ్యవధి మొదలుకొని 5  ఏళ్ల వరకు కాలవ్యవధి తో చేసే పెట్టుబడులు ఈ విభాగంలోకి వస్తాయి. స్వల్ప కాలిక పెట్టుబడులతో పోలిస్తే ఇవి ఒకింత మెరుగైన ప్రతిఫలాన్నే ఇస్తాయి. వ్యవధి ఎక్కువ ఉంటుంది కాబట్టి... ఒక ఏడాది రెండేళ్లపాటు మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురైనా.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు.   ఆ తర్వాత షేర్లు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.

అదే సమయంలో మన దగ్గర సొమ్ములున్నప్పుడల్లా మనం కొన్న షేర్లనో, వేరే షేర్లనో కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నందువల్ల రాబడి పెరగడానికి కూడా కచ్చితంగా వీలుంటుంది. మనమంతా మిడిల్ క్లాస్ మనుషులం అవడం వల్ల మన అవసరాలు ఎక్కువగానే ఉంటాయి. అందువాళ్ళ మధ్య కాలిక పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటే తక్కువ రిస్క్ తోనే గణనీయ ప్రయోజనాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.

దీర్ఘ కాలిక పెట్టుబడి 
ఇది అన్ని విధాలా శ్రేయోదాయకం. అదెలాగంటే...
1. మార్కెట్లు ఏళ్ల తరబడి పడిపోతూ ఉండవు. పడ్డ మార్కెట్ పెరగాల్సిందే. 
2. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా పెట్టుబడి పెట్టుకుంటూ పోతాం. 
3. వివిధ కంపెనీల షేర్లు కొనుగోలు చేయడం వల్ల ఒకట్రెండు నష్టాల్లో ఉన్నా... మిగతావి లాభాల్లో ఉండటం వల్ల మన పెట్టుబడి దెబ్బతినదు.
4 . ఒకేసారి లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేయాల్సిన అవసరం ఉండదు. 
5. మన షేర్లపై సదరు కంపెనీలు డివిడెండ్లు ఇస్తాయి. ఇదో అదనపు ప్రయోజనం. 
6. ఆయా కంపెనీలు షేర్లను విభజించడం, బోనస్ షేర్లు ఇవ్వడం వల్ల మన పోర్ట్ ఫోలియో లో షేర్ల సంఖ్యా పెరుగుతుంది. 
7. మన అవసరాలు దీర్ఘకాలానికి ఉంటాయి కాబట్టి... భవిష్యత్లో అవసరమైనప్పుడో, లేదంటే ఆ షేరు బాగా పెరిగిందని భావించినప్పుడో మనం కొన్ని ప్రాఫిట్స్ ను వెనక్కి తీసుకోవచ్చు లేదా వేరే పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. 
8. పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇత్యాది సందర్భాల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి రాకుండా ఉపయోగపడతాయి.

సంప్రదాయ డిపాజిట్లు పొదుపులతో పోలిస్తే... స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనేవి అధిక రాబడి ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయం అర్ధమయింది కదూ...

అయితే మీరు తీసుకునే నిర్ణయమే... మీ భవిష్యత్ కు దిక్సూచిగా నిలుస్తుంది. మీ అవసరాలు స్వల్ప కాలికమా... మధ్య కాలికమా... దీర్ఘ కాలికమా... అన్నది మీరే నిర్ణయించుకోండి. తదనుగుణమా నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేయండి. ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను.

ఎప్పటికప్పుడు మీ పోర్టు ఫోలియో మీద కన్నేసి.. తగిన లాభాలు రాగానే బయటపడటం అనేదే స్వల్ప, మధ్య కాలాలకు ఉపయుక్తంగా ఉంటుంది. దీర్ఘ కాలిక దృక్పథం తో కొంటారు కాబట్టి... లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఎప్పటికీ మంచి ఫలితాలే ఇస్తాయి. అయితే దీర్ఘ కాలానికి కొంటున్నాం కదా అని ఎవరో చెప్పారనో... తక్కువకు దొరుకుతున్నాయనో.. వ్యవధి ఎక్కువ ఉంటుంది కదా.. కచ్చితంగా పెరక్కపోవులే అనో... పనికిమాలిన పెన్నీ స్టాక్స్ జోలికి మాత్రం పోకండి.

-బెహరా శ్రీనివాస రావు
స్టాక్ మార్కెట్ విశ్లేషకులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement