pentapati pulla rao
-
పతన ఆర్థిక వ్యవస్థ పట్టదా?
2020 బడ్జెట్ ఏమంత పెద్దగా కానీ, అసాధారణంగా గానీ లేదన్న సాధారణ భావమే మెల్లమెల్లగా ఏర్పడుతోంది. ఈ బడ్జెట్లోనూ కీలకమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. అదొక షరా మామూలు బడ్జెట్‌గానే మిగిలింది. నిర్మలా సీతారామన్ సమర్థతలను అంచనా వేయడానికి ఇది సమయం కాదు. అరుణ్ జైట్లీ తొలి అయిదేళ్లు ఆర్థికమంత్రిగా ఉండేవారు. కాని తనకు పేరు తెచ్చిపెట్టే గొప్ప అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వ్యక్తి సరసన నిలబడేందుకు, అలాంటి పేరు తెచ్చుకునేందుకు ఆర్థికమంత్రి ముందు ఇప్పుడు మంచి అవకాశం ఉంది. పైగా అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఈ కోణంలో చూస్తే 2020 బడ్జెట్ కూడా అలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్న బడ్జెట్ అనే చెప్పాల్సి ఉంటుంది. సుప్రసిద్ధ బ్రిటన్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్ 50 ఏళ్ల క్రితం.. రాజకీయాల్లో ఒక వారం రోజులు అంటే చాలా ఎక్కువ కాలం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో వారం రోజులే అధికం అనుకుంటే బడ్జెట్ విషయంలో వారం రోజులంటే మరీ ఎక్కువ కాలం అనే చెప్పాలి. ఫిబ్రవరి1న కేంద్ర బడ్జెట్‌ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించినప్పుడు చాలామంది తక్షణ స్పందనలు వ్యక్తీకరించారు. కానీ ఫిబ్రవరి 1న మనం చేసిన చాలా సరళ నిర్ధారణల విషయంలో వారం రోజుల తర్వాత, అనిశ్చితి నెలకొంది. దీంతో బడ్జెట్‌పై రెండో అభిప్రాయం ప్రకటిం చడం మొదలెడుతున్నాం. ఒకవిషయం మాత్రం మారలేదు. బడ్జెట్ ప్రసంగాలకు సంబంధించిన పాత రికార్డులన్నింటినీ నిర్మల బద్దలు గొట్టేశారు. ఆర్థిక మంత్రి 2 గంటల 45 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న ప్పుడు కొంతమంది మంత్రులు నిద్రపోయారు కూడా. ఇప్పుడు సమస్య ఏమిటంటే అంత సుదీర్ఘ ప్రయత్నంలో విషయ గాఢత ఏమైనా ఉందా అన్నదే. అంత సుదీర్ఘ ప్రసంగం తర్వాత ఏర్పడిన ఉల్లాస స్థితిలో మనం ప్రతి విషయంలోనూ ముఖవిలువను మాత్రమే తీసుకుంటాం. కానీ కొంత సమయం తర్వాత వాస్తవంగా బడ్జెట్ పూర్తి భిన్నంగా ఉందని గ్రహిస్తాం. 2020 బడ్జెట్లో ఏమంత పెద్దగా కానీ, అసాధారణంగా గానీ లేదన్న సాధారణ భావమే మెల్లమెల్లగా ఏర్పడుతోంది. కీలకమైన నిర్ణయాలేవీ తీసుకోలేదు. అదొక షరా మామూలు బడ్జెట్‌గానే మిగిలింది. ఆర్థికమంత్రిని కాస్త సంప్రదాయకంగానే ఉండాలని, ఆర్థికవ్యవస్థ కుంగుబాటు సహజంగానే దాని ముగింపును చేరుకునేంతవరకు (అంటే మళ్లీ పుంజుకోవడం ప్రారంభమయ్యేంతవరకు) వేచి చూడాలని ఎవరో ఆమెకు సలహా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పతనబాట పట్టాక కొంతకాలం శిక్షను అనుభవించాక, సహజంగానే అది కోలుకుంటుందని ఆర్థిక శాస్త్రం మనకు పాఠం చెబుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ తన అత్యంత పతనస్థాయికి చేరుకుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధిబాటను చేపడుతుందనే భావన ఉంటోంది. మోదీ ప్రభుత్వ ఆశ కూడా అదేననిపిస్తోంది. 2019 అక్టోబర్ నుంచే మీడియా, విభిన్న భావాలు కలిగిన ఆర్థికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా 2020 బడ్జెట్ బిగ్ బ్యాంగ్ బడ్జెట్‌గా ఉంటుం దని, ఆర్థిక వ్యవస్థకు అధిక ద్రవ్యం వచ్చి చేరుతుందని, భారీ సంక్షేమ పథకాలు మొదలై ప్రజల చేతుల్లో పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని కలలు కన్నారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ తాజా బడ్జెట్లో కనిపించలేదు. ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు దాంట్లోకి భారీగా డబ్బును పంపించడం ద్వారా లేక డబ్బును అధికంగా ముద్రించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని ఆర్థిక సిద్ధాంతం తెలుపుతోంది. ఇది వినియోగదారుల్లో డిమాండును సృష్టించి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడుపుతుంది. కానీ 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుతో ప్రజల చేతుల్లోని డబ్బు, సహజసిద్ధమైన వారి డిమాండ్ శక్తి మటుమాయమైపోయింది. లక్షలాదిమంది తమ ఉద్యోగాలు కోల్పోయారు, చిన్నచిన్న వ్యాపారాలు మూసివేతకు గురయ్యాయి. రైతులు పండించిన పంటకు తగిన డబ్బులు రాలేదు. దేశవ్యాప్తంగా ఆర్థిక కల్లోలం చెలరేగింది, ఆరోజు చమురు ధరలు తగ్గిన కారణంగానే ఆర్థిక వ్యవస్థ తనకు తానుగా కోలుకుని తీవ్ర కుంగుబాటు బారినుంచి తప్పించుకుంది. కానీ ఆనాటి పెద్దనోట్ల రద్దు దుష్ఫలితాలు ఇప్పటికీ దేశం అనుభవిస్తూనే ఉంది. పైగా జీడీపీ సాధారణ వృద్ధిరేటు 10 శాతంగా ఉంటుందని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. అంటే జీడీపీ వృద్ధి ప్లస్ ద్రవ్యోల్బణ రేటు అనీ ఆమె ప్రకటన అర్థం తప్ప జీడీపీ వాస్తవ వృద్ధి కాదని అర్థం. 2016 నవంబర్ 8 నాటి పెద్దనోట్ల రద్దు ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. చాలామంది ప్రజల, ఆర్థిక వేత్తల అంచనాలను ఈ బడ్జెట్ అందుకోనప్పటికీ బడ్జెట్లోని కొన్ని సానుకూల అంశాలను ఎత్తిపట్టాల్సి ఉంటుంది. 1. పన్ను వివాదాల కేసులు: దేశంలో 4.86 లక్షల పన్ను వివాదాలపై కేసులు కొనసాగుతున్నాయని ఆర్థికమంత్రి చెప్పారు. అంటే ఈ వివాదాల్లో దాదాపు రూ. 15 లక్షల కోట్లు ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇలా కేసుల రూపంలో స్తంభనకు గురైన భారీ సంపదను తప్పకుండా వెలికి తీసుకురావాలని ఆమె చెప్పారు. పన్ను కేసులు పరిష్కారమైతే ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వం ఆమేరకు లాభపడతారు. భారీగా ఇరుక్కుపోయిన ఈ ఆదాయాన్ని వెలికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆర్థిక అవార్డులు, వివాదాలతో కూడిన కేసును పరిష్కరించాలనుకుంటే మరిన్ని ఆరోపణలు, న్యాయమూర్తుల పేర్లకు మరకలంటించడం చేస్తారని దానికి బదులుగా ప్రభుత్వం ఇలాంటి కేసుల్లో 50 శాతం రాయితీని కల్పించే విషయం ఆలోచిస్తోందని ఆర్థికమంత్రి చెప్పారు. 2. భారతీయ విద్యాసంస్థల్లో విదేశీ మదుపులను అనుమతించడం చాలా సానుకూలతను కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ విశ్వవిద్యాలయాల నాణ్యతను ఇది పెంచుతుంది. దీనివల్ల భారతదేశంలో విదేశీ విద్యార్థులు కూడా చదువుకునే అవకాశాలను పెంచుతుంది. ఈరోజు అమెరికాలో 10 లక్షల మంది, చైనాలో 5 లక్షలమంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ రంగంలో భారత్ కూడా పోటీపడాల్సిన అవసరముంది. 3. ప్రభుత్వ ఆసుపత్రులతో వైద్య కళాశాలలను అనుసంధానిం చడం. ప్రస్తుతం ప్రతి వైద్య కళాశాలకు కనీసం 750 పడకల పెద్ద ఆసుపత్రి అనుసంధానమై ఉండాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానం కావాలని తాజా బడ్జెట్ పేర్కొంది. దీనికి ఆర్థిక సహాయం కూడా అవసరం. దేశంలో మరిన్ని వైద్య కళాశాలల అవసరం ఉంది కాబట్టి ఈ చర్య తప్పక దోహదం చేస్తుంది. 4. ఆరోగ్యరంగానికి గరిష్టంగా నిధులు పెంచారు. గత సంవత్సరం ఈ రంగానికి రూ. 65,000 కోట్లు కేటాయించగా ఈ ఏడాది దాన్ని రూ. 67,500 కోట్లకు పెంచారు. ప్రజల వినియోగ డిమాండును ఇది తప్పకుండా పెంచుతుంది. 5. భారతదేశంలో బహిరంగ మలవిసర్జన ప్రపంచంలోనే అత్యధికం కాబట్టి పారిశుధ్య కల్పన అనేది దేశంలో అత్యంత ప్రధానమైన సంక్షేమ చర్య, ఆరోగ్య పథకంగా ఉంటోంది. ఈ రంగానికి తాజా బడ్జెట్లో గణనీయంగా నిధులు పెంచారు. గతేడాది పారిశుధ్యానికి రూ. 9,600 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 12,300 కోట్లకు పెంచారు. అంటే 28 శాతం పెరుగుదల అన్నమాట. ఈ పథకాన్ని మరింత మెరుగ్గా అమలుచేసి పబ్లిక్ టాయ్లెట్లను అధికంగా నిర్మించాల్సిన అవసరముంది. గత ఆరు బడ్జెట్ల ద్వారా నరేంద్రమోదీ చాలా ఆశాభంగం కలిగించారు. మోదీ విదేశీ వ్యవహారాలు, రక్షణ, అంతర్గత భద్రత, స్వచ్ఛభారత్ వంటి అనేక పథకాలను సమర్థవంతంగా నిర్వహించారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నందున మరింత మంచి బడ్జెట్‌ను దేశం కోరుకుంటోంది. కాని తాజా బడ్జెట్ కేటాయింపులు చూస్తే జరుగుతున్న పరిణామాలను అలాగే కొనసాగనిద్దాం అనే ధోరణే కనబడుతోంది కానీ నది మధ్యలో ఉన్న బోటును షేక్ చేసే దృక్పథాన్ని ఇది ప్రదర్శించడం లేదు. ప్రస్తుత బడ్జెట్ పరిస్థితి నాకు ఫ్రెంచ్ రచయిత జీన్ అల్ఫాన్స్ కార్ 130 ఏళ్ల క్రితం చెప్పిన మాటలను గుర్తుకు తెస్తోంది. పరిస్థితులు ఎంత అధికంగా మారితే, అంత ఎక్కువగా అవి అలాగే కొనసాగుతుంటాయి అని తన వ్యాఖ్య. దీనికనుగుణంగానే గత ఆరు బడ్జెట్లు యధావిధిగా కొనసాగుతూ వచ్చాయి. మార్పు అన్నదే కనిపించలేదు. ఈ ఆరేళ్లలో ఏమీ జరగని నేపథ్యంలో.. త్వరలోగానీ, తర్వాత కానీ అలాంటి అద్భుతమైన బడ్జెట్ ఏనాటికైనా వస్తుందా అనే సమస్య తలెత్తక మానదు. అరుణ్ జైట్లీ తొలి అయిదేళ్లు ఆర్థికమంత్రిగా ఉండేవారు. కాని తనకు పేరు తెచ్చిపెట్టే గొప్ప అవకాశాన్ని ఆయన జారవిడుచుకున్నారు. నిర్మలా సీతారామన్ సమర్థతలను అంచనా వేయడానికి ఇది సమయం కాదు. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి గొప్ప వ్యక్తి సరసన నిలబడేందుకు, అలాంటి పేరు తెచ్చుకునేందుకు ఆమెముందు ఇప్పుడు మంచి అవకాశం ఉంది. పైగా అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. ఈ కోణంలో చూస్తే 2020 బడ్జెట్ కూడా అలాంటి అవకాశాన్ని పోగొట్టుకున్న బడ్జెట్ అని కూడా చెప్పాల్సి ఉంటుంది. వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావువిశ్లేషణ -
కొత్తమలుపులో శివసేన రాజకీయం
బాల్ థాక్రే 1966లో శివసేనను స్థాపించి మహారాష్ట్రలో దాన్ని ఒక గొప్పశక్తిగా మలిచారు. బొంబాయి దేశ ఆర్థిక రాజధానిగా ఉండటంతో ఈ పరిణామం భారత రాజకీయాలపై కూడా ప్రభావితం చూపింది. బాల్‌థాక్రే బలంగా ఒక విషయాన్ని నమ్మేవారు. థాక్రే కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడు కూడా ఎన్నికల్లో ఎన్నటికీ పోటీ చేయరు అన్నదే ఆ నమ్మకం. బాల్‌థాక్రే జీవించి ఉన్నంతవరకు శివసేన ఆ నియమాన్ని గౌరవిం చింది. నిజానికి ఆయన పెద్ద కోడలు అప్పట్లోనే బాంబే మేయర్ కావాలని కోరుకున్నారు. కానీ బాల్‌థాక్రే ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో ఆయన పెద్దకుమారుడు ఇంట్లోంచి వెళ్లిపోయారు. థాక్రే మరణం తర్వాత ఉద్ధవ్‌థాక్రే ఆ నియమాన్ని బద్దలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కావడం ద్వారా ఉద్ధవ్‌థాక్రే తండ్రి అంతరాల్లోంచి వచ్చిన ఆ నిబంధనను ఉల్లంఘించారు. తన కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పడంలో బాల్‌థాక్రే తర్కం చాలా సులువైనది. వ్యక్తిగత వైభవం కోసం లేదా పదవికోసం, తన కుటుంబం రాజకీయాల్లో పాల్గొంటోందని ప్రజలు తమ గురించి అనుకోకూడదని థాక్రే భావించేవారు. శివసేన అంటే 80 శాతం సామాజిక సేవ, 20 శాతం రాజకీయాలు అని పదే పదే చెప్పేవారు. ఆయన గొప్ప చింతనాపరుడు. ఒక నాయకుడు ఎన్నికల్లో పాల్గొంటున్నప్పుడు అతడు ప్రజలవద్దకు వెళ్లి ఓట్ల కోసం అడుక్కోవాలని, అలాంటి వైఖరి శివసేనను దెబ్బతీస్తుందని థాక్రే చెప్పేవారు. ఎందుకంటే శివసేన విభిన్నమైన పార్టీ అని థాక్రే విశ్వాసం. కాబట్టి మహారాష్ట్రలో ఇప్పుడు రెండు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. శివసేన పూర్తిగా సాధారణ రాజకీయ పార్టీగా మారవచ్చు లేదా అది పతనం కావచ్చు. థాక్రే గొప్ప నియమం బద్దలైపోయింది. శివసేన ప్రస్తుత పాత్రను గుర్తిస్తున్నప్పుడు ఈ అంశాన్ని మనసులో ఉంచుకోవాల్సిందే. ఒక శివసైనికుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నది బాల్ థాక్రే చివరి కోరిక అని శివసేన నేత సంజయ్ రౌత్ ఇప్పుడు చెబుతున్నారు. కానీ తన కుటుంబ సభ్యుడొకరు సీఎం కావాలని థాక్రే ఎన్నడూ భావించలేదు. ఈ వాస్తవం ప్రస్తుత శివసేన నాయకత్వాన్ని విచ్ఛిన్న పరుస్తుంది. బాల్‌థాక్రే రాజరికపాలనపై, కాంగ్రెస్ పార్టీపై పదే పదే దాడిచేసేవారు. రాజరికపాలన క్రమక్రమంగా అంతరించిపోతుందని థాక్రే చెప్పేవారు. శివసేన మిలిటెంట్ పార్టీగానే తప్ప అధికారంపై ఆసక్తి లేకపోవడాన్ని కొనసాగించాలని ఆయన హెచ్చరించేవారు. 1994లో తొలిసారిగా మహారాష్ట్రలో శివసేన అధికారంలోకి వచ్చినప్పుడు బాల్ థాక్రే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ మనోహర్ జోషిని సీఎంగా నియమించిన థాక్రే తాను మనోహర్ జోషీ రిమోట్ కంట్రోల్‌గా ఉంటానని బహిరంగంగా చెప్పారు. శివసేన ప్రస్తుత స్థితిని అంచనా వేసేటప్పుడు ఈ నేపథ్యాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఉద్దవ్ థాక్రే దివంగత బాల్‌థాక్రే మూడవ కుమారుడు. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న బీజేపీని తుంగలో తొక్కి మరీ సీఎం అయ్యారు. భారత రాజకీయాల్లో ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదు. అయితే శివసేన నైతికతపై చర్చించటం కంటే అధికారం చేజిక్కించుకోవడం ద్వారా శివసేన ఎదుర్కోనున్న బలమైన సవాళ్లను అంచనా వేయడం అవసరం అని నా భావన. శివసేన ఒక పార్టీగా 1999 నుంచి పతనమవుతూ వస్తోంది. బీజేపీ–శివసేన పొత్తులో ప్రధాన భాగస్వామిగా ఉంటున్న స్థితి నుంచి సేన జూనియర్ భాగస్వామిగా పడిపోయింది. తన ఈ పతనానికి బీజేపీనే వేలెత్తి చూపుతున్న శివసేన తన నాయకత్వ శైలిగురించి ప్రశ్నించుకోవడం లేదు. మహారాష్ట్ర శాసనసభలోని 288 సీట్లలో 124 స్థానాల్లో పోటీ చేసిన శివసేన కేవలం 58 సీట్లను గెల్చుకుంది. మిగిలిన 164 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగింది. ఈ లెక్కలకు సంబంధించిన తేడాను ఉపయోగించుకున్న శివసేన.. బీజేపీని విడిచి, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పర్చింది. థాక్రే కుటుంబానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే శివసేనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రధానంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఉనికిలో ఉన్న పార్టీగా పతనమైన శివసేన ముఖ్యమంత్రి పదవి ద్వారా పోయిన బలాన్ని తిరిగి పొందవచ్చని ఆశిస్తోంది. సీఎంగా ఉద్దవ్ ప్రతిచోటా ఆదేశించే స్థాయిలో ఉంటారు కాబట్టి ఇతర పార్టీల్లోని నేతలను, కార్యకర్తలను కూడా పార్టీలోకి ఆకర్షించవచ్చు. ఉనికిలేని ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేసుకోవచ్చు. తాను కోల్పోయిన గౌరవాన్ని ముఖ్యమంత్రి పదవి ద్వారా తిరిగి పొందవచ్చని, పార్టీ నాయకులు, కార్యకర్తులు మునుపటిలా పార్టీని వదలకపోవచ్చని థాక్రే కుటుంబం ఆశిస్తోంది. అధికారం దన్నుతో పునర్వైభవాన్ని పొందవచ్చన్నది వీరి ఆశ. ఇప్పుడు కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి నుంచి మద్దతు ద్వారా బాంబే కార్పొరేషన్లో ఆధిక్యత సాధించవచ్చని శివసేన నాయకత్వం భావిస్తోంది. 2019లో కంటే 2024 ఎన్నికల్లో మరిన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాన్ని కూడా ముఖ్యమంత్రి పదవిద్వారా పొందవచ్చు. శివసేన గత ముఖ్యమంతి నారాయణ్ రానేతో సహా ఇతర పార్టీల్లోకి వెళ్లిన శివసైనికులను అధికార బలంతో తిరిగి ఆకర్షించడమో లేక ప్రతీకారంతో దెబ్బతీయడానికి సీఎం పదవి ఆస్కారం ఇవ్వనుంది. అలాగే చక్కెర ఫ్యాక్టరీలలో, కో ఆపరేటివ్స్‌లో వాటాను పెంచుకోవచ్చు. పైగా శివసేనకు జాతీయ స్థాయిలో ప్రతిష్ట కూడా పెరగనుంది. దేశంలో అతి పెద్ద రాష్ట్రం, దేశ ఆర్థిక రాజధానిని కలిగిన మహారాష్ట్రపై పట్టు సాధించడం ద్వారా జాతీయ రాజకీయాలను శాసించవచ్చని శివసేన అంచనా. ముఖ్యమంత్రిగా ఉద్దవ్ థాకరే మంచి పాలనను అందిస్తే, సమర్థతను నిరూపిస్తే భవిష్యత్తులో తాను గొప్ప రాజకీయవేత్తగా కావచ్చు. 1999 నుంచి 2014 వరకు 15 సంవత్సరాలపాటు కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అనుభవించిన అధికారాన్ని శివసేన సమర్థపాలన ద్వారా అందుకోవచ్చు. అన్నిటికంటే మించి మహారాష్ట్రలో వైఫల్యం నుంచి బీజేపీ గుణపాఠం తీసుకుని దిద్దుబాట పట్టకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని కావడానికి నరేంద్రమోదీ చిక్కు సమస్యలు ఎదుర్కోవచ్చు. మహారాష్ట్రను కోల్పోవడం భారీ నష్టమని బీజేపీకి అర్థమైంది. మహారాష్ట్రలో అధికార పగ్గాలు తిరిగి చేపట్టడానికి మోదీ, అమిత్ షాలు పథకాలు ఏమేరకు ఫలిస్తాయన్న అంశంపైనే శివసేన భవిష్యత్తు, ప్రస్తుత అధికార పొత్తు భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి. వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు -
రాహుల్ ప్రకటన దుస్సాహసమే
బెంగళూరులో మే 8న ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవిస్తే ప్రధాని పదవికి తానే బరిలో ఉండవచ్చని చెప్పారు. ఇది సంచలన ప్రకటన అయింది. తాను ప్రధానిగా కావచ్చని రాహుల్ చెప్పారు. భారత్‌లో ఏ రాజకీయ నేత, వాణిజ్యవేత్త కూడా తనకు అధికారం లేదా డబ్బు కావాలని కోరుకునేవారు కాదు. కానీ రోజులు మారుతున్నాయి కనుక భారతీ యులు ఇప్పుడు సంపద ప్రదర్శనకు సీట్ల కొనుగోలు పట్ల ఉత్సాహం చూపుతున్నారు. తాను ప్రధాని కావాలని అనుకుంటున్నానని రాహుల్ చెప్పడానికి ఆయనపై ఒత్తిళ్లు పనిచేసి ఉంటాయి. కర్ణాటక ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా ప్రధాని కావాలనుందని రాహుల్ చేసిన ప్రకటనకు ఎలాంటి ఫలితాలూ చేకూరవు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందితే ఇతర పార్టీలు రాహుల్ ముందు మోకరిల్లుతాయని కాదు. ఎందుకంటే.. 1. మమతా నేతృత్వంలో కూడిన ప్రాంతీయ పార్టీలు తాము రాహుల్ నాయకత్వాన్ని అనుసరించబోమని చెప్పాయి. కొన్ని నెలల క్రితం రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ, మాయావతితో సహా ప్రాంతీయ పార్టీ నేతలు ఎవరూ ఆయనకు సెల్యూట్ చేయలేదు. ఎందుకంటే ఎంపీల సంఖ్యరీత్యా చూస్తే ప్రాంతీయ పార్టీలు పెద్దవి, కాంగ్రెస్ పార్టీ చిన్నది. అందుకే రాహుల్‌ని ప్రాంతీయ పార్టీలు గొప్ప నేతగా చూడటం లేదు. 2. ప్రధాని పదవి చేపట్టడానికి తాను సిద్ధమని ముందే ప్రకటించకపోతే ఇతర ప్రాంతీయ నేతలు పోటీలో ముందుకొస్తారని రాహుల్ భావిస్తున్నారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ ప్రధాని కావడానికి విస్తృత ఆమోదం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జాతీయ ఆకాంక్షలను వ్యక్తీకరిస్తున్నారు. ఇక ఇతర ప్రాంతీయ పార్టీలైన వైఎస్ఆర్ సీపీ, టీడీపీ, తెరాస, దేవెగౌడ జనతాదళ్, మాయావతి, చివరకు అఖిలేష్ యాదవ్ కూడా వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నాయకత్వ స్థానాన్ని చేపట్టాలని చెప్పడం లేదు. కాంగ్రెస్ మళ్లీ ప్రధాని పదవిని చేపడితే తమ తమ పార్టీలకు నష్టం చేకూరుతుందని ఈ నేతలంతా భావిస్తున్నారు. దేవెగౌడ వంటి వివాదరహిత నాయకులు కేంద్రప్రభుత్వ అధినేతగా ఉండాలని వీరు కోరుకుంటున్నారు. 3. కాంగ్రెస్ పార్టీ 2019లో ప్రధాని పదవిని చేపట్టలేకపోతే తన పార్టీ, తన కుటుంబం అధికారానికి పదేళ్లు దూరంగా ఉండాల్సి వస్తుందని రాహుల్‌కి స్పష్టంగానే తెలుసు. అంటే మీడియాపై, బ్యూరోక్రసీపై, రిటైర్డ్ అధికారులపై, మేధావులపై, ప్రభావిత శక్తులపై, అభిప్రాయాలు మలచగలవారిపై, స్వార్థ ప్రయోజన శక్తులపై తమ ఆజమాయిషీని కోల్పోవలసి వస్తుంది. జనం కూడా తన వెంట ఉండరు. 4. రాహుల్ ప్రధాని పదవికి రెడీ అని చెప్పడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన ప్రక్రియ రెండింటికీ లంకె ఉంది. అధికారానికి సిద్ధం అన్న వెంటనే రాజకీయ నేతలు, అధికారం పట్ల వ్యామోహం ఉన్నవాళ్లు వెంటనే రాహుల్‌కి మద్దతు పలుకుతారు. కాంగ్రెస్ అధికారంలోకివస్తే మీడీయా, న్యాయవ్యవస్థ సైతం అప్రమత్తమవుతాయి. ఎందుకంటే చీఫ్ జస్టిస్ మీదే అభిశంసన ప్రతిపాదించినవారు మామూలు జడ్జీలపై దాన్ని మోపలేరా? 5. ప్రధానిగా తాను అధికారం చేపడతానని ప్రకటించిన వెంటనే వ్యాపార వర్గం కూడా రాహుల్‌కి మద్దతిచ్చే అవకాశముంది. రాజకీయనేత అధికారం కోల్పోయినప్పుడు సంపన్నులు వారికి దూరం జరుగుతారు. ఆ నేతలు మళ్లీ అధికారంలోకి రానున్నట్లు సూచనలు రాగానే బిలబిలమంటూ వచ్చి విరాళాలు ఇస్తారు కూడా. మీడియా యజమానులు సైతం బీజేపీకి వల్లమాలిన మద్దతునివ్వడం తగ్గించి కాస్త జాగ్రత్తగా ఉంటారు. 6. కాంగ్రెస్ క్షీణిస్తున్నట్లు కనబడగానే పార్టీలోని పలువురు నేతలు గెంతేయ్యాలని కోరుకుంటారు. ఇప్పటికే ఏపీలో, బెంగాల్లో, ఒడిశాలో తమకు ఏ పదవీ లేనిచోట కాంగ్రెస్‌కు వారు ఇంకా ఎందుకు అట్టిపెట్టుకోవాలి? 2019లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించడం ద్వారా పార్టీ మారే ఉద్దేశం ఉన్నవారిని నిలిపి ఉంచవచ్చు.భారత్‌లో ఏ ప్రజాస్వామ్య నేతా తనకు ప్రధాని కావాలని ఉందని ప్రకటించుకోలేదు. తాను ప్రపంచాన్ని జయిస్తానని 2400 ఏళ్ల క్రితం అలెగ్జాండర్ ప్రకటించాడు. గ్రీస్‌కు అవతలి ప్రపంచాన్ని లూటీ చేసుకోవచ్చన్న సందేశాన్ని తన సైనికులకు ఇవ్వడానికే అలా ప్రకటించాడు. జర్మన్ జాతికి తగిన భూ ప్రాంతం కోసం రష్యాను జయిస్తానని హిట్లర్ ప్రకటించాడు. మరోవైపు మహాత్మాగాంధీ తనకు ఏ పదవీ వద్దన్నారు. తాను రాజ్యాంగాన్ని రచిస్తానని అంబేడ్కర్ ఏ కోశానా ఊహించలేదు. మహనీయ గౌతమ బుద్దుడు విలాసాలనూ, అధికారాన్ని కూడా తృణప్రాయంగా త్యజించాడు. ఇన్ని ఉదాహరణల మధ్య రాహుల్ దుస్సాహసికంగానో లేక తప్పుగానో ప్రధాని పదవిపై అలాంటి ప్రకటన చేసి పడేశారు.రాహుల్ ప్రకటన చేసిన వెంటనే ప్రతిపక్ష నేతలతోపాటు భారతీయ యువతలో ఒక వర్గం ఆగ్రహావేశాలు ప్రదర్శించింది. తన బలం పెద్దగా లేకున్నప్పటికీ రాహుల్ ప్రధాని పదవిని ఎలా ఆశిస్తారని ప్రతి పక్షాలు ఆగ్రహిస్తే, రాజరిక, వారసత్వ రాజకీయాలు ఇంకానా ఇకపై చెల్లవు అంటూ యువత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పోతే కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో అధిక సీట్లను సాధిస్తే రాహుల్‌కి సపోర్ట్ చేయడం మినహా తమకు గత్యంతరం లేదని ప్రతిపక్షాల ఆందోళన. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ తాము బాధితులం అవుతామని తెలంగాణ, ఏపీ, ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇటీవలి కాలంలో రాహుల్ విమర్శాత్మక రాజకీయాలను పెంచిపోషిస్తున్నారు. ఒప్పైనా, తప్పైనామోదీపై, ఇతర బీజేపీ నేతలపై రాహుల్ విరుచుకుపడుతున్నారు. చివరకు న్యాయవ్యవస్థను కూడా ఆయన వదిలిపెట్టలేదు. రాహుల్ అనవసర విమర్శలు చేస్తున్నారా అనేది కాలానికి వదిలేద్దాం. కానీ ప్రధాని మోదీ మాత్రం పెద్దనోట్ల రద్దు, పేలవమైన జీఎస్టీ, చమురు ధరలను తగ్గించకపోవడం వంటి అంశాలతో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇతర నేతల్లాగే మోదీ సైతం ఇతరులను సంప్రదిం చడం లేదనే అపప్రథను సంపాదించుకుంటున్నారు. అధికారంకోసం పోరాటం, రాజకీయాలు అనేవి భారత్‌లో ఇప్పుడు చావుబతుకుల సమస్య అయింది. ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలని రాజకీయనేతలు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రమాదకర పరిస్థితిలోకి భారత్ ప్రవేశించబో తోందా, డబ్బు, కండబలం, మీడియా బలం ఇవే అధికారంలోకి తీసుకువచ్చే వాహికలుగా మారనున్నాయా అనే ప్రశ్నలు జాతిముందు నిలబడుతున్నాయి. ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు మనముందు జాతి నిర్మాతలు మాత్రం లేరు. వ్యాసకర్త: పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in -
రాజకీయాలకు ‘నితీశ్’ కుదుపు
విశ్లేషణ నితీశ్ నిష్క్రమణతో బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాలన్నిటి మహాకూటమి అనే తర్కం ఇక పని చేయదు. 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక తప్పదని అనుకున్నాక, ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఓడిపోయే పక్షంలో ఉండాలని ఎందుకు కోరుకుంటుంది? వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మోదీ, షాలు రాజకీయంగా సాధ్యమైన ప్రతిదాన్నీ సాధించారు. కాక పోతే రైతు సమస్యలు, నిరుద్యోగం కలసి 2018 నాటికి ఒక్కసారిగా జాతీయస్థాయిలో బద్దలు కాకుండటానికి హామీని కల్పించాలి. ముఖ్యంగా సుపరిపాలనపై దృష్టిని కేంద్రీకరించాలి. చైనా యుద్ధ నిపుణుడు సున్ జూ 2,500 ఏళ్ల క్రితం ‘‘శత్రువును మభ్యపెట్టు, తప్పుదారి పట్టించు, ఆశ్చర్యపరచు’’ అని బోధించాడు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు సున్ జూ, చాణక్యుల రచనలు చదివారో లేదో తెలియదు. కానీ, వారు సున్ జూ ఎత్తుగడలను కచ్చితంగా అమలు చేస్తున్నట్టు అని పిస్తోంది. అనూహ్యమైన రీతిలో నితీశ్ కుమార్, బీజేపీల కూటమిని ఏర్పాటు చేసి అమిత్ షా హఠాత్తుగా భారత రాజకీయ చిత్రాన్నే మార్చి పారేశారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ మహాఘట్‌బంధన్‌గా ఏకతాటిపైకి తేవాలని కాంగ్రెస్ పార్టీ గత ఏడాది కాలంగా పథకాలు వేస్తోంది. ఆ మహా కూటమి ఇప్పుడు అదృశ్యమైపోయింది. అమిత్ షా, సున్ జూ రాసిన ‘యుద్ధ కళ’లోని ఎత్తుగడను తు. చ. తప్పక అనుసరిస్తుండగా, కాంగ్రెస్, రాహుల్ గాంధీ అందుకు సరిగ్గా విరుద్ధంగా ప్రవర్తిసున్నారు. ‘‘నితీశ్ కుమార్ పారిపోతాడని నాకు నాలుగు నెలల క్రితమే తెలుసు’’ అని రాహుల్ అన్నారు. మరి దాన్ని ఆపడానికి నాలుగు నెలలుగా ఏం చేశావు? అని అంతా అడుగుతున్నారు. నీరు గారిన మహాకూటమి ఆశలు ఉత్తర భారతంలో నేడు కాంగ్రెస్ ఉనికిలోనే లేదు. కానీ ప్రాంతీయ నేతలైన ములాయం సింగ్, లాలూ ప్రసాద్‌యాదవ్, నితీశ్ కుమార్ వంటి వారికి గొప్ప ప్రజా పునాది ఉంది. సాధారణంగా అలాంటి ప్రాంతీయ నేతలకు ఒకరంటే ఒకరికి పడదు. కాబట్టి కాంగ్రెస్ అలాంటి నేతలందరినీ ఒక చోటికి చేర్చగలిగితే గొప్ప శక్తి ఆవిర్భవిస్తుంది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో గత 25 ఏళ్లుగా ములాయం, మాయావతి ప్రత్యర్థులుగా ఉన్నారు. అలాగే బిహార్‌లో నితీశ్, లాలూ కూడా 25 ఏళ్ల పాటూ ఒకరితో ఒకరు తలపడి, ఒకటయ్యారు. కాంగ్రెస్ కూడా కర్ణాటకలో దేవెగౌడతో, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌తో, బెంగాల్లో మమతా బెనర్జీ, సీపీఎంతో కలిస్తే మహా కూటమి సిద్ధమవుతుంది. 2015లో బిహార్‌లో నితీశ్, లాలూ చేయి కలపడం బీజేపీని రాజకీయంగా కుదిపేసింది. ఈ మహా కూటమి పథకంలో నితీశ్ ఒక ముఖ్య కీలక వ్యక్తి. నితీశ్ అందులో లేకపోతే 2019లో బీజేపీ బిహార్‌లో సులువుగా గెలుస్తుంది. నితీశ్ కాంగ్రెస్, మహా కూటమితో లేకపోవడంతో, ఇక ఎలాగూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ కూటమిలో చేరడంలో అర్థమేముంటుంది? అని ప్రాంతీయ నేతలంతా ఆలోచిస్తారు.. యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్య మంత్రి ఒమర్ అబ్దుల్లా... 2019 సంగతి పక్కనబెట్టి, 2024 ఎన్నికలకు ప్రణాళికలను రచించడం ఉత్తమమని చెప్పారు కూడా. 2014 పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయలేమని బీజేపీకి బాగా తెలుసు. అందుకే అది 2019 ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీ కరించింది. ఉత్తర ప్రదేశ్ నుంచి ఉన్న 80 పార్లమెంటు స్థానాల్లో 72ను అది తిరిగి గెలుచుకోలేదు. బీజేపీ ఎక్కువ సీట్లను సాధించిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, హరియాణా, రాజస్థాన్‌లలో బలమైన అధికారపార్టీ వ్యతిరే కత ఉంది. ఆ రాష్ట్రాల్లో వాటిల్లే నష్టాన్ని బీజేపీ కొత్త ప్రాంతాల నుంచి భర్తీ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్లో అది ఒక పెద్ద శక్తిగా ఆవిర్భవించడానికి మరో ఏడేళ్లు పడుతుంది. శాసనసభ విజయాల సంగతి ఎలా ఉన్నా, 2004లో అటల్ బిహారీ వాజ్ పేయి బీజేపీకి 300 స్థానాలు వస్తాయనుకుని ఓటమి పాలైన విషయాన్ని అది ఎన్నటికీ మరిచిపోలేదు. రాజకీయాలలో రెండేళ్లంటే చాలా ఎక్కువ కాలమని మోదీ, షాలకు బాగా తెలుసు. వారు నిరంతరం ఎప్పటికప్పడు పరిస్థితిని గమనిస్తూనే ఉండాల్సి ఉంటుంది. ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణ, బెంగాల్, ఒడిశాలలో బీజేపీ ఓట్ల శాతం పెరిగినా ఎంపీ సీట్లు మాత్రం దక్కవని కూడా వారికి తెలుసు. ఇక తెలుగుదేశం, శివసేన, ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ వంటి మిత్రపక్షాలు గాలివాటం బాపతని వారికి బాగా తెలుసు. బీజేపీకి ఆధిక్యత లభించకపోతే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి గెంతేస్తారు. ప్రాంతీయ నేతలు చాలా తెలివిగా వ్యవహరిస్తారని, వారి ప్రేమ తాత్కాలికం, విడాకులు విద్వేషపూరితం అని కూడా వారికి తెలుసు. మహారాష్ట్ర, హరియాణా జార్ఖండ్, అస్సాం వంటి పలు రాష్ట్రాల్లో బీజేపీ తొలిసారిగా గెలిచింది. కాబట్టి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కాబట్టి, ఆ రాష్ట్రాల్లో రెట్టింపు అధికార పార్టీ వ్యతిరేకతను ఎదుర్కో వాల్సి వస్తుందని మోదీ, షాలకు తెలుసు. బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాలన్నీ ఐక్యమైతే ఆ రాష్ట్రాల్లో బీజేపీ పని ఏటికి ఎదురీతే అవుతుంది. నితీశ్ విశిష్ట స్థానం నితీశ్ బిహార్‌లోని ఓ చిన్న పార్టీకి నేత. కానీ బిహార్ మహాఘట్బంధన్లో ఆయనకు స్థానం ఉండటం వల్లనే లాలూ, కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమైంది. నితీశ్, లాలూ విడిగా పోటీ చేసి ఉంటే సునాయసం గానే తాము అక్కడ గెలిచి ఉండేవారమని బీజేపీ భావిస్తోంది. బిహార్ కూటమి ప్రాతిపదికపై బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉత్తరప్రదేశ్‌లో మహాఘట్ బంధన్‌ను ఏర్పాటుచేయాలని అనుకుంటున్నాయి. బద్ధ శత్రువులైన మాయా వతి బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు 2019లో కలసి పోటీచేస్తాయి. కానీ ఇప్పుడు నితీశ్ బీజేపీతో కలవడం.. అలాంటి కూట మిని నిరుపయోగంగా మార్చేసింది. ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి కూటము లను ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ తదితర బీజేపీ వ్యతిరేక పార్టీల పథకం. బెంగాల్లో మమతా బెనర్జీ, కాంగ్రెస్ కలుస్తాయి. కర్ణాటకలో కాంగ్రెస్, దేవె గౌడకు చేయి చాస్తున్నది. ఒడిశాలో నవీన్ పట్నాయక్‌తో కలిసింది. కానీ నితీశ్ నిష్క్రమణతో ఆ తర్కం పని చేయదు. బిహార్‌లో మహాఘట్బంధన్ లేకపోతే 2019లో బీజేపీ సునాయాసంగా ఆధిక్యతను సాధిస్తుంది. నితీశ్, కాంగ్రెస్ కూటమిని వీడిన వెంటనే బీజేపీ ప్రచారపరంగా గొప్ప విజయాన్ని సాధించింది. నితీశ్ తమ కూటమిలో లేనిదే కాంగ్రెస్ బిహార్‌లో మంచి ఫలితాలను సాధించలేదు. 2019లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్ప డక తప్పదని అనుకున్నాక ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఓడిపోయే పక్షంలో ఉండాలని ఎందుకు అనుకుంటుంది? భారత రాజకీయాల్లో నితీశ్ ఒక విశిష్ట స్థానాన్ని సాధించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు లేని పార్టీ, నితీశ్ పార్టీ లేని నాయకుడు అని సుప్రసిద్ధ చరిత్రకారులు రామచంద్ర గుహ ఇటీవల అన్నారు. కాబట్టి నితీశ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి చేసి, రాహుల్ స్థానంలో ఆయ నను ప్రధాని అభ్యర్థిగా నిలపాలని సూచించారు. గుహ పరిహాసంగానే అన్నా, దేశవ్యాప్తంగా ఆ మాటలను నిజమైనవిగానే తీసుకోవడంతో నితీశ్ ప్రతిష్ట మరింత పెరిగింది. భావి పర్యవసానాలు 1. నితీశ్ నిష్క్రమణ వల్ల ఎక్కువగా నష్టపోయినది కాంగ్రెస్, రాహుల్ గాంధీలే. ఇక వారు అధికారంలోకి రాలేనట్టే అనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు దానితో కలవడానికి జంకుతాయి. పెద్ద కూటమికి నేతృత్వం వహించి, పెద్ద నేతగా కనిపించాలని రాహుల్ కలలుగంటున్నారు. ఇప్పుడిక ఏం చేయాలో ఆయనకు తెలియదు. 2. లాలూ, బిహార్‌లో తన నియంత్రణలో ఉన్న ప్రభుత్వాన్ని కోల్పో యారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇక ఆయన చెప్పు చేతల్లో ఉండదు. పైగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ కూడా లాలూ కుటుంబ ఆస్తులపై విచార ణలను మొదలెడుతుంది. ఆయన కుటుంబ సంపదపై ఇప్పటికే సీబీఐ జరుపుతున్న విచారణ ఇక ముమ్మరమవుతుంది. ఎన్ఫోర్స్ శాఖ ఆయన కుటుంబ బినామీ అస్తులన్నిటినీ స్వాధీనం చేసుకుంటుంది. 3. నితీశ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితులుగా ఉండేవారు. కాబట్టి ఆమె కూడా నష్టపోతారు. బీజేపీ అక్కడ బలపడటమే కాదు, పొరుగున ఉన్న బిహార్‌లో అధికారంలోకి వస్తుంది. 2019లో బీజేపీ ఓడిపోతుందని మమతా బెనర్జీ చెబుతూ వస్తున్నారు. కానీ నితీశ్ నిష్క్ర మణతో అది అసాధ్యంలా అనిపిస్తోంది. 4. మహాఘట్బంధన్ ద్వారా వామపక్ష పార్టీలు ఎంతో కొంత లబ్ధి పొందాలని ఆశిస్తున్నాయి. కేవలం 20 మంది ఎంపీలే ఉన్న వామపక్షాలు ఒక బలమైన కూటమిలో భాగమై 2019లో బీజేపీని ఓడించాలని చూస్తున్నాయి. ఇక అది కష్టమనే అనిపిస్తోంది. 5. ఉత్తరప్రదేశ్‌లో మహాఘట్బంధన్ను ఏర్పాటు చేయాలని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిక ఆయన తండ్రి ములా యం... ఇక ఒంటరి పోరే మెరుగంటూ, కాంగ్రెస్‌తోగానీ, మాయావతితోగానీ సమాజ్‌వాదీ పార్టీ కలవరాదని అంటారు. కాబట్టి యూపీలో అఖిలేష్ తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. 6. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పాత రోజులు తిరిగి రానున్నాయని సంబరపడుతోంది. నితీశ్ నిష్క్రమణతో 2019లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువని ఏఐడీఎంకే, తదితరులు భావిస్తున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న డీఎంకేకు ఇది దుర్వార్తే. బీజేపీ బల హీనపడితే ఏఐడీఎంకే క్రమంగా అంతర్ధానమైపోతుందని స్టాలిన్ ఆశిస్తు న్నారు. కానీ దానికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది. 7. నితీష్ రాకతో బీజేపీ మిత్రపక్షాలైన తెలుగుదేశం, శివసేన, అకాలీదళ్ వంటి పార్టీల బేరసారాలాడే శక్తి తగ్గిపోతుంది. 8. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు నితీశ్ పెద్ద మద్దతుదారు. కాబట్టి ఆయన కూడా నష్టపోతారు. ఈ పరిణామాల వల్ల ఎక్కువగా లబ్ధిని పొందేది బీజేపీనే. మోదీ, షాల ఖ్యాతి తారస్థాయికి చేరుతుంది. మరీ ముఖ్యంగా అవసరమైతే వారు ఎవరి తోనైనా రాజీ పడటానికి సిద్ధమేనని రుజువవుతుంది. రాజకీయాలలో ఇది గొప్ప సుగుణం. నితీశ్ కూడా బాగానే లబ్ధిపొందుతారు. మహా తెలివైన లాలూ యాదవ్‌తో కంటే 15 ఏళ్లు కలసి ఉన్న బీజేపీతో పని చేయడం ఆయ నకు సులువు అవుతుంది. పైగా కేంద్రంలో మిత్ర ప్రభుత్వం ఉండటమనే సానుకూలత కలుగుతుంది. 2019 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మోదీ, షాలు రాజకీ యంగా సాధ్యమైన ప్రతిదాన్నీ సాధించారు. ఒకే ఒక్కటి మిగిలిపోయింది. మోదీ ప్రభుత్వం మంచి పరిపాలనను అందించి, రైతు సమస్యలు, నిరు ద్యోగం కలసి 2018 నాటికి జాతీయస్థాయిలో ఒక్కసారిగా బద్ధలు కాకుం డటానికి హామీని కల్పించాలి. అదే జరిగితే వారి మొత్తం పథకమంతా చెడి పోతుంది. మోదీ, షాలు ఆ పరిస్థితికి తగ్గ పథకాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. అంతకు మించి సుపరిపాలనపై దృష్టిని కేంద్రీకరించాలి. వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు‘ ఈ–మెయిల్: ppr193@gmail.com పెంటపాటి పుల్లారావు -
అదిగదిగో..! డిసెంబర్ 30
విశ్లేషణ మోదీ చెప్పినట్టు డిసెంబర్ 30 నాటికి పరిస్థితులు మెరుగుపడకుంటే స్వపక్షం నుంచే ఆయన బెడదను ఎదుర్కొనక తప్పదు. దీని కోసమే సీనియర్లు కొందరు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోకుంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదు. దీనితో మోదీ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటుంది. నోట్ల రద్దు విఫలమైతే, నెపాన్ని ఇతరుల మీదకి నెట్టే అవకాశం కూడా మోదీకి లేదు. ఇదంతా తన స్వకపోల కల్పితమనీ, రహస్యంగా జరిగిందనీ ఇప్పటికే చెప్పారు. అంతా సజావుగా, సంతోషంగా ఉన్నప్పుడే రాజకీయ జీవులంతా పదవుల నుంచి పక్కకి తప్పుకోకపోతే చివరికి మిగిలేది వైఫల్యమే. రాజకీయాల లక్షణమే కాదు, మనుషుల తత్వమే అంత అంటాడు ప్రఖ్యాత ఇంగ్లిష్ రాజకీయవేత్త ఇనాక్ పోవెల్. ప్రపంచంలో చాలామంది ప్రముఖ రాజకీయ వేత్తల మాదిరిగానే తన రాజకీయ జీవితానికి కూడా అదే రాసి పెట్టి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీకి అర్థమయ్యే రోజు వస్తుంది. ఈ డిసెంబర్ 30 తేదీని మోదీ నిర్ణయాత్మక దినంగా నిర్దేశించారు. 15 లక్షల కోట్ల విలువ మేరకు ఉన్న రూ. 100, రూ. 1,000 నోట్లలో ఎన్ని బ్యాంకులకు చేరతాయో ఆరోజునే వెల్ల డవుతుందని మోదీ ఊహ. అయితే అందులో చాలావరకు, రూ. 14 లక్షల కోట్లు ఇప్పటికే జమ అయినాయి. ఈ నెలాఖరుకు ఇంకొంత జమ అవు తుంది. అంటే లక్ష్యసాధనలో మోదీ విఫలమయ్యారు. ఇదిగో నల్లధనం అంటూ చెప్పడానికి ఏమీలేదు. మోదీ అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. నోట్ల రద్దు అనే కొరివితో తలగోక్కుని స్వయంకృతాపరాధానికి పాల్పడ్డారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ జీవితం ఎంత విషాదాం తమైందో మోదీ గుర్తు చేసుకోవాలి. లేదంటే బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజకీయ జీవితం బ్రిగ్జిట్తో ఎలా పతనమైందో తలుచుకోవాలి. ఐదేళ్ల కాల పరిమితి కోసం కామెరాన్‌ను ఆ దేశ ప్రజలు 2015లో ఎన్నుకున్నారు. కానీ యూరోపియన్ యూనియన్‌లో ఉండాలా వద్దా అనే అంశం మీద మొన్న జూన్‌లో ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించి భంగపడ్డారు. రాజీనామా చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. నీ ప్రభ సమున్నతంగా వెలుగుతున్నప్పుడు పదవి నుంచి తప్పుకోవాలన్న పావెల్ మాటను ఆచరించేదెవరు? అత్యాశ ఫలితం కాదా? మోదీ మంచి పథకాలను ఆరంభించారు. స్వచ్ఛ భారత్, భారత సంతతి, భారతీయులు ఎక్కువగా ఉద్యోగాలు చేసుకుంటున్న దేశాలకు వెళ్లిరావడం, చైనాతో నిష్కర్షగా వ్యవహరించడం, జన్‌ధన్ ఖాతాలు, మరింత మెరుగైన పంటల బీమా అందులో కొన్ని. కానీ మోదీ అత్యాశకు పోయారు. ఏదో ఒకటి చేసి ప్రతిపక్షాన్ని వెనక్కినెట్టి, 2019 ఎన్నికలలో మళ్లీ తానే గెలవాలని ఆయన కోరిక. పైగా పార్లమెంట్‌కు బొత్తిగా కొత్త. అందుకే మన గొప్ప రాజకీయ వేత్తలు పీవీ, వాజ్‌పేయి, శరద్‌పవార్‌ల మాదిరిగా విమర్శను తట్టుకునే తత్వం లేదు. ఇది కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. చూడబోతే ఇందిరాగాంధీ లక్షణాలు మోదీలో చాలా ఉన్నట్టనిపిస్తుంది. నోట్ల రద్దు పథకం మొదటి దశ కూడా ముగిసింది. రద్దు అమలులోకి వచ్చిన తొలిరోజు నుంచి ప్రజలు పడిన పాట్లు వర్ణనాతీతం. ఆయన అనుకున్నదొకటి, అయినదొకటి అయింది. దీనితో ఆయన మండిపడుతున్నారు. మోదీ మధ్య తరగతి, స్వయం ఉపాధి వృత్తి నిపుణులు, విద్యావం తులైన యువత ఓట్లతో పదవిలోకి వచ్చారు. ఆర్థిక అవకాశాలు మెరుగు పడతాయని ఈ ఓటర్లందరి ఆశ. కానీ ఇప్పుడు మోదీ సరిగ్గా ఈ వర్గాల వారినే వేధిస్తున్నారు. డిసెంబర్ 30 వరకు ఆయన మౌనం పాటించడం మంచిది. అలాగే మేధావుల నుంచి లభిస్తున్న గట్టి మద్దతు కూడా కోల్పోతు న్నారు. ఇలాంటివారు మోదీ నుంచి పెద్దగా ఆశించిందేమీ లేదు గానీ, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు అంతమైతే చాలునని భావించినవారే. మోదీ మద్దతుదారులుగా ముద్ర పడిన మధు కిష్వార్, తవ్లీన్‌సింగ్ వంటి వారు కూడా గడచిన కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేయడం కనిపిస్తున్నది. వీరు కూడా డిసెంబర్ 30 కోసం వేచి చూస్తు్తన్నారు. ఇందిరను మరిపిస్తున్న మోదీ బంగారం మీద నియంత్రణ పెట్టాలని గతంలో కూడా పలువురు ఆర్థిక మంత్రులు ప్రయత్నించిన సంగతిని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విస్మరి స్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో పైకి కనిపిస్తున్న బంగారం 20,000 టన్నులు. ఇక రహస్యంగా ఉన్న పసిడి ఎన్ని టన్నులో తెలియదు. దీని గురించి ఎవరూ ఏమీ చేయలేరు. బంగారం గురించి ప్రభుత్వం ప్రజలను హెచ్చరించడం మానేస్తే మంచిది. నవంబర్ 8తో తానొక హీరోగా అవత రించానని మోదీ భావన. కానీ ఇప్పుడు ఆయన డిసెంబర్ 30 నాటి పతాక సన్నివేశం ఎలా ఉంటుందో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి తోడు ఇప్పటికీ సరిహద్దులలో భారత సైనికులను ఉగ్రవాదులు చంపుతూనే ఉన్నందున సర్జికల్ దాడులు విఫలమైనాయని చాలామంది భావన. వీటన్నిటితో మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నోట్ల రద్దు తరువాత నల్లధనానికి కొమ్ము కాస్తున్నారంటూ మోదీ బీజేపీయేతర నాయకులను పార్లమెంట్ బయట దుమ్మెత్తి పోసి వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఇలా విపక్షాల మీద ధ్వజమెత్తిన ప్రధాని ఒక్క ఇందిర మాత్రమేనని చెప్పుకోవచ్చు. మోదీకి అధికారులు తప్పుడు సలహా ఇచ్చారు. ఒక్క వారంలోనే సమస్యకు సమాధానం చెప్పడానికి కావలసిన సొమ్ము ఉందని తప్పుతోవ పట్టించారు. కానీ మోదీ ప్రభుత్వం చేసిన తప్పు ఎంత పెద్దదో దేశమంతా ఇప్పటికే గమనించింది. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన బీజేపీ నేతలు ప్రభుత్వ విధానాలతో ఏకీభవించనివారిని తూర్పార పడు తున్నారు. ఇది బీజేపీ ప్రతిష్టకీ, రాజకీయాలకీ మంచిది కాదు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రఖ్యాత ఆర్థికవేత్తలు నోట్ల రద్దు వ్యవహారం మీద పెదవి విరుస్తున్నారు. కానీ పరిస్థితులను చక్కబరచడానికి బదులు మోదీ మండిపాటును ప్రదర్శిస్తున్నారు. ప్రజలలో అంతగా పట్టులేని పీయూష్ గోయెల్ వంటివారే వెన్నుదన్నుగా ఉన్నారు. బీజేపీ సీనియర్లలో ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. వీరు కూడా డిసెంబర్ 30 పరిణామాల కోసమే వేచి చూస్తున్నారు. అంటే మోదీ విపక్షంతో బాహాటంగాను, స్వపక్షంతో గుంభనం గాను పోరాడుతున్నారు. రద్దు నిర్ణయం ఆర్థికమంత్రి జైట్లీకి కూడా నవంబర్ 8 మధ్యాహ్నం రెండు గంటలకు మాత్రమే చెప్పారు. ఇదంతా చూస్తే అతి విశ్వాసంతో, ఆఖరికి తండ్రికి కూడా తెలియకుండా శత్రు సమూహాల మధ్యకు చొచ్చుకుపోయిన అభిమన్యుడి చర్యను గుర్తుకు తెస్తున్నది. నవ భారతం ఆవిష్కృతమయ్యేనా? డిసెంబర్ 30 నాటికి బ్యాంకులలో పూర్తిస్థాయిలో ధనం జమ కాదని మోదీ తలిచారు. అది తప్పని తేలడంతో నగదు రహితం పాట అందుకున్నారు. డిసెంబర్ 30 నాటికి నవ భారతం ఆవిష్కృతమవుతుందని ఆర్భాటంగా ప్రక టించారు. కానీ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులలోకి ప్రయాణిస్తున్నది. కోట్లాది ఉద్యోగాలు పోయాయి. వ్యవసాయం, రిటైల్ రంగాలలో ఉద్యోగావకాశాలు హరించుకుపోయాయి. వర్తక వాణిజ్యాలు తగ్గుముఖం పట్టాయి. జన్‌ధన్ ఖాతాలలో పెద్ద ఎత్తున ధనం జమ చేస్తారని అంతా భావించారు. ఆ చర్యతో పేదలను తృప్తి పరచగలనని మోదీ కూడా భావించారు. ఈ విష యంలో ఆయన అచ్చం ఇందిరాగాంధీలాగే మాట్లాడారు. అయితే జన్‌ధన్ ఖాతాలలో ఏమీ జమ చేయలేరన్న విషయం ఇప్పుడు ఆ ఆశ పెట్టు కున్నవారిని తీవ్ర నిస్పృహకు గురి చేస్తున్నది. నల్లధనంపై ఇతర మార్గాల ద్వారా కూడా వేట సాగిస్తామని మోదీ చెప్పారు. అంటే రియల్ ఎస్టేట్, అవినీతి ఉద్యోగుల భరతం పడతారని అంతా ఆశించారు. కొందరు నిజా యితీ కలిగిన అధికారులు ఉన్నమాట కాదనలేం. కానీ అవినీతి పరుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బు పోగుపడింది. ఇప్పుడు వీరిని కూడా ఏమీ చేయలేని పరి స్థితి. ఎందుకంటే వీరి నల్లధనం ఏనాడో ఇతర రూపాలలోకి మారిపోయింది. మోదీ చెప్పినట్టు డిసెంబర్ 30 నాటికి పరిస్థితులు మెరుగు పడకుంటే స్వపక్షం నుంచే ఆయన బెడదను ఎదుర్కొనకతప్పదు. దీని కోసమే సీని యర్లు కొందరు ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోకుంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో పార్టీకి ఎదురుదెబ్బ తప్పదు. దీనితో మోదీ వ్యతిరేక ప్రచారం ఊపందుకుంటుంది. నోట్ల రద్దు విఫలమైతే, నెపాన్ని ఇతరుల మీదకి నెట్టే అవకాశం కూడా మోదీకి లేదు. ఇదంతా తన స్వకపోల కల్పితమనీ, రహస్యంగా జరిగిందనీ ఇప్పటికే చెప్పారు. అదే ఆయన మెడకు గుదిబండగా పరిణమించింది. మోదీ ఆత్మ స్థయిర్యం కోల్పోయిన సంగతి హావభావాలలో, కదలికలలో స్పష్టమవుతున్నది కూడా. సంపూర్ణాధికారం కాదు ప్రజలు ఒక ప్రధానిని లేదా ముఖ్యమంత్రిని ఐదేళ్ల కోసం ఎన్నుకున్నారంటే దానర్థం, ఆ కాలంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించవచ్చునని కాదు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతిపక్షాలు వ్యతిరేకించి ఉండవచ్చు. అయితే విపక్షం కూడా మౌనం దాల్చింది. ఒకవేళ నోట్ల రద్దును విమర్శిస్తే ప్రజలు నల్లధనానికి మద్దతు ఇస్తున్నవారిగా భావిస్తారేమోనని వారి బెంగ. హాస్యాస్పదమైన మరో సంగతి–ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ఎదుట ఆనం దంగానే నిలబడుతున్నారనీ, ఈ చర్య పట్ల ఆగ్రహంగా లేరని ప్రభుత్వం చెబుతోంది. ఒకటి వాస్తవం–తాము ఆగ్రహిస్తే పోలీసులు వచ్చి లాక్కుపోతా రనీ, అంతకంటే డబ్బు చేతికి వచ్చేదాకా సహనంతో ఉండడమే మంచిదని ప్రజలు భావిస్తున్నారు. మోదీ ప్రహసనం గురించి ఎంతైనా రాయవచ్చు. కానీ ఆరోగ్యకరమైన ఒక దేశాన్ని, ఎలాంటి రోగ లక్షణం లేకుండా హఠాత్తుగా ఐసీయూ పాల్జేశారు. దేవుడా; రక్షించు నాదేశాన్ని. - పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈ–మెయిల్ : drppullarao@yahoo.co.in -
'పోలవరం నిర్వాసితులు ఆశ్రయిస్తే పరిశీలన'
న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిర్వాసితులకు నూతన భూసేకరణ చట్టం అమలు చేయాలంటూ సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు సుప్రీంకోర్టులో పిటిషిన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాగా, పోలవరం నిర్వాసితులు ఎవరైనా తమను ఆశ్రయిస్తే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
‘చల్లారిన’ చమురు.. కాలుతున్న కలలు
చమురు ధరల తగ్గుదలతో గత ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం తగ్గింది. కానీ చమురు ధరలు మరీ పడిపోయి ప్రపంచ స్థాయిమాంద్య సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులతో మోదీ దేశాన్ని ఎగుమతుల కేంద్రం చేయాలనుకున్నారు. కానీ నేటి పరిస్థితుల్లో విదేశీయు లెవరూ మన దేశానికి పరుగులు తీయడం లేదు. ఎగుమతుల కోసం ఉత్పత్తి చేసినా కొనేవారు లేరు. మారిన పరిస్థితులను బట్టి దేశ ఆర్థిక దిశను మార్చాలి. తక్కువ పన్నులు, సులభ రుణాల తో ప్రజలకు డబ్బు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేసి, దేశీయ గిరాకీని సృష్టించాలి. నరేంద్ర మోదీ మే 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి చమురు ధరలు ఇంచుమించు 115 డాలర్లుగా ఉండేవి. మన దేశం దాదాపు 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి చమురు ధర 60 డాలర్లకు పడిపోవడం ఇక్కడ పెద్ద సంబరమే అయింది. అయితే చమురు ధరల తగ్గుదల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేయడం ప్రారంభించింది. చము రు ధరల తగ్గుదలతో మన దేశం కూడా ప్రపంచంలాగే ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక కడుపు నొప్పితో బాధపడుతోంది. చైనా, జపాన్. యూరప్‌ల ఆర్థిక వ్యవస్థలు మందగించి, చమురు వినియోగాన్ని తగ్గించాయి. భారీ చమురు దిగుమతి దారుగా ఉండే అమెరికా సొంత ఉత్పత్తి పెంచుకొని, చమురు దిగుమతులు మానేసింది. సరఫరా పెరిగి ధరలు తగ్గినా, గిరాకీ తగ్గి ధరలు తగ్గినా ఆర్థిక తిరో గమనం (రిసెషన్) ఏర్పడుతుంది. చమురు ఉత్పత్తి పెరుగుదలతో అమెరికా వృద్ధి చెందడం ప్రారంభమైంది. మరోవంక చైనా, జపాన్, యూరప్‌ల ఆర్థిక వ్యవస్థలు మందగించడంతో చమురు గిరాకీ పడిపోయింది. సాధారణంగా చమురు ధరలు పడిపోయినప్పుడల్లా సౌదీ అరేబియా నేతృత్వంలోని చమురు ఎగుమతి దేశాలు (ఒపెక్) ఉత్పత్తి తగ్గించడం, దాంతో ధరలు వాటికవే పెర గడం పరిపాటి. కానీ ఈసారి ధరలు పడిపోయినా సౌదీ, తదితర దేశాలు ఉత్ప త్తి తగ్గించరాదని నిర్ణయించాయి. సౌదీ, అమెరికాలు తమకు సమస్యాత్మకంగా ఉన్న రష్యా, ఇరాన్‌ల ఆర్థిక వ్యవస్థలను దె బ్బ తీయాలని కోరుకుంటున్నాయి. రష్యా. ఇరాన్‌లు రెండూ మొత్తంగా తమ బడ్జెట్ల నిధుల కోసం చమురు ఎగు మతులపైనే పూర్తిగా ఆధారపడినవి. చమురు ధరల తగ్గుదల వల్ల గత ఆరు నెలలుగా మన దేశంలో ద్రవ్యోల్బణం తగ్గింది. ఆ ఖ్యాతి నరేంద్ర మోదీకి దక్కి, లబ్ధి పొందారు. కానీ ధరలు బాగా పడిపోవడంతో భారత్ దెబ్బతినిపోసా గింది. అంతర్జాతీయ స్థాయి ఆర్థిక మాంద్య సూచనలు కనిపిస్తుండటం వలన మోదీ ఆర్థిక ప్రణాళికలు ఘోరంగా విఫలమవుతాయో లేదో వేచి చూడాలి. చమురు ధరల తగ్గుదల ప్రభావం 1. గల్ఫ్, అరబ్బు దేశాలలో దాదాపు 70 లక్షల మంది భారతీయులు పనిచేస్తు న్నారు. లక్షలాదిగా వారు అక్కడ ఉపాధి కోల్పోతారు. 2. గల్ఫ్, అరబ్బు దేశాలు ఆహారం తదితర వస్తువులను భారత్ నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. అవి ఇక ఈ దిగుమతులను తగ్గిస్తాయి. దీంతో మన ప్రభుత్వ పన్నుల రాబడి పడి పోతుంది. రవాణా, పోర్టుల రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. 3. ఏటా భారత్, యూరప్‌ల మధ్య 8,000 కోట్ల డాలర్లకుపైగా వాణిజ్యం సాగుతోంది. మాంద్యం వల్ల యూరప్ మన దేశం నుండి దిగు మతులను తగ్గిస్తుంది. ఇక యూరప్ నుంచి అరబ్బు దేశాలకు ఎగుమతులు కూ డా తగ్గుతాయి. అది తిరిగి భారత్‌పై ప్రభావం చూపుతుంది. 4. భారత్‌కు భారీ గా విదేశీ పెట్టుబడులు అవసరం. ఆ దేశాల్లోని పరిస్థితే గడ్డుగా ఉంటే వారు మన దేశంలో పెట్టుబడులు పెట్టరు. భారీ విదేశీ పెట్టుబడులనే మోదీ కల, కల గానే మిగిలిపోవచ్చు. 5. మన అతి పెద్ద వ్యాపార భాగస్వామి చైనా కూడా వాణిజ్యం విషయంలో అరబ్బు దేశాలపైనా, యూరప్‌పైనా ఆధారపడి ఉంది. కాబట్టి చైనా వాణిజ్యం కూడా తగ్గుతుంది. దీంతో భారత్‌తో దాని వాణిజ్యం, పెట్టుబడులు కూడా క్షీణిస్తాయి. 6. మన మరో ముఖ్య వాణిజ్య భాగస్వామి జపాన్ వచ్చే ఐదేళ్లలో మన దేశంలో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులకు వాగ్దా నం చేసింది. కానీ గత నెలలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అది ఆర్థిక తిరోగమనంలో ఉందంటున్నారు. అదీ ఇక్కడ పెట్టుబడులు పెట్టలేదు. 7. ఇక అమెరికాలో తాత్కాలిక వీసాలతో పనిచేస్తున్న లక్షలాది భారతీయులు వందల కోట్ల డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు. ఇప్పటికైతే అమెరికా సంతుష్టితో ఉన్నా, చైనా, జపాన్, యూరప్‌లలోని గడ్డు పరిస్థితుల వల్ల దాని ఆర్థిక వ్యవస్థ కూడా పతనోన్ముఖం గాక తప్పదు. దాని సాఫ్ట్‌వేర్‌ను, విమానాలను కొనేదెవరు? అమెరికాపైనే ఆధారపడ్డ మన సాఫ్ట్వేర్ పరిశ్రమ ఏం కావాలి? మోదీ కల కుప్పకూలుతోందా? చమురు ధరల హఠాత్ పతనంతో స్టాక్ మార్కెట్లు పతనం చెంది, బ్యాంకులు ఆందోళన చెందడం మొదలైంది. అయితే మోదీ దేశ ఆర్థిక వృద్ధికి విదేశీ పెట్టు బడులు, విదేశీ మార్కెట్లపైనా ఆధారపడ్డారు. దేశం ఎగుమతుల కేంద్రం కాగల దని విశ్వసిస్తున్నారు. కానీ మన వస్తువులను కొనేవారు లేకపోతే ఎలా? చము రు ధరల పతనం వల్ల తొలుత మన దేశానికి కొంత లబ్ధి కలిగినా, అది మన కస్టమర్లను దెబ్బతీసింది. అయితే ఏ సమస్యకైనా పరిష్కారాలుంటాయి. మోదీ ఎలాంటి ఆర్థిక నిర్వహణను అందించగలుగుతారనే దానిపైనే అది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఈ మాంద్యం సవాలును ఎదుర్కొనలేకపోతే ఆయన ప్రణాళికలన్నీ కుప్పకూలుతాయి. 11 కోట్ల మంది నిరుద్యోగులు మోదీ ఉద్యో గాలు సృష్టిస్తారని ఆశలు పెట్టుకున్నారు. గత ఆరు నెలల కాలంలో అనుమతులు, మంచి పరిపాలన కారణంగా ఉపాధి రంగంలో కొంత మెరుగుదల ఉంది. కానీ ఇది ఆగిపోవచ్చు. ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవాలంటే? ఇటీవల రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ విధానం దేశీయ మార్కెట్‌పై ఆధారపడితేనే విజయవంతం కాగలదన్నారు. ఎగుమతి మార్కెట్లు లేకపోతే తయారైన వస్తువు లు ఎక్కడకు పోవాలి? ఎగుమతి చేయలేనప్పుడు అసలు ఎందుకు ఉత్పత్తి చేయాలి అన్నారు. కాబట్టి ప్రభుత్వం దేశీయ గిరాకీని పెంచడంపై కేంద్రీకరించి తీరాలి, ఎగుమతులపై ఆధారపడరాదు. వాస్తవానికి ప్రపంచ మార్కెట్ కుప్ప కూలినప్పటి నుండే ప్రభుత్వం దేశీయ వస్తువులను కొనగలిగే విధంగా ప్రజల వద్ద మరింత డబ్బు ఉండేలా చూడాల్సింది. మారిన వాతావరణానికి అను గుణంగా మోదీ ప్రభుత్వ దిశను పూర్తిగా మార్చాల్సి ఉంది. చమురు సంక్షోభం అంటేనే ఆయన ప్రణాళికలన్నీ వృథా అయ్యాయని అర్థం. విదేశీయులెవరూ ఇక్కడకు పరుగెత్తుకు రావడం లేదు. రాజకీయ కారణాలతో మోదీ ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ఇంకా వేచి చూసే సమయం లేదు. దేశీయ గిరాకీని పెంచడమే మార్గం 1. ప్రభుత్వం ఏటా రూ. 1.5 లక్షల కోట్లు సర్వీసు ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తోంది. మన్మోహన్ హయాంలో ఈ పన్ను మాంద్యానికి కారణమైంది. కాబట్టి ప్రభుత్వం సర్వీసు ట్యాక్స్ వంటి పన్నులను తగ్గించి తీరాలి. 2. తిరిగి రప్పించలేని నల్ల ధనానికి ‘‘పన్ను క్షమాభిక్ష పథకం’’ ప్రవేశపెట్టడం ఉత్తమం. దీంతో భారీగా డబ్బు బయటకు వచ్చి దేశీయ గిరాకీని సృష్టిస్తుంది. ఆర్థిక వ్యవస్థను, మోదీని కాపాడుతుంది. 3. సాహసోపేతమైన దృష్టితో మోదీ పన్నుల సంస్కరణలను చేపట్టి, సంతోషంగా పన్నులను చెల్లించేలా వాటిని తగ్గించాలి. అప్పుడిక ఎవరూ డబ్బును విదేశాలకు తరలించాలనుకోరు. 4. ద్రవ్యోల్బణం దిగి వచ్చింది ఉత్పాదకత పెరగడం వల్లనో లేక మెరుగైన ద్రవ్య నిర్వహణ వల్లనో కాదు. సున్నా ద్రవ్యోల్బణం ఉండటం నేడు మనకు శుభ సూచకం కాదు. ఆర్బీఐ ఆర్థిక వ్యవస్థలోకి మరింత డబ్బును, రుణాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేకపోతే, తక్షణం ప్రభుత్వమే ఆ పనిచేయాలి. 5. అమెరికా 2008 ఆర్థిక మాంద్యానికి పరిష్కారంగా దివాలా తీయబోతున్న పెద్ద బ్యాంకులు, భారీ కార్ల కంపెనీలలో మునుపెన్నడూ ఎరుగని తీరున పెట్టుబడులు పెట్టింది. తక్కువ వడ్డీ రేట్లతో బ్యాంకుల ద్వారా కూడా డబ్బును అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర బ్యాంకు డబ్బు సరఫరాను సడలించింది. ప్రభుత్వం దేశీయ పన్నులను, రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది అలా మరింత డబ్బును ప్రవేశపెట్టడం ద్వారానే అది మాంద్యం నుండి గట్టెక్కింది. పగటి కలలు మానండి అమెరికా తన విధానాన్ని మార్చుకొని డబ్బు లభ్యతను తగ్గిస్తుందని ఆశించారు. కానీ అది కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ఈ హఠాత్ మాంద్యాన్ని చూసి భవిష్యత్తులో కూడా ఇదే సరళ ద్రవ్య విధానం కొనసాగుతుందని రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఇది మోదీ అర్థంచేసుకోవాల్సిన సందేశం. తక్కువ పన్నులు, సులభ రుణాల ద్వారా దేశ ప్రజలకు డబ్బు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేసి దేశీయ గిరాకీని సృష్టించాలి, ఏ తప్పు చేయకున్నా స్పైస్‌జెట్ సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం దాన్ని రక్షించకపోతే, మోదీ విఫలమవుతారనడానికి అది సంకేతం అవుతుంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల విచిత్ర స్వప్నాలు కూడా భగ్నం కావచ్చు. సింగపూర్, మలేసియాలను సృష్టించాలన్న వారి కలలు నైజీరియా లేదా ఆఫ్రికాలను సృష్టించే భయానకమైన పీడకలలుగా మారవచ్చు. మాంద్యం ఎక్కడికి దారి తీస్తుందో ఎవరూ చెప్పలేరు. చంద్రబాబు, కేసీఆర్‌లు తమ సింగపూర్, కౌలాలంపూర్ కలలను వాయిదా వేసుకోవడం మేలు. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) -
పదునెక్కిన మన దౌత్యనీతి
విశ్లేషణ ప్రధాని నరేంద్రమోదీ తరచుగా సాగిస్తున్న విదేశీ పర్యటనలపై ప్రత్యర్థుల దాడి చేయడం మొదలైంది. బీజేపీ ఒకప్పుడు రాజీవ్‌గాంధీని కూడా ఇలాగే విమర్శించింది. ప్రధాని అంటే ముఖ్యమంత్రో లేక జిల్లా పరిషత్ చైర్మనో కాదు. దేశ రక్షణ, భద్రత, ఆర్థిక సుస్థిరతలను కాపాడటం కేంద్ర ప్రభుత్వ ప్రధాన కర్త వ్యం. ఉత్కృష్ట దౌత్య నీతితోనే వాటికి భరోసా కలుగుతుంది. మే 26న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 15న భూటాన్‌కు, జూలైలో బ్రెజి ల్కు, ఆగస్టులో నేపాల్‌కు, సెప్టెంబర్‌లో జపాన్‌కు వెళ్లారు. అదే నెలలో ఆయన అమెరికాలో పర్యటించి, అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకున్నారు. నవంబర్‌లో బర్మా, ఆస్ట్రేలియాలను సందర్శించారు. తిరిగి వస్తూ ఫిజీకి వెళ్లా రు. అక్కడి జనాభాలో సగం భారతీయ సంతతికి చెందినవారే. 30 ఏళ్లుగా ఏ భారత ప్రధానీ ఆస్ట్రేలియా, ఫిజీలకు వెళ్లలేదు. గత ఆరు నెలల్లో మోదీ ప్రపం చంలోని 46 దేశాల నేతలను కలుసుకున్నారు. మన దేశం ఇద్దరు బద్ధ శత్రువుల తో కూడిన అత్యంత స్నేహరహితమైన వాతావరణంలో ప్రాంతంలో ఉంది. మన భూభాగాన్ని కోరుతున్న చైనా, పాకిస్తాన్లతో మనకున్న సమస్యలను పరిష్కరించుకోవడం కష్టం. అవే దౌత్య రంగంలో మనం ఎదుర్కొంటున్న రెం డు ప్రధాన సమస్యలు. అందువల్లే మన బడ్జెట్లో చాలా పెద్ద భాగాన్ని రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల శాఖలకే కేటాయించాల్సి వస్తోంది. ఇక నేపాల్, బర్మా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో మనకు పెద్దగా సమస్యలేమీ లేవు. 1962 నుండి చైనా-పాక్ మైత్రి దృఢంగా ఉంది. భారత్‌తో మంద్ర స్థాయి యుద్ధాన్ని కొనసాగించేలా పాక్‌ను అది ప్రోత్సహిస్తోంది. పాక్ తన ఆక్రమ ణలోని కశ్మీర్ భూభాగాన్ని చైనాకు అప్పగించినంత పని చేసింది. బదులుగా చైనా దానికి అణు సాంకేతికతను కానుకగా ఇచ్చింది. వాస్తవానికి భారత వ్యతిరేకత కలిగిన దేశాలు నేడు మన దేశాన్ని చట్టుముట్టేసి ఉన్నాయి. ‘‘భారత విదేశాంగ విధానం అత్యంత దుర్బలమైనది. అదే దాని అతి పెద్ద శత్రువు’’ అని ‘ఫారిన్ ఎఫైర్స్’అనే ప్రముఖ పత్రిక 2013లో రాసింది. చలనశీల దౌత్య నీతి మన శత్రువులు సైతం ఆందోళనకు, ఉద్విగ్నతకు గురై సతమతమవుతుండేలా చేసే చలనశీలమైన విదేశాంగ విధానం మనకిప్పుడు అవసరం. భారత దౌత్యాన్ని ఎదుర్కొనే పోరులో చైనా, పాక్‌లు తమ సమయాన్ని, వనరులను వృథా చేసుకోవాలి. 1959లో టిబెట్ మత గురువు దలైలామాకు ఆశ్రయమి చ్చినందుకు చైనా ఎన్నటికీ భారత్‌ను క్షమించలేదు. భారత్‌లో కూడా ఎన్నటికీ సుస్థిరత నెలకొనకుండా చేయాలని అది భావిస్తోంది. మనం మన ఆర్థిక వ్యవస్థపై దృష్టిని కేంద్రీకరించడాన్ని చైనా, పాక్‌లు ఎన్నడూ సహించలేవు. వాటిని ఎదుర్కోవడానికి భారత్‌కు ఉన్న ఏకైక మార్గం దౌత్యం. మోదీ చేస్తున్నది అదే. విదేశీ నేతలను కలుసుకోవడం ద్వారా ఆయన చైనా, పాక్‌లలో ఆందోళనను రేకెత్తిస్తున్నారు. మోదీ ఫిజీ వెళ్లి వచ్చిన నాలుగు రోజులకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా అక్కడకు వె ళ్లి వచ్చారు! 1. మోదీ జపాన్ పర్యటన చైనా శత్రువులతో భారత్ చెయ్యి కలుపుతోం దనే సందేశం చైనాకు చేరింది. ఆయన భూటాన్‌కు వెళ్లటంతో... చైనా ఆ దేశానికి దూరంగా ఉండాలనే సందేశం దానికి చేరింది. భారత్-నేపాల్ పాత ఒప్పందాన్ని సమీక్షిస్తామని, అన్ని విషయాల్లోనూ దానికి శాయశక్తులా సహకరిస్తామని నేపాల్ పర్యటనలో మోదీ హామీనిచ్చారు. నేపాల్‌ను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న చైనా, పాక్‌లు రెండిటికీ అది కలవరపాటును కలిగించింది. 2. చైనా రెండు దశాబ్దాలుగా మైన్మార్ సహజ వనరులను దోచుకుంటోంది. మోదీ పర్యటనతో చైనా ఇకపై పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది, మైన్మార్ వనరులకు అది అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. 3. బంగ్లాదేశ్‌తో భౌగోళిక సరిహద్దు ఒప్పందం కుదుర్చుకోడానికి మోదీ ప్రయత్ని స్తున్నారు. భూభూగాల పరస్పర మార్పిడి ద్వారా భారత్ కంటే బంగ్లాదేశ్‌కు 6 వేల ఎకరాల భూమి ఎక్కువగా లభిస్తుంది. అయితే దీనివల్ల బంగ్లాదేశ్ కు భారత్‌పై విశ్వాసం ఏర్పడుతుంది. 4. హార్వార్డ్ ప్రొఫెసర్ జోసెఫ్ న్యే ‘‘సున్నిత శక్తి’’ని ‘‘సంస్కృతి, విలువలు, విదేశాంగ విధానం తదితరాలతో నీకు కావా ల్సిందాన్ని బలవంత పెట్టడం లేదా మూల్యం చెల్లించడం ద్వారా గాక ఆకర్షణ తో సంపాదించుకోగలిగే సామర్థ్యం’’గా నిర్వచించారు. న్యూయార్క్‌లో18,000 మంది, ఆస్ట్రేలియాలో 15,000 మంది మోదీ ప్రసంగానికి వచ్చారంటే అందుకు కారణం ఆయన భారత్‌ను ‘‘సున్నిత శక్తి’’గా ఆవిష్కరించడమే. 5. అక్కడ సరిహద్దుల్లో చైనా సేనలు మన పోస్టులపై దాడులు చేస్తుండగా ఇక్కడ మోదీ చైనా అధ్యక్షునికి, ఆయన సతీమణికి ఆతిథ్యం ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. కానీ జీ సతీమణి కూర్చున్న ఉయ్యాలను మోదీ గౌరవపూర్వకంగా ఊపుతున్న ఫొటో చైనా సోషల్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందింది. హావభావాలకు, మర్యాదామన్ననలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే కన్ఫ్యూషి యన్ బోధనలకు 2,500 ఏళ్ల తర్వాత ఇప్పుడు చైనాలో ఆదరణ లభిస్తోంది. 6. మోదీ ప్రభుత్వంతో వ్యవహరించడమంటే తేలికేమీ కాదనే సందేశం పాక్‌కు చేరింది. భారత్ తన మెత్తటి శక్త్తిని, ఆర్థిక శక్తిని ప్రయోగించి పాక్ ప్రతిష్టను క్షీణంపజేయగలదు. మోదీ అదే చేశారు. ఈ ఏడాది భారత రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నానని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించగా.... దారిలో పాక్‌లో ఆగాలని నవాజ్ షరీఫ్ కోరారు. పాక్‌లో పరిస్థితిని మెరుగుపరచినప్పుడు ఆగుతానని ఒబామా చెప్పారు. ఇది పాక్‌కు పెద్ద ఎదురు దెబ్బ. భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టలేమనే సందేశం. 7. అమెరికా పర్యటనలో మోదీ... ఆఫ్రికా నేతలు తప్ప మరే విదేశీ నేతలు సందర్శించని మార్టిన్ లూథర్ కింగ్ స్మారక స్థలిని సందర్శించారు. దౌత్య సంప్రదాయాలను విడనాడి ఒబామా ఆయనతో పాటూ వెళ్లారు! పైగా ఒబామా తమ వలస విధానాన్ని మార్చారు. దీంతో అమెరికాలోని లక్షలాదిమంది భారతీయులకు మేలు జరుగుతుంది. 8. మోదీ జపాన్ పర్యటనే చైనాకు ఒక సందేశం. అది జపాన్‌తో భారత్ అనుబంధం పట్ల చైనా తీవ్రంగా ఆందోళన చెందేట్టు చేసింది. జాతీయ ప్రయోజనాలకు పట్టం గట్టాలి ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర ఆసియా దేశా లు చైనా ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా ఒక్కటి కావాలని ప్రయత్నిస్తున్నాయి. అడుగడుగునా భారత్‌కు శత్రువుగా నిలుస్తున్న చైనాను ఎదుర్కోవడానికి మోదీ ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లను సందర్శించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ను ప్రోత్సహించే విధానాన్ని చైనా కొనసాగిస్తే భారత్ చైనా శత్రువులతో చేతులు కలుపుతుందనే సందేశాన్ని తద్వారా ఆయన పంపారు. భారత్ చడీచప్పుడు లేకుండా ‘‘చైనాను కట్టడి చేసే’’ విధానానికి మద్దతు పలుకుతోంది. అఫ్ఘానిస్థాన్‌లో తమ సేనలను 2015 వరకు ఉంచుతామని అమెరికా ప్రకటించడం భారత్ సాధించిన ఒక ప్రధాన విజయం. మోదీ ఒబామాను కలుసుకున్న తర్వాతే ఈ విధాన ప్రకటన వెలువడింది. అమెరికా సేనల ఉనికి అఫ్ఘాన్‌లోని తాలిబన్, పాక్ ఆధారిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతా న్నంతా బలోపేతం చేస్తుంది. మహాభారతంలో కౌరవులు పాండవులు తమలో తాము ఎప్పుడూ కలహించినా ‘‘మాలో మేము కలహిస్తామేమోగానీ బయటి వారికి మాత్రం మేం 105 మందిమే’’ అని చెప్పేవారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా అలాగే జాతీయ ప్రయోజనాలను సంకుచిత రాజకీయాలకు అతీతంగా నిలపాలి. నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత, దాదాపు 30 ఏళ్ల అంతరాయం తర్వాత విదేశీ వ్యవహారాలకు ప్రాధాన్యం లభిస్తోంది. అయితే మోదీ విదేశాంగ మంత్రి, తదితరులను చురుగ్గా విదేశాంగ వ్యవహారాల్లో పాల్గొననివ్వాలి. లేక పోతే మోదీయే విదేశాంగ విధానంగా మారిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనా ‘‘ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగిన’’ చందంగా వ చ్చే చిల్లర మల్లర విమర్శలను పట్టించుకోక మోదీ విదేశీ సంబంధాలపై దృష్టిని కేంద్రీకరించాలి. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) -
మోదీ వ్యతిరేక ఫ్రంట్ కలేనా?
బీహార్‌లో ఆగర్భ శత్రువులైన లాలూ, నితీష్‌లు ఒక్కటి కావడం ఓ అద్భుతంలా జరిగింది. బీహార్‌లో లాగే దేశవ్యాప్తంగా బద్ధశత్రువులంతా ఒక్కటి ఎందుకు కారాదు? అని కాంగ్రెస్ యోచన. కాగితం మీద చూస్తే ఇది అత్యంత ఆచరణ సాధ్యమైన ఆలోచనే. ప్రజలు ఓట్లు వేసేది పార్టీలకే తప్ప వ్యక్తులకు కాకపోవడమే పెద్ద సమస్య. ప్రజలు గొర్రెలేమీ కారు, కాపరి వెంటే పోవడానికి. ఢిల్లీ సమావేశాల్లో కనే పగటి కలలతో కూటములను నిర్మించ లేరు. ఓటర్లు స్వతంత్రంగా ఆలోచిస్తారు. మోదీ విజయాలు సాధిస్తునంత సేపూ ‘‘శత్రువుల కూటమి’’ బీజేపీకి హాని కలుగజేయలేకపోవచ్చు. కాంగ్రెస్ ప్రస్తుతం దిగ్భ్రాంతికి గురై ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో 543 స్థానాలకుగానూ అది 44 మాత్రమే దక్కించుకోగలిగింది. ఆ తదుపరి శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నడూ అధికారం నెరపి ఎరుగని మహారాష్ట్ర, హర్యానా లలో అది దానికి అధికారాన్ని అప్పగించాల్సి వచ్చింది. గత 150 రోజుల్లో నరేంద్రమోదీ ఏ పని తలపెట్టినా సఫలమవుతోంది. విదేశీ పర్యటనల్లో ఆయన ఘన విజయాలు సాధించారు. దేవతులు సైతం కరుణించినట్టున్నారు. చమురు ధరలు గత 150 రోజుల్లో 25% పడిపోయాయి. అది ద్రవ్యోల్బణం నియంత్రణ కు తోడ్పడింది. అర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. బీహార్‌లో ఆగర్భ శత్రువులైన లాలూ ప్రసాద్‌యాదవ్, నితీష్‌కుమార్‌లు చేయి కలిపి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఓ అద్భుతంలాగా జరిగింది. బీహార్‌లోలాగే దేశవ్యాప్తంగా బద్ధశత్రువులంతా ఒక్కటి ఎందుకు కారాదు? అని కాంగ్రెస్ భావిస్తోంది. అం తా కలిసి బీజేపీని నిరోధిస్తున్నట్టు కాంగ్రెస్, సోనియాగాంధీ కలలు కనడం ప్రారంభించారు. కాగితం మీద ఇది అత్యంత ఆచరణ సాధ్యమైన ఆలోచనే. బహుముఖ పోటీ వలన బీజేపీ 31% ఓట్లతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పర చింది. రాజకీయాల్లో కూడికలు, తీసివేతల లెక్కలు సాధారణంగా పని చేయవు. అయినాగానీ ‘‘శత్రువుల సంఘటన లేదా కూటమి’’ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఉబలాటం. నెహ్రూ 125వ జన్మదినం కొన్ని పార్టీలను పోగేసే అవకా శాన్ని కాంగ్రెస్‌కు కలిగించింది. బద్ధశత్రువులైన వామపక్షాలు, మమతా బెనర్జీ హాజరైన ఆ కార్యక్రమంలో పలు పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలన్నా యి. వాళ్లంతా ఒకరికొకరు శత్రువులే. కాబట్టి వాళ్లు ‘‘శత్రువుల కూటమి’’ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇది కాంగ్రెస్‌లో కొంత ఆశను రేకెత్తించింది. కానీ మాయావతి, ములాయంసింగ్ యాదవ్, నవీన్ పట్నాయక్‌లు, డీఎంకే, ఏఐఏడీఎంకే, తదితరులు హాజరు కాలేదు. అయినా ఆశ పెట్టుకోవడంలో తప్పే మీ లేదు. అలెగ్జాండర్ పోప్ అన్నట్టు ‘‘మానవ హృదయం నుండి ఆశ నిరంత రం ఉప్పొంగుతూనే ఉంటుంది.’’ మాయావతి, ములాయం, జయలలిత, కరుణానిధులకు బీజేపీ మిత్రపక్షమైన సీబీఐ అంటే భయమని మరవరాదు. అరెస్టు కావాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? అయినా కాంగ్రెస్ ‘‘శత్రువుల కూటమి’’ కల కంటూనే ఉంది. చేదు వాస్తవాలు కాంగ్రెస్ కలలను పగటి కలలుగా మార్చే కఠోర వాస్తవాలను విస్మరించలేం. 1. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాంచల్, ఢిల్లీలలోని 130 లోక్‌సభ స్థానాల్లో 120 బీజేపీ గెలుచుకుంది. వీటిలో దాదాపు (ఢిల్లీ మినహా) అన్నీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీ ల రాష్ట్రాలే. అలాంటి చోట ఫ్రంట్ దండగ. 2. ఎనభై లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లు గాక మరో రెండు పార్టీలున్నా చాలా చిక్కులున్నాయి. ములాయం ఎస్పీ, మాయావతి బీఎస్పీలు ఒక్కటి కావడం అసాధ్యం. అక్కడ బహుముఖ పోటీయే తప్ప బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యరిథని నిలపడం సాధ్యం కాదు. పైగా ముస్లిమేతరులలోని ఎస్పీ ఓటర్లు బీఎస్పీ కంటే బీజేపీనే కోరుకుంటారు. అలాగే బీఎస్పీ ఓటర్లు కూడానూ. మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు పోటీపడాలి. మోదీ ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్టపాలైపోతే తప్ప యూపీలో బీజేపీ మంచి ఫలితాలు సాధించలేకపో వడం అసాధ్యం. మైనారిటీలకు హామీని కల్పించేలా అది గట్టి కృషి చేస్తే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ విఫలమవుతుంది. బీహార్‌లో లాలూ, నితీష్ల కలయికే కాంగ్రెస్‌కు ఆశ. రేపు శాసనసభ ఎన్నికల్లో ఏమవుతుందో వేచి చూడాల్సిందే. ఇక తమిళనాడు, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికి నామమాత్రమే. అక్కడ పటిష్టమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. బీజేపీతో వైరం కొనితెచ్చుకోవాల్సిన అవసరం వాటికేముంది? ఏఐఏడీఎంకే, డీఎంకేలు అవసరమైనతే బీజేపీతో కలుస్తాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం ప్రధాన పార్టీలు. బీజేపీ బలపడుతోంది. అక్కడ కాంగ్రెస్‌తో కలిసి ఏ పార్టీ బావుకునేది ఏమీ లేదు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ బీజేడీ, బీజేపీలే ప్రధాన పార్టీలు. నెహ్రూ జయంతి కార్యక్రమానికి పట్నాయక్ హాజరుకాలేదు. పైగా రాజ్యసభలో బీజేపీకి మద్దతునిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా తృణ మూల్, వామపక్షాలు, బీజేపీ ప్రధానమైనవి. కాంగ్రెస్ ఎక్కడో నాలుగో స్థానం లో ఉంది. వామపక్షాలు, మమత కలిసి సెమినార్లకు హాజరవుతారే తప్ప ఎన్ని కల్లో మిత్రులు కానే కారు. అక్కడా బహుముఖ పోటీ తప్పదనే అనిపిస్తోంది, ‘‘శత్రువుల కూటమి’’కి అవకాశం లేదు. ఇక అస్సాం, కేరళ, కర్ణాటకల్లో కాంగ్రెస్ బలమైన పార్టీ. కాబట్టి దానికి మిత్రులతో పని లేదు. కేరళలో కాంగ్రెస్‌కు ఇప్పటికే ఓ కూటమి ఉంది. పైగా బీజేపీ అక్కడ బలంగానూ లేదు. మిగతా రెండు రాష్ట్రాల్లో బీజేపీ దానికి బలమైన ప్రత్యర్థి. కాబట్టి ఆ మూడు రాష్ట్రాల్లో పరిస్థితిలో పెద్ద మార్పేమీ ఉండబోదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నెల క్రితం వరకు బలమైనదే. కానీ అది దాని చేజారిపోయింది. ముందు ముందు శరద్‌పవార్ ఎన్సీపీ దానితో జతకూడే అవకాశం ఉంది. బీజేపీకి ప్రతికూల, అనుకూల పరిస్థితులు సుదూరంలోని 2019 ఎన్నికల నాటికి బీజేపీకి పలు ప్రతికూల పరిస్థితులు ఎదురుకావొచ్చు. ఓటు బ్యాంకులకు, కొన్ని కులాలకు, మతాలకు బీజేపీ మద్దతు పలకక పోవచ్చు. పైగా బీజేపీ కోట్ల ఉద్యోగాలను వాగ్దానం చేసింది. ఆర్థిక వ్యవస్థలో విజయాలను సాధిస్తేనే అది అది సాథ్యం. జ్యోతిష్కులు ఏం చెప్పినాగానీ భవిష్యత్తు ఏ మాత్రం ఊహింపశక్యం కానిదిగానే ఉంది. దుష్పరి పాలన వ ల్లనో, విదేశాల్లోని ఆర్థిక మాంద్యం వల్లనో మోదీ ప్రభుత్వం విఫలం కావొచ్చు. సరిహద్దుల్లో యుద్ధమే బద్ధలైతే భారీ వ్యయాల భారం దేశంపై పడు తుంది. చమురు ధరలు తిరిగి పెరిగి, ఆర్థిక వ్యవస్థను దిగజార్చవచ్చు. పెద్ద ఉగ్రవాద చర్య ఏదైనా జరిగితే మోదీ ప్రభుత్వం ప్రతిష్ట బాగా దెబ్బతింటుంది. మంత్రులు సైతం విఫలంకావచ్చు. కాంగ్రెస్‌లాగే బీజేపీకి, దాని ప్రభుత్వానికి ఆత్వవిశ్వాసం అతిశయించి, తలపొగరుతనం పెరిగితే దాని ప్రతిష్టకు దెబ్బత గలవచ్చు. అది జరగాలనే కాంగ్రెస్ ఆశపడుతోంది. బీజేపీ చాలా తప్పులు చేసి, స్వయం వినాశానాన్ని కొని తెచ్చుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు, లాలూ, నితీష్ తదితరులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. కానీ బీజేపీ పాక్షికంగా విజయవంతమైనా... కాంగ్రెస్, వామపక్షాలు తీవ్ర ఓటములను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా కాంగ్రెస్‌కు, వామపక్షాలకు కొంత ఆశ ఉన్న రాష్ట్రాలపైకే బీజేపీ తన గురిని ఎక్కుపెట్టింది. అదృష్టం కలిసొచ్చి ఏ యుద్ధాలూ రాకపోతే, చమురు ధరలు నిలకడగా ఉంటే...చాలా సాధించానని చె ప్పుకోడానికి బీజేపీకి అంతకు మించి మరేమీ అవసరం లేదు. చమరు ధరలు ఇలాగే నిలకడగా ఉంటే కోట్ల ఉద్యోగాలను సృష్టించవచ్చు. ఇప్పటికైతే కాంగ్రెస్‌కు తన బాధలను పంచుకునే భాగస్వాములు దొరక డం కష్టంగా ఉంది. ‘ఓటమి’ అనే ప్రమాదకరమైన అంటువ్యాధితో బాధపడు తోందని ప్రతి పార్టీకి తెలుసు. నెపోలియన్ అన్నట్టు ‘‘గెలుపునకు ఎందరో తల్లి దండ్రులు. ఓటమి మాత్రం అనాథ.’’ రామ్‌విలాస్ పశ్వాన్ ఎన్నికలకు నెల ముందు మోదీ వైపు గంతేసి మంత్రి అయిపోయారు. ఆయన్ను చూసి పలు వురు నేతలు అసూయ చెందుతున్నారు, ‘‘తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది’’ అన్నట్టు బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ప్రతిపక్ష కూటమి కోసం కాంగ్రెస్ ఎంత గొప్ప పథకాలైనా వేయవచ్చు. కానీ మోదీ పాక్షికంగా విజయ వంతమైనా ఆ కూటమిలో చేరేవారెవరూ ఉండరు. అసలు కూటమిలో ఓట్ల బద లాయింపు సాధారణంగా కాగితం మీద జరిగేది మాత్రమే. 2014లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి 39%, వామపక్షాలకు 30%, కాంగ్రెస్‌కు 10%, బీజేపీకి 17% ఓట్లు పోలయ్యాయి. మమత, కాంగ్రెస్, వామపక్షాలు కలిస్తే వారికి 75% ఓట్లు రావు. ఎందుకంటే ఆ ఓట్లు బదలాయింపు అయ్యేవి కావు. ప్రజలు ఓట్లు వేసేది పార్టీలకే తప్ప వ్యక్తులకు కాకపోవడమే పెద్ద సమస్య. ప్రజలు గొర్రెలేమీ కారు, కాపరి వెంటే పోవడానికి. 1994లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా బీఎస్పీ, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డాయి. సాంకేతికంగా ఆ కూటమి యూపీ శాససనభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాలి. కానీ కాంగ్రెస్ ఓటర్లు బీఎస్పీకి ఓటు చేయక పరాజయం పాలైంది. ఢిల్లీ సమావేశాల్లో కనే పగటి కలలతో కూటములను నిర్మించలేరు. ఓటర్లు స్వతంత్రంగా ఆలోచిస్తారు. మోదీ విజయాలు సాధిస్తునంత సేపూ ‘‘శత్రువుల కూటమి’’ బీజేపీకి హాని కలుగజేయలేకపోవచ్చు. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) -
ఈ ‘సమురాయ్’ దారెటు?
నరేంద్రమోడీ ప్రధాని కాగానే, దూకుడుతో కూడిన విదేశీ, రక్షణ విధానాన్ని ప్రారంభించగలరని భారతీయులకు నమ్మకం కలిగింది. వందరోజుల్లోనే మోడీ తన బుద్ధి కుశలతతో, సానుకూల విదేశీ విధానంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇన్నాళ్లుగా శత్రువైఖరితో ఉన్న కొన్ని దక్షిణాసియా దేశాలలో పర్యటించి అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. ఇలాంటి సంతోషకరమైన పరిణామాలు మరిన్ని కలుగుతాయనీ, కలగాలనీ ఆశిద్దాం. ప్రధాని నరేంద్రమోడీ జపాన్ సందర్శన దాదాపు ముగింపుకొస్తోంది. ఈ సందర్భంలో ఆయన ఆధ్వర్యంలోని రక్షణ రంగం గురించి మాట్లాడు తున్నప్పుడు జపనీయుల మహత్తర సమురాయ్ యుద్ధవీరుడి జ్ఞాపకాలు తలపు కొస్తున్నాయి. బహుశా చరిత్రలో ఇంతవరకు నమోదైన అతిగొప్ప యుద్ధవీరులు జపాన్‌కి చెందిన సమురాయ్లే. వీరు పురాతన గ్రీకు దేశంలోని స్పార్టన్‌లతో సమానులు. వీరి త్యాగం, శౌర్యం సాటిలేనివి. పలు హాలీవుడ్ సినిమాలకు వీరి శౌర్యం పునాదిగా నిలిచింది కూడా. అయితే, ఆధునిక కాలంలో దేశాలు శౌర్యం, ప్రతిష్ట సూత్రాలపై ఆధారపడి కార్యకలాపాలను సాగించలేవు. మోడీ సమురాయ్ కాలేరు. ప్రస్తుతం యుద్ధానికి వెళ్లకుండానే విదేశీ విధానాన్ని నిర్వహించే సూక్ష్మబుద్ధి కలిగిన రాజకీయ నేతలు అవసరం. విజయవంతమైన విదేశాంగ విధానం అంటే, యుద్ధం చేయకుండా తన లక్ష్యాలను దేశం సాధించడమని అర్థం. దౌత్యనీతిని నైపుణ్యంగా ఉపయోగించుకోవడం ద్వారా యుద్ధాన్ని తప్పించాలి. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినప్పుడు, ఆయన దూకుడుతో కూడిన విదేశీ, రక్షణ విధానాన్ని ప్రారంభించగలడని భారతీయులకు నమ్మకం కలిగింది. ఇరుగు పొరుగు దేశాల నుంచి ఉగ్రవాదాన్ని, బెదిరింపులను తాను సహించబోనని మోడీ కూడా ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు చెబుతూ వచ్చారు. మన దేశం అవమానాల పాలయిందని, దీన్ని బలహీన దేశంగా భావించారని ఆయన పదే పదే పేర్కొన్నారు. సరైన సన్నాహకాలు లేకుండా ఏ దేశంపైనయినా దాడి చేయవలసిందిగా ైసైన్యాన్ని ఆదేశించడం ప్రధానిగా మోడీకి కష్టమే కాగలదు. దాడిని ప్రారంభించడం సులభమే. కాని దానికి ఒక నిష్ర్కమణ మార్గం కూడా ఉండాలి. అందుకే, మోడీ ప్రధాని అయ్యాక చేతలను పరిమితం చేసుకోవడం అనే కష్టభూయిష్టమైన లక్ష్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అదే సమయంలో బలమైన ప్రభుత్వంపై తానిచ్చిన హామీని అమలు చేయడంపై కలవరపడ్డారు కూడా. బలమైన ప్రభుత్వం అంటే పొరుగు దేశాల శత్రుచర్యలను తిప్పికొట్టడమేనని అర్థం. కానీ నిజజీవితంలో ఇలా చేయడం చాలా కష్టం. రక్షణ, విదేశీ విధాన సమస్యలు చైనా, పాకిస్థాన్ రెండింటితో భారతదేశానికి విదేశాంగ విధానంలో, రక్షణ రంగంలో తీవ్రమైన సమస్య ఉంటోంది. ఇలా ఒక పెద్ద దేశానికి రెండు పొరుగు దేశాలతో శత్రుత్వం ఉండటం అరుదు. గత 60 ఏళ్లుగా చైనా, పాకిస్థాన్‌తో శత్రుత్వం కారణంగా ఇతర పొరుగు దేశాలు కూడా భారత్ పట్ల ప్రతికూల వైఖరినే చేపడుతున్నాయి. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో పాకిస్థాన్ నుంచి అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. అలాంటి ఉగ్రవాద చర్యలను ప్రభుత్వం అరికట్టలేకపోయింది. కాశ్మీర్ మనకు శాశ్వత సమస్యగా మారిపోయింది. భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లోని ఒక రాజకీయ పార్టీని పాకిస్థాన్ ప్రోత్సహించడంతో ఆ దేశం కూడా సమస్యాత్మకంగా మారింది. బేగమ్ జియా అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ బంగ్లాదేశ్, భారత్ పట్ల శత్రు వైఖరితో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం మారి, బేగమ్ హసీనా అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇండియా ప్రశాంతంగా ఉంటుంది. అయితే బంగ్లాదేశ్‌కు వాగ్దానం చేసిన ఏ హామీలనూ నెరవేర్చకపోవడంతో వారి దృష్టిలో మన దేశం బలహీనపడి పోయింది. అలాగే శ్రీలంకతో భారత్ ఎలాంటి స్నేహపూర్వక ప్రయత్నాలు చేపట్టినా యూపీఏ ప్రభుత్వాన్ని బలపరుస్తున్న తమిళనాడు పార్టీలు బెదిరింపులకు దిగేవి. దీంతో శ్రీలంక క్రమంగా చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరయింది. నేపాల్‌కు భారత్‌తో నిరాటంకమైన సరిహద్దులున్నాయి. నేపాలీయులు వీసాలు లేకుండానే భారత్‌కు స్వేచ్ఛగా వచ్చి పనిచేసుకునేవారు. అయితే గత పదేళ్లుగా మన దేశం నేపాల్‌కు శత్రువుగా మారింది. 2014 నాటికి భారత్‌కు సరిహద్దు దేశాలైన, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక తో శత్రుత్వం ఏర్పడింది. మన్మోహన్ తన పదవీకాలంలో ఎన్నడూ నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలను సందర్శించలేదనీ, ప్రధానిగా తన హయాంలో చివరి సంవత్సరం మాత్రమే ఆయన బంగ్లాదేశ్‌ను సందర్శించారనీ గుర్తుంచుకోవాలి. ప్రారంభం అదిరింది ఇదీ నరేంద్రమోడీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసినప్పటి స్థితి. అయితే ప్రారంభం నుంచీ ఆయన గొప్ప తెలివిని, సమయస్ఫూర్తినీ ప్రదర్శిస్తూ వచ్చారు. మే 26న ప్రధానిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావలసిందిగా దక్షిణాసియా దేశాల ప్రధాన మంత్రులందరికీ పది రోజులకు ముందే ఆహ్వానం పంపడం ప్రకంపనలు సృష్టించింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేని ఆహ్వానించవద్దని తమిళనాడు రాజకీయ పార్టీలు నిరసన తెలిపినప్పటికీ మోడీ పట్టించుకోలేదు. దీంతో శ్రీలంక మళ్లీ ఇండియా పట్ల మిత్రవైఖరి కనబర్చింది, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను మోడీ ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. మోడీ ప్రారంభం అదిరింది. పైగా దక్షిణాసియాలో తన తొలి పర్యటనను భూటాన్ నుంచే మొదలెడతానని మోడీ ప్రకటించారు. మన్మోహన్ హయాంలో భూటాన్‌తో కూడా మనకు శత్రుత్వం ఏర్పడింది. కాని వాటిని పరిష్కరించుకోలేదు. మోడీ తొలి సందర్శన భూటాన్ వాసులకు ఉపశమనం కలిగించింది. తమ దేశానికి ఇండియా అటువంటి ప్రాధాన్యతను ఇవ్వడంతో వారు బహు సంతోషపడిపోయారు. మన్మోహన్ హయాంలో నేపాల్‌తో మన సంబంధాలు శత్రుపూరితంగా మారాయి. కాని మోడీ తన తదుపరి సందర్శన నేపాల్‌కే అని చెప్పి మరీ వెళ్లారు. ఆ సందర్భంగా నేపాల్‌కు ఎలాంటి సూచనలు చేయడానికి భారత్ ప్రయత్నించదని నేపాలీయులకు, ఆ దేశ పార్లమెంటుకు హామీ ఇచ్చారు. నేపాల్ ఏది కోరుకున్నా భారత్ దాన్ని బల పరుస్తుందన్నారు. ఇండియాకు విద్యుత్‌ను అమ్మాలని నేపాల్ నిర్ణయించుకుంటే తాను స్వాగతిస్తానన్నారు. అంతే తప్ప తమ వైపు నుంచి ఎలాంటి ఒత్తిడీ ఉండదన్నారు. దీంతో నేపాల్‌లో భారత్ పట్ల తీవ్ర శత్రుత్వం ప్రదర్శించే శక్తుల మనసులను కూడా మోడీ గెల్చుకున్నారు. చైనా, భారత్, జపాన్ అంతర్జాతీయంగా చైనా విస్తరణవాద విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడు తోంది. చైనా ఇప్పటికే తన పొరుగు దేశాలైన వియత్నాం, ఫిలిప్పైన్స్, దక్షిణ కొరియా, జపాన్‌లతో జగడమాడుతోంది. ఈ నేపథ్యంలో మిత్రుల కోసం వెదుకులాటలో భాగంగా భారత్‌తో భాగస్వామ్యానికి జపాన్ ప్రయత్నించింది కాని మన్మోహన్ ప్రభుత్వం స్పందించలేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండీ జపాన్‌కు సైన్యం లేదు. కానీ ప్రస్తుతం భారత్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా జపాన్ మారవచ్చు. మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ ఇప్పుడు సన్నిహితం కావడానికి ప్రయత్నించడమే చైనాకు అవమాన కరం. దీంతో దక్షిణాసియాలో చైనా శత్రువులు కూడా జపాన్‌తో జత కడతారు. ఇటీవలే జపాన్ పర్యటనలో నరేంద్ర మోడీ స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏ దేశం కూడా విస్తరణవాదంతో వ్యవహరించవద్దనీ, చైనా తప్పు దోవలో పడుతోందనీ సూచించారు. ఆసియాలో చైనా ఏకాకి అవుతోంది. అంటే పాకి స్థాన్‌తో స్నేహానికి గాను చైనా భారీ మూల్యం చెల్లిస్తోందన్న మాట. ఇండియా నుంచి చైనాకు వెళుతున్న సందేశం ఇదే. వందరోజుల పాలన ఆశాజనకం మన్మోహన్ పదేళ్ల పాలన కంటే మోడీ తొలి వంద రోజుల పాలనలోనే మన విదేశాంగ విధానం చురుగ్గా, మెరుగ్గా ఉంది. శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియాలోని చిన్నచిన్న దేశాలను గౌరవించడం ద్వారా మోడీ పొరుగు దేశాలతో గతంలో జరిగిన తప్పులను సవరించడానికి ప్రయత్నించారు. ఏది చేయాలన్నా వందరోజులు మరీ తక్కువ సమయం. కాని విదేశాంగ విధానంలో తనకు సొంత దృక్పథం ఉందనీ, ప్రమాదాలను ఎదుర్కోవడానికి తాను వెనకడుగు వేయనని మోడీ సూచించారు. హురియత్ నేతలతో పాక్ హైకమిషనర్ మాట్లాడటంపై అభ్యంతరం తెలుపుతూ విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలను చివరి నిమిషంలో నిలిపివేసింది అందుకే. పాకిస్థాన్‌తో ఇంత మొండివైఖరి అవలంబించడంపై మోడీని పలువురు విమర్శించినప్పటికీ, ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్న సందేశాన్ని పాక్‌కు ఇండియా అందించింది. దేనికైనా సిద్ధపడటమనేది తప్పదు కానీ విదేశాంగ విధానంలో మోడీ కాస్త జాగరూకతతో వ్యవహరించాలి. ఆస్ట్రియాకు చెందిన మెటర్నిచ్, ఫ్రాన్స్‌కు చెందిన టాలీర్యాండ్ వంటి ప్రముఖ విదేశీ వ్యవహారాల మంత్రులు యుద్ధం లేకుండానే తమ దేశాలను అగ్రస్థానంలో నిలిపారు. ఏదేమైనా, వంద రోజుల్లోనే మోడీ తన బుద్ధి కుశలతతో, సానుకూల విదేశాంగ విధానాన్ని అనుసరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇలాంటి సంతోషకరమైన దిగ్భ్రాంతులు మరిన్ని కలుగుతాయనీ, కలగాలనీ ఆశిద్దాం. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు -
గాడిలో పడిన మోడీ సర్కార్
కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందన్న భరోసాను, సమస్యలకు పరిష్కారాలు కనుగొంటుందన్న విశ్వాసాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు కలిగించగలిగారు. అయితే ఏ ప్రభుత్వమూ అన్ని సమస్యలనూ పరిష్కరించలేదు. ప్రజలు ఆర్థిక విషయాలపై పెట్టుకున్న అంచనాలను తీర్చలేకపోవచ్చు. ప్రధానిగా నరేంద్ర మోడీ పరిపాలనలో మొదటి నెల పూర్తి చేసుకున్నారు. అమెరికాతో సహా అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆయన ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. ఈ దేశానికి మోడీ ప్రధాని కాకపోవచ్చన్న అంచనాతో కాబోలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వీసా మంజూరు చేసేందుకు అమెరికా నిరాకరించింది కూడా! ఒక నెల అన్నది చాలా తక్కువ వ్యవధే అయినప్పటికీ ఒక ప్రభుత్వాధినేత పాలనాశైలిని అధ్యయనం చేయడానికి ఈ సమయం తగిన సంకేతాలు అందిస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తిరుగులేని విధంగా ఒక పార్టీకి అఖండ మెజారిటీని కట్టబెడతారని ఎవరూ ఊహించలేదు. త్రిశంకుసభ ఏర్పడుతుందనీ, ప్రాంతీయ పార్టీలు ప్రధానపాత్ర పోషిస్తాయనీ రాజకీయ పండితులు వేసిన అంచనాలన్నీ తప్పాయి. జయలలిత, మమతా బెన ర్జీ బ్రహ్మాండమైన విజయాలు సాధించినా కేంద్రంలో ఎలాంటి పాత్ర పోషించేందుకు అవకాశం లేకుండా పోయింది. అధికారంలోకి వస్తూనే తొలి వంద రోజుల్లోనే తమ సత్తాను చాటేందుకు మోడీ సర్కార్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఫలితాల కోసం ప్రజలు ఐదేళ్లపాటు నిరీక్షించేందుకు సిద్ధంగా లేరని ప్రభుత్వం గ్రహించింది. తన ప్రమాణస్వీకారోత్సవానికి సార్క్ దేశాల ప్రభుత్వాధినేతలను ఆహ్వానించడం ద్వారా నరేంద్ర మోడీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా దీన్ని ప్రశంసించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను ఆహ్వానించడంపై తమిళ పార్టీలు రాద్ధాంతం సృష్టించినా మోడీ వెనుకడుగు వేయలేదు. విదేశీ వ్యవహారాలలో స్థానిక రాజకీయాలకు ఎలాంటి పాత్ర ఉండదని తన చేతల ద్వారా రుజువు చేశారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువస్తామని ప్రభుత్వం పదేపదే చెపుతోంది. ఇరాక్‌లో ప్రారంభమైన అంతర్యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయి. రైల్వే, ఇతర ధరలు పెంపుదల బట్టి ఈ సర్కారు ధరలను నియంత్రించలేకపోతోందని అనిపిస్తోంది. ఒకవేళ ప్రధాని తప్పుడు సలహాలు స్వీకరిస్తే ఆయన ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. ఇప్పుడు చమురు ధరలు దిగివస్తే ఆర్థిక మంత్రి ద్రవ్యలోటుకు కోతపెడతారు. అప్పుడు ప్రధానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నా దానికి తగ్గ ప్రయోజనాలు కనిపించాలి. రైల్వే ప్రయాణ చార్జీలు పెంచితే ప్రయాణికులకు భద్రత, ఇతరత్రా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. కానీ అది జరగడం లేదు. హేమాహేమీలు అవసరమే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వంటి కురువృద్ధులను పక్కన పెట్టడం మంచి నిర్ణయమే. అయితే ప్రభుత్వంలో రాజకీయంగా హేమాహేమీలు అనదగ్గ నాయకులు ఉండాలి. ఇపుడు ప్రభుత్వ భారమంతా మోడీపైనే ఆధారపడి ఉంది. పీవీ నరసింహారావు కేబినెట్లో ఏకంగా 12 మంది మాజీ సీఎంలు ఉండేవారు. మన్మోహన్ సింగ్ కేబినెట్లో కూడా 8 మందిదాకా మాజీ సీఎంలు ఉండేవారు. మోడీ టీమ్‌లో ఆయన తప్ప అలాంటి వారు ఎవ్వరూ లేరు. ప్రభుత్వానికి హుందాతనం రావాలంటే అలాంటి హేమాహేమీల అవసరం ఎంతైనా ఉంది. మీడియా అధికార ప్రతినిధులందర్నీ కేబినెట్లో చేర్చుకోవడం వల్ల లాభం లేదు. యూపీఏ సర్కారులో పెద్దగా నోరుపారేసుకుని మాట్లాడే జైరామ్ రమేశ్ లాంటి ఒక మంత్రి ఉంటే చాలు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్లను, ఇతరులను తొలగించే విషయంలో ఎన్డీఏ సర్కారు కొంత సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు... మార్చిలోగా కాంగ్రెస్ పార్టీ అనేక పోస్టులలో తమకిష్టులైన వారిని బాహాటంగా నియమించింది. అలాంటి వారిని తొలగించాల్సిందే. కొంతమంది ‘మంచి’ గవర్నర్లతో ప్రభుత్వం నేరుగా మాట్లాడి వారిని పదవుల్లో కొనసాగనివ్వాలి. అదేవిధంగా వివిధ కమిషన్ల అధ్యక్ష, సభ్యుల తొలగింపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనర్హులైన వారిని తొలగించడంలో తప్పులేదు. అయితే ప్రభుత్వం చేసే నిర్ణయం కీలకమైనది. ఈ కమిషన్లలో కొనసాగుతున్న వారంతా చెడ్డవారని భావించనక్కర్లేదు. భజనపరులతో జాగ్రత్త నరేంద్ర మోడీకి పారిశ్రామిక వర్గంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రచారం చేశాయి. కాని దానిలో తప్పేముంది? అయితే పరిశ్రమ వర్గాల బెదిరింపులకు తాను లొంగిపోతున్నట్టుగా అభిప్రాయం కలగకుండా ప్రధాని జాగ్రత్తపడాలి. అంతేకాదు భజనపరులను చేరదీయరాదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి... దివంగత బీజేపీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్, ఇతర నాయకుల మాటలు విని 2004 ఎన్నికలలో దెబ్బతిన్నారు. వారి మాటలు విని ఏజీపీ, డీఎంకేలను దూరం చేసుకున్నారు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో భజనపరులు చుట్టూ చేరతారు. వారిని ఒక కంట కనిపెట్టాలి. లేకపోతే మోడీ కష్టాల్లో ఇరుక్కుంటారు. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఒక పార్టీగా అద్భుతమైన విజయం సాధించినా, మోడీ లేకుండా అది అసాధ్యమని చెప్పాలి. ఒకవేళ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ లేదా రాజ్‌నాథ్‌లను ప్రకటించి ఉంటే ఎంతమంది ప్రజలు బీజేపీకి ఓటు వేసి ఉండేవారు? ప్రజలను పట్టించుకోకుండా బీజేపీ క్యాడర్‌కు మరీ అధిక ప్రాధాన్యమివ్వడం మోడీ ఇక మానుకోవాలి. బీజేపీ వల్లే విజయం సిద్ధించిందని చెపితే 2004, 2009 ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి పట్టిన గతే పడుతుంది. పార్టీ క్యాడర్‌కు తప్పకుండా ప్రాధాన్యమివ్వాల్సిందే. అయితే పార్టీ క్యాడర్ మరీ అంత పటిష్టంగా ఉంటే 2004, 2009 ఎన్నికలలో టీడీపీ ఎందుకు ఓడిపోయింది? అప్పటి క్యాడరే ఇప్పుడూ ఆ పార్టీకి ఉంది కదా. పాదుకున్న విశ్వాసం కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడం ప్రారంభిస్తుందన్న భరోసాను, సమస్యలకు పరిష్కారాలు కనుగొంటుందన్న విశ్వాసాన్ని మోడీ ప్రజలకు కలిగించారు. అయితే ఏ ప్రభుత్వమూ అన్ని సమస్యలనూ పరిష్కరించలేదు. ప్రజలు ఆర్థిక విషయాలపై పెట్టుకున్న అంచనాలను తీర్చలేకపోవచ్చు. గల్ఫ్ దేశాలలో ఉన్న సహజ వనరులు భారత్‌కు లేవు. సమస్యల పరిష్కారం దిశగా అడుగుపడితే, అవినీతిని పెకిలించివేసేందుకు చర్యలు ప్రారంభమైతే, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం ప్రారంభిస్తే ప్రజలు కొంతవరకు సంతృప్తి చెందుతారు. దేశీయంగా, అంతర్జాతీయంగా అనూహ్యంగా తలెత్తే పరిణామాలకు, వాటి సవాళ్లను ఎదుర్కొనేందుకు మోడీ అప్రమత్తంగా ఉండాలి. అది యుద్ధం, విపత్తు, రాజకీయ తప్పిదం... ఏదైనా కావచ్చు. చిన్న సమస్య భారీ సంక్షోభానికి దారి తీస్తుంది. ఈ సవాళ్లే నిత్యకృత్యమవుతాయి. ప్రధానిగా మోడీ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారు. ఒక్క నెలలోనే కచ్చితంగా పలువురిని ఆశ్చర్యపరిచారు! (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు -
కాంగ్రెస్ ఉపాధి...‘కల్పనే’!
కేంద్ర ప్రభుత్వం వద్ద 10 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన ఆలోచనలు, పథకాలు ఏవీ లేవు. ఇలాంటి మాటలు చెవికింపుగా ఉంటాయి. అందుకే చిదంబరం, జైరాం రమేశ్ వంటి వారు ఇలాంటి కబుర్లు చెబుతుంటారు. వాస్తవానికి గత ఐదేళ్లలో యూపీఏ సర్కార్ కోటి కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ‘కొత్త ఆలోచనల’తో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తన మేనిఫెస్టోను ప్రకటించింది. దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని కూడా కాంగ్రెస్ నాయకులు హామీలు గుప్పించారు. అయితే గతంలో చేసిన వాగ్దానాలను ఎందుకు నెరవేర్చలేకపోయారో మాత్రం వారు సమాధానమివ్వలేకపోయారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావంతో గత ఐదేళ్లుగా వృద్ధిరేటు దిగజారుతున్నప్పుడు సమీప భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ప్రజలను నమ్మబలికించేందుకు కాంగ్రెస్ ఎందుకు ఆపసోపాలు పడుతోంది? ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల పేరిట ఎంతో హడావుడి చేస్తాయి. పోలింగ్ అయ్యాక వాటి సంగతి మర్చిపోతాయి. తమిళనాడులో గతంలో డీఎంకే పార్టీ ఓటర్లకు ‘అన్నీ ఉచితం’ అంటూ ఊరించింది. వంటసామాన్లు, మిక్సర్లు, ఫ్యాన్లు, టీవీలు వంటివి ఇచ్చింది. కాని ప్రజలు తెలివైనవారు. డీఎంకే పార్టీ పట్ల కృతజ్ఞత చూపకపోగా తమను అవినీతిలో భాగస్వామ్యం చేసిందని, అస్తవ్యస్త పరిపాలన సాగించిందని భావించారు. దాని ఫలితంగా 2011 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు డీఎంకేను చిత్తుచిత్తుగా ఓడించారు. సాధారణంగా తాము అధికారంలోకి రాలేమని భావించినప్పుడు పార్టీలు అసాధ్యమైన వాగ్దానాలు చేస్తాయి. మామూలుగా పార్టీలు నగదు బహుమతులు, కులపరంగా రిజర్వేషన్లు వంటి హామీలు ఇస్తుంటాయి. ఇలాంటి వాగ్దానాలు చేసిన తర్వాత సమర్థవంతమైన, నిజాయితీవంతమైన ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదు. సామాజిక న్యాయం పేరిట రాజకీయ పార్టీలు వాగ్దానాల సంతర్పణ చేస్తుంటాయి. ఇలా అలవికాని వాగ్దానాలను గుప్పించడం భావ్యమా? 2009 ఎన్నికలలో తామిచ్చిన వాగ్దానాలలో 90 శాతం హామీలను నెరవేర్చామని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. దాదాపు 90 శాతం వాగ్దానాలను యూపీఏ ప్రభుత్వం అమలు చేసిందని ప్రజలు భావిస్తుంటే పోల్ సర్వేలలో కాంగ్రెస్ ఎందుకు వెనుకబడి ఉందో చెప్పాలి? ఎంత సుదీర్ఘమైన మేనిఫెస్టోను ఓటర్ల ముందు ఉంచితే ఓట్ల డబ్బాలలో అంత భారీగా ఓట్లు రాలుతాయని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలవేళ పాత మేనిఫెస్టోను ప్రకటించడం కాదు, దానిలో చేసిన వాగ్దానాలను తు.చ. తప్పకుండా అమలు చేయడం అత్యంత ప్రధానమని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించాలి. కాంగ్రెస్‌లో ఇలాంటి పనులు చేసే నాయకులు లేరు. సమీప భవిష్యత్తులో 8 శాతం వృద్ధి రేటు సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు చెపుతున్నారు. అయితే గత ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించకపోవడానికి గల కారణాలను పార్టీ వివరించలేదు. ఇక మతకలహాల వ్యతిరేక బిల్లు విషయానికి వస్తే.... దీనిపై అన్ని పార్టీలూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తమ పార్టీలో మెజారిటీ మతస్తులకు దీనిపై అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అనేక కారణాల వల్ల కేంద్రం దీన్ని ఇంతవరకూ పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. ఊరించే ఉద్యోగాలు! పది కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న వాగ్దానం వివాదాస్పదంగా మారింది. ఇదెలా సాధ్యమని అనేకమంది నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి మార్కెట్లోకి ఏటా రెండు కోట్లమంది యువతీయువకులు వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఒకవేళ ఇది సాధ్యమైతే ప్రభుత్వం గత ఐదేళ్లు కలుపుకొని ఒక కోటి ఉద్యోగాలను ఎందుకు ఇవ్వలేకపోయింది? ఏమీ పనిచేయని వారికి కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ.120 చొప్పున చెల్లించిన ‘ఘనత’ ఈ సర్కారుది. ఇలాంటి పథకాల వల్ల కొత్త ఉద్యోగాలు ఏవీ రావు. ప్రభుత్వం వద్ద 10 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందు కు తగిన ఆలోచనలు, పథకాలు ఏవీ లేవు. ఇలాంటి మాటలు చెవికింపుగా ఉంటాయి. అందుకే చిదంబరం, జైరాం రమేశ్ వంటి వారు ఇలాం టి కబుర్లు చెబుతుంటారు. వాస్తవానికి గత ఐదేళ్లలో యూపీఏ సర్కార్ ఒక కోటి కొత్త ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలిగింది. పది కోట్ల ఉద్యోగాలను ఎలా సృష్టిస్తామో, ధరలను ఎలా అదుపు చేయగలమో కాంగ్రెస్ నేతలు ఈ మేనిఫెస్టోలో చెప్పలేకపోయారు. ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. గత పదేళ్లలో దాదాపు రెండు లక్షలమందిదాకా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అనధికార అంచనా. వ్యవసాయ సంక్షోభం, రైతుల దీనావస్థ గురించి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అసలు ప్రస్తావన చేయలేదు. చిత్తశుద్ధిలేని అవినీతి పోరు అవినీతిని అంతమొందించేందుకు ఇప్పుడు ఉన్న చట్టాలు చాలవన్నట్టు ఇంకా అనేక కొత్త చట్టాలు తీసుకువస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు పాత్ర ఉన్న ఆదర్శ్ కుంభకోణం, రైల్వే పోస్టులు అమ్ముకున్న మాజీ రైల్వే మంత్రి పవన్ బన్సల్ అవినీతి గురించి తీసుకున్న చర్యల గురించి ఏమీ వివరణ ఇవ్వలేదు. పెపైచ్చు కాంగ్రెస్ అవినీతి కళంకిత చవాన్‌కు నాందేడ్ లోక్‌సభ టికెట్ మళ్లీ ఇవ్వడం కొసమెరుపు. మావోయిస్టులను అణచివేస్తామని, పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అగ్రవర్ణాలలో పేదలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చే ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ఇది దేశంలో వివిధ కులాల మధ్య విభేదాలను మరింత పెంచేందుకు దారితీయవచ్చని భావిస్తున్నారు. ఓటు బ్యాంకు సృష్టించుకోవాలన్న వ్యూహంలో ఉన్న కాంగ్రెస్ తమను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీరియస్‌గా ఆలోచించుకోవల్సిన సమయం ఆసన్నమయ్యింది. పూర్వాశ్రమంలో ఒక టీ స్టాల్ నడుపుకున్న ఒక సాదాసీదా వ్యక్తి (నరేంద్ర మోడీ) తమకు సవాలు విసరగలిగే స్థాయికి ఎదగడం గురించి ఆలోచించాలి. అంతేకాదు... మోడీ సర్కారును ఏర్పాటు చేస్తారా, చేయరా అన్న మాట అటుంచితే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితులు ఆయన సృష్టించడం గురించి కూడా వారు ఆలోచిం చాలి. కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికైనా తన మేనిఫెస్టోను పక్కన పెట్టి, టీవీ షోలు, ప్రచారానికి దూరంగా ఉండి, తన తప్పిదాలను అంగీకరించి ప్రజాపాలన అసలు కిటుకు ఏమిటో తెలుసుకోవాలి. నిజాయితీ పాలన అందించిన రోజున పాలకులు చేసిన తప్పులను మన్నించేందుకు ప్రజలు సదా సిద్ధంగా ఉంటారు. కాని మీడియా ప్రచారపటాటోపం, ప్రాపగాండా ద్వారా కాంగ్రెస్ ఎన్నికల వైతరణి దాటాలనుకుంటోంది. అదే ఆ పార్టీ చేస్తున్న తప్పు. పెంటపాటి పుల్లారావు, (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) -
కమలానికి ‘చేతి’ చలువ!
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కొత్త శత్రువులను సృష్టించుకుంది. ఇప్పుడు ఆ పార్టీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీలతోపాటు టీఆర్ఎస్తో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఇది బీజేపీకి వరంగా మారుతుంది. కోస్తాలో కూడా ప్రజలు బీజేపీ కన్నా కాంగ్రెస్‌నే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ బీజేపీకి ఊహించని రాజకీయ బహుమతి ఇచ్చింది. బీజేపీకి 2014 సార్వత్రిక ఎన్నికలలో కనీసం 225 సీట్లు వస్తాయని ఏడాది క్రితం ఎవరైనా అంచనా వేసి ఉంటే వారిని చూసి నవ్వుకునేవారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో 225 స్థానాలు గెలుచుకునే స్థాయికి చేరుకుందని అనిపిస్తోంది. లోక్‌సభలో మొత్తం 543 సీట్లకుగాను బీజేపీ సొంతంగా 200 స్థానాలలో విజయం సాధిస్తేగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని విశ్లేషకులు చెపుతుండేవారు. అంతేకాదు, బీజేపీకి మిత్రపక్షాలు దొరకడం కూడా చాలా కష్టమని అనేవారు. కమలనాథులు ఈ అవరోధాన్ని కూడా అధిగమించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును పార్టీలో కొంతమంది ప్రతిపాదించినప్పుడు అంతర్గతంగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా తమకన్నా జూనియర్ తమను దాటిపోవడం ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటి అగ్రనేతలు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయారు. మోడీ సభలకు జనాలు విరగబడి వస్తుంటే అద్వానీ, సుష్మాస్వరాజ్ మీటింగ్‌లు వెలవెలబోయేవి. వీరిద్దరూ పాతతరానికి ప్రతినిధులుగా మిగిలారు. ఈ సవాళ్లను మోడీ ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. ఇప్పుడు పార్టీలో ఆయన కత్తికి ఎదురేలేదు. రాహుల్‌ది ‘సైడ్‌రోల్’ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఆయన ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా భారీ పబ్లిసిటీ సరంజామాతో ఏఐసీసీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారానికి కాంగ్రెస్ ఎంతో ఖర్చు చేసింది. దీనిలో రాహుల్ అనేక ‘అవతారాలలో’ ఓటర్లకు దర్శనమిస్తారు. మోడీ బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థి కాబట్టి ఆయన రాహుల్ శక్తియుక్తుల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాహుల్ ఎక్కడా పత్తా లేకుండా పోయారు. నిజానికి ఈ ఎన్నికల్లో ఆయన ప్రధాన పాత్ర కాకుండా ‘సైడ్‌రోల్’ను పోషిస్తున్నారు. రాహుల్ టీవీలో మాత్రమే కనిపిస్తున్నారు. జనాలు రావడం లేదు కాబట్టి ఆయన కోసం బహిరంగ సభలు ఏర్పాటు చేయడం లేదు. వాస్తవానికి మోడీని ఎదుర్కొనలేక రాహుల్ చతికిలబడ్డారు. మోడీపై కాంగ్రెస్ చేసిన దుర్మార్గపూరిత ఆరోపణలలో నిజం ఎంత ఉందో తెలియదు కాని వాటి నుంచి ఆయన బయటపడ్డారు. హస్తినలో అధికారాన్ని కైవసం చేసుకునే రేసులో బీజేపీ... కాంగ్రెస్ కన్నా ముందంజలో ఉంది. యుద్ధంలో విజయం సాధించాలంటే కాలం కలిసొచ్చే సైన్యాధికారులు ఉండాలని నెపోలియన్ చెప్పాడు. బీజేపీలో కూడా ఇపుడు అనేకమంది అదృష్టవంతులైన ‘జనరల్స్’ ఉన్నారు. వారి వల్లనే ఆ పార్టీ ఎన్నికల సంగ్రామంలో ముందుకు దూసుకుపోతోంది. గత నాలుగేళ్లుగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోని అనేక స్కామ్‌లను మీడియా ఎండగట్టింది. మోడీపై వచ్చిన ఆరోపణలు ప్రజల దృష్టిలో చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కాని యూపీఏ హయాంలో ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన అవినీతి స్కామ్‌లలో కొన్ని వేలకోట్ల రూపాయల దాకా అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. వీటితో ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత మరింత తీవ్రతరమై అది బీజేపీకి అయాచిత వరమవుతుంది. కొత్త ‘సెక్యులర్’ శక్తులతో పొత్తులు గుజరాత్ అల్లర్లకు నిరసనగా గతంలో ఎన్డీఏకు గుడ్‌బై చెప్పిన ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ మళ్లీ ఆగూటికే చేరారు. మోడీ ‘అమాయకుడని’ కోర్టులు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించాయని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు పనిలోపనిగా మోడీని ప్రధానిని చేసేదాకా నిద్రపోనని కూడా శపథం చేశారు. ప్రస్తుత బీహార్ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పాశ్వాన్ రాజకీయ అవసరాలు అలాంటివి. ఏదిఏమైనా ఇది మోడీకి ఊహించని వరమే. ధరల పెరుగుదలను ప్రజలు ఎంతమాత్రం ఇష్టపడరు. ఎందుకంటే అది వారి జేబుకు చిల్లుపెడుతుంది. కానీ గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ విషయంలో ఎంతమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. ఎన్నికల వేళ తాయిలాలు ఇస్తే అవినీతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి విషయాలను ప్రజలు పెద్దగా పట్టించుకోరన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం కాబోలు. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే తెలంగాణలో 16 ఎంపీ సీట్లు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేసింది. సీట్లు మాట దేవుడెరుగు, కొత్త శత్రువులను సృష్టించుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లతో పాటు టీఆర్ఎస్తో కూడా పోరాడాల్సి ఉంటుంది. ఈ విభజన ఒకరకంగా బీజేపీకి వరంగా మారింది. అదేవిధంగా కోస్తాలో కూడా ప్రజలు బీజేపీ కన్నా కాంగ్రెస్‌పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు. విభజన ద్వారా కాంగ్రెస్‌పార్టీ బీజేపీకి ఊహించని రాజకీయ బహుమతి ఇచ్చింది. కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలకుతోడు, బీజేపీకి కలిసివచ్చిన అదృష్టంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలనాథులు మరింత చేరువకాగలిగారు. ప్రస్తుతం వెలువడిన పోల్స్ అంచనాలు పూర్తిగా వాస్తవం కాకపోవచ్చుగానీ, ఎన్నికలు జరగడానికి ఇంకా 60 రోజుల వ్యవధి ఉంది. ఈలోగా అనేక మార్పులు జరగవచ్చు కూడా. ‘ఆప్’ నుంచి ముప్పు బీజేపీకి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిలో గట్టి పట్టు ఉంది. కాని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఈ వర్గాల ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. ఒకవేళ ఆప్ రంగంలో లేకుంటే ఈ ఓట్లన్నీ బీజేపీకే పడతాయి. కొత్తగా ఆప్ రావడం వల్ల బీజేపీ ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. ఇటీ వలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయాన్ని అడ్డుకున్నది ఆప్ అన్నది మర్చిపోకూడదు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి 15 కన్నా అధికంగా ఎంపీ సీట్లు వస్తాయని ఎవరూ భావించడం లేదు. కాని ‘ఆప్’ బీజేపీకి రావల్సిన సీట్లకే గండికొడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలలో ముస్లింలు వ్యూహాత్మకంగా ఓట్లు వేస్తారు. మతతత్వ శక్తులను ఓడించే పార్టీలనే వారు బలపరుస్తారు. బీజేపీని ఆప్ గట్టిగా వ్యతిరేకిస్తోంది కాబట్టి ‘ఆప్’ వారికి అస్త్రంగా ఉపయోగపడనున్నది. బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్న కేజ్రీవాల్‌నూ, కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీ కూడా అవినీతి పార్టీయేనని పేర్కొంటున్న ఆప్‌ను ముస్లింలు బాగా ఇష్టపడతారు. మోడీని ఎదుర్కొనే సత్తా కేజ్రీవాల్‌కు ఉందని వారు విశ్వసిస్తున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆశలను కాంగ్రెస్ దాదాపుగా వదులుకుంది. అయితే అదే సమయంలో తన ఆగర్భశత్రువు మోడీ ప్రధాని కాకుండా చూసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతుంది. జయలలిత నుంచి ములాయం వరకు, మమత నుంచి శరద్ పవార్ వరకు ఎవరు ప్రధాని అయినా కాంగ్రెస్‌కు పెద్ద ఇబ్బంది లేదు. ప్రాంతీయ పార్టీల నుంచి తగిన సంఖ్యలో ఎంపీలు గెలిస్తే బీజేపీకి మెజారిటీ దక్కదని కాంగ్రెస్ నాయకత్వం ఆశాభావంతో ఉంది. చరిత్ర పునరావృతమవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కాంగ్రెస్ అభ్యంతరం పెట్టదు. గతంలో మాదిరిగా అస్థిర ప్రభుత్వాలు ఏర్పడి గందరగోళ పరిస్థితులు తలెత్తేదాకా ఓపిగ్గా వేచి ఉండి తర్వాత అవి కుప్పకూలినప్పుడు తమ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆ సమయంలో మళ్లీ ప్రజల వద్దకు వెళ్లాలన్న ఆలోచన కాంగ్రెస్ నేతల మనసులో ఉంది. ప్రస్తుతానికి బీజేపీకి అనుకూల గాలి వీస్తోంది. ఇంతవరకు మోడీకి అదృష్టం కలిసి వచ్చింది. కాని అదృష్టంపై మరీ ఎక్కువ ఆధారపడకూడదు. (వ్యాసరచయిత రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు -
‘కారు’ తీరుతో కకావికలు!
వచ్చే ఎన్నికలలో తెలంగాణలో పోటీ కాంగ్రెస్, టీడీపీ మధ్యకన్నా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే తీవ్రంగా ఉంటుంది. విలీనంపై టీఆర్ఎస్ వెనక్కిపోవడం సోనియాకు పెద్ద షాక్! సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కన్నా ఎంతో బలమైన పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ములాయం, మాయావతి, లాలూలు కూడా సోనియాకు ఇంత దారుణంగా ద్రోహం చేయలేదు. కేసీఆర్ అడ్డం తిరగడంతో కాంగ్రెస్ కంగుతింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇపుడు ఏం చేయనున్నారు? తెలంగాణలో దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయన్నది చాలా ఆసక్తికరం. తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతంలో రాజకీయంగా లబ్ధిపొందవచ్చనీ, సీమాంధ్రలో పెద్దగా నష్టం ఉండదనీ సోనియా లెక్కలు వేశారు. ఈ దేశంలోని ఏ ప్రాంతంతోనూ, ఏ భాషతోనూ ఆమెకు సెంటిమెంటు లేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని రాజకీయంగా బోనులో ఇరికించేందుకు సోనియా తెలంగాణను ఒక తురుఫు ముక్కగా వాడుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతం నుంచి 17 మంది ఎంపీలను గెలిపించుకోవచ్చనీ, తద్వారా నరేంద్ర మోడీని నిలువరించవచ్చనీ ఆమె భావించారు. 2009 ఎన్నికలలో 206 మంది ఎంపీలు కాంగ్రెస్ టికెట్‌పై గెలిచినప్పటికీ ఈసారి కాంగ్రెస్ నుంచి కనీసం 150 మంది ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ ఆటకట్టించినట్టవుతుందనీ, తమ కుటుంబపాలనకు ఎదురే ఉండదనీ సోనియా, ఆమె కోటరీ సభ్యుల ఆలోచన. అంతా ముందే రచించుకున్న వ్యూహం ప్రకారం జరిగింది. గత ఏడాది జూలై 30న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని నిర్ణయించారు. దేశంలో కనీవినీ ఎరుగనిరీతిలో ప్రజావ్యతిరేకత పెల్లుబికినప్పటికీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపించింది. రాజ్యాంగంలోని రెండో అధికరణ ప్రకారం ప్రవేశపెట్టిన ఈ బిల్లును రాష్ట్ర శాసనసభ తిరస్కరించింది. అయినప్పటికీ రాజ్యాంగ నిబంధనలను తుంగలోతొక్కి, సంప్రదాయాలను బేఖాతరు చేసి కేంద్రప్రభుత్వం అత్యంత వివాదాస్పదరీతిలో ఈ బిల్లును పార్లమెంట్ ఉభయసభలలో ఆమోదింప చేసింది. సోనియా ఇంతకు తెగించడానికి ఒక కారణం ఉంది. తెలంగాణ ఇచ్చేస్తే ఒక పునాది ఏర్పరచుకోవచ్చనీ, దానిపై రాజకీయ భవనాన్ని నిర్మించుకోవచ్చనీ కలలుకన్నారు. పెరుగుతున్న దూరం తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత టీఆర్ఎస్ పాత నిబంధనలను గాలికొదిలింది. గతంలో బిహ రంగంగా ఇచ్చిన మాటను విస్మరించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. బిల్లు ఆమోదం పొందిన రోజునుంచీ నేటివరకూ చూస్తే పరిణామాలు అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, టీఆర్ఎస్ శత్రుపక్షాలుగా మారాయి. రెండు పక్షాల నేతలూ కత్తులు దూసుకుంటున్నారు. రెండు పార్టీల మధ్య విలీనం ఉండదు, పొత్తూ ఉండదని తేలిపోయింది. మాటల తూటాలు పేలుతున్నాయి. రోజులు గడిచేకొద్దీ ఇవి ఇంకా పదును తేలుతాయి. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ మధ్యకన్నా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే తీవ్రపోటీ ఉంటుంది. గత పదే ళ్లుగా అధికారంలో కొనసాగిన సోనియాకు ఇదొక పెద్ద షాక్! నిజానికి సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌కన్నా ఎంతో బలమైన పార్టీలకు నాయకత్వం వహిస్తున్న జాతీయ నేతలు ములాయం సింగ్ యాదవ్, మాయావతి, లాలూ ప్రసాద్‌లు సైతం కూడా సోనియాకు ఇంత దారుణంగా ద్రోహం చేయలేదు. సోనియా ఎంతో శక్తిమంతురాలు. ఆమె తలచుకుంటే ఏ బిల్లు అయినా పాస్ కావాల్సిందే. ఉదాహరణకు రూ.1.50 లక్షల కోట్ల వ్యయమయ్యే ఆహార భద్రతా బిల్లును ఆమె పట్టుబట్టి మరీ ఆమోదింప చేసుకున్నారు. కాని తెలంగాణ బిల్లు ఆమోదం పొంది వారం తిరగకుండానే టీఆర్ఎస్ శత్రుపక్షంగా మారిపోవడం సోనియాకు చేదు అనుభవం. ఇప్పుడు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అంచనా వేయాలి. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు పెద్దగా ఒరిగేది ఉండదని తెలిసికూడా కాంగ్రెస్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందా అని దేశ మంతా ఇపుడు విస్తుపోతోంది. కాని ఆమె అంచనాలు మరో విధంగా ఉండి ఉండవచ్చు. తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆ ప్రాంత ప్రజల ఆదరణను ఓట్లరూపంలోకి మార్చుకోవచ్చని అంచనా వేశారు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ 2 లేదా 3 సీట్లు మాత్రమే గెలిస్తే.... ఈ స్వల్ప రాజకీయ లబ్ధికే ఆంధ్రప్రదేశ్‌ను విభజించారా అని సీమాంధ్ర ప్రజలు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. సోనియాను ప్రజానాడిని పసిగట్టలేని నాయకురాలిగా జమకడతారు. ఆమె ప్రతిష్ట ఇంకా మసకబారుతుంది. అంతేకాదు తన రాజకీయ లక్ష్యాలను చేరుకునేందుకు ఆమె రాజకీయ వాస్తవాలను కూడా విస్మరిస్తారని కూడా ప్రజలు భావిస్తారు. బీజేపీకి అవకాశమిచ్చిన కాంగ్రెస్ నరేంద్ర మోడీ దూకుడుకు పగ్గం వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ తెలంగాణ నిర్ణయ రూపంలో బీజేపీకి ఒకవిధంగా మంచి అవకాశం ఇచ్చినట్టయ్యింది. కొన్ని నెలల క్రితం దాకా సీమాంధ్ర, తెలంగాణలో ఒక్క ఎంపీ కూడా గెలుస్తాడా అన్న అనుమానంలో ఉన్న కమలనాథులకు కొత్త ఊపిరి వచ్చింది. తెలంగాణలో బీజేపీ ప్రధానశక్తిగా ఆవిర్భవించడానికి కాంగ్రెస్ దారి చూపించింది. తాము ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధమేనని టీఆర్ఎస్ ప్రకటించినందున.... తెలంగాణ బిల్లును సమర్థించినందున పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ ముందుకు రావచ్చు. ఆ విధంగా సోనియా తన ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీకి సహాయపడినట్టయ్యింది. ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్‌కు పరాభవం ఎదురైతే అదంతా సోనియాకు చుట్టుకుంటుంది. ఇప్పటిదాకా తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఓడిపోతే వారి రాజకీయ జీవితానికి తెరపడుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకునే తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఆమె ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించడం ద్వారా యూపీఏ ప్రభుత్వం స్వీయ తప్పిదానికి పాల్పడింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం వల్ల ఒనగూరే రాజకీయ ప్రయోజనాలను ఆమె చేజార్చుకున్నారు. రాష్ట్రపతి పాలన కన్నా ఎవరో ఒక సీఎం ఉంటే ఎన్నికల వేళ పాలకపక్షానికి కొంత అనుకూలత ఉంటుంది. కేంద్ర మంత్రులు చిదంబరం, షిండే, కపిల్ సిబల్, జైరాం రమేశ్ వంటివారు పైకి ఎంతో తెలివైనవారుగా కనిపిస్తారు. మంచి వాగ్ధాటి కలవారు. వీరంతా ఏం చేస్తున్నారో ప్రతిపక్షానికి కూడా తెలుసు. కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకు తెలంగాణ వైఫల్యం బయటపడ్డాక మన దేశాన్ని పాలిస్తున్న మంత్రులు ఏ పనిలోనూ సిద్ధహస్తులు కారని, మాటలు చెప్పడంలో మాత్రం ఆరితేరిన వారుగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ అసమర్థ మంత్రుల నిర్వాకం వల్ల దేశానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనని కూడా ఆందోళన చెందుతారు. ఒకవేళ సోనియాకు సరైన అవగాహన లేకపోతే ఆ రంగంలో తగిన పరిజ్ఞానం ఉన్న మంత్రులనూ, సలహాదారులనూ ఆమె ఎంపిక చేసుకోవాలి కదా. పనికిమాలిన సలహాను పాటించడం వల్లనే సోనియా ఇప్పుడు తెలంగాణ ఉత్పాతాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది! టీఆర్ఎస్ ఖాయంగా విలీనం అవుతుందని కాంగ్రెస్ నాయకులు ధీమాగా ఉన్నందున వారు ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా రూపొందించుకోలేదు. టీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ సాదాసీదా మనుషులుగా జమకట్టింది. ఇప్పటికి తెలిసి వచ్చి ఉంటుంది, ఎవరు సాదాసీదా నేతలో! బీజేపీ వ్యూహాన్ని పసిగట్టలేని సోనియా తెలంగాణ వ్యవహారంలో గత ఆర్నెల్లుగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో సీమాంధ్ర ఉద్యమంలాంటి ఆందోళనను ఎన్నడూ చూడలేదని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ చెప్పడం విశేషం. విభజనను కమలనాథులు అడ్డుకుంటారని సీమాంధ్రులు ఆశలు పెట్టుకున్నారు. అది జరగలేదు. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ఉన్న స్థూల అవగాహనను సోనియా అర్థం చేసుకోలేకపోయారు. కాంగ్రెస్‌లో విలీనాన్ని టీఆర్ఎస్ తిరస్కరించడం ద్వారా ఆ పార్టీ మునిగిపోయే పడవ అన్న సంకేతాన్ని దేశవ్యాప్తంగా పంపించింది. నిజానికి కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుం దన్న నమ్మకం కేసీఆర్‌కు ఉంటే విలీనానికి ఒప్పుకుని ఉండేవారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎదురుతిరిగి రాజీనామా చేయడం కూడా కాంగ్రెస్‌కు చెడ్డపేరు తెచ్చింది. ఈ అస్తవ్యస్త పరిస్థితికి సోనియా ఎవర్ని నిందిస్తారు? మంత్రులు, నాయకులు ఈ నిందను సోనియాపైకే నెట్టేందుకు ప్రయత్నిస్తారు. నెపోలి యన్ చెప్పినట్టు విజయాన్ని పంచుకోడానికి అందరూ ముందుకు వస్తారుగాని అపజయం దగ్గరకు వచ్చేసరికి ముఖం చాటేస్తారు. తనకు తెలంగాణ ఇ వ్వడం వ్యక్తిగతంగా ఇష్టం లేదంటూ కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ ఇప్పటికే తన మనసులోని మాట బయటపెట్టారు. ఈ హడావిడి సద్దుమణిగాక చివరకు దీనికంతకూ సోనియా గాంధీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. - (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు -
‘తుడుపు’లో ఆటవిడుపు
కొత్తవారు సైతం పాతుకుపోయిన రాజకీయ దిగ్గజాలను మట్టి కరిపించగలరన్న పాఠాన్ని కేజ్రీవాల్ భారతీయులకు నేర్పారు. కేజ్రీవాల్ కథలోని ఆఖరి అధ్యాయం రచన ఇంకా మొదలుకాలేదు. ఆసక్తికరమైన రోజులు ఇంకా ముందున్నాయి. డెబ్భై ఐదేళ్లకొకసారి హేలీ తోకచుక్క వచ్చి పోతూ ఉం టుంది. భూమి మీద నుంచి కూడా చూడగలిగే రీతిలో కాం తిని వెదజల్లి, మాయమైపోతుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా రెండు మాసాలపాటు వెలుగులు చిమ్మారు. ఇప్పు డు ఆయన రాజకీయ భవితవ్యం ఏమిటో అంతుపట్టదు. కానీ భారత రాజకీయాల మీద ‘చీపురు’ వేసిన ముద్రను అంచనా వేయవచ్చు. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కాగల రని ఎవరూ ఊహించలేదు. ఆయన కోట్లకు పడగలెత్తిన వారుకాదు. రాజకీయ కుటుంబాల వారసు డూ కాదు. సంస్థాగతమైన యంత్రాంగం ఉన్న పార్టీ కూడా లేదు. అయినా, ప్రతిష్టాత్మ కమైన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఐదేళ్ల పూర్తికాలం ఆయన ముఖ్యమంత్రి గా కొనసాగి ఉండవలసింది. కానీ సవాళ్లను ఎదుర్కొనడంలో కేజ్రీవాల్‌కున్న ఆసక్తి పదవి మీద లేదు. బీజేపీ, కాంగ్రెస్ తన రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికి కంకణం కట్టు కున్న సంగతిని ఆయన అర్థం చేసుకున్నారు. రెండు పార్టీల వ్యవస్థ కొనసాగడానికి ఈ వ్యూ హం అనివార్యమని ఆ రెండు జాతీయ పార్టీలు భావిస్తున్నాయి కూడా. దీనిని ఛేదించడం కష్ట మన్న సంగతి ఆయనకు తెలియనిది కాదు. జాతీయ పార్టీలు తన మీద విమర్శలు మొదలుపెట్టడంతోనే కేజ్రీ వాల్ జాగరూకతతో మెలగడం మొదలుపెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వ్యక్తిని మనం తక్కువ అంచనా వేయలేం. ఆయన వేసిన ప్రతి అడుగు వెనుక ఒక వ్యూహం ఉందని గుర్తుంచుకోవాలి. నలభైతొమ్మిది రోజుల నజరానా దేశ రాజధానిలో చిరకాలంగా పాతుకుపోయి ఉన్న వీఐపీ సంస్కృతికి ఆయన స్వస్తి పలికారు. ఆడంబరాలకూ, పటా టోపానికీ, భారీ కాన్వాయ్ సంస్కృతికీ దూరంగా ఉండ మని కేజ్రీవాల్ సహచరులకు నచ్చ చెప్పగలిగారు. తాను నిరాడంబరంగా ఉంటూ నమూనాగా నిలిచారు. దీనినే ఢిల్లీ వాసులు బాగా ప్రశంసిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి వారంలోనే ముఖ్యమైన రెండు ఎన్నికల వాగ్దానాలను అమలుచేసి చూపారు. రోజుకు కుటుంబానికి 666 లీటర్ల నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యు త్ బిల్లులో సగం మొత్తాన్ని సబ్సిడీగా ప్రకటించారు. ముం దు నుంచీ ఈ వాగ్దానాల మీద సందేహాలు వ్యక్తం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లను అలా నోళ్లు మూయించారాయన. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆ రాష్ట్ర పరి ధిలో పని చెయ్యరు. ఆయన కేం ద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉంటారన్న సంగతి చాలా మం దికి తెలియదు. శాంతి భద్రత లకు సంబంధించి తనపై రాగల విమర్శలను కేజ్రీవాల్ ముందే ఊహించారు. ఈ అంశం మీద కేంద్ర హోంమంత్రి కార్యాల యంముందు ధర్నా చేశారు. ఒక ముఖ్యమంత్రి ఇలా ధర్నా చేయ డం మీద విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ పోలీసు లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అజమా యిషీలో ఉండరన్న అంశాన్ని ప్రజలకు తేటతెల్లం చేయగలి గారు. ఢిల్లీ పోలీసుల అసమర్థత రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కాదని వెల్లడించగలిగారు. ఢిల్లీ పోలీసు ల మీద ఆగ్రహంతో ఉన్న ప్రజ లకు ఇది కూడా నచ్చింది. కేంద్రం మీద పోరాటం ప్రైవేట్ విద్యుత్ కంపెనీల అక్ర మాలను అరికడతానని కేజ్రీ వాల్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. విద్యుత్ కంపెనీలతో షీలాదీక్షిత్‌కు గల అక్రమ లావాదేవీల కారణంగానే బిల్లులు ఎక్కువగా ఉంటున్నాయని విమర్శించారు. ప్రైవేట్ విద్యు త్ కంపెనీల ఆర్థిక వ్యవహారాలపై కాగ్‌తో ఆడిట్ చేయిస్తా నని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఆ మేరకు ముఖ్యమంత్రి కాగానే కేజ్రీవాల్ కాగ్‌ను కలసి ఆడిట్ చేయాలని కోరారు. పెట్టుబడులపై 18 శాతం లాభాలను హామీ ఇస్తూ, కంపె నీల ఖర్చులపై ఆడిట్ చేయబోమని షీలాదీక్షిత్ రిలయన్స్ సహా పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కంపె నీలన్నీ తమ ఖర్చుల్ని ఇష్టమొచ్చినంత చూపించుకు న్నాయి. దానిపై 18 శాతం లాభాలను వేసుకున్నాయి. ఖర్చుల్ని ఇష్టమొచ్చినట్లు చూపించి ప్రజల్ని కొల్లగొట్టుకో వడం కుదరదని కేజ్రీవాల్ అభ్యంతరం చెప్పారు. పెట్రోలియం మంత్రి వీరప్పమొయిలీ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తదితరులపై దగా, మోసం అభియోగాలతో కేజ్రీవాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్యాస్ ధరలను పెంచేసి విద్యుత్ చార్జీలు పెరగడానికి కారకుల య్యారని వారిపై నేరారోపణ చేశారు. కొంత మంది పౌరస మాజ ప్రముఖులు తనకిచ్చిన వినతి పత్రంపై కేజ్రీవాల్ స్పం దించి పోలీసు కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సమంజసమేనని, ఫిర్యాదు సవ్యంగానే ఉందని వెల్లడయిం ది. దీనిపై స్టే తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకంజవే స్తోంది. ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అవినీతిని సమర్థిం చినట్లవుతుందని కేంద్రం తటప టాయిస్తోంది. ఆమ్ ఆద్మీ మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండే వారు. ఆ మంత్రులు శక్తి మేరకు కష్టపడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఢిల్లీ శాసనసభ లోని 70 స్థానాలకూ ఆమ్ ఆద్మీ బలం 28 మాత్రమే! అందులో ముస్లిం ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు. కానీ గత 49 రోజులలో ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్‌కు దగ్గరవుతూ వచ్చారు. దళితులలో ఆయనకు గల పునాది కూడా పటిష్టమవుతోంది. మద్దతు ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ను ఖాతరు చేయకుండా విమర్శల దాడి కొనసాగిస్తున్నందుకు చాలా మంది కేజ్రీవాల్‌ను అభి నందిస్తున్నారు. ఢిల్లీలోనే కాక, ఇతర నగరాల్లో మైనారిటీ ఓట్లు కేజ్రీవాల్‌కు పడతాయని విశ్లేషకులు అంటున్నారు. కేజ్రీవాల్ ఒక జాతీయ స్థాయి హీరో అయ్యారు. ప్రజ లు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. కానీ రాజకీయ పార్టీలన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మాదిరిగా తయా రయ్యాయి. అందులో కొత్త వారికి ప్రవేశం ఉండదు. పార్టీ లకు గట్టి మద్దతుదారయినంత మాత్రాన, డబ్బు ఖర్చు చేసినంత మాత్రాన స్థానం లభించదు. అగ్రనేతల అను మతి లేకుండా కొత్తవారెవరూ పార్టీలో క్రియాశీలం కాలేరు. కొత్త రాజకీయ సంస్కృతి నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సత్తా పార్టీ ఏర్పడింది. ఎన్నో ప్రయోగాలు చేసింది. కానీ బలం పుంజుకోలేకపోయింది. తలుపులు మూసిన దుకాణం మాదిరిగా మిగిలిపోయింది. కానీ కేజ్రీ వాల్ తన పార్టీకి బాహాటంగా తలుపులు తెరిచి ఉంచారు. ‘నేను సామాన్యుణ్ణి’ అని రాసి ఉన్న టోపీ ఉంటే చాలు, ఎవరైనా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అయిపోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున టీవీల్లో కనిపిస్తున్న అధికార ప్రతినిధులే డజన్లకొద్దీ ఉన్నారు. వారి మొహాల్లో తాజాదనం, యవ్వ నోత్సాహం తొణికిసలాడుతోంది. టోపీలు ధరించి సౌమ్యంగా తియ్యగా మాట్లాడే వారి అమాయకపు ముఖా లు ప్రజలకు నచ్చుతున్నాయి. కేజ్రీవాల్ భవితవ్యం కేజ్రీవాల్ వంటి ఒక ఘటనాప్రపంచం ఆవిర్భవించగ లదని ఎవరూ అనుకోలేదు. తీరా కంటి ముందు కనిపించే సరికి అందరూ అయోమయంలో పడిపోయారు. దీన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయ పార్టీ పెడుతు న్నారని ఆయన ప్రకటించగానే కేజ్రీవాల్ పని అయిపోయి న ట్లేనని చాలామంది అనుకున్నందువల్లనే అన్నా హజారే పార్టీ ఏర్పాటుకు దూరమయ్యారు. ఆయన అదృష్టాన్నీ, నైపుణ్యాల్నీ అన్నా కూడా సరిగ్గా అంచనా వేయలేకపో యారు. ఎన్నికల్లో గెలిచి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి అన్నాహజారే చాలా ఆగ్రహంగానూ, అసూయతోనూ వ్యవహరించారు. ఎంతో గడుసుతనం ఉన్న అన్నా కూడా మనసు మార్చుకున్నారు. జన్‌లోక్ పాల్ విషయంలో కేజ్రీవాల్ వైఖరికి తోడ్పాటు ఇచ్చారు. 2014 లోక్‌సభ ఎన్నికలు ఆమ్ ఆద్మీకి పరీక్ష వంటివి. దాంతో పాటే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఢిల్లీ శాసనసభలో కేజ్రీవాల్ తన సంఖ్యాబలాన్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు విషయానికి వచ్చేసరికి నగరాల్లో కేజ్రీవాల్, నరేంద్ర మోడీ మద్దతుదారులు ఒకరే. అందువల్ల పార్లమెంటు ఎన్నికల్లో కేజ్రీవాల్ గట్టి ఫలితాలు సాధించగల అవకాశాలు కనిపిం చడం లేదు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో సొంతంగా ప్రభు త్వం ఏర్పాటు చేయగలిగే సంఖ్యలో స్థానాలు పొందగలి గితే జాతీయస్థాయిలో ప్రధాన రాజకీయ పక్షాలకు కేజ్రీ వాల్ ఇబ్బందుల్ని సృష్టించగలరు. కొత్తవారు సైతం పాతు కుపోయిన రాజకీయ దిగ్గజాలను మట్టి కరిపించగలరన్న పాఠాన్ని కేజ్రీవాల్ భారతీయులకు నేర్పారు. కేజ్రీవాల్ కథలోని ఆఖరి అధ్యాయం రచన ఇంకా మొదలుకాలేదు. ఆసక్తికరమైన రోజులు ఇంకా ముందున్నాయి. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) - డా॥పెంటపాటి పుల్లారావు -
కాంగ్రెస్‌కు మోడీ ఫోబియా!
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినా ఫర్వాలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినా బాధ లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ ప్రధాని కాకూడదన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. మోడీని కాంగ్రెస్ నాయకులు, గాంధీ కుటుంబం తమ టార్గెట్‌గా పెట్టుకుని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని గత ఎనిమిదేళ్లుగా మోడీని ఏదో కేసులో ఇరికించి జైల్లో పెట్టేందుకు, అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ కుటుంబం చేయని ప్రయత్నం అంటూ లేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ఆంగ్ల చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూ 2014లోనే అతిగొప్ప ఇంటర్వ్యూగా బ్రహ్మాండంగా పేలుతుందనుకుంటే అదికాస్తా తుస్సుమంది. దీంట్లో కొత్త విషయం ఏమీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. తాను అంతా సవ్యం గా చేస్తున్నట్టుగానూ, ఇతరులే తప్పులు చేస్తున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. గత పదేళ్లనూ ‘స్వర్ణ దశాబ్ది’గా ఈ యువరాజావారు అభివర్ణించుకుంటున్నప్పుడు వచ్చే ఎన్నిక లలో ఓటమి గురించి గుబులెందుకోమరి? ఎవరినీ ఆకర్షించని ఈ ఇంటర్వ్యూ చాలా సాదాసీదాగా చప్పగా తేలిపోయింది. ఈ ఇంటర్వ్యూపై విమర్శల వర్షం కురి సింది. గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ... బీజేపీ ప్రధాని మంత్రిత్వ అభ్యర్థి నరేంద్రమోడీపై ధ్వజమెత్తిన రాహుల్ మాత్రం 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయంలో అప్పటి కాంగ్రెస్ నాయకుల పాత్రపై క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేశారు. అవినీతిని పారదోలేందుకు శక్తివంచనలేకుండా పోరాడతానని అంటూనే... యూపీఏ హయాంలో అవినీతి మంత్రులపై చర్య తీసుకోవల్సిందిగా ప్రధాని మన్మోహన్‌కు తానెలా చెప్తానని, అది తన పని కాదంటూ మాట దాటవేశారు. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 200కు మించి సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కొన్ని సర్వేలలో వచ్చిన అంచనాలు కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. 2009 ఎన్నికలలో గెలిచిన స్థాయిలో 2014లో కాంగ్రెస్ సొంతంగా 206 స్థానాలలో గెలిచే అవకాశం లేదంటూ పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించిన సర్వేలూ, ప్రజానాడిని బట్టి ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. బీజేపీ, దాని మిత్రపక్షాలకు 200కు మించి సీట్లు వస్తాయనీ, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు సుమారుగా వంద స్థానాలు మాత్రమే వస్తాయని సర్వేలు అంచనా వేశాయి. ప్రాంతీయ పార్టీలకు కనీసం 150 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్లో నాలుగు రాష్ట్రాలలో ఓటమి తర్వాత కాంగ్రెస్ నైతికస్థైర్యం దిగజారిపోయింది. మొన్నటిదాకా రాహుల్‌ను భావిప్రధానిగా అం దరూ భావించగా 2014 ఎన్నికల తర్వాత ఆయన ప్రధాని కాలేరన్న అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ఎన్ని ఎత్తులు వేసినా ఫలితం కనిపించడం లేదు. ఓటర్లకు తాయిలాలు పంచిపెట్టి ఎలాగోలా ఎన్నికల గండం నుంచి గట్టెక్కాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆహార భద్రతా చట్టం అమలు చేస్తే ఒక ప్రభంజనం వస్తుందనీ, అది కాంగ్రెస్‌కు ఒక బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందన్న ధీమాలో వారు ఉన్నారు. 1971లో అర్హులైన పేదలకు కొన్ని కిలోల బియ్యం, గోధుమలు పంచిపెడితే అధికారం అప్పగించారు కాబట్టి ఈసారి కూడా గెలిపిస్తారన్న ఊహల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అయితే ప్రజల ముందు కాంగ్రెస్ పప్పులు ఉడకలేదు. 1971కూ, 2013కూ ఎంతో మార్పు వచ్చిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించలేదు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారు. అవినీతిరహిత పాలనకు కాంగ్రెస్ ఎప్పుడూ ప్రాధాన్యమివ్వలేదు. అన్ని రకాల ఎత్తులు వేసి విఫలమైన ఆ పార్టీ ఎదుట వచ్చే ఎన్నికలు గెలిచేందుకు ఎలాంటి విధానమూ, వ్యూహమూ లేదు. గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత... రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే లోక్‌సభ ఎన్నికలలో గెలవడం సులభం అవుతుందని కొంతమంది వందిమాగధులు సోనియా గాంధీ చెవిన వేశారు. దీనిపై జనవరిలో ఒక ప్రకటన చేస్తానని ఆమె చెప్పారు. అయితే సర్వేలలో రాహుల్‌కు మూడోస్థానం రావడం కాంగ్రెస్ నాయకత్వానికి దడ పుట్టించింది. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పేరు ప్రకటించాక లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతే అతని రాజకీయ జీవితం దెబ్బతింటుందని భావించిన సోనియా ఆ ప్రతిపాదనను పక్కనపెట్టారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినా ఫర్వాలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినా బాధ లేదు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ ప్రధాని కాకూడదన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారు. మోడీని కాంగ్రెస్ నేతలు, గాంధీ కుటుంబం తమ టార్గెట్‌గా పెట్టుకుని ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా మోడీని ఏదో కేసులో ఇరికించి జైల్లో పెట్టేందుకు, అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ కుటుం బం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలో వారు సీబీఐనీ, ఇతర అధికార యంత్రాంగాన్నీ వాడుకున్నారు. ఒకవేళ మోడీ ప్రధాని అయితే ఆయన దీనికి కక్ష తీర్చుకుంటారన్న భయం సోనియా కుటుంబాన్నీ, కాంగ్రెస్ నాయకులనూ వెంటాడుతోంది. మోడీ ఇంకా ప్రధానికాకముందే కాంగ్రెస్‌కు ఎంతో నష్టం కలిగించారు. ఆయన ప్రధాని సీట్లో కూర్చున్నాక పూర్తిస్థాయి యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు చట్టపరంగా, రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. పాత అవినీతి కుంభకోణాలపై మళ్లీ దర్యాప్తులు ప్రారంభమవుతాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే ప్రధాని పదవికి రాహుల్ పేరును ప్రకటించలేదు. అంతేకాదు... ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే మోడీ తప్ప ఎవరు ప్రధాని అయినా ఫర్వాలేదన్న ధోరణిలో ఉంది. ఎన్నికల పొత్తుల కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇపుడు లాలూ, కరుణానిధి, మాయావతి ఎవైరె నా ఆ పార్టీకి ఫర్వాలేదు. కమలనాథులను అధికారంలోకి రాకుండా చేసేందుకు చిన్నాచితకా పార్టీలతో జతకట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మాయావతి ఇదివరకే దోస్తీకి తిరస్కరించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఇస్తున్నందున టీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు పెట్టుకుంటామని, వీలైతే ఆ పార్టీని విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ బాహాటంగానే ప్రకటించింది. తెలంగాణ ఇస్తే ఆ ప్రాంతంలో కొన్ని సీట్లు వస్తాయని కాంగ్రెస్ ఆశిస్తోంది. అన్నాడీఎంకే, బీజేడీ వంటి ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ మంతనాలు జరుపుతోంది. ఒకవేళ త్రిశంకు సభ ఆవిర్భవిస్తే బీజేపీకి అధికారం దక్కకుండా చేసేందుకు తృతీయ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చెపుతున్న మాట. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిం దిగా రాష్ట్రపతి బీజేపీ నేతలను ఆహ్వానించకుండా ఉండే పరిస్థితి కల్పించేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎన్నికలముందే బీజేపీతో చిన్నాచితకా పార్టీలు పొత్తు కుదుర్చుకోకుండా అడ్డుకోగలిగితే... ఎన్నికలయ్యాక మిగిలిన వ్యవహారాలను చక్కబెట్టవచ్చని కాం గ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం లో రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం ఉంది. ప్రజలు సత్పరిపాలన కోరుకుంటారు. ఒకవేళ వారు ఎన్నికల తాయిలాలను తీసుకున్నా నిజాయితీ, మంచి పరిపాలననే ఇష్టపడతారు. కాంగ్రెస్ ఈ పాఠాన్ని మర్చిపోయింది. - డాక్టర్ పెంటపాటి పుల్లారావు రాజకీయ విశ్లేషకులు -
ఆంధ్ర నుంచే కొత్త అడుగు
ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహం మార్చుకుంటే, తొలి పాచిక వేసిన ప్రయోజనం (పయెనీర్ అడ్వాంటేజ్) బీజేపీకి లభిస్తుంది. 1996లో వాజపేయికి ఎదురైన చేదు అనుభవం మోడీకి ఎదురుకాకుండా చేసేందుకు బీజేపీ యోచించాలి. దీనికి సమైక్య ఆంధ్రప్రదేశ్ వ్యూహం పనికి వస్తుందేమో ఆ పార్టీ పరిశీలించాలి. చరిత్రను విస్మరించేవాడు చారి త్రక తప్పిదాలు చేయక తప్ప దని అమెరికన్ తత్వవేత్త జార్జ్ సాంతాయన అంటాడు. కొన్ని చారిత్రక ఘటనలను గుర్తుంచు కోవలసిందే. గతాన్ని గుర్తు చేసు కోవడమంటే జరిగిన పొర పాట్లు మళ్లీ మళ్లీ చేయకుండా జాగ్రత్తపడటం. దేశ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమైన శక్తి. 2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీ బలం 116 స్థానా లకు పడిపోయింది. కానీ పదేళ్లలో కాంగ్రెస్ నాయకత్వం లోని యూపీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం వల్ల బీజేపీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నట్లుంది. నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక పార్టీ కార్య కర్తలలో ఉత్సాహం పెరిగింది. కొత్త ఓటర్లు ఆకర్షితుల వుతున్నారు. ఏదయినా పార్టీ అధికారంలోకి రావాలంటే కొత్త ఓటర్లను ఆకట్టుకోవాలి. మోడీతో దేశమంతా ఆ పని జరిగింది. ఇదే ఆంధ్రప్రదేశ్‌లోనూ జరగాలి. 2009 ఎన్ని కలలో బీజేపీ రాష్ట్ర అసెంబ్లీకి ఇద్దరు ఎమ్మెల్యేలను పం పింది. ఈ పార్టీకి పోలైన ఓట్లు మూడు శాతమే. లోక్ సభకు పోటీ చేసిన వాళ్లంతా, సికింద్రాబాద్‌లో తప్ప, ధరావతు కోల్పోయారు. జీరో అయినా... అయినా ఇక్కడ జరిగే రాజకీయ చర్చల్లో బీజేపీ ప్రస్తావన విధిగా ఉండడానికి కారణం, పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థించడమే. 116 లోక్‌సభ స్థానాలూ, 54 రాజ్యసభ స్థానాలూ ఉన్న బీజేపీ తెలంగాణ మీద తీసుకునే నిర్ణయానికి ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఈ విషయంలో బీజేపీది చిత్రమైన పరిస్థితి. మద్దతు ఇస్తున్నా తెలంగా ణను తీసుకొచ్చే స్థితిలోలేదు. తలుచుకుంటే, తెలంగాణ ను ఆపే శక్తి మాత్రం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ జీరో అయినా, రాష్ట్ర భవిష్యత్తును శాసించే స్థితి ఉండటం విశేషం. అందుకే పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వచ్చిన ప్పుడు బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే విషయా న్ని తెలంగాణ అనుకూలురు, వ్యతిరేకులు కూడా చర్చిస్తు న్నారు. ఈ అంశాన్ని మొదటి నుంచి సమర్థిస్తున్నామని, ఇప్పుడు వెనక్కు వెళ్లలేనని చెప్పి పార్లమెంటులో బిల్లును సమర్థిస్తే, బీజేపీకి మేలుకు బదులు రాజకీయంగా నష్టం జరుగుతుంది. అందువల్ల బిల్లు మీద తుది నిర్ణయం తీసు కునే ముందు ఆగస్టు 1 తర్వాత సీమాంధ్ర ప్రాంతాలలో చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని, తెలంగాణలో పార్టీకి వచ్చే ప్రయోజనాన్ని బేరీజు వేసుకోవడం అవసరం. తెలంగాణ మీద తమ వైఖరి కాంగ్రెస్‌కు భారీగా లబ్ధి చేకూర్చగలదన్న విషయాన్ని బీజేపీ విస్మరించరాదు. 1996 అనుభవాన్ని మననం చేసుకుంటే చాలు, 2014 ఎన్నికలలో గెలిచే దారి బీజేపీ కళ్లముందు కనబడుతుంది. విస్మరించరాని అనుభవం రాజకీయ పార్టీలు సంస్థాగత జ్ఞాపకశక్తి (ఇనిస్టిట్యూషనల్ మెమొరి)ని అలవర్చుకోవాలి. గతంలో ఎలాంటి సమస్య లను ఎదుర్కొన్నది, కష్టాలు పడింది, వాటిని ఎలా పరిష్క రించుకున్నది లేదా ఆ సమస్యల్లో తామెలా నలిగిపో యింది రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. ఆ జ్ఞాపకశక్తి తోనే ఈ ముప్పులు తిప్పలు మళ్లీ మళ్లీ ఎదురుకాకుండా తప్పించుకోవచ్చు. 1996లో బీజేపీ మొదటిసారి అధికా రంలోకి ఎలా వచ్చిందో చూద్దాం. అప్పుడు లోక్‌సభలో బీజేపీ బలం 161. శివసేన, సమతా పార్టీ, హర్యానా వికాస్ పార్టీ పార్టీలు బీజేపీతో ఉండేవి. మే 16న రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అటల్ బిహారీ వాజపేయిని ఆహ్వానించారు. పార్లమెంటులో బలం నిరూపించుకోవలసిందిగా పదిహేను రోజుల గడు వు ఇచ్చారు. చిన్నాచితక పార్టీలన్నీ బీజేపీ కార్యాలయా నికి పరిగెత్తుకుంటూ వచ్చి సంకీర్ణ ప్రభుత్వంలో చేర్చు కొమ్మని బారులు తీరతాయని భావించారు. ఒక వర్గం కాంగ్రెస్ ఎంపీలు వలస వస్తారని బీజేపీ నాయకత్వం అత్యాశకుపోయింది. తీరా బలనిరూపణ కష్టమై, వాజ పేయి 1996 జూన్ ఒకటో తేదీన ప్రధాని పదవికి రాజీ నామా చేయాల్సివచ్చింది. తర్వాత కాంగ్రెస్, వామపక్షా లతో, డిఎంకే, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో జనతాదళ్ నాయకుడు హెచ్డీ దేవెగౌడ నాయత్వంలో యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, వామపక్షాలకు కావలసింది 70 మంది ఎంపీలే. అప్పుడు లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్జేడీ, ములాయం సింగ్ నాయక త్వంలోని సమాజ్ వాది పార్టీలతో పాటు డీఎంకే, తమిళ మానిళ కాంగ్రెస్‌లు కూడా ఈ కూటమిలో చేరేందుకు ముందుకు వచ్చాయి. బీజేపీ వ్యతిరేక కూటమిని కూడ గట్టడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. ఇలా ఏర్పడిన యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదట దేవెగౌడ, తర్వాత ఐకే గుజ్రాల్‌ల నాయకత్వంలో రెండేళ్లకు పైగా కొనసా గింది. అయితే అప్పుడు తమ ప్రభుత్వం పదమూడు రోజులకు మించి ఎందుకు మనుగడ సాగించలేకపో యిందో బీజేపీ మననం చేసుకోవాలి. పరిస్థితులు మారాయి దేశ రాజకీయాలలో కాంగ్రెస్, బీజేపీ తటస్థులనే మూడు రకాల శక్తులున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని రాబోయే రాజకీయ పరిస్థితిని ఒకసారి ఊహించుకుందాం. బీజేపీ అన్నింటికంటే పెద్ద పార్టీగా వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత ఆధిక్యం వచ్చేలా కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపు వస్తే కాంగ్రెసేతర, వామపక్షేతర పార్టీలన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయని ఇప్పుడు కూడా బీజేపీ ఆశిస్తూ ఉంది. అది జరిగే పనికాదు. 1996-98 మధ్య ఎలాంటి వైభవం అనుభవించినదీ తటస్థ పార్టీలేవీ మరిచిపోలేదు. డిఎంకే, తమిళ మానిళ కాంగ్రెస్ పార్టీలకు 14 మంత్రి పదవులు లభిస్తే, లాలూ ప్రసాద్, సీపీఐ, రామ్‌విలాస్ పాశ్వాన్లు బీహార్‌కు 16 పదవులు తీసు కెళ్లారు. అందువల్ల మళ్లీ మూడో ఫ్రంట్‌కు కాంగ్రెస్ ప్రాణం పోస్తుందేమోనని తటస్థ పార్టీలన్నీ ఎదురు చూస్తూనే ఉంటాయి. జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు, జయలలిత, నవీన్ పట్నాయక్, నితీష్‌కుమార్, లాలూ, రామ్‌విలాస్ పాశ్వాన్, ములాయంసింగ్, మాయవతి, మమతా బెనర్జీ తటస్థులు. ఇంతవరకు జరిగిన అభి ప్రాయ సేకరణల ప్రకారం వీళ్లందరికీ కలిపి లోక్‌సభలో 175 స్థానాల దాకా రావచ్చు. కాంగ్రెస్ కూడా పూర్తి మెజా రిటీ సాధించలేకపోయినా, అత్యధిక స్థానాలు పొందిన పార్టీగా నిలవాలని ఆ పార్టీ కలలు కంటూ ఉంది. అలాం టప్పుడు, ఈసారి లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ వంటి దళిత నేతను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి, ఇతర పార్టీల సాయం కోరవచ్చు. కాంగ్రెస్‌కు ఇలాంటి అవకాశం రాకున్నా, నరేంద్రమోడీ ప్రధాని కాకుండా చేసేందుకు ఎత్తుగడ వేయవచ్చు. అలా ప్రభుత్వ ఏర్పాటుకు తటస్థ పార్టీలను ప్రేరేపించవచ్చు. అవసరమైతే, ఆ ప్రభుత్వంలో చేరి సంకీర్ణం ఎక్కువ కాలం మనుగడ సాగించేందుకు ఉపకరించవచ్చు. ఎత్తులూ పైఎత్తులూ తప్పవు ఢిల్లీ పీఠానికి కాంగ్రెస్‌ను దూరంగా ఉంచేందుకు బీజేపీ కూడా ఇలాంటి యోచన చేయవచ్చు. కాంగ్రెసేతర ప్రభు త్వం ఏర్పాటు కావడం, దానికి బీజేపీ బయట నుంచి మద్దతు ఇవ్వడం జరిగే పని కాదు. మెజార్టీ పార్టీ హోదా రాగానే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు వస్తుంది. కానీ తటస్థ పార్టీలు ముందుకు రావు. 2014లో కూడా 1996 పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలు మెం డుగా ఉన్నాయి. నరేంద్రమోడీ వల్ల బీజేపీకి పోలయ్యే ఓట్లు పది శాతం పెరగవచ్చు. ఫలితంగా లోక్‌సభ స్థానా లు 190కి పెరగవచ్చు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇదొ క్కటే చాలదు. గత ఎన్డీయే భాగస్వాములు జయ, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్‌లు మళ్లీ కలుస్తారని బీజేపీ ఆశ. కానీ తమను సమర్థించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నప్పుడు తటస్థ పార్టీలు బీజేపీ వైపు ఎందుకు వస్తాయి? ఓ చాణక్యుడు కావాలి 2014లో దారి చూపేందుకు బీజేపీకి ఒక చాణక్యుడో, మాకియవెల్లియో కావాలి. ఎన్నికల అనంతర చారిత్ర ఘటనలు బీజేపీ అదుపులో ఉంటాయనుకోరాదు. కాం గ్రెస్‌ను బీజేపీ తక్కువ అంచనా వేసేందుకు వీలులేదు. తనకు అధికారం రాకపోతే, బీజేపీకి కూడా అధికారం దక్కకుండా చేయడం ఎలాగో చెప్పే ఉపప్రణాళికను ఈసారి కూడా కాంగ్రెస్ సిద్ధం చేసుకునే ఉంటుంది. మోడీ రావడం కంటె బలహీన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే మంచిదని కాంగ్రెస్‌కు తెలుసు. కాంగ్రెస్ లాగా, బీజేపీ కూడా ఉప ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. బీజేపీ, మిత్ర పక్షాలకు కలిపి 225 స్థానాలు వస్తాయనే సందేశం ఎన్ని కల ముందే పార్టీ ప్రజల్లోకి పంపించాలి. ఇలాంటి ఆచరణ సాధ్యమైన ప్రణాళిక సిద్ధంగా ఉంటే జయలలిత, నవీన్ పట్నాయక్‌లను వెనక్కి రప్పించుకోవచ్చు. బీజేపీ మీద ఈ పార్టీలన్నింటికీ విశ్వాసం పెరగాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ వ్యూహం మారాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక 25 స్థానాల మద్దతు సంపాదించగలిగితే జయ, నవీన్ పట్నాయక్‌లు బీజేపీని గౌరవించడం మొదలుపెడతారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యూహం మార్చుకుంటే, తొలి పాచిక వేసిన ప్రయోజనం (పయెనీర్ అడ్వాంటేజ్)బీజేపీకి లభిస్తుంది. 1996లో వాజపేయికి ఎదురైన చేదు అనుభవం మోడీకి ఎదురుకా కుండా చేసేందుకు బీజేపీ యోచించాలి. దీనికి సమైక్య ఆంధ్రప్రదేశ్ వ్యూహం పనికి వస్తుందేమో ఆ పార్టీ పరిశీలించాలి. - డా॥పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు -
కసరత్తు చాలని కమలం
విశ్లేషణ: ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం మిఠాయి పొట్లంవలె నోరూరిస్తూ చేతికందేలా ఉంది. దీనిని అందుకోవాలంటే ఒకటే-రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎనభై రోజులుగా ఉద్యమిస్తున్న రాయలసీమ, కోస్తా ప్రజలకు మేం అండగా ఉంటామని చెప్పాలి. సీమాంధ్రుల మనోభావాలను గమనించకుంటే తెలంగాణ ఏర్పాటుకు మద్దతునీయమని ప్రకటన చేయాలి. రేపటి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వేచి చూడకుండా ఇది జరగాలి. గ్రీకు పురాణాలలో టాంటలస్ కథ కనిపిస్తుంది. చేయరాని తప్పులేవో చేయడంతో ఈ రాజుకి దేవతలు చిత్రమైన శిక్ష విధించారు. ఒక పండ్ల చెట్టు కింద ఉన్న తటాకంలో రాజు నిలబడే ఉండాలి. కానీ దాహమే సినప్పుడు తాగేందుకు దోసిలి పడితే నీళ్లు దూరంగా జరుగు తాయి. ఆకలేసినప్పుడు పండ్లం దుకునేందుకు చేయి చాచితే కొమ్మలు అందకుండాపోతాయి. నిత్యం ఆకలితో, దాహం తో అలమటించాలి. నీళ్లు, పండ్లు అందుబాటులో ఉన్నా అందుకుందామంటే అందనంత దూరంగా జరిగిపోతా యి. భారతీయ జనతా పార్టీ పరిస్థితి చూస్తే శాపగ్రస్థ టాంటలస్ గుర్తుకొస్తాడు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గెలు పనేది బీజేపీకి చేయి చాస్తే అందేంత దగ్గరలో కనిపిస్తూ ఉంటుంది. కానీ పదేళ్లుగా అందక బీజేపీని అలమటింప చేస్తూనే ఉంది. నల్లేరు మీద నడక కాదు 2009లో బీజేపీకి 116 మంది ఎంపీల బలమే ఉంది. అగ్ర నేత ఎల్.కె.అద్వానీ ఆకర్షణ తగ్గిపోయిందనుకుని ఇప్పు డు నరేంద్రమోడీని తీసుకువచ్చారు. పార్టీ కళ్ల ముందు ఎన్డీఏ ప్రభుత్వం కనిపించేలా చేయడంలో మోడీ విజయ వంతమయ్యాడు కూడా. అయితే, మోడీ కూడా టాంట లస్ లాగా బాధపడతాడో లేక శాప విముక్తి చేసుకుంటాడో చూడాలి. నరేంద్ర మోడీ వల్ల కొంత ఉత్సాహం వచ్చినా, చాలా రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి ఊహించినంత ఆశాజనం గా లేదు. ముఖ్యంగా నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఈ పార్టీ అంత ఆరోగ్యకరంగా లేదు. ఈ నాలుగు రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు బీజేపీ చేతిలో ఉంటే ఢిల్లీ, రాజ స్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ నాలుగు రాష్ట్రాలలో కనీసం మూడు బీజేపీ గెల్చుకుని తీరాలి. కానీ అక్కడి రాజకీయ పరిస్థితులు దీనికి అనుకూలంగా కనిపిం చడం లేదు. ఢిల్లీ, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక పవనాలను ఎదుర్కొంటున్నాయని, ఈసారి తమదే అవకాశమని బీజేపీ ఆశ. పదేళ్లుగా బీజేపీ చేతిలోనే ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా అదే సంభవించాలి! ఢిల్లీలో షీలాదీక్షిత్, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ల ప్రభుత్వాలతో ప్రజలు విసుగెత్తి ఉంటే, మధ్య ప్రదేశ్‌లో శివరాజ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్‌ల రమణ్సింగ్ల విషయంలోనూ అదే సూత్రం వర్తించాలి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆకర్షణ తగ్గిపోతోంది. 2003 ఎన్నికలలో 288 స్థానాలు ఉన్న ఆ అసెంబ్లీలో 168 స్థానా లు గెలిచి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2008లో శివరాజ్ చౌహాన్ నాయకత్వంలో నెగ్గినా పార్టీ బలం 143కు పడిపోయింది. శివరాజ్ చౌహాన్ పెద్దగా వివాదా లలో, కుంభకోణాలలో చిక్కుకొనకపోయినా పాలనాదక్షు డిగా పేరు తెచ్చుకోలేకపోయాడు. ఆయనను గుర్తు చేసే పథకం, కార్యక్రమం లేవు. పదేళ్ల తర్వాత ఓటరులో ప్రభు త్వ వ్యతిరేకత, విరక్తి సహజం. నాయకత్వం నిత్యనూత నం కాకపోతే ప్రజల దృష్టి ఒక నాయకుడి మీదే నిలబడ టం కష్టం. శివరాజ్ది ఇప్పుడు ఇదే పరిస్థితి. చౌహాన్ ఓడిపోవడమంటూ జరిగితే అది బీజేపీకి విఘాతమే. ఢిల్లీ చుట్టూ తిరగడం, సదా పత్రికలలో కనిపించడం నచ్చని నాయకుడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్. చిన్న రాష్ట్రం కావడం వల్ల ఛత్తీస్‌గఢ్‌కు, అక్కడ అధికారంలో ఉన్నందుకు బీజేపీకీ సమస్యలు బాగానే ఉన్నాయి. 90 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో 2008లో 50 సీట్లు సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ కు, కమలానికి ఉన్న ఓట్ల వ్యత్యాసం ఒక శాతం. బీజేపీకి 50 శాతం, కాంగ్రెస్‌కు 49 శాతం ఓట్లు వచ్చాయి. బస్తర్ మావోయిస్టు ప్రాంతంలో ఉన్న 12 స్థానాలలో 11 గెల్చు కుని బీజేపీ అధికారానికి దగ్గరయింది. ఈ పదేళ్ల అధికారం వల్ల లబ్ధి పొందని బీజేపీ నాయకుల వల్ల పార్టీలో ముఠా లు వచ్చాయి. ప్రజలలో ఉన్న బీజేపీ వ్యతిరేకతకు ఈసారి ఇది కూడా తోడవుతుంది. మారిన ఢిల్లీ దృశ్యం ఢిల్లీలో ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీలే అధికారం పంచు కుంటూ వచ్చాయి. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ రావడంతో పరిస్థితి మారింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ఈ పార్టీతో బీజేపీ ఆశకు గండిపడే స్థితి కనిపిస్తున్నది. సాధారణ పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేకత సూత్రం ప్రకారం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఢిల్లీలో అధికారం దక్కకపోతే బీజేపీ జాతీయస్థాయిలో గౌరవం కోల్పోతుంది. ఒక్క రాజస్థాన్ లోనే బీజేపీ గట్టెక్కేలా కనిపిస్తున్నది. ఇక్కడ కూడా పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యనే. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం వివాదరహిత పాలన అందించడంలో విఫలమయిందనే చెప్పాలి. ఆ అపకీర్తి బీజేపీలో ధీమా పెంచింది. ఢిల్లీ, రాజ స్థాన్లను కోల్పోయినా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక రాష్ట్రాన్ని కాంగ్రెస్ గెల్చుకున్నా కూడా బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినట్లే. మోడీ ఆత్మరక్షణలో పడిపోతాడు. బీజేపీని ప్రజలు తిరస్కరిస్తున్నారన్న కాంగ్రెస్ విమర్శకు జవాబు చెప్పడం మోడీకి ఇబ్బంది కావచ్చు. ఆంధ్రలో కమలం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ వేళ్లూను కోలేకపోతోంది. ఇప్పుడు తెలంగాణకు మద్దతుతో కొన్ని ఓట్లు తెచ్చుకునే అవకాశం దొరికింది. కానీ ఈ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు తెలంగాణలో ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితి ఉండటం వల్ల ఆ ఆశయం నెరవేరుతుందని కచ్చితంగా చెప్పలేం. ఆంధ్రప్రదేశ్ నుంచి అదనంగా సీట్లు వచ్చే అవకాశం లేనందున, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎదురయ్యే ఓటమి భర్తీ చేసే మార్గం లేదు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ఓటమి బీజేపీని టాంటలస్గా మార్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రేపటి జాతీయ ప్రభు త్వం ఎవరిదో నిర్ణయించే శక్తి ఆంధ్రప్రదేశ్‌లోని 42 లోక్ సభస్థానాలకే ఉందని బీజేపీకి, కాంగ్రెస్‌లకు తెలుసు. ముందున్న అవకాశాలు దేశ రాజకీయాలలో ఇకపైనా ఒక శక్తిగా కొనసాగాలనుకుం టే, 2014 ఎన్నికలలో గెలవడం బీజేపీకి చాలా అవసరం. ఓడిపోతే, అధికారంలోకి రాలేని పార్టీల జాబితాలో పడిపో తుంది. చాలా మంది విజేతకే ఓటేయాలని భావిస్తారు. విజేత ఎవరో వరస పరాజయాలను బట్టి ప్రజలు నిర్ణ యించుకుంటారు. బీజేపీ ఇలాంటి ఖాతాలో చేరిపోకూ డదు. మోడీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా ఉంటుందా లేదా అనేది ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేల్చే స్తాయి. 2014లో అధికారంలోకి రావడం భారతీయ జనతాపార్టీ లక్ష్యమైతే రాయలసీమ, కోస్తా ప్రజల డిమాం డ్లకు సంపూర్ణ మద్దతు ఇవ్వక తప్పదు. అప్పుడు ఈ ప్రాం తంలోని 25 మంది ఎంపీల సానుభూతి దొరుకుతుంది. బీజేపీకి ఒకటో రెండో స్థానాలు దక్కవచ్చు. ఇతర పార్టీల ఎంపీలే ఢిల్లీలో ఎన్డీఏకి మద్దతునిచ్చేలా ఒత్తిడి తెస్తారు. ఈ ప్రాంతంలోని పదమూడు జిల్లాలో పెల్లుబికిన కాం గ్రెస్ వ్యతిరేకత చూశాక ప్రజలు బీజేపీకి మద్దతునీయ కుండా ఉండటం కష్టం. తెలంగాణ అంశానికి మద్దతుని చ్చినా బీజేపీకి అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం లేదు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాదని తెలంగాణకే మద్దతునీయాలని నిర్ణయించడం వల్ల ఆ ప్రాంతంలో బీజేపీకి వచ్చే ప్రయోజనమేమీ లేదు. తెలం గాణ నుంచి ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకండా సీమాంధ్ర ప్రజల మనోభావాలను బేఖాతరు చేయడం బీజేపీకి నష్టం కలిగిస్తుంది. సీమాంధ్రులకు మద్దతిస్తే... ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం మిఠాయి పొట్లంవలె నోరూరిస్తూ చేతికందేలా ఉంది. దీనిని అందుకోవాలంటే ఒకటే-రాష్ట్ర విభ జనను వ్యతిరేకిస్తూ ఎనభై రోజులుగా ఉద్యమిస్తున్న రాయలసీమ, కోస్తా ప్రజలకు మేం అండగా ఉంటామని చెప్పాలి. సీమాంధ్రుల మనోభావాలను గమనించకుంటే తెలంగాణ ఏర్పాటుకు మద్దతునీయమని ప్రకటన చేయా లి. రేపటి ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వేచి చూడకుండా ఇది జరగాలి. ఈ రాష్ట్రాలలో పరాజయం ఎదురయ్యాక విధానాలను మార్చుకునేందుకు బీజేపీకి తగినంత సమ యం ఉండదు. మాకియవెల్లి రాజకీయాల గురించి చెబు తూ ‘అది అసాధ్యాలను సుసాధ్యంచేసే కళ’ అన్నాడు. అందీఅందక ఊరిస్తున్న విజయాన్ని దక్కించుకోవాలనుం టే ఐదువందల ఏళ్ల కిందట మాకియవెల్లి చెప్పిన మాటల మర్మాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే టాంటలస్ తరహా శాపం నుంచి బీజేపీకి విముక్తి. -
‘విజయమ్మ దీక్ష ఉద్యమకారుల బలాన్ని పెంచింది’
విశాఖ: వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్ష ఉద్యమకారులకు బలాన్ని పెంచిందని రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై సమన్యాయం పాటించాలంటూ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ దీక్షతో కాంగ్రెస్ నేతల కళ్లు తెరుచుకోవడం ఖాయమన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోజు రోజుకూ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఆహార భద్రత బిల్లును వ్యతిరేకిస్తేనే విభజన అంశం ఆగుతుందన్నారు. ఆహార భద్రత బిల్లు పాస్ అయితే సీమాంధ్ర ఎంపీల అవసరం ఉండకపోవచ్చని పుల్లారావు అభిప్రాయపడ్డారు.