ఈ ‘సమురాయ్’ దారెటు?
నరేంద్రమోడీ ప్రధాని కాగానే, దూకుడుతో కూడిన విదేశీ, రక్షణ విధానాన్ని ప్రారంభించగలరని భారతీయులకు నమ్మకం కలిగింది. వందరోజుల్లోనే మోడీ తన బుద్ధి కుశలతతో, సానుకూల విదేశీ విధానంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇన్నాళ్లుగా శత్రువైఖరితో ఉన్న కొన్ని దక్షిణాసియా దేశాలలో పర్యటించి అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. ఇలాంటి సంతోషకరమైన పరిణామాలు మరిన్ని కలుగుతాయనీ, కలగాలనీ ఆశిద్దాం.
ప్రధాని నరేంద్రమోడీ జపాన్ సందర్శన దాదాపు ముగింపుకొస్తోంది. ఈ సందర్భంలో ఆయన ఆధ్వర్యంలోని రక్షణ రంగం గురించి మాట్లాడు తున్నప్పుడు జపనీయుల మహత్తర సమురాయ్ యుద్ధవీరుడి జ్ఞాపకాలు తలపు కొస్తున్నాయి. బహుశా చరిత్రలో ఇంతవరకు నమోదైన అతిగొప్ప యుద్ధవీరులు జపాన్‌కి చెందిన సమురాయ్‌లే. వీరు పురాతన గ్రీకు దేశంలోని స్పార్టన్‌లతో సమానులు. వీరి త్యాగం, శౌర్యం సాటిలేనివి. పలు హాలీవుడ్ సినిమాలకు వీరి శౌర్యం పునాదిగా నిలిచింది కూడా. అయితే, ఆధునిక కాలంలో దేశాలు శౌర్యం, ప్రతిష్ట సూత్రాలపై ఆధారపడి కార్యకలాపాలను సాగించలేవు. మోడీ సమురాయ్ కాలేరు. ప్రస్తుతం యుద్ధానికి వెళ్లకుండానే విదేశీ విధానాన్ని నిర్వహించే సూక్ష్మబుద్ధి కలిగిన రాజకీయ నేతలు అవసరం. విజయవంతమైన విదేశాంగ విధానం అంటే, యుద్ధం చేయకుండా తన లక్ష్యాలను దేశం సాధించడమని అర్థం.
దౌత్యనీతిని నైపుణ్యంగా ఉపయోగించుకోవడం ద్వారా యుద్ధాన్ని తప్పించాలి. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినప్పుడు, ఆయన దూకుడుతో కూడిన విదేశీ, రక్షణ విధానాన్ని ప్రారంభించగలడని భారతీయులకు నమ్మకం కలిగింది. ఇరుగు పొరుగు దేశాల నుంచి ఉగ్రవాదాన్ని, బెదిరింపులను తాను సహించబోనని మోడీ కూడా ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు చెబుతూ వచ్చారు. మన దేశం అవమానాల పాలయిందని, దీన్ని బలహీన దేశంగా భావించారని ఆయన పదే పదే పేర్కొన్నారు. సరైన సన్నాహకాలు లేకుండా ఏ దేశంపైనయినా దాడి చేయవలసిందిగా ైసైన్యాన్ని ఆదేశించడం ప్రధానిగా మోడీకి కష్టమే కాగలదు. దాడిని ప్రారంభించడం సులభమే. కాని దానికి ఒక నిష్ర్కమణ మార్గం కూడా ఉండాలి. అందుకే, మోడీ ప్రధాని అయ్యాక చేతలను పరిమితం చేసుకోవడం అనే కష్టభూయిష్టమైన లక్ష్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అదే సమయంలో బలమైన ప్రభుత్వంపై తానిచ్చిన హామీని అమలు చేయడంపై కలవరపడ్డారు కూడా. బలమైన ప్రభుత్వం అంటే పొరుగు దేశాల శత్రుచర్యలను తిప్పికొట్టడమేనని అర్థం. కానీ నిజజీవితంలో ఇలా చేయడం చాలా కష్టం.
రక్షణ, విదేశీ విధాన సమస్యలు
చైనా, పాకిస్థాన్ రెండింటితో భారతదేశానికి విదేశాంగ విధానంలో, రక్షణ రంగంలో తీవ్రమైన సమస్య ఉంటోంది. ఇలా ఒక పెద్ద దేశానికి రెండు పొరుగు దేశాలతో శత్రుత్వం ఉండటం అరుదు. గత 60 ఏళ్లుగా చైనా, పాకిస్థాన్‌తో శత్రుత్వం కారణంగా ఇతర పొరుగు దేశాలు కూడా భారత్ పట్ల ప్రతికూల వైఖరినే చేపడుతున్నాయి. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో పాకిస్థాన్ నుంచి అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. అలాంటి ఉగ్రవాద చర్యలను ప్రభుత్వం అరికట్టలేకపోయింది. కాశ్మీర్ మనకు శాశ్వత సమస్యగా మారిపోయింది. భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లోని ఒక రాజకీయ పార్టీని పాకిస్థాన్ ప్రోత్సహించడంతో ఆ దేశం కూడా సమస్యాత్మకంగా మారింది. బేగమ్ జియా అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ బంగ్లాదేశ్, భారత్ పట్ల శత్రు వైఖరితో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం మారి, బేగమ్ హసీనా అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇండియా ప్రశాంతంగా ఉంటుంది. అయితే బంగ్లాదేశ్‌కు వాగ్దానం చేసిన ఏ హామీలనూ నెరవేర్చకపోవడంతో వారి దృష్టిలో మన దేశం బలహీనపడి పోయింది.
అలాగే శ్రీలంకతో భారత్ ఎలాంటి స్నేహపూర్వక ప్రయత్నాలు చేపట్టినా యూపీఏ ప్రభుత్వాన్ని బలపరుస్తున్న తమిళనాడు పార్టీలు బెదిరింపులకు దిగేవి. దీంతో శ్రీలంక క్రమంగా చైనా, పాకిస్థాన్‌లకు దగ్గరయింది. నేపాల్‌కు భారత్‌తో నిరాటంకమైన సరిహద్దులున్నాయి. నేపాలీయులు వీసాలు లేకుండానే భారత్‌కు స్వేచ్ఛగా వచ్చి పనిచేసుకునేవారు. అయితే గత పదేళ్లుగా మన దేశం నేపాల్‌కు శత్రువుగా మారింది. 2014 నాటికి భారత్‌కు సరిహద్దు దేశాలైన, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక తో శత్రుత్వం ఏర్పడింది. మన్మోహన్ తన పదవీకాలంలో ఎన్నడూ నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలను సందర్శించలేదనీ, ప్రధానిగా తన హయాంలో చివరి సంవత్సరం మాత్రమే ఆయన బంగ్లాదేశ్‌ను సందర్శించారనీ గుర్తుంచుకోవాలి.
ప్రారంభం అదిరింది
ఇదీ నరేంద్రమోడీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసినప్పటి స్థితి. అయితే ప్రారంభం నుంచీ ఆయన గొప్ప తెలివిని, సమయస్ఫూర్తినీ ప్రదర్శిస్తూ వచ్చారు. మే 26న ప్రధానిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావలసిందిగా దక్షిణాసియా దేశాల ప్రధాన మంత్రులందరికీ పది రోజులకు ముందే ఆహ్వానం పంపడం ప్రకంపనలు సృష్టించింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేని ఆహ్వానించవద్దని తమిళనాడు రాజకీయ పార్టీలు నిరసన తెలిపినప్పటికీ మోడీ పట్టించుకోలేదు. దీంతో శ్రీలంక మళ్లీ ఇండియా పట్ల మిత్రవైఖరి కనబర్చింది, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను మోడీ ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. మోడీ ప్రారంభం అదిరింది. పైగా దక్షిణాసియాలో తన తొలి పర్యటనను భూటాన్ నుంచే మొదలెడతానని మోడీ ప్రకటించారు. మన్మోహన్ హయాంలో భూటాన్‌తో కూడా మనకు శత్రుత్వం ఏర్పడింది. కాని వాటిని పరిష్కరించుకోలేదు. మోడీ తొలి సందర్శన భూటాన్ వాసులకు ఉపశమనం కలిగించింది.
తమ దేశానికి ఇండియా అటువంటి ప్రాధాన్యతను ఇవ్వడంతో వారు బహు సంతోషపడిపోయారు. మన్మోహన్ హయాంలో నేపాల్‌తో మన సంబంధాలు శత్రుపూరితంగా మారాయి. కాని మోడీ తన తదుపరి సందర్శన నేపాల్‌కే అని చెప్పి మరీ వెళ్లారు. ఆ సందర్భంగా నేపాల్‌కు ఎలాంటి సూచనలు చేయడానికి భారత్ ప్రయత్నించదని నేపాలీయులకు, ఆ దేశ పార్లమెంటుకు హామీ ఇచ్చారు. నేపాల్ ఏది కోరుకున్నా భారత్ దాన్ని బల పరుస్తుందన్నారు. ఇండియాకు విద్యుత్‌ను అమ్మాలని నేపాల్ నిర్ణయించుకుంటే తాను స్వాగతిస్తానన్నారు. అంతే తప్ప తమ వైపు నుంచి ఎలాంటి ఒత్తిడీ ఉండదన్నారు. దీంతో నేపాల్‌లో భారత్ పట్ల తీవ్ర శత్రుత్వం ప్రదర్శించే శక్తుల మనసులను కూడా మోడీ గెల్చుకున్నారు.
చైనా, భారత్, జపాన్
అంతర్జాతీయంగా చైనా విస్తరణవాద విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడు తోంది. చైనా ఇప్పటికే తన పొరుగు దేశాలైన వియత్నాం, ఫిలిప్పైన్స్, దక్షిణ కొరియా, జపాన్‌లతో జగడమాడుతోంది. ఈ నేపథ్యంలో మిత్రుల కోసం వెదుకులాటలో భాగంగా భారత్‌తో భాగస్వామ్యానికి జపాన్ ప్రయత్నించింది కాని మన్మోహన్ ప్రభుత్వం స్పందించలేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండీ జపాన్‌కు సైన్యం లేదు.
కానీ ప్రస్తుతం భారత్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా జపాన్ మారవచ్చు. మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ ఇప్పుడు సన్నిహితం కావడానికి ప్రయత్నించడమే చైనాకు అవమాన కరం. దీంతో దక్షిణాసియాలో చైనా శత్రువులు కూడా జపాన్‌తో జత కడతారు. ఇటీవలే జపాన్ పర్యటనలో నరేంద్ర మోడీ స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏ దేశం కూడా విస్తరణవాదంతో వ్యవహరించవద్దనీ, చైనా తప్పు దోవలో పడుతోందనీ సూచించారు. ఆసియాలో చైనా ఏకాకి అవుతోంది. అంటే పాకి స్థాన్‌తో స్నేహానికి గాను చైనా భారీ మూల్యం చెల్లిస్తోందన్న మాట. ఇండియా నుంచి చైనాకు వెళుతున్న సందేశం ఇదే.
వందరోజుల పాలన ఆశాజనకం
మన్మోహన్ పదేళ్ల పాలన కంటే మోడీ తొలి వంద రోజుల పాలనలోనే మన విదేశాంగ విధానం చురుగ్గా, మెరుగ్గా ఉంది. శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియాలోని చిన్నచిన్న దేశాలను గౌరవించడం ద్వారా మోడీ పొరుగు దేశాలతో గతంలో జరిగిన తప్పులను సవరించడానికి ప్రయత్నించారు. ఏది చేయాలన్నా వందరోజులు మరీ తక్కువ సమయం. కాని విదేశాంగ విధానంలో తనకు సొంత దృక్పథం ఉందనీ, ప్రమాదాలను ఎదుర్కోవడానికి తాను వెనకడుగు వేయనని మోడీ సూచించారు. హురియత్ నేతలతో పాక్ హైకమిషనర్ మాట్లాడటంపై అభ్యంతరం తెలుపుతూ విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలను చివరి నిమిషంలో నిలిపివేసింది అందుకే.
పాకిస్థాన్‌తో ఇంత మొండివైఖరి అవలంబించడంపై మోడీని పలువురు విమర్శించినప్పటికీ, ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్న సందేశాన్ని పాక్‌కు ఇండియా అందించింది. దేనికైనా సిద్ధపడటమనేది తప్పదు కానీ విదేశాంగ విధానంలో మోడీ కాస్త జాగరూకతతో వ్యవహరించాలి. ఆస్ట్రియాకు చెందిన మెటర్నిచ్, ఫ్రాన్స్‌కు చెందిన టాలీర్యాండ్ వంటి ప్రముఖ విదేశీ వ్యవహారాల మంత్రులు యుద్ధం లేకుండానే తమ దేశాలను అగ్రస్థానంలో నిలిపారు. ఏదేమైనా, వంద రోజుల్లోనే మోడీ తన బుద్ధి కుశలతతో, సానుకూల విదేశాంగ విధానాన్ని అనుసరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇలాంటి సంతోషకరమైన దిగ్భ్రాంతులు మరిన్ని కలుగుతాయనీ, కలగాలనీ ఆశిద్దాం.
(వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)
పెంటపాటి పుల్లారావు