ప్రధాన రాయబారి మోదీ..! | Prime Minister's Foreign Policy Success | Sakshi
Sakshi News home page

ప్రధాన రాయబారి మోదీ..!

Published Tue, May 26 2015 1:41 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ప్రధాన రాయబారి మోదీ..! - Sakshi

ప్రధాన రాయబారి మోదీ..!

ప్రధాని విదేశాంగ విధానం సక్సెస్ - ఆ వేగం కొనసాగించటమే సవాల్
 
తొలి ఏడాదిలో 18 దేశాల్లో నరేంద్రమోదీ పర్యటన
ప్రపంచం దృష్టిని భారత్ వైపు ఆకర్షించటంలో సఫలం
అమెరికా, చైనాలతో ఏక కాలంలో సన్నిహిత స్నేహం
పాక్‌తో మరింత దెబ్బతింటున్న సంబంధాలు
ఏడాది కాలపు విదేశాంగ విధానంపై మిశ్రమ విశ్లేషణలు

 
 ఏడాది కిందట ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన నరేంద్రమోదీ.. ఈ ఏడాది పాలనా కాలంలో సాధించిన అతిపెద్ద విజయం విదేశాంగ విధానమేనని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఏడాదిలో 18 దేశాల్లో పర్యటించిన మోదీ రికార్డు సృష్టించారు. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికాతో.. మరోవైపు అమెరికాకు ప్రత్యామ్నాయ ప్రపంచ శక్తిగా పరిగణిస్తున్న కమ్యూనిస్టు చైనాతో ఏక కాలంలో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు మోదీ తనదైన ‘దౌత్య రాజకీయాలు’ నెరిపారు. తానే భారత ప్రధాన రాయబారిగా వ్యవహరించా రు. ఈ ఏడాదిలో భారత్‌ను సరికొత్తగా ప్రపంచం ముందు నిలపటానికి.. పెట్టుబడులు పెట్టటానికి ఆకర్షణీయమైన మార్కెట్‌గా ప్రపంచం దృష్టిని మళ్లీ భారత్ మీదకు తీసుకురావటంలో సఫలమయ్యారు. అలాగే.. దక్షిణాసియాపై ప్రధాన దృష్టి పెట్టిన మోదీ, పశ్చిమాసియాను పూర్తిగా విస్మరించారని.. బలమైన పొరుగుదేశం చైనాతో సంబంధాలను మెరుగుపరచుకునే దిశలో విజయం సాధించినప్పటికీ.. భారత్‌కు అతి పెద్ద సవాలుగా ఉన్న మరో పొరుగుదేశం పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో విఫలమయ్యారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
 
ఈ విజయం కొనసాగేలా చూడటం సవాలు: ఏడాదిలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో పర్యటించిన మోదీ.. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా వారికి విశ్వాసం కల్పించటంలో.. దేశంలో పెట్టుబడులకు ఉన్న ఆటంకాలను తొలగించేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నామని నమ్మకం కలిగించటంలో కృతకృత్యమయ్యారు. దీర్ఘ కాలంగా అమలుకాకుండా నిలిచిపోయిన అణు ఒప్పందం అమలుపై అమెరికాతో సంయుక్త ప్రకటన, చైనాతో సరిహద్దు పరిష్కారానికి ప్రమాణాలను నిర్ణయించటం వంటి ఘనమైన విజయాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు ఒప్పందం మరో గణనీయ విజయం. అలాగే.. దక్షిణాసియాలో ఉమ్మడి సుసంపన్నత అనే ఆకాంక్షను విశదీకరించిన మోదీ.. అందులో భారత నాయకత్వాన్ని చక్కగా చూపారు. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో అనేక దేశాలతో లక్షల కోట్ల పెట్టుబడులపై కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ కృషిని అదే ఉత్సాహం, వేగంతో కొనసాగించటం.. ఫలితాలు వచ్చేలా చూడటం మోదీ ముందున్న సవాళ్లని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే క్రైస్తవులు, చర్చిలు, విదేశీ ఎన్‌జీవోలపై తరచుగా జరుగుతున్న దాడులు.. పశ్చిమ దేశాల ఆలోచనలపై ప్రభావం చూపే అవకాశముందని.. వారి దృష్టిలో ‘భారత్ విజయగాథ’ అనేది మత స్వేచ్ఛ లేని దేశంగా మారిపోయే అవకాశముందని ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

 అటూ ఇటూ.. స్నేహం..: ప్రపంచ దేశాల్లో రెండు ముఖ్యమైన శక్తులు - అమెరికా, చైనాలతో మోదీ వ్యవహార శైలి.. ఆ దేశాలతో సంబంధాలను బలపరచుకోవటంతో పాటు.. భారత ప్రయోజనాలకు అనుగుణంగా నడచుకోవటం విస్పష్టంగా కనిపిస్తోంది. ‘‘అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి (ఢిల్లీకి) వచ్చినపుడు.. ఆయనతో కలిసి మోదీ హిందూ మహాసముద్రంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోదీ చైనా వెళ్లినపుడు.. చైనా అధ్యక్షుడితో కలిసి వాతావరణ మార్పుల అంశంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత ప్రయోజనాల విషయంలో రెండు వైపులా వ్యవహారాలు నడపటానికి ఆయన సంకోచించలేదు. ఇది ఆయన వ్యవహారిక సత్తా వాదానికి అద్దం పడుతోంది. ఈ విధంగా చూస్తే.. అలీన విధానమైన భారత విదేశాంగ విధానానికి కొనసాగింపుగానే మోదీ విధానాన్ని భావించవచ్చు’’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు చెందిన శ్రీనాథ్ రాఘవన్ పేర్కొన్నారు.

 దక్షిణాసియాలో కొత్త మైత్రి..: నేపాల్‌లో మోదీ పర్యటన ఆ దేశంతో భారత్ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. అయితే.. నేపాల్‌లో పెను భూకంపం నేపథ్యంలో ఆ దేశ రాజ్యాంగ రూపకల్పన, దేశ పునర్నిర్మాణంలో భారత్ పాత్ర సవాళ్లతో కూడుకుని ఉంటుందని చెప్తున్నారు. ఇక శ్రీలంకలో మోదీ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను పునఃనిర్వచించింది. అయితే.. లంకలో తమిళుల సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండటం.. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు వివాదం విషయంలో బీజేపీ వైఖరిని వదిలిపెట్టి.. ఆ దేశంతో భూ సరిహద్దును ఖరారు చేయటం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసింది. కానీ తీస్తా నదీ జలాల వివాదం కొనసాగుతూనే ఉంది. మోదీ ఈ ఏడాది జూన్‌లో బంగ్లాలో పర్యటించనున్నారు.

 పాకిస్తాన్‌పై తీరు మారలేదు..: మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను ఆహ్వానించి ద్వైపాక్షిక దౌత్యానికి మంచి ఆరంభాన్నిచ్చినా.. దాన్ని అదే స్థాయిలో కొనసాగించలేకపోయారు. తనకు ముందు పాలకుల తరహాలోనే తొలుత దౌత్య చర్చలతో ప్రారంభించి.. తర్వాత చర్చల నిలిపివేతకే మొగ్గుచూపారు. ఈ క్రమంలో పాక్‌తో సంబంధాలు మరింతగా దెబ్బతింటున్నాయి. పాక్‌తో సంబంధాల్లో ప్రతిష్టంభన.. అఫ్ఘానిస్తాన్‌తో భారత్ సంబంధాలపైనా ప్రభావం చూపుతోంది.
 పశ్చిమాసియాపై ప్రేక్షక పాత్ర..: అంతర్గత సంక్షోభాలతో పశ్చిమాసియా కల్లోలంగా ఉంటే.. భారత్, మోదీ ఆ ప్రాంతంపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. పలు సంక్షుభిత ప్రాంతాల నుంచి భారతీయులను రక్షించి తేవటానికే భారత్ పరిమితమైంది.  

వ్యవస్థీకృత ప్రణాళికా లోపంతో చిక్కులే..: విస్తృత విదేశీ విధానం ఎత్తుగడలకు సంబంధించి సరైన వ్యవస్థీకృత ప్రణాళిక లేకపోవటం వల్ల.. భారత్‌కు మున్ముందు చాలా దేశాలతో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌కు చెందిన శ్రీనాథ్ రాఘవన్ అభిప్రాయపడ్డారు.
 
తొలి ఏడాదిలో ఎదురైన సవాళ్లివీ...

 మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక గత జూలైలో తొలి దౌత్య సవాలు ఎదురైంది. ఇరాక్‌లో 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించారన్న వార్త వచ్చింది. ఆ తర్వాత అదే దేశంలో తలెత్తిన అంతర్గత సంక్షోభంలో భారతీయ నర్సులు చిక్కుకుపోయారన్న వార్త వచ్చింది. బలమైన దౌత్య కృషితో నర్సులను విడిపించగలిగారు. కానీ.. 39 మంది భారతీయుల ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement