ఎన్నో అవకాశాలున్నాయి.. సద్వినియోగం చేసుకోండి
విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
భారత కారి్మకులకు వీసాల సంఖ్యను 90 వేలకు పెంచిన జర్మనీ
ఢిల్లీలో ‘ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్’ సదస్సు
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని విదేశీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా మారడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ద వరల్డ్’ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆహా్వనించారు.
నేడు ప్రపంచ వ్యాపార, వాణిజ్య, తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పెట్టుబడులకు భారత్ కంటే మెరుగైన దేశం మరొకటి లేదని స్పష్టంచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘18వ ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్–2024’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌తోపాటు భారత్, జర్మనీ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని సూచించారు. నైపుణ్యం కలిగిన భారతీయ కారి్మకులపై జర్మనీ ఎంతగానో ఆసక్తి చూపుతోందని, వారికి ప్రతిఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని ఉద్ఘాటించారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...
‘ఫోకస్ ఆన్ ఇండియా’ హర్షణీయం
‘‘ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, డేటా అనే నాలుగు బలమైన మూలస్తంభాలపై భారత్ నేడు సగర్వంగా నిల్చుంది. రహదారులు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అభివృద్ధికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాం. 2047 నాటికి ఇండియాను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశాం. ఇది చాలా కీలక సమయం.
అందుకే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా జర్మనీ కేబినెట్ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ అనే డాక్యుమెంట్ విడుదల చేసింది. ఇది నిజంగా హర్షణీయం. జర్మనీ సంస్థలకు ఇండియాలో ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు భారత్ కంటే మెరుగైన దేశం ఇంకెక్కడైనా ఉందా? లేదని కచి్చతంగా చెప్పగలను. భారతదేశ ప్రగతికి టాలెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేవి నాలుగు అంశాలు.
వీటిని ముందుకు నడిపించడానికి మా వద్ద ‘ఆకాంక్షలతో కూడిన భారత్’ అనే ఇంధనం ఉంది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత ప్రజాస్వామీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష సాంకేతికత అనేవి మాకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు, ఒప్పందాలకు అద్భుతమైన అవకాశాలున్నాయి. వాటిని విదేశీ వ్యాపారవేత్తలు.. ముఖ్యంగా జర్మనీ వ్యాపారవేత్తలు ఉపయోగించుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
శాంతి స్థాపనకు సహకరిస్తాం
ఉక్రెయిన్, పశి్చమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఏడో ఇంటర్–గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)లో భాగంగా మోదీ శుక్రవారం ఢిల్లీలో జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమయ్యారు. భారత్–జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికేలా రాజకీయ పరిష్కారం కోసం భారత్ కృషి చేయాలని స్కోల్జ్ కోరారు. మోదీ బదులిస్తూ.. యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్యమార్గాల్లో ప్రయతి్నంచాలన్నదే భారత్ విధానమని తేలి్చచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment