Investments in India
-
PM Narendra Modi: పెట్టుబడులకు గమ్యస్థానం భారత్
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని విదేశీ వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు. భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా మారడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఫర్ ద వరల్డ్’ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆహా్వనించారు. నేడు ప్రపంచ వ్యాపార, వాణిజ్య, తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందిందని వెల్లడించారు. పెట్టుబడులకు భారత్ కంటే మెరుగైన దేశం మరొకటి లేదని స్పష్టంచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘18వ ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్–2024’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు జరగడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్తోపాటు భారత్, జర్మనీ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాని సూచించారు. నైపుణ్యం కలిగిన భారతీయ కారి్మకులపై జర్మనీ ఎంతగానో ఆసక్తి చూపుతోందని, వారికి ప్రతిఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని ఉద్ఘాటించారు. సదస్సులో ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఫోకస్ ఆన్ ఇండియా’ హర్షణీయం ‘‘ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, డేటా అనే నాలుగు బలమైన మూలస్తంభాలపై భారత్ నేడు సగర్వంగా నిల్చుంది. రహదారులు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల అభివృద్ధికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాం. 2047 నాటికి ఇండియాను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేశాం. ఇది చాలా కీలక సమయం. అందుకే ఇండియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా జర్మనీ కేబినెట్ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ అనే డాక్యుమెంట్ విడుదల చేసింది. ఇది నిజంగా హర్షణీయం. జర్మనీ సంస్థలకు ఇండియాలో ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు భారత్ కంటే మెరుగైన దేశం ఇంకెక్కడైనా ఉందా? లేదని కచి్చతంగా చెప్పగలను. భారతదేశ ప్రగతికి టాలెంట్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి నాలుగు అంశాలు. వీటిని ముందుకు నడిపించడానికి మా వద్ద ‘ఆకాంక్షలతో కూడిన భారత్’ అనే ఇంధనం ఉంది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత ప్రజాస్వామీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్ష సాంకేతికత అనేవి మాకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు, ఒప్పందాలకు అద్భుతమైన అవకాశాలున్నాయి. వాటిని విదేశీ వ్యాపారవేత్తలు.. ముఖ్యంగా జర్మనీ వ్యాపారవేత్తలు ఉపయోగించుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శాంతి స్థాపనకు సహకరిస్తాం ఉక్రెయిన్, పశి్చమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన కోసం అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఏడో ఇంటర్–గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(ఐజీసీ)లో భాగంగా మోదీ శుక్రవారం ఢిల్లీలో జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమయ్యారు. భారత్–జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికేలా రాజకీయ పరిష్కారం కోసం భారత్ కృషి చేయాలని స్కోల్జ్ కోరారు. మోదీ బదులిస్తూ.. యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్యమార్గాల్లో ప్రయతి్నంచాలన్నదే భారత్ విధానమని తేలి్చచెప్పారు. -
ఎకానమీకి అమెజాన్ చేసిందేమీ లేదు
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం కొనసాగించడానికే అమెజాన్ తాజా పెట్టుబడులు చేస్తుందని, ఇందులో సంబరపడాల్సిందేమీ లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెజాన్ తన పెట్టుబడులతో భారత్‌లోని సేవల రంగానికి, ఆర్థిక వ్యవస్థకు చేసిందేమీ లేదన్నారు. పనిలో పనిగా ఈ–కామర్స్ పరిశ్రమ లక్షలాది రిటైలర్ల ఉపాధిని దెబ్బతీస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అమెజాన్ చేసిన ప్రకటన పట్ల సంతోషించాల్సిందేమీ లేదన్నారు. భారత వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికే తాజా పెట్టుబడులను తీసుకొస్తున్నట్టు వ్యాఖ్యానించారు. కొల్లగొట్టే ధరల విధానాన్ని ఈ నష్టాలు సూచిస్తున్నాయంటూ.. ఇది భారత్‌కు ఎంత మాత్రం మేలు చేయబోదని, చిన్న వర్తకులను దెబ్బతీస్తుందన్నారు. ‘ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సంక్షేమంపై ఈ–కామర్స్ రంగం చూపించే నికర ప్రభావం’ పేరుతో ఓ నివేదికను మంత్రి బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దేశంలో చిన్న రిటైలర్ల ఉపాధిని దెబ్బతీసే ఈ–కామర్స్ కంపెనీల వ్యాపార నమూనాను మంత్రి ప్రశ్నించారు.ఈ–రిటైలర్లతో 1.58 కోట్ల ఉద్యోగాలు ఆన్లైన్ వర్తకులు దేశంలో 1.58 కోట్ల మందికి ఉపాధి కల్పించినట్టు మంత్రి గోయల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో 35 లక్షల మంది మహిళలు ఉన్నట్టు, 17.6 లక్షల రిటైల్ సంస్థలు ఈ –కామర్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదికను పహలే ఇండియా ఫౌండేషన్ (పీఐఎఫ్) విడుదల చేసింది. భారత్‌లో ఉపాధి కల్పన పరంగా, కస్టమర్ల సంక్షేమం పరంగా (మెరుగైన అనుభవం) ఈ–కామర్స్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ–కామర్స్ తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. టైర్–3 పట్టణాల్లోని వినియోగదారులు నెలవారీగా రూ.5,000కు పైనే ఆన్లైన్ షాపింగ్‌పై ఖర్చు చేస్తున్నట్టు వివరించింది. ఉపాధిపై ఈ–కామర్స్ రంగం చూపిస్తున్న ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 2,062 మంది ఆన్లైన్ వర్తకులు, 2,031 ఆఫ్‌లైన్ వర్తకులు, 8,209 మంది వినియోగదారుల అభిప్రాయాలను పీఐఎఫ్ తెలుసుకుంది. -
డబ్బుల్ని ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుంది? ఎంత ఆదాయం వస్తుంది?
మంచి ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునేందుకు ఎటువంటి అంశాలను పరిశీలించాలి?– శశాంక్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియోని చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్‌లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది. కొంత ట్రాకింగ్ లోపం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ అదే కాలంలో 2.01 శాతం, 1.99 శాతంగా చూపించొచ్చు. ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో కీలకం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. నేను స్వల్పకాలం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? – గోపాల్ రామ్ ఇన్వెస్టర్లలో చాలా రకాలు ఉంటారు. కొందరు కేవలం రాబడుల వృద్ధిని చూస్తుంటారు. కొందరు పెట్టుబడి ద్వారా పన్ను తగ్గించుకోవాలని భావిస్తుంటారు. కొందరు క్రమం తప్పకుండా (రెగ్యులర్) ఆదాయం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొందరు స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెడుతుంటారు. అయితే స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారు ప్రధానంగా తమ పెట్టుబడిని కాపాడుకోవడానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పెట్టుబడి భద్రంగా ఉన్నప్పుడే రాబడులు సాధ్యపడతాయి. ఈ విషయంలో ఇన్వెస్టర్ల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మార్గం. బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంచడం వల్ల వచ్చే రాబడి (3 శాతం) కంటే ఎఫ్డీలో వచ్చే రాబడే ఎక్కువ. ఎఫ్డీలు ఎంతో సురక్షితమైనవి. బ్యాంకులు సంక్షోభంలో పడినా, ఒక్కో డిపాజిట్ దారునికి రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (డీఐసీజీసీ) రూపంలో ఆర్బీఐ ద్వారా ఈ బీమా సదుపాయం లభిస్తుంది. కానీ, ఈ తరహా సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎఫ్‌డీల రూపంలో వచ్చే వడ్డీ ఆదాయం సంబంధిత పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎఫ్డీపై వచ్చే రాబడి పన్ను వర్తించే ఆదాయం కిందకే వస్తుంది. ఒకవేళ 30 శాతం పన్ను పరిధిలో ఉంటే, అటువంటి వారికి ఎఫ్డీ మెరుగైన సాధనం అని చెప్పలేం. ఎందుకంటే వచ్చే 7 శాతం రాబడిలో 30 శాతం పన్ను చెల్లించడానికే వెళుతుంది. ఇక స్వల్పకాల పెట్టుబడుల కోసం మరో మార్గం డెట్ మ్యూచువల్ ఫండ్స్. డెట్ ఫండ్స్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను పడుతుంది. డెట్ ఫండ్‌లో పెట్టుబడిని మూడేళ్ల వరకు ఉంచితే వచ్చే లాభంపై పన్ను 20 శాతంగా ఉండేది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే అవకాశం కూడా ఈ ఏడాది మార్చి వరకు అమల్లో ఉంది. కానీ, ఈ ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కనుక డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతన్న దానితో సంబంధం లేకుండా వచ్చే రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక పన్ను పరంగా ఎఫ్డీలకు సమానంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా కేంద్రం మార్చేసింది. కనుక ఇన్వెస్టర్లు వీటిల్లో తమకు ఏది సౌకర్యం అనిపిస్తే దానినే ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల కోసం అయితే మంచి లిక్విడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది అంతకుమించిన కాలానికి అయితే అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్, అంతకుమించిన కాలానికి అయితే షార్ట్ డ్యురేషన్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. డెట్ ఫండ్స్ అన్నవి రాబడులకు కానీ, పెట్టుబడికి కానీ హామీ ఇవ్వవు. కానీ, ఎఫ్‌డీల్లో పెట్టుబడి, రాబడికి హామీ ఉంటుంది. అందుకని ఒక వేళ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే అధిక నాణ్యమైన పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ నాణ్యమైన పేపర్లలో పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌లో రాబడులతో పాటు రిస్క్ ఎక్కువ. డిఫాల్ట్ రిస్క్ కూడా ఉంటుంది. -
పీనోట్ల పెట్టుబడుల దూకుడు
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పార్టిసిపేటరీ(పీ) నోట్ల పెట్టుబడులు గత నెల(ఏప్రిల్)లో రూ. 95,911 కోట్లను తాకాయి. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. గత రెండు నెలలుగా పీనోట్ల పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. ఇంతక్రితం 2022 నవంబర్‌లో పీనోట్ పెట్టుబడులు రూ. 96,292 కోట్లకు చేరాయి. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుండటం తాజా పెట్టుబడులకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(పీఎఫ్‌ఐలు) వీటిని జారీ చేస్తుంటారు. ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాకుండానే దేశీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే విదేశీ ఇన్వెస్టర్లకు వీటిని ఎఫ్‌పీఐలు జారీ చేసే సంగతి తెలిసిందే. అయితే ఇందుకు తగిన పరిశీలన చేపట్టాక మాత్రమే వీటిని జారీ చేస్తారు. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం దేశీయంగా ఈక్విటీ, రుణ, హైబ్రిడ్ సెక్యూరిటీలలో పీనోట్ పెట్టుబడుల విలువ ఏప్రిల్ చివరికల్లా రూ. 95,911 కోట్లను తాకింది. మార్చి నెలాఖరుకు ఈ విలువ రూ. 88,600 కోట్లుగా నమోదైంది. ఇక ఫిబ్రవరికల్లా ఇవి రూ. 88,398 కోట్లుకాగా.. జనవరి చివరిలో రూ. 91,469 కోట్లకు చేరాయి. వెరసి మార్చిలో స్వల్పంగా పుంజుకోగా.. ఏప్రిల్‌లో భారీ వృద్ధి నమోదైంది. తాజాగా నమోదైన పెట్టుబడుల్లో రూ. 86,226 కోట్లు ఈక్విటీలలోకి ప్రవేశించాయి. ఈ బాటలో రూ. 9,586 కోట్లను రుణ పత్రాలలో ఇన్వెస్ట్ చేయగా, మరో రూ. 100 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీల కొనుగోలుకి విదేశీ ఇన్వెస్టర్లు వెచ్చించారు. -
భారత్‌లో మరింత ఇన్వెస్ట్ చేయండి
టోక్యో: అపార వ్యాపార అవకాశాలు ఉన్న భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ జపాన్ కార్పొరేట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్‌ది చాలా కీలకపాత్ర అని ఆయన పేర్కొన్నారు. దీన్ని పురస్కరించుకుని ’జపాన్ వారోత్సవాల’ను నిర్వహించడంపై ప్రధాని ప్రతిపాదన చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా వ్యాపార దిగ్గజాలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. 34 సంస్థల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరయ్యారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఉక్కు, టెక్నాలజీ, ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్ తదితర రంగాల కంపెనీల ప్రతినిధులు వీరిలో ఉన్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జపాన్ కంపెనీలు భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలని మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించినట్లు వివరించింది. ‘టాప్ వ్యాపార సంస్థల సీఈవోలతో భేటీ అయ్యాను. భారత్‌లో పుష్కలంగా ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి వివరించాను‘ అని ప్రధాని ఒక ట్వీట్లో పేర్కొన్నారు. హోండా, సుజుకీ, టయోటా వంటి ఆటోమొబైల్ సంస్థలు, సుమిటోమో కెమికల్, ఫ్యుజిత్సు, నిప్పన్ స్టీల్ కార్పొరేషన్, మిత్సుబిషి కార్పొరేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. చాలామటుకు కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులు, కార్యకలాపాలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు.. భారత్, జపాన్ సహజమైన భాగస్వాములని సమావేశం సందర్భంగా ప్రధాని చెప్పారు. భారత్–జపాన్ సంబంధాలు బలోపేతం అయ్యేందుకు వ్యాపార వర్గాలు బ్రాండ్ అంబాసిడర్ల పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మందగించినా, భారత్‌లోకి రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారత ఆర్థిక వృద్ధి సత్తాపై ఇన్వెస్టర్లకు ఉన్న ధీమాకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక పెట్టుబడులను వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల ఎన్ల స్థాయికి పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయని ప్రధాని చెప్పారు. ఇటీవలి కాలంలో ఇండియా–జపాన్ ఇండస్ట్రియల్ కాంపిటీటివ్నెస్ పార్ట్నర్షిప్ (ఐజేఐసీపీ), క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ మొదలైన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. -
భారత్ స్టాక్ మార్కెట్లో తగ్గతున్న విదేశీ పెట్టుబడులు, కానీ
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం తగ్గిపోతోంది. 2021 డిసెంబర్ చివరికి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో.. విదేశీ ఇనిస్టిట్యూషన్స్ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) వాటాలు 9 ఏళ్ల కనిష్టానికి తగ్గాయి. కానీ, అదే సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఇనుమడిస్తోంది. 14 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ఇన్వెస్టర్ల వాటాలు పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఐఐల వాటా ఎన్ఎస్ఈ కంపెనీల్లో 0.81 శాతం తగ్గి 19.7 శాతానికి పరిమితమైంది. ఇలా ఎఫ్ఐఐల వాటాలు క్షీణించడం వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ నమోదైంది. నిఫ్టీ 500 కంపెనీల్లో అయితే డిసెంబర్ క్వార్టర్లో ఎఫ్ఐఐల వాటాలు 0.65 శాతం తగ్గి 20.9 శాతంగా ఉంది. ఈ వివరాలను ఎన్ఎస్ఈ నివేదిక వెల్లడించింది. 2021 మొత్తం మీద ఎఫ్ఐఐల వాటా ఎన్ఎస్ఈ కంపెనీల్లో 2.04 శాతం, ఎన్ఎస్ఈ 500 కంపెనీల్లో 1.65 శాతం మేర తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా వాటాలు తగ్గిపోవడం వెనుక గత ఏడాదిగా విదేశీ ఇనిస్టిట్యూషన్స్ భారత మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తుండడం ప్రధాన కారణంగా ఉంది. ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరోనా ఆంక్షలు ఇలా ఎన్నో అనిశ్చితుల మధ్య విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణను నిరాటంకంగా, మరీ ముఖ్యంగా గత ఆరు నెలలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. రెండేళ్లలో మారిన పరిస్థితి.. ఎఫ్ఐఐ పెట్టుబడులు ఎక్కువగా ఉండే కంపెనీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ 50 కంపెనీల్లో 0.21 శాతం పెరిగి 8.3 శాతానికి చేరింది. నిఫ్టీ 500 కంపెనీల్లో 0.29 శాతం పెరిగి 9 శాతానికి.. ఎన్ఎస్ఈ మొత్తం లిస్టెడ్ కంపెనీల్లో 0.36 శాతం పుంజుకుని 9.7 శాతానికి రిటైల్ ఇన్వెస్టర్ల వాటాలు చేరాయి. గడిచిన రెండేళ్లలో ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం ఎన్నో రెట్లు పెరిగింది. కొత్త ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు, క్యాష్ మార్కెట్లో వారి లావాదేవీలు అధికమయ్యాయి. 2019 డిసెంబర్ త్రైమాసికం నుంచి చూస్తే 2021 డిసెంబర్ నాటికి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో రిటైలర్ల వాటా నికరంగా 1.3 శాతం పెరిగింది. ఫండ్స్‌కు సిప్ కళ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా రిటైలర్ల ప్రాతినిధ్యం పెరిగేందుకు దోహదం చేస్తోంది. సిప్ పెట్టుబడులు ప్రతీ నెలా కొత్త గరిష్టాలకు చేరుతుండడాన్ని గమనించొచ్చు. ఎన్ఎస్ఈ కంపెనీల్లో మ్యూచువల్పండ్స్ వాటా వరుసగా రెండో త్రైమాసికం (డిసెంబర్ క్వార్టర్)లోనూ 0.11 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. 2020 మార్చి త్రైమాసికం నాటికి ఎన్ఎస్ఈ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్‌కు గరిష్టంగా 7.9 శాతం వాటా ఉంది. దీనికంటే ప్రస్తుతం 0.46 శాతం తక్కువగానే వాటి వాటా ఉన్నట్టు అర్థమవుతోంది. పెరుగుతున్న సిప్ పెట్టుబడులతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు లాభపడతున్నాయి. పెద్ద కంపెనీల్లోనే వీటి వాటాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సిప్ పెట్టుబడుల రాక వీటి ప్రాతినిధ్యం అధికమయ్యేందుకు సాయపడుతోంది. ఎన్ఎస్ఈ 500 కాకుండా ఇతర కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ వాటాలు తగ్గడం గమనార్హం. చిన్న సంస్థల పట్ల ఎఫ్ఐఐల్లో ఆసక్తి ప్రధాన సూచీల్లోని కంపెనీల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు చిన్న కంపెనీల్లో మాత్రం పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ పెట్టుబడుల పూల్‌లోకి కొత్తగా 260 కంపెనీలను వారు చేర్చుకున్నారు. 5 శాతానికి పైగా ఎఫ్ఐఐల పెట్టుబడులు ఉన్న కంపెనీల సంఖ్య 600 స్థాయిలోనే కొనసాగుతోంది. అంటే వారి నుంచి తాజా పెట్టుబడులు మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోకి వెళుతున్నట్టు అర్థమవుతోంది. -
పెట్టుబడులు పెంచండి
న్యూఢిల్లీ: ‘టీమ్ ఇండియా’ (భారత జట్టు)లో చేరి, భారత ప్రభుత్వ మూలధన వ్యయ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెంచాలని ప్రైవేటు రంగానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. రానున్న సంవత్సరాల్లోనూ భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించే దేశంగా గుర్తింపు నిలబెట్టుకునేందుకు సాయంగా నిలవాలని కోరారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయం 35 శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లను చేరుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు.. ప్రైవేటు రంగం నుంచి సైతం ఇతోధిక పెట్టుబడులకు మార్గం చూపుతుందన్నారు. ‘‘ప్రైవేటు పెట్టుబడులకు ఇది అవకాశాల తరుణం. మీ సామర్థ్యాలను విస్తరించుకోండి. కరోనా మహమ్మారి రావడానికి ముందుతో పోలిస్తే కార్పొరేట్ పన్ను తగ్గించాం. ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దని కోరుతున్నాను’’ అంటూ పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8–8.5 శాతం వృద్ధి నమోదు కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసిన విషయం గమనార్హం. ‘‘ముందుకు రండి. వీలైనంత మెరుగ్గా కృషి చేయండి. టీమ్ ఇండియాలో భాగస్వాములై ఈ ఏడాది, వచ్చే ఏడాది, తర్వాతి సంవత్సరాల్లోనూ భారత్ మెరుగైన వృద్ధి నమోదు చేసేందుకు మద్దతుగా నిలవండి’’ అని మంత్రి పిలుపునిచ్చారు. -
రిలయన్స్‌తో డీల్ క్యాన్సల్..! భారత్‌ను వదులుకునే ప్రసక్తే లేదు...!
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన పెట్రో కెమికల్ వ్యాపారంలో సౌదీ ఆరామ్కో ప్రతిపాదిత పెట్టుబడుల డీల్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. రిలయన్స్ ఓ2సీ(ఆయిల్ టూ కెమికల్స్)లో భాగంగా ఆరామ్కోతో చేసుకున్న 15 బిలియన్ డాలర్ల ఒప్పందం పూర్తిగా రద్దైనట్లుగా కన్పిస్తోంది.ఇక ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల విషయంలో సౌదీ ఆరామ్కో తమకు ప్రాధాన్య భాగస్వామిగా కొనసాగుతుందని రిలయన్స్ (ఆర్ఐఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: వారు వెంటనే రాజీనామా చేయండి: ఎలన్ మస్క్ ఆర్డర్స్ భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఎప్పుడూ సిద్దమే..! రిలయన్స్‌తో భారీ ఒప్పందం నిలిచిపోవడంతో సౌదీ ఆరామ్కో కంపెనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో పలు రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఆరామ్కో వదులుకోదని కంపెనీ వెల్లడించింది. లాంగ్‌టర్మ్ పిరియడ్స్‌లో భారత్ అద్బుతమైన వృద్దిను అందిస్తోందని ఆరామ్కో అభిప్రాయపడింది. అనువైన రంగాల్లో కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ ఎప్పుడు సిద్దంగా ఉంటుందని ఆరామ్కో పేర్కొంది. చదవండి: రిలయన్స్, సౌదీ ఆరామ్కో డీల్ రద్దు -
రండి భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయిదు రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహా్వనించారు. భారత్‌లో వ్యాపార అవకాశాల గురించి వివరించారు. చిప్ తయారీ దిగ్గజం క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఇ అమోన్, సౌర విద్యుత్ సంస్థ ఫస్ట్ సోలార్ చీఫ్ మార్క్ విడ్మర్, ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్ చైర్మన్ స్టీఫెన్ ఎ ష్వార్జ్‌మాన్, అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్, జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్ లాల్‌తో ప్రధాని భేటీ అయ్యారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం ఐటీ, డిజిటల్ రంగానికి భారత్ ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో నారాయణ్‌తో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సాయుధ బలగాల కోసం భారత్ గణనీయంగా డ్రోన్లను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో మి లిటరీ డ్రోన్ల తయారీ దిగ్గజం జనరల్ అటామిక్స్ సీఈవో లాల్‌తో ప్రధా ని సమావేశమయ్యారు. జనరల్ అటామిక్స్ నుంచి భారత్ ఇప్పటికే కొన్ని డ్రోన్లను లీజుకు కూడా తీసుకుంది. దాదాపు 18 బిలియన్ డాలర్ల విలువ చేసే ద్వైపాక్షిక రక్షణ రంగ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో లాల్ కీలక పాత్ర పోషించారు. చదవండి: ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హస్తినలో మూడు రోజులపాటు మరోవైపు, మరిన్ని పెట్టుబడులను సాధించే క్రమంలో అగ్రగామి ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ చైర్మన్ ష్వార్జ్‌మాన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. అటు దేశీయంగా 5జీ టెలికం టెక్నాలజీ అమల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా క్వాల్కామ్ చీఫ్ అమోన్‌తో సమావేశమయ్యారు. దేశీయంగా తయారీ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన్ను ఆహ్వానించారు. ఈ సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఫస్ట్ సోలార్ హెడ్ విడ్మర్‌తో సమావేశం సందర్భంగా భారత్‌లో పునరుత్పాదక విద్యు త్ రంగంలో అవకాశాల గురించి ప్రధాని చర్చించినట్లు వివరించింది. -
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలియా కంపెనీలకు అపార అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా కంపెనీలకు ఆసక్తి అధికంగా ఉండే మైనింగ్, రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించామని, అందుకే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆయన ఆస్ట్రేలియా కంపెనీలను ఆహ్వానించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (సమగ్రమైన ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా) కోసం సంప్రదింపులు మరింత ముమ్మరం కాగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు మన ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని, వీటిని మరింతగా పెంచుకోవలసి ఉందని వివరించారు. కాగా సెపా విషయమై పురోగతిని ఆకాంక్షిస్తున్నట్లు వెబినార్ ద్వారా ఆస్ట్రేలియా సెనేటర్ సైమన్ బ్రిమ్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియాకు 290 కోట్ల డాలర్ల ఎగుమతులు, ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు 980 కోట్ల డాలర్ల దిగుమతులు జరిగాయని గోయల్ పేర్కొన్నారు. -
పెట్టుబడులకు భారత్ స్వర్గధామం
న్యూఢిల్లీ: భారత్ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన దేశమని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పేర్కొన్నారు. పట్టణీకరణ, రవాణా, ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల వంటి విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి మరింత ఆకర్షణీయ దేశంగా భారత్ ఉందని ఆయన అన్నారు. బ్లూమ్‌బర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌ను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత్, కొన్ని ఆఫ్రికన్ దేశాలు రానున్న రెండు దశాబ్దాల్లో భారీ పట్టణీకరణ విప్లవాన్ని చూడనున్నాయి. పట్టణీకరణలోకి పరివర్తన చెందే క్రమంలో భారత్ ముందడుగు వేస్తోంది. ► కరోనా మహమ్మారి సవాళ్లు సమసిపోయిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు తిరిగి మెరుగుపడే స్థాయిలో ప్రపంచ పునరి్నర్మాణం జరగాలి. ప్రజల ఆలోచనా ధోరణి, విధానాలు సంబంధిత ప్రక్రియలో నవీనత లేకపోతే, కోవిడ్ తదుపరి వ్యవస్థను పునఃప్రారంభించలేము. ముఖ్యంగా డిజిటలైజేషన్ విధానానికి మరింత ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. ► 2022 గడువుకు కోటి చౌక గృహాలను ప్రజలకు అందించాలన్న లక్ష్యానికి కేంద్రం కట్టుబడి ఉంది. ► 100 స్మార్ట్ సిటీ అభివృద్ధికి దాదాపు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రూ.1.4 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి కావడమో లేక పూర్తికాబోతున్న దశకు చేరడమో జరుగుతోంది. ► పట్టణీకరణలో పెట్టుబడులకు మీరు చూస్తున్నట్లయితే, భారత్ మంచి అవకాశాలను మీకు కలి్పస్తుంది. రవాణా, ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల ప్రాజెక్టుల విషయంలోనూ మీకు భారత్ ఇదే రకమైన అవకాశాలను అందిస్తుంది. -
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఇంధన, వ్యవసాయం, బీమా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికా కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. భారత్ ఎన్నో అవకాశాలను కల్పిస్తోందన్నారు. ‘‘నేడు భారత్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆశావాదం నెలకొంది. ఎందుకంటే భారత్ ఎన్నో అవకాశాలను, ఎంపికలను కల్పించడంతోపాటు తలుపులు తెరుస్తోంది’’ అంటూ అమెరికా–భారత్ వాణిజ్య కౌన్సిల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ పేర్కొన్నారు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఎన్నో సంస్కరణలు చేపట్టడంతోపాటు ఎన్నో రంగాల్లోకి పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు వివరించారు. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం ప్రాముఖ్యతను కరోనా మహమ్మారి చూపించిందన్నారు. దేశీయంగా బలమైన ఆర్థిక సామర్థ్యాలతో భారత్ బలంగా నిలిచిందన్నారు. భారత్ అవకాశాల కేంద్రంగా మారుతోందంటూ ఒక ఉదాహరణను తెలియజేశారు. పట్టణల్లో కంటే గ్రామీణం గానే ఇంటర్నెట్ వినియోగదారులు అధికంగా ఉన్నారన్న ఆసక్తికరమైన నివేదికను ప్రస్తావించారు. -
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆసియాలోనే అతి పెద్ద ఎకానమీ అయిన భారత్‌లో పెట్టుబడులకు, వ్యాపారాల నిర్వహణకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా గ్లోబల్ వీక్ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘స్వేచ్ఛా వాణిజ్యానికి అత్యంత అనువైన ఎకానమీల్లో భారత్ ఒకటి. భారత్‌లోనూ కార్యకలాపాలు విస్తరించేలా అంతర్జాతీయ కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నాం. ప్రస్తుతం భారత్‌లో ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ దేశాల్లో మాత్రమే ఉన్నాయి‘ అని మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ నుంచి క్రమంగా బైటపడుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నంత మాత్రాన ప్రపంచంతో సంబంధాలను తెంచుకున్నట్లు కాదని ప్రధాని స్పష్టం చేశారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ ప్రపంచ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. సంస్కరణల బాట.. పెట్టుబడులను ఆకర్షించే దిశగా స్పేస్, రక్షణ తదితర రంగాలన్నింటిలో ఇటీవల ప్రవేశపెట్టిన పలు సంస్కరణల గురించి ప్రధాని వివరించారు. ‘ఎకానమీలో ఉత్పాదకత, పోటీతత్వం మరింత పెరిగేలా పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు నెలకొనేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పలు రంగాల్లో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణలతో స్టోరేజీ, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు‘ అని ఆయన చెప్పారు. అలాగే పెద్ద పరిశ్రమలకు తోడుగా ఉండేలా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రంగంలోనూ సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు ప్రధాని వివరించారు. స్పేస్, రక్షణ రంగాలకు అవసరమయ్యే పరికరాల తయారీకి సంబంధించి కొన్ని విభాగాల్లో ప్రైవేట్ సంస్థలకు కూడా అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆయా రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేయడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మోదీ చెప్పారు. దేశీ ఫార్మా సత్తా చాటుతోంది.. కరోనా వైరస్ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో భారతీయ ఫార్మా పరిశ్రమ కేవలం దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఎంతో విలువైన సంపద అన్న విషయం మరోసారి రుజువైందని ప్రధాని చెప్పారు. ‘ఔషధాల ధరలు దిగి వచ్చేలా చేయడంలో .. ముఖ్యంగా వర్ధమాన దేశాలకు తోడ్పడటంలో భారతీయ ఫార్మా కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని మూడింట రెండొంతుల మంది బాలల వ్యాక్సినేషన్‌కు భారత్‌లో తయారైన టీకాలనే ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్‌కి సంబంధించిన టీకా రూపకల్పన, తయారీలో కూడా దేశీ ఫార్మా సంస్థలు చురుగ్గా పాలుపంచుకుంటున్నాయి. టీకా కనుగొన్న తర్వాత దాన్ని అభివృద్ధి చేయడంలోనూ, వేగంగా తయారీని పెంచడంలో భారత్ కచ్చితంగా కీలకపాత్ర పోషించగలదని విశ్వసిస్తున్నా‘ అని మోదీ తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి, అభివృద్ధికి భారత్ శాయశక్తులా కృషి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సంస్కరణలు చేపడుతూ, ఆచరణలోనూ చూపిస్తూ, రూపాంత రం చెందుతున్న భారత్ కొంగొత్త వ్యాపార అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని చెప్పారు. -
పదేళ్లు పన్ను మినహాయింపు!!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో అస్తవ్యస్తమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే క్రమంలో... భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం.. 500 మిలియన్ డాలర్లకు పైగా కొత్త పెట్టుబడులు పెట్టే కంపెనీలకు 10 ఏళ్ల పాటు పూర్తిగా పన్ను మినహాయింపులు ఇచ్చే అంశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్, భారీ యంత్రాలు, టెలికం పరికరాల ఉత్పత్తి తదితర రంగాలకు దీన్ని వర్తింపచేసే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కింద ఇన్వెస్ట్ చేసే సంస్థలు.. జూన్ 1 నుంచి మూడేళ్లలోగా కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. 100 మిలియన్ డాలర్లు.. నాలుగేళ్లు ... ఇక కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే రంగాల్లో 100 మిలియన్ డాలర్లు.. ఆపైన ఇన్వెస్ట్ చేసే సంస్థలకు నాలుగేళ్ల పాటు పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఆ తర్వాత ఆరేళ్ల పాటు తక్కువ స్థాయిలో 10% కార్పొరేట్ ట్యాక్స్ రేటు వర్తిస్తుంది. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్, ఫుట్‌వేర్ తదితర రంగాలు ఈ జాబితాలోకి వస్తాయి. ప్రస్తుతం పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలకు తాజా మినహాయింపులు అదనం. ఈ ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సమగ్ర అభివృద్ధిపై దృష్టి.. ప్రధానంగా టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, వజ్రాభరణాలు వంటి రంగాలతో పాటు వివిధ పరిశ్రమల సమగ్ర అభివృద్ధిపై కేంద్రం వాణిజ్య శాఖ దృష్టి పెడుతోంది. సేవల రంగానికి చెందిన టూరిజం వంటి విభాగాలను కూడా ఈ జాబితాలో చేర్చడంపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుత మౌలిక సదుపాయాలు, టెస్టింగ్ ల్యాబ్‌లు, పరిశోధన.. అభివృద్ధి కేంద్రాల అప్‌గ్రెడేషన్ కోసం 50 పారిశ్రామిక క్లస్టర్లను వాణిజ్య శాఖ గుర్తించింది. చైనా నుంచి భారత్‌కు కంపెనీలు.. ఎన్నో ఉత్పత్తుల కోసం ప్రపంచదేశాలు చైనాపైనే అధికంగా ఆధారపడడం వల్ల వైరస్ విస్తరణకు దారితీయడంతోపాటు.. సరఫరా పరంగా తీవ్ర ఇబ్బందుల పాలవ్వాల్సి వచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు చైనాపైనే పూర్తిగా ఆధారపడిపోకుండా ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల్లోనూ తయారీ యూనిట్ల ఏర్పాటుకు మొగ్గుచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. చైనాకు దూరమయ్యే ఆలోచనలో ఉన్న ఇన్వెస్టర్లను భారత్ వైపు ఆకర్షించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. భారత్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే సంస్థలకు స్థల సమీకరణను సులభతరం చేయడం, కొత్త ప్లాంట్లకు పన్నుపరమైన రాయితీలివ్వడం తదితర చర్యలు తీసుకుంటోంది. ‘‘ఎన్నో చర్యల దిశగా పనిచేస్తున్నాం. రాష్ట్రాలు భూముల అందుబాటు వివరాలను సిద్ధం చేసి ఇస్తే, వాటిని ఆసక్తిగల ఇన్వెస్టర్ల ముందు ఉంచుతాం’’ అని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఓ సీనియర్ అధికారి ఇటీవల తెలిపారు. బహుళజాతి సంస్థలు చైనా నుంచి పూర్తిగా బయటకు వచ్చే ఆలోచనలో లేవని, కాకపోతే ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాయని, వారికి భారత్ ఆకర్షణీయ కేంద్రం అవుతుందని మరో అధికారి అభిప్రాయపడ్డారు. నిర్ణీత సమయంలోగా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు, సకాలంలో అన్ని అనుమతులను ఇచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర అధికారులను బాధ్యులను చేయాలని ఎగుమతుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ శరద్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. భారత్ వైపు.. యాపిల్ చూపు.. టెక్ దిగ్గజం యాపిల్ కూడా చైనాలోని తమ ఉత్పత్తి కార్యకలాపాల్లో అయిదో వంతు భాగాన్ని భారత్‌కు మళ్లించాలని యోచిస్తోంది. దేశీయంగా తయారీ రంగానికి ఊతమిచ్చే ఉద్దేశంతో భారత్ అమలు చేస్తున్న ఉత్పత్తిపరమైన ప్రోత్సాహకాల ప్రయోజనాలు పొందాలని భావిస్తోంది. ప్రస్తుతం యాపిల్ స్మార్ట్ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ సంస్థలు కాంట్రాక్టు ప్రాతిపదికన తయారు చేసి అందిస్తున్నాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువ చేసే స్మార్ట్ఫోన్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడం కోసం భారత్‌లో తయారు చేసేందుకు .. ఈ కాంట్రాక్టర్లను యాపిల్ ఉపయోగించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) లెక్కల ప్రకారం.. గత త్రైమాసికంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ 62.7 శాతం వాటా దక్కించుకుంది. దేశీయంగా రీసెల్లర్స్ ద్వారానే విక్రయిస్తున్న యాపిల్.. సొంతంగా కూడా స్టోర్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. 2021 నాటికి తొలి యాపిల్ రిటైల్ స్టోర్ ప్రారంభిస్తామని ఇటీవలే సంస్థ సీఈవో టిమ్ కుక్ చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్ఫోన్లు తయారవుతున్నాయి. చిన్న వ్యాపారాలు, తయారీకి ప్యాకేజీ దన్ను ... కరోనా కష్టం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీలో చిన్న పరిశ్రమలకు పన్నుల రూపంలో ప్రయోజనం కల్పించడమే కాకుండా, దేశీయ తయారీ రంగానికి ఊతం కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా ఇబ్బందుల్లో నుంచి ఆర్థిక వ్యవస్థలను గట్టెక్కించడానికి ఇప్పటికే అమెరికా తమ జీడీపీలో 13% ప్యాకేజ్ని ప్రకటించగా, జపాన్ విషయంలో ఇది 21%. మోదీ ప్రకటించిన ప్యాకేజీ కూడా ఇదే తరహా భారీ ప్యాకేజ్ కిందకు వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్ తనంతట తానుగా నిలదొక్కుకోడానికి దోహదపడే ప్యాకేజ్‌లో ఇప్పటికే కేంద్రం ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ప్యాకేజీ అలాగే ఆర్బీఐ ద్రవ్య, వడ్డీరేట్ల పరమైన ప్రయోజనలు కలిపి ఉన్నాయి. భూ, కార్మిక, ద్రవ్య, న్యాయ పరమైన అంశాలు ప్యాకేజ్‌లో ఇమిడి ఉంటాయని మోదీ తన మంగళవారంనాటి ప్రసంగంలో పేర్కొన్నారు. మొత్తంగా కరోనాను ఎదుర్కొనే విషయంలో మోదీ ప్రకటించిన ప్యాకేజీ సమగ్ర స్వరూపాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నుంచి వెల్లడించనున్నారు. -
ఎఫ్‌పీఐల డార్లింగ్.. బీమా!
న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగంలో ఉన్న అపార అవకాశాలు విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) బాగా ఆకర్షిస్తున్నాయి. గత ఏడాది కాలంగా వారు ఈ రంగంలోని లిస్టెడ్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో... అంటే ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య బీమా కంపెనీల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి రికార్డు స్థాయిలో రూ.16,976 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,331 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 13 రెట్లు అధికం. సాధారణంగా ఎఫ్‌పీఐలు దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీరు బీమా రంగ కంపెనీల్లో అదే పనిగా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే.. ఈ రంగంలోని వృద్ధి అవకాశాల పట్ల వారు ఎంతో బుల్లిష్‌గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఈ ఏడాది ఏప్రిల్– ఆగస్ట్ మధ్య కాలంలో మన ఈక్విటీల్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా ఉన్నారు. ఈ కాలంలో వారు రూ.30,011 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. అయినా, ఇదే కాలంలో బీమా రంగ కంపెనీల్లో నికరంగా రూ.5,203 కోట్లను వారు ఇన్వెస్ట్ చేశారు. జీవిత, సాధారణ బీమా విభాగంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ లిస్టయిన ప్రముఖ కంపెనీలు. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ ప్రభుత్వరంగ సంస్థ. సెబీ నిబంధనలు అనుకూలం... ‘‘గత 4–6 త్రైమాసికాలుగా ఎఫ్‌పీఐలు, దేశీయ ఇన్స్టిట్యూషన్లు బీమా కంపెనీల షేర్లను భారీగా కొంటున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ముందస్తు కమీషన్ల చెల్లింపులను నిషేధిస్తూ సెబీ తెచ్చిన నిబంధనలు బీమా రంగ కంపెనీలకు అనుకూలంగా మారాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ పరిశోధన విభాగం అధిపతి దీపక్ జసాని విశ్లేషించారు. అంటే బీమా కంపెనీల కమీషన్ల చెల్లింపులపై ఇటువంటి ఆంక్షలేమీ లేకపోవడం సానుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది 10 నెలల కాలంలో ఎఫ్‌పీఐల ఈక్విటీ పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది బీమా రంగమే. 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఎఫ్‌పీఐలు రూ.24,714 కోట్లను వీటిల్లో ఇన్వెస్ట్ చేశారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రైవేటు బీమా రంగ కంపెనీల్లో ఎఫ్‌ఫీఐల వాటా ఏడాది క్రితం ఉన్న 3 శాతం నుంచి అక్టోబర్ చివరికి 12 శాతానికి చేరుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షించినది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. అందుకే ఏడాది క్రితం ఈ కంపెనీలో 4.45 శాతంగా ఉన్న ఎఫ్‌పీఐల వాటా ఏకంగా 23.72 శాతానికి పెరిగిపోయింది. దీర్ఘకాలంలో భారీ అవకాశాలు ‘‘మారుతున్న జీవనశైలి పరిస్థితులు, అధిక రక్షణ అవసరమన్న అవగాహన విస్తృతం అవుతుండడం (ముఖ్యంగా యువతరంలో) బీమా కంపెనీలకు వ్యాపార అవకాశాలను పెంచుతోంది. ఫలితంగా వాటి మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. బీమా రక్షణ అంతరం అత్యధికంగా మన దేశంలో 92 శాతంగా ఉంది. బీమా అన్నది దీర్ఘకాలానికి సంబంధించినది. ఈ రంగం వృద్ధి అవకాశాలు ఎఫ్‌పీఐలను ఆకర్షించాయి’’ అని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. మరోవైపు బీమా రంగ కంపెనీల రెండో త్రైమాసిక వ్యాపారంలో వృద్ధి స్వల్పంగానే నమోదైంది. ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య ఆరునెలల కాలానికి చూస్తే మాత్రం నూతన వ్యాపార ప్రీమియంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎస్బీఐ లైఫ్ నూతన వ్యాపార విలువలో 33 శాతం వృద్ధిని ఏప్రిల్ – సెప్టెంబర్ కాలంలో చూపించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ నూతన వ్యాపార విలువ ఇదే కాలంలో 20 శాతం పెరిగినట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. -
విదేశీ ఇన్వెస్టర్ల ‘బీమా’ మోజు!
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు లిస్టెడ్ బీమా సంస్థల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధి చూపిస్తుండడం, అదే సమయంలో ఈ కంపెనీల షేర్ల విలువలు భవిష్యత్తు వృద్ధి అవకాశాల కోణంలో ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) బీమా కంపెనీల్లో మార్చి నెలలో ఏకంగా రూ.6,780 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశారు. అందుబాటులో ఉన్న తాజా గణాంకాలను పరిశీలించినట్టయితే మార్చి నెలలో రంగాల వారీగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో బీమా రంగమే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. 2018 మార్చి తర్వాత ఒక నెలలో బీమా రంగంలోకి అధిక పెట్టుబడులు రావడం కూడా గత నెలలోనే. ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో డీల్స్ ‘‘ఎఫ్‌పీఐల పెట్టుబడులను కంపెనీల మూలాలు, ధరల పనితీరు, మొత్తం మార్కెట్ పెట్టుబడుల కోణంలో చూడాల్సి ఉంటుంది. ఫండమెంటల్స్ పరంగా చూస్తే జీవిత బీమా, సాధారణ బీమా కంపెనీలు ఫిబ్రవరి నెల ప్రీమియం వసూళ్లలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో శిల్పా కుమార్ పేర్కొన్నారు. ఒకవైపు అధిక ఎఫ్‌పీఐల పెట్టుబడులకు తోడు బీమా రంగంలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఒప్పందాలు కూడా చోటు చేసుకోవడం గమనార్హం. బ్రిటన్‌కు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ తనకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న వాటాల్లో 3.7 శాతాన్ని ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,400 కోట్లు). అలాగే, దీనికి ముందు హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్‌లో స్టాండర్డ్ లైఫ్ 4.93 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలోనే తగ్గించుకుంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఒకానొక భాగస్వామి బీఎన్పీ పారిబాస్ కార్డిఫ్ సైతం 5 శాతం మేర వాటాలను బ్లాక్ డీల్ ద్వారా రూ.3,000 కోట్లకు మార్చి నెలలో విక్రయించింది. వృద్ధి అవకాశాలు... ఆర్థిక రంగంలో బీమా కూడా అధిక వృద్ధితో కూడిన రంగమని శిల్పా కుమార్ పేర్కొన్నారు. ‘‘ప్రైవేటు బీమా సంస్థలు వార్షికంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం పరంగా 20 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. అదే సాధారణబీమా సంస్థలు వార్షికంగా మొత్తం మీద 13 శాతం వృద్ధిని నమోదు చేశాయి. వైద్య బీమా వ్యాపారం అయితే 40 శాతం మేర వృద్ధి చెందింది’’ అని ఆమె వివరించారు. బీమా రంగం పట్ల ఆసక్తి తిరిగి పుంజుకుందని, భౌగోళికంగా భిన్న ప్రాంతాల నుంచి... ఎఫ్‌పీఐలు, సావరీన్ వెల్త్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ అస్సెట్ మేనేజర్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి భాగస్వామ్యం ఉన్నట్టు చెప్పారు. నిజానికి దేశీ ఈక్విటీ మార్కెట్లలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ భాగం ఎఫ్‌పీఐలు అమ్మకాలు వైపు ఉండగా... ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈక్విటీల్లో నికరంగా రూ.51,200 కోట్లు, బాండ్ల మార్కెట్లలో నికరంగా రూ.5,964 కోట్ల పెట్టుబడులతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం విశేషం. అంతర్జాతీయంగా లిక్విడిటీ మెరుగుపడడం, స్థిరమైన వడ్డీ రేట్లు, అధికార పార్టీయే తిరిగి మళ్లీ విజయం సాధిస్తుందన్న అంచనాలు విదేశీ ఇన్వెస్టర్లలో భారత మార్కెట్ల పట్ల ఆశావహ పరిస్థితి కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నవీన్ కులకర్ణి తెలిపారు. ‘‘అంతర్జాతీయ వృద్ధి నిదానించడం, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకుల విధానాల్లో మార్పు రావడంతోపాటు అమెరికాలో రేట్ల పెంపు అవకాశాలు లేకపోవడమే... ఎఫ్‌పీఐలకు భారత్ ఏడారిలో ఒయాసిస్‌లా మారింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటజీ హెడ్ వీకే శర్మ పేర్కొన్నారు. -
పెట్టుబడులకు స్వర్గధామం.. భారత్
డెహ్రాడూన్: దేశంలో ప్రస్తుతం కీలక సామాజిక, ఆర్థిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత అనుకూలంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘డెస్టినేషన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమ్మిట్–2018’ను ఆదివారం ఇక్కడ ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో మునుపెన్నడూ లేనంతగా సామాజిక, ఆర్థిక మార్పులు సంభవిస్తున్నాయి. వచ్చే దశాబ్దాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక చోదక శక్తిగా మారుతుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణం తగ్గాయి. దేశంలో మధ్య తరగతి ప్రజల సంఖ్య, ఆర్థిక వృద్ధి పెరిగాయి. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న కనీసం 10వేల చర్యల వల్ల దేశంలో వ్యాపార అవకాశాలు గణనీయంగా పెరిగాయి’ అని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో చేపట్టిన అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ అమలు. దీని ఫలితంగా దేశమంతా ఒకే మార్కెట్‌గా మారిపోయింది’ అని తెలిపారు. ‘మౌలిక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. దేశవ్యాప్తంగా దాదాపు 10వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సౌకర్యాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 100 కొత్త హెలిప్యాడ్లు, విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. మా దేశంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నా. ఇది కేవలం భారతీయుల కోసమే కాదు, ప్రపంచం కోసం కూడా’ అని ప్రధాని అన్నారు. రాష్ట్రాల్లో అద్భుత వనరులున్నాయంటూ ఆయన.. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే జరిగే అద్భుత అభివృద్ధిని ఏశక్తీ ఆపలేదన్నారు. అనేక యూరప్ దేశాలను అధిగమించవచ్చన్నారు. ఉత్తరాఖండ్‌లో పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉన్నందున తమ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. దేశంలోనే ఆధ్యాత్మిక పర్యావరణ జోన్(స్పిరిట్యువల్ ఎకో జోన్)గా అవతరించేందుకు రాష్ట్రంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. దక్షిణ కొరియా మోడల్ ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పటి తన అనుభవాన్ని వివరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన మీడియా సమావేశంలో కొందరు విలేకరులు నన్ను తికమకపెట్టేందుకు యత్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు వీరు ఎలాంటి మోడల్‌ను అనుసరించాలనుకుంటున్నారు అని నన్ను అడిగారు. వెంటనే నేను దక్షిణ కొరియాను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పా. నా సమాధానం వారికి అర్థం కాలేదు. దక్షిణకొరియా విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం దాదాపు గుజరాత్ మాదిరిగానే ఉంటాయి కాబట్టే ఆ దేశాన్ని మోడల్‌గా తీసుకున్నానని వారికి వివరించా’ అని అన్నారు. వ్యవసాయం, అగ్రిబిజినెస్తోపాటు ఆర్గానిక్ వ్యవసాయానికి ఉత్తరాఖండ్‌లో మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ రంగంలో పెట్టుబడులతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చన్నారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్యవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆదానీ, మహింద్రా గ్రూప్ సంస్థలు, జేఎస్‌డబ్ల్యూ, అమూల్, పతంజలి వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలిపారు. -
పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుణే: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే బహుళజాతి కంపెనీలకు తమ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పేర్కొన్నారు. మరిన్ని సంస్కరణలను అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. అమెరికా ఇంజనీరింగ్ సంస్థ-జీఈ కార్పొరేషన్ మొదటి మల్టీమోడల్ తయారీ కర్మాగారాన్ని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యంత సాంకేతిక నైపుణ్యతను సముపార్జించిన భారతీయ యువతను వినియోగించుకోవాలని బహుళజాతి కంపెనీలకు పిలుపునిచ్చారు. ప్రత్యేకించి తయారీ రంగం పురోభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రత్యేకించి మూడు రంగాలు- తయారీ, వ్యవసాయం, సేవా రంగాల పురోభివృద్ధి ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యతలని వివరించారు. దీనితోపాటు ఆతిథ్య రంగంపై కూడా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. అమెరికాతో భారత్ సంబంధాలు మరింత పటిష్టం కానున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పెరుగుదల, రైల్వే రంగంలో సాంకేతిక అభివృద్ధి లక్ష్యంగా సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 21వ శతాబ్దం ఆసియాదనీ, అందులో భారత్‌ది కీలక పాత్రని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రధాని ప్రారంభించిన జీఈ కర్మాగారం విద్యుత్, చమురు, గ్యాస్, రవాణా పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ మొత్తం ఉత్పత్తిలో 50 శాతాన్ని ప్రపంచంలోని తమ వివిధ జీఈ విభాగాలకు సరఫరా చేస్తుంది. ఈ కర్మాగారం ద్వారా 1,500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.