Best Short Term Investment Plans With High Returns - Sakshi
Sakshi News home page

నేను కొద్ది కాలమే డబ్బుల్ని పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా.. ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయొచ్చు

Published Mon, Jul 31 2023 7:22 AM | Last Updated on Mon, Jul 31 2023 8:36 AM

Best Short Term Investment Plans With High Returns - Sakshi

మంచి ఇండెక్స్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకునేందుకు ఎటువంటి అంశాలను పరిశీలించాలి?– శశాంక్‌ 

మ్యూచువల్‌ ఫండ్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియోని చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్‌ పోర్టల్‌లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది. కొంత ట్రాకింగ్‌ లోపం ఉండే అవకాశం లేకపోలేదు.

అంటే ఇండెక్స్‌ 2 శాతం పెరిగితే.. ఫండ్‌ పెట్టుబడుల విలువ అదే కాలంలో 2.01 శాతం, 1.99 శాతంగా చూపించొచ్చు. ముఖ్యంగా ఎక్స్‌పెన్స్‌ రేషియో కీలకం అవుతుంది. రెండు ఇండెక్స్‌ పథకాల్లో ఒకటి 10 బేసిస్‌ పాయింట్లు చార్జ్‌ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్‌ పాయింట్లు చార్జ్‌ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్‌ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడమే సరైనది.

నేను స్వల్పకాలం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఎక్కడ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు? – గోపాల్‌ రామ్‌ 

ఇన్వెస్టర్లలో చాలా రకాలు ఉంటారు. కొందరు కేవలం రాబడుల వృద్ధిని చూస్తుంటారు. కొందరు పెట్టుబడి ద్వారా పన్ను తగ్గించుకోవాలని భావిస్తుంటారు. కొందరు క్రమం తప్పకుండా (రెగ్యులర్‌) ఆదాయం కోసం ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కొందరు స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెడుతుంటారు. అయితే స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారు ప్రధానంగా తమ పెట్టుబడిని కాపాడుకోవడానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పెట్టుబడి భద్రంగా ఉన్నప్పుడే రాబడులు సాధ్యపడతాయి. ఈ విషయంలో ఇన్వెస్టర్ల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి.

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఒక మార్గం. బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలో ఉంచడం వల్ల వచ్చే రాబడి (3 శాతం) కంటే ఎఫ్‌డీలో వచ్చే రాబడే ఎక్కువ. ఎఫ్‌డీలు ఎంతో సురక్షితమైనవి. బ్యాంకులు సంక్షోభంలో పడినా, ఒక్కో డిపాజిట్‌ దారునికి రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ (డీఐసీజీసీ) రూపంలో ఆర్‌బీఐ ద్వారా ఈ బీమా సదుపాయం లభిస్తుంది. కానీ, ఈ తరహా సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎఫ్‌డీల రూపంలో వచ్చే వడ్డీ ఆదాయం సంబంధిత పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎఫ్‌డీపై వచ్చే రాబడి పన్ను వర్తించే ఆదాయం కిందకే వస్తుంది. 

ఒకవేళ 30 శాతం పన్ను పరిధిలో ఉంటే, అటువంటి వారికి ఎఫ్‌డీ మెరుగైన సాధనం అని చెప్పలేం. ఎందుకంటే వచ్చే 7 శాతం రాబడిలో 30 శాతం పన్ను చెల్లించడానికే వెళుతుంది. ఇక స్వల్పకాల పెట్టుబడుల కోసం మరో మార్గం డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌. డెట్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను పడుతుంది. డెట్‌ ఫండ్‌లో పెట్టుబడిని మూడేళ్ల వరకు ఉంచితే వచ్చే లాభంపై పన్ను 20 శాతంగా ఉండేది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే అవకాశం కూడా ఈ ఏడాది మార్చి వరకు అమల్లో ఉంది. కానీ, ఈ ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కనుక డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతన్న దానితో సంబంధం లేకుండా వచ్చే రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక పన్ను పరంగా ఎఫ్‌డీలకు సమానంగా డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను కూడా కేంద్రం మార్చేసింది.

కనుక ఇన్వెస్టర్లు వీటిల్లో తమకు ఏది సౌకర్యం అనిపిస్తే దానినే ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల కోసం అయితే మంచి లిక్విడ్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది అంతకుమించిన కాలానికి అయితే అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్, అంతకుమించిన కాలానికి అయితే షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్‌ను పరిశీలించొచ్చు. డెట్‌ ఫండ్స్‌ అన్నవి రాబడులకు కానీ, పెట్టుబడికి కానీ హామీ ఇవ్వవు. కానీ, ఎఫ్‌డీల్లో పెట్టుబడి, రాబడికి హామీ ఉంటుంది. అందుకని ఒక వేళ డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేట్టు అయితే అధిక నాణ్యమైన పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ నాణ్యమైన పేపర్లలో పెట్టుబడులు పెట్టే డెట్‌ ఫండ్స్‌లో రాబడులతో పాటు రిస్క్‌ ఎక్కువ. డిఫాల్ట్‌ రిస్క్‌ కూడా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement