మ్యూచువల్ ఫండ్స్‌లో నాకున్న పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసేసుకుని, తమ పీఎంఎస్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఓ ఫిన్‌టెక్ యాప్ అడుగుతోంది. నేను రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నాను. కనుక పీఎంఎస్ సేవలు వినియోగించుకోవడం సరైనదేనా? – విష్ణు నివాస్
పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా పోర్ట్‌ఫోలియో రక్షణ బాధ్యతలను ఫండ్ మేనేజర్ తీసుకుంటారు. పీఎంఎస్ అయితే ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణమైన సేవలను అందించగలదు. కాకపోతే పీఎంఎస్‌లో పెట్టుబడులకు కనీసం రూ.50 లక్షలు ఉండాలి. అదే మ్యూచువల్ ఫండ్‌లో అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పైగా మ్యూచువల్ ఫండ్స్‌లో కొనసాగడం వల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే, ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియో పరంగా ఎన్నో లావాదేవీలు నిర్వహిస్తుంటారు. వీటిపై ఇన్వెస్టర్ ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. కేవలం పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే పీఎంఎస్ అనుకోండి.. మీ డీమ్యాట్ ఖాతా నుంచే స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహిస్తుంది. కనుక లావాదేవీల చార్జీలు, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇది అధిక వ్యయాలకు, పన్నులకు దారితీస్తుంది. ఫలితంగా రాబడులపై ప్రభావం పడుతుంది. ఏ పెట్టుబడి సాధనం అయినా పారదర్శకత కీలకం.
మ్యూచువల్ ఫండ్స్ రోజువారీ యూనిట్ ఎన్‌ఏవీలను ప్రకటించాల్సిందే. నెలవారీగా తమ పోర్ట్‌ఫోలియో వివరాలను సైతం వెల్లడించాలి. దీంతో తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పెట్టుబడుల విధానం, పనితీరు ఇన్వెస్టర్లకు స్పష్టంగా తెలిసిపోతుంది. పీఎంఎస్ ఖాతాల్లో ఇదే స్థాయి పారదర్శకత ఉండదు.
నాకు గడిచిన మూడేళ్లలో ఈక్విటీ పెట్టుబడులపై గణనీయమైన రాబడులు వచ్చాయి. కనుక ఇప్పుడు వీటిని విక్రయించి, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – అద్వైత్
మీ నిధుల అవసరాలపైనే పెట్టుబడులను లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించడం ఆధారపడి ఉంటుంది. సమీప కాలంలో (6–12 నెలలు) మీకు డబ్బులతో పని ఉంటే, ఈక్విటీ ఫండ్స్ నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకుని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే, మీ ఆర్థిక లక్ష్యానికి చేరువ అయినప్పుడు కూడా ఈక్విటీ పెట్టుబడులు వెనక్కి తీసుకుని, డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ పథకం పోటీ పథకాలతో వరుసగా మూడేళ్ల పాటు రాబడుల విషయంలో వెనుకబడి ఉంటే, అప్పుడు కూడా ఆ పథకం నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు. ఏడాది, రెండేళ్ల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయానికి రావద్దు. మరో ఐదేళ్ల వరకు మీకు నిధుల అవసరం లేకపోతే ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించడమే సరైనది. ఎందుకంటే ఇప్పుడే వాటిని వెనక్కి తీసుకుంటే మిగిలిన ఐదేళ్ల కాలంలో మరింత రాబడులు పొందే అవకాశం కోల్పోతారు. అస్సెట్ అలోకేషన్ (డెట్–ఈక్విటీ తదితర సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళిక)కు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో క్రమానుగతంగా మార్పులు చేసుకోవడంపై దృష్టి సారించండి.
ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment