విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మనకు ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్పుతాడు. దారిలో ఉన్న అడ్డంకులను తొలగించి విజయాలకు మార్గం ఏర్పరుస్తాడు. ఇదే ప్రేరణతో మనం కూడా మ్యుచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్‌గా పెట్టుబడులు పెట్టే విషయంలో వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితమైనదిగా తీర్చిదిద్దుకోవడానికి బాటలు వేసుకోవచ్చు.
సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ : శుభారంభం
వినాయకుడు అంటే వివేకం, దూరదృష్టికి ప్రతీక. మన జీవితాల్లో ఎదురయ్యే విఘ్నాలను తొలగిస్తాడనే నమ్మకం. తగినంత డబ్బు లేకపోవడం లేదా ఆర్థిక భద్రతపరమైన సమస్యలతో మనలో చాలా మంది సతమతమవుతుంటారు. ఆర్థికపరమైన అడ్డంకులనేవి ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల వచ్చే సమస్యలని మనం గుర్తించాలి.
వివేకవంతమైన నిర్ణయాల ద్వారా వాటిని అధిగమించాలి. మనం పొదుపు చేసుకునే మొత్తాన్ని ద్రవ్యోల్బణం అనేది పగలు, రాత్రి చెదపురుగులా తినేస్తుంది కాబట్టి ఆర్థిక భద్రతకు పొదుపు ఒక్కటే సరిపోదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక భద్రతను సాధించాలన్నా, సంపదను పెంచుకోవాలన్నా మన పొదుపును అర్థవంతమైన విధంగా ఇన్వెస్ట్ చేయాలి. అప్పటికప్పుడు లాభాలు వచ్చేయాలనే తాపత్రయంతో ట్రేడింగ్ టిప్స్, స్పెక్యులేటివ్ పెట్టుబడులపై ఆధారపడకుండా వివేకవంతంగా, క్రమం తప్పకుండా మ్యుచువల్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చు.
తప్పిదాల నుంచి నేర్చుకోవడం
గణేశుడి పెద్ద తల వివేకాన్ని, పాండిత్యాన్ని సూచిస్తుంది. దీన్నే పెట్టుబడులకు అన్వయించుకుంటే, గత తప్పిదాల నుంచి నేర్చుకుని, మెరుగైన ఇన్వెస్టర్లుగా మారే వివేకం కలిగి ఉండాలని అ ర్థం చేసుకోవచ్చు. క్రమశిక్షణ లేకపోవడం లేదా మరీ ఎక్కువ రిస్కులు తీసుకోవడం లేదా అస్సలు రిస్కే తీసుకోకపోవడం, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోతుంటారు. అయితే, దీనితో కుంగిపోకుండా, ఈ అనుభవాలన్నింటినీ విలువైన పాఠాలుగా భావించి, విజయాల వైపు బాటలు వేసుకోవాలి.
ప్రొఫెషనల్ సలహా తీసుకోవడం
వినాయకుడి పెద్ద చెవులు మనం చక్కని శ్రోతగా ఉండాలనేది సూచిస్తాయి. ఆర్థిక ప్రపంచం విషయాన్ని తీసుకుంటే అర్హత పొందిన ఫైనాన్షియల్ ప్లానర్ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు ఇచ్చే ఆర్థిక సలహాలను స్వీకరించే ఆలోచనా ధోరణిని కలిగి ఉండాలని ఇది సూచిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా మీ డబ్బును సరైన విధంగా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చనేది ఆర్థిక సలహాదార్లు మెరుగైన సలహాలు ఇవ్వగలరు.
జీవిత పాఠాలు
వినాయకుడి ఎడమ దంతం విరిగి ఉంటుంది. మహాభారతాన్ని రాసేందుకు వేదవ్యాసుడు అత్యంత వేగంగా రాయగలిగే సామర్థ్యాలు గల వినాయకుడి సహాయం తీసుకున్నట్లు మన పురాణాలు చెబుతాయి. ఒక దశలో రాస్తున్న ఘంటం విరిగిపోవడంతో గణేశుడు తన దంతాన్నే విరగగొట్టి దాన్నే ఘంటంగా ఉపయోగించి రాయడాన్ని కొనసాగించాడు. అలా వినాయకుడి పట్టుదల, నిబద్ధతతో మనకు మహోత్కృష్టమైన మహాభారతం అందింది. అద్భుతమైన ఆర్థిక లక్ష్యాలతో మొదలెట్టిన పెట్టుబడుల ప్రయాణంలోనూ ఎలాంటి ఆటంకాలు వచ్చినా వెరవకుండా క్రమానుగత పెట్టుబడులు పెడుతూ, నిబద్ధతతో ముందుకు సాగాలని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది.
నెలకు కేవలం రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తూ వెడితే 20 ఏళ్లలో ఏకంగా రూ. 1 కోటి మొత్తాన్ని సమకూర్చుకునేందుకు (13 శాతం వడ్డీ రేటు అంచనా), అలాగే నెలకు రూ. 45,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలోనే అంత మొత్తాన్ని సమకూర్చుకునేందుకు సిప్ సహయపడగలదు. కాబట్టి వాయిదాలు వేయకుండా సాధ్యమైనంత త్వరగా సిప్‌ను ప్రారంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనాలను అత్యధికంగా పొందవచ్చు.
సురేష్ సోని - సీఈవో, బరోడా బీఎన్‌పీ పారిబా ఏఎంసీ
Comments
Please login to add a commentAdd a comment