ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? – నర్సింగ్‌రావు
ఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. అత్యవసర నిధి ఏర్పాటుకు ఇది అనుకూలమైన సాధనం కాదు. ఎందుకంటే బంగారం ఆటుపోట్లతో కూడి ఉంటుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏ మూడు నెలల కాలాన్ని పరిశీలించి చూసినా బంగారం రాబడుల్లో ఆటుపోట్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాబడులు గరిష్టంగా 24 శాతం వరకు, కనిష్టంగా 13 శాతం మధ్య ఉన్నాయి. అత్యవసర నిధికి స్థిరత్వం అవసరం. కానీ, బంగారం రాబడుల్లో ఉన్న ఈ ఊహించలేనితత్వం దీనికి విరుద్ధం. అత్యవసర నిధి ఏర్పాటుకు మోస్తరు స్థాయిలో స్థిరమైన రాబడులు ఇచ్చే సాధనాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్ చాలా తక్కువ రిస్క్‌తో వస్తాయి. ఎలాంటి లాకిన్ పీరియడ్ ఉండదు.
లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపిక
అత్యవసర నిధి ఏర్పాటుకు కొన్ని లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. కరెన్సీల్లో అస్థిరతలు లేదా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బంగారం విలువైన సాధనంగా మారుతుంది. ఆ సమయంలో సంపద విలువ రక్షణ సాధనంగా పనికొస్తుంది. కొందరు ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో కొంత బంగారానికీ కేటాయిస్తుంటారు. ఇది ఈక్విటీలకు హెడ్జ్ సాధనంగా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ గణనీయమైన దిద్దుబాట్లకు గురైనప్పుడు హెడ్జింగ్ సాధానంగా అనుకూలిస్తుంది. వైవిధ్యమైన, దీర్ఘకాల పోర్ట్‌ఫోలియోలో బంగారం సైతం తనవంతు పాత్ర పోషిస్తుంది. కానీ, అత్యవసర నిధికి అనుకూలమైనది కాదు.
ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!
బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ గురించి విన్నాను. 2020 మార్చిలో ఈక్విటీ పతనం మాదిరి సంక్షోభాల్లో డౌన్‌సైడ్ రిస్క్ నుంచి రక్షణ ఉంటుందా? – మునిరత్నం
ఈక్విటీ మార్కెట్ల అస్థిరతల నుంచి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. ఎందుకంటే ఇవి కొంతమేర పెట్టుబడులను ఈక్విటీలకు సైతం కేటాయిస్తుంటాయి. ఈక్విటీలు మార్కెట్ అస్థిరతలకు లోబడే ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చుకుంటే మాత్రం వీటిలో అస్థిరతలు తక్కువ. ఇక బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అన్నింటిలోనూ ఈక్విటీ పెట్టుబడులు ఒకే మాదిరిగా ఉండవు. ఇటీవలి డేటా ప్రకారం ఈ పథకాల్లో ఈక్విటీ ఎక్స్‌పోజర్ 14 శాతం నుంచి 80 శాతం మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయనే అంశం ఆధారంగా ఆయా పథకాల్లో డౌన్‌సైడ్ (నష్టం) రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. అంతేకాదు విడిగా ఒక్కో పథకం సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. కనుక వీటి ఆధారంగానూ డౌన్‌సైడ్ రిస్క్ మారుతుంటుంది. కనుక బ్యాలన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ మార్కెట్ల హెచ్చు, తగ్గుల ప్రభావాలకు అతీతం కాదని చెప్పుకోవాల్సిందే.
- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment