
సాంకేతిక పురోగతి, మార్కెట్లో ఒడిదుడుకులు, మారిపోతున్న ఆర్థిక పరిస్థితులతో ఇన్వెస్టింగ్ ప్రపంచంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, తమ సంపదను పెంచుకునేందుకు సరళమైన, సమర్ధవంతమైన మార్గం కోసం అన్వేషిస్తున్న వారికి, ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా మారాయి. తక్కువ వ్యయాలతో కూడుకున్నవై, సరళమైన వ్యూహం, విస్తృత డైవర్సిఫికేషన్, దీర్ఘకాలిక వృద్ధిపై ఫోకస్ పెట్టే ప్యాసివ్ ఫండ్స్ అనేవి, ఆర్థిక మార్కెట్లలో సమర్ధవంతంగా ఇన్వెస్ట్ చేసేందుకు అనువైన మార్గంగా ఉండగలవు. 2025లో పెట్టుబడులకు సంబంధించి స్మార్ట్ చాయిస్‌గా నిలవడంలో వీటికున్న ప్రత్యేకత గురించి తెలియజేసేదే ఈ కథనం.
సాధారణంగా ఇన్వెస్టింగ్ అంటే, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, రిస్క్ లను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ సాధనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇలాంటి అనేకానేక నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో, చాలా సంక్లిష్టమైన వ్యవహారంగా అనిపిస్తుంది.
ఇలాంటి గందరగోళం లేకుండా సరళమైన విధానంలో పెట్టుబడులకు అవకాశం కల్పించడమే ప్యాసివ్ ఫండ్స్ ప్రత్యేకత. ఒక్కో స్టాక్‌ను వేర్వేరుగా ఎంచుకుని, ఒక్కొక్కటిగా పర్యవేక్షించుకోవాల్సిన అవసరం లేకుండా విస్తృత మార్కెట్‌ను ప్రతిబింబించేవిగా, పెద్దగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేని విధంగా ఇవి ఉంటాయి. దీర్ఘకాలిక వృద్ధి కోరుకుంటున్నా లేదా సంపదను స్థిరంగా పెంపొందించుకోవాలని భావిస్తున్నా, జీవితంలో ఇతరత్రా అంశాలపై దృష్టి పెట్టేందుకు వెసులుబాటునిచ్చే, సులభతరంగా అర్థమయ్యే సొల్యూషన్‌గా ప్యాసివ్ ఫండ్స్ ఉపయోగపడతాయి.
తక్కువ వ్యయాలు.. ఎక్కువ ప్రయోజనాలు..
చెల్లించాల్సిన ఫీజుల గురించి ఇన్వెస్టర్లు ప్రత్యేకంగా పట్టించుకుంటున్న నేపథ్యంలో 2025లో ప్రతి పర్సంటేజీ పాయింటూ ముఖ్యమే. అతి తక్కువ వ్యయ నిష్పత్తులకు ప్యాసివ్ ఫండ్స్ పేరొందాయి. వివిధ స్టాక్స్ ఎంపిక కోసం ఈ ఫండ్స్‌కి భారీగా అనలిస్టులు, ఫండ్ మేనేజర్ల బృందం అవసరం లేకపోవడం వల్ల వీటి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి.
దీర్ఘకాలిక వృద్ధికి స్థిరమైన వ్యూహం ..
నేరుగా మార్కెట్లకు అనుసంధానితమైన రాబడులను అందించే సామర్థ్యాలు ఉండటమే ప్యాసివ్ ఫండ్స్‌ను ఎంచుకోవడానికి మరో ప్రధాన కారణంగా నిలుస్తుంది. అనిశ్చితి పెరిగిపోతున్న తరుణంలో, స్థిరత్వంతో పాటు కాలం గడిచే కొద్దీ నిలకడగా, కాంపౌండెడ్ రాబడులను అందించగలిగే వ్యూహాల కోసం ఇన్వెస్టర్లు అన్వేషిస్తున్నారు. విస్తృతమైన మార్కెట్ సూచీలను ట్రాక్ చేయడం ద్వారా, సంపదను పెంపొందించుకోవడానికి ఇన్వెస్టర్లకు విశ్వసనీయమైన బాటను ఏర్పర్చి, ప్యాసివ్ ఫండ్స్ ఇలాంటి వృద్ధి అవకాశాలను అందిస్తాయి.
ప్యాసివ్ ఫండ్స్ ద్వారా కొనడం, అమ్మడం సులభతరంగా ఉంటుంది. కాబట్టి, ఇతరత్రా పెట్టుబడి సాధనాల తరహాలో సుదీర్ఘ సెటిల్మెంట్ వ్యవధులు లేదా పరిమితుల గురించిన ఆందోళన లేకుండా, అవసరమైనప్పుడు, కావాల్సిన విధంగా తమ పోర్ట్‌ఫోలియోను సరి చేసుకునే స్వాతంత్య్రం ఇన్వెస్టర్లకు లభిస్తుంది.
వైవిధ్యం..
ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రిస్క్ లు తప్పవు. కానీ వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడమే కీలకం. ప్యాసివ్ ఫండ్స్ అనేవి డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను కల్పించడం ద్వారా రిస్క్ లకు ప్రతిగా, సహజసిద్ధమైన హెడ్జింగ్ సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారంటే మీరు విస్తృతమైన మార్కెట్లో (నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 500) కొంత భాగాన్ని లేదా మొత్తం మార్కెట్‌నే కొనుగోలు చేసినట్లు లెక్క. ఇందులో వివిధ రంగాలు, పరిశ్రమలు, థీమ్‌లను ప్రతిబింబించే వేర్వేరు స్టాక్స్ ఉంటాయి.
అంటే, మీ పెట్టుబడి రాణించడమనేది ఏ ఒక్క కంపెనీ లేదా రంగం పనితీరుపై ఆధారపడదు. ఒకటి తగ్గినా మరొకటి పెరిగే అవకాశాలు ఉండటం వల్ల రిస్క్ లు కొంత తక్కువగా ఉంటాయి. ఇక లిక్విడిటీపరంగా చూస్తే, ఇండెక్స్, సెక్టార్ లేదా అసెట్ క్లాస్‌ను ట్రాక్ చేసే ఈటీఎఫ్‌లు షేర్లలాగే ఎక్సే్చంజీల్లో ట్రేడవుతాయి. ట్రేడింగ్‌కి అనువుగా ఉంటాయి. వీటిని కొని, అమ్మేందుకు డీమ్యాట్ ఖాతా ఉండాలి.
మరోవైపు, నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్ పనితీరును ప్రతిఫలిస్తూ, ప్యాసివ్‌గా ఉండేవి ఇండెక్స్ ఫండ్స్. వీటిలో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతా అక్కర్లేదు. నికర అసెట్ వేల్యూ (ఎన్‌ఏవీ) ఆధారంగా వీటిని నేరుగా ఫండ్ హౌస్ ద్వారా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు లేని ఇన్వెస్టర్లు కూడా ప్యాసివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇండెక్స్ ఫండ్ మార్గం ఉపయోగకరంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment