అడ్వయిజర్లతో ఆర్థిక ప్రణాళిక ఈజీ! | Role of Financial Advisors in Investment Planning | Sakshi
Sakshi News home page

అడ్వయిజర్లతో ఆర్థిక ప్రణాళిక ఈజీ!

Published Mon, Nov 4 2024 4:21 AM | Last Updated on Mon, Nov 4 2024 8:02 AM

Role of Financial Advisors in Investment Planning

ఆర్థిక అంశాల్లో నిపుణుల సేవలు కీలకం 

వారి సాయంతో లక్ష్యాల సాధన సులభతరం 

సవాళ్లను తేలికగా  అధిగమించొచ్చు  

తెలిసీ తెలియని అడుగులతో సంక్షోభం తెచ్చుకోవద్దు

ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక అవసరం. వివిధ దశల్లో లక్ష్యాలను సాకారం చేసుకుంటూ విజయవంతంగా సాగిపోవడానికి మెరుగైన మార్గాన్ని చూపిస్తుంది. జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవడం, అందుకు అనుగుణంగా పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పన, వాటి ఆచరణ ఇవన్నీ ఆర్థిక విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, మనలో ఎక్కువ మందికి ఆర్థిక అంశాలపై కావాల్సినంత అవగాహన ఉండదు. ఇలాంటప్పుడే నిపుణుల సేవలు అవసరం పడతాయి. 

ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? ఎంత కాలం పాటు, ఎంత చొప్పున ఇన్వెస్ట్‌ చేయాలి? ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి.. వీటిని తేల్చడం నిపుణులకే సాధ్యపడుతుంది. అంతేకాదు పెట్టుబడి పెట్టడంతోనే పని ముగిసినట్టు కాదు. తమ లక్ష్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. ఈ పనిని సులభతరం చేసే వారే ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్లు లేదా ఫైనాన్షియల్‌ ప్లానర్లు. వీరిని ఎలా ఎంపిక చేసుకోవాలి? ఎవరు ఎంపిక చేసుకోవాలి? వీరి సేవలు ఎలా ఉంటాయి? తదితర అంశాలపై అవగాహన కలి్పంచే కథనమిది... 
 

తమకు అనుకూలమైన ఆర్థిక సలహాదారును ఎంపిక చేసుకోవడం విజయంలో కీలకంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మంచి ట్రాక్‌ రికార్డు అని కాకుండా.. తమ లక్ష్యాల ప్రాధాన్యాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగే నిపుణులను ఎంపిక చేసుకోవడం అవసరం. ‘‘ఆర్థిక ప్రణాళిక ఆరంభించడానికి సరైన సమయం అంటూ ఏదీ లేదు. ఎంత ముందుగా ఆరంభిస్తే అంత మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు’’ అనేది సెబీ రిజిస్టర్డ్‌ ఇన్వెస్ట్‌మైంట్‌ అడ్వయిజర్ల, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్‌ కుమార్‌ అభిప్రాయం. అందుకని కెరీర్‌ ఆరంభంలోనే ఆర్థిక నిపుణుల సాయంతో మెరుగైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుని, ఆ దిశగా అడుగులు వేయడం ద్వారా బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకున్నట్టు అవుతుంది.

నిజంగా అవసరమా? 
మన విద్యా వ్యవస్థ చాలా విషయాలను నేర్పుతుంది. కానీ ఆర్థిక విషయాలు, ప్రణాళికల గురించి ఎక్కడా కనిపించదు. వివాహం కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కనీసం రూ.కోటి ఉంటేనే కానీ సొంతింటి కల సాకారం కాదు. పిల్లల విద్య కోసం ఏటా రూ.లక్షలు వెచి్చంచాలి. ఖరీదైన వైద్యం, రిటైర్మెంట్‌ తర్వాత జీవన అవసరాలు వీటన్నింటికీ సన్నద్ధంగా ఉండాలి. భారీ ఆదాయం ఆర్జించే వారికి తప్పించి, ప్రణాళిక లేకుండా వీటిని విజయవంతంగా అధిగమించడం సామాన్య, మధ్యతరగతి వారికి అంత సులభం కాదు. అర్హత కలిగిన, సెబీ రిజిస్టర్డ్‌ నిపుణుల సాయంతో వీటిని అధిగమించేందుకు తేలికైన మార్గాలను గుర్తించొచ్చు.

 ‘‘తమ జీవితంలో ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే చాలా మందికి ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌  లేదా ప్లానర్‌ అవసరం తెలిసొస్తుంది. ఇందుకు నిదర్శనం ఇటీవల చూసిన కరోనా విపత్తు. ఆ సమయంలో అత్యవసర నిధి సాయం ప్రాధాన్యాన్ని చాలా మంది అర్థం చేసుకున్నారు’’ అని ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ స్టాండర్డ్స్‌ బోర్డ్‌ (ఎఫ్‌పీఎస్‌బీ) ఇండియా సీఈవో క్రిషన్‌ మిశ్రా పేర్కొన్నారు. ఒకటికి మించి లక్ష్యాలు కలిగి, పొదుపు, మదుపు పట్ల ఆసక్తి కలిగిన వారు నిపుణుల సాయంతో అదనపు ప్రయోజనం పొందొచ్చు. 

ఆర్థిక అంశాల పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న వారు సైతం.. పొదుపు, పెట్టుబడుల పట్ల తగినంత సమయం వెచి్చంచలేనట్టయితే నిపుణుల సాయానికి వెనుకాడొద్దు. అనుకోని అవసరాలు ఏర్పడితే కొందరు రుణాలతో అధిగమిస్తుంటారు. ఆ రుణం తర్వాత మళ్లీ రుణం ఇలా రుణ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల ఎంత సంపాదించినా చివరికి మిగిలేదేమీ ఉండదు. స్వీయ తప్పిదాలు, అవగాహనలేమితో ఆర్థిక సంక్షోభాలను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. ఆర్థిక నిపుణులను కలవడం వల్ల లక్ష్యాల పట్ల స్పష్టత వస్తుంది. ఆర్థిక సవాళ్లను అధిగమించడం ఎలాగన్న స్పష్టత వస్తుంది. మెరుగైన బాట తెలుస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత సాధ్యపడుతుంది. మెరుగైన ఆర్థిక ప్రణాళిక ఉన్న కుటుంబాల్లో మానసిక ప్రశాంతత పాళ్లు ఎక్కువని పలు సర్వేలు సైతం స్పష్టం చేశాయి.

అందుబాటులో ఉన్న ఆప్షన్లు..  
ఆర్‌ఐఏలు 
సెబీ రిజిస్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లు వీరు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఫైనాన్స్‌ డిగ్రీ, కనీసం ఆయా విభాగంలో ఐదేళ్ల పాటు సేవలు అందించిన/పనిచేసిన అనుభవంతోపాటు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ (ఎన్‌ఐఎస్‌ఎం) నుంచి ఎక్స్‌ఏ, ఎక్స్‌బీ సర్టిఫికెట్‌ కలిగి ఉంటారు. వీరు తమ క్లయింట్ల ప్రయోజనాల కోసమే కృషి చేయాలి. ఎవరి నుంచి ఏ రూపంలోనూ కమీషన్లు స్వీకరించరాదని సెబీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.

సీఏలు
అకౌంటింగ్, పన్ను, ఆడిట్‌ అంశాల్లో చార్టర్డ్‌ అకౌంటెంట్లు (సీఏలు) ఎంతో శిక్షణ పొంది ఉంటారు. ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌లో ప్రత్యేక నైపుణ్యాలు సీఏలకు ఉండాలని లేదు. అయినా కానీ, పన్ను కోణంలో తమ క్లయింట్లకు పెట్టుబడుల సూచనలు చేయవచ్చు.

సీఎఫ్‌పీలు 
సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌లు తగిన కోర్సులు, పరీక్షలు పూర్తి చేసి ఎఫ్‌పీఎస్‌బీ నుంచి సర్టిఫికేషన్‌ పొందిన వారు. వ్యక్తుల ఆర్థిక ప్రణాళిక, పన్నులు, బీమా, రియల్‌ ఎస్టేట్‌ ప్లానింగ్‌ తదితర సేవలు అందిస్తారు.

క్యూపీఎఫ్‌పీలు 
క్వాలిఫైడ్‌ పర్సనల్‌ ఫైనాన్స్‌ ప్రొఫెషనల్స్‌ (క్యూపీఎఫ్‌పీ) ఆరు నెలల కఠోర శిక్షణ అనంతరం నెట్‌వర్క్‌ ఎఫ్‌పీ నుంచి క్యూపీఎఫ్‌పీ సర్టిఫికేషన్‌ పొందుతారు. పర్సనల్‌ 
ఫైనాన్స్‌ అంశాలు, నైపుణ్యాల గురించి  వీరు పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంటారు. తమ క్లయింట్ల ఆర్థిక శ్రేయస్సు  దిశగా వీరు.. పొదుపు, పెట్టుబడులు, బీమా, పన్నులు, రుణాలు తదితర అన్ని రకాల వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో సేవలు  అందిస్తారు.

ఎవరిని ఎంపిక చేసుకోవాలి? 
సెబీ–ఆర్‌ఐఏలు లేదా సీఎఫ్‌పీలు, క్యూపీఎఫ్‌పీలలో ఎవరిని అయినా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, పెట్టుబడుల సలహాలు అందించాలంటే ముందుగా సెబీ నుంచి రిజి్రస్టేషన్‌ తీసుకోవాల్సిందే. అందుకే ఆర్‌ఐఏలకు అదనంగా సీఎఫ్‌పీ లేదా చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ (సీఎఫ్‌ఏ) లేదా క్యూపీఎఫ్‌పీ అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసుకోవడం మెరుగైనదని నిపుణుల సూచన. సీఎఫ్‌పీ, సీఎఫ్‌ఏ, క్యూపీఎఫ్‌పీ, సీఏ అన్నవి అదనపు అర్హతలుగానే చూడాలి.

 ‘‘ఫైనాన్షియల్‌ ప్లానర్‌ను ఎంపిక చేసుకునే ముందు వారికున్న అర్హతలను నిర్ధారించుకోవాలి. వివిధ రకాల అర్హతలు ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ పరంగా వివిధ అవసరాలకు సరిపోయే విధంగా ఉంటాయి. క్లయింట్లు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలనే దిశగా కొందరు అడ్వయిజర్లు మార్గదర్శనం చేస్తారు. అదే సీఎఫ్‌పీలు అయితే సమగ్రమైన ఆర్థిక ప్రణాళికా పరిష్కారాలు సూచిస్తారు. రిటైర్మెంట్‌ కోసం ప్రణాళిక, ఎస్టేట్‌ ప్లానింగ్‌ (తదనంతరం వారసులకు బదిలీ), పన్ను ప్రణాళిక, వ్యక్తిగత ఆర్థిక అంశాలకు వీరు పరిష్కారాలు సూచిస్తారు. 

పెట్టుబడి సలహాదారుల మాదిరిగా కాకుండా సీఎఫ్‌పీలు ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా సమర్థవంతమైన పరిష్కార మార్గాలను చూపిస్తారు’’ అని ఎఫ్‌పీఎస్‌బీ సీఈవో క్రిషన్‌ మిశ్రా సూచించారు. సీఏలు తమ కోర్సులో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణపైనా అధ్యయనం చేస్తారు. అయినప్పటికీ ప్రాక్టీసింగ్‌కు వచ్చే సరికి ఎక్కువ మంది సీఏలు ప్రధానంగా పన్ను అంశాల్లో పరిష్కారాలు, సేవలకు పరిమితం అవుతుంటారు. కాకపోతే తమకున్న అర్హతలు, అనుభవం ఆధారంగా కొందరు ఇతర సూచనలు కూడా చేస్తుంటారు. సీఎఫ్‌పీ సర్టిఫికేషన్‌ కలిగిన సెబీ ఆర్‌ఐఏ మంచి ఎంపిక అవుతారని, ఆర్థిక ప్రణాళికపై వీరికి సమగ్రమైన అవగాహన ఉంటుందని గుడ్‌ మనీ వెల్త్‌ ప్లానర్స్‌ వ్యవస్థాపకుడు మణికరణ్‌ సింఘాల్‌ సూచించారు. ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ ఎంపిక విషయంలో తమ స్నేహితులు, బంధువుల సాయాన్ని తీసుకోవచ్చు.

ఫీజుకు తగ్గ ప్రతిఫలం! 
ఆర్థిక నిపుణుల సేవల గురించి తెలిసినా.. వారికి భారీగా ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుందని కొందరు వెనకడుగు వేస్తుంటారు. నిజానికి నిపుణుల సేవలతో లాభపడే దాని కంటే వారికి చెల్లించే ఫీజు చాలా చాలా తక్కువ. కొంచెం మొత్తానికి వెనుకాడితే.. ఒక్క తప్పటడుగుతో భారీగా నష్టపోవాల్సి రావచ్చు. అందుకే కొంత ఖర్చయినా నిపుణులను ఆశ్రయించడమే మంచిది. సెబీ 2013లో ‘ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ నిబంధనలు’ తీసుకొచి్చంది. అప్పటి వరకు కమీషన్‌ ఆధారితంగా వీరు సేవలు అందించే వారు. దీంతో ఎక్కువ కమీషన్‌ కోసం కొందరు తమ ప్రయోజన కోణంలో సలహాలు ఇచ్చే వారు. 

దీన్ని నివారించేందుకు.. ఫీజుల ఆధారిత నమూనాను సెబీ తీసుకొచి్చంది. సెబీ ఆర్‌ఐఏ చట్టం 2013 కింద.. స్థిరమైన ఫీజు లేదా, క్లయింట్‌ తరఫున తాము నిర్వహించే పెట్టుబడుల విలువలో నిర్ణీత శాతం (ఏయూఎం ఆధారిత) మేర ఫీజు కింద తీసుకోవచ్చు. ‘‘ఫీజు ఆధారిత సేవల నమూనాలో ఇన్వెస్టర్‌ విజయంపైనే ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్ల ఆదాయం ఆధారపడి ఉంటుంది. మెరుగైన సూచనలు అందించకపోతే, క్లయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. కమీషన్‌లకు అవకాశం లేకపోవడంతో ఎలాంటి పక్షపాతం లేని సూచనలు అందించడానికి వీలుంటుంది’’ అని మిశ్రా వివరించారు. ఆర్‌ఐఏలకు ఫీజులను డిజిటల్‌ విధానంలో, వారి ఖాతాకే చెల్లించాలి. నగదు రూపంలో, లేదా వేరెవరి ఖాతాకో బదిలీ చేయొద్దు.

ఫీజు పరిమితులు
ఆర్‌ఐఏలకు సంబంధించి చార్జీల విషయంలో సెబీ పరిమితులు విధించింది. ఫిక్స్‌డ్‌ ఫీజు అయితే ఏడాదికి రూ.1.25 లక్షలు మించకూడదు. లేదా, ఇన్వెస్టర్‌ పెట్టుబడుల విలువలో ఏటా 2.5 శాతం మించి ఫీజు వసూలు చేయరాదు.

ఈ అంశాలపై స్పష్టత అవసరం... 
ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లకు పూర్తి వివరాలు అందించినప్పుడే వారి నుంచి సరైన సూచనలు, సలహాలు పొందడానికి వీలుంటుంది. ముఖ్యంగా తమ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు, రుణాలు, ఆస్తులు, పిల్లలు, వారికి సంబంధించి విద్య, వివాహ లక్ష్యాలు, భవిష్యత్తులో ఏవేవి సమకూర్చుకోవాలని అనుకుంటున్నారు? కుటుంబ ఆరోగ్య చరిత్ర ఇత్యాది వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కోర్టు వివాదాలు, ఇతరత్రా కోరిన సమాచారం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాల ఆధారంగా మెరుగైన ప్రణాళిక, సూచనలు, పరిష్కారాలు సూచించేందుకు ఆస్కారం ఉంటుంది.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement