సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన డబ్బు సంపాదించడమే ఆర్థిక స్వేచ్ఛ అని చాలామంది భావిస్తుంటారు. కొందరు అప్పులు లేకుండా ఉండడమే ఆర్థిక స్వేచ్ఛగా పరిగణిస్తారు. ఇంకొందరు లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ ఉండడమే ఆర్థిక స్వేచ్ఛగా భావిస్తారు. మంచి ఇల్లును సొంతం చేసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళితే ఖర్చుల గురించి ఆలోచించకుండా ఉండే డబ్బు.. ఇందంతా ఒకింత ఆర్థిక స్వేచ్ఛేనని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యక్తుల వ్యక్తిగత ఆదాయం, వయసు, జీవన శైలి, కోరికలు, అలవాట్లు ఇలా విభిన్న అంశాలపై ఆర్థిక స్వేచ్ఛ ఆధారపడుతుందని చెబుతున్నారు. మీరు ఆర్థికంగా ఏమేరకు స్వేచ్ఛగా ఉన్నారో నిత్యం బేరీజు వేసుకోవాలని సూచిస్తున్నారు.
వీటిపై ఓ కన్నేయండి..
ఆదాయంలో ఎలాంటి పెరుగుదల లేకుండా ఖర్చులు అధికమవుతుంటే మీరు ఆర్థిక స్వేచ్ఛకు దూరమవుతున్నారనే సంకేతాలు వస్తున్నట్లు గ్రహించాలి. నెలవారీ బడ్జెట్‌ను మించి చిన్న అత్యవసరం వచ్చినా తట్టుకోలేని పరిస్థితి ఉందంటే కచ్చితంగా ఆలోచించాల్సిందే. దీనివల్ల మీరు అనుకుంటున్న ఆర్థిక స్వేచ్ఛ కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి సంకేతాలు వస్తున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించి తిరిగి ఆర్థిక పరిస్థితిని గాడినపడేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అప్పులతో జాగ్రత్త
ప్రతి చిన్న కొనుగోలుకు అప్పు చేస్తుంటే మాత్రం పరిస్థితి దిగజారి పోతుందని గ్రహించాలి. అప్పులు ఉండకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితిలో అప్పు చేయాల్సి వచ్చినా చాలా తక్కువగానే ఉండాలి. ప్రస్తుతకాలంలో ఈఎంఐ లేకుండా ఏదీ కొనుగోలు చేయలేకపోతున్నారు. అన్ని ఈఎంఐలు కలిపి ఆదాయంలో 30 శాతానికి మించకూడదు. బయట అప్పులు తీసుకొస్తే మాత్రం వెంటనే వాటిని తీర్చేయాలి. ఎందుకంటే అప్పు చెల్లింపులు జాప్యం చేస్తున్న కొద్దీ వడ్డీ భారం పెరుగుతుంది.
అత్యవసర నిధి ఉందా..?
ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇంటి ఖర్చులు, అప్పుల వాయిదాలు, ఈఎంఐలు.. వంటి వాటిని భరించడం కష్టం. కాబట్టి ముందుగానే దాదాపు ఆరు నెలలకు సరిపడా ఖర్చులను అత్యవసర నిధిగా సమకూర్చుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో దాచుకోవడం ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, చిన్న మొత్తంతోనైనా ప్రారంభించి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం సాగాలి.
ఇదీ చదవండి: సినిమా టికెట్లు ఎందుకంత ఖరీదు..?
కుటుంబానికి ఆర్థిక భరోసా
ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. మీ కుటుంబం మీపైనే ఆధారపడి ఉంటే మీ తదనంతరం వారికి ఆర్థిక భారం మోపకుండా మంచి టర్మ్‌పాలసీను ఎంచుకోవాలి. మీరులేని లోటును ఎవరూ మీ కుటుంబానికి తీర్చలేరు. కనీసం కొంతవరకు ఆర్థిక వెసులుబాటు కల్పించి రోడ్డునపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే జీవితబీమా తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment