సినిమాకు వెళితే పిల్లలు, తల్లిదండ్రులు, ప్రేమికులు, స్నేహితులు, తెలిసినవారు, బంధువులు.. ఇలా చాలామందిని గమనించవచ్చు. నిత్యం ఏదో పనుల్లో బిజీగా ఉండేవారికి సినిమాలు ఆటవిడుపుగా మారి వినోదాన్ని అందిస్తుంటాయి. కొన్నేళ్ల కొందట సినిమా నిర్మించడానికి రూ.లక్షల్లో ఖర్చయ్యేది. డిస్ట్రిబ్యూటర్లకు కూడా అదే తరహాలో రాబడి ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. చిత్ర నిర్మాణానికి రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. వాటిని రాబట్టేందుకు ప్రమోషన్లు, టికెట్ రేట్లు పెంచడం వంటి విభిన్న మార్గాలను అనుసరిస్తున్నారు. ఫక్తు వినోదాన్ని అందించాల్సిన సినీ పరిశ్రమలో క్రమంగా వ్యాపార ధోరణి పేరుకుపోతుంది. క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించిన రోజు నుంచి ఇంటర్వెల్‌లో ప్రేక్షకులు పాప్‌కార్న్ కొనుగోలు చేసేంత వరకు వివిధ స్థాయుల్లో వ్యాపారం ఏ విధంగా సాగుతుందో తెలుసుకుందాం.
ప్రీ ప్రొడక్షన్ ఖర్చులు: సినిమా ప్రారంభానికి ముందు ప్రీ ప్రొడక్షన్ ఖర్చులుంటాయి. ఇందులో స్క్రిప్ట్ డెవలప్ మెంట్, లొకేషన్ సెలక్షన్.. వంటి వాటికోసం కొంత డబ్బు అవసరం అవుతుంది.
ప్రొడక్షన్ ఖర్చులు: ఈ ఖర్చు చాలా కీలకం. నటీనటులు, సిబ్బంది జీతాలు, పరికరాల అద్దె, సెట్ నిర్మాణం, దుస్తులు, ప్రత్యేక ఖర్చులు దీని కిందకు వస్తాయి.
పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు: ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, మ్యూజిక్ లైసెన్సింగ్ వంటి వాటి కోసం కొంతక ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్: సినిమాను ప్రమోట్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కుదుర్చుకోవడం దీని కిందకు వస్తాయి.
సౌకర్యాలకు పెద్దపీట
గతంలో వీటన్నింటికి తక్కువగానే ఖర్చు అయ్యేది. ఇటీవల కాలంలో వీటి వ్యయం రూ.కోట్లల్లోనే ఉంది. కొన్నేళ్ల కిందట టౌన్‌లోని చిన్న థియేటర్‌లో ఫ్యాన్ సౌండ్‌ను భరిస్తూ సినిమా చూసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏసీ థియేటర్, ప్రీమియం సీటింగ్, లగ్జరీ సౌకర్యాలతో సినిమాను ఆస్వాదిస్తున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా సినిమా థియేటర్ యాజమాన్యాలు కూడా మౌలిక సదుపాయాలను అప్‌డేట్ చేస్తున్నాయి. ఆ ఆర్థిక భారాన్ని తుదకు ప్రేక్షకులే భరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పాన్ ఇండియా మార్కు
ఒకప్పుడు స్థానిక భాషలో సినిమా నిర్మించి అదే రాష్ట్రంలో విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ఏ భాషలో సినిమా తీసినా ‘పాన్ ఇండియా’ మార్కుతో విభిన్న భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దాంతో అక్కడి భాషల్లో విడుదల చేయాలంటే అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఫలితంగా సినిమా కాస్ట్ పెరిగిపోతుంది. దాంతో టికెట్ రేట్లు పెంచుతున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్‌లో చేయాల్సినవి.. చేయకూడనివి!
లిస్టెడ్ కంపెనీల జోరు
పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ వంటి లిస్టెడ్ కంపెనీలు దేశవ్యాప్తంగా చాలా మల్టిప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నాయి. సినిమా టికెట్ కాస్ట్ కంటే యాడ్‌ఆన్ సర్వీసులుగా ఉండే స్నాక్స్, ఐస్‌క్రీమ్స్, వాటర్ బాటిల్.. వంటివి విక్రయించడంతోనే అధిక మార్జిన్లు సంపాదిస్తాయి. ఒకవేళ టికెట్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటిస్తే అదనంగా ఆదాయం సమకూరినట్లే. థియేటర్లలో విభిన్న కంపెనీలు యాడ్‌లు ఇస్తుంటాయి. దానివల్ల ఆదాయం సమకూరుతుంది. మల్టిప్లెక్స్‌లు ప్రైవేట్ ఈవెంట్లకు స్కీన్లను రెంట్‌కు ఇస్తూంటాయి. అది కూడా ఒక ఆదాయ వనరుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment