
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలకు బెనిఫిట్ షో, ప్రిమియర్ షో, స్పెషల్ షోలకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు జనవరి 21వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సవరించింది. ఇదే సమయంలో 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షోలకు అనుమతించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం, తదుపరి విచారణ మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ఫ-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన పరిణామాలతో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. కానీ, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ మూవీ టికెట్ రేట్ల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు.
ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించొద్దని హైకోర్టు సూచించింది. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment