స్టాక్ మార్కెట్‌ను ఎలాంటి కష్టం లేకుండా డబ్బు సంపాదించే మార్గంగా చాలా మంది భావిస్తుంటారు. ఇందులో కొంతవరకు వాస్తవం లేకపోలేదు. కానీ, ఫ్రీగా డబ్బులు రావన్న విషయాన్ని మాత్రం విస్మరించకూడదు. గతంలో స్టాక్ మార్కెట్ లావాదేవీలన్నీ కాగితాల మీదే జరిగేవి. ఒక షేర్ కొనాలన్నా, అమ్మలన్నా పెద్ద తతంగమే ఉండేది. పైగా ఆ షేర్లు మన అకౌంట్లో జమ అయ్యేందుకు రోజులే పట్టేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దాంతో ట్రేడింగ్ చాలా సులువైంది. అరచేతిలో క్షణాల్లో స్టాక్స్ అమ్మడం, కొనడం జరిగిపోతుంది. కానీ గతంలో స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వ్యక్తులు డబ్బు పోగుట్టుకున్నా అనుభవం గడించేవారు. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్..?
ఎవరో చెప్పారని, యూట్యూబ్‌లో ఏదో వీడియోలు చూశామని స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నారు. దాంతో మార్కెట్‌పై నిందలేస్తూ, ఇదో జూదమని, గ్యాంబ్లింగని స్టాక్ మార్కెట్ నుంచి విరమించుకుంటున్నారు. సరైన అవగాహన పెంపొందించుకోకుండా మార్కెట్‌లోకి ప్రవేశించి చేతులు కాల్చుకుని మార్కెట్‌ను నిందించడం సరికాదు. మార్కెట్‌లోకి రావాలనుకునేవారు, ఇప్పటికే వచ్చినవారు ముందుగా అవగాహన పెంచుకోవాలి. కేవలం స్టాక్స్‌లోనే కాకుండా ఇండెక్స్‌లు, మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటి ఎన్నో మార్గాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్స్ కొనాలంటే ఎలాంటి సమయంలో తీసుకోవాలి.. ఎందుకు వాటినే ఎంచుకోవాలి.. వాల్యుయేషన్ల మాటేంటి.. త్రైమాసిక ఫలితాలు ఎలా ఉన్నాయి.. కంపెనీ కాన్ఫరెన్స్‌కాల్‌లో ఏం చెబుతున్నారు.. భవిష్యత్తు ప్రణాళికలేంటి.. వంటి ఎన్నో అంశాలను పరిగణించాలి. మార్కెట్‌లో ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని కొన్ని అంశాలను పరిశీలిద్దాం.
ఇలా చేయొద్దు
అవగాహన లేనప్పుడు ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి.
ఇన్‌స్టంట్ మనీ కోసం తాపత్రయపడకండి.
పెట్టిన గంటలోనో, ఒక రోజులోనో లాభాలు వచ్చేయాలని ఆశించకండి.
ట్రేడింగ్‌లో లాభాలతో పోలిస్తే నష్టపోయేది ఎక్కువ. కాబట్టి దానిపై పూర్తి పరిజ్ఞానం లేకుండా డబ్బులతో ప్రయోగాలు చేయకండి.
సామాజిక మాధ్యమాల్లో రకరకాల వ్యక్తులు ఊదరగొట్టే సిఫారసులు చూసి మీ కష్టార్జితంతో చెలగాటమాడుతారు. వారి మాటలు నమ్మకండి.
‘మీరు ట్రేడింగ్ చేస్తున్నారా..’ అంటూ ఫోన్ కాల్స్ చేసి మీకు సిఫారసులు అందిస్తాం.. అనేవాళ్లను నమ్మకూడదు.
ఏ పని చేసిన మీపై ఆధారపడి కుటుంబం ఉందనే విషయాన్ని మరవకూడదు.
ఇదీ చదవండి: ‘వాతావరణ మార్పునకు ఈవీలు పరిష్కారం కాదు’
ఇలా చేయండి
ముందు స్టాక్ మార్కెట్ మీద ఉన్న అపోహలు, భయాలను వదిలేయండి.
స్టాక్ మార్కెట్ అంటే నష్టాలు తెచ్చిపెట్టే ఓ జటిల పదార్ధంగా భావించకుండా సిరులు కురిపించే సాధనంగా చూడటం నేర్చుకోండి.
మార్కెట్‌పై అవగాహన పెంచుకోండి.
రియల్‌టైమ్‌లో పేపర్‌ట్రేడ్ చేస్తూ క్రమంగా పట్టు సాధించండి.
మీ దగ్గర ఎంత డబ్బున్నా ప్రారంభంలో ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెట్టండి.
ట్రేడింగ్ వేరు.. ఇన్వెస్ట్‌మెంట్ వేరనే విషయాన్ని నిత్యం గుర్తుంచుకోండి.
మీ పెట్టుబడును దీర్ఘకాలం కొనసాగించేలా ప్రయత్నించండి.
బ్యాంకులో ఎఫ్‌డీ చేసినపుడు ఏడాది, రెండేళ్లు, ఐదేళ్లు ఎలా వేచిస్తున్నారో..అలాగే మార్కెట్‌లోనూ ఓపిగ్గా ఉండండి.
స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫండమెంటల్స్ బాగున్నా షేర్లను ఎంచుకోండి.
తాత్కాలిక ఒడిదొడుకులు ఎదురైనప్పుడు ఈ షేర్లు పడినట్లు కనిపించినా, భవిష్యత్‌లో ఇవి మంచి రాబడులు అందిస్తాయి.
మార్కెట్ పడిన ప్రతిసారీ కొంత మొత్తంలో షేర్స్ కొనేలా ప్లాన్ చేసుకోండి. దానివల్ల మీకంటూ ఒక పోర్ట్‌ఫోలియో క్రియేట్ అవుతుంది.
డిపాజిట్లు వంటి సంప్రదాయ పెట్టుబడులతో పోలిస్తే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు అధిక రాబడులనే ఇస్తాయి. కానీ సరైన అవగాహనతో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం.
- బెహరా శ్రీనివాసరావు, మార్కెట్ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment