
ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దాదాపు అందరూ వాడే మేసేజింగ్ యాప్ వాట్సాప్ వేదికగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా వాట్సాప్‌లో వచ్చిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇమేజ్‌పై క్లిక్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. స్కామర్లు అనుసరిస్తున్న కొత్త మోసపూరిత పంథా ఏమిటో.. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.
కొత్త మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు తెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ఒక చిత్రాన్ని పంపుతారు. ఇది స్కామ్ చేయడానికి కీలకంగా మారుతుంది. వారు పంపిన మెసేజ్ ఫొటో ఫార్మాట్‌లో ఉంటుంది. తెలియని నంబర్ నుంచి ఫొటో ఏంటా అని క్లిక్ చేయడం చాలా మందికి అలవాటు. సరిగ్గా దీన్నే నేరాలకు ఉపయోగిస్తున్నారు. ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, యూపీఐ సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు నేరగాళ్లకు పూర్తి అనుమతులు ఇచ్చినట్లు అవుతుంది. అందుకు అనుగుణంగా ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే మీకు తెలియకుండానే మీ ఫోన్‌ను కంట్రోల్ చేసేలా రూపొందించిన మాల్వేర్ అందులో ప్రవేశిస్తుంది.
ఇమేజ్ స్టెగానోగ్రఫీ
ఇమేజ్ స్టెగానోగ్రఫీ అని పిలువబడే ఈ సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో నేరాలకు అవసరమయ్యే డేటాను రహస్యంగా ఇమేజ్ లోపల ఉంచుతారు. మీరు ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే మీకు తెలియకుండానే ఓటీపీ, పాస్‌వర్డ్‌లు.. వంటి సున్నితమైన సమాచారం అంతా స్కామర్ల చేతుల్లోకి వెళుతుంది. మాల్వేర్ పనిచేయడానికి ఇమేజ్ ఓపెన్ చేస్తే చాలు మీ యాప్స్, ప్రైవేట్ డేటాను యాక్సెస్ చేస్తుంది. దాంతో మోసాలకు పాల్పడుతున్నారు.
వ్యక్తిని గుర్తించేందుకు సాయం చేయాలంటూ
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ వ్యక్తి ఇలా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. వాట్సాప్‌లో ఇమేజ్ షేర్ చేసి ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు సాయం చేయాలంటూ కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఒకే నంబర్ నుంచి పలుమార్లు కాల్స్, మెసేజ్‌లు రావడంతో చివరకు ఆ ఫొటోపై ఆ వ్యక్తి క్లిక్ చేశాడు. ఆ సమయంలో ఫోన్‌ను హ్యాక్ చేసి స్కామర్లు బ్యాంక్ వివరాలు తెలుసుకొని ఖాతా నుంచి డబ్బులు డ్రా చేశారు.
ఇదీ చదవండి: ‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..
సురక్షితంగా ఉండడం ఎలా..
తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఇమేజ్‌లు, వీడియోలు డౌన్‌లోడ్ చేయవద్దు. లింక్‌లపై కూడా అసలు క్లిక్ చేయవద్దు.
మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీడియా ఆప్షన్స్‌లో ఆటో డౌన్‌లోడ్‌ను ఆఫ్ చేసుకోండి. దాంతో మీకు తెలిసిన వారు పంపించిన ఫొటోలు, లింకులు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మీ ఫోన్ సాఫ్ట్‌వేర్, యాంటీవైరస్‌ను నిత్యం అప్‌డేట్ చేసుకోవాలి. ఏదైనా ఓఎస్, యాప్ వర్షన్ మార్పులుంటే వెంటనే అప్‌డేట్ అవుతాయి.
అనుమానాస్పద నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని హెచ్చరించడం మరిచిపోకండి.
మీరు మోసపోయారని అనుమానించినట్లయితే వెంటనే cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి.