దేశానికేకాదు, వ్యక్తులకు వారి పెట్టుబడులకు బడ్జెట్ ప్రణాళికలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏటా ఆయా ఇన్వెస్ట్‌మెంట్ల(investments)ను సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో సాధారణంగా చాలామంది తమ పెట్టుబడులను సమీక్షిస్తారని చెబుతున్నారు.
విడిగా ఒక లక్ష్యానికి ఎంత కాలంలో, ఎంత మొత్తం సమకూర్చుకోవాలన్నది బడ్జెట్‌లో రాసుకుంటారు. అందుకు అనుకూలించే ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటారు. మరి సదరు మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) పనితీరు మీ రాబడులు ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? లేదా? పనితీరు బాగోలేకపోతే ఆ ఒక్క పథకంలోనే అలా ఉందా లేక ఆ విభాగంలోని మిగిలిన పథకాల పనితీరు కూడా అదే మాదిరిగా ఉందా? అన్నది పరిశీలించుకోవాలి. విభాగం మొత్తం పనితీరు అదే మాదిరిగా ఉంటే ఆందోళన అక్కర్లేదు. మరికొంత వ్యవధి ఇచ్చి చూడొచ్చు. పథకంలో లోపం ఉంటే, అందుకు కారణాలను గుర్తించాలి. అవి సమగ్రంగా లేకపోతే మరో పథకంలోకి మారిపోవడాన్ని పరిశీలించొచ్చు.
రిస్క్‌ను అధిగమించేలా..
ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏదో ఒక విభాగంలోని పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందితే, రీబ్యాలన్స్ (Re balance) చేసుకోవాలి. ఒక విభాగం పెట్టుబడుల విలువ అధికంగా వృద్ధి చెందినప్పుడు.. అధిక విలువ ఉన్న చోట నిర్ణీత శాతం మేర పెట్టుబడులు విక్రయించి, తక్కువ విలువ వద్దనున్న విభాగంలోకి మార్చుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్‌గా చెబుతారు. దీని ద్వారా రిస్క్‌ను అధిగమించొచ్చు.
బీమా కవరేజీపై దృష్టి
టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్(Insurance)లోనూ మార్పులు అవసరం పడొచ్చు. ఉదాహరణకు గృహ రుణం తీసుకున్నారని అనుకోండి.. ఆ మేరకు టర్మ్ కవరేజీని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఇతర ఏ రుణం తీసుకున్నా సరే ఆ మేరకు కవరేజీ పెంచుకోవాలి. వివాహం, పిల్లలతోపాటు బాధ్యతలూ పెరుగుతుంటాయి. ఏటా ఆదాయం కూడా వృద్ది చెందుతుంది. వాటికి అనుగుణంగా తమ బీమా కవరేజీని సమీక్షించుకోవాలి. ఆరోగ్య బీమా కవరేజీ ప్రస్తుత కుటుంబ అవసరకాలకు సరిపడా ఉందా? అని సమీక్షించుకోవాలి. లేదంటే అదనపు కవరేజీతో తక్కువ వ్యయానికే సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: 179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’
అత్యవసర నిధి.. వీలునామాలో మార్పులు
రుణ భారంలో ఉంటే కొత్త ఏడాదిలో దాన్నుంచి బయటపడే మార్గాన్ని గుర్తించాలి. అత్యవసర నిధిలోనూ మార్పులు అవసరమే. జీవన వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. కనుక 2–5 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న అత్యవసర నిధి ఇప్పటి అవసరాలకు సరిపోకపోవచ్చు. ప్రస్తుత ఖర్చులను కనీసం ఏడాది పాటు అయినా అత్యవసర నిధి గట్టెక్కించగలదా? అన్నది సమీక్షించుకోవాలి. లేదంటే అదనంగా సమకూర్చుకోవాలి. రెండేళ్ల అవసరాలకు సరిపడా ఏర్పాటు చేసుకుంటే మరింత నిశ్చింతగా ఉండొచ్చు. నామినేషన్లు, వీలునామాలో మార్పులు అవసరం అనుకుంటే ఆ మేరకు మార్పులు చేసుకోవాలి. అవసరమైతే ఏడాదిలో ఒక్కసారి అయినా ఆర్థిక నిపుణులను సంప్రదించి సమగ్రమైన సమీక్ష చేయించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment