ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరం-2025 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటల్లోనే 2024 ముగియనుంది. తరువాత జనం నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోనున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు చోటుచేసుకోబోతున్నప్పటికీ, భారత రాజకీయాలకు 2024 ప్రధానమైనదిగా నిలిచింది. 2024లో ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లడం, 24 ఏళ్లు ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో ఓడిపోవడం వంటి ఘటనలు ఎప్పటికీ మరచిపోలేనివిగా నిలిచాయి.
లోక్‌సభ ఎన్నికలు- 2024
2024 సార్వత్రిక ఎన్నికలకు(General Elections) ఓటింగ్ ఏప్రిల్ 19- జూన్ ఒకటి మధ్య ఏడు దశల్లో జరిగింది. ఈసారి ఎన్నికల ఫలితాలు పలు రాజకీయ పార్టీలకు షాకింగ్‌గా నిలిచాయి. కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. భారత మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడవసారి ప్రధానమంత్రి అయిన ఘనత ప్రధాని మోదీ దక్కించుకున్నారు.
అయోధ్యలో బీజేపీ ఓటమి
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. 400 ఫిగర్ దాటుతుందనే నినాదం అందుకున్న బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లకు గాను బీజేపీకి 37 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీకి రెండు సీట్లు, అప్నాదళ్‌కి ఒక సీటు లభించాయి. దేశంలోనే అత్యంత హాట్ సీటుగా నిలిచిన అయోధ్య లోక్‌సభ స్థానంలో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
జైలుకెళ్లిన కేజ్రీవాల్
ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’కు సంబంధించిన అవినీతి కేసులో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్‌ను మద్యం కుంభకోణంలో 2024, మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసును ఈడీ, సీబీఐ రెండూ విచారించాయి. ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12న సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ తాను ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ సెప్టెంబర్ 17న రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది.
హేమంత్ సోరెన్ జైలు జీవితం
2024లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అవినీతి కుంభకోణంలో జనవరిలో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. అయితే ఆ తర్వాత బెయిల్ పొందిన హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పదవిని చేపట్టారు. ఈఘటనల దరిమిలా చంపై సోరెన్ జెంఎంఎంను వీడి, భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం మరోసారి విజయం సాధించి, హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు.
నవీన్ పట్నాయక్ ఓటమి
ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఒడిశా రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరొందిన నవీన్ పట్నాయక్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి 51 సీట్లకు తగ్గగా, బీజేపీకి 78 సీట్లు రావడంతో పట్నాయక్ 24 ఏళ్ల పాలనకు తెరపడింది.
ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం
నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) ఈ ఏడాది రాజకీయాల్లో క్రియాశీలక అరంగేట్రం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదిలి రాయ్‌బరేలీ స్థానానికి ఎంపీగా కొనసాగారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ప్రియాంక గాంధీని వయనాడ్ స్థానం నుండి బరిలోకి దింపింది. ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ 64.99శాతం ఓట్లతో విజయం సాధించి తొలిసారి పార్లమెంటుకు చేరుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి నిరాశే ఎదురైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మహారాష్ట్ర ప్రజలు మద్దతు పలికారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 288 స్థానాలకు గానూ 230 స్థానాల్లో విజయం సాధించింది. మహాకూటమిలో భాగమైన బీజేపీ 132 సీట్లు, శివసేన 57 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 41 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు ఎంవీఏ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొత్తం మీద 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దాదాపు 48 ఏళ్లుగా మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం విశేషం.
ఢిల్లీ సీఎంగా అతిశీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ సీఎం ఎవరనేదానిపైనే చర్చ జరిగింది. మనీష్ సిసోడియాకు ఢిల్లీ సీఎం పదవి ఇవ్వవచ్చని అంతా భావించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా కూడా అన్ని పదవులకు రాజీనామా చేశారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎం పదవికి అతిశీ పేరును ప్రతిపాదించారు. అందరి అంగీకారంతో అతిశీ ఢిల్లీ సీఎం అయ్యారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: 180 ఐఏఎస్‌లు, 200 ఐపీఎస్‌ల ఎంపిక.. టాప్‌లో ఏ రాష్ట్రం?
Comments
Please login to add a commentAdd a comment